31, అక్టోబర్ 2012, బుధవారం

సుబ్బలక్ష్మి- జాలిమ్ లోషన్ -ప్రజాస్వామ్యం- పాదయాత్ర

ఫార్ములా వన్ రేస్‌లను గుర్తుకు తెస్తున్న ట్టుగా ఓబి వ్యాన్‌లు పరుగులు తీస్తున్నాయి. తొలిసారిగా ఎవరెస్ట్ శిఖరంపైకి చేరినప్పుడు, చంద్రునిపై కాలు పెట్టినప్పుడు, అమెరికాను కనిపెట్టినప్పుడు కూడా అంత హడావుడి ఉండకపోవచ్చు. ఇంటి ముందు డజన్ల కొద్ది ఓబి వ్యాన్లు వచ్చి ఆగినా ఇంటి యజమానురాలు కించిత్ కూడా చలించకుండా ఇది మాకు మామూలే అన్నట్టుగా ఉంది. సుబ్బలక్ష్మి గారితో మేం మాట్లాడాలి అని టీవి వాళ్లు అడిగారు. కుదరదు ఇప్పుడు ఆమె బిజీగా ఉంటుంది. మరో గంట తరువాత రండి అంది. సుబ్బలక్ష్మి వంట పాత్రలన్నింటిని కడుగుతోంది. విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తే ఎవరొప్పుకుంటారు. గంట వరకు ఆగడం అంటే కుదరదు అక్కడ లైవ్‌కు ఏర్పాట్లు చేసుకున్నాం. అంటూ కోరస్‌గా వేడుకున్నారు. చివరకు ఇంటి యజమానురాలికి, చానల్స్‌కు మధ్య జరిగిన ద్వైపాక్షిక, శిఖరాగ్ర చర్చల్లో ఒక ఒప్పందానికి వచ్చారు. సుబ్బలక్ష్మి అలా వంట పాత్రలు కడుగుతూనే ఉంటుంది, వీరు ఆమెను అడగాల్సినవి అడగవచ్చు. 

సుబ్బలక్ష్మి గారూ మీ కోసం సుబ్బిగాడు వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతానని బెదిరిస్తున్నాడు. అని టీవి వాళ్లు కోరస్‌గా అడిగారు. అదంతా టీవిలో లైవ్‌గా చూశాను కొత్త విషయాలేమన్నా ఉంటే చెప్పండి అని సుబ్బలక్ష్మి ఎంతో అనుభవం ఉన్న హైకమాండ్ లీడర్ రేంజ్‌లో అనేక ప్రశ్నలకు ఒకే ముక్కలో తేల్చి చెప్పింది.
 మీ అమ్మ గారిని చూసి నిజం చెప్పడానికి భయపడుతున్నారా ? 
మా అమ్మగారి జీవితం తెరిచిన పుస్తకం ..నా  జీవితం కడిగిన గిన్నె ..
 సుబ్బి గాడి  మీద ఫిర్యాదు చేస్తారా ?
చట్టం తన పని తను చేసుకుపోతుంది 
ప్రజలకు మీరిచ్చే సందేశం ?
ప్రజలే నా  దేవుళ్లు వారికే నా జీవితం అంకితం 
అంటే ఇంటింటికి  వెళ్లి ఉచితంగా అంట్లు తోముతరా ?

ఆ ప్రశ్న వేసిన అతన్ని సుబ్భాలక్ష్మి కోపంగా చూసి .. మా మనోభావాలు దెబ్బతిస్తున్నారు .. అంది 
 అతను కొత్త వదిలేయండి అని మిగిలిన వారు సర్ది చెప్పారు 
అప్పటి వరకు మౌనంగా ఉన్న యజమాను రాలు మా సుబ్బి రోజు అన్ని న్యూస్ చానల్స్ చూస్తుంది అని అసలు విషయం చెప్పింది 
అందుకేనా ఉస్కో అంటే ఉస్కో అంటుంది అని అనుకున్నారు 
సాధారణంగా మీ సందేశం ఏమిటి అని అడుగుతాం కానీ ఎందుకో మీకు మాత్రం మా సందేశం చెప్పాలనిపించింది 
ఆరోగ్యంగా ఉండాలంటే న్యూస్ చానల్స్ ఎక్కువగా చూడకండి అని ఆఫ్ ది రికార్డ్ గా చెప్పారు 
.కొన్ని ప్రశ్నలకు నో కామెంట్ అని కొన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది అని అంది. 

ఆమెను నేను లవ్ చేస్తున్నాను, ఆమె ఐ లవ్ యూ చెప్పకపోతే వాటర్ ట్యాంక్ నుంచి దూకి చచ్చిపోతాను అని సుబ్బిగాడు ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. బస్టాప్‌లో అడవారు కనిపిస్తే, ఎవరినైనా నేను టైమ్ ఎంతయింది మేడం అని అడిగితే కుష్టువాడినో, ముష్టివాడినో చూసినట్టు చూసేవాళ్లు. కానీ సుబ్బలక్ష్మి మాత్రం నవ్వుతూ రెండు మూడు సార్లు టైమ్ చెప్పేది. లవ్ చేస్తుందనడానికి ఇంత కన్నా ఇంకేం సాక్షం కావాలని సుబ్బిగాడు ప్రశ్నించాడు. 

అమ్మగారు కొత్త వాచ్ కొనడంతో పాతది నాకిచ్చింది. జీవితంలో మొదటి సారి వాచ్ పెట్టుకోవడం వల్ల ఎవరు టైమ్ అడిగినా చెబుతాను అంతే తప్ప లవ్‌గివ్ ఏమీ లేదని పాలగినె్నను బూడిదతో గట్టిగా తోముతూ చెప్పింది సుబ్బలక్ష్మి.
***
 ‘‘ఏంటీ టీవిలో అంతగా మునిగిపోయారు ?’’ అని తాయారు మొగున్ని అడిగింది. 

‘‘్భలే లవ్ స్టోరీ వ స్తుంది. ఇటు రా అని భర్త పిలిచాడు.

 సుబ్బిగాడు వాటర్ ట్యాంక్ చివ రి వరకు వెళ్లాడు. ఏక్షణంలోనైనా బ్యాలెన్స్ తప్పి పోయి పడిపోతాడమేమో అనిపిస్తోంది. చీకట్లు ముసురుకుంటున్నాయి. ఉదయం నుంచి సుబ్బిగాడు ఏమీ తినలేదు. అప్పటి వరకు అతన్ని న్యూసెన్స్ కేసుగా చూసిన వాళ్లు క్రమంగా అతనిపై జాలి చూపడం మొదలైంది. వారి ప్రేమ ఫలిస్తుందా? లేదా? అని టీవి వాళ్లు ఎస్‌ఎంఎస్ సర్వే నిర్వహిస్తే, ఉదయం 10 శాతం మంది అనుకూలంగా చెబితే, రాత్రి అయ్యే సరికి అది 70 శాతానికి చేరుకుంది. 

చూడోయ్ తాయారు వాడు చాలా తెలివైన వాడు వాడికి తెలియకుండానే ప్రజాస్వామ్య స్ఫూర్తితో పోరాటం చేస్తున్నాడు. వాడు గనుక రాజకీయాల్లోకి వస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాడు అంటూ కుటుంబ రావు చెప్పుకొచ్చాడు.

 ‘‘వాడి ముష్టి ప్రేమకు ప్రజాస్వామ్యానికి లంకె ఏమిటి? ’’అని తాయారు చిరాకు పడింది. అదేనోయ్ ప్రజాస్వామ్యం. ముందు తనను తాను హింసించుకుని, అధికారంలోకి వచ్చాక ప్రజలను హింసించడమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనం చెబుతాను విను. రాజ్యాలు పుట్టక ముందే తనను తాను హింసించుకోవడం ద్వారా విజయం సాధించవచ్చునని చాలా మంది మహానుభావులు నిరూపించారు.

 రావణుడు తన తలలను తాను తెగ్గోసుకుని శిక్షించుకోవడం వల్లే కదా శివుడు వరాలను ప్రసాదించింది. అన్నగారి పాతాళాబైరవిలో మాంత్రికుడేం చేశాడు. తన చెయ్యిని, చివరకు తలను కోసి అర్పించడం వల్లనే కదా అమ్మ దయతలిచి వరమిచ్చింది. పాదయాత్రకు వెళ్లే ముందు బాబుగారేమన్నారు. నన్ను నేను శిక్షించుకుంటున్నాను అన్నారు కదా? ఎసి జీవులు మన కోసం వందల కిలోమీటర్లు నడవడం అంటే శిక్షించుకోవడమే కదా? తల కోసుకుంటే శివుడు వరమిస్తాడని రావణుడికి తెలుసు, అమ్మ వరమిస్తుందని పాతాళా బైరవిలో ఎస్వీఆర్‌కూ తెలుసు. అప్పుడు వైఎస్‌ఆర్‌కు తెలుసు, ఇప్పుడు బాబు, షర్మిలకూ తెలుసు. ప్రజాస్వామ్యం అంటే ఇదే? భారతీయులకు జాలి ఎక్కువ. తమ జీవితం దుర్భరంగా ఉన్నా, తమ నాయకుల కష్టాన్ని చూడలేని జాలి గుండెలు.అధికారం లేక తమ నాయకులు నీటిలో నుంచి తీసిన చేపలా విల విల లాడి  పోవడం  చూసి తట్టుకోలేరు .. ’’ అని కుటుంబరావు వివరించాడు. .

 ‘‘సుబ్బిగాడి ప్రేమ సక్సెస్ అవుతుందా? పాదయాత్రతో ఎవరికి అధికారం లభిస్తుంది? ’’తాయారు ఆసక్తిగా అడిగింది. 

హిచ్‌కాక్ సినిమాల్లో, తెలుగు రాజకీయాల్లో ఎప్పుడే మలుపు తిరుగుతుందో చెప్పలేం. సుబ్బిగాడికి పోటీగా మరో అప్పిగాడెవడన్నా రైలు పట్టాలపై తల పెట్టి లవ్ చేస్తావా? చావనా అని సుబ్బలక్ష్మికి వార్నింగ్ ఇవ్వవచ్చు. మరో నేత మరింత జాలి కోసం ప్రయత్నించవచ్చు.
 గజ్జిని బట్టి జాలిమ్ లోషన్. జాలిని బట్టి రాజకీయాల్లో గెలుపు ఓటములు అని కుటుంబరావు ముగించాడు. రోజంతా చుపిందే చూపడం తో వీక్షకులు చానల్ మార్చడం ప్రారంభం కాగానే టీవీల వాళ్లు సుబ్బిగాడి ప్రేమకథను వదిలేసి మరో కథ వేటలో పడ్డారు.

28, అక్టోబర్ 2012, ఆదివారం

భారతీయులం..... వినియోగదారులం


ఈ దేశంలో విప్లవాలు రావు

 ఎందుకంటే?

 పేదల్లో ధైర్యం లేదు

 మధ్యతరగతికి తీరిక లేదు

 సంపన్నులకు అవసరం లేదు. 


ఇది సోషల్ నెట్ వర్క్‌లో చక్కర్లు కొడుతున్న విషయం. మూడు ముక్కల్లో దేశం గురించి బాగానే చెప్పారు. మన దేశంలో పరిస్థితి దీనికి బాగా సరిపోయేట్టుగా ఉంది. ఒకవైపు రైతుల ఆర్తనాదాలు, ఆత్మహత్యలు, నిరుద్యోగం . మరోవైపు భారత దేశంలో విపరీతమైన సంపదను పోగుచేసుకోవడానికి అవకాశం ఉందని గ్రహించి క్యూ కడుతున్న విదేశీ కంపెనీలు. చివరకు ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముకునే వారికి, ఇంటి పక్కన కిరాణా దుకాణం వారికి నిద్ర లేకుండా చేయడానికి, రోడ్డున పడేయడానికి ఈ వ్యాపారంలోకి సైతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. 

మన దేశంలో గతంలో వ్యాపారం అంటే ప్రజలకు అవసరమైన వస్తువులను విక్రయించడం. పప్పు, చింతపండు, బట్టలు, పాత్రల వంటి నిత్యావసరాలను విక్రయించడమే వ్యాపారం. పాశ్చాత్యుల దృష్టిలో అది వ్యాపారం కానే కాదు. ఒక అవసరాన్ని సృష్టించి, దాన్ని అలవాటు చేసి, అమ్మడం వ్యాపారం. అది టీ కావచ్చు సిగరెట్ కావచ్చు, టూత్‌పేస్ట్, సబ్బు ఏదైనా కావచ్చు. ఇప్పుడు మ్యాక్‌డోల్ వాడి పిజ్జాలేనిదే నిద్రపోని వారు దేశంలో చాలా మందిని వాళ్లు తయారు చేశారు. మన దేశాని చెందిన ఒక ప్రముఖ కంపెనీ వాళ్లు ఒక వినూత్న పథకాన్ని చేపట్టబోతున్నారు. నర్సరీ నుంచి చివరకు ఉద్యోగం పొందే వరకు వారే చూసుకుంటారు. అంటే ఆ కంపెనీ వారే నర్సరీలో పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పిస్తారు. పెరిగాక తమ కంపెనీకి అవసరం అయిన విద్య నేర్పిస్తారు. విద్య ముగిశాక కంపెనీలో ఉద్యోగం ఇస్తారు. మంచిదే కదా అనిపించకుండా ఉంటుందా? అలా పెరిగి పెద్దయిన వ్యక్తికి ఈ దేశంపై ఎలాంటి ప్రేమ ఉంటుంది. దేశం కన్నా తన కంపెనీయే అతనికి ముఖ్యం అవుతుంది. నిరుద్యోగంతో బాధపడడం కన్నా ఇది మంచిది కదా అనే బలమైన వాదనా ఉంది. ఒక్క కంపెనీ కాదు. ఇప్పుడు మనకు తెలియకుండా మనం పిల్లలను దేశ పౌరులుగా కాకుండా కంపెనీలకు ఉద్యోగులుగా పెంచేస్తున్నాం. వెనక్కి వెళ్లడానికి అవకాశం లేదు ఎంతో ముందుకు వచ్చేశాం.

 దేశంలో స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా సాగుతున్న కాలం. నిజామాంధ్రలో తెలుగువారి పరిస్థితిని వివరిస్తూ సురవరం ప్రతాపరెడ్డి గుంటూరు నుంచి వెలువడిన ప్రబుద్ధాంధ్రకు ఒక వ్యాసం రాశారు. అప్పుడు నిజాం పాలన సాగుతోంది. సంపన్న హిందూ యువత ముస్లింల మాదిరిగా షేర్వాని, రూమీ టోపీ పెట్టుకోవడం ఫ్యాషన్‌గా మారింది. అంటూ నిజామాంధ్రలో తెలుగువారి గురించి రాశారు. ఆరేడు దశాబ్దాల క్రితం నాటి సంపన్నుల ఇళ్లల్లో ఫోటోలు చూస్తే సురవరం చెప్పిన ఈ మాట ఎంత నిజమో తెలుస్తుంది. మనకిప్పుడు ఈ మాట నవ్వు తెప్పించవచ్చు. ఇదే విషయంపై ఆయన బాగా అర్థం కావడానికి కొనసాగింపుగా .... అంటే మీ ఆంధ్రప్రాంతంలో యువత ప్యాంటు, షర్టు వేసుకున్నట్టు అన్నమాట అని స్పష్టం చేశారు. ప్రాంతాల తేడా లేదు ఇప్పుడు దేశమంతా ఇదే ఫ్యాషన్. పుట్టుకతో మనం భారతీయులం అయినా మన ఆస్తిత్వాన్ని మనం కోల్పోతున్నాం. మనను మనం కోల్పోయి మనంగా మిగిలాం. అప్పుడు ఈస్టిండియా అనే ఒక చిన్న కంపెనీ మన దేశాన్ని ఇంగ్లాండ్ నుంచి పాలించేది. ఇప్పుడు కొన్ని వందల విదేశీ కంపెనీలు మన దేశంలో ఉండే మనను పాలించేస్తున్నారు. 

ఒక్కసారిగా మన దేశంపై ప్రపంచానికి ప్రేమ పుట్టుకొచ్చింది. విశ్వసుందరీమణులుగా వరుసగా మనవారినే గెలిపించారు. అలా గెలిపించడం వల్ల ఏమైంది. గెలిచిన వారికి సినిమాల్లో హీరోయిన్లుగా, ప్రకటనల్లో మోడల్స్‌గా బోలెడు అవకాశాలు లభించాయి. గెలిపించిన కంపెనీల సౌందర్య సాధనలకు వేలకోట్ల రూపాయల మార్కెట్ మన దేశంలో ఏర్పడింది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఎప్పుడో చెప్పారు. దేశమంటే మనుషులే కదా అందుకే దేశాల మధ్య సైతం ఆర్థిక సంబంధాలు తప్పవు. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతటి విపరీతమైన కొనుగోలు మార్కెట్ ఇండియాలో ఉంది. వంద కోట్లు దాటిన జనాభా. దాదాపు యాభై శాతం మంది యువత. 30 శాతం వరకు మధ్యతరగతి. ప్రపంచానికి మనపై ప్రేమ కురిపించడానికి ఇంత కన్నా ఇంకేం కావాలి. చైనా జనాభాలో మనను మించి పోయింది. అది పెద్ద మార్కెటే కానీ అక్కడ యూరప్ పప్పులు ఉడకవు, చివరకు అమెరికా జాతీయ జెండాను సైతం చైనానే తక్కువ ధరకు అమ్ముతోంది. అమెరికా మార్కెట్‌నే చైనా ముంచేస్తోంది. చైనా పోటీని ఎదుర్కోలేక పోతున్న యూరప్ దేశాలకు చైనా మార్కెట్‌పై పెద్దగా ఆశలు లేవు. వారికి మిగిలింది ఇండియానే. జరుగుతున్నది మంచికో చెడుకో అర్థం కాని పరిస్థితి. 

ఒకవైపు విశేషమైన మానవ వనరులు ఉన్నాయని సంతోషపడాలో, అవి మన దేశ ప్రయోజనాల కన్నా విదేశీ కంపెనీలను మరింత సంపన్నులుగా మార్చడానికి ఉపయోగపడుతున్నాయని బాధపడాలో తెలియని పరిస్థితి. భాష, సంస్కృతి, కట్టుబొట్టు క్రమంగా అన్నింటినీ ఆక్రమించేసుకుంటున్నారు. మనకు తెలియకుండానే మనం మానసిక బానిసలమవుతున్నాం. అంతేనా చివరకు వారి కోసం మన యువత పగలు పడుకుని, రాత్రిళ్లు పని చేస్తున్నారు. భారతీయులు గాఢనిద్రలో ఉన్నప్పుడు స్వాతంత్య్రం లభించింది. దేశమంతా నిద్రిస్తున్న సమయంలో మన యువత అమెరికా కంపెనీల కోసం అర్ధరాత్రులు పని చేస్తూ, వాళ్లు నిద్రించే సమయంలో మేల్కొంటుంది. ప్రైవేటు రంగం చేపట్టలేని భారీ ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. కానీ ఇప్పుడు చివరకు కిరాణా వ్యాపారం సైతం విదేశీ కంపెనీలు చేయాలా? దీని వల్ల రైతులకు ప్రయోజనమా? ఓట్లువేయించుకుని అధికారంలోకి వచ్చిన రాజకీయ పక్షాలే రైతులను పట్టించుకోవడం లేదు. అలాంటిది ఏదో సుదూర తీరంలో ఉన్న దేశీయుడు ఈ దేశంలోని రైతులను ఆదుకోవడానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాడంటే నమ్ముదామా! పచారీ వస్తువులు అమ్ముకోవడానికి వచ్చిన వాడికి అంతగా భయపడాల్సిన అవసరం లేదు అంటే ఈస్టిండియా కంపెనీ కూడా అంతే కదా ముందు సుగంధ ద్రవ్యాలు అమ్ముకోవడానికి అనుమతి కోసమే వచ్చింది కదా?

 మీ ప్రధానమంత్రి నిష్కామప్రియుడు, నిద్ర పోతున్నాడా? సరిగా పని చేయడం లేదు అని టైమ్స్ పత్రిక హూంకరించగానే ఎఫ్‌డిఐలకు కేంద్రం బార్లా తలుపులు తెరిచింది. నేనేమి దద్దమ్మను కాను వీరాధివీరున్ని చూడండి మిత్రపక్షాలు వ్యతిరేకించినా ఎఫ్‌డిఐలపై నిర్ణయం తీసుకున్నాను అంటూ ప్రధానమంత్రి అమెరికాకు తన చర్య ద్వారా సందేశం పంపించారు. భారతీయ మీడియాలో ప్రధానమంత్రి పని తీరు గురించి ఎన్ని విమర్శలు వచ్చినా కిమ్మనని మన్మోహన్‌సింగ్ టైమ్స్‌లో ఒక వ్యాసం రాగానే బిగ్ బాస్ మందలించినట్టుగా వణికిపోయారు. ఇంతకూ ఈ దేశాన్ని పాలిస్తున్నది భారతీయ ప్రభుత్వమా? అమెరికానా? అమెరికా ప్రభుత్వమైనా, అమెరికా మీడియా అయినా అమెరికా వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసం పని చేస్తుంది. చివరకు ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం సైతం అమెరికా కనుసన్నల్లో పాలన సాగించక తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులను సైతం ప్రజలు వౌనంగా భరించడం, మద్దతు పలకడం తప్ప మరేమీ చేయలేకపోతున్నారు. ముందుగానే చెప్పినట్టు పేదవారి బతుకే దుర్భరంగా మారినప్పుడు ఇక విప్లవాలేం తీసుకువస్తాడు. మధ్య తరగతిని ఈ కొత్త ప్రపంచం ఆనందంలో ముంచెత్తుతోంది. దీని బాగోగుల గురించి ఆలోచించేంత తీరిక వారికి లేదు. సంపన్నులకు అవసరమే లేదు. ఒకవైపు అత్యధిక మంది నిరుపేదలు మన దేశంలోనే ఉన్నారు. పేదరికం దేశానికి సవాల్‌గా మారింది. అదే సమయంలో రెండు వందల రూపాయలతో కాఫీ తాగే నయా ఎగువ మధ్యతరగతి మన దేశంలోనే ఉంది. జీవ వైవిధ్య సదస్సుకు హైదరాబాద్ వచ్చిన విదేశీ ప్రతినిధులు ఒకవైపు హైటెక్ సిటీ మరో వైపు ఇరుకు దారులతో సందులు గొందులతో ఉండే పాతనగరాన్ని చూసి ఇంతకు మించిన వైవిధ్యం ఎక్కడా లేదని విస్తుపోయారు. హైదరాబాదే కాదు మొత్తం మన దేశమే వైవిధ్యభరితమైంది. అకలి కేకలు ఇక్కడే ఉన్నాయి సంపద ఇక్కడే ఉంది. సంపదను ఉపయోగించి ఆకలి కేకలను దూరం చేసే సమర్థవంతమైన నాయకత్వమే ఇప్పుడు కొరవడింది. సంకుచిత రాజకీయ ప్రయోజనాలే తప్ప దేశ హితాన్ని కోరే నాయకత్వం కొరవడింది. గతంలో ఒక ముఖ్యమంత్రి తనను తాను సిఇఓగా ప్రకటించుకుని ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు పాలించడం గొప్పగా భావించే వాళ్లు. ఇప్పుడు ఈ దేశాన్ని ఏలే ప్రభువు ఆరేళ్లపాటు ప్రపంచ బ్యాంకులో ఉద్యోగిగా పని చేసి ప్రపంచ బ్యాంకు విధానాలను ఔపోసన పట్టి పాలకునిగా అమలు చేస్తున్నారు. 

వంద కోట్లు దాటిన భారతీయులు ఒక ఒలింపిక్ స్వర్ణాన్ని కూడా సంపాదించలేదని వాపోతున్నారు కానీ వంద కోట్ల మందిని పాలించేందుకు సమర్థుడైన నాయకుడ్ని సృష్టించుకోలేక పోవడమే ఈ దేశానికి అసలైన శాపం. మాల్స్ ఇప్పుడు మహానగరాలను ఊపేస్తున్న మాట వాస్తవం.అక్కడే సినిమాలు చూడవచ్చు, ఐస్‌క్రీమ్ తినవచ్చు, బర్గర్ లాగించవచ్చు. గంటల తరబడి షాపింగ్ చేయవచ్చు. ఆటలాడవచ్చు, అమ్మాయి, అబ్బాయిలు ప్రేమించుకోవచ్చు. మాల్స్ పుణ్యమా అని సినిమా హాళ్లు, షాపులు మూతపడుతున్నాయి. అవసరం అయిన వస్తువును వెళ్లి కొంటే అది షాపు అవుతుంది. అవసరం లేకున్నా ఆకట్టుకుని కొనిపించడం మాల్స్ ప్రత్యేకత. ఇక్కడ రేటు ఎక్కువ, అయితేనేం ఆకర్షణీయ శక్తి అత్యధికం. జేబులో డబ్బు లేకపోయినా కార్డు ద్వారా అప్పటికప్పుడు కొనిపించే శక్తి వీటికుంటుంది. ఇప్పుడివి దేశాన్ని ముంచేస్తున్నాయి. మా పిల్లలు ఇంట్లో తినాలంటే బోర్ అంటున్నారు పిన్నీ.. పిజ్జాలు, బర్గర్‌లు లేందే వారికి గడవదు. ఇప్పుడు ఇరుగు పొరుగు అమ్మలక్కలు గర్వంగా చెప్పుకునే మాట.

 *** 
సికింద్రాబాద్ స్టేషన్ ఎదురుగా రెండంతస్తుల భవనం. పదిహేను వేలరూపాయలకు అమ్మబడును. బేరానికి అవకాశం ఉంది. క్రింది అడ్రస్‌లో సంప్రదించగలరు.

 ప్రజలకు 58 పైసలకు కిలో బియ్యం అమ్మాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ రామ్‌కె వేపా ఆదేశించారు. బియ్యాన్ని 66 పైసలకు కిలో అమ్ముతున్నారని, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. ఇకపై ప్రభుత్వం పన్నును 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గించినందున 58 పైసలకు కిలో చొప్పున అమ్మాలని ఆదేశించారు. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ రోజు ధరలు ఉల్లిగడ్డ పది పైసలకు కిలో మిర్చి 12 పైసలు నువ్వులు ఒక రూపాయి 10 పైసలు నూనె ఒక రూపాయి 90 పైసలకు కిలో ఏంటీ నమ్మకం కలగడం లేదా? ఇది నిజం కావాలంటే ఆంధ్రభూమి దినపత్రికలో ధరవరలు చూడండి ఆగండాగండి ఈ ధరలు నిజమే అయితే ఈ రోజువి కాదు. ఇవి 1964 నాటివి. కాలు పెట్టడానికి చోటు కనిపించని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా 15వేలకు రెండంతస్తుల భవనం. ఇప్పుడో అటు నుంచి ఐదారు కిలో మీటర్ల దూరం వెళితే చిన్న కుటుంబం నివసించడానికి అవసరమైన అపార్ట్‌మెంట్‌కే 40లక్షలు కావాలి. ఇప్పుడు సొంత అపార్ట్‌మెంటే సొంతిళ్లు. మూడు దశాబ్దాల క్రితం ముంభైలో అపార్ట్‌మెంట్‌ల గురించి రాష్ట్రంలో వింతగా చెప్పుకునే వాళ్లు. ఇప్పుడు గ్రామాల్లో సైతం అపార్ట్‌మెంట్స్ సంస్కృతి పెరిగిపోయింది. పది పైసలకు కిలో ఉల్లిగడ్డ 30 రూపాయలకు కిలో వరకు వెళ్లింది. 66 పైసలకు కిలో బియ్యం అంటేనే గగ్గోలు పెట్టిన వాళ్లు ఇప్పుడు 40 రూపాయలకు కిలో అంటే కిమ్మనకుండా భరించేస్తున్నారు. బ్రిటీష్ వాడు పాలించినప్పుడు కనీసం పోరాడే శక్తినైనా మిగిల్చాడు. కానీ ఇప్పుడు పెరిగిన ధరలు, పెరుగుతున్న అవసరాలు, మనకు మనం సృష్టించుకున్న పోటీతో పోరాడేశక్తి సైతం క్షీణించింది. మొక్కేవాడికి మొక్కేవాడు తయారవుతున్నాడని ఒక కవి చెప్పిన మాట ఇప్పుడు మనందరికీ వర్తించేట్టుగా ఉంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మార్పు సహజం. మారాలి కూడా కానీ ఆ మార్పు మనకు మేలుచేసేదిగా ఉండాలి తప్ప మనను మనం బానిసలుగా తయారు చేసుకునే విధంగా ఉండరాదు. ఇప్పుడు జరుగుతున్న మార్పు, సంస్కరణలు నిజంగా మనకు మేలు చేసేవా? లేక మనను పెనం నుంచి పొయ్యిలో పడేసేవా? దీనికి కాలమే సమాధానం చెబుతుంది. ఒక్కటి మాత్రం నిజం. వ్యాపార వేత్త ఎప్పుడూ తన ప్రయోజనం కోసం, తన లాభం కోసం చూసుకుంటాడు కానీ ఈ దేశ ప్రజలను ఉద్ధరిద్దామని అనుకోడు.

 * ............................ 
గంజికి 200 రూపాయలు గంజినీళ్లయినా తాగిబతుకుదాం కానీ ఆ దొర దగ్గర బానిసగా బతకొద్దు. అరేయ్ ఏం చూసుకొని ఎగిసిపడుతున్నావురా! నేను కాదన్నానంటే నీకు గంజినీళ్లు కూడా పుట్టవు ఇలాంటి డైలాగులు పాత సినిమాలు చాలా వాటిలో వినిపిస్తుంటాయి. రాయలసీమ జిల్లాల్లో తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు కమ్యూనిస్టు పార్టీలు, గ్రామాల్లో పెద్దలు గంజి కేంద్రాలను ఏర్పాటు చేయడం గతంలో కనిపించేది. గంజికి లేనివాడు అంటే ఏమీ లేని అభాగ్యుడన్నమాట! కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఇప్పుడు సంపన్నులు మాత్రమే గంజి తాగగలుగుతున్నారు. స్టార్ హోటల్స్‌లో భోజనానికి ముందు గంజి ఇస్తారు. గంజి అని పిలిస్తే దాని విలువ ఉచితం అవుతుంది. గంజికి ముద్దుగా సూప్ అని పేరు పెడితే రెండు మూడు వందల రూపాయలు చెల్లించడానికి వెనకాడరు. ఈ విషయం తెలిసే స్టార్ హోటల్స్ గంజిని నమ్ముకుని బాగానే గడిస్తున్నాయి. పాత కాలంలో తవుడు నూనె ఉపయోగిస్తున్నారు అంటే పాపం పేదోడు అని జాలిపడేవారు. ఇప్పుడు గుండె పోటు రాకుండా ఉండాలంటే తవుడు నూనే వాడమని వ్యాపార ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. సరస్వతి ఎడ్యుకేషన్ ట్రస్ట్ వాళ్ల పాఠశాలలో మీ పిల్లలను చేర్పించమంటే ఎవరినైనా అడిగితే, ఏమంటారు? అడిగిన వారిని పిచ్చివారిని చూసినట్టు చూస్తారేమో! పోనీ ఇండో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చేర్పిస్తారా? అని అడిగి చూడండి. బాబ్బాబు అక్కడ ఎవరైనా తెలిసిన వారుంటే కాస్త రికమండేషన్ చేసి పుణ్యం కట్టుకోండి అని బతిమిలాడతారు. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి. అయితే చిత్రమేమంటే ఈ విషయం తెలిసే సరస్వతి ఎడ్యుకేషన్ ట్రస్ట్ వాళ్లు తాము నడిపే పాఠశాలకు చక్కని తెలుగు పేరు కాకుండా ఇండో ఇండస్ స్కూల్ అని పేరు పెట్టారు. పేరులో ఏముందని అంటాం కానీ సరస్వతి పాఠశాల అంటే వీధి చివరి స్కూల్ అనుకుంటాం, ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఎగబడతాం. నేములోనే ఉందంతా! ................................


24, అక్టోబర్ 2012, బుధవారం

శ్రీశ్రీ.. ... కృష్ణశాస్ర్తీ..నారాశ్రీ

కవిత్వానికి కాలం చెల్లిందని ఎవరన్నారు. వినేందుకు చెవులు, చదివేందుకు కళ్లు ఉంటే కవిత్వానికి కాలం చెల్లిందనే మాట నోటి నుంచి రానే రాదు. ఒక కుర్ర కవి కవిత్వం రాసి పేరున్న రచయితకు చూపిస్తే, ఆయన ఏమీ చెప్పకుండా ఇతనికి కవిత్వం చేసింది అని యువ కవిని అయోమయంలో పడేశాడు. జలుబు చేసింది అన్నంత ఈజీగా ఆయన కవిత్వం చేసింది అని అన్నాడు. మహాప్రస్థానానికి చలం యోగ్యతా పత్రం ఇచ్చినట్టు కవిత్వం చేసిందనే మాట తన కవిత్వానికి యోగ్యతా పత్రమో, వెటకారపు మాటో అర్ధం కాక యువ కవి అయోమయంలో పడిపోయాడు. అమ్మవారు ప్రత్యక్షం కాగానే అప్పటి వరకు నిరక్షరాస్యుడిగా ఉన్న కాళిదాసు అద్భుతమైన కవిత్వం చెప్పేశారు. ఇంత కాలం తరువాత కూడా కాళిదాసును మరిపించే కవి పుట్టిలేదంటారు. అంటే దేవి ప్రత్యక్షం అయితే కవిత్వం చేస్తుందా? చెప్పడం కష్టమే!
***

మరో ప్రపంచం
మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది
పదండి.. ముందుకు..పదండి దూసుకు!
ఇదెవరి కవిత్వం అని కవిని అడిగితే ఎలా ఉంటుంది? అడిగిన వాళ్లను ఎగాదిగా చూస్తారు కదూ? ఔను మరి శ్రీశ్రీ కవిత్వం తెలియంది ఎవరికి?
మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెనె్నల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్లకీ బ్రతుకు పండెనో
ఇదెవరిది చెప్పండి ?
ఇంకెవరిది దేవులపల్లి కృష్ణశాస్ర్తీది


సరే మరి ఇప్పుడు చెప్పండి వేగుచుక్కలా దూసుకొస్తున్న మరో కవి పలుకులు చెబుతాను. అదెవరిదో చెప్పండి.
‘చాంతాడు వేయకుండానే చేతికి తగిలేట్టున్న కన్నీళ్ల చేరువకు అడుగులు వేస్తున్నాను’ వాహ్‌వా అనాలనిపిస్తోంది కదూ? ఒక శ్రీశ్రీ, ఒక దాశరథి, ఒక కృష్ణశాస్ర్తీ, అంతెందుకు తెలుగు కవులంతా కలగలిసిపోయినట్టు అనిపిస్తే, తప్పు లేదు.
మళ్లీ పైకి వెళదాం ఇంతకూ కవిత్వం ఎందుకు చేస్తుంది?
సిద్దార్థుడు ఒక బిక్షకుడ్ని, మరణించిన వ్యక్తి అంతిమ యాత్రను, మొత్తం మీద సమస్యలు, పేదరికాన్ని చూసినప్పుడు కోరికలు లేని సమాజాన్ని సృష్టించాలనే కోరికతో బుద్ధునిగా మారాడు. ఆఫ్రికా నుంచి వచ్చినప్పుడు దేశాన్ని అర్ధం చేసుకోవడానికి మహాత్మాగాంధీ దేశంలో పర్యటించి, చొక్కా తీసేసుకుని సామాన్య జీవితం గడిపారు. దోపిడీ దొంగతనాలు చేసి బతికే వాల్మికి పావురం మరణాన్ని చూసి మహాకవిగా మారాడు కదా? అలానే మన మహాకూటమి నేత నారాశ్రీ (కవి అన్నాక చివర శ్రీ ఉండి తీరాలి) పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి కవిగా మారాడు. మహాకవిగా ఒక్కో అక్షరాన్ని పేర్చుకుంటూ నడుస్తున్నారు. ఆ భావావేశం నుంచి పుట్టిన కవితలోని పంక్తులే ఈ చాంతాడు వేయకుండానే చేతికి తగిలేట్టున్న కన్నీళ్ల చేరువకు అడుగులు వేస్తున్నాను.. అన్న మాట. ఒక్క చిన్న సంఘటనతో రామాయణం రాసే స్థాయికి వాల్మికి చేరినప్పుడు రెండు వందల కిలో మీటర్ల పాదయాత్ర తరువాత తెలుగునేతలో కవిత్వం పొంగి పొర్లుతోందంటే నమ్మకపోవడానికి కారణం అవసరం లేదు.
పూర్వం రాజులు మారువేషాల్లో ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి వెళ్లేవారట! వాళ్లు సమస్యలను వెతుక్కోవడానికి మారు వేషాల్లో వెళ్లే వాళ్లు. అయితే ఇప్పుడూ పాలకులు కావాలనుకుంటున్న వాళ్లు మారు వేషంలో ప్రజల్లోకి వెళుతున్నారు. 


మారు వేషం అంటే శ్రీకృష్ణదేవరాయలు, తన మంత్రితో మల్లీశ్వరిలో బాటసారుల్లా భానుమతి, ఎన్టీఆర్‌లను కలిసినట్టు కాదు. ఇక్కడ మారువేషం అంటే లక్ష కోట్లు సంపాదించిన వాళ్లు తమను మించిన అమాయకులు, బాధితులు ప్రపంచంలో లేరని, చేతిలో మత గ్రంధం ఉంటే తప్ప ధైర్యం ఉండదని అమాయకత్వాన్ని నటించే వాళ్లు. వ్యవసాయం అంటేనే చిరాకు పడి ఐటిని ప్రపంచానికి పరిచయం చేసింది తామే అని మనస్ఫూర్తిగా నమ్మి ఇప్పుడు మాత్రం రైతుల ఊపిరే తన ఊపిరి అని రైతు బాంధవ వేషంలో తిరిగే వారన్నమాట! ఏ గ్రామానికి వెళితే ఆ రూపం ధరిస్తూ గ్రామాలు పర్యటిస్తున్న నాయకులకు కవిత్వం పొంగు కొస్తోంది. తెలుగు నేత డైయిలీ సీరియల్‌గా ఆత్మకథ రాస్తున్నారు కాబట్టి ఆయనలోని కవిత్వం మనకు పరిచయం అయింది. చెల్లి మొదలు పెట్టిన యాత్ర అన్న ముగిస్తారో, అమ్మ ముగిస్తుందో చెల్లే ముగించక తప్పదో మనకు తెలియదు కాబట్టి ఆత్మకథ రాయడం లేదు. అలా రాస్తే తెలుగు సాహిత్య జగత్తుకు ఒక గొప్ప మహిళా భావ కవి లభించి ఉండేవారు. యాత్రలు అధికారం కట్టబెడతాయా? లేదా? అనేది మనకు అవసరం లేదుకానీ తెలుగునేతలోని గొప్ప భావకవిని ప్రపంచానికి వెల్లడి చేసింది.

 ఆయన కవిత్వంలో మరో పంక్తి ఆపార్టీ, పార్టీ అంటూ విడగొట్టే రాజకీయాలేంటి? అని ఆయన తన కవిత్వంతో రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నారు. అంటే దీనర్ధం ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు అధికార పక్షం, ప్రతిపక్షం కలిసిపోయాయని ఆయన చెప్పదలుచుకున్నారా?అని వెటకారాలు వద్దు. పార్టీలు వద్దు అంటే అయ్యో ఈసారైనా అధికారంలోకి వస్తారని ఆశలు పెట్టుకుని బోలెడు ఖర్చు చేస్తున్న మా పరిస్థితేం కావాలని తమ్ముళ్లు భయపడతారేమో! రాజకీయాలు, రాజకీయ పార్టీలు వద్దే వద్దు అంటూ ఆయన చెబుతున్న కవిత్వాన్ని ఆస్వాదించండి అంతే తప్ప సొంత నిర్వచనాలు వద్దు. చెల్లి ఆలస్యమెందుకు? నువ్వూ  కవిత్వం రాసి జనం మీదకు వదిలేయ్.

17, అక్టోబర్ 2012, బుధవారం

కాపీ కొడదాం రండి..


ఏరా పరీక్ష ఎలా రాశావు?
బాగానే రాశాను కానీ ... ఏమవుతుందో అని భయంగా ఉందిరా?
బాగా రాశాక భయమెందుకు?
ఔను అస్సలు కాపీ కొట్టకుండా రాశాను. అందుకే భయం. కాపీ కొట్టి ఉంటే మినిమం గ్యారంటీ ఉండేది.

ఆ విద్యార్థి భయంలో అర్ధం ఉందని రెండో విద్యార్థి నిజమే అని తలూపాడు. చిన్న వయసు నుంచే కాపీ అనేది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. అసలు కాపీ అనేది లేకపోతే ఈ ప్రపంచం ఎంత స్లోగా సాగేదో కదా? ఆపిల్, సామ్‌సంగ్ కంపెనీల మధ్య కాపీ పోరు వల్ల బోలెడు మేలు జరిగింది కదా?
ఆమె చీర నా చీరకన్నా తెల్లగా ఉందే ఎలాగబ్బా అనే ధోరణి నుంచి కొత్త సృష్టికి లేదా ఉన్నదానికి కాపీ సృష్టి జరుగుతుంది.
పోటీ ఎంత ఎక్కువగా ఉంటే కాపీ అంత వేగంగా విస్తరిస్తుంది. రాజకీయాల్లో ఇప్పుడు పోటీ బాగా పెరిగిపోయింది. అలాంటప్పుడు కాపీ సైతం అంతే స్పీడ్‌గా పెరిగిపోవాల్సిందే!

 ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఆసలు ఆలోచన నాదే వైఎస్‌కు నేనే చెప్పాను అని బొత్స చెబితే, ఆ పథకం రూపకల్పన చేసిందే నేనే, వైఎస్‌ఆర్ ఆ పథకాన్ని కాపీ కొట్టి ఎక్కువ ప్రచారం చేసుకుని తనదని చెప్పుకున్నారని బాబు వాపోయారు. 50 మంది విద్యార్థులుండే తరగతి గదిలో ఎవరిది చూసి ఎవరు కాపీ కొట్టారో తేల్చుకోవడం పేపర్లు దిద్దే టీచర్లకు కష్టం కావచ్చు కానీ ప్రజలు మాత్రం ఎ పథకం ఒరిజినల్ ఎవరిదో? ఎవరు కాపీ కొట్టారో బాగానే గ్రహించేస్తున్నారు. వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు. ఇద్దరు మనుషులు ఒకరినొకరు ఇష్టపడేందుకే వెయ్యి అబద్ధాలు ఆడినా తప్పులేదనే మినహాయింపు ఉన్నప్పుడు కోట్ల మంది ఓటర్ల ఓట్లు కొల్లగొట్టడానికి నాయకులు ఎన్ని కోట్ల అబద్ధాలు చెప్పడానికి మినహాయింపు ఉండాలి. క్యాలుక్యులేటర్‌కు సైతం అందని లెక్క ఇది. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. కక్కురావడం కాదు ముక్కు చీదినా ఈ మధ్య ప్రభుత్వాలు పడిపోయి మధ్యంతర ఎన్నికలొస్తున్నాయి. జయలలిత, మాయావతి, మమత లాంటి వారికి తుమ్ము, దగ్గు రాకుండా చూసుకోవడానికి గతంలో బిజెపి, కాంగ్రెస్ చాలా తంటాలు పడ్డాయి. ఎలర్జీలు ఉన్నవారిని నమ్ముకుంటే నట్టేట మునుగుతామని గ్రహించి ఈ మధ్య వీళ్లతో సంబంధం లేకుండా బతికేసే మాత్రలను యుపిఏ కనిపెట్టేసింది.

 వాహనాలకు స్టెప్నీ ఉన్నట్టు ఈ మధ్య ప్రభుత్వాలు కూడా మద్దతు విషయంలో ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంటే ఔట్ సోర్సింగ్ అన్నమాట! ఉద్యోగులు తోక జాడిస్తే గతంలో మాదిరిగా లాకౌట్ ప్రకటించాల్సిన అవసరం లేదు. ఔట్ సోర్సింగ్ ద్వారా పని కానిచ్చేయవచ్చు. ప్రభుత్వాలు సైతం ఈ ఔట్ సోర్సింగ్‌ను బాగానే నమ్ముకున్నాయి. చిన్నా చితక పార్టీలను, పార్టీల్లో కొందరు సభ్యులను బయటి నుంచి మద్దతు కోసం అట్టిపెట్టుకున్నారు. దేశ రాజకీయాలకు తొలిసారి బయటి నుంచి మద్దతు మార్గాన్ని పరిచయం చేసింది మన మన బాబుగారే...! దీన్ని కాంగ్రెస్ వాళ్లు కాపీ కొట్టి ప్రభుత్వాలను నిలబెట్టుకున్నారు. మధ్యంతర ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని అన్ని పార్టీల వాళ్లు ధీమాగా ఉన్నారంటే బయటి నుంచి మద్దతు సిద్ధాంతాన్ని నమ్ముకునే కదా? దీనికి బాబుపై కృతజ్ఞత చూపాల్సిన కాంగ్రెస్ ఆయనే్న ఎంత మాటంది. బాబు కాపీ రాయుడట! ఈ మాట అనడానికి వారికి మనసెలా ఒప్పింది? కేంద్రంలో తమ ప్రభుత్వం నిలబడింది బాబు కనిపెట్టిన ఫార్ములాతోనే అనేది గుర్తుకు రాలేదా?
ఒకటా రెండా బాబు ఐడియాలు ఎన్నో కాపీ కొట్టేస్తున్నారు. నగదు బదిలీ పథకం మా అబ్బాయిది, ఉచిత విద్యుత్, ఫీజులు, ఆరోగ్యశ్రీ, మైనారిటీ రిజర్వేషన్లు, రెండు రూపాయల బియ్యం పథకాలన్నీ నావే కాపీ కొట్టేశారని వాపోతున్నారు. చివరకు నా పాదయాత్రను సైతం షర్మిల కాపీ కొట్టేశారంటున్నారు. పాదయాత్ర ఐడియా మా నాన్నది అని ఆమె చెబుతుంటే కాపీ రైట్‌కు కాలం చెల్లింది... ఇప్పుడు కొత్తగా పాదయాత్ర రైట్ బాబుగారిదే అని ఆ పార్టీ వాళ్ల వాదన. ఎప్పుడు మొదలు పెట్టామని కాదు విజయవంతంగా కాపీ కొట్టామా? లేదా? అనేది ఇప్పుడు రాజకీయాల్లో ముఖ్యం.
బజాజ్ స్కూటర్స్ హవా నడిచే కాలంలో స్కూటర్ తయారై ఇంకా మార్కెట్‌లోకి వెళ్లక ముందే పంజాబ్‌లో నకిలీ పార్ట్స్ తయారు అయ్యేవి. వాటిని నిరోధించలేమని గ్రహించాక చివవరకు కంపెనీ వాళ్లే వాళ్లకు రుణాలు ఇచ్చి కాస్త నాణ్యమైన పార్ట్స్‌ను తయారు చేయండి అని వేడుకున్నారు. స్కూటర్లు కాదు అసలు సృష్టి ప్రారంభం అయినప్పుడే కాపీ అనేది మొదలైంది. సృష్టికి ప్రతి సృష్టి చేయాలని విశ్వామిత్రుడు ప్రయత్నించాడు అంటే కాపీ అక్కడి నుంచే పతాక స్థాయికి వెళ్లినట్టు కదా? సరే మార్కెట్ శక్తులు సహకరించక పోవడం వల్ల విశ్వామిత్రుడి ప్రతి సృష్టి అంతగా విజయవంతం కాక త్రిశంకు స్వర్గంగా నిలిచిపోయింది. రాజకీయాల్లో సైతం కాపీ అనేది ప్రతిసారి ఉపయోగపడుతుందనే గ్యారంటీ లేదు. పార్టీ ఏర్పాటు, విధానాలు, పచ్చ రంగు, ప్రత్యేక వేదిక, సబ్సిడీ పథకాలు అన్నీ తమిళనాడు నుంచి కాపీ కొట్టుకొచ్చినా తెలుగునాడు పార్టీ బాగానే సక్సెస్ అయింది.

శ్రీకృష్ణుడి కాలంలోనూ ఈ కాపీ వ్యవహారం సాగింది. పౌండ్రక వాసుదేవుడు అచ్చం శ్రీకృష్ణుడిలా తయారై, వీధుల్లో తిరిగే వారట! ఈ పాత్ర విషయంలోనే ఎన్టీఆర్‌కు, ఎంఎస్‌రెడ్డికి గొడవ జరిగిందంటారు. ప్రచారంలో గోబెల్స్ మన నేతలకు మార్గదర్శకుడు. ఆయన విధానాలు కాపీ కొట్టినా గోబెల్స్ దిగివచ్చి ఈ ప్రచారం చూస్తే ఆయనే విస్తుపోయేంతగా అలా ముందుకు వెళుతున్నారు మన నేతలు.
అన్ని వేదాల్లోనే ఉన్నాయి  వేదాలనుంచే కాపి కొట్టేశారు అని ఆధునిక పరిజ్ఞానం పై కొందరి అభిప్రాయం 

11, అక్టోబర్ 2012, గురువారం

సంపాదన వన్.. టూ.. త్రీ!

‘ఒకరు లేక ఇద్దరు చాలు’ ఈ ప్రకటన చాలామందికి సుపరిచితం. రెండు మూడు దశాబ్దాల క్రితం -పిలకలేసుకున్న పిల్లల బొమ్మలతో వీధి గోడలమీదో, థియేటర్లలో స్లైడ్ షో మాదిరిగానో కనిపించేవి. కుటుంబ నియంత్రణ శాఖ హోరెత్తించే ఈ ప్రకటనలు రేడియో ప్రసారాల్లో, పత్రికా ప్రకటనల్లోనూ కనిపించేవి. ప్రకటనల మహత్యమో, బతుకుదెరువు ప్రాబ్లమో తెలీదు కానీ, ‘ఒంటికాయ సొంఠికొమ్ము’ స్టయిల్‌కు నానో కుటుంబాలు ఎప్పుడో అలవాటుపడ్డాయి. అందుకే -కుటుంబ నియంత్రణ శాఖ ప్రకటనలూ కనిపించకుండా పోయాయి. ‘సంతానం ఒక్కరే అయితే ఫరవాలేదు. సంపాదన మాత్రం రెండు మూడుండాలి’ అంటూ గ్లోబల్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చేస్తున్న సూచనలనే సరికొత్త పాఠంగా ఆచరించాల్సిన పరిస్థితి వచ్చింది. అవును -నిజం. లైఫ్‌లో ఒకింత ఫైనాన్స్ రిలాక్స్ ఉండాలంటే -ఒక సంపాదన సరిపోదు. రెండు సంపాదనలైతే మంచిది. మూడునాలుగైతే మరీ బెటర్. 

-‘మేం చేసేది బల్లకిందా పైనా చేతులు పెట్టి రెండుచేతులా సంపాదించే ఉద్యోగం కాదుగా? బహుళజాతి సంస్థలో ఐటి ఉద్యోగం’ అన్న అనుమానాలు చాలామందికి కలగొచ్చు. అలాంటి డౌట్లు ఎవరికి మందొస్తే, వాళ్లే ముందుగా కొన్ని సూత్రాలు పాటించాలి మరి. లేదంటే.. లైఫంతే! *** మూడు పదుల సీనియారిటీతో రిటైరయ్యే నాన్నకు వచ్చే బెనిఫిట్స్ మొత్తం కంటే -పాతికేళ్ల వయసున్న కొడుకు మొదటి నెలలో సంపాదిస్తున్న జీతం ఎక్కువగా ఉంటున్న రోజులివి. సంపాదన బాగానే ఉంటుంది. మరి -ఆ సంపాదన ఎప్పుడూ అలాగే ఉండిపోతుందా? అంటే గెడ్డం కింద చేయి, మూతిమీద వేలు వేసుకుని ఆలోచించాల్సిన పరిస్థితి. ఒకవేళ ఆ జీతం తలకిందులైతే అన్న డౌటు మొదలైందనుకోండి, అప్పుడు స్టార్టవుతుంది అసలు టెన్షన్. -రష్యాలో వానపడితే మన కమ్యూనిస్టులకు జలుబు చేస్తుందంటూ గతంలో జోకులు వినిపించేవి. కానీ ఇప్పుడు -ఇరాక్‌పై అమెరికా దాడి చేస్తే దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఆ దెబ్బకు -హైటెక్ సిటీలో పని చేసుకునే అమలాపురం కుర్రాడు కొన్ని ఖర్చులను సర్దుకోవాల్సి వస్తుంది. ఏమంటే -‘కంపెనీ కాస్ట్ కటింగ్’ అంటాడు. తీవ్రత ఎక్కువై ఉద్యోగం ఊడితే -తట్టాబుట్టా సర్దుకుని ఇంటికెళ్లిపోవాల్సి రావచ్చు. ఈరోజుల్లో -ఈరోజు జీతం ఎంతైనా కావచ్చు. రేపటి జీతం, జీవితం రెండూ మన చేతుల్లో ఉండవు. అందుకే వారన్ బఫెట్ (ఆయనెవరూ అని అడిగితే మాత్రం మీరు చాలా సూత్రాలు చదువుకోవాల్సి ఉంటుంది) చెప్పిన మొదటి సూత్రం -ఒకే ఆదాయంపై ఆధారపడకు. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే జీతంనుంచి సాధ్యమైనంత వరకు పొదుపు పెట్టుబడులు పెట్టాలిట. క్రమంగా జీతంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలట. 

నిజమే -ఉద్యోగం చేయడం వేరు. జీతంపై ఆధారపడటం వేరు. అందుకే -‘మన పెట్టుబడులు మన జీతాన్ని మించి ఆదాయాన్ని కల్పించే విధంగా వ్యూహం ఉండాలి’ అంటాడాయన. మనం చేసే పనికి లభించేది -జీతం. పెట్టుబడులపై లభించేది -అదనపు ఆదాయం. అంటే -రెండో సంతానం. ఒకవేళ కొంతకాలానికి ఉద్యోగంలో తేడావచ్చి జీతం తగ్గినా, రాకున్నా -బెదిరిపోవాల్సిన పనిలేకుండా అదనపు ఆదాయం మీద ఆధారపడొచ్చు అంటాడాయన. అచ్చంగా -ఇలాగే ఉండాలని లేదు. ఆయన చెప్పేదేమంటే -‘అవకాశాలను బట్టి ఒకటికిమించి ఆదాయాలను మనమే కల్పించుకోవాలి’ అని. ** ఇక -సంపాదించడమే కాదు, ఖర్చు పెట్టడమూ కళే! ‘అనవసర వస్తువులు కొనడం హాబీ చేసుకుంటే -అవసరమైన వస్తువులు అమ్ముకోవడం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది’ అన్నది బఫెట్ చేసే పెద్ద హెచ్చరిక. మార్కెట్‌లో ఏది కొత్తగా అనిపిస్తే అది కొనడం కొందరికి అలవాటుతో కూడిన హాబీ. ఆరంభంలోనే ఐదంకెల జీతాలు తీసుకుంటున్న కుర్రాకారు చాలామందిలో ఈ వ్యవసం కనిపిస్తోందన్న సర్వేలూ వెలువడుతున్నాయి. వస్తువు తప్పనిసరైతే కొనడంలో అర్థముంది. కానీ వ్యసనంగా కొనడం మొదలెడితే ఆర్థిక క్రమశిక్షణ లేక దెబ్బతింటారు. ఆఫీసులో పక్కవారి వద్ద కొత్త మొబైల్ చూసి, మనం ‘స్మార్ట్’్ఫన్ కొనడానికి పరుగులు తీయడం అవసరమా? ‘స్క్రీన్’ వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్న హీరో రజనీకాంత్ వద్ద బేసిక్ మొబైల్ మాత్రమే ఉండటాన్ని ఓ సినీ జర్నలిస్టు గుర్తించాడట. అంతే, ఆశ్చర్యంగా ముఖం పెట్టి ‘అదేంటీ? మీరు ఇలాంటి ఫోన్ వాడుతున్నారు?’ అని ప్రశ్నించాడట. దానికి రజనీ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? -‘నేను మాట్లాడేందుకు, ఎదుటివారు మాట్లాడింది వినడానికి సెల్‌ఫోన్ వాడతాను. ఆ పనులకు ఇది బాగానే పని చేస్తుంది’ అని. గొప్పల కోసం వృధా ఖర్చులు అనవసరం అన్నది -జగమెరగాల్సిన సత్యం. *** పిల్లల చదువు కోసమో, వృద్ధాప్యంలో కష్టనివారణకో ఉద్యోగంలో చేరినప్పటి నుంచే పొదుపు చేయవచ్చు. వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇలా చేయడం వల్ల తరువాత కాలంలో మీరు మోసే భారాన్ని ఇప్పటి నుంచే సులభతరం చేసుకోవచ్చు. 

మీ జీతంలో కనీసం పదిశాతం పొదుపు క్రమానుగతి పెట్టుబడిపై పెట్టండి. కనీసం ఐదేళ్ళు అలా చేయాలి. ఐదేళ్ల కాలంలో మీకొక అవగాహన వస్తుంది. రిటర్స్న్ ఏమేరకు వస్తున్నాయో, రిస్క్ ఎంతవరకు తీసుకోవచ్చో తెలుస్తుంది. పెట్టుబడులు ఎలా ఉండాలి? అనే దానికి వారెన్ బఫెట్ ఓ చక్కని మాట చెప్పారు. పెద్ద పళ్లెంలో మొత్తం అన్నం మాత్రమే ఉంటే ఎలా ఉంటుంది. పళ్లెంలో అన్నీ ఉంటేనే చూడడానికి బాగుంటుంది. తినడానికి అంతకన్నా బాగుంటుంది. అంతే తప్ప ఒక్క అన్నం మాత్రమే ఉంటే ఏం లాభం. అలానే మీ పెట్టుబడుల్లో సైతం అన్ని రుచులు ఉండాలి. స్టాక్స్, బాండ్స్, నేషనల్ సేవింగ్స్ సర్ట్ఫికెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివన్నీ ఉండాలి. చివరగా బఫెట్ చెప్పిన మరో ముఖ్యమైన సూత్రం -ఎవరిపైనా ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దని. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులపై ఎక్కువ నమ్మకాలు పెట్టుకుంటే మరీమరీ దెబ్బతింటామని. నమ్మకాలు వద్దు, ఎదుటి వ్యక్తులపై అనుమానాలూ వద్దు. డబ్బును డబ్బుగానే చూడాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులూ ఉండవ్. ఇంకెందుకు ఆలస్యం? మరో మూడువారాల్లో ఎలాగూ జీతం అందుకోబోతున్నారు కదా! ముహూర్తాలు చూడకుండా, పొదుపు పెట్టుబడులు ప్రారంభించండి. ఆర్థిక సూత్రాలు విప్పిచెప్పిన బఫెట్ అంతటి వాళ్లం కాకపోయినా, బాగుపడతామని ఆశించడంలో ఎలాంటి సందేహాలూ అక్కర్లేదు.

10, అక్టోబర్ 2012, బుధవారం

అల్లుడు బంధం!

పాపం రాజకీయ నాయకులు. మన కాలికి ముల్లు గుచ్చుకుంటే వాళ్లు కన్నీళ్లు పెడతారు. మన కోసమే మనం ఆలోచించుకోలేని కాలంలో మీ కోసం అంటూ మన కోసం ఆలోచిస్తారు. నా కోసం ఏడవకండి మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ఒక దేవుడంటే ఆ పని కూడా మేమే చేస్తాం, మా కోసం మీ కోసం మేమే ఏడుస్తామంటారు. రోడ్డుమీద హంటర్‌తో తమను తాను శిక్షించుకునే వాడ్ని చూసి జాలిపడి డబ్బులు రాలుస్తాం కానీ మన కోసం తమను తాము శిక్షించుకునే మన నాయకులను మాత్రం నమ్మం. పాపం వారికి ఇదేం శిక్ష? ఎందుకీ వివక్ష?


పండగ రోజు సగటు మధ్యతరగతి సుబ్బారావు ఇంటికి అల్లుడు అమ్మాయి వస్తే ఏం చేస్తారు. నెలఖరైనా అప్పు తెచ్చి మరీ కట్నం చదివించుకుంటారు కదా? అలా చేయపోతే ఏమంటారు. మర్యాద తెలియని వాళ్లు అని చీదరించుకోరూ..! మరి అదే పని మన నాయకులు చేస్తే ఏమంటున్నాం. తప్పు తప్పు అంటూ గగ్గోలు పెడుతున్నాం. ఇది న్యాయమా? ఎంత చెట్టుకు అంత గాలి ఎంత పెద్దింటి అల్లుడికి అంతటి చదివింపులు. గుమస్తా కుటుంబరావు ఆయన అల్లుడికి బల్లకింద చేయి పెట్టి సంపాదించిన వెయ్యి రూపాయలతో బట్టలు పెడితే, లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దేశాన్ని వంటి చేత్తో తెర వెనక నుంచి పాలించేస్తున్న అత్తగారి అల్లుడు గారికి ఎలా మర్యాద చేయాలి. మర్యాద చేస్తే మనం ఇంతగా గొడవ చేయాలా? అందుకే రాజకీయ నాయకులను చూస్తే జాలేస్తుంది. కన్నకొడుకు బాగు కోసం ఒకరు, అల్లుడి కోసం మరొకరు, త్యాగాలు చేస్తుంటే మనం ఇంతగా ఆడిపోసుకోవాలా? ఇది న్యాయమా? ఇదేనా కుటుంబ విలువలకు మనం ఇచ్చే ప్రాధాన్యం? 

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అనే పాట వింటే అసలీ పాటే ఓ బూటకంఅనిపిస్తోంది. అనుబంధం అత్మీయత అంతా వాస్తవం అని కళ్ల ముందు కనిపిస్తుంటే బూటకం అని ఎలా పాడగలం? మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయని ఎవరన్నారు? తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోవడం లేదని, అల్లుళ్లకు అత్తవారింట్లో మర్యాద దక్కడం లేదని ఎవరన్నారు? ఓ సినిమాలో మంత్రిగా ఉన్న అత్తగారు అల్లుడికి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తానంటుంది. ఆ డైలాగు విన్నప్పుడు అదెలా సాధ్యం అనిపించింది. ఎందుకంటే మంత్రిగా ఉన్నప్పుడు సొంత జిల్లాను, సొంత శాఖను అల్లుడికి రాసివ్వడం సాధ్యమే కానీ మొత్తం రాష్ట్రాన్ని రాసివ్వడం ఎలా సాధ్యం. అది ముఖ్యమంత్రికో, ప్రధానమంత్రికో లేదా వీరిద్దరిని నడిపించే వాద్రా అత్తగారికో సాధ్యం అవుతుంది కానీ మంత్రికెలా సాధ్యం. ఏం అల్లుడికి ఆ మాత్రం స్వతంత్రం ఉండదా? అత్తగారింట్లో అల్లుడికి కాకపోతే ఇంకెవరికి స్వతంత్రం ఉంటుంది. సోనియాగాంధీ అల్లుడికి డిఎల్‌ఎఫ్ అనే సంస్థ వడ్డీ లేకుండా కొంచం తక్కువ 65 కోట్ల డబ్బు ఇచ్చింది. ఏం పావలా వడ్డీ, వడ్డీ లేని రుణం అంటూ అధికారంలో ఉన్న వాళ్లు సామాన్యులకు ఇచ్చినప్పుడు సోనియా అల్లుడికి డిఎల్‌ఎఫ్ ఇస్తే మనకేం నష్టం? ఆ రోజులే వేరు ఉమ్మడి కుటుంబాలు, బంధుమిత్రులతో కళకళలాడేవి, ఒకరినొకరు ఆదరించుకునే వారని, ఇప్పుడు కుటుంబం అంటే భార్యాభర్త, వారి సంతానం మాత్రమే అని వాపోతుంటారు. ఎవరైనా బంధువులను ఆదరిస్తే సహించరు. ఇంత పెద్ద దేశం కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అల్లుడికి 65 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తే తప్పా? తెల్లని దుస్తుల్లో రాముడు మంచి బాలుడు అన్నట్టు హుషారుగా కనిపించే వాద్రా వారికి నచ్చి ఉండొచ్చు. 

వాద్రాలో నేటి కాలానికి పనికి వచ్చే ఒక గొప్ప రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. వాద్రాకు డిఎల్‌ఎఫ్ 65 కోట్లు వడ్డీ లేని రుణం ఇచ్చిందని కెజ్రీవాల్ ఆరోపిస్తే, ఆయన చెప్పిన సమాధానం విన్నాక ఆయన రాజకీయాల్లోకి వచ్చి తీరుతాడని అనిపించడం లేదూ! అసలు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చట్టంపై నాకు విశ్వాసం ఉంది, ప్రజలపై నమ్మకం ఉంది, ప్రజాస్వామ్య వ్యవస్థను నేను ప్రేమిస్తాను. అంటూ సమాధానం చెప్పాడంటే అతను కచ్చితంగా కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకుడే అయి ఉంటాడు. ఇంకా రాజకీయ ఆరంగ్రేటం చేయకముందే వాద్రా ఇంత చక్కని రాజకీయ ప్రకటనలు చేస్తున్నారంటే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక ఇంకెంతగా రాణిస్తారో?


వాద్రా ఇంకా అనుమానం వద్దు రాజకీయాల్లోకి దూకేయ్! కెజ్రీవాల్‌కు డిపాజిట్ కూడా రాదు కానీ మీరు రాజకీయాల్లో బాగా రాణిస్తారు. వాద్రాకే కాదు అసలు అల్లుళ్లకే కాలం అచ్చిరావడం లేదు. మామ గారు ఊరూరు తిరిగి కష్టపడి సంపాదించుకున్న సైకిల్‌ను అల్లుడు ఎత్తు కెళ్లాడు. ఏం అల్లుడికి ఆ మాత్రం స్వతంత్రం లేదా? అంతోటి దానికి వెన్నుపోటు అనే ముద్ర వేసి మానసికంగా హింసించడం న్యాయమా? నందమూరి వంశ సంప్రదాయం ప్రకారం అల్లుడికే అధికారం దక్కాలని అల్లుడిగారి అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ ఆశిస్తుంటే, కాదు మా అల్లుడికే అధికారం అని బాలయ్య చెప్పకనే చెబుతున్నారు. అల్లుడి నుంచి పోటీ రాకముందే రాజశేఖర్‌రెడ్డి శకం ముగిసింది. జైలు నుంచి ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తానని కొడుకు చెబుతుంటే అల్లుడేమో దేశ దేశాలు తిరిగి ప్రజలను దీవించేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల్లోనూ అల్లుళ్లకు అన్యాయం జరుగుతోంది. తొమ్మిదేళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉన్నాను, కరుణించి మరోసారి అధికారం ఇవ్వండి అంటూ అల్లుడు గారు సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. మామకు వయసు మీద పడింది, ఇంత కాలం కష్టపడి అలిసిపోయారు, ఇక నేను కష్టపడతాను అని కెసిఆర్ అల్లుడు సిద్ధంగా ఉన్నా, కాలం కలిసి రావడం లేదు. అల్లుడికి పోటీగా కొడుకు క్యూలో నిలిచారు. అందరూ ఒక్క అల్లుడితో తంటాలు పడితే ఎన్టీఆర్ రాజకీయ జీవితం మొత్తం ఇద్దరు అల్లుళ్ల మధ్య నలిగిపోయింది. నెహ్రూకు సైతం అల్లుడి దెబ్బ తప్పలేదు. పార్లమెంటులో అల్లుడు నిత్యం నెహ్రూ విధానాలపై నిప్పులు చెరిగే వారట!

3, అక్టోబర్ 2012, బుధవారం

రాజకీయ జీవుల జీవ వైవిధ్యం...కాంగ్రెస్‌ను మించిన జీవ వైవిధ్యం ప్రపంచంలో లేదు .

ఒక చేతితో తమ కన్నబిడ్డలను టెక్నో స్కూల్‌లో చేర్పించడానికి అప్లికేషన్ ఫారంను మరో చేత్తే తమను కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించడానికి దరఖాస్తు తీసుకుని ఇంటికి బయలు దేరిన సగటు మధ్యతరగతి జీవికి జీవితానికి మించిన జీవ వైవిధ్యం ఏముంటుంది. కళ్లు తెరిచి, మనసు పెట్టి చూస్తూ మన జీవితమే పెద్ద జీవ వైవిధ్యం కాదా?
ఐశ్వర్యారాయ్‌ను మోహించి తల్లిదండ్రులు చూపించిన అమ్మాయితో అడ్జస్ట్ అవుతూ నువ్వే నా పాలిట ఐశ్వర్యారాయ్‌వి అని అతను, నువ్వే నా కలల రాకుమారుడు హృతిక్ రోషన్‌వు అని ఆమె ఒకరికొరకు పైకి చెబుతూ, పైన సంతృప్తి, లోన అసంతృప్తితో జీవించడం జీవన వైవిధ్యమే.!
***

మానవ జీవితంలో పిట్టలు, పక్షులు, జంతువులు అన్నింటికి భాగస్వామ్యం ఉండాలని చెప్పడానికి శత్రు దుర్భేద్యమైన కోటలో సదస్సు నిర్వహించారు. రాజధాని నగరంలో జూబ్లీ హీల్స్ దాటిన తరువాత కొంత దూరం వెళ్లాక అనుమతి లేనిదే చీమలు కూడా దూరని ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య జీవ వైవిధ్య సదస్సు నిర్వహించడం మన వ్యవస్థలోని జీవన వైవిధ్యం. చెట్లు కొట్టేసి, పురుగు పుట్రను ఖాళీ చేయించి అద్భుమైన భవనాలు నిర్మించి వందల కోట్లు ఖర్చు చేసి జీవులను రక్షించాలని సదస్సు నిర్వహించడం కూడా జీవన వైవిధ్యమే.
***

ఐదేళ్లకోసారి అధికారంలోని పార్టీని మర్చేయాలని ఐదేళ్లపాటు ఎదురు చూసే మధ్యతరగతి జీవితాన్ని మించిన జీవన వైవిధ్యం ఎక్కడ కనిపిస్తుంది. సినిమా తారల జీవితంలోని వైవిధ్యం ఆశ్చర్యకరంగానే ఉంటుంది. హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగే రోజుల్లో వాణిశ్రీ తానేమిటో తానే మరిచిపోయానని చెప్పుకున్నారు. పూర్తిగా పాత్రల్లో లీనమై పోతూ తనను తాను మరిచిపోయానన్నారు. శ్రీరాముడు, రిక్షా రాముడు, డ్రైవర్ రాముడు ఒకదానికొకటి సంబంధం లేదు కానీ ఎన్టీఆర్ అన్నింటిలోనూ లీనమైనటించారు. శ్రీరాముడు అంటే ఇలానే ఉండేవారేమో అనుకున్నారు. రిక్షా రామున్ని చూసి రిక్షా తొక్కేవాళ్లంతా ఇలానే ఉంటారనుకున్నారు. రిక్షావాడు మరోలా కనిపిస్తే నమ్మబుద్ధి అయ్యేది కాదు. వీడెవడో దొంగోడేమో రిక్షా వాడు రిక్షారాముడిలో ఎన్టీఆర్‌లా ఉండాలి కదా? అనిపించేది. పాపం ఆయన అన్ని పాత్రల్లో నటించి చివరకు వాస్తవాలను గ్రహించలేక ఎదుటి వారి నటనను గుర్తుపట్టలేక జీవిత చరమాంకంలో ఘోరంగా దెబ్బతిన్నారు. ఎన్టీఆర్ జీవితం నటనలో జీవించే వాళ్లు ఎదుటివారి నటనను గ్రహించలేరు అనే జీవిత పాఠం నేర్పించింది.

 పాత్రవేరు నువ్వు వేరు అని తెలిసేప్పటికీ పుణ్యకాలం తీరిపోతుంది. శ్రీదేవి, జయప్రద, జయసుధ, డ్రీమ్‌గర్ల్ హేమామాలినికి వారి వారి కాలాల్లో కుర్ర కారు ఆ పేర్లు వింటేనే పడి చచ్చేవాళ్లు. వీళ్లను పెళ్లిచేసుకుందామనే ఆశ ఉన్నా అవకాశం లేదని తెలిసి అలాంటి అందగత్తెలనే పెళ్లి చేసుకుంటామని భీష్మించుకునే వాళ్లు. కొన్ని లక్షల మంది కుర్ర కారు హృదయాలను దోచిన ఇంత అంతగత్తెలకు పెళ్లి కోసం పెళ్లికాని యువకులు దొరక్కపోవడం ఆ దేవుడు చూపించిన జీవన వైవిధ్యమేమో! అంత అందగత్తెలైనా వాళ్లంతా అప్పటికే పెళ్లయి పెద్దపెద్ద పిల్లలు ఉన్న మగాళ్లకు రెండో భార్యలుగా ఉండాల్సి వచ్చింది.హేమామాలినికి పెళ్లికాని యువకుడు దొరక్కపోవడం ఏమిటో? శ్రీదేవి వయసు పిల్లలున్న బోనీ కపూర్‌కు శ్రీదేవి భార్య కావడం ఏమిటో?
***

ఏదో నిధులున్నాయని ఇప్పుడు జీవ వైవిధ్యం అంటూ పాశ్చాత్యులు హడావుడి చేస్తున్నారు కానీ మన దేవుళ్లు జీవ వైవిధ్యాన్ని ఎప్పుడో గ్రహించారు. చాలా మంది దేవుళ్లకు పశుపక్షలు వాహనాలుగా ఉండేవి. తొలి పూజలందుకునే గణపతికి ఏకంగా ఏనుగు ముఖం ఉంది కదా? జీవ జాలం తోడుగా ఉండడం కాదు తమలో భాగం అని దేవతలు నిరూపించారు. మారీచుడు బంగారు జింకగా మారినా? రాక్షసులు పక్షులుగా మారినా జీవ వైవిధ్యమే. దేవతల తరువాత జీవ వైవిధ్యం ప్రాధాన్యతను తెలుగునాట సినిమా రంగంలో ఎక్కువగా గుర్తించింది విఠలాచార్య. హీరోలు, హీరోయిన్ల కన్నా ఆయన సినిమాలో పశుపక్షులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. వాటితో విసిగిపోతే ఆయన దెయ్యాలను నమ్ముకున్నారు, కానీ జీవ వైవిధ్యన్ని వదులుకోలేదు.
***

వీరందరి కన్నా జీవ వైవిధ్యన్నా తమ జీవితంలో భాగంగా చేసుకున్నది మాత్రం కచ్చితంగా రాజకీయ నాయకులే. కోట్లు సంపాదించి ఆదాయం పన్ను కట్టమంటే నా దగ్గరేముంది బూడిద అని అంటారో నేత. అప్పుడే వివేకానంద రూపంలో కనిపించి ఆ వెంటనే మినాక్షి శేషాద్రితో శృంగార పాటలు, కాషాయ రూపం పక్కన పారేసి వృద్ధాప్యంలో వివాహం ఇదే కదా! జీవన వైవిధ్యం. తరువాత కాషాయ దస్తులను ఎర్ర రంగులో ముంచడం ఇదే కదా జీవన వైవిధ్యం. ఊసరవెల్లి ప్రమాదంలో పడినప్పుడు మాత్రమే రంగులు మారుస్తుంది కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్లు క్షణ క్షణం జీవన వైవిధ్యం చూపకపోతే ఔట్ డేటెడ్ నాయకులవుతారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం అనాలి, సీట్లు పెరిగే చాన్సుంటే ఆ వెంటనే రాష్ట్ర విభజన కోసం నడుం బిగించాలి.
ప్రపంచ దేశాలు భారత దేశాన్ని జీవ వైవిధ్య రాజధానిగా ప్రకటించేశాయి. ఏ ఉద్దేశంతో చేసినా వారు చాలా సరైన పనే చేశారనిపిస్తోంది. విదేశీ పాలనకు వ్యతిరేకంగా వందల ఏళ్లపాటు పోరాడిన చరిత్ర ఉన్న ఈ దేశీయులు ఇటలీ వనితికు దశాబ్దాల నుంచి పట్టం కట్టడానికి మించిన జీవన వైవిధ్యం ప్రపంచంలో ఇంకెక్కడుంటుంది. ఆమె నోరుమెదపరు. కానీ కనుసన్నల్లోనే దేశాన్ని పాలిస్తున్నారు. కాంగ్రెస్‌ను మించిన జీవ వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. అధికారపక్షం, ప్రతిపక్షం, అభిమాన పక్షం, వెన్నుపోటు పక్షం, గోతులు తీసే పక్షం, నీతులు చెప్పే పక్షం అన్నీ అందులోనే ఉంటాయి.