4, జూన్ 2011, శనివారం

స్పీకర్ పదవికి పెరిగిన ప్రాధాన్యం..అప్పుడు ముద్దు కృష్ణమ నాయుడు స్పీకర్ పదవి చేపట్టి ఉంటే బాబు రాజకీయ జీవితం ఎలా ఉండేదో ?

తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో శాసన సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు టిడిపి పోటీచేయడం ఇదే తొలిసారి. అధికార పక్షం అభ్యర్థే స్పీకర్ పదవికి ఎంపిక కావడం సహజం. స్పీకర్ పదవి ఎన్నికలోనే అధికార పక్షం అభ్యర్థి ఓడిపోయాడంటే ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్టే. మామూలు గా స్పీకర్ ఎన్నిక లాంఛన ప్రాయమే అయినా సంక్షోభ రాజకీయాల్లో స్పీకర్ పదవి కీలకంగా మారుతోంది. అందుకే అధికారంలో ఉన్న వారు అన్ని కోణాల్లో ఆలోచించే స్పీకర్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో వైఎస్‌ఆర్ చేసింది అదే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి చేస్తున్నది అదే. టిడిపి ఆవిర్భావం తరువాత రెండు సందర్భాల్లో స్పీకర్ పదవి తీవ్ర వివాదాస్పదంగా మారింది, వారు తీసుకున్న నిర్ణయాలే రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాయి.

ఎన్టీరామారావు నాయకత్వంలో 1994లో టిడిపి ఘన విజయం సాధించినప్పుడు గాలి ముద్దుకృష్ణమనాయుడును స్పీకర్ పదవి చేపట్టమని కోరారు. ఒకవేళ ఆయన స్పీకర్ పదవి చేపట్టి ఉంటే రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మరో విధంగా ఉండేవేమో! ఆయన చాలా గొప్పనాయకుడు స్పీకర్ గా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేవారు, రాష్ట్ర ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయిందని కాదు. ఒకవేళ ఆయన స్పీకర్ పదవి చేపట్టి ఉంటే చంద్రబాబు పరిస్థితి మరోలా ఉండేదేమో! 1994 ఎన్నికల్లో ఏకపక్షంగా ప్రజలు తీర్పును ఇచ్చారు.


 కాంగ్రెస్ పార్టీకి చివరకు ప్రతిపక్షం హోదా సైతం దక్కలేదు. కనీసం పది శాతం సీట్లు లభించిన పార్టీకే ప్రతిపక్ష హోదా ఉంటుంది . ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 27 సీట్లు మాత్రమే వచ్చాయి. అసలు ప్రతిపక్షం అంటూ లేకుండా ఫలితాలు వచ్చినప్పుడు ప్రభుత్వం సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని ఎవరూ ఊహించలేరు. కానీ అప్పటికే ఎన్టీరామారావు లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవడం, పార్టీలో ఆమెకు ప్రాధాన్యం పెరగడం చంద్రబాబు బృందానికి నచ్చలేదు. ఎన్టీఆర్ తరువాత అధికారం తనదే అని ఆశలు పెట్టుకున్న చంద్రబాబుకు లక్ష్మీపార్వతి రూపంలో స్పీడ్ బ్రేకర్ కనిపించింది. కుటుంబ రాజకీయాలు జోరుగానే సాగినా జనం మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఎన్టీఆర్‌కు పట్టం కట్టారు.
చంద్రబాబు వర్గం నుంచి ఏమైనా జరగవచ్చునని ఎన్టీఆర్ వర్గం అనుమానించింది. ఏం జరిగినా అసెంబ్లీలో స్పీకర్ మాటే శిరోధార్యం కాబట్టి స్పీకర్ పదవిని చేపట్టాలని ఎన్టీఆర్‌కు విశ్వాస పాత్రునిగా నిలిచిన గాలి ముద్దుకృష్ణమనాయుడును ఎన్టీఆర్ వర్గం కోరింది. లక్ష్మీపార్వతి సైతం అదే మాట చెప్పారు. మంత్రి పదవిపై ఆసక్తి ఉన్న ముద్దుకృష్ణమనాయుడు తనకు స్పీకర్ పదవి వద్దన్నారు. బాబు బృందంలో కొంత అసంతృప్తి ఉండవచ్చు తప్ప ఎన్టీఆర్‌ను తప్పించేంత సాహసానికి ఒడిగట్టక పోవచ్చుననుకున్న ఎన్టీఆర్ బృందం స్పీకర్ పదవి విషయంలో గాలి ముద్దుకృష్ణమనాయుడుపై పెద్దగా ఒత్తడి తీసుకురాలేదు. యనమల రామకృష్ణుడు స్పీకర్ పదవి చేపట్టారు. ఎన్టీఆర్‌ను దించేసే సమయంలో యనమల రామకృష్ణుడు నిర్వహించిన పాత్ర వివాదాస్పదం అయింది. న్యాయస్థానం సైతం కొన్ని కామెంట్లు చేసింది. ‘‘ నేను ఇంకా ముఖ్యమంత్రినే సభలో నన్ను మాట్లాడనివ్వండి ’’ అంటూ ఎన్టీఆర్ పదే పదే వేడుకున్నా స్పీకర్ స్థానంలో ఉన్న యనమల రామకృష్ణుడు అనుమతించక పోవడం కాంగ్రెస్‌కు ఇప్పటికీ బాబును విమర్శించేందుకు ఒక ఆయుధంగా ఉపయోగపడుతున్నది. ఆరోజే గనుక గాలి స్పీకర్ పదవి చేపట్టి ఉంటే ఎన్టీఆర్ పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అభిమానులంటారు. ఒకవేళ గాలి ఆ పదవి చేపట్టినా ఇంత పెద్ద పార్టీలో అందరినీ మెనేజ్ చేసిన చంద్రబాబు గాలిని చేయకపోయేవారా? అని బాబు శక్తిసామర్ధ్యాలపై విశ్వాసం గల ఆయన మద్దతు దారులంటారనుకోండి!


 1983లో తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత తంగి సత్యనారాయణను స్పీకర్‌గా, భీమ్‌రావ్‌ను డిప్యూటీ స్పీకర్‌గాఎన్నకున్నారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటుచేసి వెన్నుపోటు పొడిచిన సమయంలో వీరిద్దరు కూడ నాదెండ్ల వైపు వెళ్లిపోయి మంత్రి పదవులు చేపట్టారు. వీరు అదే పదవుల్లో ఉండి నాదెండ్లకు సహకరిస్తే పరిస్థితి ఎలా ఉండేదో కానీ రాజీనామా చేసి మంత్రిపదవులు చేపట్టడం వల్ల సభ నిర్వహణ కోసం అప్పటి సీనియర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు బాగారెడ్డిని తాత్కాలిక స్పీకర్‌గా నియమించారు. ఆయనపై తమకు నమ్మకం లేదని ఎన్టీఆర్ ప్రకటించారు. రెండు రోజుల పాటు సభను నిర్వహించలేని పరిస్థితితో బాగారెడ్డి రాజీనామా చేశారు.


 తరువాత సుల్తాన్ సలా ఉద్దీన్ ఓవైసిని తాత్కాలిక స్పీకర్‌గా నియమించారు. ఆయన నియామకంపై కూడ ఎన్టీరామారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాదెండ్ల బల నిరూపణ చేసుకోకపోడంతో ఎన్టీరామారావు తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. వెంటనే సుల్తాన్ సలా ఉద్దీన్ ఓవైసి స్థానంలో మహేంద్రనాథ్‌ను తాత్కాలిక స్పీకర్‌ను చేశారు. 1983 ,1984లలో కేవలం సంవత్సరం వ్యవధిలో రాష్ట్ర అసెంబ్లీలో ముగ్గురు తాత్కాలిక స్పీకర్లు ఉండడం విశేషం. తరువాత నిశ్శంకరరావు వెంకటరత్నంను స్పీకర్‌ను చేశారు.


