28, డిసెంబర్ 2011, బుధవారం

ట్రెండు మారింది స్క్రిప్ట్ మార్చండయ్యా!...రాజకీయ వ్యంగ్యం

గళ్ల లుంగి. ఒకవైపు పైకి మరోవైపు కిందికి. ముఖానికి పెద్ద గాటు. మెడకు కట్టుకున్న కర్చీప్. చేతిలో పెద్ద కర్ర. అతను భయంకరంగా కనిపిస్తున్నాడు. వాడి పేరు గంగులు అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వందల తెలుగు సినిమాల్లో దొంగతనం చేసే గంగులు తప్పని సరిగా ఇలానే దర్శనమిచ్చేవాడు. దొంగకు ఆ కాలంలో ఈ మాత్రం బిల్డప్ ఉండాలి. రూపం సంగతి సరే దొంగలందరికీ అలా ఒకే చోట గాటు ఉండడం ఏమిటనే సందేహం అప్పుడప్పుడు వచ్చేది.


 వారధి నిర్మించడంలో సహాయం చేసిన ఉడతను శ్రీరాముడు ఆప్యాయంగా నిమిరితే గీతలు పడ్డాయట! ఒక ఉడతను ఆప్యాయంగా నిమిరితే మొత్తం ఉడతలకు గీతలు వంశ పారంపర్యంగా వస్తున్నప్పుడు ఒక గంగులు ముఖానికి గాటు పడితే దొంగలందరికీ గాటు ఉండడం సబబే అనిపించింది. మరిప్పుడో కర్చిప్ స్థానంలో మెడకు చక్కని టై వచ్చి చేరింది. గంగులు అనే మొరటు పేరు నుండి మిస్టర్ వర్మ అనో కోనేరు ప్రసాదు అనో చక్కని పేర్లు ఉంటున్నాయి. కాలం మారింది మరి గళ్ల లుంగీతో దోపిడీలు చేయాలంటే సాధ్యమయ్యే పనేనా? పేరు కూడా మారింది. ఇప్పుడు ఇష్టం ఉన్నా లేకున్నా, సూట్ అయినా కాకున్నా సూట్ వేసుకోవలసిందే! ఆనాటి గంగులులా దౌర్జన్యాలు చేస్తామంటే కుదరదు, దురుసుగా మాట్లాడడం సాధ్యం కాదు. చేతిలో కర్ర పట్టుకుని తిరగడం ఊహకే అందని కోరిక. భారీ కార్లలో, చక్కని సూట్‌లో కనిపించి తీరాల్సిందే లేకపోతే దగా మోసం మార్కెట్‌లో ప్రవేశమే ఉండదు. ఆర్థిక సంస్కరణల తరువాత దొంగల రూపే మారిపోయింది. వారు కూడా సంస్కరణల బాట పట్టేశారు.


గతంలో మహాభారత యుద్ధం సైతం బాణాలతో, గదలతో ముష్టిఘాతాలతో సాగేది. రామాయణం అంతే రాముడు మహాబలసంపన్నుడైనా, బాణాలతో బ్లాక్ అండ్ వైట్‌లో కొద్దిపాటి మెరుపులు మెరిపించేవాడు. టెక్నాలజీ పెరిగింది గ్రాఫిక్ మయాజాలం దేవుళ్లను సైతం వశం చేసుకుంది. కాలం మారింది టెక్నాలజీ పెరిగింది మరి దేవుళ్లు సైతం మారిన కాలానికి తగ్గట్టు యుద్ధాలు చేస్తున్నారు.
ఐతే ఏంటీ ? ఇంతకూ ఏం చెప్పదలుచుకున్నారని అడుగుతున్నారా?
మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు ప్రపంచంలో అన్నీ మారుతాయి అంటారు. మారాల్సిందే. తప్పదు మరి! కాలం ఇంత మారినా దేవుళ్లు, మనుషులు, దొంగలు సైతం సంస్కరణల బాట పట్టి మారుతుంటే మన రాజకీయ నాయకులు మాత్రం దశాబ్దాల క్రితం నాటి స్కిృప్ట్‌ను మార్చడం లేదు. డైలాగులు మారడం లేదు.
అందుకే కాలం మారింది స్క్రిప్ట్ మార్చండయ్యా అనేది.


ప్రపంచం అంతా మారుతోంది. వ్యాపారాలు అన్నీ మారుతున్నాయి. పూటకూళ్ల ఇళ్లలో తిండి అమ్ముకునే కాలం నాటి డైలాగులనే స్టార్ హోటళ్ల కాలంలో నాయకులు వినిపిస్తున్నారు. ఇంకెప్పుడు మారుతారు, మారండయ్యా! కొత్త జనరేషన్‌కు తగ్గట్టు కొత్త డైలాగులు, కొత్త స్క్రిప్ట్‌లతో రండయ్యా! ‘ప్రజలే నా దేవుళ్లు, వారికే నా జీవితం అంకితం. చివరి రక్తం బొట్టువరకు రైతుల కోసమే ఉద్యమిస్తాను’ అబ్బబ్బ ఇంకెంత కాలం చెబుతారు ఈ డైలాగులు. 1960 ప్రాంతంలో నాగభూషణం మహమ్మద్‌బిన్ తుగ్లక్ సినిమాలో ప్రజలే నా దేవుళ్లు అని రాజకీయ నాయకుడు డైలాగు చెప్పడాన్ని తొలిసారిగా ఉపయోగించారు. 82లో కొత్త పార్టీ నేత ఈ డైలాగులను చాలా సీరియస్‌గా ఉపయోగించారు. జనం కూడా బాగానే నమ్మారు. సరే సినిమా డైలాగు అయినా రాజకీయాల్లో తొలిసారి ఉపయోగించారు కాబట్టి బాగానే హిట్టయింది. 50 ఏళ్ల క్రితం నాటి ఆ సినిమా డైలాగు, 30 ఏళ్ల క్రితం నాటి రాజకీయ డైలాగును ఇంకా వాడుకుంటే ఎలా? కొత్త డైలాగు చెప్పండి. నెహ్రూ చితాభస్మాన్ని ఆకాశం నుండి పొలాల్లో చల్లించారంటారు. బ్లడ్ బ్యాంకు ద్వారా ఈయన రక్తం బొట్లను అందరికీ పంచుతారో ఏమిటో?


మురికివాడల్లో ముక్కుచీమిడి కారే పిల్లలను ముద్దుపెట్టుకుంటూ కెమెరాలకు ఫోజులిచ్చే టెక్నిక్ ఇందిరాగాంధీ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తనాటిది. సరే నానమ్మ వారసత్వంతో ఆమె మనవడు రాజకీయ శిక్షణలో భాగంగా గుడిసెల్లో దూరి భోజనం చేయడం, కాలేజీలకు వెళ్లి రాజకీయాల గురించి మాట్లాడితే పిల్ల చేష్టలు అనుకోవచ్చు. 60 ఏళ్లు దాటి, రిటైర్ మెంట్‌కు చేరువైన వారూ అవే నాటకాలా? తల్లిదండ్రులనే మా ఆవిడ వద్దంటుందమ్మా !అంటూ వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్న కాలమిది దశాబ్దాల తరబడి ఓదార్పులు అంటూ జనం మీద పడితే నమ్ముతారా? ఆన్‌లైన్‌లో పంటలు పండించవచ్చునని నమ్మేవారు సైతం పంట పొలాల వెంట పడి రైతులకే నా జీవితం అంకితం అని ఎంత కాలం చెబుతారు. దళితుల అభ్యున్నతి కోసమే పుట్టామని ఎంత కాలం చెప్పుకుంటారు. 1885లో కాంగ్రెస్ పుట్టాక, వచ్చిన తొలి ఎన్నికల్లో చెప్పిన మాటల నుండి నిన్నమొన్న పుట్టిన పార్టీ వరకు అన్ని పార్టీల ఎన్నికల ప్రణాళికలో అవే డైలాగులు సమసమాజం, పేదరిక నిర్మూలన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ... వైగైరా.. వైగైరా... అవే డైలాగులు, తళతళలాడే ఖద్దరు డ్రెస్సు, మెడలో కండువా. ప్రతిసారి బడ్జెట్‌పై చెబుతారు అదేంటీ ఆ కొత్త సీసాలో పాతసారా! అని అలానే మీరు పార్టీల పేర్లు మారుస్తున్నారు తప్ప అదే వ్యాపారం, అవే డైలాగులు, అదే స్క్రిప్ట్. స్క్రిప్ట్ మార్చండి. కొత్త డైలాగులు చేర్చండి...

27, డిసెంబర్ 2011, మంగళవారం

మన చానల్స్‌కు చట్టాలు వర్తించవా? టైమ్స్ నౌ పై కేసు పెట్టినట్టు తెలుగు చానల్స్ పై కేసులు పెట్టరేమిటి ?


కొన్ని దేశాల్లో చట్టాలు అక్రమాలకు అనువుగా ఉంటాయి. అలాంటి దేశాల నుండే మన దేశానికి నిధులు వస్తుంటాయి. ఇక్కడ సంపాదించిన సొమ్ము ఆ దేశాల ద్వారా అక్రమంగా మళ్లీ ఇక్కడికే వస్తుంటుంది. అక్రమ సంపాదన పరులకు ఈ దేశాలు కొంగు బంగారం వంటివి. అలానే తెలుగు నాట చానల్స్‌కు చట్టాలు వర్తించవా? అనే అనుమానం కలుగుతోంది. ప్రముఖ సినిమా హీరో అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ మద్యం సేవించి కారు నడిపారని, ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారని ఈ నెల 20న తెలుగు చానల్స్ ఒకరిని చూసి ఒకరు హడావుడి చేశాయ. నాగార్జున తండ్రి సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారే, మహానటుడు, నాగార్జున నటుడు, ఇక అఖిల్‌ను నేడో రేపో హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నారు. ఇంకేం చానల్స్‌లో ఈ వార్త హడావుడి చేయడం సహజమే. అంతా బాగానే ఉంది కానీ చివరకు తేలింది ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్న అఖిల్ నాగార్జున కుమారుడు అఖిల్ కాదు. ఫార్ములా వన్ డ్రైవర్ అఖిల్ కుష్‌లానీ.

 మద్యం తాగి వాహనాన్ని నడుపుతున్న అతన్ని ట్రాఫిక్ పోలీసులు తిరుమలగిరిలో పట్టుకున్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో కానీ అఖిల అనగానే టీవిల్లో నాగార్జున కుమారుడని ప్రకటించి హడావుడి చేశారు. తరువాత కనీసం పొరపాటు జరిగింది ఫార్ములా వన్ డ్రైవర్ అఖిల్‌ను నాగార్జున కుమారుడు అఖిల్ అనుకున్నాం అనే సవరణ అయినా స్క్రోలింగ్‌లో చూపాల్సిన కనీస బాధ్యత లేదా?
ఇలాంటివి చూసిన తరువాతనే చట్టాలు మన తెలుగు చానల్స్‌కు పని చేయవేమో అనిపిస్తుంది. ఎందుకంటే గజియాబాద్ ఫ్రావిడెంట్ ఫండ్‌లో భారీ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణానికి బాధ్యులు సావంత్ కాగా టైమ్స్ నౌ చానల్ పొరపాటున సావంత్ ఫోటోకు బదులు జస్టీస్ సామంత ఫోటో చూపించారు. పొరపాటు జరిగిందని, ఒకరి ఫోటోకు బదులు మరొకరి ఫోటో టీవిలో చూపించామని టైమ్స్ నౌ స్క్రోలింగ్‌లో పదే పదే చూపించింది. అయితే సామంత్ టైమ్స్ నౌ పై పరువు నష్టం దావా వేశారు. కోర్టుకు వెళ్లడంతో వంద కోట్ల రూపాయల జరిమానా విధించారు. టైమ్స్ నౌ సుప్రీంకోర్టుకు వెళ్లగా ఈ వ్యవహారంలో సుప్రీం సైతం జోక్యం చేసుకోలేమంది. ముందు 20 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయమంటే చేశారు. ఇది జాతీయ స్థాయిలో మీడియాలో సంచలనాత్మకంగా మారింది. రెండు పేర్ల మధ్య పోలికలు ఉన్నాయి. ఉద్దేశ పూర్వకంగా చేసిన తప్పు కాదు. పైగా పొరపాటు జరిగిందని ప్రకటించారు. అయినప్పటికీ జరిమానా తప్పలేదు.
పొరపాటు జరిగిన దానికే ఇంత తీవ్రంగా స్పందిస్తుంటే ఉద్దేశ పూర్వకంగానే తెలుగునాట చానల్స్ నిబంధనలు తుంగలో తొక్కినా ఎలాంటి చర్యలేదు. నాగార్జున లాంటి వారు ఇలాంటివి పట్టించుకోకపోతే ఫరవాలేదు కానీ కోర్టుకు వెళితే?
వ్యభిచారం కేసులో పట్టుపడినా? నృత్యాలు చేస్తున్న వారిని అరెస్టు చేసినా వారి ముఖాలను టీవిల్లో చూపించవద్దు. దీనికి సంబంధించి స్పష్టమైన నియమ నిబంధనలు, కోర్టు తీర్పులు ఉన్నాయి. అయితే వీటిని ఏ చానల్ పాటించదు. పైగా అలాంటి నిబంధనలు ఉన్నాయనే విషయం కూడా వారికి గుర్తుండదు. నగర శివార్లలో అమ్మాయిల అర్ధనగ్న దృశ్యాలు అంటూ పోలీస్ స్టేషన్‌లో అమ్మాయిల ముఖాలను చూపుతుంటారు. అక్కడి పోలీసులకు తెలియకుండానే నగర శివార్లలో ఫాం హౌస్‌లో నృత్యాలు జరుగుతాయని అనుకోలేం. ఏదో తేడాలు వచ్చినప్పుడు దాడులు జరుగుతుంటాయి, మీడియాను పిలిచి హడావుడి చేస్తారు. వారు అర్ధనగ్నంగా నృత్యాలు చేశారో, మిత్రులతో కలిసి వచ్చారో, ఏం జరిగిందో తెలియదు కానీ చానల్స్‌లో మాత్రం ఆ అమ్మాయిలు ముఖాలను పదే పదే చూపుతూ బోలెడు కవిత్వాన్ని ఒలకబోస్తుంటారు. వాళ్ల ముఖాలు టీవిలో కనిపిస్తే ఆ కుటుంబం ఏం కావాలి. వ్యభిచారం చేసినా ముఖం చూపించవద్దు అనే చట్టం చెబుతుంటే నృత్యాలు చేశారు అంటూ ముఖాలు నేరుగా చూపించడం చట్ట వ్యతిరేకం కాదా? నిబంధనలకు విరుద్ధంగా నృత్యాలు చేస్తున్నారంటూ నిబంధనలకు విరుద్ధంగా టీవిల్లో ఎలా చూపిస్తారు. రెండూ చట్ట వ్యతిరేకమే కదా?
చానల్స్ పోటీతో కొందరి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఆ మధ్య ఒక అమ్మాయిని ప్రేమించానంటూ ఉన్మాది ఆ అమ్మాయి తల్లిదండ్రులను చంపేశాడు. ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. ఆ వార్తలను పదే పదే చూపుతుంటే టీవిల ముందే పెద్ద అమ్మాయి ఏడ్చింది అలా చూపించకండి అంటూ. కొన్నాళ్ల తరువాత కేసు విచారణ జరిగి దోషికి శిక్ష పడింది. అప్పుడు మళ్లీ టీవిల వాళ్ల ఆ అక్కా చెల్లెళ్లను మళ్లీ టీవిల్లో పదే పదే చూపించారు. దాంతో చెల్లెలు, దీన్ని తట్టుకోలేక పోతున్నానని, బతికున్నంత వరకు ఇలానే చూపిస్తారని ఆవేదన చెంది పాఠశాలలోనే భవనం పై నుండి పడి ఆత్మహత్య చేసుకుంది. అయినా మన చానల్స్ గుండె కరగలేదు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ చూపుతూనే ఉన్నారు. నేరం చేసిన మహిళ అయినా సరే ముఖాన్ని టీవిలో చూపించ వద్దనే నిబంధన ఉల్లంఘించినందుకు చాలా రోజుల క్రితం ఒక సామాజిక ఉద్యమ కారిణి కోర్టుకు వెళితే, ప్రముఖ చానల్‌కు జరిమానా విధించారు. భార్యా భర్తల గొడవ, అక్రమ సంబంధాలు, అనుమానాల వ్యవహారాల్లో సైతం కెమెరాలు పట్టుకుని చానల్స్ దూరిపోతున్నాయి. ఒకావిడ తన భర్త ఎవరితోనో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని చానల్స్ వారిని, జనాన్ని వెంటబెట్టుకుని సాక్షాలతో చూపించి, ఆమెను చితగ్గొట్టింది. భార్యా భర్త, ఆవిడ ముగ్గురు, బంధు జనం రోడ్డున పడ్డారు. కొట్టుకున్నారు. టీవి చానల్స్‌కు పసందైన దృశ్యాలు లభించాయి. ప్రసారం చేశారు. దీని తరువాత ఆ భర్త బుద్ధిగా కాపురం చేసుకున్నాడా? ఆ విషయం చానల్‌కు ఎందుకు అప్పటికప్పుడు న్యూ సెన్స్ జరిగి మంచి దృశ్యాలు దొరికితే చాలు, ఆ అవమానాన్ని భరించ లేక ఆమె ఆత్మహత్య చేసుకుంటే వారికేంటి?
పోటీ వల్ల ఎవరికి వారు తాము వెనకబడతామేమోనని నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇలాంటి తప్పులను క్షేత్ర స్థాయిలో ఉండే రిపోర్టర్లు ఆపలేరు. నిబంధనలు ఉల్లంఘించిన సంఘటనల్లో సామాజిక ఉద్యమ కారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటే చానల్స్‌లో మార్పు రావచ్చు. టైమ్స్ నౌ సంఘటనలో మానవ తప్పిదానికి పెద్ద శిక్ష వేశారు, కానీ ఇక్కడ ఉద్దేశ పూర్వకంగా జరుపుతున్న తప్పులను నివారించడానికి తీవ్రమైన చర్యలు అవసరం.

22, డిసెంబర్ 2011, గురువారం

భగవద్గీత..టెర్రరిజం..గాంధీ..!!.....వేదాలనూ నిషేధించాలి

చందమామపై అడుగుపెట్టి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తిన సోవియట్ రష్యా పతనంతో పరిశోధనలు మందగించాయనిపించింది. కమ్యూనిజం ప్రయోగం విఫలమై, సోవియట్ రష్యా ముక్కచెక్కలైన తరువాత రష్యా, భగవద్గీతపై బాగానే పరిశోధన జరిపినట్టుగా ఉంది. వాళ్ల పరిశోధనల్లో ప్రపంచంలో టెర్రరిజానికి మూలం భగవద్గీత అని తేలిపోయింది. దాన్ని నిషేధించాలని కోర్టు నిర్ణయించేసింది, తీర్పువెలువడడమే తరువాయి. భగవద్గీత మనదే అయినా టెర్రరిజానికి మూలం అదే అని మనం కనిపెట్టలేకపోయాం.


గాంధీజీ మన వాడు అనే విషయం పక్కన పెట్టి నిజాయితీగా ఆలోచిద్దాం. ఆయనలో నిలువెత్తు టెర్రరిస్టు కనిపించడం లేదూ? చొక్కాకు ఒక్క గుండే లేకపోతేనే వాడు చూడు రౌడీలా అని తిట్టుకుంటాం. మరి ఆయన ఏకంగా చొక్కానే లేకుండా కనిపిస్తున్నాడంటే టెర్రరిస్టు కాకుంటే మరేమిటి? పైగా చేతిలో ఒక కర్ర. కర్ర హింసకు నిదర్శనం కాదా? నడుము దగ్గర ఒక వాచీ. ఏ టైంలో టైంబాం బు పేల్చాలో నిర్ధారించుకోవడానికి కాకపోతే ఆ వాచీ ఎందుకు? ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపమనడం హింసను ప్రేరేపించడమే? మరో చెంప చూపడం అంటే కొట్టిన వ్యక్తిలో హింసాత్మక ధోరణిని అలా పెంచి పోషించడమే కదా? హింసను ప్రేరేపించే వారు టెర్రరిస్టులే కదా? ఇవి సరిపోవంటారా?


 బాధల్లో ఉన్నప్పుడు తల్లి ఒడిలో సేదతీరినట్టుగా నేను భగవద్గీతతో స్వాంతన పొందుతాను అని స్వయంగా మహాత్ముడే చెప్పుకున్నాడు. బగవద్గీత టెర్రరిజాన్ని పెంచి పోషించే సాహిత్యం కాబట్టి టెర్రిరిస్టు సాహిత్యాన్ని తల్లిగా భావించే వ్యక్తి టెర్రరిస్టు కాకుంటే మరేమవుతారు. ఆసియా దేశాల వారే కాదు చివరకు యూరప్ దేశానికి చెందిన ఎంతో మంది స్వాతంత్య్ర సమర యోధులు మహాత్ముని బోధనలే మాకు ఆదర్శం, ఆయన స్ఫూర్తితోనే మేం మా దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమించామని ప్రకటించారు. అంటే ఆయన ఒక్క దేశానికే పరిమితం అయిన టెర్రరిస్టు కాదు అంతర్జాతీయ టెర్రరిస్టు. నొబెల్ శాంతి బహుమతి కమిటీ వాళ్లు మహాత్మాగాంధీకి నొబెల్ శాంతి అవార్డుకు ఎందుకు ఎంపిక చేయలేదో ఇప్పుడు తెలిసిందా? శాంతి బహుమతిని టెర్రరిస్టుకు ఎలా ఎంపిక చేస్తారు?


మన లౌకిక వాదులు నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. మనకు రాని ఆలోచన ఇతరులను వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా అభినందించాలి. హిందూ మతాన్ని ఎన్నో విధాలుగా విమర్శించిన మన లౌకిక వాదులకు ఒక్క సారన్నా ఈ ఆలోచన వచ్చిందా? మరి అలా రానందుకు సిగ్గుపడి తీరాలి. రష్యాలో వర్షం పడితే ఇక్కడ గొడుగు పట్టుకోవడం మనకు ఎలాగూ అలవాటే కాబట్టి ఇప్పుడైనా రష్యావాడికి కలిగిన జ్ఞానోదయం నుండి మన వాళ్లు నేర్చుకోవాలి. సోవియట్ యూనియన్ పతనం తరువాత కల్లోల రష్యాలో ఇటీవల హరేరామ హరేకృష్ణ అంటూ కొంత మంది తీవ్రవాదులు, తీవ్రవాద సాహిత్యం భగవద్గీతను చేతపట్టుకుని పట్టపగలు రోడ్లమీద టెర్రరిజం భజన చేస్తున్నారు. బాంబులు పట్టుకొని తిరిగే వారుంటే మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ బాంబు పేలితే పక్కనున్న కొద్ది మంది మాత్రమే పోతారు. కానీ అదే భగవద్గీత లాంటి టెర్రరిస్టు సాహిత్యాన్ని అలా వదిలేస్తే ఇంకేమైనా ఉందా? ప్రజల మెదళ్లలో చేరి అహింస అనే తీవ్రమైన హింసను వ్యాపింపజేస్తుంది.
 బహుశా ఈ ప్రమాదాన్ని మన పాలకులు కూడా గుర్తించినట్టుగా ఉన్నారు. అందుకనే ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు.
విస్తృతమైన పరిశోధన చేసి భగవద్గీతలో టెర్రరిజంను కనుగొన్న రష్యాను మనస్ఫూర్తిగా మెచ్చుకుందాం. అదే కోణంతో ఆలోచిస్తే మనకు మహాత్ముడే కాదు ఇంకెంతో మంది తీవ్రవాదులు కనిపిస్తారు. ఆయనెవరో విల్లు విరిచాడు, ఎప్పుడు చూసినా చేతిలో విల్లు పట్టుకుని ఉంటాడు. అదే నండి శ్రీరాముడు. చేతిలో ఆయుధం ఉంది కాబట్టి ఆయనా తీవ్రవాదే కదా? ఏదో రావణాసురుడు ముచ్చటపడి కిడ్నాప్ చేస్తే ఆయన దేశంపై దండెత్తి చంపేయడమేనా? టెర్రరిజానికి ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలి. ఇంకొక దేవుడు శ్రీకృష్ణుడు చేతిలో చక్రంతో తప్ప విడిగా కనిపించడు. ఆ చక్రానికి లైసెన్స్ ఉందా? ఆ చక్రంతో ఆయన చంపిన వారు ఎంత మంది? దేవుళ్ల సంగతి పక్కన పెడదాం ఆ తరువాత వచ్చిన బుద్ధుడి సంగతి రష్యా మెదడుతో 



జాగ్రత్తగా ఆలోచిస్తే బుద్ధుడిలోనూ అంతర్జాతీయ టెర్రరిస్టు కనిపిస్తున్నాడు. బౌద్ధమతాన్ని ప్రపంచంలో అనేక దేశీయులు ఆచరిస్తున్నారు. అంటే యుద్ధం వద్దని శాంతిని బోధించడం అంటే దాని వెనుక పెద్ద టెర్రరిజం కుట్ర ఉంది. బౌద్ధమతాన్ని ఆచరించిన వారు శాంతియుతంగా ఉంటారు, దాంతో ఇతర దేశం దాడి చేసి స్వాధీనం చేసుకుంటుంది. రక్తపాతం లేకుండా లొంగదీసుకోవడం అన్నమాట! కాబట్టి చైనా, జపాన్‌లకు ఓ మాట చెప్పి బౌద్ధమతాన్ని కూడా టెర్రరిస్టు జాబితాలో చేర్చే విషయం రష్యా సీరియస్‌గా ఆలోచించాలి. అసలు హిందూ మతమే టెర్రరిజంగా కనిపిస్తోంది. ఇక వేదాలను కూడా ఓ చూపు చూడు రష్యా!

20, డిసెంబర్ 2011, మంగళవారం

బుల్లితెరపై భక్తి ఉద్యమం



మతం మనుషులకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అంటే రెండు వైపులా బలంగా వాదించవచ్చు. ఈ వాదన కొత్తేమీ కాదు. తరతరాల నుండి ఉన్నదే. మనిషి చంద్రుడిపై అడుగుపెట్టిన తరువాత, కంప్యూటర్ యుగంలో ఇంకా ఈ నమ్మకాలేమిటి? అనే వాదన కంప్యూటర్‌లు మన దేశంలోకి వచ్చిన కొత్తలో బాగా వినిపించేది.
 ఇప్పుడు ఇంటింటికి కంప్యూటర్ , ప్రతి చేతిలో సెల్‌ఫోన్ అన్నంతగా పరిజ్ఞానం పెరిగింది. అయితే మేధావులు ఊహించినట్టుగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తరువాత భక్తి భావం తగ్గలేదు. మరింతగా పెరిగింది. ఇప్పుడు అమెరికాలో ఉన్నా, గల్ఫ్ దేశంలో ఉన్నా ఇంట్లో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానంలో పూజలను తిలకించవచ్చు, పులకించి పోవచ్చు. ఉదయం లేవగానే తిరుమలలో వినిపించే సుప్రభాతాన్ని ఇంట్లో నుండి వినవచ్చు. మనిషి జీవితం సంక్లిష్టంగా మారినా కొద్ది దైవంపై భక్తి మరింతగా పెరుగుతుంది. ఆధునిక జీవితంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఒక్క మానసిక ప్రశాంతత తప్ప. ఇలాంటి పరిస్థితిలో తనకు తెలియని ఏదో ఒక శక్తి ఉందని మనిషి నమ్ముతాడు. ఈ నమ్మకం అతనికి కొంత మానసిక ప్రశాంతతను ఇస్తుంది అంతే తప్ప సమాజానికి నష్టమేమీ లేదు.

 మానసిక ప్రశాంతత కోరుకునే వారు దైవాన్ని నమ్ముతున్నారు. దైవ దర్శనం అంటే వయసు మీరిన వారికి సంబంధించిన విషయమేమీ కాదు ఇప్పుడు. సంపద ఎక్కువ ఉన్న చోట భక్తి సైతం ఇప్పుడు ఎక్కువగానే కనిపిస్తోంది. ఆలయాలను సందర్శిస్తే పెద్దవారి కన్నా యువత ఎక్కువ కనిపిస్తున్నారు. మనం సాంకేతికంగా ఎంతో ముందడుగు వేసినా నైతిక విలువల విషయంలో మన పరిస్థితి ప్రశ్నార్ధకంగానే ఉంది. భక్తి భావం మనిషిలో విలువలను పెంచుతుంది. ఏ మతమైనా కావచ్చు దైవాన్ని విశ్వసించే వాడి మొత్తం సమాజం మంచిని కోరుతారు. మీడియాలో సైతం భక్తి అంశాలకు ఇప్పుడు ప్రాధాన్యత పెరిగింది. దాదాపు తెలుగు పత్రికలన్నీ ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రత్యేకంగా పేజీలు కేటాయిస్తున్నాయి. ఇప్పుడు బుల్లితెరపై సైతం భక్తి ఉద్యమం సాగుతోంది.
వారానికోసారి దూరదర్శన్ సప్తగిరిలో ధర్మసందేహాలు వినేవారి సంఖ్య తక్కువేమీ కాదు. తండ్రికి తద్దినం చిన్నకొడుకు పెట్టాలా? పెద్ద కొడుకు పెట్టాలా? అనే సందేహం మొదలుకుని మహాభారత, రామాయణాల వరకు ధర్మ సందేహాల్లో ఏ అంశం గురించి ప్రశ్నించినా పండితులు చక్కని సమాధానాలు ఇస్తున్నారు. ఒక విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితోనైనా వినవచ్చు.
2007లో భక్తి పేరుతో పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఎన్‌టీవి ఒక చానల్‌లు ప్రారంభించింది. 24 గంటల పాటు చూపడానికి భక్తి కార్యక్రమాలు ఏముంటాయని అప్పుడు అనిపించి ఉండవచ్చు. కానీ నాలుగున్నర ఏళ్లపాటు భక్తి టీవి ఆధ్యాత్మిక ప్రసారాల ద్వారా భక్తులను బాగానే ఆకట్టుకుంది. దూరదర్శన్ ధర్మ సందేహాల తరహా కార్యక్రమాలు చానల్స్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తప్పనిసరిగా ఉంటోంది. ఈ తరహా కార్యక్రమానికి సప్తగిరి మార్గదర్శిగా నిలిచింది.
ఎన్‌టీవి వారి భక్తి చానల్‌తో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ హిందూ మతానికి సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేసే రెండు చానల్స్. శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ టిటిడి వారిది కాబట్టి ఆ చానల్ కార్యక్రమాలను ప్రసారం చేయడాని కన్నా ముందు ఆ చానల్ గురించి, నిధుల దుర్వినియోగం అంటూ దాదాపు అన్ని న్యూస్ చానల్స్ హడావుడి చేశాయి.

 హిందూ ఆలయాల గురించైనా, హిందూ మతానికి సంబంధించిన విషయాలపైనైనా దాడికి మీడియా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే హిందువులు కాబట్టి. ఈ మధ్య చిన జీయర్ స్వామి తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలని క్లబ్‌కు వెళ్లి వచ్చిన భావన కలగరాదని అంటే తిరుమలలో మద్యం, వ్యభిచారం, మాంసం విచ్చలవిడిగా అంటూ జీ న్యూస్ చానల్ మసాలా దట్టించి ప్రసారం చేసింది. భక్తి చానల్ దక్షిణ భారత దేశంలోనే తొలి ఆధ్యాత్మిక చానల్. కాగా భక్తి చానల్ వస్తోందని తెలిసి టీవి9 వాళ్లు హడావుడిగా ప్రపంచంలోనే తొలి సర్వమత చానల్ అంటూ సంస్కృతిని తీసుకు వచ్చారు. ఎంత హడావుడిగా ఆ చానల్‌ను ప్రారంభించారో అంతే హడావుడిగా దాని చరిత్ర ముగిసిపోయింది. టీవి 1 అంటూ ఆ చానల్ ప్రసారాలు చేస్తున్నారు. ఆధ్యాత్మిక చానల్‌ను ప్రారంభించబోయి తమ వల్ల కాదని చేతులు ఎత్తేసిన వారు అదే చానల్‌లో హిందువుల మనోభావాలను అగౌరవపరిచే కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. సప్తగిరిలో వచ్చే ధర్మసందేహాలను పేరడీ చేస్తూ ఇడియట్ సందేహాలు అంటూ వెకిలి అంశాలతో వ్యంగ్యం అంటూ చూపుతున్నారు.
శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌లో తిరుమలలోని భక్తి కార్యక్రమాలకు పరిమితం కాగా, భక్తి టీవి మాత్రం ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో పాటు ఆలయాల గురించి, ధర్మ సందేహాల గురించి వివరిస్తోంది. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి ఉన్నవారిని బాగా ఆకట్టుకుంటోంది. పండుగల సందర్భంగా ఆయా పండగల గురించి తెలియని విషయాలు చెబుతున్నారు. శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక అంశాల కోసం మరో చానల్ ప్రారంభించనున్నారు. కొన్ని మతాలకు సంబంధించిన ప్రచారానికి విదేశాల నుండి నిధులు రావడం గురించి అందరికీ తెలిసిందే. హిందువులకు అలాంటి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లోనూ భక్తి చానల్ వంటివి విజయవంతంగా నాలుగున్నర ఏళ్ల నుండి ప్రసారాలు కొనసాగించడం అభినందనీయం.

18, డిసెంబర్ 2011, ఆదివారం

హాస్యాంధ్ర ప్రదేశ్ .......... ఇక్కడ అందరూ కమేడియన్లె


ఆంధ్రా హ్యూమర్ క్లబ్!

అత్తపోరు లేదు మామ పోరు లేదు గుడిసెలో గుడ్డోడి పోరు అన్నట్టు ఇంత కాలం మనకు ఎదురులేదనుకుంటే చివరకు ఇలా అయిందేమిటి? అని రాజ్యలక్ష్మి కొంగుతో కళ్లు తుడుచుకుంది. దశాబ్ద కాలంగా ఎదురులేకుండా ఉన్న వాళ్ల క్లబ్‌కు గట్టి పోటీ వచ్చింది. వారం వారం పార్క్‌లో కలుసుకొని ఎంచక్కా జోకులు చెప్పుకునే వారు. పాపం పగవాడికి కూడా ఈ కష్టం రావద్దు అని విశ్వనాధం మనసులోనే అనుకున్నారు. సుమన్ సినిమాలను సైతం జీర్ణం చేసుకునే మన వాళ్లకు మన జోకులు జీర్ణం కాకపోవడం ఏమిటని పద్మనాభం విస్తుపోయాడు. రాజకీయ నాయకులు ఇలా మనతో పోటీకి రావడం ఏ మాత్రం బాగాలేదని ఎర్రన్న బాధపడ్డాడు. 

 నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా వారికి బాధ ఉండదు, మూడు రోజుల కోసారి నీళ్లు రాకపోయినా, వారానికోరోజు మంచి నీళ్లు వచ్చినా, రోజుకు డజను సార్లు కరెంటు పోయినా వారిలో ఎలాంటి కోపం ఉండదు. ఎందుకంటే వారు హ్యూమర్ క్లబ్ సభ్యులు. మొండివాడు రాజుకున్నా బలవంతుడైతే, వాడబ్బకన్నా బలవంతులు హ్యూమర్ క్లబ్ సభ్యులు. అలాంటి క్లబ్ సభ్యులకు ఇప్పుడు కష్టకాలం వచ్చింది.  ఏమైందని ఏడుస్తున్నారు అంటూ అయోమయరావు అడిగాడు. ఆయన టీవిల్లో బ్రేకింగ్ న్యూస్‌లు తప్ప ఏమీ పట్టించుకోడు దాంతో ఏం జరుగుతుందో ఆయనకు ఎప్పుడూ అర్ధం కాదు. ఇంకేం కావాలి జరగాల్సింది జరిగిపోయింది ఎదురులేదనుకుంటున్న మనకు రాష్ట్ర రాజకీయ నాయకుల నుండే గట్టిపోటీ వచ్చింది. మనకు వారి నుండి పోటీ ఏమిటని ఆయోమయరావు అడిగాడు. జోకులు చెప్పి నవ్వించడాన్ని మనం హాబీగా తీసుకుంటే దాన్ని నాయకులు ఏకంగా వృత్తిగా తీసుకున్నారు. అనుమానం ఉంటే అటువైపు ఒకసారి చూసి నువ్వే చెప్పు వారి జోకుల ముందు మన జోకులు నిలుస్తాయా?
***
బాబు పొలంలోకి అడుగు పెట్టి దీన్ని పొలం అంటారు. దీన్ని గడ్డి అంటారు. గడ్డిలో అనేక రకాలు ఉంటాయి అంటూ రాసుకొచ్చిన  
సమాచారాన్ని రైతుకు చదివి వినిపిస్తున్నాడు. రైతు అలానే నోరు తెరిచాడు. గడ్డిలో బంగారు పంటలు పండును, చీడపురుగుల వల్లపంట దెబ్బతినును.. అంటూ సొంతంగా చెప్పాడు.
 రైతు ఏం తిక్క తిక్కగా ఉందా? నేను లేనప్పుడు పొలంలోకి మిమ్మల్ని ఎవరు రమ్మన్నార ంటూ కర్ర పుచ్చుకున్నాడు. పచ్చ చొక్కాల నాయకులు పరిగెత్తు కొచ్చి ఎవరనుకున్నావ్ ఆయన చంద్రబాబు అని చెప్పారు. మరీ అంత పిచ్చోడిననుకున్నావా? ఎన్టీవోడి అల్లుడు చంద్రబాబు గోరు రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లపాటు పాలించారు. ఆయన నాకు తెలియదా? అంటూ తిట్లు మొదలు పెట్టాడు. ఎవరెంత చెప్పినా రైతు వీరంగాన్ని ఆపలేకపోయారు. అక్కడున్న మహిళా ఎమ్మెల్యేకో ఐడియా వచ్చి యూరేకా అని అరిచి కారువైపు పరుగులు తీసి కొద్ది నిమిషాల్లోనే తిరిగి వచ్చి, బాబు తలపాగాను తీసిపారేసి కారులో నుండి తెచ్చిన ల్యాప్‌టాప్‌ను ఓపెన్ చేసి బాబు చేతిలో పెట్టింది. అప్పటి వరకు కర్ర పట్టుకుని అందరినీ పరిగెత్తిస్తున్న రైతు వెంటనే కర్ర పారేసి బాబుగారూ మీరా నన్ను క్షమించండి, చేతిలో ల్యాప్‌టాప్ కనిపించేంత వరకు మిమ్ములను గుర్తించలేకపోయాను క్షమించండి బాబు క్షమించండి అని వేడుకున్నాడు.
***
సచివాలయంలో..మంత్రి శంకరన్నను చూడగానే విలేఖరులు గజగజవణికిపోయారు. నిజంగా సార్ అమ్మతోడు బయటకెళ్లి ఆఫీసుకు ఫోన్ చేసి వస్తాను వదలండి సార్ అంటూ ఒక విలేఖరి వేడుకుంటున్నాడు. ఏంరా బై దూడకు పాలిచ్చి వస్తానని వేడుకున్న ఆవును వదిలేసిన పులిననుకున్నావా? మిమ్ముల్ని వదిలితే మళ్లీ రారు నాకు తెలుసు. నేను చెప్పిందంతా వినాల్సిందే అంటూ తలుపులు మూశాడు.
***
ఏమయ్యా కిరణ్ ప్రతిదీ నీకు నేనే చెప్పాలా? అవిశ్వాస తీర్మానమప్పుడు నేనేం మాట్లాడమన్నాను నువ్వేం మాట్లాడావు. మరీ అంత మెతగ్గా ఉంటే ఎలా? ఆ బొత్సా నిన్ను దూసుకెళ్లేట్టుగా ఉన్నాడు అదే జరిగితే నేను చేయగలిగిందేమీ లేదు అని బాబు ఫోన్‌లోనే అక్షింతలు వేశాడు. 
బాబు గారు మీరు ఇలా బెదిరిస్తే నేను ఎన్నికలకు వెళదామని మా హై కమాండ్కు చెబుతాను అని కిరణ్ బెదిరించారు . కంగారు పడ్డ బాబు ఏదో మన జిల్లా వాడివని  మంచి చెబుతున్నాను సరే ఆ పని మాత్రం చేయకు . ఐతే నువ్వు లేదా నేను కలిసిపాలిద్దాం  కానీ మనం మనం కోట్లడుకొని  మూడో వాడికి అవకాశం ఇవ్వడం ఎందుకు అన్నాడు. సరే నీ పాలన పరమ చండాలంగా ఉందని విలేఖరుల సమావేశంలో మాట్లాడేందుకు వెళుతున్నాను. కొన్ని మంచి పాయింట్స్ చెప్పు అని బాబు అడిగాడు. ఫ్యాక్స్ చేస్తాను అని కిరణ్ వినయంగా చెప్పాడు.
***
సార్ తెలంగాణ సంగతి అంటూ ఈటెల రాజేంద్ర కెసిఆర్‌తో మెల్లగా అన్నాడు. ఏదో అలోచనలో ఉన్న కెసిఆర్ ఏంటీ అన్నాడు. తెలంగాణ అని మెల్లగా నసిగాడు. గోడకున్న క్యాలండర్‌ను కెసిఆర్ స్వహస్తాలతో తీసి టెబుల్‌పై వేశాడు. క్యాలండర్‌లో ఉంది చూడు అన్నాడు. ఈటెలకు అర్ధం కాలేదు. మొన్న గులాంనబీ ఆజాద్ ఏమన్నాడు. పండుగల తరువాత తెలంగాణ అన్నాడా? లేదా?
పండుగలు లేని నెల ఏదో చెప్పు సోనియమ్మ అప్పుడు తేలుస్తుంది తెలంగాణ గురించి అని నవ్వాడు.
***
ఏ కులమబ్బీ నీ దే మతమబ్బీ అంటూ సిపిఐ నారాయణ, సిపిఎం రాఘవులు పాటలు పాడుతున్నారు. నీకు మిగిలింది ఆ గోచీ ఒక్కటే అది కూడా ఈసారి దక్కదు అంటూ సిపిఎంకున్న ఒక్కసీటు గురించి నారాయణ ఎద్దెవా చేశాడు.
***
సార్ కూకుట్‌పల్లిలో డ్రైనేజీ అంటూ అమాయకుడొకరు ఏదో వినతిపత్రం ఇవ్వబోతుంటే చూడండి మీకెప్పుడూ తాగునీరు, డ్రైనేజీ వంటి చిల్లర సమస్యలేనా? రాష్ట్ర సమస్యలపై అంతర్జాతీయ సమాజం ఏమంటుందో అమెరికాలో ఉపన్యాసానికి గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నాను నన్ను విసిగించకు అని జెపి అతన్ని పంపించేశాడు.

***
10 జనపద్ కు తొలిసారిగా చిరంజీవి ఒంటరిగా  వెళ్ళాడు . నిచ్చెన పై ఎవరో కనిపిస్తే అతని వద్దకు వెళ్లి కింది నుంచి మై చిరంజీవి హు .. మెగా స్టార్ హు .. సోనియాజీ ... అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు .. చిరంజీవి వచ్చాడని తెలిసి తెలుగు మీడియా అటువైపు వచ్చి చిరంజీవి మాటలు విని వింతగా చూశారు .. ఎత్తులో ఉన్నారని హై కమాండ్ అనుకున్నారా అని అడిగితే చిరంజీవి తల ఉపాడు . వాడు ఎలక్త్రిశియన్ బల్బు పెడుతున్నాడు . హై కమాండ్ కిందే పరుపులు దిండ్ల పై కూర్చుంటుంది టీవి లలో ఎప్పుడూ ప్లినరి చూడలేదా  అని అడిగారు . నాకు తెలియక పోవడం ఏమిటి నేనో సినిమాలో ముఖ్యమంత్రిగా కూడా నటించాను అని చిరంజీవి చెప్పాడు . మీకు తెలుసో లేదో  ఇందిరా గాంధీ హయం లో  హై కమాండ్ వద్ద కారు డ్రైవర్ గా ఉన్న వ్యక్తి కూడా తరువాత కేంద్ర మంత్రి అయి చక్రం తిప్పాడు . ఆకబట్టి హై కమడ్కు యెంత దగ్గరగా ఉన్నారనేది ముఖ్యం కానీ వాళ్ళు చప్రసినా , బల్బులు పెట్టె వాడా అని కాదు అని చిరంజీవ తనను తను సమర్ధించుకున్నాడు 
***
ఇప్పుడు చెప్పండి వీరి ముందు మన జోకులు పెలుతయా అని ఎవరో అడిగితే అంతా లేదు లేదు అని కోరస్ గా  పలికారు .
ఎన్నో  సమస్యలతో సతమత మవుతున్న  మనను హాయిగా నవ్వుకునేట్టు చేస్తున్న మన తెలుగు నాయకులు వర్ధిల్లాలి అని అంతా పలికారు  


15, డిసెంబర్ 2011, గురువారం

రాజకీయ పోకిరీలు వర్ధిల్లాలి


కాలేజీలోల అల్లరి మూక అమ్మాయిలను ఆటపట్టిస్తోంది. ఇంతలో హీరో అక్కడికొచ్చి ఒక పాట పాడడంతో అల్లరిమూక మమ్మల్ని క్షమించండి మాస్టారు ఇంకెప్పుడూ ఆడవారిని వేధించం అంటూ 1980లో కన్నీరు కార్చారు. రామారావు పాడిన పాట విని తన్మయం చెందిన వాణిశ్రీ తనకు సరిజోడు రామారావే అని అప్పుడు నిర్ణయించుకుని చీరకొంగును కొరుకుతూ కాలేజీ నుంచి పార్క్‌లోకి పరుగులు తీసింది.
పదేళ్లు గడిచాయి అమ్మాయిలను వేధిస్తున్న అల్లరి మూకను హీరో చితగ్గొట్టాడు. కాళ్లతో, చేతులతో విలన్లను చితగ్గొడుతున్న హీరో ధైర్యాన్ని చూసిన జయప్రద హీరోకు 1990లో మనసిచ్చేసింది. కాలం మరింతగా మారింది. హీరో అమ్మాయిల వెంట పడుతున్నాడు. గిల్లుతున్నాడు, గిచ్చుతున్నాడు. హీరోయిన్‌ను కూడా వదలలేదు. మిగిలిన ఎక్‌స్ట్రా ఆర్టిస్టుల కన్నా హీరోయిన్‌నే ఎక్కువగా వేధిస్తున్నాడు. 



వేధింపులకు అలవాటు పడిపోయిన హీరోయిన్ త్రిష చివరకు హీరోను ప్రేమించేసి, నువ్వు కాదంటే ప్రాణాలు వదిలేస్తానంది 2000ల సంవత్సరంలో. 1980లో విలన్లు అమ్మాయిలను వేధిస్తుంటే చీదరించుకున్న హీరోయిన్ చివరకు 2000ల సంవత్సరంలో అదే పని చేసిన హీరోకు మనసిచ్చేంతగా కాలం మారింది. సినిమాల్లో, రాజకీయాల్లోనే కాదు అన్నింటా కాలం బాగా మారిపోయింది. ఏం మారింది.. అప్పుడు జైలుకు వెళ్లిన వారికి ప్రజలు మంగళహారతులు పాడేవారు, ఇప్పుడు అలానే పాడుతున్నారు తేడా ఏముంది అనేది కొందరి అనుమానం. స్వాతంత్య్ర పోరాటం సాగించిన ప్రకాశం పంతులు జైలు నుండి వచ్చినప్పుడు చెన్నైలో ఎలాంటి స్వాగతం లభించిందో తెలియదు కానీ కనిమొళికి మాత్రం బ్రహ్మాండమైన స్వాగతం లభించింది. డిఎంకెకూ ఒక పురుచ్చి తలైవి లభించిందని ఆ పార్టీ వారు సంబరపడుతున్నారట! ఇప్పట్లో అక్కడ ఉప ఎన్నికలు లేవు కానీ ఉండి ఉంటే మాత్రం కనిమొళి భారీ మెజారిటీతో విజయం సాధించి తీరుతారు.


అనుమానం ఉంటే పొరుగున ఉన్న కర్నాటకకు వెళ్లి చూస్తే తెలుస్తుంది. మైనింగ్ కుంభకోణంలో గాలి జనార్దన్‌రెడ్డి అరెస్టు తరువాత ఆయన ప్రియమిత్రుడు శ్రీరాములు బిజెపికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే 46వేల ఓట్ల మెజారిటీ లభించింది. అంతకు ముందు ఆయనకు నాలుగైదువేల మెజారిటీ కూడా రాలేదు. ఈ ఊపుతో ఆయన గాలితో కలిసి కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉన్న ఆస్తిని దేశానికి అర్పించిన వారిని ఆ కాలంలో రాజకీయాల్లో హీరోలుగా చూశారు, ఇప్పుడు దేశాన్ని దోచుకున్న వారికి హీరోవర్షిప్ వచ్చేస్తోంది.
తండ్రి లాంటి మామ కుర్చీ లాగేసిన వారిలోనే కథనాయకుడిని చూశారు కొంత కాలం. అబుసలేం, దావుద్ ఇబ్రహీంలను హీరోలుగా కొలిచేవారున్నారు.రాజకీయాల్లో ఆసక్తి లేక కానీ దావుద్ వస్తే ఓటర్లు వద్దంటారా?


ఎందుకలా అంటే ఔను వాళ్లు దొంగలు ఆ విషయాన్ని వారెప్పుడూ దాచుకోలేదు. కానీ రాజకీయ నటులు అలా కాదు కదా? నానా పటేకర్‌లు రాజనీకాంత్‌లా ఫోజు కొడతారు. దాంతో ఎవరు ఎవరో గుర్తించడం కష్టం. నిరంతరం నటనలో జీవించే నాయకులను అంచనా వేయడం అంత ఈజీ కాదని చెప్పడమే ఉద్దేశం.
ఆ హీరోగారు సినిమాలో పేదలకు అండగా, విలన్ల పాలిట సింహస్వప్నంగా ఉండే వారు. తాను ముఠామేస్ర్తి అయినా విలన్ ముఖ్యమంత్రిగా ఉన్న చితగ్గొట్టిన చరిత్ర అతనిది. నువ్వు ఏలాల్సింది చిత్రసీమను కాదన్నా రాజకీయ సీమను అని అభిమానులు అతన్ని అన్నా నువ్వు రాజకీయాల్లోకి వచ్చేయ్ అన్నా వచ్చేయ్ అని దీక్షలు జరిపారు. ఒకరు ఏకంగా ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయాల్లో విలన్లను చీల్చి చెండతాడు అని అభిమానులు కలలు కంటుండగానే ఆయన రాజకీయాల్లోకి రావడం విలన్లతో చేట్టాపట్టాలేసుకుని తిరగడం అయిపోయింది. విలన్లతో చేతులు కలిపిన హీరోల ట్విస్ట్‌ను మనం ఏ సినిమాలోనైనా ఊహించామా? మన సినిమాల్లో కథలుండవని అనుకుంటాం కానీ రాజకీయాల్లో సినిమాల కన్నా ఎక్కువ మలుపులుంటున్నాయి. నీ మిత్రుడెవరో చెప్పు నీవెలాంటి వాడివో చెబుతాను అంటారు.


గతంలో జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్‌స్మిత అని వాంప్‌లు ప్రత్యేకంగా ఉండేవారు. సినిమాల్లో ఏదో ఒక పాటలో వీళ్లు తళుక్కున మెరిసి ప్రేక్షకులను మైమరిపించే వాళ్లు. సినిమాల బడ్జెట్ పెరిగి వినోదం తగ్గిన తరువాత బడ్జెట్ కోతలో భాగంగా వాంప్‌ల పాత్రలను తొలగించి ఆ బాధ్యతను హీరోయిన్లకే అప్పగించారు. ఇప్పుడు డ్రెస్స్‌ను చూసి ఎవరు హీరోయినో, ఎవరు వాంపో చెప్పలేం. అలానే రాజకీయ నాయకుల మాటలను బట్టి వారిని అంచనా వేయలేం.


1969లో బుద్ధిమంతుడే హీరో. హీరోయిన్ విజయనిర్మల బుద్ధిమంతుడు అనే హీరో అక్కినేనిని ప్రేమిస్తుంది. అదే 2006 సంవత్సరానికి వచ్చేసరికి ఇలియానా లాంటి అందగత్తె పోకిరీనే హీరోగా ఇష్టపడి ప్రేమించింది. సినిమాల్లో హీరోయినే్ల కాదు రాజకీయాల్లో సైతం పోకిరీలనే ఇష్టపడుతున్నారు. అంటే ఇప్పుడు ఎన్నికల్లో విజయం సాధించాలంటే నాయకులు పోకిరీ అవతారం ఎత్తాలి. దట్టంగా వేసుకున్న మేకప్ తొలగిస్తే చాలు అసలు రూపం అదే పోకిరీ రూపం బయట పడుతుంది.

13, డిసెంబర్ 2011, మంగళవారం

ఇక రాంగోపాల్ వర్మ ఈ టీవీ సుమన్ తోనే పోటీ పడాలి .. వివాదాల ప్రచారంతో సినిమా పప్పులు ఉడకవు




చానల్స్‌లో వివాదాల ద్వారా సినిమాను సక్సెస్ చేయించుకోవాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది. బెజవాడ సినిమా అవుతుంది. ఇప్పుడు చానల్స్‌లో ప్రచారాన్ని నమ్మి సినిమా చూసేవారెవరూ లేరు. సినిమా బాగుందని చూసిన వారు చెబితే కొంత వరకు నమ్ముతున్నారేమో కానీ మీడియాను నమ్మి సినిమాకు వెళ్లే రోజులు పోయాయి.

 రాంగోపాల్‌వర్మ వర్మ మాత్రం ఇంకా పాత టెక్నిక్‌లనే నమ్ముకున్నారు. శివ నాటికి ఇప్పటికి కాలం చాలా మారిపోయింది. ఆయన దాన్ని గుర్తించారో లేదో? గుర్తించక పోవడమే మంచిది. ఇదే దూకుడుతో ఇదే తరహాలో మరో ఐదారు సినిమాలు తీస్తే చాలు. అంతకు మించి మనం ఆయన నుంచి కోరుకునేది ఏమీ లేదు. వర్మ సినిమాలు మరో రెండు మూడు విడుదలయ్యాక ఆయనకు ఈటీవి సుమన్ తప్ప మరెవరూ సాటిరారు. వారిద్దరి మధ్యనే రసవత్తరమైన పోటీ ఉంటుంది. బెజవాడ సినిమా విడుదల సందర్భంగా దాదాపు అన్ని తెలుగు చానల్స్‌లోనూ రాంగోపాల్ వర్మ హడావుడి కనిపించింది.

 పేయిడ్ ఇంటర్వ్యూలో, లేక చానల్స్ వాళ్లు పే చేసి ఇప్పించుకునే ఇంటర్వ్యూలో, సాధారణంగా సినిమా వాళ్లను చేసే ఇంటర్వ్యూలో ఏది ఏమిటో ఈ మధ్య తెలియడం లేదు. ఏ ఇంటర్వ్యూ అయితేనేం కానీ బెజవాడ సినిమా విడుదల సందర్భంగా అన్ని చానల్స్‌లోనూ రాంగోపాల్ వర్మ తెగ మాట్లాడేశారు. నా ఇష్టం వచ్చినట్టు నా కోసం నేను సినిమా తీస్తాను మీకు నచ్చినా నచ్చక పోయినా నాకు సంబంధం లేదు, ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు. రాంగోపాల్‌వర్మ ఎన్ని చానల్స్‌లో మాట్లాడినా మొత్తంగా ఆయన మాటల సారాంశం ఇది. పైగా టీవి చానల్‌లో ప్రశ్న అడిగిన వారితో అమర్యాదకరంగా మీకు అర్థం కావడం లేదు అంటూ తీసిపారేస్తూ మాట్లాడుతుంటారు. సినిమా గురించి చానల్స్‌లో తెగ హడావుడి చేశారు. ఆయన మాట్లాడింది సరిపోదన్నట్టు తెలుగు చానల్స్ ఆ సినిమా ప్రచారం తమ బాధ్యత అన్నట్టుగా లెక్కలేనన్ని ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. తీరా సినిమా విడుదలయ్యాక అది అట్టర్ ఫ్ల్లాపైంది. ఇంటర్వ్యూల్లో వివాదాస్పదంగా మాట్లాడడం ద్వారా సినిమాపై ఆసక్తి కలిగించడానికి ఆయన చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. గతంలో రక్తచరిత్రను ఇదే విధంగా టీవిల ద్వారా సంచలనం చేశారు. సినిమా విడుదలైన తరువాత ఏమాత్రం బాగాలేదనే టాక్ వచ్చేసరికి వర్మకు సన్నిహితుడైన ఒక ఎమ్మెల్యే ద్వారా టీవిలో సంచలన ప్రకటన చేయించారు. ఈ సినిమా ఎన్టీఆర్‌ను అవమానించే విధంగా ఉందని సినిమాను బ్యాన్ చేయాలని చానల్ చర్చలో టిడిపి ఎమ్మెల్యే ఒకరు డిమాండ్ చేశారు. ఆయన వర్మ మిత్రుడు. ఆ డిమాండ్ కూడా ప్రచారంలో భాగం. ఎన్టీఆర్ అభిమానులైన నాయకులు రోడ్డుమీదకు వచ్చి కొంత హడావుడి చేయడం ద్వారా సినిమాకు కొద్దిగా ఊపిరి పోశారు.

 ఇదే తరహాలో బెజవాడను మొదటి నుండి వివాదం చేయడానికి ప్రయత్నించారు. బెజవాడ రౌడీ అని తొలుత పేరు ప్రకటించడం, విజయవాడ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, విజయవాడలో వర్మ, ఆయన మిత్రుడు లగడపాటి రాజ్‌గోపాల్ బైక్‌పై షికార్లు, చివరకు నేను ఎవరికీ భయపడను కానీ మిత్రుడి కోరిక మేరకు సినిమా పేరు మార్చినట్టు వర్మ ప్రకటించారు. ఇన్ని నాటకాలు ఆడినా, చానల్స్ ప్రచారంతో అదరగొట్టినా సినిమా అట్టర్ ఫ్ల్లాప్ కావడం విశేషం. మరోవైపు సుమన్ రెండు మూడు వారాలకో సినిమాను నిర్మించేస్తూ ఈటీవి ప్రేక్షకులపైకి వదిలేస్తున్నారు. సినిమాలను కుటీర పరిశ్రమ స్థాయికి తీసుకు వచ్చిన ఘనత సుమన్ బాబుదే. అట్టర్ ఫ్లాప్ సినిమాలు నిర్మిస్తూ థియేటర్‌లో విడుదల చేస్తున్న వర్మ ధైర్యాన్ని, రెండు మూడు వారాలకో సినిమా టీవిలో విడుదల చేస్తున్న సుమన్ కృషిని అభినందించాల్సింది. వివాదాల ద్వారా టీవిల ద్వారా సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం అంత పెద్ద దర్శకుడికి ఉండడం విచిత్రమే. అన్ని తెలుగు చానల్స్‌లో పవన్ కళ్యాణ్‌తో చిట్‌చాట్ అంటూ సుమ ఇంటర్వ్యూ చేసిన కార్యక్రమం వచ్చింది.

 15 నుంచి 30 నిమిషాల తేడాతో అన్ని తెలుగు చానల్స్‌లో ఒక దాని తరువాత ఒకదానిలో ఈ కార్యక్రమం వచ్చింది. పంజా సినిమా విడుదల సందర్భంగా ఇది పేయిడ్ ఇంటర్వ్యూనేమో! ప్రకటనను, ప్రత్యేక కార్యక్రమాన్ని ఒకే విధంగా చూపిస్తే ఎలా? ఆ మధ్య హాలివుడ్ నటుడు ఢిల్లీ వస్తే అభిమానులు తెగ హడావుడి చేశారట! ఇంగ్లీష్ సినిమాలు చూసే వాళ్లు మన దేశంలో బాగానే ఉండవచ్చు కానీ అభిమానం అంటూ అలా వెంటపడేంత సీన్ ఉంటుందా? ఆ నటుడు వచ్చి వెళ్లిన తరువాత వారంతా పేయిడ్ అభిమానులని, హాలీవుడ్ హీరోను సంతృప్తి పరిచేందుకు అలా చేశారని జాతీయ చానల్స్‌లో కథనాలు ప్రసారమయ్యాయి.
సోషల్ సైట్స్ హద్దులు మీరి అభ్యంతరకరమైన రాతలు, ఫోటోల మార్ఫింగ్‌పై కేంద్ర మంత్రి సిబాల్ నిరసన వ్యక్తం చేశారు. స్వీయనియంత్రణ లేదా ఆంక్షలు అవసరం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఇంగ్లీష్ చానల్స్ కన్నా మన తెలుగు చానల్స్‌లోనే సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆంక్షలు విధిస్తారా? అంటూ మంత్రిపై మండిపడ్డవారే ఎక్కువ. సోషల్ సైట్స్‌లో ఇప్పటికే కొంత వరకు స్వీయనియంత్రణ ఉంది. ఎవరైనా అభ్యంతరకరమైన రాతలు, ఫోటోలు పెడితే ఫిర్యాదు చేయవచ్చు. పెద్ద సంఖ్యలో బోగస్ అకౌంట్స్ ఉంటాయి వాటిపై ఫిర్యాదు చేస్తే వెంటనే తొలగిస్తారు. ఆలోచనలకు స్వేచ్ఛ అవసరం, ఆలోచనలను అడ్డుకోవలసిన అవసరం లేదు కానీ సున్నితమైన అంశాలపై ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలను అడ్డుకోవడానికి సోషల్ సైట్స్ స్వీయనియంత్రణ పాటించాల్సిందే. ఏదో ఒక మారు మూల దేశంలో ఒక మతాన్ని కించపరిచే విధంగా కార్టూన్ వేశారని హైదరాబాద్‌లో సైతం మతకలహాలు చెలరేగాయి. సున్నితమైన అంశాలపై రెచ్చగొట్టే రాతలు, ఫోటోలతో ఎవరైనా ఇష్టానుసారం వ్యవహరించడానికి అవకాశం ఉండకూడదు. రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అంటే ఒక పౌరుడిగా ఎక్కడికైనా ప్రయాణించే నా హక్కును కాలరాస్తారా? అని నిలదీస్తే ఎలా? సోషల్ సైట్స్‌లో వెర్రితలలు వేసే వ్యవహారాలను అడ్డుకోవడానికి స్వీయనియంత్రణ అవసరం. అదే సమయంలో ప్రజలకు తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు ఉండాలి.
విశాఖలో రియల్ ఎస్టేట్ గొడవలపై టీవి5 గురువారం ఒక ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేస్తూ విశాఖకు సీమ సంస్కృతి అంటూ పేర్కొన్నారు. చానల్ వాళ్ల దృష్టిలో సీమ సంస్కృతి అంటే ఏమిటో? అస్థిత్వ పోరాటాలు సాగుతున్న ఈ కాలంలో ఒక ప్రాంతం గురించి మాట్లాడేప్పుడు చానల్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

8, డిసెంబర్ 2011, గురువారం

రాజకీయ అవతార పురుషులు


వెనకటికో నక్క కాస్త మార్పు ఉంటుందని అడవిని వదలి గ్రామం పై పడింది. తిండి వేటలో పొరపాటున ఒక తొట్టిలో పడిపోయింది. ఆ తొట్టిలో రంగు నీళ్లు ఉన్నాయి. దాంతో నక్క రంగుల మయంగా మారింది. ఇక్కడ మనకు వర్కవుట్ కాదని తిరిగి అడవిలోకి వచ్చింది. రంగుల్లో మెరిసిపోతున్న నక్కను చూడగానే అడవిలో జంతువులన్నీ ముందు భయపడి పోయాయి . తరువాత తమను ఉద్దరించడానికి వచ్చిన కొత్త దేవత అనుకున్నాయి. నిజమే అడవిలో నిస్సారమైన జీవితం గడుపుతున్న మిమ్ములను ఉద్దరించడానికి అవతరించాను అని నక్క చెప్పుకుంది. తొలుత అడవిలోని నక్కలన్నింటిని బయటకు పంపించేసింది. నక్కకు అడవిలో ఎదురులేకుండాపోయింది. పులి, సింహం లాంటి జంతువులు కూడా నక్క ముందు తోక ఆడిస్తూ తమరి ఆదేశం అంటూ వినయంగా ఉండసాగాయి. జీవితం అంటే తనదే కదా? అనుకుంది నక్క.

 ఓ రోజు అడవిలో దూరంగా ఒక చోట కొన్ని నక్కలు బిగ్గరగా ఊలవేశాయి. ఇంకేం మన నక్కలోని సహజ అవతారం బయటకు వచ్చాడు. రంగుల నక్క కూడా బిగ్గర ఊలవేసింది. దీంతో నక్క బండారం బయటపడి దాని తాట ఒలిచాయి. మనం కూడా అంతే. చాలా మందిని ఏదో అవతారం అనుకుంటాం. సమయం రాగానే వారి అసలు అవతారం బయటపడుతుంది. నమ్మితే మోసం చేస్తావా? అని నిలదీస్తాం. అమాయకత్వం కాకపోతే నమ్మకపోతే ఎలా మోసం చేస్తారు.
1952 ప్రాంతంలో ఒక సాధువు దశావతారాల్లో తనది భూలోకంలో కడపటి అవతారమని ప్రకటించాడు. ఈ వార్తను అప్పటి తమిళ మహానేత రాజాజీ చదివి ఈ విషయంలో కూడా తనకు ప్రత్యర్ధి దాపురించాడని ఆవేదన చెందారట!
84లో నాదెండ్ల భాస్కర్‌రావు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు కర్నాటకలో క్యాంపులు నిర్వహించి ఎమ్మెల్యేలను రక్షించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో తల్లిదండ్రులను కావడికుండలను మోసినట్టు భుజాన మోసిన శ్రావణ కుమారుడి అవతారంగా రామారావుకు బాబు కనిపించారు. సరీగ్గా పదేళ్ళ తరువాత స్వయంగా తానే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి దించినప్పుడు బాబు శ్రావణ కుమారుడు కాదు తండ్రినే చంపించిన ప్రహ్లాదుడి అవతారం అని కొందరు గుసగుసలాడుకున్నారు. ఎన్టీఆర్‌కు తాను అవతార పురుషుడిని అని గట్టి నమ్మకం ఉండేది. అభిమానులు సైతం ఆయన్ని అవతార పురుషుడిగానే కొలిచే వారు. ఆయుధాన్ని చేపట్టకుండానే మహాభారత యుద్ధం మొత్తన్ని నడిపించిన శ్రీకృష్ణుడు ఒక అనామకుడి చేతిలో మరణించాడు. అవతారాన్ని చాలించాలి కాబట్టి తన అవతారాన్ని అలా ముగించారన్నమాట ఎన్టీఆర్ సైతం తన అవతారాన్ని చాలించాల్సిన సమయం వచ్చింది కాబట్టి అల్లుడి చేతిలో అంత సులభంగా ఓడిపోయాడని అభిమానులనుకుంటారు. డైరెక్ట్‌గా చెప్పుకోలేదు కానీ వైఎస్‌ఆర్ అవతార పురుషుడు, అందుకే ఆయన అధికారంలోకి వచ్చాకే వర్షాలు పడ్డాయి అని అభిమానులు చెప్పుకుంటారు. కానీ ఇది మనుషుల కాలం కలి కాలం. ఒక్క జీవితంలోనే ఎన్నో అవతారాలు ఎత్తితే కానీ జీవితం గడవదు.
సాధారణ కుటుంబరావులే రోజుకో అవతారం ఎత్తక తప్పదు. మా అమ్మతో నాకు పరమ చిరాకుగా ఉందోయ్ నువ్వెలా భరిస్తున్నావో కానీ అంటూ భార్య వద్ద భార్యా విధేయ అవతారం ఎత్తాలి. అమ్మా నీ కొడలు సంగతి తెలుసు కదా? రాచి రంపాన పెడుతోంది. నీ మీద ప్రేమ లేక కాదు.. ఆ గొడవను భరించలేక ... అంటూ అమ్మ దగ్గర నిస్సహాయ సుబ్బారావు అవతారం ఎత్తాలి. సినిమా వాళ్లకైనా అవతారాలు మార్చడంలో కొంత గ్యాప్ ఇస్తారు. కొత్త పాత్రను అర్ధం చేసుకుని జీర్ణం చేసుకుని, ఆవహించుకోవడానికి కొంత సమయం ఇస్తారు. సుబ్బారావుల జీవితంలో ఆ మాత్రం చాన్స్ కూడా ఉండదు. పైగా ఇంట్లో అంతలా నటించి ఆఫీసుకు వచ్చాక బాసు జోకు వేయకముందే పడి పడి నవ్వాలి. ఊసరవెళ్లి అని తిడతారు కానీ అలా అవతారాలు మార్చకపోతే ఆ జీవి బతకలేదు కదా!
దేవతల కాలంలో విష్ణుమూర్తి అవతారం దేవతలకైనా, రాక్షసులకైనా విష్ణుమూర్తిలానే కనిపించేది. కానీ అదేం చిత్రమో కానీ ఈ కాలంలో మాత్రం ఒకే అవతారం ఒక్కోక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది. పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో విజయం సాధించిన తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయకి సాక్షాత్తు అపర దుర్గగానే కనిపించింది. మాయావతిని దళిత దేవతగా దళితులకు కనిపిస్తుంటే ఆమెను తీవ్రంగా వ్యతిరేకించే వారికి మాత్రం విలన్ అవతారంగానే కనిపిస్తోంది. ఆమె మాత్రం దేశంలో చాలా మంది నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్న విషయం మాత్రం వాస్తవం. దళితులకు పెద్ద పీట అంటూ ఇంత కాలం అగ్రవర్ణ నాయకత్వ పార్టీలు ప్రకటించుకుంటుంటే ఆమె రివర్స్‌లో అగ్రవర్ణాలకు పెద్ద పీట అంటూ నిజంగానే ఉత్తర ప్రదేశ్‌లో బ్రాహ్మణులకు అత్యధిక సీట్లు ఇవ్వడమే కాకుండా గెలిపించుకుని రాజకీయాల్లో కొత్త అవతారాన్ని దాల్చారు. ఇంటి నుండి బయటకు వెళ్లి మళ్లీ ఇంటికి వచ్చే వరకు ఒక రోజులో సామాన్యుల దశావతారాల ముందు ఏ దేవుళ్ల అవతారాలు, నాయకుల అవతారాలు సాటిరావు.

6, డిసెంబర్ 2011, మంగళవారం

మన చానల్స్ ప్రయోగాలూ చేయాలి



పొరుగున ఉన్న తమిళంలో అద్భుతమైన ప్రయోగాలతో సినిమాలు వస్తున్నాయి. అక్కడ విజయవంతం అయిన తరువాత తెలుగువారు డబ్బింగ్ హక్కులో, రీ మేక్ హక్కులో కొనుక్కుంటున్నారు. చివరకు షష్టిపూర్తి వయసులో రజనీకాంత్, కమల్‌హాసన్‌లు సైతం ప్రయోగాలు చేస్తున్నా మన వాళ్లు చేయడం లేదు. కాపీ కావచ్చు, కొత్త దనం కావచ్చు. గజనీ లాంటి కథలు అక్కడి నుంచే వస్తున్నాయి. వయసు మీరిన తరువాత కూడా ఆ ఇద్దరు తారలు రోబో, దశావతారాలు వంటి ప్రయోగాలు చేశారు. అలాంటి ప్రయోగాలు ఇక్కడ సరిపోవు కావాలంటే డబ్బింగ్ చేసుకోండి అని మన ఘనత వహించిన హీరోలు సూచనలు చేస్తున్నారు. ఇతర హీరోల సినిమాలు చూసే అలవాటు మాకు లేదు అని సగర్వంగా ప్రకటించుకునే హీరోలున్న మన తెలుగు సినిమా రంగంలో ప్రయోగాలు ఆశించగలమా?

 సినిమా వాళ్లు ప్రయోగాలు చేయాలంటే కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలి. విజయవంతం అవుతుందో అట్టర్ ఫ్ల్లాప్ అవుతుందో తెలియదు కానీ టీవి రంగం అలా కాదు ప్రయోగాలకు అవకాశం ఉన్న రంగం ఇది. కానీ ఎందుకో కానీ అలాంటి సాహసాలు ఇక్కడ తక్కువగానే కనిపిస్తున్నాయి. ఒకరు దారి ఏర్పాటు చేస్తే ఆ మార్గంలోనే పయనించాలనే నిబంధన పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. దూరదర్శన్ కాలంలో తెలుగులో తొలి ప్రైవేట్ 24 గంటల న్యూస్ చానల్ టీవీ 9. వారు తొలుత ప్రవేశపెట్టిన మూసలో నడవడానికే తెలుగు చానల్స్ అలవాటుపడిపోయాయి. స్టూడియోకు పిలిచి తిట్టిపించడం ఐనా, బ్రేకింగ్ న్యూస్‌లైనా టీవీ 9 ప్రవేశపెట్టిన ఒరవడే. ప్రతి దాన్ని సెనే్సషనలైజ్ చేయడం అతి అయిన తరువాత ప్రజలు దేనికీ పెద్దగా స్పందించని పరిస్థితి ఏర్పడింది.
ఈ మధ్య పెద్దగా రాజకీయాల్లో సంచలనాలు అంటూ ఏమీ లేదు. 24 గంటల పాటు లైవ్‌గా చూపించే వార్తలు లేవు, చూసేందుకు ప్రజలూ సిద్ధంగా లేరు. అలాంటి సమయంలో న్యూస్ చానల్స్ సైతం ఎక్కువ సమయాన్ని రాజకీయ వ్యంగ్య కార్యక్రమాలు, కామెడీ సినిమా బిట్స్, సినిమా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు.
జానపద గీతాలను దూరదర్శన్ ఎప్పటి నుండో ప్రసారం చేస్తోంది. కానీ కొన్ని ప్రైవేటు చానల్స్ జానపద గీతాల ప్రసారాన్ని ఎలా విజయవంతం చేయవచ్చునో చూపించాయి. దూరదర్శన్‌లో జానపద గీతాలు సీదాసాదాగానే వచ్చేవి. రేలా రేలా దుమ్ము రేపడం అంటే ఏమిటో మా చానల్ వాళ్లు చూపించారు. టీ న్యూస్ వచ్చిన కొత్తలో తెలంగాణ జానపద గీతాలను ఎక్కువగా ప్రసారం చేశారు. ఆ తరువాత అనేక చానల్స్‌లో జానపద గీతాలు వస్తున్నాయి. ఎవరో ఒకరు ప్రారంభించాక వ్యూయర్‌షిప్ ఎక్కువగా ఉంటే మిగిలిన చానల్స్ సైతం అటువైపు అడుగులు వేస్తున్నాయి. అలా కాకుండా ఎవరికి వారు సొంతంగా కొత్తదనం కోసం ఏదో ఒక ప్రయోగం చేయవచ్చు. అన్ని ప్రయోగాలు విజయవంతం అవుతాయని, ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తారని కాదు.
మూసలో ఉండే బదులు ప్రయోగం చేస్తే పోయేదేముంది.
ఏదోలా 24 గంటల ప్రసారాలు ఎలా అనే ఆలోచనకు బదులు, కొంత సమయాన్ని కొత్త ప్రయోగాలకు కేటాయిస్తే బాగుంటుందనే ఆలోచన చేయవచ్చు కదా! వారు ప్రసారం చేసే కార్యక్రమాలు సెనే్సషనల్ కాకపోవచ్చు, వ్యూవర్ షిప్‌లో మొదటి స్థానంలో నిలవకపోవచ్చు కానీ హెచ్‌ఎం టీవిలో కొన్ని ప్రయోగాలు కనిపిస్తున్నాయి. దూరదర్శన్‌ను మినహాయిస్తే న్యూస్ చానల్స్‌లో సాహిత్య కార్యక్రమాన్ని ఊహించలేం. ఆ మధ్య టీవీ 9లో పుస్తక సమీక్ష ప్రారంభించినా అది ఎందుకో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. హెచ్‌ఎం టీవిలో వందేళ్ల తెలుగు కథ పేరుతో గొల్లపూడి మారుతీరావు ఆధ్వర్యంలో వస్తున్న సాహిత్య కార్యక్రమం ఒక మంచి ప్రయోగం. గొల్లపూడి మారుతీరావు సినిమా నటుడు, రచయిత. సహజంగా సినిమా వారి పట్ల ప్రేక్షకుల్లో ఆకర్షణ ఉంటుంది. సాహిత్య కార్యక్రమాన్ని గొల్లపూడితో ప్రారంభించడం వల్ల అటు ప్రేక్షకాదరణ లభిస్తుంది. ఇటు సాహితీ విలువలు ఉంటాయి. ఇదో మంచి ప్రయత్నం. మరీ దుమ్ము రేపకపోయినా సాహితీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇది విజయవంతం అయితే అదే చానల్‌లో మరిన్ని సాహిత్య కార్యక్రమాలు రావచ్చు, వాటికి ప్రేక్షకాదరణ ఉంటే వద్దన్నా ఇతర చానల్స్ అనుసరించి తీరుతాయి. టీవి5 తొలుత జిల్లాల వారీగా జిల్లా వార్తలను ప్రసారం చేసింది. హెచ్‌ఎంటీవి ప్రత్యేకంగా గిరిజన వార్తలకు ప్రత్యేక సమయం కేటాయించారు. అయితే గిరిజనులు అనగానే రోగాలు, తాగునీరు లభించక ఇబ్బందులు పడడం, ఆస్పత్రుల్లో మందులు లేకపోవడం డాక్టర్లు అందుబాటులో ఉండక పోవడం ఇవేనా? ఇలాంటి సమస్యలు గిరిజన ప్రాంతాల్లోనే కాదు అన్ని ప్రాంతాల్లో ఉన్నవే. గిరిజనుల జీవితం అంటేనే కష్టాలే అనే కోణమే కాకుండా వారి ఆటపాటలు, వారి జీవిత విధానం చూపించవచ్చు కదా? దానికి కొంత శ్రమ ఎక్కువవుతుందేమో కానీ కచ్చితంగా కొత్తదనం చూపినప్పుడు ఆకట్టుకుంటుంది. గిరిజనుల వివాహాలు సైతం ప్రత్యేకంగా ఉంటాయి. కొంత సమయం సమస్యలకు కేటాయించినా మరి కొంత సమయం వారిదైన ప్రత్యేక జీవన విధానంపై కథనాలు ప్రసారం చేయడానికి అవకాశం ఉంది.
అంబుడ్స్‌మెన్ వ్యవస్థ గురించి తెలిసిందే. మేం చెప్పిందే వేదం అని భావించే చానల్స్ వ్యవస్థలో తొలిసారిగా హెచ్‌ఎంటీవి అంబుడ్స్‌మెన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దానికి తీర్పరి అని తెలుగు పేరు పెట్టింది. చానల్‌లో ప్రసారం అయ్యే కార్యక్రమాల పట్ల అభ్యంతరాలు ఉంటే తీర్పరికి ఫిర్యాదు చేయవచ్చు. మంచి ప్రయత్నం.

1, డిసెంబర్ 2011, గురువారం

గతాన్ని తెలుసుకుందాం ఎక్కడినుంచి ఎక్కడికి వచ్చాం


గతాన్ని తెలుసుకుందాం 
ఎక్కడినుంచి ఎక్కడికి వచ్చాం 
1951 సంవత్సరం నాటి ఆనందవాణి లో ఆమెరికా సహాయం గురించి చదువుతుంటే ఏదోలా అనిపించింది ఈ దేశం ఎమీ అభివృద్ధి సాధించలేదని తిట్టుకునే వాళ్ళు ఒక్కసారి ఈ వ్యాసం చదవండి ... ఎన్ని లోపాలున్నా మన ప్రజాస్వామ్యం గొప్పది. మన అభివృద్ధి అధ్బుతం ....
 http://www.pressacademyarchives.ap.nic
http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.asp
http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.asp

30, నవంబర్ 2011, బుధవారం

విస్కీసోడా= ప్రజాస్వామ్యం - సామాజిక న్యాయం!




అత్యవసర సమావేశం అని తన ముఖ్యులందరినీ ఊరవతల ఉన్న డాబాకు పిలిచాడు ప్రముఖ దాదా సూరి. అప్పటికే క్వార్టర్ పూర్తి చేసిన సూరి మరో పెగ్గి లాగించేస్తూ ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. డబుల్ మర్డర్ చేసేప్పుడు కూడా అన్న ఇంత సీరియస్‌గా కనిపించలేదు, ఏమై ఉంటుందా? అని అంతా తమలో తామే గుసగుసలాడుకుంటున్నారు.
 ఉద్రిక్తంగా ఉన్నా పరిస్థితి అదుపులో ఉంది అన్నట్టుగా ఉందక్కడ . హైటెక్ సిటీ దగ్గర ఏడెకరాల ల్యాండ్ గొడవలో మంత్రిగాడి మనుషులు వచ్చినప్పుడే అనుకున్నాను ఏదో అవుతుందని అని ఒకరు మెల్లగా పలికాడు. ఆ మాట విన్న సూరి .... ఖాళీ ల్యాండ్‌మీద మన కన్ను పడిందంటే ఏ నాయకుడి చెంచాలు నాకు అడ్డురారు నీకు తెలియందేముంది భాయ్ కానీ ... అంటూ చెప్పకుండా నసుగుతుంటే అన్నా చెప్పన్నా పరవాలేదు. నీ కోసం ఏమైనా చేస్తాం అని అంతా పలికారు. సూరిబాబు గొంతు సవరించుకుని ‘‘ 50 ఏళ్ల వయసులో నాలో ఓ తీరని కోరిక రగిలిపోతుంది రా!’’ అని సిగ్గుపడ్డాడు. విషయం అర్ధమైందన్నా!
 సుజ్జి కంపెనీలో కొత్త పిట్టలొచ్చాయట! వెళదాం పదన్నా అని ఒకడన్నాడు. సూరి తల అడ్డంగా ఊపాడు. అన్నా టాలివుడా? బాలివుడా? పేరు చెప్పన్నా మిగతా మేం చూసుకుంటాం అని ముఖ్య అనుచరుడు ఊషారుగా ఈలవేశాడు. ఇంతోటి దానికి సిగ్గుపడడం ఎందుకన్నా అని నవ్వారు. సిగ్గే మనను చూసి సిగ్గుపడుతుంది మనకు సిగ్గెందుకురా? కానీ ఎందుకో? మీ అందరి ముందు ఆ కోరికను చెప్పాలంటే కొంత ఇబ్బందిగా ఉందని సూరి నవ్వాడు. ఏ కంపెనీ పిట్ట కావాలో చెప్పన్నా ? క్షణంలో నీ ఓళ్లో వాలిపోతుందని భరోసా ఇచ్చారు అనుచరులు నాకు కావలసింది అది కాదు. ఎప్పుడూ లేని విధంగా నాకు దానిపై మనసు పడిందిరా! పోయే లోపు ఎలాగైనా ఒకసారి సొంతం చేసుకోవాలనిపిస్తుంది. కానీ నాకది కావాలంటే నీ సహయం కావాలి అని సూరి సిగ్గుపడుతూ తల దించుకున్నాడు. అది.. అది.. అంటావు ఏంటో చెప్పన్నా అని అనుచరులు ఆప్యాయంగా అడిగారు. డబ్బులు బాగా వచ్చాక అది కావాలనే కొరిక చాలా మందికి కలుగుతుంది చూడు.. ‘‘అదేరా... అదే ప్రజాస్వామ్యం ... ఎలా గైనా దాన్ని సొంతం చేసుకోవాలని, అనుభవించాలని కోరిక పుట్టింది’’ అని సూరి చెప్పాడు.‘‘ ఏమో అనుకున్నానన్నా మరీ కొండకే గురిపెట్టావు. ప్రజాస్వామ్యాన్ని అనుభవించాలనుంది, సొంతం చేసుకోవలనుంది అనొద్దన్నా! ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని’’ఉంది అనాలి భాస్కర్ సవరించాడు. ఏదో లేరా? అది చేయాలని ఉంది అని సూరి చెప్పాడు.

 ఐనా అది మరీ ఖరీదైందన్నా ఒకటి రెండు ఎకరాలకు దొరికేంత తక్కువ ధర కాదు అని భాస్కర్ నిరాశ పరిచాడు. ఎంత ఖరీదైనా పరవాలేదురా మనం పెజాస్వామ్యాన్ని రక్షించాల్సిందే అని సూరి భీష్మించుకున్నాడు. అన్నా మరీ ప్రజాస్వామ్యంతో పరాచికాలొద్దు బాబు, జగన్ లాంటి పెద్ద పెద్ద వాళ్లు చేసే పనన్నా అది వాళ్ల వద్దనంటే లెక్కలేనంత డబ్బుంటుంది వాళ్లు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వెళితే ఒక అర్ధం ఉంది. ఏదో అక్కడిక్కడ ఖాళీ స్థలాను ఆక్రమించుకుని బుద్ధిగా బతికే వాళ్లం. అంత ఖరీదైన జూదం మనకెందుకన్నా ఉన్నది ఊడ్చుకుపోతుంది అయినా ప్రజాస్వామ్యాన్ని రక్షించి ఏం చేస్తావన్నా అని భాస్కర్ ఆసక్తిగా అడిగాడు. సూరి మరింతగా మెలికలు తిరిగిపోతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించి సామాజిక న్యాయం సాధిస్తాను అన్నాడు. ఇంతకూ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఆలోచన నీ కెందుకొచ్చిందన్నా! అని అడిగారు.

 ‘‘మొన్న రచ్చబండలో మంత్రి వేదికపై ఉంటే ఎమ్మెల్యే బస్తీమే సవాల్ అంటూ పైకి వెళ్లి బండ బూతులు తిట్టి మంత్రిని తోసేశాడు. దాంతో మంత్రి తిరిగి బూతులు తిట్టి ఆ ఎమ్మెల్యేను చితగ్గొట్టాడు. తరువాత ఎమ్మెల్యే టీవిలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే తాను వేదికపైకి వెళ్లి గొడవ పడ్డానన్నాడు. మంత్రికూడా ఎమ్మెల్యేను చితగ్టొట్టాడంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే కదా! మనం పోలీసులకు, అధికారులకు, నాయకులకు అందరికీ భయపడాలి. మరి మనమే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ముందుకు వచ్చామనుకో? ’’ అని సూరి అడిగాడు. సామాజిక న్యాయం? అని రవి ప్రశ్నార్ధకంగా ముఖం పెట్టాడు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం విస్కీ సోడాలా కలిసే ఉంటాయిరా? సామాజిక న్యాయం అంటే మీకు ఈజీగా అర్ధమయ్యేట్టు చెబుతా వినండి. మన కులపోల్లంతా మనకు ఓటు వేస్తారు, గెలిచాక మనం మన కులపోల్లకు కావలసింది చూసుకోవాలి ఈ కులాలు మనం సృష్టించుకున్నవే అంతా ఒకటే అంటూ ఉపన్యాసం ఇవ్వాలి అదే సామాజిక న్యాయం’’ అని సూరి వివరించాడు అయితే సరే అన్నా సొంతంగా కాకుండా ఇప్పుడున్న ఏదో ఒక పార్టీలో చేరి పెజాస్వామ్యాన్ని రక్షించి, సామాజిక న్యాయం సాధిద్ధాం అన్నారు. సూరి ఎవరికో ఫోన్ చేసి ఖద్దరు డ్రస్‌లు సిద్ధం చేయండి అని ఆదేశించి అనుచరులవైపు చూస్తూ ఇకపై నా పేరు సూరిబాబు అన్నాడు. అందరూ కోరస్‌గా ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సూరిబాబు జిందాబాద్ అన్నారు.

29, నవంబర్ 2011, మంగళవారం

చానల్స్ ఘోరాలు- యాజమాన్య నేరాలు


దాదాపు అన్ని తెలుగు చానల్స్ లో నేరాలు - ఘోరాలు అంటూ  నేరాల వార్తలు చూపుతున్నారు . ఓసారి కాస్త వెరైటిగా మన తెలుగు చానల్స్ యజమానుల నేరాల గురించి చూపితే ఎలా ఉంటుంది. ఒకరి ఇద్దరూ అని కాదు చాలామంది అనేక కేసులు ఎదుర్కొంటున్నారు .
కొత్త సంవత్సరంలో మరిన్ని కొత్త చానల్స్ వెలుగు చూడనున్నాయి. ఇప్పటి కున్న చానల్స్ సరిపోవనా? అంటే ఎవరి అవసరం వారిది. ఆర్థిక సంస్కరణల తరువాత సంపద పెరగడంతో పాటు చానల్స్ ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యయం కూడా తగ్గిపోవడం వల్ల సాధారణ స్థాయిలోనే చానల్ ప్రారంభించడానికి అవకాశం ఏర్పడింది. చానల్స్ మధ్యృ పోటీ వల్ల నష్టాలు ఎన్నున్నా, ప్రయోజనాలు సైతం ఉన్నాయి. ఒకటి రెండు చానల్స్ మాత్రమే ఉన్నప్పుడు ఏదో ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, తాము చెప్పినట్టుగానే ఆలోచించాలి అనే ధోరణి ఉండేది. ఇప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అనే సామెత మాదిరిగా చానల్స్ సంఖ్య పెరిగినప్పటికీ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించడానికి అవకాశం ఉంటోంది. ఇప్పటికీ అన్ని వర్గాలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభిస్తోందని చెప్పలేం కానీ గతంలో కన్నా మెరుగు.
త్వరలోనే ఎంపి వివేక్ చానల్ వస్తోంది. చిరంజీవి సైతం సొంత చానల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదే వర్గం నుండి ఒక సీడ్స్ కంపెనీ వారు కొత్త చానల్ ఏర్పాటులో ఉన్నారు.
వీరంతా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికో, సుపరిపాలన కోసమో చానల్స్ పెడుతున్నారనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు రాజకీయాల్లో ఎదగాలంటే సొంత చానల్ తప్పనిసరి.
టైమ్స్ నౌలో ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేస్తూ పొరపాటున ఒక న్యాయవాది ఫొటో చూపించారు. ఒకరి ఫోటోకు బదులు మరొకరి ఫోటో పొరపాటున వచ్చింది. పొరపాటు జరిగిందని పలుమార్లు చానల్ ప్రకటించింది. దీనిపై కోర్టుకు వెళితే వంద కోట్ల రూపాయలు చెల్లించాలని తీర్పు రావడం మీడియా రంగాన్ని విస్మయ పరుస్తోంది. పొరపాటున వచ్చిన దానికే ఇలా వంద కోట్ల జరిమానా? అయితే ఉద్దేశ పూర్వకంగా మన తెలుగు నాట పార్టీల వార్‌లో భాగంగా ప్రత్యర్థులపై మన చానల్స్ ప్రసారం చేస్తున్న కథనాలకు ఎన్నివేల కోట్లు చెల్లించాలో? ఒక రకంగా మన తెలుగు చానల్స్ దీన్ని అవమాన కరంగానే భావించాలి. సొంత పార్టీ మేలు కోసం ప్రత్యర్థి పార్టీపై వ్యతిరేకతతో మన వాళ్లు ప్రసారం చేస్తున్న కథనాలను ఎవరూ పట్టించుకోవడం లేదు, పట్టించుకోవడం లేదేమో అనిపిస్తోంది.
స్వాతంత్య్ర పోరాట కాలంలో ఎంతో మంది మీడియా పెద్దలు జైలు జీవితం అనుభవించారు. జైలు నుండి కూడా పత్రికల ద్వారా స్వాతంత్య్ర కాంక్షను రగిలించారు. అప్పటి మీడియా పెద్దలే కాదు ఇప్పటి మీడియా పెద్దలు సైతం కేసులు ఎదుర్కొంటున్నారు, జైలుకు వెళుతున్నారు. అయితే వారిది స్వాతంత్య్రం కోసం పోరాటం జరిపి జైలు పాలైతే, వీరు మాత్రం ఆర్థిక వ్యవహారాల్లో, నేరాల్లో కేసులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఎసిబి చేతిలో పట్టుబడిన పోలీసు అధికారి సర్వేశ్వరరెడ్డి ఒక చానల్స్ ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకున్నారు అని మీడియాలో ఒక వార్త. హమ్మయ్య చివరకు అవినీతి పరులు కూడా చానల్ పెట్టబోయారా? సర్వేశ్వరరెడ్డి ప్రమాదం తృటిలో మనకు తప్పిపోయింది అని సంబరపడిపోవలసిన అవసరం లేదు అంత కన్నా భారీ నేరాలకు పాల్పడిన వారి చేతిలో ఇప్పుడు చానల్స్ ఉన్నాయి, రాబోతున్నాయి, తృటిలో ఆగిపోయాయి. ఒక మీడియా మొఘల్ సిబిఐ కేసు ఎదుర్కొంటున్నారు. చానల్ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న మరొకరు ఒక కేసులో జైలు పాలయ్యారు. ఇక వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళేశ్వరస్వామి గురించి ఒక చానల్‌లో విస్తృతంగా ప్రచారం సాగుతుంటుంది. సాధారణంగా చానల్స్‌లో బాబాలకు వ్యతిరేకంగా ప్రచారం సాగుతుంటుంది. కానీ కాళేశ్వరస్వామి గురించి మాత్రం ఓ చానల్‌లో మహిమాన్వితుడు అనే ప్రచారం జరుగుతుంది. కొన్ని వందల కోట్ల రూపాయల పెట్టుబడులను ఒక స్వామి పెనుగొండకు తీసుకురావడంలో కీలక పాత్ర వహిస్తున్నారని ఆ చానల్ విస్తృతంగా ప్రచారం సాగిస్తోంది. సాధారణంగా ముఖ్యమంత్రులు తమ పాలనతో పెట్టుబడి దారులను ఆకట్టుకున్నామని, పెట్టుబడులతో వారు రాష్ట్రంలోకి దిగిపోతున్నారని ప్రచారం చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం స్వామి పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు ప్రచారం సాగడం విశేషం. ముల్లును ముల్లుతోనే తీయాలని ఆ మధ్య మీడియా ద్వారా బాధలు అనుభవించిన ఓ స్వామి మీడియాలో పెట్టుబడుల ద్వారా తన స్థావరాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. ఇటీవల ఒక నాయకుడి వ్యవహారాన్ని ఒక చానల్ బయటపెడితే, ఆ చానల్ వారి వ్యవహారాన్ని ఆ నాయకుడు బయటపెట్టాడు.

 ఆ మధ్య చీరాల కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చానల్స్‌లో కొన్ని వార్తలు వస్తే, ఒక్కో చానల్స్ వ్యవహారం ఇదీ అంటూ అతను లైవ్‌లో వివరించే సరికి అంతా అవాక్కయ్యారు. లైవ్‌ను నిలిపివేసి రాయబారాలు నడిపించారు. ఏదైనా చానల్‌లో ఓ నాయకుడికి వ్యతిరేకంగా వార్తలు వస్తే మీ చానల్ వ్యవహారం ఇదీ అంటూ నాయకులు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. న్యూస్ చానల్స్ హడావుడి లేకముందు ఇలాంటి వాతావరణం తక్కువ.
చిరంజీవి రాజకీయాల్లో విఫలమయ్యాక ఎందుకిలా జరిగిందని సమీక్షించుకున్నారు. సొంత చానల్ లేకపోవడం వల్లనే ఇలా జరిగింది తేల్చారు. 2014 ఎన్నికల నాటికి చేతిలో ఒక సొంత చానల్ ఉండే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నిలబడాలన్నా, ఒక నాయకుడు ఎదగాలన్నా చేతిలో ఒక చానల్ తప్పనిసరి అని బలంగా వినిపిస్తున్న వాదన. దేవేందర్‌గౌడ్ సైతం ఇదే కారణంతో విఫలమయ్యారని, ముందు చానల్ పెట్టి తరువాత ఆయన పార్టీ పెట్టి ఉంటే విజయం సాధించి ఉండేవారని ఆయన శ్రేయోభిలాషులు చెబుతుంటారు.
కొత్త చానల్ ప్రారంభించడానికి ఎన్నో ఆంక్షలు విధిస్తున్నప్పటికీ సంపద పెరగడం వల్ల చానల్స్ సంఖ్య రోజు రోజుకు పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. కొత్త ఏడాదిలో మరిన్ని కొత్త చానల్స్ దర్శన మివ్వబోతున్నాయి. రాసిలోనే తప్ప వాసిలో చానల్స్‌పై మనం పెద్దగా ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు. చానల్స్ కొత్తవి కావచ్చు కానీ ఒరవడిలో కొత్తదనం ఆశించలేం.

25, నవంబర్ 2011, శుక్రవారం

రాజకీయ నాయకుడిని చెంపదెబ్బ కొడితే భారత రత్న ఇవ్వాలా ?


ఎక్కడికెళ్తున్నాం?

ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. అవినీతిని, అధిక ధరలను సహించలేక పోతున్నారు. ఇది మంచి పరిణామమే. నేటి యువత తమ కెరీర్, సంపాదనపై సమాజంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇలాంటి సమయంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలపై ఒక యువకుడు తీవ్ర స్థాయిలో స్పందించాడు. ఎంత తీవ్ర స్థాయిలో అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌ను చెంపదెబ్బ కొట్టేంత తీవ్ర స్థాయిలో. ఢిల్లీలో గురువారం సిక్కు యువకుడు హర్విందర్‌సింగ్ చెంపదెబ్బ కొట్టాడు. ఇది ఆహ్వానించదగిన పరిణామమా? ముమ్మాటికీ కానే కాదు. కానీ శరద్ పవార్‌ను కొట్టిన సంఘటన కన్నా తీవ్రమైన విషయం యాహూ వెబ్‌సైట్‌లో కనిపించింది. యాహూ సైట్‌లో హర్విందర్‌సింగ్ మంత్రిని చెంపదెబ్బ కొడుతున్న దృశ్యాన్ని పెట్టారు. గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయానికి యాహూలోని ఈ దృశ్యంపై 1118 మంది స్పందించారు. విచిత్రమైన విషయం ఏమంటే యాహూలో స్పందించిన మొత్తం 1118 మంది ఆ యువకుడి చర్యను సమర్ధించారు. ఇంకా విచిత్రమైన విషయం ఏమంటే అతనికి భారత రత్న ఇవ్వాలని మొత్తం 20 మంది సూచించారు. రాజకీయ నాయకులంతా దొంగలే, వారికి ఇలాంటి శిక్ష తప్పదు. మీ కుటుంబం గురించే కాదు సమాజం గురించి పట్టించుకోండి. ఒక్క చెంపదెబ్బతోనే సరిపెట్టావేం హర్విందర్ ... మీ వెంట భారత యువత ఉంది . ముందుకు వెళ్లు .. ఇది ఆరంభం మాత్రమే.. హర్విందర్ చర్యకు మా సంపూర్ణ మద్దతు .... యాహూ స్పందనల్లోని కొన్ని వాఖ్యలివి. ఈ చర్యను దేశంలోని అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఖండించగా, వెబ్‌సైట్స్, సోషల్ సైట్స్‌లో మాత్రం యువత ఈ చర్యను సమర్ధించింది. చివరకు అతనికి భారత రత్న అవార్డు బహూకరించాలని డిమాండ్ చేసేంత వరకు వెళ్లారు. యాహూలో స్పందించిన వారిలో ఎక్కువగా యువత ఉంది. వృద్ధులు కూడా కొద్ది మంది ఉన్నప్పటికీ యువతనే ఎక్కువగా ఉంది. మహిళలు కూడా కొద్ది సంఖ్యలో ఉన్నారు. 1118 స్పందనల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ యువకుడి చర్యను ఖండిస్తూ లేదు. భారత రత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్‌ను సమర్దిస్తూ పోటీ పడ్డారు. దేశంలోని రాజకీయ నాయకులంతా ఇలాంటి వారే వారికీ శిక్ష అవసరం అనే నినాదాలు రాశారు. మరి రాజకీయ నాయకులందరినీ వ్యతిరేకిస్తూ, వారిని వద్దని మనం ఏ పాలన కోరుకుందాం. సైనిక పాలన కోరుకుందామా? ఇలాంటి నాయకుల కన్నా సైనిక పాలనే మేలు అని వాదించే యువత సైతం లేకపోలేదు. కొన్ని ఇస్లామిక్ రాజ్యాల్లో విప్లవాల ద్వారా నియంతృత్వాన్ని అంతమొందించాక, సైనిక పాలన వస్తే వారిని కొన్నినెలలు కూడా భరించలేకపోతున్నారు.
సైనిక పాలన స్థానంలో ప్రజా స్వామ్యం కోసం ఇస్లామిక్ రాజ్యాల్లో ప్రజలు ఉద్యమిస్తుంటే మనం మళ్లీ ప్రజాస్వామ్యాన్ని వద్దనుకుని ఎలాంటి పాలన కోరుకుంటున్నాం? గురువారం ఢిల్లీలో జరిగిన పరిణామం అటు రాజకీయ వ్యవస్థకు మంచిది కాదు, దేశంలో అసహనంతో విసిగివేసారి పోయిన యువతకు మంచిది కాదు. అవినీతిని ముమ్మాటికి వ్యతిరేకించాల్సిందే!కానీ రాజకీయ నాయకులను కొడితే ధరలు తగ్గుతాయా? ఇదే సమయంలో రాజకీయ వ్యవస్థ సైతం తమను తాము సంస్కరించుకోవాలి. ఎలా పాలించినా ప్రజలకు ఐతే కాంగ్రెస్, లేదంటే బిజెపి మాత్రమే శరణ్యం కాబట్టి చచ్చినట్టు ఎన్నుకొని తీరుతారు అనే ధీమా మంచిది కాదు. శరద్ పవార్‌ను కొట్టిన యువకుడే సుఖరామ్‌పై రెండు రోజుల క్రితమే దాడి చేశాడు. అతని మానసిక స్థితి అనుమానం కలిగిస్తోంది. ఇలాంటి చర్యలను నాగరికులు ఎవరైనా ఖండించాల్సిందే. భారత రత్న ఇవ్వాలని కోరడం, చర్యను సమర్ధించడం తగదు.

  • శరద్ పవర్ ను చెంప దెబ్బ కొట్టిన హర్విందర్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని చెబుతూ కొందరు యాహూ లో రాసిన కామెంట్స్ 
  • sathiyaseelan
    Sathiyaseelan Yesterday
    A very good news to all indians. We shouldn't stop with him alone. We should continue to slap Mr.P.Chithambaram, Mr.Manmohan singh, Mrs.Sonia ji, Mr.Rahul Gandhi. Ms,Mayawathi, Mr.Pranab mukharjee, Ms.Jeyalalitha, Mr.Lallu prasad yadhav etc. Since they are ruining our country. My support to you..