30, అక్టోబర్ 2013, బుధవారం

దత్తపుత్రుడిపై బ్రహ్మాస్త్రం

అతను భయాన్ని కూడా భయపెట్టేంత ధైర్యవంతుడు. అలాంటి  యువనేత దత్తుడు ఒక్కసారిగా వణికిపోయాడు. శరీరమంతా చమటలు పట్టాయి. భయం అంటే ఏమిటో జీవితంలో అతను తొలిసారిగా తెలుసుకున్నాడు.
ప్రహ్లాదుడ్ని చండామార్కుల వారు ఎన్ని రకాలుగా హింసించినా అతను హరినామ స్మరణ మాననట్టు, కొండలపై నుంచి తొసేసినా, ఏనుగులతో తొక్కించినా హరినామ స్మరణలోనే మునిగినట్టు దత్తుడు సింహాసన నామ స్మరణ మానలేదు. రాజమాత ఎంతగా హింసించినా, కేసులు పెట్టినా సింహాసనం... సింహాసనం అంటూ అన్నింటినీ చిరునవ్వుతో భరించాడు. కాలం కలిసొస్తే మెడలో పామును వేసినా అది పూలమాలగా మారుతుంది. దత్తుడికి అదే జరిగింది. రాజమాత ఎంతగా వేధిస్తుంటే జనంలో దత్తునికి అంతగా జనాభిమానం పెరిగింది.


రాజ్యంలోని అన్ని విచారణ సంస్థలతో విచారణ జరిపించారు. ప్రపంచ చరిత్రలోనే ఇంతటి నేరాలు ఎప్పుడూ జరగలేదు అంటూ రాజమాత ఆరోపణలకు విపక్ష నేత అండగా నిలిచారు. అధికారపక్షం, విపక్షం ఉమ్మడి శత్రువుగా దత్తున్ని ప్రకటించారు. అయినా దత్తుడు భయపడలేదు. విచారణ సంస్థలన్నీ ఎటూ పాలుపోక సతమతమవుతుంటే దత్తుడు హాయిగా నవ్వుకున్నాడు. పెట్టండిరా దమ్ముంటే ఇంకెన్ని కేసులు పెడతారో పెట్టండి అని సవాల్ విసిరారు. విపక్ష నేత ప్రపంచ పటాన్ని ఎదురుగా పెట్టుకొని ఎప్పుడూ వినని దేశాల పేర్లు నోట్ చేసుకుని ఆయా దేశాల్లో దత్తుని అక్రమ సంపాదన దాచిపెట్టాడని భయటపెట్టాడు. దాన్ని మీడియా డైలీ సీరియల్‌లా ప్రసారం చేసింది. ఈ సీరియల్స్ చూస్తూ జైలులో దత్తుడు హాయిగా కాలక్షేపం చేశాడు.

 పాపులర్ టీవి సీరియల్స్‌కు రేటింగ్ పెరిగినట్టుగా దత్తుని అక్రమ సంపాదన సీరియల్స్‌కు టీవిల్లో వీక్షకాధరణ రోజు రోజుకు పెరగసాగింది. అమెరికా బడ్జెట్ కన్నా వంద రెట్లు ఎక్కువగా దత్తుడు సంపాదించాడని డైయిలీ సీరియల్స్‌లో లెక్కలు తేల్చారు. నిజానికి తొలుత వారం రోజుల సీరియల్‌కు సరిపోయే మ్యాటర్ రాసి,తరువాత దాన్ని వందల రోజులకు పొడిగించారు.
త్వరలోనే సింహాసనం అధిష్టించేందుకు పోటీలు జరుగనున్నాయి. వ్యతిరేక ప్రచారంలో, జనాదరణలో దత్తుడే ముందున్నాడని తేలింది.
సింహాసనంపై కూర్చోవడానికి ఒక్కరికే చోటుంటుంది కానీ ఆ సింహాసనంపై ఎందరివో కళ్లుంటాయి. అలాంటి కళ్లలో ఒక కన్నుకు కన్నుకుట్టి భయమెరుగని నేతకు దత్తుడనే పేరు పెట్టి, బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తానని హెచ్చరించాడు.


మహామహులు, రాజమాత కూడా ఏమీ చే యలేని యువనేతను చివరకు రాజకీయ విదూషకుడు భయపెట్టాడా? అని కొందరి అనుమా నం.
దత్తుడు ఎందుకు భయపడ్డాడు అంటే ?


***
యువనేత దత్తుడు అభిమానుల చెంపలు రుద్దీ రుద్దీ అలసిపోయి నిద్రకు ఉపక్రమించాడు. ఆరునెలలు గడిస్తే, సింహాసనం కూర్చోవడమే కాదు ఏకంగా పడుకోవచ్చు అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.
ఆ నిద్రలో వచ్చిన కలతో దత్తునికి అర్థరాత్రి భయం వేసింది.
శరీరం వణికిపోతోంది.
ఏంటా కల? అంటే
***


యువనేత ఉదయం లేవగానే ఎప్పటిలానే శత్రుపత్రికను చేతిలోకి తీసుకున్నాడు. అందులోని వార్తలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. యువనేతకు దేశంలోని అన్ని విచారణ సంస్థలు క్లీన్ చిట్ ఇచ్చాయి. నిజాయితీ పరుడైన యువ పారిశ్రామిక వేత్తను చూసి దేశం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఇలాంటి పారిశ్రామిక వేత్తను వేధింపులకు గురి చేసినందుకు ప్రభుత్వం మొ త్తం దేశానికి క్షమాపణలు చెబుతోంది.
ప్రపం చం ఈ యువనేతను చూసి గర్విస్తోంది. ఇదీ మొత్తం మొదటి పేజీలోని వార్తల సారాంశం. పైగా అప్పటి వరకు విపక్ష నేతకు అనుకూలంగా రాసిన వాళ్లు అదే నేతకు పూర్తిగా వ్యతిరేకంగా రాశారు. ఇంకో పత్రిక తీసి చూస్తే అందులోనూ వార్తలు ఇలానే ఉన్నాయి. తనకు అనుకూలంగా, విపక్ష నేతకు వ్యతిరేకంగా రాస్తూ తనను దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నారని యువనేతకు అర్ధమై తొలిసారిగా భయం పట్టుకుంది. 


యువనేత హడావుడిగా పత్రికల వారికి ఫోన్ చేశాడు. ఇలా రాయడం న్యాయమా? అని అడిగాడు. కనీసం మరో ఆరునెలలు పాత పాలసీనే కొనసాగించి, దయచేసి నాకు వ్యతిరేకంగా రాయండి. అనుకూలంగా రాయకండి  ప్లీజ్ అని వేడుకున్నాడు.


ఏం చేస్తాం సార్ మీ అక్రమార్జనపై రాసీ రాసి విసిగిపోయాం. ఇక రాయడానికి మ్యాటర్ ఏమీ లేదు. అందుకే ఇలా రాయాల్సి వస్తోంది అని సమాధానం చెప్పారు. మీరలా మాట్లాడి నా భవిష్యత్తును దెబ్బతీయవద్దు మీరు రండి కావలసినంత సమాచారం ఇస్తాను రోజుకో కుంభకోణం వివరాలిస్తాను. మిమ్ములను నమ్ముకుని రాజకీయాల్లో భారీ పెట్టుబడులు పెట్టాను. మీరిలా అనుకూలంగా రాస్తే నా గతేం కాను అని ఆవేదన వ్యక్తం చేశాడు. సార్ ఇక మీ కుంభకోణాల గురించి రాయవద్దని మేనేజ్‌మెంట్ స్థాయిలో తీసుకున్న నిర్ణయం ఇది అని వాళ్లు నిర్మొహమాటంగా ఫోన్ పెట్టేశారు.


***
యువనేత కలవరపాటుతో నిద్ర లేచాడు. ఈరోజు ఇది కల రేపు ఇదే నిజమైతే అనే ఆలోచన యువనేతను తొలిసారిగా భయపెట్టింది. మీడియా ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో చక్కగా చెబుతుంటే, ఓటర్లు సరిగ్గా దానికి భిన్నంగా తీర్పు ఇస్తున్నారు. అందుకే  తనపై అనుకూల ప్రచార బ్రహ్మాస్త్రం వేస్తారనే  కల రాగానే యువనేత వణికిపోయాడు. ఇప్పుడిది కల రేపు ఇది నిజం అయితే అనే ఆలోచన దత్త పుత్రుడిని కలవరపాటుకు గురి చేస్తోంది . మాయలపకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు నాయకుల ప్రాణం అనుకూల ప్రచారంలో ఉంటుంది.

23, అక్టోబర్ 2013, బుధవారం

బంగారు దొంగ కల

పూర్వం ఒక గ్రామంలో ఒక చిల్లర దొంగ ఉండేవాడు. సన్నాసులు, సన్యాసులు, నాయకులు, నాయక దొంగలు కలలు కంటున్నప్పుడు పాపం ఆ చిల్లర దొంగ మాత్రం కలలు కంటే తప్పేమిటి? ఆ దొంగ కూడా కలలు కన్నాడు. తమ వ్యవసాయ భూమికి కావలిసినంత నీరు లభించి చక్కని పంట పండినట్టు కలలు కన్నాడు. చెప్పడం మరిచాను అతను కల కన్నది పట్టుపరుపుల మీద పడుకుని కాదు, జైలు గోడల మధ్య!
దొంతనానికి పాల్పడడం వల్ల రాజభటులు చిల్లర దొంగను అరెస్టు చేసి కారాగారంలో బంధించారు. దొంగతనం చేస్తే సన్మానించేందుకు, అభిమాన సంఘాలను ఏర్పాటు చేసేందుకు అదేమీ ఆధునిక కాలం కాదు. రాజుల కాలం కాబట్టి దొంగతనం చేసి పట్టుపడితే జైలే గతి.


 పార్లమెంటుపైనే దాడి చేసిన కసబ్‌లాంటి వాడికి కోట్ల రూపాయల ఖర్చుతో రాజభోగాలు కల్పించే మన కాలం కాదు. చిన్నచిన్న రాజ్యా లున్న కాలమది. దొంగ దొరకడం, భటులు పట్టుకు వెళ్లడం, శిక్ష విధించడం అన్నీ అప్పటికప్పుడే జరిగిపోయేవి.


జైలుపాలైన చిల్లర దొంగ ఆలోచనల్లో పడ్డాడు. వీరోచితంగా జనం సొమ్ము దోచుకున్నాడని ఆభిమానించే అభిమానులు లేరు. ముసలి తల్లిదండ్రులు, వారికి ఆధారంగా వ్యవసాయ పొలం తప్ప ఏమీలేవు. తాను జైలులో ఉన్నందున పొలానికి నీళ్లు తోడే అవకాశం లేకుండా పోయింది. ఎలారా భగవంతుడా!అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. బంగారం లాంటి కల కన్నాడు!


ఉదయం లేచాక తల్లిదండ్రులకు ఉత్తరం రాశాడు. భటుణ్ణి పిలిచి ఈ ఉత్తరం తన తల్లిదండ్రులకు చేర్చమని కోరాడు. సరేనని భటుడు ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి తన పై వాడికి ఇచ్చాడు. అసలే దొంగ.. వాడు కారాగారంలో ఉన్నాడు. లేఖ రాశాడు అంటే ఏదో ఉండే ఉంటుంది అనుకుని లేఖ చదివాడు.


అమ్మానాన్నా ...!
నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను. నేను రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈ విషయం ఎవరికీ చెప్పకండి.. నేను ఇంత కాలం దొంగతనాల్లో సంపాదించిన బంగారం అంతా మన పొలంలోని వ్యవసాయ బావిలో పాతిపెట్టాను. నేను బయటకు వచ్చాక ఆ బంగారంతో హాయిగా జీవిద్దాం... అంత వరకు సెలవు అని ముగించాడు. ఉత్తరం చదవగానే భటునితోపాటు సైనికాధికారి ఎగిరి గంతేశారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఉత్తరంలో ఉన్న చిరునామాకు భటులను వెంటబెట్టుకెళ్లాడు. బావిలోని నీళ్లన్నీ తోడి పోశారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారు ఝాము వరకు అదే పని. పంటపొలాలన్నీ నీటితో తడిసిపోయాయి. బావిలోనీరు అయిపోయంది కానీ బంగారం జాడలేదు. ఉదయం జన సంచారం మొదలుకావడంతో భటులు కిమ్మనకుండా వెనక్కి వెళ్లిపోయారు. 


కొడుకు జైలులో ఉన్నా దేవుడి దయవల్లనే పొలానికి నీళ్లు అందాయని వృద్ధ దంపతులు సంతోషించారు. భటులు తేలుకుట్టిన దొంగల్లా వౌనంగా ఉండిపోతే దొంగ మాత్రం తన తెలివితేటలకు మురిసిపోయాడు.
చిన్నప్పటి ఈ కథ తెగ నచ్చినా అది కథ కాబట్టి సాధ్యమైంది కానీ బావిలో బంగారం ఉందటే నమ్మి నీటిని తోడేందుకు భటులు మరీ అంత అమాయకులా అని పెద్దయ్యాక అనిపించింది..... మరింత పెద్దయ్యాక చిన్నప్పటి కథే నిజమని ఇప్పుడు అనిపిస్తోంది.


ఉత్తర ప్రదేశ్‌లోని దౌడియాకలా గ్రామంలో రాజా ఃరావు రాంబక్షసింగ్ కోట ఆలయంలో కోట శిధిలాల కింద వెయ్యి టన్నుల బంగారం ఖజానా ఉందని శోభన్ సర్కార్ అనే సాధువుకు కల వచ్చింది. వయసులో ఉన్న కుర్రాడికి అందమైన అమ్మాయిని ప్రేమించినట్టు కలలు వస్తుంటాయి. నిరుద్యోగికి మంచి ఉద్యోగం వచ్చినట్టు, రాజకీయ నాయకుడికి ఎన్నికల్లో గెలిచినట్టు కలలు వస్తుంటాయి. వారి వారి కోరికలను బట్టి అలాంటి కలలు వస్తుంటాయి. అన్ని కోరికలను త్యజించి సన్యసించే సన్యాసులకు కోరికలే ఉండవు కాబట్టి వారికెలాంటి కలలు వస్తాయి? ఎమో ఇప్పటి వరకు ఎవరూ అటు దృష్టిపెట్టలేదు. కానీ ఎందుకో కానీ శోభన్ సర్కార్‌కు మాత్రం వెయ్యి టన్నుల బంగారం కలొచ్చింది. ఆయన సన్యాసే అయినా అల్లాటప్పా సన్యాసి కాదు ఆయనకు లక్షల మంది భక్తులున్నారు. యుపిఏ సర్కార్ ను వణికిస్తున్న నరేంద్ర మోడీ సైతం శోభన్ సర్కార్ దెబ్బకు సరెండర్ కాక తప్పలేదు. ఈ తవ్వకాలపై మోడీ విమర్శలు చేస్తే శోభన్ సర్కార్ మండిపడ్డారు. దాంతో మోడీ ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించక తప్పడం లేదు. ఆయన కలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నమ్మేశాయి. తవ్వకాలు మొదలు పెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియా తవ్వకాలను ప్రపంచానికి లైవ్‌గా అందిస్తోంది. చిన్నప్పటి కథలో బంగారం కోసం భటులు బావిలోని నీటిని తవ్వడాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా ఉంది.


ఆ మధ్య టిడిపి ఎమ్మెల్యే దేవినేని ఉమ లోటస్‌పాండ్ నేలమాళిగల్లో కోట్ల రూపాయలు దాచిపెట్టారు. పునాదులు తవ్వండి అని డిమాండ్ చేశారు. మేం టిడిపి పునాదులు కూల్చేస్తున్నామనే అక్కసుతో వాళ్లు లోటస్‌పాండ్ పునాదులు కూల్చమంటున్నారని వైకాపా వాళ్లు సమాధానం చెప్పారు. ఇప్పుడు దేశ ఆర్థిక సమస్య సన్యాసి కలతోనే పరిష్కారం అవుతుందని ఆశించే వాళ్లు దేశంలో చాలా మందే ఉన్నారు. ఆ సన్యాసి కల ఫలిస్తే బాగుండు? ఎందుకంటారా...


అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నేత తన ఆస్తి 40లక్షలే అని చెబుతాడు. ఆ ఇంట్లో ఒక గోడకు ఉపయోగించిన ఇటుకల ఖరీదు కాదా మొత్తం అని ఆయనకూ తెలుసు.మనకూ తెలుసు.( ఆ నేత తన ఇంటి ఇటుకల విలువ చెప్పాడు కానీ , ఇటుకల లోపల దాచిన సంపద విలువ చెప్పలేదని కొదరి వాదన) .   రాజకీయ నాయకుల ఇళ్ల పునాదుల్లో బంగారు గని ఉందని  ఎవరైనా ఉత్తరాది సన్యాసికి కలొస్తే( దక్షిణాది సన్యాసి కలలను సన్నాసులు కూడా  పట్టించుకోరు మరి.) దేశంలోని సమస్యలు పరిష్కారం అవుతాయి.   ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుం డా ఒక్కో నాయకుడి ఇల్లు ఒక్కో స్విస్ బ్యాంక్ కదా? ఆ బ్యాంకుల్లోని నల్లధనం బయటపడడానికి కలల కన్నా మంచి స్కీమ్ లేదు.

19, అక్టోబర్ 2013, శనివారం

భాజపాకు తెదేపా గండం

అదేం శాపమో రాష్ట్రంలో బిజెపి ఎదగడానికి అవకాశం లభించినప్పుడల్లా ఆ పార్టీని టిడిపి గండం వెంటాడుతోంది. మేం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని కల్పిస్తే 82లో ఎన్టీఆర్ టిడిపిని ఏర్పాటు చేసి మా ఆశలు అడియాశలు చేశారని బిజెపి నాయకులు ఆనాటి రాజకీయాలపై ఆవేదన చెందుతారు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా అదే గండం బిజెపిని వెంటాడుతోంది. మోడీ, తెలంగాణ రూపంలో మరోసారి బిజెపి ఎదగడానికి అవకాశాలు కనిపిస్తుండగా, టిడిపి రూపంలో మళ్లీ గండం పొంచి చూస్తోంది.
టిడిపి తిరిగి ఎన్‌డిఏకు చేరువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబు ఢిల్లీ పర్యటనను జాతీయ మీడియా మొత్తం ఈ కోణంలోనే చూసింది. బాబు ఎన్‌డిఏతో జత కడితే అటు మోడీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుంది, ఇటు చంద్రబాబు తన పార్టీని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. 1998 సమయంలో రాష్ట్రంలో బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. చివరకు రాయలసీమ జిల్లాల్లోని ఫ్యాక్షన్ నాయకులు సైతం బిజెపి పట్ల ఆకర్షితులయ్యారు. 1998 పార్లమెంటు ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా బిజెపి సొంతంగా పోటీ చేసి నాలుగు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 శాతం ఓట్లు, తెలంగాణలో 25 శాతం ఓట్లు సాధించింది. 60 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో మొదటి స్థానంలో నిలిచింది. అంతకు ముందు మసీదులను కూల్చే పార్టీ అంటూ ధ్వజమెత్తిన చంద్రబాబు 98లో బిజెపికి చేరువ అయ్యారు.
ఎన్టీఆర్ నుంచి బాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత 1999, 2004, 2009లలో మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బాబు నాయకత్వంలో ఒక్క 1999 ఎన్నికల్లో మాత్రమే టిడిపి విజయం సాధించింది. ఒక్క ఓటుతో వాజ్‌పాయి ప్రభుత్వం పడిపోవడం, కార్గిల్ యుద్ధం, వాజ్‌పాయిపై ఉన్న సానుభూతి రాష్ట్రంలో బిజెపి ఎదగడానికి దోహదం చేశాయి. 98 ఎన్నికల్లో ఓటింగ్ సరళి, ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదుగుతున్న తీరు గమనించిన చంద్రబాబు బిజెపి వైపు వచ్చారు. అప్పటి వరకు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్న బాబు, ఏదో కుంటి సాకు చెప్పి బిజెపి వైపు వచ్చేశారు. ఫ్రంట్ కన్వీనరే జెండా ఎత్తేయడంతో ఫ్రంట్‌లోని పార్టీల నాయకులు విస్తుపోయారు.
బాబు చాణక్య నీతి గురించి, పాలానా సామర్ధ్యం గురించి మీడియా ఎంతగా ప్రచారం చేసినా ఒక్కసారి కూడా ఆయన స్వయం శక్తితో విజయం సాధించలేదు. ఆయన నాయకత్వంలో గెలిచింది ఒకే ఒకసారి అదీ బిజెపి కున్న సానుభూతి పవనాలతో....! 1999లో బిజెపి, టిడిపి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాయి. బిజెపి ఎనిమిది పార్లమెంటు నియోజక వర్గాల్లో పోటీ చేస్తే ఏడు స్థానాల్లో గెలిచింది. వాజ్‌పాయి హవా టిడిపి సైతం అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది. ఆ తరువాత అటు టిడిపి, ఇటు బిజెపి క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. 2004 ఎన్నికల్లో బిజెపి, టిడిపి కలిసి పోటీ చేసినా బాబు అధికారం దక్కలేదు సరికదా కేవలం 47 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయ్యారు. ఆ తరువాత జరిగిన పార్టీ సమీక్షా సమావేశాల్లో మత తత్వ బిజెపితో పొత్తు వల్లనే ఎన్నికల్లో ఓడిపోయామని చంద్రబాబు ప్రకటించారు. బిజెపితో పొత్తు వల్ల మైనారిటీలు టిడిపికి ఓటు వేయలేదని తమ ఓటమి పాపం తమది కాదని బిజెపిదే అంటూ చెప్పుకొచ్చారు. బాబు వల్లే మేం ఓడిపోయామనేది బిజెపి సమాధానం. అలిపిరి దాడిలో బయటపడి సానుభూతిపై ఆశలు పెట్టుకున్న బాబు 2004లో ముందస్తు ఎన్నికలకు తాను వెళ్లడమే కాకుండా బిజెపిని సైతం తీసుకు వెళ్లారు. బిజెపి, టిడిపిల పొత్తు 1998 నుంచి 2004 వరకు ఆరేళ్లపాటు సాగినా, రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య పెద్దగా అనుబంధం ఏర్పడలేదు. రాష్ట్రానికి చెందిన వారిలో వెంకయ్యనాయుడును మినహా మిగిలిన వారిని చంద్రబాబు పెద్దగా పట్టించుకునే వారు కాదు.
2004 ఎన్నికల్లో బిజెపి వల్ల ఓడిపోయామని చెప్పి, ఆ పార్టీతో స్నేహాన్ని వదులుకున్నాక 2009 సాధారణ ఎన్నికల్లో సైతం మైనారిటీలు టిడిపిని నమ్మలేదు. బిజెపితో కలిసిన తరువాత బాబు ఎన్ని మాటలు చెబుతున్నా, రూమీ టోపీ ధరించి ప్రచారం చేసినా ముస్లింలు నమ్మడం లేదు. ముస్లిం లు, క్రైస్తవ ఓటర్లలో మెజారీటీ తమవైపు లేరనే అభిప్రాయం టిడిపిలో బలంగా ఉంది. 

రాష్ట్ర విభజన జరిగితే రెండు ప్రాంతాల్లోనూ టిడిపి పరిస్థితి ఇబ్బంది కరమే. పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న టిడిపి మరో ఐదేళ్లపాటు అధికారం లేకుండా పార్టీని కాపాడుకోవాలి. అలా కాపాడుకున్నా 2019లో అధికారంలోకి వస్తామనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో కల్పించడం అంత ఈజీ కాదు. అధికారంలోకి వచ్చే విషయం ఎలా ఉన్నా పార్టీని కాపాడుకోవడం బాబు తక్షణ కర్తవ్యం. దాని కోసం ఆయన ఎవరితోనైనా కలుస్తారు, ఏమైనా చేస్తారు.
ఇలాంటి పరిస్థితుల్లోనే టిడిపి నాయకులు బిజెపి వైపు ఆశగా చూస్తున్నారు. దేశంలోని ఓటర్లలో దాదాపు 47 శాతం యువతే. మోడీ పట్ల యువతలో మంచి క్రేజ్ ఉంది. ఉత్తరాది స్థాయిలో కాకపోయినా రాష్ట్రంలో సైతం మోడీ ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఒకవైపు యువత మరోవైపు ప్రధానమంత్రిగా బిసికి తొలిసారిగా వస్తున్న అవకాశం అనే నినాదం ఎన్నికల్లో బాగానే పని చేసే అవకాశం ఉంది.
గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పదేళ్ల తరువాత ఇప్పుడు అదే మోడీకి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని టిడిపి నాయకత్వం బిజెపి పట్ల ఆసక్తి చూపిస్తోంది.
 డిల్లీలో జరిగిన సమావేశం లో మోడీ, బాబు ఒకే వేదిక పై కూర్చున్నారు . అనంతరం బాబు మోడితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు . మోడీ , మహాత్మా గాంధీ గుజరాత్ లోనే  జన్మించారు అంటూ  మోడిని ఆకాశానికెత్తుతూ ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి డిల్లీ సమావేశం లో  బాబు తంటాలు పడ్డారు

 రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. పరస్పర అవసరాలే ముఖ్యం. ఇక్కడ టిడిపిని బతికించుకోవడం బాబుకు అవసరం, అధికారంలోకి రావడం అక్కడ మోడీకి అవసరం. ఈ అవసరాలే రెండు పార్టీలను కలిపే అవకాశాలు కల్పిస్తోంది.

విభజన తరువాత ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండేది తెలంగాణ ప్రాంతంలోనే. తెలంగాణలో అధికారంలోకి వచ్చే సూచనలే లేనప్పుడు బిజెపితో పొత్తు పెట్టుకుని తెలంగాణలో ముస్లింల ఓట్లను వదులుకోవడానికి బాబుకు అభ్యంతరం ఏముంటుంది. కమ్యూనిజానికి కాలం చెల్లిందని పదే పదే చెప్పి అధికారం పోయాక వారితో కలిసిన బాబుకు బిజెపితో కలవడానికి ఒక కారణం చెప్పడం పెద్దకష్టమేమీ కాదు.విభజన తరువాత కొత్త రాజధానిని హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయాలని అలా చేయాలంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీతో ఉండాలి అంటూ కొత్త సిద్ధాంతం చెప్పగలరు.
రెండు పార్టీల కలయిక వల్ల బాబుకు, మోడీకి ఇద్దరికీ ప్రయోజనమే. కానీ రాష్ట్రంలో బిజెపి ఎదగడానికి అవకాశాలు పోతాయి. విభజన జరిగితే ఒక ఎన్నిక వరకు టిడిపి విపక్ష స్థానంలో ఉంటుంది. ఆ తరువాత ఆ స్థానాన్ని క్రమంగా బిజెపి కైవసం చేసుకుంటుంది. శ్రీకృష్ణ కమిటీకి ఎంఐఎం సైతం ఇదే విషయం చెప్పింది. విభజన జరిగితే తెలంగాణలో టిడిపి ఉండదని, ఆ స్థానాన్ని బిజెపి భర్తీ చేస్తుందని, అదే తమకు సమస్య అని ఎంఐఎం తెలిపింది. ఎప్పుడో రాష్ట్రంలో బిజెపి ఎదగడం కన్నా తక్షణం మోడీ ప్రధానమంత్రి కావడం బిజెపి జాతీయ నాయకత్వానికి ముఖ్యం. మోడీ రాష్ట్ర పర్యటనలో ఎన్టీఆర్ పేరును గుర్తు చేశారు. బాలకృష్ణతో పాటు టిడిపి ముఖ్యులు మోడీని కలిశారు. బాబు ఢిల్లీ పర్యటనలో బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌తో అంతరంగిక సమావేశం జరిపారు. ఎన్‌డిఏతో కలుస్తారా? అంటే నేనిప్పుడు రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదు అంటూ బాబు చిత్రంగా చింతామణి సూక్తులు చెబుతున్నారు. నిన్నమొన్నటి వరకు వామపక్షాలతో కలిసే బాబు ఉద్యమాలు చేశారు. రైతుల కోసం నిరాహార దీక్ష చేసినప్పుడు వామపక్షాల నాయకులనే పిలిపించుకున్నారు. 2009లో వామపక్షాలతో కలిసే పోటీ చేశారు. బిజెపితో కలుస్తారా? అనే ప్రశ్న వచ్చినప్పుడు తక్షణం ఖండించాలి కానీ ఇప్పుడేమీ చెప్పను అంటున్నారు. 

కాంగ్రెస్‌తో బాబు కలిసిపోయారు అనే విమర్శ వచ్చినప్పుడు 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం అంటూ ఖండిస్తున్నప్పుడు అదే స్థాయిలో బిజెపితో చెలిమిపై కూడా ఖండించాలి కదా? కానీ వరుసగా బిజెపి నాయకులను కలుస్తున్న బాబు ఈ ప్రచారాన్ని ఖండించడం లేదు. హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం కన్నా పార్టీ శ్రేణులను, ప్రజలను మానసికంగా సిద్ధం చేసి చివరలో నిర్ణయం తీసుకోవడం బాబుకు అలవాటు బిజెపితో చేయబోయే కొత్త కాపురం విషయంలో సైతం అదే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం పట్ల టిడిపికి   అండగా నిలిచే ఒక సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బిజెపితో చెలిమికి ఇదే వర్గం అసక్తి చూపుతోంది. ఈ వర్గం బాబును వదిలి ప్రత్యామ్నాయం చూసుకుంటే బాబు రాజకీయ జీవితం ముగిసినట్టే. ఈ ప్రమాదాన్ని గ్రహించే ఈ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు, ఈ వర్గం ప్రయోజనాలు కాపాడేందుకు బాబు బిజెపి పట్ల ఆసక్తి చూపక తప్పని పరిస్థితి.

 1998లో బిజెపితో, 2009లో కమ్యూనిస్టులతో స్నేహం విషయంలో బాబు ఆయా పార్టీల రాష్ట్ర నాయకులను ఏ మాత్రం పట్టించుకోలేదు. జాతీయ నాయకత్వంతోనే నేరుగా సంప్రదింపులు జరిపారు. బాబు ఢిల్లీలో బిజెపి నేతలను కలిశాక రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఈసారి మేం 294 నియోజక వర్గాల్లో పోటీ చేస్తాం అని ప్రకటించారు. 2009కు ముందు రాష్ట్రానికి చెందిన వామపక్షాల నాయకులు సైతం ఇలాంటి ప్రకటనలే చేసేవారు, కానీ బాబు మాత్రం రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులను ఏ మాత్రం పట్టించుకోకుండా ఢిల్లీ నుంచి నరుక్కు వచ్చారు.
ఇప్పుడూ అంతే రాష్ట్ర బిజెపి నాయకులతో ఏ మాత్రం సంబంధం లేకుండానే అటు నుంచి వ్యవహారం నడుపుతున్నారు. ఈ చెలిమి తమ పాలిట గండం అని తెలిసినా బిజెపికి ఆహ్వానించక తప్పని పరిస్థితి.


16, అక్టోబర్ 2013, బుధవారం

రామన్న ఇంట్లో అరడజను మంది రాజన్న ఇంట్లో పావుడజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు

‘‘కలికాలం కాకపోతే... ఉల్లిపాయలు దొరకడం లేదు కానీ రాజకీయ మార్కెట్‌లో ఇంటికో అరడజను,పావుడజను మంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లు కనిపిస్తున్నారు’’ అంటూ సుబ్బారావు ఉపన్యాసం మొదలుపెట్టాడు. మార్నింగ్ వాక్‌లో ఏదో ఒక అంశంపై చర్చ జరుపుకోవడం వారికి అలవాటు.


‘‘ఐనా ఇదేం చిత్రమైన పోలికరా! ఉల్లికి ముఖ్యమంత్రి క్యాండిడేట్లకు సంబంధం ఏమిటి? అని కుటుంబరావు ఆశ్చర్యపోయాడు.
‘‘ఉల్లి మనకు మేలు చేస్తుంది, ముఖ్యమంత్రి అభ్యర్థులు తమకు తాము మేలు చేసుకుంటారు’’అని సుబ్బారావు నవ్వాడు.
‘‘ఐనా ఉల్లిపాయలంటే అవేమన్నా ఇంజనీరింగ్ సీట్లనుకున్నావా అవసరం అయిన వాటికన్నా ఎక్కువ అందుబాటులో ఉండడానికి’’ అని కుటుంబరావు తన వంతు జోకేశాడు.


మహా అయితే కొత్త రాష్ట్రానికి ఇంకో కొత్త ముఖ్యమంత్రి అవసరం అవుతాడు కానీ అరటిపండ్లలా ముఖ్యమంత్రి అభ్యర్థులకు డజన్ల కథా కమామిషేమిటి? ’’ అని కుటుంబరావు అడిగాడు.
‘‘చెబుతా కానీ, కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరవుతారనుకుంటున్నావు? అని సు బ్బారావు అడిగాడు.
‘‘తెలంగాణ కోసం ఉద్యమించిన వారు కా రు. ఉద్యమ కాలంలో పదవిని అంటిపెట్టుకున్నవారే అవుతారు’’ అని కుటుంబరావు చెప్పాడు.
‘‘ఇది స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి వస్తున్న సంప్రదాయమే!స్వాతంత్య్ర పోరాట యోధులు అలానే ఉండిపోయారు, బ్రిటిష్ పాలన కొనసాగాలని కోరుకున్న వారు ఆ తదనంతరం అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి ఎవరు కావచ్చునంటావు’’ అని సుబ్బారావు అడిగాడు.


‘‘హఠాత్తుగా ఈ మధ్య భాగ్యనగరంలో ఎక్కడ చూసినా భారీ హోర్డింగులు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత చెబుతూ ఒకవైపు సోనియా బొమ్మమరోవైపు మంత్రి అరుణమ్మ బొమ్మ కనిపిస్తోంది. విష యం ఏమని విచారిస్తే ఏం నాకేం తక్కువ ముఖ్యమంత్రిని నేనెందుకు కాకూడదని ఆమె అంటున్నారట! సమాచార మంత్రి కాబట్టి హోర్డింగ్‌లు పెద్ద కష్టమేమీ కాదనుకో? ఇక ఉద్యమ కాలమంతా మౌ నంగా ఉండి సిడబ్ల్యుసి నిర్ణయం ప్రకటించే ముందు హఠాత్తుగా వీర తెలంగాణ వాదిగా ముందుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి ఉండనే ఉన్నారు. ఉప తొలగిస్తే చాలు.. 30 రోజుల్లో ఏ భాషనైనా నేర్పించే పుస్తకాలున్నట్టు 60 రోజుల్లో ఆయన ఉద్యమ పాఠాలు బాగానే నేర్చుకున్నారు. జనారెడ్డి, జైపాల్‌రెడ్డి క్యూలో ఉండనే ఉన్నారు’’ అని కుటుంబరావు చెప్పాడు.

‘‘అంతా కాంగ్రెస్ వారి పేర్లే చెబుతున్నావు, ఇతర పార్టీల్లో ఎవరూ లేరా? ’’సుబ్బారావు అడిగాడు.
‘‘తెలంగాణ వస్తే దళితుడే సిఎం అని చెప్పడం ద్వారా మొదట్లోనే కెసిఆర్ ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదని చెప్పేశారు కదా? రామన్న , రాజన్న ఇంట్లోలా తన ఇంట్లోనూ  క్యూ పెరుగుతున్దనుకొని ముందు జాగ్రతగా అలా చెప్పారేమో .. ఆయనేం చెప్పినా
ఈ ఒక్కసారికి మాత్రం సోనియాగాంధీ ఎవరి పేరు సూచిస్తే వారే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారు’’ అని కుటుంబరావు చెప్పాడు. ‘‘సరే ఇంతకూ డజన్ల కొద్ది ముఖ్యమంత్రి అభ్యర్థుల కథేమిటని ’’ మళ్లీ అడిగాడు కుటుంబరావు

‘‘అక్కడికే వస్తున్నా వారసత్వ రాజకీయాలకు, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అన్నగారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు కదా? చిత్రంగా ఆయన కుటుంబీకులే ఇప్పుడు కనీసం అరడజను మంది ముఖ్యమంత్రి పదవి కోసం టిడిపి తరఫున క్యూలో ఉన్నారు. కాలం కలిసొస్తే కాంగ్రెస్ ద్వారా ముఖ్యమంత్రి కావడానికి అన్నగారి కూతురు పురంధ్రీశ్వరి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు మళ్లీ సిఎం పదవి కోసం చేయని దీక్ష లేదు.ఇంట్లో, ఎన్టీఆర్ భవన్‌లో మార్చని వాస్తు లేదు. నాన్నా నేను అని లోకేశ్ అంటుంటే గెలిచే చాన్స్ లేకపోతే నీకోసం త్యాగం చేస్తాను అంటున్నాడు. ఇక బాలయ్య బాబు సిద్ధంగానే ఉన్నాడు. ప్రమాణస్వీకార పత్రాన్ని సింపుల్‌గా మారిస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం హరికృష్ణకు పెద్ద కష్టమేమీ కాదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ ఇప్పుడు కాదు ఇంకో ఐదేళ్లయినా నిరీక్షిస్తాను అంటున్నాడు.


వైఎస్ కుటుంబంలో ఎంత లేదన్నా పావుడజను మంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఉన్నా రు. అంతా అనుకున్నట్టు జరిగితే జగన్ బాబు, లేదంటే అమ్మానో, చెల్లినో ఆ పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. సువార్తలు వినిపిస్తున్న అల్లుడి గారికి ముఖ్యమంత్రి అనే మంచి వార్త వినే యోగం ఉందో లేదో?
పవర్ ప్రాజెక్టుల ద్వారా బోలెడు సంపాదించిన లగడపాటికి కొత్త పార్టీ పెట్టి నిజమైన పవర్ పొందాలని చాలా కాలం నుంచి ఉంది. రాయపాటి, కిరణ్‌కుమార్‌రెడ్డిలు సైతం కొత్త పార్టీ అంటున్నారు. కొత్త పార్టీ పెట్టి విజయం సాధిస్తే మహా అయితే ముఖ్యమంత్రిని అవుతాను, నేనిప్పుడు అదే పదవిలో ఉన్నాను కదా? అంటూ కిరణ్ కుమార్‌రెడ్డి ఈ మధ్య చెప్పారు కదా? చిరంజీవి ముఖ్యమంత్రి పదవి కోసం సినిమా లో రిహార్సల్స్ కూడా పూర్తి చేశాడు. ఆనం, బొ త్స బాబు ఎలాగూ క్యూలో ఉండనే ఉంటారు.
తండ్రి మరణించినప్పుడు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన ఉద్యమ నేత అశోక్‌బాబుకు సైతం మనసులో ఎక్కడో ఇలాంటి ఆలోచన ఉన్నట్టుంది. ‘‘కొత్త పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యేంతగా ప్రజల్లో అభిమానం ఉంది కానీ నిధులు లేవు అని ఆయన చెప్పినట్టు పత్రికల్లో వచ్చింది.
 మార్కెట్ ఉంది అనుకుంటే పెట్టుబడి పెట్టె వారు ఎంత మంది లేరు  ’’ అని కుటుంబరావు చెప్పాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సీమాంధ్రలో ఒక్కో నియోజక వర్గానికి కనీసం ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులు కనిపిస్తారు అని కుటుంబరావు చెప్పాడు.

వీరి సంభాషణ వింటున్న మూడో వ్యక్తి ‘‘ముఖ్యమంత్రి అభ్యర్థులకు కొరత లేదు. కానీ జనం కోసం తపించే నాయకులే లేరు. అదే అసలైన కొరత ’’ అని చెప్పి వెళ్లిపోయాడు.

9, అక్టోబర్ 2013, బుధవారం

పోకిరీ విద్యార్థులు - మహా నేతలు

ఏమండోయ్ మీ శిష్య పరమాణువులు టీవిలో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు వింటారా? అని భార్య గాయత్రి పిలవడంతో సుందరం పరిగెత్తుకొచ్చాడు. టీవిలు సగం స్కీృన్‌ను బా బుకు, మరో సగం జగన్‌కు అంకితం చేశాయ. టీవిలో జగన్,చంద్రబాబులు తప్ప ఎవరూ కనిపించడం లేదు కదా? అని గాయత్రిని తండ్రి అడిగాడు. వాళ్లిద్దరే మీ అల్లుడి గారి శిష్యులు అంది గాయత్రి నవ్వుతూ. 

నాలుగు పదుల వయసున్న అల్లుడి గారికి ఆరుపదుల వయసు దాటిన చంద్రబాబు, నాలుగుపదుల వయసు న్న జగన్ శిష్యుడేమిటో అస్సలు అర్ధం కాలేదు.

కొద్దిసేపటి తరువాత విషయం అర్ధమైన సుందరం ఉడుక్కున్నాడు. చాల్లే బడాయి. నా శిష్యులు మరీ ఇలా ఏమీ కాదు. ప్రతి వారికి ఏదో ఒక బలహీనత ఉన్నట్టు, ప్రతి విద్యార్థికి ఏదో ఒక సబ్జెక్ట్‌లో బలహీనంగా ఉంటాడు. మరీ వీరిలా ఏమీ కాదు అని చెప్పాడు. మామ గారు విషయం అర్ధం కావాలంటే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి అని సుందరం చెబుతుండగానే సినిమాల్లోలా రింగులు రింగులుగా పొగ కనిపించసాగింది...

***
సుందరం ముఖ కవళికలు క్షణానికో విధంగా మారిపోసాగాయి. ఏమైందండి అంటూ భార్య కంగారుగా అడిగింది. చూడవే ఈ వెధవలు అడిగిన ప్రశ్నకు సమాధానం తప్ప అన్నీ రాశారు.
వీడేం రాశాడో చదువుతా విను అంటూ చదవసాగాడు.
ప్రశ్న: రాష్టప్రతి అధికారాలు, విధులు వివరింపుము- పది మార్కులు
జవాబు: దేశానికో రాష్టప్రతి ఉంటాడు. రాష్టప్రతి కూడా మనిషే అందరు మనుషుల్లానే ఆయనకూ  కోరికలు ఉంటాయి. రాష్టప్రతికి పోకిరీ సినిమా చూడలనిపించింది. సినిమా హాలుకు వెళ్లి పోకిరీ చూశాడు. హీరో మహేష్‌బాబు, హీరోయిన్ ఇలియానా... ఇక కథ విషయానికి వస్తే....
ఇక చాల్లేండి అని గాయత్రి నవ్వింది. ఇంకో ఆన్సర్‌షీటు చదువుతానుండు అంటూ సుందరం మరోటి తీసుకున్నాడు.
ప్రశ్న: మంత్రిమండలి బాధ్యతలు వివరింపుడు- పది మార్కులు
జవాబు: సార్ మీ చల్లని దీవెనలు నాకుండాలి. నిన్ననే మీ పేరుమీద మీ భార్య, పిల్లల పేర్లమీద మా ఊరి ఆంజేయస్వామి గుడిలో పూజలు చేయించాను. మీరు నన్ను పాస్ చేస్తారని మొక్కుకున్నాను. ఆ దేవుడి అనుగ్రహం ఎలా ఉంటుందో? ఆగ్రహం కూడా అలానే ఉంటుంది సార్. వీడెవడో సున్నితంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడండీ అంది గాయత్రి
***
అందరూ ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చి నవ్వుకున్నారు.
టీవి చూస్తే ‘ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించమని ఆరోజు నేనే చెప్పాను, నిన్న సమన్యాయం అని అడిగింది నేనే. ఇప్పుడు మళ్లీ నేనే చెబుతున్నాను సమైక్యాంధ్ర అంటున్నాను అని అతను సాగదీస్తూ చెప్పాడు. తాతయ్య ఇంట్లోకి అడుగుపెడుతూ కళ్లద్దాలు సవరించుకుంటూ ఎవర్రా శివారెడ్డేనా అచ్చం వైఎస్‌ఆర్‌లానే మిమి క్రీ బాగా చేస్తున్నాడు అని మెచ్చుకున్నాడు. 
అది మిమిక్రి కాదు ఆయన శివారెడ్డి కాడు .అయన జగన్ రెడ్డి . అచ్చం తండ్రి లా మాట్లాడాలని అలా సాగదీస్తూ మాట్లాడుతున్నాడని చెప్పారు.
 ఇంతకూ  సమన్యాయం అంటే ఏమిటి ? ఎలా సాధించాలి అని ఒక విలేఖరి అడిగాడు . 
తెలుగు మీడియా అంటే అందుకే నాకు చిరాకు .. జాతీయ మీడియా తోనే మాట్లాడుతాను . అని జగన్ కోపంగా చెప్పాడు 
, ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ , ఎకనామిక్ టైమ్స్ తో  సహా నా గురించి ఎంత బాగా రాస్తారు .. 
రాజకీయం ఎంత వ్యాపారం అయినా .. మరీ  వ్యాపార పత్రికలకే పరిమితం కావద్దు అంటూ తెలుగు పత్రికలను పిలిచారు అంటూ జగన్‌రెడ్డి  అసహనం వ్యక్తం చేశాడు 

మరోటీవిలో చంద్రబాబు ఢిల్లీ విలేఖరుల సమావేశం వస్తోంది.
ఇంతకూ మీరు తెలంగాణ ఇవ్వాలంటున్నారా? వద్దంటున్నారా? ఢిల్లీ విలేఖరి సూటిగా అడిగారు.
బాబు కోపంగా తాజ్‌మహల్ నిర్మాణానికిరాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు ? ఎన్ని తెచ్చారు ? బ్రదర్ చెప్పు అని విలేఖరిని నిలదీశాడు.
నా ప్రశ్నకు దీనికి సంబంధం ఏమిటని ఆ విలేఖరి బిక్కచచ్చిపోయాడు.
అదే చెబుతున్నాను బ్రదర్ ఢిల్లీ పక్కన ఉన్న తాజ్‌మహల్ గురించే నీకు తెలియనప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఎలా అడుగుతావుఅని నిలదీశాడు.
సరే సార్ నేను ఆంధ్రప్రదేశ్ వాడినే. అదే ప్రశ్న నేను అడుగుతున్నాను చెప్పండి అని తెలుగు విలేఖరి ముందుకు వచ్చాడు.
రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండమన్నారు, ఇండియాలో ఉన్నప్పుడు సోనియాగాంధీ ఇండియన్‌లా ఉండాలి ఔనా కాదా ముందు మీరు చెప్పండి అని బాబు గద్దించాడు.
ఔను ఉండాలి అని అంతా పలికారు.

ఆ విషయం చెప్పడానికి మీరెవరు? సోనియాగాంధీ ఇక్కడికొచ్చి చెప్పాలి అప్పటి వరకు కదిలేది లేదని అన్నారు.
సరే సార్ ఇంతకూ మీరు రాష్ట్ర విభజన జరగాలంటున్నారా? వద్దని చెబుతున్నారా?
జరగాలనడానికి నేనెవరు, వద్దనడానికి మీరెవరు? చేసేది చేయించేది అంతా ఆ పైవాడే.
నేను ధర్మం కోసం వచ్చాను. ఎక్కడ ధర్మం అమ్ముతుంటే అక్కడ కొనుక్కునే సత్తా నాకుంది. అని ఆవేశంగా పలికాడు.
తెలంగాణ ఏర్పాటు చేయాలంటారా? వద్దంటారా? ఒక్క మాట చెప్పండి సార్ వెళ్లిపోతాం అని వేడుకున్నారు. బ్రదర్ గంట క్రితం ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు బ్రతిమిలాడుకుంటున్నారు. తెలుగోడి దెబ్బ తెలిసొచ్చిందా అని అడిగాడు. అలూ లేకుండా సమోసా చేయాలని చూస్తే దెబ్బతినడం ఖాయం ఆ విషయమే సోనియా కు చెప్పడానికే ఢిల్లీకి వచ్చానని బాబు చెప్పాడు. ధర్మో రక్షిత రక్షితః అన్నారు.కంటి చూపుతో కాదు ఉపన్యాసంతో చెవుల నుంచి రక్తం కారేట్టు చేస్తాను.. తెలుగు పౌరుషం అంటే ఏమనుకుంటున్నారు అని చంద్రబాబు  వార్నింగ్ ఇచ్చాడు. 
*****
వీరు సుందరానికి శిష్యులు ఎలా అవుతారో అందరికీ అర్ధం అయి నవ్వుకున్నాడు.
నీతి: విలేఖరుల ప్రశ్నల్లో మార్పు ఉండొచ్చు కానీ చంద్రబాబు చెప్పదలుచుకున్నసమాధానంలో ఎలాంటి మార్పు ఉండదు.

2, అక్టోబర్ 2013, బుధవారం

జైలులో ‘పెద్ద మనుషుల ఒప్పందం’

స్వాతంత్ర పోరాట కాలం లో కీలక ఘట్టాలన్నీ జైలు లోనే జరిగాయి . స్వతంత్ర దేశం లోనూ పెద్దమనుషుల ఒప్పందాలన్నీ జైలు లోనే జరుగుతున్నాయి .. 
పూర్వజన్మ సుకృతం ఉంటేనే చార్‌ధామ్ లాంటి యాత్రలకు వెళ్లే భాగ్యం లభిస్తుందని అనేవారు. మొన్నటి ప్రళయానికి ముందు వరకు.
పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప జైలు జీవితం సాధ్యం కాదనిపిస్తోంది. ఈ కాలంలో పుణ్య క్షేత్రాల సందర్శన పెద్ద కష్టమేమీ కాదు. గతంలో అంటే కాశీకి వెళ్లిన వాడు కాటికి వెళ్లిన వాడు తిరిగి రాడనే వారు. ఇప్పుడన్నీ ప్యాకేజీలే. చివరకు హనీమూన్‌కు సైతం చార్‌ధామ్‌ను ఎంచుకుంటున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన వాడు, జైలుకు వెళ్లిన వాడు చెడిపోయే ప్రసక్తే లేదు. సమాజంలో అతనికి ఎంత హోదా! ఎంత గౌరవం!!
ఐదంకెల జీతంతో ఐటి ఉద్యోగి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు మీ గురించి మీ పక్కింటోడికి తెలిస్తేనే అదో గొప్ప కానీ మీ వీధిలో జైలుకు వెళ్లి వచ్చిన వారెవరైనా ఉంటే అతన్ని చూడండి. ఎంత గౌరవం ఎంత మర్యాద. జైలు అదృష్టం అందరికీ రాదు.


 అందుకే దాణా స్కాంలో తొలిసారి అరెస్టయినప్పుడు లాలూప్రసాద్ యాదవ్ ఇదే విషయం చెప్పాడు. జైలు కాదు అది శ్రీకృష్ణ జన్మస్థానం. ప్రతి మనిషి కనీసం వారం రోజులైనా జైలు జీవితం గడిపితే కానీ జీవితం ఏమిటో అర్ధం కాదని ఆ మధ్య ఆయన పార్లమెంటులోనే చెప్పుకొచ్చారు. జైలులో ఉన్న వాళ్లు పోటీకి అనర్హులు అని ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు చెబితే, రాజకీయ నాయకులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారని అన్ని పార్టీల నాయకులు ముక్తకంఠంతో ఆవేదన వ్యక్తం చేశారు. నేర చరితులు పోటీకి దూరంగా ఉంటే ఇక ఎన్నికల్లో పోటీ చేసేది ఎవరు, అక్రమాలకు పాల్పడేది ఎవరు? అక్రమాలే లేకపోతే ప్రజాస్వామ్యానికి మనుగడ ఏది? అని తీవ్రంగా ఆలోచించి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హడావుడిగా ఆర్డినెన్స్ తెచ్చారు. నేరచరితులు కూడా పోటీ చేయవచ్చు అంటూ... రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోవడం వల్ల రాహుల్‌గాంధీ ఇదో చెత్త ఆర్డినెన్స్ అంటూ మండిపడ్డారు. అందుకే చంద్రబాబు ఆయన్ని మొద్దబ్బాయి అంటున్నారు.


బాబు కూడా అనవసరంగా సిబిఐ విచారణపై స్టే తెచ్చుకుని ఆరునెలల పాటు పాదయాత్ర చేశారు. నడక కన్నా అదే అర్ధసంవత్సరం జైలులో హాయిగా విశ్రాంతి తీసుకుని ఉంటే ఆయనకు జనంలో ఎంత క్రేజ్ ఉండేది.
మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి స్వాతంత్య్ర సమర యోధులు జైలులో ఉన్నప్పుడు అద్భుతమైన సాహిత్యం సృష్టించారు.
దేశానికి స్వాతంత్య్రం కోసం వ్యూహ ప్రతి వ్యూహాలు జైలులోనే రచించారు. జైలులోనే అద్భుతమైన ఆలోచనలు వస్తాయని ఎంతోమంది మహనీయులు నిరూపించారు.
వీరు అనేక సార్లు జైలుకు వెళ్లారు...వచ్చారు.. కానీ వీరెవరికీ లభించని స్థాయిలో ఘన స్వాగతం మన యువనేతకు లభించింది.
హైదరాబాద్ నగరం మొత్తం స్తంభించింది. నలుగురు వ్యక్తులు ఒక చోట చేరితే తాట తీస్తాం అంటూ బెదిరిస్తూ పోలీసులు 144 సెక్షన్ విధించిన సమయంలో వేల మంది యువనేతకు స్వాగతం పలికారు.


మన క్రికెట్ టీమ్ ప్రపంచ కప్ సాధించినప్పుడో, పాకిస్తాన్‌పై విజయం సాధించినప్పుడో విమానాశ్రయం వద్ద స్వాగతానికి హడావుడి సహజమే. పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టిన భారత సైన్యం తిరిగి వచ్చినా స్వాగతానికి పెద్దగా హడావుడి కనిపించదు. అవసరం లేదు కూడా. ఎందుకంటి అది వారి డ్యూటీ.
సాహిత్యంలో అంతర్జాతీయ అవార్డు పొందిన వారికి కుటుంబ సభ్యులు తప్ప స్వా గతం పలికే వారుండరు. అవార్డు ఇవ్వాలనుకున్న వారు ఇచ్చారు. స్వాగతం పలకాల్సిన అవసరం ఎవరికుంది? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించాడని సిబిఐతో ఆరోపణలు ఎదుర్కొన్న యువనేత 16 నెలల తరువాత జైలు నుంచి బెయిల్‌పై రావడం అంటే సాధారణ విషయమా? అభిమానులే కాదు ప్రకృతి కూడా పులకరించింది. ఈ స్వాగత ఆర్భాటాన్ని చూసిన తరువాత చంద్రబాబు కూడా కుళ్లుకున్నారట! అనవసరంగా సిబిఐ విచారణపై స్టే తెచ్చుకున్నాను, జైలుకు వెళ్లి నేను కూడా ఇలా బెయిల్ తెచ్చుకుని ఉంటే ఇంతటి ఘన స్వాగతం లభించేది కదా?అని మధనపడినట్టు ధ్రువీకరించని వార్తలు.


జైలు నుంచి బయటకు రాగానే జగన్‌బాబు నిజాయితీతో కూడిన రాజకీయాలు అవసరం అని జాతికి సందేశం ఇచ్చారు. ఆ వెంటనే బెయిల్ ఎలా వచ్చిందో నిజాయితీగా చెప్పండి అని అడగలేకపోయారా? అనేది కొందరి అనుమానం. బెయిల్ అంటే త్రిశంకు స్వర్గం లాంటిదే. ‘పెద్ద మనుషుల ఒప్పందం’ అమలులో ఏ మాత్రం తేడా వచ్చినా బెయిల్ రద్దవుతుంది. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. గడ్డితిన్నందుకు 17 ఏళ్ల తరువాత కూడా లాలూకు జైలుకు వెళ్లక తప్పలేదు. ఎక్కడ తేడా వచ్చిందో? తీర్పు వచ్చిన వెంటనే లాలూ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తనకు ఆదర్శం అని చెప్పుకొచ్చారు. ఆ జ్ఞానం విచారణ జరుగుతున్నప్పుడే ఉండాలి. జైలులో తనకు జడ్‌ప్లస్ కేటగిరి భద్రత కావాలని లాలూ కోరితే కోర్టు సాధ్యం కాదని కొట్టివేసింది. తన నుంచి జైలులో ఉన్నవారికి భద్రత కోసం అని ఆయన అడిగి ఉంటే అనుమతించేవారేమో!


తాజ్‌కారిడార్‌లో మాయావతి ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తేలింది. ములాయం కూడా నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అని సిబిఐ తేల్చింది. పెద్ద మనుషుల తరహా అంటే అదే మరి. ఎదుటి వారు అడగక ముందే అవసరం అయిన మద్దతు ప్రకటించే పెద్ద మనుసు వారికుంది. తోకజాడిస్తే జైలు తప్పదు, చివరకు లొంగుబాటు తప్పదు.
జరుగుబాటు ఉంటే జ్వరం అంత సుఖం లేదంటారు. జరుగుబాటు ఉంటే జైలులో కూడా సుఖంగా ఉండొచ్చు. బయట ప్రపంచం బతుకును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉల్లిధర కూడా జీవితంపై విరక్తి కలిగిస్తుంది. అదే సామాన్యుడు జైలులో ఉంటే ఉల్లికూడా ఉచితంగానే లభిస్తుంది. నాయకుడైతే పదవినిస్తుంది. జైలు జీవితం రాజకీయ నాయకులకు హీరో  వర్షిప్ నిస్తుంది ... ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి .. జైలులు కళకళ  లాడాలి
..