31, ఆగస్టు 2011, బుధవారం

ఆరనీకుమా.. ఈ దీపం!....కోట్ల మంది భారతీయుల ఆశాదీపాన్ని రక్షించిన జగన్‌...చంద్రబాబు

అవినీతిపై ఉద్యమ అగ్నిని రాజేసేందుకు అన్నా హజారే సింబాలిక్‌గా ....ప్రమిదలో నూనె పోసి దీపం ముట్టించారు. గిట్టని వారెవరో ప్యాన్ వేయడంతో బలంగా గాలి వచ్చి దీపం రెపరెపలాడింది. ఆ దీపం ఆరిపోతుందా? దాన్ని నిలిపే వారే లేరా? ఊపిరి నిలిచిపోతుందేమో! అన్నంత టెన్షన్‌గా కుటుంబరావు టీవినే చూస్తున్నాడు. ఆ ఘోరాన్ని ఇక చూడలేను అని కళ్లు మూసుకోబోతుంటే ఎక్కడి నుండో నాలుగు చేతులు వచ్చి రెపరెపలాడుతున్న ఆ దీపాన్ని ఆరిపోకుండా రక్షించాయి.

క్లోజప్‌లో చూస్తే ఆ నాలుగు చేతుల్లో రెండు చంద్రబాబువి, మిగిలిన రెండు జగన్‌వి. ఇద్దరు తమ నాలుగు చేతులను అడ్డుగా పెట్టి దీపాన్ని రక్షించారు. ఆ దీపం ఈ దేశంలోని నైతిక నియమాలకు , దేశ ప్రతిష్ఠకు ప్రతీక. వంద సుమోలను గాలిలోకి లేపే మహేష్‌బాబు కన్నా, కంటిచూపుతోనే వందలమందిని చంపే జూనియర్ ఎన్టీఆర్ కన్నా వంద కోట్ల మంది భారతీయుల ఆశాదీపాన్ని రక్షించిన వారిద్దరికీ ఈ జాతి ఋణపడి ఉండి తీరాలి అని తనలో తానే అనుకున్నాడు కుటుంబరావు.



షాక్ తిన్నట్టనిపించి బుర్ర విదిలించి టీవిని పరీక్షగా చూశాడు. ఇప్పటి వరకు తాను చూసిన తెరపై బాబు, జగన్‌లకు బదులు. పవన్ కళ్యాణ్, భూమిక కనిపిస్తున్నారు. అది ఖుషీ సినిమా . ఆలయంలో వికలాంగురాలైన అమ్మాయి దీపం ముట్టించి, దేవతను మొక్కుతోంది. ఇంతలో గాలి రావడంతో దీపం రెపరెపలాడుతుంది. దీపం ఆరిపోతుందేమో అని ప్రేక్షకులు ఊపిరి బిగపట్టి చూసే లోగా ఒకవైపు నుండి పవన్ కళ్యాణ్, మరోవైపు నుంచి భూమిక పరిగెత్తుకు వచ్చి రెండు చేతులు అడ్డం పెట్టి దీపం ఆరిపోకుండా చేస్తారు. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటారు. ప్రేమను పంచుకునే హీరోహీరోయిన్ ఉన్న ఈ దృశ్యంలో కత్తులు దూసుకునే ఇద్దరు నాయకులు కనిపించడంతో తనను తాను గిల్లుకొని కలకాదు నిజమే అనుకున్నాడు.


 బుర్ర తిరిగినట్టు అనిపించడంతో చానల్ మార్చేశాడు....కామెడీ చానల్ లో చందన బ్రదర్స్ బొమ్మన సిస్టర్స్ సినిమా. నరేశ్‌ను చూడగానే నవ్వు వస్తుంది. హీరో కుటుంబం అంతా దొంగలే. జాగ్రత్తగా ఉండే వాడి జేబును దోచుకోగలిగిన వాడికి అజాగ్రత్తగా ఉండే అందమైన అమ్మాయి హృదయాన్ని దోచుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నమ్మడమే కాకుండా ఆచరణలో చూపెట్టిన చిలిపి దొంగలు. హీరోయిన్‌కు భక్తి ఎక్కువే. ఇంకేం దొంగ నరేశ్ భక్తరామదాసు ఐపోతారు. అంతా రామమయం ఈ జగమంతా రామయం అంటూ నాగార్జున నటించిన రామదాసు పాటను తాను పాడుతున్నట్టు వినిపిస్తాడు. సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్టులకు భక్తుల వేషం వేయిస్తాడు. అనుకున్నట్టుగానే అందమైన హీరోయిన్ హీరో దొంగ భక్తికి పడిపోతుంది. హృదయాన్ని అప్పటికప్పుడే ఇచ్చేసి మిగతావివరాల కోసం ఇంటికి రమ్మంటుంది. హీరోయిన్ వెళ్లిపోగానే జూనియర్ ఆర్టిస్టుల సప్లైయర్ రెండులక్షల ఆరువేల ఇమ్మంటాడు. అదేంటి మనం మాట్లాడుకున్నది ఆరువేలే కదా? అంటే కిరాయి ఆరువేలు, నీ ఓవర్ యాక్షన్ చూడలేక ఓ జూనియర్ ఆర్టిస్ట్ కన్నుమూశాడు వాడికి రెండు లక్షలు అంటాడు. శవం పక్కనున్న మరో జూనియర్ ఆర్టిస్ట్ దొంగ సచ్చినోడా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశాం కానీ ఇంత ఓవర్ యాక్షన్ ఎక్కడా చూడలేదు, నీ యాక్టింగ్‌తో నిండు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నావు కదరా! అని శపిస్తుంటుంది. అసలు జీవితంలో నవ్వని నాయకులు సైతం ఈ సీన్ చూసి పడిపడి నవ్వాల్సిందే!


 నవ్వు నుండి తేరుకోక ముందే ప్రకటనలు రావడంతో చానల్ మార్చాడు. అది న్యూస్ చానల్ ఇద్దరు నాయకులు అవినీతికి వ్యతిరేకంగా మహోపన్యాసాలు చేస్తున్నారు. మనిషి చనిపోయిన తరువాత మూడు రోజులకే మరిచిపోతున్న రోజులివి అలాంటిది ఏడాది తరువాత కూడా యువనేత ఓదార్పు అంటూ, పనిలో పనిగా అవినీతికి వ్యతిరేకంగా సమాజం ఎలా అభివృద్ధి చెందాలో చెబుతున్నాడు. మరో నాయకుడు విద్యా వ్యాపార కేంద్రాలకు వెళుతూ అవినీతికి వ్యతిరేకంగా విలువలతో కూడిన సమాజాన్ని ఎలా నిర్మించాలో బోధిస్తున్నాడు. సార్ ఆయన ఉపన్యాసాలతో మన విద్యార్థుల్లో చైతన్యం పెరిగి మనం ఇష్టనుసారంగా వసూలు చేసే ఫీజులకు వ్యతిరేకంగా ఉద్యమించే ప్రమాదం ఉందని కాలేజీ కరస్పాండెంట్ ఒకరు ఆందోళన వ్యక్తం చేస్తే, కాలేజీ ఎమ్‌డి చిరునవ్వు నవ్వి పిచ్చివాడా! ఉపన్యాసాలకే ఏదో ఐ పోతే దేశంలో ఏడాదికి మూడువందల విప్లవాలు వస్తాయి అన్నాడు.


 ఎవరు రాసిచ్చారు అని కాదు కానీ నైతికమైన విలువల గురించి ఇద్దరు నాయకులు చేస్తున్న మహోపన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. వృద్దుడి ఆకస్మిక మృతి, యువకుడు ఆత్మహత్య అంటూ బ్రేకింగ్ వార్తలు వస్తున్నాయి. ఇద్దరు మహానాయకులు నైతిక నియమాలపై చేస్తున్న మహోపన్యాసాలు వినగానే మీటింగ్‌కు తీసుకు వచ్చిన ఒక వృద్దుడు మరణించడంతో గందరగోళంగా మారింది అని స్పాట్ నుండి లైవ్‌గా రిపోర్టర్ వార్త అందిస్తున్నాడు. ఒక యువతి పాపాత్ముడా! నిండు ప్రాణాన్ని బలిగొన్నావు కదరా! ఆరోగ్యంగా ఉన్నాడు వారానికి నాలుగైదు మీటింగ్‌లకు వెళ్లివస్తున్నాడు. తన జీవితంలో కొన్ని వేల మీటింగ్‌లు విన్నాడు... ఎప్పుడూ తలనొప్పి అని కూడా అనలేదు. మీటింగ్‌లు వినందే నిద్ర పోని స్థితికి చేరుకున్నాడు. అంతటి ఆరోగ్యవంతుడిని నీ ఉపన్యాసంతో మింగేశావు కదరా! ఈ పాపం ఊరికే పోదు. మరీ అవినీతిపై అంతేసి మాటలా? పొట్టకూటి కోసం వస్తే ప్రాణాలు తీసేట్టుగా మాట్లాడతారా? అంటూ ఇంకా ఏవేవో తిడుతూనే ఉంది



కుటుంబరావు కంగారుగా టీవిలో ఒకటుంటే నాకు మరోటి కనిపిస్తోంది. నాకేమైంది అని వెర్రి చూపులు చూడసాగాడు. ‘‘ భార్య పరిగెత్తు కొస్తూ, ఆ ఉపన్యాసాలు వినకండి అంటే వినకపోతిరి, ఆ జూనియర్ ఆర్టిస్ట్ చనిపోయినట్టు మీరు పోతే పిల్లల గతేం కాను. నా గతేం కాను’’ అని ఏడుపు మొదలు పెట్టింది....

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం