30, ఏప్రిల్ 2023, ఆదివారం

కొత్త సచివాలయం - పాత జ్ఞాపకాలు

కొత్త సచివాలయం - పాత జ్ఞాపకాలు జ్ఞాపకాలు 6 తెలంగాణ కొత్త సచివాలయం అద్భుతం గా తీర్చి దిద్దారు . ఈ కాలానికి తగ్గట్టు ఆధునిక సౌకర్యాలు , భద్రత ఏర్పాట్లు కనిపిస్తున్నాయి . గతం, లో సచివాలయం అంటే పైరవీ కారులు , ఆందోళన చేసే వారు ఎవరంటే వారు దూసుకువెళ్ళే వారు . ఇప్పుడు అనుమతి ఉంటేనే లోనికి ప్రవేశం , ఏ ఫ్లోర్ కు వెళ్ళడానికి అనుమతి ఉంటే ఆ ఫ్లోర్ కే వెళ్ళాలి . పాత సచివాలయానికి సంబంధించి అనేక అనుభవాలు . ఉమ్మడి రాష్ట్రం లో 95లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు . అంతకు ముందు సచివాలయం చుట్టూ వివిధ సమస్యలతో ఆందోళనలు చేసే వారి టెంట్ లతో ఎప్పుడూ సందడిగా ఉండేది . సచివాలయం ఎదురుగా , ఫుట్ ఫాత్ పైన ఎక్కడ చూసినా టెంట్ లు బాధితుల దీక్షలు కనిపించేవి . చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సచివాలయం వద్ద నిషేధాజ్ఞలు విధించి , ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ఏర్పాటు చేసి , అక్కడే ధర్నాలకు అవకాశం కల్పించారు . సచివాలయం లో ప్రెస్ రూమ్ లో అనేక చర్చలతో హాట్ హాట్ గా ఉండేది . కొందరు సీనియర్ లు అక్కడున్న సోఫాలో కునికి పాట్లు పడుతుంటే ల్యాండ్ లైన్ ఫోన్ పై కొందరు కబ్జా చేసే వారు . అప్పుడింకా సెల్ ఫోన్ లు రాలేదు . ఉచితంగా ల్యాండ్ లైన్ అందుబాటులో ఉండడం తో ఒక్క క్షణం కూడా విరామం తీసుకోకుండా ఆ ఫోన్ పని చేస్తూనే ఉండేది . ప్రెస్ రూమ్ ఎదురుగా చాలా మంది పెదరాయుడు లు కనిపించే వారు . పెదరాయుడు పెద్ద చెట్టుకింద కూర్చొని తీర్పులు చెబుతున్నట్టు ప్రెస్ రూమ్ ఎదురుగా ఒక పెద్ద వృక్షం ఉండేది . ఆ వృక్షం చుట్టూ గ్రామాల్లో చావిడి మాదిరిగా ఓ పది మంది కూర్చునే అవకాశం ఉండేది . సచివాలయానికి పని కోసం వచ్చినా , పైరవీ కోసం వచ్చినా అటు నుంచి వెళ్లాల్సిందే అక్కడున్న అందరి కళ్ళల్లో పడాల్సిందే .. ఆ చెట్టు అక్కడున్న వారి దృష్టి తమకు ఇబ్బంది కరం గా మారిందని అసెంబ్లీ లో చర్చ జరిగింది . అప్పుడు బిజెపి శాసన సభ్యునిగా ఉన్న మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అసెంబ్లీ లో ఈ చెట్టు గురించి ఫిర్యాదు చేశారు . ప్రజా సమస్యలపై అధికారులను కలిసేందుకు వెళితే సచివాలయం లో చెట్టువద్ద ఉన్న వాళ్ళు పైరవీల కోసం వచ్చినట్టు చూస్తున్నారని శాసన సభలో చెప్పారు . ఆ తరువాత చెట్టు చుట్టూ కూర్చోవడానికి అనువుగా ఉన్న ప్రాంతాన్ని తగ్గించారు . కూర్చునే వకాశం లేక పోయినా అక్కడే నిలబడి చర్చలు చేసే వారు . ప్రెస్ రూమ్ కు వెనక వైపున ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఛాంబర్ ఉండేది . నిజాం కాలం లో నిర్మించిన చెక్క మెట్లు భలే ఉండేవి . ఎన్టీఆర్ ఇష్టంగా ఈ ఛాంబర్ ను ఎంపిక చేసుకున్నారు . ఆగస్టు సంక్షోభం లో ఎన్టీఆర్ ను దించేసేంత వరకు అదే ఛాంబర్ లో ఉన్నారు . ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించేయడానికి చంద్రబాబు నాయకత్వం లో తొలిసారిగా శాసన సభ్యుల , పార్టీ నాయకుల సమావేశం జరిగింది ఈ సచివాలయం లోనే . పోస్టాపీసు పైన చంద్రబాబు ఛాంబర్ ఉండేది . 1995 ఆగస్టు లో తొలుత నల్లగొండ జిల్లాకు చెందిన నాయకులు బాబుకు బొకే ఇచ్చి అభినందించారు . అనంతరం ఒకరి తరువాత ఒకరు శాసన సభ్యులు రాసాగారు . ఏదో జరుగుతుంది అని రిపోర్టర్ లు వచ్చే సరికి నాయకులు అందరినీ బయటకు పంపారు . లోపల ఎంత మంది శాసన సభ్యులు ఉన్నారో ఎవరికీ తెలియదు . 70 మంది శాసన సభ్యులు అని ఓ అంకె ప్రచారం లోకి వచ్చింది . ఎలా అంటే కూర్చోవడానికి ప్లాస్టిక్ ఛైర్లు తెప్పించారు . వాటిని లెక్కబెట్టిన ఓ జర్నలిస్ట్ 70 అని అంకె తేల్చారు . 70 ప్లాస్టిక్ కుర్చీలను 70 మంది శాసన సభ్యులుగా తేల్చేశారు . ప్రెస్ రూమ్ లో ఉన్న ల్యాండ్ లైన్ నుంచే రామోజీ రావుకు వాళ్ళ రిపోర్టర్ ఈ సమావేశానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే వారు . సాయంత్రానికి సచివాలయం నుంచి క్యాంపు వైస్ రాయ్ హోటల్ కు మారింది . నెల రోజుల్లో ఎన్టీఆర్ మాజీ అయిపోగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయం లోకి అడుగు పెట్టారు . తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న చివరి దశలో కూడా సచివాలయం లో తెలంగాణ వారిపై పెత్తనం చెలాయించేవారు . చివరి దశలో ఓ మహిళా ఉద్యోగి మేం వెళ్లి పోతే మీరు ఎందుకూ పనికి రారు , పాలించడం రాదు అని కెమెరాల ముందే తిట్టింది . 2014లో తెలంగాణ ఆవిర్భావం ఎన్నికలు జరిగాయి . కొత్త ముఖ్యమంత్రికి సచివాలయ ఉద్యోగులు స్వాగతం పలికి , సచివాలయం లో అభినందన సభ నిర్వహించడం ఆనవాయితి. ముఖ్యమంత్రిగా తొలిసారి సచివాలయానికి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సిబ్బంది ఘన స్వగతం పలికారు . సభ నిర్వహించారు . జులై నెలలో ఎప్పుడూ లేనంత ఉడక పోత . సభలో కెసిఆర్ ఇదే చెప్పారు . హైదరాబాద్ వాతావరణం ఇది కాదు ఎంత చల్లగా ఉండేది . చెట్లు పెంచి వాతావరణాన్ని మళ్ళీ చల్లగా ఉండేట్టు చేద్దాం అని వాతావరణం వల్ల కొద్ది సేపే ప్రసంగించి ముగించారు . ఇప్పుడు నూతన సచివాలయం లో 30 శాతం స్థలం పచ్చ దనానికి కేటాయించారు . నూతన సచివాలయం ఆధునికతతో పాటు పచ్చదనం తో కళకళ లాడుతోంది . బుద్దా మురళి (నమస్తే తెలంగాణ 29-4-2023)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం