21, డిసెంబర్ 2019, శనివారం

జ్ఞానోదయం

బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు వయసు మీరిన తరువాత చాలా మందికి డబ్బుకు సంబంధించి తత్వం బోధపడుతుంది. ఇలా చేసి ఉండాల్సింది కాదు అనుకుంటాం. అలా అనుకోకుండా ముందు నుంచే జాగ్రత్త వహించాలి. 40 ఏళ్ళ వయసులో గ్రహించి రూపొదించిన 40 తప్పుల జాబితాలో ఈ వారం మరి కొన్ని..
* సంపద, ఆదాయం పెరిగితే సమస్యలు తీరుతాయని, స్ట్రైస్ తగ్గుతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆదాయం పెరిగినంత మాత్రాన ఒత్తిడి తగ్గుతుంది అని ఏమీ లేదు
* జీతం పెరిగితే సమస్యలన్నీ తీరుతాయనే ఆలోచన ఉద్యోగంలో చేరిన కొత్తలో ఉంటుంది. కానీ వయసు మీరిన తరువాత జీతం దారి జీతానిదే సమస్యల దారి సమస్యలదే అని గ్రహిస్తారు.
* మీ జీతం ఎంతన్నా కావచ్చు. కానీ జీతం కన్నా మీ ఆస్తి ఎంత అనేది ముఖ్యం. నెలకు లక్ష రూపాయల జీతం ఉండి ఆస్తి ఏమీ లేని వారు కూడా ఉంటారు. అందులో సగం జీతం ఉన్నా అంత కన్నా తక్కువ ఖర్చు పెట్టి పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్‌ను నమ్ముకున్న వారు ఉంటారు. జీతం ఎంతున్నా మీ నెట్‌వర్త్ పెంచుకోవడంపై దృష్టిసారించాలి. 40 దాటిన తరువాతే చాలా మంది ఇది గ్రహిస్తారు. నెట్‌వర్త్ ముఖ్యం అనేది ఎంత తక్కువ వయసులో గుర్తిస్తే అంత మంచిది.
* మీ కోసం మీరు పని చేయడం సరే... కానీ మీ డబ్బు మీ కోసం పని చేసే పరిస్థితి ఎంత త్వరగా కల్పించుకుంటే అంత మేలు. మీ పొదుపు ఇనె్వస్ట్‌మెంట్ రూపంలోనో, లేదా అద్దెలు వచ్చే ఇంటిపైనో ఉంటే మీ తరుపున మీ డబ్బు పని చేస్తుంటుంది.
* మీపై మీరు కూడా ఇనె్వస్ట్‌మెంట్ చేసుకోవడం మంచి ఇనె్వస్ట్‌మెంట్ అవుతుంది. కాలం మారుతోంది టెక్నాలజీ వేగంగా మారుతోంది. దీనికి తగ్గట్టు వృత్తిలో ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త కోర్సులు నేర్చుకోవడం, వివిధ అంశాల గురించి జ్ఞానం పెంచుకోవడం ఇవన్నీ మీపై మీరు చేసుకునే ఇనె్వస్ట్‌మెంట్.్భవిష్యత్తు ఆర్థిక స్వేచ్ఛకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
* చాలా మంది కొంత కాలం ఉద్యోగం చేసి తరువాత సొంతంగా వ్యాపారం ప్రారంభించిన వారు ఈ పని ముందే చేయాల్సింది అనుకుంటారు. మీరు దేనికి సరిపోతారో ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. కొందరికి ఉద్యోగాలే సరిపోతాయి. కొందరికి వ్యాపారం. మీరు ఎందులో అయితే రాణిస్తారో గ్రహించాలి.
* పాసివ్ ఇన్‌కంపై దృష్టిపెట్టాలి. రిస్క్ లేకుండా మీ పెట్టుబడిపై పాసివ్ ఇన్‌కం వచ్చే మార్గాలను చూడాలి.
* నాకు లెక్కలు అంటే బోర్ అనుకుంటే డబ్బు చేతిలో నిలబడదు. ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు. సంపద ఎక్కడి నుంచి వస్తుంది. ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నాను. నా లక్ష్యం చేరేందుకు ఏ స్థాయిలో కష్టపడాలి అనే లెక్కలు అవసరం.
* పొదుపు రేపటి కోసం అని గుర్తుంచుకోవాలి. అలా అని అవసరాలు తీర్చుకోవద్దు అని కాదు. దేనికి ఎంత ప్రాధాన్యత అనేది గుర్తించాలి. అనివార్యం అయిన వాటికి ఖర్చు చేయాల్సిందే. అనవసర ఖర్చును అదుపులో పెట్టాల్సిందే.
* అప్పుడు ఖర్చు చేయలేకపోయాను అని వయసు మీరిన తరువాత మీరు బాధపడే సందర్భం రావద్దు. మీ సంపదన మీ కోసమే. మీకు అనందం కలిగించే ఖర్చు తప్పేమీ కాదు. అనివార్యం అయిన వాటికి ఖర్చు చేయడం తప్పుగా భావించాల్సిన అవసరం లేదు.
* క్రెడిట్ కార్డులను మేనేజ్ చేయలేకపోతే దూరంగా ఉండడమే మంచిది. కార్డులపై కాకుండా నగదు రూపంలోనే ఖర్చు చేస్తే ఖర్చు మీ అదుపులో ఉంటుంది.
* ఇనె్వస్ట్‌మెంట్ గురించి తెలిసిన వారితో మిత్రులతో చర్చించండి. అదేమీ రహస్యం కాదు. అందరితో చర్చించి మీకు నచ్చినట్టు చేయండి.
* ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అనగానే వారికంతా తెలుసు అనుకోకండి. ప్రతి సందేహాన్ని అడగండి. మీకు ఏది నచ్చుతుందో ఆ మార్గంలో వెళ్లండి.
* పర్సనల్ లోన్స్ ఇస్తాం. వాయిదాలపై కొనండి. కార్డులు ఇస్తాం అని వెంట పడితే మోహమాటపడాల్సిన అవసరం లేదు. అది వారి వ్యాపారం. మీకు అవసరమా? కాదా? అనేది నిర్ణయించుకోవలసింది మీరే.
* మీ నెల జీతం నుంచి నిర్ణయించుకున్న మొత్తం ప్రతి నెలా ఆటోమెటిక్‌గా పొదుపు ఖాతాలోకి వెళ్లే విధంగా బ్యాంకుకు ముందే సూచనలు ఇవ్వండి.
* ఇప్పుడు సమయం మీ చేతిలో ఉంది. డబ్బు మీ చేతిలో ఉంది. ఇలాంటి మంచి సమయంలోనే పొదుపు చేయండి. రేపు ఎలాంటి అవసరం వస్తుందో ఊహించలేం.
* చిన్న మొత్తం కాంపౌండ్ ఇంట్రస్ట్ పుణ్యమా అని మీ రిటైర్‌మెంట్ కాలంలో పెద్ద మార్పు చూపిస్తుంది.
* మీ పొదుపు లక్ష్యాలు, భవిష్యత్తు అవసరాలు మీ ఆదాయం అన్నీ కాగితంపై రాసుకోండి. మీకు అవగాహన వస్తుంది.
* ఉద్యోగంలో చేరిన కొత్తలో ఇలాంటి ఆలోచనలు రాకపోవచ్చు. కానీ పిల్లలు పెరుగుతూ ఉన్నా కొద్ది ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. వారి భవిష్యత్తుకు అవసరం అయిన డబ్బు సమకూర్చగలనా? లేదా అనే టెన్షన్ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ఈ అవసరాలను గుర్తిస్తే చివరలో టెన్షన్ ఉండదు.
* పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు గురించి చెప్పండి. వారికి ఏమీ తెలియదు అనుకోకండి. ఎంత ఆదాయం వస్తుంది. ఎంత ఖర్చవుతుంది. భవిష్యత్తు అవసరాలు ఏమిటి వారితో చర్చించాలి.
* డబ్బుకు సంబంధించి మనం ఎన్ని లెక్కలు వేసుకున్నా జీవితంలో చాలా విషయాలు ఊహించి రావు. అంతా బాగుంది అనుకున్న సమయంలో స్టాక్ మార్కెట్ పడిపోవచ్చు. ఊహించని స్థాయిలో ఆస్పత్రి ఖర్చు మీద పడవచ్చు. ఇలాంటి వాటి కోసం ముందుగానే సిద్ధం కావాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య బీమా తీసుకోవాలి. ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆదాయం లేని రోజులను ఊహించుకుని పొదుపు చేయాలి.
* ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యజమాని, బంధువులు ఎవరో వచ్చి ఆర్థికంగా ఆదుకుంటారు అనే ఆశలు వద్దు. ఎవరిని వారే ఆదుకోవాలి.
* డబ్బుకు సంబంధించి ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. ఆలా చేసి ఉండాల్సింది. ఇలా చేసి ఉండాల్సింది అని అయిపోయిన తరువాత బాధపడాల్సిన అవసరం లేదు. ఇకపై ఎలా ఉండాలి అనేదే ముఖ్యం. *జీవితంలో డబ్బు ముఖ్యం కాదు అని చాలా మంది సూక్తులు చెబుతుంటారు. అది నిజం కాదు డబ్బు చాలా ముఖ్యం. అన్ని అవసరాలకు డబ్బు ముఖ్యం. డబ్బు ముఖ్యం కాదు అని డబ్బును నిర్లక్ష్యం చేయవద్దు. చాలా ముఖ్యం అని గుర్తించి గౌరవం ఇవ్వాలి.
40 ఏళ్ల వయసులో డబ్బుకు సంబంధించి బోలెడు నేర్చుకొని ఉండవచ్చు. ఏ వయసులోనైనా నేర్చుకోవచ్చు. మనిషి పుట్టుక నుంచి అంతిమ శ్వాస విడిచే వరకు డబ్బుతో అవసరం ఉంటుంది. డబ్బు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతుంది.
-బి.మురళి(13-10-2019)

ఇల్లే స్వర్గం

అంబానీ ఐనా పూరిగుడిసెలో ఉండే సామాన్యుడైనా తన కంటూ ఈ భూమి మీద ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిపై ఎక్కువ ఆదాయం వస్తుందా? బంగారంపై పెట్టుబడిలో గిట్టుబాటు ఎక్కువగా ఉంటుందా? అనే లెక్కలు ఎలా ఉన్నా.. ఇల్లు ఇచ్చే భరోసా మరేది ఇవ్వదు. ఈ అనంత విశ్వంలో తన కంటూ ఒక అడ్రస్ ఉండాలని, తన స్వంతం అని చెప్పుకోవడానికి ఒక ఇల్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇంటిపై పెట్టుబడి లాభసాటిగా ఉంటుందా? ఉండదా? అని ఆర్థిక నిపుణులు చెప్పే లెక్కలు వేరు. జీవితం వేరు.
డబ్బు ఒక చోట స్థిరంగా ఉండదు. ఈ రోజు పేదవాడు స్వయంకృషితో ఎదిగి సంపన్నుడిగా మారవచ్చు. సంపన్నుడు సరైన వ్యూహం లేక నిర్లక్ష్యంగా వ్యవహరించే నిరుపేదగా మారవచ్చు. కానీ జీవితం చివరి దశలో ఉండడానికి ఒక గూడు కూడా లేని దశను అనుభవించడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సామాన్యులకే ఇలా ఉంటే ఎంతో మంది అసామాన్యులను తయారు చేసిన వారికి చివరి దశలో సొంత గూడు లేకుంటే ఎలా ఉంటుంది.
అచ్చం కళైజ్ఞ ఆవేదనలా ఉంటుంది. అతను ఎవరో మనకు తెలియక పోవచ్చు కానీ రజనీకాంత్, కమల్ హాసన్ తెలుసు కదా? ఈ సూపర్ స్టార్‌లను తయారు చేసిన బిగ్‌బాస్ కళైజ్ఞ.
అలాంటి కళైజ్ఞ తొమ్మిది పదుల వయసులో బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మందిని సినిమా రంగానికి పరిచయం చేశాను. సూపర్ స్టార్లను చేశాను. చివరి దశలో సొంత ఇల్లు లేకపోవడం బాధగా ఉంది. జీవిత చరమాంకంలో సొంత ఇంటిలో ప్రశాంతంగా గడపాలని ఉంది ఎవరైనా సహకరిస్తారా? అని నోరు తెరిచి అడిగారు.
సినిమా జీవితం ఒక రకంగా జూదం లాంటిదే. జీవితం ఒకసారి రంగుల రాట్నంలా కనిపిస్తుంది. మరో చీకట్లోకి నెట్టివేస్తుంది. అలాంటప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు.
స్టూడియోలు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించడం, వందల ఎకరాలు కొనడం అందరి వల్ల కాకపోవచ్చు. కానీ కనీసం సొంత ఇల్లు అనేది ముఖ్యం. సొంత ఇల్లు అనేది ఉంటే తన ఇంట్లో తాను పస్తులతోనైనా గడపవచ్చు.
సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగి... చివరి దశలో సొంత ఇల్లు కూడా లేక పరాయి పంచన, స్టూడియోల్లో ఒక మూలన జీవితాన్ని ముగించిన సినీ ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు. ఒక్క సినిమా రంగమే కాదు అనేక రంగాల్లో ఇలా జీవితాన్ని ముగించిన వారు ఉన్నారు. ఐతే సినిమా వారిలా ఇతర రంగాల వారు పాపులర్ కాదు కాబట్టి వారి గురించి తెలియదు. ఏ రంగంలో ఉన్నా... ఉద్యోగంలో ఉన్నా సొంత ఇంటిని సమకూర్చుకోవడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇల్లు ఇచ్చినంత భద్రత మరేమీ ఇవ్వదు.
* * *
రజనీకాంత్ ఈ పేరు వింటేనే కోట్లాది మంది అభిమానులు పులకించి పోతారు. ఉత్తరాది , దక్షిణాది అనే కాదు చివరకు జపాన్, చైనాల్లో సైతం అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్.
అతన్ని సూపర్ స్టార్ అని తొలిసారి పిలిచింది ఎవరో తెలుసా? అతని పరిస్థితి ఏమిటో తెలుసా? రజనీకాంత్‌కు కోట్ల రూపాయల మార్కెట్ ఉంది. అతన్ని సూపర్ స్టార్‌ను చేసిన కళైజ్ఞంకు మాత్రం సొంత ఇల్లు కూడా లేదు. చివరి దశలో దయతలిచి రజనీకాంత్ ఆదుకోవడంతో ఓ ఇంటివాడయ్యారు కళైజ్ఞ.
ఇటీవల వచ్చిన బ్రోచేవారెవరురా సినిమాలో ఇంటికి మించిన భద్రత ఎక్కడా దొరకదు అని అని హీరోయిన్‌ను ఉద్దేశించి హీరో పలికే డైలాగు అందరికీ నచ్చింది. ఆడ పిల్లలకే కాదు సూపర్ స్టార్‌లకు, సూపర్ స్టార్‌లను తయారు చేసిన వారికి ఎవరికైనా ఇంటికి మించిన భద్రత, భరోసా ఎక్కడా ఉండదు.
తమిళనాడుకు చెందిన కళైజ్ఞం వందకు పైగా సినిమాలకు పని చేశారు. దర్శకత్వం వహించారు. సినిమాలను నిర్మించారు. కథ రాశారు. స్కిృప్ట్ రాశారు. తొమ్మిది పదులు దాటిన వయసులో ఎంతో చేశాను కానీ చివరకు సొంత ఇల్లు కూడా లేకపోవడం దిగులుగా ఉంది. ఎంతో మందిని పెద్దవారిని చేశాను. వారిలో ఎవరో ఒకరు చేయూత ఇవ్వకపోతారా? అని ఆశగా ఎదురు చూస్తున్నాను అని ఒక సినిమా ఫంక్షన్‌లో బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేశారు. రజనీకాంత్, కమల్‌హాసన్, జయచిత్ర, మాధవి, స్వప్న వంటి హేమాహేమీలను పరిచయం చేసిన వారు. సొంత గూటి కోసం ఎవరు ఒకరు సహకరించక పోతారా? అని ఆశగా ఎదురు చూసే పరిస్థితి రావడం దయనీయం.
కళైజ్ఞ అంటే చిన్న చితక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన వారు కాదు ఆయన సూపర్ స్టార్‌లను ప్రేక్షకులకు పరిచయం చేసిన బిగ్‌బాస్ ఆయన. రజనీ స్టైల్ అంటే అభిమానులు పడి చస్తారు. అమితాబ్ తరువాత దేశమంతా అంతటి అభిమానులను సంపాదించుకున్న నటుడు.
* * *
అప్పటి వరకు సహాయ పాత్రలు వేస్తున్న రజనీకాంత్‌ను . సోలో హీరోగా తొలిసారి భైరవి అనే సినిమాతో కళైజ్ఞ పరిచయం చేశారు. తమిళంలో విజయవంతమైన సినిమాను తమిళంలో రజనీకాంత్ హీరోగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ దేవర్ ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇవ్వడంతో కళైజ్ఞ ఈ సినిమా నిర్మాణానికి నడుం బిగించారు. రజనీ హీరో అంటే నడిచే అవకాశం లేదు. పెట్టుబడి పోతుంది. హీరోను మార్చాలి అని దేవర పట్టుపట్టారు. కానీ రజనీపై పూర్తి నమ్మకంతో ఉన్మ కళైజ్ఞ వెనకడుగు వేయలేదు. దేవర ఆర్థిక సహాయం చేయకపోయినా ఎలాగోలా డబ్బులు సమకూర్చుకుని సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమాకు సంబంధించి భారీ కటౌట్ ఏర్పాటు చేసి సూపర్ స్టార్ రజనీకాంత్ అని రాశారు. ఆ సినిమా అనుకున్నట్టుగా హిట్ కావడంతో రజనీకాంత్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి.
ఇక బాలనటునిగా ఏడాది వయసు నుంచే నటిస్తున్న కమల్‌హాసన్ అనంతరం కొంత కాలం సినిమాకు దూరమయ్యారు. అందరు బాల నటులకు ఎదురయ్యే సమస్యనే ఇది. కమల్‌కు 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కళైజ్ఞ కురత్తి మాగన్ అనే సినిమా తీస్తూ, నృత్యం చేసే యువకుడి పాత్ర కోసం కమల్‌ను కలిస్తే, నేను బాలనటునిగానే ప్రేక్షకులకు పరిచయం. యుక్తవయసు పాత్రలో నన్ను ప్రేక్షకులు చూడలేరు అని కెమెరా ముందుకు రావడానికి ఒప్పుకోలేదు. కానీ కళైజ్ఞ పట్టుపట్టి కమల్ నటించేట్టు చేశారు. ఆ తరువాత కమల్ హాసన్‌కు ఎదురు లేకుండా పోయింది.
తన దుస్థితిని రెండేళ్ల క్రితం కళైజ్ఞ బహిరంగంగా చెప్పాక, రజనీకాంత్ స్పందించి ఇటీవల దాదాపు కోటి రూపాయల త్రిబుల్ బెడ్‌రూమ్ ఇంటిని కళైజ్ఞకు రజనీకాంత్ బహుమతిగా ఇచ్చారు. వేటూరి సుందర రామమూర్తి కూడా ఇదే విధంగా సొంత ఇంటి కోసం ఆవేదన చెందారు.
-బి.మురళి(20-10-2019)

నచ్చిందా.. అవసరమా?

ఒక వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేందుకు అనేక పరీక్షలు ఉంటాయి. అలానే మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉండబోతుందో తేల్చడానికి కూడా ఒక చిన్న పరీక్ష ఉంది. మీరు ఒక వస్తువును కొనే పద్దతిని బట్టి మీ ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తును అంచనా వేయవచ్చు.
ఒక వస్తువును కొనేప్పుడు నచ్చింది కాబట్టి కొంటున్నారా? అవసరం కాబట్టి కొంటున్నారా? ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యత ఇస్తారు అనే దాని బట్టి మీ ఆర్థిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
అమెరికాలో జరిపిన ఒక సర్వేలో దాదాపు 80 శాతం మంది నచ్చిందని కొంటున్నారు కానీ అవసరంతో కాదట! ఈ స్థాయిలో కాకపోయినా మన వద్ద కూడా ఇలా కొనే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అవసరంతో కాకుండా ఎమోషన్‌తో కొత్త వస్తువులను కొనేస్తున్నారు. ఆ వస్తువు కొనడం వల్ల ఆర్థికంగా ఎలా ప్రభావం పడుతుంది అనే అంశంపై పెద్దగా ఆలోచనలు ఉండవు. వడ్డీ లేకుండా నెలసరి వాయిదాలపై లెటెస్ట్ సెల్‌ఫోన్ అమ్మకానికి కనిపించగానే కొనకుండా ఉండలేరు. ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు, అడ్రస్ ఫ్రూప్ కూడా అవసరం లేదు. లెటెస్ట్ మోడల్ సెల్‌ఫోన్ తీసుకు వెళ్లండి అనగానే అడుగులు అటువైపు పడుతున్నాయి అంటే... మిమ్ములను మీరు సమీక్షించుకోవాలి.
సెల్‌ఫోన్లు, కొత్త కొత్త మోడల్ టీవిలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఒక్క సంతకం చేస్తే చాలు అవి ఇంట్లో వాలిపోతాయి. అడ్వాన్స్ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. నెల నెలా వాయిదాలు కట్టాలి. కొన్ని కంపెనీలైతే ఏకంగా తొలి వాయిదాను వారే కడుతున్నారు. ఎలాగైనా మిమ్ములను ఆకర్శించడమే వారి లక్ష్యం. దాని కోసం అందమైన మోడల్స్‌తో చక్కని ప్రకటనలు గుప్పిస్తారు.
అవసరం ఉంది కాబట్టి కొంటున్నానా? లేక నచ్చి కొంటున్నానా? అని తమను తాము ప్రశ్నించుకునే వారు ఇలాంటి అందమైన ప్రకటనల బారిన పడకుండా తమను తాము ఎలా రక్షించుకొంటారు.
మీరు ఎలా ఖర్చు చేస్తారు అనే దాన్ని బట్టి కూడా మీ భవిష్యత్తు ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది.
చాలా మంది కొత్త మోడల్ అనగానే సెల్‌ఫోన్ కొనేస్తారు. సాధారణంగా సెల్‌ఫోన్‌ను మాట్లాడేందుకు, ఎస్‌ఎంఎస్‌లు, ఫోటోలు తీయడం వంటి సాధారణ పనుల కోసమే ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ కొత్త ఫీచర్లతో కొత్త ఫోన్ అని ప్రకటనలు కనిపించగానే మనసు అటువైపు వెళుతుంది. ఇప్పుడు చేతిలో ఉన్న ఫోన్‌తో పని జరగడం లేదా? నిజంగా ఆ కొత్త ఫీచర్ల అవసరం ఉందా? వాటిని ఉపయోగిస్తామా? అనే ఆలోచన కూడా లేకుండా కొత్త సెల్‌ఫోన్‌ను సొంతం చేసుకుంటారు.
ఇలాంటి వారి ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమే. చేసే ఉద్యోగంలో ఏదైనా తేడా వచ్చినా? ఆదాయం తగ్గినా నిండా అప్పుల్లో మునిగిపోయే వారు ఇలాంటి వారే.
సెల్‌ఫోన్ కావచ్చు, టీవి కావచ్చు ఇంట్లోకి ఫర్నీచర్ కావచ్చు. చివరకు దుస్తులు కావచ్చు కంటికి నచ్చిందని కొంటున్నారా? లేక అవసరం అని కొంటున్నారా? మీకు మీరే ప్రశ్నించుకొని . అవసరమే అనే సమాధానం వస్తేనే కొనండి. మార్కెట్‌లో కంటికి నచ్చిందని కొని అసలు ఉపయోగించని వస్తువులు ప్రతి ఇంట్లో చాలానే ఉంటాయి. ఇలాంటి అలవాట్లే మీ ఆర్థిక సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.
జీవితమంతా లెక్కల మయమేనా? నచ్చిన వస్తువు కొనవద్దా? అంటే అలా అని కాదు. నచ్చిన వస్తువు కొనడం తప్పు కాదు కానీ దాని వల్ల ఎలాంటి భారం పడుతుంది అనే ఆలోచన ముఖ్యం. చిన్న చిన్న కోరికలను కూడా అణిచిపెట్టుకోవలసిన అవసరం లేదు. నచ్చిన వస్తువు కొనడం, నచ్చిన చోటుకు వెళ్లడం, నచ్చిన హోటల్‌కు వెళ్లడం తప్పేమీ కాదు కొద్ది పాటి ఖర్చుతో నచ్చిన పని చేయడం వల్ల జీవితం ఉత్సాహంగా ఉంటుంది. చిన్న చిన్న ఖర్చులు తప్పేమీ కాదు. కానీ కుటుంబ బడ్జెట్‌పై తీవ్రంగా ప్రభావం చూపించే ఖర్చులపై ఆలోచన అవసరం. ఆదాయానికి మించిన ఖర్చు వద్దు. ప్రాధాన్యతలు గుర్తించకుండా ఖర్చులు వద్దు. వాయిదాల్లో బందీ అయితే అత్యవసరమైన ఖర్చుల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంటి బడ్జెట్ తలక్రిందులవుతుంది.
ఎమోషనల్ కొనుగోళ్లను అడ్డుకోవడానికి నిపుణులు ఒక చిన్న చిట్కా వివరించారు. కొత్త మోడల్ సెల్‌ఫోన్ వచ్చింది ... చాలా ఫీచర్లు ఉన్నాయి కొనాలా? చిన్న చిన్న కోరికలను కూడా అదుపులో పెట్టుకొని బతకాలా? అనుకుంటే ఈ చిట్కాను అమలు చేయవచ్చు.
సెల్‌ఫోన్ ఖరీదు 25వేలు అనుకుంటే మీ సేవింగ్ ఖాతాలో లక్షా పాతిక వేలు అంటే సెల్‌ఫోన్ ఖరీదు కన్నా ఐదింతలు ఉంటే కొనుక్కోవచ్చు. అలా కాకుండా పాతిక వేలు మాత్రమే ఉంటే ఆ డబ్బుతో సెల్‌ఫోన్ కొంటే అత్యవసర ఖర్చు వస్తే ఏం చేస్తారు. కొందరు సేవింగ్ ఖాతాలో ఏమీ లేకపోయినా వాయిదాలపై కొంటున్నారు. అది అవసరమా?
ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాల వారిని కంపెనీలు టార్గెట్ చేసుకుంటున్నాయి. ఎమోషనల్ పర్చెసింగ్‌తో దెబ్బతింటున్నది వీళ్లే. ఎమోషనల్ పర్చెసింగ్‌కు బదులు తెలివిగా ఆలోచించాలి ఈ వస్తువు మనకు అవసరమా? ఇప్పుడే అవసరమా? ఈ ధరతో అవసరమా? అనే ఆలోచన చేసి అవసరం అని తేలిన తరువాతనే కొనుగోలు చేయాలి. ఒక వస్తువును కొనే ముందు ఇలా మిమ్ములను మీరు ప్రశ్నించుకోవడం అలవాటు చేసుకుంటే ఖర్చు మీ అదుపులో ఉంటుంది. ఏ ఖర్చు అయినా సరే ఇష్టమా? అవసరమా? అని ప్రశ్నించుకుంటే మీ ఆర్థిక ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. భవిషత్తు ప్రశాంతంగా ఉంటుంది.
-బి.మురళి(27-10-2019)

మైండ్‌సెట్‌లో సంపద

ఎక్కువ జీతం వచ్చే వాళ్లు, ఎక్కువ ఆదాయం ఉండే వారే సంపన్నులు అవుతారు అనే అంచనా తప్పు. జీతం తక్కువగా ఉన్నా మీ మైండ్‌సెట్ బట్టి మీరు సంపన్నులు కావచ్చు. ఇదేమీ మంత్రం కాదు. మాటలతో బురిడీ కొట్టించడం కాదు.
దాదాపు దశాబ్దం క్రితం యాదగిరిగుట్ట పక్కనున్న వంగపల్లిలో వ్యవసాయ భూమి పదివేలకు ఎకరం అమ్మాలంటే కూడా కొనేవారుండేవారు కాదు. పెళ్లి ఖర్చుల కోసం చాలా ఇబ్బంది పడి వంగపల్లిలో పదెకరాల భూమిని పదివేలకు ఎకరంలా అమ్మేసిన వారున్నారు. ఈ పదేళ్ల కాలంలో అక్కడ భూమి విలువ ఎంతుంటుందో ఊహించగలరా? యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత హైదరాబాద్ నగరాన్ని మించి ధరలు పలుకుతున్నాయి అక్కడ. ఆలయానికి సమీపంలో ఒక ఎకరానికి రెండు కోట్లకు పైగా ధర పలుకుతోంది.
భవిష్యత్తును ఊహించి భూమిని నిలుపుకొన్న వారు, కొన్నవారు చాలా తక్కువ సమయంలోనే సంపన్నులు కాగా, అమ్మిన వారు లబోదిబోమంటున్నారు.
హైటెక్‌సిటీ భవన నిర్మాణ సమయంలో అక్కడ ఎకరం ధర లక్ష రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు ఆ ధరతో ఒక గజం భూమి కూడా లభించదు. ఇలాంటి ఉదాహరణలు మనకు అన్ని చోట్ల కనిపిస్తాయి. అదృష్టం అనేది మనకు జీవితంలో అనేక సార్లు తలుపు తడుతోంది. ఆ ఆహ్వానాన్ని స్వీకరించేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? లేదా? అనే దాన్ని బట్టి మన ఆర్థిక స్థితి ఆధారపడి ఉంటుంది.
ఆర్థికంగా బాగుండేందుకు ఎక్కువ జీతం, ఎక్కువ సంపాదన ఒక్కటే సరిపోదు. దీని కన్నా సంపదను ఆకట్టుకునే మైండ్‌సెట్ అవసరం. మీ మైండ్‌సెట్ దానికి సరిపోయే విధంగా లేకపోతే సంపద వచ్చి మీ ఖాతాలో పడ్డా అది ఎక్కువ కాలం ఉండదు. ఒక డాక్టర్ ఆన్‌లైన్‌లో ఎవరో లాటరీ వచ్చిందంటే దశల వారిగా కోటి రూపాయలు సమర్పించుకుందట! అంటే డాక్టర్‌గా ఉన్నత విద్యావంతురాలు అయినా, ఆన్‌లైన్‌లో డబ్బులు పంపేంత సాంకేతిక నైపుణ్యం ఉన్నా , సంపాదించే సామర్థ్యం ఉన్నా ఆ డబ్బును నిలుపుకొనే మైండ్‌సెట్ లేకపోవడం వల్ల అంత చదువు చదివినావిడ, పెద్దగా చదువు సంధ్యలు లేని మోసగాళ్ల ఆన్‌లైన్ మోసాలకు చిక్కింది.
మన మైండ్‌సెట్ ఎలా ఉంది. మనల్ని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకు వచ్చే విధంగా ఉందా? అప్పులు, సమస్యల్లో ముంచేట్టుగా ఉందా? అని మనకు మనమే పరీక్షించుకోవాలి.
సంపద సమకూర్చుకునే వారి మైండ్‌సెట్ ఎలా ఉంటుందో నిపుణులు సూచించారు. ఈ పది లక్షణాలు తప్పన సరిగా ఉండాలట! అవి ఉంటే సంపన్నులు కావడానికి మిమ్ములను ఎవరూ ఆపలేరు.
* ఈ రోజు గురించే కాదు.. భవిష్యత్తు గురించి ఆలోచించగలగాలి. వచ్చే ఐదేళ్లు, 20 ఏళ్లలో మీరు ఆర్థికంగా ఎలా ఉండాలనుకుంటున్నారో ఊహించుకోవాలి. ఉద్యోగంలో చేరిన మొదటి నెలనే రిటైర్‌మెంట్ గురించి ఆలోచించగలగాలి. మంచిరోజు, మంచి ముహూర్తం గురించి ఆలోచన వద్దు .. ఆర్థికంగా బలంగా ఉండాలనే ఆలోచనకు ఈరోజే శ్రీకారం చుట్టండి.
* ఒక వస్తువును కొనేప్పుడు తక్కువ ధర అనే కాదు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి ఖర్చులోనూ ఇదే ధోరణి అవసరం. ఎక్కువ కాలం ప్రయోజనం కలిగించే ఖర్చు చేయాలి. ఖర్చులో, కొనుగోలులో సైతం తెలివి ఉండాలి.
* ఒక కంపెనీకి బ్రహ్మాండంగా లాభాలు వస్తే యజమానికి ప్రయోజనం. కానీ అదే కంపెనీ దివాళా తీస్తే ఉద్యోగి కోలుకోలేని విధంగా దెబ్బతింటాడు. ఉద్యోగమే పోయి జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. లాభం వచ్చినప్పుడు తేడా ఉండదు కానీ నష్టాలు వస్తే ఉద్యోగి కూడా భరించాలి. నిజానికి యజమాని కన్నా ఉద్యోగిపైనే నష్టప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు ఉద్యోగిగా ఉంటూ కూడా యజమానిగా ఉండే ఆలోచన చేయవచ్చు. మీ జీతంతో వచ్చే డబ్బును రియల్ ఎస్టేట్ వంటి వాటిపై ఇనె్వస్ట్ చేయవచ్చు. స్టాక్స్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో, మీకు అవగాహన ఉన్న వాటిలో ఇనె్వస్ట్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఉద్యోగిగా జీతం వస్తుంది. ఇనె్వస్ట్‌మెంట్‌పై ఆదాయం గడించడం ద్వారా ఉద్యోగిగా, యజమానిగా రెండు రకాల ప్రయోజనం పొందగలరు. జీవిత కాలమంతా ఉద్యోగిగానే కాదు యజమానిగా మారే విధంగా మైండ్‌సెట్ ఉండాలి. ఇనె్వస్ట్‌మెంట్‌కు అనుకూలమైన మైండ్‌సెట్ లేనివారు ఎక్కడా ఇనె్వస్ట్ చేయలేరు.
* ఇతరుల ప్రతిభను గుర్తించాలి. ఇతరుల సహాయానికి కృతజ్ఞత చూపాలి. ఒక్కరి వల్లనే ఏదీ సాధ్యం కాదు. మీరు ఆర్థికంగా బలంగా మారడంలో ఇతరుల సహకారం కూడా ఏదో విధంగా ఉంటుంది. దానికి కృతజ్ఞతలు చూపే విధంగా మీ మైండ్‌సెట్ ఉండాలి.
* అత్యవసర ఖర్చులు, అవసరాలు, ఊహించని విధంగా వచ్చే సమస్యలను ముందే ఊహించి, దానికి సిద్ధం కావాలి. యుద్ధానికి సిద్ధంగా ఉండే సైనికుల మాదిరిగా అత్యవసరంగా వచ్చే వాటి కోసం ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి.
* సినిమాల గురించి, క్రికెట్ గురించి గంటల తరబడి మాట్లాడుతుంటాం. చదువుతుంటాం. సినిమాల వల్ల ఆ సినిమా తీసిన వారికి, నటించిన వారికి లాభాలు రావచ్చు, క్రికెట్ వల్ల క్రికెటర్లకు లాభమేమో కానీ మనకు ఆర్థికంగా ఏ మాత్రం ఉపయోగపడని వాటి గురించి గంటలు గంటలు కేటాయిస్తూ జీవితంలో మనకు ఎంతో ముఖ్యమైన ఆర్థిక అంశాలను పట్టించుకోం. వడ్డీ, స్టాక్‌మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనే కనీస అవగాహన కూడా లేని వాళ్లు కనిపిస్తారు. వీటిని తెలుసుకోవాలి.
* మార్పునకు సిద్ధంగా ఉండాలి. ఉద్యోగం మారవచ్చు, పరిస్థితి తలక్రిందులు కావచ్చు, మార్పునకు సిద్ధంగా ఉండాలి.
* మార్పు మీపై నెగిటివ్‌గానే కాదు పాజిటివ్‌గా కూడా ప్రభావం చూపవచ్చు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాను అనే విధంగా మీ మైండ్‌సెట్ ఉండాలి. లాభాలే కాదు నష్టాలనూ ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి.
* ఆయా రంగాల గురించి మనకు ఎంత తెలిసినా నిపుణుల నుంచి సలహాలు తీసుకోవడం తప్పు కాదు. ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సలహాలు తీసుకోవచ్చు.
* మంచి జరుగుతుంది అనే పాజిటివ్ ఆలోచన లేనిదే ఏదీ సాధించలేరు. ఆర్థిక అంశాలపై నిరంతరం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
-బి.మురళి(3-11-2019)

ఔను.. రోజులు మారాయి

కాగ్నిజెంట్ ఐటి కంపెనీలు ఒకేసారి పదమూడు వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఆర్థిక మాంధ్యం ప్రభావం అని కొందరి వాదన. కాదు కింద స్థాయిలో ఉద్యోగుల పనితీరు బాగాలేకపోయినా, ఆర్డర్స్ లేకపోయినా ఐటి కంపెనీలు తరుచుగా ఇలా తొలగించడం మామూలే అని కొందరు వాదిస్తున్నారు. ఈ ఒక్క కంపెనీయే కాదు చాలా ఐటి కంపెనీల్లో ఇలా పెద్ద సంఖ్యలో తరుచుగా ఉద్యోగులను తొలగించడం మామూలే అంటున్నారు. ఐబిఎం లాంటి కంపెనీలో సైతం భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించారు. కారణాలు ఏదైనా కావచ్చు హఠాత్తుగా ఉద్యోగాలు పోతున్నాయి.
***
కుటుంబంలో ఎంత మందైనా సంపాదిస్తూ ఉండొచ్చు, భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. కానీ మారిన ఈ పరిస్థితుల్లో ఒకే ఆదాయం సరిపోదు. కాగ్నిజెంట్ లాంటి పెద్ద సంస్థలోనే ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఇక చిన్న కంపెనీల్లో ఉద్యోగం అంటే కేవలం ఒక జీతం మీదనే ఆధారపడి జీవిస్తే భవిష్యత్తును తలుచుకుంటే ఏమనిపిస్తుంది. చేస్తున్న ఉద్యోగానికి ఏమన్నా ఐతే ఏమిటి? అనే ప్రశ్న మీకు మీరు వేసుకుంటే మీకేమనిపిస్తుంది. ఒకసారి అలాంటి ప్రశ్న వేసుకుని చూడండి.
***
డి మార్ట్ రమేష్ దమానీ చాలా సరదాఐన మనిషి. లక్ష కోట్ల రూపాయల ఆస్తిపరుడు. దేశంలోని టాప్ టెన్ సంపన్నుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. యువత స్టాక్‌మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేసేందుకు ప్రోత్సహించేందుకు జరిగే సెమినార్లలో ఆయన చేసే ప్రసంగాలను చూస్తుంటే అంత ఆస్తిపరుడైనా ఇంత సింపుల్‌గా ఎలా ఉంటారు? ఎలా మాట్లాడుతారు అనిపిస్తుంది.
ఒక సదస్సులో ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ హాజరైన యువతను ప్రశ్నించారు. మీ మొదటి నెల జీతంతో ఏం చేశారు అని.. సాధారణంగా ఎక్కువ మంది మొదటి నెల జీతంతో హోటల్‌లో పెద్ద పార్టీ ఇస్తారు. కారు కొంటారు. ఎంతో కాలం నుంచి ఇష్టమైన స్మార్ట్ఫోన్ కొంటారు. ఒక యువకుడు లేచి తాను మొదటి నెల జీతాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాను ఆనగానే అంత పెద్ద మనిషి కూడా ఉత్సాహాన్ని ఆపుకోలేక పోయారు. నాకే గనుకు ఓ అమ్మాయి ఉంటే నిన్ను అల్లుడిగా చేసుకునే వాడిని అని కితాబు ఇచ్చారు.
ఏదో సరదాగా అన్న మాట కాదు. మొదటి నెల జీతాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇనె్వస్ట్ చేయడం అంటే భవిష్యత్తు పట్ల ఎంత ప్రణాళిక ఉందో స్పష్టం అవుతోంది.
తన కుమారుడు అమెరికాలో చదువు కోసం వెళ్లినప్పుడు స్మార్ట్ ఫోన్ కోసం 40వేల రూపాయలు అడిగాడట! దానికి దమానీ నీకు 40వేలు ఇవ్వడానికి అభ్యంతరం ఏమీ లేదు. ఆ 40వేల రూపాయలను నీ పేరుతో స్టాక్ మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేస్తాను. మనం చేసిన 40వేల ఇనె్వస్ట్‌మెంట్ నష్టం రావచ్చు, లాభం రావచ్చు రెండింటికీ అవకాశం ఉంది. స్మార్ట్ఫోన్ కొంటే కాలం గడిచిన తరువాత కచ్చితంగా ధర తగ్గుతుంది. రెండింటిలో ఏది ఎంచుకుంటావు అని అడిగితే స్మార్ట్ఫోనే కావాలన్నాడట! ఆ వయసు అలాంటిది కాబట్టి విలువ తగ్గే వాటిపైనే ఆసక్తి చూపించాడని, కానీ కాలం గడిచిన కొద్ది అతనికి మనం సంపాదించిన డబ్బు విలువ తగ్గే వాటిపై ఖర్చు చేయాలా? విలువ పెరిగే వాటిపై ఇనె్వస్ట్‌మెంట్ చేయాలా? అనేది బాగా అర్థమైందని దమానీ చెప్పుకొచ్చారు.
***
కాగ్నిజెంట్ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు పోవడం, ఒకే ఆదాయంపై ఆధారపడితే కలిగే ప్రమాదం, మొదటి నెల నుంచే ఇనె్వస్ట్ మెంట్ ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేనివి అనుకోవద్దు.
సంబంధం ఉంది. ఎంత పెద్ద కంపెనీ కావచు, ఎంత పెద్ద జీతం అయినా కావచ్చు ఒకే ఆదాయం పై ఆధారపడడం ఈ కాలంలో చాలా ప్రమాదం. అనుకోనిది ఏమైనా జరిగితే ? ఉద్యోగం పోతే....
ఒకే ఆదాయంపై ఆధారపడడం ఈ రోజుల్లో ప్రమాదకరం. దీని వల్లనే చాలా మంది ఉద్యోగులు తెలియని స్ట్రైస్‌తో అనారోగ్యం పాలవుతున్నారు. ఒక ఆదాయం ఆగిపోయినా కుటుంబం గడపడానికి మరో ఆదాయం ఉంది అనే ధైర్యం వేరుగా ఉంటుంది.
మొదటి నెల జీతం నుంచే సాధ్యమైనంత పొదుపు చేసి ఇనె్వస్ట్ చేయడం ద్వారా కొంత కాలానికి జీతంలా ఆదాయం వస్తుంది. జీతంతో కుటుంబం గడిచిపోయినా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఇనె్వస్ట్‌మెంట్ ఆదాయం ఉపయోగపడుతుంది.
జీతం వల్ల ఇల్లు గడిచిపోతుంది కానీ సంపన్నులు కాలేరు. కానీ అదే ఇనె్వస్ట్‌మెంట్ ద్వారా వచ్చే రెండవ ఆదాయం మిమ్ములను సంపన్నులుగా మారుస్తుంది.
ఉద్యోగం, జీతం చిన్నదా? పెద్దదా ? ఏదైనా కావచ్చు, ఎంత సాథ్యం ఐతే అంత పొదుపు చేయాలి, ఇనె్వస్ట్ చేయాలి. ఉద్యోగం ఉంటుందా? పోతుందా? అనే భయం నుంచి కాపాడేది ఆ ఇనె్వస్ట్‌మెంట్‌నే.
టాటా చైర్మన్ ఉద్యోగం కూడా పర్మనెంట్ కాదు. ఆ మధ్య టాటా చైర్మన్‌ను తొలగించిన విషయం తెలిసిందే! టాటా లాంటి కంపెనీకి చైర్మన్‌గా ఉన్న రతన్ టాటా కూడా ఇతర కంపెనీల్లో ఇనె్వస్ట్ చేస్తారు. ఆయన కూడా ఒకే ఆదాయంపై ఆధారపడి లేరు. మరి సామాన్య ఉద్యోగులు ఒకే ఆదాయంపై ఆధారపడి ఉండడం ఎంత ప్రమాదకరం.
జీతానికి తోడు పార్ట్‌టైంగా మరో పని చేస్తారా? చిన్న వ్యాపారం చేస్తారా? మీకు ఏది సాధ్యం ఐతే అది చేయవచ్చు. అవేవీ చేయడానికి సమయం లేదు అనుకుంటే స్టాక్ మార్కెట్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇనె్వస్ట్ చేయడానికి సమయంతో పని లేదు. ఎలా అవకాశం ఉంటే అలా రెండవ ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. అది ఎంత త్వరగా ప్రారంభం అయితే మీ ఆర్థిక భవిష్యత్తు అంత బాగుంటుంది.
-బి.మురళి(10-11-2019)

16, డిసెంబర్ 2019, సోమవారం

ఔను.. రోజులు మారాయి

కాగ్నిజెంట్ ఐటి కంపెనీలు ఒకేసారి పదమూడు వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఆర్థిక మాంధ్యం ప్రభావం అని కొందరి వాదన. కాదు కింద స్థాయిలో ఉద్యోగుల పనితీరు బాగాలేకపోయినా, ఆర్డర్స్ లేకపోయినా ఐటి కంపెనీలు తరుచుగా ఇలా తొలగించడం మామూలే అని కొందరు వాదిస్తున్నారు. ఈ ఒక్క కంపెనీయే కాదు చాలా ఐటి కంపెనీల్లో ఇలా పెద్ద సంఖ్యలో తరుచుగా ఉద్యోగులను తొలగించడం మామూలే అంటున్నారు. ఐబిఎం లాంటి కంపెనీలో సైతం భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించారు. కారణాలు ఏదైనా కావచ్చు హఠాత్తుగా ఉద్యోగాలు పోతున్నాయి.
***
కుటుంబంలో ఎంత మందైనా సంపాదిస్తూ ఉండొచ్చు, భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. కానీ మారిన ఈ పరిస్థితుల్లో ఒకే ఆదాయం సరిపోదు. కాగ్నిజెంట్ లాంటి పెద్ద సంస్థలోనే ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఇక చిన్న కంపెనీల్లో ఉద్యోగం అంటే కేవలం ఒక జీతం మీదనే ఆధారపడి జీవిస్తే భవిష్యత్తును తలుచుకుంటే ఏమనిపిస్తుంది. చేస్తున్న ఉద్యోగానికి ఏమన్నా ఐతే ఏమిటి? అనే ప్రశ్న మీకు మీరు వేసుకుంటే మీకేమనిపిస్తుంది. ఒకసారి అలాంటి ప్రశ్న వేసుకుని చూడండి.
***
డి మార్ట్ రమేష్ దమానీ చాలా సరదాఐన మనిషి. లక్ష కోట్ల రూపాయల ఆస్తిపరుడు. దేశంలోని టాప్ టెన్ సంపన్నుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. యువత స్టాక్‌మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేసేందుకు ప్రోత్సహించేందుకు జరిగే సెమినార్లలో ఆయన చేసే ప్రసంగాలను చూస్తుంటే అంత ఆస్తిపరుడైనా ఇంత సింపుల్‌గా ఎలా ఉంటారు? ఎలా మాట్లాడుతారు అనిపిస్తుంది.
ఒక సదస్సులో ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ హాజరైన యువతను ప్రశ్నించారు. మీ మొదటి నెల జీతంతో ఏం చేశారు అని.. సాధారణంగా ఎక్కువ మంది మొదటి నెల జీతంతో హోటల్‌లో పెద్ద పార్టీ ఇస్తారు. కారు కొంటారు. ఎంతో కాలం నుంచి ఇష్టమైన స్మార్ట్ఫోన్ కొంటారు. ఒక యువకుడు లేచి తాను మొదటి నెల జీతాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాను ఆనగానే అంత పెద్ద మనిషి కూడా ఉత్సాహాన్ని ఆపుకోలేక పోయారు. నాకే గనుకు ఓ అమ్మాయి ఉంటే నిన్ను అల్లుడిగా చేసుకునే వాడిని అని కితాబు ఇచ్చారు.
ఏదో సరదాగా అన్న మాట కాదు. మొదటి నెల జీతాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇనె్వస్ట్ చేయడం అంటే భవిష్యత్తు పట్ల ఎంత ప్రణాళిక ఉందో స్పష్టం అవుతోంది.
తన కుమారుడు అమెరికాలో చదువు కోసం వెళ్లినప్పుడు స్మార్ట్ ఫోన్ కోసం 40వేల రూపాయలు అడిగాడట! దానికి దమానీ నీకు 40వేలు ఇవ్వడానికి అభ్యంతరం ఏమీ లేదు. ఆ 40వేల రూపాయలను నీ పేరుతో స్టాక్ మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేస్తాను. మనం చేసిన 40వేల ఇనె్వస్ట్‌మెంట్ నష్టం రావచ్చు, లాభం రావచ్చు రెండింటికీ అవకాశం ఉంది. స్మార్ట్ఫోన్ కొంటే కాలం గడిచిన తరువాత కచ్చితంగా ధర తగ్గుతుంది. రెండింటిలో ఏది ఎంచుకుంటావు అని అడిగితే స్మార్ట్ఫోనే కావాలన్నాడట! ఆ వయసు అలాంటిది కాబట్టి విలువ తగ్గే వాటిపైనే ఆసక్తి చూపించాడని, కానీ కాలం గడిచిన కొద్ది అతనికి మనం సంపాదించిన డబ్బు విలువ తగ్గే వాటిపై ఖర్చు చేయాలా? విలువ పెరిగే వాటిపై ఇనె్వస్ట్‌మెంట్ చేయాలా? అనేది బాగా అర్థమైందని దమానీ చెప్పుకొచ్చారు.
***
కాగ్నిజెంట్ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు పోవడం, ఒకే ఆదాయంపై ఆధారపడితే కలిగే ప్రమాదం, మొదటి నెల నుంచే ఇనె్వస్ట్ మెంట్ ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేనివి అనుకోవద్దు.
సంబంధం ఉంది. ఎంత పెద్ద కంపెనీ కావచు, ఎంత పెద్ద జీతం అయినా కావచ్చు ఒకే ఆదాయం పై ఆధారపడడం ఈ కాలంలో చాలా ప్రమాదం. అనుకోనిది ఏమైనా జరిగితే ? ఉద్యోగం పోతే....
ఒకే ఆదాయంపై ఆధారపడడం ఈ రోజుల్లో ప్రమాదకరం. దీని వల్లనే చాలా మంది ఉద్యోగులు తెలియని స్ట్రైస్‌తో అనారోగ్యం పాలవుతున్నారు. ఒక ఆదాయం ఆగిపోయినా కుటుంబం గడపడానికి మరో ఆదాయం ఉంది అనే ధైర్యం వేరుగా ఉంటుంది.
మొదటి నెల జీతం నుంచే సాధ్యమైనంత పొదుపు చేసి ఇనె్వస్ట్ చేయడం ద్వారా కొంత కాలానికి జీతంలా ఆదాయం వస్తుంది. జీతంతో కుటుంబం గడిచిపోయినా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఇనె్వస్ట్‌మెంట్ ఆదాయం ఉపయోగపడుతుంది.
జీతం వల్ల ఇల్లు గడిచిపోతుంది కానీ సంపన్నులు కాలేరు. కానీ అదే ఇనె్వస్ట్‌మెంట్ ద్వారా వచ్చే రెండవ ఆదాయం మిమ్ములను సంపన్నులుగా మారుస్తుంది.
ఉద్యోగం, జీతం చిన్నదా? పెద్దదా ? ఏదైనా కావచ్చు, ఎంత సాథ్యం ఐతే అంత పొదుపు చేయాలి, ఇనె్వస్ట్ చేయాలి. ఉద్యోగం ఉంటుందా? పోతుందా? అనే భయం నుంచి కాపాడేది ఆ ఇనె్వస్ట్‌మెంట్‌నే.
టాటా చైర్మన్ ఉద్యోగం కూడా పర్మనెంట్ కాదు. ఆ మధ్య టాటా చైర్మన్‌ను తొలగించిన విషయం తెలిసిందే! టాటా లాంటి కంపెనీకి చైర్మన్‌గా ఉన్న రతన్ టాటా కూడా ఇతర కంపెనీల్లో ఇనె్వస్ట్ చేస్తారు. ఆయన కూడా ఒకే ఆదాయంపై ఆధారపడి లేరు. మరి సామాన్య ఉద్యోగులు ఒకే ఆదాయంపై ఆధారపడి ఉండడం ఎంత ప్రమాదకరం.
జీతానికి తోడు పార్ట్‌టైంగా మరో పని చేస్తారా? చిన్న వ్యాపారం చేస్తారా? మీకు ఏది సాధ్యం ఐతే అది చేయవచ్చు. అవేవీ చేయడానికి సమయం లేదు అనుకుంటే స్టాక్ మార్కెట్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇనె్వస్ట్ చేయడానికి సమయంతో పని లేదు. ఎలా అవకాశం ఉంటే అలా రెండవ ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. అది ఎంత త్వరగా ప్రారంభం అయితే మీ ఆర్థిక భవిష్యత్తు అంత బాగుంటుంది.
-బి.మురళి(10-11-2019)

ఏదీ శాశ్వతం కాదు.

ఏదీ శాశ్వతం కాదు.. అంటే ఇదేదో మెట్టవేదాంతం అనిపిస్తోంది. కాదు టెక్నాలజీ పెరిగిన తరువాత, ప్రపంచం ఒక గ్రామంగా మారిన తరువాత మన జీవితాల్లో ఏదీ శాశ్వతం కాదు అనేది అర్థం అవుతోంది.
***
ఆ దేవుడు మనల్ని చల్లగా చూడాలని మొక్కుకుంటాం. మరి మనల్ని చల్లగా చూసే దేవుడి గుడిలో పూజాపునస్కారాలు జరగాలి అంటే...
భక్తులు సమర్పించే కానుకల విలువ అంతంత మాత్రంగానే ఉంటుంది. ఏవో కొన్ని ఆలయాలను మినహాయిస్తే ఆదాయం వచ్చే ఆలయాలు నామమాత్రమే. వేల సంవత్సరాల క్రితం అలయాలు నిర్మించిన వారికి ఇదే ఆలోచన వచ్చింది. మనల్ని కాపాడమని ఆలయానికి వెళ్లి దేవుడ్ని వేడుకుంటాం. మరి అలాంటి ఆలయం నాలుగు కాలాల పాటు చల్లగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే ఆలోచన వేల సంవత్సరాల క్రితమే చేశారు. దాదాపు ప్రతి ఆలయానికి మాన్యాలు ఉంటాయి. అంటే దేవాలయ భూములు. రాజుల కాలంలో రాజులు, లేదా సంపన్నులు ఆలయాన్ని నిర్మించినప్పుడు ఆలయ నిర్వహణ కోసం భూములు ఇచ్చే వాళ్లు. ఆ భూములపై వచ్చే వ్యవసాయ ఆదాయంతోనే అలయాలను నిర్వహించే వారు. ఒక ఆలయాన్ని నిర్మించినప్పుడు అది నాలుగు కాలాల పాటు పచ్చగా ఉండాలి అంటే ఏం చేయాలి అనే ఆలోచన వేల సంవత్సరాల క్రితం నాటి మన పెద్దలకే వచ్చినప్పుడు .... మన జీవితానికి సంబంధించిన ఈ ఆలోచన మనకు రావలసిన అవసరం లేదా?
భక్తుల నుంచి కానుకల వచ్చినా రాకపోయినా మాన్యాల వల్ల ఆలయం బతికి పోతుంది. మరి మనం? ఆలయాలకు మాన్యాల రూపంలో ఉండే భరోసా మన జీవితాలకు అవసం లేదా?
***
ఒక కాలంలో ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ ఉంది అంటే సంపన్నులు అని అర్థం. బిఎస్‌ఎన్‌ఎల్ మాత్రమే ఉన్నప్పుడు టెలిఫోన్ కనెక్షన్ కావాలి అంటే దాదాపు 1995 వరకు కూడా ఐదారేళ్లపాటు నిరీక్షిస్తే కానీ కనెక్షన్ లభించేది కాదు. హైదరాబాద్ నగరం నుంచి ఓ వంద కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామానికి ఫోన్ చేయాలన్నా ఆ రోజుల్లో టెలిఫోన్ ఎక్సెంజ్‌కు వెళ్లి గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఫోన్ కనెక్షన్ కోసమో, అడ్రస్ మార్పు కోసమే టెలిఫోన్ ఎక్సెంజ్‌కు వెళితే ఆక్కడి సిబ్బంది చుక్కలు చూపించే వారు. అలాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం దొరకడం అంటే జీవితానికి అంతకు మించిన భరోసా ఏముంటుంది అనే ధీమా ఉండేది.
అలాంటి బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు సంక్షోభంలో పడింది. 80వేల మంది ఉద్యోగులకు విఆర్‌ఎస్ ఇచ్చి ఖర్చు తగ్గించుకుని సంస్థను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. విఆర్‌ఎస్ ప్రకటించగానే రెండు రోజుల్లోనే 40వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఆ సంస్థ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో సిబ్బందికి అర్థం అయింది. అందుకే ఇచ్చిన కాడికి తీసుకుని ఏదో ఒకటి చూసుకోవాలి అనుకుంటున్నారు.
ఒక్క కాల్ కోసం గంటల తరబడి నిరీక్షించిన ఆ కాలంలో బిఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగాలు ఊడిపోవచ్చు అనే ఆలోచన ఎవరికీ ఊహకు కూడా వచ్చి ఉండదు.
***
ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో అంత కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఫోటోలు ఉన్నాయి. ఇంత ఎక్కువ స్థాయిలో ఫోటోలను చూస్తున్న కాలం ఇంతకు ముందెన్నడూ లేదు. ఫోటోలకు ఇంత డిమాండ్ పెరిగింది అంటే ఫోటోలకు సంబంధించిన వ్యాపారంలో ఉన్న సంస్థలకు లాభాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చి ఉండాలి కదా?
కాదు... దీనికి పూర్తిగా భిన్నంగా జరిగింది. ఫోటోగ్రఫీ వ్యాపారంలో ప్రపంచాన్ని శాసించిన పోలరాడో వంటి సంస్థలు మూత పడ్డాయి. ఉద్యోగులు రోడ్డున పడ్డారు.
ఇలా ఎందుకు జరిగింది అంటే టెక్నాలజీలో వచ్చిన మార్పు. టెలికాం రంగంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించిన తరువాత బిఎస్‌ఎన్‌ఎల్ ఏకస్వామ్యానికి బీటలు పడ్డాయి. స్మార్ట్ఫోన్‌లో రోజుకు వందల ఫోటోలు తీసుకునే సౌకర్యం వచ్చిన తరువాత అప్పటి వరకు ఫోటోగ్రఫీ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన కంపెనీలు మూత పడ్డాయి. కెమెరాలు తయారు చేసే కంపెనీలు, ఫోటోగ్రఫీకి అవసరం అయిన పేపర్, కెమికల్స్, ఫిల్మ్ తయారీ కంపెనీలన్నీ దెబ్బతిన్నాయి.
ఇప్పుడు ఫోటో అనేది పేపర్ మీద కనిపించాల్సిన అవసరం లేదు. స్మార్ట్ఫోన్‌లో కనిపిస్తుంది. ఇది టెక్నాలజీ తెచ్చిన మార్పు.
ఈ మార్పులను మనం ఊహించలేం. కానీ మార్పులు అనివార్యం అని గ్రహించాలి.
***
ఒక ఉద్యోగి తన ఉద్యోగాన్ని నిలుపుకోవాలి అంటే మార్పులను ఎప్పటికప్పుడు గ్రహించాలి, నైపుణ్యాలను పెంచుకోవాలి. అలా అయితేనే సవాళ్లను తట్టుకుని నిలబడతాడు. టెక్నాలజీ అనేది ఆ రంగంలో ఉన్న నిపుణుల పైనే కాదు... టెక్నాలజీ గురించి ఏ మాత్రం తెలియని వారిపై కూడా గణనీయంగా ప్రభావం చూపుతుంది.
సెల్‌ఫోన్ల విప్లవానికి ముందు హైదరాబాద్ నగరంలో ఎటు చూసినా ఎస్‌టిడి, ఐఎస్‌టిడి బూత్‌లు కనిపించేవి. వాటి ముందు పెద్ద పెద్ద క్యూలు. వేలాది మంది వీటిపై ఆధారపడి జీవించే వారు. కుటుంబం గడిచిపోవడానికి అవసరం అయినంత వరకు బాగానే సంపాదించేవారు. కొందరు అప్పటి వరకు తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలి టెలిఫోన్ బూత్‌లు ఏర్పాటు చేసుకున్నారు. సెల్‌ఫోన్ల విప్లవం వారి జీవితాల్లో కోలుకోలేని దెబ్బతీసింది. ప్రతి వారి చేతిలో సెల్‌ఫోన్ ఉన్నప్పుడు టెలిఫోన్ బూత్‌ల వైపు చూసేదెవరు? వీటిపై ఆధారపడి జీవించే సామాన్యులు ఎప్పటికప్పుడు టెక్నాలజీలో వచ్చే మార్పులను ఆవగాహన చేసుకోవడం సాధ్యమా? అసాధ్యం. నిజానికి సాంకేతిక నిపుణులు సైతం ఆ మార్పును ముందుగా ఊహించలేదు. సాధ్యం కాదు.
కానీ ఈ రోజుల్లో మనం ఒక్కటి ఊహించగలం. ఏదీ శాశ్వతం కాదు. ఏ ఉద్యోగం శాశ్వతం కాదు. ఏ మార్పు ఏ కంపెనీ పుట్టుకకు దోహదం చేస్తుందో, ఏ కంపెనీని మూసేస్తుందో ఎవరికీ తెలియదు. వీటికి సిద్ధంగా ఉండాలంటే ఏదీ శాశ్వతం కాదు అని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఉద్యోగం, వృత్తి ఏదైనా కావచ్చు, ఆదాయం ప్రారంభం అయిన మొదటి నెల నుంచే ఏదీ శాశ్వతం కాదు అని గ్రహించి భవిష్యత్తు కోసం పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్ అనే మంత్రాన్ని ఆశ్రయించడం ఒక్కటే మార్గం.
ఒక్క ఆదాయంపైనే ఆధారపడకుండా ఒకిటికి మించిన ఆదాయంపై దృష్టిసారించాలి.
.-బి. మురళి(17-11-2019)

గుజరాతీల విజయరహస్యం

విజయ సూత్రాలు ఎక్కడున్నా నేర్చుకోవాలి తప్పు లేదు. ప్రపంచంలో పలు యూనివర్సిటీలు వివిధ అంశాలపై అధ్యయనం చేస్తారు. ఆ అధ్యయన ఫలితాలపై అన్ని దేశాలు ఆసక్తి చూపిస్తాయి. అవి మనకు ఏమన్నా ఉపయోగపడతాయా? అని..
దేశాల్లోనే కాదు వివిధ రాష్ట్రాల్లో సక్సెస్ అయిన ఫార్ములాలను ఇతర ప్రాంతాల వారు కూడా అధ్యయనం చేస్తారు. ఎక్కడో బంగ్లాదేశ్ వంటి చిన్న దేశంలో చిన్నతరహా పొదుపుపై ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాలు, పెద్ద దేశాలు కూడా ఈ మార్గాన్ని అనుసరించాయి.
గుజరాతీల విజయ రహస్యం మొత్తం ప్రపంచానికే ఆశ్చర్యం కలిగిస్తుంది. పరిశ్రమలు అనగానే గుర్తుకు వచ్చే పేరు గుజరాత్. గుజరాత్ సంస్కృతి అంటే అదేదో కేవలం పారిశ్రామిక వేత్తల సంస్కృతి అని భావించాల్సిన అవసరం లేదు. అది మొత్తం ఆ రాష్ట్ర ప్రజల సంస్కృతి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం ఎక్కువగా ఐటి ఉద్యోగాలపై దృష్టిసారిస్తాం. అదే కేరళ ప్రజలు గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి ప్రాధాన్యత ఇస్తారు. అలానే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఇలాంటి మంచి కనిపిస్తే అనుసరించాల్సిందే.
మనం ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటాం కానీ గుజరాతీలు మాత్రం ఉద్యోగాలపై పెద్దగా ఆసక్తి చూపరు. వ్యాపారం అనేది వారి సంస్కృతిలో భాగంగా ఉంటుంది. ఈరోజుల్లో ప్రభుత్వ ప్రైవేటు అనే తేడా లేదు. ఎక్కడా ఉద్యోగ భద్రత లేదు. మారుతున్న ఈ కాలంలో గుజరాతీల నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది.
ఎదిగిన వారిని చూసినా, సంపన్నులను చూసినా సహజంగా మనలో కొంత అసూయ పుడుతుంది. వాళ్లేదో తప్పు చేశారు అన్నట్టుగా చూస్తాం. దేశంలో సంపన్నుల్లో గుజరాతీలే ముందు వరుసులో ఉన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలంతా గుజరాతీలే. చివరకు అమెరికాలో 50శాతం మోటల్స్ గుజరాతీల చేతిలోనే ఉన్నాయి.
చివరకు అల్లకల్లోలంగా ఉన్న పాకిస్తాన్‌లో బడా పారిశ్రామిక వేత్తల్లో ఎక్కువ మంది దేశ విభజన సమయంలో ఇప్పటి గుజరాత్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ వెళ్లి పరిశ్రమలు స్థాపించిన వారే.
కులం, మతం, జిల్లా అనే తేడా లేదు. గుజరాత్ ప్రాంతానికి చెందిన ప్రజల సహజ లక్షణం వ్యాపారం. ఉద్యోగం కోసం తంటాలు పడడం కాదు, ఉద్యోగాలు కల్పించడమే వారి లక్షణం. మోఘల్ పాలకులకు వడ్డీలకు డబ్బులు ఇచ్చిన వ్యాపారులు వీరే.
ఇటీవల కోరాలో జరిగిన ఒక చర్చలో గుజరాతీల్లో ఈ ప్రత్యేక లక్షణానికి కారణం ఏమిటి? అనే అంశంపై ఆరోగ్యకరమైన చర్చ జరిగింది. ఒక గుజరాతీ తమ రాష్ట్ర ప్రజల్లో కనిపించే సహజ లక్షణాలే తమను ఇతరుల కన్నా ప్రత్యేకంగా నిలబెడుతున్నట్టు చెప్పుకొచ్చారు.
* మేం 18 గంటల పాటు కష్టపడతాం .
* ఈ రోజు మేం ఏ స్థితిలో ఉన్నా ప్రతి రోజు ఇంత కన్నా మెరుగైన స్థితి కోసం ప్రతి రోజు ప్రయత్నిస్తాం.
* ఇతరుల విజయాన్ని చూసి కుళ్లు కోవడానికి మా శక్తిని అస్సలు ఖర్చు చేయం. పనికి మాలిన విషయాలపై దృష్టి పెట్టం. మా కున్న శక్తి సామర్థ్యాలను మేం ఎలా బాగుపడాలి అనే అంశంపై కేంద్రీకరిస్తాం.
* మా పొరుగు వారు బాగుపడితే మేం కుళ్లుకోం. బాగుపడిన వారి ఇంటి పక్కన ఉంటాం అని గర్వంగా చెప్పుకొంటాం.
* మమ్ములను ఎవరైనా మోసం చేస్తే, వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా అనే ఆలోచనలతో మునిగిపోం. పోతే పోయింది అని మళ్లీ బాగుపడేందుకు ప్రయత్నిస్తాం.
* రెండు చేతులా కష్టపడితే తిండికి సరిపోతుంది. కానీ సంపన్నుడు కావాలంటే కొందరికి పని కల్పించాలి అని భావిస్తాం.
* మద్యం వల్ల జీవితాలను నాశనం చేసుకోవడం గుజరాతీల్లో చాలా తక్కువ.
* శ్రీకృష్ణుడు గీతలో బోధించినట్టు ఖర్మను ఆచరించండి ఫలితాన్ని నాకు వదిలేయండి అనే మాటను నమ్ముతాం. కష్టపడి పని చేసినప్పుడు ఫలితం వచ్చితీరుతుంది అని నమ్ముతాం.
* ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసం కోల్పోం. అంతా కోల్పోయినా జీరో నుంచి తిరిగి ప్రారంభించవచ్చు అని నమ్ముతాం.
* చాలా మందిలో డబ్బు పాపిష్టిది. డబ్బు తప్పు అనే భావన ఉంటుంది. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఇదే చెబుతారు. ఇది మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కానీ గుజరాతీలు మాత్రం ఇలా చెప్పరు. శక్తి మేరకు డబ్బు సంపాదించాలని చెబుతారు. ఏ పని చిన్నది కాదు పెద్దది కాదు అని చెబుతారు. వ్యాపారాన్ని గౌరవిస్తారు. డబ్బు గురించి, డబ్బున్న వారి గురించి అస్సలు వ్యతిరేకంగా మాట్లాడరు. డబ్బును దైవంగా భావిస్తారు. డబ్బును గౌరవిస్తారు. సంపాదించే వారిని గౌరవిస్తారు. డబ్బు సంపాదించడం అంటే అదేదో నేరం అన్నట్టుగా భావించే వారు చాలా మంది ఉన్నారు. కానీ గుజరాత్‌లో అలా ఉండదు. కాబట్టే వాళ్లు దేశంలో ఏ మూలకు వెళ్లినా వ్యాపారం చేయగలుగుతున్నారు. చదువు అంతగా లేకపోయినా వీరిలో వ్యాపార నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది. తరగతి గదిలో చదువు కన్నా కుటుంబం నుంచే వీరికి వ్యాపారానికి సంబంధించిన శిక్షణ ఉంటుంది. వీరికి వ్యాపార నైపుణ్యం సహజంగా అబ్బుతుంది. ఉద్యోగంతో ఎన్నటికీ సంపన్నులం కాలేం, వ్యాపారంతోనే సంపన్నులం అవుతాం అని వీరు గట్టిగా నమ్ముతారు.
ఎంత చిన్న వ్యాపారం చేయడానికి కూడా వీరు వెనుకాడరు. అదే సమయంలో ఏది చేసినా పెద్ద ఎత్తున చేయాలని భావిస్తారు. ఆర్థిక సంక్షోభం, కంపెనీల ఢోలాయమానం, మూత పడుతున్న కంపెనీలు, ఉద్యోగాలు పోతున్న ఈ కాలంలో గుజరాతీల్లోని ఈ లక్షణాలపై యువత దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. జీవితానికి ఉపయోగపడే మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి.
-బి. మురళి(15-12-2019)

13, డిసెంబర్ 2019, శుక్రవారం

ఓషో ధననీతి

‘పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారు, సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారు. ఎంత కాలమిది. ఎందుకీ ప్రజాస్వామ్యం. అంబానీ సంపద నానాటికి పెరిగిపోతోంది. పేదలు అప్పుల్లో మునిగిపోతున్నారు.’ ఇలాంటి డైలాగులు మనం చాలా సార్లు విని ఉంటాం. కథల్లో, సినిమాల్లో, సీరియల్స్‌లో, నాయకుల ఉపన్యాసాల్లో ఇవి సర్వసాధారణం. చాలా మంది మేధావులు, రచయితలు పేదరికాన్ని గ్లోరిఫై చేస్తుంటారు. అదేదో పూర్వ జన్మ సుకృతం అన్నట్టుగా సినిమాల్లో చూపిస్తుంటారు. ధనానికి పేదలం కానీ గుణానికి పేదలం కాదు బాబు అంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ధనవంతుడైన యజమాని ముందు డైలాగు చెబుతాడు.
ఇలాంటి వాదన వినిపించినప్పుడు సాధారణంగా రాజకీయ నాయకులు కావచ్చు, సంపన్నులు కావచ్చు, సాధారణంగా సమాధానం చెప్పరు. నిజాయితీగా సమాధానం చెబితే అది తమకు సమస్య అవుతుంది. కాబట్టి వౌనంగా ఉండిపోతారు.
కానీ మీరు నిజంగా ధనాన్ని ప్రేమిస్తే, సంపన్నులు కావాలి అనుకుంటే ఇలాంటి అనారోగ్యకరమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి. అంబానీ డబ్బు సంపాదించడమే తప్పా? అంటే అతను కూడా ఓ ఫైలు పట్టుకుని ఉద్యోగం కోసం చెప్పులు అరిగిపోయేట్టుగా రోడ్ల మీద తిరిగితే బాగుంటుందా? చాలా మంది రచయితల దృష్టిలో వీళ్లే హీరోలు. పేదరికాన్ని ప్రేమించే వారికి పేదరికమే దక్కుతుంది. చట్టబద్ధంగా డబ్బు సంపాదించడం తప్పేమీ కాదు. సంపన్నులను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఒక పెట్రోల్ బంకులో పని చేసిన ధీరూబాయి అంబానీ కొన్ని లక్షల మందికి ఉపాధి చూపే స్థాయికి ఎలా ఎదిగాడు. శ్రీమంతుడిగా ఎదగడానికి అతను చేసిన కృషి ఏమిటి? అనే దానిపై దృష్టి పెడితే మనకు ఉపయోగపడే విషయాలు తెలియవచ్చు. అంతే కానీ సంపదన కలిగి ఉండడం అంటే దేశద్రోహం అన్నట్టుగా భావించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
ఇటీవల ఓషో ఉపన్యాసం ఒకటి వింటే... సంపన్నులను విమర్శించే వారికి సున్నితంగా ఆయన ఇచ్చిన సమాధానం అద్భుతం అనిపించింది.
ఇలాంటి వాదనకు బహుశా ఇంత చక్కని సమాధానం ఇప్పటి వరకు ఎవరూ ఇచ్చి ఉండరు.
ఓషో ఉపన్యాసం ఇస్తుండగా, ఒకరు ప్రశ్న రాసి పంపించారు. దేశంలో ఎంతో మంది పేదలు ఉండగా, మీరు రోల్స్ రాయిస్ కార్లలో తిరగడం ఎందుకు? ఆ డబ్బును పేదలకు పంచవచ్చు కదా? అని ప్రశ్నించారు.
ఆయన సమాధానం ఇలా సాగింది...
‘‘దేశంలో 70కోట్ల మంది డబ్బు అవసరం ఉన్న పేదలు ఉన్నారు. నేను కారు అమ్మితే ఎంత మందికి ఇవ్వగలను. సరే మీరు ముందుకు వచ్చారు సంతోషం. నీ వాటాగా ఓ పైసా వస్తుంది. వచ్చి తీసుకో. మిగిలిన పేదవారు వచ్చినప్పుడు తలా ఓ పైసా ఇస్తాను. చిత్రమేమంటే నేను కారులో కాకుండా నడుస్తూ వెళ్లినప్పుడు కూడా దేశంలో ఇంత మంది పేదలే ఉన్నారు. నన్ను ప్రశ్నించిన వారిని అడుగుతున్నాను. పేదలకు మీరేం ఇచ్చారు. మీ సైకిల్ అమ్మి పేదలకు ఇచ్చారా? మీ ఇళ్లు అమ్మి ఇచ్చారా? మీ షాప్ అమ్మి ఇచ్చారా? ఎందుకివ్వడం లేదు. అవసరం అయిన పేదలు ఎంతో మంది ఉన్నారు. కదా? వారిని మీరు ఆదుకోరా! డబ్బు అవసరం అయిన పేదవారికి ఏం చేశారు. సంపన్నులను పేదలకు సంపద ఇచ్చేయాలి? మరి ఇంతకూ పేదలేం చేయాలి. మరి పేదలు ఏం చేయాలి? మరింత మంది పేదలను పుట్టించడమే వారి పని అంతే కదా?
డబ్బు సంపాదించిన వారు పేదల గురించి ఆలోచిస్తే మరి పేదలేం చేయాలి?’’
ఇలా సాగుతుంది ఓషో ప్రసంగం.
నిజమే కదా? పేదరికం ఓ వరం అన్నట్టు, డబ్బు సంపాదించడం పాప కార్యం అన్నట్టుగా చాలా మంది ఆలోచనలు. చట్టవిరుద్ధంగా సంపాదిస్తే తప్పవుతుంది కానీ చట్టబద్ధంగా తనకున్న అవకాశాలను ఉపయోగించుకుని సంపాదించడం తప్పేలా అవుతుంది. పైగా అవకాశాలను అందిపుచ్చుకోకుండా పేదరికంలో మగ్గిపోవడమే తమ ఘనకార్యం అని భావించడం తప్పవుతుంది. అలాంటి ఆలోచనలకు ప్రచారం కల్పించడం, ప్రోత్సహించడం తప్పవుంది.
చాలా మతాల్లో డబ్బు పాపిష్టిది అనే అభిప్రాయం కలిగించారు. సంపన్నుల పట్ల వ్యతిరేక భావన కలిగించారు. ఈ ఆలోచనలను మన బుర్ర నుంచి తొలగించాలి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి.
నీ పేదరికానికి నీ పూర్వ జన్మ కారణం అని కొన్ని మతాలు చెబితే, సమాజమే కారణం అని మార్క్స్ చెప్పాడు. బౌద్దం నయం నీ పరిస్థితికి నువ్వే కారణం అంటుంది అంటారు రజనీష్. ఎవరేం చెప్పినా మన పరిస్థితికి మనమే కారణం. మన నిర్ణయాలే మనల్ని తయారు చేస్తాయి. పేదరికంలో ఉండిపోవాలా? సంపన్నుడిగా మారాలా? అనేది నిర్ణయించుకోవలసింది ఎవరికి వారే. తల రాతల్లోనూ, చిలక జోస్యంలోనో మన భవిష్యత్తు ఉండదు. మన చేతిలో, మన నిర్ణయాల్లోనే మన భవిష్యత్తు ఉంటుంది. మనం ఏం కావాలో మనమే నిర్ణయించుకోవచ్చు. అంటే అదేదో అల్లా ఉద్దీన్ అద్భుత దీపం మాదిరిగా కోరుకున్నది ప్రత్యక్షం అవుతుంది అని కాదు..... మనం ఏం కావాలనుకుంటున్నాం, పేదలుగానే ఉండిపోవాలా? ఎదుగుబోదుగు లేని జీవితం గడపాలా? సంపన్నుడిగా మారాలా? అనే నిర్ణయం మన చేతిలోనే ఉంటుంది. నిర్ణయం తీసుకున్న తరువాత ఆ లక్ష్యాన్ని సాధించే విధంగా మన అడుగులు పడాలి. నిర్ణయం తీసుకోగానే సరిపోదు. దానికి తగిన కృషి ఉండాలి. మీ పేదరికానికైనా, మీ సంపన్నతకైనా మీరే కారణం. మీకు మీరే యజమాని. ముందుగా డబ్బు పాపిష్టిది అనే ఆలోచనలు తుడిచిపెట్టాలి. డబ్బును ఆహ్వానించాలి. గౌరవించాలి.
గౌరవం ఉన్న చోటే డబ్బు నిలుస్తుంది.

బి మురళి (24-11-2019 ధనం -మూలం )

బతకలేని పిహెచ్‌డిలు

సరస్వతి, ధనలక్ష్మి ఒకరు ఉన్న చోట మరొకరు ఉండరు అని ఓ నానుడి. పేదరికం నుంచి విముక్తి కావాలి అంటే చదువు ముఖ్యం. ఇది అందురూ నమ్మే మాట! ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటే రెండూ నిజమే.
ఇటీవల అమెరికాలో ఉన్నత విద్యావంతులు, పేదరికం అనే అంశంపై ఒక అధ్యయనం చేశారు. పిహెచ్‌డి డిగ్రీలు ఉన్నా పేదరికమే... ఉన్నత విద్యావంతుల్లో పేదరికం ఎందుకు అనే అంశంపై పలు ప్రాంతాల్లో అధ్యయనం చేసి ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు.
దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు 18్భషల్లో నిష్ణాతులు, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా పని చేసిన విశేష అనుభవం కలవారు. జ్ఞాన సంపన్నులు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గట్టెక్కించిన వారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పటి కేసు, దిగిపోయిన తరువాత కూడా కొనసాగింది. ఆ కేసు వాదించిన న్యాయవాదికి ఫీజు చెల్లించడానికి తన ఇంటిని అమ్మేశారు. పివి తెచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల ఎంతో మంది కోటీశ్వరులు అయ్యారు. ఆయన్ని నమ్ముకుని, ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని సంపాదించిన వారు ఉన్నారు. కానీ ఆర్థికంగా ఆయన పరిస్థితి మాత్రం అంతంత మాత్రమే. మరో మేధావి మన్మోహన్‌సింగ్ పరిస్థితి సైతం ఇంతే.
న్యాయవాదిగా బోలెడు సంపాదించిన ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. న్యాయవాదిగా సంపాదించిన డబ్బుతో మద్రాస్‌లో విలువైన భవనాలు కొనుగోలు చేసిన ఆయన చివరి దశలో పేదరికంలోనే గడిపారు.
ఇలాంటి వారిని చూశాక లక్ష్మీదేవికి, సరస్వతి దేవికి నిజంగానే పడదేమో అనిపిస్తుంది. అలాంటి మహనీయులు సంగతి వదిలేద్దాం. ఈ కాలంలో సామాన్యుల సంగతి చూద్దాం. ఎంతో మంది పిహెచ్‌డి చేసిన వారు కూడా ఉద్యోగం పేదరికంలో ఉండిపోయారు. ఉండిపోతున్నారు. పిహెచ్‌డి చేశారంటే వీరికి అ పారమైన జ్ఞానం ఉన్నట్టే కదా? మరెందుకు పేదరికంలో ఉన్నారు.
పిహెచ్‌డి అనేది ఒక డిగ్రీ సర్ట్ఫికెట్ మాత్రమే... జ్ఞానం వేరు సర్ట్ఫికెట్ వేరు. కొందరికి జ్ఞానంతో పాటు సర్ట్ఫికెట్ కూడా ఉంటుంది. కానీ చాలా మంది తాము పొందిన సర్ట్ఫికెట్‌నే తమ జ్ఞానం అనుకుంటున్నారు.
జ్ఞానం- సర్ట్ఫికెట్ రెండూ వేరు వేరు కాబట్టే చాలా మంది ప్రముఖ కంపెనీల యజమానుకు ఎంబిఎ పట్టా లేదు కానీ వేల మంది ఎంబిఏలకు ఉద్యోగాలు ఇచ్చారు.
సర్ట్ఫికెట్‌నే జ్ఞానం అనుకోవడం వల్ల వచ్చిన చిక్కు ఇది. ఎంబిఎ సర్ట్ఫికెట్ ఉన్నంత మాత్రాన వ్యాపారం గురించి వారి కంతా తెలుసు అనుకోలేం. దిగితే కానీ లోతు తెలియదు అన్నట్టు వారికి వ్యాపారం గురించి పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ మాత్రమే తెలుసు కానీ వ్యాపారంలో అనుభవం ఉండదు.
ఓ నలుగురు ఎంబిఏ విద్యార్థులు. వారు నివసించిన ప్రాంతాలు, కుటుంబ నేపథ్యాలు వేరు. చదివిన విశ్వవిద్యాలయాలు వేరు. ఎంబిఏ పూర్తి చేయగానే నలుగురు వివిధ కంపెనీల్లో ఉద్యోగంలో చేరారు. ఎంబిఏ పూర్తయిన వారికి జీతం సాధారణంగానే ఉంటుంది. వారికి ఉద్యోగం సంతృప్తి నివ్వలేదు. వ్యాపార రంగం గురించి ఇంతగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నాం, కానీ సంతృప్తి కలగడం లేదు. నలుగురం కలిసి ఏదైనా చేద్దాం అని రాయిపూర్‌లో ఈ నలుగురు గన్నావాలా కేఫ్‌ను ఏర్పాటు చేశారు. అంటే ఏమీ లేదు. చెరుకు రసం అమ్మే షాప్. ఐతే చదువుకున్న వాళ్లు కాబట్టి కొత్తదనం చూపించారు. చెరుకు బండిపై చెరుకు రసం ఎలా అమ్ముతారో మనకు తెలుసు. అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుంది. కానీ వీళ్లు దానికి కొత్త రూపం ఇచ్చారు. పరిశుభమ్రైన వాతావరణం, దానికో బ్రాండ్ నేం. చక్కని కేఫ్‌లో వాతావరణం ఎలా ఉంటుందో అలా. ఊహించని విధంగా పెరిగిన టర్నోవర్, జీతం కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఆదాయం. సందీప్ జైన్, వికాస్ ఖన్నా, అమిత్ అగ్రవాల్, అంకిత్ సర్వాగి. వీళ్లంతా రాయపూర్‌లోని సాలెం స్కూల్‌లో చదివారు. తరువాత వేరువేరు ప్రాంతాల్లో ఎంబిఏ చేశారు. మంచి కంపెనీల్లోనే ఉద్యోగాలు లభించినా సంతృప్తి కలగలేదు. ఇప్పుడు జీతం కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు.
ఆ మధ్య మద్రాస్‌కు చెందిన ఒక ఐఐటి విద్యార్థి కూడా ఐఐటి తరువాత మంచి ఆఫర్ వచ్చినా వద్దని ఇడ్లీ వ్యాపారం మొదలు పెట్టారు. నిజానికి తన తల్లి ఓ పేదరాలు ఇంటింటికి తిరిగి ఇడ్లీలు అమ్మి చదివించింది. కానీ అతను ఇడ్లీ వ్యాపారానికి తన జ్ఞానాన్ని కూడా జోడించి విజయం సాధించాడు.
డిగ్రీ సర్ట్ఫికెట్ మాత్రమే జ్ఞానం కాదు. అలా సర్ట్ఫికెట్‌నే జ్ఞానం అనుకునే వారు అక్కడే ఉండిపోతున్నారు. పిహెచ్‌డి ఐనా పేదరికమే అనే సర్వేలో తేలింది ఇదే.
స్కూల్‌లో చదువు చెబుతారు కానీ జీవితానికి అవసరం అయిన జ్ఞానం మనమే సంపాదించుకోవాలి. ఏ స్థాయి చదువు అయినా కావచ్చు, స్కూల్ మొదలుకొని విశ్వవిద్యాలయం వరకు అక్కడ ఉద్యోగులను తయారు చేసే చదువే ఉంటుంది కానీ సంపన్నులుగా మార్చే చదువు ఉండదు. లెక్కల్లో ఎంత జ్ఞాని అయినా కావచ్చు కానీ డబ్బులు సంపాదించే లెక్కలు వేరుగా ఉంటాయి. జీవితానినికి అవసరం అయిన డబ్బును ఉద్యోగం ద్వారా ఎలా సంపాదించుకోవాలో చదువు నేర్పుతుంది కానీ సంపన్నులు కావడానికి ఎలాంటి అలోచన ఉండాలో చదువు నేర్పించడం లేదు. మార్కులు, డిగ్రీలు జ్ఞానాకి కొలమానం కానే కావు.
ఎంబిఏ డిగ్రీతో ఒక పాన్ షాప్ కూడా నడపలేక పోవచ్చు, కానీ ఏ చదువు లేకపోయినా పాన్‌షాప్‌తో బోలెడు సంపాదించిన వారు ఉన్నారు. పెద్దగా చదువు లేని వారు దాదాపు 20ఏళ్ల వయసులోనే సంపాద కోసం ఏదో ఒక వృత్తిలో స్థిరపడితే, బాగా చదువుకున్న వారు 25ఏళ్ల వయసు తరువాత జీవనోపాధి కోసం ఉద్యోగ వేటలో పడతారు. అంటే చదువువారు ఉద్యోగం కోసం ప్రయత్నించే నాటికి పెద్దగా చదువులేని వారు అప్పటికే సంపాదనలో పడిపోయి ఐదేళ్లు అవుతుంది. చదువుకున్న ఉద్యోగిగి ఉద్యోగం పోతుందేమో అనే భయం ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వారికి ఇది కాకపోతే ఇంకో వ్యాపారం అనే ధైర్యం ఉంటుంది. వ్యాపారం మినహా తనకు మరో మార్గం లేదు అని గ్రహించడం వల్ల అతను సర్వశక్తులు వ్యాపారంలో పెడతారు. ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది సంపన్నులను తయారు చేయలేదు. ఉద్యోగులను మాత్రమే తయారు చేస్తుంది. చదువును వ్యతిరేకించడం కాదు. చదువు అంటే కేవలం డిగ్రీలే కాదు అని చెప్పడం. రాయిపూర్‌కు చెందిన ఆ నలుగురు యువకులు చదువు ద్వారా తాము గ్రహించిన జ్ఞానాన్ని, వ్యాపారం చేయాలనే తమ అభిరుచిని రెండింటిని కలపడం ద్వారా గనే్నకా రస్ కెఫ్ అనే కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఏ చదువుకున్నా, ఉద్యోగం చేసినా, వ్యాపారం అయిన నిజమైన జ్ఞానాన్ని గ్రహించాలి. ఐఐటి చదివినా, ఎంబిఎతో ఉద్యోగాల్లో చేరినా తమ జీవిత లక్ష్యం ఏమిటో గ్రహించారు. ఉద్యోగంతో సంపన్నులం కాలేం, వ్యాపారంతోనే అది సాధ్యం అని గ్రహించారు వినూత్నంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా పని చేయడం తప్పు కానీ సంపన్నులు కావాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ చిన్న పని నుంచి మొదలు పెట్టినా అది తప్పు కాదని నేటి తరం యువత కొందరు ఇతరులకు మార్గం చూపుతున్నారు.
-బి. మురళి(1-12-2019 ధనం -మూలం )

రిక్షా తొక్కే రాజకుటుంబం

డబ్బు సంపాదించడమే కాదు దాన్ని నిలుపుకోవడం కూడా ముఖ్యమే. ఇది తెలియకపోతే రోడ్డున పడతాం. సంపాదించడం కన్నా హోల్డ్ చేయడం చాలా మందికి కష్టం. జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లిన వారి జీవితాలు అంతిమ దశలో దయనీయంగా మారడానికి కారణం డబ్బును హోల్డ్ చేయలేకపోవడం. మార్వాడీలు సంపాదించడమే కాదు దాన్ని నిలుపుకోవాలి అంటారు. అది విన్నప్పుడు సంపాదించిన తరువాత నిలుపుకోక పోవడం ఏమిటి? అని పిస్తుంది కానీ అది నిజం కాదు. నిలుపుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. జీతం వచ్చిన వారం రోజులకే మన జేబులు ఖాళీ అవుతున్నాయి అంటే నిలుపుకోవడంలో మనం చాలా బలహీనంగా ఉన్నామని అర్థం. చేతికి వచ్చిన డబ్బు నిలుపుకోలేక పోతే మహామహా రాజులే రోడ్డున పడతారు.
దూరదర్శన్ మాత్రమే ఉన్న కాలంలో నిజాం వారసుడు ఒకరి ఇంటర్వ్యూ జాతీయ చానల్‌లో ప్రసారం అయింది. నవాబు వారసుడు ఐదులీటర్ల పెట్రోల్ తెప్పించుకుని కారులో పోస్తున్నాడు. మీ జీవితం ఎలా సాగుతుందని అతన్ని అడిగితే ఆస్తులు అమ్ముకొని వాటితో బతుకుతున్నామని చెప్పాడు. అదేంటి బోలెడు ఆస్తులు ఉన్నప్పుడు ఏదైనా వ్యాపారం చేయవచ్చు కదా? అని రిపోర్టర్ అడిగితే ... మీ ఇంట్లో మీరు వ్యాపారం చేస్తారా? అలానే ఈ దేశమే మా సొంతం కదా? ఇక మేం వ్యాపారం చేయడం ఏమిటి? అని పించింది అందుకే వ్యాపారం ఆలోచన రాలేదు అన్నాడు. నాంపల్లిలో నిజాం వారసులకు సంబంధించిన ట్రస్ట్ ఒకటి ఉంది. వందలాది మంది నిజాం వారసులు బతుకు తెరువు కోసం అక్కడ నెల నెలా పెన్షన్ తీసుకోవడానికి క్యూలో నిలబడతారు.
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రాజులు రాజ్యాలు పోయిన తరువాత బతుకు తెరువు కోసం తంటాలు పడుతున్నారు. దేశ విభజన సమయంలో జూనాఘడ్ రాజు తమ జూనాఘడ్‌ను పాకిస్తాన్‌లో కలిపేయాలని ప్రయత్నించి, సాధ్యం కాకపోవడంతో పాకిస్తాన్ పారిపోయాడు. పాకిస్తాన్‌లో రాజరికం బతుకు బతుకుతానని ఊహించి ఆస్తులు వదిలి పారిపోయి చివరకు పాక్‌లో దయనీయమైన బతుకు సాగిస్తున్నాడు.
నిజాం రాజు వారసుడు ప్రిన్స్ ముఖరంజా విదేశాల్లో అద్దె ఇంటిలో సామాన్య జీవనం సాగించారు. చివరి నిజాం ప్రపంచంలో కెల్లా సంపన్నుడిగా టైమ్స్ ముఖచిత్రాన్ని అలంకరించారు. అతని వద్ద ఉన్న వజ్రాలు, బంగారు నగలు ఒక పెద్ద ఆటస్థలం నిండిపోయేట్టుగా ఉండేవి అంటారు. నిజాం ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వారసులు ఆస్తి కోసం దాదాపు నాలుగు వందల కేసులు వేశారు. వారసత్వం ముఖరంజాకు దక్కింది. చివరి దశలో ముఖరంజా అద్దె గదిలో అనారోగ్యంతో జీవనం సాగించారు. ఒరిస్సా చివరి రాజు బ్రిజ్‌రాజ్ వద్ద 25లగ్జరీ కార్లు ఉండేవి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు. రాజభవనం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అతనికి 130 పౌండ్ల భరణం ఇచ్చారు. జీవనోపాధి కోసం ఆ కాలంలో విశాలమైన తన రాజభవనాన్ని 900 పౌండ్లకు అమ్మేశాడు. ఇందిరాగాంధీ హయాంలో రాజభరణాల రద్దు తరువాత బ్రిజ్‌రాజ్ జీవనం దయనీయంగా మారింది. మట్టితో నిర్మించిన చిన్న ఇంటిలో చివరి దశ గడిపారు. 2015లో పేదరికంలోనే మరణించారు. మన దేశాన్ని పాలించిన చివరి మొఘలాయి బహద్దూర్ షా జఫర్ మునిమనవరాలు సుల్తానా బేగం. కలకత్తాలో రెండు గదుల ఇంటిలో నివసిస్తున్నారు. బహద్దూర్ షా జఫర్ వారసురాలిగా కేంద్ర ప్రభుత్వం ఆమెను గుర్తించి గతంలో ప్రభుత్వ ఇంటిని కేటాయించింది. రాజభరణాల రద్దు తరువాత ఈ ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఆమె కలకత్తా గల్లీలోని రెండు గదుల ఇంటిలో నివాసం ఉంటున్నారు. పిల్లల పోషణ కోసం టీ కొట్టు నడిపిస్తున్నారు. బహుద్దూర్ షా జఫర్ మరో వారసుడు ప్రిన్సి జియా ఉద్దీన్ తుసీ కిరాయ ఇంటిలో నివసిస్తున్నాడు. రాష్టప్రతిని, ఇతరులను కలుస్తూ తరుచుగా మొఘలాయిల వారసులుగా గుర్తించి సహాయం చేయమని అడుగుతుంటాడు.
ఇక మైసూర్‌ను పాలించిన టిప్పు సుల్తాన్‌కు పనె్నండు మంది కుమారులు. ఇద్దరు మునిమనమళ్లు ఉన్నారు. వారిప్పుడు రిక్షా నడిపిస్తూ జీవిస్తున్నారు.
ఇవేవీ చందమామ కథలు కాదు. వాస్తవాలు. ఐతే రాజుల వారసులు అందరూ ఇంతేనా అంటే కాదు. జీవితం పట్ల సరైన అవగాహన లేని వారి వారసుల పరిస్థితి మాత్రమే ఇది.
ఐదువందలకు పైగా సంస్థానాలు భారత దేశంలో విలీనం అయ్యాయి. రాజరికం అంతరించాక వాస్తవ పరిస్థితులు గ్రహించిన వారు ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. మన దేశంలో సంస్థాలకు చెందిన వారసులు ఎంతో మంది వ్యాపార రంగంలో, రాజకీయాల్లో స్థిరపడ్డారు. చాలా మంది పరిశ్రమలు స్థాపించారు. కానీ సరైన అవగాహన లేకుండా ఈ రాజ్యమే మాది మేం పని చేయడం ఏమిటి? వ్యాపారం చేయడం ఏమిటి? అనుకున్న వాళ్లు కాల గర్భంలో కలిసి పోయారు. పేదరికంలో జీవితం సాగించారు. చివరకు పెన్షన్ కోసమో, బతుకు తెరువు కోసమో దరఖాస్తు చేసుకుంటున్నప్పుడు వారి వారసులు ఉన్నారని తెలుస్తోంది కానీ వారు ఎలాంటి ఉనికి లేకుండా జీవనం సాగిస్తున్నారు.
సంపద చేతికి వచ్చినప్పుడు దానిని కాపాడుకునే జ్ఞానం కూడా ఉండాలి. అలా లేకపోతే సువిశాలమైన భారత దేశాన్ని వందల ఏళ్లపాటు పాలించిన రాజకుటుంబాలే రోడ్డున పడ్డప్పుడు. వారి వారసులే రిక్షా కార్మికులుగానో, టీ కొట్టు నడుపుతూ బతుకుతున్నప్పుడు ఇక సామాన్యులెంత?
సంపద గురించి సరైన అవగాహన ఉన్న వ్యక్తి పేదరికం నుంచి జీవితాన్ని ప్రారంభించినా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు. అదే సరైన అవగాహన లేని వ్యక్తి రాజకుటుంబానికి చెందిన వారైనా దుర్భర జీవితం గడపాల్సి వస్తుంది. డబ్బును సంపాదించడమే కాదు హోల్డ్ చేయడం కూడా తెలియాలి. అలా తెలిసిన వ్యక్తి వద్దనే సంపద నిలుస్తుంది. లేకపోతే రాజకుటుంబ వద్ద కూడా నిలవదు. జీతం, వ్యాపారం ఏదైనా కావచ్చు ఎప్పుడూ పరిస్థితి ఒకేలా ఉంటుందని భావించద్దు. సంపద ఉన్నప్పుడే దానిని జాగ్రత్త చేయడం, పెంచుకోవడం తెలియాలి.
-బి. మురళి( 8-12-2019 ధనం -మూలం )

నవలోకం మేధావి!

‘‘ఏంటోయ్..! మేధావిలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?’’
‘‘ఆరోజులే వేరు. పెన్ను పట్టుకొని ఆలోచిస్తున్నట్టు ఫొటో దిగితే చాలు మేధావిలా గుర్తింపు వచ్చేది. బోనస్ డబ్బులతో కవితా సంకలనం ప్రచురించి, అట్టచివర ఆ ఫొటో ముద్రిస్తే నాసామిరంగ.. నోబెల్ బహుమతి వచ్చినంత సంబరంగా ఉండేది. ఇపుడు కవితా సంకలనాలు ఉచితంగా పంచిపెట్టినా తీసుకోనేవారు లేరు. మేధావిగా గుర్తింపు మాట దేవుడెరుగు.. డబ్బులు ఎందుకిలా వృథా చేస్తావు? నీ కవిత్వం చదివేదెవడు? చచ్చేదెవడు? అని దెప్పిపొడుస్తున్నారు. చెప్పుకొంటే సిగ్గుచేటు.. మన కొలీగ్ షేర్‌మార్కెట్ కోటీశ్వరరావుకు మొన్న క్యాంటీన్‌లో నా కొత్త కవితా సంకలనం ఇచ్చాను. అందరిముందు వాడు నా పరువు తీశాడు.’’
‘‘ఏమన్నాడేం? ఒక్కో కవిత చదివి పీకిపాకం పట్టాడా?’’
‘‘చదివి విమర్శిస్తే సంతోషించేవాడిని, పుస్తకం అట్ట కూడా చూడలేదు.’’
‘‘కవి అనే ముద్రపడ్డాక ఇలాంటి అవమానాలు మామూలే. పుస్తకం తెరవలేదని బాధపడితే ఎలా? ఇప్పటికి పాతిక కవితా సంకలనాలు వేసి ఉంటావు. అదేదో తొలిసారి అన్నట్టుగా బాధపడితే ఎలా?’’
‘‘వాడు కూడా సరిగ్గా పాతిక అనే నా పరువుతీశాడు.’’
‘‘ఏం పరువుతీశాడో చెప్పవేం?’’
‘‘పాతికేళ్ల క్రితం బోనస్ డబ్బులు వచ్చినప్పుడు తొలిసారిగా కొత్త ప్రపంచం అనే కవితా సంకలనం ముద్రించా.. ఆ సంగతి షేర్‌మార్కెట్ కోటేశ్వరరావుకు ఇప్పటికీ గుర్తుంది..’’
‘‘పాతికేళ్ళ తరువాత చదివి, ఇప్పుడు సమీక్ష చేశాడా?’’
‘‘కాదు- తిట్టిపోశాడు’’
‘‘ఇద్దరిదీ ఒకే జీతం, ఒకే ఉద్యోగం. పాతకేళ్ళ క్రితం తొలిసారి బోనస్ వచ్చినప్పుడు ఆ డబ్బులతో నేను హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు కొన్నాను. నువ్వేమో కొత్త ప్రపంచం కవితా సంకలనం ముద్రించావు. కొత్త ప్రపంచం వచ్చింది లేదు, చచ్చింది లేదు. నేను కొన్న షేర్ల పుణ్యమాని నాకు నిజంగానే కొత్త ప్రపంచం వచ్చింది. రిటైర్‌మెంట్ తరువాత పెన్షన్ సరిపోదనే భయం లేదు. పిల్లలు చూస్తారా? లేదా? అనే దిగులు లేదు. ఆరోజు నేను కొన్న షేర్లు బంగారు బాతుగుడ్లు అయ్యాయి. మరి నువ్వు ప్రచురించిన కొత్తలోకం పుస్తకం ఒక్కడన్నా చదివాడా? ఎందుకురా? ఈ పనికిమాలిన పని.. రిటైర్‌మెంట్ దగ్గరగా వచ్చావు, ఐనా నీకా పిచ్చి పోలేదా? అని తిట్టాడు.’’
‘‘అతనన్న దాంట్లోనూ నిజం ఉంది. చేతిచమురు వదిలే వ్యాపకాలు ఎందుకోయ్! మనం ఎంత ప్రయత్నించినా ఈ ప్రపంచం మారదు’’.
‘‘నీతో దాపరికం ఏముంది కానీ, ప్రపంచాన్ని మార్చాలనే పిచ్చి నాకు పాతికేళ్ళ క్రితం లేదు, ఇప్పుడూ లేదు’’
‘‘మరి ఈ ప్రయత్నం అంతా..?’’
‘‘ఏదో నలుగురిలో మేధావిగా గుర్తింపు పొందాలనే దుగ్ధ. కడుపు చించుకొంటే కాళ్ళమీద పడుతుంది. కలం పట్టుకొని ఆలోచిస్తున్న ఫొటోల సీజన్ తరువాత బాగా ఆలోచించి గడ్డం పెంచాను. అందరూ తిట్టేవారే కానీ మేధావిలా కనిపిస్తున్నావని మెచ్చుకున్నవాళ్ళు లేరు.’’
‘‘నీ బాధ అర్థమైంది. మేధావిగా గుర్తింపుపొందాలనే తపన అన్నింటికన్నా ఇబ్బందికరమైంది. లక్ష్యం నెరవేరే మార్గం కనిపించదు. లక్ష్యం చేరేంతవరకు నిద్రపట్టదు. పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు. పెళ్ళయితే కానీ పిచ్చి కుదరదు లాంటిదన్నమాట ఈ సమస్య.’’
‘‘నువ్వొక్కడివైనా నా సమస్య గుర్తించావు. మార్గం కూడా చూపించు.’’
‘‘పాత టెక్నిక్‌లు పనిచేయవు, తాజా ట్రెండ్‌ను ఫాలో కావాలి!’’
‘‘అవుతూనే ఉన్నాను. కశ్మీర్‌లో 371 రద్దుచేసినా, పాలస్తీనాలో బాంబులు పేలినా క్యాండిల్స్ పట్టుకొని రోడ్డుమీదకు వెళ్ళి నినాదాలు చేశాను. అందరూ అదోలా చూసి నవ్వుకున్నారు. ఇంకా ఏ కాలంలో ఉన్నారు అంకుల్.. అని జోకులేస్తున్నారు. ఇంకా ఐదేళ్ళ సర్వీసు ఉన్నా, ఉద్యోగం మానేసి ఢిల్లీ వెళ్ళి...’’
‘‘ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తావ్? రాజకీయాల్లో చేరతావా?’’
‘‘లేదు. జెఎన్‌యూలో చేరి ఆందోళనల్లో పాల్గొని, అలాగైనా మేధావిగా గుర్తింపు పొందాలని..’’
‘‘మరేమైంది?’’
‘‘జెఎన్‌యూలో ఇప్పుడున్న మేధావులకే దిక్కులేదు. నువ్వొచ్చి చేసేదేముంది? అని ఢిల్లీ తెలుగు సంఘం మిత్రుడు కృష్ణారావు వద్దన్నాడు.’’
‘‘ఎంతైనా తెలుగు మేధావులకన్నా జెఎన్‌యూ మేధావులు ముదుర్లు..!’’
‘‘నా కోరిక తీరే మార్గం లేదా?’’
‘‘మేధావివి. నీకే ఆలోచన తట్టనప్పుడు, సామాన్యులం మేమెంత? ఏదో ఆలోచన మెరుపు నీ ముఖంలో కనిపిస్తుంది.’’
‘‘ఔను! యూరేకా.. ఐడియా?’’
‘‘ఏంటో చెప్పు?’’
‘‘దిశ’’
‘‘ఇది కూడా పాతపడిపోయింది. ‘దిశ’ ఉదంతంపై రాష్టప్రతి పాలన విధించాలని, ఎన్‌కౌంటర్ చేయాలని, చేయొద్దు అని, రోడ్డుమీదనే ఉరి తీయాలని, ఎన్‌కౌంటర్ అలా ఎలా చేస్తారని కొందరు.. ఎందుకు చేయరని ఇంకొందరు ఎవరి స్థాయిలో వారు మేధో చర్చ సాగించారులే.’’
‘‘వారెవ్వరికీ రాని ఆలోచన నాది..’’
‘‘ఎన్‌కౌంటర్ అప్రజాస్వామికం, నిందితులకూ హక్కులున్నాయని చాలామంది నీకన్నాముందే ఆందోళనలు చేసి మేధావులుగా గుర్తింపు పొందారులే.’’
‘‘అది కామన్. ప్రతి ఒక్కరికీ హక్కులుంటాయి. రేప్‌లు చేసిన వారికీ ఉంటాయి.. కానీ నా డిమాండ్ అది కాదు.’’
‘‘మరి?’’
‘‘అత్యాచారం మా జన్మహక్కు.. అత్యాచారాలకు అనువుగా కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తా.. రేప్ చేయాలనే కోరిక మనిషి సహజ లక్షణం. రేపిస్టులను రక్షించండి. రేప్‌ల సంస్కృతిని కాపాడండి.. ఎలా ఉంది నా నినాదం.’’
‘‘???’’
‘‘ఇంకో పాయింట్ మరిచిపోయాను. రేపిస్టులూ సమాజంలో భాగమే.. వారికి స్వయం ఉపాధి కల్పించాలి. ఎలా ఉంది?’’
‘‘నువ్వు బాగా ముదిరిపోయిన మేధావివి. నిన్ను జనం అర్థం చేసుకోవడం కష్టం. నీ అద్భుత ఆలోచన ఎవరికీ చెప్పకు. మీ ఇంట్లోవారికి కూడా.’’
‘‘నిజమే! మేధావులను అర్థం చేసుకోరు.. ఎవరికీ చెప్పను.’’
*బుద్దా మురళి (జనాంతికం 13-12-2019)