31, ఆగస్టు 2011, బుధవారం

ఆరనీకుమా.. ఈ దీపం!....కోట్ల మంది భారతీయుల ఆశాదీపాన్ని రక్షించిన జగన్‌...చంద్రబాబు

అవినీతిపై ఉద్యమ అగ్నిని రాజేసేందుకు అన్నా హజారే సింబాలిక్‌గా ....ప్రమిదలో నూనె పోసి దీపం ముట్టించారు. గిట్టని వారెవరో ప్యాన్ వేయడంతో బలంగా గాలి వచ్చి దీపం రెపరెపలాడింది. ఆ దీపం ఆరిపోతుందా? దాన్ని నిలిపే వారే లేరా? ఊపిరి నిలిచిపోతుందేమో! అన్నంత టెన్షన్‌గా కుటుంబరావు టీవినే చూస్తున్నాడు. ఆ ఘోరాన్ని ఇక చూడలేను అని కళ్లు మూసుకోబోతుంటే ఎక్కడి నుండో నాలుగు చేతులు వచ్చి రెపరెపలాడుతున్న ఆ దీపాన్ని ఆరిపోకుండా రక్షించాయి.

క్లోజప్‌లో చూస్తే ఆ నాలుగు చేతుల్లో రెండు చంద్రబాబువి, మిగిలిన రెండు జగన్‌వి. ఇద్దరు తమ నాలుగు చేతులను అడ్డుగా పెట్టి దీపాన్ని రక్షించారు. ఆ దీపం ఈ దేశంలోని నైతిక నియమాలకు , దేశ ప్రతిష్ఠకు ప్రతీక. వంద సుమోలను గాలిలోకి లేపే మహేష్‌బాబు కన్నా, కంటిచూపుతోనే వందలమందిని చంపే జూనియర్ ఎన్టీఆర్ కన్నా వంద కోట్ల మంది భారతీయుల ఆశాదీపాన్ని రక్షించిన వారిద్దరికీ ఈ జాతి ఋణపడి ఉండి తీరాలి అని తనలో తానే అనుకున్నాడు కుటుంబరావు.



షాక్ తిన్నట్టనిపించి బుర్ర విదిలించి టీవిని పరీక్షగా చూశాడు. ఇప్పటి వరకు తాను చూసిన తెరపై బాబు, జగన్‌లకు బదులు. పవన్ కళ్యాణ్, భూమిక కనిపిస్తున్నారు. అది ఖుషీ సినిమా . ఆలయంలో వికలాంగురాలైన అమ్మాయి దీపం ముట్టించి, దేవతను మొక్కుతోంది. ఇంతలో గాలి రావడంతో దీపం రెపరెపలాడుతుంది. దీపం ఆరిపోతుందేమో అని ప్రేక్షకులు ఊపిరి బిగపట్టి చూసే లోగా ఒకవైపు నుండి పవన్ కళ్యాణ్, మరోవైపు నుంచి భూమిక పరిగెత్తుకు వచ్చి రెండు చేతులు అడ్డం పెట్టి దీపం ఆరిపోకుండా చేస్తారు. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటారు. ప్రేమను పంచుకునే హీరోహీరోయిన్ ఉన్న ఈ దృశ్యంలో కత్తులు దూసుకునే ఇద్దరు నాయకులు కనిపించడంతో తనను తాను గిల్లుకొని కలకాదు నిజమే అనుకున్నాడు.


 బుర్ర తిరిగినట్టు అనిపించడంతో చానల్ మార్చేశాడు....కామెడీ చానల్ లో చందన బ్రదర్స్ బొమ్మన సిస్టర్స్ సినిమా. నరేశ్‌ను చూడగానే నవ్వు వస్తుంది. హీరో కుటుంబం అంతా దొంగలే. జాగ్రత్తగా ఉండే వాడి జేబును దోచుకోగలిగిన వాడికి అజాగ్రత్తగా ఉండే అందమైన అమ్మాయి హృదయాన్ని దోచుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నమ్మడమే కాకుండా ఆచరణలో చూపెట్టిన చిలిపి దొంగలు. హీరోయిన్‌కు భక్తి ఎక్కువే. ఇంకేం దొంగ నరేశ్ భక్తరామదాసు ఐపోతారు. అంతా రామమయం ఈ జగమంతా రామయం అంటూ నాగార్జున నటించిన రామదాసు పాటను తాను పాడుతున్నట్టు వినిపిస్తాడు. సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్టులకు భక్తుల వేషం వేయిస్తాడు. అనుకున్నట్టుగానే అందమైన హీరోయిన్ హీరో దొంగ భక్తికి పడిపోతుంది. హృదయాన్ని అప్పటికప్పుడే ఇచ్చేసి మిగతావివరాల కోసం ఇంటికి రమ్మంటుంది. హీరోయిన్ వెళ్లిపోగానే జూనియర్ ఆర్టిస్టుల సప్లైయర్ రెండులక్షల ఆరువేల ఇమ్మంటాడు. అదేంటి మనం మాట్లాడుకున్నది ఆరువేలే కదా? అంటే కిరాయి ఆరువేలు, నీ ఓవర్ యాక్షన్ చూడలేక ఓ జూనియర్ ఆర్టిస్ట్ కన్నుమూశాడు వాడికి రెండు లక్షలు అంటాడు. శవం పక్కనున్న మరో జూనియర్ ఆర్టిస్ట్ దొంగ సచ్చినోడా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశాం కానీ ఇంత ఓవర్ యాక్షన్ ఎక్కడా చూడలేదు, నీ యాక్టింగ్‌తో నిండు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నావు కదరా! అని శపిస్తుంటుంది. అసలు జీవితంలో నవ్వని నాయకులు సైతం ఈ సీన్ చూసి పడిపడి నవ్వాల్సిందే!


 నవ్వు నుండి తేరుకోక ముందే ప్రకటనలు రావడంతో చానల్ మార్చాడు. అది న్యూస్ చానల్ ఇద్దరు నాయకులు అవినీతికి వ్యతిరేకంగా మహోపన్యాసాలు చేస్తున్నారు. మనిషి చనిపోయిన తరువాత మూడు రోజులకే మరిచిపోతున్న రోజులివి అలాంటిది ఏడాది తరువాత కూడా యువనేత ఓదార్పు అంటూ, పనిలో పనిగా అవినీతికి వ్యతిరేకంగా సమాజం ఎలా అభివృద్ధి చెందాలో చెబుతున్నాడు. మరో నాయకుడు విద్యా వ్యాపార కేంద్రాలకు వెళుతూ అవినీతికి వ్యతిరేకంగా విలువలతో కూడిన సమాజాన్ని ఎలా నిర్మించాలో బోధిస్తున్నాడు. సార్ ఆయన ఉపన్యాసాలతో మన విద్యార్థుల్లో చైతన్యం పెరిగి మనం ఇష్టనుసారంగా వసూలు చేసే ఫీజులకు వ్యతిరేకంగా ఉద్యమించే ప్రమాదం ఉందని కాలేజీ కరస్పాండెంట్ ఒకరు ఆందోళన వ్యక్తం చేస్తే, కాలేజీ ఎమ్‌డి చిరునవ్వు నవ్వి పిచ్చివాడా! ఉపన్యాసాలకే ఏదో ఐ పోతే దేశంలో ఏడాదికి మూడువందల విప్లవాలు వస్తాయి అన్నాడు.


 ఎవరు రాసిచ్చారు అని కాదు కానీ నైతికమైన విలువల గురించి ఇద్దరు నాయకులు చేస్తున్న మహోపన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. వృద్దుడి ఆకస్మిక మృతి, యువకుడు ఆత్మహత్య అంటూ బ్రేకింగ్ వార్తలు వస్తున్నాయి. ఇద్దరు మహానాయకులు నైతిక నియమాలపై చేస్తున్న మహోపన్యాసాలు వినగానే మీటింగ్‌కు తీసుకు వచ్చిన ఒక వృద్దుడు మరణించడంతో గందరగోళంగా మారింది అని స్పాట్ నుండి లైవ్‌గా రిపోర్టర్ వార్త అందిస్తున్నాడు. ఒక యువతి పాపాత్ముడా! నిండు ప్రాణాన్ని బలిగొన్నావు కదరా! ఆరోగ్యంగా ఉన్నాడు వారానికి నాలుగైదు మీటింగ్‌లకు వెళ్లివస్తున్నాడు. తన జీవితంలో కొన్ని వేల మీటింగ్‌లు విన్నాడు... ఎప్పుడూ తలనొప్పి అని కూడా అనలేదు. మీటింగ్‌లు వినందే నిద్ర పోని స్థితికి చేరుకున్నాడు. అంతటి ఆరోగ్యవంతుడిని నీ ఉపన్యాసంతో మింగేశావు కదరా! ఈ పాపం ఊరికే పోదు. మరీ అవినీతిపై అంతేసి మాటలా? పొట్టకూటి కోసం వస్తే ప్రాణాలు తీసేట్టుగా మాట్లాడతారా? అంటూ ఇంకా ఏవేవో తిడుతూనే ఉంది



కుటుంబరావు కంగారుగా టీవిలో ఒకటుంటే నాకు మరోటి కనిపిస్తోంది. నాకేమైంది అని వెర్రి చూపులు చూడసాగాడు. ‘‘ భార్య పరిగెత్తు కొస్తూ, ఆ ఉపన్యాసాలు వినకండి అంటే వినకపోతిరి, ఆ జూనియర్ ఆర్టిస్ట్ చనిపోయినట్టు మీరు పోతే పిల్లల గతేం కాను. నా గతేం కాను’’ అని ఏడుపు మొదలు పెట్టింది....

30, ఆగస్టు 2011, మంగళవారం

బతుకులో సరే... తెరపైనా ఏడుపేనా..?





* కాపురాలను కలుపుతున్న రాఖీ * ఏడిపిస్తున్న సుమలత




జీవితంలో బాధలు, కన్నీళ్లు, ఏడుపులు సహజమైనవే. సమస్యలు లేని జీవితాన్ని ఊహించలేం. బహుశా సమస్యలు లేకపోతే మనిషి జీవితం నిస్సారంగా ఉంటుందేమో! జీవితంలో సమస్యలు అనివార్యం అయినా సగటు జీవి సినిమాలకు వెళ్లినా, టీవీలు చూసినా కాసేపు రిలాక్స్ అవుదామని, తన సమస్య ఆలోచన నుండి కాసేపు బయటపడదామని. అంతే తప్ప ఎవరి ఏడుపునో విని మనం కూడా ఏడుద్దామని టీవీ చూసేవారు ఉండరు.
జీ తెలుగు చానల్‌లో గత ఏడాది నుండి ‘బతుకు జట్కాబండి’ కార్యక్రమాన్ని అప్పటి హీరోయిన్ సుమలతతో నిర్వహిస్తున్నారు. కార్యక్రమ ఉద్దేశం మంచిదే. సుమలత అందమైన హీరోయిన్ కూడా. ఉద్దేశం మంచిదైనప్పటికీ కార్యక్రమం రూపకల్పనలోనే ఏదో లోపం ఉంది. భార్యా భర్తల మధ్య తగాదాలు, విడాకులు, ఘర్షణలు, అత్తా కోడళ్ల కలహాలు శృతిమించి విడాకుల వరకు వచ్చిన కేసులను ‘బతుకు జట్కా బండి’లో చర్చిస్తున్నారు. వారి మధ్య వివాదాలను తొలగించి కలిపి ఉంచాలనేది కార్యక్రమ ఉద్దేశం. కానీ అలా జరగడం లేదు. చివరకు ఈ కార్యక్రమంలోనే కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఒక దశలో మీరిలా తిట్టుకుంటే నేను ఇక్కడ ఉండను అని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సుమలత మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకునే ముందు హిందీలో ప్రముఖ చానల్ ఇమేజెస్‌వైపు ఒకసారి వెళదాం. సరిగ్గా ‘బతుకు జట్కా బండి’ కార్యక్రమం మాదిరిగానే ప్రముఖ శృంగార తార రాఖీసావంత్ ‘గజబ్ దేశ్‌కీ అజబ్ కహానియా’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కానీ నిర్వహణ తీరులో ఏ మాత్రం సంబంధం లేదు. దాదాపు అర్ధనగ్నంగా కనిపించే రాఖీసావంత్ సరదాగా మాట్లాడుతూ ప్రేక్షకులను టీవీల ముందు కదలకుండా చేస్తుంది. ఒక తల్లి ఒక కొడుకు, కూతురు. తల్లీ కొడుకు మధ్య పనె్నండేళ్ల నుండి మాటలు లేవు. నన్ను కొడుకుగానే చూడలేదు అందుకే నేను మాట్లాడలేదు అని కొడుకు తనను తాను సమర్ధించుకున్నాడు. వారిద్దరిని కలపడానికి నీవేమైనా ప్రయత్నం చేయలేదా? అని కూతురును అడిగితే తల్లికి చెప్పకుండా ఒకసారి ఆమె పుట్టిన రోజున ఇంట్లో కేక్ కట్ చేయించడానికి ఏర్పాటు చేశాం, కానీ తల్లి కోపంగా కేక్‌ను విసిరిపారేసింది... అని చెప్పింది. సరే ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది మీరిద్దరు కలవవచ్చు కదా అని రాఖీసావంత్ చలాకీగా ఇద్దరినీ ఒక దగ్గరకు చేర్చింది. చిత్రంగా వారిద్దరు కన్నీళ్లు కారుస్తూ ఏకమయ్యారు.
పనె్నండేళ్ల నుండి తల్లీ కొడుకు మధ్య మాటలు లేకపోవడం ఒక విడ్డూరం అయితే అరగంటలోనే వారు ఏకం కావడం అంత సులభమేమీ కాదు. బహుశా ఈ కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి ఉంటారు. ఇద్దరం కలవడానికి సిద్ధంగా ఉన్నామని వారు అంగీకరించిన తరువాతనే వారితో కార్యక్రమం నిర్వహించి ఉంటారు. అయినప్పటికీ ఒక మంచి ఉద్దేశంతో నిర్వహించిన కార్యక్రమం ఉద్దేశం నెరవేరినట్టు అయింది. చూసేవారికి తల్లీ కొడుకు కలిశారనే సంతోషం ఉంటుంది. రాఖీసావంత్ ఉల్లాసపరుస్తుంది.
ఇమేజ్ చానల్ కన్నా ఏడాది ముందుగానే జీ తెలుగులో ఈ కార్యక్రమం మొదలైనా పెద్దగా ఆకట్టుకోకపోవడానికి కారణం. స్టూడియోకు పిలిచి కుటుంబాలను అక్కడే కొట్టుకునేట్టు చేయడం. కొన్ని కేసుల్లో అప్పటి వరకు ఉన్న చిన్న చిన్న గొడవలు కూడా స్టూడియోలకు వచ్చిన తరువాత మరింత ముదిరిపోతున్నాయి. ఒకరి కుటుంబంలోని సమస్యలను వీధిలోకి తీసుకురావడమే తప్పు అనుకుంటే మరీ స్టూడియోకి తీసుకు వచ్చి వారిని మరింత క్షోభకు గురిచేస్తున్నారు. ఇమేజెస్ చానల్ తరహాలో ఆ కుటుంబాన్ని కలపడానికి కృషి చేయాలి. ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించి, సమస్య పరిష్కారానికి అంగీకరించిన తరువాత స్టూడియోకు పిలిస్తే బాగుంటుంది కానీ తాత్కాలికంగా విడిపోయిన కుటుంబాలను కలిపే విధంగా ఉండాలి. అదే సమయంలో ప్రేక్షకులు ఆ కార్యక్రమాన్ని ఆస్వాదించగలగాలి. బతుకు జట్కాబండిలో ఇది లోపించింది.
పాపం.బాబు
ఎబిఎన్ చానల్ యంగిస్తాన్‌లో చంద్రబాబు పరిస్థితి చూసి ఆయన అభిమానులే కాదు చివరకు ఆయన వ్యతిరేకులు సైతం జాలిపడ్డారు. వ్యక్తిగత జీవితంలో యాంకర్‌కు, నాయకునికి ఎంత సన్నిహిత సంబంధం అయినా ఉండవచ్చు. ఉమ్మడిగా ఎలాంటి వ్యవహారాలైనా చేసి ఉండవచ్చు కానీ నలుగురు చూసేప్పుడు వ్యవహరించాల్సిన తీరు అది కాదు. విజ్ఞాన్ కాలేజీలో యంగిస్థాన్‌లో విద్యార్థులు ఏదో అడుగుతుంటే చంద్రబాబు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే నువ్వుండు నేను చెబుతాను.. అని ఒకసారి. అవినీతి విషయంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఒకరే నేను మాట్లాడతాను అంటూ బాబును తీసిపారేస్తూ యాంకర్ మాట్లాడడం బాబుకు ఎలా ఉన్నా వినేవారికి నచ్చదు. వ్యక్తిగతంగా బాబు ఏమైనా కావచ్చు కానీ ప్రతిపక్ష నాయకుడు, తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించారు. మీడియాలో కనిపిస్తే చాలు అనుకుంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవు. మళ్లీ అధికారం వచ్చే విషయం ఎలా ఉన్నా నాయకులు హుందాగా ఉండాలి. వ్యక్తిగత సంబంధాలు వేరు చానల్‌లో ప్రజలకు కనిపించేటప్పుడు తమ హోదాను గుర్తుంచుకోవాలి. బహుశా ఎబిఎన్‌లో అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మరుసటి రోజు మరో కాలేజీలో స్టూడియో ఎన్‌లో సుదీర్ఘ ఏకపాత్రాభినయం చేశారు.
మోజు తీరిందా?
అన్నా హజారే దీక్షపై హడావుడి చేసిన జాతీయ చానల్స్ బహుశా వారికే రొటీన్ అనిపించినట్టుగా ఉంది కొంత మసాలా జోడించారు. శుక్రవారం ఉదయం స్టార్ న్యూస్‌లో అన్నా దీక్ష శిబిరం వద్ద జరిగిన గొడవలు చూపారు. దాదాపు పది పదిహేను మంది యువకుల గుంపు తలపై గాంధీ టోపి, చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని తాగి వచ్చి చివరకు పోలీసులపైనే దాడి చేశారు. పోలీసులు పారిపోయేట్టుగా కొట్టారు. టీవీ కెమెరాలు అక్కడే ఉన్నా ఈ యువత భయపడలేదు... సిగ్గుపడలేదు. ఒకవైపు అన్నా శిబిరం వద్దకు తాగి రావద్దని, గొడవ చేయవద్దని పదే పదే చెబుతున్నా వారు పట్టించుకోలేదు. మరి కొంత మంది యువకులు ఇండియా గేట్ వద్ద ఒక్కో బైక్‌పై నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురేసి చొప్పున హెల్మెట్ లేకుండా స్పీడ్‌గా వెళుతూ హంగామా సృష్టించారు.
దేశవ్యాప్తంగా శాంతియుతంగా మద్దతు పలుకుతున్న సమయంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే పట్టించుకోవలసిన అవసరం లేదనిపించవచ్చు. కానీ మీడియాకు హజారేలో గాంధీ కనిపించినప్పుడు ఇలాంటివి కనిపించవు, క్రమంగా మోజు తీరితే ఇలాంటివే హైలెట్ అవుతాయి.

24, ఆగస్టు 2011, బుధవారం

పాడులోకానికో తోడులోకం...... ‘‘అమెరికా సంబంధం చేసుకోవలసిన ఖర్మ పట్టలేదు.’’

''పిన్నిగారు మీ పిల్లలకు సంబంధాలు చూస్తున్నారటకదా! ’’ అంటూ ప్రశ్నను సంధించింది అదో రకంగా నవ్వుతూ మీనాక్షి. ‘‘ఆ చూస్తున్నాం.... ’’ అని ఊర్మిళ ముక్తసరిగా సమాధానం చెప్పింది. ‘‘సంబంధాలు కుదరడం కష్టంగా ఉన్నట్టుంది’’ అని మీనాక్షి పొడిగిస్తూ మరో ప్రశ్న వేసింది. ‘‘అలా ఏమీ లేదు’’ అంటూ ఊర్మిళ నీవెంత ఉడికించాలని చూసినా నేను ఉడుక్కోకుంటా నినే్న ఉడికిస్తాను అన్నట్టుగా మళ్లీ ముక్తసరిగానే సమాధానం చెప్పింది. తాను ప్రశ్నను పదిహేను మార్కల కోసం రాయాల్సిన వ్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని అడిగితే ఊర్మిళ మాత్రం ఒక్క మార్కు ప్రశ్నలా ముక్తసరిగానే సమాధానం చెప్పింది.

‘‘మొన్న మీరు అమెరికా సంబంధం గురించి వాకబు చేసినట్టు పనిమనిషి కూతురు చెప్పింది, అది నాకు నమ్మబుద్ధి కాలేదు. నిజమో కాదో తెలుసుకుందామని’’ అంటూ మీనాక్షి ఇప్పుడు ప్రశ్ననే వ్యాసంగా ఉన్నప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను అన్నట్టుగా ఓ లుక్కెసింది. ‘‘ అప్పటి వరకు ఔను.. కాదు. స్థాయి టైపు సమాధానలతో సరిపుచ్చిన ఊర్మిళ ఈ ప్రశ్నతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది.‘‘ అమెరికా సంబంధం చూడడానికి మేమంత గతిలేని వాళ్లమేమీ కాదు’’ అని రోషంగా పలికింది. ‘‘అమెరికా సంబంధం చేసుకోవలసిన ఖర్మ మాత్రం మా పిల్లలకు పట్టలేదు. మన దేశంపై ఆధారపడి బతికే అమెరికా సంబంధం ఎలా చేసుకుంటాం? అప్పుల్లో మునిగిపోయిన వాడి కుటుంబంతో సంబంధం కలుపుకుంటామా? అమెరికా అప్పులు పెరిగాయి, పరపతి తగ్గింది. వారి పరిస్థితి అచ్చం మొన్న దివాళా తీసిన మీ పిన్ని కొడుకు సూరయ్యలా తయారైంది కదూ’’ అని ఊర్మిళ దెప్పి పొడిచింది. ఎంత దెబ్బకొట్టావే అని మనసులోనే అనుకుంది మీనాక్షి.‘‘వారి సంగతి వదిలేయండి ఇంతకూ సంబంధాలు ఎక్కడ చూస్తున్నారేమిటి? ’’ అని మామూలు స్థాయికి వచ్చి మీనాక్షి ప్రశ్నించింది.

‘‘నీ దగ్గర దాపరికమేముంది. మరో లోకంలో మంచి సంబంధం ఉందని ఆ పేరయ్య చెబితే మొన్ననే మా వారిని పంపించాను. ఈ పాటికి చేరాలి, ఇంకా ఫోన్ రాలేదు. పూర్వం మన రైళ్లలానే ఇప్పుడు మరో లోకానికి అంతరిక్ష యాత్రకు సైతం వేళాపాళా లేదొదినా ? ఇండియా వాడు మరో లోకానికి విమానాలు నడిపినా ఇండియన్ టైంను మాత్రం మేయిన్‌టెయిన్ చేస్తున్నాడు’’ అని ఊర్ళిళ అనగానే ఇద్దరూ నవ్వుకున్నారు.

****
టీవిలో గట్టిగా నవ్వులు వినిపించగానే ఊర్ళిళకు మెలుకువ వచ్చింది. ఇప్పటి వరకు నేను కల కన్నానా? అనుకుంటూ మంచం మీది నుంచి లేచింది. ప్రస్తుతం మనం ఉన్న విశ్వంలో మరిన్ని విశ్వాలు ఉండే అవకాశం ఉందని, అంతర్జాతీయ ఖగోళ శాస్తవ్రేత్తలు కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. మన విశ్వం ఆవిర్భవించినట్టుగానే ,మరిన్ని చిన్న విశ్వాలు ఏర్పఉండే అవకాశాలున్నట్టు లండన్ శాస్తవ్రేత్త డేనియల్ మార్క్‌లాక్ వివరించినట్టు వార్తల్లో చదివింది. అలా చదువుతూ నిద్రపోయిన ఊర్ళిళ ఏకంగా ఆ కొత్త లోకంతో పిల్లలకు సంబంధాలు కుదుర్చుకోవాలనే ఆలోచన తనకువచ్చినందుకు నవ్వుకుంది. పాడు లోకానికో తోడు లోకమన్నమాట అనుకుంది. అన్నీ జంటగా ఉన్నప్పుడు ఈ విశ్వం మాత్రం ఒంటరిగా ఉండడం ఏమిటి? దానికో జంట ఉండడం న్యాయమే అనిపించింది. ఒకటికన్నా రెండు ఎంతో గొప్పది.
 తిరుమల శ్రీవెంకటేశ్వరుడి నిలయం ప్రపంచంలోని ఆలయాల్లోకెల్లా సంపన్న ఆలయం కావడం వెనుక అసలు కారణం ఏమిటి? బహుశా ఆయన ఇద్దరు భార్యల భర్త కావడమేనేమో!
 మరి తలపై గంగ, పక్కన పార్వతి ఉన్న శివుడి నివాసం ఎక్కడ? ఆయన ఆలయాల్లో సంపద కనిపించదు కదా? అని అంటారా? అనుకూలంగా ఉన్న ఉదాహరణలనే వాడుకుంటాం!


 చాలా మంది నటులు, పారిశ్రామిక వేత్తలు జీవితంలో ఒక ఉన్నత స్థానానికి చేరుకున్న తరువాత రెండో పెళ్లితో పరిపూర్ణులవుతారు.
రెండు అంకె చూడగానే గుర్తుకొచ్చే నాయకుడు బాబుగారు. మన చేతి రెండు వేళ్లపై కూడా ఆయనే కాపిరైట్ హక్కులు కలిగి ఉన్నారేమో అనిపించేంతగా రెండుకు ఆయన ప్రచారం కల్పించారు. ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రి , రెండు సార్లు ప్రతిపక్ష నాయకుడయ్యారు. రెండో స్థానంలో ఉండి ఎన్టీఆర్‌ను దించిన తరువాత ఆయన మా పార్టీలో అంతా నంబర్‌టూలే అన్నారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమాలో తుగ్లక్ పాత్రలో నాగభూషణం ప్రధాని పదవి చేపట్టి గొడవ లేకుండా ఎంపిలంతా ఉప ప్రధానులే అనేస్తాడు. అప్పుడు ఏ ఒక్కరికో వెన్నుపోటు పొడిచే అవకాశం లేకుండా పోతుంది. తొలిసారి వెన్నుపోటులో నాదెండ్ల విఫలమైతే రెండోసారి జరిపిన వెన్నుపోటులో బాబు విజయం సాధించారు. ఆయన పాలనా కాలంలోనే రెండు రాష్ట్రాల ఉద్యమం పురుడు పోసుకుంది. చివరకు ఆయన రెండు కళ్ల సిద్ధాంతం నమ్ముకున్నారు.


స్త్రీ , పురుషులు. నాస్తికులు, ఆస్తికులు. జీవాత్మ, పరమాత్మ, సూర్య చంద్రులు. భూమి, ఆకాశం , స్వర్గం, నరకం- ఇలా అన్నీ రెండైనప్పుడు మన విశ్వానికి తోడుగా ఇంకో విశ్వం ఎందుకుండకూడదు??

22, ఆగస్టు 2011, సోమవారం

మాస్ హిస్టీరియా వచ్చినట్టుగా అవినీతిపై ఊగిపోతున్నారు.. లోక్ పాల్ పరిధిలోకి .మీడియా, కార్పొరేట్ రంగం, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌

 అదేంచిత్రమో కానీ మన దేశంలో ఒక్కో కాలంలో ఒక్కో అంశం తెరపైకి వచ్చి తెగ హడావుడి చేస్తుంది. ఇప్పుడు అవినీతిపై తీవ్ర స్థాయిలోవ్యతిరేకత కనిపిస్తోంది. స్కూల్ పిల్లలు మొదలుకుని ఐటి ఉద్యోగులు, వాకింగ్‌కు వెళ్లే రిటైర్డ్ ఉద్యోగులు, గృహిణులు అంతా ఒక్కసారిగా అవినీతిపైనే మాట్లాడుకుంటున్నారు. మాస్ హిస్టీరియా వచ్చినట్టుగా అవినీతిపై ఊగిపోతున్నారు. 


ఇంత మంది అవినీతిని ఇంతగా వ్యతిరేకిస్తుంటే, మరి అవినీతికి పాల్పడుతున్నది ఎవరు? అందరి సహకారం లేకుంటే అవినీతి ఎలా బతికి బట్టకడుతోంది? అన్నా హజారే సాగిస్తున్న అవినీతి ఉద్యమానికి మద్దతు తెలపనివాడిదే పాపం అన్నట్టుగా వాతావరణం ఏర్పడింది. నిజంగా భారతీయుల్లో అవినీతి పట్ల ఇంతటి ధర్మాగ్రహం ఉందా? కళ్ల ముందు కనిపిస్తున్నప్పుడు కాదని ఎలా అనగలం. మంచిదే. కానీ చిత్రం ఏమంటే ఈ మధ్యనే నిర్వహించిన ఒక సర్వేలో ప్రపంచంలోని అవినీతిమంతమైన దేశాల్లో మనం 87వ స్థానంలో నిలిచాం. మరో జాతీయ చానల్ ఇటీవల నిర్వహించిన సర్వేలో దేశంలో ప్రధాన సమస్య అవినీతి అని 61 శాతం మంది పేర్కొన్నారు.


 క్యాండిల్స్ పట్టుకుని ఊరేగడంతోనే సరిపోతుందా? మేం లంచం ఇవ్వం, తీసుకోం అని ప్రతిజ్ఞ చేస్తారా? చేస్తే ఎంత మంది ఆ మాట నిలుపుకొంటారు. ఇంత పెద్ద సంఖ్యలో జనం అవినీతిని వ్యతిరేకిస్తున్నప్పుడు అన్నాకు జై కొట్టడంతోనే బాధ్యత తీరిపోదు. లంచం ఎందుకు ఇవ్వాలి? అని ప్రశ్నించగలగాలి.
అలా ప్రశ్నిస్తున్న సూచనలు కనిపించడం లేదు. ఎవరో ఉద్యమిస్తారు, మాకు ఇప్పుడు ఎలాగోలా పని చేసుకోవడం ముఖ్యం, దాని కోసం లంచం ఇవ్వక తప్పడం లేదు అనే ధోరణి మంచిది కాదు. ఎవరో ఉద్యమించడం కాదు కానీ నా వంతుగా నేను లంచం ఇవ్వను అని నిర్ణయించుకోవచ్చు కదా! ఇంతకూ అన్నా హజారే ఉద్యమిస్తున్నది మనం నిత్యం ఎదుర్కొనే అవినీతి సమస్యపై కాదు.



 జాతీయ స్థాయిలో ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారాలపైనే అన్నా ఉద్యమిస్తున్నారు. ఐతే అది అవినీతి ఉద్యమం కాబట్టి అంతా మాస్ హిస్టీరియా మాదిరిగా అండగా నిలుస్తున్నారు కానీ అన్నా ఉద్యమిస్తున్న అంశంపై పెద్దగా అవగాహన లేదు. సాధారణ పౌరుడు మండల కార్యాలయం, మున్సిపాలిటీల్లో పనుల కోసం వెళ్లినప్పుడు అవినీతితో ఇబ్బంది పడుతున్నాడు. అన్నా చేస్తున్న ఉద్యమంలో ఈ సామాన్య సమస్య ప్రస్తావనే లేదు. ఐతే ప్రజల్లో ఈ వ్యవస్థ పట్ల, అవినీతి పట్ల తీవ్ర స్థాయిలో నెలకొన్న అసంతృప్తిని ప్రదర్శించే విధంగా ఉంది అన్నా ఉద్యమానికి లభిస్తున్న మద్దతు. ఒక పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడితే, మరో పార్టీని ఎన్నుకోవాలి. వారూ పెద్ద తేడా లేకుండా పాలిస్తున్నారు.


 మళ్లీవాళ్లపై వ్యతిరేకత, మరో పార్టీని ఎన్నుకోవాలి. పార్టీలు మారుతున్నాయి తప్ప ప్రజలకు మేలు జరగడం లేదు, ప్రజలు ఆశించిన పాలన రావడం లేదు. ఈ పరిస్థితి వల్ల ప్రజల్లో తీవ్రమైన నిరాశ ఏర్పడింది. అన్నా ఉద్యమానికి దేశ వ్యాప్తంగా లభిస్తున్న మద్దతు ఈ నిరాశ నుండి పుట్టిందే. జన లోక్‌పాల్ బిల్లులో ఏముందో, ఆ చట్టం వస్తే కలిగే మార్పు ఏమిటో పెద్దగా అవగాహన లేకున్నా ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై వ్యతిరేకతతో ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఒక రాజకీయ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడితే నష్టమేమీ లేదు. మరెన్నో పార్టీలు ఉన్నాయి. కానీ ప్రజలకు మొత్తం రాజకీయ వ్యవస్థపైనే నమ్మకం పోవడం ప్రజాస్వామ్యానికి మంచిది. కాదు ఇప్పుడు మనమీ ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఏ ఒక్క పార్టీలోనూ నిజాయితీ కనిపించడం లేదు. అందుకే అన్నా దీక్ష వద్దకు రాజకీయ పార్టీల నాయకులు వచ్చినప్పుడు ఛీ కొట్టి జనం వెనక్కి పంపించారు. అయతే దీనివల్ల సమస్య పరిష్కారం కాదు. దేశంలో ఏ మార్పు అయినా జరగాల్సింది రాజకీయ వ్యవస్థ ద్వారానే. ఆ వ్యవస్థపై వ్యతిరేకత పెంచడానికి అన్నా లాంటి వారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నాయకుల స్వయం కృషి చాలు. లంచం ఇవ్వం, తీసుకోం అని ప్రజలు నిర్ణయం తీసుకోవడానికి అన్నా హజారే ఉద్యమందోహదం చేయాలి.




హైదరాబాద్ లో జరిగిన ఒక సమావేశం లో అరుందతి మాట్లాడుతూ .....................అవినీతిపై ప్రజల్లో చైతన్యం రానంతవరకు జన్ లోక్‌పాల్, లోక్‌పాల్ బిల్లు వచ్చినా ఏమి ఒరగదని ఆమె అభిప్రాయపడ్డారు. అన్నా హజారే ఉద్యమానికి మీడియా, ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అన్నా హజారే చేపట్టిన ఉద్యమం మధ్యతరగతి ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని నడుస్తోందని  ప్రస్తుతం సమాజంలో కీలక భూమిక పోషిస్తోన్న మీడియా, కార్పొరేట్ రంగం, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌ల్లో అవినీతి నెలకొందని, వాటిని కూడా లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి తీసుకురావాలని అరుంధతి రాయ్ డిమాండ్ చేశారు..........


 ఇప్పుడు హడావుడి చేస్తున్న మీడియా , పెద్దలు ఈ డిమాండ్ ను వినగలదా? ఈ డిమాండ్ ను అంగీకరించే మాట అటుంచి అవినీతిపై హడావుడి చేస్తున్నా వారి మీడియాలో ఈ డిమాండే కనిపించలేదు ?  

21, ఆగస్టు 2011, ఆదివారం

రెండు కెవ్వుల నెట్ ప్రేమ.......నెట్ స్నేహలపై ఆంధ్రభూమి -ఆదివారం కవర్ స్టొరీ



దివా: కెవ్వు... విజ్జి మీ అభిమాన హీరో మహేష్ బాబునా? ఇంత వరకు నాకు ఎందుకు చెప్పలేదమ్మా!
విజ్జి: నేను కూడా కెవ్వు అంటే నువ్వు కూడా మహేష్ అభిమానివా దివా!
నాకు మహేష్ అంటే పిచ్చి అభిమానం. ఒక రోజు తిండి తినకుండా ఉండగలను కానీ మహి సినిమా చూడకుండా ఉండలేను. కొంపతీసి నవ్వు ఆ పొట్టి జూనియర్ అభిమానివేమో అనుకున్నాను.
దివా: అలా ఎలా అనుకున్నావు విజ్జి. చిత్రంగా నీకు నీలం రంగు అంటే ఇష్టం నాకు నీలం ఇష్టం. నీకు మహి ఇష్టం నాకూ ఇష్టం. మన అభిరుచులు ఎంత బాగా కలుస్తున్నాయో కదూ!
విజ్జి: ఔను దివా! ఇంతకూ నువ్వు అన్నం తిన్నాక నీళ్లుతాగుతావా? ముందు తాగుతావా?
దివా: అరే చిత్రంగా ఉందే ఇందులోనూ మనం ఒకటే.. మన పరిచయం రెండు రోజులైనా కనీసం ఐదు జన్మల పరిచయం అనిపిస్తోంది విజ్జి
విజ్జి: నాకూ అంతే దివా!మన అభిప్రాయాలు భలే కలుస్తున్నాయి.
నీతో చాటింగ్ చేస్తుంటే ప్రపంచానే్న మరిచిపోతున్నాను.
దివా: ఔను విజ్జి నా పరిస్థితి కూడా అదే మన అభిప్రాయాలు ఇంత బలంగా కలుస్తున్నప్పుడు మనం ఎందుకు కలవకూడదు విజ్జి
విజ్జి: కలవడమే కాదు దివా మనం కలిసి ఉండలేమా?
దివా: నా మనసులోని మాట చెప్పావు విజ్జి. అభిప్రాయాలు కలిసిన వారు జీవితమంతా చిలకా గోరింకల్లా కలిసి ఉండలరని మా బామ్మ చెప్పేది. ఐతే మగాన్ని కాబట్టి ముందు చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాను. నీ పేరు తలుచుకుంటే నన్ను నేను మరిచిపోతున్నాను. చాటింగ్ చేస్తే ఆకాశంలో విహరించినట్టుగా ఉంది. ఇక మనం కలుసుకుంటే, కలిసి ఉంటే ఆలోచిస్తేనే మనసు ఎక్కడికో వెళ్లిపోతోంది.
విజ్జి: సరే రేపు కలుద్దాం. ట్యాంక్ బండ్‌పై బుద్దవిగ్రహం వద్ద ఉన్న బెంచ్‌పై ఈ విజ్జి నీకోసం వేయి కళ్లతో రేపు సాయంత్రం ఎదురు చూస్తుంటుంది.
మరుసటి రోజు..
దివాకర్ ముందుగానే వచ్చి బెంచ్‌పై కూర్చోని మక్క జొన్న కంకి తింటూ విజ్జికోసం రెండు కళ్లతో ఎదురు చూస్తున్నాడు. ఏంటో ఈ రోజు వాచి చాలా స్లోగా నడుస్తోంది అనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత విజ్జి స్కూటీపై వచ్చింది. ఒకరి నొకరు చూసుకుని కెవ్వు... కెవ్వు... అనుకున్నారు.
ఇది బజ్జుల్లో కనిపించే సంతోషపు కెవ్వు కాదు...
వారిద్దరు భార్యాభర్తలు... ఒకరంటే ఒకరికి క్షణం పడదు. పండగ పూట కూడా పాత మొగుడే అనే సామెతలా పాపం వారిద్దరు పేర్లు మార్చుకుని నెట్ స్నేహం చేసినా ఆ దేవుడు వాళ్లిద్దరినే మళ్లీ కలిపాడు. దాంతో ఒకరిని చూసి ఒకరు కెవ్వు.. కెవ్వు ...మన్నారు.


(పూర్తి స్టొరీ ఇక్కడ చదవండి )


నెట్ స్నేహలపై ఆంధ్రభూమి -ఆదివారం కవర్ స్టొరీ http://www.andhrabhoomi.net/aadivavram-andhrabhoomi/cover-story-615----

19, ఆగస్టు 2011, శుక్రవారం

సుమనే నిజమైన హీరో .......................... సఖల సుమన్ అభిమానులకు బహిరంగ సవాల్





















 మీరు సుమన్ అభిమానులా? ఏ సుమన్ అంటున్నారా ? సూర్యుడు అంటే ఏసూర్యుడు అనే ప్రశ్న ఉదయిస్తుందా? చంద్రుడు అంటే ఏచంద్రుడు  అని అడుగుతారా? భూమి , ఆకాశం అంటే ఏ ఆకాశం, ఏ భూమి అని అడుగుతారా? అలానే సుమన్ అంటే ఏ సుమన్ అనే ప్రశ్నే రాదు .. రాకూడదు. మన సుమన్  బుజ్జ్లు, బ్లాగ్స్ సూటి పోటి మాటలను ఖాతరు చేయకుండా మన సుమన్ మరో సినిమాతో దూసుకు వెళుతున్నారు .. ఈనెల ౨౧న  వాళ్ల టీవి లో మన సుమన్ హీరోగా నటించిన ఉషా పరిణయం సినిమా వస్తోంది. ఆ సినిమా చూసి మనసుమన్ కు నైతిక దైర్యాన్ని అందించాలని అందరిని కోరుతున్నాను. అన్నా హాజరేకు సుమన్ సినిమాలు వరుసగా చూపిస్తే దారికొస్తాడు అని ఢిల్లీ లో కొందరు కాంగ్రెస్స్ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తిప్పాయపాలెం లో పొలం పనులు చేసే రంగయ్య అంటుంటే విన్నాను అని గంగాయపాలెం లో ఉండే మా మిత్రుడు చెప్పాడు. మన సుమన్ ప్రతిభ ఢిల్లీ వరకు వెళ్ళినందుకు మనం సంతోషించి తీరాలి. చిన్నప్పుడు నేను చూసిన జేమ్స్ బాండ్ సినిమాల్లో ఆమెరికా వాడికి పెద్ద సమస్య వచ్చి తల పట్టుకున్నప్పుడు  అమ్మాయిలతో ఆడుకుంటున్న జేమ్స్ బాండ్  గుర్తుకొస్తాడు. అలానే మన హస్తిన పాలకులకు సుమన్ గుర్తుకు రావడం అంటే మనకు సంతోషమే కదా . స్వయంగా శ్రీకృష్ణుడు భూలోకానికి వచ్చి సుమన్ ను కృష్ణుడి  వేషం లో చూసి నేను ఇంత అందంగా ఉన్నానా ? అని సిగ్గు పడతాడు అని మా తాలూకా అభిప్రాయం ( ఏ తాలూకా అని అడుగుతున్నారా? ఇప్పుడు తాలుకాలు ఎక్కడున్నాయి ? )
సుమన్ ను మించిన రియల్ హీరో రాష్ట్రం లో లేడని నా నిజమైన అభిప్రాయం ( వ్యంగ్యంగా అంటున్నానని అనుకునేరు , అందుకే నిజమైన 
అభిప్రాయం అని చెబుతున్నాను) 
ఎందుకంటే చెబుతాను వినండి. 
నందమూరి తారక రామారావును అధికారం నుండి దించినప్పుడు నాకు ఆయన మీద బోలెడు జాలి కలిగింది. పాపం నానా కష్టాలు పడి అధికారం లోకి వస్తే అంతా కలిసి కింద పడేశారు అని బాధ పడ్డాను. తనను తొలగించడానికి రామోజీ రావు కుట్ర పన్నాడు. బాబుతో కలిసి రామోజీ పన్నిన కుట్రకు బలయ్యాను అని రామారావు ఆవేదన చెందారు. ౯౫ లో ఆయన చనిపోవడానికి ఒకటి రెండు వారాల ముందు శ్రీశైలం లో  విలేఖరులతో మాట్లాడుతూ  రామోజీ  కుట్ర పన్ని కూల్చి వేశాడు అతని సంగతి త్వరలోనే తేలుస్తాను అన్నాడు . ( అనుమానం ఉన్నా వారు అప్పటి ఈనాడును గ్రంధాలయం లో వెతికి చూడ వచ్చు ) . బతికి ఉంటే  ఏ చేసేవారో తెలియదు కానీ ఒకి రెండు వారాలకే చని పోయారు. అంతటి జనాకర్షణ గల రామారావు కూడా రామోజీని ఎమీ చేయలేక పోయారు. ఇక ఆ తరువాత అధికారం లోకి వచ్చిన అంతకన్నా మొండి ఘటం  రాజశేఖర్ రెడ్డి , ఉండవల్లి  అరుణ్ కుమార్ కలిసి ఆయన ఆర్ధిక  మూలాలను దెబ్బతీశారు, పాతిక శాతం వాటా అమ్ముకునేట్టు చేశారు. . మార్గదర్శిడిపాజిట్లు  వసూలు చేయకుండా చేశారు అంతకు మించి ఎమీ చేయలేక పోయారు . మరి అదే మన హీరో వద్దకు వస్తే ముచ్చెమటలు పోయించారు. తన తండ్రి ఎలాంటి వ్యక్తో సాక్షికి పేజీల కొద్దీ ఇంటర్వ్యులు ఇచ్చి తండ్రికి నిద్ర లేకుండా చేశాడు. ఆ దృశ్యాన్ని  ఉహించుకుంటే భక్త ప్రహ్లాద   సినిమాలో యస్వీ రంగ రావు అసమాన నటన గుర్తుకు వచ్చిందని ఓ మిత్రుడి ఉవాచ . భక్త ప్రహ్లాద కన్నా మన సుమన్ మిన్న ఎందు కంటే  మన సుమన్ మళ్లీ తండ్రి వద్దకు చేరడమే కాకుండా ఎడా పెడా సినిమాలు తిసేస్తున్నాడు . మరి ఆతను  రియల్ హీరో కాకుంటే మరేమిటి ?  కోట్లాది మంది ప్రజలు  ఎన్ను కున్న ప్రభుత్వం కన్నా నేనే మిన్న అనుకునే వ్యక్తిని, ముఖ్యమంత్రిని సైతం  తన కంపెనీ లో  పని చేసే ఒక   ఎగ్జిక్యుటివ్ గా చూసే వ్యక్తి కి నిదుర లేకుండా చేసే వ్యక్తి హీరో కాకుంటే మరేమిటి 
మీ నాన్న మాటనే వినని నువ్వు కోన్ కిష్క బ్లాగర్స్ మాట వింటావా ? బ్లాగ్స్ లో నిన్ను ఎవరేం  విమర్శించిన పట్టించు కోకు మాలాంటి ఆభిమానుల కోసం మళ్లీ మళ్లీ సినిమాలు తీస్తూనే ఉండు. తెలుగు సినిమాను కొత్త మలుపు తిప్పు సుమన్. చాలా సినిమాల్లో హీరోయిన్ తండ్రే విలన్ అని తేలుతుంది. నిన్ననే ఏదో టివిలో ఏదో సినిమా చూశాను. జయప్రద హీరోయిన్ రామారావు హీరో . ఇంత చేస్తే జయప్రద తండ్రే విలన్ అని తేలుతుంది . హీరోయిన్ తండ్రే విలన్ ఎందుకు కావాలి నువ్వు ఈ ట్రెండ్ను మర్చి హీరో తండ్రిని విలన్ గా  నువ్వే కథ రాసి, హీరోగా నటించి సినిమా తీయి. చూడడానికి మేం ఉన్నాం కదా . ఇప్పుడు చెప్పండి మీరు సుమన్ అభిమానులైనా ? వ్యతిరేకులైన సుమన్ రియల్ హీరో అంటే ఒప్పుకుంటారా? లేదా?
( ఫోటో సౌజన్యం....... .).

KAMMA VAARI KI GURTHIMPPU THECHCHINA GREAT HERO

17, ఆగస్టు 2011, బుధవారం

అవినీతి మా జన్మ హక్కు ........ ..... హజారేను కట్టడి చేసే వజ్రాయుధం మనదే


ప్రభుత్వానికి ఒళ్లు మండిపోయింది. ఎంత ప్రభుత్వంలో ఉన్నవాళ్లయినా ఒళ్లు మండిపోకుండా ఉంటుందా? చిన్నా చితక ఉద్యోగులు, నాయకులకే ఇలాంటి మాటలు వింటే చిరాకేస్తుంది అలాంటిది ఇంత పెద్ద దేశాన్ని పాలించే వారికెంత మంటగా ఉంటుంది. వాళ్లూ మనుషులే వాళ్ల శరీరంలో ప్రవహించేది ఒరిజినల్ రక్తమే . ఒళ్లు మండకుండా ఎలా ఉంటుంది? ఒక్క వ్యక్తి ఉద్యోగం పీకేస్తేనే విలవిలలాడిపోతారు కదా? అలాంటిది మొత్తం వ్యవస్థ ఉపాధినే దెబ్బతీయాలని ప్రయత్నిస్తే ఎవరికైనా ఒళ్లు మండిపోకుండా ఉంటుందా?
ఎంత రిమోట్ కంట్రోల్‌తో నడిచే ప్రభుత్వం అయితే మాత్రం వాళ్లకూ చీమునెత్తురు ఉంటుంది? వ్యవస్థనే నిర్మూలించాలనుకుంటే వాళ్లకు చిర్రెత్తుకొస్తుంది. అవినీతి మా జన్మ హక్కు. స్వాతంత్య్ర దినోత్సవం మరుసటి రోజే మా ఈ స్వాతంత్య్రాన్ని హరించాలని హజారే ప్రయత్నిస్తే ఎలా ఊరుకుంటాం. ఐదు శాతమో పది శాతమో అవినీతిని నిర్మూలించమంటే అర్ధం చేసుకోవచ్చు కానీ వంద శాతం నిర్మూలించాల్సిందే అంటే ఈ వ్యవస్థ ఏం కావాలి. ప్రజాస్వామ్యంలో అవినీతే ప్రభుత్వానికి ఊపిరి. అలాంటి ఊపిరిని నిలిపివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు హత్య చేయడమే కదా!

ఏదో తెలియక మా వాళ్లు మీ పార్లమెంటు మీద దాడి చేశారు, మీ తాజ్ మహల్ హోటల్‌పై దాడి చేశారు, ఓ వంద మందిని పొట్టన పెట్టుకున్నారు ఏమనుకోకుండా క్షమించేయండి అంటే సరే ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండవా అని క్షమించేస్తాం. ఇంట్లో కాఫీ పొడి ఐపోతే అక్కయ్య గారూ ఒ కప్పు కాఫీ పొడి బదులిస్తారా? అని అడగమా? నెలాఖరులో తోటి వారిని ఓ వందుంటే ఇస్తావా? అని అడిగేందుకు మొహమాటపడతామా? అలానే పొరుగు దేశం నుండి అష్టకష్టాలు పడి ప్రయాణం చేసి వచ్చిన వాళ్లు ఎంతో సాసహంతో మన పార్లమెంటు మీద దాడి చేసి ఎంతో మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుని పట్టుపడ్డవాళ్లకు క్షమాబిక్ష పెట్టేయమంటే మనకేమీ పెద్ద బాధ అనిపించదు. వారిని అల్లుళ్లలా చూసుకొని వదిలేయమంటే వదిలేద్దాం .... కానీ అవినీతిని నిర్మూలించండి అంటూ ఆయనెవరో పనీ పాట లేనాయన హడావుడి చేస్తే ఏ ప్రభుత్వమైనా ఎందుకు సహిస్తుంది. అరెస్టు చేసి తిహారు జైలుకు తరలించింది. మంచి పని చేసింది. ఆయనేమన్నా తనను తాను కసబ్ అనుకుంటున్నాడా? జైలులో స్టార్ హోటల్ సౌకర్యాలు కల్పించడానికి. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. ఇలాంటి వారిని అస్సలు క్షమించకూడదు. మొత్తం దేశాన్ని నాశనం చేస్తారు. 120 కోట్ల మంది ప్రజలు బుద్ధిమంతుల్లా ఎవరికే పని పడ్డా చక్కగా నిర్ణీతమైన లంచం ఇచ్చి తమ పని తాము చేసుకుపోతుంటే తగుదునమ్మా అని ఆయనెవరో వచ్చి ఎక్కడా అవినీతి ఉండడానికి వీలు లేదంటే ఎలా? ఆ మాట అనడానికి ఆయననెవరు. లంచం ఇవ్వడం, తీసుకోవడం మా జన్మహక్కు. మా హక్కులను కాలరాచే హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదు. సత్రంలో తింటూ గుళ్లో పడుకునే ఆయనకేం తెలుసు సంసారుల సమస్యలు.

 అవినీతి ఉండాలని పాలకులు, పాలితులు అంగీకరిస్తే వద్దనడానికి నువ్వెవరు? అసలలా అనేందుకు నీకెంత గుండె ధైర్యం. స్వాతంత్య్ర దినోత్సవం నాడు మా ప్రధాని ఎంతో చక్కగా చెప్పాడు. అయినా ఆయనకు అర్ధం కాలేదు. అవినీతిని నిర్మూలిస్తే అభివృద్ధి ఆగిపోతుంది.. నా చేతిలో ఏమైనా మంత్రదండం ఉందా? అంటూ ఆయన చెప్పిన తరువాత కూడా అర్ధం చేసుకోకపోతే ఎలా? చిన్నపిల్లాడికి కూడా అర్ధమయ్యేట్టుగా అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా ప్రధాని చెబితే అంత పెద్ద మనిషి అన్నా హజారేకు అర్ధం కాకపోతే ఎలా? అవినీతిని పూర్తిగా నిర్మూలించాల్సిందే అని అన్నా హజారే ప్రభుత్వాన్ని భయపెడితే కొన్ని కోట్లమంది భయంతో వణికిపోయారు. కొంపదీసి ప్రభుత్వం నిజంగానే అవినీతిని ఎన్‌కౌంటర్ చేసేస్తుందా? అని భయపడ్డారు. ఎన్‌కౌంటర్ చేయాల్సింది అవినీతిని కాదు అవినీతిపై సాగే ఉద్యమాన్ని అనే విషయాన్ని ప్రభుత్వం బాగానే గ్రహించింది.
 అందుకే ఆయన్ని అరెస్టు చేసి, తిహార్ జైలుకు పంపింది. అన్నా హజారేకు ఏ మాత్రం జ్ఞానం ఉన్నా దీనికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. లక్షా 76వేల కోట్ల రూపాయల 2జి స్పెక్ట్రమ్ కుంభకోణానికి సూత్రధారి రాజా, కరుణానిధి గారాల పట్టి కనిమొళి, కల్మాడి వంటి మహ మహా నేతలు కొలువు తీరిన జైలులో కొంతసేపు ఉండనిచ్చినందుకు హజారే ప్రభుత్వానికి కొద్దిగానైనా విశ్వాసం చూపడం లేదు. త్వరపడి విడుదల చేశారుకానీ, హజారేను కనీసం ఆరునెలలైనా అక్కడే ఉంచి ఉండాలి. ఎందుకంటే ఆరునెలల్లో వారు వీరవుతారంటారు కదా! పెద్దగా చరిత్ర లేని హజారేకు ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం రికార్డు సృష్టించిన వారి సరసన ఉండే అదృష్టం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం లేదా?

అన్నా హజారే వ్యవహారాన్ని డీల్ చేయడంలో ప్రభుత్వం తప్పుచేసిందని రాజకీయ అభిమాని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటో ఆ తప్పు అంటే.. అన్నాదీక్ష మొదలు పెట్టగానే ఎక్కడెక్కడి వారు మద్దతు ప్రకటించారు కదా! చంద్రబాబు, మాయావతి, జయలలిత, అమర్‌సింగ్ వంటి మహనీయులున్నారు. జగన్, గాలి జనార్దన్‌రెడ్డి వంటి పిల్ల మహానీయులున్నారు. ఢిల్లీలో హజారే దీక్షకు అనుమతించి, ఆ పక్కనే ఈ మహనీయులు, పిల్ల మహనీయుల కోసం ప్రత్యేకంగా మరో టెంటు ఏర్పాటు చేసి అందరినీ ఒకే చోట కూర్చోపెడితే? అప్పుడు దెబ్బకు దయ్యం దిగివచ్చేది. బాబోయ్ నేను దీక్ష చేయను వదిలేయండి అని హజారే ప్రభుత్వాన్ని వేడుకునే వారు కదా! ఇప్పటికైనా పోయిందేమీ లేదు. తీహార్ జైలు నుండి హజారేను బయటకు తీసుకు వచ్చి దీక్షకు కూర్చోపెట్టాలి. ప్రభుత్వం ఈ మహనీయులందరినీ ఆయనతో పాటు కూర్చోబెట్టాలి. అన్నాకు దీక్ష చేసే అధికారం ఉన్నట్టే ఆయనతో పాటు దీక్ష చేసే అధికారం ఈ మహనీయులకు ఉంది తీరాల్సిందే . ప్రభుత్వం ఇప్పటికైనా వజ్రాయుధాన్ని గుర్తించి అన్న పై  ప్రయోగించి తనను తను రక్షించుకొని , కోట్లాది మంది అవినీతి పరులకు అండగా నిలవాల్సిన బాధ్యత  ప్రభుత్వం పై ఉంది!

16, ఆగస్టు 2011, మంగళవారం

తెలుగు కమెడియన్స్ తో పోటీ పడుతున్న తెలుగు నేతలు .. లండన్ అల్లర్లు మన విజయమా?

నాయకుడనే వాడు ప్రజలకు మార్గదర్శకం చేయాలి. సాధ్యం కానప్పుడు ప్రజలు చూపిన మార్గంలో పయనిస్తాడు. కానీ కొందరు నాయకులు మాత్రం ప్రజలకు వినోదం కలిగించే కమెడియన్లుగా మారిపోతున్నారు.
‘‘ఈ రోజు ఖద్దరు వేసుకొని, శాలువా కప్పుకొని షోకిల్లా రాయుడిలా వచ్చారేమిటి?‘‘ ‘‘మా అధినాయకుడు ఇక్కడ లేడు కదా అందుకే కాస్తా రిలాక్స్‌గా ఉన్నాం. అలా అని మా నాయకుడు డ్రెస్ గురించి పట్టించుకుంటారని కాదు’’ అంటూ ఆ నాయకుడు కెమెరా ముందే తల దువ్వుకుంటూ ఫోజులిస్తున్నాడు. ఇదేదో ఆ నాయకుడికి తెలియకుండా రహస్యంగా చిత్రీకరించింది కాదు! కెమెరా ముందే సాగిన తంతు. ఈ దృశ్యం ఏ చానల్‌లో, ఏ కార్యక్రమంలో వస్తుందో అతనికి తెలుసు. ఆ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకునే అతనలా ఫోజులిచ్చాడు. ఇది సాక్షి చానల్ డింగ్‌డాంగ్‌లో ప్రసారమైన ఒక దృశ్యం. ఆ నాయకుడు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాజకీయ నాయకులను చానల్స్ చివరకు హాస్య పాత్రల్లోకి దించుతున్నాయి. మంత్రుల స్థాయి వాళ్లు సైతం ఇదే మార్గంలో పయనిస్తున్నారు. కొందరు వారంతట వారే ఇలా మారితే, కొన్ని చానల్స్ వీరిని ఆ మార్గంలోకి తీసుకు వస్తున్నాయి. వారు చూపిస్తున్నారని కాదు కానీ నిజంగానే నాయకులు ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు. కొంత మంది నాయకులు చానల్స్‌లోని ఇలాంటి కామెడీ కార్యక్రమాల్లో తాము కనిపించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి తగ్గట్టుగా మాట్లాడుతున్నారు.
మంత్రి శంకర్‌రావు న్యూస్ చానల్స్‌కు కామెడీ కింగ్‌గా తయారయ్యాడు. తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం, వేణుమాధవ్ లాంటివారికి ఎంత క్రేజ్ ఉందో తెలుగు న్యూస్ చానల్స్ కామెడీ కార్యక్రమాల్లో శంకర్‌రావుకు అంత క్రేజ్ ఉంది. శంకర్‌రావు పాత్రలేని పొలిటికల్ కామెడీ కార్యక్రమం కనిపించదు. ఆయన తరువాత సిపిఐ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్డిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో మారెప్ప, గోనె ప్రకాశ్‌ల హడావుడి కనిపించేది.
నల్లకళ్లద్దాలు పెట్టుకున్న శంకర్‌రావును అదేంటి సార్ మీరు అచ్చం కరుణానిధిలా ఉన్నారని అడిగితే, కరుణానిధి తెలుగువాడే, జయలలిత తెలుగే, నేనూ తెలుగువాడినే అని కళ్లద్దాలు సర్దుకుంటూ సమాధానం చెప్పారు. నిజానికి ఈ ప్రశ్నలు వేయడం, ఆయనలా చెప్పడం అంతా న్యూస్ చానల్స్‌లోని కామెడీ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకునే సాగుతుంది.

 దాదాపు  అన్ని తెలుగు న్యూస్ చానల్స్‌లోనూ రాజకీయ నాయకులను హాస్యపాత్రల్లో చూపించే కార్యక్రమాలు ఉన్నాయి. సాక్షి చానల్‌లో డింగ్‌డాంగ్‌లో స్వయంగా ఆ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ముందో, తరువాతనో చేసే చిత్రమైన చేష్టలను ఈ కార్యక్రమానికి ఉపయోగించుకుంటున్నారు. మిగిలిన చానల్స్ ఆయా నాయకుల వేషాలతో కామెడీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అన్ని తెలుగు చానల్స్‌లో రాజకీయ నాయకులను కమెడియన్లుగా మార్చేశారు. అన్ని చానల్స్‌లో శంకర్‌రావు పాత్ర తప్పనిసరి. సాక్షి డింగ్‌డాంగ్‌ను దృష్టిలో పెట్టుకునే టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య కొన్ని డైలాగులు చెబుతున్నారు. కొన్ని చర్యలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం వివేకానందరెడ్డి..
 ఆయన చెప్పులు మొదలుకుని దుస్తులు, డైలాగులు, అన్నీ చిత్రంగా ఉంటాయి. మాయదారి మల్లిగాడు సినిమాలో కృష్ణ కాస్ట్యూమ్స్ ఎంత ప్రత్యేకంగా ఉంటాయో, రాజకీయాల్లో ఆయన డ్రెస్సులో అంత ప్రత్యేకత ఉంటుంది. ప్రతి వారం చానల్స్ కామెడీ కార్యక్రమాలకు ఆయన మంచి ముడిసరుకు అందిస్తున్నారు. సాక్షి డింగ్ డాంగ్‌ను నిర్వహిస్తోంది హాస్య నటుడు ధర్మవరపు సుబ్రమణ్యం. ఆయన స్వతహాగా హాస్యనటుడు కాబట్టి ఆయన నవ్వించడం పెద్ద విశేషమేమీ కాదు కానీ ఆయన కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు పాత్ర మాత్రం ఆయన్ని మించిపోయి నవ్వించగలగడమే బాధాకరం. నారాయణ తిట్లు, సామెతలతో శంకర్‌రావుకు పోటీ రావాలని తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.
* * *
ధరలు పెరిగాయని తెలుగు మహిళలు నగరంలో ధర్నా చేశారు. అందులో ఒక మహిళలకు ప్రణబ్‌ముఖర్జీ వేషం వేసి అంతా కలిసి ఆమెను చితగ్గొట్టారు. ఏమిటీ నాటకాలు అంటే మరేం చేస్తాం సార్ మేం ఎంత పెద్ద కార్యక్రమం చేసినా టీవీల్లో చూపించరు, ఇలాంటి తలతిక్క పనులేవో చేస్తేనే టీవీల్లో కనిపిస్తాం అని నిర్వాహకుల సమాధానం. వారు ఊహించినట్టుగానే ఈ కార్యక్రమం డింగ్‌డాంగ్‌లో చాలా సేపు చూపించారు.



 నిద్రమబ్బులో...... న్యూస్


ఐ న్యూస్‌లో ఇన్‌సైట్ పేరుతో గురువారం ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమాన్ని చూశాక వారి మాటలకు ఒళ్లు జలదరించింది. లండన్‌లో అల్లరి మూకలు దాడులకు దిగుతున్నాయి. ఈ దాడుల్లో లండన్ నగరాన్ని లూటీ చేశారు. ముగ్గురు ఆసియా వాసులను హత్య చేశారు. దీనికి సంబంధించి ఏ మాత్రం అవగాహన లేని వారు ఐ న్యూస్‌లో ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో తన దేశం గెలిస్తే వార్తలు ఎలా చూపిస్తారో ఈ అంశంపై ఐ న్యూస్ అలానే ఈ కథనాన్ని రూపొందించింది. ఎంతో కాలం భారతీయలను తెల్లవారు బానిసలుగా చూస్తే ఇప్పుడు తెల్లవారిపై నల్లవారు ప్రతీకారం తీర్చుకున్నారట!


 ఇంగ్లాండ్ చేసిన పాపాలు ఇన్నాళ్లకు పండాయి, ఇంగ్లీష్ వాడు మటాష్, నల్లవాళ్ల సత్తా చూస్తున్న తెల్లదొరలు, ఇవీ లండన్ నగరంలోని దాడులపై ఐ న్యూస్ ఉపయోగించిన వ్యాఖ్యలు. ఎంతటి అజ్ఞాని నుండి కూడా ఈ అంశంపై ఇలాంటి వ్యాఖ్యలను ఊహించలేం. అక్కడ ఆసియావాసులు, భారతీయులపై కూడా దాడులు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భారతీయులు గుమికూడి తమకు తాము రక్షణ కల్పించుకుంటున్నారు. ఇదేదో భారతీయులు ఇంగ్లాండ్‌పై యుద్ధం చేసి జయించినట్టుగా పిచ్చి వ్యాఖ్యానాలేమిటో? చానల్ వారికే తెలియాలి. ఇలాంటి దాడులకు కారణం ఏమిటని సామాజిక శాస్తవ్రేత్తలతో చర్చించాల్సిన అంశాన్ని ఏమాత్రం అవగాహన లేని వారికి అప్పగించినట్టుగా ఉంది.
* * *
జగన్ ఆస్తులపై విచారణకు హైకోర్టు సిబిఐని ఆదేశించింది. విచారణకు ఆదేశించింది తప్ప ఆవినీతి నిరూపణ జరగలేదు, శిక్ష పడలేదు, కానీ ఈ విషయం తెలియగానే ఈటీవి2, స్టూడియో ఎన్‌లో ఉత్సాహం ఉరకలు వేసింది. జగన్ అవినీతి నిరూపితం అయిందని ఈటీవి2 సొంత వ్యాఖ్యానాలను జోడించింది. ఈ చానల్స్ జగన్ జైలుకు వెళ్లినట్టు, తమ అభిమాన నాయకుడు సిఎం అయిపోయాడన్నంత ఆనందాన్ని ప్రదర్శించాయి.

15, ఆగస్టు 2011, సోమవారం

ఇది మన భారత దేశం.........భారత మాత చిరునామా తెలుసా ?


ఇది మన భారతదేశం

బుద్దా మురళి


గాంధి పుట్టిన దేశమా ఇది..అంటూ కవి ఆరుద్ర ఏనాడో పేద్ద పాట రాశాడు. రాసి మూడు,నాలుగు దశాబ్ధాలు దాటుతున్నా, దేశ పరిస్థితులు అలాగే వున్నాయ..పేరుకు ప్రజలది రాజ్యం..పెత్తందార్లదే భోజ్యం..అన్న దందా ఇంకా నడుస్తూనే వుంది. .ఈ నేపథ్యంలో సగటు మనిషి మనోగతం ఇది..బాధగీతం ఇది. సామ్యవాదం..రామరాజ్యం సంభవించే కాలం కోసం, కలవరింత ఇది.

అమ్మా భారత మాత
బాగున్నావా తల్లీ! ఉత్తరం రాసేప్పుడు ఇక్కడంతా క్షేమమే.. మీరు కూడా క్షేమమే అని తలుస్తాను అనడం మర్యాద. కానీ కళ్ల ముందు పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఇక్కడంతా క్షేమమే అని ఎందుకో రాయాలనిపించలేదు తల్ల్లీ. సరే ఇంతకూ నీ అడ్రస్ ఎక్కడ మాత. ఏమో ఎప్పుడు చూసినా ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు తప్ప భారత మాత అని ఎవరి నోటి నుండి పెద్దగా వినిపించడం లేదు. మరి నీ అడ్రస్ నాగపూర్ అనుకోవాలా/ లేక ఢిల్లీనా సరే ముందు ఉత్తరమైతే పూర్తి చేస్తాను అడ్రస్‌దేముంది తల్లి అడ్రస్‌ను కూడా గూగుల్‌లో వెతుక్కునే రోజులు వచ్చేశాయి. గూగుల్‌లో సెర్చ్ చేసి పోస్ట్ చేస్తాను లే! జైలులో ఉండాల్సిన వాళ్ల అడ్రస్ అధికార కేంద్రంలో, ఇంట్లో పూజలందుకోవలసిన తల్లిదండ్రుల కేరాఫ్ అడ్రస్ వృద్ధాశ్రమం అవుతోంది మాత అందుకే అడ్రస్ అడిగాను మరోలా అనుకోకు.
నీవు ఎలా ఉన్నావో నాకు తెలియదు మరి నేను ఎలా ఉన్నాననే కదా నీ సందేహం. నిజమే తల్లీ ఎలా ఉన్నా నిరంతరం తన సంతానం మంచి చెడుల గురించే కదా? ఆందోళన చెందుతుంది.
ఎలా ఉన్నానంటే సంతోషంగా ఉన్నానని, చెప్పాలా? బోలెడు బాధల్లో ఉన్నానని చెప్పాలా? చెప్పకూడదని కాదు తల్లి నిజంగా నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు.
1947 ఆగస్టు 14 ఆర్ధరాత్రి... సరిహద్దుల్లో అల్లకల్లోలం. లక్షలాది మంది ఇటు నుండి అటు... అటు నుండి ఇటు.. మత కలహాలు... సంపన్నులు సైతం కట్టుబట్టలతో పరుగులు తీశారు. ఏ ముహూర్తంలో ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందో కానీ ఇంకా ఆ అల్లకల్లోలం తీరలేదు తల్లి. కాశ్మీర్‌లో రావణ కాష్టం రగులుతూనే ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో అల్లకల్లోలంగానే ఉన్నాయి. దక్షిణాదిన ఆంధ్రలో చిచ్చు రగులుతోంది. మత ఘర్షణలు, కుల ఘర్షణలు పెరుగుతున్నాయే తప్ప తక్కడం లేదు.
అయ్యో నా బాధలు చెప్పి నిన్ను మరింత కలవరపెట్టానా? సరే ఇవి ఎప్పుడూ ఉండేవే లే అన్నీ సమస్యలేనే నీ జీవితంలో మంచేమీ లేదా? అనే కదా తల్లి నీకొచ్చిన సందేహం. ఎందుకు లేదు చాతి పొంగిపోయేంత, నేను భారతీయుడ్ని అని గర్వించేంత సంతోషకరమైన విషయాలు చాలానే ఉన్నాయి తల్ల్లీ.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశం ఎదుర్కొన్న ప్రధాన సమస్య తిండి గింజలు. అమెరికా వాడు దయతలిచి ఇచ్చిన గోదుమలు, మంచి నూనెను అమృతంలా తీసుకున్న రోజులు మరిచిపోలేదు తల్లీ. అలాంటిది మొన్న అమెరికా అధ్యక్షుడొచ్చి మన మధ్య స్నేహం అవసరం అంటూ సమాన స్థాయి స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడాడు. అంతే కాదు వాళ్ల దేశానికి వెళ్లి ఇండియా నన్ను బాగా ఆదరించింది నా పర్యటనలో కుదిరిన ఒప్పందాల వల్ల అమెరికా పౌరులకు 50వేల ఉద్యోగాలు వస్తాయని గర్వంగా ప్రకటించుకున్నాడు. వాడిచ్చే పాలపొడి, గోధుమ రవ్వ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన రోజులు మరిచిపోలేదు తల్లీ ఇప్పుడు అదే అమెరికా అధ్యక్షుడు భారతీయులు తెగ తినేస్తున్నారు, పెట్రోల్ వాడేస్తున్నారు అందుకే ధరలు పెరిగాయని వాపోతే దాన్ని నేను సాధించిన అభివృద్ధికి కితాబుగానే భావించాను. వాడిచ్చే గోదుమల కోసం ఎదురు చూసిన ఈ కళ్లతోనే వాళ్లకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి వెళ్లినందుకు నిజంగానే ఆ క్షణంలో గర్వించాను తల్ల్లీ.
అమెరికాలో విడుదలైన కారు మరుసటి రోజే మన రోడ్లమీద దర్శనమిస్తోంది. ఇప్పుడు ప్రపంచం చూపు మన దేశంపై ఉంది.
భారత మాత నీకు తెలియదని కాదు ఇప్పుడు ఎంత అభివృద్ధి సాధించామో తెలుసా? జనాభాలో చైనా తరువాత మనమే. తల్లీ ఇప్పుడు నీ బిడ్డల సంఖ్య 120 కోట్లు. ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. బౌగోళికంగా ప్రపంచంలో ఏడవ పెద్ద దేశం. ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాలైన హిందూయజం, బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం మతాలను నీ బిడ్డలు అవలంబిస్తున్నారు.
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లెక్క ప్రకారం 2010 ఇండియా జిడిపి 1.538 యుఎస్ ట్రిలియన్ డాలర్లు. 2011 1.7 యుఎస్ ట్రిలియన్ డాలర్లు. ఏమిటీ లెక్క అనడుగుతున్నావా? తల్ల్లీ నీలానే నీ బిడ్డల్లో కోట్లాది మందికి ఈ లెక్కలు అస్సలు తెలియవు తల్లీ. చివరకు ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చిన పివి నరసింహారావు సైతం ఈ లెక్కలేమిటో నాకు తెలియవన్నారు. ఆయన ప్రధానమంత్రిగా దిగిపోయిన తరువాత ఒక సభలో అప్పటి సిఎం చంద్రబాబు సంస్కరణలు, ట్రిలియన్లు బిలియన్లు అంటూ ఏవో లెక్కలు చెబుతుంటే బాబు ఏవో లెక్కలు చెబుతున్నారు, ఈ ట్రిలియన్లు, బిలియన్లు నాకు తెలియవు అన్నారు. మనవడు ముచ్చట్లు చెబుతుంటే అబ్బురంగా విన్న తాతలా ఆయన బాబు ట్రిలియన్ల ముచ్చట్లు వింటూ సంస్కరణలు అంటూ నేను కిటికీలు తెరిస్తే తరువాత వాళ్లు ఏకంగా తలుపులే తెరిచేశారని చెప్పాడు. నిజమే తల్లీ ఈ సంస్కరణల తరువాత తలుపులు తెరిచాక లోనికి విస్తారంగా గాలి వచ్చిందని సంతోషపడాలో, ఈ తుఫాను గాలిలో అస్థిత్వానే్న కోల్పోయి మనది కాని లోకంలోకి కొట్టుకుపోతున్నామో అర్థం కావడం లేదు తల్లీ.

 నీకు తెలుసా తల్లి ఈ దేశంలో రోజుకు 20 రూపాయలు సంపాదించే నీ బిడ్డలు కొన్ని కోట్ల మంది ఉన్నారు. తిన్నది అరక్క రాత్రి పూట క్లబ్బుల్లో లక్షలు ఖర్చు చేసే బిడ్డలూ ఉన్నారు. రాత్రి జీవితం కోసం గతంలో వలె సింగపూర్‌కో మరో దేశానికో వెళ్లక్కర లేదు. చాలా రాష్ట్రాల రాజధానులు రాత్రి కాగానే సింగపూర్‌లు అయిపోతున్నాయి.
మనది ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అట. కొనుగోలు శక్తి ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగో అతి పెద్దదట! ఒక నివేదిక ప్రకారం 2011లో కొనుగోలు శక్తిలో భారత్ జపాన్‌ను అధిగమిస్తుంది. 2045 నాటికి అమెరికాను అధిగమిస్తుంది. మరో నాలుగు దశాబ్దాల పాటు భారత వృద్ధిరేటు ఎనిమిది శాతం వరకు ఉంటుందట! 2050 వరకు కూడా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తుందట! పని చేసే యువత శాతం అత్యధికంగా ఉండడమే ఈ వృద్ధికి కారణం.
అందుకే మన దేశాన్ని పాశ్చాత్యులే కాదు చివరకు మన వాళ్లు సైతం వినియోగదారుల్లానే చూస్తున్నారు తప్ప మనుషుల్లా కాదు.
మరో విషయం చెబుతాను తల్లీ టాటా వాళ్లు ఆ మధ్య నానో కారు తయారు చేశారు. ఇది ప్రపంచంలో కెల్లా చౌకయిన కారు. ప్రపంచంలో అత్యధికంగా బేసిక్ కార్లు తయారు చేసేది మన దేశమే. పేదరికం అత్యధికం ఇక్కడే సంపద ఇక్కడే. బిలియనీర్ల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతున్నది ఇక్కడే, అంత కన్నా వేగంగా పేదల సంఖ్య పెరుగుతున్నది ఇక్కడే.
దేశంలో సగం మంది పిల్లలు నిర్ణీత బరువు కన్నా తక్కువగా ఉంటున్నారు. అంటే వారికి సరైన పౌష్టికాహారం దొరకడం లేదు. అమెరికా అధ్యక్షుడంతటి వాడు మీరు తెగ తిని తాగేస్తున్నారర్రోయ్ అని మొత్తుకున్నది మన గురించే తిండి లేక బక్కచిక్కుతున్నది మనమే చిత్రంగానే ఉంది కదు తల్లీ.
మనకు తెలియకుండానే భారత దేశంలో రెండు భారత దేశాలు కనిపిస్తున్నాయి తల్లీ. ఒకటి సంపన్న భారత దేశం, మరోటి కడు పేద భారత దేశం. భారత్, పాకిస్తాన్‌లు చీలిపోయినంత వేగంగా రెండు భారత దేశాలు చీలిపోతున్నాయి. ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ ఈ చీలిక ఏనాటికైనా ప్రమాదమే తల్లీ. కొడుకుల్లో సగం మంది మంచి తిండి, సుఖ సంతోషాలతో ఉంటే మిగిలిన సగం మంది ఆకలి కేకలు వేస్తుంటే ఏ తల్లి మనసైనా తల్లడిల్లకుండా ఉంటుందా? సరే తల్లీ వీటి గురించి మళ్లీ మాట్లాడదాం కానీ ఎప్పటి నుండో నాకో సందేహం.
నీ కడుపున ఎలాంటి వీరులు పుట్టారు. దేశ భక్తులు, సంఘ సంస్కర్తలు, శత్రువులను చీల్చి చెండాడిన మహా యోధులు, మేధావులు ఎంత మంది పుట్టారు తల్లీ. అలాంటి నీ కడుపున ఇప్పుడు నపుంసక నాయకులు పుట్టారేమి తల్లీ. దేశ ఆర్థిక రాజధానిలో రాక్షసుల్లా దాడి చేసి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసిన ముష్కరుడు అల్లుడిలా ఆతిథ్యం పొందుతుంటే ఎంత గాంధేయ వాదులమైనా సహించలేకపోతున్నాం తల్ల్లీ.
 ఈ దేశం నన్నేం  చేస్తుంది అన్నట్టుగా వాడు కోర్టులో వెకిలినవ్వు నవ్వుతుంటే ఎందుకో తల్లీ ఎంత క్షమించేద్దామన్నా మనసు ఒప్పుకోవడం లేదు. నువ్వు కనిపిస్తే ఎందుకు తల్లీ ఈ నపుంసక నాయకత్వాన్ని మాకు కట్టబెట్టావని నిలదీయాలనిపిస్తోంది. జలియన్ వాలాబాగ్‌లో అమాయకులను చంపిన డయ్యర్‌ను మట్టుపెట్టిన నీ కుమారులు ఇప్పుడేమయ్యారు తల్లీ.
ప్రపంచానికి అణుబాంబును పరిచయం చేసిన వాడు సైతం చివరి రోజుల్లో తనను క్షమించమని వేడుకుని కుమిలిపోయాడు. అంత కన్నా శక్తివంతమైన నిరాహార దీక్ష అనే ఆయుధాన్ని ప్రపంచానికి అందించిన మహాత్మాగాంధీని కన్నావు. ఆయుధ సంపత్తితో ఉన్న బ్రిటీష్ వాడిని ఓడించాలంటే అంత కన్నా బలమైన ఆయుధం కావాలి. పేద భారతీయులు అలాంటి ఆయుధాన్ని ఎలా సమకూర్చుకుంటారు. ఎంత కాలమైనా బానిసత్వంలో మగ్గవలసిందేనా? అనుకుంటున్న తరుణంలో ఒక్క బక్క జీవి అంత బలమైన బ్రిటీష్‌వాడిని నిరాయుధం ఆనే ఆయుధంతో చావు దెబ్బ తీశాడు.

 అప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా రక్త పాతం కనిపించింది. ఒకరు విజయం సాధించారు అంటే మరొకరు ఓడిపోయారు. రెండువైపులా రక్తం ప్రవహిస్తేనే అది యుద్ధం. కానీ యుద్ధానికే కొత్త నిర్వచనం చెప్పి రక్తపాతం లేకుండా ఇద్దరూ గెలిచే కొత్త యుద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మోహన్‌దాస్ కరం చంద్ గాంధీని కన్న తల్లివి. ఈ దేశాన్ని పాలించుకునేంత శక్తి సామర్ధ్యాలు భారతీయులకు లేవు, వాళ్లు చవటలు అంటూ చర్చిల్ లాంటి వాడు తిడితే తన పాలనతోనే వాడికి సమాధానం చెప్పి నవ భారతానికి పునాదులు వేసిన జవహర్‌లాల్ నెహ్రూలాంటి వజ్రాన్ని కన్నావు. ఏమన్నావురా మాకు పాలించడం చాతకాదా? చవట ఇప్పుడు చూడరా నీ దేశం గత చరిత్ర మాది భవిష్యత్తు అని వాడికి ఎలుగెత్తి చాటే విధంగా దేశానికి బలమైన పునాదులు నిర్మించారు.

 అంత కన్నా కొంత ముందుకు వెళితే అఖండ భారతాన్ని తురుష్క ముష్కరులు దాడులు జరిపి దోచుకుంటున్న కాలంలో కత్తి పట్టి వీరోచితంగా పోరాడిన శివాజీ లాంటి వీరులను ఎంతోమందిని కన్నావు తల్లీ. అప్పటి గాలి నీరు అలాంటిది అని సరిపెట్టుకుందామంటే స్వాతంత్య్రం వచ్చాక కూడా ఇందిరాగాంధీ లాంటి వీరనారిని ఈ దేశానికిచ్చావు కదా! పాకిస్తాన్ సైనిక పాలకుడు యాహ్యాఖాన్ 1971 డిసెంబర్ మూడున పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌లోని సైనిక స్థావరాలపై దాడులకు పాకిస్తాన్ సైన్యానికి ఆదేశాలిచ్చారు. సరిగ్గా మరో 13 రోజుల్లోనే పాకిస్తాన్‌ను చీల్చి ఢాకా రాజధానిగా బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడినట్టు ఇందిరాగాంధీ ప్రకటించారు.

 తన దేశంలోని రెండు సైనిక స్థావరాలపై దాడులకు ఆదేశించిన దేశాన్ని రెండు ముక్కలు చేసిన వీరత్వం ఎక్కడ, ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు పార్లమెంటుపై దాడి చేసిన వాడిని శిక్షించడంలో మీన మేషాలు లెక్కిస్తున్న శిఖండి నాయకత్వం ఎక్కడ. భారత పాకిస్తాన్ ల మధ్య యుద్ధం అంటూ జరిగితే చైనా పాకిస్తాన్‌కు అండగా నిలుస్తుంది. కానీ మేం మాత్రం మీకు సహకరించేది లేదు అని అమెరికా ఖరాఖండిగా అధికారికంగానే తేల్చి చెప్పినా నీ మద్దతు లేకుంటే యుద్ధం చేయలేమని ఎందుకనుకుంటున్నావు చేతలతోనే ప్రశ్నించి పాకిస్తాన్‌ను చీల్చి చెండాడేందుకు భారత సైనికులకు ధైర్యాన్ని నూరిపోసిన ఆ వీరనారి ఎక్కడ.

 పార్లమెంటుపై దాడి చేస్తే దండిస్తే అమెరికాకు కోపం వస్తుందేమో, ఓటు బ్యాంకు చెదిరిపోతుందనేమో అని భయపడిన పిరికి జీవులెక్కడ. బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి ఇందిరాగాంధీ మొదటి నుండి అండగా నిలిచారు. కోటి మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చారు. కష్టాల్లో ఉన్న పొరుగు వాడిని ఆదుకోడం నీ కనీస ధర్మం. పొరుగు వాడిగా సహాయం చేసేందుకు సదా సిద్ధంగా ఉంటాను, కానీ నావైపు కనె్నత్తి చూస్తే ఇక నీకు చూసేందుకు కన్ను లేకుండా చేయడానికి వెనకాడను అనే సందేశాన్ని ఇచ్చి, ప్రతిపక్ష నాయకునిచేత కూడా అపరకాళి అని బిరుదు పొందిన ఇందిర ఎక్కడ రిమోట్‌తో నడిచే పప్పెట్ పాలకులెక్కడ?. బంగ్లావిముక్తికి సహకరించినందుకు బంగ్లాదేశ్ ఇచ్చిన అత్యున్నత పురస్కారం ఆమె కోడలు స్వీకరించారు. వీరనారిగా పురస్కారానికి ఇందిరాగాంధీ అర్హురాలే కానీ, నాయకత్వ లక్షణాల్లో కోడలికంత అర్హత ఉందా? నువ్వే చెప్పు తల్లీ. మేం ఏ జన్మలో చేసుకున్న పాపం తల్లీ ఈ జన్మలో ఇంత సన్నాసి పాలకులనిచ్చావు. తల్లిని ప్రశ్నించడం పాపమంటారు కానీ ప్రశ్నించకుండా ఉండలేకపోతున్నాను తల్లీ. ఇలాంటి నాయకులను కన్నందుకు నేను నిన్ను ప్రశ్నించాలా? లేక నీ దేశాన్ని ఇలాంటి నాయకుల చేతిలో పెట్టినందుకు నువ్వు నన్ను నిలదీస్తావా? యధారాజ తథా ప్రజ అన్నారు అంటే తప్పు నాలోనే ఉందంటావా తల్లీ. ఏమో అది కూడా నిజమే కావచ్చు.
దేశంలో ఇప్పుడు 467 మిలియన్ వర్కర్స్ ఉన్నారట! అంటే పని చేసేశక్తి ఉన్నవారిలో ప్రపంచంలో మనది రెండో స్థానంలో ఉన్న దేశం. మధ్యతరగతి ప్రజల సంఖ్య 580 మిలియన్లు, ప్రపంచంలోని 15 టాప్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల్లో ఏడు మన దేశానికి సంబంధించినవే.
భారత మాత ఆర్థిక రంగంలో సాధిస్తున్న ఈ అభివృద్ధిని చూసి సంతోష పడమంటావా? ప్రపంచంలోని సగం మంది నిరక్ష్యరాస్యులు, పేదవారు, పౌష్టికాహారం లోపించిన వారు ఈ దేశంలోనే ఉన్నారని బాధపడమంటావా?
ప్రపంచానికి నీ దేశం ఏమిచ్చింది? అని ప్రశ్నించి సున్నా అని ఒకడు నవ్వాడు. ఔను సున్నానే అని నీ బిడ్డలు గర్వంగా చెప్పుకుంటున్నారు. నిజమే కదా తల్లీ ప్రపంచానికి మన దేశం సున్నా ఇవ్వకపోతే ఈ ప్రపంచం అభివృద్ధి సున్నా వద్దే నిలిచిపోయేది కదా! అర్యభట్టు, భాస్కరాచార్య, ఆటమిక్ సిద్ధాంతానికి మూల పురుషుడు ఆచార్య కంద, అమెరికా పురుడు పోసుకోకముందే ప్రపంచానికి కెమికల్ సైన్స్‌ను పరిచయం చేసిన నాగార్జునుడు, వైద్యానికి పితామహుడు ఆచార్య చరకుడు, ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు ఆచార్య శుశ్రుతి. వరాహమిహీరుడు, ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించిన యోగా పితామహుడు ఆచార్య పతంజలి, వైమానిక టెక్నాలజీని క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే చెప్పిన ఆచార్య భరద్వాజ, కాస్మాలజీ ఫౌండర్ ఆచార్య కపిల వీరంతా నీ ముద్దు బిడ్డలే కదా తల్లీ ఇలాంటి ఎందరో మహనీయులను, వీరులను, సంఘ సంస్కర్తలను కన్న నీవు ఇప్పుడెందుకమ్మా మరి ఇలా...
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అని మురిసిపోవాలా? నీ దేశంపై దాడి చేసినా నువ్వు ఏమీ చేయలేవురా అని వాడు వికృతంగా నవ్వుతుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోవాలా?
ఒద్దు తల్లీ ఇలాంటి శిఖండి నాయకత్వం మాకొద్దు... నెత్తురు మండే యువత ఒకవైపు నపుంసక నాయకత్వం ఒకవైపు ఇది అన్యాయం తల్ల్లీ. అయినా అమ్మా నిజంగా దీన్ని నేను అభివృద్ధి అనుకోవాలా? నా గ్రామాల్లో మంచినీరు లేదు కానీ కోకాకోలా, విదేశీ మద్యం దొరకని గ్రామం లేదు. సగం మందికి తిండిలేని నా దేశానికి పిజ్జాలు అవసరమా తల్ల్లీ. ఇంతకూ నేను ప్రపంచం దృష్టిలో వినియోగదారునే్ననా? లేక మహోన్నతమైన సంస్కృతికి వారసుణ్ణా?
ఇంత భారీ అభివృద్ధిని నేను భరించలేను తల్లీ నా సంస్కృతిని, నా సంప్రదాయాలను పణంగా పెట్టి సాధించుకున్న ఈ అభివృద్ధి నన్ను గందరగోళంలో పడేస్తోంది.
ఇప్పుడు నా పరిస్థితి జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా ఉంది. ఎటు వెళుతున్నానో, ఏది మంచో ఏది చెడో నాకు అర్థం కావడం లేదు. కంటికి కనిపిస్తుంటే ఇది అభివృద్ధి కాదు అని చెప్పలేను. సగం మంది దుఃఖంలో ఉండి, గ్రామాలు జీవచ్ఛవంలా కనిపిస్తుంటే ఇదే అభివృద్ధి అని చెప్పలేను. ఈ గందరగోళంలో కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఐటిలోనే కాదు భార్యాభర్తలు విడిపోవడంలోనూ అమెరికాతో పోటీపడుతున్నాం.
నిజంగా నాకేం కావాలో నాకే తెలియడం లేదు. నిజమే కదా! కొడుకు అవసరం ఏమిటో తల్లికే తెలుస్తుంది. జాతరలో తప్పిపోయిన నన్ను చేయి పట్టుకుని సరైన మార్గంలో తీసుకువెళ్లాల్సింది నువ్వే తల్లి. ముందు ఈ జాతర నాకు అబ్బురంగా కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం తల్లీ ఒడిలో నిర్భయంగా పడుకోవాలని ఉంది. మరో ప్రపంచం అయినా తల్లి ఒడికి సాటిరాదు కదా! తల్లీ
సరే ఇక ఉంటానమ్మా!
నీ కోటాను కోట్ల మంది బిడ్డల్లో ఒకరు *
***



బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కరప్షన్
మార్కెట్‌లో దేనికి డిమాండ్ ఉంటే దానే్న అమ్మాలి. లేదా డిమాండ్ సృష్టించాలి. ఎంసెట్‌కు ఉన్న డిమాండ్‌ను మన రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇలానే దేశంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతుంది. మరి అవినీతిలో పాఠాలు నేర్పడానికి ఒక డిగ్రీ కోర్సు ప్రారంభిస్తే దాని ప్రకటన ఎలా ఉంటుంది.
బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కరప్షన్
నేషనల్ కరప్షన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
( పార్లమెంటు ఉభయ సభలకు అనుబంధం)
అవినీతిపై ప్రపంచ ప్రఖ్యాత సంస్థలో బిడిసి కోర్సు చేయండి.
హవాలా, కుంభకోణాలు, ఫైనాన్షియల్ నెట్‌వర్క్ ( రాష్ట్ర పార్టీ నుండి కేంద్ర పార్టీకి, కేంద్రం నుండి రాష్ట్ర పార్టీలకు నిధుల మళ్లింపులో చక్కని శిక్షణ ఇవ్వబడును. లంచాలు ఇవ్వడం, తీసుకోవడం వంటి వాటిలో ప్రాక్టికల్ క్లాస్‌లు ఉంటాయి. చాయ్ పానీ మొదలుకొని స్వీట్ బాక్స్, కలర్ టీవి, ఫారన్ ట్రిప్ ల వంటి చిన్నచిన్న అవినీతి వ్యవహారాలతో పాఠాలు మొదలు పెట్టి 2జి స్పెక్ట్రమ్ వంటి కుంభకోణాల వరకు అన్నింటిలో అవగాహన కల్పిస్తాం. అవినీతికి పాల్పడే చాన్స్ వచ్చినప్పుడు ఇది నాకు తెలియదు అనే అవకాశం లేకుండా మిమ్ములను మా డిగ్రీ సర్వసన్నద్ధం చేస్తుంది.
మీ పార్టీ వారు అవినీతికి పాల్పడినా, మీరు అవినీతికి పాల్పడినా ఏ విధంగా తప్పించుకోవాలో శిక్షణ ఇస్తాం. మీడియా ప్రశ్నలు ఎలా ఉంటాయి, నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ఏ విధంగా సమాధానం చెప్పాలో నిపుణులతో శిక్షణ ఉంటుంది. మనీష్ తివారి, రవిశంకర్ ప్రసాద్‌లతో ఈ అంశంపై ప్రత్యేక క్లాసులుంటాయి.
లా అండ్ ఆర్డర్
మిమ్ములను కేవలం అవినీతికే పరిమితం చేయం. మర్డర్, రేప్ చేసి ఎలా తప్పించుకోవాలో చక్కని శిక్షణ లభిస్తుంది. స్థానిక పోలీసులను చెప్పుచేతుల్లో ఉంచుకోవడం, బెయిల్ పొందడం వంటి అంశాలన్నీ ఇందులో ఉంటాయి. నేరం చేయడానికి సిద్ధం కాగానే ముందస్తు బెయిల్ పొందడం. ఒక వేళ జైలుకు వెళితే అక్కడి నుండే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడంపై తగు శిక్షణ ఉంటుంది.
అర్హతలు: ఈ కోర్సులో చేరడానికి కనీసం వంద కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన అనుభవం ఉండాలి
ఒకటిలేక రెండు రేపులు, ఒకటి రెండు హత్యలు చేసి ఉండాలి.
దేశంలోని వివిధ కోర్టుల్లో కనీసం పది కేసులు విచారణలో ఉండాలి.
కనీసం ఆరునెలల జైలు జీవితం ఉండాలి.
కనీసం స్విస్ బ్యాంకులో ఒక్క అకౌంట్ అయినా ఉండాలి.
====
ఇది మన దేశం
ఇది నా దేశం అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు.
* ఇక్కడ బియ్యం కిలో 40 రూపాయలు.. సిమ్‌కార్డ్ మాత్రం ఉచితం
*పిజ్జాకు ఆర్డర్ ఇస్తే అరగంటలో ఇంటి ముందుకొస్తుంది. గుండెపోటు వచ్చినా, హత్య జరిగినా అంబులెన్స్ రావాలంటే చాలా సమయం పడుతుంది.
*కారు లోన్‌కు ఐదు శాతం వడ్డీ , చదువుకోవడానికి విద్యార్థులకు ఇచ్చే రుణాల వడ్డీ 13 శాతం
* ఈ దేశంలో రెండు ఐపిఎల్ టీంలను 3300 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇదే దేశంలో రోజుకు ఒక పూట తిండిలేని వాళ్లు కోట్లలో ఉన్నారు.
* ఈ దేశంలో కాళ్లకు ధరించే పాదరక్షలను ఎసి షోరూ ముల్లో అమ్ముతారు. తినే కూరగాయలను ఫుట్‌పాత్‌లపైన, చెత్తకుప్పల పక్కన అమ్ముతారు.
* ప్రతి వారు తమ పేరు పత్రికల్లో రావాలని, తాము టీవీల్లో కనిపించాలని అనుకుంటారు. మంచి పనితో కాదు ఏ తప్పు చేసైనా సరే అని
* ఈ దేశంలో పెద్ద మాల్స్‌లున్నాయి. అదే పట్టణాల్లో భారీ మురికివాడలున్నాయ.
* ఎన్నో చోట్ల ఆడవారు, మగవారు రైల్వే ట్రాక్‌నే మరుగుదొడ్డిగా ఉపయోగించుకునే దేశమిది. ఇదే దేశంలో ఒక జంటకు మూడు బాత్‌రూంలు కూడా ఉన్నాయ.
* ఈ దేశంలో నాయకులు ప్రజలకు సేవ చేస్తూ జీతంతో పాటు వారి నుండి డబ్బులూ తీసుకుంటారు.
* మనం అవినీతికి వ్యతిరేకంగా అనర్ఘళంగా ఉపన్యాసం ఇస్తాం. రాంగ్ రూట్‌లో వెళితే ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటే చేతిలో నోటు పెట్టి వెళ్లిపోతాం.
* నిజాన్ని ఒప్పుకుందాం.. ఇది మన భారతదేశం.



 . పూర్తి లేఖ ఇక్కడ 


cover story | ఇది మన భారతదేశం | Andhra Bhoomi

13, ఆగస్టు 2011, శనివారం

అవినీతి ఉద్యమంలో ముందున్నఅవినీతి పరులు ..

అన్నిరోగాలకు జిందాతిలస్మాత్ మందు అన్నట్టు జనలోక్‌పాల్ వస్తే చాలు అవినీతి అంతా మటుమాయం అవుతుందని భావిస్తున్నారు. దీని సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు జరుగుతున్న అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అవినీతిపరులే ముందుండడం విశేషం. బ్రిటీష్ పాలన కొనసాగాలని కోరుకున్న వర్గాలే స్వాతంత్య్రం లభించిన కొంత కాలం తరువాత అధికారం సాధించారు. ఇప్పుడు అదే విధంగా అవినీతిలో ముందున్న వారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నారు.

నంది శ్రీహరి అన్న ఒక ‘ఉద్యమ’ కారుడు, సినిమా నిర్మాత సమాజంలోని అవినీతికి చలించి పోయాడు. వైఎస్‌ఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ఎండగడుతూ నగరం నిద్రపోతున్న వేళ అని సినిమా తీశాడు. చక్కని సినిమా అని అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు సంతోషం వ్యక్తం చేశారు. అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తున్న బాబుగారికి చెందిన స్టూడియో ఎన్ చానల్‌లో ఆ సినిమాపై ప్రత్యేక కార్యక్రమాన్ని చూపించారు.


 ఈసినిమాలో వైఎస్‌ఆర్ కుంభకోణాలను బయటపెట్టామని, జగన్ మనుషులు సినిమా నడవకుండా దాడులు చేస్తున్నారని చెప్పారు. రంగంలోకి దిగిన సినీ నటుడు, టిడిపి మాజీ మంత్రి బాబు మోహన్ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు? పేపర్లలో వచ్చిన వార్తలతోనే సినిమా తీశారని, చక్కని సందేశాత్మక సినిమా అని, నిర్మాత అభిరుచిని మెచ్చుకున్నారు.
 ఆ నిర్మాత సైతం అవినీతి సమాజాన్ని ఎలా పట్టిపీడిస్తుందో, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఎంతుందో సందేశాత్మకంగా వివరించారు. అంతా బాగానే ఉంది కానీ ఇది జరిగిన రెండువారాలకే ప్రజలను చీటింగ్ చేస్తున్నారని ఆ నిర్మాత నంది శ్రీహరిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు.
 ఆయన అరెస్టుతో అవినీతి వ్యతిరేక ఉద్యమం ఒక గొప్ప ఉద్యమ కారున్ని కోల్పోయినట్టు అయింది. బెయిల్‌పై వెంటనే బయటకు వచ్చి ఆయన తన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని కొనసాగించాలని కోరుకుందాం.ఆయన మరో సినిమా కూడా తీస్తున్నారట! బహుశా అది కూడా అవినీతికి వ్యతిరేకంగా సందేశాత్మక సినిమానే అయి ఉంటుంది. 


అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించగానే ఆయన దీక్షకు చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. జగన్మోహన్‌రెడ్డి అవినీతి వ్యవహారాల్లో సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నారు. గాలి జనార్దన్‌రెడ్డి మైనింగ్ మాఫియా ప్రభావం పడి కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.మంత్రి పదవి కోల్పోయిన గాలి సోదరులకు కొత్త మంత్రివర్గంలో స్థానం కూడా దక్కలేదు.


 కానీ తన అవినీతి కేసుల్లో విచారణ చేపట్టకుండా సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న చరిత్ర బాబుగారిది. తనపై ఇరవై ఒక్క కమిటీలు, కమీషన్‌లు వేసి విచారణ జరిపిస్తున్నారని చంద్రబాబు సగర్వంగా ప్రకటించుకుంటారు. ఇక చంద్రబాబుతో అవినీతిపై ఉద్యమానికి బాబా రాందేవ్ ఎమ్‌ఓయు కుదుర్చుకున్నారు. బాబు ఒక్కరినేనా రాష్ట్రంలో ఇంకెవరితోనైనా కలిసి ఉద్యమిస్తారా? అని ఆయన్ని ప్రశ్నిస్తే, ఎవరు వచ్చినా తన తలుపులు తెరిచే ఉన్నాయని ఆయన ప్రకటించారు.


 అంటే బాబాకు ఒకవైపు బాబు మరోవైపు జగన్ నిలిచి అవినీతిపై ఉద్యమిస్తుంటే దాన్ని సినిమాగా తీయడానికి నంది శ్రీహరి సిద్ధంగా ఉన్న దృశ్యాన్ని చూసి మనం ఏ మాత్రం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. రాష్ట్రంలో చాలా కాలం నుండి నైతిక విలువల ప్రచారంపై గుత్త్ధాపత్యం తీసుకున్న రాజగురువు చట్ట వ్యతిరేక ఆర్థిక వ్యవహారాలు బయటపడడంతో పాతిక శాతం ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది. ఎలాగైనా, ఏం చేసేనా రాజగురువు స్థాయికి ఎదగాలని కలలు కంటున్న పిల్ల రాజగురువు ఒకరు ఇప్పుడు రాష్టమ్రంతటా తిరిగి విద్యార్థులకు నైతిక విలువలు బోధిస్తున్నారు. అవినీతి నిర్మూలన జరగాల్సిందే కానీ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అవినీతి పరులు ముందుండడం, దాన్ని తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించడం ఎవరికి మేలు ముగింపు ..
ఎన్నటికైనా అవినీతికి పరాజయం ... నీతికి జయం తప్పదని బాబు మంచి మాట చెబుతున్నారు. దానికి ఆయనో మంచి ఉదాహరణ కూడా చెబుతున్నారు . తమిళనాడులోఅవినీతి కరుణానిధి ఓడిపోయి నీతికి మారుపేరైన జయలలిత గెలిచారు , అలానే ఇక్కడ జగన్ ఓడిపోయి , నేను గెలుస్తాను అని ఆయన చెబుతున్నారు. గతం లో కరుణానిధి తనకు రాజకీయాల్లో గురువు లాంటి వారు అని  ఇదే బాబు గారు చెప్పారు .  దేశం మొత్తం లో అవినీతి పరురాలిగా అత్యధిక ప్రచారం పొందిన గొప్ప నాయకురాలు జయలలిత . అవినీతి కేసులో స్వయంగా కోర్టుకు హాజరు కావలసిందే అని తాజాగా కోర్టు ఆదేశించింది.  సంపాదన విషయం లోజగన్ ముందుండ వచ్చు కానీ జాతీయ పత్రికల్లో సైతం అవినీతిపై ఎక్కువ ప్రచారం లభించింది జయలలితకే జగన్ పై తెలుగునాట మాత్రమే ప్రచారం జరిగింది . మొత్తం మీద అవినీతి పరులే అవినీతి ఉద్యమం లో ముందుండడం మనం చేసుకున్న అదృష్టం 


10, ఆగస్టు 2011, బుధవారం

జగనా ? రాజగురువా ? ఎవరు పిట్టలదొర ?

శ్రీధర్ ఇంతకూ పిట్టల దొర ఎవరంటావు? మీ పత్రికల్లో వార్తలు చూస్తేనేమో జగన్ పిట్టలదొర అని మీరు భావిస్తున్నట్టుగా ఉంది. మరి మొన్ననే కడప ప్రజలు మీ వార్తలు చదివిన తరువాత కుడా జగన్కు ఐదున్నర లక్షలమెజారిటీ ఇచ్చారంటే  రాజగురువునే ప్రజలు పిట్టల దొర అనుకుంటున్నారేమో అనిపిస్తోంది. ప్రజల భావన వాస్తవమా? మీ రాతలు వాస్తవమా? నిజంగా నిజం తెలియడం లేదు .

మరో ప్రపంచం- మాయా ప్రపంచం

తలుపులకు తాళాలు లేని ఇళ్లను సృష్టించేస్తాను అని బయలు దేరుతాడు చాలా కాలం క్రితం వచ్చిన రాజువెడలే సినిమాలో శోభన్‌బాబు. అలానే వెనకటికో రాజుగారికి తన దేశాన్ని అవినీతి లేని రాజ్యంగా చేయాలనే కోరిక పుట్టింది. అవినీతి లేనిదే అస్సలు ఊపిరి పీల్చుకోలేని ఒక ఉద్యోగి గురించి రాజుగారికి వేగుల ద్వారా తెలిసింది. అవినీతి రహిత రాజ్యాన్ని నిర్మించాలనుకున్న రాజుగారు తాను అనుకున్నదాన్ని ఆ ఉద్యోగి తోనే మొదలుపెట్టాలనుకున్నాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారికి వద్దన్నా వచ్చి నిధులు పడిపోతున్నట్టుగానే ఆ కాలంలో రాజుగారి ఆస్థానంలో ఉన్నవారికి వద్దన్నా డబ్బులు వచ్చి పడేవి. తన ఆస్థానానికి అతి దూరంగా ఉన్న ప్రాంతం ఏదా? అని వెతికితే రాజుగారికి సముద్రం కనిపించింది. సరే నువ్వు ఆ సముద్రం వద్దకు వెళ్లి.. రోజూ అలలు లెక్కపెట్టు ఇదే నీ ఉద్యోగం అని చెప్పి పంపాడు.

ఉద్యోగి వెళ్లి చాలా రోజులైంది అతనికి నెలనెల జీతం ముడుతుంది. ఉద్యోగి కాళ్లావేళ్లా పడతాడని అనుకున్న రాజుకు కొంత నిరాశ కలిగింది. ఆ ఉద్యోగి సముద్రం ఒడ్డున తన జీవితాన్ని ఎలా గడుపుతున్నాడో చూడాలనుకున్నాడు. పాతాళభైరవిలో ఎన్టీఆర్‌కు అంజిగాడు తోడన్నట్టు రాజుగారు అంజిగాడి లాంటి గంజిగాడిని తోడు తీసుకొని మారువేషంలో సముద్రం ఒడ్డుకు వెళ్లాడు. ఆ ఉద్యోగి గతంలో కన్నా కాస్త ఒళ్లు చేసినట్టున్నాడు, సంతోషంగా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. బాటసారుల్లా వచ్చిన రాజు, అతని గంజిగాడు ఆ ఉద్యోగిని పలకరించారు.


 జీవితం ఎలా సాగుతుందేంటి అని ముచ్చట్లు మొదలు పెట్టారు. రాజుగారి పుణ్యమా అని చాలా సంతోషంగా ఉంది, గతంలో కన్నా ఆదాయం పెరిగింది, ఆరోగ్యం పెరిగిందని చెప్పుకుపోతున్నాడు. అదెలా సాధ్యమో రాజుకు అర్ధం కాలేదు. కొద్దిసేపటి తరువాత ఓపెద్ద వాణిజ్యనౌక అటు నుండి వస్తుండడంతో ఉద్యోగి సంతోషంగా నిలబడ్డాడు. ఆగండాగండి నేను అలలు లెక్కిస్తున్నాను. ఇది రాజాజ్ఞ నా పనికి మీరు అడ్డురావద్దు, మీ ఓడను పక్కన నిలపండి అని ఆదేశించాడు. ఓడ వాడొచ్చి ఉద్యోగి చేతిలో డబ్బు పెట్టాడు.

సముద్రంలో అలలు లెక్కపెట్టడం నా ఉద్యోగం, అలల లెక్కింపునకు ఓడలు అడ్డుగా ఉంటున్నాయి, వాటిని వదిలేయాలంటే నాకేంటి? మా రాజుగారికో లక్ష్యం ఉన్నట్టుగానే భార్యాపిల్లలు సుఖంగా ఉండాలనే లక్ష్యం నాకుంది అని ఉద్యోగి నవ్వాడు. మరో ప్రపంచం అని అక్కినేని నాగేశ్వరరావు ఒక సినిమా తీశారు. ఈ సినిమాలో అర్ధరాత్రి పూట పిల్లలందరినీ ఎత్తుకెళతారు. ఆ పిల్లలలతో మరో ప్రపంచం సృష్టించాలనేది హీరో లక్ష్యం. పుణ్యానికి ప్రీమియర్ షో చూసిన వారంతా అద్భుతం, అమోఘం అని మెచ్చుకున్నారు చివరకు సినిమా విడుదలయ్యాక లెక్కలువేసుకుని ఇదా ప్రపంచం అని అక్కినేని విస్తుపోయారు.


 కొన్ని లెక్కలంతే అంతు చిక్కవు. కెమెరా ముందు నటన విసుగేశాక, రాజకీయ నట జీవితాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్‌కు సైతం ఇలాంటి లక్ష్యాలే ఉండేవి. నవజాత శిశువులను వారి తల్లిదండ్రుల నుండి దూరం చేసి కొంత మందిని ఒక చోట చేర్చి వారిని అద్భుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని ఒక పథకం ఆలోచించారు. వచ్చిన అధికారం ఎలా నిలబెట్టుకోవాలో ముందు నేర్చుకోండి మరో ప్రపంచం తరువాత అని అల్లుడు గారు సలహా ఇచ్చినట్టున్నారు ఎన్టీఆర్ చిత్రమైన లక్ష్యం అమలుకు నోచుకోలేదు. నువ్వు, నేను, టోనిబ్లేయర్ ( అమెరికా అధ్యక్షుడు క్లింటన్, ఇంగ్లాండ్ ప్రధాని టోనిబ్లేయర్, బాబు) కలిసి కొత్త ప్రపంచం సృష్టిద్దామని క్లింటన్ నాతో అన్నాడని బాబు చెప్పుకున్నారు. ఆ కొత్త ప్రపంచం ఏమిటో? దాని రంగు రుచి తెలియకముందే పాపం వీరంతా మాజీలైపోయారు. ఇంకొంత కాలం ఉండి ఉంటే మనకు మరో ప్రపంచాన్ని చూపించేవారేమో! సినిమాల్లో రొటీన్ కామెడీతో విసుగేసిన వారికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగు పలుకులతో  చక్కని కామెడీని అందిస్తున్నారు. ఓ జాతీయ చానల్ వాళ్లు దేశంలోని సిఎంలకు ర్యాంకింగ్ ఇస్తే ఈయన చివరి నుండి మొదటి స్థానంలో నిలిచారట! బహుశా ఆయన నాయకత్వంలో రాష్ట్రం సైతం ఆయనలానే చివరి నుండి మొదటి స్థానంలో నిలపడమే ఆయన జీవిత లక్ష్యం కావచ్చు. గాంధీజీ కలలు కన్న మరో ప్రపంచాన్ని సృష్టిస్తామని నాయకులంతా అంటుంటారు.

 మా నాన్న కలలు గన్న ప్రపంచాన్ని సృష్టిస్తానని జగన్ అంటున్నారు. నేతల్లానే మనకూ చిన్నప్పటి నుండే ఈ ప్రపంచాన్ని ఏదో ఒకటి చేసేయాలని బలంగా ఉంటుంది. లెక్కలు లేని ప్రపంచాన్ని సృష్టించాలనే బలమైన కోరిక చదువుకునే రోజుల్లో చాలా మందికి ఉంటుంది. అలాంటి వారు వెంకట్రామా అండ్ కో వారి ఎక్కాల బుక్కు కనిపించకుండా దాచేస్తుంటారు. లేదా పదమూడో ఎక్కం నుండి పుస్తకం చినిగిపోయి ఉంటుంది. లెక్కల బుక్కు దాచేస్తే ,పేజీలు చిరిగిపోతే ఎక్కాలు లేకుండా పోతాయా? మబ్బుల మాటున దాగిన చందమామలా ఎక్కాలు మనను జీవింతాంతం వెంటాడుతాయి. మూడుముళ్లు, ఏడుగులతో ఇద్దరి జీవితం ఒకటవుతుంది. తరువాత ఒకరో ఇద్దరో యాడ్ అవుతారు. అప్పటి నుండి జీవితంలో లెక్కలు చుక్కలు చూపిస్తాయి. భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుడి చుట్టు తిరగడం మనం చూడలేదు కానీ. ఉద్యోగంలో చేరాక మాత్రం జీవితం ఒకటో తారీఖు చుట్టూ తిరుగుతుంటుంది. 30 రోజులు ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూడడం ఆ రోజు వచ్చిన జీతానికి లెక్కలు వేయడం, మళ్లీ ఒకటో తారీఖు కోసం ఎదురు చూడడం. లెక్కలు లేని జీవితం ఉండదు... జీవితమంటే లెక్కలే.
కెమెరా ముందు ఎలా జీవించాలో ప్రపంచానికే పాఠాలు చెప్పగల మహానటులు చిత్తూరు నాగయ్య, సావిత్ర, కాంతారావు, రాజబాబు లాంటి వారు లెక్కల్లో ఫూర్ కావడం వల్లనే కదా, ప్లస్‌ల గురించి తెలియని వారి జీవితం చివరి దశలో అంతా మైనస్‌గానే మిగిలిపోయింది. నిజంగా లెక్కలు లేని ప్రపంచం ఉంటే జీవితం పగలే వెనె్నలగా ఉండేదేమో!