10, ఆగస్టు 2011, బుధవారం

మరో ప్రపంచం- మాయా ప్రపంచం

తలుపులకు తాళాలు లేని ఇళ్లను సృష్టించేస్తాను అని బయలు దేరుతాడు చాలా కాలం క్రితం వచ్చిన రాజువెడలే సినిమాలో శోభన్‌బాబు. అలానే వెనకటికో రాజుగారికి తన దేశాన్ని అవినీతి లేని రాజ్యంగా చేయాలనే కోరిక పుట్టింది. అవినీతి లేనిదే అస్సలు ఊపిరి పీల్చుకోలేని ఒక ఉద్యోగి గురించి రాజుగారికి వేగుల ద్వారా తెలిసింది. అవినీతి రహిత రాజ్యాన్ని నిర్మించాలనుకున్న రాజుగారు తాను అనుకున్నదాన్ని ఆ ఉద్యోగి తోనే మొదలుపెట్టాలనుకున్నాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారికి వద్దన్నా వచ్చి నిధులు పడిపోతున్నట్టుగానే ఆ కాలంలో రాజుగారి ఆస్థానంలో ఉన్నవారికి వద్దన్నా డబ్బులు వచ్చి పడేవి. తన ఆస్థానానికి అతి దూరంగా ఉన్న ప్రాంతం ఏదా? అని వెతికితే రాజుగారికి సముద్రం కనిపించింది. సరే నువ్వు ఆ సముద్రం వద్దకు వెళ్లి.. రోజూ అలలు లెక్కపెట్టు ఇదే నీ ఉద్యోగం అని చెప్పి పంపాడు.

ఉద్యోగి వెళ్లి చాలా రోజులైంది అతనికి నెలనెల జీతం ముడుతుంది. ఉద్యోగి కాళ్లావేళ్లా పడతాడని అనుకున్న రాజుకు కొంత నిరాశ కలిగింది. ఆ ఉద్యోగి సముద్రం ఒడ్డున తన జీవితాన్ని ఎలా గడుపుతున్నాడో చూడాలనుకున్నాడు. పాతాళభైరవిలో ఎన్టీఆర్‌కు అంజిగాడు తోడన్నట్టు రాజుగారు అంజిగాడి లాంటి గంజిగాడిని తోడు తీసుకొని మారువేషంలో సముద్రం ఒడ్డుకు వెళ్లాడు. ఆ ఉద్యోగి గతంలో కన్నా కాస్త ఒళ్లు చేసినట్టున్నాడు, సంతోషంగా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. బాటసారుల్లా వచ్చిన రాజు, అతని గంజిగాడు ఆ ఉద్యోగిని పలకరించారు.


 జీవితం ఎలా సాగుతుందేంటి అని ముచ్చట్లు మొదలు పెట్టారు. రాజుగారి పుణ్యమా అని చాలా సంతోషంగా ఉంది, గతంలో కన్నా ఆదాయం పెరిగింది, ఆరోగ్యం పెరిగిందని చెప్పుకుపోతున్నాడు. అదెలా సాధ్యమో రాజుకు అర్ధం కాలేదు. కొద్దిసేపటి తరువాత ఓపెద్ద వాణిజ్యనౌక అటు నుండి వస్తుండడంతో ఉద్యోగి సంతోషంగా నిలబడ్డాడు. ఆగండాగండి నేను అలలు లెక్కిస్తున్నాను. ఇది రాజాజ్ఞ నా పనికి మీరు అడ్డురావద్దు, మీ ఓడను పక్కన నిలపండి అని ఆదేశించాడు. ఓడ వాడొచ్చి ఉద్యోగి చేతిలో డబ్బు పెట్టాడు.

సముద్రంలో అలలు లెక్కపెట్టడం నా ఉద్యోగం, అలల లెక్కింపునకు ఓడలు అడ్డుగా ఉంటున్నాయి, వాటిని వదిలేయాలంటే నాకేంటి? మా రాజుగారికో లక్ష్యం ఉన్నట్టుగానే భార్యాపిల్లలు సుఖంగా ఉండాలనే లక్ష్యం నాకుంది అని ఉద్యోగి నవ్వాడు. మరో ప్రపంచం అని అక్కినేని నాగేశ్వరరావు ఒక సినిమా తీశారు. ఈ సినిమాలో అర్ధరాత్రి పూట పిల్లలందరినీ ఎత్తుకెళతారు. ఆ పిల్లలలతో మరో ప్రపంచం సృష్టించాలనేది హీరో లక్ష్యం. పుణ్యానికి ప్రీమియర్ షో చూసిన వారంతా అద్భుతం, అమోఘం అని మెచ్చుకున్నారు చివరకు సినిమా విడుదలయ్యాక లెక్కలువేసుకుని ఇదా ప్రపంచం అని అక్కినేని విస్తుపోయారు.


 కొన్ని లెక్కలంతే అంతు చిక్కవు. కెమెరా ముందు నటన విసుగేశాక, రాజకీయ నట జీవితాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్‌కు సైతం ఇలాంటి లక్ష్యాలే ఉండేవి. నవజాత శిశువులను వారి తల్లిదండ్రుల నుండి దూరం చేసి కొంత మందిని ఒక చోట చేర్చి వారిని అద్భుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని ఒక పథకం ఆలోచించారు. వచ్చిన అధికారం ఎలా నిలబెట్టుకోవాలో ముందు నేర్చుకోండి మరో ప్రపంచం తరువాత అని అల్లుడు గారు సలహా ఇచ్చినట్టున్నారు ఎన్టీఆర్ చిత్రమైన లక్ష్యం అమలుకు నోచుకోలేదు. నువ్వు, నేను, టోనిబ్లేయర్ ( అమెరికా అధ్యక్షుడు క్లింటన్, ఇంగ్లాండ్ ప్రధాని టోనిబ్లేయర్, బాబు) కలిసి కొత్త ప్రపంచం సృష్టిద్దామని క్లింటన్ నాతో అన్నాడని బాబు చెప్పుకున్నారు. ఆ కొత్త ప్రపంచం ఏమిటో? దాని రంగు రుచి తెలియకముందే పాపం వీరంతా మాజీలైపోయారు. ఇంకొంత కాలం ఉండి ఉంటే మనకు మరో ప్రపంచాన్ని చూపించేవారేమో! సినిమాల్లో రొటీన్ కామెడీతో విసుగేసిన వారికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగు పలుకులతో  చక్కని కామెడీని అందిస్తున్నారు. ఓ జాతీయ చానల్ వాళ్లు దేశంలోని సిఎంలకు ర్యాంకింగ్ ఇస్తే ఈయన చివరి నుండి మొదటి స్థానంలో నిలిచారట! బహుశా ఆయన నాయకత్వంలో రాష్ట్రం సైతం ఆయనలానే చివరి నుండి మొదటి స్థానంలో నిలపడమే ఆయన జీవిత లక్ష్యం కావచ్చు. గాంధీజీ కలలు కన్న మరో ప్రపంచాన్ని సృష్టిస్తామని నాయకులంతా అంటుంటారు.

 మా నాన్న కలలు గన్న ప్రపంచాన్ని సృష్టిస్తానని జగన్ అంటున్నారు. నేతల్లానే మనకూ చిన్నప్పటి నుండే ఈ ప్రపంచాన్ని ఏదో ఒకటి చేసేయాలని బలంగా ఉంటుంది. లెక్కలు లేని ప్రపంచాన్ని సృష్టించాలనే బలమైన కోరిక చదువుకునే రోజుల్లో చాలా మందికి ఉంటుంది. అలాంటి వారు వెంకట్రామా అండ్ కో వారి ఎక్కాల బుక్కు కనిపించకుండా దాచేస్తుంటారు. లేదా పదమూడో ఎక్కం నుండి పుస్తకం చినిగిపోయి ఉంటుంది. లెక్కల బుక్కు దాచేస్తే ,పేజీలు చిరిగిపోతే ఎక్కాలు లేకుండా పోతాయా? మబ్బుల మాటున దాగిన చందమామలా ఎక్కాలు మనను జీవింతాంతం వెంటాడుతాయి. మూడుముళ్లు, ఏడుగులతో ఇద్దరి జీవితం ఒకటవుతుంది. తరువాత ఒకరో ఇద్దరో యాడ్ అవుతారు. అప్పటి నుండి జీవితంలో లెక్కలు చుక్కలు చూపిస్తాయి. భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుడి చుట్టు తిరగడం మనం చూడలేదు కానీ. ఉద్యోగంలో చేరాక మాత్రం జీవితం ఒకటో తారీఖు చుట్టూ తిరుగుతుంటుంది. 30 రోజులు ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూడడం ఆ రోజు వచ్చిన జీతానికి లెక్కలు వేయడం, మళ్లీ ఒకటో తారీఖు కోసం ఎదురు చూడడం. లెక్కలు లేని జీవితం ఉండదు... జీవితమంటే లెక్కలే.
కెమెరా ముందు ఎలా జీవించాలో ప్రపంచానికే పాఠాలు చెప్పగల మహానటులు చిత్తూరు నాగయ్య, సావిత్ర, కాంతారావు, రాజబాబు లాంటి వారు లెక్కల్లో ఫూర్ కావడం వల్లనే కదా, ప్లస్‌ల గురించి తెలియని వారి జీవితం చివరి దశలో అంతా మైనస్‌గానే మిగిలిపోయింది. నిజంగా లెక్కలు లేని ప్రపంచం ఉంటే జీవితం పగలే వెనె్నలగా ఉండేదేమో!

6 కామెంట్‌లు:

 1. లాభ -నష్టాలు నాకు లెక్క లోనే కావు అంటాను నేను. అమ్మో.. ఇప్పుడు మీ పోస్ట్ చూసాకా లెక్కల్లో జాగ్రత్త పడాలి అనుకుంటున్నాను. విషయం బాగుంది మురళి గారు.. ధన్యవాదములు

  రిప్లయితొలగించు
 2. ఇటువంటిదే గంటలు కొట్టే ఉద్యోగంకు మార్చే కథ మరోటి ఉంది.

  రిప్లయితొలగించు
 3. అంతే కదండి... లెక్కలు వేయడం రాకపోతే జీవితంలో ఎవరయినా బొక్కబోర్లా పడతారు.. అలాగే, నేల విడిచి సాము కూడా చెయ్యకూడదంటారు పెద్దలు.... మీ టపా ఆలోచింపచేసేదిగా వుంది...

  రిప్లయితొలగించు
 4. @Murali and Oremuna

  Suravaram Prathapa reddy gaari racahana...GYARAH KADDU...BARAH KOTWAL" ani NIJAAM kaalam lo vunde AVINEETHI meeda SETIRICAL gaaa raasina katha....


  meeru cheppina KATHA kudaa baagundi....

  రిప్లయితొలగించు
 5. మురళీగారు,
  చాలా కాలం తర్వాత రాస్తున్నందుకు ఏం అనుకోవద్దు. చాలా బావుంది ఈ మీ పోస్టు. ముఖ్యంగా జీవితంలో లెక్కలు వద్దనుకున్న తిక్కలోళ్ళకి లెక్కలెలా చుక్కలు చూపిస్తాయో చక్కాగా చూపించారు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. యేవో కూడికలు తిసివేతల్లో బిజిగా ఉన్నట్టున్నారు అందుకే బ్లాగ్స్ లో పోస్ట్ లా లెక్కలు పీరుకు పోతున్నా ఇటు వైపు రావడం లేదని అనుకున్నానండి సుధా గారు

   తొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం