29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

నూలు పోగు కూడా అడ్డం లేకుండా నగ్న నృత్యం చేస్తున్న మీడియా ... ఆ రోజుల్లో మీడియా అంతా కలిసి నాయకులను బహిష్కరించేవారు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 97

నూలు పోగు కూడా అడ్డం లేకుండా నగ్న నృత్యం చేస్తున్న మీడియా ... ఆ రోజుల్లో మీడియా అంతా కలిసి నాయకులను బహిష్కరించేవారు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 97 ------------------------- రాష్ట్రాల్లో , జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూడా ఒక పార్టీ మీడియాను, మరో పార్టీ బహిష్కరించడం ఇప్పుడు సర్వసాధారణం . ఆ రోజుల్లో కూడా బహిష్కరణ ఉండేది కానీ ఇప్పటిలా కాదు . జర్నలిస్ట్ లంతా కలిసి తప్పు చేసిన నాయకుడిని బహిష్కరించేవారు . అన్ని పార్టీల మీడియా ఏకాభిప్రాయానికి రావడం ఎలా సాధ్యం అని ఇప్పటి వారికీ అనిపించవచ్చు . కానీ అప్పటి పరిస్థితి వేరు . 1987లో తొలిసారిగా మెదక్ జిల్లాలో జర్నలిస్ట్ గా ఉద్యోగం . అప్పుడు జిల్లాకు చెందిన బాగారెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షం నాయకుడు జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు ఒకరు బీర్ తాగిస్తే ఏమైనా రాస్తారు అంటూ జర్నలిస్ట్ ను ఏదో తిట్టాడు . జిల్లా జర్నలిస్ట్ లకు చెప్పడంతో అంతా సమావేశం అయి ఆ నాయకుడిని మీడియాలో బహిష్కరించాలి అని నిర్ణయించారు . అటు నుంచి హైదరాబాద్ వచ్చి బాగారెడ్డిని కలిసి కాంగ్రెస్ నాయకుడిపై ఫిర్యాదు . అప్పుడు నాయకులు ఏ మీడియా వారిని తిట్టినా అందరూ కలిసి బహిష్కరించేవాళ్ళు . బహిష్కరణ అంటే ఏ మీడియా కూడా ఆ నేత పేరు, అతని ప్రకటనలు ఉండవు . .93లో నల్లగొండలో పని చేసేప్పుడు నరసింహారావు అని జిల్లా కలెక్టర్ ఉండేవారు . ఈనాడు రిపోర్టర్ తో ఏదో వివాదం. అతని వార్తలు బహిష్కరించాలి అంటే ఎలా ? జిల్లాలో ప్రధాన వార్తలు కలెక్టర్ వే ఉంటాయి . కలెక్టెర్ వార్తలు రాయాలి కానీ , కలెక్టర్ పేరు రాయకూడదు అని నిర్ణయం . దాదాపు ఐదు ప్రధాన పత్రికల రిపోర్టర్ లు ముగ్గురు నలుగురు లోకల్ రిపోర్టర్ లు కాబట్టి నిర్ణయం అమలు ఈజీ . సాధారణంగా ఈనాడు రిపోర్టర్ లు యాజమాన్య నిర్ణయం మేరకు యూనియన్ కార్యకలాపాలకు దూరం , ఐతే ఇలాంటి దాడుల విషయంలో కలిసి వచ్చేవారు . ఓ వారం పాటు పట్టించుకోని కలెక్టర్ కు తరువాత తన పేరు లేకుండా తన వార్తలు రావడం చిరాకు వేసి అందరినీ పిలిచి ఏదో రాజీ పడ్డారు . డివిజన్ స్థాయి మొదలు కొని జిల్లా స్థాయి వరకు ఇలా బహిష్కరణలు ఆ రోజుల్లో కామన్ . ఓ సారి సదాశివపేట విలేకరులకు పొలిసు వారితో ఏదో వివాదం క్రైం వార్తలు బహిష్కరించాలి అని నిర్ణయం . సిఐ అత్యాచారం చేశాడు అనుకో ఆ వార్త రాయరా ? అని లోకల్ విలేకరులను అడిగితే ఏమీ చెప్పలేదు . ***** ఇప్పుడు బహిష్కరణలు మరింత ఉదృతంగా సాగుతున్నాయి . ఐతే జర్నలిస్ట్ లు అందరూ కలిసి నాయకుడిని బహిష్కరించడం కాదు . ఒక పార్టీ మీడియా మరో పార్టీ మీడియాను బహిష్కరిస్తోంది . ఆంధ్ర లో టీడీపీ వై యస్ ఆర్ పార్టీ మీడియాను బహిష్కరిస్తే , వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మీడియాను బహిష్కరించింది . మా మీటింగ్ కు మీరు రావద్దు అని చెప్పాము ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు . తెలంగాణ లో సైతం బి ఆర్ ఎస్ , బీజేపీ మీడియాలు పరస్పరం బహిష్కరించుకున్నాయి . మొదలుకొని దేశం వరకు ఇదే తీరు . తమిళనాడులో పార్టీ గుర్తు , ఆ పార్టీకి చెందిన ఛానల్ గుర్తు ఒకటే ఉంటుంది . మన రాష్ట్రం లో కొంత ముసుగు ఉండేది . పార్టీల ఆధ్వర్యంలో నడిచే మీడియా , పార్టీలకు మద్దతు ఇచ్చే మీడియాగా ఇప్పుడు రెండు మీడియాలు ఉన్నాయి . రెండు రాష్ట్రాల్లో చిన్న పార్టీ , పెద్ద పార్టీ అని కాదు అన్ని పార్టీలకు మీడియా ఉంది . శాసన సభలో ప్రాతినిధ్యం లేనికదా ? ఎందుకు వచ్చారు అని బహిరంగంగానే అడుగుతున్నారు . గతంలో ఆ రెండు పత్రికలు టీడీపీకి అనుకూలం , మాకు వ్యతిరేకం అంటూ వై యస్ ఆర్ బహిరంగంగానే అనేవారు కానీ బహిష్కరిద్దాం అంటే లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక , అప్పటికి సొంత పత్రిక సాక్షి లేదు .. ఇప్పుడు ఏ పార్టీ పత్రిక ఆ పార్టీకి ఉండడం తో ఈజీ అయింది . . మీడియా రాజకీయ అనుబంధాలు కొత్తేమి కాదు కానీ ఇప్పుడు చిన్న నూలుపోగు కూడా అడ్డం లేకుండా మీడియా ఇప్పుడు నగ్న నృత్యం చేస్తోంది . 82లో టీడీపీ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ప్రచారం వరకు బాధ్యతను ఈనాడు తన భుజాలపై వేసుకోంది . 82 నాటి టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టో ఎం వి మైసూరారెడ్డి ఇంట్లో ఓ సారి చూశాను . ఈనాడు కార్యాలయంలో ముద్రించినట్టు మ్యానిఫెస్టో లోనే ఉంటుంది . టీడీపీ అనుకూల వార్తలు రాయడమే కాదు పెద్ద పెద్ద శీర్షికలతో ఈనాడులో టీడీపీకి ఓటు వేయండి , కాంగ్రెస్ ను ఓడించండి అని నినాదాలు ముద్రించేవారు . ఈ రోజులలో పార్టీ పత్రికలు కూడా అలా నినాదాలు ముద్రించవు .. ఐతే ఆ రోజుల్లో ఉన్న రాజకీయ వాతావరణంలో అది తప్పు అనిపించలేదు . ఈ తరం వారికి నమ్మశక్యం కాకపోవచ్చు ఇప్పుడు టీడీపీ కోసం ప్రాణాలు ఇచ్చే జ్యోతి ఆ రోజుల్లో కాంగ్రెస్ వైపు ఉండేది . ఆ పత్రిక యజమాని కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యులు . క్రమంగా మెజారిటీ మీడియా టీడీపీకి మద్దతుగా నిలవడం తమ సామాజిక బాధ్యతగా భావించింది . 95 లో ఎన్టీఆర్ ను దించే నాటికి అంతంత మాత్రంగానే సర్క్యులేషన్ ఉన్న ఆంధ్రభూమి మినహా మెజారిటీ మీడియా బాబు కోసం , బాబు టీడీపీ కోసం అలుపెరుగని శ్రమ దానం చేసింది . ఎన్టీఆర్ లాంటి జనాకర్షణ గల నాయకుడు సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు . మీడియా తనను కుట్రతో దించేసింది అని .. ఈనాడు సంగతి తెలుస్తాను అని శ్రీశైలం లో మీడియాతో చెప్పిన వార్త ఈనాడులో చిన్నగా వచ్చింది . ఆలా చెప్పిన వారానికి ఎన్టీఆర్ మరణించారు . మీడియా మొత్తం టీడీపీ వైపు నిలవడం 95 నాటికి పీక్ స్టేజికి వెళితే .. ఆ తరువాత క్రమంగా రోజులు మారాయి .******** అన్ని పార్టీలకు సొంత మీడియా ఉంది . పార్టీలకే కాదు వ్యక్తులకూ ఉంది . ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు ఈనాడులో కనిపించవద్దు అని పేపర్ బాస్ హుకుం జారీ చేస్తే ఎంపీ యున్న ఎన్నికల్లో పోటీ చేసేవారి గురించి రాసేప్పుడు ఉండవల్లిని మినహాయించారు . యూ ట్యూబ్ ఛానల్స్ వచ్చాక ఉండవల్లి సెలబ్రిటీ అయిపోయారు . ఈనాడులో పేరు కనిపించడం లేదు అని ఒకనాడు తపించిన ఆయన మాట్లాడితే యూ ట్యూబ్ లో లక్షల్లో చూస్తారు . ***** చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ తరువాత తెలుగు మీడియా కనీసం నూలుపోగు కూడా అడ్డం లేకుండా నగ్న నృత్యం చేస్తోంది . కొన్ని ఛానల్స్ , పత్రిక లు మొత్తం బట్టలు విప్పుకోలేదు కానీ .. కొన్ని ఛానల్స్ పత్రికలు జనం నవ్వుకుంటారు అని కూడా ఆలోచించకుండా నగ్న నృత్యాలు చేస్తున్నాయి . రాజమండ్రి జైలులో బాబుపై దోమలతో బయో వెపన్ ఉపయోగిస్తున్నారు , దోమలతో కుట్టించి చంపాలని చూస్తున్నారు అని మహా టివి చివరకు సీరియస్ వ్యవహారాన్ని నవ్వులాటగా మార్చేట్టు ఉన్నాయి . టివి 5 ఆవేశంతో పోతారేమో అన్నట్టుగా ఊగిపోతోంది . మేడం భువనేశ్వరీ నడుం బిగించండి అని అని టివి 5 పిలుపు ఇచ్చింది . మహా టివి , టివి 5, abn బాధ వర్ణనాతీతం . వీరికి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ఆంధ్ర లో రాష్ట్రపతి పాలన పెడుతున్నారు , అమిత్ షా తో అధికారుల తాట తీయిస్తున్నారు . సందట్లో సడేమియా అని మహా టివి ఏకంగా బాబుకు మద్దతుగా వంద దేశాల్లో ఉద్యమాలు చేయిస్తోంది . మా బాబు బంగారం అని టీడీపీ మీడియా 24 గంటలు కోడై కుస్తుంటే , బాబు దుర్మార్గుడు అని సాక్షి తీర్పులు ఇస్తోంది . శుక్రవారం ఆంధ్ర లో జరిగిన మీటింగ్ లో టీడీపీ పత్రికల పై జగన్ వ్యంగ్యోక్తులు విసిరారు . నిజానికి బాబు అరెస్ట్ ఎపిసోడ్ లో అన్ని ఛానల్స్ కన్నా మహా టివి ఎక్కువ వినోదాన్ని పంచుతోంది .ఐతే అన్ని ఛానల్స్ ను ప్రత్యేకంగా ప్రస్తావించిన జగన్ మహాటీవీ పేరు ఎత్తలేదు . పార్టీలు ఒకరినొకరు పొడుచుకొంటారేమో అనిపించేట్టుగా ఉంది . ప్రత్యర్థి పార్టీల మీడియాను పరస్పరం బహిష్కరించుకుంటున్నా .. తిట్టుకుంటున్నా .. క్షేత్ర స్థాయిలో పని చేసే జర్నలిస్ట్ ల మధ్య అంత కక్షలు , పగలు ఏమీ లేవు . హాయిగా పని చేసుకుంటున్నారు . ఎందుకంటే యాజమాన్యాలు , యాజమాన్యాల పార్టీల రాజకీయాలు వారికి బాగా తెలుసు .. - బుద్దా మురళి

26, సెప్టెంబర్ 2023, మంగళవారం

శవం మీద టీడీపీ జెండా కప్పమని ప్రజారాజ్యం లోకి జంప్ .... మన్మోహన్ ను గెలిపించిన ...నేతల మాటల మర్మం చెప్పిన ఓషో జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 96

శవం మీద టీడీపీ జెండా కప్పమని ప్రజారాజ్యం లోకి జంప్ .... మన్మోహన్ ను గెలిపించిన ...నేతల మాటల మర్మం చెప్పిన ఓషో జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 96 --------------------------------------------- జర్నలిస్ట్ లు అవకాశం ఉన్నంత వరకు చదవాలి . 87 నుంచి 94 వరకు జిల్లాల్లో పని చేసేప్పుడు చాలా మంది జర్నలిస్ట్ లు జిల్లా పేజీలు మాత్రమే చదివే వారు . ఆ తరువాత మనం రాసిన వార్త మనం చదివితే పేపర్ చదివినట్టే అనే దశకు చేరుకున్నాం . ఇప్పుడు ఆ దశ కూడా దాటి పోయి టివిలో న్యూస్ చూడడమే తప్ప చదవడం అనే అలవాటు తగ్గిపోయింది . నాయకుల మాటల్లో మర్మం అర్థం చేసుకోవడానికి ఓషో రచనలు నాకు ఎంతగానో ఉపయోగ పడ్డాయి . మాట్లాడే మాటల అర్థాలు వేరు కావచ్చు , కానీ వాటి వెనుక మతలబు వేరుగా ఉంటుంది .. ఆ మతలబును అర్థం చేసుకోవడంలో ఓషో రచనలు ఉపయోగపడ్డాయి . ******** చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన కొత్తలో ఎన్టీఆర్ భవన్ లో అప్పటి టీడీపీ నాయకుడు తమ్మినేని సీతారాం విలేకరుల సమావేశం . సమావేశానికి ముందు , సమావేశం తరువాత నాయకులు మీడియాతో ఇష్టాగోష్టిగా మనసులో మాట మాట్లాడుతుంటారు . విలేకరుల సమావేశాల్లో పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినా అసలు విషయాలు ఇష్టాగోష్ఠిలోనే పంచుకుంటారు . చిరంజీవి పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది ? అని సీతారాం విలేకరుల అభిప్రాయం అడిగారు . ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు . అంతంత మాత్రమే ప్రభావం ఉంటుంది .. నమ మాత్రంగానే సీట్లు గెలుస్తారు అని విలేఖరులు తమ అభిప్రాయం చెప్పారు . లేదు మీరు చూస్తూ ఉండండి ప్రజారాజ్యం ప్రభావం చాలా ఉంటుంది . బాగానే గెలుస్తారు అని తమ్మినేని చెప్పుకొచ్చారు . విలేకరుల సమావేశం టైం కాగానే అదే తమ్మినేని స్టేజి మీదకు వెళ్లి వీరావేశంతో ప్రజారాజ్యంను , చిరంజీవిని తీవ్రంగా విమర్శించారు . తమ్మినేని మాట తీరు ఏకపాత్రాభినయం లా గంభీరంగా ఉంటుంది . ఆవేశం తెచ్చిపెట్టుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపించి .. అకారణంగా అంత ఆవేశంగా ప్రజారాజ్యంను తిడుతున్నారు అంటే చూస్తుంటే మీరు కూడా ప్రజారాజ్యం లోకి వెళుతున్నట్టు ఉంది అన్నాను . తమ్మినేని అంతే ఆవేశంగా ఏంటీ నేనా ? ప్రజారాజ్యం లోకి వెళ్లడమా ? చివరి వరకు టీడీపీలోనే ఉంటాను , నా శవం మీద టీడీపీ జెండా కప్పాలి అంటూ ఆవేశంగా చెప్పారు . విలేకరుల సమావేశం ముగిసిన తరువాత ఆయన్ని మళ్ళీ పార్టీలో చూడలేదు . ఎందుకంటే అటుబుక్నుం లో చి ఆటే వెళ్లి ప్రజారాజ్యం లో చేరారు . తమ్మినేని అంత ఆవేశంగా ప్రజారాజ్యంను విమర్శిస్తుంటే .. మీరు ప్రజారాజ్యంలోకి వెళ్లేట్టు ఉన్నారు అని ప్రశ్నించడం ఒక రకంగా చూస్తే అర్థం లేని ప్రశ్న అవుతుంది . కానీ ఓషో పుణ్యమా అని అలా ప్రశ్నించాను . నువ్వు ఏదైతే కాదో అది అని చెప్పడానికి ప్రయత్నిస్తావు అని ఓషో అంటాడు . మనసులో ఉన్నది ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది అంటాడు ... నాయకుడైన , మాములు వారైనా విలువల గురించి ఎక్కువగా మాట్లాడితే ఓషో చెప్పిన మాట ప్రకారం అతన్ని ఎక్కువగా అనుమానించడం నాకు అలవాటు . కొల్లి ఇంటిపేరుతో ఓ జర్నలిస్ట్ మిత్రుడు ఉండేవాడు . తెలంగాణ పార్టీని తీవ్రంగా విమర్శిస్తూ , అంతే ఘాడంగా టీడీపీని అభిమానించేవాడు . రాజకీయ పక్షాల్లో విలువలు ముఖ్యం అంటూ ఫేస్ బుక్ లో తెగరాసేవాడు . ఇప్పుడు ఎక్కడ ఉన్నడో తెలియదు కానీ .... తెలంగాణ ప్రభుత్వం గొర్రెలు , బర్రెలు ఇప్పించే పథకం లో కొంతమంది తో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడితే అరెస్ట్ చేశారు . తరువాత ఏమైందో తెలియదు . ************* మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అణుఒప్పందం పై వామపక్షాలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చాయి . ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెట్టారు . కోట్ల రూపాయలు ఇచ్చి టీడీపీ ఎంపిలను కొనే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మీడియాలో వార్తలు . ఓ రోజు ఎన్టీఆర్ భవన్ లో ఓ ఎంపీని పలకరిస్తే కోట్ల రూపాయలు ఆఫర్ ఇస్తున్నారని మీరు వార్తలు రాయడమే కానీ ఒక్కరు కూడా సంప్రదించలేదు అని నవ్వుతూ అనాన్రు . టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ , టీడీపీ శాసన సభా పక్షం కార్యాలయం ఇంటి వ్యవహారం లా ఉండేది . వాళ్ళు వాళ్ళే కుటుంబ సభ్యుల్లా మాట్లాడుకుంటారు . అదే కాంగ్రెస్ శాసన సభా పక్షం కార్యాలయం నానా జాతి సమితిలా ఉంటుంది . అన్ని పార్టీల నాయకులు , రిపోర్టర్ లు అక్కడికి చేరుకునే వారు . అన్ని పార్టీల వ్యవహారాలు అక్కడ చర్చకు వచ్చేవి . పెళ్లి చేయుకుంటావా ? తాతా అంటే ఈ వయసులో పిల్లను ఎవడిస్తాడు అంటదు తాత . అంటే ఇస్తే చేసుకోవడానికి రెడీ అన్నమాట . మనసులో ఉన్నది ఇలా ఎలానో బయటకు వస్తుంది . ఓషో చెప్పిన దాని ప్రకారం .. ఇప్పటి వరకు ఒక్కరూ డబ్బులు ఇస్తామని ఆఫర్ చేయలేదు అంటే ఆ ఎంపీ డబ్బులకు సిద్ధం అన్నమాట అని నా అభిప్రాయం నేను చెప్పాను .. తరువాత ఏం జరిగిందో , ఎవరు ఏం చేశారో , ఎంత ఇచ్చారో తెలియదు కానీ . టీడీపీ ఓట్లు రెండు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి అనుకూలంగా పడ్డాయి . ప్రభుత్వం నిలబడింది . ఎంపిలను కొనడం అనైతికం కానీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ దేశానికి చేసిన మేలు అంతా ఇంతా కాదు .ఆ ను ఒప్పందం వల్ల దేశం ఈ రోజు శక్తి వంతంగా తయారు అయింది .. ధైర్యంగా నిలబడింది... - బుద్దా మురళి

25, సెప్టెంబర్ 2023, సోమవారం

ప్రతి ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది ... లక్ష కోట్లు .. ఐటీని కనిపెట్టడం .. మడమ తిప్పక పోవడం .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -95

ప్రతి ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది ... లక్ష కోట్లు .. ఐటీని కనిపెట్టడం .. మడమ తిప్పక పోవడం .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -95 ------------------------------------- 2004 లో టీడీపీ ఓడిపోయి వైయస్ ఆర్ ముఖ్యమంత్రి అయిన మూడు నాలుగు నెలలకే వేలకోట్ల అవినీతి అంటూ టీడీపీ ప్రచారం చేసేది . వారి ప్రచారాన్ని ముందు వారు నమ్మి ఇతరులను నమ్మిస్తారు . ఈ విధానం టీడీపీలో చాలా బాగుంటుంది . ఓ రోజు తెలుగుదేశం శాసన సభా పక్షం కార్యాలయంలో ఉన్నప్పుడు టీడీపీ శాసన సభ్యులు దేవినేని ఉమ హరిశ్చంద్రుడు అబద్దం చెప్పడు అనే ముఖకవళికలతో బోలెడు బాధపడుతూ .. విచ్చల విడిగా సంపాదిస్తున్నారు , ఇంత డబ్బు ఏం చేసుకుంటారో అని అమాయకత్వం కనిపించేలా ప్రశ్నించారు . నేనూ అంతే సీరియస్ గా విన్నట్టు ముఖం పెట్టి .. వాళ్ళు అధికారం లోకి వచ్చి ఏడాది కావస్తుంది కదా ? ఈ ఏడాదిలో వాళ్ళు ఎంత సంపాదించారో ఈజీగా లెక్క కట్టవచ్చు అన్నాను . ఎంత సంపాదించారు ? ఎలా చెప్పవచ్చు అని ఆసక్తిగా అడిగారు . మూడో తరగతి వాడు కూడా చెబుతాడు ఇదో పెద్ద లెక్క నా ? అని మీ పార్టీ తొమ్మిదేళ్లు అధికారంలో ఉంది కదా ? తొమ్మిదేళ్లలో ఎంత సంపాదించారో దాన్ని తొమ్మిది తో భాగించండి .. ఒక్క సంవత్సరంలో ఎంతో వస్తుంది .. ఒక్క సంవత్సరంలో మీరు సంపాదించింది ఎంత మొత్తమో , ఈ ఏడాది లో కాంగ్రెస్ సంపాదించింది అంతే .. ఈజీ అన్నాను . ముఖం చూస్తే అమాయకంగానే ఉంది . లెక్క తప్పేమీ కాదు . ఏమీ బదులివ్వకుండా అలానే ఉండి పోయారు దేవినేని ... **** వేల కోట్ల నుంచి ఈ అంకె క్రమంగా లక్ష కోట్లకు చేరింది . రాజకీయాల్లో అవినీతి ఉండదు అంటే ఎవరూ నమ్మరు . పాత సినిమాల్లో హీరో పగటి పూట చిన్న ఉద్యోగం , మూటలు మోస్తూ , రిక్షా తొక్కుతూ , రాత్రి టాక్సీ నడుపుతూ , చివరకు సైకిల్ తొక్కే పోటీలో పాల్గొని ఇంటికి డబ్బు తీసుకొచ్చినట్టు నాయకులు కాయా కష్టం చేసి , ముఖానికి మాస్క్ ధరించి రిక్షా తొక్కినా డబ్బుతో పార్టీలు నడపరు , రాజకీయ పార్టీ అన్నాక వ్యవహారాలు ఉంటాయి . ఐతే కొందరు తాము శ్రీ రామ చంద్రునికి లేటెస్ట్ వెర్షన్ కానీ, మా ప్రత్యర్ధులు మాత్రం మనుషులను తినే రాబందులు అన్నట్టు ప్రచారం చేస్తుంటారు . రౌండ్ ఫిగర్ అని మొదటి పది వేల కోట్లు , తరువాత 40 వేల కోట్లకు పెంచి చివరకు అంకె ఆకర్షణీయంగా ఉంటుంది అని లక్ష కోట్లకు చేర్చినట్టు ఎం వి మైసూరారెడ్డి ఓ సారి బహిరంగంగానే ప్రకటించారు . కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేర్చుకొని వారికి రాజ్యసభ సభ్యత్వం కల్పించారు . చివరకు టీడీపీ మీడియా సూపర్ మాన్ గా క్రియేట్ చేసిన జెడి లక్ష్మీనారాయణ ఆ లక్ష కోట్ల అంకె ఎలా వచ్చిందో తెలియదు అని, చార్జిషీట్ లో సుమారు 15వందల కోట్ల వరకు అవినీతి వివరాలు ఉన్నాయని స ఓ ఇంటర్వ్యూలో చెప్పారు . లక్ష కోట్లు అంటే ఎన్ని లారీల్లో డబ్బు తీసుకువెళ్ళవచ్చో లోకేష్ చెప్పారని చంద్రబాబు మురిసిపోయారు . ఇలా వినూత్నంగా చెప్పాలి అని పార్టీ నాయకులకు సూచించారు . ఐనా లక్ష కోట్ల ప్రచారం ఆశించిన స్థాయిలో పని చేయలేదు . చివరకు లక్ష కోట్లు అనేది ఒక జోక్ గా మారిపోయింది . దీనిని ప్రజలు ఎందుకు పట్టించుకోలేదో అర్థం కావడం లేదు అని ఈ మధ్య బాబు కూడా మీడియా ముందు బాధపడ్డారు . ***** లక్ష కోట్లు ఇడుపుల పాయలో నేలమాళిగల్లో దాచిపెట్టారు అని ఉమ్మడి రాష్ట్రంలో దేవినేని పదే పదే ఆరోపించేవారు . ఉమ్మడి రాష్ట్రంలో 2009 ప్రాంతంలో అసెంబ్లీ లాబీ లో లక్షకోట్లపై చర్చ జరుగుతుంటే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం వివేకానందరెడ్డి ఆసక్తికరమైన విషయం చెప్పారు . అప్పుడు ఆయన టీడీపీలోకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు . లక్ష కోట్ల అవినీతి నిజం కాదు కానీ టీడీపీ ప్రచారం చేయడం తెలివైన నిర్ణయం అన్నారు . లక్ష కోట్లు అంటే మీరూ నేనూ నమ్మక పోవచ్చు . మన నమ్మకాలు టీడీపీకి అనవసరం . టీడీపీ ప్రచారం చేసేది జగన్ వర్గం నమ్మాలి అని కాదు .. టీడీపీ వర్గం నమ్మాలి అని . వాళ్ళు నమ్ముతారు టీడీపీ కి అది చాలు . తండ్రి పేరు చెప్పుకొని జగన్ వెళుతుంటే టీడీపీ ఏం చేయాలి మౌనంగా ఉండాలా ? తమ వర్గం కోసం అయినా లక్ష కోట్లు అని ప్రచారం చేయాల్సిందే అంటూ ప్రచారంలో మర్మాన్ని వివరించారు . . ఏ విషయం అయినా కావచ్చు నమ్మని వారు ఉంటారు , అదే విధంగా నమ్మేవారు ఉంటారు . ప్రచారం చేసేది నమ్మేవారి కోసమే కానీ నమ్మనివారి కోసం కాదు. టీడీపీ చేస్తున్న ఈ ప్రచారాన్ని టీడీపీ వర్గం అయితే నమ్ముతూయింది కదా అది చాలు అని ఆనం వివేకానందరెడ్డి కళ్ళు తెరిపించారు . ఒక్క టీడీపీ అని కాదు అన్ని పార్టీల ప్రచారానికి ఇది వర్తిస్తుంది . ఐటీ ని బాబే కనిపెట్టారు , సెల్ ఫోన్ బాబే తెచ్చారు అనే ప్రచారంలో మర్మం ఇదే తమ వర్గం నమ్మితే చాలు . మడమ తిప్పడు మాట తప్పఁడు అని చెప్పినా , రాజన్న రాజ్యం అని ప్రచారం చేసినా ప్రజలంతా నమ్ముతారని కాదు . అది నమ్మే వర్గం కొంత ఉంటుంది అది చాలు ... రాజకీయాల్లో పని చేసేది ఈ నమ్మకాలే ..... - బుద్దా మురళి

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

ఎడిటర్ తో ఒక రోజు .... బీడీ కట్ట కోసం ఇతరులపై ఆధారపడే వాళ్ళు కూడా కెసిఆర్ ను తామే నడిపించామంటారు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -94

ఎడిటర్ తో ఒక రోజు .... బీడీ కట్ట కోసం ఇతరులపై ఆధారపడే వాళ్ళు కూడా కెసిఆర్ ను తామే నడిపించామంటారు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -94 ---------------------------------- ఈ మధ్య యూ ట్యూబ్ లో కొన్ని వీడియోలు చూస్తుంటే బీడీ కట్ట కోసం , ప్లేట్ ఇడ్లీ కోసం ఎవరో ఒక్కరిపై ఆధారపడే వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది కెసిఆర్ కాదు మేమే ... మేం లేక పోతే కెసిఆర్ ఎక్కడ అంటూ బోలెడు మాట్లాడుతున్నారు . ఆ వీడియోలు చూస్తుంటే అలాంటి దృశ్యాన్ని మరికొందరు జర్నలిస్ట్ మిత్రులతో కలిసి నేరుగా చూసిన సంఘటన గుర్తుకు వచ్చింది . ************* 2014 లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాత సచివాలయానికి రోజూ వచ్చే వారు . భూమి ఎడిటర్ శాస్త్రి ఇంట్లో పెళ్లి కి పిలవడానికి ఎడిటర్ , జర్నలిస్ట్ మిత్రుడు వెల్జాల చంద్రశేఖర్ , మరో ఇద్దరితో కలిసి వెళ్లాం . దాదాపు మూడు గంటలు వేచి చూసినా పిలుపు రాలేదు . గతంలో ఛానల్స్ నాయకుడితో ఒక రోజు , నటులతో ఒక రోజు అని ఎన్నికల సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు చూపే వారు . యూ ట్యూబ్ ఛానల్స్ పెరిగాక వీధి రౌడీతో ఒక రోజు అని డబ్బులిస్తే చేసే కార్యక్రమాలు కూడా వస్తున్నాయి అవి వేరు . ఓనర్ తో , ఎడిటర్ తో ఒక రోజు అనే కార్యక్రమం రిపోర్టర్ లకు అగ్ని పరీక్ష లాంటిదే . తేడా వస్తే ఉద్యోగాలకే ప్రమాదం . టంకశాల అశోక్ ఎడిటర్ గా జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రధాన అంశాలు , వేటిపైన వార్తలు రాయవచ్చునో రిపోర్టర్ లతో మాట్లాడేవారు . అలానే ఆంధ్రప్రభలో గతంలో ఓ ఎడిటర్ ఆంధ్ర ప్రాంతంలో పర్యటించి రిపోర్టర్ ని ఓ గుడి పూజారి పేరు అడిగితే చెప్పలేదు , ఎడిటర్ గుడికి వెళితే పూర్ణ కుంభ స్వాగతం పలక క పోవడం తో నువ్వేం రిపోర్టరువు అని చెడామడా తిట్టాడు . ఆ మీడియా ఈ మీడియా అని కాదు అన్ని చోట్ల బాస్ తో ఒక రోజు అంటే అది గండమే . ఎడిటర్ ఇంట్లో పెళ్లి , తెలంగాణ సీఎం ను పిలవడానికి కాబట్టి ఎడిటర్ తొలిసారిగా నన్ను వెంట తీసుకువెళ్లాడు . మూడు గంటలైనా లోనికి పిలుపు లేక పోవడంతో ఒక వైపు నేనూ , జర్నలిస్ట్ మిత్రుడు వెల్జాల చంద్రశేఖర్ బాధపడుతున్నట్టు నటిస్తూ , మరో వైపు సంతోష పడుతున్నాం . సంతోషానికి కారణం మా ఇద్దరికే తెలుసు . అక్కడి సిబ్బంది పరిచయం ఉండడం వల్ల కలిస్తే ప్రపంచ బ్యాంకు అధికారులు బయటకు రాగానే మీరు లోనికి దూసుకు వెళ్ళండి అని సలహా . అ లానే చేశాం . సీఎం కార్డు తీసుకోని నాకేమీ పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా మాములుగా అందరితో మాట్లాడి పంపించారు . ఎడిటర్ సమైక్య రాతలు, తెలంగాణ వ్యతిరేక రాతలు , తెలబాన్లు అని రాసిన చిల్లర మాటలు అన్నీ కెసిఆర్ చదివారు , గుర్తుంది . ఎడిటర్ మాత్రం అవి గుర్తు లేవేమో అనుకున్నారు . ********** హమ్మయ్య గండం గడిచింది . ఎడిటర్ తో ఒక రోజు ఎలాంటి ప్రమాదం లేకుండా గడిచింది అని బయటకు వచ్చాక ... రమణా చారి ఇక్కడే ఉన్నారుకదా ఫోన్ చెయ్ వెళదాం అని ఎడిటర్ అనగానే ఫోన్ చేసి బుద్దా మురళి అని చెప్పగానే అప్పుడు ఆంధ్రభూమి ఆదివారం లో వారం వారం రాస్తున్న ధనం - మూలం లో ఎక్కెడెక్కడి వారి గురించి భలే రాస్తున్నావు అని మాట్లాడుతుంటే .. నా పని ఐపోయింది అనుకున్నాను . ఎడిటర్ తో పాటు వెళ్లి రమణా చారి ఛాంబర్ లో కూర్చున్నాక ధనం - మూలం కాలం గురించే అలానే మాట్లాడారు . ప్రమాదం తప్పదు అని నిర్ణయించుకున్నాను . ******** ఉదయం నుంచి సాయంత్రం వరకు తినక పోవడం ఒకటి . సంతోషాన్ని పంచుకోవడం ఒకటి దారిలో సికింద్రాబద్ తాజ్ మహల్ హోటల్ లో తిన్నాం . సంతోషానికి కారణం ఏమంటే ఎడిటర్ తో సీఎంను కలిసినప్పుడు నాకూ , మిత్రుడు చంద్రశేఖర్ కు ఎక్కువ గౌరవం ఇచ్చి ఉంటే తెల్లారి నుంచి ఎడిటర్ పైరవీ పనులు , అయన రాసిన పుస్తకాలు అమ్మించే పనులు అప్పగిస్తారని భయపడ్డాం .. సీఎం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వక పోవడం , మూడు గంటలు వేచి ఉండాల్సి రావడం తో ఎడిటర్ మా పై ఆశలు వదులుకొని ఆంధ్ర పై దృష్టి సారించాడు . **** సికింద్రాబాద్ తాజ్ మహల్ హోటల్ కు మరో ఇద్దరు జర్నలిస్టులతో కలిసి వచ్చే సరికి హోటల్ కౌంటర్ దగ్గర ఓ వ్యక్తి హోటల్ యజమానితో కెసిఆర్ ను నడిపించేది నేను , ఇప్పుడు ఇక్కడికి పిలిపించ మంటావా ?అని ఏదో మాట్లాడుతున్నాడు . ఇప్పుడు రెన్నొవేషన్ చేశారు . అంతకు ముందు సికింద్రాబాద్ పాత తరానికి చెందిన వారు అక్కడ కబుర్లు చెప్పుకొంటూ ఉండేవారు . బీడీ కట్టలకు కూడా ఇతరులపై ఆధారపడే వ్యక్తిలా ఉన్నాడు . మహా ఐతే హోటల్ యజమాని అతనికి ఓ ప్లేట్ ఇడ్లీ ఉచితంగా ఇస్తాడేమో , తెలంగాణ ఉద్యమాన్ని తానే నడిపినట్టు , కెసిఆర్ ను తానే నడుపుతున్నట్టు తెగ కబుర్లు చెబుతున్నాడు . ఎడిటర్ తో కలిసి వెళ్లి మూడు గంటలు నిలబడి కష్టంగా కలిసిన మేం ఆ మాటలు వింటూ నవ్వుకున్నాం . అప్పుడు ఎవరైనా యూ ట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటే అతన్ని ఇంటర్వ్యూ తీసుకునేవాళ్ళు . ఇప్పుడు ఇలాంటి వారి ఇంటర్వ్యూలు యూ ట్యూబ్ లో చాలా కనిపిస్తున్నాయి . ***** ఆ రోజు ప్రమాదం ఏమీ ముంచుకురాలేదు . మూడు నాలుగు రోజులు గడిచిన తరువాత ఎడిటర్ పిలిచి ధనం - మూలం కాలం చాలా రోజుల నుంచి రాస్తున్నావు కదా ? ఇక చాలు ఆపేయ్ అన్నారు . ఈ సంగతి నేను ఆ రోజే అనుకున్నాను అని మనసులోనే చెప్పుకున్నాను . అబ్దుల్ అని సినిమా రిపోర్టర్ సినిమా సమీక్షకు నంది అవార్డు వచ్చింది . జాగ్రత్త అని ముందే చెప్పాను . ఉత్సాహంగా ఎడిటర్ కు యెగిరి గంతేసి చెప్పాడు . ఆ మరుసటి రోజు నుంచి సినిమా రిపోర్టింగ్ నుంచి తొలగించి ఆదిలాబాద్ మఫిసిల్ డెస్క్ లో చేయమని చెప్పారు అట్లుంటుంది ఎడిటర్స్ తో ... - బుద్దామురళి .

15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

ఆ... రాజకీయం అంతు చిక్కని అద్భుతం ... ఎన్టీఆర్ ను లక్ష్మీ పార్వతిని ఒక్క మాట అనలేదు . అంతా మనోగతమే .... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 93

ఆ... రాజకీయం అంతు చిక్కని అద్భుతం ... ఎన్టీఆర్ ను లక్ష్మీ పార్వతిని ఒక్క మాట అనలేదు . అంతా మనోగతమే జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 93 --------------------------------------- సార్ ఇప్పుడు అంతా అయిపొయింది కదా ? కనీసం ఇప్పుడన్నా చెప్పండి ఎన్టీఆర్ ను అధికారం నుంచి ఎందుకు దించేశారు చెప్పండి అని మీడియా సమావేశంలో బాబును అడిగితే , నన్ను ప్రశ్నార్ధకంగా చూసి మీ అందరికీ తెలుసు కదా ? అని సమాధానం చెప్పారు .ఇది 95 సెప్టెంబర్ లో జరిగింది . ఎన్టీఆర్ ను ఎందుకు దించేశారో బాబు చెబితే వినాలి అని ఉన్న నా కోరిక తీరలేదు . ఆ మధ్య ఆహా ఛానల్ లో బాలకృష్ణ ప్రోగ్రాం లో ఎన్టీఆర్ దించే అంశం లో ఆ రోజు మనం చేసింది కరక్టే కదా ? అని బాలకృష్ణతో ఒప్పించారు కానీ ఎన్టీఆర్ ను దించి 28 సంవత్సరాలు గడిచిపోయినా ఈ రోజుకు కూడా ఎన్టీఆర్ ఏం తప్పు చేశారు , ఎందుకు దించారు అనేది బాబు నేరుగా చెప్పలేదు . ఇక లక్ష్మీ పార్వతి ఎర్ర బస్సు ఎక్కి పోవలసిందే అని దగ్గుబాటి వెంకటేశ్వర రావు మీడియా ముందు విమర్శించారు కానీ .. బాబు కాదు . లక్ష్మి పార్వతికి దుష్ట శక్తి అని హరికృష్ణ పేరు పెడితే, సినిమా నటుడు రజనీకాంత్ పాపులర్ చేశారు . దగ్గుబాటి ఉప ముఖ్యమంత్రి అని ఈనాడులో బ్యానర్ వార్త వచ్చింది కానీ . చంద్రబాబు మీడియాలో ఎప్పుడూ ఆ మాట చెప్పలేదు . లక్ష్మీ పార్వతి భుజం మీద తుపాకి పెట్టి ఎన్టీఆర్ ను పేల్చేసిన వ్యూహం బాబుది కానీ.. ఆ దంపతులను బాబు ఒక్క మాట అనలేదు . జామాతా దశమ గ్రహం అంటూ ఎన్టీఆర్ అల్లుడిని అనరాని మాటలు అంటూ క్యాసెట్ లు తయారు చేసి జనం మీదకు వదిలారు కానీ బాబు ఎన్టీఆర్ ను ఒక్క మాట అనలేదు . ******* చంద్రబాబు రాజకీయం అంటే అది ....ఎన్టీఆర్ ను దించేసి మూడు దశాబ్దాలు అవుతున్నా ఒక్క మాట అనకుండా దించేయడం ఎలా సాధ్యం అని ఆశ్చర్యం కలుగుతుంది . కానీ ఇది నిజం .. నమ్మకం లేకుంటే పాత పత్రికలు వెతికి చూడండి . జర్నలిస్ట్ లు కావచ్చు , జర్నలిజం విద్యార్థులు కావచ్చు , పరిశోధకులు కావచ్చు ఎన్టీఆర్ ను ఎందుకు దించేస్తున్నామని చంద్రబాబు ఎక్కడైనా చెప్పారా ? గ్రంథాలయాల్లో కాస్త శ్రమిస్తే పాత పత్రికలు దొరుకుతాయి . 95 నాటి పత్రికలు పరిశోధించండి చాలా మటుకు ప్రభుత్వ గ్రంధాలయంలో 95 నాటి పత్రికలను 95-96 లోనే మాయం చేశారు . వేట పాలెం లాంటి గ్రంధాలయంలో ఉన్నాయి . ***** ఆగస్టు సంక్షోభం అంటూ పుంఖాను పుంఖాలుగా వార్తలు కనిపిస్తాయి . ఎన్టీఆర్ ను ఎందుకు అధికారం నుంచి దించేస్తున్నారు , ఎందుకు దించేయాలి , దించేయడం వల్ల రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుంది అని బోలెడు వార్తలు , వ్యాసాలు , వ్యాఖ్యానాలు , సంపాదకీయాలు కనిపిస్తాయి కానీ ఒక్క చోట కూడా నేరుగా చంద్రబాబు చెప్పినట్టు వార్త ఉండదు . చంద్రబాబు మనోగతం , చంద్రబాబు భావిస్తున్నారు అనే వార్తలు కనిపిస్తాయి కానీ ఒక్క చోట కూడా నేరుగా బాబు మాట్లాడినట్టు ఉండదు . ఎన్టీఆర్ సామాన్య నాయకుడు కాదు , వెన్నుపోటుకు గురికాక పోతే దేవే గౌడ స్థానంలో ప్రధాన మంత్రి స్థానంలో ఉండే అవకాశం ఉన్న వారు . కాంగ్రెస్ కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా పార్టీని గెలిపించిన నాయకుడు . అలాంటి నాయకుడిని గద్దె దించినప్పుడు , అలా దించడానికి నాయకత్వం వహించిన వారు ఎందుకు దించుతున్నామో చెప్పినట్టు మీడియాలో లేదు అంటే ఆశ్చర్యమే . బాబు మనోగతం తప్ప నేరుగా బాబు దించేయడానికి కారణం ఏమిటో ఆ రోజు చెప్పలేదు . ఈ రోజుకు చెప్పలేదు . భారత రాజకీయాల్లో , మీడియా చరిత్రలో ఇదో అద్భుతం . అద్భుతాలు జరగడానికి కాలం అనేది కీలక పాత్ర వహిస్తుంది . ఆనాటి మీడియా దాదాపు 90 శాతానికి పైగా ఈ కుట్రలో భాగస్వామ్యం . మీడియా మొత్తం అటు ఉన్నప్పుడు ఇది సాధ్యం అయింది . ఆ తరువాత ఎలక్ట్రానిక్ మీడియా రావడం , పత్రికల సంఖ్య పెరగడం , అన్ని పార్టీలకు మీడియా రావడం , తరువాత సామాజిక మాధ్యమాలు వచ్చి ప్రతి మనిషి ఒక మీడియా కావడం వల్ల పరిస్థితులు మారాయి . 90 శాతం మీడియా చెప్పు చేతుల్లో ఉండడం వల్ల ఒక్క మాటకూడా ఓపెన్ గా మాట్లాడకుండా ఎన్టీఆర్ నుం దించడం వంటి కార్యం సాధించగలిగారు . ***** బాబు జైలుకు వెళ్లడం తో పవన్ దూసుకెళ్తున్నారు అని కొందరు .. ఇది పవన్ కు లాభమా ? బాబుకా ? అని లెక్కలు వేస్తున్నారు . అలా లెక్కలు వేస్తున్నారు అంటే చంద్రబాబు రాజకీయం పై అవగాహన లేనట్టే ... విశ్వ విఖ్యాత నటసార్వ భౌమను దించేసిన వారికి పవన్ ఓ లెక్కనా ? బిర్యానీ ఆరగించుకున్న వారికి బఠాణీ నమిలినంత ఈజీ . కూటమి అధికారం లోకి వస్తే చేరి రెండున్నరేళ్లు సీఎం అని , ముందు బాబు అని కాదు పవన్ అని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు తప్ప బాబు ఓపెన్ గా నోరు విప్పలేదు ... అచ్చం దగ్గుబాటి ఉప ముఖ్యమంత్రి వార్తలనే ఇదీనూ ... పవన్ కళ్యాణ్ పాత వీడియో ఒకటి - మీరు వెన్నుపోటు పొడిస్తే పొడిపించుకోవడానికి సిద్ధంగా లేము అని పవన్ వార్నింగ్ ఇస్తున్నారు . పవన్ కు తెలియంది .. పవన్ సిద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు . అసలు తెలియకుండా పోటు పొడిచేంత రాజకీయ సామర్ధ్యం బాబుకు ఉంది . - బుద్దా మురళి

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

మాక్ అసెంబ్లీలోనూ మనచేతిలోనే అధికారం ... బాబుకు బాబే ప్రత్యామ్నాయం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -92

మాక్ అసెంబ్లీలోనూ మనచేతిలోనే అధికారం బాబుకు బాబే ప్రత్యామ్నాయం జర్నలిస్ట్ జ్ఞాపకాలు -92 ------------------------------ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి . సభలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు అని టీడీపీ శాసన సభ్యులు తెలుగుదేశం శాసన సభా పక్షం కార్యాలయం మెట్ల వద్ద మాక్ అసెంబ్లీ నిర్వహించారు . కాంగ్రెస్ ,టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు ఇలా మాక్ అసెంబ్లీ నిర్వహించడం మాములే . సీఎం , ప్రతిపక్ష నాయకుడు , స్పీకర్ గా తమలో తామే కొందరిని నిర్ణయించి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారు . ఒక రకంగా ఇది రాజకీయ వీధి నాటకం . ఆరు బయటే సాగుతుంది కాబట్టి ఇతర పార్టీల వాళ్ళు , అన్ని పార్టీల మీడియా అక్కడే ఉంటుంది . ప్రచారం , ప్రత్యర్థి మీద వ్యతిరేకత వ్యక్తం చేయడం , కాసింత సరదా ఈ రాజకీయ నాటకాల్లో ఉంటుంది . దూళిపాళ నరేంద్ర ముఖ్యమంత్రిగా , మోత్కుపల్లి నర్సింహులు ప్రతిపక్ష నాయకుడు , ఎర్రబెల్లి దయాకర్ రావు స్పీకర్ , ఇతర శాసన సభ్యులకు పాత్రలు ఇచ్చారు . టీడీపీ శాసన సభ్యులు విలేకరుల సమావేశాల్లో ఏం విమర్శలు చేశారో అవే విమర్శలు మాక్ అసెంబ్లీలో , పైగా అధికార పక్షం ( అప్పుడు కాంగ్రెస్ ) మేము తప్పు చేశాం అన్నట్టు మాట్లాడడం .. అధికార పక్షం , విపక్షం రెండూ ఆయనుంటే బాగుండు అన్నట్టుగా మాక్ అసెంబ్లీ సాగుతోంది . మాక్ అసెంబ్లీ అంటే చూసేవారికి ఉషారు కలిగేట్టుగా సరదాగా ఉండాలి . కానీ అక్కడ కూడా విలేకరుల సమావేశంలానే సాగుతుండడం తో .. నేను సరదాగా మన మైండ్ లో కొన్ని నిర్ణయాలు చాలా బలంగా ఉండి పోతాయి . వీళ్ళు ముఖ్యమంత్రి పదవిని కనీసం మాక్ అసెంబ్లీ లో కూడా ఇతరులకు ఇవ్వరు . దూళిపాళ్ల నరేంద్రను సీఎం చేశారు కానీ , మరో వర్గం వారిని , తెలంగాణ వారిని మాక్ అసెంబ్లీలోనే కాదు కలలో కూడా సీఎంగా ఒప్పుకోరు అని జోక్ చేశాను . ఎన్టీఆర్ కు మొదటి సారి పోటు పొడిచిన నాదెండ్ల భాస్కరరావు , రాజ్యాంగేతర శక్తి అని మీడియా ప్రచారం చేసిన లక్ష్మీ పార్వతి , విజయవంతంగా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన బాబు అంతా ఒకే వర్గం . *********** మాక్ అసెంబ్లీని కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ లతో పాటు కాంగ్రెస్ కు చెందిన రవిచంద్ కూడా వింటున్నాడు . ఏదో సరదాగా జోక్ చేసి న మానాన నేను వెళ్లి పోయాను . వార్తలు రాసేందుకు సాయంత్రం ఆఫీస్ కు వెళ్లే సరికి మాక్ అసెంబ్లీ వార్తతో పోటీ పడే విధంగా ... చివరకు మాక్ అసెంబ్లీ లో సైతం అదే వర్గం వారికి సీఎం పాత్ర . కనీసం మాక్ అసెంబ్లీలోనూ వేరేవారికి ఇవ్వరా ? అని కాంగ్రెస్ శాసన సభ్యులు నిలదీసిన వార్త కనిపించింది ***** స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు రాజమండ్రి జైలులో ఉండడంతో ఇక బాలకృష్ణ రంగప్రవేశం చేస్తారని టీవీల్లో వార్తలు . ప్రపంచ పటంలో ఆంధ్ర లేదు అంటూ ఆయనేదో ఆవేశంగా మీడియాతో మాట్లాడారు . ఉమ్మడి రాష్ట్రంలో బాబు తొలిసారిగా దశల వారీగా పాదయాత్ర కు శ్రీ కారం చుట్టినప్పుడు ఎన్టీఆర్ భవన్ కు నందమూరి హరికృష్ణ ఇలానే వచ్చి ఈ రోజు నుంచి పార్టీని నేను చూసుకుంటా అని ఆఫీస్ లో కూర్చున్నారు . నాలుగైదు రోజులు వచ్చారు . తరువాత కనిపించలేదు ఏమైంది అని తెలుసు కుంటే .... జిల్లాల నుంచి ఎవరో ఒకరు వచ్చి బస్సుకు డబ్బులు లేవని అడగడం , సహాయం చేయమని అడగడం చేసేవారు . నాలుగు రోజులు డబ్బులు ఇచ్చి .. చిరాకేసి రావడం మానేశాడు అని తెలిసింది . నాలుగు రోజులు కుదురుగా పార్టీ కార్యాలయంలో కూర్చోలేరు వీళ్ళ వల్ల ఏమవుతుంది అనిపించింది . ఆ నాలుగు రోజులు హరికృష్ణ మీడియాతో ఇష్టాగోష్టిగా తెగ మాట్లాడారు . రాజకీయం అంటే ఏమిటీ అంటూ .... తెలంగాణ ఉద్యమ చివరి దశలో టీడీపీ తెలంగాణ నేతలు తెలంగాణ ఫోరమ్ అని పెడితే , దూళిపాళ్ల తొలుత నాయకత్వం లో ఆంధ్ర ఫోరమ్ పెట్టారు . మాక్ అసెంబ్లీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కాలువ శ్రీనివాస్ను ఆంద్ర ఫోరమ్ఎనాయకున్ని చేశారు . మా నాన్న లా నేను మంచి వాడిని కాదు అని లోకేష్ సినిమా డైలాగులు చెప్పినా , జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని సభల్లో కొందరు బ్యానర్లు చూపినా బాబు రాజకీయం ముందు నిలవలేరు .. ఎన్టీఆర్ కు చంద్రబాబు ఉన్నట్టు , చంద్రబాబుకు మరో చంద్రబాబు లేకపోవడమే బాబుకు పెద్ద లోటు అని ఎన్టీఆర్ ను దించేసిన కాలం లో అన్నారు . చంద్రబాబుకు చంద్రబాబే ప్రత్యామ్నాయం , పార్టీని నిలబెట్టినా, ముంచినా కర్త , కర్మ , క్రియ అన్నీ బాబే ... - బుద్దా మురళి

11, సెప్టెంబర్ 2023, సోమవారం

అలిపిరి పై సానుభూతి ఆశిస్తే ఏం జరిగింది .. తెలుగునాట సానుభూతి రాజకీయలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 91

అలిపిరి పై సానుభూతి ఆశిస్తే ఏం జరిగింది .. తెలుగునాట సానుభూతి రాజకీయలు జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 91 ------------------------------------- నవంబర్ 14, 2003 సచివాలయం విలేకరులతో కిక్కిరిసిపోయాయి ఉంది . అంతకు ముందే మంత్రివర్గ సమావేశం జరిగింది . అసెంబ్లీని రద్దు చేస్తూ సమావేశంలో తీర్మానం చేశారు . అప్పటికప్పుడు గవర్నర్ కు తీర్మాన ప్రతిని అందజేశారు . రాజ్ భవన్ నుంచి మంత్రివర్గ తీర్మానం మేరకు అసెంబ్లీ రద్దు నిర్ణయం వెలువడింది . అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో వివరిస్తున్నారు . వెంటనే ఎన్నికలు జరగాలి అని కోరుకున్నారు . అసెంబ్లీ రద్దు గురించి బాబు చెబుతుండగానే ఇంగ్లీష్ ఛానల్ మహిళా రిపోర్టర్ ఒకరు మధ్యలో లేచి ఢిల్లీ నుంచి ఇప్పుడే సమాచారం వచ్చింది . ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించలేం , సమయం పడుతుంది అని కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ప్రకటించింది అని చెప్పగానే బాబు కంగారు పడ్డారు . ముఖకవళికలు మారిపోయాయి . పరిస్థితులు చేయి దాటి పోక ముందే ఎన్నికలు జరగాలి అని ఆరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేశారు . రద్దు ప్రకటన చదువుతుండగానే పిడుగులాంటి వార్త వినడంతో బాబు కంగారు పడ్డారు . 99 లో స్వల్ప తేడాతో గెలవడం , 2001లో తెలంగాణ ఉద్యమం , వరుసగా మూడు నాలుగేళ్ల నుంచి కరువు వంటి పరిస్థితుల్లో పూర్తిగా పరిస్థితి చేయి దాటి పోక ముందే ఎన్నికలకు వెళ్లాలని బాబు అనుకున్నారు . 2003 అలిపిరిలో నక్సల్స్ తన వాహనం పై బాంబు దాడి చేశారు . ఈ దాడి నుంచి బయటపడ్డ బాబు దానిని అనుకూలంగా మార్చుకొని సానుభూతి పవనాలు సృష్టించే ప్రయత్నాలు చేశారు . వారం రోజుల చికిత్స తరువాత జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో బాబు మీడియాతో మాట్లాడుతారు అని సమాచారం . అప్పుడు సీఎం ముఖ్య పౌర సంబంధాల అధికారిగా ఉన్న విజయ కుమార్ మీడియా ఏమీ ప్రశ్నించవద్దు , బాబు చెప్పింది విని వెళ్ళాలి అంతే అనే షరతు తో లోనికి అనుమతి ఇచ్చారు . ఏమీ అడగవద్దు అని విజయ్ కుమార్ నాకు మరోసారి షరతు గుర్తు చేశారు . అంతకు ముందు రోజే జ్యోతిలో కొమ్మినేని బాబు ముందస్తు ఎన్నికలకు వెళతారు అని రాశారు/ రాయించారు . బాబు అరగంటకు పైగా మాట్లాడారు . ఆయన మాటల సారాంశం నామీద దాడి జరిగింది , ముందస్తు ఎన్నికలకు వెళతాను , నాకు ఓటు వేయండి అని అడుగుతున్నట్టుగా ఉంది అని జర్నలిస్ట్ మిత్రులతో నా అభిప్రాయం చెప్పాను . , సానుభూతి కోసం మంచి ప్రయత్నాలు చేశారు . ఇప్పుడు వై యస్ ఆర్ కాంగ్రెస్ లో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అప్పుడు టీడీపీలో కీలక నాయకులు వారికీ చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి పెద్ద సంఖ్యలో పిల్లలను తీసుకువచ్చి బాబుకు పిల్లలతో పూలు ఇప్పించారు . డక్కన్ క్రానికల్ లో సైతం స్కూల్ అమ్మాయి గులాబీ పూవు బాబుకు ఇస్తున్న ఫోటో మొదటి పేజీలో అద్భుతంగ వచ్చింది . ఆ తరువాత నియోజక వర్గాల వారీగా పార్టీ వారికీ టార్గెట్ విధించి ప్రతి రోజు బాబు ఇంటికి వచ్చేట్టు చేశారు . అంతరం పార్టీ విస్తృత సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి అని నిర్ణయాలు . రాష్ట్రంలో నక్సలైట్లు విజృంభిస్తున్నారు , అసెంబ్లీ రద్దు చేస్తాం . మమ్ములను తిరిగి గెలిపించండి ఇదీ తీర్మానం . అధికారంలో ఉన్నది టీడీపీ , నక్సల్స్ విజృంభిస్తే కట్టడి చేయాల్సింది ప్రభుత్వం , ప్రభుత్వంలో ఉండి అసెంబ్లీ రద్దు చేయడం ఏమిటో , తిరిగి అధికారం ఇవ్వమని కోరడం ఏమిటో ప్రజలకు అర్థం కాలేదు . ****** స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపడంపై ఆంధ్ర లో భిన్న వాదనలు గతమ్లో జగన్ ను అరెస్ట్ చేస్తే జగన్ సీఎం అయ్యారు , ఇప్పుడు బాబును అరెస్ట్ చేయడం వల్ల బాబు సీఎం అవుతారు అనేది తెలుగుదేశం వాదన . సానుభూతి వల్లనే జగన్ సీఎం అయ్యారు అని వాదించినా , సానుభూతి వల్ల బాబు సీఎం అవుతారు అని వాదించినా కోట్లాది మంది ఓటర్ల అభిప్రాయాలను చిన్న చూపు చూసినట్టే . ఒక పార్టీ నచ్చ డానికి , నచ్చక పోవడానికి ఓటర్లకు అనేక కారణాలు ఉంటాయి అంతే తప్ప నాయకుడికి జ్వరం వచ్చింది అనో జలుబు చేసింది అనో సానుభూతితో ఓడించరు , గెలిపించరు . పాదయాత్ర చేయగానే సీఎం అని , అరెస్ట్ చేయగానే సీఎం అని చిత్రమైన విశ్లేషణలు చేస్తుంటారు . షర్మిల పాదయాత్రతో తెలంగాణ కాబోయే సీఎం అని రాసిన మీడియా మేధావులు కూడా ఉన్నారు . చివరకు ఆమె కనీసం ఒక్క స్థానంలో కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు . పాదయాత్ర తోనే అధికారం వస్తే సిపిఎం తమ్మినేని వీరభద్రం ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రం సీఎం అయిపోవాలి . పాపం ఆ పార్టీకి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రతినిధ్యమే లేదు . అనేక అంశాలు ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి . *****\ తెలుగు నాట సానుభూతి రాజకీయాలు కొత్తేమి కాదు. సానుభూతి ఎన్నికల్లో పని చేస్తుందా ? చేయదా ? అంటే ? పని చేసిన సందర్భాలు ఉన్నాయి , పని చేయని సందర్భాలు ఉన్నాయి . 84లో ఇందిరాగాంధీ హత్య తరువాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 404 పార్లమెంట్ సీట్లను గెలుచుకోండి . స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కు అన్ని సీట్లు ఎప్పుడూ రాలేదు . అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చే సరికి సానుభూతి పవనాలు పని చేయలేదు . టీడీపీకి 30 సీట్లు వచ్చాయి . తొలిసారిగా పార్లమెంట్ లో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది . అరెస్ట్ చేయగానే సీఎం అని కొందరు జోష్యం చెబుతున్నారు . వై యస్ జగన్మోహన్ రెడ్డిని 2012 మేలో అరెస్ట్ చేశారు . ఆ తరువాత 2014 లో ఎన్నికలు జరిగితే జగన్ సీఎం కాలేదు . బాబు ఐదేళ్ల పాలనా ప్రభావం వల్లనే జగన్ 2019 లో సీఎం అయ్యారు కానీ . 2012లో అరెస్ట్ అయ్యారనే సానుభూతితో కాదు . కాంగ్రెస్ కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా ఎన్టీఆర్ 94లో కాంగ్రెస్ ను ఓడించారు . 95లో ఎన్టీఆర్ ను బాబు గద్దె దించితే ఎన్టీఆర్ నల్ల దుస్తులు వేసుకొని సానుభూతి యాత్ర చేసినా పెద్దగా స్పందన లేదు . ఆంధ్రభూమి మినహా మీడియా పట్టించుకోలేదు . 94లో ఘనవిజయం చేకూర్చిన ప్రజలే 95లో పట్టించుకోలేదు . ఆయా సమయంలో పరిస్థితులే కీలక పాత్ర వహిస్తాయి కానీ , సానుభూతి , అరెస్ట్ లు , పాదయాత్రలు కాదు . ******* ముందస్తు ఎన్నికల ఆశపై ఎన్నికల కమిషన్ నీళ్లు పోసింది . ఐతే సానుభూతి పవనాలు విచడం లేదు అనే విషయం దాదాపు అందరికీ అర్థమైంది . అలిపిరి బాంబు దాడి తరువాత తిరుపతికి చెందిన టీడీపీ లీడర్ , బాబు మిత్రుడు , మున్సిపల్ ఛైర్మెన్ శంకర్ రెడ్డిని పిలిచి .... బాబు షర్ట్ రక్తంతో తడిసిపోయింది , నువ్వు లోకల్ కాబట్టి షాప్స్ షట్టర్ ఎత్తి ఐనా కొత్త షర్టు తీసుకురా అని పంపించారు . బాంబు దాడి వల్ల సానుభూతిగా తిరుపతిలో షాప్స్ అన్నీ మూసేస్తారు అని శంకర్ రెడ్డి అనుకున్నాడు . వెళ్లి చూసే సరికి అన్ని షాప్స్ లో బిజినెస్ యధావిధిగా జరుగుతోంది . ఈ విషయం శంకర్ రెడ్డినే ఎన్టీఆర్ భవన్ లో ఇష్టాగోష్టిలో చెప్పుకొచ్చారు . ******* రాయలసీమకు చెందిన ఓ లీడర్ మంచి మిత్రులు ఓ రోజు ఫోన్ చేసి ఈ సారి మేం గెలవడం కష్టమే అని చెప్పుకొచ్చారు . అలిపిరి దాడి జరిగినప్పుడు షేరింగ్ ఆటోలో కొందరి ముచ్చట ఒకరు దాడి గురించి చెబితే మరొకరు అన్న మాట కార్యకర్త విని ... జనాల్లో ఇంత వ్యతిరేకత ఉంది . బాంబు దాడి జరిగినా కనీస సానుభూతి చూపడం లేదు అని ఆ సంఘటన గురించి చెప్పుకొచ్చారు . ******** ఆరు నెలల ముందు అసెంబ్లీ రద్దు చేసినా ఎన్నికలు సకాలం లోనే జరిగాయి . ఏప్రిల్ 20న పోలింగ్ జరిగింది . బాబు జన్మదినం రోజున పోలింగ్ జరిగింది . ప్రజలు పుట్టిన రోజు కానుక ఇస్తారు చూడు అంటూ అప్పుడు ఎన్టీఆర్ భవన్ కార్యాలయ కార్యదర్శిగా ఉన్న రాధాకృష్ణ గట్టిగా వాదించారు . ఏ సానుభూతి పవనాలు పని చేయలేదు . అప్పటి వరకు టీడీపీ చరిత్రలోనే తక్కువ సీట్లు వచ్చాయి . టీడీపీకి 47 స్థానాలు మాత్రమే వచ్చాయి . ప్రజలు తప్పు చేశారు అంటూ టీడీపీ మీడియా రాస్తూ పోయింది ఎప్పటి మాదిరిగానే . అలిపిరి సానుభూతి కథ అలా ముగిసింది ... అదే సమయంలో  బాబు పోతూ పోతూ వాజపేయి ప్రభుత్వాన్ని కూడా ముందస్తుకు తీసుకు వెళ్లారు . ఇండియా షైనింగ్ నినాదం తో ముందస్తుకు వెళ్లి బీజేపీ బోర్లాపడింది . ఏ కారణమో తెలియదు కానీ అదే సమయంలో బంగ్లా దేశ్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది . బాబు ముందస్తు తో బంగ్లా దేశ్ కూడా ముందస్తుకు అని తెలుగు మీడియా చాలా ముచ్చట పడి రాసింది .  - బుద్దా మురళి

9, సెప్టెంబర్ 2023, శనివారం

జైలులో ఇనుప చువ్వల వెనుక బాబు పోస్టర్ లతోహైదరాబాద్ ను నింపేశారు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 90

జైలులో ఇనుప చువ్వల వెనుక బాబు పోస్టర్ లతోహైదరాబాద్ ను నింపేశారు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 90 -------------------------------------- అర్ధరాత్రి ఇంటికి చేరుకొని ఎప్పటిలానే ఉదయం ప్రధాన రహదారి పైకి వెళ్లి చూస్తే ఇనుప చువ్వల వెనుక జైలులో బాబు ఉన్న పోస్టర్ లు , బేగంపేట వంటి ప్రధాన రహదారిలో భారీ హోర్డింగ్లను చూసి ఆశ్చర్యం వేసింది . వారి సామర్ధ్యం గురించి తెలియంది కాదు . అప్పటికే వారిని దగ్గర నుంచి ఒకటిన్నర దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నాను . అయినప్పటికీ ఆ హోర్డింగ్ లు , పోస్టర్ లు చూసి వాళ్ళు మామూలోళ్లు కాదు అనుకున్నాను . రాత్రి మహారాష్ట్ర శివారులో అరెస్ట్ అయితే , తెల్లవారే సరికి హైదరాబాద్ లో ఇనుప చువ్వలు , జైలు లో బాబు బొమ్మలతో అంత భారీ హోర్డింగ్ లు ఎలా సాధ్యం అయ్యాయి అనుకున్నాను . బహుశా పోస్టర్ లు , హోర్డింగ్లకు ముందే ఏర్పాట్లు చేసుకొని ఉండవచ్చు . స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు అరెస్ట్ అయితే ఇదే మొదటి సారి అని అనుకొంటున్నారు , 2010 లోనే భారీ అరెస్ట్ గుర్తుకు వచ్చి ... **** సరిగ్గా 13 సంవత్సరాల క్రితం . తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజులు . తెలంగాణ కోసం తెరాస శాసన సభ్యులు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల ప్రచారం , తెలంగాణ ఉద్యమం కలిసి ఉదృతంగా సాగుతున్న రోజులు . ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ లో నినాదం లేదు . మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా తెలంగాణ ను ఎడారిగా మారుస్తున్నారు అనే నినాదం తో టీడీపీ విస్తృతంగా ప్రచారం . శత్రు దేశం పైకి దండెత్తిన తీరులో ప్రజాప్రతినిధులు , పార్టీ నాయకులు మీడియా తో కలిసి చంద్రబాబు బాబ్లీ కి పయనం . ఇదేమి రాజరికం కాదు కొద్ధి మంది సైన్యం తో శత్రు రాష్ట్రం పై గెరిల్లా దాడి చేసి ఆ రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోలేరు . ఏం చేస్తారో అంతా రహస్యం . మంత్ర సాని తనానికి ఒప్పుకున్నప్పుడు ఏమొచ్చినా పట్టుకోవాలి అనే సామెత చెప్పినట్టు టీడీపీ బీట్ రిపోర్టర్ అన్నప్పుడు వారు ఎటు వెళితే అటు వెళ్ళాలి . జూలై 16న 2010 న మీడియాతో కూడిన సర్వ సైన్త్యం తో చంద్రబాబు బృందం ప్రత్యేక బస్సుల్లో బయలు దేరింది . అచ్చం దండయాత్రకు వెళుతున్నట్టుగానే ఉంది . బాబు తరువాత తెలంగాణ నాయకుల్లో ఎర్ర బెల్లి దయాకర్ రావు , ఆంధ్ర నాయకుల్లో పయ్యావుల కేశవ్ లు బాబ్రీ ప్రాజెక్ట్ నిర్మిస్తే తెలంగాణ ఎడారిగా ఎలా మారుతుందో కళ్ళకు కట్టినట్టు వివరించారు . చిన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కౌబాయ్ సినిమాల్లో , గూఢచారి సినిమాల్లో ఎడారిని చూసి ఉండడం వల్ల తెలంగాణ ఎడారి అవుతుంది అని టీడీపీ నాయకులు చెప్పింది ఈజీగానే అర్థం అయింది . ******* బాసర లో భోజనానికి ఆగారు . నాకెంతో ఇష్టమైన సర్వ పిండి హోటల్స్ లో అమ్మడం బాసరలోనే తొలిసారి చూశాను . ఇప్పుడు స్వగృహ ఫుడ్స్ అమ్మే చాలా వాటిలో సర్వ పిండి అమ్ముతున్నారు కానీ అప్పుడలా కాదు . నిజాం కాలేజీ గ్రౌండ్ లో తెలంగాణ సంబురాలు నిర్వహించి తెలంగాణ వంటకాలు అమ్మితే మొత్తం సర్వ పిండి అరగంటలో కనిపించకుండా పోయింది . అప్పుడు సర్వ పిండి తినాలి అంటే ఇంట్లోనే .. అందులోనూ అమ్మచేసిన సర్వపిండి రుచి చూశాక ...... అలాంటి పరిస్థితిలో బాసరలో సర్వపిండి అలా గుర్తుండి పోయింది . .. భోజనాలు అయ్యాక శత్రు సైన్యానికే కాదు సొంత సైన్యానికి కూడా చివరి నిమిషం వరకు దాడి తెలియకుండా ఉండడం యుద్ధ నీతి .. అటు నుంచి వాహనాలను ఎటు తీసుకువెళ్తారో , ఏం చేస్తారో తెలియదు . అప్పటి ఆంధ్ర , మహారాష్ట్ర సరిహద్దుల్లో ధన్ బాద్ సమీపం లో పెద్ద సంఖ్య లో పోలీసులు మోహరించారు . ఆంధ్ర నుంచి వచ్చిన బాబూ సైన్యాన్ని అక్కడే ఆపేశారు . అక్కడే ఉపన్యాసాలు .. చుశారా ? మీరేమో తెలంగాణ రాష్ట్రం కావాలి అని డిమాండ్ చేస్తుంటే మేం తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నాం , అరెస్టులకు సిద్ధం అయ్యాం , ఇక నైనా మారండి అన్నట్టుగా పయ్యావ్యుల కేశవ్ తెలంగాణ కోరుకునే నాలాంటి వారికీ హితబోధ చేశారు . ఇదేమన్నా ఒక రాజ్యం ఇంకో రాజ్యం పై దాడి చేయడమా ? ఇలా చేస్తే తెలంగాణకు ఏం లాభం అంటే .. అరెస్టులకు సిద్దమైన ఆంధ్ర నాయకుల త్యాగాలు నీకు అర్థం కావు అని విమర్శ .. సరిహద్దుల్లో కొంత సమయం రాజకీయ ఉపన్యాసాలు , చప్పగా ఉన్నట్టు అనిపించింది . లాటీ చార్జీలు , తోపులాట అయితే తప్ప సరైన కవరేజ్ దక్కదు . మహారాష్ట్ర పోలీసులేమో మీ భూ భాగం లో మీరు ఏమైనా చేసుకోండి అని నిమ్మకు నీరెత్తినట్టు ఉండి పోయారు . దాంతో బాబూ బృందానికి సహనం నశించి సరిహద్దు దాటి మహారాష్ట్రలో అడుగుపెట్టి బాబ్లీ వెళ్లాలని ప్రయత్నిస్తే సాయంత్రం తరువాత ఈ బృందాన్ని అరెస్ట్ చేసినట్టు చూపించి ధన్ బాద్ లోని ఒక విద్యా సంస్థలో ఉంచారు . ఉప ఎన్నికల్లో ఎక్కడ గెలవరు , గెలుపు మాట దేవుడెరుగు డిపాజిట్ కూడా దక్కదు . ఉప ఎన్నికలు వెనకల్కి వెళ్లి తమ బాబ్లీ ఉద్యమం ముందుకు రావాలి అనే రాజకీయం అని తెలుస్తూనే ఉంది . అక్కడినుండి చేసేదేమి లేదని ఆఫీస్ కు ఫోన్ చేసి అనుమతి తీసుకోని హైదరాబాద్ వచ్చేశాను . ********** ఉదయం రోడ్డు మీద చూడగానే జైలు గోడల మధ ఇనుప చువ్వల వెనుక బాబు ఉన్నట్టు భారీ పోస్టర్ లతో నగరాన్ని నింపేశారు . ధన్ బాద్ లోని ఐ టి ఐ లో అందరినీ ఒకే చోట ఫ్రీ గానే వదిలేశారు . ఈ జైలు గోడలు , ఇనుప చువ్వల వెనుక బాబు ఎలా వచ్చారో అర్థం కాలేదు . అది సరే అరెస్ట్ తో అప్పుడు సానుభూతి వచ్చిందా ? అంటే ఉప ఎన్నికలను మరిచిపోయేట్టుగా మీడియా బాబు బాబ్లీ ఉద్యమానికే ప్రాధాన్యత ఇచ్చి కవరేజ్ తో అదరగొట్టినా .. ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తెలంగాణ కే ప్రాధాన్యత ఇచ్చారు విజయం చేకూర్చారు . బాబు బాబ్లీ నాటకం మీడియా ప్రచారానికే పరిమితం అయింది . డిపాజిట్ లు కూడా దక్కలేదు . - బుద్దా మురళి

8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

బస్సు డిపోలో బాక్స్ లు , బేరింగ్ కార్డు నుంచి వాట్స్ ఆప్ లో న్యూస్ వరకు ... జర్నలిజం పరిణామ క్రమం ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -89

బస్సు డిపోలో బాక్స్ లు , బేరింగ్ కార్డు నుంచి వాట్స్ ఆప్ లో న్యూస్ వరకు ... జర్నలిజం పరిణామ క్రమం ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -89 ----------------------- ----------------------- ఇమ్లీ బన్ బస్సు డిపో , జూబ్లీ బస్సు డిపో , విజయవాడ , విశాఖ బస్సు డిపోల్లో ఏదో ఓ మూలకు కొన్ని బాక్స్ లు మీరు చూసే ఉంటారు. అన్ని దిన పత్రికలు తమ తమ పత్రికల పేర్లు రాసి అక్కడ బాక్స్ లు వేలాడ దీశారు . ఇప్పుడు వాటి ఉపయోగం లేకున్నా కొన్ని బస్సు డిపోల్లో ఆ బాక్స్ లు దుమ్ముకొట్టుకుపోయి ఇంకా అలానే ఉన్నాయి . వాటికో చరిత్ర ఉంది . మహా సామ్రాజ్యం కూలిపోయిన తరువాత శిధిలాలు కనిపించినట్టు ఒకనాటి మహా వైభవాన్ని ప్రదర్శించే విధంగా దుమ్ము పట్టిన ఆ బాక్స్ లు ఇంకా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి . ఒకనాడు ఆ బాక్స్ లు సమాచార విప్లవానికి దోహదం చేశాయి . పత్రికల ప్రచురణ కేంద్రాల్లో రిపోర్టర్ లు ఆఫీస్ కే వచ్చి వార్తలు రాస్తారు . మరి జిల్లాల నుంచి వార్తలు ఎలా ? ముఖ్యమైన వార్తలు ఐతే ఫోన్ లో మిగిలినవి రాసి పంపాలి . రాసిన వార్తలను మండలాలు , జిల్లాల నుంచి స్థానిక జర్నలిస్ట్ లు బస్ స్టాండ్ కు వెళ్లి హైదరాబాద్ కు వెళ్లే బస్సు డ్రైవర్ ను పట్టుకొని అతనికో రెండు రూపాయలు , వార్తలు రాసిన కవర్ ఇస్తే , వాటిని హైదరాబాద్ డిపో లో ఉండే ఆయా పత్రికల బాక్స్ లలో వేసేవారు . ఒక్కో డ్రైవర్ వద్ద హైదరాబాద్ వెళ్లే సరికి ఒక్కో సారి 20-30 కవర్లు కూడా ఉండేవి . కవరు మీద ఆ పత్రిక లోగో అతికిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఏ పత్రిక కవరును ఆ పత్రిక బాక్స్ లో వేస్తే , పత్రిక కార్యాలయం నుంచి ఓ వ్యక్తి వచ్చి ఆ కవర్లను రోజుకు రెండు సార్లు తీసుకువెళ్ళేవాడు . ఆ కాలం లో కొన్ని పత్రికలు తమ రిపోర్టర్ లకు బేరింగ్ కార్డు లు ఇచ్చేవారు . అంటే పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి వార్తలను టెలిగ్రామ్ గా పంపడం . డబ్బులు చెల్లించనవసరం లేదు . బేరింగ్ కార్డు చూపితే సబ్సిడీ తో తక్కువ ఖర్చుతోనే పంపేవారు . లెక్క చూపించి పత్రిక ప్రధాన కేంద్రం నుంచి డబ్బు తీసుకొనేవారు . ఇంగ్లీష్ లిపిలో తెలుగు రాసి టెలిగ్రామ్ పంపాలి . అది రాసే వారికి , టెలిగ్రామ్ పంపే ఉద్యోగి ఇద్దరికీ చాలా కష్టమైన పని .. వివాహ శుభాకాంక్షలు , పలానా వారు పోయారు వంటి రెండు మూడు సందేశాలకే టెలిగ్రామ్ పంపేవారు , అలాంటిది పేజీలకు పేజీలు ఇంగ్లీష్ లిపిలో తెలుగు వార్తలు పంపాలి అంటే ఇబ్బంది పడేవారు . 87లో నేను సంగారెడ్డిలో ఆంధ్రభూమిలో తొలి ఉద్యోగం . బేరింగ్ కార్డు ఇచ్చి పంపారు . టెలిగ్రామ్ కన్నా ఆర్ టీసీ డిపోలో బాక్స్ బెటర్ అనిపించింది . ****** 1986-87 లో ఆంధ్రభూమి లో అప్పటి న్యూస్ ఎడిటర్ జొన్నలగడ్డ రాధాకృష్ణచొరవ తీసుకోని డిపోలో ఈ బాక్స్ ఏర్పాటు చేశారు . అంతకు ముందు ఆంధ్రపత్రిక కాలం లో ఆయా ప్రాంతాల్లోని పత్రిక ఏజెంట్ లే పోస్ట్ లో వార్తలు పంపేవారు . తరువాత జిల్లా కేంద్రాల్లో టెలిప్రింటర్ ల శకం మొదలైంది . సంగారెడ్డి లో నండూరి సాంబశివరావు ఈ టెలీ ప్రింటర్ గురించి తెలుసుకొని మా కన్నా మీరే నయం , మాక్కూడా అలాంటి సౌకర్యం లేదు అన్నారు . అప్పుడు అలా ఉండేది టెలిప్రింటర్ ఏర్పాటు చేస్తే టీపీ సెంటర్ ప్రారంభోత్సవం అంటూ కొన్ని పత్రికలు ప్రత్యేక సంచికలు వేసి ప్రకటనలు వసూలు చేసేవారు . పత్రిక వా.ళ్ళు టి పి సెంటర్ పెట్టుకొంటే రాజకీయ నాయకులు ప్రకటనలు ఎందుకు ఇవ్వాలో ? ... బస్సు డిపోలో బాక్స్ ల ద్వారా వార్తలు పంపే స్థాయి నుంచి సామాన్యుడు తన ఆత్మహత్యను ఫేస్ బుక్ లో ప్రపంచానికి లైవ్ గా చూపిస్తున్న కాలానికి వచ్చాము . 90 కి ముందు పత్రికా కార్యాలయానికి వార్తలు పంపాలి అంటే అదో యజ్ఞం లా ఉండేది . కానీ వార్తల సేకరణ జర్నలిస్ట్ కు పరీక్ష పెట్టే విధంగా , ఆసక్తి కలిగించే విధంగా ఉండేది . ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్ ఉంటే క్షణం లో ఫోటో లు పంపవచ్చు , సెల్ ఫోన్ లోనే వార్తను టైపు చేసి పంపవచ్చు . కానీ పెరిగిన ఈ సాంకేతిక విప్లవం జర్నలిజాన్ని మెల్లగా చంపేస్తోంది . ******************* ఇప్పుడు కాలం మారింది . రిపోర్టర్ , సబ్ ఎడిటర్ ఇద్దరూ తిరుగుదామన్నా అవకాశం లేకుండా పోయింది . టెక్నాలెజీ పెరగడం , సామాజిక మాధ్యమాలు , వాట్స్ ఆప్ , కరోనా , రాష్ట్ర విభజన , మారిన పరిస్థితులు జర్నలిజాన్ని పూర్తిగా మార్చేసింది . ఒక్కో మీడియా ఒక్కో రాజకీయ పక్షానికి అనుబంధంగా మారిపోయింది . ఒక పార్టీ నాయకుడు విమర్శితే , మరో పార్టీ నాయకుడు ఎదురు దాడి , ప్రతి విమర్శ చేస్తాడు . కానీ చిత్రంగా వై యస్ ఆర్ కాంగ్రెస్ పలానా నాయకుడికి గట్టి కౌంటర్ ఇచ్చిన పలానా నంబర్ టివి రిపోర్టర్ అనే శీర్షికతో ఛానల్స్ వార్తలు కనిపిస్తున్నాయి . ఒక వైపే కాదు అన్ని పార్టీల ఛానల్స్ లో ఇదే తీరు . రాజకీయ పక్షాల మధ్యనే కాదు ఛానల్స్ మధ్య కూడా రాజకీయ పోరు సాగుతోంది . ఒక పార్టీ ఛానల్ ను మీడియాను , మరో పార్టీ బహిష్కరిస్తోంది . ***** రిపోర్టర్ అనే వాడు తిరగక చెడితే , సబ్ ఎడిటర్ తిరిగి చెడిపోతాడు అనేది మీడియా రంగంలో గతంలో వినిపించిన ఓ హితోక్తి . రిపోర్టర్ ఎంత ఎక్కువ తిరిగితే అంత ఎక్కువగా రాణిస్తాడు . అధికారులు నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి . జర్నలిజంలో పరిచయాలు అంటే సోర్స్ . ఎంత ఎక్కువ పరిచయాలు ఉంటే అంత బాగా వార్తలు రాయవచ్చు . నాలుగు దశాబ్దాల జర్నలిజంలో నేను చూసిన వారిలో అత్యధికంగా పరిచయాలు ఉన్న జర్నలిస్ట్ ఈ మధ్య మరణించిన సి హెచ్ వి ఎం కృష్ణారావు . రిపోర్టర్ తిరగాల్సిందే , తిరగకుండా ఆఫీస్ లో కూర్చోని ఎవరో ఒకరి మీద ఆధారపడి వార్తలు రాస్తే ఆ వార్తల్లో జీవం ఉండదు . అందుకే రిపోర్టర్ తిరగక చెడిపోతాడు అంటాడు . మరి తిరిగి సబ్ ఎడిటర్ చెడిపోవడం ఏమిటీ ? అంటే వీరి సంఖ్య చాలా చాలా స్వల్పంగానే ఉండొచ్చు కానీ కొంతమంది సబ్ ఎడిటర్స్ , ఇంచార్జ్ లు నాయకుల వద్దకు తిరిగేవారు . పి . అశోక గజపతి రాజు మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికీ ఎలాంటి పని చేయరు అని జర్నలిస్ట్ ల సర్కిల్స్ లో పేరు . అలాంటి అశోక గజపతి రాజు సైతం తమ ప్రాంతానికి చెందిన , హైదరాబాద్ లో పని చేసిన సబ్ ఎడిటర్ కు బాగానే పని చేసి పెట్టాడు అని చెప్పుకొనేవారు . ఎన్టీఆర్ మరణించిన కొత్తలో లక్ష్మీ పార్వతి , ఇంద్రా రెడ్డి ఓ సారి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతుంటే ఒకరు కంగారుగా ఫోన్ చేసి పూర్వ జన్మ బంధం అన్నట్టుగా ఏదో చెబుతుంటే ఇంద్రారెడ్డి ల్యాండ్ లైన్ రిసీవర్ మీద చేయి పెట్టి ఫోన్ చేసిన జర్నలిస్ట్ పేరు చెప్పి ఎవరితను అని అక్కడున్న వారిని అడిగితే , ఓ పత్రికలో సబ్ ఎడిటర్ అని తెలిసింది . ఇంద్రారెడ్డి మనది జన్మ జన్మల బంధం అన్నట్టుగా తిరిగి అంతే ఆప్యాయంగా అతన్ని పేరు పెట్టి పలకరించి మాట్లాడితే ఆమ్మో ఇంద్రారెడ్డి అనిపించింది . ఈ సబ్ ఎడిటర్ తిరిగి చెడిపోయాడు అనడానికి సజీవ ఉదాహరణగా నిలిచాడు . ******** ఇప్పుడు సబ్ ఎడిటర్ కాదు రిపోర్టర్ కూడా తిరిగే అవకాశాలు లేకుండా పోయాయి . సమాచారం క్షణాల్లో వాట్స్ ఆప్ లో పంపడమే . విలేకరుల సమావేశం అంటే కేవలం నాయకులు , అధికారులు చెప్పిన విషయం వినడానికి కాదు .. నిజానికి విలేకరుల సమావేశం తరువాత పిచ్చాపాటి మాట్లాడితే అనేక విషయాలు తెలిసేవి . రాజకీయ పరిణామాలు , పార్టీల్లో ఏం జరుగుతుందో పిచ్చాపాటి కబుర్లలోనే తెలిసేది . ఇప్పుడు అలాంటి అవకాశం పూర్తిగా తగ్గిపోయింది . ఒక వైపు సామాజిక మాధ్యమాల విస్తృతి , మరోవైపు రాజకీయ పక్షాలు , మీడియా అనుబంధం వల్ల మీడియా రూపురేఖలు మారిపోయాయి . కెమెరాలు , ఫోటోలకు ఉపయోగించే పేపర్ అమ్మకాల్లో కోడాక్ ప్రపంచంలో నంబర్ వన్ గా ఉండేది . ఇప్పుడు ప్రపంచంలో వందల కోట్లమంది రోజూ వందల కోట్ల ఫోటోలు తీస్తున్నారు . ఫోటోలు తీసేవారి సంఖ్య పెరిగింది కాబట్టి కొడాక్ వ్యాపారం పెరగాలి కానీ అలా జరగలేదు . మూత పడింది . కెమెరాలు , పేపర్ లు అవసరం లేకుండా సెల్ ఫోన్ లోనే ఫోటోలు తీసే రోజులు వచ్చాయి కాబట్టి కొడాక్ మూతపడింది . సాంకేతిక విప్లవం కూడా జర్నలిజం కు కొడాక్ లా కోలుకోలేని దెబ్బ తీసింది . జర్నలిజం ఉంటుంది . మీడియా ఉంటుంది కానీ అందులో గతంలోలా జీవం ఉందా ? అంటే ఏమో ..... ఎవరికి నచ్చినా , నచ్చక పోయినా మార్పు ఆగదు .. - బుద్దా మురళి

6, సెప్టెంబర్ 2023, బుధవారం

చదువురాని ఓ జర్నలిస్ట్ కథ... మారుతున్న మీడియాకు ప్రతిరూపం .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -88

చదువురాని ఓ జర్నలిస్ట్ కథ మారుతున్న మీడియాకు ప్రతిరూపం .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -88 ------------------------------------------- దాదాపు రెండేళ్ల క్రితం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సరికి నా కోసం ఒకరు గేటు వద్దనే ఎదురు చూస్తున్నారు . నేను వచ్చాక ఏదో మాట్లాడి స్టైల్ గా చేతికి ఐడెంటీ కార్డు ఇచ్చాడు . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా గలవారికి కూడా అంత నాణ్యమైన కార్డు ఉండదు . కార్డు నాణ్యత తో చాలా బాగుంది . అలా చూస్తూ ఉండి పోయాను . నేను కూడా రిపోర్టర్ ను ఐ పోయాను అన్నాడు . టివి 9 సక్సెస్ అయ్యాక , 9 కి ముందో వెనుకనే కొన్ని అక్షరాలు , లేదా మరి కొన్ని తొమ్ముదులు చేర్చి చాలా నే ఛానల్స్ వచ్చాయి . అనంతరం ఈ తొమ్మిదులను చేర్చుకుంటూ పోతూ యూ ట్యూబ్ ఛానల్స్ వచ్చాయి . అందులో ఒక అనేక తొమ్ముదుల యూ ట్యూబ్ ఛానల్ లో తనను రిపోర్టర్ గా నియమించినట్టు ఐడెంటీ కార్డు చూపించాడు . ఎనీ బడి కెన్ డాన్స్ ( ఏబీసీ ) అని డాన్సర్ నటుడొకరు సినిమా తీసి జనం మీద వదిలినట్టు యూ ట్యూబ్ వాళ్ళు ఎవరైనా జర్నలిస్ట్ కావచ్చు అని మొత్తం జర్నలిజం మీదనే కక్ష తీర్చుకుంటున్నట్టు అనిపించింది . చక్కని ఐడెంటీ కార్డు తో నా ముందు నిలబడ్డ అతను మా మాజీ పని మనిషి భర్త .. నువ్వేమన్నా రాజకుటుంబం నుంచి జర్నలిజం లోకి వచ్చావా ? పని మనిషి భర్త జర్నలిస్ట్ కాకూడదా ? ఎంత అహంకారం అని తొందరపడి తిట్టకండి . మా రోజుల్లో నైనా , ఈ రోజుల్లో ఐనా ఎక్కువగా పేదవారు , దిగువ మధ్యతరగతి వారే జర్నలిజంలోకి వస్తున్నారు . మధ్యతరగతి ఐతే ఇంజనీరింగ్ చేసి అమెరికా కో, కెనడాకో , ఇంకో దేశానికో వెళ్లి పోతారు . ఆ విషయం నాకు తెలుసు . నా సందేహం అది కాదు . అతనికి చదువు రాదు , పని గండం . శివశంకరి అనే పాటతో బాలకృష్ణ గాయకుడు అయినట్టు , వినేవాళ్ళు , చూసే వాళ్ళు ఉంటే ఎవరు ఏమైనా కావచ్చు అభ్యన్తరం చెప్పఁడానికి నేనెవరిని . కానీ చదువు రానివారు జర్నలిస్ట్ ఎలా అవుతారు అనేదే నా అనుమానం . తరువాత ఆ అనుమానం తీరిపోయింది . అక్షరం ముక్క రావలసిన అవసరం , రాయాల్సిన అవసరం లేకుండా యూ ట్యూబ్ జర్నలిస్ట్ లను చేసేస్తుందని తెలిసింది . ***** అతనితో మాట్లాడుతూనే యూ ట్యూబ్ లో రెండుకన్నా ఎక్కువ తొమ్ముదులు టైప్ చేసి చూశాను . ఓ ఛానల్ కనిపించింది . ఏడాది కాలం లో దాదాపు నాలుగు వందల మంది ఆ ఛానల్ చూశారు . ఇసుక మాఫియా అంటూ ఏదో స్టోరీ . విషయం అర్థమైంది . అది సరే చదువుకోక పోయినా జర్నలిజం లోకి రావచ్చు అనే ఆలోచన నీకు ఎలా వచ్చింది అని ఆసక్తిగా అడిగాను . అప్పుడప్పుడు అతను టెంపో నడుపుతాడు . టెంపోను ఓ యూ ట్యూబ్ ఛానల్ అతను అద్దెకు తీసుకోని నువ్వూ జర్నలిస్ట్ కావచ్చు అని ఐడెంటీ కార్డు అంటగట్టాడు . ( టెంపోకు అద్దె ఇచ్చాడో ఐడెంటీ కార్డు తోనే సరిపెట్టాడో నేను అడగలేదు అతను చెప్పలేదు ) అతన్ని అడిగిన మొదటి ప్రశ్న నెలకు ఎంత ఇమ్మన్నాడు అని ... భలే అడిగాను అని మనసులోనే నన్ను నేను అనుకున్నాను . ఎవరైనా ఉద్యోగం వచ్చింది అంటే , వెంటనే జీతం ఎంత అని అడుగుతారు . కానీ నేను ఎంత ఇమ్మన్నారు అని అడిగాను . నా ప్రశ్న కు అతనేమీ ఆశ్చర్య పోకుండా , ఇది కామన్ అన్నట్టు ఎంతో అనుభవజ్ఞుడిలా 25 వేలు ఇమ్మన్నాడు అని బదులిచ్చాడు . అతనికి 25 వేలు ఇవ్వాలి , నీకు ఎంతో కొంత కావాలి ఇదంతా ఎలా వస్తుంది అని అడిగాను . అతను రాదా ? అని లీడర్లు ఇస్తారు కదా ? అని బదులిచ్చాడు . నీకు స్మార్ట్ ఫోన్ ఉంటే రెండు వందలు ఖర్చు పెడితే జియో సిమ్ తో నువ్వే ఓ యూ ట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయవచ్చు ఇప్పుడున్న తొమ్ముదులకు మరో తొమ్మిది కలిపితే పేరు కోసం కూడా వెతకాల్సిన అవసరం లేదు అన్నాను . నాయకుల వద్ద బోలెడు వసూలు చేయవచ్చు అని ఉత్సాహంగా ఉన్న అతనికి అనుభవం ఐతే కానీ తత్త్వం బోధపడదు అని .. మన లోకల్ శాసన సభ్యులు మైనంపల్లి హనుమంతరావు అతన్ని కలిసి నీ అనుభవం చెప్పు అని పంపించేశాను . అతను హనుమంతరావును.. కలిశారో లేదో తెలియదు మళ్ళీ నన్ను ఎప్పుడూ కలువ లేదు . గర్భస్థ శిశువు లా ఇంకా పురుడు పోసుకొని జర్నలిస్ట్ ను చంపేశానో లేదో తెలియదు . ****95లో ఎన్టీఆర్ ను దించినప్పుడు అప్పుడుడప్పుడే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది . బాబు శిబిరం , ఎన్టీఆర్ శిబిరాలుగా టీడీపీ విడిపోయింది . ఈ రోజు వార్తలను మరుసటి రోజు రోజుకు గంట ప్రసారం చేసే రోజులు అవి .. కమ్యూనిస్ట్ పార్టీ శాసన సభ్యులు నర్రా రాఘవరెడ్డిని ఛానల్ మహిళా రిపోర్టర్ మీరు బాబు గ్రూప్ నా ? ఎన్టీఆర్ గ్రూప్ నా ? అని అడిగింది . రాఘవరెడ్డి కూడా టీడీపీ శాసన సభ్యలు అని ఆ అమ్మాయి అనుకుంది . అది విన్న తలపండిన జర్నలిస్టులు చాలా మంది ఆ ప్రశ్నను ఘోరమైన తప్పుగా చూశారు . దాన్నే తప్పు కుంటే ఈనాటి యూ ట్యూబ్ ఛానల్స్ జర్నలిజం ను ఏమనాలో .. చిన్నప్పటి నుంచి హైదరాబాద్ నగరం లోనే జీవితం . చిన్నప్పుడు పలువురు పేరు మోసిన రౌడీలా పేర్లు వినిపించేవి . పేర్లు వినే వణికి పోయే వాళ్ళం ... ఆ పేర్లలో ఇప్పటికీ బతికి ఉన్న కొందరి దివ్య మంగళ రూపాన్ని యూ ట్యూబ్ ఛానల్స్ వల్ల చూసే భాగ్యం లభించింది . ఆ పుణ్య దంపతుల ఇంటర్వ్యలు , వారి నిజ గృహంబులను చక్కగా చూపిస్తున్నారు . నా బాల్యంలో పేరు మోసిన రౌడీలు ఇప్పుడు యూ ట్యూబ్ ఛానల్స్ లో జాతిని ఉద్దేశించి చక్కని సందేశాలు కూడా ఇస్తున్నారు . యూ ట్యూబ్ ఛానల్స్ తరుపున ఇంటర్ వ్యూ చేసేవారు సైతం వయసుకు మించిన నటనా కౌశల్యం ప్రదర్శిస్తూ వారు చెప్పే మాటలు వింటూ చక్కగా ఆశ్చర్యాన్ని నటిస్తున్నారు . ***** యూ ట్యూబ్ ఛానల్స్ యేనా ? మిగిలిన మీడియా పవిత్రమైనదా ? అనే ప్రశ్న రావచ్చు . పార్టీలకు అనుబంధం లేకుండా ఏ మీడియా లేదు . ఈ దేశంలో మీడియా పుట్టిందే పార్టీలకు అనుబంధంగా . బ్రిటిష్ పాలనా కాలం లో కాంగ్రెస్ పార్టీ , మీడియా , స్వతంత్ర సమర యోధులు ఒకే లక్ష్యం తో పని చేశారు . దేశానికి స్వతంత్రం తేవాలి అనే లక్ష్యం తో కాంగ్రెస్ నాయకులే పత్రికలను ప్రారంభించారు . ఆ రోజులు , ఆనాటి మీడియా లక్ష్యాలు వేరు , ఇప్పుడు వేరు ... ఇప్పుడు శాసన సభ్యులే కాదు టికెట్ ఆశిస్తున్న వాళ్ళు , లోకల్ లీడర్లు కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్నారు . మా పార్టీ వాళ్లే యూ ట్యూబ్ ఛానల్స్ పెట్టి తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల మీద ఫిర్యాదు చేశారు . డజన్ల కొద్ది యూ ట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్న నాయకులు ఉన్నారు . ఓ ఇంటర్స వ్యూ లో రాంగోపాల్ వర్మ వెల్లువెత్తిన యూ ట్యూబ్ ఛానల్స్ గురించి మాట్లాడుతూ వీటిని ఎవరూ ఆపలేరు . కాలం గడిచిన తరువాత అబద్దాల ఛానల్స్ పోతాయి , నాణ్యత ఉన్నవి మిగులుతాయి అన్నారు . రోగాన్ని దాచిపెట్టుకుంటే ఆరోగ్యాంగా ఉన్నట్టు కాదు . రోగం ఉందని గుర్తిస్తే చికిత్స లభిస్తుందేమో . రాం గోపాల్ వర్మ జోస్యం నిజం కావాలి అని ఆశించడం తప్ప , ప్రస్తుతానికి చేయగలిగింది ఏమీ లేదు . BUDDHA MURALI

5, సెప్టెంబర్ 2023, మంగళవారం

సగటు జర్నలిస్ట్ జీవితంలో రోజూ బ్రహ్మానందమే .... ఎడిటర్ ల వేధింపులు ఎలా ఉంటాయంటే ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 87

సగటు జర్నలిస్ట్ జీవితంలో రోజూ బ్రహ్మానందమే .... ఎడిటర్ ల వేధింపులు ఎలా ఉంటాయంటే ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు - 87 -------------------------------------- "మీకేంటి రెండు చేతులా సంపాదిస్తారు .. జీతానికి జీతం పై ఆదాయానికి పై ఆదాయం " ఈ మాట ప్రతి జర్నలిస్ట్ తన వృత్తి జీవితంలో అనేక సార్లు విని ఉంటారు . జర్నలిస్ట్ జ్ఞాపకాలు రాస్తుంటే కూడా కొందరు తెలిసిన వారు జర్నలిస్టులకు రెండు చేతులా ఆదాయం ఉంటుంది మీ రెమో దిన దిన గండం అని రాస్తున్నారు అని అడిగారు . వారి సందేహాలు నిజమే , జర్నలిస్టుల జీవితాలు దిన దిన గండం నిజమే . ఓ సినిమాలో బ్రహ్మానందం ఒక వైపు బాధపడుతున్నట్టు నటిస్తూ మరు క్షణమే ఇంకో వైపు సంతోష పడుతున్నట్టు అద్భుతంగా నటన పండించాడు . చాలా మంది జర్నలిస్ట్ లు ఇలాంటి నటనను దాదాపు రోజూ తన వృత్తి జీవితంలో ప్రదర్శించాల్సి ఉంటుంది . బయటి వారే కాదు రిపోర్టర్ లను చూసి సబ్ ఎడిటర్ లు , సబ్ ఎడిటర్ లను చూసి రిపోర్టర్ లు మా కంటే వీరి జీవితమే బెటర్ అని ఈర్ష పడుతుంటారు . నెల నెల జీతం ఇచ్చే పత్రికల్లో జర్నలిస్ట్ లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని , అప్రమత్తంగా పని చేయాల్సి ఉంటుంది . జీతం ఇవ్వడం మాట దేవుడెరుగు ఉల్టా జర్నలిస్ట్ ల వద్దనే డబ్బులు తీసుకోనే మీడియాలో వారు ఆడింది ఆటగా ఉంటుంది . తిను తినిపించు అనే నినాదం ను వీరు నమ్ముతుంటారు . అప్పుడుడప్పుడు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న జర్నలిస్ట్ ల అరెస్ట్ అంటూ వచ్చే వార్తలు ఇలాంటి వారి గురించే . నెల నెల జీతం ఇచ్చే సంస్థల్లో జర్నలిస్ట్ ల జీవితాలు మాత్రం దిన దిన గండం లాంటిదే . ఉద్యోగం నిలుపుకోవడానికి బ్రహ్మానందం ను మించి నటించాల్సి ఉంటుంది . సంస్థ లో ఒక్కరు కాదు బోలెడు మంది బాస్ లు ఉంటారు . కొన్ని సంస్థల్లో బాస్ ల సొంత పనులు చేయకపోయినా ఇబ్బందే .. ఇదే సమయంలో ఇలాంటి పైరవీలు ఎంజాయ్ చేస్తూ ఎదిగే వారు కూడా ఉంటారు . మీరు ఎన్నయినా చెప్పండి .. నిజాయితీ గా మన పని మనం చేస్తే బాస్ కే కాదు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అని సినిమా డైలాగు చెప్పవచ్చు కానీ వాస్తవ పరిస్థితి అలా ఉండదు . **** ఒకరోజు ఆఫీస్ కు వెళ్ళగానే వాతావరణం వేడిగా ఉంది . చీఫ్ రిపోర్టర్ యస్ ఎన్ సి ఎన్ ఆచారిని పిలిచి ఎడిటర్ శాస్త్రి చెడా మడా తిట్టి పంపించారు . సాధారణంగా ఏదైనా ముఖ్యమైన వార్త మిస్ అయితే అలా తిడతారు . దానితో రిపోర్టర్ లు అందరూ అప్రమత్తమైన తమ బీట్ కు సంబంధించిన వార్త ఏమైనా మిస్ అయిందా అని అన్ని పత్రికలు చూశారు . ఏమీ మిస్ కాలేదు . మరి దేనికోసం ఆ తిట్లు అని విచారిస్తే ... ఆస్ట్రేలియాలో భారీ భూకంపమో ఏదో ప్రకృతి వైపరీత్యం .. ఆ వార్త భూమిలో మిస్ అయ్యారు . విషయం తెలిసి ఆఫీస్ లో మౌనంగానే ఉండి .. నవ్వు ఆపుకోలేక మిత్రులం టీ డబ్బా వద్దకు వెళ్లి పగలబడి నవ్వుకున్నాం . ఆస్ట్రేలియాలో ఏదో జరిగితే హైదరాబాద్ లో ఉన్న రిపోర్టర్ కు ఏం బాధ్యత అది డెస్క్ వాళ్ళ పని ... ఐతే ప్రతి తిట్టుకు తెరవెనుక ఓ కథ ఉంటుంది . ఎడిటర్ ఎక్కువ సమయాన్ని పుస్తకాలు రాయడానికి ఉపయోగిస్తారు . యజమాని దృతరాష్ట్రుడు అయినప్పుడు దుర్యోధనుడు పూనడం సహజం . ఈ పుస్తకాలను అమ్మడం జర్నలిస్టుల ప్రధాన విధిగా మారిపోతుంది . ప్రభుత్వ సంస్థలకు పెద్ద మొత్తంలో పుస్తకాలు అంటగట్టారు . బిల్లులు మాత్రం రావడం లేదు . ముఖ్యమంత్రి స్థాయిలో చెబితే తప్ప పని కాదు . అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి . కిరణ్ కుమార్ రెడ్డి ఆచారికి సన్నిహితుడు .. ఎంత స్నేహం అంటే ఓ సారి చారికి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేస్తే చారి బాబాయ్ నేను పనిలో ఉన్నాను , తరువాత నేనే కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేయడం నా ముందే జరిగింది . అంత సన్నిహితంగా ఉండేవారు పని చెబితే చేయడం లేదు అంటే ఎవరూ నమ్మరు . పుస్తకాల బిల్లుల కోసం ఎడిటర్ చారి మీద ఒత్తిడి , చారి వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డిని బతిమిలాడడం అసంకల్పిత ప్రతీకార చర్య సూత్రం లా వరుసగా జరుగుతున్నా బిల్లు మాత్రం మంజూరు కాలేదు . బిల్లు కోసం చారి చిత్త శుద్దితో ప్రయత్నం చేయడం లేదు అని ఎడిటర్ నమ్మకం . చారి ఎంత ప్రయత్నించినా కిరణ్ కుమార్ రెడ్డి వినలేదు . దాంతో అమెరికాలో తుఫాన్ఏం వచ్చినా , , ఆస్ట్రేలియాలో భూకంపం వచ్చినా చారి వణికిపోయే పోయే పరిస్థితి . పుస్తకాల డబ్బుల కోసం ఎడిటర్ కక్ష కట్టాడు అని అర్థమైన చారి ఇక ఉండలేను అని గ్రహించి భూమిని వదిలేసి డక్కన్ క్రానికల్ లో చేరిపోయారు . మనం నిజాయితీ గా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు అనే డైలాగు ఇతర ఉద్యోగాలకు పని చేస్తుందేమో కానీ జర్నలిస్ట్ లకు పని చేయదు . ఎడిటర్ పని కాక పోయినా , ఓనర్ కు కోపం వచ్చినా వణికిపోవలసిందే . ఇదే సమయంలో ఓనర్ పనులు, ఎడిటర్ పనులు చేస్తూ సొంత పనులు చక్కపెట్టుకుని ఎంతో ఎత్తుకు ఎదిగి ఓనర్లు గా మారి సమాజానికి నైతిక విలువలు బోధిస్తున్నవారు కూడా ఉన్నారు . . అదేదో సినిమాలో పాము కాటుకు మంత్రం వేసే వాడు పాము కాటుకే పోయాడు అని శ్రీ హరి చెప్పిన డైలాగులా , పుస్తకాల అమ్మకాల కోసం ఎందరినో బ లి చేసిన ఎడిటర్ ఉద్యోగం చివరకు ఆ పుస్తకాల కాటుతో ఊడింది . ఆ కథ మరోసారి .. - బుద్దా మురళి