30, జనవరి 2013, బుధవారం

సురభి నాటక సమాజం .. కాంగ్రెస్ పార్టీ .. 1885!


ఈ దేశంలో 1885లో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ యేడు రెండు వేరువేరు సంస్థలు ఆవిర్భవించాయి. సంస్థలు వేరు, లక్ష్యాలు వేరు, పని  వేరు, రంగాలు వేరు కానీ ఇద్దరి పనితీరు ఒకేలా ఉంటుంది.


***
రావణుడు టీ తాగుతుంటే శ్రీరాముడు ఆయన మీసాన్ని సవరిస్తున్నాడు. హనుమంతుడి భార్య ఇంకెంత సేపు త్వరగా తెములు అంటూ రావణుడి నెత్తిన ఒక్కటిచ్చింది. అమ్మా శ్రీకృష్ణుడు నా బిస్కట్ లాగేసుకున్నాడని ప్రహ్లాదుడు ఏడవ సాగాడు... సురభి నాటక సమాజంలోని తెర వెనక ఇలాంటి దృశ్యాలు కామనే. శ్రీరాముడు, రావణుడు, మండోదరి, సీత, ద్రౌప ది, దుర్యోధనుడు అంతా ఉమ్మడి కుటుంబ సభ్యులే. కీచకుడు, ద్రౌపది ఒకే కంచంలో తింటుంటారు. ఇలాంటి దృశ్యాలను తెర వెనుక చూసి ఏ మాత్రం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే సురభి నాటక సమాజంలోని ఉమ్మడి కుటుంబ సభ్యుల నాటకంలోని సంబంధాలు వేరు. తెర వెనక వాస్తవ సంబంధాలు వేరు.
నాటకమే వారి జీవితంగా సాగుతుంది. దీంతో ఇది నటన, ఇది వాస్తవం అంటూ వాళ్లు ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవలసిన పరిస్థితి. 

సురభి నాటక సమాజం 1885లో కడప జిల్లాలోని సురభి గ్రామంలో పుట్టింది. అదే 1885లో కాంగ్రెస్ పార్టీ పుట్టింది. అచ్చం సురభి నాటక సమాజంలానే కాంగ్రెస్ పరిస్థితి ఉంది. ఒకే కుటుంబ సభ్యులతో నడిచే 128 ఏళ్ల పురాతనమైన నాటక సమాజం ప్రపంచంలో మరోటి లేదు. అలానే 128 ఏళ్ల నుంచి ఒకే కుటుంబం నడిపిస్తున్న రాజకీయ పార్టీ మరోటి లేదు. సురభి నాటక సమాజం, కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలో ఈరెండూ ప్రత్యేకమైనవే.
సురభి నాటక సమాజం ప్రదర్శించే నాటకాలు, యుద్ధ సన్నివేశాలు కళ్లు మిరిమిట్లు గొలిపేట్టుగా ఉంటాయి. యుద్ధ సన్నివేశాలకు సురభి నాటకం పెట్టింది పేరు. ఉమ్మడి కుటుంబ సభ్యులే అయినా వేషం వేసి వేదికపైకి వచ్చారంటే బాణాలతో శత్రువును చీల్చి చెండాడుతారు. కాంగ్రెస్‌లో సైతం అంతే ఒకే పార్టీ సభ్యు లు వాగ్భాణాలతో ఒకరినొకరు చీల్చి చెండాడుకుంటారు. 


తర్వాత ఇద్దరూ అమ్మదగ్గరకు వెళ్లి రాముడు మంచి బాలుడిలా నిలబడతారు. పాండవుల కొలువులోకి రాయబారం కోసం వచ్చిన శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని చూసి సభలోని వారు మూర్చపోయినట్టుగా అప్పటి వరకు బాణాలు దూసుకున్న వీళ్ళు అమ్మను చూడగానే ప్రసన్నంతో తమను తాము మరిచిపోయి తన్మయత్వంతో బయటకు వస్తారు.


సురభి నాటక సమాజం పుట్టిన తరువాత కొన్ని దశాబ్దాల పాటు ఎదురు లేకుండా విస్తరించింది. 50 నాటక సమాజాలుగా విస్తరించింది. సినిమాలు , టీవీలు వచ్చిన తరువాత ఒక్కసారిగా క్షీణించడం మొదలై 50 కాస్తా 16 నాటక సమాజాలు అయ్యాయి. కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే స్వాతంత్య్రం వచ్చాక కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో అదే పార్టీ అధికారంలో ఉండేది. ప్రాంతీయ పార్టీలు పుట్టాక సురభి నాటక సమాజం మాదిరిగానే కాంగ్రెస్ వైభవం క్షీణిస్తూ వచ్చింది. సురభి నాటక సమాజం ఎన్నో అద్భుతమైన నాటకాలను ప్రదర్శించి వైభవంగా చరిత్రలో నిలిచిపోయింది. అలానే కాంగ్రెస్ సైతం దేశంలో ఎన్నో రాజకీయ నాటకాలు ఆడించింది.

కొందరు వారం లో ఒక రోజు మాట్లాడకుండా మౌన దీక్ష చేస్తారు. అది చాలా కష్టం అలాంటిది ఎనిమిదేళ్ల నుంచి వౌన దీక్ష చేయించడం సాధ్యమా? మాకు సాధ్యమే అని కాంగ్రెస్ నిరూపించింది. ప్రధానమంత్రి ఎనిమిదేళ్ల నుంచి వౌనంగానే ఉంటున్నారు. అంతే కాదు మాట్లాడాల్సిన వాళ్లు తప్ప కాంగ్రెస్‌లో అందరూ మాట్లాడుతుంటారు. ఇలాంటి చిత్రవిచిత్రమైన ఎన్నో నాటకాలకు ఊపిరి పోసిన కాంగ్రెస్ ఇప్పుడు మరో నాటకం ఆడిస్తోంది. 

ఇది సజీవ నాటకం. ఢిల్లీలో, రాష్ట్రంలో వేదికలుగా ఈ నాటకం సాగుతోంది.
కాంగ్రెస్ ఆడిస్తున్న తెలంగాణ నాటకం. ఈ కొత్త నాటకం ముగింపు ఎప్పుడో నాటకం ఆడేవారికే తెలియదు అని కొందరంటే కాదు ఆడిస్తున్న వారికి కూడా తెలియదు అందుకే అలా కొనసాగిస్తూనే ఉన్నారని కొందరంటారు. ఎంత గొప్ప హిచ్‌కాక్ అయినా రెండు గంటలకు మించి సస్పెన్స్ సినిమాను తీయలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం ఏళ్ల తరబడి సస్పెన్స్ కొనసాగిస్తూ నాటకాన్ని రక్తి కట్టిస్తోంది. 
మరు క్షణంలో తెలంగాణ ఇచ్చేస్తారు అనిపించే డైలాగులు బిగ్గరగా వినిపిస్తాయి. ప్రేక్షకులు దానికి సిద్ధం అయి బిగపట్టుకుని కుర్చీలో అటెన్షన్‌గా కూర్చుంటే .... తూచ్ ఇప్పటి వరకు మీరు విన్న డైలాగులు కేవలం రిహార్సల్స్ మాత్రమే! నాటకంలో భాగం కాదు..! అని మరో నటుడు వచ్చి చెబుతాడు.


 ఇంత మోసమా అని పళ్లు కొరుకుతుంటే అవి రిహార్సల్స్ అని చెప్పడానికి వాడెవడు? నాటకంలో భాగమే అని మరో నటుడు వచ్చి చెబుతాడు. సుదీర్ఘ కాలం నాటకాన్ని చూసిన ప్రేక్షకులు పట్టుపట్టి ఇప్పటికైనా ముగింపు చెప్పండి అని నాయకులను నిలదీస్తే, వాళ్లువెళ్లి హస్తినాపురం హై కమాండ్ నాయకులను నిలదీశారు.

వాళ్లు సుదీర్ఘంగా ఆలోచించి. ‘‘నాటకం చాలా రోజుల నుంచి సాగుతోంది. ఎవరి పాత్ర ఏమిటో? ఎవరేం మాట్లాడారో గుర్తు లేదు అందుకే మూడు ప్రాంతాల వారిని మళ్లీ పిలిచి మళ్లీ నాటకం ఆడించి, నాటకాన్ని అర్ధం చేసుకుని అప్పుడు నిర్ణయం చెబుతామని అన్నారు. అందరి అభిప్రాయాలూ తెలుసుకున్నాం .. ఇప్పుడు తెలంగాణా పై  మేం ఏమిటో ? మేం తెలుసు కోవాలని అనుకుంటున్నాం అంటున్నారు.   రమణ మహర్షులు చెప్పినా అంతకు ముందు మహామహా మునులు చెప్పినా అందరు చెప్పింది ఒకటే ప్రపంచాన్ని తెలుసుకోవడం, ఇతరులను తెలుసుకోవడం సులభమే కానీ నిన్ను నువ్వు తెలుసుకోవడనేదిచాలా కష్టం. అనేది వేదాంత సారం. ఇప్పుడు కాంగ్రెస్ తనను తాను తెలుసుకునే పనిలో పడింది. కాంగ్రెస్ తనను తాను తెలుసుకుంటుందా? ప్రేక్షకులు అంత వరకు ఓపిక పడతారా? ఏమవుతుంది? మిగిలిన నాటకాన్ని స్టేజీపైనే చూద్దాం.

29, జనవరి 2013, మంగళవారం

ఫేస్ బుక్ వాల్ అంటే నగర కేంద్ర గ్రంథాలయం టాయ్‌లెట్‌ గోడ కాదు!





చిక్కడపల్లి లోని నగర కేంద్ర గ్రంథాలయం టాయ్‌లెట్‌లోని గోడలపై పచ్చి బూతు రాతలు  కనిపించేవి. అక్కడికి వచ్చే వారు చదువుకున్న వారే! వారు వచ్చేది చదువు కోవడానికే..! మరి ఈ రాతల సంగతేమిటి?


 ప్రతి మనిషిలో కనీసం ముగ్గురు మనుషులు ఉంటారంటారు రజనీష్. పైకి కనిపించని మనిషి అప్పుడప్పుడు అలా గోడలపై తన లోపలి రూపాన్ని ప్రదర్శిస్తాడు. టాయ్‌లెట్ గోడలవరకైతే ఈ పైత్యానికి వచ్చిన ప్రమాదం ఉండదు. ఎందుకంటే అవి రాసింది ఎవరో తెలియదు. కానీ ఫేస్‌బుక్ వాల్‌పై ఇలానే పిచ్చి రాతలు రాసిన కొందరు ప్రబుద్ధుల మెడకు ఇప్పుడు పోలీసు కేసు చుట్టుకుంది. ఫేస్‌బుక్, బ్లాగ్స్,  గూగుల్ ప్లస్ వంటి  సామాజిక సైట్స్‌లో ఇద్దరు తెలుగు వారిపై కేసులు నమోదు కావడం  తెలుగు గ్రూపుల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలకు సంబంధించి రాతలపై కేసులు నమోదైన వాటిలో తెలుగుకు సంబంధించి ఇదే మొదటిది కావచ్చు. మహిళలను కించ పరిచే విధంగా ఉన్న రాతలు రాసినందుకు ఇద్దరిపై ఆ చర్చలో పాల్గొన్న మరి కొందరిపై సాక్షులుగా కేసు నమోదైంది. గత నాలుగైదు ఏళ్లుగా కొందరు ఇదే విధంగా మహిళలను కించపరుస్తూ రాతలు రాసినా కొందరు కామెంట్స్ ద్వారా తప్పు అని హెచ్చరించారు. మరి కొందరు మనకెందుకులే ఇలాంటి వారితో వివాదం అని వౌనంగా ఉండిపోయారు. ఈసారి రాతలన్నింటిని రికార్డు చేసి సాక్ష్యంగా చూపించి మహిళా సంఘాలు నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాయి .  సామాజిక మాధ్యమాల దాదాలుగా చెలామణి అయిన వారు ఊహించని ఈ దెబ్బతో కంగుతిని పోయారు. కేసుల్లో ఇరికి తంటాలు పడుతున్న వాళ్ళు  కొందరు .. ఇలాంటి కేసులు కుడా ఉంటాయా ? అని జాగ్రత్త పడుతున్న వాళ్ళు కొందరు.  తప్పయిపోయింది ఆత్మహత్యే శరణ్యం వదిలేయండి అని వేడుకున్న వారు కొందరైతే, మేం చెప్పిన విషయం కరెక్టే, చెప్పిన విధానం బాగాలేదు అని తలబిరుసుగా వ్యవహరించి కేసులో నిండా మునిగిన వారు మరికొందరు.


సామాజిక మాధ్యమాల్లో ఒక అంశంపై అభిప్రాయాలు చెప్పుకోవడమంటే రోడ్డుమీద నిలబడి ఇద్దరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం కాదు. బాధ్యతాయుతంగా ఉండాలని ఈ కేసుతో తెలిసి వచ్చింది. ఇంగ్లీష్‌లో పోలిస్తే, సామాజిక మాధ్యమాల్లో తెలుగు భాషలో సాగే చర్చల హడావుడి తక్కువే. ఉన్న ఈ కొద్ది సంఖ్యలో సైతం అభ్యంతరకరమైన చర్చలకు కొదవేమీ లేదు. పాత పాటలు, తెలుగు సినిమాలు, సాహిత్యం , రాజకీయం గురించి అంతో ఇంతో మంచి చర్చనే జరుగుతూనే ఉంది. అయితే ఇదే సమయంలో తమ అభిప్రాయాలే ఉన్నతమైనవని ఎదుటివారిపై ఆధిపత్యం చెలాయించాలనే ధోరణులు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. తమకు నచ్చని వారిని పూర్వం సమాజం నుంచి వెలివేసినట్టు కొందరిని వెలివేసే పద్ధతి సైతం కనిపిస్తోంది. 

ఇక్కడ మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు ఏమీ కాదు అనే ధోరణితో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు మహిళా సంఘాలు పెట్టిన కేసును స్ఫూర్తిగా తీసుకుని, కించ పరిచే రాతలపై ఇతరులు సైతం కేసులు పెట్టే అవకాశం లేకపోలేదు. తమకు నచ్చని వ్యాఖ్య కనిపిస్తే అడ్డగాడిదలు అని ఒకరు రెచ్చగొడితే, వారిని సంకర జాతి అని వీళ్లు తిడుతున్నారు. గూగుల్ ప్లస్, ఫేస్‌బుక్ లాంటి వాటిలో చురుగ్గా ఉండే తెలుగు వాళ్లు మహా అయితే ఐదారు వందల మంది ఉంటారు. ఈ ఐదారువందల మంది తలుచుకుంటే రాష్ట్రంలో విప్లవం రాదు, వచ్చే విప్లవం ఆగిపోదు. కానీ ఫేస్‌బుక్‌ను ఒక సామ్రాజ్యంగా, తమను తాము సామ్రాజ్యాధిషులుగా భావించి ఇష్టం వచ్చినట్టు రాతలు రాయడం ద్వారా లేని పోని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. మహిళలను కించపరిచిన రాతలకు కేసు పెట్టారు, వారికి ఏ శిక్ష పడుతుంది అనేది తరువాత. అపర కీచకులు అంటూ లక్షలాది మంది చూసే టీవి చానల్స్‌లో వారి ఫోటోలు చూపించారు. అంతకు మించిన శిక్ష ఏముంటుంది. వారి కుటుంబ సభ్యులు, తెలిసిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలి.

27, జనవరి 2013, ఆదివారం

నడమంత్రపు దేవుళ్లు... వై యస్ ఆర్ ..ఎన్టీఆర్ .మాయావతి...అమితాబ్ ..నమిత లకు దేవాలయాలు ... ప్రజాస్వామ్యం లో వెర్రి తలలు వేస్తున్న వ్యక్తి పూజ

మనది రాజరికమా? ప్రజాస్వామ్యమా? అంటే ఈ రెండూ కాదు వ్యక్తిపూజ స్వామ్యం అనిపిస్తోంది. సిద్ధాంతాల కన్నా ఈ దేశంలో వ్యక్తి పూజకే రాజకీయాల్లో పెద్ద పీట వేస్తున్నారు. వ్యక్తిపూజ మన నర నరాల్లో ఇంకిపోయింది. రాజరికంలో రాజు పట్ల ఈ వ్యామోహాన్ని చూపించాం. రాజు ఎంత తప్పు చేసినా ఎదిరించవద్దని, రాజు ఏం చేసినా మన మంచి కోసమే అని మన శాస్త్రాలు ఘోషించాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆరు దశాబ్దాల తరువాత కూడా ప్రజాస్వామ్యంలోనూ ప్రజలకు దూరంగా ఉండే రాజులు గెలుస్తున్నారు. ఆ రాజు కుటుంబంపై ప్రజల కుండే పిచ్చి అభిమానం. వ్యక్తి పూజ రాజులకు పెట్టని కోటలా నిలిచింది. 

రక్షణ కోసం సైన్యాన్ని నియమించుకోవడం కన్నా..రాజు కోసం ప్రాణాలు అర్పించే ప్రజలను తయారు చేసుకోవడం ఎక్కువ ప్రయోజన కరం అని పాలకులు ఎప్పుడో గ్రహించారు. వ్యక్తిపూజకు పెద్ద పీట వేసినప్పుడు తప్పు ఒప్పులను సమీక్షించుకునే విచక్షణా జ్ఞానం కోల్పోతాం. ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ కొత్త రాజులు పాతుకు పోయారు. వ్యక్తిపూజ ఉధృత స్థాయికి వెళ్లింది. చివరకు హీరోయిన్లకు, హీరోలకు, నాయకులకు ఆలయాలు కట్టే స్థాయికి ఈ ఆరాధన చేరుకొంది. 

మానవత్వం ఉన్నవారిని మంచి చేసిన వారిని మనుషులు ఎప్పుడూ మరిచిపోరు. ఇంగ్లాండ్ నుంచి ఒక ఉద్యోగిగా మన దేశానికి వచ్చిన కాటన్‌కు కోస్తాలో ఆర్ఘప్రదానం చేసే వాళ్లు చాలా మందే ఉంటారు. అతను క్రైస్తవుడు. ఆర్ఘప్రదానం చేసేది హిందువులు. మంచి చేసిన వారికి మేం గుండెల్లో గుడికట్టుకొని పూజిస్తాం అని తెలియజేస్తున్నట్టుగా ఉంటుంది ఇలాంటి దృశ్యాలను చూసినప్పుడు. మంచిని గుర్తించినప్పుడు ఆ మంచి మరింతగా వ్యాపించడానికి దోహదం చేస్తుంది. మంచిని గుర్తించడం వేరు. వెర్రి అభిమానం వేరు. అభిమానం కాస్తా వ్యక్తిపూజకు దారితీస్తే...

 మన దేశ రాజకీయ చరిత్రలో మహాత్మాగాంధీ ఒక దేవునిగా పూజలు అందుకున్నారు. ఆధునిక కాలంలో ఆయనతోనే మన దేశంలో రాజకీయాల్లో వ్యక్తి ఆరాధన ప్రారంభం అయిందనవచ్చు. ఆయన ఒక్క మాట చెబితే విద్యార్థులు కళాశాలలు వదిలి స్వాతంత్య్ర సంగ్రామంలో చేరారు.దేశం కోసం ఉద్యమించారు. మొత్తం దేశం స్పందించింది. ఆయన నాయకత్వంలో దేశం ఒక్కత్రాటిపై నిలిచింది. దేశానికి మంచి జరగడానికి మహాత్మాగాంధీకి ఉన్న ఇమేజ్ దోహదం చేసింది. ఆ తరువాత జవహర్‌లాల్‌నెహ్రూకు సైతం దాదాపుగా ఇదే విధంగా ఇమేజ్ లభించింది. 125 ఏళ్ల కాంగ్రెస్‌కు ఇప్పటికీ వ్యక్తిపూజ ఒక వరంగా మారింది. వ్యక్తిపూజకు ఇది పాజిటివ్ కోణం. 

* * * 
వ్యక్తిపూజ ఒక హిట్లర్‌ను తయారు చేసింది.తమ జాతే  అత్యున్నతమైన దని పౌరులని నాజీ బృందం నమ్మించింది. తమను తాము ప్రేమించుకున్న నాజీలు హిట్లర్ చేసిన సిద్ధాంతం బాగా నచ్చింది. ఆయన నాజీల పాలిట దైవంగా కనిపించారు. అంత వరకు బాగానే ఉంది కానీ నాజీల దైవం కాస్తా యూదుల పాలిట రాక్షసునిగా మారాడు. వ్యక్తిపూజకు ప్రపంచంలోనే పరాకాష్టగా నిలిచిన వాడు హిట్లర్. తన ఉపన్యాసాలతో ప్రజలను రెచ్చగొట్టి వారి పాలిట తానో దైవంగా నిలిచి లక్షలాది మంది యూదులను హతమార్చాడు. వ్యక్తిపూజకు సంబంధించి ఇది రెండవ కోణం. రెండవ ప్రపంచ యుద్ధం నాటి భయంకరమైన అనుభవాల నుంచి ప్రపంచం ఇప్పటికీ బయటఫడలేకపోతోంది. కానీ జర్మనీలో ఇప్పటికీ నాజీ అభిమానులకు కొదవ లేదు. వ్యక్తిపూజకు ఉండే శక్తివంతమైన లక్షణం అది. హిట్లర్ చేసిన ప్రచారం ఇప్పటికీ జర్మనీ యువత మెదళ్లను తొలుస్తూనే ఉంది. హిట్లర్ చేసింది తప్పు కాదు. తమదే అత్యున్నతమైన జాతి అని విశ్వసించే హిట్లర్ అభిమానులు జర్మనీలో ఇంకా చాలా మందే ఉన్నారు. వ్యక్తి పూజకు సంబంధించి 20 వ శతాబ్దంలో గొప్ప ఉదాహరణ హిట్లర్. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక సాధారణ సైనికునిగా ఉన్న ఆతను తన వాగ్దాటితో కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించి జాత్యహంకారాన్ని రగిల్చి రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడయ్యాడు.

 లాడెన్ చెబితే చాలు వేలాది మంది ముస్లిం యువకులు తీవ్రవాదులుగా మారారు. విమానాన్ని మానవ బాంబుగా మార్చి టవర్స్‌ను కూల్చారు. వ్యక్తిపూజ వెర్రితలలు వేసినప్పుడు విచక్షణా జ్ఞానం కోల్పోతారు. వ్యక్తిపూజ మంచి ప్రయోజనాల కోసం ఉపయోగపడితే మంచిదే కానీ వెర్రితలలు వేస్తే సమాజాన్ని ప్రమాదంలో ముంచేస్తుంది. హిట్లర్, స్టాలిన్ వంటి వారు వ్యక్తిపూజకు ప్రపంచంలో ఉదాహరణగా నిలిచారు. వ్యక్తిపూజను కోరుకునే వారు ప్రధానంగా ప్రచారంపై ఆధారపడతారు. తమను తాము అత్యున్నతమైన నాయకులుగా, ప్రపంచాన్ని ఉద్దరించడానికి అవతరించిన అవతార పురుషులుగా ప్రచారం చేసుకుంటారు. హిట్లర్ ప్రారంభ కాలంలో తాను ఉపన్యాసం చేసేప్పుడు చప్పట్లు కొట్టడానికి కొంత మందిని తానే ఏర్పాటు చేసుకునే వారట! బ్రిటన్‌లో లార్డ్ బాడెన్ తానెంత గొప్ప వ్యక్తో తానే ప్రచారం చేసుకునే వారట! తన ఇమేజ్ పెంచుకోవడానికి స్వయంగా ఆయనో న్యూస్ పేపర్‌ను, మ్యాగజైన్‌ను ప్రారంభించారు. మారు పేర్లతో తన గొప్పతనం గురించి తానే వ్యాసాలు రాసుకునే వారట! వ్యక్తిపూజను అందుకున్న వారందరిలో కనిపించే కామన్ లక్షణం. మీడియా ప్రచారం. 

మరే దేశంలోనూ కనిపించని విధంగా సినిమా నటుల విషయంలో మన దేశంలో వ్యక్తిపూజ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఉత్తరాదిలో ఎక్కువగా కుల రాజకీయాలు వ్యక్తిపూజలో ప్రాధాన్యత వహిస్తే దక్షిణాదిలో సినిమాలు ఎక్కువ ప్రాధాన్యత వహిస్తున్నాయి. తమిళనాడులో హీరోయిన్లకు, హీరోలకు, రాజకీయ నాయకులకు ఆలయాలు నిర్మించడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి మన రాష్ట్రాన్ని ఆవహించింది. ఏకంగా ఆలయాలను నిర్మించి పూజించే స్థాయికి వ్యక్తి పూజ చేరుకుంది. ఎన్టీఆర్.. వైఎస్‌ఆర్ ఆలయాలు తమిళనాడు అంత స్థాయిలో కాకపోయినా మనుషులకు ఆలయాలు నిర్మించే సంస్కృతి ఇప్పుడిప్పుడే మన రాష్ట్రంలోనూ ప్రవేశించింది.


  ఈ కాలానికి సంబంధించి  రాష్ట్ర రాజకీయాల్లో పాపులర్ నాయకులు ఇద్దరే ఇద్దరు. ఒకరు ఎన్టీఆర్ కాగా, మరొకరు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. మూడు దశాబ్దాలకు పైగా శ్రీరామునిగా, శ్రీకృష్ణ్ణునిగా అటు దైవంగా ఇటు సాంఘిక, జానపద సినిమాల్లో హీరోగా ఎన్టీఆర్ తెలుగు వారి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆ అభిమానం ఆయన్ని ఏకంగా ముఖ్యమంత్రిని చేసింది. రాజకీయ నాయకుడిగా కన్నా నటునిగానే ఆయన అభిమానులకు చేరువయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రిగా తాను అమలు చేసిన పలు పథకాల ద్వారా వైఎస్‌ఆర్ ప్రజలకు చేరువ అయ్యారు. వైఎస్‌ఆర్ మరణం తరువాత వ్యక్తి పూజ మొదలు కాగా, ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఆయన నటునిగా, రాజకీయ నాయకునిగా ఉన్నప్పటి నుంచే పూజలందుకున్నారు. ఆత్మగౌరవం నినాదంతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌కు ప్రజాప్రతినిధులు బహిరంగంగానే కాళ్లు మొక్కేవారు. అలా కాళ్లు మొక్కిన వారే ఆయన్ని అధికారం నుంచి దించేశారు.

ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం తరువాత ఎన్నో చారిత్రక సమావేశాలకు వేదికగా నిలిచిన ఆబిడ్స్‌లోని ఆయన నివాసాన్ని వారసులు అమ్మివేశారు. చివరి రోజుల్లో ఆయన నివసించిన బంజారాహిల్స్‌లోని భవనాన్ని రియల్ ఎస్టేట్ డవలపర్‌కు అమ్మేశారు. ఆయన నివసించిన ఇళ్ల ప్రాధాన్యతను వారసులు గుర్తించలేదు కానీ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సహాయానికి ఒక సామాన్య కూలీ మాత్రం స్పందించారు.
 ఒక  కూలీ  ఎన్టీఆర్‌కు ఆలయాన్ని నిర్మించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజక వర్గంలోని తొట్టెంబేడు మండలం కంచెనపల్లి గ్రామంలో శ్రీనివాసులు అనే సాధారణ కూలీ ఎన్టీఆర్‌కు ఆలయాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ ఫోటోలకు పూజలు చేసేవాడు. ఒక దాత ఎన్టీఆర్ విగ్రహాన్ని బహూకరించడంతో విగ్రహం ఏర్పాటు చేశారు. 1985లో తమ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ఆ ప్రాంతానికి వచ్చి సహాయం చేశారని, దానికి కృతజ్ఞతగా తాను ఆలయాన్ని నిర్మించినట్టు శ్రీనివాసులు తెలిపారు. ఈ అభిమాని నిర్మించిన ఆలయం గురించి ఒక చానల్‌లో చూసిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు గ్రామంలో ఎన్టీఆర్, బసవ తారకంలకు ఆలయాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించారు.

 వైఎస్‌ఆర్‌కు వ్యతిరేకంగా ప్రత్యర్థులు ఎంతగా ప్రచారం చేసినా ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఏకంగా ఒక కొత్త పార్టీ పురుడు పోసుకునేంత బలంగా ప్రజల్లో నాటుకున్నాయి. ఆ పథకాల వల్ల చివరకు ఆభిమానులు ఆయనకు ఆలయాలను నిర్మిస్తున్నారు. వైఎస్‌ఆర్ క్రైస్తవుడు. హిందుపూజా విధానాలతో ఆయనకు ఆలయాన్ని నిర్మించారు. విశాఖ జిల్లా రాజగోపాలపురం గ్రామంలో రాజశేఖరరెడ్డి ఆలయం పేరుతో దేవాలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం కోసం గ్రామస్తుల నుంచి నాలుగు లక్షల రూపాయలు సేకరించామని, ఇతర హిందూ ఆలయాల్లో వలెనే ఇక్కడ పూజలు నిర్వహించనున్నట్టు స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత గోవిందరెడ్డి చెప్పారు. ఈ ఆలయంలో విగ్రహాన్ని జగన్మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. మరోవైపు మదనపల్లి నియోజక వర్గంలో వైఎస్‌ఆర్‌కు ఆలయం నిర్మించనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే ప్రకటించారు. వైఎస్‌ఆర్ క్యాథలిక్ క్రిస్టియన్, ఆలయాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించింది ముస్లిం ఎమ్మెల్యే. హిందూ పూజా విధానంతోనే ఆలయాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపిల మధ్య అన్ని రంగాల్లోనూ వార్ సాగుతోంది. వైఎస్‌ఆర్ విగ్రహాల ఏర్పాటును వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు ఒక ఉద్యమంగా చేపడితే, టిడిపి నాయకులు కాస్త ఆలస్యంగా ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 

ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట, పూజల నిర్వహణ ఎలా ఉండాలో ఆగమ శాస్త్రం చెబుతోంది. రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, హీరోయిన్లకు ఆలయాల నిర్మాణం ఆగమ శాస్త్రానికి ఎలాంటి సంబంధం ఉండదు. వ్యక్తులకు నిర్మించే ఆలయాల్లో అభిమానుల ఆత్యుత్సాహం, వ్యక్తిపూజకు పరాకాష్టగా నిలవడమే తప్ప నిజంగా అక్కడ ఇతర ఆలయాల్లో మాదిరిగా ఉండదు. ఆలయం అంటే కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు. భక్తులు వస్తేనే అది ఆలయం అవుతుంది. కానీ ఇలా వ్యక్తుల ఆలయాల్లో అభిమానులు తప్ప భక్తులు కనిపించరు. ఆ నాయకుని, నటుని జయంతి, వర్థంతి, పుట్టిన రోజుల్లో అభిమానులు వచ్చే హడావుడి చేయడం తప్ప భక్తులెవరూ ఉండరు. ఎక్కువగా ఈ ఆలయాన్ని నిర్మించిన వారే భక్తులుగా వెళుతుంటారు.

 నాయకులకు ఆలయాలు 

రాజకీయ నాయకులకు ఆలయాలు నిర్మించడం ఇప్పుడో ఫ్యాషన్‌గా మారింది. ఒరిస్సాలోని బత్రా గ్రామంలో హరిజనులు మహాత్మాగాంధీకి ఆలయాన్ని నిర్మించారు. సమాజంలోని అన్ని కులాలు ఒకటే అని చాటి చెప్పిన మహాత్ముడు తమ దృష్టిలో దేవుడే అని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోని హరిజనులే నిధులు సమకూర్చుకుని ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎలాంటి కుటుంబ రాజకీయ నేపథ్యం లేకపోయినా కాన్షీరామ్ శిష్యురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి ప్రభావాన్ని ఈ రోజు దేశంలో తక్కువగా అంచనా వేయలేరు. దళిత చైతన్యానికి ఆమె ప్రతీకగా నిలిచారు. ప్రధానంగా దళిత సమాజం నుంచి ఆమె పూజలు అందుకునే స్థాయికి వెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లోని మహబా జిల్లాలో నాత్‌పూర్‌లో మాయావతి ఆలయాన్ని నిర్మించారు. నాస్తిక దేవాలయం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నాస్తికులు. హిందూ వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అలాంటి కరుణానిధికి తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని డిఎంకె నాయకుడు జిఆర్ కృష్ణమూర్తి కళైగనర్ తిరుకోవళి పేరుతో కరుణానిధికి సమిరెడ్డిపల్లి గ్రామంలో ఆలయం నిర్మించారు. మన రాష్ట్రంలో వైఎస్‌ఆర్, ఎన్టీఆర్ విగ్రహాలు పోటీపడుతున్నాయి. ఇద్దరికీ ఆలయాలు నిర్మించారు. ఎన్టీఆర్ సినిమా గ్లామర్‌పై ఆధారపడ్డ ఆయన కుటుంబ వారసులు , రాజకీయ గ్లామర్‌పై ఆధారపడి తిరిగి విజయం సాధించాలనుకుంటున్న రాజకీయ వారసులు ఎన్టీఆర్ విగ్రహాలు, ఆలయాల నిర్మాణానికి నడుం బిగించారు. వైఎస్‌ఆర్ రాజకీయ గ్లామర్‌ను నమ్ముకున్న ఆయన కుమారుడు విగ్రహాల సమరాన్ని ప్రారంభించారు. ఆయన పార్టీని నమ్ముకున్న వాళ్లు ఏకంగా వైఎస్‌ఆర్‌కు వంద ఆలయాలు నిర్మించనున్నట్టు ప్రకటించారు. ఈ కొత్త దేవుళ్ల పోటీలో అసలు దేవుళ్లను ఆ దేవుడే రక్షించాలి. 

శృంగార తారలకు ఆలయాలు

 సినిమా నటీనటులకు అభిమాన సంఘాలు ఉండడం ఎంత సహజమో, ఇప్పుడు తమిళనాడులో వారికి ఆలయాలు ఉండడం అంత సహజం అయింది. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తి మనిషికి దేవునిలా కనిపిస్తాడు. దేవుడు ఉన్నాడో? లేడో? ఉంటే ఎక్కడున్నాడో? ఎలా ఉన్నాడో? మనిషికి తెలియదు కానీ మంచి తనంలో దేవుడ్ని చూసుకుంటాడు. తోటి మనిషికి సహాయపడిన వానిలో దేవుడ్ని చూసుకుంటాడు. ఆపదలో దైవం తనకు అండగా ఉంటుందని మనిషి నమ్మకం. అందుకే ఆదుకున్న వారిని దేవునిలా వచ్చి ఆదుకున్నావని అంటాడు. అంత వరకు బాగానే ఉంది కానీ తనకు నచ్చిన నటులకు, నాయకులకు ఆలయాలు కట్టి పూజించడమే ప్రపంచానికి వింతగా ఉంటుంది. ఇలా ఆలయాలు నిర్మించే వారి సంఖ్య స్వల్పంగానే ఉండొచ్చు, ఆలయ నిర్మాణమే తప్ప నిజంగా ఒక ఆలయంలో పూజలు జరిగినట్టుగా ఇక్కడ జరపవచ్చు, జరపకపోవచ్చు. కానీ ప్రపంచానికి మాత్రం ఇది వింతగానే ఉంటుంది. సినిమా తారలకు ఆలయాలు నిర్మించడమనే వేలం వెర్రి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తుంది. ఖుష్బు ఒక అందమైన హీరోయిన్. నటించింది కొన్ని సినిమాల్లోనే. కానీ ఆమెకు తమిళ సినీభక్తులు ఆలయాన్ని నిర్మించి సంచలం సృష్టించారు. రెండు మూడు దశాబ్దాల పాటు సినీరంగంలో పాతుకుపోయి అద్భుతంగా నటించిన నటీమణి ఏమీ కాదామే కానీ రెండు మూడు సినిమాలతోనే ఆలయం నిర్మించేశారు.

 ఆమెకు ఎంత స్పీడుగా ఆలయం నిర్మించారో అంతే స్పీడ్‌గా కూల్చేశారు. పెళ్లికి ముందు సెక్స్ తప్పు కాదు అంటూ ఆమె చేసిన కామెంట్ తమిళనాడులో దుమారం రేపింది. అంతకు ముందు ఆమెకు ఆలయం నిర్మించడం ఎంత సంచలనం అయిందో, ఆమె ప్రకటన అంతే సంచలనం సృష్టించింది. ఖుష్బుకు తిరుచిరాపల్లిలో ఆలయం నిర్మించారు. పెళ్లికి ముందు శృంగారం తప్పు లేదు అంటూ ఆమె చేసిన ప్రకటనలతో దుమారం చెలరేగి ఆలయాన్ని కూల్చేశారు. ఆమెపై కేసులు పెట్టారు. వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఖుష్బ కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగుసినిమా రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో వెంకటేష్‌కు జంటగా నటించింది. ఆ తరువాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా అంతగా పేరు రాలేదు. తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగారు. శృంగార తారగా తమిళుల అభిమానం సంపాదించారు. ముంబైకి చెందిన ఖుష్బు ముస్లిం. ఆమె సినిమా రంగానికే చెందిన సుందర్‌ను పెళ్లి చేసుకున్నారు. గత రెండు దశాబ్దాల నుంచి తమిళనాడులోనే ఉంటున్న ఆమె ప్రస్తుతం డిఎంకెలో ఉన్నారు. బాలనటిగా 1980లో తొలిసారి బర్నింగ్ ట్రైయిన్ సినిమాలో నటించారు. ఖుష్బుకన్నా ముందే కొందరు తమిళతారలకు ఆలయాలు నిర్మించినా ఎక్కువ ప్రచారం మాత్రం ఖుష్బు ఆలయానికి లభించింది. 

నమితకూ ఆలయం 

నమ్మశక్యం కాకపోవచ్చు కానీ ఇది నిజం. సింహా సినిమాలో బాలకృష్ణతో శృంగారం ఒలకబోసిన నమితకూ తమిళనాడులో ఆలయం నిర్మించారు. తమిళనాడులోని తిరునెల్‌వెళ్లిలో అభిమానులు నమితకు ఆలయం నిర్మించారు. నాకు ఆలయం నిర్మించడం ఏమిటని ఆశ్చర్యపోయాను అని నమిత ఒక సందర్భంలో తెలిపారు. నమిత స్వస్థలం సూరత్. తిరిగి తాను స్వస్థలానికి వచ్చేస్తానని కుటుంబ సభ్యులతో ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. చూడండి ఏదో ఒక రోజు నాకు గుడి కడతారు అని మా ఇంట్లో వాళ్లతో నవ్వుతూ చెప్పేదాన్ని కాని ఇప్పుడు నిజంగానే గుడి కట్టడంతో వింతగా అనిపిస్తోంది అని నమిత ఆశ్చర్యపోయారు.

 పూజకు పూజ

పూజా ఉమా శంకర్ అని ఒక తమిళనటి. పేరు పెద్దగా వినలేదు కదూ. కావచ్చు కానీ ఈమెకూ ఒక ఆలయం ఉంది. మన దేశంలో కాదు. శ్రీలంకలో... ఈ తమిళనటి, సింహాళ, మళయాళ సినిమాల్లో సైతం నటించారు. శ్రీలంకలోని కొలంబోలో ఈమెకు అభిమానులు చాలా ఎక్కువ. ఈమెను వాళ్లు అమితంగా ఆరాధించేస్తుంటారు. దాంతో ఈ పూజకు శ్రీలంకలో ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. పూజ నటించిన అంజలిక, ఆసియ మంగ్ పియబన్న సినిమాలతో ఆమె శ్రీలంకలో లక్షలాది మంది హృదయాలను దోచుకున్నారు. అయితే ఆమె ఎక్కువ రోజులు పూజలు అందుకునే భాగ్యం లేకుండాపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఆలయాన్ని పేల్చేశారు. మళ్లీ ఆలయం నిర్మించడానికి అభిమానులు సిద్ధపడగా, ఆమె వద్దని వారించారు. తొలుత ఆమె కన్నడ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు.తరువాత తమిళ, సింహాళ సినిమాల ద్వారా పక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకుంది. పూజ తల్లి శ్రీలంకకు చెందిన వారు కాగా, తండ్రి కర్నాటకకు చెందిన వారు. మరో తమిళ, తెలుగు నటి హన్సికకు తమిళనాడులోని మధురైలో ఆలయం నిర్మించడానికి అభిమానులు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ఆమె నటించిన తమిళ సినిమాలు రెండు మాత్రమే విడుదల అయ్యాయి. మూడవది విడుదల కానుంది. అప్పుడే ఆలయానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 హీరోలకూ ఉన్నాయి ఆలయాలు

ఆలయాలన్నీ హీరోయిన్లకేనా? మరి హీరోల సంగతి ఏమిటి? అని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో తమిళభక్తులు సినీ భక్త జనానికి మంచి దారి చూపించారు. హీరోలకు ఆలయాలు నిర్మించడంలోనూ వారే ముందున్నారు. కర్నాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న కోటిలింగేశ్వర శివాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడే రజనీకాంత్ అభిమానులు రజనీకాంత్‌కు ఆలయంగా సహస్ర లింగం ఏర్పాటు చేశారు. కోటిలింగేశ్వర ఆలయ పూజారులతోనే వేద మంత్రాలతో సహస్ర లింగాన్ని రజని అభిమానులు ఏర్పాటు చేయించారు. కోటి లింగేశ్వర ఆలయ నిర్వాహకులు ఈ సహస్ర లింగం ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తారు. సాధారణంగా రజనీకాంత్‌కు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఆయన సరే అంటే తమిళనాడులో వీధికో ఆలయాలు వెలసి ఉండేవి కానీ ఆయన ఇలాంటి వాటిని ప్రోత్సహించరు. దాంతో తమిళనాడుకు బదులు కర్నాటకలో ఆయన ఆలయం వెలిసింది. 

.... ఎంజిఆర్, అమితాబ్‌లకు గుళ్లు 

  తమిళభక్తులు సినీ భక్త జనానికి మంచి దారి చూపించారు. హీరోలకు ఆలయాలు నిర్మించడంలోనూ వారే ముందున్నారు. దేశంలో సినిమా వాళ్లకు ప్రజల్లో ఇంతటి ఇమేజ్ ఉంటుందని దేశ ప్రజలకు చాటి చెప్పిన తొలి నటుడు ఎంజిఆర్. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి నటుడు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి, టిడిపి ఏర్పాటుకు ఎంజిఆర్ విజయం ప్రేరణగా నిలిచింది. పురిచ్చి తలైవర్ - మక్కల్ తిలగం ఎంజిఆర్. అభిమానులతో నిజంగానే పూజలు అందుకున్న నటుడు ఆయన. తమిళనాడు రాజధాని చెన్నైకి 40 కిలో మీటర్ల దూరంలో గల తిరువనంతపురం నాతవేడులో ఎంజిఆర్‌కు ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ నిర్వహించే ప్రత్యేక కుంభాభిషేకానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంజిఆర్ అభిమానులైన తమిళులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. రాజకీయ నాయకులు, సినిమా తారలకు ఇటీవల కాలంలో ఆలయాలు నిర్మిస్తున్నారు. అయితే వీరందరి కన్నా ముందు ఆలయం నిర్మించింది. ఎంజిఆర్‌కు 

ఎంజిఆర్ ఇజం ఒక మతం అయితే ఎంజిఆర్ ఒక దేవుడు అంటారు ఆయన తొలి భక్తురాలు కాంత శ్రీనివాసన్ . మద్రాస్ హైకోర్టు ఆవరణలో ఆమె 1984లోనే ఎంజిఆర్‌కు ఆలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ ఆమె కోర్టు ఆవరణలో పూలు అమ్ముతుంది. తన జీవితంలో మూడు సార్లు ఎంజిఆర్‌ను చూశానని ఆమె గర్వంగా చెబుతుంటుంది. ఒకసారి ఆమె ఎంజిఆర్‌కు కూల్‌డ్రింక్ ఇస్తే, ఆయన సగం తాగి, మిగిలిన సగం ఆమెకు ఇచ్చారు. ఎంజిఆర్ సమక్షంలోనే మిగిలిన సగం తాను తాగితే ఎంజిఆర్ నవ్వాడని, ఆ అభిమానానికి తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని, నన్ను నేను సంభాళించుకోలేక పోయానని ఆమె చెబుతోంది. 84లో ఎంజిర్‌ను అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయన కోలుకోవాలని అందరిలానే ఆమె ప్రార్థించింది. ఆ సమయంలోనే ఆమె ఎంజిఆర్ ఫోటో పెట్టి ప్రార్థించింది. ఆమెతో పాటు చాలా మంది ఎంజిఆర్ భక్తులు అక్కడే మొక్కేవారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఆయన మూడవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆలయం నిర్మించారు. ఎంజిఆర్ భక్తుడు ఎంజిఆర్‌కు ఏడు అడుగుల పొడవైన విగ్రహంతో మరో ఆలయాన్ని 1990లో నిర్మించారు. 

హిందూ ఆలయం తరహాలోనే దీన్ని నిర్మించారు. మధ్యలో ఎంజిఆర్ విగ్రహం రెండు వైపుల ఎడిఎంకె జెండాను పట్టుకుని నిలిచిన అమ్మాయిలతో ఈ ఆలయం ఉంది. ( ఇండియా టుడే తమిళ ఎడిషన్ 6.4.1990లో ఈ ఆలయం గురించి రాశారు) ఎంజిఆర్ భక్తులు ఎల్. కలైవనన్, ఆయన భార్య శాంతి తమిళనాడులోని తిరునింద్రవుర్ వద్ద భూమిని కొనుగోలు చేశారు. ఆలయ నిర్మాణం కోసం ముందుగా కాంపౌండ్ వాల్ నిర్మించి ఆరుమిగు ఎంజిఆర్ ఆలయం అని పేరు పెట్టారు. 28.10.2010లో ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. తాజాగా 2011లో మరో ఆలయం నిర్మించారు. ఇప్పటి వరకు ఎంజిఆర్‌కు నాలుగు ఆలయాలను నిర్మించినట్టు సమాచారం. ....
... బిగ్‌బి ఆలయం 

అమితాబ్‌ను సినిమా అభిమానులు కనిపించే దైవంగానే భావిస్తారు. ఏడుపదుల వయసులో ఆయన ఉత్సాహాన్ని చూసి అభినందించాల్సిందే.. కానీ ఏకంగా దైవంగా పూజించడం వింతగానే ఉంటుంది. ఇంత వయసులోనూ ఆయన్ని జనం ఎంతగా అభిమానిస్తారో కౌన్‌బనేగా కరోడ్‌పతిలో చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా కలకత్తాకు చెందిన ఆయన అభిమానులు ఆయన్ని ఏకంగా దైవంగానే చూస్తారు. అమితాబ్ సినిమాల్లోకి రాకముందు తొలి ఉద్యోగం కలకత్తాలోనే చేశారు. బెంగాల్‌కు చెందిన జయను అమితాబ్ పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన్ని బెంగాల్ అల్లుడిగా భావిస్తామని, ఆయన అంటే ఉన్న గౌరవంతో ఆలయం నిర్మించుకున్నాం ఇందులో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని అభిమానులు వాదిస్తారు. దక్షిణ కలకత్తాలో సంజయ్ అనే వ్యక్తి అమితాబ్‌కు ఆలయాన్ని నిర్మించాడు. అమితాబ్ ఆక్స్ సినిమాలో కూర్చున్న చైర్‌ను, అగ్నిపథ్ సినిమాలో ఆయన వేసుకున్న షూను సంపాదించి, అమితాబ్ ఆలయంలో వాటిని అమర్చి పూజ జరుపుతున్నారు. జై శ్రీరామ్ అని రాసిన శాలువా ధరించినట్టుగానే అమితాబ్ భక్తులు జై శ్రీ అమితాబ్ అని రాసి ఉన్న ఆకుపచ్చ శాలువా ధరిస్తారు. సంజయ్, ఆయన కుమారుడు ఇక్కడ పూజలు జరుపుతారు. సంజయ్ ప్రత్యేకంగా అమితాబ్ చాలీసా కూడా రాశారు. తమ దృష్టిలో మాత్రం అమితాబ్ జీవించి ఉన్న దేవుడు అంటాడా భక్తుడు.

 కలకత్తా అమితాబ్ అభిమాన సంఘం అమితాబ్ 70వ జన్మదినాన్ని ఈ ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. అమితాబ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ పేదలకు ఈ ఆలయం వద్ద దుస్తులు పంచారు. దక్షిణ కలకత్తా బొన్‌డల్ రోడ్‌లోని ఈ ఆలయాన్ని అమితాబ్ జన్మదినం రోజున ఆయన సినిమాల పోస్టర్లతో అలంకరిస్తారు. అక్కడ పండుగ వాతావరణం ఉంటుంది. తన ఆలయం గురించి తెలిసినప్పుడు అమితాబ్ తనకు ఇది నచ్చలేదని నిర్మొహమాటంగానే చెప్పుకున్నాడు. నేను ఒక మనిషిని మాత్రమే, నటన నా వృత్తి అభిమానించండి. ఫరవా లేదు కానీ ఆలయం నిర్మించి దేవుడ్ని చేయకండి అని విజ్ఞప్తి చేశారు.

23, జనవరి 2013, బుధవారం

విష పురుషులు

తాను నమ్మిన సిద్ధాంతం కోసం సోక్రటీసు విషం తాగాడని చరిత్ర పుస్తకాల్లో చదివినప్పుడు మనసు మూలల్లో ఎక్కడో ఇది నిజంగా జరిగిందా? అలా విషం తాగినప్పుడు సోక్రటీసు ఏం ఆలోచించారు. అప్పుడాయన ముఖ కవళికలు ఎలా ఉన్నాయి. అంటూ బోలెడు సందేహాలు రావడం సహజమే! వాటికి ఇంత కాలానికి సమాధానాలు లభించాయి. విషం తాగిన కలియుగ సోక్రటీసులు లెక్కలేనంత మంది మన కళ్ల ముందే కనిపిస్తున్నారు. విషం తాగడమే కాదు, తమ వాళ్లతో విషం తాగిస్తున్నారీ, అభినవ సోక్రటీసులు, పరమ శివుళ్లు. మనవాళ్లు వట్టి వెధవలు అని చెప్పిన గురజాడ నాయకుల గురించి చెప్ప మంటే మాత్రం మనవాళ్లు మహాపురుషులోయ్, విష పురుషులోయ్ అని గర్వంగా ప్రకటించి ఉండేవారు. 

ఆ తరువాత వచ్చే అమృతం కోసం పరమశివుడు విషాన్ని గరళంలో దాచుకున్నాడు. మన రాజకీయ పుణ్య పురుషులు మాత్రం విషాన్ని తాగడమే కాకుండా ఆ విషపు నిల్వను తమ కడుపులో పులియబెట్టి తమ తరువాత వారసత్వ సంపదగా తమ సంతానానికి అందిస్తున్నారు. అమృత మథనంలో సముద్రాన్ని చిలికినప్పుడు విషం వస్తే పరమ శివుడు దాన్ని తన కంఠంలో దాచిపెట్టుకుంటాడు. కంఠం లో విషాన్ని పెట్టుకున్నది శివుడు దేవుడైతే, విషం తాగి, విషం పంచుతూ, విషం చిమ్మే నాయకులు పరమ పురుషులు.


అందగత్తెలను విష కన్యలుగా మార్చే రాజకీయ చాణుక్యులు చాలా మందిని జానపద సినిమాల్లో, కథల్లో మనం బోలెడు మందిని చూశాం. విష కన్యల విషయంలో నిజానిజాలు ఏమిటో కానీ విష పురుషులకు మాత్రం మనకు కొదవ లేదని తేలిపోయింది.
***



‘‘్చీ...చీ  ..్.. ఇంత చేదుగా ఉంది మీరేమిటండి రోజూ ఈ మందు అంతగా ఎలా తాగుతారు’’అని భార్య చీదరించుకుంటే
‘‘చూశావా? పారు నేనేదో మందు కొట్టి సుఖపడుతున్నానని అనుకుంటావు అంత చేదు విషం తాగడానికి నేనెంత కష్టపడతానో నీకేం తెలుసు పారూ ’’అంటూ మందుదాసు వాపోవడం పాత జోకు. వీళ్లు విష పురుషులు కాదు ప్రభుత్వం పాలిట కామధేనువులు, అక్షయ పాత్రలు. సీమాంధ్ర , తెలంగాణ ఉద్యమాల్లో ఏది భారీ ఉద్యమం అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ప్రభుత్వ ఖజానాను నింపే ఈ వీరి మద్య ఉద్యమ ఉధృతిపై ఎవరికీ మరో మాట ఉండడానికి వీలు లేదు. మరీ తెల్లవారు జామునే తాగడం మొదలు పెట్టావా? అంటే లేదు రాత్రి నుంచి కంటిన్యూ అవుతున్నాను అని చెప్పే ఇలాంటి కార్యశూరుల వల్లనే ఖజానా నిండుతోంది. మనం చెప్పుకునేది ఇలాంటి పుణ్యపురుషుల గురించి కాదు విషాన్ని అమృతంలా జీర్ణం చేసుకున్న విష పురుషుల గురించి.


***
అధికారం విషం లాంటిదట! అనధికారికంగా 110 కోట్ల మందిపై అధికారం చలాయిస్తున్న సోనియాగాంధీ చెప్పిన మాట ఇది. జైపూర్ చింతన శిబిరంలో కాంగ్రెస్‌లో నంబర్ 2గా బాధ్యతలు స్వీకరిస్తూ రాహుల్‌గాంధీ గంభీరమైన ఉపన్యాసం చేస్తూ వాళ్ల అమ్మ చెప్పిన ఈ మాట మనకు చెప్పారు. ఆయన నంబర్ టూ అయితే మన్మోహన్‌సింగ్ నంబర్ ఎంత?
మన వ్యవస్థలో అధ్యక్షుడు రబ్బర్ స్టాంపే, అసలైన అధికారం ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది. అదే ఇంగ్లాండ్‌లో రాణి డమీ అయితే ప్రధాని చేతిలో అసలైన అధికారం ఉంటుంది. అమెరికాలో అధ్యక్షుని చేతిలో సర్వాధికారం ఉంటుంది. మరి మన దేశంలో ఇప్పుడు అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ ప్రధానమంత్రి వౌనముని. మరి దీనే్న విధానం అనాలో? అదో సమస్య. 


కొన్ని ఇళ్లల్లో అత్తగారి  పెత్తనం చూసి  రాజ్యాంగేతర శక్తి అంటూ అల్లుడు గారు మనసులోనే కుమిలిపోవడం తప్ప ఏమీ అనలేడు. చుట్టు పక్కల వారికి అదో పెద్ద వినోదం. ప్రధానిని డమీగా మార్చి నంబర్ వన్ అమ్మ నంబర్‌టూ గా బ్రహ్మచారి యువరాజుకు పట్ట్భాషేకం చేశారు. ఈ విషం కోసం పాపం ఆ రాజకీయ పసికూన ఎంత కాలం నుంచి ఆశగా ఎదురుచూస్తున్నారో? అప్పుడెప్పుడో అమ్మగారికే ఆ విషం తాగే చాన్స్ వచ్చింది. ఇటలీ మాత ఇండియా విషం  తాగడమా! ఇది చూస్తూ బతకడం కన్నా విషం తాగి తనువు చాలించడం మేలు అన్నట్టుగా సుష్మాస్వరాజ్ శిరోముండనంతో నిరసనకు సిద్ధం అయ్యారు. 

అమ్మ మనసు మార్చుకుని విషాన్ని తాత్కాలిక ప్రాతిపదికన మన్మోహన్‌కు ఇవ్వక తప్పలేదు. ప్రజాస్వామ్యంలో అధికారం ఐతే అత్యధిక ప్రజాభిమానం ఉన్న నాయకుడి చేతిలో ఉంటుంది లేదంటే ఎలాంటి జనాకర్షణ లేకుండా ఎలాంటి ప్రమాదం లేదనుకున్న వారి చేతిలో వచ్చి పడుతుంది. విషం తాగించడానికి రెండో కేటగిరి కింద మన్మోహన్‌కు మించిన నాయకుడు అమ్మకు కనిపించలేదు.

 పాముకు తలపై ఉండే నోటిలో, తేలుకు చివరలో ఉండే తోకలో విషం ఉంటే మనిషికి నిలువెల్లా విషమే అని సుమతీ శతక కారుడు చెప్పింది రాజకీయ విష పురుషుల గురించే కావచ్చు.
విషానికున్న పవర్ తెలియక చాలా మంది భయపడతారు కానీ ఒక్కసారి విషం అలవాటు అయిందా? దాన్ని మించిన అమృతం ఉండదు. కావాలంటే రాజకీయ నాయకులను చూడండి విషానికి అలవాటు పడిన వీళ్లు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులకు కూడా బాధపడకుండా వేల కిలో మీటర్లు నడిచేస్తారు. విషం కోసం ఒకరు జైలులో నుండే ఉద్యమిస్తారు. తమ తరువాత తమ విషం ఎవరు తాగాలో నిర్ణయించుకునే అధికారం కూడా నాయకులకు ఉండదు ఎందుకంటే ఆ విషం కూడా నాయకుల చుట్టూ వారసులు విషవలయంగా తిష్టవేసుకొని ఉంటారు . 


తల్లికడుపులో ఉన్న భవిష్యత్తు నాయకులు, రుద్ర భూమిలో సేద తీరుతున్న గత కాలపు నేతలు మినహా ఈ విషం కోసం అందరూ అర్రులు చాచే వా రే. విషానికున్న ఆకర్శణ శక్తి అలాంటిది.

18, జనవరి 2013, శుక్రవారం

సినిమాలు మనిషిని చెడగొట్టలేవా ?

సినిమాల్లోని వికృత చేష్టల ప్రభావం సమాజంపై ఉండదు అని వాదించే వాళ్లు ... సమాజం సంగతి సరే కానీ చివరకు సినిమా వాళ్లపై సైతం ఆ ప్రభావం ఎంతగా పడుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఈ మధ్య పలువురు సినిమా నటీనటులు వ్యబిచారం కేసుల్లో పట్టుబడ్డారు. హెరాయిన్ వంటి మత్తు పదార్ధాలను సేవిస్తూ పట్టుపడిన వారున్నారు, తరలిస్తున్న నటులు ఉన్నారు. చిన్నా చితక నటులే కాదు హీరోలుగా నటించిన వాళ్లు పట్టుపడ్డారు. మరీ ఎక్కువ పలుకుబడి ఉన్న వాళ్లు తప్పించుకున్నారు. వీరిపై సినిమాల ప్రభావం ఏమీ లేదని సినిమా పెద్దలు చెప్పగలరా?
అమ్మాయిని అల్లరి మూక ఆటపట్టిస్తుంటే.. హీరో వచ్చి వారికి బుద్ధి చెబుతాడు. హీరోయిన్ కళ్లతోనే హీరో ప్రేమలో పడుతుంది. ఆడవారిని గౌరవించే హీరోలోని సంస్కారం ఆమెను ప్రేమించేట్టు చేస్తుంది.
ఇది మూడు నాలుగు దశాబ్దాల క్రితం అనేక తెలుగు సినిమాల్లో కనిపించిన దృశ్యం.


ఇప్పుడు విలన్లు, అల్లరి మూకలు సైతం కుళ్లుకునే విధంగా హీరోనే హీరోయిన్‌ను అటపట్టిస్తున్నాడు. మరీ తిక్కరేగిందంటే హీరోయిన్ తల్లిని కూడా హీరోయిన్‌ను ఆటపట్టించినట్టే ఆటపట్టిస్తాడు. హీరో హీరోయిన్‌ను, హీరోయిన్ తల్లిని ఒకేసారి ప్రేమించేస్తాడు. కాలేజీలో హీరో అల్లరితో హీరోయిన్‌ను ఏడిపించేస్తాడు. హీరోగారి చిల్లర వేషాలకు ముచ్చటపడి చివరకు హీరోయిన్ హీరోను ప్రేమించేస్తుంది. ఇది  ఇప్పుడొస్తున్న అనేక తెలుగు సినిమాల్లో కనిపించే దృశ్యం. 


సినిమాలు మనిషిని చెడగొట్టలేవు, అలా అయితే సినిమాల్లో మంచిని చూసి ఎంతో మంది మంచివారుగా మారేవారు కదా? ఇది ఐదారు దశాబ్దాల నుంచి సినిమా రంగంలో ఉంటున్న ప్రముఖ నటుడు పలు సభల్లో వేసిన ప్రశ్న ఇది.  సినిమాల వల్ల చెడిపోయారని కొన్ని వందల ఉదాహరణలు చూపగలం. అలానే సినిమాల్లోని సందేశంతో బాగు పడ్డ సంగటనలు చూపగలం. సినిమా ఎలాంటి ప్రభావం చూపదు అని వాటికి మించిన ఉదాహరణలు చూపగలం. మనం సినిమా ప్రభావం ఎలా ఉంటుందని భావిస్తే, అలాంటి ఉదాహరణలు చూపగలం. దేశం కోసం త్యాగం చేయమని ఒక సినిమా చెబితే సైన్యంలో చేరి దేశ సేవ చేద్దామని అంతా క్యూ కట్టరేమో కానీ చెడు చూపినప్పుడు కచ్చితంగా అంతో ఇంతో మనిషిపై ఆ ప్రభావం ఉండి తీరుతుంది. ఏదో ఒక సినిమా చూసి నేరం చేసేస్తారని కాదు. సినిమాలన్నీ అలాంటివే అయినప్పుడు క్రమంగా ఆ ప్రభావం మనిషిపై పడుతుంది. పోలీసు శాఖలో అత్యున్నతమైన పదవి నిర్వహించి, రిటైర్ అయిన పోలీసు అధికారి ఒకరు ఒక ఇంటర్వ్యూలో తన పిల్లలు ఒక్క తెలుగు సినిమా కూడా చూడలేదని చెప్పుకొచ్చారు. ఎందుకంటే సహజత్వానికి భిన్నంగా ఉండే ఆ సినిమాలు చూడడం వృధా అనిపించింది అన్నారు.ఈ ఐటం సాంగ్ లేకుండా ఈ మధ్య హిట్టయిన ఒక్కసినిమాను చూపండి అని వచ్చిన ప్రశ్నకు సినిమా వాళ్ల నుండి సమాధానం రాలేదు.
***


మహేష్‌బాబు హీరో, అనుష్క హీరోయిన్‌గా వచ్చిన సినిమా ఖలేజా. ఈ సినిమాలో హీరో హీరోయిన్‌పై దాడి చేసినట్టుగా వెళతాడు. తన టాక్సీకి డాష్ ఇచ్చాడని ఏదో బూతు మాటతో హీరోయిన్‌ను నిలదీస్తాడు. ఆమె భయపడిపోతుంది. ఇది ఒక మాల్‌లో జరుగుతుంది. చాలా మంది పక్క నుంచి వెళుతుంటారు. ఒక యువకుడు చొక్కా మడిచి ఆడపిల్లను వేధిస్తావా? అని హీరోని నిలదీయడానికి ప్రయత్నిస్తే, అమ్మాయి కనిపించగానే ప్రతి ఒక్కడు హీరోలా రక్షించేందుకు వస్తాడని అతన్ని కొట్టేందుకు వెళుతుంటే పైన దేవుడున్నాడు చూస్తాడు అంటూ రక్షించడానికి వచ్చిన యువకుడు వెళ్లిపోతాడు. సినిమాలో ఇదో హాస్య సన్నివేశం. అంటే అమ్మాయిలు ఇబ్బందుల్లో ఉంటే వేధించేవాడు హీరో, అండగా నిలవడానికి వచ్చిన వాడు హాస్యపాత్ర ధారునిగా మారిపోయాడు. ఒకప్పుడు రక్షించేవాడు హీరో అయితే ఇప్పుడు దాడికి దిగేవాడు హీరో అయ్యాడు, ప్రజలు జీరోలయ్యారు. ఒక్క సినిమాతో ఏదో అయిపోతుందని కాదు కానీ ఇలాంటి దృశ్యాల ప్రభావం అంతో ఇంతో ఉంటుంది. సినిమాల ప్రభావం లేకపోతేనే ఒక నటున్ని ప్రజలు ముఖ్యమంత్రిని చేశారా?


మనకెందుకు అని కొట్టుకుపోతున్న సమాజంలో అంతో ఇంతో ప్రజల కోసం ఉద్యమించే సంస్థలు కొన్ని ఉన్నాయి. పెళ్లి చేసుకుంటాను అని మోసం చేసే యువకున్ని నిలదీసేవి మహిళా సంఘాలే. కానీ మన సినిమాల్లో మాత్రం మహిళా సంఘాలు అంటే పనీ పాటా లేని మహిళల సమూహం. తోటి వారి గురించి పట్టించుకోవడమే మన సినిమాల్లో పని లేని తనం. మహిళా సంఘాలను ప్రోత్సహించకపోయినా పరవాలేదు. అంత చిన్న చూపు చూడడం ఎందుకు?


ఆడపిల్లలను వేధించడమే హీరోయిజం అని కొన్ని వందల సినిమాల్లో పరోక్షంగా సందేశం ఇస్తున్నప్పుడు ఆ ప్రభావం యువతపై పడకుండా ఉంటుందా? తమ అభిమాన నటుని స్టైల్‌ను దుస్తుల్లో, హేర్‌కటింగ్‌లో అనుసరించే వారు ఆ వెర్రి బుద్ధులను కూడా అనుసరించకుండా ఉంటారా?
సినిమా ఒక వ్యాపారం. వాళ్ల డబ్బు వాళ్ల ఇష్టం. కానీ సమాజం పట్ల కొంత బాధ్యతా యుతంగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? జనం ఇలాంటి సినిమాలే చూస్తున్నారు కాబట్టి తీస్తున్నామని సమర్ధించుకోవచ్చు. 5 నుంచి 10 శాతం సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. ఇంతోటి విజయం కోసమేనా సినిమా వాళ్ల కృషి.
సమాజానికి కీడు చేసే ఇలాంటి సినిమాలను ఎలా ఆదరించాలో అలానే ఆదరిస్తున్నారు. సినిమాలకు సమాజం నుంచి కావలసింది ఈ గుణపాఠమే. సినిమాల విజయం ఐదు శాతం నుంచి మరింతగా తగ్గి సంక్షోభం తలెత్తినప్పుడు సినిమాల సంఖ్య తగ్గుతుంది, నాణ్యత పెరుగుతుంది. అలా జరగాలని ఆశిద్దాం.

16, జనవరి 2013, బుధవారం

నాస్తిక దేవుని వారసత్వ కష్టం!

రాజకీయాల్లో ఆస్తులు సంపాదించడం సులభమే. దాన్ని వారసులకు కట్టబెట్టడం ఇంకా సులభం. అధికారాన్ని సంపాదించడం కష్టం. సంపాదించిన అధికారాన్ని వారసులకు అప్పగించడం అంత కన్నా కష్టం. పరమ శివుని నుంచి పరమ నాస్తికుడు కరుణానిధి వరకు. ఔరంగజేబు నుంచి బాబు వరకు. రాజుల కాలం నుంచి రాజశేఖరుని కాలం వరకు, బాల థకరెలు, పెద రాయుళ్ళు  అందరూ ఈ సమస్య ఎదుర్కొన్న వారే. ఏ కాలంలోనైనా వారసులకు అధికారం అప్పగించడం పాలకులకు ఎప్పుడూ కష్టమే. దేవుళ్లకే ఈ కష్టాలు తప్పనప్పుడు నాస్తిక దేవుళ్లకు తప్పుతాయా?


దశరథరాముని కాలం నుంచి తారక రాముని కాలం వరకు అందరూ ఎప్పుడో ఒకప్పుడు దైవలీలలకు ఆశ్చర్యపోయిన వారే. నాస్తికుడైన కరుణానిధికి ఆలయం నిర్మించి దేవునిలా కొలవడం ఏమిటి? అచ్చం దేవుడికి వచ్చిన సమస్యనే ఆయనకు రావడం ఏమిటి? ఆలయం నిర్మించారనే సంతోషం ఆయన్ని ఉబ్బితబ్బిబ్బు అయ్యేట్టు చేస్తుంటే వారసుని ఎంపికలో వంటింటి తిరుగుబాటు ఆయనకు ముసలి వయసులో కునుకు లేకుండా చేస్తోంది.
కరుణానిధి  సామాన్య కుటుంబంలో పుట్టారు. తల్లి యుక్త వయసులో ఉండగా, దేవాలయంలో నృత్యాలు చేసే వారు. ఆలయ నర్తకికి జన్మించిన కరుణానిధికి యుక్తవయసు వచ్చాక నాస్తికుడయ్యారు.
తమిళనాడులో డిఎంకె, అన్నాడిఎంకె ఏ విషయంలోనైనా పోటాపోటీగా ఉంటాయి. ఇద్దరికీ సొంత చానల్స్ ఉన్నాయి, సొంత ఆస్తులున్నాయి, సొంత మీడియా ఉంది. ఇద్దరికీ సొంత పార్టీలు ఉన్నాయి.


ఎంజిఆర్‌ను దైవంగా భావించే తమిళ భక్తులు  ఆయనకు ఏకంగా ఆలయాలు నిర్మించారు. మా రాజకీయ దేవుడు నాస్తికుడైతేనేమి ఏ విషయంలోనూ ప్రత్యర్థి కన్నా తక్కువ కారాదని కరుణకు సైతం ఆలయం నిర్మించారు. బహుశా ప్రపంచంలో ఇదే తొలి నాస్తికుని దేవాలయం కావచ్చు. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో సమిరెడ్డిపల్లి గ్రామంలో కరుణానిధికి కళైంగనైర్ తిరుకోవిళ్ పేరుతో ఆలయం నిర్మించారు. డిఎంకెకు చెందిన జిల్లా పంచాయితీ కౌన్సిలర్ జిఆర్ కృష్ణమూర్తి ఈ ఆలయం కోసం ఐదు సెంట్ల భూమి సేకరించారు. రెండేళ్ల క్రితం ఆలయ నిర్మాణం పూర్తయింది. కరుణ నాస్తికుడు కదా? అని ప్రశ్నిస్తే, ‘కరుణానిధిని దేవునిగా భావించి ఆలయం నిర్మించడం అనేది మా ఇష్టం.. ఆయన తనను తాను దేవునిగా భావిస్తారా? లేదా? అనేది ఆయనిష్టం’ అంటూ కృష్ణమూర్తి కట్టె విరగకుండా పాము చావకుండా చెప్పుకొచ్చారు.


కరుణానిధి వచ్చే ఏడాదికి 90 ఏళ్లకు చేరుకుంటారు. తన కుమారుడు, 60 ఏళ్ల యువనాయకుడు స్టాలిన్‌ను డిఎంకెకు తన వారసునిగా ప్రకటించారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న కరుణధి హృదయం సముద్రమంత విశాల మైంది. కొడుకులు, కూతురు, అల్లుళ్లు, మేనల్లుళ్లు సమస్త సన్నిహిత బంధుజనానికి రాష్ట్రంలో లేదా కేంద్రంలో మంత్రి పదవులు ఇప్పించారు. వ్యాపారాలు అప్పగించారు. ఆస్తుల విషయంలో ఆయన తన సంతానంలో ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదు. ఆడపిల్ల కదా అనే చిన్నచూపు చూడలేదు. మూడవ భార్య కుమార్తె కనిమొళిని ఎంపిని చేశారు, భారీ కుంభకోణంలో భాగస్వామ్యం కల్పించారు. కరుణానిధి యువకుడిగా ఉన్నప్పుడు భక్తిని ఎంతగా వ్యతిరేకించారో, వయసు మీరాక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయాలకు అంతగా పెద్దపీట వేశా రు. కమ్యూనిస్టు ఒక్కసారి వ్యాపార వేత్తగా మారితే మహామహా పెట్టుబడి దారులే వారి ధాటికి దిమ్మతిరిగి పోతారు(తెలుగునాట రాజకీయాల్లో తెర వెనుక చక్రం తిప్పే వ్యాపా ర సామ్రాట్టులు ఒకప్పుడు కమ్యూనిస్టులే). అలానే నాస్తికునిలో భక్తి ప్రవేశించినందంటే భక్తాగ్రేసురులు కూడా రేస్‌లో వారిని పట్టుకోలేరు. ఏ ముహూర్తాన కరుణానిధి దేవుడయ్యారో కానీ అప్పటి నుంచి ఆయనకు దేవుని సమస్యలు తప్పడం లేదు.


గణాలకు అధిపతిని ఎవరిని చేయాలని పరమ శివుని ముందు ప్రశ్న ఉదయించినట్టుగానే పార్టీకి ఎవరిని అధిపతిని చేయాలనే ప్రశ్న కరుణానిధి ముందుకు వచ్చింది. లోకం చుట్టి ఎవరు ముందు వస్తే వారికే పదవి అంటాడు శివుడు. తండ్రి నా సంగతి తెలిసి కూడా ఇలాంటి షరతు పెడతావా? మరో మార్గం లేదా? అని ప్రశ్నిస్తే, సులభ మార్గం చెప్పారు. బొజ్జగణపయ్య అక్కడే ఉండి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి గణాధిపత్యం సంపాదించేస్తాడు. అళగిరి ఢిల్లీలో చక్రం తిప్పితే స్టాలిన్ మద్రాస్ మేయర్‌గా, డిప్యూటీ సిఎంగా తల్లిదండ్రుల వద్దనే ఉండి భూ కుంభకోణాల్లో తన ప్రతిభ చాటి వారసత్వ అధికారం  కొట్టేశారు.


అధికారంలో లేడు కాబట్టి సరిపోయింది ఇదే పని అధికారంలో ఉన్నప్పుడు చేస్తే రచ్చరచ్చ అయి ఉండేది. కరుణకు ముగ్గురు భార్యలు, అళగిరి, స్టాలిన్ ఇద్దరూ ఒక తల్లి పిల్లలే. అన్నను పక్కన పెట్టి తమ్ముడు స్టాలిన్‌కు వారసత్వం కట్టబెట్టడం ఏమిటని అళగిరి అలిగారు. పార్టీకి వారసున్ని ప్రకటించడానికి ఇదేమన్నా మఠమా? అంటూ అళగిరి ప్రశ్నించడం చూస్తుంటే ఆయన అమాయకత్వానికి నవ్వుకోవాలో, జాలి పడాలో అర్ధం కాదు. మొత్తం కుటుంబ సభ్యులను కేంద్రంలో, రాష్ట్రం లో ఖాళీల భర్తీకి పంపిస్తుంటే ఇది రాజకీయ పార్టీనా? మఠమా అనే ప్రశ్న అప్పుడు రాలేదాయనకు!
ఇదేం శాపమో పాపులర్ నేతలందరికీ ఈ వారసత్వ సమస్య తప్పడం లేదు.
కోర్కెలు తీర్చుకోవడానికి 40 రోజుల అయ్యప్ప దీక్ష మాదిరిగా నాస్తిక దేవుని భక్తులు తమ దేవుని సమస్య కోసం ఏదైనా నాస్తిక మండల  దీక్ష చేపడితే ఫలితం ఉంటుందేమో!

9, జనవరి 2013, బుధవారం

సచివాలయం బయట చిలక జ్యోతిష్యుడు .. లోపల ముఖ్యమంత్రి జ్యోస్యం ....అధికార పక్షం + ప్రతిపక్షం =జ్యోతిష్యం



వాస్తు జ్యోతిష్యుడి సలహా మేరకు సచివాలయం ప్రధాన ద్వారం మారింది. అంతకు ముందున్న ప్రధాన ద్వారం వద్ద ఉదయం పది గంటలు కాగానే ఠంచనుగా ఫుట్‌పాత్‌పై ఒక చిలక జ్యోతిష్యుడు ప్రత్యక్షమవుతాడు. అదే సమయానికి సచివాలయం లోనికి సిఎం వెళతారు. లోనికి వెళ్లే సిఎంలు తరుచుగా మారవచ్చు కానీ బయట ఉన్న జ్యోతిష్యుడు మాత్రం ఎక్కువ కాలం ఉంటాడు.

 జ్యోతిష్యుడికి డబ్బులిచ్చి కాసేపు మాట్లాడితే ముందుంది మంచి కాలం అంటూ భరోసా ఇస్తాడు. వాడిచ్చిన భరోసాతో ఇప్పటి కష్టాలు మరిచిపోతాం. చిలక జోస్యుడు రెండు మూడు రూపాయల ఫీజుతో మిమ్ములను ఊహల్లో రెండు మూడు తరాలు తిన్నా తరగని సంపన్నుడిని చేసేస్తాడు. అటు నుంచి ప్రధాన ద్వారం గుండా లోనికి వెళితే..(ముందు లోనికి వెళ్లే పలుకుబడి ఉండాలి. అలా ఉండి లోనికి వెళితే) ముఖ్యమంత్రి అని ఒకరుంటారు. చిత్రంగా ఆయన ఛాంబర్‌లో కూడా అచ్చం ఆ జ్యోతిష్యుడి నినాదమే ఉంటుంది. ముందుంది మరింత మంచి కాలం అంటూ. బహుశా కారులో వెళుతున్నప్పుడు ఈ జ్యోతిష్యుడిని చూసి ముఖ్యమంత్రికి ఆ నినాదం తట్టిందేమో! నాయకుల ఉపన్యాసాలు విన్నాక జ్యోతిష్యుల కు ఆ నినాదం తట్టిందో, జ్యోతిష్యుల మాటలు విన్నాక నాయకులకా నినాదం చిక్కిందో ఏదైతేనేం అది ఇద్దరికి సరిగ్గా సరిపోయే మాట. అటు రాజకీయంలో, ఇటు జ్యోతిష్యంలో రెండు రంగాల్లో క్లిక్కయింది. రోడ్డు పక్కనుండే జ్యోతిష్యుల నినాదాలకు కాపిరైట్ హక్కులేమీ ఉండవు.

ఇంతకూ విషయం ఏమిటంటారా? శ్రీమాన్ సిపిఐ నారాయణ గారు రాజకీయ సిద్ధాంతం జ్యోతిష్యం ఒకటే అని తేల్చేశారు. బ్లాక్ అండ్ వైట్ నుంచి సినిమాలు అప్పుడప్పుడే కలర్‌లోకి వచ్చిన కాలంలో ప్రేమించుకోవడానికి ముందు హీరో హీరోయిన్ల మధ్య గిల్లి కజ్జాలు ఉండేవి. ప్రేమించుకున్న తరువాత ప్రేమ లేఖల రాయబారం సాగేది. అలానే సిపిఎం కార్యదర్శి బివి రాఘవులు, సిపిఐ కార్యదర్శి నారాయణల మధ్య చిలిపి రాజకీయ విమర్శలు చాలా రోజుల నుంచి సాగుతూనే ఉన్నాయి. వామపక్షేతర నాయకుల్లా వీళ్లు కెమెరాల ముందు తిట్టుకోరు. ఉత్తరాలు రాసుకుని మీడియాకు విడుదల చేస్తారు.

 సిపిఎం వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుంది అని నారాయణ అన్నట్టు వార్తలు వచ్చాయి. అత్త కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు కోపం వచ్చినందన్నట్టు, తాను చెప్పాల్సిన విషయం నారాయణ చెప్పడం ఏమిటని రాఘవులుకు కోపమొచ్చింది. వాల్మీకికి శోకం నుంచి శ్లోకం పుట్టినట్టు రాఘవులుకు కోపం నుంచి సెటైర్ పుట్టింది. నారాయణ జ్యోతిష్యం మొదలు పెట్టారా? సిపిఐ కార్యాలయాల్లో జ్యోతిష్య దుకాణాలు పెట్టుకోండి అంటూ సెటైర్ వేశారు. రాఘవులు చెప్పింది అక్షర సత్యం. కమ్యూనిజం అంటే జ్యోతిష్యం చెప్పడమే కదా? అం టూ నారాయణ ‘ద్వేషలేఖ’ రాసి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. కమ్యూనిస్టు కార్యాలయాలన్నీ జ్యోతిష్యాలయాలేనని, మార్క్సిజం, లెనినిజం భవిష్యత్తు చెబుతాయని, జ్యోతిష్యం కూడా భవిష్యత్తునే చెబుతాయి కదా? అనేది నారాయణ వాదన. జ్యోతిష్యంలో వామపక్షాల సామర్ధ్యం ఏమిటో కానీ ఈ పార్టీల భవిష్యత్తు మాత్రం అందరికీ తెలుసు. జ్యోతిష్యంపైన, దేవుడిపైన నమ్మకం లేని వాళ్లు సైతం వామపక్షాలకు గతమే తప్ప భవిష్యత్తు లేదు, వాళ్లను ఆ దేవుడు కూడా రక్షించలేడు అని చెప్పేస్తారు. రాజకీయ నాయకులు, జ్యోతిష్యులు కవల పిల్లల్లాంటి వాళ్లే. రూపం వేరు కావచ్చు కానీ చేసే పని, చెప్పే మాటలు ఒకటే. అపరిచితుడిలో అనేక రూపాలు ఉన్నట్టు, జ్యోతిష్యుడిలో అధికార పక్షం ఉంటుంది, ప్రతి పక్షం ఉంటుంది. అవసరాన్ని బట్టి రూపం బయటకు వస్తుంది.

అధికారంలో ఉన్న నాయకుడి మాటలు వినండి. తన పాలనా సామర్ధ్యం వల్ల రాష్ట్రం వెలిగిపోతుందని అధికారంలో ఉన్న నాయకుడు చెబుతాడు. ప్రపంచ పటంలో నా వల్లే రాష్ట్రాన్ని చేర్చారంటాడు. అభివృద్ధిలో దూసుకుకెళుతున్నాం, ఇప్పుడు మీకు మంచి కాలం నడుస్తోంది, ముందుంది మరింత మంచి కాలం అంటాడు. మరి మేమేం చేయాలి అని మనం ప్రశ్నిస్తే, ఇంకేం చేస్తారు మీ ఓటు నాకివ్వండి బొందితో కైలాసానికి పంపిస్తానంటాడు. అదే ప్రతిపక్ష పార్టీ వాళ్ల ఉప న్యాసాలు వినండి. జీవితంపై విరక్తి, భయం, జుగుస్స, కోపం, ఆగ్రహం, ఇంకా వర్ణించలేని ఏవేవో మనలో మొదలవుతాయి. మనం ఇంత కష్టాల్లో ఉన్నామా అని మన దుస్థితికి మనకే ఏడుపొస్తుంది. ఇన్ని కష్టాలు పడుతూ ఎలా బతుకుతున్నామని ఆశ్చర్యం కూడా వేస్తుంది. వా..! అని ఏడుస్తూ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని ప్రతిపక్ష నాయకుడ్ని అడిగితే ఇంకేం చేస్తావు నీకున్న ఆ ఒక్క ఓటు నాకు వేయి భూ లోకంలో స్వర్గం చూపిస్తానంటాడు.

ఇప్పుడు జ్యోతిష్యుడి వద్దకు వెళదాం ఈ రెండు రూపాలు కలిపి చూపిస్తాడు. నీ తల రాతే ఇలా ఉంది. నీ కన్నీ కష్టాలు, గ్రహ స్థితి బాగాలేదు. దుష్ట శక్తులు నీ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాయి అంటూ మాటలతో పై లోకాలకు పంపే ప్రయత్నాలు చేస్తుంటే మనం అతని ఉపన్యాసాన్ని అడ్డుకుని నన్ను ఇప్పుడేం చేయమంటారు అని అడుగుతాం. ఇదిగో ఈ యంత్రంతో నీ పరిస్థితి మొత్తం మారిపోతుందని చెబుతుండగానే యంత్రం లాగేసుకుం టాం. అంతే స్పీడ్‌గా మన చేతిలోని కరెన్సీని వాడు లాగేసుకుంటాడు. ఇక నీకే భయం లేదు పో... ఇక నీకు పట్టిందల్లా బంగారమే. అడుగు పెట్టిన చోటల్లా విజయమే అంటూ భరోసా ఇస్తాడు. తొలుత ప్రతిపక్ష వాణి వినిపించిన వాడు కరెన్సీ చేతులు మారగానే అచ్చం ముఖ్యమంత్రి ఇచ్చినంత భరోసా ఇవ్వడం అంటే ఒక జ్యోతిష్యుడు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరికి సమానం అన్నమాట!

జ్యోతిషం నిజం అవుతుందనే గ్యారంటి  ఉండదు.. నాయకుల మాటలు  కుడా అంతే. కానీ ఇద్దరి మాటలు వినడానికి ఇంపుగా ఉంటాయి. నిజం అవుతాయని అనిపిస్తుంది .. అయితే బాగుండు అనే  ఆశ పుడుతుంది .   రాజకీయ సమరం లో  అధికార పక్షం, ప్రతి పక్షమే కాదు, జీవన సమరంలో ప్రతీ పక్షం చెప్పేది  జ్యోతిస్యమే కదా 

6, జనవరి 2013, ఆదివారం

‘ఖర్మ’ భూమి లో మహిళా నిర్మూలనా యజ్ఞం


దేవకీ అష్టమ సంతానంతో ప్రాణాపాయం ఉందని ఆకాశవాణి చెప్పడంతో కంసుడు ఏడుగురు పిల్లలను పుట్టగానే హతమార్చాడు. ఎందుకంటే వారితో కంసుడి ప్రాణాలకు ముప్పు ఉంది. మనం కంసుడ్ని మించి పోతున్నాం. కంసుడు వాడి ప్రాణాలకు ముప్పు ఉందని మాత్రమే ఆడ శిశువులు అని కూడా కనికరం చూపకుండా చంపేశాడు. వాడే రాక్షసుడు అయినప్పుడు మరి మనం... ఎలాంటి ముప్పు లేకున్నా ఆడ పిల్లల ప్రాణాలు హరిస్తున్నాం.

 స్కానింగ్‌లో తేలింది. ఆడపిల్ల అని
 అయితే కడుపులోనే ప్రాణాలు తీసేయ్!
 పుట్టింది ఆడపిల్ల .

ఇంత ఘోరాన్ని తట్టుకుని ఎలా ఉన్నావురా! గొంతు పిసికేయ్!

 అయినా తప్పించుకొని తల్లి ఒడిలో హాయిగా పడుకుంటున్నారా?

 వాళ్లను చూసి ఎలా సహిస్తున్నావురా!

 ఇంటి నుంచి ఆడుకోవడానికి బయటకు రాగానే చాక్లెట్ ఇస్తాననో, పిప్పరమెంటు ఇస్తాననో ఆశ చూపించి గొంతు నులిమేయ్ మరీ కోపంగా ఉంటే అత్యాచారం చేసేయ్! 

అంత చిన్నపిల్లపై అత్యాచారం చేయాలని ఆలోచన వస్తే నువ్వు మనిషివెలా అవుతావు. అత్యాచారం చేసేయ్! 

అయినా కొందరు తప్పించుకుని పాఠశాలకు వెళుతున్నారు. ఇది ప్రమాదకరం... ప్రేమిస్తావా? చస్తావా? అని యాసిడ్ బాటిల్ పట్టుకెళ్లి ప్రశ్నించు... ప్రేమిస్తే, మోసం చేయ్! ప్రేమించడం లేదంటే ముఖంపై యాసిడ్ పోసేయ్!

 అందమైన అమ్మాయిలు చేతిలో పుస్తకాలు పట్టుకొని కాలేజీలకు వెళితే అమ్మో ఎంత ప్రమాదం... వాళ్లు ఎదిగిపోతారు. ఏదో ఒకటి చేసేయ్ సీతాకోక చిలుకల్లా ఉన్న వాళ్లను నమిలి మింగేయ్.. 

పేదరికానికి తల వంచక హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారా? అర్ధరాత్రి వెళ్లి అత్యాచారం చేసేయ్.. గుర్తు పడుతుందనుకుంటే చంపేయ్!

 గర్భస్త శిశువు నుంచి ఇంట్లో ఉన్న గృహిణి వరకు అందరూ మన శత్రువులే ... తలెత్తుకోకుండా అత్యాచారం చేయ్... సరదాగా ఉంటే హత్య చేసేయ్!

 చదవడానికి సిగ్గేస్తుందా? రాయడానికి కూడా... కానీ ఇది నిజం. వారి మానాన వారిని బతకనివ్వడం లేదు. మనకు చదవడానికి, రాయడానికే సిగ్గేస్తుంది... కానీ సమాజంలోని ఈ స్థితి మహిళలకు ఎంతటి ఆవేదన కలిగిస్తుందో, అత్యాచారాలకు గురవుతున్నా బాధితులకు ఎంతటి క్షోభను కలిగిస్తుందో కదా?

 * * *
 రావణుడు, దుర్యోధనుడు, కీచకుడు ఇప్పుడు మన దేశం వైపు చూస్తే ఏమనుకుంటారు. వాళ్లు కల్పిత పాత్రలో నిజమైన వాళ్లో తెలియదు కానీ ఉండి ఉంటే మాత్రం సిగ్గుతో తలదించుకునే వాళ్లు. రావణుడు సీతను ఎత్తుకెళ్లాడు కానీ అత్యాచారం చేయలేదు.. దుర్యోధనుడు, కీచకుడు సైతం సిగ్గుతో తల దించుకునేంతగా బరితెగించారు కొందరు నర రూప రాక్షసులు. ఎవరో చేసిన తప్పుకు మనం రాక్షసులను తిడుతున్నాం కానీ నిజానికి రాక్షసులు సైతం సిగ్గుతో తలదించుకునే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి.

 * * * 
మానవ పరిణామ క్రమంలో కోతి నుంచి మనిషిగా పరిణామం చెందాడని అంటారు. మనిషి పరిణామం చెందినట్టుగానే దేశం కూడా పరిణామం చెందుతుంది. చెందింది. కర్మ భూమి నుంచి కామ భూమిగా మనం పరిణామం చెందుతున్నాం. ఒకవైపు ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం సంఘటనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యువత ఆందోళన చేస్తున్న సమయంలోనే దేశంలోని అనేక ప్రాంతాల్లో అత్యాచారాల పరంపర కొనసాగూతనే ఉన్నప్పుడు మన దేశం కర్మ భూమి నుంచి కామ భూమిగా మారుతుందనే విమర్శను ఎలా కాదంటాం.

 దేశంపై పడ్డ కామభూమి అనే ఈ మచ్చను తొలగించడం అందరి బాధ్యత. ఆవును ఆ బాధ్యత గుర్తించారు కాబట్టే దేశ వ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు, పెద్దలు, ఆడమగ అనే తేడా లేకుండా, యువత, వృద్ధులు అనే తేడా లేకుండా.. హిందువు, ముస్లిం, క్రైస్తవులు అనే మత విభేదాలు లేకుండా మనుషులంతా ఈ అమానుష అత్యాచారాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. అది అన్నా హజారే చూపిన మార్గం కావచ్చు, కేజ్రీవాల్ ఐడియా కావచ్చు. నిద్ర పోతున్న పాలకుల చెంప ఛెళ్లు మనిపించే విధంగా శాంతియుతంగా లక్షలాది మంది యువత ఇండియా గేట్ వద్ద ఆందోళన సాగిస్తోంది. వారి గాంధీగిరితో పాలకులు కదిలి రాక తప్పలేదు. మీరు ఒకసారి మాకు ఓటువేసి అధికారం అప్పగించారంటే ఐదేళ్ల వరకు మా ఇష్టం అని భావించే రాజకీయ వ్యవస్థ చొక్కా పట్టుకుని నిలదీశారీ ఉద్యమ కారులు. 

ఎచ్చట స్ర్తిలు పూజలందుకుంటారో అక్కడ సంపద ఉంటుంది. ఇది పాత మాట. ఇప్పుడు దేశంలో సంపదకు కొరత లేదు కానీ స్ర్తిలు పూజలందుకనే మాట అటుంచి, రక్షణ లేని పరిస్థితి కల్పించాం. కాలేజీకి వెళ్లి ప్రేమించలేదని యాసిడ్ పోసినా దిక్కులేదు. ఇంటికి వెళ్లి కత్తితో పొడిచినా అడిగేవారు లేరు. అడ్డొచ్చిన అమ్మానాన్నలు సైతం ప్రాణాలు వదులుకోవలసిందే.

 ***
 కాలేజీ వదలగానే బిలబిలమంటూ అమ్మాయిలు బస్టాప్‌కు వచ్చేశారు. అప్పటి వరకు కళావిహీనంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా కళకళలాడింది. ఇంతలో బైక్ మీద పోకిరీలు వచ్చారు. మాటలతో చేతలతో కంపరమెత్తించారు. ఆ అమ్మాయిలకి కన్నీళ్లొక్కటే తక్కువ. 18 ఏళ్ల వయసులో కొన్ని వందల సార్లు ఇలాంటి వికారపు చేష్టలను భరించిన అనుభవం అయినా మూగగానే రోదించింది. బస్టాప్‌లో అంత మంది ఉన్నా కొద్ది మంది పోకిరీల ఆగడాలను చూసి మనకెందుకులే అని వౌనంగానే ఉండిపోయారు. కన్నీటితోనే అమ్మాయిలు బస్సెక్కారు. కొజ్జా నా కొడుకులు అని మనసులోనే ఎవరో తిట్టుకున్నట్టు వినిపించింది.
 ***
 విజయవాడ హాస్టల్‌లో ఉంటూ భవిష్యత్తు కోసం బంగారు కలలు కంటూ చదువులో మునిగిపోయినా ఆ అమ్మాయి తనపైకి ఒక మానవ మృగం పంజా విసిరేందుకు వేచి చూస్తోందని తెలియదు. కలల ప్రపంచంలో ఉన్న ఆమె కలలను చిదిమివేస్తూ ఆ మృగం అమానుషంగా మానభంగం చేసి హత్య చేసింది. ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదో, లేక వినిపించినా మనకెందుకులే అనుకున్నారో తెలియదు. అప్పుడూ చీ... సిగ్గులేని నపుంసక సమాజం అని ఎక్కడో నిరసన ధ్వనించింది.

 ***
 ఆర్థిక సంస్కరణలతో, ఐటి విప్లవంతో అమ్మాయిలకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ప్రపంచం నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చింది. దేశమంతా అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మేలుకొని ఉండే అమెరికా వాడి కోసం అమ్మాయిలు అర్ధరాత్రి పని చేసి క్యాబ్‌లో ఇంటికి రావాలి. క్యాబ్ డ్రైవర్ కీచకుడు కావచ్చు, మధ్యలో రావణాసురుడు కనిపించవచ్చు. ప్రతి రోజూ గండమే. సీతకు ఒక్కసారే రావణాసురుడి నుంచి ప్రమాదం ఎదురైంది. నేటి మహిళలకు ప్రతి రోజు ... ప్రతి నిమిషం ... కీచకులతో తప్పించుకోవాలి. బెంగళూరు, నోయిడా, ఢిల్లీలలో క్యాబ్‌లో అమ్మాయిలపై అఘాయిత్యం చేసిన సంఘటనలు చాలానే జరిగాయి. అలాంటి వాతావరణాన్ని చూస్తూ మనకెందుకులే అని వెళ్లిపోయిన వారిని చూసి ఎక్కడో ఛీ ... నపుంసకుల్లారా! అని ఎవరో తిట్టినట్టు వినిపించింది. *** 
హైదరాబాద్ శివారులో ఇంటర్నేషనల్ పాఠశాలలో తమ కూతురు హాయిగా చదువుకుంటుందనుకుని గుండెల మీద చేయివేసుకుని నిద్రపోతున్న ఆ దంపతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పదో తరగతి చదివే తమ కూతురును స్కూల్ ప్రిన్సిపల్ గర్భవతిని చేశాడని తెలిసి వారికి పిచ్చెక్కినట్టు అయింది. పాఠశాల పిల్లలను పాఠాలు చెప్పాల్సిన పంతులు లైంగికంగా ఉపయోగించుకుంటున్నాడని తెలిసీ మనకెందుకులే అని వౌనంగా ఉన్నవారిని చూసి ఛీ..్ఛ... సిగ్గులేని కొజ్జా సంఘం అని మనసులోనే తిట్టుకున్నారా తల్లిదండ్రులు. *** అభిమాన హీరో తన సినిమాల్లో అమ్మాయిలను ఏడిపించినట్టుగానే వారి రోడ్డుమీద పోకిరీలు అమ్మాయిలను వేధిస్తుంటే వౌనంగా ఉన్నవారిని చూసి సిగ్గులేని జాతి అని వినిపించింది.
 *** 
పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని, పని చేసే ఉద్యోగిని, ఇంట్లో ఉన్న గిృహిణీ ఏ ఒక్కరికీ రక్షణ లేదు. అర్ధరాత్రి స్వతంత్య్రం వచ్చిందని అర్ధరాత్రి ఆడవారు బయట తిరిగితే ఎలా? అని ఇదో మంత్రి ప్రబుద్ధుని ప్రశ్న. సరే మరి పట్టపగలు ఇంట్లో ఉన్నవారిపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా? మహిళలకు ఇంట్లోనూ రక్షణ కల్పించలేకపోతున్నాం మాది సిగ్గు శరం.. చీము నెత్తురు లేని ప్రభుత్వం అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అని ఆ మంత్రిని ప్రశ్నించాల్సింది.

 ***
 అడుగడుగునా అత్యాచారాలను చూశాం, వౌనంగా ఉన్నాం ఇక చాలు మేం చీమునెత్తురు లేని జాతి కాదు. పాఠశాలకు వెళ్లే బిడ్డపైన, ఆఫీసుకు వెళ్లే కూతురుపైన, ఇంట్లో ఉన్న అమ్మపైన జరిగిన అత్యాచారాలు చాలు ఇక సహించం అని సమాజం ఒక్కటై నిలిచింది. *** ఫేస్‌బుక్‌లు, సోషల్‌సైట్స్‌లో యువత సొల్లుకబుర్ల మత్తులో జోగుతున్నారు అని పాలకులు వేసిన అంచనాలను తలక్రిందులు చేస్తూ చీమల దండులా యువత ఢిల్లీ ప్రభుత్వంపై దండయాత్రకు బయలు దేరింది. ఢిల్లీలో 23 ఏళ్ల వైద్య విద్యార్థిని డిసెంబర్ 16న తన స్నేహితునితో కలిసి బస్సులో వెళుతుండగా, ఆమెపై సామూహికంగా అత్యాచారం జరపడమే కాకుండా సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా గాయపరిచారు. ఆమెను గాయపరిచిన తీరు చూసి సీనియర్ డాక్టర్లు నా జీవితంలో ఎన్నో రేప్ కేసులు చూశాను, కానీ ఇంత అమానుషంగా ప్రవర్తించిన సంఘటన చూడలేదని గద్గద స్వరంతో పలికాడు. మనకెందుకులే అని వౌనంగా ఉండే సమాజాన్ని ఈ సంఘటన ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఇంత కాలం తాము చేసిన తప్పేమిటో చెంప ఛెళ్ళుమని చెప్పినట్టు అనిపించింది. ఒకరు ఇద్దరు ముగ్గురు నుంచి వందలు వేలు లక్షల సంఖ్యగా మారింది. ఏ రాజకీయ పార్టీ పిలుపు ఇవ్వలేదు. యువత తమకు తామే పిలుపు ఇచ్చుకున్నారు. ఛలో ఇండియా గేట్ అనుకున్నారు. చీమల దండు రాజ్యంపై దండెత్తివచ్చినట్టుగా చీమల్లా కదిలారు. పామును కూడా వణికిపోయేట్టు చేశారు. న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదన్నారు. 

ఫేస్‌బుక్ లేందే నిమిషం గడవదు వీళ్ల ముఖం రాజ్యంతో వీళ్లేం పోరాడుతారనుకున్న ప్రభుత్వం దిమ్మ తిరిగిపోయేట్టుగా అలా ఇండియా గేట్ వద్దకు జన ప్రవాహం కదలి వస్తూనే ఉంది. వాటర్ ట్యాంకులతో నీళ్లు చిమ్మినా, బాష్పవాయువులు ప్రయోగించినా ప్రవాహం ఆగలేదు. ప్రభుత్వం పోరాడాల్సింది ఉద్యమ కారులపై కాదు రేపిస్టులపై అని నినదించారు. ఔను సాధారణంగా మేం సమాజం గురించి పెద్దగా పట్టించుకోం. పట్టించుకోవడం పాలకుల బాధ్యత అనుకుంటాం. కానీ మేం ఒక్కసారి పట్టించుకోవడం మొదలు పెట్టామా? మీకు నిద్ర లేకుండా చేస్తాం అని ఢిల్లీ యువత చేసి చూపించారు. కాలేజీలో చదువుకునే పిల్లలు, ఐటి ఉద్యోగులు, వారు వీరని కాదు ఆడ మగ అనే తేడా లేదు. తమ తల్లి, చెల్లి, అక్క, భార్య కూడా మహిళే ఈ రోజు ఇతరులకు జరిగింది మనకెందుకులే అనుకుంటే అదే అన్యాయం మనకు జరగవచ్చు అని ప్రతి ఒక్కరు స్పందించారు. చీమలదండు తిరగబడితే పాముకూడా తోక ముడవాల్సిందే అని చాటి చెప్పారు. తాత్కాలిక ఆవేశమే అని భావించి ప్రభుత్వం సైతం ఈ స్పందన చూసి బెదిరిపోయింది. పోలీసుల లాఠీలతో సమస్య పరిష్కారం కాదని భావించింది. ఒక్క అత్యాచారం సంఘటనపై ఇంతగా రెచ్చిపోతారా? దేశంలో 43 నిమిషాలకో అత్యాచారం జరుగుతుంది అని అధికారంలో ఉన్న పెద్దలు అధికారిక లెక్కలు చెప్పారు.

 ఔను అందుకే మేం ఉద్యమిస్తున్నాం ఇంకెన్నాళ్లీ అత్యాచారాలు అని ప్రశ్నించారు. తన కూతురును కిడ్నాప్ చేస్తే దేశానికి ప్రమాదకరంగా పరిణమించిన తీవ్రవాదులను సైతం వదిలిపెట్టారు. మరి సామాన్య మహిళలపై అఘాయిత్యాలు జరిగితే రక్షించాల్సిన బాధ్యత మీపై లేదా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వౌనంగా ఉండే సోనియాగాంధీని అర్ధరాత్రి బయటకు రప్పించారు. హోంమంత్రికి నిద్ర లేకుండా చేశారు. ఢిల్లీలో యువత ఉద్యమాన్ని చూసి మొత్తం దేశం కదిలింది. కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించి మద్దతు ప్రకటించారు. వౌనంగా ప్రదర్శన చేశారు. నల్లగుడ్డలు మూతికి కట్టుకుని ర్యాలీ జరిపారు. ఆసేతు హిమాచలం స్పందించింది. మహిళా స్వాతంత్య్రం కోసం దేశం ఉద్యమించింది. నిజమే 43 నిమిషాలకో అత్యాచారం జరుగుతుంది కాబట్టి దాన్ని ఇకనైనా ఆపమని చెప్పడానికే ఈ ఉద్యమం అని యువత పట్టువదకుండా ఉద్యమించింది. ఆయుధాలు పట్టుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారికి ఎన్‌కౌంటర్‌తో సమాధానం చెబుతారు కానీ ఆడవారికి రక్షణ కల్పించమని, అత్యాచారాలు నిలిచిపోయేట్టు చేయమని విద్యుత్ స్తంభాలను పట్టుకుని నిరసన గళాలు వినిపించే వారిని ప్రభుత్వం ఏమని ఎన్‌కౌంటర్ చేయగలదు. 

ఆయుధ పోరాటంలో ప్రభుత్వానికి ఎన్‌కౌంటర్ రక్షణ కవచం. నిరాయుధీకరణతో యువత జరిపే ఎన్‌కౌంటర్‌కు ప్రభుత్వం సరెండర్ అయి తీరాల్సిందే. మీ విజ్ఞప్తిని పరిశీలించాం, తగు చర్యలు తీసుకుంటాం అని మంత్రిగారు చెప్పే రొటీన్ డైలాగులు వినీ వినీ విసిగిపోయిన దేశమిది. అందుకే నిర్దిష్టమైన హామీ ఇచ్చేంత వరకు, అత్యాచారాల నివారణకు తగు చర్యలు తీసుకునేంత వరకు కదిలేది లేదని యువత పట్టు పట్టింది సాధించుకుంది. అత్యాచారం సంఘటనల్లో కేసులు నమోదయ్యేది 11 శాతమని ఒక సర్వేలో తేలింది. 90 శాతం కేసుల్లో అత్యాచారం చేసేది తెలిసి ఉన్న వారేనట! దేశంలో ప్రతి 34 నిమిషాలకు ఒక రేప్ కేసు నమోదు అవుతోంది. 42 నిమిషాలకు ఒక లైంగిక వేధింపు కేసు నమోదు అవుతోంది. ప్రతి 43 నిమిషాలకు ఒక మహిళను కిడ్నాప్ చేస్తున్నారు. ప్రతి 93 నిమిషాలకు వరకట్నం వేధింపుల్లో ఒక మహిళ సజీవ దహనం అవుతోంది. ఇది ఇంకెంత కాలం ఇక సహించేది లేదని వినిపించిన నిరసన గళమే ఇండియా గేట్ వద్ద జరిగిన ఆందోళన. దీనికి దేశం అండగా నిలిచింది. సమాజాన్ని చైతన్య పరిచిన ఈ ఆందోళన కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఈ ఉద్యమం మళ్లీ మన దేశాన్ని కర్మ భూమిగా మారుస్తుందని ఆశిద్దాం. * 

.................... ఔరత్ బంద్

అమ్మ రాజీనామా- ఈ పేరుతో మనకో తెలుగు సినిమా వచ్చింది గుర్తుందా? ఒక్క రోజు అమ్మ రాజీనామా చేసి పని మానేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతో వచ్చిందే ఆ సినిమా? మరి మహిళలు బంద్ చేస్తే ఎలా ఉంటుంది? వస్త్ర వ్యాపారుల బంద్‌లా ఎవరి సమస్యకు వారు బంద్‌లు జరపడం తెలిసిందే! మరి కేవలం మహిళలు మాత్రమే బంద్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన ఢిల్లీకి చెందిన కొంత మంది మహిళా సామాజిక ఉద్యమ కారులకు వచ్చింది. ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై అమానుషంగా సామూహిక అత్యాచారం సంఘటనకు నిరసనగా దేశ వ్యాప్తంగా యువత నిరసన ఉద్యమాలు చేస్తోంది. ఢిల్లీకి చెందిన నటి, హుమా ఖురైషి, ఢిల్లీకి చెందిన సామాజిక కార్యకర్త నూర్ ఇనాయత్‌లకు వచ్చిన ఆలోచన మహిళా బంద్. వీరి ఆలోచనకు ఇతర ఉద్యమ కారులు మద్దతు పలికారు. డిసెంబర్ 26ను మహిళా బంద్‌గా ప్రకటించారు. ప్రతి ఒక్కరు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్దకు వచ్చి నిరసన గళం వినిపించలేకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు మహిళా బంద్‌లో పాల్గొని సంఘీభావం ప్రకటించవచ్చు. కార్పొరేట్ రంగంలో 45 శాతం వర్క్ ఫోర్స్ మహిళలే. అలాంటి మహిళలు బంద్ పాటించి ఒక చోట చేరి నిరసన వ్యక్తం చేస్తే... ఇంట్లో మహిళలు ఒక రోజు పని మానేస్తే, మాల్స్, ఎక్కడ పని చేసే వారైనా మహిళలు ఒక రోజు పని మానేస్తే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమాజం దృష్టి సారించక తప్పని పరిస్థితి వస్తుంది అందుకే మహిళా బంద్‌కు పిలుపును ఇచ్చినట్టు ఇనాయత్ తెలిపారు. 

ఈ ఆలోచన రాగానే సామాజిక సైట్స్‌లో ఒకరి నుంచి ఒకరికి వెళ్లింది. ఐదువేల మంది మహిళలకు ఈ ఆలోచనలకు మద్దతు ప్రకటించి ఆమోదం తెలిపారు. ఇంత జరుగుతుంటే మేం ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చోలేం. ఏదో ఒక రూపంలో మా గళం వినిపిస్తాం, నిరసన వ్యక్తం చేస్తాం, నిగ్గ తీస్తాం అంటున్నారు మహిళలు. ఢిల్లీలో అనేక రంగాల్లో మహిళల సంఖ్య అధికంగా ఉంది. మహిళా బంద్‌కు అనేక మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి. మహిళా బంద్ వల్ల ప్రభావం ఎక్కువగానే ఉంటుందని ఢిల్లీలో మహిళా డ్రైవర్లతోనే క్యాబ్స్ నడిపే సఖా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలిపింది. పేరు మహిళా బంద్ అయినప్పటికీ ఈ బంద్‌లో ఒక్క మహిళలే కాకుండా పురుషులు సైతం పాల్గొంటే నేను మరింత సంతోషిస్తాను అని న్యూఢిల్లీలోని రామ్‌జా కాలేజీ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇది రాజకీయ బంద్ కాదు సమాజానికి పట్టిన రుగ్మతకు చికిత్స కోసం మహిళలు చేపట్టిన వినూత్న నిరసన. ఈసారి ఢిల్లీకే పరిమితం అయిన మహిళా బంద్ ఇతర ప్రాంతాలకూ వ్యాపించవచ్చు. వ్యాపించాలి కూడా. మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పాటించినట్టుగా డిసెంబర్ 26న అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళలు గళమెత్తే దినంగా మారాలి.

 ................. త్రిసూత్ర పథకం

 అత్యాచారం జరిగిన బాధితులు ఏం చేయాలి? దీనికి తనకు ఎదురైన అనుభవం ఒకటి ఇటీవల తనికెళ్ల భరణి వివరించారు. భరణి ఇంటికి సమీపంలో వాళ్లకు తెలిసిన ఇంటి వాళ్ల చిన్నపాపను చాక్లెట్ ఇప్పిస్తానని ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలిసిన భరణి తీవ్రంగా ఆవేదన చెంది ఏం చేద్దామని తనకు తెలిసిన న్యాయవాది వద్దకు తీసుకు వెళితే, ఆయన చెప్పిన విషయం విని భరణి విస్తుపోయాడు. ఆ న్యాయవాది చెప్పిన దాని ప్రకారం ఎవరిపైనైనా అత్యాచారం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేయాలి. ఇది ఒక మార్గం. బలవంతులు, డబ్బు, పలుకుబడి ఉంటే అత్యాచారం చేసిన రాక్షసుడ్ని కిరాయి హంతకులతో చంపించాలి. మూడు వౌనంగా ఉండిపోవాలి... అంటూ సూచించారు. అంత చిన్నబాలికపై అత్యాచారం జరిగిందని ఆవేదనతో వస్తే ఇదేం పరిష్కారం అనుకున్న భరణి ఇదే విధంగా నీ కూతురుకు జరిగితే ఏం చేస్తావు అని న్యాయవాదిని ప్రశ్నించాడు. అలా జరిగితే మా అమ్మాయిని విదేశాలకు పంపిస్తాను, నాకున్న పలుకుబడి, రాజకీయ పరిచయాలతో వాడ్ని చంపేయిస్తాను కానీ న్యాయస్థానానికి మాత్రం వెళ్లను అని న్యాయవాది చెప్పాడట! ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనపై చానల్స్‌లో జరిగిన చర్చలో ఈ విషయాన్ని స్వయంగా భరణి వివరించారు. అత్యాచారం జరిగిన సంఘటనల్లో ఒక నివేదిక ప్రకారం కేవలం 11 శాతం కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఇలా నమోదయిన కేసుల్లో నిందితులకు శిక్ష పడి బాధితులకు న్యాయం జరిగే కేసులు చాలా స్వల్పంగా ఉంటాయి. అత్యాచారం జరిగిన బాధితురాలిని న్యాయస్థానాల్లో ప్రశ్నలతో పొడిచిపొడిచి చంపేస్తారు. అప్పటికే మానసికంగా చనిపోయి ఉన్న బాధితురాలిని ప్రశ్నలతో మరింతగా చంపేస్తారు. ఆ విషయం తెలుసు కాబట్టి అందుకే ఆ న్యాయవాది అత్యాచారం జరిగినప్పుడు కోర్టుకు మాత్రం వెళ్లను అంటూ మిగిలిన పరిష్కార మార్గాలను చూపించారు. అత్యాచారం వంటి కేసుల విచారణ ఇన్‌కెమెరాలో జరగాలి తప్ప బాధితురాలిని మరింతగా కృంగదీసే విధంగా ఉండకూడదు. ఏ చట్టం అయినా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉండనే ఉంటాయి. అంత మాత్రాన చట్టాలు అవసరం లేదని చెప్పలేం. అలానే అత్యాచారం కేసుల్లో సైతం చట్టాలను దుర్వినియోగం చేసే వారు ఉంటే ఉండవచ్చు. అలా అని అత్యాచారం జరిగిన వారు కేసు పెట్టడానికి బదులు వౌనంగా ఉండడమే మేలు అనుకునేట్టుగా విచారణ ఉండకూడదు.

 ఢిల్లీలో జరిగిన సంఘటన తరువాత మహిళల రక్షణ కోసం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వర్మ కమిటీ వేస్తే వేలాది మంది తమ అభిప్రాయాలను కమిషన్‌కు పంపించారు. కమిషన్ వేసిన మూడు రోజులకే ఆరువేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి. పలు సూచనలు చేశారు. మనకెందుకులే అనుకుంటున్న స్థాయి నుంచి ఇంత తీవ్రంగా స్పందించి సూచనలు పంపపడం సమాజం చైతన్యానికి ప్రతీక. అత్యాచారం కేసుల విచారణలో బాధితులకు ఎదురవుతున్న సమస్యలు, సత్వరం కేసు విచారం కోసం కమిటీ పలు సూచనలు చేస్తుంది.


2, జనవరి 2013, బుధవారం

అర్ధ నారీశ్వర రాజకీయం


 పూర్వం గ్రామాల్లో  పాటలు పాడుతూ అర్ధ నారీశ్వర  రూపాన్ని ప్రదర్శించే వారు .చిన్న గుడ్డ ముక్క అడ్డుగా ఉండేది .ఒక వైపు నుంచి చూస్తే పార్వతిగా , మరో వైపు నుంచి శివునిగా దర్శన మిస్తారు  ... ఒకే వ్యక్తి అప్పటి కప్పుడు రెండు భిన్నమైన రూపాలు ప్రదర్శించడం వింతగా అనిపించేది . ఇప్పుడు గ్రామాల్లో  ఈ కళా కారులు కనిపించడం లేదు . అదే మాట అంటే కనుల ముందే ఈ  కళా కారులు  కళా ప్రదర్శన చేస్తుంటే రాజకీయ నాయకులూ అని తిడుతూ కళను గుర్తించడం లేదు ... చిన్న చూపు చూస్తున్నారు అని కొందరి  విమర్శ 

***
ఒకవైపు నుంచి చూస్తే అందమైన స్ర్తి ప్రతిమలా, మరోవైపు నుంచి చూస్తే పురుషుడిలా కనిపిస్తుంది. సాలార్‌జంగ్ మ్యూ జియంలోని ఈ ప్రతిమ ఎన్నిసార్లు చూసినా అన్ని వయసులవారిని విస్తుపోయేట్టు చేస్తుం ది. అది స్ర్తిమూర్తి ప్రతిమ అని ఒకరు వాదిస్తే, మరొకరు పురుషుని ప్రతిమ అంటారు. ఎవరిది కరెక్టు అంటే ఇద్దరిదీ కరెక్టే అని వాదించవచ్చు, ఇద్దరిదీ తప్పని ఆధారాలు చూపవచ్చు. తెలంగాణపై జరిగిన అఖిలపక్ష సమావేశంలోటిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లు ఈ ప్రతిమనే ఆదర్శంగా తీసుకుని తమ వాదనలు వినిపించాయి  . టిడిపిది సమైక్యవాదం అని టిఆర్‌ఎస్ చెబుతుంటే కానే కాదు తెలంగాణ వాదం అని తెలంగాణ టిడిపి నేతలు చెబుతున్నారు. సీమాంధ్ర టిడిపి నేతలు వౌనంగా ఉంటున్నారు. మా వాదన సీమాంధ్ర నుంచి చూస్తే సమైక్యవాదంలా, తెలంగాణ నుంచి చూస్తే తెలంగాణ వాదంలా, అచ్చం సాలార్‌జంగ్ మ్యూజియంలోని ప్రతిమలానే ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు సంబరపడుతున్నారు. ఆ మ్యూజియంలో దేశ దేశాల చిత్రవిచిత్రమైన వస్తువులు ఎన్నున్నా ఈ ఆడమగ ప్రతిమ ప్రత్యేకత వేరు. ఒక్కోసారి ఇలాంటి విగ్రహాలతో ఒక ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రతిమను అటు స్ర్తిమూర్తుల ప్రతిమల కేటగిరి లేదా పురుష మూర్తుల కేటగిరి ఏదో ఒకదానిలో చేర్చాలంటే ఎటూ తేల్చుకోలేని ఇబ్బంది వస్తుంది. ఆ ప్రతిమ రెండు కేటగిరిల్లోనూ చేర్చకుండా ఇద్దరూ దూరంగా పెట్టే ప్రమాదం లేకపోలేదు.
***

సుభాష్ చంద్రబోస్ మారువేశాల్లో దేశం ఎల్లలు దాటి బ్రిటీష్‌వారిపై సాయుధ పోరాటానికి ఆయుధాలను సమకూర్చుకున్నాడని చదివితే ఒళ్లు గగుర్పాటు కలుగుతుంది. శివాజీ పళ్లబుట్టలో దాచుకుని మారువేశంలో ఎల్లలు దాటి ముస్లిం రాజులను గడగడలాడించారని మరాఠీలు ఇప్పటికీ శివాజీని వీరత్వానికి మారుపేరుగా చెప్పుకుంటారు. ఆయన ఎన్ని యుద్ధాలు చేసినా మారువేషం వేసుకొని ఉండక పోతే అంతటి క్రేజి వచ్చి ఉండేది కాదేమో! 

 పూర్వం మన రాజులు కూడా మంత్రితో కలిసి మారు వేషాల్లో దేశమంతా తిరిగి రాజు గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకునే వారు. ఎందుకలా రాజు నేరుగా వెళ్లి ప్రజలను సమస్యల గురించి అడగొచ్చు కదా? అంటే టీవిల ముందు ఇప్పుడు నాయకులు చచ్చినా నిజం చెప్పరు. మనసులో మాట అస్సలు బయటపడనివ్వరు కదా? అలానే రాజుల పాలనలోనైనా ప్రజలు నేరుగా రాజు కనిపిస్తే వాస్తవాలు ఆయన ముందు చెప్పలేరు కదా? అందుకే మారువేషాల్లో జనంలోకి వెళ్లేవాళ్లన్నమాట!
రాజరికం అయినా ప్రజాస్వామ్యం అయినా జనం ముందుకు అసలు రూపంతో కాకుండా మారువేశాల్లో వెళ్లడమే రాజకీయం. అంతేనా అంత కన్నా ముందు అసలు పురాణాల్లోనే ఈ మారువేషాల వ్యవహారాలు ఎన్ని లేవు. ఇంద్రు డు మారువేషాల్లోనే కదా కోరుకున్న అందగత్తెలను అనుభవించింది. మహామహా పతివ్రతలను సైతం మారువేషాలతో ఆయన చిత్తు చేశాడు. అంతే కాదు ఎంతో మంది రాక్షసులను దేవుళ్లు మారువేషాలతోనే మట్టికరిపించారు. ఈరోజు మనం రాక్షసుల బారిన పడకుండా బతికి బట్టకడుతున్నామంటే మారువేశాల పుణ్యమే కదా? 


క్షీరసాగర మథనంలో అమృతం లభించినప్పుడు అమృతాన్ని రాక్షసులకు కూడా పంచితే అల్లకల్లోలం అయి ఉండేది కదా? మానవుల్లోని రాక్షసులనే భరించలేకపోతున్నాం, ఇక దేవతలనే పీడించిన రాక్షసులు అమృతం తాగి శాశ్వతంగా ఉండి ఉంటే పైకి వెళ్లినా రాక్షస బాధ తప్పేది కాదు. అమృతం పంచేప్పుడు దేవతలకు మాత్రమే అది దక్కేట్టు, రాక్షసులకు చిక్కకుండా చేసేందుకు విష్ణువుకు వచ్చిన ఏకైక ఐడియా మారువేషమే కదా? విష్ణువు అందగత్తెగా వేషం మార్చుకుని అమృతం అంతా దేవుళ్లకే వడ్డించారు. మన నేతలు కూడా అంతే పేదల పెన్నిధిగా వేషం ధరించి పేదలకే అమృతం పంచుతున్నట్టు నటించి తమ అసలు రూపంలో మాత్రం తమ పెద్దలకే అమృతం పంచుకుంటారు. మహామహా రాక్షసులను వధించాలంటే అసలు రూపంలోని శక్తి సరిపోదని తెలిసిన త్రిమూర్తులు ఎన్నోసార్లు మారువేషాలు ధరించాల్సి వచ్చింది. దేవతలే కాదు చివరకు అప్పుడప్పుడు రాక్షసులు సైతం ఇలా వేషాలు మార్చడం ద్వారానే అనుకున్నది సాధించేందుకు ప్రయత్నించారు. సీతను అపహరించడం వర్కవుట్ కావాలంటే సన్యాసి రూపం అవసరం అని రావణుడికి ఐడియా రావడం వల్లనే కదా అపహరణ సాధ్యమైంది. అంత కన్నా ముందు మారువేషం కోసం చిన్న ట్రయల్ వేసి చూశాడు. మారీచుడ్ని మాయాలేడిగా మారువేషంతో పంపిస్తే సీత ఈజీగానే బుట్టలో పడిపోయింది. 

మన నాయకులు కూడా అంతే! తమ అసలు వేషం అంతగా వర్కవుట్ కాదనుకున్నప్పుడు మారువేషాలను ఆశ్రయిస్తారు. చార్లీ చాప్లిన్ గ్లోబ్‌తో ఆడుకున్నట్టు దిగ్రేట్ డిక్టెటర్ సినిమా పోస్టర్‌ను తలపించే విధంగా బిల్‌గేట్స్, బిల్ క్లింటన్ పక్కనుండగా, చిటికెల వేలితో ఐటితో ఆటాడుతున్నట్టు ఉన్న బొమ్మ వర్కవుట్ కాదని తేలాక కల్లు ముంత పట్టుకుని, తాటి చెట్టు ఎక్కుతున్న వేషంలో ప్రజలను అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. శీతాకాలంలో బతుకమ్మ అడుతున్నారు, బోనాలు ఎత్తుతున్నారు, బీడీలు చుడుతున్నారు, గాజులమ్ముతున్నారు. ఎనె్నన్ని వేషాలో? సాధారణంగా బాల్యంలో పిల్లలకు ఇలాంటి వేషాలు వేసి తల్లిదండ్రులు ముచ్చట తీర్చుకుంటారు. కాలం మారింది. ఇప్పుడు మహా మహానేతలు కూడా ఇలాంటి వేశాలు వేసి జనం ముచ్చట తీర్చి తమ కోరిక తీర్చుకోవాలనకుంటున్నారు. 

అజ్ఞాతంలో ఉన్నప్పుడు గద్దర్ కానిస్టేబుళ్లను మంచి చేసుకోవడానికి మాలోని వాడివే మా వాడివే అంటూ ఓ పాట రాసి పోలీసుల మనసు దోచాడు. నక్సలైట్లే మా వాడివి అని ఆడిపాడినప్పుడు ఎంత పోలీసు కఠిన హృదయమైన  కరిగి పోకుండా ఉం టుందా? అలానే ఇప్పుడు నేతలు మీ వాడినే మీలోని వాడినే అంటూ చెప్పులు కుడుతున్నా రు, కుండలు చేస్తున్నారు. నాయక్‌ను నేనే, బాబుఖాన్‌ను నేనే అంటున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? వేషాలకు ఓటర్లు పడతారా? అంటే ఏం చెబుతాం?.. ప్రయత్నిస్తే  కొత్తగా   పోయేదేమీ లేదు ..