23, ఏప్రిల్ 2023, ఆదివారం

దాసరి పార్టీ పుట్టక ముందే అలా గిట్టి పోయింది


ఓ జ్ఞాపకం ....
ఉదయం నాలుగు గంటలు కావస్తుంది ... ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ కావడం తో ఈ టైంలో ఎవరు ఫోన్ చేసి ఉంటారు ? ఎందుకు చేసి ఉంటారు అని గాబరాగా ఫోన్ ఎత్తితే ... అటు నుంచి గొనె ప్రకాష్ ... మిమ్ములను నమ్మి వార్త చెబితే అలానేనా రాసేది .. సోర్స్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి .. ఇలా రాస్తే ఇంకోసారి ఎలా చెబుతాం . అంటూ అతను మాట్లాడుతూ పోతూనే ఉన్నాడు ... నాకు షాక్ .. అతని మాటలకు కాదు .. తెల్లవారు జామున నాలుగు గంటలకు అతను ఆంధ్రభూమి చదవడం , వార్త పై స్పందించడం .... అతను అడిగిన వాటిని పట్టించు కోకుండా ఆశ్చర్యంగా అదేంటి ఇంత పొద్దున మీకు పేపర్ రావడం , చదవడం అయిపోయిందా ? అని అడిగాను ...
****
దాదాపు 1997-98 ప్రాంతం ... 
ఎన్టీఆర్ కు ముందు ఆ సామాజిక వర్గం ప్రముఖులు కొందరు మనకంటూ ఓ పార్టీ ఉండాలి అని తీవ్రంగా ప్రయత్నించినట్టే ... చిరంజీవి కన్నా ముందు ఆ సామాజిక వర్గం నుంచి ప్రయత్నాలు జరిగాయి .. అలా దాసరి నారాయణ రావు ఓ పార్టీ పెట్టాలి అనుకున్నారు ... అంకెలు , చరిత్ర తో మాట్లాడే గొనె ప్రకాష్ దాసరి వద్ద చేరారు ... ఉమ్మడి రాష్ట్రం లో కాపు ఓట్లు ఎన్ని ? జిల్లా , నియోజక వర్గమే కాదు .. గ్రామాల వారీగా కూడా కులాలు , ఓట్ల లెక్కలు , చరిత్ర ఆయన నాలుక మీద ఉంటుంది .. మీరు పార్టీ పెట్టడమే ఆలస్యం సీట్లు వచ్చి పడిపోతాయి అని దాసరికి లెక్కలు చెప్పారు . ఆ లెక్కలకు ఎవరైనా ఆశ్చర్య పోవలసిందే ...
బసంత్ టాకీస్ లో దాసరి అభిమాన సంఘాల సమావేశం .. దాసరి పుట్టిన రోజు నాటికి కొత్త పార్టీ అన్నట్టుగా ప్రచారం .. పార్టీ ఎలా పెట్టాలి , అధికారం లోకి వచ్చాక ఏం చేయాలి అభిమాన సంఘాల విస్తృత చర్చ .... ఈ మీటింగ్ కన్నా ముందే పార్టీ పెడతారు అనే వార్తలు ...
అట్టహాసంగా మీటింగ్ జరిగినా పార్టీ పెట్టడానికి దాసరి జంకుతున్నారు అని చూచాయగా వినిపించింది ..
ఆ సమాచారం కోసం ప్రయత్నిస్తుంటే గొనె ప్రకాష్ కలిసి మీకో వార్త చెబుతాను ...అని ... పురజనుల కోరికపై దాసరి పార్టీ ఏర్పాటును వాయిదా అని రాయాలి అని చెప్పారు ..
***
పార్టీ ఏర్పాటు వాయిదా అని రాయాలి అని నేను చెబితే , పార్టీ ఏర్పాటు చేయడం లేదు అని రాశారు . మీరు సోర్స్ ను దూరం చేసుకున్నారు . అంటూ గొనె చెబుతూనే పోతున్నారు . అది సరే నాలుగు గంటలకు ఆంధ్రభూమి పాఠకుల వద్దకు వస్తుందా ? ఎలా సాధ్యం అయింది అని అడిగాను .. గొనె అవకాశం ఉంటే ప్రింటింగ్ అయి పత్రిక బయటకు రాగానే చదువుతారు అని తెలిసింది .. ప్రింటింగ్ వద్దకు వెళ్లే అవకాశం లేకపోతే, తెల్లవారు జామునే పేపర్ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లి చదువుతారు .
దాసరి పార్టీ వాయిదా ఎప్పటికీ కార్యరూపం దాల్చ లేదు ... తరువాత బాబు వద్ద ఓ సమావేశం లో మీరు మీడియాను కాదు మా సినిమా వారిని నమ్ముకోండి . బోలెడు ప్రచారం కల్పిస్తాం అని సలహా ఇచ్చారు . అటుతరువాత కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రి అయ్యారు ..
****
సరే మరి సోర్స్ ను పోగొట్టుకున్నావు అని గొనె అడిగిన దానికి ఏం సమాధానం చెప్పారు ? 
దాసరి పార్టీ పెడితే మీరు సోర్స్ అవుతారు కానీ ... అసలు పార్టీనే పెట్టనప్పుడు మీరు సోర్స్ ఏమిటీ అని నవ్వాను ....

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం