28, జూన్ 2015, ఆదివారం

లాంగ్ లివ్ ఎమర్జెన్సీ....ఈ కాలం నేతల నుంచి ఇందిరా గాంధీ తెలుసుకోవలసిన ఓ సంగతి

‘‘అద్వానీ  అలా ఎందుకు మాట్లాడారో?’’
‘‘ఏం మాట్లాడారు. రెండు సీట్లున్న బిజెపిని రథయాత్రలతో అధికార పీఠం వరకు తీసుకు వెళ్లారు. వాజ్‌పాయి తరువాత ప్రధానమంత్రి కావలసిన వారు.’’
‘‘మళ్లీ ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉందని అలా అనవచ్చా?’’
‘‘ప్రస్తుత పరిస్థితి బట్టి ఎమర్జెన్సీ రావచ్చు అని ఆయన అభిప్రాయం. మోదీ పాలన వల్ల రామరాజ్యం వచ్చింది, స్వర్ణయుగం కళ్ల చూడవచ్చు అని ప్రధానమంత్రి అభిమానులు చెప్పుకోవచ్చు. రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు?’’
‘‘సూర్యోదయాన్ని చూస్తూ మళ్లీ సూర్యోదయం కావచ్చు అంటే చిత్రంగా అనిపిస్తుంది కదా?’’
‘‘ అంటే’’


‘‘ నిజంగా అర్ధం కాలేదా? అర్ధం కానట్టు నటిస్తున్నావా? దశాబ్దాల నుంచి ఎమర్జెన్సీలోనే జీవిస్తున్న దేశ ప్రజలు దానికి అలవాటు పడిపోతే, మళ్లీ ఎమర్జెన్సీ రావచ్చు అని అంత పెద్దాయన అంటే విడ్డూరంగా అనిపించింది.’’
‘‘ఎమర్జెన్సీ మహాఘోరాలు తెలిస్తే నువ్విట్లా మాట్లాడవు. ఎమర్జెన్సీ విధించి 40 ఏళ్లవుతున్న సందర్భంగా తెలుగు చానల్స్‌లో ఎమర్జెన్సీ ఆకృత్యాలపై  పాతికేళ్ళు నిండని ఆ పసి కూనలు టీవి మైకులు పట్టుకుని ఆనాటి కరాళ నృత్యాల గురించి  కళ్ళకు కట్టినట్టు ప్రత్యక్ష సాక్షుల్లా  చక్కగా వర్ణిస్తుంటే వయసు మీరిన నువ్విలా మాట్లాడతావేమ్?.. ఆ నల్ల చొక్కా టీవి కుర్రాడిని చూడు వానికి మూడు నెలల్ల నుంచి జీతాలు ఇవ్వలేదు .. గట్టిగా అడిగితే ఉద్యోగం నుంచి పీకె స్తామని వార్నింగ్ ఇచ్చారు .. కానీ 
ఎమర్జెన్సీచీకటి రోజుల ఘోరాల గురించి ఎంత బాగా చెబుతున్నాడో  చూడు ’’

‘‘ ఏంటో ఆ ఘోరాలు చెబితే తెలుసుకుంటాం’’
‘‘ ఎమర్జెన్సీలో పౌరుల హక్కులను కాలరాచారు’’


‘‘అబ్బొ గొప్పపాయింట్ చెప్పావు. ఇప్పుడు పౌరులు తమకు హక్కులు ఉంటాయనే విషయమే మరిచిపోయారు. మీకున్న హక్కులు ఇవి అని పౌరహక్కుల ఉద్యమ కారులెవరైనా చెబితే వాళ్లను మాయం చేస్తున్నారు’’
‘‘బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించేవారు. పెళ్లికాని వారికి కూడా ఆపరేషన్లు చేశారు. ’’
‘‘ఎంసెట్ కోచింగ్ సెంటర్లు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. మంచి ర్యాంకుతో కార్పొరేట్ కాలేజీ హాస్టల్ నుంచి బయటకు వస్తారనుకుంటే శవమై బయటకు వస్తున్నవారు లెక్కలేనంత మంది ఉన్నారు. వారి సంఖ్యతో పోలిస్తే, ఎక్కడో పొరపాటున పెళ్లికాని వారికి జరిగిన ఆపరేషన్లు ఎన్నుంటాయి’’


‘‘మీడియాకు సెన్సార్ విధించారు. పౌరులకు తెలుసుకునే హ క్కు లేదా? ఇంత కన్నా ఘోరం ఇంకేముంటుంది? ’’
‘‘ఆవేశం ఎందుకోయ్.. ఎమర్జెన్సీలో మీడియా స్వేచ్ఛను లాగేసుకున్నారు అంటే అంతకు ముందు స్వేచ్ఛ ఉన్నట్టే కదా? అది కొంత నయం. ఇప్పుడు సామాజిక వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా మీడియాపై సెన్సార్‌షిప్ విధిస్తున్నారు. తమకు నచ్చని చానల్ తమ ప్రాంతంలో ప్రసారం కాకుండా నిషేధం విధిస్తున్నారు. మేనేజ్ చేయడం లేదా నిషేధం ..  స్వయంగా ముఖ్యమంత్రి లాంటి వారు అధికారిక విలేఖరుల సమావేశంలో పలానా పలానా మీడియా మా వర్గం కాదు కాబట్టి మా సమావేశాలకు హాజరు కావద్దు అని హుకూం జారీ చేశారు. ఎమర్జెన్సీలో మొత్తం మీడియాపై సెన్సార్‌షిప్ ఉండేది కానీ ప్రాంతాలు, సామాజిక వర్గాల వారిగా సెన్సార్ షిప్ ఉండేది కాదు కదా?’’


‘‘ ఉద్యమ కారులను రాత్రికి రాత్రి మాయం చేసి హత్య చేసిన సంఘటనలు కేరళలో జరిగాయి. ’’
‘‘ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ప్రతి ఊళ్లో జరుగుతున్నాయి. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించే వారిని పట్టపగలే మాయం చేస్తున్నారు. దీనికి ఎన్‌కౌంటర్ అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు.
‘‘అప్పుడు రాజ్యహింస జరిగింది. రాజ్యమే రౌడీలా మారి చట్టాన్ని చేతిలోకి తీసుకుంది’’


‘‘ఏంటో అలాంటి పెద్ద పెద్ద పదాలకు నాకు అర్ధం తెలియదు కానీ నీ అభిప్రాయం ప్రకారం. కోర్టులు, చట్టాలు విచారణ అలాంటివేమీ లేకుండా లేపేశారంటావా? ’’
‘‘ అవును’’
‘‘ మరిప్పుడు జరుగుతున్నదేమిటి? ఒకే రోజు పోటాపోటీగా ఎర్రచందనం కూలీలు, ఐఎస్‌ఐ తీవ్రవాదులను లేపేయడం మొన్ననే  జరిగింది కదా?  హత్యలు రాజ్యం రాజ్యం ప్రధాన బాధ్యతగా మారింది  ఇలాంటివి దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి .. ’’
‘‘ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అధికారంలో ఉన్నవారి కోసం పని చేశారు’’
‘‘మరీ సిల్లీగా మాట్లాడకు ఒక్క ఎమర్జెన్సీలోనే నా ? అధికారులెప్పుడూ అంతే కదా? అధికారంలో ఉన్న నాయకులు ఎలా చెబితే అలానే కదా నడుచుకునేది’’
‘‘అంటే ఎమర్జెన్సీని సమర్ధిస్తున్నావా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నావా? ’’


‘‘ ఎమర్జెన్సీని నేనెక్కడ సమర్ధించాను. ఎమర్జెన్సీలో జరిగాయని చెబుతున్న ఆకృత్యాలు ఎప్పుడూ జరుగుతున్నవేనని చెబుతున్నాను. ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయని చెబుతున్నాను.   1975, జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు మాత్రమే ఎమర్జెన్సీ అని నువ్వంటున్నావు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించక ముందు, ఎమర్జెన్సీని ఎత్తివేసిన తరువాత, ఇప్పుడూ అది కొనసాగుతూనే ఉందని, ఎమర్జెన్సీ నిరంతర ఉంది అని నేనంటున్నాను’’


‘‘ ఇందిరాగాంధీ తప్పు చేయలేదని చెప్పదలుచుకున్నావా? ’’
‘‘లేదు... లేదు.. తప్పు వల్లనే నాలుగు దశాబ్దాల తరువాత కూడా ఎమర్జెన్సీ ఆకృత్యాలు అని ప్రచారం చేయగలుగుతున్నాం. ’’
‘‘ ఎమర్జెన్సీ చర్యలన్నీ ఒప్పే అన్నట్టు మాట్లాడి, మళ్లీ ఇందిరాగాంధీ ఘోరమైన తప్పు చేసిందంటావు. ఏమిటా తప్పు ?
‘‘మీడియా మేనేజ్‌మెంట్ చేసుకున్నాక ఎమర్జెన్సీ విధించి ఉంటే ఎమర్జెన్సీ విధించినందుకు ఆమెకు జనం నీరాజం పట్టేట్టు మీడియా చూసుకునేది. సెన్సార్‌షిప్ కన్నా మీడియాకు సెజ్‌లు బహూకరిస్తే ఇది సాధ్యం అయ్యేది. మీడియా మేనేజ్‌మెంట్‌లో నాలెడ్జ్ ఉంటే జనాకర్షణ నేత ఎన్టీఆర్‌ను సైతం అనామకుడిగా మార్చేయవచ్చు, అనామకుడిని మహనీయునిగా చిత్రీకరించ్చు. ఓటునోటులో పట్టుపడిన వాని కన్నా పట్టుకున్న వాడిదే నేరం అని సమర్ధవంతంగా వాదించగలగడం అంటే  మీడియా మేనేజ్‌మెంట్ తెలివితేటలు ఉంటేనే కదా? 

ఎమర్జెన్సీ విధించడానికి ముందు మీడియా మేనేజ్‌మెంట్ చేయకపోవడమే ఆ కాలంలో ఇందిరాగాంధీ చేసిన ఘోరమైన తప్పు .. ఇప్పుడు  ఇందిరాగాంధీ ఉండి  ఉంటే ఇప్పటి రాజకీయాలు చూసి ఈ విషయం ఆమె కూడా ఒప్పుకొని తీరుతారు . 
 ఎమర్జెన్సీ అంటే అదేదో మూడు రంగుల పార్టీ కె సొంతం అనుకుంటారు .. కానీ ఎమర్జెన్సీకి వర్ణ బేధాలు ఉండవు . తెలుపు , ఎరుపు , కాషాయ  అనే తేడా ఉండదు.  పచ్చ, గులాబీ , నీలి రంగు అన్నీ ఒకటే సప్తవర్ణాల కలయికే తెలుపు. ఎమర్జెన్సీ, అధికారం రెండూ కవలలు. అధికారం , ఎమర్జెన్సీ కంబైండ్ ప్యాకేజి విడివిడిగా దొరకవు .. 

27, జూన్ 2015, శనివారం

జనాంతికం కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం

జనాంతికం కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం 
పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారానికి ఎంపిక చేసినందుకు ఉపకులపతి ఎల్లూరి శి వారెడ్డి అధ్యక్షతన గల కమిటీకి  ధన్యవాదాలు 



21, జూన్ 2015, ఆదివారం

మీ నేరంతో మీకు సంబంధం లేదు!..ముందస్తు‘‘ నిర్దోషిత్వ ’’ పత్రం

‘‘యురేకా... ’’
‘‘ చిన్నపిల్లాడిలా పాట పాడుతూ ఆ గెంతులేమిటి? ’’
‘‘ నేను పాట పాడానా? ’’
‘‘ హలో ఇక్కడ మేం కూడా చిరంజీవి ఫ్యాన్స్‌మే. చదువుకునే రోజుల్లో కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లిన వాళ్లమే. యూరేకా తస్సమిస్స అంటూ అదేదో పాటే కదా నువ్వు పాడదలుచుకున్నది. ఆ పాట తెలుసు ఆ పాట మీద చిరంజీవి, రాధిక వేసిన స్ట్ఫె్పలూ తెలుసు. థర్టీ ఇయర్ అభిమానులం. తక్కువగా అంచనా వేయకు’’
‘‘ మీరు థర్టీ ఇయర్ ఇండస్ట్రీ అయితే మేం ఇక్కడ 40 ఇయర్ ఇండస్ట్రీ. మొన్న ప్రెస్‌మీట్‌లో కృష్ణ విజయనిర్మల మమ్ములను ఆదరించినట్టే మా అబ్బాయిని , అల్లుడిని ఆదరించారు. అలానే పిన్నత్త కొడుకు, బాబాయ్ పిన్ని కొడుకు, చిన్నత్త పెద్ద కొడుకు త్వరలోనే సినిమాల్లో హీరోగా రానున్నారు వారందరినీ ఆదరించమని చెప్పారు కదా? వాళ్ల బంధువులందరి సినిమాల కోసం , మా బంధువులందరూ ఎదురు చూస్తున్నారు. నాకస్సలు హోమియో వైద్యం మీద నమ్మకం లేదు. కానీ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ మొత్తానికి అన్ని జబ్బులకు చికిత్స చేసింది ఫలానా హోమియో అని టీవిలో చూసి ఏ జబ్బు లేకున్నా ఆ హోమియో డాక్టర్‌ను కలుస్తాను తెలుసా? అభిమానం అంటే ఇది. నాతో పెట్టుకోకు ’’
‘‘చిన్నప్పుడు తల్లి పాలు తాగకపోయినా, పెద్దయ్యాక పిల్లలకు పాలు కొనిచ్చే స్థితి లేకపోయినా హీరోల కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ ఎదిగిన జీవితాలు మనవి. అభిమానం విషయంలో గొడవెందుకు కానీ ఈ వయసులో అలా యూరేకా కస్సమిస్స అంటూ ఎగరొద్దంటున్నాను అంతే.’’
‘‘ శాస్తవ్రేత్తలు ఏదైనా కొత్త విషయం కనిపెడితే యూరేకా అంటూ అరుస్తూ బయటకు వస్తారు కదా? నా యూరేకాకు అర్ధం అది’’
‘‘ అబ్బో అంత గొప్ప విషయం ఏం కనిపెట్టావు?’’
‘‘ ప్రపంచ వైద్య రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టే గొప్ప విషయం కనుగొన్నాను’’
‘‘ ఇక చాలు.. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం. యోగాతో సర్వ రోగాలు మాయం అవుతాయనే నమ్మకం ఈనాటిది కాదు. మోదీ పూర్వీకుల కన్నా ముందు నుంచి ఉన్నదే. తెలంగాణలో తమ పార్టీ భవిష్యత్తు తలుచుకుంటే నిద్ర రాని బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులను తనలానే యో గా చేయాలని పిలిచింది కూడా తెలుసు. ’’
‘‘నా ఆవిష్కరణ కోట్లాది మందికి సంజీవనిలా పని చేస్తుంది. ఏ మల్టీనేషన్ కంపెనీ వాడన్నా కొట్టేస్తాడేమోనని, నా ఆవిష్కరణ మన దేశ పౌరులకే చెందాలని మొదటి నీకు చెబుతున్నాను. ’’
‘‘ఎంసెట్‌లో ట్యాప్ ర్యాంకర్లు అంతా పేదలకు సేవ చేస్తాం అని రొటీన్ డైలాగులు చెబుతారు. చదువయ్యాక విదేశాలకు చెక్కేస్తారు. టెన్త్‌లో చెప్పాల్సిన డైలాగు ఇప్పుడు చెప్పడం ఏమిటి? ’’
‘‘నాది అలాంటిలాంటి పరిశోధన కాదు. వైద్య రంగంలో విప్లవం సృష్టించే పరిశోధన. ఒక్క మాటలో చెప్పాలంటే బుద్ధుడికి బోధి వృక్షం వద్ద జ్ఞానోదయం కావడం ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో, నా జ్ఞానం రోగులను అలా మార్చేస్తుంది.’’
‘‘ ఊరించకు అసలు విషయం చెప్పు’’
‘‘ సమస్యలకు కారణం అన్వేశించడానికి  బుద్ధుడు బయలు దేరినట్టు రోగాలకు కారణం ఏమై ఉంటుందా? అని నేను పరిశోధించాను . రోగరహిత సమాజాని కోసం ఏం చేయాలో తెలుసుకున్నాను .  మనుషుల రోగాలకు, పోలీసు స్టేషన్లు, కోర్టులకు అవినాభావ సంబం ధం ఉందని నా పరిశోధనల్లో తేలింది’’
‘‘ అడ్డదిడ్డంగా మాట్లాడడం కాదు.  నీ పరిశోధన పరీక్షలకు నిలవాలి ... మాట్లాడిన దానికి ఆధారాలు చూపించాలి, నీ పరిశోధన ప్రజలకు ఏ విధంగా ఉపయోగమో నిరూపించాలి’’
‘‘ అక్కడికే వస్తున్నాను. రేవంత్‌రెడ్డిని చూశావా? అచ్చం సినిమా హీరోలా కనిపించేవారా? కాదా? ’’
‘‘కాలేజీ కెళ్ళే స్టూడెంట్‌లా కనిపించే నాయకుడిని పట్టుకుని సినిమా హీరో అంటావేమిటి? హీరో అంటే కనీసం 60 ఏళ్లయినా నిండి ఉండాలి కదా’’
‘‘ అబ్బా రోజులు మారాయి.. నీకన్నా అనుమానాలే.. సరే హీరో కాదు.. చిన్న సినిమా హీరోలా కనిపించేవాడు అంటే అభ్యంతరం లేదు కదా? ’’


‘‘ అలా సరిగా చెప్పు హీరో అంటే 60 ఏళ్ల వయసు చిన్న సినిమా హీరో అంటే 20 ఏళ్ల వయసు’’
‘‘ చిన్న సినిమా హీరోలా గెంతుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపించే రేవంత్‌కు గుండె సమస్య, కీళ్ల సమస్య, నోటి సమస్య అబ్బో లెక్కలేనన్ని సమస్యలు ఒక్కసారే వచ్చిపడ్డాయి .. ఆయనొక్కడే కాదు. పహిల్వాన్‌లా, మఫ్టీలో ఉన్న డిఎస్‌పిలా కనిపించే ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తీవ్రంగా ఆలోచించడం వల్ల హఠాత్తుగా మోకాళ్లలో నొప్పి, వెన్నముకకు తెలియని సమస్యలు ఒకేసారి బయటపడ్డాయి. అచ్చం హీరో అన్న నరేష్‌లా నవ్వు ముఖంతో కనిపించే వేం నరేందర్‌రెడ్డికి  చెప్పుకోలేని , నోరు తిరగని రోగాలు ఎన్నో ఉన్నాయని ఎప్పుడైనా ఊహించావా? ఒక్కసారి అవన్నీ బయటపడ్డాయి. ఇంకా చాలా మంది నాయకులకు ఇలాంటి సమస్యలు బయటపడనున్నాయి.’’


‘‘చాల్లే పెద్ద ఇంతోటి విషయానికి ఏదో అతిగా ఊహించుకుంటున్నావ్. ఒక ఓటు ఐదుకోట్లు కేసులో ఎవరికి నోటీసు వచ్చినా మాయదారి జబ్బులన్నీ బయటకు వస్తాయి. ఏకేసులోనైనా ఇంతే ఇది కామన్. బాలకృష్ణకైతే ఏకంగా మతి స్థిమితం లేదనే విషయం బయటపడింది.అప్పటి వరకు ఆ రోగం గురించి బాలకృష్ణ కు కూడా తెలియదు .  ఇదా నువ్వు పరిశోధన చేసి కనుగొని యూరేకా అని అరిచింది ’’
‘‘ నోటీసు రాగానే రోగాలు బయటపడడం తెలిసిందే. కానీ నా పరిశోధన అది కాదు. కోరికలు లేని లోకం కోసం బుద్ధుడు కలగన్నట్టు అసలు రోగాలు లేని లోకాన్ని నేను కనుగొన్నాను. ’’
‘‘ అదెలా సాధ్యం’’
‘‘ నోటీసు ఇవ్వగానే రోగాలు బయటకు వస్తున్నాయి కదా? మీరు చేయబోయే నేరంతో మీకెలాంటి సంబంధం లేదు. చేసిన నేరం లో 
..చేయబోయే నేరం లో మీరు నిర్దోషులు .  మీరే విచారణకు హాజరు కావలసిన అవసరం లేదు అని అందరికీ ముందస్తు‘‘ నిర్దోషిత్వ ’’ పత్రం అంటే అడ్వాన్స్ క్లీన్ చిట్ ఇవ్వాలి.’’
‘‘ ఇదెలా సాధ్యం’’
‘‘ ఎందుకు సాధ్యం కాదు. అరెస్టయ్యే అవకాశం ఉన్నవారికి ముందస్తు బెయిల్ ఇచ్చినట్టు, అందరికీ మీ నేరంతో మీకు సంబంధం లేదని ముందస్తు క్లీన్ చిట్ ఇస్తే ఇక రోగాలు వచ్చే అవకాశమే  ఉండదు.’’

14, జూన్ 2015, ఆదివారం

జై సెక్షన్ 8 ... సెక్షన్ 8 వర్థిల్లాలి



‘‘చెప్పంగ వినని వారిని చెడంగా చూడాలని అందుకే అన్నారు ’’
‘‘ మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు. మీరెవరికి ఏం చెప్పారు, ఇప్పుడు ఎవరు చెడిపోయారు.?’’
‘‘ ఓసారి టీవి చూడు నీకే తెలుస్తుంది. ’’
‘‘ అత్తా - కోడలు సీరియల్‌లో పంకజాక్షి గురించా? సరిగ్గా నేను కూడా మీలానే అనుకున్నాను. ఎప్పుడు చూసినా చుట్టుపక్కల వారిని ఆడిపోసుకోవడమే ఆమె. సొంతింటి పని తప్ప అందరి ఇళ్లపని అమెకు అవసరం. ఇలాంటి క్యారక్టర్‌లను పుట్టించిన ఆ దర్శడిని అనాలి.’’
‘‘ టీవి సీరియల్‌లో క్యారక్టర్ ఆర్టిస్ట్‌లా అర్ధం పర్థం లేకుండా మాట్లాడకు. నేను చెప్పింది వార్తల గురించి’’
‘‘ హైదరాబాద్‌లో భారీ వర్షాం... నీటిలో తేలియాడుతున్న కార్లు... ఈ వార్తల గురించేనా? ’’
‘‘ వద్దురా బాబూ అంటే విన్నారా? భారీ వర్షాలతో హైదరాబాద్‌లో విధ్వంసం. సెక్షన్ 8ని ముందు నుంచే అమలు చేస్తే ఇలా ఉండేదా? గవర్నర్ చేతిలో అధికారాలు ఉంటే ఒక పద్ధతి ప్రకారం అవసరం ఉన్నప్పుడు వర్షాలు పడేవి. అంతా ఒక పద్ధతిగా ఉండేది. అనుభవించండి’’
‘‘ సెక్షన్ 8కు వర్షాలకు సంబంధం ఏమిటండి’’
‘‘ పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. 24 గంటల న్యూస్ చానల్స్ చూసే నా కన్నా 24 గంటల సీరియల్స్ చూసే నీకే ఎక్కువ తెలుసా? మాట్లాడడానికి కూడా సిగ్గుండాలి. పెళ్లిలో ఒప్పుకున్నదే బోడి 30వేల రూపాయల కట్నం. ఐదు వేల రూపాయలు తరువాత ఇస్తామన్నారు. పెళ్లయి పాతికేళ్లయినా బాకీ తీర్చే తెలివి లేదు కానీ ఓ తెగ మాట్లాడేస్తారు. ’’
‘‘ అప్పుడు ఉద్యోగం కూడా లేని నీకు పిల్లనివ్వడమే గొప్ప ’’
‘‘ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు ఇలా మాట్లాడుకుండా ఉండాలనే సెక్షన్ 8 అమలు చేయాలని మొత్తుకున్నది’’
‘‘ ఏంటి నాన్నా అమ్మను ఊరికే అలా తిడుతూనే ఉంటావు’’
‘‘నువ్వు కూడా నాకు చెప్చొచ్చావా? నువ్వు మూడవ తరగతి చదివేప్పుడు లెక్కల్లో తక్కువ మార్కులు ఎందుకొచ్చాయి. ముందు ఆ సంగతి చెప్పు. అడిగే వాడు లేకపోతే ప్రతోడు మాట్లాడే వాడే. ఏమేవ్ అమ్మాయి మూడవ తరగతి ప్రోగ్రెస్ కార్డు ఓసారి ఇలా తీసుకు రా చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. ’’
‘‘ నాన్నా నీ మాటలు నీకే కానీ ఎదుటి వారు చెప్పేది అస్సలు వినిపించుకోవా? నాకు గుర్తున్నంత వరకు నాకు 90శాతానికి తక్కువ మార్కులు ఎప్పుడూ రాలేదు. కావాలంటే సర్ట్ఫికెట్లు చూడండి’’
‘‘నీ ఇంజనీరింగ్ మార్కుల మెమో చూపించి నన్ను మోసం చేయాలని చూడకు. నేనడిగింది నీ మూడవ తరగతి ప్రొగ్రెస్ కార్డు నువ్వు చూపుతున్నది రెండేళ్లక్రితం పూర్తయిన ఇంజనీరింగ్ మార్కుల లిస్ట్’’
‘‘నిజంగానండి అమ్మాయికి 90 శాతానికి తక్కువ మార్కులు ఎప్పుడూ రాలేదు. మీరు థర్డ్ క్లాస్‌లో మార్కులు తక్కువ వచ్చిందన్నది పదిహేనేళ్లక్రితం మనం దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్నప్పుడు మన పక్కింటి మీనాక్షి వాళ్ల అబ్బాయిదండి. కావాలంటే వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడదాం. ఈ మధ్య మీరు మరీ పిచ్చిగా మాట్లాడుతున్నారు.’’
‘‘అంటే నాకు మన అమ్మాయికి, మీనాక్షి వాళ్ల అబ్బాయికి తేడా తెలియదా? మీరంతా కలిసి కుట్ర పన్నుతున్నారు. సిగ్గుండాలి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి’’
‘‘ మీరు ఇంట్లో ఉన్నప్పుడే మీ మాటలను భరించలేం ఇక మీరు బయటకు వెళ్లాక మీ ఫోన్ ట్యాపింగ్ చేయడమా? మీరీ మధ్య పిచ్చిగా మాట్లాడుతున్నారు. ’’
‘‘ బాస్ సరిగ్గా ఇదే మాట అని చివాట్లు పెట్టాడు. మీరు అదే మాట అంటున్నారు, మీరే కాదు ఇంకా చాలా మంది నా గురించి ఇలానే అంటున్నారు. అంటే మీరంతా నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనడానికి ఇంకేం నిదర్శనం కావాలి. సెక్షన్8 అమలు చేస్తే కానీ మీరంతా దారికి రారు.’’
‘‘ ముందు ఆ న్యూస్ చానల్స్ చూడడం తగ్గించండి. బుర్ర కాస్త చల్లబడి పని చేస్తుంది ’’

***
‘‘డార్లింగ్’’
‘‘ఊ’’
‘‘రాజీ’’
‘‘ఊ’’
‘‘ పిల్ల గాలులు. నిండు పున్నమి వాతావరణం ఎంత రొమాంటిగ్ ఉందో ఆకాశంలోకి ఒకసారి చూడు. నాకైతే మనసు తేలిపోయినట్టుగా ఉంది. పాత సినిమాలో దేవానంద్‌లా నీ కోసం ఓ పాట పాడాలి ఉంది. కృష్ణశాస్ర్తీలా కవిత్వం చెప్పాలని ఉంది. ఉర్దూ రాదు కానీ వచ్చుంటే నీ కోసం ఓ షాయరీ చెప్పాలనిపిస్తోంది మరి నీకు’’
‘‘ పైన చందమామ. ఆకాశంలో మబ్బులు ఎవరి పని వాళ్లు చేసుకుంటుంటే మీరు మాత్రం పడుకున్న వారికి నిద్రా భంగం కలిగించి కవిత్వం చెబుతాను పాట పాడతాను అని హింసిస్తున్నారు. పడక గదిలో విధ్వంసం సృష్టిస్తున్నందుకు సెక్షన్ 8 అమలు చేస్తే తప్ప నీలాంటి వారు దారికి రారు. ’’
‘‘ సర్లే మూడ్ లేదని చెబితే సరిపోతుంది కదా అంత పెద్ద పెద్ద సెక్షన్‌లు ఎందుకులే కానీ హాయిగా నిద్ర పో.. నేను కూడా నిద్ర పోతా? రొమాంటిక్ సినిమాలు చూసి ఆనందించడమే కానీ దేవుడు నా జీవితంలో రొమాంటిక్ రాసిపెట్టలేదనుకుంటా? నిద్ర రావడం లేదు. నేను వెళ్లి హాల్‌లో టివిలో పాత సినిమా చూస్తుంటే నువ్వు హాయిగా పడుకో.. సెక్షన్ 8 లాంటి పెద్ద పెద్ద పదాలు ఉపయోగించి నన్ను భయపెట్టకు’’

***
‘‘మనిద్దరం ఇలా లాంగ్ డ్రైవ్‌కు వచ్చి ఎన్ని రోజులైంది డార్లింగ్ ’’
‘‘ కదిలారంటే కత్తితో పొడిచేస్తా. మీ మెడలో ఉన్న బంగారు నగలు , డబ్బు మర్యాదగా ఇవ్వండి, లేదంటే ప్రాణాలు తీస్తాను’’
‘‘ దొంగా... దొంగా... రక్షించండి’’
‘‘ మీరెంత అరిచినా వృధా. సెక్షన్ 8 అమలులో ఉంది. దొంగతనం మా వృత్తి ... మా విధి నిర్వహణనను అడ్డుకుంటే మీమీద కేసులు పెట్టాల్సి వస్తుంది. ’’
‘‘గొడవ ఎందుకు కానీ ఇదిగో నగదు, నగలు తీసుకో. ఇదిగో దొంగాయన.. ఇంతకూ సెక్షన్ 8 అంటే ఏంటి? ’’
‘‘ మహా మహా నేతలే సెక్షన్ 8తో ఎవరేమైనా చేసుకోవచ్చునంటున్నారు కదా. దీంతో అడ్డంగా వాదించవచ్చునని తెలుసు కానీ, నిజంగా అదేంటో నాకేం తెలుసమ్మా’
జై సెక్షన్ 8 ... సెక్షన్ 8 వర్థిల్లాలి.....
-బుద్దా మురళి 
(జనాంతికం 14-6-2015)

7, జూన్ 2015, ఆదివారం

అవినీతిని రక్షిద్దాం .. ప్రజాస్వామ్యాన్ని బతికిద్దాం

‘‘ ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కాస్త హుందాగా ఉండాలి.’’
‘‘ బాబు గురించా? అంత ఆవేశపడుతున్నావ్?‘‘
‘‘ కాదు కెసిఆర్ గురించి’’
‘‘ ఓటుకు నోటు లాంటి హాట్ టాపిక్ వదిలేసి ఎక్కడికో వెళ్లావు.’’
‘‘ నేను మాట్లాడేది కూడా ఆ సబ్జెక్ట్ గురించే.. ఆదివారం పోలీసులకు సెలవు ఇస్తానని కెసిఆర్ ప్రకటించారా? లేదా? రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే స్టిఫెన్‌సన్‌కు 50లక్షలు ఇస్తుండగా, పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది ఆదివారం రోజే కదా? కెసిఆర్ మాట మీద నిలబడలేదు అనడానికి ఇంత కన్నా ఇంకేం సాక్ష్యం కావాలి. పోలీసులు యూనిఫాం వేసుకోవాలి కానీ వాళ్లు కనీసం యూనిఫారం కూడా వేసుకోలేదంటే పాలనపై కెసిఆర్‌కు పట్టు తప్పిందని తెలియడం లేదా?’’


‘‘అవన్నీ సరే ఇంతకూ రేవంత్‌రెడ్డి అలా డబ్బులివ్వడం ఐదు కోట్లకు బేరం ఆడడం, బాబు పంపితేనే వచ్చానని చెప్పడంపై అభిప్రాయం చెప్పనేలేదు’’
‘‘అవన్నీ రాజకీయాల్లో సాధారణ విషయాలు. మనం మాట్లాడాల్సింది కీలకమైన వౌలిక విషయాల మీద.. ప్రపంచ స్థాయిలో గుర్తింపున్న దేశంలోనే గొప్ప ఇంగ్లీష్ పేపర్ చదివావా? ’’
‘‘లేదు చదవలేదు.. ఏం రాసింది’’
‘‘ఈ కేసులో ఒక బ్రహ్మాండమైన, మహా తప్పు జరిగింది ఆ విషయాన్ని ఈ అంతర్జాతీయ పత్రిక బయటపెట్టింది.’’
‘‘తప్పును మహా తప్పు, బ్రహ్మాండమైన తప్పు అనరు. ఘోరమైన తప్పు అంటారు.’’
‘‘మేమేమనుకోవాలో కూడా మీరే నిర్ణయిస్తారా? మహానాడు, మహాధర్నా, మహా టీవి మేం అంతే దేన్నయినా మహా అంటాం అది మా ఇష్టం ’’
‘‘సరే నీ ఇష్టం కానీ ఇంతకూ ఆ మహా తప్పు ఏంటో చెప్పు’’
‘‘మండలి ఎన్నికలు జరుగుతున్నాయి కదా? ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. ఎమ్మెల్యే డబ్బులతో ఓటు కొనే వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదా? అంటే చివరకు ఎన్నికల కమిషన్‌ను సైతం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? లేక రాజరికం అనుకుంటున్నారా? ఎన్నికల కమిషన్‌ను కూడా పట్టించుకోవడం లేదం టే పరిస్థితి ఎంత వరకు వెళ్లిపోయింది. ఈ మహాతప్పును బయటపెట్టింది అల్లాటప్పా మీడియా కాదు ఇంగ్లీష్ పత్రిక’’


‘‘అంటే రేవంత్‌రెడ్డి స్టీఫెన్‌సన్‌కు 50లక్షలు ఇవ్వబోతున్న విషయం తెలియగానే ప్రభుత్వం ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు తెలిపి, వారి అనుమతి తీసుకొని ఎసిబి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలా? ’’
‘‘అంతే కదా ? మరి ఎన్నికల నియమావళి అంటే ఆషామాషి అనుకుంటున్నావా? ’’
‘‘అంటే ఎసిబి వాళ్లు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తే, ఎన్నికల కమిషన్ రేవంత్‌రెడ్డికి లేఖ రాసి, సరే నన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి అనుమతి ఇస్తున్నాను అని రేవంత్‌రెడ్డి చెబితే అప్పుడు పట్టుకోవాలంటావు? ’’
‘‘ఇక్కడ మళ్లీ నువ్వో మహా తప్పు చేస్తున్నావు. ఎన్నికల కమిషన్ లేఖకు రేవంత్‌రెడ్డి సరే అని చెబితే కుదరదు. లిఖిత పూర్వకంగా అంగీకారం తెలపాలి. వీడియోలో, ఆడియోలో కోర్టులో చెల్లవు ఆ విషయం నీకు తెలియదేమో ’’


‘‘చట్టంపై, ఎన్నికల నియమావళిపై నాకంతగా అవగాహన లేదు కానీ ఇదెలా సాధ్యమవుతుంది. బహిరంగం అయ్యాక రేవంత్ ఎలా డబ్బులిస్తాడు’’
‘‘ అంటే వాళ్ల మాటనే అనుమానిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావ్. క్రమశిక్షణకు మారుపేరు, ఇంటిపేరు నిప్పు తెలుసుకొని మాట్లాడాలి. 50లక్షలు ఇస్తానని చెప్పి వెంటనే ఇచ్చారా? లేదా? రాత్రి 9.30కి మిగిలిన నాలుగున్నర కోట్లు ఇస్తానని మాటిచ్చారు. తొమ్మిది గంటల 31 నిమిషంలో మాట తప్పారు. నాలుగున్న కోట్లు ఇవ్వలేదు అని నిందిస్తే అర్థం చేసుకోవచ్చు, అడ్డుకొని తప్పు చేసినట్టు నిందిస్తే ఎలా? ’’
‘‘ఇంతకూ తప్పెవరిదంటావు?’’
‘‘ ఇంకా సందేహం ఎందుకు సంపద పంపిణీని ఎవరు అడ్డుకున్నారో వారిదే తప్పు, వారితో ఎవరు ఆ పని చేయించారో వారిది తప్పు. ఇంకా ఇందులో భారీ కుంభకోణం దాగుంది. దాన్ని కూడా బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాం. రేవంత్ మాట్లాడింది వీడియో తీశారు కదా? ఆ వీడియో ఏ కంపెనీదో, వీడియోను ఎంతకు కొన్నారో సిబిఐతో విచారణ జరిపిస్తే భారీ కుంభకోణం బయటపడుతుంది.’’
‘‘ఏంటో నీతో మాట్లాడుంటే అవినీతికి పాల్పడడం తప్పా? లేక అవినీతిని బయటపెట్టడం తప్పా అర్ధం కావడం లేదు’’


‘‘నీకేంటి మహా మహా తీర్పులు చెప్పేవాళ్లకే అర్ధం కాక నాట్ బిఫోర్ అంటారు’’
‘‘అది సరే ఇదంతా వాస్తు వల్ల జరిగింది.. ఇలాంటివి బాస్, రేవంత్ ఎన్ని చేయలేదు. ఈ ఒక్కసారి బయటపడడానికి కారణం వాస్తు అంటున్నారు ’’
‘‘ఇందులో అనుమానం ఎందుకు? కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంటి పక్కనే చక్కని వాస్తుతో ఉన్న ఇంటిని మార్చి రేవంత్ పెద్దమ్మ గుడి వద్ద ఇంటికి వెళ్లారు. అక్కడి వాస్తు వల్లనే ఈ సమస్య. నేరం రేవంత్‌ది బాస్‌ది కానే కాదు వాస్తుది.’’
‘‘వాస్తు మనిషి కాదు కదా? చర్య తీసుకోవడానికి’’
‘‘అందుకే కదా ఆలోచిస్తున్నది. పోనీలే అని ఊరుకోవడమే కానీ అందరిపైనా కేసులు పెట్టొచ్చు తెలుసా? ’’
‘‘ఎలా?’’
‘‘ ఒక కానిస్టేబుల్‌ను విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తే సీరియస్ కేసు పెడతారు. బాస్ చెప్పిన పని చేయడం ఒక సుశిక్షితుడైన నేతగా అమలు చేయడం రేవంత్ విధి. రేవంత్ లాంటి ఎమ్మెల్యే విధి నిర్వహణను అడ్డుకున్నందుకు అందరిపైన కేసులు పెట్టవచ్చు. ’’
‘‘అమ్మో’’
‘‘ అమ్మో ఏంటి? తానెంత తప్పు చేశారో అర్ధం కావడం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ మూలస్తంభంతో ఆడుకుంటున్నారు. అవినీతిని నిర్మూలించడం అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేయడమే. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే కనిపించని నాలుగవ స్తంభమే అవినీతి.  ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం లో ప్రజాస్వామ్య కీలక  స్తంభాన్ని కూల్చేస్తే చూస్తూ ఊరుకుంటామా?  మేమేమన్నా లక్ష రూపాయలకే జాతీయ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బిజెపి అనుకున్నారా ? ’’
‘‘ ఏం చేస్తారు? ’’
‘‘ అవినీతిని రక్షిద్దాం .. ప్రజాస్వామ్యాన్ని బతికిద్దాం అనే నినాదం ఇస్తాం . జాతిని కదిలిస్తాం . 

 అవినీతికి మద్దతుగా జాతీయ స్థాయిలో ఉద్యమిస్తాం’’

2, జూన్ 2015, మంగళవారం

ఎగతాళిని ఎదిరించి... ...........నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం





=================
తెలంగాణ తనను తాను పాలించుకోవడం మొదలు పెట్టి ఏడాది గడిచింది. 1948లో హైదరాబాద్ రాష్ట్రం మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయి, ఆంధ్రప్రదేశ్‌లో విలీ నం తరువాత ఆరున్నర దశాబ్దాల తరువాత తనను తాను పాలించుకోవడం మొదలై ఏడాది గడుస్తోంది. ఏడాదిలో ఏం సాధించారు అని ప్రశ్నిస్తే, స్వేచ్ఛగా తనను తాను పాలించుకోవడమే అన్నింటి కన్నా గొప్ప విజయం. ఈ విజయాన్ని తెలంగాణ సొంతం చేసుకుంది. ‘మీకు పాలించడం చేతకాదు, మీకు అన్నం తినడం, చెప్పులు వేసుకోడం మేమే నేర్పించాం’ అంటూ గౌరవనీయ పార్లమెంటు సభ్యుల మాటలను వౌనంగా విన్న తెలంగాణ ఏడాది కాలంలో తలెత్తుకుని నిలిచేలా తనను తాను పాలించుకుంది. అల్లాటప్పా పాలన కాదు... దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో తలెత్తుకుని నిలిచేలా మాకు రాజకీయం తెలుసు, మమ్ములను మేం పాలించుకోవడం తెలుసు అని సగర్వంగా దేశానికి చాటి చెప్పే విధంగా తెలంగాణ తనను తాను పాలించుకుంది.


తొలుత తెలంగాణ వద్దన్నారు, తెలంగాణ ఏర్పడితే చీకటి రోజులు తప్పవని, కరెంటు ఇవ్వలేరు, జీతాలివ్వలేరు, అసలు బతకలేరు, మూడు నెలలు గడిస్తే ఆంధ్రలో కలిపేయండి అని ఉద్యమాలు వస్తాయి అని ప్రకటించిన నాయకులు సిగ్గుపడేలా.. తెలంగాణ కోసం పోరాడిన వారు తలెత్తుకునేలా తెలంగాణ పాలించుకునే సరికి ఇప్పుడు ఈ వెలుగులకు, ఈ సంతోషాలకు మేమే కారణం అని నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నారు.


తెలంగాణ కోట్లాది మందిని ఏకం చేసిన నినాదం. ఒకటిన్నర దశాబ్దాల కాలం నుంచి ఈ నినాదం రాష్ట్ర రాజకీయాలను తన చుట్టూ తిప్పుకుంది. రాజకీయాల్లో ఈ నినాదం ఎంత శక్తివంతమైందో తెలంగాణ ఉద్యమం దేశానికి చాటి చెప్పింది. తెలంగాణ ఒక శక్తివంతమైన నినాదం. తెలంగాణ ఇప్పుడు ఒక శక్తివంతమైన రాష్ట్రం. తెలంగాణ ఎంత శక్తివంతమైన రాష్టమ్రో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన ఏడాది పాలనలో దేశానికి చూపించారు.
1948లో పురుడు పోసుకున్న హైదరాబాద్ రాష్ట్రం తొలి సంవత్సరమే రెవెన్యూ మిగులు రాష్ట్రంగా నిలిచింది. ఆరున్నర దశాబ్దాల తరువాత తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడగానే తొలి సంవత్సరంలోనే మిగులు బడ్జెట్ గల రాష్ట్రంగా నిలిచింది. గుజరాత్ తరువాత రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఒక శక్తివంతమైన నాయకుడు ఉన్నప్పుడే ఆ రాష్ట్రం శక్తి సామర్ధ్యాలు ఏమిటో దేశానికి తెలిసొస్తాయ. కెసిఆర్ లాంటి శక్తివంతమైన నాయకుడి వల్లనే తెలంగాణ శక్తిసామర్ధ్యాలు ఇప్పుడు దేశానికి తెలిసొస్తున్నాయి.


రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే సీజన్‌లో హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భారీ హోర్డింగ్‌లు కనిపించేవి. ఎసిలు వాడకండి.. విద్యుత్ పొదుపు పాటించండి... ప్రభుత్వానికి సహకరించండి అంటూ రకరకాల నినాదాలు కనిపించేవి. రాత్రుళ్లు ఫ్లడ్ లైట్ల కాంతిలో ఈ హోర్డింగ్‌లు వెలిగిపోయేవి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎసిలపై నిషేధం విధించిన కాలం అది. తెలంగాణ ఆవిర్భవించిన వెంటనే కొత్త ప్రభుత్వం సైతం ఈ సమస్యను ఎదుర్కొంది. తెలంగాణ ప్రత్యర్థులు ఎంతో మందికి ఈ పరిస్థితి ఎన్నో ఆశలు రేకెత్తించింది. విద్యుత్ సమస్య ద్వారా తెలంగాణను అదుపులో పెట్టుకోవాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడేట్టు చేయాలని, ఉద్యమించాలని ఎన్నో కలలు కన్నారు. ముందుంది ముసళ్ల పండుగ అంటూ 2015 వేసవి సీజన్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన విద్యుత్ ఇవ్వడానికి సైతం ఆంధ్ర ప్రభుత్వం అంగీకరించలేదు. పిపిఎలను ఏకపక్షంగా రద్దు చేసింది. కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టు ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ కూడా అది ట్రయల్ రన్ మాత్రమే అంటూ తెలంగాణకు వాటా ఇవ్వడానికి నిరాకరించారు. తెలంగాణను విద్యుత్ అంశం ద్వారా అణిచివేసే ఎత్తుగడలన్నీ అమలు చేశారు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు తెలంగాణకు కాలం కలిసి వచ్చింది. పరిస్థితులు అనుకూలించి తెలంగాణ ఏర్పడినట్టుగానే విద్యుత్ అంశంలో కూడా తెలంగాణకు పరిస్థితులు కలిసి వచ్చాయి. దేశంలో 24 గంటల పాటు విద్యుత్ పంపిణీ చేసే రాష్ట్రాల్లో ఆంధ్రను కూడా కేంద్రం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. అలాంటి రాష్ట్రంలో సైతం విద్యుత్ కోతలు విధిస్తుండగా, తెలంగాణలో మాత్రం తెలంగాణ వాదులు సైతం ఊహించని విధంగా వేసవిలోనూ కోతలు లేకుండా విద్యుత్ పంపిణీ చేస్తున్నారు. తెలంగాణను ఇరకాటంలో పెట్టాలనుకున్న విద్యుత్ అంశం ద్వారానే సమర్ధవంతమైన నాయకత్వం ఉంటే తెలంగాణ ఎంత శక్తివంతమైందో కెసిఆర్ నిరూపించారు. 

మీడియాను నమ్ముకున్న వాళ్లు బషీర్‌బాగ్‌లోని విద్యుత్ కాల్పుల్లో అసువులు బాసిన అమర వీరుల స్థూపం వద్ద కూడా ధైర్యంగా తెలంగాణలో మా పాలనలో నిరంతరం విద్యుత్ సరఫరా చేసి తెలంగాణ రైతులను ఆదుకున్నాం అని చెప్పుకోవచ్చు. కానీ ప్రజల జ్ఞాపక శక్తి అంత బలహీనంగా ఏమీ లేదు. ఆనాటి కాల్పులను అంత సులభంగా మరిచిపోరు. అలా మరిచిపోకుండా ఉండేందుకే స్మారక స్థూపాలు నిర్మిస్తారు.
మీరూ వద్దు మీ విద్యుత్ వద్దు అంటూ కెసిఆర్ ప్రకటించడం ప్రత్యర్థులకు దిమ్మతిరిగినట్టు అయింది. కెసిఆర్ అధికారంలోకి రాగానే కొత్తగా విద్యుత్ ఉత్పత్తి అంటూ ఏమీ జరగలేదు. కానీ తెలంగాణ అవసరాలను తీర్చే విధంగా తాత్కాలిక వ్యూహం, దీర్ఘ కాలిక వ్యూహంతో కెసిఆర్ వ్యవహరించారు. తాత్కాలికంగా విద్యుత్ కొనుగోలు చేసినా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని దాదాపు 95వేల కోట్లతో నాలుగేళ్ల వ్యవధిలో విద్యుత్ ఉత్పత్తిలో మిగులు రాష్ట్రంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శక్తి యుక్తులు, వ్యూహాలు, ఎత్తుగడలు ఎలాంటివో 14ఏళ్ల ఉద్యమం నిరూపించింది. పాలకుడిగా కెసిఆర్ సామర్ధ్యాలు ఏడాది కాలంలో బయటపడ్డాయి.


పాఠ్యపుస్తకాల్లోనే కాదు పాలనలో సైతం తెలంగాణ ముద్ర కనిపిస్తోంది. తెలంగాణ వైతాళికులను స్మరించుకుంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత మొదటి నెలలోనే రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు తలెత్తినప్పుడు కెసిఆర్ అభివృద్ధిలో తనతో పోటీ పడాలని చంద్రబాబు సవాల్ చేశారు. మరో ఆరేడు నెలలు గడిచిన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ సంపన్న రాష్ట్రం, ఆర్టీసి ఉద్యోగుల వేతనాలు ఆ రాష్ట్రంలా పెంచలేమని ప్రకటించారు. తనను ఇబ్బంది పెట్టడానికే ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.


మీడియా ప్రచారం ఎలా ఉన్నా ప్రత్యర్థుల రాజకీయ విమర్శలు ఎన్నున్నా ప్రాధాన్యతా అంశాలను ఎంపిక చేసుకోవడంలో కెసిఆర్ వ్యూహాత్మకంగా వెళుతున్నారు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్‌ను జాగ్రత్తగా చూసుకోవలసిన ఆవశ్యకతను బాగా గుర్తించారు. శాంతిభద్రతలు, పరిశుభ్రత, హైదరాబాద్ అభివృద్ధిపై రూపొందించిన ప్రణాళికలు అమలు జరుగుతాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఆరు దశాబ్దాలు పాలించిన ఇరు పార్టీలు ఏడాది పాలించిన పార్టీని ఏం చేశారని నిలదీస్తున్నాయ.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బంగారు తెలంగాణ సాధన కోసం అనేక ప్రణాళికలు ప్రకటించారు. పోరాడి సాధించిన తెలంగాణ యోధునిగా ఈ ప్రణాళికలు అమలు చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంది. మీడియా, విపక్షాల విమర్శలు, అనుమానాలు ఎన్నున్నా ప్రజలకు కెసిఆర్ నాయకత్వంపై విశ్వాసం ఉంది.


కెసిఆర్ ప్రజల నమ్మకానికి ప్రాధాన్యత ఇవ్వాలి, తాను ప్రకటించిన పథకాల అమలుకు నడుం బిగించాలి కానీ రోజూ ఉదయం టీవిల్లో కనిపించే రిటైర్డ్ మేధావుల చర్చకో, మీడియాలో వార్తలకో కాదు. ఈ సామాన్యులు తమ అభిప్రాయం చెప్పడానికి టీవిల్లో కనిపించక పోవచ్చు, కానీ అవకాశం వచ్చినప్పుడు మద్దతు ఇచ్చి చూపిస్తారు. రైట్ సోదరులు విమానాన్ని ఆవిష్కరించే ప్రయోగం గురించి ప్రకటించినప్పుడు ఇది అసాధ్యం, గాలి కన్నా బరువైన యంత్రం గాలిలో ఎగరడం అసాధ్యం అంటూ న్యూయార్క్ టైమ్స్ 1903లో సంపాదకీయం రాసింది. అది ప్రపంచ ప్రఖ్యాత పత్రిక. అంత గొప్ప పత్రిక రాసింది తప్పా ? రైట్ సోదరులది తప్పా? అంటే ఇద్దరిదీ రైటే. న్యూయార్క్ టైమ్స్ సంపాదకుడికి చక్కని భాషా నైపుణ్యం ఉంది. సంపాదకుడిగా అనుభవం ఉంది. సంపాదకీయం రాయడం ఆయన డ్యూటీ. ఆయన తన పని తాను చేశారు. రైట్ సోదరులకు సంపాదకీయం రాయడం రాదు, కానీ తాము చేసే విమాన ప్రయోగంపై పూర్తి విశ్వాసం ఉంది. అందుకే సంపాదకీయం చదివిన తరువాత తమ పరిశోధనను ఆపలేదు. చివరకు విమానాన్ని కనుగొన్నారు. కెసిఆర్‌కు సైతం తన పథకాలపై అంతటి విశ్వాసం ఉంది, ఆయన్ని గెలిపించిన వారికీ ఆ విశ్వాసం ఉంది. కెసిఆర్ తాను ప్రకటించిన పథకాలను కార్యరూపంలోకి తీసుకు రావడంపైనే దృష్టిసారించాలి కానీ విమర్శలపై కాదు.


ఏడాది కాలంలో మిషన్ కాకతీయ, ఇంటింటికి తాగునీరు వంటి అద్భుత పథకాలకు రూపకల్పన చేశారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ప్రకటించిన ప్రణాళికలు అమలు చేయాలి. తెలంగాణలోని పరిశ్రమలన్నీ తరలిపోతాయని, మిగిలిన పరిశ్రమలు విద్యుత్ లేక మూతపడతాయని, 19లక్షల బోర్లు తెలంగాణలోనే ఉన్నాయి కాబట్టి వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వలేరని, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఘోరంగా పడిపోతుందని భయంకరమైన ప్రచారం చేశారు. తాము చేసిన ప్రచారం తప్పని ప్రచారం చేసిన వారే గ్రహించేందుకు ఏడాది కాలం పట్టింది. పరిశ్రమలు తరలిపోయే మాట అటుంచి చివరకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు సైతం ఆంధ్ర రాజధానికి తరలిపోవడానికి ఇష్టపడడం లేదు.
ఇక మాటలు చాలు చేతల్లో చూపిద్దాం అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అంతిమంగా ప్రజలు చూసేది ఏం చెప్పారు? ఏం చేశారు అనే చూస్తారు. ఎవరు ఎంత బాగా తిట్టారు, ఎవరు తిట్టించారు అనేది ప్రజలకు అవసరం లేదు. 


తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణను వ్యతిరేకిస్తూ వచ్చిన వాళ్లు అప్పటి నుంచే చివరకు కెసిఆర్ ఆరోగ్యంపై సైతం ప్రచారం మొదలు పెట్టారు. 14 ఏళ్ల ఉద్యమం ముగిశాక, అధికారంలోకి వచ్చాక తిరిగి అదే ప్రచారం. ఇలా ప్రచారం చేసిన వారు నిరాశా నిస్పృహలతో ఆరోగ్యం పాడు చేసుకుంటే అది వారిష్టం. కెసిఆర్ కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చడంపైనే దృష్టిసారించాలి. తప్పటడుగుల దశ దాటిపోయింది. ఇప్పుడు వేగంగా పరిగెత్తాలి. తన కోసం కాదు తనపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజల కోసం.-- 
  • - బుద్దా మురళి

  • 02/06/2015