 19 85 ఎన్నికల తరువాత జి నారాయణరావును స్పీకర్‌గా ఎన్నకున్నారు. ఆయన హయాంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు . స్పీకర్ పదవి గౌరవాన్ని నిలిపే విధంగా ఆయన స్వతంత్రంగా వ్యవహరించే వారు. పార్టీ ఎమ్మెల్యేలంతా ఎన్టీఆర్‌ను దైవంగా పూజించే సమయంలో సైతం నారాయణరావు గంభీరంగా స్పీకర్‌గానే వ్యవహరించేవారు. ఆది తెదేపా అధినేతకు ఏ మాత్రం నచ్చలేదు. నారాయణరావు స్వతంత్రంగా వ్యవహరించే తీరును ఎన్టీరామారావు జీర్ణం చేసుకోలేక పోయారు. తరువాత ఆయన పార్టీ వీడి వెళ్లారు. స్పీకర్ స్థానంలో ఒక వెలుగు వెలిగిన నారాయణరావు తరువాత రాజకీయాల్లో కనిపించలేదు.
సాధారణంగా శాసన సభ్యుల్లో సీనియర్ సభ్యున్ని తాత్కాలిక స్పీకర్‌గా నియమిస్తారు. తాత్కాలిక స్పీకర్ పదవిలో ఎవరిని నియమించాలనే నియమం ఏమీ లేదు. స్పీకర్ నియామకానికి వర్తించే నిబంధనలే త్రాత్కాలిక స్పీకర్‌కు వర్తిస్తాయి. తొలిసారి గెలిచిన సభ్యున్ని సైతం స్పీకర్‌గా నియమించే అవకాశం ఉన్నప్పుడు తాత్కాలిక స్పీకర్‌గా నియమించడానికి అభ్యంతరం ఏముంటుంది. అయితే సాధారణంగా సభలో సీనియర్ సభ్యున్ని తాత్కాలిక స్పీకర్‌గా నియమిస్తారు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరో పార్టీకి చెందిన సభ్యుడు సీనియర్ సభ్యునిగా ఉన్నప్పుడు తాత్కాలిక స్పీకర్‌గా ఎవరిని నియమించాలనేది విమర్శలకు దారితీస్తోంది. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి వరకు సీనియర్ సభ్యుడైన పెన్మత్స సాంబశివరాజును తాత్కాలిక స్పీకర్‌గా నియమించారు. 2009లో కాంగ్రెస్ రెండవ సారి అధికారంలోకి వచ్చినప్పుడు జెసి దివాకర్‌రెడ్డిని తాత్కాలిక స్పీకర్‌గా నియమించారు. జెసి కన్నా సీనియర్ అయిన పి అశోకగజపతిరాజును తాత్కాలిక స్పీకర్‌గా నియమించకపోవడం పట్ల తెదేపా అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ రాజీనామా చేసి స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో తాత్కాలిక స్పీకర్‌గా జెసి దివాకర్‌రెడ్డిని నియమించారు. రెండు సార్లు తాత్కాలిక స్పీకర్ బాధ్యతలు నిర్వహించిన రికార్డు జెసిదే.
స్పీకర్ వ్యవహారంలో పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ఎంపికలో తెదేపా ఆచితూచి వ్యవహరించడం మొదలు పెట్టింది. ఇప్పుడు అధికార పక్షం సైతం సంక్షోభ రాజకీయాలను, భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది. వైఎస్‌ఆర్ మరణం తరువాత రోశయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టడం, ఆయన రాజీనామాతో అప్పటి వరకు స్పీకర్‌గా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆరునెలల పాటు స్పీకర్ లేకపోవడం, స్పీకర్ లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగడం విశేషం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం