26, సెప్టెంబర్ 2012, బుధవారం

తెలుగు జాతీయ గీతం... ఓలమ్మీ తిక్కరేగిందా..!

హాలంతా కేరింతలతో, విజిల్స్‌తో ఊగిపోతోంది. వారి ఆనందాన్ని చూసి తెలుగు నాయకుడి కళ్లు చెమ్మగిల్లాయి. వారిలో ఇంతటి ఉత్సాహాన్ని చూడడం అదే మొదటి సారి. ఆనందంతో గొంతు బొంగురు పోయింది. ఈలోపు పాట అయిపోయింది. నాయకులంతా వన్స్‌మోర్ ... వన్స్‌మోర్ అని అరవసాగారు. తెలుగునేత తల ఊపడంతో పాట మళ్లీ వినిపించారు. ఓలమీ తిక్కరేగిందా.... ఒళ్లంతా తిమ్మిరెక్కిందా? మైకులో పాట పెద్దగా వినిపిస్తోంది. పదేళ్ల నుంచి రాజకీయాల్లో ఒక్క హిట్టు కూడా లేక చతికిలపడిపోవడంతో సినిమా శ్రేయోభిలాషులు కొందరు ఇచ్చిన సలహా మేరకు తెలుగునేత హిట్ చిత్రాల దర్శకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

 ఒక్కో దృశ్యం రక్తి కట్టడానికి ఏంతో కృషి చేసే దర్శకులు పడిపోయిన పార్టీ పైకి లేవాలంటే పవర్ ఫుల్ సీన్స్ ఉండాలని సూచించారు. ఒకదాని తరువాత ఒకటి అమలు చేయాలని నిర్ణయించారు. మొదటగా సమావేశాల ప్రారంభ సూచనగా ఒలమీ తిక్కరేగిందా? ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా? పాటను వినిపించాలని నిర్ణయించారు. ఆ పాటకు నాయకులంతా ఊగిపోతున్నారు. రాష్టమ్రంతా మీలానే చైతన్యంతో రగిలిపోవడానికి మనం అధికారంలోకి రాగానే ఒలమీ తిక్కరేగిందా? పాటను తెలుగు జాతీయ గీతం చేస్తామని ప్రకటిస్తున్నాను అని తెలుగు నేత చెప్పగానే అంతా చప్పట్లతో ఆమోదం తెలిపారు. 

సార్ రగులుతుంది మొగలి పొద పాటను రెండవ తెలుగు జాతీయ గీతంగా ప్రకటించండి.సామాజిక న్యాయాన్ని పాటించినట్టు  అవుతుంది  అని సినిమా రాజ్యం పార్టీలోకి వెళ్లి వెనక్కి వచ్చిన సీనియర్ నాయకుడొకరు సూచించాడు. అతని సలహాను ఎవరూ పట్టించుకోలేదు. పక్కనున్న నేత సానుభూతిగా సినిమా రాజ్యం నేతకు ఇవ్వాల్సిన సలహాలు తెలుగు నేతకు ఇస్తున్నావు.ఇలా చేస్తే  నీకు భవిష్యత్తు ఉండదు అని మెల్లగా చెవిలో చెప్పారు. 

హాలులో  రాజ మౌళి ని చూసి తెలుగు పార్టీ నేత ఒకరు ఈగను హీరోను చేసిన దర్శకుడు మా నేతను హీరో ను చేస్తాడు చేసి తీరుతాడు అని ధీమాగా పక్కనున్న నేతతో చెప్పాడు.
 గడ్డం రాఘవేంద్రరావు వెనక అతని సహాయకులు ఆపిల్ పళ్లు, బత్తాయి పళ్ల బుట్టలు పట్టుకుని కూర్చున్నారు. రాఘవేంద్రరావు ఉత్సాహాన్ని ఆపుకోలేక బత్తాయి పళ్ల బుట్టను తీసుకుని ఆడవారివైపు చూడగానే విషయాన్ని గ్రహించిన పుసపాటి రాజావారు కొంప తీశారండి 

మీ కళా ప్రదర్శన  ఇక్కడొద్దు అని అడ్డుకున్నారు. 


 దర్శకుల వైపు తెలుగునేత కృతజ్ఞతా పూర్వకంగా చూసి సరే ఇక త్వరలో చేపట్టే అధికార ప్రాప్తి పాదయాత్ర గురించి మీ మీ అభిప్రాయాలు చెప్పండి అని అడిగారు. ఒక్కోక్కరు వంద రోజుల సినిమా తీసిన హిట్ దర్శకులు అలాంటిది డజను మంది హిట్ దర్శకులు రాసిచ్చిన సీన్స్‌తో ప్రారంభించే పాదయాత్ర సూపర్ హిట్టయి తీరుతుందని తెలుగునేత గట్టి విశ్వాసంతో ఉన్నాడు. పాదయాత్ర హిట్టు కావాలంటే కామెడీ ట్రాక్ బాగుండాలని శ్రీనువైట్ల మరీ మరీ చెప్పాడు.

****
పాదయాత్ర ప్రారంభమైంది... తెలుగు నేత ఎండకు, చలికి, వర్షానికి, తుఫానుకు భయపడకుండా పాదయాత్ర ప్రారంభించారు అంటూ చానల్స్‌లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. 

యాత్ర సాగుతుండగా, వికలాంగుల గుంపు వచ్చింది. అన్నయ్యా మీరు రాజకీయాల్లోకి రావాలి అని ఒక వికలాంగుడు తెలుగు నేత కాళ్లపై పడ్డాడు. అతన్ని పక్కకి తీసుకెళ్లి ఏరా ఠాగూర్ సినిమా డైలాగు ఇంకా మరిచిపోలేదా? రాజకీయాల్లోకి రావడం ఏమిటి? వచ్చి నాలుగు దశాబ్దాలవుతుంది.

భవిష్యత్తు ఏమిటా ? అని దశాబ్ధం నుంచి కలవరపడుతున్నాడు . 

 అని తిట్టారు.

 డైలాగు సరి చేసుకుని ఆ బృందం మళ్లీ వచ్చింది. అన్నయ్యా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మేం కాళ్లు లేకున్నా పరిగెత్తే వాళ్లం. ఇప్పుడు ట్రై సైకిల్ ఉన్నా ముందుకెళ్లడం లేదన్నా నువ్వు అధికారంలోకి రావాలి అని ఏడ్చాడు. అన్నయ్య నా భుజంపై చేయి వేయగానే నాకు కళ్లు వచ్చాయి అని మరో వికలాంగుడు సంతోషంగా గెంతులేశాడు.
అన్నయ్యా మేం ఐటి ఉద్యోగులం ... చెయ్యోళ్ల ప్రభుత్వంలో మా నాన్న ఐఎఎస్ 
పాసై  నిరుద్యోగిగా దుర్భరమైన జీవితం గడిపాడు.

 నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నేను మా అమ్మకడుపులో ఉండగానే ఐటి కంపెనీ నుంచి నాకు అపాయింట్‌మెంట్ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మా తమ్ముడు ఐఐటి చదివినా పాన్‌షాప్‌లో కూడా ఉద్యోగం దొరకడం లేదు. మళ్లీ నువ్వు రావాలన్నా రావాలి అంటూ కంటనీరు పెట్టుకున్నాడు.

రైతుల బృందం వచ్చి మీరు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి మాకు ఎరువులు, విత్తనాలు, కరెంటు అవసరమే పడలేదు. ఇప్పుడు వాటి కోసం క్యూలో నిల్చుంటే లాఠీచార్జీలు అంటూ భోరుమన్నారు. దృశ్యాలన్నీ తాము అనుకున్నట్టుగానే వస్తుండడంతో దర్శకులు సంతోషించారు. తెలుగునేత మాత్రం మనసులో... లక్ష కోట్లు సంపాదించిన నేత అధికారం నాదే అని ధీమాగా జైలులో విశ్రాంతి తీసుకుంటుంటే, నేనేమో రోడ్డున పడి నడుస్తున్నా గిట్టుబాటు అవుతుందా? అని అనుకున్నారు. దర్శకులు మనసు పెట్టి రాసిన సీన్లు ,జూనియర్ ఆర్టిస్తులంతా తలపండిన వారు కావడం వల్ల సీన్స్ బాగా వచ్చాయని అంతా అనుకున్నారు .
 యాత్రలో అవి బాగా పండి, రజనీకాంత్ సినిమాలను మించిన ప్రచారం జరిగింది. యాత్ర ముగిసింది. ఎన్నికలు వచ్చాయి. జనం తండోప తండాలుగా పోలింగ్ బూత్ లకు  తరలి వచ్చారు .
***
 అర్ధరాత్రి వరకు మీటింగ్‌లంటూ తిరిగి బారెడు పొద్దెక్కినా మంచం మీది నుంచి లేచేది లేదు అంటూ భార్య దుమ్ము దులపడంతో తెలుగు కార్యకర్త ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు. బంగారం లాంటి కల పాడు చేశావు ఇంతకూ కౌంటింగ్‌లో ఏం జరిగిందో అని మదనపడ్డాడు. ఔను కౌంటింగ్‌లో ఏం జరిగింది!తెలియాలంటే 
 2014 వరకు వేచి చూడాల్సిందే కదా!

19, సెప్టెంబర్ 2012, బుధవారం

సరసమైన ధరకు కిడ్నాప్ చేయబడును!

‘‘బాబూ కాస్త ఈ వస్తువులకు మొత్తం ధర ఎంతవుతుందో చెబుతావా?’’ అంటూ గంగాధర్ వినయంగా అడిగాడు. షాపతను లిస్ట్ చూసి జాబితా పైకే చదివాడు. పనె్నండు పెద్దవి పాత ఇనుప డ్రమ్ములు, ఆరు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములు, రెండు ట్రంకు పెట్టెలు, 43 కార్టూన్ డబ్బాలు, 10 మీటర్ల పొడవైన ఆరు ఇనుప గొలుసులు, 20 మీటర్ల ఐదు తాళ్లు, పెద్ద సైజు వీల్ చైరు, రెండు నల్లపిల్లులు, ఒక పులి చర్మం, ఒక జింక తల, అరడజను గబ్బిలాలు, ఐదారు సాలెపురుగులు, ఇంకా.....
షాపతను అంతటితో చదవడం ఆపేసి గంగాధర్‌ను చూసి బాబూ కొత్తలా ఉన్నట్టుంది అని లిస్ట్‌ను గంగాధర్ చేతిలో పెట్టాడు. ఒకపని చేయ్ ఇవన్నీ ఒకే చోట నీకు దొరకాలంటే జుమ్మేరాత్ బజార్ వెళ్లు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వరకు అన్నీ అమ్ముతారక్కడ. ఉస్మానియా ఆస్పత్రి నుంచి అలానే ముందుకెళ్లు. ఆయనెవరో పార్టీ ఉత్సవంలో లొట్టిపిట్టలను కూడా ఉపయోగించాడు వెరైటీగా అలానే జుమ్మేరాత్ బజార్‌లో చిత్రమైన పక్షులు కూడా దొరుకుతాయి వాటిని కూడా కొనుక్కో అని షాపతను సలహా ఇచ్చాడు. మీ సహాయాన్ని ఈ జన్మలో మరిచిపోలేను. నా డెన్‌కు మీ పేరే పెట్టుకుంటాను. మీ పేరేమిటి ? అని అడిగాడు. గుప్తదానాల్లా మనలాంటి వారి సేవ రహస్యంగానే ఉండాలి అన్నాడు.


జుమ్మేరాత్ బజార్‌ను చూడగానే గంగాధర్ కళ్లు తిరిగాయి. రెండు నెలల క్రితం ఎవరో ఎత్తుకెళ్లిన తమ ఇంట్లో పిల్లల సైకిల్ అక్కడ కనిపించగానే ఆశ్చర్యపోయాడు. ఈ సైకిల్ నాది అంటూ దానిపై చేయి వేశాడు. దాన్ని అమ్ముతున్న అతను ఉర్దూలో చాలా సేపు ఏదో చెప్పాడు. జారే... పాగల్... జా అనే ఒక్క మాట కాస్త వినబడింది అంతకు మించి ఏమీ అర్ధం కాలేదు. 

గంగాధర్ ఈ మార్కెట్‌కు కొత్త అని గ్రహించిన సాటి తెలుగు వాడు ఓదారుస్తూ బాబూ నీ పేరేమిటో వాడు నిన్ను తిడుతూ కొన్ని జీవిత సత్యాలను బోధించాడు, వాటిని తెలుగులోకి అనువదిస్తే, నదులన్నీ సముద్రంలోనే కలిసినట్టు ఎవరి వస్తువైన ఇక్కడికే చేరుకుంటుంది. ఏదీ ఎవరికీ చెందదు. ఏదీ శాశ్వతం కాదు ఒకనాడు నీది అనుకున్నది ఈ షాపువాడిదవుతుంది ’’ ఇది జుమ్మేరాత్ బజార్ సారం. అని అర్ధం చెప్పాడా సాటి తెలుగు వ్యక్తి.

 ‘‘పేర్లు మారుతుంటాయి కానీ ఇలాంటి జుమ్మేరాత్ బజార్‌లో అన్ని చోట్లు ఉంటాయి. వీళ్లకు వైద్యశాస్త్రంలో ప్రవేశం లేదు కానీ అందులోనూ వీళ్లు ప్రవేశించి ఉంటే నీ శరీరంలోని అవయవాలను కూడా కొట్టేసి నీకే అమ్మేయగలరు. నీకు కావలసింది కొనుక్కో అంతే కానీ కనిపించిన దానిపై వ్యామోహం పెంచుకోకు అంటూ ఆ తెలుగు వ్యక్తి తనకు కావలసినవి చూసుకోవడంలో పడిపోయాడు. జుమ్మేరాత్ బజార్ మొత్తం తిరిగి తనకు కావలసినవన్నీ కొనుక్కుని లారీలో వేసుకుని గంగాధర్ బయలు దేరాడు.
అచ్చం తెలుగు సినిమాలో మాదిరిగానే డెన్‌ను ముస్తాబు చేశారు. అడ్డా మీదకు వెళ్లి పది మంది కూలీలను పిలుచుకొచ్చాడు. వీల్ చెయిర్‌పై కూర్చున్న గంగాధర్ పిల్లి తలపై నిమురుతున్న చేతులు, వీపువైపు మాత్రమే కనిపిస్తోంది. అయ్యా అంటూ కూలీలు చేతులు కట్టుకున్నారు. ఏదో తేడా ఉందనుకున్న గంగాధర్ ఒక్క క్షణం ఆలోచించి చందన బ్రదర్స్‌కు పరిగెత్తుకెళ్లి... పది రెడీమేడ్ డ్రెస్‌లు కొన్నాడు. అంతే స్పీడ్‌గా తిరిగి వచ్చి, ఇదిగో ఈ డ్రెస్‌లు వేసుకోండి. అయ్యా కాదు బాస్ అని పిలవాలని వారికి డెన్‌కు సంబంధించి స్వల్పకాలిక కోర్సు నిర్వహించాడు. శిక్షణ సంతృప్తికరంగా సాగిందనుకున్న తరువాత ట్రయల్ రన్ చేయాలనుకున్నారు. డెన్ ప్రారంభోత్సవానికి ఐపిఎస్ అధికారి లక్ష్మయ్యను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు.


 పాత డ్రమ్ములను కాలితో దోర్లించి డెన్ ప్రారంభం అయినట్టు లక్ష్మయ్య ప్రకటించారు. ఆ వెంటనే లక్ష్మయ్యను కిడ్నాప్ చేస్తున్నట్టు గంగాధర్ ప్రకటించాడు. తెలుగును అధికార భాషగా అమలు చేయాలి, అసెంబ్లీ సమావేశాలు నెలకు పది రోజుల పాటు నిర్వహించాలి. కిరణ్ కుమార్‌రెడ్డి స్పష్టమైన తెలుగు మాట్లాడాలి. బాబు ఉపన్యాసం గంట కన్నా ఎక్కువ ఉండవద్దు. జగన్ ఓదార్చడం మానుకోవాలి వంటి కొన్ని డిమాండ్లతో ఐపిఎస్ అధికారిని కిడ్నాప్ చేసినట్టు తన ఫోటోతో పాటు గంగాధర్ మీడియాకు లేఖ పంపించాడు. ఇవేం డిమాండ్స్ అని అసిస్టెంట్స్ నవ్వారు. అవి పైకి కనిపించేవి, తెర వెనుక మన డిమాండ్లు వేరుగా ఉంటాయి అవి సంబంధిత వ్యక్తులకు మాత్రమే చెప్పాలి ఇది వృత్తి రహస్యం అని నవ్వాడు. అమెరికా అధ్యక్షుడి దేశ పర్యటన, భారత ప్రధాని విలేఖరుల సమావేశాలను పక్కకు తోసేసి ఆ రోజంతా చానల్స్‌లో గంగాధర్ జీవిత విశేషాలనే వివరించసాగారు. మొత్తం తెలుగు ప్రపంచంలో గంగాధర్ పేరు మారుమ్రోగింది. ఉదయం జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హోంమంత్రి, కిడ్నాపర్ గంగాధర్ మాట్లాడారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని, ఇలా స్పందించే ప్రభుత్వం ఉండడం రాష్ట్రం చేసుకున్న అదృష్టం అని గంగాధర్ చెప్పాడు. గంగాధర్ లాంటి వారు ప్రశంసించే విధంగా రాష్ట్రంలో పాలన సాగుతుందని హోంమంత్రి సగర్వంగా ప్రకటించారు. గంగాధర్ ఇంటర్వ్యూ కోసం టీవి చానల్స్ వాళ్లు పోటీ పడ్డారు. ఒకరిద్దరు సినిమా నిర్మాతలు ఫోన్ చేస్తే గంగాధర్ సున్నితంగా తిరస్కరించారు.తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో గంగాధర్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేశాడు. ఎలాంటి సమస్యకైనా కిడ్నాప్ ద్వారా సరసమైన ధరలకు పరిష్కారం చూపబడును. మీరు చెల్లించే అడ్వాన్స్‌కు బ్యాంకు గ్యారంటీ ఇవ్వబడును. అని గంగాధర్ పత్రికల్లో ప్రకటన ఇచ్చాడు.
ముక్తాయింపు: ఇది వ్యంగ్యం కాదు న్యూస్ అంటారా? సరే మీ ఇష్టం.

12, సెప్టెంబర్ 2012, బుధవారం

నారా లోకేష్ తొలి రాజకీయ ప్రకటన -- అక్షర సత్యం




కాంగ్రెస్స్ ను ఎదుర్కొనే సత్తా  మాకే ఉంది ..చిత్తూరులో నారా లోకేష్ ( చంద్రబాబు కుమారుడు )

- రాజకీయాలకు కొత్త అయినా , ఏ ఉద్దేశం తో చెప్పినా బాగా చెప్పావు లోకేష్ .. తెలంగాణాలో  తెరాస , సీమంద్రలో  జగన్ మొదటి స్థానం లో నిలుస్తారని సర్వేలు చెబుతున్నాయి . రెండవ  స్థానం కోసం  కాంగ్రెస్స్ తో పోటీ పడే  సత్తా మీకే ఉంటుంది .

యువతాతల మేధోమథనం

కార్లు పుట్టిన కొత్తలో ఇండియాకు వచ్చిన కారులా ఉన్న కారు కనిపించగానే అంతా అటువైపు ఆసక్తిగా చూస్తున్నారు.  కారును మించి పాతగా కనిపిస్తున్న ఒక వృద్ధుడు కారులోంచి దిగి. బాబూ ఇక్కడ యూత్ కాంగ్రెస్ మీటింగ్ జరుగుతుందట ఎక్కడా? అని అడిగాడు. అదిగో అక్కడున్న జూబ్లీ హాలులో తాతయ్యా! అని అటువైపు చూపించాడు. అయినా ఈ వయసులో యూత్ కాంగ్రెస్‌తో మీకేం పని తాతయ్యా అంటూ నవ్వాడా? యువకుడు. 

1952లో యూత్ కాంగ్రెస్‌లో ఉన్న యూత్‌ను రాష్ట్ర రాజకీయాలపై మేధోమథనం జరపడానికి హనుమంతరావు అనే యువకుడు పిలిచాడు బాబు అని నెమ్మదిగా చెప్పాడు ఆ వృద్ధుడు. వాడు చీమిడి ముక్కుతో చెడ్డి కూడా సరిగా వేసుకోకుండా స్కూల్ ఎగ్గొట్టి సినిమా హాళ్ల చుట్టూ తిరిగే వాడు. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడు. కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది. చీమిడి ముక్కు పోరగాడు ఇంత పెద్ద రాష్ట్రానికి అంత పెద్ద పదవి చేపట్టే యువకుడయ్యాడంటే సంతోషమే కదా? బాబు...అనుకుంటూ జూబ్లీ హాల్‌వైపు వెళ్లాడా! వృద్ధుడు.

అప్పటికే అక్కడికి రెండు వందల మంది వరకు వృద్ధులు చేరారు. అతన్ని చూడగానే ఓరి...ఓరి.. వీరిగా నిన్ను చూసి ఎన్నాళయిందా? ఇంత కాలం ఎక్కడున్నావు... పిల్లలేం చేస్తున్నారు? అంటూ మరో వృద్ధుడు ఆప్యాయంగా భుజంపై చేయి వేసి ప్రశ్నల వర్షం కురిపించాడు. ఎవరూ.. క్షమించాలి బాబు గుర్తు పట్టకలేకపోతున్నాను అని వృద్ధుడు అద్దాలను సరి చేసుకున్నాడు. నేనురా యూత్ కాంగ్రెస్‌లో మనమిద్దరం క్యాంపుల కెళ్లినప్పుడు గోడలు దూకి నానా అల్లరి చేసేవాళ్లం పండరిని అని కొత్త వృద్ధుడు చెప్పాడు. ఓరి పండరిగా నువ్వారా! నువ్వు పోయావన్నారు ? ఇంకా పోలేదా? అని అడిగాడు. రెండు సార్లు గుండెపోటు వచ్చింది పోయింది నేను కాదు మన బ్యాచ్‌లో కర్రిగాడు ఉండేవాడు కదా? వాడు పోయాడు అని చెప్పాడు. మన హనిమిగాడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడట కదా! రమ్మని లేఖ పంపాడు అందరినీ చూసినట్టు ఉంటుంది అని వచ్చాను అని వీరిగాడు అనబడే ఆ వృద్ధ వీరేశం చెప్పుకుపోతున్నాడు.

 హనిమి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాదురా! వాడి మనవడికి కూడా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వయసు దాటి పోయింది. ఐనా అదేం చిత్రమో రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ అంటే ఇప్పటికీ మన హనుమంతే గుర్తుకొస్తాడు అని పండరి గర్వంగా చెప్పుకొచ్చాడు. ఓహో అలాగా! భడవ మంచి పని చేశాడురా! ఖండ ఖండాల్లో ఉన్న మనమంతా కనీసం ఈ విధంగానైనా కలుసుకున్నాం అన్నాడు వీరి.
వీరు మాట్లాడుకుంటుండగానే చిరంజీవి వచ్చాడు. ఎవరూ ఆయన్ని పట్టించుకోలేదు. అక్కడున్న వృద్దుల్లో ఒక్కరికీ చిరంజీవి తెలియదు, చిరంజీవికి ఒక్కరూ తెలియదు. దాంతో ఆయన పెద్దలను గౌరవించుకుంటూ ఒక పక్కకు వెళ్లి కూర్చున్నాడు.
***

వృద్ధులంతా గుంపులు గుంపులుగా చేరి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఆ గ్రూప్ డిస్కషన్ సారాంశం ఇలా ఉంది.
‘‘బైపాస్ సర్జరీ జరిగింది ఇప్పుడు పరవా లేదు.
రోజుకు అరగంట నడువు చాలు నీ రోగాలన్నీ కనిపించకుండా పోతాయి.
కీళ్ల నొప్పులు, కళ్లు సరిగా కనిపించవు, చెవులు వినిపించవు. మతిమరుపు పెరిగింది.
ఈ ముసలోడు ఎప్పుడు పోతాడా! ఇంటిని అమ్మేద్దామా? అని చూస్తున్నారురా!
మధుమేహం, బిపి, ఇంకెంత కాలం బతుకుతావు అని ననే్న నేరుగా అడిగేశారు.
నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు . ఈ వయసులో పార్టీ నాయకుల నంబర్లు కాదురా! డాక్టర్ల ఫోన్ నంబర్లు ముఖ్యం’’
***

హనుమంతరావుకు కోపం వచ్చింది. ఇదిగో 1952 నుంచి కూడా మీలో ఏ మార్పు రాలేదు. అప్పుడు కూడా యూత్ కాంగ్రెస్‌లో గ్రూపులు మేయింటెన్ చేసేవాళ్లు. ఇక్కడికొచ్చినా అదే చేస్తున్నారు. మేధోమథనంలో రాష్ట్ర కాంగ్రెస్‌ను రక్షించడానికి ఏం చేయాలో ఆలోచిద్దామని మీ అందరినీ పిలిస్తే మీరంతా మీ మీ రోగాల గురించి చర్చించుకోవడం ఏమీ బాగా లేదు. ‘‘ఓరి భడవా అక్కడికొచ్చానంటే రెండు ఇచ్చుకుంటాను. ఒక్క రోజైనా క్లాస్‌లో సరిగా పాఠం విన్నావురా! మీ నాన్న మాకు చెప్పుకొని ఏడ్చేవాడు, పిల్లాడు ఏమైపోతాడో అని ఏమీ కాదు యూత్ కాంగ్రెస్‌లో చేర్పించు అని నేను చెబితేనే కదరా! చేర్పించింది ఇప్పుడు మాకే చెబుతున్నావా? ’’అని కోటేశ్వరరావు వణికిపోతూ కడిగి పారేశాడు.


అది కాదు తాత మీరంతా కాంగ్రెస్‌ను బతికించుకోవడానికి మంచి సలహాలు ఇస్తారని అని హనుమంతరావు నసిగాడు.
పిచ్చి కుంక కాంగ్రెస్‌ను ఒకరు బతికించలేరు... చంపేయలేదు.... కాంగ్రెస్ తనంతట తానే బతుకుతుంది.. తనంతట తానే చస్తుంది.... నువ్వు నేను, హై కమాండ్ అంతా నిమిత్తమాత్రులం. భీష్ముడికి తాను కోరుకున్నప్పుడు మరణించే  వరం ఉన్నట్టుగానే .. ఎవరు ప్రయత్నించక పోయినా తనంతట తానే చచ్చే శాపం కాంగ్రెస్స్, తనకు తానే సంపాదించుకుంది .. అని చెప్పాడు కోటి.

***
కొద్దిసేపటి తరువాత వేదిక మీద ఒక మూల నుంచి వా! వా!! అని ఏడుపు వినిపించింది. చిరంజీవి కన్నీళ్లు పెడుతున్నాడు. ఎవరా కుర్రాడు ఎందుకేడుస్తున్నాడు అనే ప్రశ్నలు వినిపించాయి. ‘‘రాజకీయాలపైనే ఆశలు పెట్టుకొని బతుకుతున్నాను. సొంత పార్టీతో వర్కవుట్ కాలేదు. మీ ఉపన్యాసాలు వింటే ఈ పార్టీ కూడా బతికి బట్టకట్టేట్టు కనిపించడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి. పార్టీ రోగాలు మీ రోగాల జాబితా విన్నాక జీవితం మీదనే విరక్తి కలుగుతోంది’’ .. వా! వా! అని మళ్లీ ఏడుపు మొదలు పెట్టాడు చిరంజీవి.
మేధోమథనానికి ముగింపు ఉండదు. అలా సాగుతూనే ఉంటుంది.

5, సెప్టెంబర్ 2012, బుధవారం

మన్మోహన మౌనాయుధం

మౌనాన్ని 
మేరే పాస్ గాడీ హై, బంగ్లా హై అంటూ ఇంకా ఏమేం హైలో అమితాబ్ వరుసగా చెప్పుకుంటూ పోతుంటే శశికపూర్ మెల్లగా మేరే పాస్ మా హై అంటాడు. దివార్‌లో ఈ డైలాగు హిందీ సినిమాలు ఉన్నంత కాలం గుర్తుండిపోతుంది.  ఇలానే పార్లమెంటులో బిజెపి వాళ్లు కాంగ్రెస్ కుంభకోణాల జాబితా చదువుతుంటే, తనతో తాను కూడా మాట్లాడుకోని మన్మోహన్‌సింగ్ ఏదో చెప్పడానికి సన్నద్ధం అవుతున్నారు. స్పీకర్ ఆప్ బైటియే ఆప్ బైటియే అంటూ తాను లేచి ఎంత మొత్తుకున్నా ఒక్కరూ కూర్చోలేదు. కానీ మన్మోహన్ సింగ్ లేవగానే అంతా బిత్తర పోయారు. ఆయుధం చేపట్టను అని మహాభారత యుద్ధం ప్రారంభ సమయంలోనే శ్రీకృష్ణుడు షరతు విధిస్తాడు. అలాంటి శ్రీకృష్ణుడికి సైతం యుద్ధంలో ఒకసారి కోపం వచ్చి తానే స్వయంగా యుద్ధం చేసేందుకు ముందుకు వస్తాడు. ఈ చర్యతో పాండవులు కౌరవులు బెంబేలెత్తిపోతారు . అలానే మన్మోహన్‌గారే స్వయంగా మాట్లాడేందుకు లేవడంతో ఇరుపక్షాలు బిత్తరపోయాయి. 

చాలా రోజుల నుంచి ఉపయోగించకపోవడం వల్ల పని చేస్తుందో లేదో అని మన్మోహన్‌సింగ్ గొంతు సవరించుకున్నారు. నీళ్లు తాగారు. చాలా కాలం ఉపయోగించని వాహనాలకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. అలానే మన్మోహన్‌కు కొద్దిసేపటి తరువాత తన గొంతు తన అదుపులోకి వస్తున్నట్టు అనిపించింది. అటువైపు చూశాడు. సోనియాగాంధీ గుడ్లు ఉరుమి చూస్తున్నట్టు అనిపించిది. తన అనుమతి లేకుండా మన్మోహన్ ఏదో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రహించి, క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని సోనియా ముఖ కవళికలతోనే ఆదేశాలను పంపించారు. 

నిశ్శబ్దంలో గట్టిగా మాట్లాడితే మన మాట మనకే ఎంతో మధురంగా వినిపిస్తుంది. ఆ విషయం సుష్మా స్వరాజ్‌కు బాగా తెలుసు ఆమె ఆ చాన్స్ వదలుకోదలుచుకోలేదు. హమారే పాస్ బోఫోర్స్‌కా రికార్డ్స్ హై, 2జికా రిపోర్ట్స్ హై... అబ్ బొగ్గు కుంభకోణంకా కాగ్ రిపోర్ట్ హై ఆప్‌కే పాస్ క్యా హై అంటూ సుష్మా స్వరాజ్ ఆవేశంగా ఫైళ్ల దొంతరను టేబుల్‌పై వేశారు. మన్మోహన్ గొంతు సవరించుకుని మేరే పాస్మౌన్ హై... వెయ్యి ప్రశ్నలకు సరితూగే సమాధానం మౌనమే అని ఆయన పంజాబిలో చదువుకున్న ఉర్దూ కవితను హీందీలో చెప్పి ఇక చెప్పడానికి ఇంతకు మించి ఏమీ లేదన్నట్టు కూర్చుండి పోయారు. సోనియా ముఖం సంతోషంతో విప్పారింది.  చదువుకునే పిల్లాడు బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు వాళ్లింట్లో అనుమతి లేకుండా ఏ ఆటవస్తువును ముట్టుకోవద్దు, బుద్ధిగా కూర్చోవాలి అని తల్లి చెబితే, ఆ పిల్లాడు ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తే, ఆ తల్లి ఎంతగా సంతోషిస్తుందో సోనియా అంతగా సంతోషించారు. ఇంట్లో కార్టూన్ నెట్ వర్క్ చూస్తున్న కొడుకుతో బాబు నాకిష్టమైన కలవారి కోడలు సీరియస్ రెండువేల ఒకటో ఎపిసోడ్ చూడాలి అనగానే బుడిబుడి అడుగులతో రిమోట్ పట్టుకొచ్చి తల్లి వళ్లో వేస్తే ఆ తల్లి ఎంతగా సంతోషిస్తుందో మన్మోహన్‌ను చూసి సోనియా అంతగా సంతోషించింది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తే తల్లిదండ్రులు ఎంతగా సంతోషిస్తారో, కలిసొచ్చే కాలానికి మౌనంగా ఉండే ప్రధాని లభించడం ఏ పార్టీ నాయకురాలికైనా సంతోషకరమే కదా! మీ వెయ్యి ప్రశ్నలకు నా ఒక్క మౌనమే సమాధానం అని ఆయన చెప్పగానే ముందు సోనియా ఆ తరువాత కాంగ్రెస్ సభ్యులు చప్పట్లు కొట్టి అభినందించారు.

బిజెపి సభ్యులు కోయ్‌లా గొటాలా హాయ్.. హాయ్ అని నినాదాలు చేస్తుంటే కాంగ్రెస్ సభ్యులు హమారే పాస్ మౌన్ హై మౌన్ హై అంటూ నినాదాలు చేయసాగారు. దేశం అట్టుడికిపోతుంటే ఈ బిజెపి వాళ్లేంది కోయిల ... కొయిలా అంటారు అని రాయపాటి పక్కనున్న గారపాటిని అడిగారు. వెనక వైపు నుంచి ఈ మాటలు విన్న మరో ఎంపి కోయ్‌లా అంటే కోయిలా కాదు బొగ్గు. వాళ్లు బొగ్గు కుంభకోణం గురించి నినాదాలు చేస్తున్నారు. అని నవ్వాడు. ఇదిగో మనకెందుకు మనమేమన్నా మాట్లాడితే మన కుంభకోణాలు బయటపెడతారు. అసలే అధికారంలో ఎవరున్నారో, ఎవరి కుంభకోణాలు ఎవరు భయటపెడుతున్నారో అర్ధం కాని పరిస్థితి అని తెలుగు ఎంపి ఒకరు చెప్పగానే అంతా మాట్లాడడం మానేశారు.

మొండివాడు రాజుకున్నా బలవంతుడట! మొండివాడి కన్నా మౌనంగా ఉండేవాడు మరింత శక్తివంతుడు. మౌనాన్ని నమ్ముకున్నవాడికి ఎలాంటి సమస్య ఉండదు. మహాభారత యుద్ధంలో ప్రతి వీరుడి వద్ద ఒక శక్తివంతమైన ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధాన్ని ఒకసారి ప్రయోగిస్తే మరోసారి ప్రయోగించడానికి చాన్స్ ఉండదు. కానీ మౌనం మాత్రం ఎన్ని సార్లయినా ప్రయోగించడానికి అవకాశం ఉన్న శక్తివంతమైన ఆయుధం. నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతుంటే భీష్ముడు మౌనంగానే ఉన్నాడు కానీ పల్లెత్తు మాట అనలేదు. ధర్మరాజు జూదంలో ముందు తాను ఓడిపోయి తరువాత నన్ను ఓడిపోయాడా? లేక నన్ను ఓడిపోయాక తాను ఓడిపోయాడా? కనీసం ఈ ప్రశ్నకన్నా సమాధానం చెప్పమని ద్రౌపది అడిగితే, భీష్ముడు మౌనంగానే ఉంటాడు. సమాధానం తెలియ కాదు. సమాధానం చెబితే బాస్‌కు కోపం వస్తుంది. ఆవెంటనే ఊస్టింగ్ లెటర్ వస్తుంది. కార్పొరేట్ కంపెనీ అయినా కౌరవ కొలువులోనైనా, రాజకీయ పదవిలోనైనా ఉద్యోగాన్ని నిలుపుకోవడానికి మౌనాన్ని మించిన లౌక్యం లేదు. తన వౌనాయుధంతో మన్మోహన్ ఇటు సొంత పక్షాన్ని సంతృప్తి పరుస్తున్నారు, అటు ప్రతిపక్షానికి చిక్కడం లేదు. మౌనాన్ని మించిన ఆయుధం లేదని నిరూపిస్తున్నారు.