8, జూన్ 2011, బుధవారం

వీరబాబు కథ .. నాయకుడిలోని నాయకులు

కొత్తకారులో లాంగ్ డ్రైవ్‌కు వెళదామా? డార్లింగ్ అని రాజేశ్ అడగ్గానే సుజి ఒక్క క్షణం కూడ ఆలోచించలేదు. పరిచితుడు, పైగా ప్రేమికుడు మురిసిపోయి కారెక్కింది. ఊరుదాటింది, అడవి ప్రవేశించింది చల్లని గాలికి కనులు మూతపడుతుండగా, వర్షం మొదలైంది. వీరికోసమే అన్నట్టు అక్కడో పాడుపడిన బంగ్లా కనిపించింది.

 వర్షంలో తడుస్తూ బంగ్లాలోని పరుగులు తీశారు. తడిసిన చీరలో ఆమె మరింత అందంగా కనిపించింది. పరిచితుడైన రాజేశ్‌లోని అపరిచితుడు బయటకు వచ్చాడు. తరువాత కథ నమ్మించి మోసం చేశాడని టీవి లైవ్ షోలో ఆమె చెప్పుకోవడం పిఓడబ్ల్యు సంధ్య ఆగ్రహం అంతా తెలిసిందే కదా! వదిలేద్దాం. రాకేశ్‌లు రాజేశ్‌లే కాదు. పాలకులు పాలితులే కాదు దేవుళ్లులో సైతం పరిచితుల్లో బయటకు కనిపించని అపరిచితులు ఎంతో మంది ఉంటారు. వారి వారి పాత్రల అవసరాన్ని బట్టి బయటకు వస్తారు
.****
సాలార్‌జంగ్ మ్యూజియంలో ఒకవైపు స్ర్తిగా మరోవైపు పురుషునిగా కనిపించే విగ్రహాన్ని చూస్తూ అంతా విస్తుపోతుంటారు. కానీ అలా విస్తుపోయే వారిలో సైతం కనిపించని మనుషులు ఎందరో ఉంటారు. అలానే ఈ మధ్య అల్లుడు బాబు తనలోని వీరబాబు అవతారాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. చెవిలో చెప్పిందంత నిజమేనని నమ్మేవారుంటారని కొందరి నమ్మకం. అలానే గట్టిగా చెబితే జనం నమ్ముతారని వీరబాబు కొత్త సిద్ధాంతం . ఇప్పుడాయన తన పేరుతో సహా ఏదైనా చాలా గట్టిగా చెబుతున్నారు.
కాకిపిల్ల కాకికి ముద్దు మీడియా మానస పుత్రుడు మీడియాకు ముద్దు. వీరబాబు కొత్త అవతారాన్ని చూసి సొంత మీడియా మురిసిపోతోంది. అప్పుడంటే ప్రచారం కోసం అర్రులు చాచి క్లింటన్ మెచ్చుకున్నాడు అంటూ ప్రచారం చేసుకున్నాను, అది నా అసలు అవతారం కాదు ఇప్పటి రైతు అవతారమే నిజమైన అవతారం అని నమ్మమంటున్నారు.

 డ్రెస్ కోడ్‌ను సైతం మార్చి అడ్డపంచ కట్టారు. వచ్చే మహాపండగ నాటికి వీరబాబు ధోవతి కట్టుకొని వస్తారని ఆయన అభిమానులు ఎన్నికల హామీ ఇస్తున్నారు. ఏం చేశాం, ఏం చేస్తున్నామన్నది ముఖ్యం కాదు ఎలా నటిస్తున్నాం అనే్నదే ముఖ్యం అని వీరబాబు నమ్మిన సిద్ధాంతం. ఆయనలో హైటెక్ రూపాన్ని చూసిన అభిమానులు ఆయన ఓటమిని సైతం తట్టుకున్నారు కానీ పంచలోకి మారక తప్పని పరిస్థితిని జీర్ణం చేసుకోలేకపోతున్నారు.

 చేసేవాడిని చేయించే వాడిని అంతా నేనే అని శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పారు. నా అసలు రూపం నాకే తెలియనప్పుడు నేను ఏ రూపంలో కనిపిస్తేనేం అని వీరబాబు అభిమానులకు నచ్చజెపుతున్నారు. విష్ణువు అంశ ఉంటేనే కాదా రాజ్యభోగం లభిస్తుంది. అధికారంలోకి వచ్చారు అంటే వారిలో విష్ణు అంశ ఉన్నట్టే కదా!

 విష్ణు అంశం ఉండడం అంటే కనీసం పది అవతారాలైనా ఎత్తాల్సిందే కదా! మరి వీరబాబైనా మరెవరైనా రంగులు మారుస్తున్నాడని విమర్శించడం ఎందుకు అవతారాలు దాలుస్తున్నారని మురిసిపోవచ్చు కదా! వీరుడంటే ఇలా ఉండాలని చెప్పడానికి సృష్టించిన పాత్ర అర్జునుడిది. అటూ ఆడా ఇటు మగా కాని పాత్ర బృహన్నలది. అర్జునుడు బృహన్నల కావడం మహాభారతంలో ఓ విచిత్రం. ఎన్టీఆర్ కృష్ణుడిగా, అర్జునుడిగా ఎంతగా అలరించారో, బృహన్నలగా అంత కన్నా బాగా ఆకట్టుకున్నారు.

 ఒక మనిషిలో అనేక మంది మనుషులుంటారు. సందర్భాన్ని బట్టి ఒక్కో మనిషి బయటకు వస్తారు. అప్పటి సూపర్ స్టార్ కృష్ణ సాంకేతిక విలువలతో కురుక్షేత్రం సినిమాకు సన్నాహాలు చేస్తే, ఎన్టీఆర్ దాన వీర శూరకర్ణకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమాలో దుర్యోధనుడి నుంచి నుంచి శ్రీకృష్ణుని వరకు అంతా ఎన్టీఆర్ మయం. కథ, దర్శకత్వం, నిర్మాత సర్వ బాధ్యతలు ఆయనవే. ఒకటి అరా సరిపోకపోతే కొడుకులతో నటింపజేశారు.
 ఒక మనిషిలో అనేక మంది మనుషులుంటారనే దానిపై ఏమైనా అనుమానం ఉంటే ఎన్టీఆర్ నటన చూశాక అవి పటాపంచలై పోక తప్పదు. బహుశా ఈ సినిమా ప్రభావం అల్లుడిపై బాగానే పడినట్టుంది. 
ఆయన ముఖ్యమంత్రి కాగానే చీపురు పట్టుకుని క్లీన్ అండ్ గ్రీన్ ఎలా చేయాలో చూపించారు, ఆకస్మిక తనిఖీ అంటూ బడిపంతులయ్యారు. పరిపాలన ఇలా కూడా ఉంటుందా? అని సిఇఓ అవాక్కయితే, ఆయన హోదా కూడా లాక్కోని ఇప్పుడు నేనే సిఇఓ నన్నారు. సొంత డబ్బుతో, సొంత బ్యానర్‌పై అన్ని పాత్రల్లో ఎన్టీఆర్ తానై నటించినా దానవీర శూరకర్ణ సూపర్ హిట్టయితే అన్ని పాత్రలు తానై నడిపించిన బాబు పాలన అట్టర్ ఫ్లాపైంది.

 అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎన్ని పాత్రలు పోషించారో ఆయనకే గుర్తు లేదు. ఇప్పుడు తీరిగ్గా ఒక్కో పాత్రను గుర్తుకు తెచ్చుకుంటూ పశ్చాత్తాపం ప్రకటిస్తున్నారు. అన్ని పాత్రల్లో దూరిపోవాలనే తపనే కాదు సత్తా కూడా ఉండాలి. పబ్లిసిటీపై సినిమాలే కాదు పాలన కూడా నడవదని అల్లుడు తన తొమ్మిదేళ్ల నిర్విరామ కృషితో నిరూపించారు.
మహాభారతం వాస్తవం అయితే అద్భుతం, కల్పితం అయితే మహాద్భుతం అన్నాడో పాశ్చాత్యుడు.

 ఒకటా రెండా కొన్ని వేల పాత్రలు. ఏదో ఇలా వచ్చి అలా పోయే పాత్రలు కాదు ప్రతి పాత్రతో హీరోగా కొన్ని వందల సినిమాలను తీయవచ్చు. రచయిత హీరోను సృష్టించినా విలన్‌ను సృష్టించినా ఆ క్యారక్టర్‌లోని లక్షణాలు రచయిత మనసులో కొద్దొ గొప్పో ఉండి తీరుతాయి.
 విలన్ రేప్ సీన్ సృష్టించే రచయితకు రేప్ చేసిన అనుభవం లేకపోయినా కనీసం కోరికైనా కొంతైనా ఉంటుంది. లేదా ఎవరైనా రేప్ చేస్తే అలా చితగ్గొట్టాలనే కోరికైనా ఉంటుంది. భిన్నభిన్న మనస్తత్వాలతో కొన్ని వేల పాత్రలను సృష్టించడం అంత ఆషామాషి కాదు అందుకే మహాభారతం వాస్తవం అయితే అద్భుతం అన్నవారు కల్పితం అయితే మహాద్భుతం అన్నారు
.***
అవకాశాలు లేక అమాయక పాత్రలో ఉండిపోతాం కానీ మనం మాత్రం తక్కువనా? అవకాశం ఉంటే మనలోని అపరిచితులను బయటకు తీయకుండా ఉంటామా? 

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం