17, నవంబర్ 2018, శనివారం

డబ్బు లక్షణాలు

ఎంత డబ్బు వచ్చినా నిలవడం లేదు. ఇద్దరు పని చేసేది ఒకే చోట. ఇద్దరి జీతం ఒకటే ఇద్దరి హోదా ఒకటే కానీ మా వద్ద డబ్బు అస్సలు నిలవదు. కానీ వారి పరిస్థితి బాగుంది. డబ్బు నిలుస్తోంది. ఎందుకిలా జరుగుతోంది. ఇలాంటి సందేహాలు మనలో చాలా మందికి వచ్చే ఉంటాయి. వస్తూనే ఉంటాయి.
మనిషికి కొన్ని లక్షణాలు ఉన్నట్టే డబ్బుకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. నిన్ను అభిమానించే వారి వద్దకే నువ్వు వెళతావు. అలాంటి వారితో ఉండడానికే నువ్వు ఇష్టపడతావు. డబ్బు కూడా అంతే తనను బాగా చూసుకునే వారి వద్దనే ఉంటుంది. వారి వద్దనే వృద్ధి అవుతుంది. తోటి మనుషులను, ఇంట్లో వాళ్లను ప్రేమగా ఎలా చూసుకుంటామో డబ్బును కూడా అలా చూసుకుని దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తేనే అది నీ వద్ద నిలుస్తుంది. లేదంటే బంధాలు నిలవనట్టే డబ్బు కూడా నిలువదు.
డబ్బు లక్షణాలను వివరించే విధంగా మనకెన్నో సామెతలు, నానుడులు ఉన్నాయి. పైసే పైసాకు కీంచ్‌తా అనేదో నానుడి. డబ్బుకు డబ్బును ఆకర్శించే లక్షణమే కాదు, తనను నిర్లక్ష్యం చేసే వారికి దూరంగా వెళ్లడం కూడా సంపద ప్రధాన లక్షణం.
ఆర్థిక నిపుణులు డబ్బు లక్షణాలు కొన్నింటివి వివరిస్తూ మీవద్ద కూడా సంపద నిలిచి ఉండాలంటే ఏం చేయాలో వివరించారు. మన వద్ద డబ్బు నిలవాలి అంటే ముందు ఆ డబ్బుకుండే లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలి. ప్రధానంగా డబ్బుకు ఐదు లక్షణాలు ఉంటాయని నిపుణులు తేల్చారు.
డబ్బు మొదటి లక్షణం తనకు తగిన గౌరవం, విలువ ఇచ్చిన వారి వద్దనే అది నిలుస్తుంది. అంటే మీ వద్ద డబ్బు నిలవాలి అంటే దానికి తగిన గౌరవం ఇవ్వాలి. డబ్బు మనిషి కాదు కదా? దానికి విలువ ఇవ్వడం ఏమిటీ అనుకోవద్దు. అది మనిషి కాకపోయినా మనిషిలా స్పందించే గుణం లేకపోయినా, మాట్లాడక పోయినా డబ్బు తనకు విలువ ఇస్తున్నారా? లేదా అని గ్రహించే శక్తి దానికి ఉంటుంది. విలువ ఎలా ఇవ్వాలి అంటే మీ జీతం, సంపాదన ఎంతైనా కావచ్చు దానిలో కనీసం ఒక పది శాతం పొదుపు చేయాలి, అలా పొదుపు చేసిన డబ్బును తనకు, తన కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే విధం ఇనె్వస్ట్ చేయాలి. చాలా మంది ప్రతి నెలా ఎంతో కొంత ఇనె్వస్ట్ చేస్తారు. తిరిగి ఏదో పని పడినప్పుడు ఆ డబ్బును ఖర్చు చేస్తారు. మా వద్ద డబ్బు నిలవడం లేదు అని ఆవేదన చెందుతారు. ఆరంభశూరత్వం అన్నట్టు ఐదారు నెలలు పొదుపు చేయడం కాదు. కనీసం పది శాతం పొదుపు చేయడం అనేది సంపాదన ప్రారంభించినప్పటి నుంచీ ఉండాలి. వీలుంటే పొదుపు లేదంటే లేదు అనే వైఖరి కాకుండా క్రమం తప్పకుండా ఈ పొదుపు ఉండాలి. రెగ్యులర్‌గా పొదుపు చేసి మదుపు చేసే వారి వద్దనే డబ్బు నిలుస్తుంది. సంపద సమకూరుతుంది. ఇది డబ్బుకు సంబంధించి మొదటి లక్షణం.
ప్రలోభాలకు లొంగని వారి వద్దనే ధనం నిలుస్తుంది. ఇది డబ్బుకు సంబంధించి రెండో సూత్రం. అంటే మీరు పొదుపు చేసిన డబ్బును సక్రమంగా ఇనె్వస్ట్ చేయాలి. రెండేళ్లలో డబ్బు రెట్టింపు అవుతుంది. జూదం, లాటరీలు, అక్రమ వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో పెట్టుబడి పెట్టి రాత్రికి రాత్రి సంపన్నులం కావాలి అనుకునే వారి వద్ద డబ్బు నిలువదు. చిన్న విత్తనమే భూమిలో పాతిన తరువాత కొంత కాలానికి మహావృక్షం అవుతుంది. జ్ఞానం అయినా, ధనం అయినా క్రమంగా పెరుగుతుంది. చట్టబద్ధమైన, ధర్మబద్ధమైన పెట్టుబడుల్లోనే డబ్బు న నిలుస్తుంది.
ఓపిక ఉన్న వారి వద్దనే ధనం నిలుస్తుంది. ఓపిక లేని వారి వద్ద ధనం నిలవదు. ఇది ధనానికి సంబంధించి మూడవ లక్షణం. డబ్బుకు సంబంధించి నిర్ణయాలు అన్ని కోణాల్లో ఆలోచించి సావధానంగా నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో ఓపిక ఉండాలి. హడావుడి పనికి రాదు. నీ చేతిలో ఉన్నంత వరకే అది నీ డబ్బు నీ చేయి దాటి పోయింది అంటే దానిపై నీకు అజమాయిషీ ఉండదు. డబ్బును ఎవరికైనా అప్పుగా ఇచ్చినా, చే బదులు ఇచ్చినా, ఇనె్వస్ట్ చేసినా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. మన నిర్ణయం సరైనదేనా అని ఆలోచించాలి. ఏటిలో డబ్బు వేసినా లెక్కబెట్టి వేయాలి అంటారు. అంటే డబ్బుకు సంబంధించి లెక్కలు స్పష్టంగా ఉండాలి. ఎక్కడ ఎంత ఖర్చు చేస్తున్నాం, ఎక్కడ ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఎవరికెంత ఇచ్చాం అనే లెక్కలు ఉండాలి. ఓపిక ఉన్నవారిలో మాత్రమే డబ్బుకు సంబంధించి ఈ లెక్కల్లో స్పష్టత ఉంటుంది. అలాంటి వారి వద్దనే డబ్బు నిలుస్తుంది.
తెలియని రంగం వైపు వద్దు
ఎవరినైనా ఆర్థికంగా దెబ్బతీయాలి అంటే వారితో లారీ కొనిపించాలి అని ఒక జోక్ వ్యాపార వర్గాల్లో ప్రచారంలో ఉంది. లారీ వ్యాపారంలో లాభాలు ఉండవని కాదు కానీ లారీల వ్యాపారం గురించి ఏ మాత్రం తెలియకుండా, ఆ రంగంలో అడుగు పెడితే అనుభవం వచ్చే నాటికి పెట్టుబడి మాయం అవుతుంది. వాహన రంగం ఒక్కటే కాదు ఏ వ్యాపారంలోనైనా దాని గురించి లోతు పాతులు తెలియకుండా అడుగు పెడితే అలాంటి వారి వద్ద ధనం నిలువదు. ఏదో ఆకర్శణతో తమకు ఏ మాత్రం అనుభవం లేని రంగంలో అడుగు పెట్టి ఆర్థికంగా చితికి పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్నా, వ్యాపారం చేయాలన్నా ఆ రంగం గురించి నిపుణులతో చర్చించాలి. తగిన అవగాహన కలిగి ఉండాలి. కూరగాయలు అమ్మే వ్యక్తితో కూరగాయల గురించి సలహాలు తీసుకోవచ్చు కానీ స్టాక్‌మార్కెట్ గురించి కాదు. అంటే ఏ రంగంలో నిపుణులు ఐతే వారిని నుంచి ఆ రంగానికి సంబంధించి సలహాలు తీసుకోవచ్చు. ఒక రంగంలో నిపుణులు ఐనంత మాత్రాన వారికి అన్ని రంగాల గురించి అవగాహన ఉంటుందని కాదు.
అత్యాశా పరులు వద్ద ధనం నిలువదు. ఇది ధనానికి సంబంధించి ఐదవ సూత్రం. అత్యాశతో ధనాన్ని ఎప్పుడూ పెట్టుబడి పెట్టవద్దు. లాటరీలు, జూదం, ఏడాదిలో ధనం రెట్టింపు అవుతుంది. కాకరకాయ పొడితో ఆరునెలల్లో ధనం రెట్టింపు. బంగారం కడిగితే రెట్టింపు అవుతుంది అంటూ మోసం చేసే వారిని నమ్మేది అత్యాశా పరులే. ధనం అనేది క్రమ బద్ధంగా పెరుగుతుంది. క్రమ బద్ధంగా పెరగాలి అలాంటి వారి వద్దనే ధనం నిలుస్తుంది. ధనానికి మనం విలువ ఇస్తేనే అది మన వద్ద నిలుస్తుంది.
-బి.మురళి(11-11-2018)