1, ఆగస్టు 2023, మంగళవారం

రాజకీయ కామెడీ ప్రయోగం .. తటస్థ రాజకీయం ఓటింగ్ కు దూరంగా ఉండే గాంధేయ వాదులు ..... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -81

రాజకీయ కామెడీ ప్రయోగం .. తటస్థ రాజకీయం ఓటింగ్ కు దూరంగా ఉండే గాంధేయ వాదులు జర్నలిస్ట్ జ్ఞాపకాలు -81 ------------------------------------------------- ఆమె మహాత్మా గాంధీజీ మనవరాలు మేం ఎన్నికల్లో ఓటు వేయం అని చెప్పగానే ఆశ్చర్యం అనిపించింది . అదేంటి ఓట్లను బహిష్కరించాలి అనేది నక్సల్స్ నినాదం . మీరు గాంధేయ వాదులు అని చెబుతూ , మహాత్మా గాంధీజీ మనవరాలు అయి ఉండి , తీవ్రవాదుల్లా ఓటు ను బహిష్కరించడం ఏమిటీ ? అంటే ... ఆమె చెప్పిన సమాధానం తటస్థులం అని ... రాజకీయాల్లో తటస్థులు అనే దానిని ఓ జోక్ గా మార్చారు కానీ వాళ్ళు నిజమైన తటస్థులు . ఎన్టీఆర్ భవన్ లో ఒక సారి మహాత్మ గాంధీజీ మనవరాలు కలిశారు . మానవ విలువలు బోధించే విధంగా కృషి చేసే తమ సంస్థ విధానాలు అన్ని పార్టీల వారికి చెబుతూ ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు . ఎన్నికల్లో ఓటు వేయకుండా దూరంగా ఉండడం తమ సంస్థ సభ్యలు పాటించాల్సిన నియమం . మేము తటస్థంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాం , ఒక పార్టీకి ఓటు వేసిన తరువాత తటస్థులం అని చెప్పడం సరికాదు .. ఏ పార్టీకి ఓటు వేశామో మనం ఆ పార్టీని ఇష్టపడుతున్నట్టు లెక్క , ఓటు వేస్తే ఇక తటస్థులు ఎలా అవుతారు, అందుకే ఓటింగ్ కు దూరంగా ఉంటాం అని చెప్పుకొచ్చారు . ఆ తరువాత అదే ఎన్టీఆర్ భవన్ తటస్థులతో నిండిపోయింది . ******** 1999 ఎన్నికల సమయంలో టీడీపీ చేసిన తటస్థ రాజకీయ ప్రయోగం రాజకీయాల్లో ఓ విచిత్ర ప్రయోగం గా మిగిలిపోయింది . ఒక పార్టీ తరపున గెలిచి న తరువాత తటస్థులు ఎలా అవుతారో ? గెలవడమే కాదు మంత్రి వర్గంలో చేరిన తరువాత కూడా మేం తటస్థులం అని చెప్పుకునేవారు . మంత్రి వర్గం లో స్థా నేను తటస్తున్ని అని చెప్పుకంటే వంద శాతం పలానా పార్టీ అభిమాని అని చెప్పేసే పరిస్థితి . 99 ప్రయోగం విఫలమైనట్టు 2004 లో కానీ టీడీపీ గుర్తించలేక పోయింది . తరువాత తటస్థులు ఎవరూ పార్టీలో మిగలలేదు . 95లో ఎన్టీఆర్ ను దించి అధికారం లోకి వచ్చిన చంద్రబాబు కు చెప్పుకోవడానికి బలమైన పథకాలు లేవు . పైగా టీడీపీకి రామబాణం లాంటి రెండు రూపాయలకు కిలో బియ్యం ను రెట్టింపు ధర చేశారు . సొంతంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేమి లేవు . హై టెక్ సిటీ పై పూర్తిగా ఆధారపడలేరు . సమయంలో తటస్థ ప్రయోగానికి తెర లేపారు . ******** ఎన్టీఆర్ భవన్ లో అప్పుడు ఒక జాతరలా ఉండేది . పెద్ద సంఖ్యలో జనం వచ్చి మేం తటస్థులం అని చెప్పి పార్టీలో చేరేవారు . రిపోర్టర్ లకు సైతం వారితో మాట్లాడడం ఓ కాలక్షేపంగా ఉండేది . అప్పుడు శాసన మండలి సభ్యునిగా ఉన్న యాదగిరి టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో రిసెప్షనిస్ట్ గా బాధ్యతలు నిర్వహించేవారు . పెద్ద సంఖ్యలో వచ్సిన తటస్థులు రిసెప్షన్ లో ఉన్న యాదగిరి వద్ద సందర్శకుల బుక్ తీసుకోని అందులో వివరాలు , ఫోన్ నంబర్ , అడ్రెస్ రాసేవాళ్ళు . అలా రాసే వారి ఉద్దేశం పార్టీ నుంచి తమకు పిలుపు వస్తుంది , ఏదో ఒక బాధ్యత అప్పగిస్తారు అని .. అలా రాసి వెళ్లిన వారికి పిలుపు వచ్చేది పార్టీ నుంచి కాదు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక నుంచి . టైమ్స్ మార్కెటింగ్ అతను రోజూ యాదగిరి వద్దకు వచ్చి అంతకు ముందు రోజు అడ్రెస్ లు రాసిన వారి వివరాలు నాట్ చేసుకొని , టైమ్స్ పత్రిక వేసుకోమని కోరే వారు . అలా రాసి వెళుతున్న వారికి ఇది తెలియదు కానీ రిపోర్టర్ లు గా రోజూ అక్కడే ఉండి ఈ తతంగాన్ని చూసే వారికి ఇదో తమాషా గా ఉండేది . తాజాగా రిటైర్ అయినట్టు ఉన్నాడు ఓ వ్యక్తి బ్రీఫ్ కేస్ తోనే ఎన్టీఆర్ భవన్ కు వచ్చి .. నాకేదైనా పని అప్పగించండి అని ఉత్సాహ పడ్డారు . అక్కడ తోటి తటస్థులు , జర్నలిస్ట్ లు కనిపించగానే అతనికి జ్ఞాన బోధ చేయాలి అని పించింది . తప్పంతా నెహ్రూదే అన్నట్టుగా అందరికీ ఓటు హక్కు కల్పించడం వల్లనే దేశం ఇలా ఉంది . చదువుకున్న వారికి , ఉన్నత స్థాయి వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటే దేశం ఇలా ఉండదు అని అతను తేల్చేశాడు . అంతా విన్నాక అతనికో మాట చెప్పాను .. ఎన్టీఆర్ భవన్ ఎదురుగానే కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంటుంది . బాగా చదువుకున్న వాళ్ళు , సంపన్నులు , ఉన్నతాధికారులు అక్కడ వాకింగ్ చేస్తుంటారు . చేతిలో బ్రీఫ్ కేస్ తో ఇలానే ఆ పార్క్ వద్దకు వెళ్లి గుండెపోటు వచ్చినట్టుగా పడిపోండి . మీరు చెప్పిన ఉన్నత వ్యక్తులు మీకు ఏమైందో అని సహాయం చేయడానికి వస్తారా ? లేక అక్కడ ఉండే ఆటో డ్రైవర్లు , ఇతర చిన్న చిన్న వాళ్ళు వస్తారో చూడండి అని సలహా ఇచ్చాను . **** 1999 ఎన్నికల్లో . తటస్థ కోటలో పలువురికి టికెట్లు ఇచ్చారు . తటస్థ కోటాలో విజయరామారావు , శనక్కాయల అరుణ , లక్ష్మి పద్మావతిలకు బాబు మంత్రివర్గంలో చోటు కల్పించారు . డిజిపిగా , సిబిఐ డైరెక్టెర్ గా మంచి ప్రతిభ చూపారు అని చెప్పి విజయరామారావును హోం మంత్రిని చేస్తారు అని అంతా అనుకుంటే రోడ్లు భవనాలు అప్పగించారు . తటస్థులు మంత్రివర్గంలో ఉన్నా , పార్టీతో మాకేం సంబంధం , మేం తటస్థులం అని చెప్పే వాళ్ళు . అప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా లాల్ జాన్ బాషా పార్టీలో ప్రముఖునిగా ఉండేవారు . ఓ మంత్రికి ఫోన్ చేస్తే పార్టీతో నాకు సంబంధం లేదు అని బదులిచ్చారు . . తటస్థ నాయకులు ఉన్న చోట పార్టీ శ్రేణులు నిర్వీర్యం అయ్యారు . తటస్థ కోటాలో విజయరామారావుకు మంత్రి పదవి ఇవ్వకుండా కెసిఆర్ కు ఇస్తే తెలంగాణ ఉద్యమమే ఉండేది కాదు అని కొందరు టీడీపీ నాయకుల వాదన .. ఐతే తటస్థుల ప్రయోగాన్ని కన్నా చాలా ముందుగానే తెలంగాణ ఉద్యమానికి సన్నాహాలు జరిగాయి . ******* తటస్థుల ప్రయోగం టీడీపీ లానే బిజెపి కూడా చేసింది . 2004 ఎన్నికలకు ముందు ఏం వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో వైస్ రాయ్ హోటల్ లో కొందరు ప్రముఖులతో సమావేశం నిర్వహించి బీజేపీని గెలిపించాలి అని కోరారు . ఐతే ఇది పార్టీ సమావేశం కాదు బీజేపీని అభిమానించే తటస్థుల సమావేశం అని ప్రకటించారు . టీడీపీకి ఇప్పటికీ స్వదేశంలో , విదేశంలో తటస్థ మద్దతుదారులు ఉన్నారు . స్వల్ప సంఖ్యలోనే కావచ్చు వీరిని చూసి ఇతర పార్టీల వారూ మేము తటస్థులం అని చెప్పుకుంటారు . ఇప్పడు బీజేపీకి కూడా తటస్థ మద్దతుదారులు బాగానే ఉన్నారు . ఒక్క తెలంగాణ ఉద్యమం లో మాత్రమే అన్ని పార్టీల వాళ్ళు , ఏ పార్టీకి చెందని వారు . లెఫ్ట్ , రైట్ అనే తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు . గుడిలో పూజలు చేసే పూజారులు సైతం... -బుద్దా మురళి

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం