24, నవంబర్ 2018, శనివారం

బేతాళుడూ విప్పలేని చిక్కుముడి!

‘‘రావోయ్.. కాంపోజిట్ మాథ్స్.. రా..!’’
‘‘ఎంతకాలానికి వినిపించిందిరా..! ఆ పిలుపు.. దేశాలు తిరిగాం, ఎంతో జీవితాన్ని చూశాం. నాలుగు దశాబ్దాల తరువాత కాంపోజిట్ మాథ్స్ అంటూ నువ్వు పిలిచిన పిలుపుతో మరోసారి బాల్యంలోకి వెళ్లినట్టుంది. మన బ్యాచ్‌లో మీరంతా టెన్త్‌లో జనరల్ మాథ్స్ తీసుకుంటే నేనొక్కడినే కాంపోజిట్ మాథ్స్ తీసుకున్నా.. అప్పుడు నా పేరు కన్నా- ఈ పేరుతోనే పిలిచేవారు మీరంతా’’
‘‘సరే లేరా! నువ్వు లెక్కల్లో చాలా క్లవర్‌వి కదా? నీకో చిన్నలెక్క చెబుతా.. సమాధానం ఇస్తావా..?’’
‘‘తిరుపతిలో లడ్డూలు, ఆర్‌బిఐలో డబ్బులు ఎలానో నా బుర్రలో లెక్కలు అలా.. ఏమడుగుతావో అడుగు.. పదహేడవ ఎక్కం కింది నుంచి పైకి చెప్పాలా? పై నుంచి కిందికి చెప్పాలా? పోనీ 37వ ఎక్కం చెప్పమంటావా? అదీ కాదంటే 12346ను 14తో భాగిస్తే ఎంత అవుతుందో చెప్పాలా? 12తో హెచ్చిస్తే ఎంతవుతుందో చెప్పాలా?’’
‘‘తొందర వద్దు అడుగుతా.. అనగనగా ఒక రాజ్యం.. అక్కడ మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికలకు వెళుతున్నారు.’’
‘‘డొంక తిరుగుడు ఎందుకు? తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి.. వాటికి ఎన్నికలు జరుగుతున్నాయని సూటిగా అడుగు’’
‘‘నేను అడిగేది అడుగుతా! నువ్వు ఊహించుకునేది ఊహించుకో’’
‘‘సరే అడుగు’’
‘‘119 నియోజకవర్గాల్లో హస్తం, ప్రొఫెసర్, ఎరుపు, చెరుకు, సైకిల్ పార్టీలు ఒక బృందంగా ఏర్పడి పోటీ చేయాలనుకున్నాయి. మొదట్లోనే ‘చెరుకు’ను పిప్పిలా పక్కన పడేశారు. ఇక మిగిలినవి నాలుగు. ప్రొఫెసర్ 30 స్థానాలను డిమాండ్ చేసి చివరకు 12 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు వాటి పేర్లు అధికారికంగా ప్రకటించారు. 14 చోట్ల నామినేషన్ వేశారు .8 మావే అన్నారు. మూడు మాత్రమే మిగిల్చారు. బృందంలో పెద్దన్న హస్తం మాత్రం చివరకు ప్రొఫెసర్‌కు ఎనిమిది స్థానాలు ఇస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో మూడు స్థానాల్లో హస్తం వారికి అవకాశం ఇచ్చారు. మరో దానిలో సైకిల్ వెళ్లింది. సైకిల్‌కు పధ్నాలుగు ఇచ్చారు. ఇవి సరిపోవు.. ఇంకో నాలుగైనా కావాలని ఆడిగి, పన్నెండుచోట్ల నామినేషన్లు వేసి, ఒకటి గాలికి వదిలేశారు. ‘ ఒకటి మరిచి పోయారు.ఎర్ర’ పార్టీ డజను సీట్లు అడిగి, ఐదింటితో సంతృప్తి చెందుతామంటే మూడిచ్చారు. ఒక చోట వెన్నుపోటు, రెండింటిలో సహాయ నిరాకరణ, ఇంకోచోట అష్టకష్టాలు. కథ విన్నావు కదా? ఇప్పుడు చెప్పు ఇందులో బృందంలోని పార్టీల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది? ఎన్ని స్థానాల్లో బృందం సభ్యుల మధ్య స్నేహ పూర్వక పోటీ ఉంది. ఎన్ని చోట్ల వెన్నుపోట్లు? ఎన్ని చోట్ల అగచాట్లు చెప్పు? ఎన్ని చోట్ల తిరుగుబాట్లు ’’
‘‘ఇదేం లెక్క.. అస్సలు అర్థం కాలేదు’’
‘‘అర్థం కాలేదా? సమాధానం చెప్పలేవా? పత్రికలు చూస్తున్నావా? చూడు అభ్యంతరం లేదు. పత్రికలు చూడు, క్యాలిక్యులేటర్ ఉపయోగించుకో, ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో సంప్రదించు, బృందంలోని పార్టీల నాయకులకు ఫోన్ చేసి తెలుసుకో.. అభ్యంతరం లేదు.’’
‘‘ఒక్కో పత్రికలో ఒక్కో లెక్క వేశారు. సమాధానం ఎలా చెప్పాలి?’’
‘‘చిన్నప్పుడు టెన్త్‌లో కాంపోజిట్ మాథ్స్ తీసుకున్నోడివి- 119 సీట్ల లెక్క చెప్పలేవా? ల్యాప్‌టాప్ తీసుకో నోప్రాబ్లమ్’’
‘‘బుర్ర వేడెక్కుతోంది’’
‘‘సరే కొద్ది సేపు ఇతర విషయాలు మాట్లాడుకుందాం. చిన్నప్పుడు మన ఫ్రెండ్స్ అందరం జనరల్ మాథ్స్ తీసుకుంటే నీకు కాంపోజిట్ మాథ్స్ తీసుకోవాలని ఎందుకనిపించిందిరా?’’
‘‘నిజం చెప్పాలంటే మనమంతా ఒక గ్రూప్‌గా ఉన్నా నేను మీ అందరి కన్నా తెలివైన వాడినని గుర్తింపు పొందాలన్న ఆశ బలంగా ఉండేది. మీతో ఉన్నంత వరకు నన్ను కూడా అందరిలో ఒకడిగానే చూసిన వరలక్ష్మితో పాటు నేను కాంపోజిట్ మాథ్స్ తీసుకోగానే నన్ను ఎంత ఆరాధనగా చూసిందో తెలుసా? మేం స్కూల్ ముగిశాక మా కాలనీలో కలుసుకుని మాట్లాడుకునే వాళ్లం. ’’
‘‘ఆ సంగతి మాకు తెలుసులేరా! మన మల్లేష్ గాడు అంతకు ముందు వరకు ఆ అమ్మాయిని మూగగా ఆరాధించే వాడు. మాట్లాడే ధైర్యం చేయలేదు. ఈ లోపు నువ్వు లైనేశావు. వాడు ఆ రోజు నుంచే తన జీవితం ముగిసిపోయిందని అనుకున్నాడు పాపం..’’
‘‘మీరంతా నన్ను చూసి కుళ్లుకుంటుంటే నేను ఎంజాయ్ చేసేవాడ్ని.. ఏదో బాల్యం.. తెలియని తనం.’’
‘‘ఇప్పుడు చెప్పు 119 సీట్లలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?’’
‘‘పోనీ- ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పాలా?’’
‘‘నేను సూటిగా అడిగాను. 119 సీట్లలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అని?’’
‘‘సమాధానం చెప్పడం నా వల్ల కాదు. నువ్వు చెప్పు?’’
‘‘నేను చెబుతాననలేదు. నిన్ను చెప్పమని అడిగాను. కాంపోజిట్ మాథ్స్‌తో టెన్త్ చదివిన లెక్కల మేధావివి.. చెప్పలేవా?’’
‘‘చెప్పలేను, నువ్వు చెప్పురా! లెక్క విన్న తరువాత బుర్ర పని చేయడం లేదు. ఇంటికి వెళ్లినా ప్రశాంతంగా ఉండలేను. నీకు తెలుసు కదా? నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా లెక్క వింటే అది సమాధానం తెలియనిదే నిద్ర పట్టదు.’’
‘‘సమాధానం నీకే కాదు, నాకూ తెలియదు. ఇన్ని దశాబ్దాల నా కసి ఇప్పుడు తీరిందిరా! నాలుగు దశాబ్దాల క్రితం లెక్కల్లో తెలివైన వాడినని నువ్వు విర్ర వీగితే మేం మనసులో ఇంత కాలం ఎంత మథనపడ్డామో నీకేం తెలుసురా?’’
‘‘ఐతే అమరావతి వెళ్లొస్తా’’
‘‘ఆయనకూ తెలియదు. 2009 నాటి కూటమిలో ఎవరికెన్ని సీట్లో ఇప్పటి వరకు లెక్క తేలలేదు. 2018ది ఎప్పుడు తేలాలి?’’
‘‘సమాధానం లేని లెక్క అంటే నాకు నిద్ర పట్టదు. ఏదో ఒక మార్గం చెప్పు’’
‘‘లెక్కల్లో నీ తెలివితో మేం నాలుగు దశాబ్దాలు క్షోభ అనుభవించాం. ఇప్పుడు నీ వంతు. దీంతోనైనా మా క్షోభ నీకు అర్థం అవుతుంది.’’
‘‘చెప్పరా ఎవరికెన్ని స్థానాలో..’’
‘‘పెద్ద పెద్ద ప్రొఫెసర్లకే సమాధానం తెలియదు. నువ్వు, నేను ఎంత? బేతాళుడు కూడా చెప్పలేని చిక్కు ప్రశ్న ఇది. ’’
‘‘బాల్య స్నేహితుడిని ఇలా అమానుషంగా హింసించడం అన్యాయం. నాలుగు దశాబ్దాలు నువ్వు ఇంత కసితో రగిలిపోతున్నావని, ఆ కక్ష నీలో ఇంత బలంగా ఉందని ఊహించలేదు. సమాధానం తెలిసే దాకా నిద్ర పట్టదు. ఎవరికెన్ని సీట్లో చెప్పి పుణ్యం కట్టుకో ప్లీజ్..’’
బుద్దా మురళి (జనాంతికం 23-11-2018) )
*

4 కామెంట్‌లు:

  1. బాల్య స్నేహితుడిని సతాయించడం వరకు ఒకే, మీ ఇష్టం. మీ బ్లాగు చదివిన అమాయక జీవులకు ఇటువంటి బేతాళ ప్రశ్నలతో పిచ్చెక్కించడం అన్యాయం గురువు గారూ.

    రిప్లయితొలగించండి
  2. లెక్క దొరికింది!

    Total: 99 + 13+ 8+ 3= 123 (119+4)
    BC: 24+ 3+ 2= 29. అమ్మయ్య డబుల్ కౌంటింగ్ అయితే కానీ మొత్తానికి బడుగులకు "గౌరవప్రదమయిన" (> TRS) సీట్ల సంఖ్య సాధించాం!

    http://bhandarusrinivasarao.blogspot.com/2018/11/blog-post_25.html

    "మహాకూటమి పొత్తులో భాగంగా తమకు లభించిన 99 సీట్లకుగాను, కాంగ్రెస్ పార్టీ 24 స్థానాల్లో బీసీ అభ్యర్ధులను నిలబెట్టింది. 13 సీట్లు లభించిన తెలుగుదేశం పార్టీ మూడింటిని బీసీలకు వదిలింది. కాగా, టీజేఎస్ తనకు దక్కిన 8 సీట్లలో రెండు సీట్లలో బీసీ అభ్యర్ధులను ప్రకటించింది. మహాకూటమిలో మరో భాగస్వామి అయిన సీపీఐకి బీసీల విషయంలో గడ్డు పరీక్ష ఎదురయింది. తన భాగానికి వచ్చిన మూడు సీట్లలో రెండు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కిందకు పోయాయి. మిగిలింది ఒక్క జనరల్ సీటు. ఈ ఎన్నికల్లో తలపడుతున్న తమ పార్టీ రాష్ట్ర నాయకుడికి ఆ సీటు ఇవ్వక తప్పని పరిస్తితి. అదే చేసింది."

    రిప్లయితొలగించండి
  3. ఈ లెక్క తప్పు ఉదాహరణకు టిడిపి 14 కాదు 13 కాదు
    14 కేటాయించారు ఒకటి వదిలేశారు ఒకటి మరిచి పోయారు పన్నెండు లో మాత్రమే నామినేషన్ లు వేశారు

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం