9, ఆగస్టు 2011, మంగళవారం

తెలంగాణా ఉద్యమ నాయకత్వాన్ని మార్చేంత శక్తి మీడియాకు ఉందా?


కొండా లక్ష్మణ్ బాపూజీ 96 వృద్ధ తెలంగాణ వాది. తెలంగాణపై ఆయన చిత్తశుద్ధిని సందేహించేవారు ఎవరూ ఉండరు. ’69 ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం మంత్రిపదవికి రాజీనామా చేశారు. ’72లో జై ఆంధ్ర ఉద్యమం జరిగేప్పుడు తెలంగాణలో మిగిలిన నాయకులు వౌనంగానే ఉన్నా కొండా లక్ష్మణ్ తెలంగాణ సాధనకు ఇదే సరైన సమయం అని తెలంగాణలో ఉద్యమం సాగించారు. ఆయన వౌనంగా ఉండి ఉంటే అప్పుడాయనకు ముఖ్యమంత్రి పదవి లభించేదని అప్పటి రాజకీయాలను దగ్గరి నుండి చూసిన వారు చెబుతారు. ఈ వయసులో కూడా తెలంగాణ కోసం ఆయన తపిస్తూనే ఉన్నారు. చిత్రంగా తెలంగాణ వాదం పలచబడాలని కోరుకునే చాలా మంది నాయకులు ఆయనవైపు ఆశగా చూస్తున్నారు. టీవీ9 తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ వార్తలు ప్రసారం చేస్తుందని విమర్శిస్తూ ఆ చానల్‌ను తెలంగాణలో బహిష్కరిం చాలని పిలుపు ఇచ్చారు. ఆ తరువాత రోజు టీవీ9 తెలంగాణ ఉద్యమానికి ప్రత్యామ్నాయ నాయకత్వం అంటూ కొండా లక్ష్మణ్ బాపూజీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయ జెఎసి ఏర్పడుందని ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది.


 96 ఏళ్ల కొండా లక్ష్మణ్ బాపూజీని చూపుతూ బ్యాక్ గ్రౌండ్‌లో యువకులారా అంటూ పాటను చూపడం ఎబ్బెట్టుగా అనిపించింది. కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో రెండేళ్ల క్రితం సాక్షి చానల్ చేసిన ప్రయోగానే్న ఇప్పుడు టీవీ9 చేసింది. కెసిఆర్‌పై ఉద్యమకారుల్లో వ్యతిరేకత ఏర్పడినందున తెలంగాణ వాదులంతా కొండా లక్ష్మణ్ బాఫూజీ నాయకత్వంలో తెలంగాణ కోసం ఉద్యమించడానికి సిద్ధమవుతున్నారని అప్పుడు సాక్షి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ఇప్పుడు అదే మార్గంలో టీవీ9 పయనించింది. అంతకు ముందు మరో మీడియా గద్దర్ నేతృత్వంలో ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం తీవ్రంగానే ప్రయత్నించింది. నాయకత్వాన్ని మార్చేంత శక్తివంతంగా చానల్స్ లేవని మరోసారి నిరూపితం అయింది.బాపూజీ 
ఇంటితెరకోసం ఈ వ్యాసం రాసిన తరువాత మరుసటిరోజు ఈనాడులో  కొండా లక్ష్మణ్ బాపూజీ నాయకత్వం లో తెలంగాణా ఉద్యమానికి కొత్త వేదిక అని బ్యానర్ వార్త వచ్చింది . చాలామంది ఆ వార్తలో ఏముందని కాకుండా ఆ వార్తకు వాళ్ళు అంత ప్రాముఖ్యత యివ్వడం వెనుక అసలు కారణం ఏమిటా అని చర్చిస్తున్నారు. ఇంతలో ఒకరు బాపూజీ అంటే వాళ్ళు మహాత్మా గాంధీ అనుకున్నారు. మహాత్ముణ్ణి బాపూజీ అంటారు కదా అని వాతావరణాన్ని తేలిక పరిచాడు అనారోగ్యమే చానల్స్ మహాభాగ్యం 


ఒక వ్యక్తి రోగాలకు సంబంధించి మీడియా బహిర్గతం చేయకూడదు. అత్యాచార బాధితురాలి ముఖాన్ని చానల్స్‌లో చూపించకూడదు. ఇలాంటి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ వాటిని ఎందుకు పాటిస్తారు. సోనియాగాంధీ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకురాలు. ఆమె ఆరోగ్య పరిస్థితి కచ్చితంగా వార్తే అవుతుంది. ఆ స్థాయిలో ఉన్న నాయకులకు సంబంధించి ఏం జరిగినా అది మొత్తం దేశంపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఆ కోణంలో కచ్చితంగా అది ఒక వార్తే. యుపిఎ చైర్‌పర్సన్‌గా ఉన్న సోనియాగాంధీ ఆరోగ్యంపై చానల్స్ తెలిసిన దాని కన్నా తెలియని అంశాలతోనే ఎక్కువ హడావుడి చేశారు. 


సోనియాగాంధీ అనారోగ్యం పై చికిత్సకు అమెరికా వెళ్లారని, డాక్టర్లు శస్త్ర చికిత్స చేయాలని చెప్పారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెప్పిన సమాచారం తప్ప ఏం జరిగింది అనేది తెలియదు. నిజానికి కాంగ్రెస్ నేత ద్వివేది ఈ ప్రకటన చేసే సమయానికి అమెరికాలో ఆమెకు శస్త్ర చికిత్స జరిగిపోయింది కూడా అనేది ఓ వార్తా సంస్థ కథనం. అమెరికాలోని ఆస్పత్రిలో సోనియాగాంధీకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాధికి చికిత్స జరుగుతోంది అని తెహల్కా డాట్‌కాంలో వార్త వచ్చింది. ఈ వార్త మినహా సోనియా వ్యాధి ఏమిటి? అనేది అధికారిక సమాచారం ఏమీ లేదు. తెహల్కా డాట్‌కాంలో డాక్టర్ నోరి దత్రాత్రేయ ఆధ్వర్యంలో సర్జరీ జరిగిందనేది తెహల్కా కథనం. అసలే కోతి ఆపై ఏదో తాగిందన్నట్టు అసలే తెలుగు చానల్స్ సోనియాకు శస్త్ర చికిత్స చేసింది తెలుగు డాక్టర్ అని కనిపించగానే ఎగిరి గంతేశారు.


 హెచ్‌ఎం టీవీతో పాటు కొన్ని చానల్స్ డాక్టర్ నోరి దత్తాత్రేయ జీవిత కథనాన్ని వివరించసాగారు. ఆయన కర్నూలు మెడికల్ కాలేజీలో చదువుకున్నారని, ఆయన గుణగణాలను వివరించారు. సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి వల్ల రాజకీయలపై పడే ప్రభావం పడుతుందేమో, దాని గురించి మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు నోరి దత్తాత్రేయ చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నాడో, ఎక్కడ ఆడుకున్నాడో, వారి బంధువులు ఎవరో? అంతెందుకు? ఇంతకూ నోరి దత్తాత్రేయ అమెరికాలో ప్రముఖ రేడియేషన్ అంకాలజిస్టట, ఆయన సర్జరీలు చేయరు కానీ తెలుగు చానల్స్ మాత్రం ఆయనతో సోనియాకు సర్జరీ చేయించారు.
ఆ మధ్య ఐశ్వర్యా రాయ్ గర్భవతి అయిందనే వార్త బయటకు వచ్చింది. మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి, అమితాబ్ కోడలు, అభిషేక్ భార్య కాబట్టి సహజంగానే ఆమెకు సంబంధించి ఏ వార్త అయినా ఆసక్తికలిగిస్తుంది. స్టూడియో ఎన్ వాళ్లు ఐశ్వర్యా రాయ్ గర్భవతి అయిందనే వార్తను చెప్పి వెంటనే గైనకాలజిస్ట్‌తో సందేహాలు సమాధానాలు ప్రసారం చేశారు. ఐశ్వర్యారాయ్ గర్భవతిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ నెలలో ఏం చేయాలో చక్కగా చెప్పించారు. అంటే ఆ చానల్ వారి ఉద్దేశం ఐశ్వర్యరాయ్ గర్భవతి కాబట్టి ఆమె అభిమానులంతా ఆమెలా జాగ్రత్తలు తీసుకోవాలా? లేక గర్భవతిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఐశ్వర్యా రాయ్ స్టూడియో ఎన్ చూసి నేర్చుకుంటారని భావించారా? మరి ఆ చానల్ వారికే తెలియాలి. ఆ వార్తతో పాటు సాధారణంగా ఆమె నటించిన సినిమాల క్లిప్పింగ్స్ చూపిస్తారు, అవి లేకపోతే ఊరుకోవాలి కానీ గైనకాలజిస్ట్‌తో సందేహాలు, సమాధానాలు ఏమిటో?
ప్రముఖ రచయిత మో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే మరణించినట్టు చానల్స్ ప్రకటించాయి.


1 కామెంట్‌:

  1. విశాఖపట్నం జిల్లాలో ఒక అమ్మాయి అబ్బాయి మీద యాసిడ్ పోసింది. స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి వార్తలని రోజుల తరబడి ప్రసారం చేసిన మీడియా ఈ వార్తని అంతగా ప్రసారం చెయ్యలేదు. యాసిడ్ దాడి చెయ్యడానికి అమ్మాయైతేనేమిటి, అబ్బాయైతేనేమిటి? ఇది పురుషాధిక్య సమాజం కదా. మగవాడి మీద యాసిడ్ పోస్తే అతని జీవితం నాశనం అవ్వదు కానీ ఆడదాని మీద యాసిడ్ పోస్తే ఆమె జీవితం నాశనం అవుతుంది అనుకుంటారు. అందుకే ఆడవాళ్ళపై జరిగే దాడులనే మీడియా హైలైట్ చేసి చూపిస్తుంది. మీడియా దేన్నైనా తనకి అనుకూలంగా ఉపయోగించుకుంటుంది.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం