27, ఏప్రిల్ 2019, శనివారం

మార్వాడీల విజయ రహస్యం

‘‘ఈ రోజుల్లో కూడా కులాలు ఉన్నాయా? కులాలు, మతాలు మనం సృష్టించుకున్న కృత్రిమ గోడలు. నిజానికి ఇవేమీ లేవు.’’ చాలా మంది మేధావుల నుంచి ఇలాంటి మాటలు తరుచుగా వినిపిస్తుంటాయి. ఒకవైపు కుల సంఘాలకు నాయకత్వం వహిస్తూ మరోవైపు ఈ రోజుల్లో కూడా కులాలా? అని మనం నిర్మొహమాటంగా చెప్పగలం. కులాలు లేని సమాజం ఏర్పడాలని కోరుకుందాం తప్పు లేదు. కానీ అవి ఉన్నాయి అనేది వాస్తవం. మన ఆర్థిక అలవాట్లు, సంపాదన, మనం పెట్టుబడి ఆలోచన వీటన్నిటిపైన మన కుటుంబ వాతావరణం ఆధారపడి ఉంటుంది. సామాజిక వర్గాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఒక్కో సామాజిక వర్గం ఆలోచన ధోరణి ఒక్కో రకంగా ఉంటుంది. ఇది వాస్తవం. రాజస్థాన్ అనగానే తాగునీటి కోసం కూడా కిలోమీటర్ల దూరం వెళ్లే ఆడవారు గుర్తుకు వస్తారు. అదో ఇసుక ఎడారి. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా రాజస్థాన్ ఉండాలి.
కానీ దేశంలో ఏ మూలకు వెళ్లినా సక్సెస్‌ఫుల్ రాజస్థానీ మార్వాడీలు కనిపిస్తారు. మొఘలాయిల కాలంలో వీరు మొఘలాయిలకు బ్యాంకర్లు. మార్వాడి జగత్ సేఠీ కుటుంబం మొఘలాయిలకు బ్యాంకర్లు. మొఘలాయిలు, బ్రిటీష్ పాలకులు సైతం వీరికి వ్యాపార రంగంలో అండగా నిలిచారు. చివరకు వీరు స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో కాంగ్రెస్‌కు సైతం సహాయ సహకారాలు అందించే వారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టేంత వరకు దేశ ఆర్థిక వ్యవస్థ వీరి చేతిలో ఉండేది. ఆర్థిక సంస్కరణల తరువాత విదేశీ పెట్టుబడులు పెరగడం వల్ల వీరి వాటా తగ్గింది.
ఆర్థికంగా మాత్రం ఇప్పటికీ వీరే బలవంతులు. వ్యాపారులు కనిపిస్తారు.
ఇదేమీ సామాజిక వర్గాల గురించిన చర్చ కాదు. ఒక సామాజిక వర్గం గొప్పది, మరోటి కాదు అని చెప్పడం కాదు. దేశంలోనే అత్యంత విజయవంతమైన వర్గంగా ఉన్న వారి విజయానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. ఎవరు విజయం సాధించినా దానిలో మంచిని స్వీకరించడం తప్పేమీ కాదు. ఒక విజేతను స్ఫూర్తిగా తీసుకుని ఆదే మార్గంలో పయనించి మనం కూడా విజయం సాధించాలి అనుకోవడం తప్పేమీకాదు. కరువుకు, ఇసుక ఎడారికి కేరాఫ్ అడ్రస్ లాంటి రాజస్థాన్‌లో ఒక ప్రాంతానికి చెందిన వారు మార్వాడి. ఈ పేరు సక్సెస్‌కు, సంపదకు మారుపేరుగా నిలిచిపోయింది. ఎడారి ప్రాంతానికి చెందిన వారు దేశమంతా విస్తరించడం, విజయం సాధించడం అంటే కచ్చితంగా వారి గురించి తెలుసుకోవాలి, మంచి ఉంటే నేర్చుకోవాలి.

మహానగరంలోని మన కాలనీలో సక్సెస్‌ఫుల్ షాప్ ఎవరిది అంటే మార్వాడిలదే, పట్టణాల్లోనూ వారే... ఉపాధి కోసం మన వాళ్లు ఎక్కడో గల్ఫ్ దేశాలకు, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళుతుంటే వాళ్లేమో మన నగరంలోనే కాదు దేశమంతా విస్తరించారు. విదేశాల్లోనూ వ్యాపారంలో దూసుకువెళుతున్నారు.
డబ్బుకు సంబంధించి వారి గురించి మనకున్నవి ఎక్కువగా అపోహలే. కానీ డబ్బుకు విలువ ఇవ్వడం అనేది వారి జీవన విధానంలోనే ఉంటుంది. అదే వారి విజయ రహస్యం అంటారు ఆర్థిక రంగ నిపుణులు. మార్వాడీల విజయ రహస్యం, ఆర్థిక అంశాలపై వారి ఆలోచనా దోరణి గురించి ఇటీవల పుస్తకాలు వచ్చాయి. అదే విధంగా కొన్ని వీడియోలు కూడా రూపొందించారు. అందులో డబ్బుకు సంబంధించి వారి ఆలోచనా ధోరణి ఎలా ఉంటుందో వివరించారు.
సాధారణంగా మార్వాడీలు పిసినారులు అని ఇతరులు విమర్శిస్తారు. డబ్బుకు విలువ ఇవ్వడం పిసినారి తనం ఎలా అవుతుంది. తాను ఒక రూపాయి పెట్టి ఒక వస్తువు కొన్నా, రూపాయిని ఎక్కడైనా ఇనె్వస్ట్ చేసినా దానికి తగిన ప్రయోజనం ఉంటుందా? లేదా అని మార్వాడి ఆలోచిస్తారు. కష్టపడి సంపాదించిన డబ్బును విచ్చల విడిగా దుబారా చేయాలా? నెలకు 20వేల రూపాయల జీతంతో పని చేసే ఉద్యోగి కూడా ఐ ఫోన్‌కు 60వేల రూపాయలైనా ఖర్చు చేస్తారు. వాయిదాలపై లక్ష రూపాయల టీవీనైనా కొంటారు. ఇలాంటి ఆలోచనా ధోరణిలో ఉన్నవారు కచ్చితంగా జీవిత కాలమంతా అప్పుల్లోనే మునిగిపోతారు. నీ జీతం 20వేలు అయినప్పుడు సెల్‌ఫోన్ కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కానీ అప్పు చేసి ఖరీదైన టీవీలు, సెల్‌ఫోన్‌లు కొనడం ఎందుకు? మార్వాడీలు తమ పెట్టుబడికి తగిన రిటర్న్స్ ఉండాలని కోరుకుంటారు. అదే విధంగా తాము పెట్టే ఖర్చు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఈ ఖర్చు అవసరమా? మనం పెడుతున్న ఖర్చుకు తగిన విలువైన వస్తువునే కొంటున్నామా? అని ఆలోచిస్తారు.
చిన్నప్పటి నుంచే వారికి మనీ మేనేజ్‌మెంట్ గురించి అవగాహన ఉంటుంది. ఒక ఎం.బి.ఏ. విద్యార్థి తరగతి గదిలో వ్యాపారంలో నేర్చుకున్న దాని కన్నా ఇంట్లోనే వ్యాపారి కుటుంబంలోని వ్యక్తికి అనుభవ పూర్వకంగా వ్యాపారం గురించి ఎక్కువ తెలుస్తుంది.
మార్వాడి నిరంతరం తన వ్యాపారాన్ని, సంపదను పెంచుకుంటాడు. సంపన్నులు కావడమే కాదు నిరంతరం సంపన్నులుగా ఉండాలి అనేది మార్వాడీలు చిన్నప్పటి నుంచి అనుభవంతో నేర్చుకుంటారు. ఇది మనకు కొంత చిత్రంగా అనిపించవచ్చు. ఇది మనకు కొంత చిత్రంగా అనిపించవచ్చు. ఒకసారి సంపన్నుడు అంటే సంపన్నుడే కదా? నిరంతరం సంపన్నుడిగా ఉండడం ఏమిటనిపించవచ్చు. ఎన్టీఆర్, ఏయన్‌ఆర్‌లు నెల జీతంపై నటిస్తున్న కాలంలోనే సూపర్‌స్టార్‌గా సినిమాకు లక్ష రూపాయలు తీసుకున్న చిత్తూరు నాగయ్య సంపదకు కొదవ లేదు. అలాంటి వారు చివరి దశలో తిండికి సైతం కష్టపడాల్సిన దుస్థితి ఎదుర్కొన్నారు. ఒకసారి సంపన్నులు అయితే శాశ్వతంగా ఉండాలనేమీ లేదు. దాన్ని నిలుపుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయం మార్వాడీలకు బాగా తెలుసు, అందుకే వారు సంపద అనే దానికి అంతు ఉండదని, నిరంతరం సంపద పెంచుకుంటూ పోవాలనుకుంటారు. మన చేతిలో ఉన్న డబ్బు శాశ్వతంగా మన వద్దే ఉంటుందని చెప్పలేం, అది పోవచ్చు అనే భావనతో వారు సంపాదించడం అనేది నిరంతరం సాగాలని కోరుకుంటారు. సంపాదించడం, ఇనె్వస్ట్ చేయడం ఈ రెండూ ఎప్పుడూ నిలిపివేయవద్దు కొనసాగించాలి అనేది వీరి నమ్మే సిద్ధాంతం. వ్యాపారంలోనైనా, పెట్టుబడుల్లో నైనా వీళ్లు తక్షణ లాభాల కోసం చూడరు. దీర్ఘకాలిక లాభాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పటికప్పుడు వీరు లెక్కలు వేసుకుంటారు. దీని వల్ల వ్యాపారంలో మోసాలు ఉండవు, లెక్కలు వేసుకోవడం వల్ల తాము వెళుతున్న దారి సరైనదేనా, తప్పటడుగులు పడుతున్నాయా? అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆలోచనా ధోరణే మార్వాడీలను దేశంలో వ్యాపార రంగంలో ముందు వరసలో నిలబెట్టింది. మార్వాడీ వ్యాపారులకే కాదు డబ్బుకు విలువ ఇవ్వడం అందరికీ అవసరమే!
-బి.మురళి (21-4-2019)

17, ఏప్రిల్ 2019, బుధవారం

మీ డబ్బుపై మీదే పెత్తనం

‘‘మా ఇంటిపై నరదిష్టి పడింది. ఎవరి కన్నుకుట్టిందో కానీ ఇబ్బందులన్నీ మాకే. జీతం రాగానే అస్సలు డబ్బులు మిగలడం లేదు. పిల్లలు పెద్దవారవుతున్నారు. వారి చదువులు, ఇతర ఖర్చులు తలుచుకుంటే భయమేస్తుంది’’
‘‘మరేం చేద్దామనుకుంటున్నారు.?’’
‘‘మా బంధువు చెబితే ఆ మధ్య పూజలు చేయించాం. ఐనా పెద్దగా మార్పు లేదు. ఆయనెవరో పవర్‌ఫుల్ యంత్రాలు ఇస్తున్నారట! రెండు రోజులు సెలవు పెట్టయినా వెళ్లి రావాలి అనుకుంటున్నాను’’
‘‘మూర్తిగారు మీ సమస్య నాకు అర్థమైంది. ఆయన ఇచ్చే యంత్రాల కన్నా డబుల్ ఫవర్‌ఫుల్ యంత్రాన్ని నేను సగం ధరకే ఇప్పిస్తాను తీసుకుంటారా?’’
‘‘అదేంటి మీరు ఇలాంటివి నమ్మరు కదా? మీరు కూడా యంత్రాల్లోకి వచ్చారా?’’
‘‘నమ్మకాలదేముంది? ఇంత లాభసాటి వ్యాపారం కళ్ల ముందు కనిపిస్తుంటే మిమ్ములను చూశాకే నాకూ ఈ వ్యాపారంలో ప్రవేశించాలనిపిస్తోంది’’
‘‘అసలే కష్టాల్లో ఉన్నాను. ఇలా నమ్మకాలను అపహాస్యం చేయడం మంచిది కాదండి. ఎవరి నమ్మకాలు వారివి.’’
‘‘నేనేమీ అపహాస్యం చేయడం లేదు. లాభసాటి వ్యాపారం నేనూ చేస్తాను అంటున్నాను’’
‘‘వ్యంగ్యం వద్దు నా సమస్యకు ఏమైనా చెప్పగలిగితే పరిష్కార మార్గం చెప్పండి’’
‘‘మీ సమస్యకు మీరే కారణం, మీ సమస్య పరిష్కరించుకునే శక్తి మీకే ఉంది. మీ మాటల్లోనే మీరు డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారో తెలుస్తోంది. మీ పద్దతులు మార్చుకోండి. నెలంతా జీతం చేస్తేవచ్చే మీ డబ్బుకు మీరే విలువ ఇవ్వకపోతే ఇక అది మీ వద్ద ఎలా నిలుస్తుంది. ’’
‘‘పూజలు, మంత్రాలు తప్పా?’’‘‘ఆ మాట నేను అనలేదు. దేవుడు లేని చోటు లేదు అంటారు. దైవాన్ని నమ్మే మీకు ఈ మాట తెలియదు అనుకోను. సమస్త విశ్వాన్ని నడిపించేది ఆ దేవుడు అని నమ్మినప్పుడు ఆ దేవుడికి లేని శక్తి రేకులు అమ్ముకునే వాడికి ఉంటుందా? దైవం అన్ని చోట్లా ఉన్నాడు. మనస్ఫూర్తిగా మనసులోనే దైవాన్ని మొక్కుకోండి. దేవుడు ఉన్నాడా? లేడా? అనే వాదన కాదు. ఉన్నాడు అని విశ్వసిస్తే మనసులోనే ప్రార్థంచండి మీ కాలనీలో ఉన్న ఆలయానికి వెళ్లి మొక్కండి. అంతే కానీ ఏవో రాతలు రాసిన, గీతలు గీసిన రేకులకు మీ కష్టార్జితం అప్పగించకండి అని చెబుతున్నాను అంతే’’

‘‘అంత నరదిష్టి ప్రభావం లేదంటారా?’’
‘‘మీరేమి అనుకోకండి మీమీద ఎవరి ప్రభావమో ఉండదు. మీ ప్రభావమే ఉంటుంది. ’’
‘‘అంటే?’’
‘‘నావద్ద డబ్బు నిలవడం లేదు అని నెపం ఎవరిమీదనో నెట్టివేయకండి. మీ డబ్బు మీ మాట వింటుంది. ముందు అది మీ కష్టార్జితం అని మీరు గ్రహించండి. ఒక్కో రూపాయి ఎంత కష్టపడితే వచ్చి చేరుతుంది. ఖర్చు చేసేప్పుడు ఈ విషయం గుర్తుకు తెచ్చుకోండి.’’
‘‘డబ్బు నిలిచే సలహా ఇస్తారా?’’
‘‘క్రెడిట్ కార్డులు పక్కన పారేయండి. అత్యవసరం ఐతే తప్ప ఉపయోగించకండి. డబ్బు చేతులతో లెక్కపెట్టి ఇవ్వడం వల్ల ఇది అవసరమా? లేదా? అనే ఆలోచన వస్తుంది.
* ఇంట్లోకి కావలసిన వస్తువులను మాల్‌లో కొనడం కన్నా షాపులో కొనడం మంచిది. కావాలంటే ఒకనెల పరీక్షించి చూడండి. మాల్‌లోకి వెళితే మనక అవసరం అయిన వస్తువులే కాదు అక్కడ అందంగా కనిపించినవన్నీ కొనేస్తాం. దీని వల్ల మనకు వచ్చే డిస్కౌంట్ కన్నా మనం అనవసరంగా పెట్టే ఖర్చు ఎక్కువ. పెద్ద పెద్ద మాల్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ దొరక వచ్చు. కానీ ఆ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అవసరం లేని ఖర్చు చేస్తాం.
* మాల్‌కు వెళ్లినా, షాపునకు వెళ్లినా, రైతు బజార్‌కు, సంతకు వెళ్లినా ఏం కొనాలో ముందుగానే ఒక జాబితా రాసుకుని వెళ్లండి. దీని వల్ల అవసరం లేనివి కొనడం మానేస్తారు.
* నెల నెలా వాయిదాల్లో కొనడం వద్దు. ఆ వస్తువును కొనే ఆర్థిక స్థాయి వచ్చిన తరువాతే కొనండి.
* భవిష్యత్తులో ఆదాయం పెరగవచ్చు అనే అంచనాతో ఇప్పటి నుంచే ఖర్చు పెంచుకుంటే ఇబ్బందుల్లో పడిపోతారు.
* పెద్ద వస్తువు కొనాలి అనిపించినప్పుడు నెల వాయిదా వేసుకోండి. ఈ సమయంలో మార్కెట్‌లో స్టడీ చేయవచ్చు. సరైన ధర గురించి అవగాహన వస్తుంది. నెల వ్యవధి వల్ల ఆ వస్తువు నిజంగా అవసరమా? లేదా? అనే అవగాహన వస్తుంది.
* జీతం రాగానే ముందుగా ఖర్చు చేయడం కాదు. భవిష్యత్తు కోసం ముందు ఇనె్వస్ట్ చేయండి. ఆ ఇనె్వస్ట్‌మెంట్ తరువాత మిగిలిందే మీ జీతంగా భావించండి.
* ఎంత సంపాదిస్తున్నా, అంత కన్నా తక్కువే నా ఆదాయం అనే నిర్ణయానికి వచ్చి ఆ స్థాయిలోనే బతకాలి. అలా మిగిల్చింది ఇనె్వస్ట్ చేయాలి.
* కరెంటు బిల్లు మొదలుకొని, సినిమాలు, హోటల్స్, ఇంటి ఖర్చు, అన్ని రకాల ఖర్చుల జాబితా రూపొందించుకుని, అందులో అనవసరమైన ఖర్చు ఏమైనా? ఉందా? తగ్గించాల్సిన ఖర్చు ఏమైనా ఉందా? అని పరిశీలించాలి. *పిల్లలకు పెద్ద మొత్తంలో పాకెట్ మనీ ఇవ్వడం కన్నా, వారి భవిష్యత్తుకు అవసరం అయిన ఇనె్వస్ట్‌మెంట్‌ను బహుమతిగా ఇవ్వండి. అప్పటికప్పుడు వారికి దాని విలువ అర్థం కాకపోయినా భవిష్యత్తులో అర్థం అవుతుంది.
* రేపటి రోజు ఆర్థికంగా ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో ఊహించుకోండి. ఆ ఊహకు తగ్గట్టు ప్రణాళిక రూపొందించుకోండి.
* హఠాత్తుగా దేవుళ్లు ప్రత్యక్షమై మన మంచితనాన్ని మెచ్చుకుని పెద్ద మొత్తంలో సంపద ఇచ్చిపోతారు. లాటరీ తగులుతుంది అనే ఊహలకు బ్రేకు వేయండి. మనల్ని మనమే కరుణించుకోవాలి. మన నిర్ణయాలే మనకు లాటరీలు.
* మనకే డబ్బు, పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్ గురించి తెలియకపోతే ఇక మన పిల్లలకు ఏం చెబుతాం? పిల్లలతో ఆర్థిక వ్యవహారాల గురించి చర్చించండి.
-బి.మురళి(14-4-2019)

మీ రిటైర్‌మెంట్ వయసెంత?

ప్రశ్న తప్పుగా అనిపిస్తుంది కదూ? నిజమే రిటైర్‌మెంట్ వయసును మనకు మనం నిర్ణయించుకోలేం. ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఆయా సంస్థలు నిర్ణయిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం అయితే ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రైవేటు ఉద్యోగం ఐతే ఆ కంపెనీ నిర్ణయిస్తుంది. ఇంతకు ముందు 58 ఏళ్లు రిటైర్‌మెంట్ వయసు ఐతే ఆంధ్రలో 60కి పెంచారు. 61కి పెంచనున్నట్టు తెలంగాణలో హామీ ఇచ్చారు. సగటు ఉద్యోగి అంచనాలు అన్నీ తన రిటైర్‌మెంట్ వయసుతో ముడిపడి ఉంటాయి. రిటైర్ అయ్యే లోగానే సొంతిళ్లు, పిల్లలు జీవితంలో స్థిరపడేట్టు చేయాలని సగటు వ్యక్తి కోరుకుంటాడు. సాధారణంగా రిటైర్‌మెంట్‌కు ఇంకో ఐదేళ్ల గడువు ఉంది అనగా ఈ ఆలోచనల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచే రిటైర్‌మెంట్ కోసం తగిన ప్రణాళిక రూపొందించుకునే వారు టెన్షన్ లేకుండా గడిపేస్తుంటే, ఐదేళ్లు అంత కన్నా తక్కువ సమయం ఉన్నవారిలో టెన్షన్ పెరుగుతుంటుంది. ఒక వైపు వయసు పెరుగుతుంటుంది. మరోవైపు పూర్తి కాని బాధ్యతలు, రిటైర్‌మెంట్ వయసు దగ్గర పడుతుండడం వీటన్నిటితో తీవ్రంగా ఆలోచించడంతో ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
మన ఆరోగ్యానికి రిటైర్‌మెంట్ వయసుకు దగ్గరి సంబంధం ఉంది. కొంత ఆశ్చర్యం అనిపించినా అమెరికాలోని ఒక యూనివర్సిటీవారు 2002లో జరిపిన ఒక ఆధ్యయనంలో దీనికి సంబంధించి ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.

ఈ అధ్యయనం గురించి చెప్పుకునే ముందు రిటైర్‌మెంట్ వయసు మన చేతిలోనే ఉంటుందని గ్రహించాలి. ప్రభుత్వం కావచ్చు, ప్రైవేటు సంస్థలు కావచ్చు రిటైర్‌మెంట్ వయసు 60 అని నిర్ణయించవచ్చు. మీరు దానికి కట్టుబడి 60 ఏళ్ల వరకు పని చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రణాళిక, మీ ముందు చూపు బాగుంటే 50 ఏళ్ల లోపే రిటైర్ కావచ్చు. మిగిలిన కాలాన్ని మీకిష్టమైన విధంగా గడపవచ్చు. ఆయా వ్యక్తులకు ఉండే ఆసక్తి, అభిరుచి మేరకు వ్యాపారంలో, మరో వృత్తిలో, లేదా తమకు ఇష్టమైన వ్యాపకంతో గడపవచ్చు.
ఐతే దానికి ముందు నుంచే సరైన ప్రణాళిక అవసరం. తన ఉద్యోగం ద్వారా వస్తున్న జీతం ఎంతో, తాను ఉద్యోగం చేయకపోయినా ఆ మెరకు నెల నెలా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్న వారు తక్కువ వయసులోనే రిటైర్ కావచ్చు. ఉదాహరణకు నెలకు లక్ష రూపాయ జీతం ఐతే ప్రారంభంలోనే పొదుపు మొత్తాన్ని సరైన రీతిలో ఇనె్వస్ట్ చేస్తే పదేళ్లలో తన జీతానికి సమానమైన ఆదాయం ఇనె్వస్ట్‌మెంట్ ద్వారా పొందవచ్చు. అలాంటి వారు ఫైనాన్షియల్ ఫ్రీడంతో తమకిష్టమైన పనిలో గడపడం ద్వారా ఒత్తిడి లేకుండా ఎక్కువ కాలం జీవిస్తారు.
ఇక రిటైర్‌మెంట్ వయసుకు ఆయుఃప్రమాణానికి సంబంధించిన అధ్యయనం విషయానికి వస్తే....
చైనీస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అమెరికా న్యూ యార్క్ చాప్టర్ వాళ్లు ఈ అంశంపై 2002లో ఒక అధ్యయనం చేశారు. ఎక్కువ కాలం ఉద్యోగంలో ఒత్తిడితో పని చేసే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందట! ఆ సమయంలో ఎక్కువ మంది అమెరికాలో 65ఏళ్ల వయసులో రిటైర్ అయ్యేవాళ్లు. పెద్ద ఎత్తున పెన్షన్ ఫండ్స్ మిగిలిపోతున్నట్టు గమనించారు. 65ఏళ్ల వయసులో రిటైర్ అయ్యాక ఓ రెండేళ్లు మాత్రమే బతుకుతున్నారు. సగటున 66.8ఏళ్లకు మరణిస్తున్నట్టు తేలింది. అదే సమయంలో 55ఏళ్ల వయసులోనై రిటైర్ అయిన వారు సగటును 86ఏళ్ల వరకు జీవిస్తున్నారని తేలింది. 55ఏళ్లు దాటిని తరువాత బాగా ఒత్తిడిగా ఉండే ఉద్యోగాల వల్ల ఒక ఏడాది రెండేళ్ల ఆయుఃస్సు ప్రమాణం తగ్గుతున్నట్టు తేలింది. మరి 55ఏళ్ల వయసులో రిటైర్ అయిన వారు ఏ పనీ చేయకుండా కాలక్షేపం చేయడం వల్ల ఎక్కువ కాలం జీవించారా అంటే అది కాదట! ఉద్యోగంలో ఉన్న వారి మాదిరిగానే వీళ్లు కూడా పని చేస్తూనే ఉన్నారు. ఐతే ఉద్యోగంలో ఉన్న వాళ్లు ఆ నెల జీతం రాకపోతే సమస్యలు ఎదుర్కొనే వాళ్లు. పైగా వారి ఉద్యోగంలో టెన్షన్ ఎక్కువ. 55 ఏళ్లు దాటిన వారు తమ మెదడుకు, శరీరానికి ఎక్కువ శ్రమ కల్పించడం, టెన్షన్ వల్ల అనారోగ్యం పాలవుతున్నారని తేలింది. అదే 55 ఏళ్లకు రిటైర్ అయిన వారు మాత్రం దానికి ఎప్పటి నుంచో ఒక ప్రణాళిక రూపొందించుకుని, ఉద్యోగం లేకపోయినా ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకుని మానసికంగా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా తమకు నచ్చిన పని చేసుకుంటున్నారట! దాని వల్ల వారి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉండి ఎక్కువ కాలం బతికినట్టు తేలింది. అదే సమయంలో మరి జపాన్ ప్రజలు ఎక్కువ కాలం బతకడానికి కారణం ఏమిటా? అని కూడా పరిశీలించారు. వారిలో ఎక్కువ మంది 60 ఏళ్ల లోపే రిటైర్ అయి తమకు నచ్చిన పని చేసుకుంటారు.

మన రిటైర్‌మెంట్ వయసు ఎంత ఉండాలి అని మనకు మనమే నిర్ణయించుకోవాలి. ఆ వయసు తరువాత పని చేయవద్దు అని కాదు. పని చేయకపోయినా గడుస్తుంది అని ఆర్థిక భరోసా ఉండాలి అని చెప్పడమే ఉద్దేశం.
-బి. మురళి(7-4-2019

ఎవడు కొడితే మైండ్ బ్లాంక్...

ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండు. పూరి జగన్నాథ్ సినిమాలోని ఈ డైలాగు తెలుగు నెలను ఒక ఊపు ఊపింది. ఇది అందరికీ తెలుసు కాని విషయం ఏమంటే ... చాలా మంది జీవితాల్లో ఇలా దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేట్టు చేసే పండుగాడు చాలా మంది జీవితాల్లో ఉంటారు. చివరకు ఆ డైలాగు రాసిన పూరి జగన్నాథ్ జీవితంలో కూడా ఉన్నాడు. తెలుగులో ఇప్పటి వరకు ఎవరూ సంపాదించనంత డబ్బు సంపాదించిన దర్శకుడు ఆయన. ఆయన తీసిన చాలా సినిమాలు సూపర్ హిట్. కథ మాత్రమే కాదు ఇలాంటి పాపులర్ డైలాగులు రాసింది సైతం ఆయనే. కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందని డైలాగు రాసిన పూరి జగన్నాథ్‌కు దిమ్మతిరిగి, మైండ్ బ్లాంక్ అయ్యేట్టుగా కొట్టింది ఆయన నమ్మిన వారే. పూరి జగన్నాధ్ చెప్పిన దాని ప్రకారమే అతని ఆర్థిక వ్యవహారాలు చూసే వ్యక్తే నమ్మించి దాదాపు వంద కోట్ల రూపాయల వరకు మోసం చేశాడట! సూపర్ హిట్ సినిమాలతో బిజీగా ఉన్న పూరి ఆర్థిక వ్యవహారాలు అన్నీ ఒకరు చూసేవారు. ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలియదు కానీ ఆ నమ్మిన వ్యక్తి పూరిని నిండా ముంచేశాడు. అత్యధిక పారితోషకం తీసుకున్న దర్శకుడు, అత్యధికంగా సంపాదించిన దర్శకుడు ఆ దెబ్బతో చివరకు తన పెంపుడు కుక్కలకు తిండి కూడా పెట్టలేని స్థితిలో పడిపోయాడు. ఆ మోసం విలువ దాదాపు వంద కోట్ల రూపాయల వరకు ఉంటుందని పూరి చెప్పారు.
దర్శకుడు, రచయిత అంటే మనుషుల జీవితాలను పరిశీలిస్తుంటారు. అంత పవర్‌ఫుల్ డైలాగులను రాయాలి అంటే జీవితాన్ని ఎంత సునిశితంగా పరిశీలించే అలవాటు ఉండాలి. నమ్మకం, మోసం వంటి మనుషుల లక్షణాలు ఎంత బాగా తెలిసి ఉండాలి. ఏదో ఆషామాషిగా అంత గొప్ప దర్శకులు కాలేరు. కానీ చిత్రం ఏమంటే తన పరిశీలన మొత్తం దర్శకత్వం వహించడానికి, కథ, మాటలు రాయడానికే పరిమితం చేశారు. నిజ జీవితంలో సైతం తనకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేట్టు చేసే వ్యక్తులు ఉంటారని పూరి జగన్నాథ్ ఊహించలేకపోయారు.
ఇక్కడ పూరి జగన్నాథ్ గురించి చెప్పడం అంటే ఆయన వంద కోట్ల రూపాయలు పోయాయని సానుభూతితో కాదు. నిజానికి ప్రతి మనిషి జీవితంలో ఇలా మైండ్ బ్లాంక్ చేసే పండుగాళ్లు ఉంటారు అని చెప్పడానికే పూరి ఉదంతాన్ని ప్రస్తావించడం.
ఒక్క సినిమా రంగంలోని వారికే కాదు, ఏ రంగంలో ఉన్నా ఇలా మోసం చేసేవాళ్లు ఉంటారు. మోసపోయేవాళ్లు ఉంటారు. సంపాదించడమే కాదు సంపాదించిన డబ్బును మనం కోరుకున్నట్టుగా ఉపయోగించుకోవడం,జాగ్రత్త చేయడం కూడా మనకు తెలిసి ఉండాలి. లేకపోతే రోడ్డున పడతాం. పూరి జగన్నాథ్ వంద కోట్ల రూపాయల మోసానికి గురైనా కాలం కలిసి వచ్చి తిరిగి నిలదొక్కుకున్నారు. అందరికీ అలాంటి అవకాశాలు వస్తాయని కాదు. పాత తరం నటులు ఇలా మోసాలకు గురైన చివరి దశలో తిండికి లేకుండా గడిపారు. హీరోయిన్‌గా, హాస్యనటిగా ఒక వెలుగు వెలిగిన గిరిజ చివరి దశలో తిండికి సైతం బాధపడ్డారు. చివరకు తిండి కోసం కూడా నలుగురి ముందు చేయి చాచి బతికారు. భర్త చేతిలోనే గిరిజ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. ఆయన్ని దర్శకుడిగా నిలబెట్టడానికి సినిమాలు తీసి, భర్తమీద పెట్టుబడి పెట్టి రోడ్డున పడ్డారు. ఆనాటి స్టార్ హీరోలతో సమానంగా మద్రాస్‌లో పెద్ద భవంతి నిర్మించుకున్న ఆమె చివరి దశలో తలదాచుకునే చోటు కూడా లేకుండాపోయింది.
ఇక్కడ తెలివితో సంబంధం లేదు. పూరి జగన్నాథ్‌కు తెలివి లేదు అందామా? తెలుగు సినిమా రంగంలో రికార్డులు సృష్టించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు ఆయన ఆయనకు తెలివి లేదని ఎలా అంటాం. అలానే అలనాటి పాత తరం నటులు ఎంతో మంది తెలివి లేకుండానే అంత ఉన్నత స్థాయికి వెళ్లారా? అద్భుతమైన తెలివి తేటలు, నైపుణ్యం ఉంటే తప్ప వీళ్లు తమ తమ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరరు.
ఐతే ఇదే సమయంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన తెలివి తేటలు సైతం అవసరం.
సినిమా వారి ఉదాహరణలు ఎందుకు అంటే వారి గురించి అందరికీ తెలుసు కాబట్టి. ఇలా స్నేహితులను నమ్మి నిండా మునిగిపోయిన వారు మన చుట్టుపక్కలనే ఎంతో మంది ఉండొచ్చు. మన బంధువుల్లో ఉండొచ్చు. డబ్బు కుండే లక్షణాలను తెలుసుకుంటే ఇలా మోసాల బారిన పడం. ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ఉంటే అది ఆ ఇద్దరి వద్దనే చెల్లుబాటు అవుతుంది. ఇద్దరు బంధువుల మధ్య ఉండే బంధుత్వం ఆ ఇద్దరికే వర్తిస్తుంది. ఇద్దరు పెద్ద వారి మధ్య ఉండే స్నేహం మరో వ్యక్తి వద్ద అది పని చేయకపోవచ్చు. కానీ డబ్బు అలా కాదు. ఎక్కడైనా డబ్బు విలువ ఒకే రకంగా ఉంటుంది. నీ చేతిలో ఉన్నంత వరకే అది నీ డబ్బు. నీ వద్ద ఉన్నంత వరకే అది నీ మాట వింటుంది. నీ చేయి దాటి ఇంకొకరి వద్దకు వెళ్లిందనుకో... ఆ డబ్బు నిన్ను అస్సలు గుర్తు పట్టదు. నీ వైపు చూడదు. ఎవరి వద్ద ఉందో వారికే విశ్వాసంగా ఉంటుంది. వారి మాటే వింటుంది. డబ్బుకుండే ఈ లక్షణం అర్థం అయితే దానికి తగిన విలువ ఇస్తాం. మోసపోయాను, నమ్మించి మోసం చేశారు అనే మాటలు ఎవరి నుంచి వినిపించినా అది వారి అజ్ఞానాన్ని బయటపెట్టుకోవడమే అవుతుంది. తెలివి తేటలతో డబ్బు సంపాదించాను అని భావిస్తున్నప్పుడు, అజ్ఞానం వల్ల ఆ డబ్బును కోల్పోయామని గ్రహించాలి.
ఇష్ట పూర్వకంగా నచ్చిన వారికి మీ డబ్బులు ఇవ్వడం వేరు. తెలివి తేటలు ఉపయోగించి, చమటోడ్చి సంపాదించిన మీ డబ్బుపై పెత్తనాన్ని అమాయకత్వంతో ఎవరికో అప్పగిస్తే రోడ్డున పడాల్సి వస్తుంది. చాలా మంది విషయంలో ఇలానే జరిగింది. ఒకసారి దెబ్బతిన్నతరువాత తిరిగి కోలుకోవడం అంత ఈజీ కాదు. వయసు సహకరించదు. కాలం కలిసి రాదు. మళ్లీ సంపాదిద్దాం అనుకుంటే అప్పటికి మీ ఆరోగ్యం, వయసు పరిస్థితులు అన్నీ మారిపోయి ఉంటాయి. కాలాన్ని వెనక్కి తిప్పలేం. డబ్బుల విషయంలో మన మైండ్ బ్లాంక్ చేసే అవకాశం ఎవరికీ కల్పించవద్దు. కాల్చడమే నిప్పు లక్షణం. డబ్బుకు స్నేహాలు, బంధుత్వాలు ఏమీ ఉండవు. ఎవరి వద్ద ఉంటే వారికి విలువ ఇవ్వడమే దాని లక్షణం. ఎంత త్వరగా ఈ లక్షణాన్ని అర్థం చేసుకుంటే డబ్బు విషయంలో అంత ప్రాక్టికల్‌గా ఉండడం అలవాటు అవుతుంది.
-బి.మురళి(31-3-2019