22, జూన్ 2011, బుధవారం

దయ్యం నిజం.. దైవం నమ్మకం!

నమ్మకమే జీవితం. జీవితం అన్నాక నమ్మకాలుంటాయి. నమ్మకాలున్నప్పుడు మూఢనమ్మకాలూ ఉంటాయి. మనకున్న మూఢనమ్మకాల్లో దయ్యాలకు కాళ్లు వెనక్కి ఉంటాయనేది ఒకటి. అది మూఢనమ్మకం అని నా గట్టినమ్మకం.


 మనకు గట్టినమ్మకం అనిపించింది ఎదుటి వాడికి మూఢనమ్మకం అనిపించవచ్చు, ఎదుటి వాడికి గట్టినమ్మకం మనకు పిడివాదం అనిపించొచ్చు. ఎవరిష్టమొచ్చినట్టు వాళ్లు జీవించే హక్కున్నప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వారు మూఢనమ్మకాల్లో ఉంటారు.
 ఒకరి మూఢనమ్మకంలో మరొకరు జోక్యం చేసుకోకపోవడమే ప్రజాస్వామ్యం. పరస్పర మూఢనమ్మకాలను గౌరవించుకోవడంపైనే ప్రజాస్వామ్య మనుగడ ఆధారపడి ఉంది.
అందుకే దయ్యాలకు కాళ్లు వెనక్కి తిరిగి ఉంటాయనేది మూఢనమ్మకం అని నా నమ్మకం.



 ఏం దయ్యాలకు కాళ్లు వెనకే ఎందుకుండాలి మనం దోవతి నుంచి జీన్స్‌లోకి అటు నుంచి చిరిగిపోయిన జీన్స్ నుంచి సగం ప్యాంట్‌లోకి వచ్చినట్టు, ఆడవాళ్లు చీరల నుంచి చుడీదార్‌లోకి వచ్చినట్టు దయ్యాలు కూడా వాటి కాళ్లు వెనక నుంచి ముందుకు ఎందుకు తెచ్చుకోవు. దయ్యాలు కొండలను ఎత్తుతాయి, భవనాలను చిటికెనవేలుతో కూల్చేస్తాయి. రాజకుమారిని అరచేతిలో మంచంతో సహా లేపుకుపోతాయి. మనిషి  మెదడు తల నుంచి మోకాలికి వస్తుండగా, దయ్యం కాళ్లువెనక  నుంచి ముందుకు ఎందుకు రావు. మళ్లీ దయ్యాలున్నాయా? అనే సందేహం ఎందుకు దేవుడున్నాడా? అని సందేహం లేనప్పుడు దయ్యాలున్నాయా? అనే సందేహం రావలసిన అవసరమే లేదు.
దయ్యాన్ని చూశానని, మాట్లాడానని, చెప్పేవాళ్లు చాలా మంది కనిపిస్తారు. దయ్యం పడితే కాల్ చేయండి మేం వచ్చి తొలగిస్తాం అని పత్రికల్లో ప్రకటనలు ఇస్తుంటారు ! దేవుడి విషయంలోనైనా అనుమానాలు ఉండొచ్చు కానీ దయ్యం విషయంలో మాత్రం అలాంటి అనుమానాలు అస్సలు వద్దు. నీ పొరుగువాడిని ప్రేమించు అని ఒకరంటే మనిషిలోని దైవాన్ని చూడు అని మరొకరన్నారు. మనిషిలో దైవం కనిపించడ కష్టమేమో కానీ దయ్యం మాత్రం అడుగడుగునా కనిపిస్తుంది. అందుకే దయ్యం వాస్తవం, దేవుడు నమ్మకం అనిపిస్తోంది. 

విఠలాచార్యకు దయ్యాలకు అవినాభావ సంబంధం ఉంది. ఆ రోజుల్లో ఆయన్ని చూసి చాలా మంది నటీనటులు దయ్యాన్ని చూసినట్టు భయపడేవారట! షూటింగ్‌కు ఆలస్యంగా రావడం వంటి తలతిక్కపనులతో దర్శకులను, నిర్మాతలను ముప్పు తిప్పలు పెట్టే నటీనటులు విఠలాచార్య విషయానికి వచ్చే సరికి పెంపుడు దయ్యాల్లా చెప్పినట్టు వినేవారట! ఓ సారి ఇలానే హీరోగారు హీరోయిజం చూపించాలని షూటింగ్‌కు ఆలస్యంగా వచ్చాడు.

 నేనూ నా కోడి లేకపోతే ఎలా తెల్లారుతుందో చూస్తాను అన్న ముసలవ్వలానే హీరోగారు మెల్లగా స్టూడియోకు వచ్చాడు. హీరోలేక నిర్మాత, దర్శకుడు కన్నీళ్ల పర్యంతం అయి ఉంటారని, సందులు గొందులు వెతికి ఉంటారని ఏవేవో ఊహించుకుని హీరో స్టూడియోకు వస్తే అక్కడ ఈయన్న పట్టించుకున్నవారే లేరు. షూటింగ్ సాగిపోతోంది. హీరోను మార్చారా? అని అనుమానం వచ్చి చూస్తే హీరోయిన్ ఒడిలో కుక్కుంది. అంత అందమైన హీరోయిన్ ఒడిలో ఆ కుక్క గారాలు పోవడం చూసి ఆపండి అని హీరో గట్టిగా అరిచాడు.

 ఇది పెళ్లి పీటల మీద వినిపించాల్సిన డైలాగు అని సర్ది చెప్పారు. ఏం జరుగుతుందిక్కడ నాకు ఇప్పుడే తెలియాలి అని అడిగితే హీరోను దయ్యం కుక్కగా మార్చేసింది. దాంతో ఇప్పుడు ఆ కుక్కతోనే హీరోయిన్ డ్యూయెట్ పాడుతోంది అని సమాధానం వచ్చింది. కథలో అలా లేదు కదా! అని ఆశ్చర్యపోతే ఇప్పుడు వచ్చిన ఐడియా అందుకే కథలో ఈ మలుపుఅని సమాధానం వచ్చింది.

 బుద్ధి గడ్డితింది అని హీరో బావురుమన్నాడు. కాళ్ల బేరానికి వచ్చాడు. అప్పటి నుండి నటీనటులు విఠలాచార్య దగ్గర ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండేవారట! కోపం వస్తే ఇక నీ పాత్ర ముగిసింది నువ్వు పిల్లివయ్యావనో, ఎలుకవయ్యావనో చెప్పి వాటితో నటింపజేస్తారని భయపడేవారట!

 నిజమే ఎప్పుడూ నాలుగైదు దయ్యాలను వెంట ఉంచుకుంటే ఎదురుండదు. పెంపుడు కుక్కలు, పిల్లులు ఉన్నప్పుడు పెంపుడు దయ్యాలు ఎందుకుండవద్దు. మనం అనుకుంటాం కానీ చాలా మంది దయ్యాలను పెంపుడు జంతువుల్లా తమతో అట్టిపెట్టుకుంటారు. అవి దయ్యాలు కాబట్టి మనకు కనిపించవు. పరీక్షించి చూడండి ప్రతి మనిషిలో కనిపించని దయ్యం ఉంటుంది. చూసే ఓపిక ఉండాలి. నాయకుల్లో అధికారం అనే దయ్యం ఉంటుంది.

 వారికి అధికార దయ్యం పట్టిన తరువాత వారు అధికారం కోసం ఏమైనా చేస్తారు. చాలా మంది నాయకుల్లో ఎన్నో సుగుణాలు కనిపిస్తాయి కానీ ఈ అధికారమనే దయ్యం వారితో ఏ పనైనా చేయిస్తుంది. ఆదాయం కోసం ఎన్నో వ్యాపారలు ఉండగా, రాజకీయాలనే ఎందుకు నమ్ముకున్నారని ప్రశ్నిస్తే చిరునవ్వుతో దాటవేస్తారు. దయ్యం కోరుకునేది అధికారం కానీ కేవలం సంపాదన మాత్రమే కాదు కదా!
దయ్యాల్లో అనేక రకాలు ఉంటాయి

 కొరివి దయ్యం, ఆడ దయ్యం, పిల్ల దయ్యం, కామ పిశాచం అంటూ రకరాలుగా ఉంటాయి. చాలా సినిమాల్లో దయ్యాలను మరీ బఫూన్లుగా చూపిస్తారు కానీ అవి మరీ మనుషులంత బఫూన్లు కావు, మనుషుల కున్నంత క్రూరత్వం ఉండదు. రాజకీయ దయ్యాలు మరీ చిత్రమైనవి. తమ చిత్రవిచిత్ర వేషాలతో అవి ఎప్పటికప్పుడు ప్రజలను తమపై నమ్మకం పెంచుకునేట్టు చేస్తాయి.

 పాడుపడిన శ్మశాన వాటికల్లో దయ్యాలు తమ మానాన తాముంటే వాటిని ఆక్రమించుకుని దయ్యాలను రోడ్డుపాలు చేసే మనుషుల కన్నాదయ్యాలు క్రూరమైనవేమీ కాదు. దయ్యాలు విడిగా ఉన్నప్పుడు బుద్ధిమంతురాళ్లుగానే ఉంటాయి. అవి మనిషితో కలిసినప్పుడే , అధికారం కోసం ఏమైనా చేయబుద్ధవతుంది. దయ్యం ప్రభావం మరీ ముదిరిపోతే నైతిక విలువల గురించి ఊరూరు తిరిగి ఉపన్యాసాలు ఇవ్వాలనిపిస్తుంది. ప్రపంచ పు దయ్యాలు ఏకం కావాలి. పోరాడితే పోయేదేమి లేదు మానవ సంకెళ్లు తప్ప.

16 కామెంట్‌లు:

 1. క్షమించు దయ్యమా కామెంట్స్ లేవని బాధపడకు కు ఇంట్లో నెట్ పని చేయలేదు.ఇప్పుడు పని చేస్తోంది . కామెంట్స్ బాక్స్ కనిపించడం లేదని ఓ మంచిదయ్యం మెయిల్ చేసేంతవరకు తెలియలేదు ( మచిదయ్యం దేవతలాంటిదే మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు)

  రిప్లయితొలగించు
 2. ఏమో అనుకున్నాను కానీ మీకు దెయ్యాలగురించి చాలా విషయాలు తెలుసే...

  చాలా బాగా రాసారు...వెరీ నైస్...ఇంకా మీకు తెలిసిన దెయ్యాల కథలు పార్టులు పార్టులుగా చెప్తారని ఎదురు చూస్తున్నాం.
  --
  మీ బ్లాగ్లో కామెంట్ బాక్స్ ఏ దెయ్యం ఎత్తుకుపోయిందో వెంటనే నాకు తెలియాలి...తెలియాలి.....

  రిప్లయితొలగించు
 3. ఇంతకీ దయ్యాలు ఉన్నాయని నమ్ముతారు కానీ వాటి కాళ్ళు వెనక్కి ఉంటాయన్నది మూఢనమ్మకం అంటారా.

  మనుషుల్లో దయ్యాలు అణువణువునా కనిపిస్తాయి. ముందుకు నడుస్తామంటూ వెనక్కి నడిచేవాళ్లే నిజమైన దయ్యాలు. వాళ్ళ కాళ్ళు వెనక్కే ఉంటాయి కదా మాష్టారూ.

  రిప్లయితొలగించు
 4. oho ide nnamaata sangathi, ee madhya nannu andaroo "neeku blog dayyam pattukundi. adi ninnu vadaladam ledu, maaku annam kooda sariggaa pettadam ledu" antunnaru andaru. ite nannu pattukundi manchi dayyame nannamaata. chaalaa opikatho aalochinchaanulendi.

  రిప్లయితొలగించు
 5. ముందుకు నడుస్తామంటూ వెనక్కి నడిచేవాళ్లే నిజమైన దయ్యాలు.
  _____________________________________________

  అంటే ఇలాగేనా బులుసుగారూ?

  http://www.youtube.com/watch?v=n_3v-_p3ESo

  రిప్లయితొలగించు
 6. @ సుధా గారు మనం అనుకుంటాం కానీ మన చుట్టూ ఎన్నో దయ్యాలు ఉంటాయండి. వాటిని పరిశీలించే ఓపిక మనకు ఉండాలి అంతే . నాకు కవిత్వం గురించి తెలియదు కానీ శ్రీ శ్రీ ముందు దగా వెనక దగా కుడి ఎడమల దగా దగా అన్నారు కానీ అలా కాకుండా ముందు దయ్యం, వెనక దయ్యం కుడిఎడమల దయ్యం అని ఉంటే మరింత సహజంగా ఉండేదేమో . ఖాన్తో గేమ్స్ ఆడొచ్చు కానీ దయ్యంతో ఆడలేం చూడండి ఆ బాక్స్ ఎత్తుకేల్లిన వారు క్షమాపణ చెప్పి మరి ఇచ్చి వెళ్లారు

  రిప్లయితొలగించు
 7. @సమీరా గారు ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మానని కాపాడుతుంది అలానే మీకు పట్టిన మంచి దయ్యం (బ్లాగ్ ) ను మీరు కాపాడండి, మంచి దయ్యం మిమ్ములను కాపాడుతుంది .

  రిప్లయితొలగించు
 8. మురళీ గారూ ఈ పోస్ట్ బాగా నచ్చింది..మంచి వ్యంగ్యం...నిన్ననే చదివాని, కానీ కామెంటు పెడదామనుకుంటే బాక్స్ లేదు. ఏ పాడు దెయ్యమైనా వచ్చి కామెంటు రాసేస్తుందేమో అని అనుమనించి మీరే కామెంటు బాక్స్ disable చేసారేమో అని అనుకున్నాను. నేనెంత అమాయకపు దెయ్యాన్నో! :)

  రిప్లయితొలగించు
 9. మలక్ పేట గారు నేను అలా ముందుకు వెలతానండి

  రిప్లయితొలగించు
 10. ఆ సౌమ్య గారు దయ్యాల పట్ల ఇంత అభిమానం ఉంటుందని ఉహించలేదండి.. మనుషుల గురించి రాస్తే స్పందన అంతంత మాత్రమే కానీ దయ్యాల గురించి రాస్తే ... దయ్యం అభిమానులు దయ్యం గుర్తుతో ఒక పార్టీ పెడితే బాగానే ఉంటుందనిపిస్తుంది . ఇదిగో అందరికీ ముందే చెబుతున్నాను. దయ్యం గుర్తు పార్టీ కాఫి రైట్స్ నావే. ( ఎవరికైనా ఆసక్తి ఉంటే సంప్రదించండి . రేటు దేముందండి . మనం మనం కలిసిజనాన్ని మోసం చేయడం ముఖ్యం )

  రిప్లయితొలగించు
 11. >>>ఒకరి మూఢనమ్మకంలో మరొకరు జోక్యం చేసుకోకపోవడమే ప్రజాస్వామ్యం. పరస్పర మూఢనమ్మకాలను గౌరవించుకోవడంపైనే ప్రజాస్వామ్య మనుగడ ఆధారపడి ఉంది.
  :)) బాగా చెప్పారు.

  >>>దయ్యాలు విడిగా ఉన్నప్పుడు బుద్ధిమంతురాళ్లుగానే ఉంటాయి.
  >>>మచిదయ్యం దేవతలాంటిదే
  ఇంతకీ దెయ్యం అనే పదం స్త్రీలింగమా? దెయ్యాలు స్త్రీలింగాలా? :)

  రిప్లయితొలగించు
 12. శిశిర గారు ప్రస్తుతానికి దయ్యల్లో వర్గ ,కుల , ప్రాంతీయ భేదాల గురించి తెలియడం లేదు దానిపై దృష్టి సారించాలి. మనిషి అనేది స్త్రీ పురుష ఇద్దరికీ ఉపయోగిస్తున్నప్పుడు దయ్యాన్ని అలానే పిలుచుకుందాం

  రిప్లయితొలగించు
 13. :))
  నాదో సందేహం - దయ్యాలు బ్లాగులు కూడా రాస్తుంటయ్యా? అవి బ్లాగులు వ్రాస్తే ఎలా వుంటుందేంటి? అలాంటి బ్లాగులేమన్నా వుంటే అడ్రసులివ్వండి.

  పతంజలి గారి ఓ నవల (దయ్యం ఆత్మకథ/పిశాచం ఆత్మ కథ? పేరు సరిగ్గా గుర్తుకులేదు) ఈ టపాకి స్ఫూర్తి అనుకుంటా.

  రిప్లయితొలగించు
 14. శరత్ గారు మీ అమాయక పాత్ర బాగుంది .దయ్యాలు బ్లాగ్స్ రాయడం లో ఆశ్చర్యం ఎందుకు ఏకంగా నవలలే రాశాయి. రాజకీయాల్లో వీరవిహారం చేసేస్తున్నాయి. సరే మరి కావాలంటే కులం , చెత్తా చెదారం పేరుతో కొట్టుకుంటున్న బ్లాగ్స్ బోలెడు ఉన్నాయి చూడండి అవి ఎవరు రాస్తున్నారని అనుకుంటున్నారు.......... మీరు పతంజలి గారి పేరు ప్రస్తావించినందుకు సంతోషం వేసింది. ఆయన రాసింది ఒక దయ్యం ఆత్మ కథ . మిత్రులతో మాట్లాడేప్పుడు నాకు మాత్రం గురజాడ కన్యాశుల్కం కన్నా పతంజలి రచనల్లో వ్యంగ్యం బాగా నచ్చింది అంటే, నువ్వి ఈ మాట అంటే సార్ కూడా ఒప్పుకోడు అన్నారు.కానీ నా మాట మాత్రం అదే .పతంజలి వ్యంగ్య రచనలు చదివిన వారు ఆ ప్రభావం నుంచి బయట పాడడం అంత సులభం కాదు. బ్లాగర్స్ తాము చదివిన బుక్స్ గురించి బ్లాగ్స్ లో పోస్ట్ రాసినప్పుడు పతంజలి పేరు కోసం ఆసక్తిగా వెతుకుతాను.

  రిప్లయితొలగించు
 15. మీకు పతంజలి గారంటే ఇష్టమని తెలిసే అది ప్రస్థావించాను. సౌమ్య గారి టపాలో మీ కామెంటు చదివాను కానీ ఆ టపా ఇంకా చదవలేదు - చదవాలి. పతంజలి గారివి రెండు నవలలు మాత్రం చదవగలిగాను. అందులో దయ్యం ఆత్మకథ ఒకటి. ఇంకొకటి డబ్బు గురించి. సినిమాగా వచ్చింది కానీ పేరు గుర్తుకులేదు. టబు హీరోయిన్. దయ్యం నవల నాకు బాగా నచ్చింది.

  రిప్లయితొలగించు
 16. "దయ్యాలు విడిగా ఉన్నప్పుడు బుద్ధిమంతురాళ్లుగానే ఉంటాయి. అవి మనిషితో కలిసినప్పుడే , అధికారం కోసం ఏమైనా చేయబుద్ధవతుంది. దయ్యం ప్రభావం మరీ ముదిరిపోతే నైతిక విలువల గురించి ఊరూరు తిరిగి ఉపన్యాసాలు ఇవ్వాలనిపిస్తుంది. "

  ఇది సూపరండీ.....

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం