29, డిసెంబర్ 2014, సోమవారం

పెద్ద పీట ఒక భ్రమ- కుర్చీ నిజం.

‘‘బాబాయ్ ఆ ఒక్క కాంట్రాక్టు మనకు దక్కిందంటే మన దశ తిరిగి పోతుంది ’’
‘‘ఏరో నువ్వు కాంట్రాక్టులు కూడా చేస్తావా? ’’
‘‘ఇప్పటి వరకు లేదు బాబాయ్ నీ ఆశీర్వాదం ఉంటే మొదలు పెడతాను ’’
‘‘నీ దుంప తెగ మళ్లీ ననే్న ఇరికించావు. కాంట్రాక్టుల సంగతి నాకు తెలిస్తే టీ కొట్టు దగ్గర కబుర్లు చెబుతూ ఎందుకుంటానురా? ఆ కాంట్రాక్టులేవో నేనే చేసుకుంటూ ఉండేవాడిని కదా? విభజన అనివార్యం అని, కొత్త రాజధాని గుంటూరు- విజయవాడల మధ్య ఉంటుందని అడిగినోడికీ అడగనోడికీ మూడేళ్ల నుంచి చెబుతూ వచ్చాను కానీ ముందస్తుగా అక్కడ ఓ ప్లాట్ కూడా కొనలేదు. ఇప్పుడు కొనాలన్నా జీవిత కాలంలో సంపాదించింది అంతా కలిపినా కొనలేను. అలాంటి నన్నొచ్చి అడుగుతావేంటిరా అబ్బాయ్’’
‘‘జ్ఞానం ఉన్నోడి దగ్గర డబ్బుండదు. డబ్బున్నోడి దగ్గర జ్ఞానం ఉండాలనేమీ లేదు. రోజూ అరడజను పత్రికలు చదివి విభజన ఖాయం, ఎవరు గెలిస్తే కొత్త రాజధాని ఎక్కడో నువ్వు ఊహించావు కానీ కనీసం ఒక్క పేపర్ కూడా చదివే అలవాటు లేని ఎంతో మంది అక్కడ ఎకరాలకు ఎకరాలు కొనేశారు బాబాయ్. భూములు కొనాలంటే కావలసింది జ్ఞానం కాదు డబ్బు. అయినా నేను నీ దగ్గరకొచ్చింది పెట్టుబడి కోసం కాదు బాబాయ్ జ్ఞానం కోసం. రాజకీయాల గురించి తెగ ఉపన్యసిస్తుంటారు కదా? పెద్దలకు చెప్పి నాకో కాంట్రాక్టు ఇప్పించొచ్చు కదా? ’’
‘‘అది సరేరా? చెక్కబల్లలు చేసుకునే నువ్వేం కాంట్రాక్టులు చేస్తావు, నీకెవరిస్తారు? ’’


‘‘ఇప్పుడు పాయింట్‌కొచ్చావు బాబాయ్. ఇంత కాలం ఐడియా లేక ఇలా ఉండిపోయాను కానీ నిన్న ఇంటికి మిర్చి బజ్జీల పొట్లం తీసుకొస్తుంటే అందులో పోయిన నెల వార్త ఒకటి చదివాక నాకో బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది... ఇదిగో నిన్న తెచ్చిన మిర్చీ బజ్జీల పొట్లం పేపర్. ’’
‘‘నూనె మరకలు తప్ప ఏముందిందులో అంత బ్రహ్మాండమైన ఐడియా వచ్చేందుకు? ’’
‘‘అదే బాబాయ్ బిజినెస్ ఆలోచనలున్న నాకు మీకు తేడా. కార్యకర్తలకు పెద్ద పీట..ఈ వార్త ఓసారి చదువు’’
‘‘అబ్బా నా చిన్నప్పటి నుం చి వింటున్నాను ఈ మాట ఇం దులో పెద్ద విశేషం ఏముంది?’’
‘‘అక్కడికే వస్తున్నా... ఆ పార్టీ కార్యకర్తలకు పెద్ద పీట వేయాలని నిర్ణయించుకున్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఆ పార్టీకి 50లక్షల మంది కార్యకర్తలున్నారు. ఉభయ రాష్ట్రాల్లో అన్ని పార్టీలకు ఎంత తక్కువ అంచనా వేసుకున్నా రెండు కోట్ల మంది సభ్యులైనా ఉంటారు కదా? బాబాయ్’’
‘‘ఏమో ఆ సంగతి నాకు తెలియదు కానీ ఉభయ రాష్ట్రాల్లో కుటుంబాల సంఖ్యను మించి పార్టీలకు కార్యకర్తలు ఉంటారంటే నమ్మబుద్ధి కావడం లేదురా? సంఖ్య సంగతి ఎందుకు కానీ ఎంత మంది కార్యకర్తలుంటే నీకేంటి? ’’
‘‘నీకు అన్నీ అనుమానాలే. కావాలంటే ఆన్‌లైన్‌లో అడ్రస్‌లు కూడా చూసుకోవచ్చు. ఇక అక్కడికే వస్తున్నా? నిజమైన కార్యకర్తలకు పెద్దపీట వేయాలని ఈసారి పాలకులు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఇప్పటికీ గతంలో చెప్పిన వాటికి సంబంధం లేదు.కనీసం ఒక్క పార్టీ వారిని మంచి చేసుకున్నా 50లక్షల పీటలు తయారీ కాంట్రాక్టు దక్కుతుంది. ఇక మీలాంటి వారు సహకరిస్తే అన్ని పార్టీలకు మనమే పీటలు పంపించగలిగామంటే రెండు కోట్ల పీటలంటే ఆలోచించుకో బాబాయ్ .. మన పంట పండుతుంది. ఈ దెబ్బతో తరతరాలుగా కూర్చోని తినొచ్చు. ’’
‘‘నిజంగా కార్యకర్తల కోసం పెద్ద పీటలు వేయాల్సి వస్తే ఏ సింగపూర్ కంపెనీకో, జపాన్ కంపెనీకో కాంట్రాక్టు ఇస్తారు కానీ తొట్టెంపూడిలో కర్ర బెంచీలు చేసుకొని బతికే నీకెందుకిస్తారు.? నీకు విషయం అర్ధం కావడం లేదు. పెద్ద పీట అనేది నాయకుల ఊతపదం దాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టున్నావ్. ఎన్నికల ముందు దళితులకు పెద్ద పీట అన్న విషయం గుర్తుం దా? ఒకాయన పెద్ద దళితుడను అవుతాను అంటే మరొకాయన పెద్ద పీట కాదు పెద్ద కుర్చీనే దళితులకు ఇస్తాను అన్నారు. అంతకు ముందు ఒక్కో కుల సమావేశాన్ని నిర్వహించి మీ కులానికే పెద్ద పీట అని మాట ఇచ్చారా? లేదా? ’’
‘‘నేనూ అదే చెబుతున్నాను కదా బాబాయ్. క్యాడర్‌కు, ఇన్ని కులాలకు పెద్ద పీటలు తయారు చేసే కాంట్రాక్టు మనం దక్కించుకుంటే మన దశ తిరిగిపోతుంది. ఇప్పుడంటే మన ఊళ్లో ఎవరూ పీటలు చేయించుకోవడం లేదు కానీ పీటలు తయారీలో మాకున్న అనుభవం మీకు తెలియంది కాదు. పీటలు తయారు చేసేవాళ్లు దొరక్క ఇంత కాలం పెద్దపీటలు వేయలేదేమో? ’’


‘‘నీ దారి నీదే కానీ నీకస్సలు లోకజ్ఞానం లేదురా అబ్బాయ్. ఏదో మాట వరుసకు మీకే పెద్ద పీట అని ఎన్నికల ముందు అలా అంటారు కానీ నిజంగా పెద్ద పీట వేయరు.. ఇదిగో మన టీకొట్టు సాయేబు చాయ్‌పే చర్చ అని మోదీ అనగానే మోదీ ప్రధాని అయితే టీకొట్టు వాళ్లకు పెద్దపీట వేసేస్తారని తెగ సంబరపడ్డాడు. ఏమైంది ఎప్పటిలానే ఈ పాకలో బెంచీల మీద కుర్చున్న వారికి టీ అందిస్తూ వాడి జీవితం ఎప్పటిలానే గడిచిపోతోంది కానీ ఈ బెంచీల నుంచి విముక్తి కలగలేదు, వాడాశించినట్టు పెద్ద పీట దక్కలేదు. ఈరోజుల్లో పీటలెవరు ఉపయోగిస్తున్నారు. పెళ్లిళ్లలో రెండు రెండు మూడు గంటల కోసం పీటలు తప్ప నిజంగా పెద్ద పీటలు ఉండవు.’’
‘‘అంతే నంటావా బాబాయ్’’


‘‘నువ్వంటే ఆమాయకుడివి కాబట్టి పెద్ద పీట అనగానే పీటలు తయారు చేసే కాంట్రాక్టు కోసం ఆలోచించావు. ఇంకో విషయం తెలుసా? నాయకులు ఎన్నికల్లో పెద్ద పీట వేస్తాం అనగానే చదువుకున్న వారు కూడా నిజంగానే పెద్దపీట వేస్తారని కలలు కంటారు. నాయకులు కుర్చీమీద కూర్చోవడానికే పెద్దపీటలనే హామీలు ఉపయోగపడతాయి కానీ నిజానికి ఎవరూ ఎవరికీ పెద్దపీట వేయరు. అంతెందుకురా? కనీసం ఈ టీకొట్టు సాయేబు కూడా మనకు బెంచీనే వేస్తాడు కానీ పెద్ద పీట వేయడు. రాజకీయ నాయకుల కలల్లో కుర్చీ ఉంటుంది కానీ పెద్ద పీట నిజంగా ఉండనే ఉండదు. పెద్ద పీట ఒక భ్రమ- కుర్చీ నిజం.’’

21, డిసెంబర్ 2014, ఆదివారం

గ్రామానికో గాడ్సే విగ్రహం!

అంతరించి పోయిన రాక్షస బల్లులను తిరిగి పుట్టించేందుకు చాలానే ప్రయత్నాలు జరుగుతున్నాయట! జురాసిక్ పార్క్ సినిమా పుణ్యమా అని రాక్షస బల్లులపై జనంలో ప్రేమ బాగానే పెరిగింది. తిరిగి పుడితే బాగానే ఉండనుకునేవారికి కొదవ లేదు. అంతరించి పోయిన జాతులను తిరిగి పుట్టించేంతగా శాస్తవ్రిజ్ఞానం అభివృద్ధి చెందితే పోయినోళ్లను తిరిగి పుట్టించడం కూడా సాధ్యం కావచ్చు. ఇప్పటికే అధిక జనాభాతో ప్రపంచం సతమతమవుతోంది. అప్పుడు చచ్చిన వాళ్లు తిరిగి పుడితే ఇంత జనాభాలో సమస్యలతో బతకలేక ఆ చచ్చిపుట్టినోళ్లు మళ్లీ చచ్చి ఊరుకుంటారు. 

నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని చిన్నప్పుడు స్కూల్స్‌లో పిల్లలను అడగడం ఉపాధ్యాయులకు ఓ అలవాటు. ఏదో పెద్ద అనుకున్నదే అయినట్టు. అలా ప్రశ్నించిన ఉపాధ్యాయులేమైనా పెద్దయ్యాక తాము ఉపాధ్యాయులు కావాలని చదువుకునేప్పుడు ఏమైనా అనుకున్నారా? ఏమిటి? ప్రధానమంత్రిని అవుతాను, ముఖ్యమంత్రిని అవుతాను సేవ చేసేస్తాను అని పిల్లలు ముచ్చటగా చెబుతుంటారు. ఎంసెట్‌లో ర్యాంకర్లు టీవిల ముందు ఎంత చక్కగా చెబుతారో డాక్టర్‌నై పేదలకు సేవ చేస్తాను అని ఎంసెట్ ప్రారంభం అయినప్పటి నుంచి ర్యాంకర్లు చెబుతూనే ఉన్నారు. అలా సేవ చేసేవారు ఎక్కడున్నారా? అంటే ఎంత వెతికినా కనిపించరు. పాకిస్తాన్‌లో కాస్త ఎవరినన్న అడిగితే దావూద్ ఇబ్రహీం ఇల్లు చూపిస్తారేమో కానీ పేదలకు ఉచితంగా సేవ చేసే డాక్టర్లు కనిపించడం కష్టం. కోటి రూపాయల డబ్బుతో సీటు కొనుక్కోని ఐదేళ్లపాటు ఆహోరాత్రులు కష్టపడి చదివే వారి నుంచి పేదలకు సేవ ఆశించడం కూడా ఆత్యాశే.
ఎంసెట్ ర్యాంకర్లు చదువు పూర్తయ్యాక కార్పొరేట్ ఆస్పత్రులు, సొంత ఆస్పత్రిలోనూ కనిపిస్తారు.


ఆ సంగతి వదిలేద్దాం. కాలం మారింది డైనోసార్స్‌ను, చచ్చిన వారిని బతికించే రోజులు వచ్చాక..... నువ్వు ఎవరిని తిరిగి బతికించాలనుకుంటున్నావు? అని టీచర్ ప్రశ్నిస్తే, పిల్లలు చెప్పే సమాధానాలు ఎలా ఉంటా యో?
రావణుడిని తిరిగి బతికించాలని చాలా మంది కోరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రావణుడిని తిరిగి బతికించినా ఈ లోకంలో పాపం ఆ అమాయకుడు బతకలేక చచ్చి ఊరుకుంటాడు. రావణాసురుడు అత్యాచార యత్నం చేశాడు కానీ అత్యాచారం చేయలేదు. అలాంటిది అడుగడుగునా రావణుడి తాతలు విజృంభిస్తుంటే అమాయక రావణుడు వీళ్ల మధ్య బతుకగలడా? బాబోయ్ నేనీ లోకంలో బతకలేను మళ్లీ వచ్చి మళ్లీ చంపేయమని రాముడ్ని వేడుకోకుండా ఉంటాడా?


ఇప్పుడు కనిపించడం లేదు కానీ ఎన్టీఆర్ జయంతి, వర్థంతి రోజున ఆయన కుమారులు మళ్లీ ఎప్పుడు పుడతావు నాన్నా అంటూ ప్రకటనలు ఇచ్చేవాళ్లు. పాపం అల్లుడి చేతిలో మోసపోయిన కుమారులు తండ్రి మళ్లీ పుడితే కానీ తమకు గుర్తింపు లేదని తొందరలోనే గుర్తించారు. ఒకవేళ వాళ్లు అలా కోరినా అల్లుడు వీటోతో వాళ్ల కోరిక అడ్డుకోగలరు.
ఇండియానే ఇందిరా అని బారువా ఎంత మొత్తుకున్నా ప్రపంచంలో చాలా దేశాల్లో ఇండియా అంటే గాంధీజీ పుట్టిన దేశం. ఇండియాను ఇప్పటికే గాంధీజీ దేశంగానే చూసేవాళ్లకు కొదవ లేదు.
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఆయన ప్రపంచానికి అహింస అనే బలమైన ఆయుధాన్ని పరిచయం చేశారు. తమ మీద పోరాడిన నాయకుడు అయినా ఆయన్ని బ్రీటిష్ వారు సైతం గౌరవించారు. ఇప్పటికీ ఆ దేశంలో గాంధీజీ విగ్రహాలు ఉన్నాయి. ఆఫ్రీకా, ఇంగ్లాండ్, అమెరికా లాంటి అనేక దేశాల్లో గాంధీజీ విగ్రహాలున్నాయి. ప్రపంచాన్ని తెరవెనుక నుంచి పాలించే అమెరికా వంటి శక్తివంతమైన దేశ పాలకులు తమ ఉపన్యాసాల్లో గాంధీజీ బోధనలను సగర్వంగా ప్రస్తావిస్తుంటారు. అలాంటి గాంధీజీని చంపిన గాడ్సే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొందరు చాలా బలంగా వాదిస్తున్నారు. గ్రామ గ్రామాన గాడ్సే విగ్రహాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలట! గాంధీజీ సిద్ధాంతాలను మనం మరిచిపోయినా గ్రామ గ్రామాన గాంధీజీ విగ్రహాలు ఉన్నాయి. కొత్తగా విగ్రహాలను ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఈ విగ్రహాలనే రీ మోడల్ చేసి గాడ్సే విగ్రహాలుగా మార్చే ప్రతిపాదన వస్తుందేమో చూడాలి. చనిపోయిన వారిని తిరిగి పుట్టించే రోజులు వచ్చినప్పుడు ఈ భక్తులు తమ మొదటి డిమాండ్‌గా గాడ్సేను తిరిగి పుట్టించాలని కచ్చితంగా అడిగి తీరుతారు. 


అమెరికాలో వాడెవడో బీర్లమీద గాంధీజీ బొమ్మను ముద్రించాడు ఇదేం పోయే కాలం అని ఆ దేశంలోని భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేస్తున్నారు. పాపం అమాయకులు దేశం వీడినా వారిలో ఇంకా గాంధీజీపై అభిమానం వీడలేదు. గాంధీజీ అంటే భారతీయతకు ప్రతీక అని భావిస్తూ తమ దేశానికి అవమానం జరిగిందని ఆందోళన చేస్తున్నారు. పోనీలే అని అమెరికా వాడు ఊరుకుంటున్నట్టుగా ఉంటున్నాడు కానీ దీనిపై న్యాయపోరాటం చేస్తే మన వాళ్లు గాంధీజీ బోధనలతో బలంగా వాదన వినిపిస్తే, ఆ దేశం అడ్వకేట్ ఒక్క ముక్కలో తేల్చి పారేయవచ్చు. పోవయ్యా పో గాంధీజీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఆ గాంధీని చంపిన గాడ్సేనే నిజమైన దేశభక్తుడు అని గౌరవనీయులైన ఎంపి, గాడ్సేకు గ్రామ గ్రామాన విగ్రహాలు విగ్రహాలు కట్టించాలని మీ దేశం వారే డిమాండ్ చేస్తున్నారు అని ఒక్క మాట చెబితే సరిపోతుంది.


ఇది ప్రజాస్వామ్య ప్రపంచం. గొంతున్నవాడు గొంతుతో గొంతు లేని వాడు రాతతో ఏమైనా మాట్లాడవచ్చు. భగవద్గీత హింసను ప్రేరేపిస్తోంది నిషేధించి తీరాల్సిందే అని ఆ మధ్య రష్యాలో కొందరు కోర్టుకు వెళ్లారు. కింది కోర్టు ఔను నిజమే హింసను ప్రేరేపిస్తోంది అని తేల్చి చెప్పింది. పై కోర్టు అంగీకరించక పోవడం వల్ల వారి కోరిక తీరలేదు కానీ లేకపోతే ప్రపంచంలో టెర్రరిజానికి, తాలిబాన్లహింసకు భగవద్గీతే కారణం అని కోర్టు తీర్పు ను సాక్షంగా చూపించి వాదించే వారూ ఉండేవారు. రష్యా కోర్టుకు భగవద్గీతలో హింస కనిపిస్తే అనేక మంది ప్రపంచ మేధావులకు భగవద్గీతలో శాంతి సందేశం కనిపించింది. ఎవరిష్టం వారిది. కానీ ఓ చిన్న కోరిక.

 చనిపోయిన వారు తిరిగి పుట్టే చాన్స్ ఉన్నా ఓ మహనీయులారా! మీరు మాత్రం మళ్లీ పుట్టకండి .

14, డిసెంబర్ 2014, ఆదివారం

శ్మశానాన పడక! పొరుగింటి నిద్ర!

కర్నాటక ఎక్సైజ్ మంత్రి సతీష్ జార్కి హొళి ఒక మంచి ముహూర్తం చూసుకుని బెలగాళి శ్మశాన వాటికలో పదివేల మంది అభిమానులతో కలిసి శ్మశాన నిద్ర చేశారు. కాటికి పోయిన వాడు తిరిగి రాడు అంటారు కానీ నేను వచ్చాను చూడండి అని కాలరెత్తి చూపిస్తున్నాడాయన. ఆ పదివేల మంది ఆక్కడే భోజనం చేసి శ్మశాన వాటికలోనే పడుకున్నారు. ఎందుకయ్యా అలా అంటే నా నిద్ర కోట్లాది మంది ప్రజలకు మేలుకొలుపు, చైతన్యం అంటూ కన్నడంలో ఇలాంటి బోలెడు మాటలు చెప్పుకొచ్చారు. ప్రజల మూఢనమ్మకాల విషయం ఎలా ఉన్నా ఆయనే పెద్ద మూఢనమ్మకంతో ఉన్నాడేమో ననిపిస్తోంది.


శ్మశానంలో ఒక్క రాత్రి నిద్ర పోయి అంతలా ధైర్యవంతునిగా మాట్లాడితే తెలుగు నాట మహనీయులు ఏం మాట్లాడాలి? ఆ మంత్రిగారు అక్కడే తిని, ఆరడుగుల నేలపై మహా అయితే ఐదారు గంటల పాటు పడుకుని ఉంటారు. అదే తెలుగునాట లెక్కలేనంత మంది నాయకులు శ్మశానాలకు చెందిన ఎకరాలు ఎకరాలను స్వాహా చేసి భవంతులను నిర్మించేశారు. ఒక్క రాత్రి తినడం కాదు అక్కడ ఏకంగా స్టార్ హోటల్స్ కట్టించిన వారున్నారు. కర్నాటక మంత్రిని చూశాక ప్రజలను చైతన్య పరచడానికే ఇలా శ్మశానాలను ఆక్రమించేసుకుని భవనాలు కట్టించుకుని నిద్ర పోతున్నామని చెబుతారేమో మన వాళ్లు!


ఒక్క రాత్రి శ్మశానంలో నిద్రతో కర్నాటక మంత్రికి ఆ రాష్ట్ర రాజకీయాల్లో మంచి క్రేజ్ లభించింది. అయితే రాజకీయాల్లో ఈ రాత్రులు కొత్తేమీ కాదు. రాత్రులకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇందులో ద్వంద్వార్థం ఏమీ లేదు. అన్ని వ్యాపారాల్లోలానే రాజకీయాల్లో కూడా పోటీ పెరిగిపోయింది. రిస్క్, పోటీ ఎక్కడ ఎక్కువుంటే అక్కడ ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుందనేది నిజమేననుకోండి. పార్టీలు పెరిగాయి, నాయకులు పెరిగారు. రోజుకు 18 గంటలు ప్రజల కోసం కష్టపడుతున్నామన్నా జనం ఆదరించడం లేదు, పక్కన పెట్టేస్తున్నారు. దాంతో ఇప్పుడు రాత్రి కూడా రాజకీయం కోసమే నిద్ర పోవలసిన పరిస్థితులు వచ్చాయి. తెలుగునాట పల్లె నిద్ర, పట్నం నిద్ర గూడెం నిద్ర అంటూ రకరకాల నిద్రలను ఎన్నికలకు ముందే ఉద్యమ కాలంలో టిఆర్‌ఎస్ నిర్వహించేసింది. అధికారంలోకి వచ్చాక నిద్ర కార్యక్రమాలను పక్కన పెట్టి నిద్ర పోతే అధికారం మరోసారి అంత ఈజీగా చేతికి దక్కదు కదా? ఇప్పుడు ఆస్పత్రి నిద్ర అంటూ కొత్త కార్యక్రమం చేపట్టారు.


ఈ ప్రోగ్రామ్ ఎలా పుట్టిందో తెలియదు కానీ ప్రచారంలో ఉన్న కథ మాత్రం ఆసక్తికరంగానే ఉంది. అధికారంలోకి వచ్చాక మరోసారి అధికారంలోకి రావడానికి నాయకులు నిద్ర పోకుండా కొత్త కార్యక్రమం కోసం నిద్ర లేని రాత్రులు గడుపుతూ తెగ ఆలోచించారు. ఐడియా రాలేదు కానీ ఆనారోగ్యం వచ్చి, ఆస్పత్రి పాలయ్యారు. ఆస్పత్రిలోనూ నిద్ర పోకుండా ఆలోచిస్తూ యూరేకా అని అరిచి అందరి నిద్రను చెడగొట్టారట నాయకులు. ఎందుకలా అరిచాడు అంటే ఆస్పత్రి నిద్ర కార్యక్రమం ఆలోచన రాగానే ఆనందాన్ని పట్టలేక అరిచారట! అక్కడి నుంచే ఆస్పత్రి నిద్ర అని కొత్త కార్యక్రమం ప్రారంభించారు. స్వయంగా వైద్యుడైన ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖను కూడా చూస్తున్న రాజయ్య ఎక్కడ ఆస్పత్రి కనిపిస్తే అక్కడికి బెడ్ తీసుకెళుతూ నిద్ర పోతున్నారు. ఆయన నిద్ర పోని జిల్లా ఆస్పత్రి లేదు. మంత్రిగారూ మీ ఆరోగ్యం జాగ్రత్త మీరిలా ఆస్పత్రి నిద్ర అంటూ జిల్లాలు పట్టుకొని తిరిగితే ఆస్పత్రి పాలవుతారు అని అభిమానులు గోల పెడుతున్నారు. ఇంటి బయట నిద్రలు జీవితంలో భాగం.
పెళ్లయ్యాక మూడు రాత్రులు కొత్త జంటకు జీవితాంతం మిగిలిపోయే మధుర స్మృతి.


కాలం గడిచిన తరువాత కొంత మంది గుట్టు చప్పుడు కాకుండా పొరుగింటి నిద్రపై దృష్టిపెట్టి జీవితాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న నేరాలకు ఇలాంటి నిద్రలే కారణమని పోలీసు వారి లెక్కలు చెబుతున్నాయి. పక్కింటి నిద్ర మీద దేవుళ్లకు సైతం ఆసక్తే. ఏదో పోటీల్లో విజయం సాధించి గౌతముడు అహల్యను చేపడతాడు. పోటీలో ఓడిపోయినంత మాత్రాన మనసు ఊరుకుంటుందా? కోడి రూపం దాల్చి కొక్కరోకో అని అరిస్తే తెల్లారిందని గౌతముడు బయటకు వెళ్లిపోతే ఆ వేషంలో వచ్చిన ఇంద్రుడు పక్కింటి నిద్ర విజయవంతం అయిందనుకుంటుంటే గౌతముడు మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చి రెడ్ హ్యాండెడ్‌గా ఇంద్రున్ని పట్టుకుని చివరకు ఇంట్లో కూడా నిద్ర పోకుండా నీ శరీరం అంతా కళ్లయి పోవాలని శపిస్తాడు. రెండు కళ్లవాళ్లే నిద్ర పట్టక ఆలోచనలతో సతమతమవుతుంటే పాపం ఇంద్రుడి ఒళ్లంతా కళ్లు కావడం వల్ల ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపాడో.
ఇక మన నాయకుల వద్దకు వస్తే దేవెగౌడ నిద్రకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపితే కానీ రాజకీయాల్లో అవకాశం రాదు. అలాంటిది దేవగౌడను ఎకాఎకిన ప్రధానమంత్రి పదవి వరించింది. బహుశా రాజకీయాల్లో అవకాశాల కోసం నిద్రలేని రాత్రులు గడిపి బాగా అలసిపోయాక ఆ పదవి వచ్చినట్టుంది. దాంతో ప్రధానమంత్రి పదవి చేపట్టగానే కుర్చీనే బెడ్‌గా మార్చుకుని నిద్ర పోవడం అలవాటు చేసుకున్నారు. నిద్రకు దూరమై రోజుకు 18 గంటల పాటు కష్టపడుతున్నాను అని చెప్పుకునే చంద్రబాబు లాంటి వారికి నిద్ర ప్రధానమంత్రిని ఎంపిక చేయడం రాజకీయాల్లో ఓ వింత. నిద్ర పోతే అందరూ సమానమే, మేల్కొంటేనే ముఖ్యమంత్రి, సామాన్యుడు అనే తేడా ఉంటుందనే విషయం బాగా తెలిసిన బాబు ఎక్కువ సమయం మేల్కొని ముఖ్యమంత్రిగా మురిసిపోయేవారు. ఈ సీక్రెట్ దేవెగౌడకు చెప్పి ఉంటే పాపం ఆయన నిద్ర పోయేవారు కాదేమో! నిద్రలోనే ఆయన పదవీ కాలం కాస్తా ముగిసిపోయింది. పదవి పోయాక ఆయన మళ్లీ పదవి కోసం కలలు కన్నా ప్రయోజనం లేకుండాపోయింది.


వారం రోజుల పాటు ఇల్లూ వాకిలి వదిలి ఊరి బయట నిద్ర పోవడం కొన్ని గ్రామాల్లో ఆచారం. అలా చేస్తే ఊరికి పట్టిన శని విరగడ అయి అదృష్టం వరిస్తుందనేది వారి నమ్మకం. వారి నమ్మకం నిజమవుతుందో లేదో కానీ ఈ కొత్త కొత్త రాత్రులు మాత్రం రాజకీయ నాయకులకు బాగా కలిసివస్తున్నాయి.

9, డిసెంబర్ 2014, మంగళవారం

రాజకీయ భిక్ష

రాష్ట్రం ఏదైనా కావచ్చు, భాష ఏదైనా కావచ్చు కానీ పార్లమెంటులో అయినా అసెంబ్లీల్లో అయినా వారి వారి భాషల్లో మేం పాండవులం మీరు కౌరవులు అని తిట్టని పార్టీ ఉండదు. చిత్రమేమంటే పాండవులు కౌరవులు ఇద్దరూ ఒకే వంశానికి చెందిన వారు అంటే అధికార పక్షం అయినా విపక్షం అయినా అన్ని పక్షాలు కౌరవ పక్షాలే అనేది నిజం. అత్యంత పురాతనమైన వృత్తుల్లో రాజకీయం- భిక్షక వృత్తి ఒకదానితో ఒకటి పెనవేసుకొని పోయాయి. మాతా కబళం తల్లి అన్నట్టుగా మాతా, పితా ఓట్లు తల్లి ఓట్లు బాబాయ్య అని అడుక్కుంటారు అదే తేడా. రాజకీయ ఎత్తుగడల్లో చిత్తయి అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులు భిక్షకులుగానే జీవించాల్సి వచ్చింది. భిక్షం అంటే ఇప్పటిలా కాదు


మా రోజుల్లో అని పెద్దలు చెప్పినట్టుగా భిక్షకులు చెప్పుకోరు కానీ పూర్వ కాలంలో భిక్షకులు అంటే అల్లాటప్పా కాదు. ఉద్యోగులు బాస్ ముందు గజగజవణికిపోయినట్టుగా భిక్షకుల ముందు ఇంటి యజమాని వణికిపోవలిసిందే. క్షణం ఆలస్యం అయినా బాస్ క్షమించడు అలానే రెండు సార్లు భవతీ భిక్షాందేహి అని పిలిస్తే పరుగు పరుగున రాకపోతే మునులు శపించేస్తారు. కాళ్లా వేళ్లా పడితే శాప విమోచన మార్గం చెబుతారు. ఇలాంటి కథలు చిన్నప్పుడు ఎన్ని చదవలేదు. సీతను అపహరించే ముందు రావణుడు కూడా భిక్షగాడిగానే వచ్చి భవతీ భిక్షాందేహి అంటూ సీత గీత దాటేట్టు చేసి అపహరిస్తాడు. అన్ని వేషాల కన్నా భిక్షక వేషం సేఫ్ అని రావణుడు ఆ కాలంలోనే గ్రహించాడు.


మీవాడు ఏం చేస్తున్నాడు అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం అని ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత గర్వంగా చెబుతారో బహుశా ఆ కాలంలో మా వాడు భిక్షానికి వెళ్లాడు అని గర్వంగా చెప్పుకునే వారేమో! అయినా ఈ రోజుల్లో ఎంత గొప్ప కంపెనీలో పని చేసినా వారికి నచ్చక పోతే అదేదో రంగు కాగితం చేతిలో పెట్టి పంపించేస్తారు కానీ ఆ కాలం నాటి వారిలా శపించేంత సీన్ ఈ కాలం వారికెక్కడుంది?


అప్పుడెప్పుడో అమెరికా అధ్యక్షుడిగా క్లింటన్ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో భిక్షకులు కనిపించకుండా రాత్రికి రాత్రి శివార్లకు తరలించారు. కాలాన్ని బట్టి భిక్షకులు కూడా మారిపోతున్నారు. మాతా కబళం తల్లి అనే మాట పురాణాల కాలం నుంచి వినిపించిన మాటే అయినా గత మూడు నాలుగు దశాబ్దాల నుంచి ఆ మాట వినిపించడం లేదు. భాగ్యనగరంలో సైతం 70-80ల కాలం వరకు ఉదయమే ఇంటింటికి మాతా కబళం బ్యాచ్ వచ్చేది. ఇప్పుడు నగదు రూపంలో తప్ప మరో రూపంలో అంగీకరించడం లేదు. ధర్మం అంతా అన్ని మతాల ప్రార్థనాలయాల వద్ద హోల్‌సేల్‌గా అమ్మేసేట్టుగా కనిపిస్తారు భిక్షకులు. హర్ ఏఖ్ మాల్ 10 రూప్యా అని అరిచినట్టుగా వీళ్లు ఒక్క రూపాయికి ధర్మం అమ్ముతామన్నట్టు అరుస్తుంటారు. ఆలయాలకు వెళితే దైవదర్శనం కన్నా ఈ ధర్మం అమ్మేవారి గోల ఎక్కువ.


ఏవో నాలుగు రాజకీయ ముచ్చట్లు చెప్పకుండా ఆదివారం పూట ఏమిటో అడ్డుక్కునే వారి గోల అంటున్నారా? అక్కడికే వస్తున్నా..
తెలుగు నాట ఈ మధ్య భిక్ష పాపులర్ వర్డ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు రాజకీయ భిక్ష అంటూ మైకులను కొరికేస్తున్నారు.
కెసిఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. దాంతో ఒక్కసారిగా రాజకీయ భిక్ష చరిత్ర తెరపైకి వచ్చేసింది. కెసిఆర్‌కు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెడితే, బాబుకు రాజకీయ భిక్ష పెట్టింది ఇందిరమ్మ కదా? భిక్ష పెట్టిన తల్లిని అల్లుడి పార్టీ వాళ్లు విమర్శించవచ్చునా? అని కొందరు నిలదీస్తున్నారు. రాజకీయాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం భిక్ష అవుతుందా? బీరువాల్లో ఎంత డబ్బునైనా దాచుకోవచ్చు. బీరువా సైజు సరిపోక పోతే స్విస్ బ్యాంకులో దాచుకోవచ్చు. దాచిపెట్టడానికి చోటు లేదని డబ్బును దానం చేసేవాళ్లు ఎవరూ ఉండరు. అదే రాజకీయాల్లో అయితే ఒక నాయకుడు ఒక స్థానం నుంచే ప్రాతినిధ్యం వహించాలి. తానే అన్ని నియోజక వర్గాల నుంచి పోటీ చేసి తానే మెజారిటీ సీట్లలో గెలిచి తానే ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ ఉంటే మన నాయకులు ఆ పనే చేసేవారు. కానీ ప్రజల అదృష్టం కొద్ది రాజకీయాల్లో అలాంటి అవకాశం లేదు. దాంతో ఇష్టం ఉన్నా లేకున్నా, కాళ్లు మొక్కేవాళ్లయినా, కాళ్లు లాగేసే వాళ్లనే అనుమానం ఉన్నా టికెట్లు పంచక తప్పదు. అలా గెలిచిన వారితోనే ప్రభుత్వం ఏర్పడుంది. ఇలాంటి తప్పని సరి తతంగం ఉంది కాబట్టే కులాల వారిగా, ప్రాంతాల వారిగా, మతాల వారిగా టికెట్లు ఇస్తారు. వందలాది సినిమా హాళ్లను ఒకే కుటుంబం లీజుకు తీసుకుని తమ గుప్పిట్లో పెట్టుకున్నట్టు కొన్ని వందల సీట్లు తమ చేతుల్లో పెట్టుకునే చాన్స్ లేదు. అప్పారావో, సుబ్బారావో, కోన్ కిస్కానో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాల్సిందే. కావాలంటే వారిని బానిసలుగా చూసుకోవచ్చు కానీ ముందు ఇతరులకైతే టికెట్లు ఇవ్వక తప్పదు.


ఉమ్మడి రాష్ట్రంలో ఏ పార్టీ అయినా 294 మందిని పోటీకి నిలబెడుతుంది. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టక ముందైనా, పెట్టిన తరువాతైనా పోటీలో ఉండేది 294 మందే. కానీ చిత్రంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాతనే భిక్షం అనేది రాజకీయాల్లో ప్రవేశించినట్టుగా కొందరు ఎన్టీఆర్ ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టారు అంటున్నారు. అలా అనే పార్టీ అధ్యక్షునికి సైతం 78లో ఇందిరాగాంధీ కొత్తగా పెట్టిన ఇందిరా కాంగ్రెస్ పేరుతో భిక్ష పెట్టారనే విషయాన్ని ప్రత్యర్థులు గుర్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ పెట్టిందే భిక్ష కానీ అల్లుడిగారిది భిక్ష కాదు ఆయన సామర్ధ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో ప్రభువులు ఓటర్లే. ప్రభువు భిక్ష పెడతాడు. ఇందిరాగాంధీ , ఎన్టీఆర్, కెసిఆర్, బాబు, వైఎస్‌ఆర్, జగన్ ఎవరైనా కావచ్చు రాజకీయాల్లో వీరికి ఓట్ల భిక్ష వేసి రాజకీయ జీవితం ప్రసాదించేది ఓటర్లే. కాబట్టి ప్రజాస్వామ్యంలో నాయకులకు ఓటర్లు భిక్ష పెడతారు కానీ, అధినాయకులు కాదు.

7, డిసెంబర్ 2014, ఆదివారం

పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావును కటాక్షించని లక్ష్మీదేవి



వృత్తిలో నిబద్ధత ఉన్నవారు మాత్రమే తమ రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మహనీయులు ఎంతో మంది తమ తమ రంగాల్లో పూర్తిగా లీనమై వ్యక్తిగత జీవితాన్ని, డబ్బును పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల అంతిమ కాలంలో అయ్యో పాపం అనుకునే జీవితాన్ని గడిపారు. వృత్తిపై నిబద్ధత ఉండాల్సిందే అదే సమయంలో లక్ష్మీదేవిపై ఎంతో కొంత శ్రద్ధ చూపాల్సిందే. జీవిత కాలమంతా ఆ దేవతను నిర్లక్ష్యం చేస్తే అంతిమ సమయంలో తానేంటో చూపిస్తుంది. తొలి తరంలో హేమాహేమీలైన సినీ ఉద్దండులందరి జీవితాలు ఈ సత్యాన్ని నిరూపిస్తున్నాయి.

మీ ఆలోచనా శక్తి ఆమోఘం కావచ్చు. ఎవరికీ తెలియని లోకాలు ఎలా ఉంటాయో క్షణాల్లో ఆలోచించి ఔను ఇలానే ఉంటాయి అని కోట్లాది మందితో అనిపించే సామర్థ్యం మీకు ఉండొచ్చు. లోకాల గురించి ఆలోచించే వారు డబ్బు గురించి, దాని శక్తి సామర్థ్యాల గురించి సరిగా అంచనా వేయకపోతే నరకం ఎలా ఉంటుందో అది నీకు జీవిత చరమాంకంలో చూపిస్తుంది. డబ్బు గురించి కచ్చితత్వం లేకపోతే చివరి రోజుల్లో నిరాశ తప్పదు అని చాటి చెబుతుంది.

ఆయనకు పౌరాణిక బ్రహ్మ అని పేరు. బ్రహ్మ మనుషులను సృష్టిస్తే ఆయన సినిమా దేవుళ్లను సృష్టించి పౌరాణిక బ్రహ్మగా నీరాజనాలు అందుకున్నారు కమలాకర కామేశ్వరరావు. దేవుళ్లు అంటే వల్లమాలిన భక్తి. లక్ష్మీదేవి కూడా దేవతే. కరెన్సీ రూపంలో కళ్లెదుట కనిపించే ఆ దేవతపై ఆయన ఎప్పుడూ పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే జీవితానికి అండగా నిలిచే ఆ లక్ష్మీదేవి కటాక్షం ఆయనపై లేకపోవడం వల్ల అంతిమ కాలంలో ఆర్థిక ఇబ్బందులతో కన్ను మూశారు. దర్శకత్వం వహించిన సినిమాలకు దర్శకునిగా పారితోషికంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడం, కొందరు నిర్మాతలు దీన్ని అలుసుగా తీసుకోవడాన్ని కొందరు ప్రస్తావించినా పట్టించుకునే వారు కాదు. ఇచ్చినంత తీసుకునే వారు ఇవ్వకపోయినా పట్టించుకునే వారు కాదు. ఈ విషయంలో అంతా ఆయన్ని ధర్మరాజు అనేవారు.

దేవుళ్లు ఇలానే ఉంటారు అని ఆయన చూపించారు. హిందీ సినిమా వాళ్లు సైతం దేవుళ్లకు ఆయన గీసిన డిజైన్‌ను అంగీకరించారు. చివరకు ఇప్పుడెప్పుడైనా ఏ సినిమాలోనైనా దేవుడు కనిపిస్తే కమలాకర కామేశ్వరరావు ముద్ర అందులో తప్పకుండా ఉంటుంది. సినిమా దేవుళ్లపై ఆయన అంత బలమైన ముద్ర వేశారు.
***
ఔను నిజం! కైలాసం ఇలానే ఉంటుంది అని మన చేత అనిపించారు. సకల లోకాలను తన మనోనేత్రంతో చూసి మన కళ్ల ముందు కనిపించేట్టు చేశారు. మూడు లోకాలను మనకు చూపిన ఆయన తనకంటూ ఒక చిన్న ఇంటిని కూడా నిర్మించుకోలేకపోయాడు. అద్దె ఇంటిలోనే కాలం వెళ్లదీశారు పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరావు. తన సినిమాల ద్వారా దేవుళ్లను ప్రజల కళ్ల ముందుకు తెచ్చిన ఆయనపై చివరి రోజుల్లో ఆ దేవుళ్లు కరుణ చూపలేదు. నిర్మాతలకు కనకవర్షం కురిపించిన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన కారు కూడా లేకుండా సామాన్య జీవితమే గడిపారు. చివరకు నిరాశతోనే మద్రాస్ నుంచి మకాం నెల్లూరుకు మార్చి చివరి రోజులు కుమారుడి ఇంట్లో గడిపారు.
***
ఓ పెద్దాయన జీవితంలో ఒక్క సినిమా కూడా తీయలేదు. కానీ నిర్మాతగా ఫిల్మ్‌నగర్‌లో ఆయనకు కోట్ల రూపాయలు విలువ చేసే ఏడు ప్లాట్లు కేటాయించారు. నర్తనశాల, గుండమ్మ కథ లాంటి కలకాలం గుర్తుండే సినిమాలకు దర్శకత్వం వహించిన కమలాకర కామేశ్వరరావు లాంటి వారికి కనులు మూసేనాటికి సొంత ఇల్ల్లు కూడా లేదు.
జీవితం చివరి దశలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక సమస్యలకు తోడు ఒంటరితనం, అయిన వారు దూరం కావడం వంటివి ఆయనను కృంగదీశాయి.
కెవిరెడ్డి, కమలాకర కామేశ్వరరావు మంచి స్నేహితులు. వాహిని సంస్థలో కలిసి పని చేశారు. దర్శకత్వం వహించేందుకు ఎవరికి ముందు అవకాశం వస్తే, వారు రెండవ వారికి సహాయ దర్శకుడిగా అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. అలా కెవిరెడ్డికి మొదట అవకాశం వస్తే కమలాకర కామేశ్వరరావు సహాయ దర్శకునిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. కెవిరెడ్డి దర్శకత్వం వహించిన భక్త పోతన, యోగివేమన, గుణసుందరి కథ, పాతాళభైరవి సినిమాలకు సహాయ సహాయ దర్శకునిగా పని చేశారు. విజయ వారు తీసిన చంద్రహారం సినిమా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన తొలి సినిమా. ఇద్దరూ సినిమాల్లో అవకాశం కోసం నిరీక్షిస్తున్నప్పుడు మద్రాసులో ఇద్దరూ తెగ సినిమాలు చూస్తూ వాటి గురించి చర్చించుకునేవారు.
డ్రీమ్‌గర్ల్ హేమమాలిని సినిమాకు పనికి రాదన్నవారున్నారు. కామేశ్వరరావు మాత్రం ఆమెలోని నటిని గుర్తించి పాండవ వనవాసం (1965)లో నృత్యం చేసే అవకాశం కల్పించారు. ఆ తరువాత ఆమె హిందీ సినిమాల్లో డ్రీమ్‌గర్ల్‌గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనూ కమలాకర కామేశ్వరరావుపై గౌరవంతో శ్రీకృష్ణ విజయం సినిమాలో నాట్యం చేసింది.

చంద్రహారం (54), తమిళంలో గుణసుందరి కథ, పెంకిపెళ్లాం (56), పాండురంగ మహత్యం (57), శోభ (58), రేచుక్క పగటి చుక్క (59), మహాకవి కాళిదాసు (60), గులేబకావళికథ, గుండమ్మకథ (62), మహామంత్రి తిమ్మరుసు (62), నర్తనశాల (63) పాండవ వనవాసం (65) శకుంతల (66) శ్రీకృష్ణ తులాభారం (66), శ్రీకృష్ణావతారం, కాంభోజరాజు కథ (67) వీరాంజనేయ, కలసిన మనుషులు (68) మాయనిమమత (70) శ్రీకృష్ణ విజయం (71) బాల భారతం (72) ఇందులో రెండు మూడు సినిమాలు మినహాయిస్తే మిగిలినవన్నీ సూపర్ హిట్టయ్యాయి. నర్తనశాల అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. జకార్తాలో జరిగిన ఆఫ్రో ఆసియన్ ఫిలిం ఫెస్టివల్‌లో ఎస్‌విఆర్‌కు ఉత్తమ నటునిగా అవార్డు సంపాదించి పెట్టిన సినిమా ఇది. 78నాటి వినాయక విజయం తరువాత కొన్ని సినిమాలకు ఆయన దర్శకత్వం వహించినా అవి నడవలేదు. పౌరాణిక సినిమాలకు ఆయనకు ఉన్న ఇమేజ్‌ను ఉపయోగించుకుందామనే ప్రయత్నమే తప్ప ఆర్థికంగా పెద్దగా ఖర్చు పెట్టే వారు కాకపోవడం వల్ల ఆ తరువాత వచ్చిన సినిమాలు కమలాకర కామేశ్వరరావు పేరును నిలబెట్టే స్థాయిలో లేవు. అదీ కాకుండా క్రమంగా ప్రేక్షకులు పౌరాణిక సినిమాలకు దూరం అవుతున్న కాలం అది. ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ నిర్మిస్తే అదే సమయంలో కృష్ణ కురుక్షేత్రం నిర్మించారు. సాంకేతిక విలువల పరంగా కురుక్షేత్రం బాగున్నా, దానవీరశూరకర్ణ డైలాగుల ముందు నిలువలేకపోయింది.
ఆయన అద్భుతమైన సినిమాలు తీసిన కాలంలో దర్శకుడే సుప్రీం. ఆ స్థానాన్ని హీరో ఆక్రమించడాన్ని చూసి జీర్ణం చేసుకోలేకపోయారు. ఆ తరువాత పౌరాణికాలకు కాలం చెల్లింది, కమలాకర కామేశ్వరరావు కాలం చేశారు.

1911లో బందరులో జన్మించిన కమలాకర కామేశ్వరరావు విద్యాభ్యాసం అక్కడే సాగింది. బిఎ ఉత్తీర్ణులయ్యాక ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా సినిమాలపై ఆసక్తి పెంచుకుని సాంకేతిక అంశాల గురించి అధ్యయనం చేశారు. ముట్నూరు కృష్ణారావు కృష్ణాపత్రికలో సినీఫ్యాన్ పేరుతో సినిమా సమీక్షలు రాసే వారు. ఆ పరిచయాలతోనే సినిమా రంగంలో ప్రవేశించారు.
పౌరాణికాలు మాత్రమే తీయగలరు అనే మాటకు సమాధానంగా గుండమ్మకథను చూపించారు. ఎన్నో విజయవంతమైన పౌరాణికాలు, జానపదాలు, సాంఘిక చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా చరిత్రలో కలకాలం గుర్తుండే సినిమాలను అందించిన ఆయన సొంత ఇళ్లు కూడా సంపాదించుకోలేకపోయారు. 1999 జూన్ ఐదవ తేదీన నెల్లూరులో తన కుమారుడి ఇంట్లో తుది శ్వాస విడిచారు. చివరి కాలంలో మూడు సినిమాలకు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని సినిమాలు తీయాలని ప్రయత్నించారు. ఆ కోరిక తీరకుండానే పోయారు.

1, డిసెంబర్ 2014, సోమవారం

మీరు దేవుడు బాబు గారు !

‘‘నువ్వు ఎన్నయినా చెప్పరా.. ఎన్టీఆర్ మహా దార్శనికుడు ’’
‘‘ఏంట్రోయ్! హఠాత్తుగా ఎన్టీఆర్ గుర్తొచ్చారు.. ఇప్పుడేమీ ఎన్నికలు కూడా లేవు... ఆయన నిజంగా దార్శనికుడే అయి ఉంటే కుర్చీ లాగేస్తున్న విషయాన్ని ముందే గుర్తించే వారు కదరా! దార్శనికుడు అని నీకు ఎందుకనిపించాడో? చెబితే మేమూ వింటాం కదా? ’’
‘‘మా అల్లుడు నా కన్నా గొప్ప నటుడు అని ఎన్టీఆర్ అన్నారా? లేదా? ’’
‘‘అవును.. అన్నారు.. అంటే ? ‘‘అల్లుడిలో గొప్ప నటుడు ఉన్నాడని అన్నారే అనుకో... అల్లుడు ఒక్క సినిమాలో కూడా నటించలేదు కదరా? ’’
అక్కడికే వస్తున్నా ఇదిగో ఈ ఫోటో చూడు...


‘‘పరమశివుడు, వెంకన్న స్వామి, సాయిబాబా, అర్జునుడు భలే ఉన్నాయిరా.. ఈ దేవుళ్ల ఫోటోలు. కొత్త సినిమానా ఏమిటి? అన్నగారు సినిమాల్లో నటించడం మానేశారు. పౌరాణిక సినిమాల శకం ముగిసింది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడే కాదు. రావణ బ్రహ్మ, దుర్యోధనుడు ఏ పాత్రలోనైనా ఇట్టే లీనమయ్యేవారు. దానవీర శూరకర్ణ చూస్తే నాకైతే కచ్చితంగా దుర్యోధనుడు ఇలానే ఉండేవాడు అనిపించింది. కర్ణుడిని అచ్చుగుద్దినట్టు తెరపై దించేశారు అన్నగారు. మళ్లీ ఇన్నాళ్లకు పౌరాణిక సినిమా తీయాలనే సాహసం చేసింది ఎవరురా? ఆ నిర్మాత ఎవరో కానీ పుణ్యత్ముడు ’’
‘‘ఈ ఫోటోలను మరోసారి చూడు.. ఎవరు కనిపిస్తున్నారు.. బాగా తెలిసిన మనిషిలా కనిపించడం లేదూ! ’’


‘‘అవును బాబుగారి లక్షణాలున్నాయి. ఆయన సినిమాల్లో కూడా నటిస్తున్నారా? ’’
‘‘హమ్మయ్య ఇప్పటికి దారిలోకి వచ్చావు. నటించడం కాదురా! జీవించేస్తున్నారు. బాబులా ఉండడం కాదు.. అవి బాబుఫోటోలే... ఆయన అభిమానులు బాబులో దేవుడ్ని చూస్తున్నారు. పోస్టర్లతో ప్రజలకు చూపిస్తున్నారు. అందుకే చెప్పాను బాబులో ఇంత గొప్పనటుడు ఉన్నాడని గుర్తించారు కాబట్టే ఎన్టీఆర్ మహాదార్శనికుడు అన్నాను.’’
‘‘అయినా ఇదేం చోద్యం.. ఎన్టీఆర్ 60 ఏళ్ల వయసులో సినిమా రంగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వస్తే, బాబు 64 ఏళ్ల వయసులో రాజకీయాల నుంచి సినిమాల్లోకి వెళుతున్నారా? ఏమిటి కొంపదీసి. ’’
‘‘అవి సినిమా పోస్టర్లు కావు.. బాబులో దైవం కనిపిస్తున్నారు అందుకే అభిమానులు అలా పోస్టర్లు వేయించారు’’
‘‘ఏ దేవుడి పాత్రలోనైనా ఎన్టీఆర్ ఇట్టే కలిసిపోయేవారు.. ఎంత అల్లుడైనా ఆ దేవుళ్ల పాత్రలు ఈయనకు సరిపోవు. నీకు అభిమానం ఉంటే ఉండొచ్చు. దేవుడు ఎన్టీఆర్‌లా ఉం డేవాడని జనం డిసైడ్ అయ్యారు. నువ్వు మధ్యలో వచ్చి కాదు కాదు దేవుడు ఎన్టీఆర్ అల్లుడిలా ఉండేవారు అంటే ఎవరు ఒప్పుకుంటారు?’’


‘‘సరే ఎవరి అభిప్రాయం వారిది. దేవుడి పాత్రకు బాబు సరిపోరని నువ్వంటున్నావు. ఈయనే దేవుడని ఆయన అభిమానుల నమ్మకం. నీ నమ్మకాన్ని నేను గౌరవిస్తాను, వారి నమ్మకాన్ని నువ్వు గౌరవించాలి. ’’
‘‘నమ్మకాల సంగతి కాదు.. నువ్వు నిజాయితీగా చెప్పు ఆయన దేవుడి పాత్రలకు సరిపోతాడా? ’’
‘‘చూడోయ్ పలనా హీరోగారి కుమారుడు హీరోగా పనికి వస్తాడా? అల్లుడు పనికి వస్తాడా? మాజీ హీరో మనవడు హీరోగా పనికి వస్తాడా? వారి కన్నా బాగా నటించేవారు బయట ఎంత మంది లేరు? అంటే ఏమంటావు? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు అంతే? ’’
‘‘ఇంతకూ నీ అభిప్రాయం ఏమిటి? దేవుడి పాత్రలకు ఆయన సరిపోతాడనా? సరిపోడనా? ’’
‘‘మళ్లీ పాత్రలంటావు? అభిమానులు ఆయనే దేవుడు అంటుంటే’’
‘‘ నువ్వు ఎన్నయినా చెప్పు నేను ఒప్పుకోను’’
‘‘ నీ ఒప్పుకోలు ఎవడికి కావాలి.. ముందే చెప్పాను ఎవరి నమ్మకం వారిదని.. సరే నీ మాట ఎందుకు కాదనాలి నీతోనే చెప్పిస్తాను.. ఆయన సరిపోతాడని’’
‘‘ఎలా? ’’
‘‘వెయ్యి పాత్రల అద్భుత గ్రంథం అని పాశ్చాత్యులు మహాభారతాన్ని మెచ్చుకున్నారు. ఒక్కో పాత్రది ఒక్కో ప్రత్యేకత ’’
‘‘ ఇప్పుడు మహాభారత సంగతి ఎందుకు కానీ ఒప్పిస్తానన్నావు కదా? ’’
‘‘ అక్కడికే వస్తున్నా? అక్కడున్న దేవుళ్ల పోస్టర్‌లో మొదటి దేవుడు ఎవరు? ’’
‘‘ అర్జునుడిగా బాబు’’
‘‘మహాభారతంలో శిఖండిని అడ్డం పెట్టుకుని అర్జునుడు భీష్మ పితామహున్ని కడతేర్చిన దానికి అల్లుడు ఎన్టీఆర్‌ను గద్దె దించిన దానికి పోలిక కనిపించడం లేదా? అలా గద్దె దించినప్పుడు అల్లుడిలో నీకు అర్జునుడు కనిపించడం లేదూ?’’
‘‘ఆ! ’’
‘‘ ఆయనలో ఉన్న ఒక్కో దేవుడి లక్షణాలు చెప్పమంటావా? ’’
‘‘వద్దు... వద్దు... ఇప్పటి వరకు నేను ఆస్తికున్ని.. నన్ను నాస్తికుడిగా మార్చే ప్రయత్నం చేయకు. నువ్వు చెబుతుంటే నాకు భూమిని చాపలా చుట్టిన పురాణ పురుషుడు గుర్తుకొస్తున్నాడు. ’’
‘‘మయుడి పేరు విన్నావా? ’’
‘‘యముడి పేరు వినిపిస్తోంది.’’
‘‘యముడు కాదు మయుడు... సరే నేను చెబుతాను విను. మయుడు ఎగిరే మూడు పట్టణాలను నిర్మించాడు. మయ అనే అద్భుతమైన రాజధానిని నిర్మించుకున్నాడు. ఎన్టీఆర్ పాపులర్ డైలాగు ఏమంటివేమంటివి గుర్తు కొచ్చిందా? ఆ! ఆ మయసభను నిర్మించింది మయుడు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమ కలిగించే అద్భుత ప్రపంచమది. అక్కడే ఎన్టీఆర్ కొలను అనుకుని పడిపోయింది.’’
‘‘ఆగాగు 14 విమానాశ్రయాలు, సింగపూర్ లాంటి నగరం, జపాన్‌లాంటి రాష్ట్రం కళ్ల ముందు చూపిస్తున్న అల్లుడిలో ఇప్పుడు నాకు మయుడు కనిపిస్తున్నాడు.’’


‘‘ఉభయ రాష్ట్రాల్లో రియల్ వ్యాపారులు అభినవ మయుడ్ని తలపిస్తున్నారు. ఏం జరుగుతుందో సామాన్యుడి బతుకు ఏమవుతుందో తెలియదు కానీ ఊహా ప్రపంచాన్ని చూపించేస్తున్నారు. పచ్చని పొలాలు వేగంగా కాంక్రిట్ జంగల్‌గా మారుతున్నట్టు, చెట్లకు కరెన్సీ పంట పండుతున్నట్టు కలలు వస్తున్నాయి. ’’


‘‘మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం కలలు కన మన్నారు. పెద్ద కలలే కనమన్నారు కానీ మరీ ఇంత పెద్ద కలలు కాదేమో ! ’’
‘‘నువ్వెన్నయినా చెప్పు నా అనుమానాలు నావి. పాలకులు బాణాలతో ఆకాశానికి నిచ్చెన వేసిన అర్జునుడిలా మిగిలిపోతే సంతోషం. కాళ్లకు రాసుకున్న లేపనం కరిగిపోయిన తరువాత దారి తెలియక హిమాలయాల్లో అయోమయంగా తిరిగిన ప్రవరాఖ్యుడిలా మిగిలిపోకుండా ఉంటే చాలు.

30, నవంబర్ 2014, ఆదివారం

మాయా బజార్ కెవి రెడ్డిని కాటేసిన పరాజయం

ఆ గొంతు ఒక్కసారి గద్దించిందంటే నాగిరెడ్డి చక్రపాణి లాంటి వారు సైతం వౌనంగా సెట్ నుంచి బయటకు వెళ్లిపోయేవారు. ఎన్టీఆర్ సైతం ఆయన ఉంటే బుద్ధిమంతుడైన విద్యార్థిలా ఉండేవారు. ఒకప్పుడు గర్జించిన ఆ గొంతు మాట్లాడాలా? వద్దా ? అని తటపటాయిస్తోంది. చివరకు మాట్లాడాలనే నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ వద్దకు వెళ్లి తన కుమారుడి విదేశీ చదువు కోసం 40 వేల రూపాయల సహాయం కావాలని అడిగారు. అలా అడిగిన వారు మాయాబజార్ సృష్టించిన కెవి రెడ్డి.


***


శ్రీకృష్ణుడికి ఎన్టీఆర్ మారుపేరు అన్నట్టుగా మారిపోయింది. మరి ఆ ఎన్టీఆర్‌లోని శ్రీకృష్ణున్ని వెలికి తీసింది కెవిరెడ్డినే. ఇద్దరు పెళ్లాలు, సొంత ఊరు ఈ రెండు సినిమాల్లో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించారు. శ్రీకృష్ణుడిగా ఆయన కనిపించగానే జనం ఈలలు వేసి, గోల చేశారు. దాంతో శ్రీకృష్ణునిగా తాను పనికి రాను అని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. మాయాబజారు సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రకు కెవిరెడ్డి ఎన్టీఆర్‌ను ఎంపిక చేస్తే ‘‘గురువు గారూ ఆ పాత్రకు నేను సరిపోను, చేయలేను అని ఎన్టీఆర్ పాత అనుభవాలు గుర్తు తెచ్చుకున్నారు. నీలో శ్రీకృష్ణుడు ఉన్నాడు నేను చూపిస్తాను అని కెవిరెడ్డి భరోసా ఇవ్వడంతో తనపై నమ్మకం కన్నా నటుల ఎంపికలో కెవిరెడ్డికి ఉన్న జడ్జ్‌మెంట్‌కు ఎన్టీఆర్ అంగీకరించారు. ఆ తరువాత ఎన్టీఆర్, శ్రీకృష్ణుడు ఒకరే అన్నట్టుగా మారిపోయింది.
అలాంటి కెవిరెడ్డిపై ఎన్టీఆర్‌కు అపారమైన గౌరవం.


తన కుమారుడి చదువు కోసం గురువు సహాయం అడగడమే మహాద్భాగ్యం అని భావించిన ఎన్టీఆర్ ఆ డబ్బు ఇవ్వడమే కాకుండా, మీరు నాకో సినిమా చేసి పెట్టాలి అన్నారు. ఓటమి దెబ్బలకు తట్టుకోలేక మానసికంగా అలసిపోయిన ఆయన ఆరోగ్యం బాగాలేదు. చేయలేనేమో అన్నారు. గురువు గారూ మీరు అక్కడ కూర్చొని డైరెక్షన్ ఇవ్వండి అంతా మేం చూసుకుంటాం అన్నారు. అలా వచ్చిన కెవిరెడ్డి చివరి చిత్రమే శ్రీకృష్ణ సత్య.
***


కెవి రెడ్డి అంటే కాలేజీ కుర్రాళ్లకు కూడా తెలియకపోవచ్చు. మాయాబజార్ అంటే కానె్వంట్ స్కూల్‌కెళ్లే పిల్లోడికి కూడా తెలుసు.
ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం వచ్చిన సినిమా ఇప్పటి జనాభాలో మూడొంతుల మంది 30 ఏళ్ల యువతేనట. అంటే నేటి యువత తల్లిదండ్రులు కూడా పుట్టక ముందు వచ్చిన సినిమా అది. అయినా నేటి బుడతలకు కూడా ఆ సినిమా గురించి తెలుసు అంటే అదెంత గొప్ప సినిమా అయి ఉంటుంది.


మాయాబజార్‌ను సినిమా అనడం సరికాదేమో! అది సినిమా కాదు ఓ కళాఖండం. తెలుగు సంస్కృతిలో భాగం, తెలుగు సినిమా చరిత్ర. తెలుగు దేవుళ్ల ప్రొఫైల్ పిక్చర్ అది. ఆ కళాఖండానికి ఊపిరి పోసింది కెవి రెడ్డి. కదిరి వెంకటరెడ్డి. పాతాళాభైరవి, మాయాబజార్ ఈ రెండు సినిమాలను మినహాయిస్తే తెలుగు సినిమా చరిత్ర అసంపూర్ణం. ఈ రెండు సినిమాలు కెవి రెడ్డి దర్శకత్వం వహించినవే.


పదవ తరగతి పాఠ్యపుస్తకంలో మాయాబజారు సినిమా గురించి ఒక పాఠాన్ని చేర్చారు. బహుశా మరే సినిమాకు ఇంతటి కీర్తి దక్కి ఉండదు. సినిమా ఎలా తీయాలో బోధించేందుకు అనేక జాతీయ అంతర్జాతీయ సినిమా ఇన్‌స్టిట్యూట్‌లో మాయాబజారు చూపడం తెలిసిందే. కానీ రేపటి పౌరులను తీర్చిదిద్దడం కోసం రాసే పాఠ్యపుస్తకాల్లో కెవిరెడ్డి సినిమా ఉంది అంటే అది సినిమా కాదు సినిమా కన్నా ఇంకా చాలా ఎక్కువ అని అర్థమవుతూనే ఉంది. కెవిరెడ్డి సినిమాలు సినిమా పరిశ్రమకు పాఠాలు అయితే ఆయన నిజ జీవితం సైతం నేటి తరానికి ఎన్నో పాఠాలు చెబుతుంది.
ఓటమికి కృంగిపోవలసిన అవసరం లేదు... ఓటమి తెలియని విజయం ఓటమి కన్నా ప్రమాదకరం అని కెవిరెడ్డి జీవితం నేర్పిస్తుంది.
రాజబాబును పరిచయం చేసింది, అతనిలో మంచి నటుడు ఉన్నాడని గుర్తించింది కెవిరెడ్డినే. వాణిశ్రీని సైతం ... ఎంతో మందిలో నటున్ని గుర్తించిన ఆయన ఓటమి తరువాత తెలిసిన వారే ఎలా వ్యవహరిస్తారో అనుభవంలోకి వచ్చేంత వరకు గుర్తించ లేకపోయారు.


***
వరుస విజయాలకు అలవాటు పడితే పరాజయాన్ని తట్టుకోలేరు కృంగిపోతారు. విజయాలు, పరాజయాలకు అలవాటు పడి ఉంటే పరాజయాలకు కృంగిపోయి ఉండేవారు కాదేమో!
కెవి రెడ్డి అని పిలువబడే కదిరి వెంకటరెడ్డి తీసింది 18 సినిమాలుః అందులో 15 సూపర్ హిట్టు. అంటే ఈరోజుల్లో జరుగుతున్న ప్రచార హిట్టు సినిమాలు కాదు. ఆరు దశాబ్దాల తరువాత విడుదలైనా విజయం సాధించే మాయాబజారు, పాతాళాభైరవి, జగదేక వీరుని కథ లాంటి సూపర్ హిట్లు. విజయసంస్థకు ఎన్నో హిట్లు అందించిన కెవిరెడ్డి చివరి మూడు సినిమాలు సరిగా నడవలేదు. విజయవారి ఉమాచండీగౌరీ శంకరుల కథ సినిమా ఫ్ల్లాప్. అప్పటి వరకు విజయ సంస్థలో మహారాజులా చూసిన కెవిరెడ్డిని పక్కన పెట్టారు. కెవిరెడ్డికి ఇచ్చిన కారును సైతం తీసేసుకున్నారు.
ఈ అనుభవాన్ని ఆయన ఊహించలేకపోయారు. ఉమా చండీ గౌరీ శంకరుల కథ పరాజయాన్ని విజయ సంస్థ తట్టుకోలేకపోయింది. ఆ పరాజయాన్ని కెవిరెడ్డి కూడా తట్టుకోలేకపోయారు. అయితే పరాజయం మనుషుల్లో ఇంత మార్పు తీసుకువస్తుందని ఆయన ఊహించలేకపోయారు. ఆ సృజనశీలిని ఈ మార్పు తీవ్రంగా కలిచివేసింది.


వరుసగా మూడు సినిమాలు పరాజయం పాలు కావడంతో ఆ దర్శకుడు మానసికంగా సంఘర్షణ తీవ్రంగా ఉంది. తానిక సినిమాలకు పనికిరానా? అని మదనపడ్డారు. అద్భుత విజయాలతోనే జీవితాన్ని ప్రారంభించడమే పెద్ద పరాజయం. పరాజయ అనుభవం లేకపోతే నీకు జీవిత మాధుర్యం ఎలా తెలుస్తుంది. నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సరిగ్గా ఎలా అంచనా వేయగలవు. పరాజయం నిన్ను నీకు కొత్తగా పరిచయం చేస్తుంది.
అదే ఘన విజయాల తరువాత ఒక పరాజయం ఎదురైతే తట్టుకోవడం కష్టం. కెవి రెడ్డి విషయంలో అదే జరిగింది. ఆర్థికంగా దెబ్బతిన్నారు, ఆరోగ్యం క్షీణించింది.
***


జూలై 1 1912లో అనంతపురం జిల్లా తాడిపర్తిలో జన్మించిన కెవిరెడ్డి చదువుకునే రోజుల్లోనే తన మిత్రుడు మూలా నారాయణస్వామితో కలిసి సినిమాలు తీయాలని కలలు కనేవారు. చదువు ముగిశాక మూలా నారాయణస్వామి రోహిణి సంస్థలో భాగస్వామిగా చేరడంతో ఆసక్తి ఉంటే రమ్మని కెవిరెడ్డిని పిలిచారు. అక్కడ క్యాషియర్‌గా చేరిన కెవిరెడ్డి డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉండేవారు. తాను సినిమా తీసే సంస్థల కోసం డబ్బు వ్యవహారంలో నిక్కచ్చిగా ఉన్న ఆయన తన సొంత జీవితంలో మాత్రం ఏమీ సంపాదించలేకపోయారు. రోహిణీ నుంచి కొందరు బయటకు వచ్చి వాహిని సంస్థను ఏర్పాటు చేసినప్పుడు కెవిరెడ్డి ప్రొడక్షన్ మేనేజర్‌గా చేరారు. ఆసక్తి అంతా సినిమాలపైనే. 1942లో భక్తపోతన తొలి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అప్పటి వరకు రొమాంటిక్ హీరోగా ఉన్న నాగయ్యను పోతనగా ఎంపిక చేయడం నాగయ్యకే ఆశ్చర్యం వేసింది. మిగిలిన వారు నవ్వుకున్నారు. సినిమా విడుదలయ్యాక నాగయ్యను దేవుడిలా పూజించారు. తరువాత యోగి వేమన అదీ సూపర్ హిట్. గుణసుందరి కథ, పాతాళాభైరవి, పెద్దమనుషులు, దొంగ రాముడు, మాయాబజారు, పెళ్లినాటి ప్రమాణాలు, జగదేక వీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధంతో పాటు రెండు ఇతర భాషా సినిమాలు. ఇవన్నీ సంచలన విజయాలు సాధించాయి. సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీ శంకరుల కథ, భాగ్యచక్రం ఈ మూడు సినిమాలు కెవిరెడ్డి భాగ్యచక్రాన్ని దెబ్బతీశాయి. పరాజయాలతోనే తన సినిమా జీవితం ముగింపు పలకాల్సి వస్తోందని మదనపడిన ఆయనకు ఎన్టీఆర్ శ్రీకృష్ణ సత్య రూపంలో విజయం అందించారు. మన ఫోటోలు ఎవరు చూస్తారు అంటూ ఆయన ఫోటోలు తీయించుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదట! ఆయన సినిమాను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తారని ఆయన ఊహించి ఉండరు.


కెవిరెడ్డి కుమారుడు ఇప్పుడు అమెరికాలో ఒక కంపెనీ నిర్వహిస్తున్నారు. రైతులా కనిపించే కెవిరెడ్డి సినిమాల బంగారు పంట పండించారు. 15 సెప్టెంబర్ 1972లో 60 ఏళ్ల వయసులో మరణించారు.
*

23, నవంబర్ 2014, ఆదివారం

మొనగాళ్లకు మొనగాడు!!

‘‘జీవితం బుద్భుద ప్రాయం.. ఖరీదైన ఐస్‌క్రీమ్ అయినా ఎండ తగిలితే కరిగిపోవాల్సిందే... హెరిటేజ్ పాలకైనా సబ్బు నురగ ఉండాల్సిందే ఈ జీవితం కూడా అంతే నాయనా! ఉప్పు తిన్న విశ్వాసం కన్నా నురగ తాగిన అభిమానం ఎక్కువ. ట్రింగో ట్రింగాయహః మేల్కొండి... ’’ అంటూ స్వామి భీమ్‌పాల్ తన ప్రవచనాన్ని ముగించడంతో భక్తులు వరుసగా పాదాభివందనం చేసి వెళుతున్నారు. అంతా ముగియడంతో అంతరంగిక మందిరంలోకి భీమ్‌పాల్ అడుగు పెట్టాడు... అంతరంగిక మందిరంలో అతి కొద్ది మందికి మాత్రమే అనుమతి. అక్కడుంటే వాళ్లంతా ఒకరి కన్నా ఒకరు మొనగాళ్లు.


‘‘ఔను స్వామి ట్రింగో ట్రింగాయహః ’’అంటే అర్ధమేంటి అని పాత్రికేయ పాపారావు అడిగాడు. భీమ్‌పాల్ పక పకా నవ్వి.‘‘ పిచ్చోడా ఆ పదానికి నాకు అర్ధం తెలిస్తే కదా నీకు చెప్పడానికి. ఎవరికీ అర్ధం కానీ ఏవో కొన్ని పదాలు చెబితే తప్ప భక్తులకు విశ్వాసం కలగదు... చూశావా నీ లాంటి దేశ ముదురు కూడా ఆ పదాన్ని గుర్తుంచుకుని అడిగావంటే నా టెక్నిక్ ఫలించినట్టే కదా?’’ అన్నాడు. ‘‘ అది సరే మనం కలిసి చాలా రోజులైంది. ఏంటి మీ మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి?’’ అని అభిమానంతో స్వామి అడిగాడు.


‘‘ఈ మధ్య పెద్దగా గిట్టుబాటు కావడం లేదు’’ అని రాజకీయ నానాజీ
దీనంగా చెప్పాడు. ‘‘ ఇదిగో నానాజీ చింతామణికైనా ఆదాయం కొంత కాలమే ఉంటుంది. కానీ కాలాతీతంగా ఆదాయాలు గల వాళ్లం మనం.’’.. అంతరంగిక మందిరంలోనూ నటిస్తే ఎలాగోయ్’’ అని అభిమానంతో చీవాట్లు పెట్టాడు. మూడో పెగ్గు తరువాత చర్చ వారి వారి వృత్తులపై సాగింది.
‘‘ఎంత హీరోనైనా ఏ సినిమా నడుస్తుందో ఏది నడవదో తెలియదు. రోజుకో కొత్త హీరో మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు. తాత పేరు చెప్పుకుని బతికేద్దామన్నా వంశ వృక్షం పెద్దది కావడంతో ఒక్కో తాత ఇంట్లోంచి డజన్ల మంది రంగంలోకి వచ్చేస్తున్నారు. ఇక్కడ తప్ప ఎక్కడ బతకలేం ఈ కష్టాలు పగోడికి కూడా వద్దని ’’హీరో గద్గద స్వరంతో పలికాడు.
అతని బాధ విన్నాక ఔను నిజమే అని అంతా తలలు ఊపారు. కొందరు ఊరడించారు.


‘‘నీకు రాసుకోవడానికి పెన్ను కాగితం కూడా ఎవడో ఒకడు ఇవ్వాల్సిందే కదా? కోట్లు గడించావ్ ..నీ పనే బాగుందోయ్’’ అని పాత్రికేయ పాపారావు వైపు చూశారు.


‘‘ఎక్కడ స్వామి ఆ రోజులే పోయాయి. ఆ కాలంలో అంటే ఐదారుగురే ఉండేవారు. ఒక్కొక్కడు ఒక్కో నాయకుడ్ని పట్టేసేవాడు. ఆ నాయకుడి దశ తిరిగితే వాడ్ని పట్టుకున్నవాడి దశ కూడా తిరిగేది. మీరు ఆ కాలాన్ని చూసి ఈ కాలం వాళ్లను అంచనా వేస్తే ఎలా? ఈ రోజుల్లో పార్టీకో అరడజను చానల్స్, పావు డజను పత్రికలుంటున్నాయి. రెండు రాష్ట్రాలకు నాలుగు డజన్ల చానల్స్... ఐటి దాడి జరిగితే సేఠ్ చంపక్‌లాల్ గోడ దూకి పారిపోయినట్టు, ఎసిబి వాళ్లు రైడ్ చేస్తే మండలాఫీసులో గుమస్తాలు పరుగులు తీసినట్టు మీడియా కంటికి కనిపించకుండా నాయకులు పరుగులు తీస్తున్నారు. వాళ్లు మాకు చిక్కితే కదా! వాళ్లే చిక్కనప్పుడు మాకేం లాభం. ఒకవేళ చిక్కినా 16వేల మంది గోపికల మధ్య చిన్నికృష్ణుడు అన్నట్టుగా ఉంటోంది... వ్యవహారాలు జరపడం తరువాత కనీసం వాటి గురించి మాట్లాడేంత ఏకాంత సేవ దక్కడం లేదు. అప్పటి రోజులు మళ్లీరమ్మన్నా రావు’’ అని పాత్రికేయ పాపారావు దీనంగా చెప్పిన దానికి మిగిలిన వారు నిజమే అన్నారు.


‘‘ఎంత ఉన్నతాధికారుల మైతేనేం ఆదాయం బాగా తగ్గింది మా వైపు చూడకండి’’అని ఉన్నతాధికారి మరో పెగ్గు కోసం చేయి చాచాడు. ‘‘మీకేంటి సార్ మీ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ కూడా పార్ట్‌టైం వృత్తిలో లక్షలు సంపాదిస్తున్నారు ’’ అంటూ ఓబులేషు వ్యవహారాన్ని ఎత్తి చూపుతూ అంతా ఆయన వైపు చూసి నవ్వారు. వౌనమే తన సమాధానం అన్నట్టు ఆయన తన పనిలో తానుండిపోయారు.


‘‘నా వైపు చూడాల్సిన అవసరం లేదు. నేను నేలరాలిన ‘తార’ను’’ అని అమె వయ్యారంగా పలికింది. ‘‘ఒక్కోసారి డెన్ నిర్వాహణ ఖర్చులు కూడారావడం లేదు, ఎక్కడ చూసినా సిసి కెమెరాలే ఇక కిడ్నాప్‌లు ఎక్కడ చేస్తాం’’ అని దావూద్ అబ్రహం తనను అడగక ముందే తన పరిస్థితి చెప్పారు. ఏదో మంచి కాలంలో దోచుకున్న సొమ్ముతో కాలం గడుపుతున్నాం కానీ ఇప్పుడు మా బిజినెస్ ఏ మాత్రం లాభసాటిగా లేదని అందరి మాటల సారాంశం.
స్వామి భీమ్‌పాల్ నవ్వి ‘‘మంచి వ్యాపారి ఎప్పుడూ తన లాభాన్ని చెప్పడు బేరాలు లేవని ఏడుస్తూనే ఉంటాడు.. జుమేరాత్ బజార్‌లో దొంగ సొమ్ము అమ్మే సులేమాన్, రైతు బజార్‌లో వంకాయలమ్మే కిష్టయ్య నుంచి స్విస్ బ్యాంకులో దొంగ ఖాతాలున్న మీ వరకూ అంతా బేరాలు లేవనే అంటారు. అలా అనడం వ్యాపార ధర్మం అదంతే’’ అని నవ్వాడు.


రాజకీయ నానాజీ మైకు కోసం చేయి పైకెత్తినట్టు చేయి చూపగానే అంతా అతని మాటల వినేందుకు ఆసక్తి చూపారు. ‘‘ప్రతి వృత్తిలోనూ రిస్క్ ఉంటుంది. ఒక్కో నియోజక వర్గంలో కనీసం నాలుగు ప్రధాన రాజకీయ పక్షాలు ఉంటాయి. ఒక్కో పార్టీ నుంచి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించే వాళ్లు కనీసం ముగ్గురుంటారు. అంటే ఒక నియోజక వర్గంలో 12 మంది గట్టిగా ఐదేళ్లపాటు ఖర్చు చేస్తే, అందులో ముగ్గురికి టికెట్ వస్తుంది. ఒక్కరు గెలుస్తారు. టికెట్ వస్తుందో రాదో తెలియదు, వస్తే గెలుస్తామో లేదో తెలియదు, గెలిస్తే మేం గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు. మా రాజకీయ వ్యాపారంలో ఉన్నంత రిస్క్ మరే వ్యాపారంలో లేదు’’ అని చెప్పగానే వెనక నుంచి ఎవరో ఔను రిస్క్ ఎక్కువే ఆదాయం ఎక్కువే అని గోణిగారు.


‘‘ఇంతకూ నేను చెప్పొచ్చేదేమిటంటే మా అందరి కన్నా ఆదాయంలో స్వామి భీమ్‌పాలే మొనగాడు. తనకు కూడా అర్ధం కాని నాలుగు మాటలు చెప్పి మహామహులతో కాళ్లు మొక్కించుని సామాజ్య్రాలను సృష్టించుకుంటారు. మర్డర్ చేసినా అరెస్టు చేసేందుకు పోలీసులు జంకుతారు. ఎవరో ఒకరు సాహసం చేసి అరెస్టు చేసేందుకు వస్తే వేలాది మానవ కవచాలు రక్షణగా నిలుస్తాయి.. కానుకలిస్తారు, కాళ్లు మొక్కుతారు. ఇంతకు మించిన లాభసాటి వ్యాపారం ఏముంటుంది అని రాజకీయ నానాజీ చెప్పిన మాటలకు అంతా చప్పట్లు కొట్టారు.


‘‘మేమంతా మొనగాళ్లం కావచ్చు కానీ మీరు మొనగాళ్లకే మొనగాడు’’ అంటూ అంతా అనడంతో స్వామి భీమ్‌పాల్ ముసిముసిగా నవ్వుకున్నాడు.

ఆ నటుడు బిచ్చగాడయ్యాడు



సినిమా నటుడు అంటే జనంలో బోలెడు క్రేజీ. కనిపిస్తే చాలు ఆటోగ్రాఫుల కోసం వందల చేతులు పోటీ పడుతుంటాయి. అలాంటి నటుడే వందలాది ముందు బిక్షం వేయమని చేయి చాస్తే.... అలాంటి నటుడు ఫుట్‌పాత్‌పైనే తన జీవితాన్ని చాలించాడు అని, చివరకు భార్యా పిల్లలు కూడా చివరి దశలో చూసేందుకు రావడానికి ఇష్టపడలేదు అంటే ఊహించడానికే కష్టంగా ఉంటుంది కదూ! చాలా మంది జీవితాల్లో సినిమాల్లో కన్నా ఊహించని మలుపులు ఉంటాయి.
***

54ఏళ్ల యువరత్న బాలకృష్ణ కన్నెర్ర చేయగానే వేగంగా వస్తున్న రైలు తోక ముడిచి వెనక్కి వెళ్లింది. బాలకృష్ణ ప్యారాచూట్ వేసుకుని పాకిస్తాన్‌లో దిగి ఒంటి చేత్తో ఆ దేశ సైన్యాన్ని మట్టికరిపించాడు. మన హీరోలు అందరూ అంతే.  ...   మరి నిజ జీవితంలో..హీరోల కన్నా శక్తివంతమైనది ఒక చిన్న వ్యసనం. ప్రముఖ నటునిగా ఒక వెలుగు వెలిగిన వారిని సైతం బిక్షగాళ్లుగా మార్చేసేంత శక్తివంతమైనది ఆ చిన్న వ్యసనం.
ఒక్కసారి నన్ను పూర్తిగా నమ్మి నీ జీవితాన్ని నాకు అప్పగించు. ఆ తరువాత నీ జీవితాన్ని నడిపించే బాధ్యత నాదీ అని మద్యం మనిషికి గట్టి నమ్మకాన్ని ఇస్తుంది. ఆ మాటను నమ్మిన వారి జీవితాన్ని మద్యమే నడిపిస్తుంది.
***
దాదాపు మూడు దశాబ్దాల సినిమా జీవితం. విలన్‌గా ఒక వెలుగు వెలిగిన నటుడు రోడ్డుమీద బిక్ష మెత్తుకుని బతికాడు.. అలా రోడ్డుమీదనే కన్ను మూశాడు. ఆయన మరణ విషయం తెలిసినా భార్యా, కుమారుడు భౌతిక కాయాన్ని చూసేందుకు కూడా రాలేదు. అంటే నమ్మగలమా? నమ్మి తీరాలి. ఆయన జీవితం నుంచి గుణపాఠాన్ని నేర్చుకోవాలి.
***
పరశురామ్ ఒకప్పటి బాలీవుడ్ ఫేమస్ విలన్... అంతకు ముందు బాల నటుడు. మంచి గాయకుడు. మనకు ఆయన పేరు తెలిసి ఉండక పోవచ్చు. మనం ఆయన సినిమాలు చూసి ఉండక పోవచ్చు. తెలియాల్సిన అవసరం కూడా లేదు. శాంతారామ్, రాజ్‌కపూర్ లాంటి వారు మెచ్చుకున్న ప్రతిభావంతుడైన నటుడి జీవితం చివరకు ఫుట్‌పాత్‌పై ఎందుకు ముగిసింది. భార్యా పిల్లలు కడ చూపు కోసం కూడా ఎందుకు రాలేదు.
***
దేశంలో బుల్లితెరపై తొలిసారిగా టాక్‌షోను ప్రారంభించింది. తబస్సుమ్. 1947లో బాలనటిగా సినిమా రంగంలోకి ప్రవేశించిన ఆమె ఆ తరువాత 70వ దశకంలో దూరదర్శన్‌లో ఫూల్‌కిలే గుల్షన్ గుల్షన్ కార్యక్రమం ద్వారా టాక్ షోలు నిర్వహించారు. ముంబైలో ఓ రోజు తబస్సుమ్ కారులో వెళుతుండగా, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బిక్షమెత్తుకుంటున్న ఒక వ్యక్తిని చూసి ఆమె నిర్ఘాంత పోయింది. తన కళ్లు తనను మోసం చేస్తున్నాయేమో అనుకుంది. కారు ఆపి దగ్గరకు వెళ్లి చూసింది. నిజమే ఆ బిక్షగాడు ఒకప్పటి గొప్ప నటుడు. ప్రభాత్ స్టూడియోలో బాల నటునిగా నట జీవితాన్ని ప్రారంభించి, ఆ కాలంలో టాప్‌మోస్ట్ విలన్‌గా ఎదిగిన పరశురామ్. కొన్ని సినిమాల్లో అతని కుమార్తెగా నటించిన తబస్సుమ్. అతన్ని గుర్తు పట్టింది. అతన్ని తన కారులో ఎక్కించుకొని స్టూడియోకు తీసుకు వెళ్లింది. దూరదర్శన్‌లో పరశురామ్ ఇంటర్వ్యూ ప్రసారం చేశారు.
అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్‌తో సహా సినిమా అభిమానులు ఎంతో మంది స్పందించి సహాయం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరశురామ్‌కు సహాయం చేశారు.
పరశురామ్ గురించి తబుస్సుమ్ అనుభవాన్ని చదివిన పాత హిందీ సినిమాల అభిమానులు కొందరు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు.
పరశురామ్ కుమార్తెతో పాటు మనవడి ఆచూకీ కనుగొని సంబరపడ్డారు. పరశురామ్ జీవితం ముగింపు గురించి వారి నుంచి తెలుసుకుని ఆవేదన చెందారు.

దునియా నా మానా (1937) సినిమాలో ఆయన పాడిన మన్‌సాఫ్ తెరా హై కె నహీ పాట ఆ కాలంలో చాలా పాపులర్. పరశురామ్ లక్ష్మణ్ మహారాష్టల్రోని ఆహ్మద్‌నగర్ జిల్లాలో ఒక గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే అతనికి పాటలు పాడడం, నటించడంలో ప్రావీణ్యం ఉంది. పేదరికం వల్ల ఫోర్త్ స్టాండర్డ్‌కు మించి చదవలేకపోయాడు. విపరీతంగా చదివే వాడు. పదేళ్ల వయసులో తండ్రి బొంబాయికి చేరుకుని పని కోసం రంజీత్ మూవీ టోన్‌లో చేర్పించాడు. వి.శాంతారామ్ ఓ సారి ఆ కుర్రాడు సినిమా కోసం పాట పాడుతుంటే విని తన్మయం చెందారు. ఆ కుర్రాడి బాధ్యత అప్పటి నుంచి శాంతారామ్ తీసుకుని ప్రభాత్ ఫిల్మ్ కంపెనీలో నెలకు ఐదు రూపాయల జీతంపై చేర్చుకున్నాడు. ప్రభాత్ వారి అద్భుతమైన సినిమాగా చరిత్రలో నిలిచిపోయిన దునియా నా మానే సినిమాలో బిక్షగాడిగా పురుషోత్తం నటించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. చివరకు అతను బిక్షగాడిగానే తనువు చాలించడం విచిత్రం. 1940లో పరశురామ్ లీలాబాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఖర్చుల కోసం శాంతారామ్ ఐదు వందల రూపాయలు ఇచ్చారు. ఆ కాలంలో ఇది చాలా పెద్ద మొత్తం. ఇక తన జీవితం స్థిరపడినట్టే అనుకున్నాడు పురుషోత్తం. 

ప్రభాత్ ఫిల్మ్ కొన్ని వివాదాల్లో చిక్కుకోవడంతో ఆయన నేషనల్ స్టూడియో వారి మేరీ దునియా (1942)లో నటించారు. ఈ సినిమాలో ఆయన మూడు పాటలు కూడా పాడారు. తరువాత శాంతారామ్ రాజ్‌కమల్ సినిమా స్టూడియోను ఏర్పాటు చేసి పరశురామ్‌ను నెలకు 80 రూపాయల వేతనంపై తీసుకున్నారు. 1943లో శాంతారామ్ తీసిన శకుంతల సినిమాలో పరశురామ్ కణ్వమునిగా నటించాడు. ఒకవైపు రాజ్‌కమల్ వారి సినిమాల్లో నటిస్తూనే ఇతర సంస్థల సినిమాల్లో బిజీ అయ్యాడు. జీవన్ యాత్ర(1946) మత్‌వాలా షాయర్(47), బూల్(48)అప్నాదేశ్(49), తీన్ బాతి చార్ రాస్తా(53) గీత్ గాయా పాత్తరోనే(64), చోర్ బజార్(54), హౌస్ నంబర్ 44(1955) జాగ్తే రహో1956) బాగం బాగ్(1956) సినిమాల్లో నటించారు. 62లో వచ్చిన కింగ్ కాంగ్, ఆశిఖ్, మై చూప్ రహుంగా, 64లో ఆప్‌కి పర్‌చయే 65లో రుస్తూం ఇ హిందు, 70లో సఫర్, 71లో మన మందిర్ సినిమాల్లో నటించారు. మద్రాస్ వెళ్లి ఎవిఎం వారి సినిమాల్లో కూడా నటించాడు పరశురామ్.

1968లో ఒక సినిమాషూటింగ్‌లో కాలు విరగడంతో అతని దురదృష్టకర జీవితం ప్రారంభం అయింది. ఆ సంఘటన తరువాత పరశురామ్ పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తరహా నటన, పాటలకు కాలం చెల్లిందని దూరం పెట్టారు. సినిమాల్లో నటించనిదే ఉండలేని అతను చివరకు మద్యం లేనిదే ఉండలేని స్థితికి చేరుకున్నాడు. సినిమా వాళ్ల ముందు మద్యం కోసం చేతులు చాచడం ప్రారంభించారు. చివరకతను బిక్షగాడిగా మారిపోయాడు.... మద్యానికి బానిసైన పరశురామ్‌కు ఎంత చెప్పినా వినకపోడంతో కుటుంబం దూరమైంది. కుమార్తెకు అప్పటికే పెళ్లి కావడంతో ఆమె వేరుగా ఉంది. అలాంటి సమయంలోనే పరశురామ్ రోడ్డుపై బిక్షమెత్తుకుంటుంటే తబస్సుమ్ చూసింది. ఎంత మంది సహాయం చేసినా మద్యం ముందు ఆయన నిలువలేకపోయాడు. ఆ తరువాత కొద్ది రోజులకే జనవరి 24, 1978న పరశురామ్ ఫుట్‌పాత్‌పైనే జీవితాన్ని ముగించారు. రోడ్డుమీద అతన్ని చూసి దయగల వాళ్లు బాబా ఆస్పత్రిలో చేర్పించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే వాళ్లు రావడానికి ఇష్టపడలేదు. కుమార్తెకు తెలిసి వచ్చేసరికి పరశురామ్ మరణించాడు. ఆమెనే తండ్రి అంత్య క్రియలు నిర్వహించింది. 1981లో పరశురామ్ భార్య, 82లో కుమారుడు మరణించాడు. పరశురామ్ కుమార్తె ముంబైలో, మనవడు న్యూజిలాండ్‌లో ఉన్నారు. మూడున్నర దశాబ్దాల తరువాత తన తాత గురించి తెలుసుకొనే వారి గురించి తెలిసి మనవడు సంతోషించాడు. ఆయన మద్యానికి బానిసై దుర్భర జీవితం గడిపి ఉండవచ్చు కానీ అంత కన్నా ముందు గొప్పనటుడు ఆ నటుని మనవడిగా నేను సంతోషిస్తాను అని పరశురామ్ మనవడు మంగేష్ బార్డె చెప్పుకొచ్చారు.

నటన జీవితంలో ఒక భాగం... కానీ నటనే జీవిత కాదు.. కానీ పరశురామ్ మాత్రం ఆ తేడాను గ్రహించ కుండా జీవితాన్ని విషాదంగా మార్చుకున్నారు. *

16, నవంబర్ 2014, ఆదివారం

పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే... చార్మినార్‌లో లక్క గాజులు తక్కువ ధరకు దొరికేవి

‘‘ఏమోయ్ కుటుంబరావు   నీ కోసమే ఎదురు చూస్తున్నాను. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి’’అని విశ్వనాథం ఫోన్ చేశాడు. ‘‘ఇదిగో నినే్న మీ కుటుంబరావు అన్నయ్య వస్తున్నాడు, మంచి టీ చేయ్ సీరియస్ విషయంపై సీరియస్‌గా మాట్లాడుకోవాలి’’
‘‘ఏంటో అంత సీరియస్ విషయం ’’అని శ్రీమతి అడిగింది.


‘‘దేశంలో ఇప్పుడు ఇదే అత్యంత కీలకమైన అంశం. జవహర్ లాల్ నెహ్రూకు బదులు పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే ఎలా ఉండేదని దేశ పాలకులు మొదలుకుని, సామాజిక మాధ్యమాల వరకూ అంతా దీనిపైనే చర్చించుకుంటున్నారు. రిటైర్ అయ్యాక ఈ దేశం కోసం ఏమైనా చేయాలని తెగ ఆలోచించాను. ఆలోచించడానికి మించిన దేశసేవ లేదని మా ఆలోచనల్లో తేలింది. అందుకే ఇవ్వాళ ఈ సీరియస్ విషయం మీద కుటుంబరావు, నేను సుదీర్ఘంగా చర్చించాలని నిర్ణయించుకున్నాం. వినాలని ఆసక్తి ఉంటే వంట గది నుంచి విను... అనవసరంగా మధ్యలో జోక్యం చేసుకుని మూడ్ పాడు చేయకు’’ అని విశ్వనాథం చెబుతుండగానే కుటుంబరావు వచ్చినట్టుగా శబ్దం అయింది.


పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే పాకిస్తాన్‌తో పాటు నాలుగైదు దేశాలు మన దేశంలో కలిసిపోయేవని, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ పెరిగి ఉండేవని, చార్మినార్‌లో లక్క గాజులు తక్కువ ధరకు దొరికేవని, జాంబాగ్ ఫ్రూట్‌మార్కెట్‌లో పండ్ల ధర ఇంకా తక్కువుండేదని నాకెందుకో గట్టిగా అనిపిస్తోందోయ్ నువ్వేమంటావు’’ అని విశ్వానాథం చర్చ ప్రారంభించాడు.


‘‘అన్నయ్య గారూ బాగున్నారా? ఈ మధ్య రావడం లేదేమిటి ’’ అని కుటుంబరావును శ్రీమతి అడిగింది. ఇంకా భార్య అక్కడే నిలబడడంతో ‘‘ఇలాంటి విషయాలు నీకు అర్ధం కావు. ముందు టీ పెట్టుపో..’’ విశ్వనాథం శ్రీమతిని ఆదేశించాడు.
‘‘సరే టీ పెడతాను కానీ మొన్న పెళ్లిలో మీరు చాలా సేపు మాట్లాడారు చూడండి ’’
‘‘ఎవరూ ఆ బట్టతల అతని గురించేనా నువ్వు చెబుతున్నది’’.
‘‘అవును అతనే ఇంటికి రమ్మని పిలిచాం కదా వస్తానన్నాడు. వచ్చేప్పుడు ఫోన్ చేస్తాడు కాస్త చూడండి ’’


‘‘సరే చూస్తాను కానీ ఎవరతను చాలా ఇంట్రస్టింగ్ పర్సన్ తెగ మాట్లాడేస్తాడు కొత్తా పాత అని లేనే లేదు. బాగా కలిసిపోతాడు. ఆ పెళ్లిలో అతనున్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంతో ఇబ్బంది పడేవాడిని.. ఔను ఏదో సినిమాలో కూడా నటించాడట కదా?’’ అని విశ్వనాథం అడిగాడు.


‘‘అతను మీకూ నచ్చాడా! అతనంతే ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాడు. బాగా మాట్లాడతాడు. తహసిల్దారుగా వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకొన్నాడు. బాగానే సంపాదించాడు. వాళ్ల పిల్లలిద్దరూ అమెరికాలో సెటిలయ్యారు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక రిటైర్ అయ్యాక ఇప్పుడు ఆసక్తి కొద్దీ సినిమాల్లో ప్రయత్నిస్తున్నాడు. మాయా మశ్చింద్ర సినిమా చూశారా! అందులో రాజు యుద్ధానికి వెళ్లేప్పుడు చాలా మంది సైనికులు ఉంటారు కదా! ఆ సైనికుల్లో ముందు వరసలో 14వ వాడు ఆయనే... ఆ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్‌ను చాలా దగ్గరి నుంచి చూశాడట! ఎన్టీఆర్ అచ్చం మనిషిలానే ఉన్నాడట కలిసినప్పుడల్లా 40ఏళ్ల క్రితం నాటి ఆ సినిమా షూటింగ్ కబుర్లు కళ్లకు కట్టినట్టు చెబుతాడనుకో... 


ఇంట్లో ఆ సినిమా సీడీ ఉంది. చూడండి. చేసింది సైనికుడి వేషమే అయినా, డైలాగులు లేకపోయినా ఎంత హుందాగా నిలబడ్డాడు... ఆ ఠీవీ... దర్పం...’’ అంటూ శ్రీమతి చెప్పుకుపోతున్నది.


‘‘సర్లేఈ సారి నువ్వు ఆ సినిమా చూసేప్పుడు ఆ సీన్ వచ్చినప్పుడు నన్ను పిలువు చూస్తాను....అది సరే ఇంతకూ అతను నీకేమవుతాడో చెప్పనే లేదు.’’ని విశ్వనాథం ఆసక్తిగా అడిగాడు.


‘‘ఏమవుతాడు చేసుకుంటే ఇప్పుడు మీరు కూర్చున్న చోట ఆయన కూర్చునే వాడు. అది జరిగితే నా జీవితం ఎంత బాగుండేది. సినిమాల షూటింగ్‌లకు తీసుకు వెళ్లేవాడు. కాలం కలిసి వస్తే మహానటుడు అయ్యేవాడు. ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడు. మధ్యలోనే పోతే ఆ స్థానంలో నేను ముఖ్యమంత్రిని అయ్యేదాన్ని. దూరపు బంధువు.. వరుసకు బావ అవుతాడు. మా తరఫు వాళ్లు, వాళ్ల తరఫు వాళ్లు అంతా ఓకే అనుకున్నారు. మాయదారి గోత్రాలు కలవలేదు’’ అని శ్రీమతి ఏదో చెబుతుంటే


విశ్వనాథం మధ్యలోనే జోక్యం చేసుకుని, ఎవడూ ఆ ఉడత ముఖం వాడు నిన్ను చేసుకోవాలనుకున్నాడా! అయినా వాడేంటి ఆడవాళ్లలా అలా కబుర్లు చెబుతూనే ఉంటాడు. ఎదుటివాడు వింటున్నాడా లేడా? అనే స్పృహనే ఉండదు. పొట్టివెదవ, ఏదో లంచం తీసుకుంటుంటే ఎసిబి వాళ్లు పట్టుకున్నట్టున్నారు. తీసేసిన తహసిల్దారు అని చెప్పుకోవడానికి సిగ్గుపడి అలా చెబుతున్నాడేమో! వాడ్ని చూడగానే దొంగ ముఖం అనిపించింది ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. వాడ్ని నువ్వు చేసుకుని ఉంటే పీడాపోయేది నేను ఏ వాణిశ్రీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండేవాన్ని అని విశ్వనాథం ఉడుక్కుంటూ చెప్పాడు.

 సర్లేండి మీ బట్టతల ముఖానికి వాణిశ్రీ లాంటి అమ్మాయి దొరికేదా? అని శ్రీమతి ఎత్తి పొడిచింది.

‘అది సరే వాడు మహానటుడు, ముఖ్యమంత్రి అయ్యేవాడా? ? ఎలా?’’


’’డిప్యూటీ రిజిస్ట్రార్ ఉద్యోగం వదిలి ఇన్‌స్పెక్టర్‌గా చిన్న పాత్రలో నటించిన ఎన్టీఆర్ మహానటుడై, తరువాత ముఖ్యమంత్రి కాలేదా? ఆయన ఏకంగా తహసిల్దారు... సైనికుడి వేషం వేశాడు ఏం ఎన్టీఆర్‌లా ఎందుకు కాకూడదు ?’’ అని శ్రీమతి నిలదీసింది...
శ్రీమతితో వాదించి ప్రయోజనం లేదని గ్రహించిన విశ్వనాథం ‘‘సర్లేవే నీతో వాదనెందుకు? పెళ్లయిన ఆరు దశాబ్దాల తరువాత వాడెవడితోనో పెళ్లయి ఉంటే అనుకోవడం పిచ్చితనం’’ అన్నాడు.
‘‘ మరి దేశంలో మరే సమస్య లేనట్టు.. ఏడు దశాబ్దాల తరువాత నెహ్రూకు బదులు పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే? ’’ అని చర్చించుకోవడం తెలివైన పనా? అని శ్రీమతి అడిగింది.


గుర్తు తెలియని వ్యక్తి వీరి చర్చలో దూరి ‘‘మా గుండప్ప బతికుంటే దేశంలో ఇన్ని సమస్యలే ఉండేవి కాదు. వాడు మా ఊర్లో పెద్ద రౌడీ వాడంటే అందరికీ హడల్ పిచ్చి కుక్క వెనకనుంచి వాడ్ని దెబ్బతీసింది’’ అని చెబుతుంటే .. ఒక గుంపు అదిగో గుండప్ప అక్కడున్నాడు అని ఆ అగంతకుని వైపు పరిగెత్తు కొచ్చారు.