27, ఏప్రిల్ 2016, బుధవారం

ప్రభుత్వం పనితీరే తెరాసకు ఊపిరి

జల దృశ్యంలో ఒక మొక్కగా ఊపిరి పోసుకున్న టిఆర్‌ఎస్ 16 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో 29వ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ దృష్టిని ఆకట్టుకునే మహా వృక్షంగా ఎదిగింది. ఉద్యమ కాలంలో జై తెలంగాణ నినాదమే టిఆర్‌ఎస్‌కు ఊపిరిగా నిలిచి, టిఆర్‌ఎస్‌ను ఒక రాజకీయ పార్టీగా నిలబెట్టింది. ఇప్పుడు టిఆర్‌ఎస్‌కు ప్రభుత్వ పని తీరే అసలైన బలం. బుధవారం ఖమ్మంలో టిఆర్‌ఎస్ ప్లీనరీ జరుగుతోంది. ప్రభుత్వ పథకాలు ఎంత బాగా అమలు చేస్తే పార్టీ అంతగా పటిష్టపడుతుంది అని గ్రహిస్తే పార్టీకీ , తెలంగాణకు ప్రయోజనం. తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ ప్రజల సమస్యలను తెలంగాణ కోణంలో ఆలోచించి పరిష్కార మార్గాలు చూపే దిశగా పాలన సాగిస్తే, తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో తిరుగులేని శక్తిగా నిలుస్తుంది. తప్పటడుగులు వేస్తే పార్టీ నష్టపోవడమే కాదు, తెలంగాణ సుడిగుండంలో చిక్కుకుంటుంది.


దాదాపు రెండేళ్ల పాలన చూసినా, ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూసినా ప్రభుత్వం సరైన దారిలోనే పయనిస్తోందని స్పష్టమవుతోంది. వీడియో కాన్ఫరెన్స్‌లు, ఆకస్మిక తనిఖీలు, ముఖ్యమంత్రి ఆగ్రహాలు వ్యక్తం చేయడం వంటి చిలిపి పనులతో నిరంతరం మీడియాలో ఉంటూ పని మంతునిగా బోలెడు ప్రచారం తెచ్చుకోవచ్చు. ప్రభుత్వానికి దీనికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణకు ఇది అవసరం లేదు. తెలంగాణ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే నిర్ణయాలు కావాలి. ప్రభుత్వం సరైన దారిలోనే పయనిస్తోందని ఇటీవల జరిగిన పలు ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తెలంగాణ ప్ర భుత్వం ఏదో చేసేసింది అని కాదు, చెప్పింది చేస్తుంది అనే నమ్మకంతోనే ప్రతి ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్ సైతం ఊహించని స్థాయిలో విజయం చేకూర్చి పెట్టారు. 

కొన్ని దశాబ్దాల పాటు పాలకులు 18 గంటలు కష్టపడ్డామని, ఎన్నో మీటింగులు పెట్టామని చెప్పినా తెలంగాణ కరవు సమస్య పరిష్కారం కాలేదు. తెలంగాణను ఇంత కాలం అంటిపెట్టుకుని ఉన్న శతకోటి దరిద్రాలకు కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే సరైన పరిష్కారం.
దర్భతో గోవును హతమార్చిన వశిష్టుడు గోహత్యా పాతకం పోయేందుకు తపస్సు చేసి గోదావరిని ఆ ప్రాంతం గుండా ప్రవహింప చేశాడని గోదావరి గురించి పురాణ కథ. కథలో నిజానిజాలు ఎలా ఉన్నా కోటి ఎకరాలకు సాగునీరు లభిస్తే, తెలంగాణకు గత నాయకత్వం తెలిసో తెలియకో చేసిన పాపాలను ప్రక్షాళన చేసి, సస్యశ్యామల తెలంగాణను అందిస్తే పాలకులకు అంతకు మించి పుణ్య కార్యం ఉండదు. ఈ దిశగా ప్రభుత్వం సరైన అడుగులే వేస్తోంది. మేం వెళ్లిపోతే హైదరాబాద్ తలక్రిందులు అయిపోతుందని, చీకట్లో బతుకుతారు అని బెదిరించిన వారు కుళ్లుకునే స్థాయిలో నగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రియల్ ఎస్టేట్ పాతాళంలోకి ఏమీ వెళ్లలేదు. మరింతగా పెరిగింది. గత మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ మహానగరం విద్యుత్ కోతలు లేని వేసవిని చూస్తోంది. ఇవన్నీ తాత్కాలిక విజయాలు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడం శాశ్వత విజయం. తాత్కాలిక విజయాలను సొంతం చేసుకుంటే ప్రభుత్వం బలంగా ఉండేట్టు చూసుకుంటే ప్రభుత్వం సరైన దారిలోనే పయనిస్తోంది అనే అభిప్రాయం ప్రజలకు కలిగించడంలో విజయం సాధించారు.


ఆసరా, డబుల్ బెడ్‌రూమ్, కోటి ఎకరాలకు సాగునీరు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తే, టిఆర్‌ఎస్ ఒక మహావృక్షంగా నిలుస్తుంది. పథకాల అమలులో మాట తప్పినా, వెనకడుగు వేసినా, లక్ష్యాన్ని చేరుకోకపోయినా టిఆర్‌ఎస్‌కు అదే పెద్ద ప్రమాదం. హామీల అమలులో విఫలమైతే మరుగుజ్జు నేతలే టిఆర్‌ఎస్‌ను బలంగా ఢీకోనే శక్తివంతులుగా అవతరిస్తారు. తన బలం మొత్తం ప్రకటించిన పథకాలను అమలు చేసి చూపడమే అని టిఆర్‌ఎస్ నాయకత్వం సదా గుర్తుంచుకోవలసిన అంశం.
తెలంగాణలో పెద్దగా ప్రతిపక్షం అంటూ లేదు. ప్రభుత్వం, పార్టీ దేనికైనా భయపడడం అంటే తామిచ్చిన హామీలను తాము విజయవంతంగా అమలు చేసే అంశంపైన ప్రజలకే భయపడాలి. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ రెండు కోవల్లోకి వస్తాయి. ఒకటి సినిమా నటులు తమ గ్లామర్‌ను పెట్టుబడిగా పెట్టి ఏర్పాటు చేసిన ప్రాంతీయ పార్టీలు. లేదా ఒక ఉద్యమం నుంచి పుట్టిన పార్టీలు. ఆవిర్భావ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి సినీ గ్లామర్ లేదు. వారసత్వ నాయకత్వం లేదు. తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకత్వం లేదు. నాయకత్వం ఒక జిల్లాకు ఒక నియోజక వర్గానికే పరిమితం అయి ఉండవచ్చు. కానీ ప్రజల ఆకాంక్ష మాత్రం తెలంగాణ వ్యాప్తం. తెలంగాణ ప్రజలు తమ చిరకాల స్వప్నాన్ని నిజం చేసే సత్తా ఉన్న పార్టీగా టిఆర్‌ఎస్‌ను గుర్తించారు.
తెలంగాణ వాదులే కాదు తెలంగాణ వ్యతిరేకులు సైతం కొద్ది కాలంలోనే ఈ విషయం గ్రహించారు. అందుకే తెలంగాణను కోరుకునే వారికి కెసిఆర్ కేంద్ర బిందువుగా మారితే, తెలంగాణ వ్యతిరేకులకు సైతం ఆయనే కేంద్ర బిందువుగా మారారు. 


చంద్రబాబు వైఎస్‌ఆర్, కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి నాయకులు, ఆంధ్ర నాయకత్వం, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వర్గాలన్నీ కెసిఆర్‌నే కేంద్ర బిందువుగా చేసుకుని విమర్శలకు దిగాయి. అదే ఆయనకు వరంగా మారింది.
తెలంగాణకు సంబంధించి అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం ఆయననే  నాయకునిగా గుర్తించడం తెలంగాణకు బలమైన నాయకత్వం లభించేట్టు చేసింది. తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగింది, తెలంగాణ సాకారం అయితే ఎలా అభివృద్ధి చెందుతామో చెబుతూ కెసిఆర్ తెలంగాణ వారికి దగ్గరవుతుంటే, తెలంగాణ వ్యతిరేకులు ఆయన్ని వ్యతిరేకిస్తూ పాపులర్ నాయకునిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో కెసిఆర్‌ను నిలిపేందుకు తమకు తెలియకుండానే తమ వంతు సహకారం అందించారు. దీని వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ కాలంలోనే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా అభివృద్ధి చెందాల్సి ఉండే. కానీ అలా జరగలేదు.


 2014 ఎన్నికలకు ముందు వరకు 47 స్థానాల్లో పోటీ చేయడమే టిఆర్‌ఎస్ రికార్డు. 2004లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తే 27 స్థానాలు వచ్చాయి, 2009లో టిడిపితో కలిసి పోటీ చేస్తే 10 స్థానాల్లో గెలిచింది. తెలంగాణ ఉద్యమానికి టిఆర్‌ఎస్ కెరాఫ్ అడ్రస్ అని అన్ని పార్టీలు ఒప్పుకోక తప్పని పరిస్థితి. అయితే ఎన్నికల్లో సీట్ల సంఖ్య తక్కువ కావడం అసలు రాజకీయం. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంలో, జై తెలంగాణ నినాదాలు ఇవ్వడంలో, తీర్మానాలు చేయడంలో అన్ని పార్టీలు పోటీ పడ్డాయి. అదే సమయంలో పార్టీ అగ్రనాయకత్వాలు తెలంగాణను అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డాయి.టిఆర్‌ఎస్ తెలంగాణ ఉద్యమం చేస్తే మేం మౌ నంగా ఉంటే మా నియోజక వర్గంలో కొత్త నాయకత్వం పుడుతుంది, అలా కాకుండా ఉండాలంటే మేం టిఆర్‌ఎస్ కన్నా గట్టిగా జై తెలంగాణ నినాదం వినిపించాలి అదే చేస్తున్నాం అంటూ ఉద్యమ కాలంలో తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు చెప్పిన మాట. అన్ని పార్టీలు, అన్ని నియోజక వర్గాల్లో ఇదే విధంగా తెలంగాణ కోసం ఉద్యమాలు చేశాయి. సమయం వచ్చినప్పుడు పార్టీ నాయకత్వాలు తెలంగాణను అడ్డుకున్నాయి. దీంతో ఉద్యమ కాలంలో ఉద్యమ స్థాయిలో నియోజక వర్గాల్లో టిఆర్‌ఎస్ చొచ్చుకు వెళ్లలేకపోయింది. అలా కాకుండా ఉంటే ప్రతి నియోజక వర్గంలోనూ తెలంగాణకను కోరుకున్న యువనాయకత్వం గ్రామ స్థాయి నుంచి నియోజక వర్గం స్థాయి వరకు బలంగా ఉండేది. అలా జరగకుండా దాదాపు సగానికి పైగా నియోజక వర్గాల్లో పార్టీ ఏదైనా పాత కాపులే తమ తెలివి తేటలతో నియోజక వర్గంలో నాయకత్వం తమ చేయి దాటి పోకుండా చూసుకున్నారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. తెలంగాణ సాధించిన టిఆర్‌ఎస్‌కే పాలించే బాధ్యతను ప్రజలు అప్పగించాఠు. ఉద్యమ కాలంలో రాజకీయ భవిష్యత్తు కోసం అధిష్టానం కోరిక మేరకు నడుచుకున్న నాయకులు, ఎన్నికల తరువాత మళ్లీ తమ రాజకీయ భవిష్యత్తు కోసమే టిఆర్‌ఎస్‌ను ఆశ్రయించాయి. రెండు కుటుంబాలు, ఇద్దరు వ్యక్తులు, రెండు కులాల మధ్యనే పోరు అన్నట్టుగా తెలుగునాట గత మూడు దశాబ్దాల రాజకీయం సాగింది. అవశేష ఆంధ్ర ప్రదేశ్‌లో ఇప్పటికీ అదే రాజకీయం కనిపిస్తుంటే తెలంగాణలో మాత్రం దీనికి భిన్నవైఖరి కనిపిస్తోంది. ప్రభుత్వ పాలన తెలంగాణ కోణంలో తెలంగాణ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ సాగుతోంది. అందుకే మిషన్ కాకతీయ, భగీరథ వంటి పథకాలపై ప్రధానమంత్రితో పాటు నీతి ఆయోగ్ ప్రత్యేకంగా దృష్టిసారించింది.


ఇక రాజకీయాల అంశానికి వస్తే గతానికి ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ లేదు. ఉద్యమ కాలంలో ఇష్టం లేకపోయినా జై తెలంగాణ అని నినదించిన నాయకులు నియోజక వర్గంలో పట్టు కోల్పోకుండా ఉండడమే కాకుండా తరువాత మంత్రివర్గంలో సైతం స్థానం సంపాదించారు. వారు అలా అని ఉండకపోతే బలమైన కొత్త నాయకత్వం పుట్టుకు వచ్చేది. తెలంగాణ ఈ అవకాశాన్ని కోల్పోయింది. అధికార పక్షం ఎమ్మెల్యేలనే కొనుక్కొని ప్రభుత్వానే్న పడగొట్టే మహా నీతిమంతుల ఎత్తుగడలను తిప్పి కొట్టి టిటిడిపినే టిఆర్‌ఎస్‌లో విలీనం అయ్యేట్టు చేశారు. అధికారం కన్నా సిద్ధాంతాలే ముఖ్యం అని మడికట్టుకుని కూర్చోని ఉంటే టిఆర్‌ఎస్ కూడా సిపిఐ, సిపిఎం తరహాలో మిగిలిపోతే, ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే కాంగ్రెస్, టిడిపిల మధ్య అధికార మార్పిడి జరిగేది. గొంగట్లో తింటూ వెంట్రుకలను ఏరినట్టు ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత కన్నా గొప్ప విలువలతో కూడిన రాజకీయాలను ఆశించడం అత్యాశే. ఎందుకు చేర్చుకుంటున్నారు? ఎందుకు చేరారు అనే వాటి జోలికి ప్రజలు వెళ్లడం లేదు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసే స్వాప్నికునిగా కెసిఆర్‌ను ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినప్పుడు తొలుత కెసిఆర్ ఒక్కరికే తెలంగాణ సాధ్యం అనే గట్టి నమ్మకం ఉండేది. అందరికీ అపనమ్మకమే. ఇప్పుడు బంగారు తెలంగాణ సాకారం అవుతుందనే నమ్మకం తెలంగాణ మేలును కోరుకునే వారందరికీ ఉంది. ఆ నమ్మకం ప్రతి ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తోంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. 

ప్రజల్లో కెసిఆర్ పట్ల అంత బలమైన నమ్మకం ఉంది కాబట్టే విపక్షాలు డీలా పడడమే కాదు. సొంత పార్టీలోని నేతలు సైతం మౌ నంగా ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వం పట్ల ప్రజల్లో ఇంతటి విశ్వాసం లేకుంటే సొంత పార్టీ వారే విశ్వరూపం చూపించేవారు. ఈ నమ్మకాన్ని కలకాలం నిలబెట్టుకోవలసిన బాధ్యత కెసిఆర్‌పైనే ఉంది. అదే తెలంగాణకు మేలు.- బుద్దా మురళి (ఎడిట్ పేజి 27. 4. 2016)

24, ఏప్రిల్ 2016, ఆదివారం

ఓటరుకో విగ్రహం!

‘‘దేశంలో ఎత్తయిన విగ్రహం ఏదో తెలుసా?’’
‘‘ మోదీ మాట నిలబెట్టుకుంటే పటేల్ విగ్రహం, కెసిఆర్ నిర్మించే అంబేద్కర్ విగ్రహం, లేదంటే బాబు గారి అంబేద్కర్ విగ్రహం.. కానీ నాకైతే ఈ మూడూ అనుమానంగానే ఉన్నాయి. ’’
‘‘ విగ్రహాల గురించి అడిగితే, రాజకీయాల గురించి చెబుతున్నావ్’’
‘‘రెండూ ఒకటే. భోజరాజుకు సాలభంజికలు కథలు చెప్పినట్టు ప్రతి విగ్రహం వెనుక రాజకీయ కథ ఉంటుంది.’’
‘‘ గుజరాత్ అనగానే మహాత్మాగాంధీ గుర్తుకు వస్తారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు మహాత్మున్ని పటేల్‌తో రీ ప్లేస్ చేస్తూ, గుజరాత్‌లో పటేళ్ల ఓటు బ్యాంకును పదిల పరుచుకోవడానికే మోదీ ప్రపంచంలోకెల్లా ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు’’
‘‘పటేల్ ఈ దేశం కోసం ఏమీ చేయలేదా? ’’
‘‘గాంధీ, పటేల్ మాత్రమే కాదు వారి కన్నా ముందు, వారి తరువాత ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు. అయితే విగ్రహాలకు వారి త్యాగాలు కాదు, వారి ఓటు బ్యాంకే కొలమానం. ’’
‘‘ పటేళ్లే మోదీకి తలనొప్పిగా మారారని వార్తలొస్తున్నాయి. ’’
‘‘ పటేల్ విగ్రహ ఏర్పాటు సైతం నెమ్మదించింది అందుకేనేమో! ఇంటికో ఇటుక సేకరించి రామ మందిరం నిర్మిస్తామని, ఆ నినాదంతోనే అధికారంలోకి వచ్చిన వాళ్లు ఆ సంగతి మరిచిపోయారు. దేవుడినే బురిడీ కొట్టించినప్పుడు రాజకీయ వారసులు కూడా లేని పటేల్‌ను పక్కన పెట్టలేరా? ’’


‘‘రాజకీయాలకు విగ్రహాలకు సంబంధం అంటే నమ్మలేకపోతున్నాను? ’’
‘‘ విగ్రహాలకు రాజకీయాలకు ప్రపంచ వ్యాప్తంగా అవినాభావ సంబంధం ఉంది. రెండు వేల ఏళ్ల క్రితమే బుద్ధుడు విగ్రహారాధనను వ్యతిరేకించారు. ప్రపంచంలో కెల్లా ఎక్కువ విగ్రహాలు, ఎత్తయిన విగ్రహాలు, ఎక్కువ దేశాల్లో విగ్రహాలు ఉన్నది బుద్ధుడికే. ప్రపంచంలో అత్యధికులు దేవునిగా పూజించేది విగ్రహారాధనను వ్యతిరేకించిన బుద్ధ విగ్రహాలనే.. ఆఫ్ఘానిస్తాన్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద బుద్ధ విగ్రహాన్ని తాలిబాన్లు కూల్చేశారు!! ’’
‘‘ అవును కూలిస్తే ? ’’
‘‘ ఆఫ్ఘానిస్తాన్ బుద్ధ దేశంగా ఉన్నప్పుడు బుద్ధుని విగ్రహాలు వెలిశాయి, రాజకీయాల్లో మార్పులు వచ్చి తాలిబానిజం పెరిగినప్పుడు విగ్రహాలు కూలాయి. విగ్రహారాధనను వ్యతిరేకించి మతంలానే వ్యక్తి పూజను వ్యతిరేకించే దేశా లు పార్టీలు కూడా ఉన్నాయి. వాళ్లూ విగ్రహారాధనకు, విగ్రహ పూజకు అతీతులు కారు. ’’
‘‘ వాళ్లెవరు? ’’
‘‘ సోవియట్ రష్యా... శ్రీశ్రీ చెప్పినట్టు గర్జించు రష్యా గాండ్రించు రష్యా అనే నినాదాలతో ఓ వెలుగు వెలిగినప్పుడు లెనిన్ విగ్రహాలు పూజలందుకునేవి. 75ఏళ్ల వయసులో వృద్ధాప్యం మీద పడి గాండ్రించే రష్యా కాస్తా చతికిల పడ్డ రష్యాగా మారినప్పుడు లెనిన్ విగ్రహాలను కూల్చేశారు. రాజకీయం మారినప్పుడు విగ్రహాల స్థానం మారుతుంది.’’
‘‘ ఏ విగ్రహం కూడా శాశ్వతం కాదన్నమాట’’
‘‘ రాజకీయంగా ప్రయోజనం ఉన్నంత వరకే ఆ విగ్రహం శాశ్వతం. మనువాద పార్టీలు అంటూ బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా పుట్టిన బిఎస్‌పి మాయావతి బహెన్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చాక ఉత్తరప్రదేశ్‌లో భారీ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ’’


‘ కానీ ఆమెనే బ్రాహ్మణులకు ఎక్కువ టికెట్లు ఇచ్చారట కదా? ’’
‘‘ నిజమే ఉత్తర ప్రదేశ్ చరిత్రలోనే అత్యధికంగా బ్రాహ్మాణులకు టికెట్‌లు ఇచ్చిన ఘనత ఆమెదే. 70మందికి పైగా టికెట్‌లు ఇచ్చారు. ఎన్టీఆర్ సావిత్రి, అక్కినేని వాణిశ్రీ, చిరంజీవి విజయశాంతి హిట్ పేయిర్ అంటూ తెలుగు సినిమా జంటలు ఉండేవి తెలుసు కదా? ఈ జంట కలిసి నటిస్తే సినిమా సూపర్ హిట్ అని గట్టి నమ్మకం ఉండేది. కుటుంబ నియంత్రణపై పెద్దగా ఆసక్తి చూపక పోవడంతో ఒక్కో సినీ కుటుంబం నుంచి డజన్ల కొద్ది హీరోలు వచ్చి వాలిపోతున్నారు. అలానే ఫ్యాక్షన్ కథలకు ఒకప్పుడు మినిమం గ్యారంటీ ఉండేది. రాజకీయాల్లో సైతం సరిగ్గా ఇంతే. బహుజన నినాదంతో రాజకీయంగా బలమైన శక్తిగా నిలిచిన మాయావతి హిట్ కాంబినేషన్ కోసం దళిత, బ్రాహ్మణ వాదాన్ని మిక్స్ చేశారు. దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అన్నారు. ములాయం బిసి, మైనారిటీ కాంబినేషన్‌తో విజయం సాధించారు. లేకపోతే ఉత్తర ప్రదేశ్‌లో అతి పెద్ద మనువు విగ్రహాలు ఏర్పాటయి ఉండేవి కూడా? ’’
‘‘???’’


‘ రాజకీయాల్లో విగ్రహాలను నమ్ముకున్న వాళ్లు ఎవరూ చెడిపోలేదు. ఎన్టీఆర్‌ను దించేసిన బాబే శ్రీకృష్ణునిగా ఎన్టీఆర్ విగ్రహం చేయించారు. జగన్ ముందు చూపుతో వైఎస్‌ఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్లనే కదా బలమైన విపక్షంగా నిలిచింది. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను కూల్చేశాక కేంద్రం సైతం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగం చేసింది. ’’
‘‘ ఆ విగ్రహాలను విజయవాడకు పార్సిల్ చేస్తాను అని కెసిఆర్ చెబితే, మేం తీసుకుంటాం అని సినీ పెద్ద మురళీ మోహన్ అన్నారు. కెసిఆరే ఇప్పుడు ఎన్టీఆర్ జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకుంటామని చెబుతున్నారు. ’’
‘‘ ఆ మాటల్లో నిజంగా ప్రేమ ఉందంటావా? మీ దేశం మీరు వెళ్లండి మీరు వదిలిన విగ్రహాలను మేం జాగ్రత్తగా చూసుకుంటాం అని అప్పగింతలు చెప్పడం అయితే కాదు కదా? ’’
‘‘ ఏమో నాయకుల మాటలకు అర్ధాలే వేరు? దీని కంతటికీ కారణం ఏమంటావు? ’’
‘‘ నెహ్రూతో పాటు ఆనాటి జాతీయ నాయకులంతా కారణం? ’’
‘‘ ఇంకా నయం జగన్ కారణం అనలేదు? వాళ్లేం చేశారు. ’’
‘‘స్వాతంత్య్రానికి ముందులా కొందరికే ఓటు హక్కు ఉంటే కొందరి విగ్రహాలే కనిపించేవి. సార్వజనీన వయోజన ఓటు హక్కు వల్ల ఓటున్న సామాజిక వర్గాలన్నింటికి విగ్రహాలు వస్తాయి . ’’
‘‘ ఆర్‌కె లక్ష్మణ్ కామన్ మ్యాన్ విగ్రహంలా సింబాలిక్‌గా ఓటరుకే భారీ విగ్రహం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఆ పార్టీకే అంతా ఓటు వేస్తారు కదా? ’’
‘‘ఓటరు దేవుళ్లు అని పూజించే నాయకులు ఓటరుకు విగ్రహాన్ని నిర్మించే రోజులు కూడా వస్తాయి’

-బుద్దా మురళి (జనాంతికం 24. 4. 2016)

17, ఏప్రిల్ 2016, ఆదివారం

చంద్రోదయం!

‘‘ఇంత కాలానికి కెసిఆర్ అసలు విషయం చెప్పారు’’
‘‘ఏంటా అసలు విషయం? ’’
‘‘బాబా సాహెబ్ అంబేద్కర్ వల్లనే తెలంగాణ ఏర్పడిందని ఒప్పుకున్నా రు కదా? సోనియాగాంధీ వల్ల అని, కెసిఆర్ ఉద్యమంతో సాకారం అయిందని, తెలంగాణ ప్రజలు జరిపిన ఉద్యమంతోనే తెలంగాణ సాకారం అయిందన్నారు. ఇప్పుడు చూడు కెసిఆరే స్వయంగా అసలు విషయం చెప్పారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా అంబేద్కర్‌కు రాజ్యాంగ రచన బాధ్యత అప్పగించక పోయి ఉంటే సమైక్యాంధ్రలో మనం చక్కగా ఉండేవాళ్లం ’’
‘‘సరే అయిపోయిన పెళ్లికి ఏమనుకుంటే ఏం కానీ... సపోజ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ఉండక పోతే తెలంగాణ రాకపోయి ఉండేదని నీ అభిప్రాయమా? రాజ్యాంగం ఎవరో ఒకరు రచించాల్సిందే, రాష్ట్రాల ఏర్పాటుకు ఏదో ఒక నిబంధన చేర్చాల్సిందే కదా? అంబేద్కర్‌కు ఉన్న ముందు చూపు వల్ల ఆ అధికారం కేంద్రం చేతిలో పెట్టారు. ’’
‘‘అంటే కెసిఆర్ చెప్పింది నిజం కాదా? ’’
‘‘వెనకటికో రాజుగారి కుమారుడి జాతకంలో శునకంతో ప్రాణాలకు ముప్పు ఉందంటే ఒంటి స్తంభం మేడ గట్టించి కుమారున్ని ఎవరి కంట పడకుండా రాజు దాచి పెడతాడు. పిల్ల రాజు శునకం బొమ్మతో ఆడుకుంటుంటే గుండెల్లో కుచ్చుకుని ప్రాణాలు విడుస్తాడు. జాతకంలో అలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది అంతే. బుద్ధుడు జాతకాన్ని చూసి దుఃఖం అంటే ఏమిటో తెలియకుండా పెంచాలని శుద్ధోదనుడు ప్రయత్నిస్తే, ఏమైంది చివరకు గౌతముడు రాజ్యాన్ని, భార్యను వదిలేసి బుద్ధుడయ్యా డు కదా? జాతకాలను బుద్ధుడు వ్యతిరేకించి ఉండవచ్చు కానీ ఆయన జాతకంలో అలా రాసిపెట్టి ఉంది అంతే. అలానే తెలంగాణ ఏర్పడాలని తెలంగాణ ప్రజల జాతకంలో రాసిపెట్టి ఉంది. శుద్ధోదనుడు ఎన్ని అడ్డంకులు కల్పించినా బుద్ధునికి జ్ఞానోదయం అనివార్యం అయినట్టు ఎన్ని అడ్డంకులు కల్పించినా తెలంగాణ సాకారం అయింది. అంతా జాతక మహిమ. ’’
‘‘నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పడం లేదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి ఉండకపోతే తెలంగాణ వచ్చేదా? ’’
‘‘గాంధీ లేకపోతే స్వాతంత్య్ర ఉద్యమం సాగేది అని కొందరి అనుమానం. నెహ్రూ పోయాక ఈ దేశం ఏమవుతుందో అని భయపడ్డవాళ్లున్నారు. ఎవరూ లేకపోయినా చాయ్ వాలా కూడా ఈ దేశాన్ని పాలించగలడు అని మోదీ నిరూపించారు. బాబు గారు ఓడిపోతే భూమి బద్దలవుతుంది అని 2004లో మేధావులే ఆందోళన పడ్డారు. వైఎస్‌ఆర్ వచ్చాక ఐటి ఎగుమతులు మరింతగా పెరిగాయి. కెటిఆర్ నాయకత్వంలో ఇప్పుడు మరింత వేగంగా ఐటిలో అభివృద్ధి కనిపిస్తోంది. తీన్మార్‌లో మల్లన్న పోతే చానల్‌లో చూసేందుకు ఏముంటుందని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు. ఏమైంది మల్లన్న ప్లేస్‌లో బిత్తరి సత్తి వచ్చాక రేటింగ్ ఇంకా పెరిగింది. దేని కోసం ఏదీ ఆగదు. ’’
‘‘ నేను అడిగిన దాని గురించి చెప్పు’’
‘‘యుపిఏ ప్రభుత్వం, సోనియా నాయకత్వం ఉండి ఉండకపోతే, కెసిఆర్ నాయకత్వంలో ఉద్యమం జరగకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. 1969లో ఉధృతంగా ఉద్యమం సాగింది కానీ ఫలించలేదు. అలా రాసిపెట్టి ఉంది అంతే’’
‘‘ ఎవరి వల్ల తెలంగాణ వచ్చిందటావ్?’’
‘‘చంద్రబాబు వల్ల తెలంగాణ వచ్చిందటాను కాదంటావా? బాబు పాలనలో వరుస కరువు, విద్యుత్ చార్జీలు పెంచడం, చార్జీలు తగ్గించమని రైతులు ఆందోళన చేస్తే కాల్పులు జరిపి ప్రాణాలు పొట్టన పెట్టుకోవడం వంటివన్నీ జరిగి ఉండక పోతే కెసిఆర్ ఉద్యమానికి జనం అండగా నిలిచేవారా? బాబుగారి వల్లనే తెలంగాణ వచ్చిందటాను’’
‘‘నువ్వేమనుకున్నా అంబేద్కర్ వల్లనే.. కాకపోతే 125 అడుగులు ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని కెసిఆర్ ఎందుకు ప్రకటిస్తారు’’
‘‘ చూడోయ్ రాజకీయ నాయకుడు ఏం చేసినా అందులో రాజకీయం ఉంటుంది. ఆ రాజకీయం ప్రజలకు మంచిచేసేదైతే స్వాగతిద్దాం. విగ్రహాల్లోనూ కచ్చితంగా రాజకీయమే ఉంటుంది. ఇద్దరు చంద్రుల మధ్య విగ్రహ పోటీ సాగుతోంది. ఎప్పుడొచ్చామన్నది కాదు. బుల్లెట్ దిగిందా లేదా? అనే డైలాగు తరహా కెసిఆర్‌ది. కెసిఆర్ కన్నా ముందు బాబు విగ్రహ ప్రకటన చేశారు, కానీ కెసిఆర్ ముందు విగ్రహాన్ని నిర్మించి చూపిస్తారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని చేర్చడం ద్వారా తెలంగాణ సాకారం కావడానికి దోహదం చేసిన అంబేద్కర్‌కు భారీ విగ్రహం నిర్మించి నివాళి అర్పిస్తాను అని కెసిఆర్ చెబుతున్నారు. సెక్షన్ 8తో కెసిఆర్‌ను ఇరకాటంలో పెట్టాలనుకుంటే ఆర్టికల్ 3తో బాబును ఇరకాటంలో పెట్టారు. నెక్లెస్ రోడ్ అంటే ఎన్టీఆర్ పేరు గుర్తొస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ స్థానంలో ఆర్టికలో 3ని చేర్చిన అంబేద్కర్ పేరు గుర్తుకు రావడం ఇదే రాజకీయం .
‘‘ కెసిఆర్‌కు ఆంధ్రలో సైతం పాపులారిటీ లభించడం కెసిఆర్ పాలన వల్లనా లేక బాబుపై వ్యతిరేకత వల్లనా? ’’
‘‘ ఆంధ్రలో ఆంధ్ర సంస్థలు జరిపిన సర్వేల్లో కూడా ఆ చంద్రుడి కన్నా ఈ చంద్రుడి పాలన బాగుందని చెప్పారట ! మొగుడు కొట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టు, సొంత రాష్ట్ర ప్రజలు విమర్శించినందుకు కాదు కానీ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి పనితీరును తమ రాజ్య ప్రజలు అభినందిస్తున్నందుకు బాబుకు చిరాకెత్తిందట! అయితే ఏ సర్వేలో ఏ రాజకీయం ఉందో కాబట్టి ఈ సర్వేలను అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదనుకో’’
‘‘ అంటే సర్వే జగన్ కుట్ర అంటావా? ’’
‘‘ అన్నింటికీ జగన్ కుట్ర అనడం కామన్ డైలాగ్. జగన్‌మీద కుట్ర ఈ సర్వే అని ఎందుకనుకో కూడదు. బాబు గ్రాఫ్ పడిపోతున్నా, విపక్ష నాయకుడి పట్ల ప్రజలు విశ్వాసం చూపించడం లేదు అనే ప్రచారం చేసేందుకు జగన్‌పై సర్వేల కుట్రలు జరపవచ్చు కదా? ’’
‘‘ వారికి లేని ఆలోచనలు నువ్వు పుట్టించేట్టు ఉన్నావు? ’’
‘‘ ఏది నిజం అనే ఆలోచన వదిలేయ్ ! ఏ ప్రచారాన్ని ఎవరు ఎందుకు ప్రారంభించి ఉంటారని ఆలోచించు రాజకీయం అర్ధమవుతుంది ’’

-బుద్దా మురళి (జనాంతికం 17-4-2016)

11, ఏప్రిల్ 2016, సోమవారం

స్క్రిప్ట్ మార్చండి!


‘‘ దిగులుగా ఉన్నావేంటి?’’
‘‘ న్యూ ఇయర్ ఆలోచనలు ’’
‘‘దుర్ముఖి నామ సంవత్సరంపై భయపడాల్సిందేమీ లేదని కెసిఆర్ పంచాంగ శ్రవణంలో చెప్పారు కదా? ’’
‘‘ తెలుగు కాదు ఇంగ్లీష్ సంవత్సరం గురించి? ’’


‘‘ హేమా మాలిని తెల్ల జుట్టుతో కనిపించడం లేదా? ఒక రోజు ఐశ్వర్యారాయ్ కనిపిస్తుంది. దిగులు పడితే అవుతుందా? ’’
‘‘రోజులు గడిచిపోతున్నాయని కాదు. విజయమాల్యా విదేశాలకు వెళ్లిపోయారు కదా? కొత్త క్యాలండర్ వస్తుందా? రాదా? అనేదే నా బాధ. అందమైన అమ్మాయిల బొమ్మలతో చక్కని క్యాలండర్‌ను ప్రతి ఏటా విడుదల చేసేవాడు. మనసు బాగా లేనప్పుడు క్యాలండర్‌లోని ఆ ముద్దు గుమ్మలను చూస్తూ సమస్యలన్నీ మరిచిపోయే వాడ్ని. కత్రినాకైఫ్ లాంటి వాళ్లెంతో మంది ఆ క్యాలండర్‌లో మనను కనువిందు చేశారు. ఆ మహానుభావుడు తన వ్యాపారాన్ని, వ్యవహారాలను పక్కన పెట్టి అందమైన అమ్మాయిల క్యాలండర్ ఫోటో షూట్ కోసం చెట్ల వెంట పుట్టల వెంట, సముద్రాల వెంట తిరిగేవాడు. మన కష్టాలను పారద్రోలిన ఆయనకు కష్టాలంటే నమ్మలేక పోతున్నాను. విధి బలీయమైంది. ’’
‘‘మాట్లాడుకోవడానికి నీకు మరో అంశమే లేదా? ’’
‘‘సరే సర్దార్ గబ్బర్ సింగ్ ఎలా ఉందట! ’’
‘‘ కొందరు పండగ అంటే మరికొందరు దండగ అంటున్నారు. ఒక అభిమాని అకాశానికి ఎత్తితే మరో అభిమాని పనిలేకపోతే రామకోటి రాసుకోవాలి కానీ కథ స్క్రీన్‌ప్లే మాత్రం రాయవద్దని ఫేస్‌బుక్‌లో సలహా ఇచ్చారు. నేను చూడలేదు కాబట్టి చెప్పలేను. ’’


‘‘సినిమాలు చూడక పోతే రాజకీయాల గురించి ఎలా తెలుస్తుంది?టీచర్ పిల్లలకు చెప్పాల్సిన పాఠం ముందుగా చదువుకొని వెళ్లకపోయినా ఇబ్బంది లేదు. జర్నలిస్టు పేపర్ చదవక పోయినా ఏమీ కాదు. టీవి యాంకర్‌కు తాను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి పేరు తెలియక పోయినా ఏమీ కాదు. కానీ కలికాలంలో సినిమా గురించి తెలియక పోతే ఎలా బతుకుతావోయ్ ’’
‘‘రాజకీయాలకు సినిమాకు సంబంధం ఏంటోయ్?’’
‘‘ 82లో బెబ్బులి పులి వంటి సూపర్ హిట్ సినిమాల తరువాతే కదా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చింది. అలానే పవన్ కొన్ని సూపర్ హిట్ సినిమాలు ఇచ్చి రాజకీయాల్లోకి ఫుల్‌టైమ్‌గా రావాలని వ్యూహం. ఈ విషయం తెలిసే అధికారపక్షం, విపక్షం సినిమా ఫ్లాప్ అని ప్రచారం చేస్తోంది.’’


‘‘ఎట్టెట్టా! ’’
‘‘జగన్ అధికారంలోకి వస్తే దించడం కష్టం అని పవన్ వ్యూహాత్మకంగా బాబుకు మొన్న ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. అంటే 2019లో పవన్ అధికారంలోకి రావాలంటే బాబు గెలవాలి అదీ వ్యూహం. అందుకే ఇప్పుడు ఇద్దరి వర్గం సినిమా ప్లాప్ అని ప్రచారం చేస్తోంది’’
‘‘ఈ వ్యూహాల సంగతి తెలియదు కాదు. పవన్ ఆ డైలాగు చెప్పినప్పుడు ఆయనలో మాత్రం నిజాయితీ కనిపించింది? ’’
‘‘ఏ డైలాగు? ’’
‘‘నాక్కొంచం తిక్కుంది. అనే డైలాగు’’
‘‘రాజకీయాలంటే నీకు మరీ జోకులయ్యాయి.. రాజకీయాలంటే ఒక పవిత్ర కార్యం. సరే లోకేశ్‌ను మంత్రివర్గంలో తీసుకుంటారా? ’’


‘‘మీ బాబాయ్‌కి స్వీట్ షాపుంది కదా? వాళ్ల అబ్బాయి ఓ స్వీట్ బాక్స్ అడిగితే ఇస్తాడా? ’’
‘‘ఎందుకివ్వడు షాపే వాళ్లది’’
‘‘ఇదీ అంతే ప్రాంతీయ పార్టీ అంటే కుటుంబ వ్యాపారమే? హెరిటేజ్ బాధ్యతలు ఇవ్వడం ఎలాగో ఇదీ అంతే.. ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు. లోకేశ్ లోకనాయకుడు అని పల్లె రఘునాథరెడ్డిలాంటి వారి సిఫారసూ అవసరం లేదు. లోకేశ్ గురించి తల్లిదండ్రుల కన్నా పార్టీ వారికి ఎక్కువ తెలుసా? ’’
‘‘ ఏదీ తిన్నగా చెప్పవు కదా? ’’
‘‘ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ వ్యాపారాలే. ప్రాంతీయ పార్టీలు పుట్టిన తమిళనాడు నుంచి కొత్తగా పుట్టిన మన తెలుగు రాష్ట్రాల వరకు అంతా అంతే. ’’


‘‘ తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీలో కిలోల లెక్క అమ్ముతుంటే చలించిపోయిన ఎన్టీఆర్ టిడిపిని పెట్టారు. ప్రాంతీయ పార్టీలను కుటుంబ వ్యాపారం అని తేలిగ్గా తీసేస్తావా? కొన్ని కోట్ల మంది ఆశలకు ఆశయాలకు, సిద్ధాంతాలకు ప్రతిరూపం’’
‘‘ ఎన్టీఆర్ అయినా కెసిఆర్ అయినా ఏదో త్యాగం చేయాలని పార్టీ పెట్టరు. ఒక్కో పార్టీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. 60 ఏళ్ల హీరో రిటైర్‌మెంట్ బెనిఫిట్ స్కీమ్ పాత టిడిపి , మామ గారి రెండో పెళ్లికి అల్లుడికి దక్కిన కట్నం కొత్త టిడిపి, టెక్ట్స్‌బుక్ నాలెడ్జ్‌తో పుట్టిన పార్టీ లోక్‌సత్తా, ఏ నాలెడ్జ్ లేకుండా పార్టీ పెడితే జనసేవ అవుతుంది.
కాలం కాని కాలంలో కూసిన కోయిల ప్రజారాజ్యం. ఒక ప్రాంత ప్రజల వివక్షపై ఆసంతృప్తి ఆగ్రహంగా మారితే పుట్టిన పార్టీ టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ స్కీముల నుంచి పుట్టిన పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పార్టీలు వామపక్షాలు. మతం నుంచి పుట్టింది బిజెపి, బ్రిటీష్ పాలకులకు వినతిపత్రాలు ఇవ్వడం కోసం ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ చాలా ఇంకా చెప్పాలా? ’’


‘‘ అందరు నాయకులు తమ పిల్లలకు పదవులు ఇచ్చిన వారే కదా? ’’
‘‘ఇవ్వలేదని, అలా ఇవ్వవద్దని ఎవరన్నారు? హీరోయిన్ బొడ్డును అందంగా చూపిస్తారని రాఘవేంద్రరావు సినిమాలకు యమ క్రేజీ ఉండేది. స్మార్ట్ఫోన్ పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచ నగ్న స్వరూపమే అరచేతిలో ఉన్నప్పుడు హీరోయిన్ బొడ్డు చూసేందుకు రాఘవేందర్‌రావు సినిమాలకెళ్మేదెవరు? కాలాన్ని బట్టి మారాలి. సినిమాల స్కిృప్ట్ మారుతోంది అది గమనించకుండా రాజకీయాల్లో ఇంకా పెద్దమనుషులు సినిమా కాలం నాటి స్క్రిప్ట్‌లే వినిపిస్తే ఎలా? మీ అబ్బాయకి మంత్రి పదవి ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాం అని ప్రజాప్రతినిధులతో డ్రామాలెందుకు ? ప్రజలు వీటిని నమ్మేంత అమాయకులు కాదు. ’’
‘‘ప్రజలు వీరి చేతిలో ఇలా మోసపోవలసిందేనా? ’’


‘‘ అలా అని ఏమీ కాదు ఇంకెంత కాలం వీరి చేతిలో మోసపోతారు? మోసం చేసేందుకు మాకూ ఓ చాన్స్ ఇవ్వండి అని చాలా మంది వస్తూనే ఉంటారు. కావాలంటే రాజకీయ చరిత్ర చదువు మోసం కు మార్కెట్ ఉందిఅని  గ్రహించినప్పుడల్లా మార్కెట్ లోకి కొత్త పార్టీ లు వచ్చాయి . వస్తూనే ఉన్నాయి . వస్తుంటాయి  ’’
-బుద్దా మురళి (జనాంతికం 10.4. 2016)

3, ఏప్రిల్ 2016, ఆదివారం

కెసిఆర్-బాబు-జగన్.. మిస్టరీ

‘‘దీని వెనుక ఏదో మతలబు ఉందనిపిస్తోంది. బాబు మంచి మిత్రుడని కెసిఆర్ చెప్పడం మాయగా ఉంది’’
‘‘కోటి ఎకరాలకు సాగునీరిస్తానన్న విషయంపైనా నీ అనుమానం’’
‘‘నీళ్లిస్తే నాకేంటి, ఇవ్వక పోతే ఏంటీ ? హైదరాబాద్‌లో నాకు ప్లాట్లు తప్ప వ్యవసాయ భూమి లేదు. అసలు విషయం ఉద్దేశ పూర్వకంగా దాట వేస్తున్నావు’’


‘‘ ఇలానే తెలివిగా ఆలోచిస్తే అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్‌ల మధ్యనే ఏదో మతలబు ఉంది.
షరీఫ్ మనవరాలి పెళ్లి వేడుకలకు మోదీ ఎందుకు వెళ్లారు. చిన్ననాటి మిత్రులా? దగ్గరి బంధువులా? ఇంకాస్త విస్తృతంగా ఆలోచిస్తే అమెరికాకు పాకిస్తాన్‌కు మధ్య కూడా ఏదో మతలబు ఉంది. అమెరికా నిధులతోనే పాకిస్తాన్ బతుకుతుంది. అమెరికా స్నేహపూర్వకంగా ఇచ్చే ఆయుధాలతోనే పాకిస్తాన్ యుద్ధాలు చేస్తుంది. అమెరికాకు పాక్‌తో స్నేహం, చైనా పాకిస్తాన్ మా స్నేహ దేశం అని ప్రకటించింది. మోదీ పాకిస్తాన్ వెళ్లి వచ్చారు. అంటే అమెరికా, చైనా, ఇండియా, పాకిస్తాల మధ్య బహిరంగ స్నేహం, రహస్య శతృత్వం మిస్టరీ ఉందనిపిస్తోంది. దశాబ్దాల పాటు శత్రువులుగా పోరాడిన క్యూబాకు అమెరికా స్నేహ హస్తం అందించింది. మొత్తం ప్రపంచ దేశాల మధ్యనే ఏదో రహహ్య మతలబు సాగుతున్నట్టు అనిపించడం లేదా? ’’


‘‘ఏదో చెప్పి నన్ను నన్ను కన్‌ఫ్యూజ్ చేయాలని ప్రయత్నిస్తున్నావు. నేను రెండు తెలుగు రాష్ట్రాల నాయకుల స్నేహం గురించి చెబుతుంటే నువ్వు ప్రపంచ దేశాల గురించి మాట్లాడుతున్నావు.
‘‘సరే లోకల్ మిస్టరీ గురించే మాట్లాడుకుందాం. కెసిఆర్‌కు బాబుతోనే కాదు అందరితో రహస్య స్నేహం ఉందనిపిస్తోంది. 2014 ఎన్నికల పోలింగ్ ముగియగానే తెలంగాణలో టిఆర్‌ఎస్, ఆంధ్రలో జగన్ అధికారంలోకి వస్తారని చెప్పారు కదా? ఏ బంధం లేకుంటేనే ఇలా చెబుతారా? పైగా నిప్పులాంటి మనిషి బాబు కూడా కెసిఆర్ జగన్ కుమ్మక్కయ్యారని ఎన్నిసార్లు చెప్పలేదు. ఇక ఢిల్లీలో సోనియాగాంధీ ఇంటికి సకుటుంబ సపరివారంగా వెళ్లారు. అంటే కాంగ్రెస్‌తో బంధం బహిరంగ రసహ్యమే కదా? మరోవైపు మోదీతో స్నేహం నడుపుతున్నారు. ఇక ఎంఐఎం మంచి స్నేహితులే. సిపిఐ నారాయణ నాకు మంచి మిత్రులు అని కెసిఆర్ చాలా సార్లు చెప్పారు. కెసిఆర్ బాబు పాత స్నేహం, కెసిఆర్ జగన్‌లది కొత్త స్నేహం. స్నేహితుడి స్నేహితుడు కూడా స్నేహితుడే అవుతాడు కదా? దీన్ని బట్టి వీళ్లంతా స్నేహితులే అవుతారు’’


‘‘ నువ్వు చెబుతుంటే నిజమే అనిపిస్తోంది. కెసిఆర్‌కు బాబో జగనో ఒక్కరితో స్నేహం ఉండాలి కానీ ఇదేంటి ? ’’
‘‘నీ ఆలోచనలో గందరగోళం ఉంది కానీ జరుగుతున్న పరిణామాల్లో ఎలాంటి గందరగోళం లేదు. ఒక్కో పాత్రకు ఒక్కో బాధ్యత ఉంటుంది. నువ్వు అదే గ్రహించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ నేత నోట విన్నా తెలంగాణకు పెద్ద పీట అనే మాటలు వినిబడేవి. ఎన్టీఆర్ భవన్‌లో ఒక అంతస్థు నిండా పెద్ద పీటలు తయారు చేయించి పెట్టారనే మాట కూడా వినిపించేది. అప్పుడు పాలమూరు జిల్లాను బాబు ఏకంగా దత్తత తీసుకున్నారు. అదే బాబు పాలమూరు ఎత్తిపోతల పథకం ఆంధ్రకు ప్రమాదం అని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గట్టిగా ఫిర్యాదు చేయలేదని శాసన సభలో జగన్ నిలదీశారు. విలేఖరుల సమావేశాల్లో తెలంగాణపై బాబు, జగన్ చూపిన ప్రేమను గుర్తుకు తెచ్చుకున్న వారికి ఈ ఫిర్యాదు నమ్మశక్యం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో పెద్దపీటలు వేయడం రాజకీయంగా అవసరం. ఆంధ్ర సిఎంగా పాలమూరు ప్రాజెక్టును వ్యతిరేకించడం ఇప్పటి అవసరం. తెలంగాణ ఉద్యమ కాలంలో, ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూసిన సందర్భంలోనైనా కెసిఆర్‌కు బాబు శత్రువే. ఇప్పుడు రాష్ట్రంలో వారి పార్టీనే కనుమరుగైనప్పుడు ఇంకెక్కడి శతృత్వం?
యాచకునికి యాచకుడే శత్రువు అన్నారు కానీ రాజుకు రాజు కూడా శత్రువే. ఆనకట్టలు కట్టి తన రాజ్యం సుభిక్షంగా ఉండేట్టు చూసుకోవడం రాజు బాధ్యత కానీ పక్క రాజ్యంలో నాయుడు పార్టీ ఉండాలా? రెడ్డి రాజ్య పాలన సాగాలా?అనే దానిపై ఆసక్తి ఎందుకుంటుది. రాజుతో సంబంధాలు ముఖ్యం కానీ రాజు ప్రత్యర్థితో కాదు.


 పొరుగున రెడ్డి రాజ్యం ఉండాలా? నాయుడు రాజ్యం పతనం కావాలా? అనేది పాలకుడికి ముఖ్యం కాదు. ఏ రాజ్య పాలకునికి ఆ రాజ్య ప్రయోజనాలు ముఖ్యం.
‘‘ నువ్వు ఎన్ని చెప్పినా కెసిఆర్ చెప్పినట్టు ప్రాజెక్టులు పూర్తవుతాయని నాకైతే అనిపించడం లేదు’’
‘‘ వర్షాలు వస్తే సాగు లేదంటే కన్నీళ్లే జీవితంగా గడిపే తెలంగాణ పల్లెలు రెండు పంటల పండించే రోజులు రాబోతున్నాయి అని వింటేనే మనసు పులకించి పోతుంది? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన యోధుడికైనా, చంద్రుడిపై తొలిసారి పాదం మోపిన వీరుడికైనా తొలుత కొన్ని లక్షల గొంతులు ఇది అయ్యేదా పొయ్యేదా? అని వారి వారి మాతృభాషల్లో ముందు మాటలు పలికిన వారే’’


‘‘ అవుతాయంటావా? ’’
‘‘ ఎవరెస్ట్ శిఖరం అధిరోహిస్తానని తొలుత చెప్పినప్పుడు కొన్ని వందల గొంతులు అయ్యే పని కాదులే అని స్వాగత వచనాలు పలికాయి. వాటిని పట్టించుకోకుండా ఎవరెస్ట్ ఎక్కిన ఎడ్మండ్ హిల్లరీ పేరు మనకు గుర్తుంది కానీ ఆ లక్షల గొంతుల్లో ఒక్క పేరూ గుర్తు లేదు. చందమామపై కాలు మోపేందుకు వెళుతున్న నీల్ ఆర్మ్ స్ట్రాంగ్‌కూ ఇలానే బృంద గీతం వినిపించారు. కెసిఆర్ తెలంగాణ కోసం వెళ్లినప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద గొంతులు ఇలానే అన్నారు. ’’


‘‘ అంటే కోటి ఎకరాలకు సాగునీరు వస్తుందని అంత నమ్మకమా? ’’
‘‘ గోదావరి, కృష్ణా నదులతో పొలాలు తడిస్తే మంచిదే,కాక పోతే కొన్ని వందల ఏళ్ల నుంచి అణిచివేత, పేదరికం,కరువుతో సహజీవనం చేసిన వాడికి కొత్తగా పోయేదేముంది. యత్భావం తత్భవతి.. రెండు రాష్ట్రాల రైతులకు మంచే జరుగుతుందనుకుందాం పోయేదేముంది’’

బుద్ధా మురళి (జనాంతికం 3. 4. 2016)