28, ఏప్రిల్ 2023, శుక్రవారం

ఆంధ్రా కిమ్ శంకర పిచ్చయ్య ... ఓ జ్ఞాపకం 5

ఆంధ్రా కిమ్ శంకర పిచ్చయ్య ... ఓ జ్ఞాపకం శంకర పిచ్చయ్య తెలుసా ? అని నేటి ఐటీ కుర్రాళ్లను అడిగితే , ఎవరూ ? సుందర్ పిచాయ్ కు ఏమవుతారు అని అడుగుతారు . ఏమీ కారు . ఆగండాగండి నేను కూడా మీ కన్నా ముందే శంకర పిచ్చయ్య గురించి గూగుల్ ఏమన్నా చెబుతుందేమో అని చూస్తే ఆది శంకరా చార్య గురించి మోయలేనంత సమాచారం చూపించింది . ఆ ప్రయత్నాలను పక్కన పెట్టి జ్ఞాపకాల్లోకి వెళితే ... 93 -94 లో వరంగల్ జిల్లా రిపోర్టర్ గా ఉన్నప్పుడు పత్రికల్లో ప్రతి రోజు లక్ష్మీ పార్వతి , శంకర పిచ్చయ్య గురించి పుంఖాను పుంఖాలుగా వార్తలు . ఇప్పుడు కొరియా కిమ్ గురించి ప్రపంచం భయపడుతున్నట్టు వార్తలు ఎలా వస్తున్నాయో ఓ మూడు పత్రికల్లో శంకర పిచ్చయ్య గురించి అలా వచ్చేవి . అంటే అతను ఆ కాలం నాటి ఆంధ్రా కిమ్ అన్నమాట . లక్ష్మీ పార్వతి సోదరుడు వరంగల్ ఈనాడు రిపోర్టర్ నళినీకాంత్ గుంటూరు బదిలీ అయి వెళ్ళాడు . గుంటూరు వెళ్లి ఉద్యోగం లో చేరి కొన్ని రోజులు పని చేసి వరంగల్ వచ్చాడు . వరంగల్ లోని తమ ఇంట్లో శుభకార్యం రావాలి అని రిపోర్టర్ లు అందరినీ పిలిచాడు . గుంటూరు బదిలీ అయి వెళ్లిన అతను శంకర పిచ్చయ్య గురించి చెప్పాడు . మా ఇంట్లో పంక్షన్ కు శంకర పిచ్చయ్య కూడా వస్తున్నాడు అని చెప్పగానే తోటి రిపోర్టర్ లలో ఉత్సాహం . ఆ మాట ముందే చెబితే పిలువక పోయినా ఫంక్షన్ కు మేం వచ్చేస్తాం అన్నాం . కిమ్ వస్తున్నాడు అంటే బొట్టు పెట్టి పిలవాలా ? వాలిపోతాం . ఆంధ్రా కిమ్ వస్తున్నాడు అంటే రాకుండా ఎలా ఉంటాం . ****** అందరూ పంక్షన్ జరిగే చోట ఉంటే రిపోర్టర్ లం మాత్రం గేటు దగ్గర నిలబడి శంకర పిచ్చయ్య కోసం చూస్తున్నాం . అంతా పంక్షన్ కు వచ్చిన వాళ్ళే ఒక్కరిలోనూ శంకర పిచ్చయ్య ముఖం కనిపించలేదు . ఒక్కొక్కరిని చూస్తూ ఉండగా .. బక్క పలుచగా , పొట్టిగా కనిపించిన ఓ వ్యక్తిని చూస్తూ ఇతను శంకర పిచ్చయ్య కాదు పిచ్చయ్య అని జోకులేసుకున్నాం . ఎంత ఎదురు చూస్తున్నా శంకర పిచ్చయ్య కనిపించలేదు . మా పరిస్థితి గమనించి నళినీకాంత్ బయటకు వచ్చి , శంకర పిచ్చయ్య ఎప్పుడో వచ్చాడు మీరు లోపలి రండి అని లోపలి తీసుకు వెళ్లి శంకర పిచ్చయ్యను పరిచయం చేస్తే ఆశ్చర్య పోవలసి వచ్చింది . తెలుగు పత్రికల్లో శంకర పిచ్చయ్య ఆకృత్యాలు పేజీలకు పేజీలు రోజూ వచ్చేవి . పాతాళా భైరవి సినిమాలో ఎన్టీఆర్ ను మట్టుపెట్టడానికి వచ్చిన మాయల మాంత్రికుడు యస్వీఆర్ లా ఉంటాడు అనుకుంటే కనీసం డిటెక్టివ్ సినిమాల్లో విలన్ ఆర్ నాగేశ్వర రావులా కూడా లేడు . లోనికి వెళ్తున్నప్పుడు శంకర పిచ్చయ్య కాదు ఉట్టి పిచ్చయ్య అని మేం జోకులు వేసుకుని నవ్విన వ్యక్తే శంకర పిచ్చయ్య . అనుమానం తిరక రోజూ పత్రికల్లో అంతంత పెద్ద వార్తల్లో విలన్ మీరేనా ? నిజంగా మీరే శంకర పిచ్చయ్య నా అంటే ఔను అని చెప్పి . తన గురించి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు , లెక్చరర్ గా పని చేస్తున్నాను ఏవేవో రాస్తున్నారు . మీరు నా జీవితం తో ఎందుకు ఆడుకుంటున్నారు ? ఎందుకు రాస్తున్నారు అని అవే పత్రికల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాను , పట్టించుకోవడం లేదు అలానే రాస్తున్నారు అని వాపోయాడు . శంకర పిచ్చయ్య వచ్చిన ఆ పంక్షన్ కు ఆనాటి వరంగల్ టీడీపీ హేమా హేమీలు కడియం శ్రీ హరి , ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మిగిలిన నేతలు వచ్చారు . *** లక్ష్మీ పార్వతి పెంపుడు పిల్లిని కూడా డైనోసర్ అని తెలుగు పత్రికలు రాస్తున్న రోజులు అవి . ముచ్చటగా మూడు పత్రికలు ఈ వార్తలు పంచుకొని వడ్డించే వారు . సాధారణం గా పత్రికల మధ్య పోటీ ఉంటుంది . ఎన్టీఆర్ ను దించేసి కుట్రలకు సంబంధించిన ఈ వార్తల్లో పోటీ లేకుండా పరస్పర సహకారం తో పని చేసేవారు . అప్పటి వరకు లక్ష్మీ పార్వతి , శంకర పిచ్చయ్యల గురించి పుంఖాను పుంఖాలుగా రాసిన వారు ఎన్టీఆర్ ను దించేసి తరువాత శంకర పిచ్చయ్య అనే ఓ పాత్ర ఉండేది అనే విషయం కూడా మరిచిపోయారు . ఎన్టీఆర్ మరణించిన తరువాత ఓ రోజు అంతకు ముందు ఉదయం లో పని చేసిన బసవేశ్వర రావు అనే ఓ జర్నలిస్ట్ మళ్ళీ శంకర పిచ్చయ్య వస్తారట అందరినీ కలిపి ఏదో చేస్తారట పెద్ద ప్లాన్ తో ఉన్నాడు అంటూ కథ చెబుతుంటే మధ్యలోనే ఆపేసి ఎన్టీఆర్ ను పైకి పంపిన తరువాత కూడా శంకర పిచ్చయ్యనా ? ఎన్టీఆర్ బాబును ఏమీ చేయలేక కుమిలి పోయి , పైకి పోయారు , ఇక పిచ్చయ్యలు ఏం చేస్తారు అన్నాను . ***\ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అట తెలుగు తనాన్ని ప్రపంచ వ్యాప్తం గా తీసుకువెళ్లిన అంటూ ఎన్ టి వి లో ఏదో చెబుతుంటే గుర్తుకు వచ్చింది . ఎన్టీఆర్ మరణించిన కొద్ది గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో అశోక గజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ మరణం పై లక్ష్మీ పార్వతి పై అనుమానం ఉందని అన్నారు . ఆ తరువాత కొంత కాలానికి ఎన్టీఆర్ మరణం పై విచారణ జరిపించాలనే డిమాండ్ ను బాబు పట్టించుకోనందుకు నందమూరి హరి కృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేశారు . తెలుగు తనాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన వ్యక్తి మరణం మిస్టరీ తెలుసుకోవాలి అనే హక్కు తెలుగు వారికి లేదా ? తన తండ్రి మరణం వెనుక కుట్ర తెలుసుకునే హక్కు కుమారుడికి లేదా ? శంకర పిచ్చయ్య మరణించారు అని వినిపించింది . ఈ రోజుల్లా అన్ని పార్టీలకు అప్పుడు మీడియా లేదు . ఒకే పార్టీ కోసం మీడియా పని చేసింది . దాంతో ఎన్టీఆర్ లాంటి వారే ఏమీ చేయలేక కుమిలి పోయి చనిపోయారు . ఇప్పుడంటే మృతుడే హంతకుడేమో అనే అనుమానం కలిగేట్టుగా ఒక్కో పత్రికలో ఒక్కో రకం వార్తలు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం