18, ఏప్రిల్ 2024, గురువారం

ఎన్నికల్లో పండని అలిపిరి సానుభూతి పంట జర్నలిస్ట్ జ్ఞాపకాలు -109

ఎన్నికల్లో పండని అలిపిరి సానుభూతి పంట జర్నలిస్ట్ జ్ఞాపకాలు -109 ------------------------------------------------------- అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం నక్సలైట్లకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు మంత్రి గా ఉన్న మణికుమారి భర్తను నక్సలైట్లు హత్య చేశారు . భర్త ను నక్సల్స్ హత్య చేసినప్పుడు ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమె సానుభూతి పవనాల ప్రభావం తో ఘన విజయం సాధించి ఉండాలి . గెలుపు మాట దేవుడెరుగు రెండవ స్థానం కూడా రాలేదు . నాలుగవ స్థానంలో నిలిచారు . ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై రాయితో దాడి జరగగానే అది సానుభూతి కోసం ఆడిన డ్రామా అని టీడీపీ వర్గం , ఇది బాబు జరిపిన కుట్ర అంటూ వై యస్ ఆర్ వర్గం పరస్పరం మాటల దాడులు జరుపుకుంటున్నారు . రాజకీయ సానుభూతి ఆరోపణల తో ఉమ్మడి రాష్ట్రంలో అతి పెద్ద సానుభూతి రాజకీయ ఎత్తుగడలు గుర్తుకు వచ్చాయి . 1999 ఎన్నికల్లో వాజ్ పాయి ఒక్క ఓటు తో ఓడిపోవడం ఆ సానుభూతి , గురిచూసి కొట్టినట్టు బాబు అదే సమయంలో బీజేపీతో జతకట్టి స్వల్ప తేడాతో తిరిగి అధికారంలోకి వచ్చారు . వరుసగా నాలుగేళ్ళ కరువు , తెలంగాణ ఉద్యమం , విద్యుత్ ఉద్యమం తో ఈ సారి బాబు ఓటమి ఖాయం అనే అభిప్రాయం బలంగా ఏర్పడింది . ఆ సమయంలో తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు వెళుతుండగా నక్సల్స్ బాబు కారు ను బాంబులతో పేల్చేశారు . బాబుతో పాటు , గోపాల కృష్ణారెడ్డికి తీవ్ర గాయాలు , బట్టలు రక్తసిక్తం అయ్యాయి . బాబు ఇంటికి వచ్చాక రాజకీయం మొదలైంది . సానుభూతి పవనాలతో విజయం సాధించడం ఖాయం అనే ఆలోచనతో ముందస్తు ఎన్నికలకు సిద్ధం అయ్యారు . మొదట జ్యోతిలో ముందస్తు ఎన్నికలకు అని రాయించారు . అలిపిరి సంఘటన తరువాత బాబు మీడియాతో మాట్లాడలేదు . ఈ వార్త వచ్చిన రెండు రోజులకు ముఖ్యమంత్రి చీఫ్ పిఆర్ ఓ విజయ కుమార్ నుంచి ఫోన్ ... బాబు మీడియాతో మాట్లాడుతారు , ఐతే మీరెవ్వరు ఏమీ అడగవద్దు .. బాబు చెప్పింది విని వెళ్ళాలి ఆ షరతుకు ఒప్పుకుంటే రావాలి అని పిలుపు .. సరే అని మీడియా వెళితే చేతికి కట్టుకట్టుకొని ఉన్న బాబు గంటకు పైగా ఉపన్యాసం . ఐదేళ్ల కాలం లో తాను ఎలా అభివృద్ధి చేసింది , తిరిగి తానే ఎందుకు సీఎం కావాలో చెప్పుకుపోయారు . అచ్చం ఎన్నికల ప్రచారంలో ఉపన్యాసం లానే సాగింది . ఏమీ అడగవద్దు అనే షరతు వల్ల ఎవరూ ఏమీ అడగకుండానే బయటకు వచ్చారు . బాబు మనోగతం అంటూ ఏమన్నా రాయించదలుచుకుంటే జ్యోతి లేదా ఈనాడు , ఒక్కోసారి రెండింటికి చెబుతారు . ముందస్తు అని జ్యోతిలో రావడంతో ఈనాడు మిత్రుడికి అది నమ్మబుద్ది కాలేదు . బాబు ఉపన్యాసం వింటే ఎన్నికల ఉపన్యాసంలానే ఉంది . సానుభూతిపై ఆశలు పెట్టుకొని ముందస్తుకు వెళతారు అనే అనిపిస్తోంది అని బయటకు వచ్చాక జరిగిన చర్చలో నా అభిప్రాయం చెప్పాను . అప్పటి నుంచి బాబు ఇంటి వద్ద సానుభూతి రాజకీయాలు ఉదృతం అయ్యాయి . తొలుత మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తమ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులను బాబు నివాసానికి తీసుకువచ్చి బాబు అంకుల్ మీరు త్వరగా కోలుకోవాలి అని గులాబీ పూలు ఇవ్వడం .. మీడియాలో దీనికి మంచి కవరేజ్ వచ్చింది . స్కూల్ పిల్లల తరువాత అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా పరామర్శ యాత్రలు నిర్వహించారు . అంటే ఏ అసెంబ్లీ నియోజక వర్గం క్యాడర్ , నాయకులు ఏ రోజు రావాలో ముందుగానే సమాచారం ఇస్తే ఆ రోజు వచ్చే వాళ్ళు . చెప్పకుండానే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు . సానుభూతి పై టీడీపీ చాలా ఆశలు పెట్టుకొంది . ఐతే బయట ప్రజల్లో మాత్రం ఈ ప్రభావం ఏమీ లేదు . కృత్రిమ వర్షాలు కురిపించినట్టు , కృత్రిమ సానుభూతి పవనాలు కురిపించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శలు చేసింది . ముందు బాబు కుడి చేతికి కట్టు ఉండేది , తరువాత దాన్ని ఎడమ చేతికి మార్చుకున్నారు అని కే . రోశయ్య చేసిన విమర్శ దుమారం లేపింది . బాబు కారు కింద నక్సల్స్ బాంబులు పేల్చింది , గాయాలు తగిలింది అంతా నిజమే . కానీ అప్పుడు బాబు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్ల బాంబు దాడి అంతా డ్రామా నెమో అని భావించిన వారు , ప్రచారం చేసిన వారు కూడా ఉన్నారు . ఎన్నికల ఫలితాల వరకు అవసరం లేదు .. దడి జరిగినప్పుడే సానుభూతి పని చేయడం లేదు అని తెలిపే సంఘటన ఒకటి ... శంకర్ రెడ్డి అని తిరుపతిలో టీడీపీ నాయకులు ( అప్పటి మున్సిపల్ ఛైర్మెన్ ), చదువుకునే రోజుల నుంచి బాబు మిత్రుడు . అతనే ఓ సారి టీడీపీ కార్యాలయంలో చెప్పిన విషయం. బాంబు దాడిలో బాబు దుస్తులు రక్తంతో తడిచిపోయాయి . దాడి తరువాత తిరుపతిలో షాప్స్ మొత్తం బంద్ చేస్తారని షట్టర్ తెరిచి బట్టలు తేగలడు అని శంకర్ రెడ్డిని పంపితే , షాప్స్ అన్నీ తెరిచే ఉన్నాయట . ఒక్క షాప్ కూడా మూయలేదు . సానుభూతి పై బోలెడు ఆశలు పెట్టుకున్నా ఆ ఎన్నికల్లో సానుభూతి పని చేయలేదు . టీడీపీ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా కేవలం 47 సీట్లు మాత్రమే వచ్చాయి . మంత్రి మణికుమారి భర్తను నక్సల్స్ హత్య చేస్తే ఆ ఎన్నికల్లో ఆమెకు డిపాజిట్ కూడా రాలేదు . **** కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సభలో శాంతిభద్రతల గురించి సీరియస్ చర్చ . తెరాస నుంచి గెలిచి, కాంగ్రెస్ లో చేరిన మందాడి సత్యనారాయణ తో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడించారు . శాంతి భద్రతల వైఫల్యం అంటూ బాబు ఆవేశంగా మాట్లాడితే .. ముడ్డి కింద బాంబు పిలిస్తే దిక్కులేదు .. శాంతిభద్రతల గురించి మీరా మాట్లాడేది అంటూ మందాడి దాడి చేశారు . *** అలిపిరి బాంబు దాడి , కోడి కత్తి , తాజాగా జగన్ పై రాయితో దాడి అన్నీ నిజమే .ఏ పార్టీ నాయకులైన రాజకీయాల్లో ఉండేవాళ్ళు మహా ముదుర్లు . యూ ట్యూబర్ల అంత చిల్లర ఆలోచనల్లో ఉండరు . తమ మీద తామే దాడి జరుపుకొని , సానుభూతి వస్తుంది అనుకునేంత అమాయకులు కాదు . . ఓటర్లు అనేక కోణాల్లో అలోచించి ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయించుకుంటారు . సహజంగా రెండు పక్షాలు ఈ అంశంపై తమ తమ రాజకీయ కోణం నుంచి మాట్లాడుతుంటారు . ఐతే అలిపిరి దాడి సమయంలో వై యస్ రాజశేఖర్ రెడ్డి తెలివిగా వ్యవహరించారు . బాంబు దాడి జరిగిన సమయంలో ఆంధ్రాలోనే ఉన్న రాజశేఖర్ రెడ్డి వెంటనే రోడ్డు మీద బైటయింది ధర్నా చేశారు . దాడిని ఖండిస్తున్నట్టు , దోషులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు . టీడీపీ వాళ్ళు తేరుకోక ముందే కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్నా చేయడం ప్రత్యేకంగా నిలిచింది. - బుద్దా మురళి .

21, ఫిబ్రవరి 2024, బుధవారం

అయోధ్య , కాశ్మీర్ , తెలంగాణ కన్నాకష్టం జర్నలిస్ట్ ల" ఇంటి "సమస్య ... ఓ జర్నలిస్ట్ ఇంటి స్థలం కథ @ 1987 జర్నలిస్ట్  జ్ఞాపకాలు 108

అయోధ్య , కాశ్మీర్ , తెలంగాణ కన్నాకష్టం జర్నలిస్ట్ ల" ఇంటి "సమస్య   ఓ జర్నలిస్ట్ ఇంటి స్థలం కథ @ 1987 జర్నలిస్ట్  జ్ఞాపకాలు 108 ---------------------------------------కొన్ని దశాబ్దాల క్రితం జర్నలిస్ట్ ల మధ్య చర్చలో  అయోధ్య - బాబ్రీ మసీదు , కాశ్మీర్ , తెలంగాణ ఈ మూడు ఎప్పటికీ పరిష్కారం లేని సమస్యలు అనే అభిప్రాయం  వినిపించేది .   అసలు పరిష్కారమే లేదు  అనుకొన్న ఈ మూడు సమస్యలకు కూడా మన కళ్ళ ముందే పరిష్కారం లభించింది . కానీ  మహానగరంలో జర్నలిస్ట్ ల ఇంటి స్థలం సమస్య మాత్రం ఈ మూడు సమస్యలకన్నా జటిలంగా మారింది . ప్రతి మనిషికి సొంత ఇల్లు ఉండాలి అనే ఓ కల బలంగా ఉంటుంది .  హౌసింగ్  సొసైటీ లో తనకూ ఓ ప్లాట్ దక్కాలి అని జర్నలిస్ట్ గా అక్షరాబ్యాసం చేసినప్పుడే జర్నలిస్ట్ మనసులో బలంగా ఉంటుంది .  *********1987 సెప్టెంబర్ నెలలో ఆంధ్రభూమి కార్యాలయంలో అపాయింట్ మెంట్ లెటర్ తీసుకోని నిలబడ్డాను . హైదరాబాద్ వీడి వెళుతున్నానని బాధ . ఉద్యోగం వచ్చింది అని సంతోషం .  అప్పుడు ఆంధ్రభూమి న్యూస్ ఎడిటర్ గా ఉన్న  రాధాకృష్ణ ఒకే జిల్లా కాదు , కులం కాదు ... నా రాతలంటే బోలెడు అభిమానం . ఎలాగైనా జీవితంలో బాగుపడేట్టు చేయాలి అనుకోని లెటర్ ఇస్తూ" మెదక్ జిల్లా రిపోర్టర్ గా వెళ్ళు ..  అక్కడ జర్నలిస్ట్ ల హౌసింగ్  సొసైటీ ఉంటుంది . వెళ్ళగానే ముందు ఆ సొసైటీ లో సభ్యత్వం తీసుకో ..... నేను విశాఖలో ఉండగా  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయి రెండు రోజుల్లో ఇస్తారు  అనగా నేను కలెక్టర్ మీద ఓ వార్త రాశాను . దానితో కలెక్టర్ కు మండింది . అన్నీ రద్దు చేశాడు . అందరూ దెబ్బ తిన్నారు" అంటూ తన విషాద భరిత ఇంటి స్థలం కథ చెప్పుకొచ్చారు . తనదే కాదు  ఇది చాలా మంది  అంతులేని కథ అని ఆ రోజు రాధాకృష్ణ ఉహించి ఉండరు . మెదక్ జిల్లా రిపోర్టర్ గా సంగారెడ్డిలో ఉన్నప్పుడు ఆంధ్రప్రభ నుంచి వారానికి ఓ రిపోర్టర్ హైదరాబాద్ నుంచి సంగారెడ్డి  వచ్చేవారు .1988-89 లో  ఓ వారం  అంజయ్య  వచ్చినప్పుడు హైదరాబాద్ లో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం తీసుకో అని సలహా ఇస్తే ... నేను పని చేసేది మెదక్ జిల్లాలో హైదరాబాద్ లో ఎలా తీసుకుంటా అని ప్రశ్నించా ... నీకెందుకు  నేను చెబుతున్నాను కదా ? అని చెప్పినా వినలేదు . ఓ దశాబ్ద కాలం గడిచాక 95లో  ప్రెస్ క్లబ్ లో మద్య నిషేధం తక్షణం ఎత్తివేయాలి అంటూ అప్పటి సీఎం బాబు సమక్షంలో జర్నలిస్ట్ యూనియన్ సమావేశం . బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మ తో సీకులు అమ్మించగలరు . అయన కోసం మనం డిమాండ్ చేయడం ఏమిటీ అని ఆవేశంగా మాట్లాడి కిందకు వచ్చాక ... ప్రెస్ క్లబ్ తో పాటు , హౌసింగ్ సొసైటీ వ్యవహారాలు చూసే ఉద్యోగి ఒకరు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి తనను తాను పరిచయం చేసుకొని , మీకు హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం ఉందా ? అని అడిగితే ఎప్పుడంటే అప్పుడు ఇవ్వరు కదా ? అని బదులిచ్చాను . ఇదిగో ఫారం నింపి ఇవ్వండి అని అక్కడి కక్కడే సొరుగు  నుంచి ఫారం తీసి ఇచ్చాడు . అలా 95లో సభ్యత్వం . గోపన్ పల్లిలో సందడిగా సభ్యుల సమావేశం ప్లాట్ ల కేటాయింపు కుటుంబ సమేతంగా సభ్యులు వచ్చారు . ఇప్పటి వరకు మన సొసైటీలో రాష్ట్రంలో ఎక్కడ పని చేసేవారైనా సభ్యత్వం తీసుకోవచ్చు అనే నిబంధన ఉంది , దీనిని సవరించి హైదరాబాద్ లో పని చేసేవారికే సభ్యత్వం అనే నిబంధన పెడదాం జనరల్ బాడీ ఆమోదిస్తే , అని చదివి చప్పట్లతో ఆమెదించిన తరువాత కానీ ... ఇలాంటి నిబంధన ఒకటి ఉందని తెలియలేదు .   ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడెక్కడో పని చేసిన వారు హైదరాబాద్ లో  సభ్యత్వం పొందింది ఈ నిబంధన వల్లే .  దీనిని ఎత్తివేసిన తరువాత కానీ నాలాంటి వారికి తెలియలేదు . 95 నుంచి వెయిటింగ్ లిస్ట్ కే పరిమితం .అంటే ఆశగా మా అన్నది ఇంతకన్నా విషాదం .  కరీం నగర్ లో ఈనాడు ఎడిషన్ పెట్టినప్పుడు హైదరాబాద్ నుంచి కొందరిని అక్కడకు బదిలీ చేశారు . అప్పుడు సొసైటీ అధ్యక్షుడు ఈనాడులోనే ఉన్న రాహుల్ . మీకు బదిలీ అయింది కదా ? మీ సభ్యత్వం వెనక్కి తీసుకోండి అని రాహుల్ సలహా .  ఎక్కడెక్కడి వారికో  విశాల హృదయంతో హైదరాబాద్ లో సభ్యత్వం ఇచ్చిన పెద్దలు హైదరాబాద్ లో పుట్టి , హైదరాబాద్ లోనే జర్నలిస్ట్ గా పని చేస్తున్న వారికి బదిలీ అయింది అని సభ్యత్వం వెనక్కి ఇచ్చారు . నా ఒక్కడికే ఈ నిబంధన ఏమిటీ , మీ వారిసభ్యత్వం ఎందుకు రద్దు చేయరు , ప్లాట్స్ మీ సొంత జాగీరు కాదు కదా ? అని ప్రశ్నించక పోవడం తప్పు . గోపన్ పల్లిలో 9 ఎకరాలు ఉంది , ప్రభుత్వం అది ఇస్తే  వెయిటింగ్ లో ఉన్న అందరికీ ప్లాట్ వస్తుంది అంటే ఆశగా ఎదురు చూపులు . ********2004 ఎన్నికలకు సన్నాహాలు . ఓ రోజు టీడీపీ బీట్ రిపోర్టర్ లు అందరూ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో మాట్లాడుతుంటే ... బాబుగారిని కలిసి మీ సొసైటీకి ల్యాండ్ కేటాయించమని అడగండి   అని సలహా ... ఎప్పుడో అడిగాం , జర్నలిస్ట్ లకు ల్యాండ్ ఇవ్వడం మా పాలసీ కాదు ,  ఇవ్వం అని నిర్మొహమాటంగా చెప్పారు అని  సమాధానం . అప్పటి మాట వదిలేయండి ఇది ఎన్నికల సమయం , ఎవరు ఏది అడిగినా ఇస్తున్నారు అని ఉమ్మారెడ్డి సలహా . గుర్తున్నంత వరకు నేను , అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న రాముశర్మ , జ్యోతి వాసిరెడ్డి శ్రీనివాస్ , ఈనాడు సీఎస్ ఆర్ , సారధి బాబును కలిసి సొసైటీకి స్థలం అడిగితే ఒకే  అని బదులిచ్చారు .  టీడీపీ  బీట్ రిపోర్టర్ లు బోలెడు ఆనందపడిపోయారు .తరువాత సచివాలయ రిపోర్టర్ లు సంబంధిత అధికారిని కలిస్తే  .. రిపోర్టర్ లు అందరూ వెళ్లి అడిగితే ఏదో బాబు అలా హామీ ఇచ్చారు కానీ , మాకు ఏమీ చెప్పలేదు . మీరు ఆశలు పెట్టుకోకండి అని ఆశల మీద నీళ్లు చల్లారు . ఐతే బాబు ఉట్టుట్టి హామీ ఇచ్చినా ... తరువాత సొసైటీకి ల్యాండ్ కేటాయింపులో ఈ ఉట్టుట్టి హామీ ఎంతో మేలు చేసింది . టీడీపీ బీట్ రిపోర్టర్ లు ఎన్నికల ముందు బాబును కలిస్తే , కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ లు గుర్తున్నంత వరకు నేమాని భాస్కర్ , వంశీ ఇతర రిపోర్టర్ లు వై యస్ ఆర్ ను కలిసి ఈ ఎన్నికల్లో బాబు గెలిస్తే సొసైటీకి ల్యాండ్ ఇస్తాను అని హామీ ఇచ్చారు . మీరు గెలిస్తే మీరు ఇవ్వాలి అని ఓ వినతి పత్రం ఇస్తే వైయస్ ఆర్ సరే అని హామీ ఇచ్చారు . జర్నలిస్టులు 9 ఎకరాల గురించి వినతి పత్రం ఇస్తే , అది వదిలేయండి అని వైయస్ ఆర్ అందరు జర్నలిస్టులకు సరిపోయే విధంగా 72 ఎకరాలు కేటాయించారు . *****ఐదేళ్ల సీనియారిటీ వల్ల సభ్యత్వం దక్కని వారు వైయస్ ఆర్ ను కలిస్తే న మాట విని వెళ్ళండి , 2009 లో కూడా నేనే సీఎం అవుతాను , మీ అందరికి కూడా నేనే ఇస్తాను అని చెప్పి పంపారు . ఐనా కొందరు కోర్టుకు వెళ్లడం , హై కోర్ట్ , సుప్రీం కోర్ట్ ల లో రెండు దశాబ్దాల పయనం .  సామాన్యుల సమస్యలు పరిష్కరించడం అంత కష్టం కాదు . చివరకు అయోధ్య , కాశ్మీర్ సమస్య పరిష్కరించడం కూడా అంత కష్టం కాదు . కానీ మేధావుల సమస్య లు పరిష్కరించడం అంత ఈజీ కాదు .మొట్టమొదట కోర్ట్ర కు వెళ్ళింది  జర్నలిస్ట్ లే .. ఒక్క సారి వ్యవహారం  కోర్ట్ కు వెళితే .. తాతలు దిగివస్తారు .  పెళ్లయిన కొత్తలో హౌసింగ్ సొసైటీ లో సభ్యత్వం తీసుకొంటే ..    కోర్ట్ తీర్పు వచ్చేనాటికి  తాత లు అయిన వారు కూడా ఉన్నారు . బాబు మాట తప్పారు , వైయస్ ఆర్ ఇచ్చారు , తరువాత వచ్చిన రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు . తరువాత ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వ జోక్యం వల్ల, ప్రధాన న్యాయమూర్తి       జస్టీస్ రమణ గారి వల్ల సుప్రీంలో   కేసు కదిలింది . తీర్పు వచ్చింది . సుప్రీం తీర్పు తరువాత నిజాం పేట స్థలం సొసైటీకి అప్పగించిన ప్రభుత్వం . పేట్ బషీర్ బాద్ స్థలం విషయం ఎటూ తేల్చలేదు . మేం అధికారంలోకి రాగానే హైదరాబాద్ ల్యాండ్ సమస్య పరిష్కరిస్తాం అని ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ హామీ . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వందరోజుల్లో హామీ నెరవేరుస్తారు అని  అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు  . ఇంకో నెల రోజుల్లో వంద రోజులు అవుతాయి . అంతులేని కథ రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు మొదలయింది .  సీఎంగా  కథ కు శుభం పడుతుందా ?   అంతులేని కథ ఇంకా సాగుతుందా ? న్యూస్ పేపర్ లో చూడాలి . ******ఉచితంగానా ? కాదు కానే కాదు , 2005-6 లోనే  ఒక్కో జర్నలిస్ట్ రెండేసి లక్షలు చెల్లించి ప్రభుత్వ ధరకు ల్యాండ్ కొన్నారు . అప్పుడు రెండు లక్షలు అంటే యాదగిరిగుట్ట , భువనగిరి ప్రాంతాల్లో ఒకటి రెండు ఎకరాల భూమి కొనవచ్చు .  కొసమెరుపు   : అదే సమయంలో వైయస్ ఆర్ ఐఏఎస్ ,  ఐ పి యస్ ,  శాసన సభ్యులకు ల్యాండ్ కేటాయించారు .  జర్నలిస్ట్ లకు సంబంధించి కనీసం తీర్పు వచ్చింది . వారిది ఇంకా తీర్పు కూడా రాలేదు . ఇది నా ఒక్కడి కథ . ఒక్కొక్కరిది ఒక్కో పుస్తకం రాసేంత గాధ ఉంటుంది . రాస్తూ పోతుంటే అంతులేని కథకు అంతు  ఉండదు . - బుద్దా మురళి