30, ఆగస్టు 2011, మంగళవారం

బతుకులో సరే... తెరపైనా ఏడుపేనా..?





* కాపురాలను కలుపుతున్న రాఖీ * ఏడిపిస్తున్న సుమలత




జీవితంలో బాధలు, కన్నీళ్లు, ఏడుపులు సహజమైనవే. సమస్యలు లేని జీవితాన్ని ఊహించలేం. బహుశా సమస్యలు లేకపోతే మనిషి జీవితం నిస్సారంగా ఉంటుందేమో! జీవితంలో సమస్యలు అనివార్యం అయినా సగటు జీవి సినిమాలకు వెళ్లినా, టీవీలు చూసినా కాసేపు రిలాక్స్ అవుదామని, తన సమస్య ఆలోచన నుండి కాసేపు బయటపడదామని. అంతే తప్ప ఎవరి ఏడుపునో విని మనం కూడా ఏడుద్దామని టీవీ చూసేవారు ఉండరు.
జీ తెలుగు చానల్‌లో గత ఏడాది నుండి ‘బతుకు జట్కాబండి’ కార్యక్రమాన్ని అప్పటి హీరోయిన్ సుమలతతో నిర్వహిస్తున్నారు. కార్యక్రమ ఉద్దేశం మంచిదే. సుమలత అందమైన హీరోయిన్ కూడా. ఉద్దేశం మంచిదైనప్పటికీ కార్యక్రమం రూపకల్పనలోనే ఏదో లోపం ఉంది. భార్యా భర్తల మధ్య తగాదాలు, విడాకులు, ఘర్షణలు, అత్తా కోడళ్ల కలహాలు శృతిమించి విడాకుల వరకు వచ్చిన కేసులను ‘బతుకు జట్కా బండి’లో చర్చిస్తున్నారు. వారి మధ్య వివాదాలను తొలగించి కలిపి ఉంచాలనేది కార్యక్రమ ఉద్దేశం. కానీ అలా జరగడం లేదు. చివరకు ఈ కార్యక్రమంలోనే కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఒక దశలో మీరిలా తిట్టుకుంటే నేను ఇక్కడ ఉండను అని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సుమలత మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకునే ముందు హిందీలో ప్రముఖ చానల్ ఇమేజెస్‌వైపు ఒకసారి వెళదాం. సరిగ్గా ‘బతుకు జట్కా బండి’ కార్యక్రమం మాదిరిగానే ప్రముఖ శృంగార తార రాఖీసావంత్ ‘గజబ్ దేశ్‌కీ అజబ్ కహానియా’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కానీ నిర్వహణ తీరులో ఏ మాత్రం సంబంధం లేదు. దాదాపు అర్ధనగ్నంగా కనిపించే రాఖీసావంత్ సరదాగా మాట్లాడుతూ ప్రేక్షకులను టీవీల ముందు కదలకుండా చేస్తుంది. ఒక తల్లి ఒక కొడుకు, కూతురు. తల్లీ కొడుకు మధ్య పనె్నండేళ్ల నుండి మాటలు లేవు. నన్ను కొడుకుగానే చూడలేదు అందుకే నేను మాట్లాడలేదు అని కొడుకు తనను తాను సమర్ధించుకున్నాడు. వారిద్దరిని కలపడానికి నీవేమైనా ప్రయత్నం చేయలేదా? అని కూతురును అడిగితే తల్లికి చెప్పకుండా ఒకసారి ఆమె పుట్టిన రోజున ఇంట్లో కేక్ కట్ చేయించడానికి ఏర్పాటు చేశాం, కానీ తల్లి కోపంగా కేక్‌ను విసిరిపారేసింది... అని చెప్పింది. సరే ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది మీరిద్దరు కలవవచ్చు కదా అని రాఖీసావంత్ చలాకీగా ఇద్దరినీ ఒక దగ్గరకు చేర్చింది. చిత్రంగా వారిద్దరు కన్నీళ్లు కారుస్తూ ఏకమయ్యారు.
పనె్నండేళ్ల నుండి తల్లీ కొడుకు మధ్య మాటలు లేకపోవడం ఒక విడ్డూరం అయితే అరగంటలోనే వారు ఏకం కావడం అంత సులభమేమీ కాదు. బహుశా ఈ కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి ఉంటారు. ఇద్దరం కలవడానికి సిద్ధంగా ఉన్నామని వారు అంగీకరించిన తరువాతనే వారితో కార్యక్రమం నిర్వహించి ఉంటారు. అయినప్పటికీ ఒక మంచి ఉద్దేశంతో నిర్వహించిన కార్యక్రమం ఉద్దేశం నెరవేరినట్టు అయింది. చూసేవారికి తల్లీ కొడుకు కలిశారనే సంతోషం ఉంటుంది. రాఖీసావంత్ ఉల్లాసపరుస్తుంది.
ఇమేజ్ చానల్ కన్నా ఏడాది ముందుగానే జీ తెలుగులో ఈ కార్యక్రమం మొదలైనా పెద్దగా ఆకట్టుకోకపోవడానికి కారణం. స్టూడియోకు పిలిచి కుటుంబాలను అక్కడే కొట్టుకునేట్టు చేయడం. కొన్ని కేసుల్లో అప్పటి వరకు ఉన్న చిన్న చిన్న గొడవలు కూడా స్టూడియోలకు వచ్చిన తరువాత మరింత ముదిరిపోతున్నాయి. ఒకరి కుటుంబంలోని సమస్యలను వీధిలోకి తీసుకురావడమే తప్పు అనుకుంటే మరీ స్టూడియోకి తీసుకు వచ్చి వారిని మరింత క్షోభకు గురిచేస్తున్నారు. ఇమేజెస్ చానల్ తరహాలో ఆ కుటుంబాన్ని కలపడానికి కృషి చేయాలి. ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించి, సమస్య పరిష్కారానికి అంగీకరించిన తరువాత స్టూడియోకు పిలిస్తే బాగుంటుంది కానీ తాత్కాలికంగా విడిపోయిన కుటుంబాలను కలిపే విధంగా ఉండాలి. అదే సమయంలో ప్రేక్షకులు ఆ కార్యక్రమాన్ని ఆస్వాదించగలగాలి. బతుకు జట్కాబండిలో ఇది లోపించింది.
పాపం.బాబు
ఎబిఎన్ చానల్ యంగిస్తాన్‌లో చంద్రబాబు పరిస్థితి చూసి ఆయన అభిమానులే కాదు చివరకు ఆయన వ్యతిరేకులు సైతం జాలిపడ్డారు. వ్యక్తిగత జీవితంలో యాంకర్‌కు, నాయకునికి ఎంత సన్నిహిత సంబంధం అయినా ఉండవచ్చు. ఉమ్మడిగా ఎలాంటి వ్యవహారాలైనా చేసి ఉండవచ్చు కానీ నలుగురు చూసేప్పుడు వ్యవహరించాల్సిన తీరు అది కాదు. విజ్ఞాన్ కాలేజీలో యంగిస్థాన్‌లో విద్యార్థులు ఏదో అడుగుతుంటే చంద్రబాబు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే నువ్వుండు నేను చెబుతాను.. అని ఒకసారి. అవినీతి విషయంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఒకరే నేను మాట్లాడతాను అంటూ బాబును తీసిపారేస్తూ యాంకర్ మాట్లాడడం బాబుకు ఎలా ఉన్నా వినేవారికి నచ్చదు. వ్యక్తిగతంగా బాబు ఏమైనా కావచ్చు కానీ ప్రతిపక్ష నాయకుడు, తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు. మీడియాలో కనిపిస్తే చాలు అనుకుంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవు. మళ్లీ అధికారం వచ్చే విషయం ఎలా ఉన్నా నాయకులు హుందాగా ఉండాలి. వ్యక్తిగత సంబంధాలు వేరు చానల్‌లో ప్రజలకు కనిపించేటప్పుడు తమ హోదాను గుర్తుంచుకోవాలి. బహుశా ఎబిఎన్‌లో అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మరుసటి రోజు మరో కాలేజీలో స్టూడియో ఎన్‌లో సుదీర్ఘ ఏకపాత్రాభినయం చేశారు.
మోజు తీరిందా?
అన్నా హజారే దీక్షపై హడావుడి చేసిన జాతీయ చానల్స్ బహుశా వారికే రొటీన్ అనిపించినట్టుగా ఉంది కొంత మసాలా జోడించారు. శుక్రవారం ఉదయం స్టార్ న్యూస్‌లో అన్నా దీక్ష శిబిరం వద్ద జరిగిన గొడవలు చూపారు. దాదాపు పది పదిహేను మంది యువకుల గుంపు తలపై గాంధీ టోపి, చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని తాగి వచ్చి చివరకు పోలీసులపైనే దాడి చేశారు. పోలీసులు పారిపోయేట్టుగా కొట్టారు. టీవీ కెమెరాలు అక్కడే ఉన్నా ఈ యువత భయపడలేదు... సిగ్గుపడలేదు. ఒకవైపు అన్నా శిబిరం వద్దకు తాగి రావద్దని, గొడవ చేయవద్దని పదే పదే చెబుతున్నా వారు పట్టించుకోలేదు. మరి కొంత మంది యువకులు ఇండియా గేట్ వద్ద ఒక్కో బైక్‌పై నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురేసి చొప్పున హెల్మెట్ లేకుండా స్పీడ్‌గా వెళుతూ హంగామా సృష్టించారు.
దేశవ్యాప్తంగా శాంతియుతంగా మద్దతు పలుకుతున్న సమయంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే పట్టించుకోవలసిన అవసరం లేదనిపించవచ్చు. కానీ మీడియాకు హజారేలో గాంధీ కనిపించినప్పుడు ఇలాంటివి కనిపించవు, క్రమంగా మోజు తీరితే ఇలాంటివే హైలెట్ అవుతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం