15, జూన్ 2011, బుధవారం

యాంటీ ‘అంకుల్, ఆంటీ ’ ఉద్యమం

అంకుల్ .. అంకుల్.. ఆ ఒక్క మాటతో నవనాడులు క్రుంగిపోయాయి. ప్రకృతి స్తంభించింది. గుమ్మడి ఉంటే ఆ సినిమాలో గుండెపోటు గ్యారంటీ అని ముందే తెలుసు కాబట్టి గుండెపోటుతో గుమ్మడి హరీ అన్నా మనకంత ఆశ్చర్యం కలగదు.
 కానీఅక్కినేనికో, హీరోయిన్‌కో క్యాన్సర్ అంటే మాత్రం మనమే కాదు ప్రకృతి మొత్తం స్త్భించి పోతుంది. సముద్రంలో పైకి ఎగిసిన అలలు ప్రకృతి నిమయానికి భిన్నంగా ఆకాశంలోనే నిలిచిపోతాయి. గాలి వీచడం ఆగిపోతుంది.
 హీరోలంటే ప్రకృతికి సైతం ప్రత్యేక అభిమానం. జూనియర్ ఎన్టీఆర్, మహేష్‌బాబు వస్తుంటే వందలాది కార్లు, సుమోలు గాల్లో లేవడాన్ని తప్పు పడుతున్నారు కానీ ఆ రోజుల్లో హీరోలకు, హీరోయిన్లకు కష్టాలొస్తే గాలి ఆగిపోవడం కన్నా గాలిలో కార్లు లేవడం కొంత నయం కదా!
 అలానే కొందరికి కొన్ని మాటలు వింటే ప్రకృతి స్తంభించినట్టుగా ఉంటుంది.

గోవిందు ఎన్టీఆర్‌లా నటుడు కాదు, కనీసం అభిమాని కూడా కాదు. చిరంజీవి కన్నా పాతికేళ్లు చిన్నవాడు పెళ్లయి ఆరేళ్లయింది. కానీ అమ్మాయిలు కనిపిస్తే పెళ్లికాని ప్రసాదులానే మాట్లాడతాడు. 
అలాంటి గోవిందును తొలిసారి అంకుల్ అని పిలిచాడు. పిలుపే కంపరమెత్తిస్తే ఆ పిలిచిన వాడు తన వయసు వాడు కావడం మరింత బాధ కలిగించింది.


 లిఫ్ట్ అంకుల్ అంటూ మరోసారి అదే కూత కూశాడు. పాత విలన్ ఆర్ నాగేశ్వరరావు మొదలుకొని ముంబై నుంచొచ్చిన విలన్ షిండే వరకు అందరిని కలిపి తయారు చేస్తే వీడి ముఖంలా ఉంటుందేమో అనిపించింది గోవిందుకు లిఫ్ట్ అడిగిన వాడిని చూడగానే ...


 వాడి ముఖం చూడడానికే ఇష్టం లేదు పైగా వాన్ని తన బైక్‌పై కూర్చోబెట్టుకుని సహ ప్రయాణమా!నెవర్ అంటూ నేను వెళ్లాల్సింది వెనక్కి అని బైక్‌ను వెనక్కి మళ్లించాడు. మనసు బాగాలేనప్పుడు సాయంత్రం అయితే బారుకు, ఉదయం అయితే ఇంటికే వెళ్లడం ఉత్తమం, చచ్చినా ఆఫీసుకు వెళ్లవద్దనుకున్నాడు. 


మహాత్మాగాంధీని గాడ్సె హత్య చేసినప్పుడు గాంధేయవాదులు తమ జీవితంలో అది అత్యంత దుర్భరమైన దినంగా భావించినట్టు, 9/11 రోజును అమెరికన్లు భావించినట్టు ఈ రోజు తన జీవితంలో అత్యంత బాధాకరమైన రోజని డైరీలో రాసుకున్నాడు.


 60 ఏళ్ల వయసులో కాలేజీ కుర్రాడిగా నటించి, 74 ఏళ్ల వయసులో నిజజీవితంలో పెళ్లి చేసుకున్న ఎన్టీ రామారావునే సొంత అల్లుడు అంకుల్ అని పిలవలేదు. కానీ నన్ను..... అని బాధపడ్డాడు. 


ఈ విషయంలో మాత్రం ఎన్టీఆర్ అదృష్టవంతుడే ఇద్దరు అల్లుళ్లు, పదిమంది సంతానం, చిన్న భార్య అంతా, ఆయన ప్రస్తావన వస్తే అన్నగారు అనే చెబుతారు. అల్లుడు బాబు కూడా అంకుల్ అనగా ఎవరూ విన్నవారు లేరు. 


వినగా వినగా అంకుల్ అనే మాట గోవింద్‌కు మొదటిసారి కలిగినంత బాధ మాత్రం కలిగించలేదు. చెంగుచెంగు మంటూ కాలేజీకి గెంతుతూ వెళ్లే అమ్మాయిని ఒక దుర్ముహూర్తంలో ఎవరో ఒకరు ఆంటీ అని పిలుస్తారు. అంతే అప్పటి వరకు ఐశ్వర్యారాయ్‌లా ఊహించుకున్న అమ్మాయి కాస్తా నేను కూడా ఏదో ఒక రోజు కల్పనారాయ్‌ని కావలసిందే కదా! అని దిగులు పడుతుంది.

ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందంటారు. ఐడియా సంగతెలా ఉన్నా ఒక్క మాట మీ జీవితాన్ని మార్చడం మాత్రం ఖాయం. ఆంటీ, అంకుల్ చిన్నపదంలా కనిపించినా అణుబాంబుకున్నంత పవరుంటుంది. అందాలరాముడులో రాజబాబు తీతా అని పిలిచినప్పుడు అల్లురామలింగయ్య బాధ చూడాలి. తీతా అంటే తీసేసిన తహసిల్దారు. అలానే మాజీ ముఖ్యమంత్రి అనే పదం ముఖ్యమంత్రులుగా పని చేసిన వారికి తొలిసారి విన్నప్పుడు ప్రాణం విలవిలలాడిపోకుండా ఉంటుందా?


 మనకే కాదు మహా మహా నాయకులకే ఏదో ఒక మాట జీవితాన్ని క్రుంగదీస్తుంది. తీసేసిన ముఖ్యమంత్రి అనే మాట వినపడకముందే రోశయ్య కాబోయే గవర్నర్ అని ప్రచారం చేసుకున్నారు. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో అవినీతిపై వీరోచితంగా రెండు గంటలు ఉపన్యసించారు. నవ్వుతూ కవ్వించే వైఎస్‌ఆర్ లేచి చాల్లేవయ్యా పెద్ద చెప్పొచ్చావు, మామను వెన్నుపోటు పొడిచిన నువ్వు కూడా మాట్లడడమే అనే వారు


. అప్పటి వరకు బాలచంద్రుడిలా వెలిగిపోయిన బాబు వెన్నుపోటు అనే మాట వినగానే డీలాపడిపోయి కూర్చునే వారు. వెన్నుపోటు పదం వినడానికి ముందు, తరువాత అంటూ బాబువి రెండు ఫోటోలను స్పష్టమైన తేడాలతో చూడొచ్చు. ఇలానే ఏదో ఒక పదాన్ని వైఎస్‌ఆర్‌కు తగిలిద్దామని బాబు బృందం విపరీతంగా కష్టపడింది కానీ సాధ్యం కాలేదు.్ఫ్యక్షనిస్టు అనే పదాన్ని కొంత కాలం ప్రయోగించారు. అది కాస్తా ఆయన గ్లామర్‌ను పెంచింది.
 దాంతో ధనయజ్ఞం ఆయుధాన్ని ప్రయోగించారు. కొద్దిపాటి ప్రభావం చూపింది కానీ ఆశించిన స్థాయిలో పని చేయలేదు.


 ఏ పదాస్త్రాన్ని ప్రయోగించి ఎదుటి వాడిని బంధించవచ్చునో గ్రహించడమే రాజకీయం. ద్రోణాచార్యుడు అలానే చెలరేగిపోతే పాండవులకు కష్టం. అందుకే కృష్ణుడు ధర్మరాజుతో అశ్వత్థ్ధామ హతః - అని చెప్పించాడు. ద్రోణాచార్యుడే కాదు మనిషన్నవాడెవడినైనా క్రుంగిపోయేట్టు చేసే మాట అది.


 ఆ మాట యుద్ధగతినే మార్చేసింది. ముఖ్యమంత్రి భార్యగా లక్ష్మీపార్వతి వెలిగిపోతున్న సమయంలో బాబు బృందం వదిలిన డైలాగు దుష్టశక్తి. ఎన్టీఆర్‌నే కట్టిపడేసిన లక్ష్మీపార్వతి ఈ డైలాగును మాత్రం తట్టుకోలేకపోయారు. ఎన్టీఆర్ ముందే గ్రహించినట్టుగా ఉన్నారు. అందుకే ఆయన అన్నగారు అనే పిలిపించుకున్నారు.
అవినీతికి పాల్పడినా సహిస్తాం కానీ అవినీతి అనే పదం పలికితే అరెస్టు చేస్తాం అని కేంద్రం వారు రాత్రికి రాత్రి రామ్ దేవ్‌బాబాను అరెస్టు చేశారు. చిన్నమాటే అని వదిలేస్తే వందేమాతరం బ్రిటిష్‌వాడినే వణికించింది. పుస్తకాలను నిషేధించినప్పుడు పదాలను ఎందుకు నిషేధించరు? క్రుంగదీసే పదాలను ఉపయోగించడం హక్కుల ఉల్లంఘనే కదా! అందుకే ‘యాంటీ అంకుల్, ఆంటీ’ ఉద్యమం నిర్వహించాలి.

8 కామెంట్‌లు:

 1. @రిషి గారు@ వనజవనమాలి గారు థాంక్స్

  రిప్లయితొలగించండి
 2. ఎక్కడి నుంచి ఎక్కడీకి ముడి పెట్టారూ! ఆంటీ, అంకుల్, తీతా, అన్నగారు, బాబు, అణుబాంబు పవరున్న పిలుపులు,పదాలు.. అహా! ఎక్కడా విషయం నుంచి పక్కకు మళ్లకుండా భలే స్క్రీన్ ప్లే! చంద్రుడికో నూలు పోగే కానీ, చెప్పకుండా ఉండలేక చెప్తున్నా! "భలే రాసారు అసలు!" :)

  రిప్లయితొలగించండి
 3. ఎక్కడ నుండి ఎక్కడకి ముడిపెట్టారండీ బాబు...మెత్తని చెప్పుతో భలే కొట్టారు....ఏమి వ్యంగ్యమండీ...చాలా బాగా రాసారు.

  రిప్లయితొలగించండి
 4. అమ్మ బాబోయ్....! పదాలకెంత పవరో అనిపించారండీ బాబూ... ఆద్యంతం అత్యంత రసవత్తరంగా నడిపించారు. ఇంతకూ అంకుల్ అన్న పదం మీకు నచ్చకే ఇవన్నీ పుట్టుకొచ్చినట్టు చిన్న అనుమానం.

  రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం