‘అతని వద్ద డబ్బులుంటే బ్యాంకులో ఉన్నట్టే అనుమానించాల్సిన అవసరం లేదు.’ ఇలాంటి మాటలు మనం చాలా సార్లు వింటుంటాం. రిటైర్ అయిన వారు తమ పిల్లలను నమ్మడం కన్నా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం మేలు అని భావిస్తారు. చార్మినార్, కృషి వంటి ప్రైవేటు బ్యాంకులు, సహకార బ్యాంకుల సంగతి వేరు కానీ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం అత్యంత నమ్మకంగా భావిస్తారు. నిజమే మన డబ్బుకు బ్యాంకుల్లో పూర్తి భద్రత ఉంటుంది.
ఇది నిజమే కానీ మరో రకంగా ఆలోచిస్తే కొంత కాలానికి బ్యాంకులో మన డబ్బు కరిగిపోతుంది. ఎండలో ఐస్ ఎలా కరిగిపోతుందో బ్యాంకుల్లో అలా మన డబ్బు కరిగిపోతుంది. ఇందులో మోసం లేదు. మాయలేదు. నేరం అసలే లేదు. చట్టబద్ధంగానే మన డబ్బు కరిగిపోతుంది. డబ్బు కరిగిపోతుంది అని చెబితే మోసం చేయాలని ప్రయత్నిస్తున్నాడేమో అనిపించడం సహజం. కానీ నిజంగా కరిగిపోతుంది.
ఉదాహరణకు ప్రస్తుతం బ్యాంకుల్లో డిపాజిట్లకు ఆరు నుంచి ఏడు శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. అంటే మీరు ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే ఏడాదికి లక్షా ఏడువేల రూపాయలు మీకు వస్తాయి. ఏడు వేలు రావడం నిజమే డబ్బు మాయం కావడం నిజమే.
ఏడాదికి ఆరు నుంచి ఏడు వేల రూపాయల వడ్డీ వస్తుంది. అదే సమయంలో ద్రవ్యోల్బణం దాదాపుగా ఎనిమిది శాతంగా ఉంటుంది. అంటే మీరు లక్ష రూపాయలు బ్యాంకులో ఓ రెండేళ్ల పాటు డిపాజిట్ చేశారు. దానికి ఏడు శాతం వడ్డీ అనుకుంటే 14వేల రూపాయల వడ్డీ వస్తుంది. అదే సమయంలో ఎనిమిది శాతం ద్రవ్యోల్బణం అనుకుంటే మీ డబ్బు విలువ రెండేళ్లలో 16వేల రూపాయలు తగ్గుతుంది. అంటే వడ్డీ 14వేలు వస్తే విలువ 16వేలు తగ్గడం అంటే రెండు లక్షలను రెండేళ్లపాటు బ్యాంకులో డిపాజిట్ చేశాక ఆ డబ్బు విలువ రెండేళ్లకు రెండువేల రూపాయల వరకు తగ్గుతుంది. వివిధ వస్తువుల విలువ పెరిగి, రూపాయి విలువ తగ్గడమే ద్రవ్యోల్బణం. అంటే గత ఏడాది 70 రూపాయలకు లీటర్ పెట్రోల్ లభిస్తే ఇప్పుడు 80 రూపాయలు.
మూడవ తరగతి వాడు కూడా చెప్పగలిగే సులభమైన లెక్కనే కానీ ఈ లెక్క అంత ఈజీగా జీర్ణం కాదు. ఈ లెక్కను బుర్రలో జీర్ణం చేసుకున్న వారు ద్రవ్యోల్బణం శాతాన్ని మించి ఆదాయం లభించే వాటిలో పెట్టుబడి పెడతారు.
***
సికిందరాబాద్ సమీపంలోని మల్కాజిగిరి చుట్టుపక్కల 1995 ప్రాంతంలో ప్లాట్లు దాదాపుగా మూడు వందల రూపాయలకు గజంలా దొరికేవి. ప్రభుత్వ టీచర్ ఒకరు రిటైర్ అయ్యారు. పిల్లలకు లెక్కలు చక్కగా బోధించేవారు ఆ టీచర్. ఆ రోజుల్లో జీతం తక్కువే, పెన్షన్ తక్కువే. గ్రాట్యుటీ డబ్బు రెండు లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశారు. నెలకు దాదాపుగా 18వందల వరకు వడ్డీ వచ్చేది. ఆ సమయంలో ఈ రెండు లక్షల్లో నుంచి ఓ ఆరవై వేలతో రెండు వందల గజాల స్థలం కొనడం మంచిది సూచించారు. మన డబ్బుకు 18వందల వడ్డీ వస్తుందని పైకి కనిపిస్తుంది కానీ ద్రవ్యోల్బణం అదే స్థాయిలో ఉందని చెబితే లెక్కల మాస్టారుకు అర్థం కాలేదు. బ్యాంకులో డిపాజిట్ చేసిన ఆ డబ్బు విలువ క్రమంగా కరిగిపోతుందని చెబితే లెక్కల మాస్టారుకు అర్థం కాలేదు.
ఇప్పుడా ప్రాంతంలో గజం స్థలం విలువ 30 వేలకు పైగానే ఉంది. అంటే ఆ రోజు 60వేలతో స్థలం కొంటే ఇప్పుడు అరవై లక్షల రూపాయల విలువైన స్థలం చేతిలో ఉండేది. నెల నెలా వడ్డీ తీసుకుంటూ బ్యాంకులో రెండు లక్షలు అలానే ఉన్నాయి అనుకున్నా ఆ డబ్బుతో ఇప్పుడు ఏడు గజాల స్థలం వస్తుంది. అంటే బ్యాంకులో ఉన్న మన డబ్బు కన్నా భూమి విలువ ఎన్నో రేట్లు పెరిగింది. 1995లో 60వేల రూపాయలను బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే చక్రవడ్డీలెక్కల్లో ఇప్పటికి దాదాపు ఐదు లక్షల రూపాయలు అవుతుంది. అంటే అప్పుడు రెండు వందల గజాల స్థలం వచ్చే డబ్బుతో ఇప్పుడు 20 గజాల స్థలం కూడా రాదు.
దీని అర్థం బ్యాంకులో డిపాజిట్ చేస్తే డబ్బు సురక్షితం కాదు అని చెప్పడం కాదు. బ్యాంకు వడ్డీ కన్నా ఎక్కువ ఆదాయం అందజేసే పెట్టుబడులపై దృష్టిసారించాలి అని చెప్పడమే దీని ఉద్దేశం.
కొందరికి రిటైర్‌మెంట్ తరువాత ఎవరినీ నమ్మలేని పరిస్థితి ఉంటుంది. ఇతరులపై ఆధారపడలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారు ఎక్కువ ఆదాయం కలిగించే పెట్టుబడుల కన్నా తక్కువ ఆదాయం అయినా పరవాలేదు. సురక్షితంగా ఉంటుంది అనుకునే బ్యాంకుల్లో డిపాజిట్ చేయడమే ఉత్తమం. కానీ తమ డబ్బు విలువ పెరగాలి అని కోరుకునే వారు ద్రవ్యోల్బణాన్ని మించిన ఆదాయం ఇచ్చే విధంగా ఇనె్వస్ట్‌మెంట్ చేయాలి.
స్కూల్‌లో టీచర్లు లెక్కల పాఠాలు చెబుతారు. ఆ లెక్కలు అవసరమే బతకడానికి అవసరమైన ఇలాంటి లెక్కలను జీవితం నేర్పిస్తుంటుంది. జీవిత పాఠాలు నేర్పే లెక్కలు ఎంత చిన్న వయసులో నేర్చుకుంటే అంత మంచిది. బ్యాంకులో డిపాజిట్ చేసిన సొమ్ము కరిగిపోవడం ఏమిటి? అనేది అంత ఈజీగా అర్థం కాదు. కానీ అర్థం చేసుకోవాలి. అదే సమయంలో రెండు మూడు నెలల్లో మీ డబ్బును రెట్టింపు చేస్తాం అనే మాయగాళ్ల బారిన పడొద్దు. మంత్రం వేస్తే మీ బంగారు నగలు రెట్టింపు అవుతాయని మోసం చేయడం లాంటిదే రెండు మూడు నెలల్లో మీ డబ్బు రెట్టింపు అవుతుంది అని చెప్పడం.
ద్రవ్యోల్బణాన్ని మించిన ఆదాయం ఎలాంటి ఇనె్వస్ట్‌మెంట్ ద్వారా సాధ్యమో ఎవరికి వారే తమకు అనుకూలమైన మార్గాలను ఎంపిక చేసుకోవాలి. అది ప్లాట్ కావచ్చు, అద్దెలు ఇచ్చే ఇళ్లు కావచ్చు. స్టాక్ మార్కెట్ ఇంకేదైనా కావచ్చు. అవకాశం ఉన్నవారు ద్రవ్యోల్బణాన్ని మించిన ఆదాయం తెచ్చిపెట్టే పెట్టుబడి మార్గాలపై దృష్టిసారించాలి. అవకాశం లేని వారికి సురక్షితంగా ఉండే బ్యాంక్ డిపాజిట్లే ఉత్తమం.
-బి.మురళి (ధనం -మూలం 23-9-2018)