29, జూన్ 2014, ఆదివారం

అసెంబ్లీ కాలేజీ!


అర్జునుడికి పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తే, కౌరవులకు చెట్టు, చెట్టుమీద పండ్లు, ఆకులు, పిట్టలు ఇంకా ఏమేమో కనిపించాయి. మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అందరూ ఒకే కుటుంబ సభ్యులు, అందరు చూసింది ఒకటే కానీ కనిపించింది వేరు వేరు. పిట్టకన్ను కథే కాదు మన ప్రజాస్వామ్యం కథ కూడా ఇలాంటిదే. అదో బ్రహ్మపదార్థం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు అర్ధం చేసుకోవచ్చు,దర్శించుకోవచ్చు. అసెంబ్లీకి రాగానే మీకు ఎలా అనిపించింది అని ప్రముఖ హీరో, అల్లుడిగారి వియ్యంకుడు బాలకృష్ణను అడిగితే ఆయన ఏ మాత్రం తడుముకోకుండా, స్కిృప్టు రైటర్ కోసం ఎదురు చూడకుండా కాలేజీకి వచ్చినట్టుగా ఉందని చెప్పుకొచ్చారు. అడిగిన వారు,విన్నవారు విస్మయం చెందారు. భైరవద్వీపంలో రాజకుమారిగా రోజా, రాజకుమారుడిగా బాలకృష్ణ నటించారు. ఇప్పుడు ఒకే సభలో ఇద్దరూ శాసన సభ్యులు. తండ్రి కొడుకులు ఒకే సభలో సభ్యులుగా తెలంగాణ శాసన సభ ఒక రికార్డు సృష్టిస్తే, హీరో,హీరోయిన్ ఒకే సభలో సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రికార్డు సృష్టించింది. హీరోగారికి అసెంబ్లీని చూశాక కాలేజీ ఎందుకు గుర్తుకొచ్చిందా? అని చాలా మంది అనుమానం. కాలేజీలో 60 నిమిషాలకో పిరియడ్ ఉన్నట్టు, బహుశా బావగారి గంట ఉపన్యాసం విన్నాక అలా అనిపించిందేమో అని సర్ది చెప్పుకున్నారు. అదో కాలేజీ అని అక్కడున్నవారంతా బుద్ధిగా చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులనే అభిప్రాయంతో బాలయ్య ఉంటే మంచిదే పాపం వాళ్ల నాయన కూడా ఇంతే అమాయకంగా అసెంబ్లీ అంటే ఆలయం లాంటిదని, తాను దైవాన్ని మిగిలిన సభ్యులు భక్తులు అనుకున్నారు, అధికారం నుంచి దించేసే వరకు. చరిత్రలో స్వాతంత్య్ర పోరాటం చేసిన సన్యాసుల గురించి చదివి ఉంటారు కానీ భక్తుల తిరుగుబాటును ఆయన ఊహించి ఉండరు. అదే ఆయన కొంప ముంచింది. 


మళ్లీ పిట్టకన్ను దగ్గరికి వస్తే అసెంబ్లీ ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తోంది. తరిమెల నాగిరెడ్డి అనే పెద్దాయన అసెంబ్లీ కన్నా అడవులే నయం అనుకుంటూ అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసం ఇచ్చి అటు నుంచి అటే అడవుల్లోకి వెళ్లారు. అధ్యక్షా అంటూ గొంతు చించుకుని ప్రజల సమస్యలను ఎంతగా చెప్పినా అరణ్య రోదనే అవుతోందని ఆయన ఆ సమస్యల పరిష్కారానికి అడవుల బాట పట్టారు.


ఉగాదికి పంచాంగ పఠనం చేసినట్టు అసెంబ్లీలో ఇరుపక్షాలు ప్రత్యర్థి కుంభకోణాల పఠనం చేయడం ఆనవాయితీ. ఏడాది కాలంలో ఏం జరగబోతుందో రాశుల వారిగా చదివి చెబుతుంటే వినడానికి ముచ్చటగా ఉంటుంది. వాటిని నమ్మేవాళ్లు ఉంటారు, నమ్మని వాళ్లు ఉంటారు కానీ వినడానికి మాత్రం అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. అసెంబ్లీలో అవినీతి పంచాంగంలో మాత్రం కొత్తదనం ఏమీ ఉండదు. సంవత్సరాల తరబడి అవే విషయాలు అటు వారు ఇటువారు చెప్పుకుంటారు. సరే అధికారం ఉన్నప్పుడు వీటిపై మీరెందుకు చర్య తీసుకోలేదు అంటే వాళ్లు చెప్పరు, అధికారంలో ఉన్నారు కదా ఆరోపణలు చేయడం ఎందుకు? చర్య తీసుకోవచ్చు కదా?అంటే వీళ్లు సమాధానం చెప్పరు. ఆ విషయాలు చెప్పి అధికారంలోకి రావాలని కోరుకుంటారు కానీ చర్య తీసుకోవాలని వారెందుకనుకుంటారు అనేది కొందరి వాదన. ఎంత గొప్ప సినిమా అయినా కొనే్నళ్ల పాటు అవే డైలాగులు వినాలంటే విసుగే కదా? కొత్త ఆరోపణలు, కొత్త విమర్శలైనా చేయవచ్చు కదా?


ఓ రెండు దశాబ్దాల క్రితం ఇలానే అసెంబ్లీలో భూ ఆక్రమణల గురించి రోజూ వినీ వినీ, రాయలేక విసుగేసిన ఓ మీడియా ఆయన మీడియా గ్యాలరీ నుంచి బయటకు వెళ్లి మళ్లీ కనిపించలేదు. ఏమయ్యాడా అంటే ఎవరో ఆక్రమించుకుంటే ఎవరో విమర్శస్తే మనం రాయడం ఏమిటి? ఆ మాత్రం తెలివి తేటలు మనకు లేవా? అని ఆత్మవిమర్శ చేసుకుని రంగంలో దిగాడట! ఐతే ఏమైంది అంటే ఫోర్ట్ ఎస్టేట్ కన్నా రియల్ ఎస్టేట్ గొప్పదనే జీవిత సత్యాన్ని అతను గ్రహించాడు. అతను గ్రహించిన జ్ఞాన సారాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాదు ఎందుకంటే అతను అంత బిజీ మరి.
ఆ మధ్య కర్నాటకతో పాటుకొన్ని రాష్ట్రాల్లో చట్టసభల్లో కొందరు సభ్యులు ఉత్సాహంగా కనిపించారు. నిద్ర మబ్బుతో ఉండే వారి ముఖాలు వెయ్యి వాల్టుల బల్బుల్లా వెలిగిపోతున్నాయి కారణం ఏమిటబ్బా అని గ్యాలరీలోని మీడియా కెమెరాకు అనుమానం వచ్చింది. అటువైపు జూమ్ చేసి చూస్తే ఆ పెద్దల ఉత్సాహానికి కారణం బయటపడింది. సెల్‌ఫోన్‌లో నీలి చిత్రాలు వీక్షిస్తూ ఆనంద పరవశులవుతున్నారు. బెడ్‌రూమ్‌లోకి బుల్లి తెర

రావడాన్నే అబ్బురంగా చెప్పుకున్నాం, అలాంటిది అరచేతిలో నీలి చిత్రం ఇమిడిపోయి చట్టసభల వరకు తీసుకు వచ్చినందుకు ఆ సభ్యుల తెలివి తేటలకు ముచ్చటపడాల్సింది పోయి. వేటు వేశారు. ఇంతకూ చట్టసభలు ఏం చేస్తాయి అని అడిగితే తడుముకోకుండా సమాధానం చెప్పడం చాలా మందికి కష్టమే. చట్టాలు తప్ప అన్నీ చేస్తాయని గిట్టని వాళ్ళు అంటారు 


చాలా కాలం నుంచి చట్టసభలు సామూహిక గోదాలా మారిపోయాయి. పాత కాలంలో గోదా అంటే ఇద్దరు మల్లయోధులు గోదాలోకి దిగి బాహాబాహి పోరాడే వారు. చట్టసభల్లో అలా బాహా బాహీ చేతులతో కాకుండా మాటలతో సామూహికంగా బాహాబాహీకి దిగుతారు. మొన్నో మీడియా మిత్రుడు ఇదేం సభ చప్పగా ఉంది, ఇలా అయితే ఇక మనం పని చేసినట్టే నంటూ వాపోయాడు. ఏం జరిగింది అని ఓదారిస్తే, ఇలా ప్రశాంతంగా సభ జరగడం చాలా అవమానకరంగా ఉంది. చర్చకే పరిమితం అయితే మనమెందుకు, చానల్స్‌లో చూపేందుకు మసాలా లేందే ఎలా అంటూ వాపోయాడు. ప్రజాస్వామ్యం గురించి నాకు బాగా తెలుసు అన్ని రోజులు ఇలానే ఉండవు, మంచిరోజులు వస్తాయి అంటూ మిగిలిన వారు అతన్ని ఓదార్చారు. భవిష్యత్తుపై ఆశలు కల్పించారు. కొందరైతే ఇది కలా నిజమా? అని తమను తాము గిల్లి చూసుకున్నారు. తెలిసిన ముఖాలే కావడంతో కల కాదు కలలాంటి నిజం అనుకున్నారు. కల లాంటి నిజాలు ఎక్కువ రోజులు ఉండవని తమను తాను ఓదార్చుకున్నారు.

22, జూన్ 2014, ఆదివారం

అన్న నీళ్ళు...అమ్మ ఉప్పు! రాజకీయ ఆవిష్కరణలు

మన రాజకీయ నాయకులు ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ శాస్తవ్రేత్తలను మించి పోతున్నారు. విద్యుత్ బల్బ్ కనిపెట్టింది ఎవరు? అని ప్రశ్నిస్తే, ఏ మాత్రం తడుముకోకుండా ఎడిసన్ అని ఠక్కున చెప్పేస్తాం. పైగా ఆయన ఆవిష్కరణల కృషిని వ్యక్తిత్వ వికాస పాఠాలుగా చెప్పేస్తారు. 999సార్లు విఫలం అయ్యాక వెయ్యోసారి బల్బ్ కనిపెట్టారని కథలు కథలుగా చెబుతారు. కానీ వీరి కన్నా రాజకీయ ఆవిష్కర్తల కష్టం ఎక్కువగా ఉంటుంది. ఎడిసన్ వెయ్యవ ప్రయోగంతో బల్బ్ కనిపెట్టిన తర్వాత ఎన్నివేల సార్లు బల్బ్ తయారు చేయాలన్నా అదే సూత్రం వర్కవుట్ అవుతుంది. కానీ రాజకీయాల్లో ఒకసారి బ్రహ్మాండమైన ఆవిష్కరణగా నిలిచింది తరువాత ఎందుకూ పనికి రాకపోవచ్చు. ప్రతి ఎన్నికల్లోనూ పోటీ పడి కొత్త కొత్త ఆవిష్కరణలు కనిపెట్టాలి. అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు ప్రభుత్వంపై ఆసక్తి కలిగే విధంగా తరచుగా కొత్త కొత్త ఆవిష్కరణలను ప్రజలకు పరిచయం చేయాలి.


రాజకీయాల్లో నూతన ఆవిష్కరణల్లో తమిళనాడు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఆ రాష్ట్రంలో జరిగిన ఆవిష్కరణల వల్ల అక్కడ అధికారం రావడమే కాదు... చివరకు వారిని కాపీ కొట్టిన వారికి సైతం అధికారం దక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రెండు రూపాయల కిలో బియ్యం అనగానే తెలుగునాట అన్నగారి ఆవిష్కరణ అని అంతా భావిస్తారు. నిజానికి ఇది తమిళనాడు ఆవిష్కరణ. ఇదొక్కటే కాదు చీర ధోవతి వంటి పథకాలకు, రిక్షా కార్మికులకు డ్రెస్సుల వంటివి అపూర్వమైన పథకాలను మొదట ఆవిష్కరించింది తమిళ నేతలే. ఆ మార్గాన్నే  తెలుగునేతలు అనుసరించారు. 

ఈగ సినిమా సక్సెస్ అయిందా? లేదా? అనేది ముఖ్యం కానీ రాజవౌళి ఆ సినిమాను ఏ ఇంగ్లీష్ సినిమా నుంచి కాపీ కొట్టారనేది అనవసరం. రాజకీయాల్లో సైతం అంతే! ఓటర్లపై తీవ్రమైన ప్రభావం చూపించి అధికారంలోకి వచ్చారా? లేదా? అనేదే ఏ కొత్త ఆవిష్కరణ కైనా కొలమానం.
తమిళ అమ్మ ఐదు రూపాయలకు భోజనం, రూపాయికి టిఫిన్ అంటూ వచ్చే ఎన్నికల కోసం కొత్త కొత్త ఆవిష్కరణలను ఓటర్లకు పరిచయం చేస్తున్నారు. ఏ కూర వండినా ఉప్పు ఉండి తీరుతుంది. టిఫన్‌లోనూ అంతే. అయినా అమ్మగారికి ఎందుకో కానీ ఇంటింటికి తన ఉప్పు అంది తీరాల్సిందేనని అనిపించింది. ఉప్పు విశ్వాసానికి ప్రతీక. ఉప్పు తిన్నవారు కృతజ్ఞతతో ఉంటారని గట్టి నమ్మకం. ఐదు రూపాయల భోజనం, రూపాయి టిఫిన్‌లో ఉప్పు ఉంటుంది. కానీ ఎక్కువ మంది ఇంట్లోనే వండుకుంటారు. మరి ఎలా అని తీవ్రంగా ఆలోచించిన అమ్మ బృందం అద్భుతమైన ఆవిష్కరణకు నాంది పలికారు. ఈ ఆలోచన ఇంటికి అమ్మ ఉప్పు ఆవిష్కరణకుదారి తీసింది. ఇంట్లో ఉండి ఎవరి వంట వాడు వండుకున్నా వారి వంటల్లో ఉండాల్సింది అమ్మ ఉప్పు. తిండి తమదైనా ఉప్పు అమ్మది కాబట్టి ఉప్పు తిన్నందుకు విశ్వాసపాత్రంగా ఉంటారని అమ్మ బాగానే ఆలోచించారు. తమిళనాట ఎన్నికలకు ఇంకా బోలెడు సమయం ఉంది. అప్పటి వరకు అమ్మ ఉప్పు తమిళ ఓటర్ల ఒంటికి బాగానే ఒంటబడుతుంది. తమిళ తల్లి అమ్మ ఉప్పు అంటే తెలుగు అల్లుడు అన్న నీళ్లు అంటున్నారు. రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ పథకాన్ని ప్రకటించారు. వాటర్ పథకం ఎలా ఉన్నా రుణమాఫీ అమలు చేయకపోతే ఓటర్లు మాత్రం ప్రభుత్వంతో నీళ్లు తాగించేట్టుగా ఉన్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఐదు రూపాయలకు భోజనం పథకం అమలు చేస్తున్నా, ఎంఐఎం మేయర్ ఈ పథక ఆవిష్కర్త కావడంతో పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. 


తెలుగునాట రెండు రూపాయల కిలో బియ్యం ఆవిష్కరణ తరువాత అంత గొప్ప ఆవిష్కరణ మరేదీ జరగలేదు. ఆ పథకాన్ని అల్లుడు ఐదు రూపాయల చేసినా, వైఎస్ ఒక రూపాయికి చేసినా కిరణ్ కుమార్‌రెడ్డి ఉచితం అన్నా ఈ పథకం ఆవిష్కర్తగా ఎన్టీఆర్ పేరే ఉండిపోయింది. ఈ పథకం మాతృక తమిళనాడే అయినా తెలుగువాడిదే అన్నంతగా ప్రభావం చూపింది. ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలంటారు. అలానే పవర్‌లోనే పవర్ వెతుక్కోవాలనే ఆలోచన వైఎస్‌ఆర్‌కు వచ్చింది. మీకు ఫ్రీ పవర్ ఇస్తాననగానే రైతులు ఆయనకు పవర్ ఇచ్చారు.
చక్కగా ఆడుకోండి అంటూ అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ యువత కోసం ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరిస్తే, ఈయన పాలనలో అత్యాచారాల గురించి ల్యాప్‌టాప్‌లో వివరాలు సేకరిస్తూ ఆక్కడి యువత ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ల్యాప్‌టాప్‌లో చర్చలు సాగిస్తోంది.


మొన్నటికి మొన్న అల్లుడు గారు రుణవిముక్తి అనే అద్భుతమైన యంత్రాన్ని కనిపెట్టాను. అధికారంలోకి రాగానే ఆవిష్కరణను జాతికి అంకితం చేయడమే నా మొదటి పని అన్నారు. జనం నమ్మారు. ఇప్పుడేమో ఈ ఆవిష్కరణ విడుదల చేయవచ్చా? లేదా? చేస్తే ఎలా చేయాలి? చేయకపోతే ఎలా చేయవద్దు అంటూ కమిటీ వేశారు. చిన్నా చితక అవిష్కరణలతో అంతా అధికారం కోసం ప్రయత్నిస్తుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏకంగా తెలంగాణ ఆవిష్కరణతో అధికారంలోకి వచ్చేశారు. టెలిఫోన్ ఆవిష్కరణకు ప్రపంచం విస్తుపోయింది. తరువాత పేజర్ల గురించి వింతగా చెప్పుకున్నారు. ఇప్పుడు సెల్‌ఫోన్... ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు వెలుగు చూడాల్సిందే... అధికారం కట్టబెట్టిన అద్భుతమైన ఆవిష్కరణలు అయినా కొంత కాలానికి వాటి ఆకర్షణ శక్తి కోల్పోతాయి. అందుకే నేతలంతా కొత్త కొత్త ఆవిష్కరణల కోసం తమిళనాడుపై ఓ కన్నేసి  ఉంచుతారు. ఈ రోజు బెంగాల్ ఏం ఆలోచిస్తుందో రేపు దేశం అదే ఆలోచిస్తోందని అనే వారు. అలానే నేడు తమిళనాడు అమలు చేసే పథకాలను రేపు తెలుగునాడు అమలు చేస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి పుంటికూర పచ్చడి, ఇంటింటికి ఆవకాయ వంటి ఆకర్శణీయ పథకాలు రావచ్చు. సినిమా టైటిల్స్‌ను ముందుగానే రిజిస్టర్ చేయించుకున్నట్టు ఈ పథకాల రిజిస్ట్రేషన్ కూడా ఉంటే బాగుండేది. పనిలో పనిగా హోంలోన్, క్రెడిట్ కార్డ్ లోన్ రద్దు పథకాల ఆలోచన ఎవరికీ రావడం లేదెందుకో?

15, జూన్ 2014, ఆదివారం

కొత్త ముఖ్యమంత్రుల సరికొత్త స్టైల్

కార్పొరేట్ కంపెనీలకే కాదు రాజకీయ నాయకులకు సైతం బ్రాండ్ ఇమేజ్ ముఖ్యమని నాయకుల గట్టి నమ్మకం. జాతీయ నాయకులు ఈ రహస్యాన్ని ఎప్పుడో కనిపెట్టాశారు. బ్రాండ్ ఇమేజ్‌ను తొలుత గుర్తించింది మహాత్మాగాంధీనే అనిపిస్తోంది. చేతిలో పొన్నుకర్ర పట్టుకున్న నాయకుడు అనగానే మర్రి చెన్నారెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొన్నుకర్ర చెన్నారెడ్డి అంతగా కలిసిపోయాయి. ఆ పొన్నుకర్రపై ఆ కాలంలో రక రకాల పుకార్లు రాజ్యమేలేవి. ఇప్పుడంటే అవి నవ్వులాటగా అనిపించవచ్చు కానీ అప్పుడు నిజమే అనిపించేది. ఆయన పొన్నుకర్రలోపల చురుకైన కత్తి ఉంటుందని .... ఇంకా ఏవేవో పుకార్లు రాజ్యమేలేవి. జవహర్‌లాల్ నెహ్రూ అనగానే కోటుపై గులాబీ పూవు ధరించిన రూపం గుర్తుకొస్తుంది.


దృశ్యపరంగానే కాకుండా కొన్ని మాటలు కొందరు నాయకులకు మారు పేర్లుగా వినిపిస్తాయి. యువనేత అంటే వైకాపా అధ్యక్షుడు అని వేరుగా చెప్పాల్సిన అవసరమే లేదు. వెన్నుపోటు అనగానే గతంలో నాదెండ్లకు మారు పేరుగా నిలిచేది. మందులకు పేటెంట్ కాలం తీరిపోయినట్టు వెన్నుపోటుకు నాదెండ్ల అనుబంధం 95తో తీరిపోయింది. ఆయనతో అనుబంధం తీరిపోతే మరి ఎవరితో అనుబంధం ఏర్పడింది అని మీరు అడిగితే మీకు రాజకీయ పరిజ్ఞానం లేనట్టే. అలా అడిగితే ఆ బ్రాండ్ పాపులారిటీకి ఇక అర్ధమే లేదు.


ఆసియన్ పెయింట్స్ అనగానే బ్రష్ పట్టుకుని రంగులేసే చిన్న కుర్రాడు కళ్ల ముందు ప్రత్యక్షమవుతాడు. కంపెనీలు ఇలా వినియోగదారుల హృదయాల్లో ముద్రించుకు పోయినట్టుగా రాజకీయ నాయకులు సైతం ఏలాగోలా ఓటర్ల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవాలని తంటాలు పడుతుంటారు. ధైర్యంగా పోలీసు వాడికి గుండెను చూపి కాల్చమన్న దృశ్యం ప్రకాశం పంతులుగా బ్రాండ్ నేమ్‌గా మారిపోయింది. అయితే ఆయన తన ఆత్మకథలో సైతం అలా గుండె చూపింది నేను కాదు ఒక ముస్లిం యువకుడు, నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన నేను మద్రాస్ నగరంలో నడుస్తుంటే పోలీసు తుపాకి చూపి అడ్డుకున్నప్పుడు ఆగ్రహంతో కాలుస్తావా? కాల్చు అంటూ ముందుకు వచ్చింది ముస్లిం యువకుడు ప్రకాశం పంతులు చెప్పినా ప్రజలు మాత్రం ప్రకాశంను అలానే మనస్సుల్లో చిత్రించుకున్నారు.


సంఘ్ సేవకునిగా బ్రహ్మచారి జీవితం గడుపుతూ ఉతుక్కోవడానికి కాస్త కలిసొస్తుందని పొట్టి చేతుల షర్ట్‌ను మోదీ ఎంపిక చేసుకుంటే ఇప్పుడది మోదీ బ్రాండ్‌గా మారిపోయింది. దేశంలోని యువతకు ఇప్పుడు లెటెస్ట్ ఫ్యాషన్ గురు మోదీ. ఆయన డ్రెస్సింగ్‌లే ఫ్యాషన్ పాఠాలు.
లోకో భిన్నరుచి అన్నట్టు ఒక్కో నాయకుని అలవాటు ఒక్కోరకంగా ఉంటుంది. ఎవరి అలవాటు వారిష్టం. తమిళ అమ్మ జయలలిత ఐదేళ్ల ముఖ్యమంత్రి పదవీ కాలంలో రెండు మూడు సార్లు కూడా విలేఖరుల సమావేశంలో మాట్లాడినా గొప్పే. వారి సచివాలయంలోకి మీడియాకు నిరంతర అనుమతి అనేది ఉండదు. పిలిస్తేనే వెళ్లాలి. ఒకరు ఐదేళ్లలో రెండు సార్లు మీడియాతో మాట్లాడే ముఖ్యమంత్రి అయితే అదే సమయంలో రోజుకు ఐదుసార్లు మీడియాతో మాట్లాడే ముఖ్యమంత్రి సైతం ఉన్నారు.


తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెండు వారాల వ్యవహార శైలి చూస్తే ఆయన తన సొంత బ్రాండ్‌ను సృష్టించుకోవడంలో బిజీగా ఉన్నారనిపిస్తోంది. తూటా కన్నా బలంగా పేల్చే మాటలే ఆయన బ్రాండ్ ఇమేజ్ అయితే అది ఉద్యమ కాలంలో.. ఇప్పుడాయన ముఖ్యమంత్రి కావడం వల్ల పాత బ్రాండ్‌ను నిలుపుకుంటూనే పాలకుడిగా కొత్త బ్రాండ్‌ను సృష్టించుకునే పనిలో పడ్డారు. మీడియా వ్యవహారంలో తమిళ అమ్మ బ్రాండ్‌ను కొంత వరకు అనుకరించినా, పాలనలో మాత్రం తన సొంత బ్రాండ్ రూపొందించుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ కుర్చీలో కూర్చుంటే ఆ పక్కన ఉండేది నా కుర్చీనే అని చాలా మందే కలలు కన్నారు. కుర్చీ లేకపోయినా పరవాలేదు కానీ కెసిఆర్‌కు ఎలా పాలించాలో పాఠాలు చెబుదామని కొందరు తలలు నెరిసిన పాత్రికేయులు పాఠ్యపుస్తకాలను సంకలో పెట్టుకుని తిరిగారు. కానీ ఆయన మాత్రం లఘు దర్శనంతోనే సరిపుచ్చుకోండి అంటూ దగ్గరకు రానివ్వడం లేదు. తెలుగు నాట మీడియాను నమ్ముకుని బాగుపడ్డవాడు లేడు, మీడియాను నమ్మక చెడిపోయిన వాడు లేడు అని కెసిఆర్ గట్టిగా నమ్ముతున్నట్టుగా ఉంది. 2004లో మీడియా ఎవరికి అండగా నిలిచిందో వారు గెలవలేదు, 2009లో మీడియా ఎవరినైతే తీవ్రంగా వ్యతిరేకించిందో వారి గెలుపును ఆపలేకపోయింది అనేది కెసిఆర్ వాదన. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు గెలుపు ఓటములపై ప్రభావం చూపాయి తప్ప మీడియా కాదు అనేది ఆయన నమ్మకం. అందుకే మీడియాకు దూరంగా, ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా తన బ్రాండ్ ఇమేజ్ కల్పించుకోవడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. మీడియాను దూరంగా పెడుతూ అదే సమయంలో విధాన నిర్ణయం ఏదైనా అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తరువాతే అంటూ అందరి మాటలకు విలువ ఇచ్చే కొత్త రాజకీయం చూపిస్తానంటున్నారు.

 ప్రమాణస్వీకారం చేసిన వారంలోనే ఏడుసార్లు అధికారికంగా, మరో మూడుసార్లు అనధికారికంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడింది ఒకరైతే, రాష్ట్రంలో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయని నాయకులు ఒకరు. ఎవరి స్టైల్ వారిదే. అంతిమంగా కొత్త బ్రాండ్ ఇమేజ్ ఏలా ఉందో ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పాల్సిందే. మీడియా తీర్పులు చెప్పినా,జనం నాడికి , మీడియా తీర్పుకు సంబంధం ఉండడం లేదు.


గతంలో రాజకీయ నాయకుడు అనగానే ఖద్దరు ధరించి బానపొట్టతో నడవలేక నడవ లేక నడిచే 60 ఏళ్ల సగటు వయస్సు వ్యక్తి అనే ముద్ర బలంగా ఉండేది. ఈ నాయకులు తమ పొట్టను తమ వెంట తీసుకు వెళ్లడానికే తంటాలు పడతారు. రోజులు మారాయి నవతరం నాయకులు కనిపిస్తున్నారు. వీరికి పొట్టలు లేనంత మాత్రాన ఆరగించరు అనుకోవద్దు .. కొందరి శరీర తత్వం అంతే ఎంత తిన్నా కనిపించదు, కొందరు ఎంత తక్కువ తిన్నా పొట్ట పెరుగుతుంది. జీవితంలోనే కాదు రాజకీయాల్లోనూ అంతే..

8, జూన్ 2014, ఆదివారం

ధృతరాష్డ్రుడి సెన్సాఫ్ హ్యూమర్.. దుర్యోధనుడి వందో తమ్ముడు!

‘‘ధృతరాష్డ్రుడిది మంచి సెన్సాఫ్ హ్యూమర్’’
‘‘కొంపతీసి మహాభారతంలో సెన్సాఫ్ హ్యూమర్ అనే అంశంపై పిహెచ్‌డి ఏమైనా చేస్తున్నావా? ’’
‘‘రామాయణంలో మహిళలు, భారతంలో పురుషులు, భాగవతంలో ఋషులు అంటూ పరిశోధనలు చేసినప్పుడు సెన్సాఫ్ హ్యూమర్‌పై చేస్తే తప్పేముంది. కానీ నేనేం ఉద్యోగం చేయడం లేదు కదా? ప్రమోషన్ కోసం పిహెచ్‌డి చేయడానికి’’
‘‘్ధృృతరాష్ట్రుడంటే ప్రేమతో కళ్లు మూసుకుపోయిన తండ్రి గుర్తుకు వస్తాడు కానీ నీకేంటి అలా?’’
‘‘కెసిఆర్ అనగానే తెలంగాణ వారికి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ఉద్యమ కారుడిగా కనిపిస్తారు. ఇతరులకు వేర్పాటు వాదిగా కనిపిస్తారు. బాబు కొందరికి వెన్నుపోటు దారుడిగా గుర్తుకు వస్తే, కొందరికి జాతి రత్నంగా, యుగపురుషుడిగా కనిపిస్తారు. ఈ ఇద్దరు వారు వారే. కానీ వీరిని చూసేవారు తమ తమ కోణాల్లో చూస్తున్నారు. ధృతరాష్ట్రుడిలో గుడ్డితనం ఒకరికి కనిపిస్తే, సెన్సాఫ్ హ్యూమర్ ఒకరికి కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు ఒక్కడే చూసేవారే వేరువేరు’’
‘‘అంతే నంటావా? ’’


‘‘ సరే ధృతరాష్ట్రుడి వందో కొడుకు పేరు తెలుసా? ’’
‘‘తెలిస్తే మీలో ఎవరో కోటీశ్వరుడికి, నాగార్జున కోటి ఇచ్చినట్టు సమాధానం చెబితే ఏమిస్తావు? ’’
‘‘నీకు తెలియదని నాకు తెలుసులే... ఒక్కరు లేక ఇద్దరు చాలు అని నిర్ణయించుకున్న మన తరానికి పిల్లల పేర్లు పెట్టడడానికి ఎంతో తంటాలు పడాల్సి వస్తోంది. అన్ని భాషల్లో పిల్లల పేర్ల పుస్తకాలు నాలుగైదు కొంటే కానీ ఒక్క పేరు చిక్కడం లేదు. ఆ రోజుల్లో వంద మంది సంతానానికి ధృతరాష్ట్రుడు అన్ని పేర్లు ఎలా పెట్టాడో? ’’
‘‘ముందు అతని సెన్సాఫ్ హ్యూమర్ గురించి చెప్పు’’
‘‘ అక్కడికే వస్తున్నా? ధృతరాష్ట్రుడి వందో కొడుకు, దుర్యోధనుడి చివరి తమ్ముడి పేరు కవి. కౌరవులంటే ఎవరు మహాభారతంలో విలనే్ల కదా? వాళ్ల పేర్లు కూడా అలానే ఉంటాయి ధుర్యోధనుడు, దశ్శాసనుడు అంటూ అలా పేర్లు పెడుతూ పోయాక చివరకు ధృతరాష్ట్రుడు వందో వాడిపేరు కవి అని పెట్టుకున్నాడు.’’


‘‘మహాభారతంలో ప్రధానంగా ధుర్యోధనుడి యుద్ధ కాంక్ష, దుశ్శాసనుడి ద్రౌపది వస్త్రాపరణం గురించే ప్రస్తావన ఉంది కానీ మిగిలిన వారి గురించి ఎక్కువగా కనిపించదు. మొదటి వాడు యుద్ధాలతో హింసిస్తే చివరి వాడు కవిత్వంతో హింసించే వాడేమో? లేక వాడు పెద్దయ్యాక కవి అవుతాడని తండ్రి ముందే ఊహించి ఉంటాడు. పెద్దయ్యాక కవులయిన వారున్నారుక కానీ పుట్టగానే కవి అయిన ఘనత ధృతరాష్ట్రుడి కుమారుడికి మాత్రమే దక్కింది. ఆ పేరుతో ధృతరాష్ట్రుడు కవులపై సెటైర్ వేశాడేమోననిపిస్తోంది. అందుకే ధృతరాష్ట్రుడి సెన్సాఫ్ హ్యూమర్ తెగనచ్చేసింది..’’
‘‘అయినా నేటి కవి వేరు ఆ కవి వేరు’’
‘‘కాలం ఏదైనా కావచ్చు కవి కవే. 144 సెక్షన్ విధించినా జనం చెల్లాచెదురు కాకపోవచ్చు కానీ అక్కడికి నలుగురు కవులను పంపించామంటే ఒక్క పురుగు కంటికి కనిపించడు అదీ కవి శక్తి సామర్ధ్యం ’’
‘‘అది సరే నీకు హఠాత్తుగా వందో సంతానం పేరు ఎందుకు గుర్తుకు వచ్చింది’’


‘‘వంద రోజుల్లో మీరేం చేస్తారో ప్రణాళిక రూపొందించుకోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రులను ఆదేశించారు. కేజ్రీవాలేమో మోదీకి 101 రోజుల గడువు ఇస్తున్నామని ఆ రోజు నుంచి ప్రశ్నించడం మొదలు పెడతానని చెబుతున్నారు. యుపిఏ మొదటి సారి అధికారంలోకి రాగానే వంద రోజుల్లో సాధించే లక్ష్యాలతో ఇలానే ఆర్భాటం చేసింది. ధరలు తగ్గించడం, మహిళా రిజర్వేషన్ల బిల్లు వంటివన్నీ వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. వంద సంఖ్యకు భారతీయుల జీవితంలో విడదీయరాని అనుబంధం ఉందేమోననిపిస్తోంది. శతమానం భవతి అంటూ వందేళ్లు జీవించాలని దీవిస్తారు’’
‘‘దీవించడమే కాదు శిక్షించడంలో సైతం వందకు ప్రాముఖ్యత ఉంది. శిశుపాలుడు 99 తప్పులు చేసేంత వరకు క్షమించిన శ్రీకృష్ణుడు వందో తప్పు తరువాతే కదా? శిక్షించింది.. చంద్రబాబు వంద తప్పులపై బిజెపి కూడా శత్రుపక్షంగా ఉన్నప్పుడు చార్జీషీట్ విడుదల చేసింది’’
‘‘ఔను డెల్‌కార్నిగ్ తాత పుట్టక ముందు వ్యక్తిత్వ వికాసం గురించి మన వాళ్లు చెప్పింది శతకాల ద్వారానే కదా? శతకాల ద్వారా వంద మంచి మాటలు కలకాలం గుర్తుండేట్టు చెప్పారు కదా? సుమతీశతకం, భాస్కర శతకం, వేమన శతకాలను మనసు పెట్టి చదవాలి కానీ అందులో కావలసినంత వ్యక్తిత్వ వికాస సాహిత్యం దొరుకుంది. తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి. పాలకుల మనస్తత్వం ఎలా ఉంటుంది. మానవ జీవితానికి ఉపయోగపడే ప్రతి అంశం ఈ శతకాల్లో కనిపిస్తుంది. శంఖంలో పోస్తే కానీ తీర్థం కానట్టు ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్‌లో చెబితే కానీ మనం విలువ ఇవ్వం. ప్రబంధ నాయికలు కూడా వంద మందే.. శత ప్రబంధ నాయికలు అని ముచ్చటగా పిలుచుకున్నాం. అభిసారిక విరహత్కంఠిత వంటి ఇద్దరు ముగ్గురు ప్రబంధ నాయికల పేర్లే పాపులర్ కానీ కులట కూడా ఈ శత ప్రబంధ నాయికల్లో ఒకరు ’’
‘‘వంద లేనిదే సినిమా చరిత్ర లేదు. ఇప్పుడంటే సినిమా వంద రోజులు నడిస్తే గొప్ప కానీ గతంలో వంద రోజులు నడిస్తేనే సినిమాకు గుర్తింపు. తమ అభిమాన హీరోల సినిమా వంద రోజులు నడిపించేందుకు అభిమానులు తామే టికెట్లు కొనే వారు కూడా. చిరంజీవి 150వ సినిమా హిట్టు కావాలని మంచి కథ కోసం ప్రయత్నిస్తుంటే ఆయన రాజకీయ జీవితం మాత్రం అట్టర్ ఫ్లాపైంది.’’
‘‘అధికారంలో ఉన్న పార్టీ మారుతోంది కానీ ప్రజల జీవితాలు మారడం లేదు’’
‘‘ఐతే’’

బహుశా ప్రజలు తాము కోరుకున్న రీతిలో ప్రజాస్వామ్య ఉండేందుకు వందేళ్ల గడువు అవసరం అనిపిస్తోంది. అంటే మన ప్రజాస్వామ్యం వయసు 67 ఏళ్లు ఇంకా 33 ఏళ్లు అనుభవించాలి. నువ్వు ఎలాగైనా అర్ధం చేసుకో... పాలకులపై ఇప్పట్లో పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని చెప్పడమే నా ఉద్దేశం.’’

3, జూన్ 2014, మంగళవారం

షో’మాస్టర్స్!... కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు నారా చంద్రబాబు నాయుడుల రాజకీయ మనస్తత్వం



రాష్ట్రం -రెండు ముక్కలైంది. రెండు రాష్ట్రాలుగా ఊపిరి పోసుకుంది. భారతదేశ పటం మీద ఒకే ప్రాంతీయ భాష తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలుగా రికార్డు మిగుల్చుకుంది. *** ‘విభజన’ ముగిసింది. పట్టింపులు పోయాయి. పంపకాలు పూర్తయ్యాయి. ఎవరి ఉనికి కోసం వారు పరుగు ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో -ఎవరి రాష్ట్రానికి వారు ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. ఒకే రాజకీయ తాను నుంచి వచ్చిన ఇద్దరూ -ఎవరి షో వారు ప్రారంభించబోతున్నారు. ఇద్దరి రంగూ రుచీ పాలనలో తేడాలున్నా -పొలిటికల్ షోను ఎవరు రక్తికట్టిస్తారన్నది వెండితెరపై వేచి చూడాలి. *** రాజకీయ వ్యూహాల్లో ఇద్దరూ ఆరితేరారు. ఒకరు స్వయంకృషితో సిఎం పీఠాన్ని అందుకుంటే, మరొకరు -వారసత్వంగా తొలిసారి, ప్రత్యర్థులు సైతం అబ్బురపడేట్టు ఈసారి సిఎం కుర్చీని అందుకున్నారు. మొదటిది -కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. రెండో వ్యక్తి -నారా చంద్రబాబు నాయుడు. ఇద్దరూ ఇద్దరే. గండరగండులే. కానీ, ఎవరి స్టైల్ వారిది. రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరిదీ చెరగని ముద్ర. ఇద్దరూ ఒకప్పుడు ఒకే పార్టీ సభ్యులు. అత్యంత సన్నిహితులు. కానీ ఇద్దరి మమస్తత్వం భిన్న ధృవాలు. వారి రాజకీయ ఎత్తుగడల్లో ఇంతకాలం ఆ తేడా స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు పాలనలో సైతం ఎవరి స్టైల్ వారిది. అనుకూల ప్రచారం కోసం మీడియా మేనేజ్‌మెంట్‌పై ఆధారపడేవారు ఒకరైతే, ఏదో ఒక సంచలన ప్రకటనతో వ్యతిరేక మీడియాను సైతం తనవైపు దృష్టి సారించేలా చేయడం ఇంకొకరి స్టయిల్. అంతిమంగా ఇద్దరి వ్యూహాలు ఫలించాయి. ఇద్దరూ సిఎంలయ్యారు. ఇద్దరి పాలన ఎలా ఉండబోతుందనేదే -పెద్ద క్వొశ్చన్ మార్క్. 

కురుసభ.. భీముడిగా ఎన్టీఆర్. దుర్యోధనుడిగా ఎస్వీ రంగారావు. ఎన్టీఆర్ ఎన్నో పద్యాలు పాడి ఎస్వీ రంగారావును భయపెట్టాలని చూస్తాడు. ఎన్టీఆర్ పద్యాలన్నీ చిద్విలాసంతో విన్న ఎస్వీఆర్ ‘హే.. బానిసలకు ఇంతటి అహంభావమా?’ అంటూ ఒక్కముక్కలో తేల్చేస్తాడు. రాజకీయాల్లో కేసీఆర్‌దీ అదే స్టయిల్. ప్రత్యర్థులు ఆయనపై ముప్పేట దాడి జరుపుతుంటే ఆయన మాత్రం ఒక్కముక్కలో ‘సన్నాసులు’ అని తేల్చిపారేస్తారు. 

80వ దశకం తరువాత తెదేపా ఆవిర్భావంతో తెలుగునాట నవశకం రాజకీయం ప్రారంభమైంది. ఎన్టీఆర్ తరువాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అనిపించుకున్నది -నలుగురు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. వైఎస్ మరణంతో మిగిలిన ముగ్గురి చుట్టే రాజకీయాలు తిరిగాయి. వీరిలో ఇద్దరు నేతలు రెండు రాష్ట్రాలకూ ముఖ్యమంత్రులయ్యారు. నవశకం రాజకీయ నేతల్లో చంద్రబాబు, చంద్రశేఖర్‌రావు రాష్ట్ర రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేసిన వారు. ఉద్యమం ద్వారా కేసీఆర్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాజకీయాల్లో తమ ముద్ర చూపించారు. ఇద్దరు నేతలూ యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వారే. తెదేపాలో బాబుకన్నా కేసీఆర్ ఏడాది సీనియర్. తెదేపా ఆవిర్భవించిన తరువాత చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి చంద్రబాబు ఓడిపోతే, సిద్ధిపేటలో తెదేపా తరఫున పోటీ చేసి కాంగ్రెస్ నేత మదన్‌మోహన్ చేతిలో కేసీఆర్ ఓడిపోయారు. 83నాటి చారిత్రక సభలో ఇద్దరూ సభ్యులు కాదు. ఎన్టీఆర్ పిలుపు మేరకు కేసీఆర్ తెలుగుదేశంలో చేరితే, ఎన్టీఆర్ అల్లుడి హోదాలో చంద్రబాబు తెదేపాకు వచ్చారు. మెదక్ జిల్లాలో కరణం రామచంద్రరావును ఎన్టీఆర్ ప్రోత్సహించడంతో కేసీఆర్ మొదటి నుంచీ చంద్రబాబు వర్గంగా ఉండిపోయారు. ఇద్దరూ రాజకీయంగా ఓనమాలు దిద్దింది యువజన కాంగ్రెస్‌లోనే అయినా అక్కడ ఇద్దరికీ ఎలాంటి పరిచయం లేదు. ఎందుకంటే అప్పుడు ఇద్దరూ నియోజక వర్గస్థాయి నేతలు కూడా కాదు. ఈమధ్య ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు -కేసీఆర్ నా శిష్యుడే అని చెప్పుకొచ్చారు. కానీ తెదేపాలో మొదటి నుంచీ నాయకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంలో కేసీఆర్‌దే కీలక పాత్ర. జన్మభూమి, శ్రమదానం వంటి కార్యక్రమాల రూపకల్పన, పార్టీ శ్రేణులకు శిక్షణ నిర్వహించడంలో కేసీఆర్‌దే ప్రధాన పాత్ర. అయితే తెదేపా నేతలు మాత్రం ఎన్టీఆర్‌కు వెన్నుపోటులో బాబు ప్రమేయమేమీ లేదు, వ్యూహమంతా కేసీఆర్‌దేనంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు అయ్యేదా? పొయ్యేదా? అనుకున్నారు. ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించడమే కాకుండా తెలంగాణను సాధించుకోవడంతో పాటు తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపడుతున్నారు కేసీఆర్. చంద్రబాబు చరిత్ర ముగిసిపోయింది. 1999లోనే అయనకు చివరి విజయం లభించింది. అంటే ఆయనది 20వ శతాబ్ధం విజయం తప్ప 21వ శతాబ్ధంలో విజయమే లేదు. ముగిసిన చరిత్ర అనుకున్నారు. వరుసగా ఉప ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు. అన్ని సర్వేల్లోనూ జగన్‌దే హవా. అయినా మొక్కవోని ధైర్యంతో ఏఒక్క అవకాశాన్ని వదలకుండా విజయం కోసం కృషి చేసి అనుకున్నది సాధించారు చంద్రబాబు. వైకాపా, తెదేపా కూటమి మధ్య ఓట్ల తేడా కేవలం  2 శాతం మాత్రమే. . ఫలితాలు తేలిన తరువాత ఎన్నికల కమిషన్ ప్రకటించిన లెక్కలివి. ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన వారిదే విజయం. ఎంత శాతం, ఎన్ని ఓట్లు అనే లెక్కలెలా ఉన్నా ఈ ఎన్నికల్లో తెదేపా విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు అనేది మాత్రం వాస్తవం. 

‘బిజెపి వల్లనే ఓడిపోయాం. ఇక జీవితంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు’ ఇది 2004లో చంద్రబాబు చేసిన ప్రకటన. ‘అమాయక మైనారిటీల హత్యకు కారణమైన నరేంద్ర మోదీని హైదరాబాద్‌లో అడుగు పెట్టనిచ్చేది లేదు’ ఇది అధికారంలో ఉన్నప్పుడు బాబు చేసిన ప్రకటన. ‘నరేంద్ర మోదీని వెంటనే అధికారం నుంచి తొలగించాలి’ -మోదీ గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఎంగా చంద్రబాబు బిజెపికి ఇచ్చిన అల్టిమేటం ఇది. కాలచక్రం గిర్రున తిరిగి పదేళ్లు గడిచిన పోయిన తరువాత అదే నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడానికి బాబు చేయని ప్రయత్నం లేదు. ‘మోదీ, మహాత్మాగాంధీ ఇద్దరూ గుజరాత్‌లోనే జన్మించారు’ పొత్తు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో బాబు చెప్పిన మాట ఇది. చంద్రబాబు ప్రయత్నాలు వృధా కాలేదు. పొత్తు కుదిరింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. అయితే మోదీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తారని ఏ పార్టీ కూడా ఊహించలేదు. రావాలని కోరుకోలేదు. చివరకు బిజెపి సైతం మిషన్ 272కు మాత్రమే పరిమితమైంది. గతంలోలాగే తెదేపా మద్దతుపై ఆధారపడి ఎన్డీయే అధికారంలోకి రావాలని, వస్తుందని బాబు అనుకున్నారు. సొంత బలంతో బిజెపి అధికారంలోకి రావడం బాబును కొంత నిరుత్సాహపర్చిన అంశం. తన మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వమైతే తన ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం చంద్రబాబుకు ఉండేది. కానీ ఇప్పుడా అవకాశం లేదు. మోదీ ప్రసన్నమైతే ఆయన ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటే అన్ని ఇస్తారు. ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. అంతే తప్ప ఆయనపై బాబు ఒత్తిడి పని చేయదు. ఒత్తిడి పెట్టాలని బాబు కలలో కూడా అనుకొనే పరిస్థితి లేదు. ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే వైకాపా ఎంపీలు ఇద్దరు తెదేపా వైపు వెళ్లగాలేనిది, మోదీ ఈలవేస్తే ఏ పార్టీనుంచైనా ఎంపీలు బిజెపివైపు పరుగులు తీయడానికి నిరాకరిస్తారా? 

రైతుల రుణ మాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి వంటి ఆకర్షణీయ పథకాలకు భారీ ఎత్తున నిధులు వ్యయం చేయాలి. అసలే లోటు బడ్జెట్‌తో ప్రారంభమయ్యే రాష్ట్రానికి ఇంత భారీ వ్యయాన్ని భరించే పథకాల అమలు అంత సులభం కాదు. ఈ కోరికలన్నింటినీ కేంద్రం తీరుస్తుందనే ఎన్నికల్లో బాబు ప్రచారం చేశారు. బిజెపికి మెజారిటీ రాకపోతే అదే జరిగేది కూడా. కానీ పరిస్థితి ఇప్పుడలా లేదు. ఇప్పుడు మోదీ నుంచి అనుకున్నంత సాయం ఒక రాష్ట్రానికి అందుతుందని ఆశించలేం. ఒక రాష్ట్రానికి పెద్దపీట వేస్తే మిగిలిన రాష్ట్రాల నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పోనీ తన రాజకీయ మనుగడ కోసం విమర్శలనైనా ఎదుర్కోందాం అనుకోవడానికి -మోదీకి అలాంటి అవసరం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పాలన చంద్రబాబుకు అంత సులభమేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లపాటు సాగించిన పాలన వేరు. 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో పాలన వేరు. ఇప్పుడు మనం కొత్త చంద్రబాబును చూడబోతున్నాం. అటు కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. రాజకీయంగా జగన్‌ను ఎదుర్కోవాలి. ఇన్ని సమస్యలున్నా మీడియా అండ చంద్రబాబుకు కొండంత బలం. ఆయన అధికారపక్షంలో ప్రపంచంలోనే మేటి అని ప్రచారం పొందినా, విపక్షంలో ఉన్నప్పుడు డిపాజిట్లు కోల్పోయినా ధైర్యం వీడకుండా ఉండటానికి మీడియా అండ ఎంతో తోడ్పడింది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన విజయానికి అనేక అంశాలు దోహదం చేశాయి. మోదీ వేవ్, పవన్ కల్యాణ్ ప్రచారం వంటి అంశాలతో పాటు మీడియా మద్దతు విజయానికి దోహదం చేసిన జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. నిజాం కాలేజీలో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ. తొలిసారిగా రాష్ట్రంలో అక్కడే మోదీ, పవన్ కల్యాణ్, చంద్రబాబు ఒకే వేదికను పంచుకున్నారు. పక్కపక్కనే ఉన్నా బాబుతో కరచాలనం చేయడానికి కూడా ఇష్టపడలేదు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ నాయకుడైనా స్పందించే తీరు వేరుగా ఉంటుంది. కానీ తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా, పదేళ్లు విపక్ష నేతగా పని చేసిన అనుభవం, కేంద్రంలో ప్రధానిని, రాష్టప్రతిని నిర్ణయించడంలో కీలక భూమిక పోషించిన అనుభవం ఉన్న చంద్రబాబు స్పందించిన తీరు అనూహ్యం. కరచాలనం చేయడానికే ఇష్టపడని పవన్ ఇంటికి బాబు స్వయంగా వెళ్లి ఆయన మద్దతు కోరిన రాజకీయ చతురుడు చంద్రబాబు. ఈ చర్యకు బాబు అభిమానులు విస్తుపోయారు. పవన్ అభిమానులు, ఓ సామాజిక వర్గం మురిసిపోయింది. ఆ మురిపెం ఓట్ల రూపంలో ప్రభావం చూపినట్టు ఫలితాలే తేల్చి చెప్పాయి. రాజకీయాల్లో విజయం సాధించాలి. దాని కోసం ఏమైనా చేయాలనేదే నేటి రాజకీయం. ఈ రాజకీయాల్లో చంద్రబాబు ఆరితేరారు. లేకపోతే పదేళ్ల నుంచి వరుస పరాజయాలు వెంటాడుతున్నా, డిపాజిట్లు కోల్పోతున్నా ధైర్యంగా నిలబడ్డారు. సర్వశక్తులు ఒడ్డారు.  ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తన కన్నా మోదీ, పవన్‌లపైనే ఎక్కువ ఆధారపడ్డారు. ఒకరకంగా తన ముఖానికి ఆ ఇద్దరి మాస్క్‌లు ధరించి ప్రచారం చేశారు. ప్రచారం ఎవరు చేస్తేనేం విజయం సాధించింది, అధికారంలోకి వచ్చింది చంద్రబాబు. ఎన్నికల్లో విజయానికి తెరవెనుక వ్యూహాల్లో తనకు సాటిలేరని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. 

విపక్ష నేతగా ఉన్నప్పుడే కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పాలన సాగించడంలో సైతం ఆయనకు మీడియా మద్దతు కొండంత అండ. రాజకీయాలంటే ఎన్నికల్లో గెలవడం ఒక్కటే అనుకుంటే చేసేదేం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేర్చడానికి చంద్రబాబు కృషి చేస్తారని, కొత్త రాజకీయాలకు శ్రీకారం చుడతారని ఆశిద్దాం. *** తెలంగాణ కొన్ని కోట్ల మంది కల. తెలంగాణ రావాలని కోట్లమంది కోరుకున్నారు. కానీ రానేరాదని అదే తెలంగాణకు చెందిన కోట్లమంది నమ్మారు. చివరకు కేసీఆర్ చదువుకునే రోజులనాటి మిత్రులు కూడా అట్లెట్లోస్తది తెలంగాణ అనేవారట! కానీ మొదటి రోజు నుంచీ ఒక్క కేసీఆర్ మాత్రమే ‘అట్లెట్లరాదు తెలంగాణ’ అని నిర్ణయించుకున్నారు. ఏ అంశంపైనైనా లోతుగా అధ్యయనం చేయడం ఆయనకు అలవాటు. నిజానికి కేసీఆర్, బాబు మంత్రివర్గంలో ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఆలోచించలేదు. 

1995 నుంచీ తెలంగాణ ఉద్యమం సాగుతోంది. అయితే అది కొద్దిమంది మేధావులకు మాత్రమే పరిమితమైన ఉద్యమంగా మొక్క తొడగడం మొదలు పెట్టిన రోజులవి. అప్పుడు బాబు మంత్రివర్గంలో కేసీఆర్ మంత్రి. రెండు మూడేళ్లు గడిచిన తరువాత క్రమంగా తెలంగాణ ఉద్యమం సామాన్యులకు చేరువవుతుండటాన్ని గమనించారు. అదే సమయంలో రాజకీయ మార్పులను నిశితంగా గమనించారు. అందరి సహకారంతో ఎన్టీఆర్‌ను గద్దెదించినా అంతా తానేనని, తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అనుకునే దశకు బాబు చేరుకున్నారు. ఒకవైపు విద్యుత్ ఉద్యమం మొదలైంది. కొంతమంది తెలంగాణ ఉద్యమానికి రాజకీయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే అంశంపై అధ్యయనం మొదలు పెట్టారు. కేసీఆర్‌కు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అదే సమయంలో అధ్యయనాల్లో తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు. ఈ ఆకాంక్ష బలంగా ఉన్నా, దానికి నాయకత్వం వహించే బలమైన నాయకుడు లేడని గ్రహించారు. ఆ పాత్రను తాను పోషించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. విజయవంతంగా ఆ పాత్ర పోషించారు. విజయం సాధించారు. రాజకీయాల్లో కొంతమంది సేఫ్ గేమ్ ఆడతారు. కానీ కేసీఆర్ మాత్రం అనేకసార్లు తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి రిస్క్‌గేమ్ ఆడారు. ఆ గేమ్‌లో ఆయన ప్రతిసారీ విజయం సాధిస్తూనే ఉన్నారు. తనవల్లే కరీంనగర్ నుంచి కేసీఆర్ ఎంపీగా ఎన్నికయ్యారని వైఎస్సార్ అంటే సరే తేల్చుకుందాం రా అంటూ రాజీనామా చేసి నాలుగింతల మెజారిటీతో విజయం సాధించి చూపించారు. వైఎస్సార్‌కు మద్దతుగా ఎంఐఎం, కుల సంఘాలు, ఎంఆర్‌పిఎస్ అంతా కలిసి ప్రచారం చేసినా కేసీఆర్‌నే విజయం వరించింది. సురక్షితమైన మెదక్ పార్లమెంటు సీటు విజయశాంతికి ఇచ్చి పార్టీ ప్రభావం ఏమాత్రం లేదని చెప్పుకునే పాలమూరుకు తాను వెళ్లారు. సార్ చాలా రిస్క్ తీసుకుంటున్నారు, ఓడిపోతే తెలంగాణ ఉద్యమం ముగిసినట్టేనని ప్రతిసారి పార్టీ శ్రేణులు హెచ్చరించినా రిస్క్‌లోనే మజా ఉందని చూపించారు. తెలంగాణ ప్రజల మనస్థత్వం ఏమిటో నాకు తెలుసు. వారిపై నమ్మకంతోనే రిస్క్ తీసుకుంటున్నాను అని చెప్పేవారు. చంద్రబాబు మీడియాలో అనుకూల ప్రచారం మాత్రమే కోరుకుంటారు. తనకు వ్యతిరేకంగా వార్తలు వస్తే సహించలేరు. వాస్తవ పరిస్థితి ఎలా ఉన్నా మీడియాలో వార్తలు మాత్రం వ్యతిరేకంగా రావద్దని బాబు కోరకుంటారు. మీరు తప్పు చేశారా? లేదా? అని కాదు, మీడియాల్లో అలా వార్తలు రాకుండా చూసుకోండి అంటూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబు పార్టీ నేతలకు చెప్పిన మాట. ఈ విషయంలో కేసీఆర్‌ది పూర్తిగా భిన్నమైన మనస్థత్వం. తనకు వ్యతిరేకంగా వార్త లు వస్తే ఆయన ఎంజాయ్ చేస్తారు. విమర్శలు రావాలని కోరుకుంటారు. ఒక్కమాటతో రాష్ట్రం మొత్తం తనపై ధ్వజమెత్తే విధంగా పవర్‌పుల్ పంచ్ డైలాగులతో ఎదుటివారు గిజగిజలాడేట్టు చేస్తారు. ఏ విషయంపైనైనా లోతుగా అధ్యయనం చేసిన తరువాతనే దాని గురించి సాధికారికంగా మాట్లాడతారు. 

పుష్కరాలు అనగానే రాష్ట్రంలో ఏ ప్రాంతం వారికైనా గుర్తుకొచ్చేది రాజమండ్రి. ఏ ప్రభుత్వం ఉన్నా పుష్కరాలకు రాజమండ్రికే నిధులు కేటాయించేది. తెలంగాణలో పుష్కరాలకు నిధులు కేటాయించరా? అంటూ కేసీఆర్ ప్రకటన చేయగానే తెలంగాణ సైతం విస్తుపోయింది. ఓసారి మీడియా సమావేశంలో ఓ విలేఖరి పుష్కరాలు అంటే రాజమండ్రినే కదా? అని అనగానే ఆ ప్రశ్న విని ఆయన సంతోషపడిపోయారు. అసలు పుష్కరాలు అంటే ఏమిటీ అని సుదీర్ఘంగా వివరించారు. 12 ఏళ్లకోసారి పుష్కర దేవుళ్లు నదీ ప్రవాహ ప్రాంతంలో పుష్కర స్నానాలు అచరిస్తారు. అప్పటి నుంచి తెలంగాణలో గోదావరి ప్రవహించే ప్రాంతాల్లోనూ పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు మొదలెట్టింది. పుష్కరాల గురించి మాట్లాడాలన్నా, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నా ఏ అంశంపైనా ఆ రంగంలో నిష్ణాతులైన వారితో మంతనాలు జరిపి, తన సందేహాలను తీర్చుకున్న తరువాతనే ఆ అంశం గురించి మాట్లాడడం కేసీఆర్‌కు మొదటి నుంచి అలవాటు. ఒక అంశం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి చిన్న వాడా? పెద్ద వాడా? అనే తేడా ఆయనకు ఉండదు. విషయం తెలిసిన వ్యక్తి అని తెలిస్తే చాలు గౌరవిస్తారు, ఆ అంశం గురించి అభిప్రాయం అడిగి తెలుసుకుంటారు. సామాజిక వర్గాల వారిగా, ప్రాంతాల వారిగా ఎవరిని ఎవరు తిట్టాలి అనే జాబితాను చంద్రబాబు రూపొందించుకుంటారు. బాబు నేరుగా తిట్టరు, కానీ కులాల వారిగా తిట్టేవారిని ఎంపిక చేసుకుంటారు. ఈ విషయంలో కెసిఆర్ ఎవరిపైనా ఆధారపడరు. ఎదుటి వారు రోజుల తరబడి గంటల తరబడి తిడితే ఒక్కమాటలో సమాధాన తిట్టు ఉంటుంది. ఇక విలేఖరుల సమావేశాల్లో విలేఖరి అడిగిన దానికి బాబు చెప్పిన దానికి సంబంధం ఉండదు. సుదీర్ఘంగా మాట్లాడి విసిగించడం బాబు అలవాటు. కెసిఆర్‌కు విలేఖరులతో ఆడుకోవడం సరదా. ఓసారి ఒక విలేఖరి ఒక ప్రశ్న వేస్తే, ఈ ప్రశ్నకు సమాధానం నీకు కావాలా? మీ యాజమాన్యానికి కావాలా? అంటూ ఎదురు ప్రశ్నించే సరికి నీళ్లు నమలడం ఆ విలేఖరి వంతయింది. నమ్మి అందలమెక్కించిన అనుచురులు తిట్టి బయటకు వెళ్లిపోయినా కేసీఆర్ పెద్దగా పట్టించుకోరు. వారి గురించి విమర్శలు కూడా చేయరు. 

చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే జన్మభూమి, ప్రజల వద్దకు పాలన వంటి కార్యక్రమాల్లో ప్రారంభంలో మీడియాతో కలిసి భోజనం చేసేవారు. ఇది కూడా మీడియాలో బాగా హైలెట్ అయ్యేది. నిజానికి ఈ వనభోజనం మీడియా ప్రచారం కోసమే తప్ప నిజంగా అది బాబు నైజం కాదు. బాబు వద్ద అన్నీ దాపరికమే. కేసీఆర్ వద్ద ఏదైనా బహిరంగమే. మరే నాయకుడూ ఎదుర్కోలేనన్ని విమర్శలు కేసీఆర్ ఎదుర్కొన్నారు. ఆక్రోశంతో ప్రత్యర్థి తిడుతుంటే, ఆ తిట్లను సైతం ఎంజాయ్ చేశారు కానీ కృంగిపోలేదు. ఇటుక ఇటుక పేర్చి ఉద్యమదుర్గాన్ని నిర్మించారు. దానికి తెరాస అని రాజకీయరూపం కల్పించారు. వ్యూహాత్మకమైన ఎత్తుగడలతో స్వయం కృషితో తెరాసను విజయశిఖరంపై నిలబెట్టారు. కెసిఆర్‌కు ముఖ్యమంత్రి పదవి వారసత్వంగా వచ్చింది కాదు. కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షల రూపం. కేసీఆర్ చెప్పినట్టు మనమెవ్వరం వెయ్యేళ్లు బతికేందుకు రాలేదు. బతికేది కొద్ది కాలమే. తరతరాలు గుర్తుంచుకునే విధంగా ప్రజలకు మేలు చేయాలి. ప్రచారం కోసం కాకుండా సహజంగా జనంలో కలిసిపోవడం కేసీఆర్ నైజం. కలెక్టర్ అనగానే అర్భాటాలు అవసరమా? ఇంకా బ్రిటీష్ పాలనలోనే ఉన్నట్టు మనకీ ఆర్భాటాలు అవసరం లేదు అని ఇటీవల కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం అంటే సామాన్యుడి ప్రభుత్వమని చూపించాలి. 
 గతం లో కాంగ్రెస్ నుంచి తెలంగాణ వారుఆంద్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. స్వరాష్ట్రంలో ఇప్పుడు ఇంటి పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా, ఇదీ మా పాలన అని నిరూపించే విధంగా, తెలంగాణ నేతల రాజకీయ శక్తి సామర్థ్యాలను చూపించే విధంగా కేసీఆర్ పాలన ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. వారి ఆశలను కేసీఆర్ నెరవేరుస్తారో లేదో చూడాలి. *

** 
పాలనలోనైనా పార్టీలోనైనా చంద్రబాబుది వన్‌మేన్ షో. కేసీఆర్‌ది వండర్‌మేన్ షో. ఎవరి స్టయిల్ వారికుంది. సో.. ఒక్కటిగా ఉన్న రాష్ట్రం ఎలాగూ రెండైంది. రెండుగా ఉన్న నేతలు మాత్రం -పాలన, అభివృద్ధి విషయంలో ఒక్కటవ్వాలని, ఒకరికి మించి ఒకరవ్వాలని ఆశిద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, ప్రజలకు మేలు చేసే విషయంలో ఇద్దరు నేతలూ పోటీ పడాలని కోరుకుందాం. ఆరోగ్యకరమైన పోటీ రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు చేయాలని ఆశిద్దాం. *

1, జూన్ 2014, ఆదివారం

వాళ్లు ఇప్పుడేం చేస్తున్నారు?

సెలబ్రిటీల జీవితం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఒకప్పటి భారతీయ వెండి తెర కలల రాకుమారుడు రాజేష్ ఖన్నా హఠాత్తుగా తెర వెనక్కి వెళ్లారు. వృద్ధాప్యం, అనారోగ్యం పీడిస్తున్న కాలంలో ఆయన ఫోటోను హఠాత్తుగా పత్రికల్లో చూసిన వాళ్లు ఒక్కసారిగా వైరాగ్యంలోకి వెళ్లారు. రాజేశ్ ఖన్నా వెలుగులను చూసిన తరం ఆయన చీకటిని చూసే సరికి తమ జీవితం కూడా అంతే కదా అనే ఆలోచన పడ్డారు. కాంతారావు కత్తి ఝుళిపిస్తూ గుర్రంపై స్వారీ చేస్తూ కృష్ణకుమారి మనసు దోచుకోవడం చూసిన కుర్ర కారు తమ లేవల్‌లో సైతం అదే విధంగా ఎవరో ఒక కుమారి కోసం ప్రయత్నించే వారు. ఆ కాలం గడిచిపోయాక ఒక్కసారిగా కాంతారావు వృద్ధాప్యంలో కనిపిస్తే తామూ వృద్ధులమయ్యామనే విషయం గుర్తుకు వచ్చి ఎంత కాదన్నా మనసు కలవరపడుతుంది. ఆకాశంలో చుక్కలు హఠాత్తుగా మాయమైనట్టు సినిమాల్లో వెలిగిన తారలు హఠాత్తుగా మాయం అవుతుంటారు. ఇలాంటి వారిపై సహజంగా ఉండే ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని వాళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటూ పాత తరం నటీనటుల గురించి అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. 

ఎంతో మందికి నిద్ర లేకుండా చేసిన జయమాలిని ఇప్పుడు చెన్నైలో ప్రశాంతంగా విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నారు. జ్యోతిలక్ష్మి కూడా అంతే. మళయాల మహానటులకు ము చ్చెమటలు పోయించిన షకీలా తెర వెనక్కి వెళ్లారు. ఏం చేస్తున్నారు? అంటే అన్ని రకాల అనుభవాలతో ఆత్మకథ రాస్తున్నాను అని ఆమె ప్రకటించగానే చాలా మందికి నిద్ర కరువైందట!
పాండవులు పాండవులు తుమ్మెదా అంటూ అభిమానుల హృదయాల్లో దూసుకెళ్లిన జానకి, ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, కాంతారావులను మురిపించిన అందాల రాణి కృష్ణకుమారి బెంగళూరులోని ఫాం హౌస్‌లో విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నారని, అలనాటి అందాల తార కాంచన ఒక ఆలయంలో సేవ చేస్తూ శేష జీవితం దైవారాధనలో గడుపుతున్నారంటే ఆసక్తిగానే ఉంటుంది. ఏయిర్ హోస్టేస్ నుంచి సినీ తారగా అటు నుంచి ఆలయంలో సేవకురాలిగా అంటే చదివేందుకు మనసు భారంగానే ఉంటుంది. 


సినిమా తారలు అంటే అభిమానుల దృష్టిలో దేవుళ్లే. దేవుళ్లు నిత్య యవ్వనులు. దేవుని అస్థిత్వాన్ని మనిషి గుర్తించినప్పుడు దేవుళ్ల వయసు ఎంతో ఇప్పుడూ అంతే. దేవుళ్లు నిత్యయవ్వనులుగా ఉన్నప్పుడు తాము అభిమానించే తారా దేవుళ్లు కూడా అలానే ఉండాలని అభిమానులు కోరుకోవడం సహజమే. అందుకే రాజేశ్ ఖన్నా ముఖం ముడతలు పడినా, జేమ్స్‌బాండ్ 116 అంటూ విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సూపర్ స్టార్ కృష్ణ వయసు భారంతో కనిపించినా అభిమానులు తట్టుకోలేరు. మిస్సమ్మలో కస్సుబుస్సు మంటూ వయ్యారి నడకతో కనిపించిన అందాల బొమ్మ జమున ఇప్పుడు నడిచేందుకే ఒకరి సహాయం తీసుకోవడం అభిమానులు అస్సలు తట్టుకోలేరు.


వాళ్లిప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? అంటూ చాలా మంది తారల గురించి అప్పుడో ఇప్పుడో ఎక్కడో ఒక పత్రికలో కనిపిస్తూనే ఉంటుంది.
తారల కన్నా ఒక్కో సమయంలో ఎక్కువ వెలుగురు విరజిమ్మిన చాలా మంది నాయకులు కనిపించకుండా పోయినప్పుడు పాపం వారేరీ అంటూ ఎవరూ పట్టించుకోరు. అధికారాంతమున చూడాలి అని వూరికే అనలేదు మరి..


రాష్ట్రం ఎంత క్లిష్టపరిస్థితిలో ఉన్నా, ఉన్నతాధికారులు బయట వేచి ఉన్నా తన గదిలో క్రికెట్ క్రీడను వీక్షించే లాస్ట్‌బాల్ హీరో కిరణ్ కుమార్‌రెడ్డి పేరు నిన్నమొన్నటి వరకు మీడియాలో మారు మ్రోగేది. కాంగ్రెస్‌లో ఉంటూ సోనియాగాంధీనే ఎదిరించిన నేతగా, చక్రం అడ్డువేసి విభజనను అడ్డుకునే మహావీరునిగా ఆయన పేరు మారుమ్రోగింది. మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్‌లో సభ్యత్వం ఉన్న ప్రతి తార టిడిపి వైపు చూసినా చలించని హేమ లాంటి నటికూడా కిరణ్ కుమార్‌రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్రలో చేరి మండపేట నుంచి పోటీ చేశారు. అలాంటి నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? అనే ఆసక్తి జనంలో ఉండడం సహజమే. ఏం చేస్తున్నారు అంటే క్రికెట్ చూస్తున్నారు అంటూ ఠక్కున చెప్పవచ్చు కానీ క్రికెట్ 24 గంటలు ఉండదు కదా మిగిలిన సమయంలో ఏం చేస్తున్నారు? ఆయన ఏం చేస్తున్నారు? ఆయన పార్టీ ఏమైంది? సమైక్యాంధ్ర పరిస్థితి ఏమిటి? అన్నీ సందేహాలే. ఇంతకూ జనం సమైక్యాంధ్రను తిరస్కరించారా? కిరణ్ కుమార్‌రెడ్డి నాయకత్వాన్ని తిరస్కరించారా? ఆయన విషయంలో అన్నీ సందేహాలే.


సాధారణంగా ఎన్నికల ఫలితాలు  చాలా మంది నాయకుల విషయంలో ఇప్పుడు వాళ్లేం చేస్తున్నారు? అనే ప్రశ్న ఉదయించేట్టు  చేస్తాయి . చంద్రబాబు రెండుసార్లు ఓడిపోయినా  మీడియా ప్రచారం పుణ్యమా అ ని ఆయనే సీఎం అనిపించేది. 83లో ఓడిపోగానే టిడిపిలో చేరడం ఆయన తీసుకున్న తెలివైన నిర్ణయం లేకపోతే ఎన్టీఆర్ అల్లుడు ఇప్పుడేం చేస్తున్నాడు? అనే ప్రశ్న  వినిపించేది.
 మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు విషయంలో మాత్రం  ఈ ప్రశ్న వేసుకోవలసిందే. ఆయనిప్పుడు ఏం చేస్తున్నారో? నంబర్ టూ పదవి కోసం బాబుతో పోటీ పడి 95లో తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఇప్పుడాయన ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించుకునే స్థితికి వచ్చారు. టిడిపిలో ఆయన బాబు కన్నా సీనియర్... బిజెపితో స్నేహం విషయంలో కూడా ఆయన బాబు కన్నా సీనియర్ కానీ ఏం లాభం సరైన సమయంలో తప్పుడు నిర్ణయంతో దెబ్బతిన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పుస్తకాల రచనలో మునిగిపోయారు. బహుశా ఇప్పుడు రచయితగా కొత్త అవతారంలో కనిపించవచ్చు. 

బాబు అధికారంలో ఉన్నప్పుడు వైస్రాయ్ ప్రభాకర్‌రెడ్డి ఆయనకు కుడిభుజంగా కనిపించేవారు. ఆయనిప్పుడు రాజకీయాలకు దూరంగా హోటల్ వ్యాపారం విస్తరణలో బిజీగా ఉన్నారు. ఒక్కటి మాత్రం నిజం. ఏదీ శాశ్వతం కాదు. మాకు ఎదురు లేదు విర్రవీగితే ఇప్పుడేం చేస్తున్నారు? అని గుర్తు పెట్టుకునే వారు కూడా ఉండరు. ఈ సత్యాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.