25, జనవరి 2015, ఆదివారం

అల్లుడు గారి తాతమ్మ కల!

‘‘ఏనాటికైనా ఎన్టీఆర్‌కు నిజమైన వారసుడు అల్లుడు గారే అని ఇప్పటికైనా ఒప్పుకుంటావా?? ’’
‘‘ఏంటో అల్లుడిగారిలో నేను ఒప్పుకునేంత గొప్ప మార్పు ఏమొచ్చింది? మనం ఎన్ననుకున్నా, కారణాలు ఏమైనా అన్నగారి పార్టీ అల్లుడిదే అని కోర్టులు కూడా తేల్చేశాయి. ప్రజలు ఓటు కూడా వేసేసి అధికారం అప్పగించారు. నీ, నా ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం వల్ల వచ్చేదేముంది? పోయేదేముంది? ’’


‘‘ప్రజలిచ్చిన తీర్పు గురించి కాదు నేను చెప్పాలనుకున్నది ’’
‘‘ఏంటో మరి నేరుగా చెప్పు’’
‘‘అల్లుడు గారు ఏమన్నారు? ’’
‘‘నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడిగితే చాలా కష్టమోయ్! కౌన్‌బనేగా కరోడ్‌పతిలో అమితాబ్, మీలో ఎవరు కోటీశ్వరుడులో నాగార్జున చివరి రౌండ్‌లో ఇలాంటి ప్రశ్న అడిగితే హాట్ సీట్‌లో ఉన్నవారు పిచ్చేక్కి సీటు దిగివెళ్లిపోతారు. అలాంటి సంద ర్భం కోసం ఈ ప్రశ్న దాచిపెట్టుకోవాలి కానీ నువ్వు నన్నడిగితే ఎలా?’’


‘‘జోక్ కాదు నేను సీరియస్‌గానే అడుగుతున్నాను’’
‘‘నేను కూడా సీరియస్‌గానే చెబుతున్నాను. బాబుగారు రోజుకు మూడు ప్రెస్‌కాన్ఫరెన్స్‌లు పెట్టి అనేక సందేశాలు ఇస్తుంటారు. ఈ లోగా నాలుగైదు లీకేజీలు, రెండు మూడు వీడియో కాన్ఫరెన్స్‌లో, మరో ఒకటో రెండో మనసులోని మాట అంటూ ఏవో విడుదల అవుతుంటాయి. ఆయన చెప్పారని చానల్స్‌లో వార్తా ప్రవా హం వస్తుంటుంది. సరే 24 గంటల న్యూస్ చానల్స్‌లో బతికించేందుకు ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నారు. సంతోషం. నువ్వే చెప్పు గంటకు కొన్ని డజన్ల మాటలు చెప్పే నాయకుడి గురించి బాబుగారు ఏమన్నారు అని అడిగితే, నేనేం సమాధానం ఇవ్వాలి’’
‘‘నిజమే... సరే నేరుగా విషయంలోకి వస్తాను... పిల్లలను కనడం గురించి బాబుగారేమన్నారు? ’’


‘‘ఓ అదా? ఇంతకు ముందు చిన్నకుటుంబం గురించి నేనే పిలుపు ఇచ్చాను అన్నారు’’
‘‘ఆ తరువాత ఏమన్నారు? ’’
‘‘అప్పుడలా పిలుపు ఇచ్చింది నేనే.. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఎక్కువైనా సరే అర్జంట్‌గా కనేయండి అని పిలుపు ఇచ్చారు.. దాని గురించేనా? నువ్వు చెప్పాలనుకున్నది. దీంట్లో ఎన్టీఆర్ వారసత్వం ఏముంది? ఆయన మార్గంలో అల్లుడు గారు పయనించడం ఏముంది? ’’
‘‘మామ గారు కాంగ్రెస్ బద్ధ వ్యతిరేకి అయితే అల్లుడు గారు రాజకీయంగా పుట్టింది కాంగ్రెస్‌లోనే. మామ సినిమాల్లో మాత్రమే నటిస్తే, అల్లుడు రాజకీయ నటనలో జీవించేస్తారు. ఆలోచనలు, అలవాట్లు, వృత్తి ప్రవృత్తి, మాట తీరు, సంపాదన అన్నింటిలో మామా అల్లుళ్ల వ్యవహారం తూర్పు పడమర కదా? ఔను అంతే కాదు చివరకు మామ గారికి ఒకరు తక్కువ ఒక డజను సంతానం ఉంటే.. అల్లుడి గారికి ఒకరే సంతానం.’’
‘‘అలా రంధ్రానే్వషణ చేయకు. నేను చెప్పాలనుకున్న దానికి సపోర్ట్‌గా నీకేమీ ఉదాహరణలు దొరకవా? ’’
‘‘నాకేమీ దొరకడం లేదు. నీకు దొరకితే చెప్పు వింటాను’’
‘‘ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన గొప్ప సినిమా తాతమ్మ కల గురించి తెలుసా? ’’


‘‘అప్పుడే కాదు దానవీర శూరకర్ణ ఇప్పటికీ అద్భుతంగా నిలిచే సినిమా.. అలాంటి సినిమాను వదిలిపెట్టి ఎవరికీ పెద్దగా గుర్తుండని తాతమ్మ కల గుర్తుకొచ్చిందెందుకు నీకు? ’’
‘‘ పేరు తాతమ్మ కల అయినా ఆ సినిమా ఎన్టీఆర్ అలోచనలకు రూపం. నటనా, దర్శకత్వం అన్నీ ఆయనే. అంతే కాదు చివరకు ఆ సినిమాలో నటించింది కూడా ఆయన పిల్లలే. 74లో వచ్చిన ఈ సినిమాకో ప్రత్యేకత ఉంది. అధిక సంతానానికి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ యుద్ధం ప్రకటిస్తే, ఎమో ఎవరు చెప్పొచ్చారు, అధిక సంతానం ఉంటే అందలో చివరి వాడే కుటుంబాన్ని ఆదుకునేవాడు కావచ్చు అంటూ ఎన్టీఆర్ కథ నిర్ణయించి, దర్శకత్వం వహించి తాతమ్మకల తీశారు. తాతమ్మ కుమారుడికి ఐదుగురు కొడుకులు. వీరిలో నలుగురు పనికిరాని వారుగా తేలితే ఐదవ వాడు ప్రయోజకుడై తాతమ్మ కల తీరుస్తాడు. ఆ ఐదవ కుమారుడిగా నందమూరి బాలకృష్ణ నటించాడు. ఆయన తొలి సినిమా ఇదే. ఇదీ కథ. ఎక్కువ సంతానం ఉండాలని చెప్పడమే కాదు ఎన్టీఆర్ ఆచరణలో కూడా చూపించారు. అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ నమ్మిన తాతమ్మకల సిద్ధాంతాన్ని ఇంత కాలానికి అల్లుడు గారు కూడా ప్రచారం చేస్తున్నారంటే, మెచ్చుకోకుండా ఏవేవో గుర్తు చేస్తావేంటి? ’’
‘‘పాత సినిమాల్లో తరుచుగా వినిపించే విధి ఆడే వింత నాటకం అంటే ఇదేనేమో! ఎన్టీఆర్ తాతమ్మ కలలో ఐదుగురిలో చివరి వాడు కల నెరవేరిస్తే, ఎన్టీఆర్‌కు నిజ జీవితంలో పదకొండు మంది సంతానంలో ఒక్కరు కూడా ఆయన కల తీర్చలేదు. ఆ సినిమాలోలానే బాలకృష్ణ తన వారసుడిగా నిలవాలనే కోరిక ఆయనకు బలంగా ఉండేది. కానీ చివరకు 11 మంది సంతానం ఉన్నా అల్లుడే రాజకీయ వారసుడయ్యాడు. ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు కల్పిస్తూ చట్టం తెచ్చిన ఎన్టీఆర్‌కు 11 మంది సంతానంలో కుమారుడో, కుమార్తెనో రాజకీయ వారసులు కాకుండా అల్లుడే రాజకీయ వారసుడు కావడం వింత కాకపోతే మరేంటి? బాలకృష్ణ నా రాజకీయ వారసుడు అని ఎన్టీఆర్ ప్రకటించగానే అల్లుడు గారు అలిగి ఆ ప్రకటనను ఉద్దేశం అది కాదని చెప్పేంత వరకు ఊరుకోలేదు’’
‘‘నేనేదో చెబుతుంటే నువ్వెక్కడికో వెళుతున్నావు? ’’
‘‘సర్లే ఇప్పుడు అల్లుడి గారిది గొప్ప నినాదం, మామకు ఆయనే వారసుడు అని ఒప్పుకోమంటావు? ’’
‘‘ఒప్పుకోమని బలవంతం పెట్టడం లేదు. నిజమా? కదా? చెప్పమంటున్నాను? ఆయనెవరో ఐదుగురు పిల్లల్ని కనమంటే దేశమంతా చర్చ పెట్టారు. పెట్టుబడులను ఆకట్టుకోవడంలో బిజీబిజీగా ఉన్న అల్లుడు గారు పిల్లల్ని కనడంలో మీరు బిజీబిజీగా ఉండండి అని ఈ కాలంలో పిలుపు ఇవ్వడం ధైర్యం కాకపోతే మరేంటి?
‘‘సర్లే నీ మాట ఎందుకు కాదనాలి? అల్లుడు గారి సరికొత్త ఉద్యమం అభినందనీయం. ఈ ఉద్యమానికి ఓ బ్రాండ్ అంబాసిడర్‌ను నియమిస్తే బాగుంటుందేమో!’’
‘‘వెరీగుడ్ ఇప్పుడు దారిలోకి వచ్చావు’’


‘‘లాలూ ప్రసాద్ యాదవ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటారా?’’
‘‘ఎన్‌డిఏలో ఉంటూ థర్డ్ ఫ్రంట్ నాయకుడ్ని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నుకుంటే బాగోదేమో? ’’
‘‘నిజమే పోనీ చినబాబుగారిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తే ఎలా ఉంటుంది? ’’
‘‘ఆ !!! ??? ’’

18, జనవరి 2015, ఆదివారం

ఆరేసుకోబోయి...

‘ఆరేసూకోబోయి పారేసుకున్నాను హరిహరి ’’
‘‘ ఏంటీ మంచి ఉషారు మీదున్నావు? ఏంటి కథ పంకజం కలిసిందా? లాటరీ తగిలిందా? కొడి పందాల్లో బాగా డబ్బు చేసిందా? ’’
‘‘అదేం లేదులే’’
‘‘మారండయ్యా మారండి... ఇంకా 77 నాటి పాటలేనా? ప్రపంచం చాలా ముందుకెళుతోంది.  అంత సడెన్‌గా నీకు జయప్రద గుర్తుకొచ్చిందేంటో?
‘‘అదేం కాదురా! ఈ ఫోటో చూడగానే మనసంతా ఉల్లాసంగా తేలిపోయినట్టు అనిపించింది. ’’
‘‘బిజెపిలోకి జయప్రద.. ఈ వార్తను చూసేనా? అంతగా సంతోషిస్తున్నావు. ఏరా నువ్వు కూడా పార్టీ మారావా? అదేదో నోరు తిరగని పార్టీ అభిమానివని గుర్తు. బిజెపిలోకి వెళ్లిపోయావా? ’’


‘‘జయప్రద బిజెపిలో చేరినందుకు సంతోషంగా ఉందని నేనేమైనా చెప్పానా? జయప్రద ఫోటో చూడగానే సంతోషం వేసిందని చెప్పాను అంతే తప్ప నేనెందుకు పార్టీ మారుతాను. తాప్సీ, జిప్సీ ఎంత మంది హీరోయిన్లు వచ్చినా జయప్రద అందమే అందం. అంతులేని కథలో మధ్యతరగతి సరితగా నటించినా, అడవిరాముడులో ఆరేసుకోబోయి పారేసుకున్నాను అంటూ అందాలు ఆరబోసిన జయప్రదకు ఎవరూ సాటిరారు. అడవిరాముడులో ఎన్టీఆర్‌పై జయప్రద మనసు పారేసుకున్నట్టు చూపించారు కానీ ఆ పాటలో మాత్రం జయప్రద అందాలకు ఎన్టీఆరే మనసు పారేసుకున్నట్టు అనిపిస్తుంది. అంతందగా ఉంటుంది జయప్రద. యమగోలో ఎన్టీఆర్‌కు తిక్కరేగేట్టు చేసింది ఇప్పటికీ మరిచిపోలేం. ఓలమీ తిక్కరేగిందా? అంటూ ఆరుపదుల వయసులోనూ ఎన్టీఆర్ చెలరేగిపోలేదా? ’’
‘‘నిజమే కానీ ఎప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన తారల వల్ల ఈ కాలంలో రాజకీయ పక్షాలకు ఉపయోగం ఉంటుందంటావా? ’’
‘‘పిచ్చోడా? ఎందుకుండదు బాగా ఉంటుంది. అప్సరస భువిపైకి వచ్చి నిన్ను పలకరించి, నీ సహాయం కోరిందనుకో నువ్వేమంటావు? కాదంటావా?’’


‘‘చచ్చినా కాదనను ’’


‘‘జయప్రద అంటే ఒకప్పటి అప్సరసే కదా? అప్సరస బిజెపి కోసం నాలుగు మాటలు మాట్లాడేందుకు వస్తే చూసేందుకు రాని వారుంటారా? నవ్వు ఔనన్నా కాదన్నా జయప్రద మహానటి’’
‘‘అంతులేని కథ గురించే అంతులేకుండా ఎన్నిసార్లు చెబుతావు’’
‘‘మహానటి అని  కేవలం సినిమాల రికార్డును చూసి అన్న మాట కాదు... రాజకీయాల్లో నూ  ఆమె ప్రతిభను చూశాకే ఆ మాట అంటున్నాను’’


‘‘ఇప్పుడు రోజుకు డజను మంది హీరోయిన్లు వస్తున్నారు. అరడజను సినిమాల్లో కూడా నటించకుండా, ఆరేడు వారాలకు కనుమరుగవుతున్నారు. అలాంటిది ఎప్పుడో 76లో వచ్చిన జయప్రద మూడు దశాబ్దాలు రాజకీయాల్లో ఆ తరువాత మరో రెండున్నర దశాబ్దాల నుంచి రాజకీయాల్లో వెలిగిపోతున్నారంటే మహానటి కాకుంటే మరేమిటి? ’’


‘ ఏమోరా నువ్వెంత చెప్పినా నేను కన్విన్స్ కావడం లేదు. సావిత్రిని తప్ప మరొకరిని మహానటి అంటే ఒప్పుకోబుద్ధి కావడం లేదు’’
‘‘ సావిత్రి మహానటే కాదనను, ఆమె సినిమాల్లో తప్ప కనీసం జీవితంలో కూడా నటించలేకపోయారు. మరి జయప్రద సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో సైతం అద్భుతంగా జీవించేస్తున్నారు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా జయప్రద మహానటి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అని సినిమాలో పాడినా, రాజకీయ జీవితంలో మాత్రం పారేసుకోకుండా జాగ్రత్తగా అరేసుకుంటున్నారు. ’’


‘‘ఏంటో నీ అభిమానం మరీ మితిమీరిపోతోంది’’
‘‘నా అభిమానం కాదు... ఈ మాట నీతో కూడా చెప్పిస్తాను చూడు. నాటకంలో ఎప్పుడు ప్రవేశించడమో తెలియడమే కాదు.. ఎప్పుడు దిగిపోవాలో తెలిసిన వాడే మంచినటుడు అంటారు కదా? అలాంటి లెక్కలు తెలియక పోవడం వల్లనే కదా మెగస్టార్లు కూడా జీరో అయ్యారు. లెక్కలు తెలిసి  ఎన్టీఆర్ హీరో అయ్యారు. ’’


‘‘ఎన్టీఆర్, చిరంజీవి, జయప్రద.. ఒకరితో ఒకరికి ఏం సంబంధం? ’’
‘‘అక్కడికే వస్తున్నా? ఎంత వీరాభిమానులున్నా 60 ఏళ్ల తరువాత హీరోగా అవకాశాలు ఉండవని గ్రహించి సరైన సమయంలో సినిమా నటన వదిలి ఎన్టీఆర్ రాజకీయ నాటక రంగంపైకి వచ్చారు. విజయం సాధించారు. అదే చిరంజీవి ఏం చేశారు 2009 ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చి బొక్క బోర్లా పడ్డారు. అదే అంత కన్నా ముందు 2004 ఎన్నికల్లో వచ్చినా, లేక 2014 ఎన్నికల కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చినా ఎక్కడో ఉండేవారు. ఇప్పుడు ఎక్కడున్నారో ఆయనకు కూడా తెలియని పరిస్థితి’’


‘‘నిజమే! పాపం ప్రజా సేవ చేసేందుకు చిరంజీవికి కాలం కలిసి రాలేదు’’
‘‘అదే జయప్రద ఏం చేశారో 94లో హీరోయిన్‌గా కాలం చెల్లిందని గ్రహించే ముందు ఎన్టీఆర్ పిలుపును అందుకుని రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా! అని 82లోనే ఎన్టీఆర్ పిలుపు ఇచ్చారు. కానీ అప్పుడు హీరోయిన్‌గా దూకుడు మీదున్న జయప్రద పనె్నండేళ్ల తరువాత ఆపిలుపునకు స్పందించారు. తెలుగులో అవకాశాలు ఉండగానే హిందీ సినిమాల్లోకి వెళ్లినట్టు తెలుగునాట తన రాజకీయాలకు కాలం చెల్లగానే ఢిల్లీలో వాలిపోయారు. అమర్‌సింగ్‌ను ఆశ్రయించి అప్పటి వరకు పేరు కూడా వినని రాంపూర్ మట్టిని ముద్దాడి ఇక ఇదే నా పుట్టిల్లు అని ఎంత చక్కగా డైలాగు చెప్పారు. పదేళ్లపాటు ఆమెను రాంపూర్‌కా రాణి అన్నట్టుగా చూశారా ప్రజలు. అమర్‌సింగ్ కాలం కలిసిరాకపోవడంతో జయప్రద ఆలోచనల్లో పడ్డారు. ఏమిటీ? నా రాజకీయ భవిష్యత్తు అని ఆమె దీర్ఘంగా ఆలోచిస్తుండగా, నరేంద్ర మోదీ ఆశాకిరణంలా కనిపించారు. మోదీ చేతిలోనే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుంది అంటూ మీడియా ముందు దేశ ప్రజలకు ఆమె సందేశం ఇస్తున్నారు’’


‘‘ఐనా ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చిన వాళ్లకే బిజెపిలో భవిష్యత్తు ఉంటుందని, ఇతరులను నమ్మరు అంటారు కదా? ’’
‘‘ పిచ్చోడా అదంతా అధికారంలోకి రాకముందే. ఎన్నికల ముందు కెసిఆర్ ఏమన్నారు. ఉద్యమం ముగిసింది,తెలంగాణ వచ్చింది ఇక మాది ఫక్తు రాజకీయ పార్టీ అన్నారా?లేదా? ఫక్తు రాజకీయ పార్టీ అంటే ఏమిటి? ఏమైనా చేయవచ్చు, ఎవరినైనా చేర్చుకోవచ్చు అని, అలా చేస్తేనే కదా? అధికారం నాలుగు కాలాలా పాటు పదిలంగా ఉంటుంది. ’’


‘‘ఇప్పుడు బిజెపి కూడా అంతే ఫక్తు రాజకీయ పార్టీ. సినిమాల్లో కథ నుంచి కాస్సేపు రిలీప్ కోసం ఐటం సాంగ్స్ పెట్టినట్టు.. సీరియస్ రాజకీయాల్లో కాసింతైనా మనోల్లాసం కోసం ఎన్నికల సమయంలో సినిమా తారలను పార్టీల్లో చేర్చుకుంటారు. ఈ విషయం చేరిన వారికి తెలుసు, చేర్చుకునే వారికీ తెలుసు. ఓటేసే వారికి ఇంకా బాగాతెలుసు. అంతా ఓ నాటకం.’’

12, జనవరి 2015, సోమవారం

సెలబ్రిటీ స్వీపర్లు!

చేతిలో చీపుర్లు పట్టుకుని ముచ్చట్లు పెడుతుండడంతో క్షణాల్లో కెమెరాలు ప్రత్యక్షం అయ్యాయి. అది వివిఐపి జోన్.. బాగా డబ్బు కోసం కిడ్నాప్ చేయాలనుకునే వారు మొదలుకుని కొవ్వును కరిగించుకోవాలనుకునే వారి వరకు అందరూ అక్కడికొస్తారు. ఎ నుంచి జడ్ కేటాగిరి వరకు సెక్యూరిటీ హక్కుగా ఉన్నోళ్లు అక్కడ సర్వసాధారణం. గుంపును చూసి మొదట కెమెరాలు ఆ వెంటనే సీనియర్ నాయకులు, ఔత్సాహిక నాయకులు, పోలీసులు చేరిపోయారు. మహిళా ఆత్మాహుతి దళమేమో అని ఈ గుంపును దూరం నుంచి పరిశీలిస్తున్న వ్యక్తి అంచనా వేశాడు. అంత మంది చుట్టు ముట్టేసరికి ఆ గుంపు బెదిరిపోయింది.


‘‘చేతిలో చీపుర్లున్నాయి కానీ వాళ్లు సినిమా యాక్టర్లు కాదు. సానియా మీర్జా లేదు, సైనా నెహ్వాల్ కనిపించడం లేదు. ఎంత దూరంలో ఉన్నా పొడుగు కాళ్ల గుత్తా జ్వాలా కనిపిస్తుంది. కనిపించడం లేదంటే ఆమె రానట్టే, అంటే వాళ్లు స్పొర్ట్స్ ఉమెన్స్ కూడా కాదని తెలిసిపోతోంది. కనీసం బడా పారిశ్రామిక వేత్తలు కూడా కాదు. ఏంటో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చీపురు పట్టుకోవడమే.. హీరోలా ఓ ఫోజు. కనీసం టాలీవుడ్ స్టార్లయినా కాదు కానీ చేతిలో చీపురు’’ అంటూ ఓ యువకుడు అందరికీ వినబడేట్టుగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. ‘‘చీపురు పట్టుకోవాలంటే కనీసం నాలుగైదు సినిమాల్లో లీడ్ రోల్స్‌లో నటించి ఉండాలని చట్టం తేవాలి. నాగార్జున చీపురుపట్టుకున్నప్పటి ఫోటో పేపర్‌లో వచ్చింది కదా నాగార్జున వెనుక నీలి రంగు జీన్స్ ప్యాంట్ కనిపిస్తుంది కదా? అది నాదే. తెల్లషర్ట్ వేసుకున్నాను కానీ అది కనిపించడం లేదు. జీన్స్ ప్యాంట్ అందగాడ్ని నేనే’’ అని అతను తనను తాను పరిచయం చేసుకున్నాడు. పొగమంచు వల్ల వాళ్ల ముఖాలు సరిగా కనిపించడం లేదు. పోలీసులు వచ్చి వారిని పలకరించారు. జరుగుతున్నది ఏమిటో అర్ధం కాక అంతా వణికిపోయారు. బిత్తరపోయి చూస్తున్న మహిళలు వారి మధ్యలో ఒకే ఒక పురుష పుంగవుడు. సార్ క్షమించేయండి సార్ నేను వద్దే వద్దన్నాను ఇదిగో వీళ్లే అంటూ అతను పోలీసు కాళ్ల మీద పడిపోయాడు. వాళ్లతో మాట్లాడిన తరువాత పోలీసులకు విషయం అర్ధమై అందరినీ వెళ్లిపొమ్మని పంపించేశారు. 

వాళ్లంతా స్వీపర్లు, వాళ్ల కాంట్రాక్టర్ బర్త్‌డే కావడంతో టీ తాగుదామని అంతా ఒక చోట చేరారు. ‘‘ఇదీ విష యం చీపుర్ల గుంపు కనిపించడంతో మీలానే మేము కూడా వివిఐపిలేమో అని కంగారు పడ్డాం’’ అని ని పోలీసు అధికారి అందరికీ విషయం వివరించి చెప్పాడు.
‘‘నిజమే చీపుర్లు అనగానే సెలబ్రిటీలే గుర్తుకొస్తున్నారు కానీ రోడ్లు ఊడ్చేవాళ్లు చీపుర్లు పట్టుకుంటారనే విషయమే మర్చిపోయామండి’’ అని మీడియా వాళ్లు నవ్వుకున్నారు. అంతా వెళ్లిపోయిన తరువాత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఆ చీపుర్ల బృందంలోని మహిళని పలకరించి, కంగారు పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చాడు.
‘‘ఈ మధ్య చాలా మంది చీపుర్లు పట్టుకొన్న ఫోటోలు పత్రికల్లో కనిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ కూడా రోడ్లు ఊడ్చే బిజినెస్‌లోకి వస్తున్నాడట కదా? ఏ వ్యాపారం దొరక నట్టు మీరంతా ఇందులోకి వచ్చి మా పొట్ట కొట్టాలా? రానివ్వండి వాళ్లందరినీ కడిగిపారేస్తాను’’ అని అమె ఆవేశంగా అంటోంది.


‘‘వాడెవడో పెద్ద కంపెనీ వాడు రోడ్లు ఊడ్చే కాంట్రాక్టు తీసుకుని వందల మంది సూపర్ వైజర్లను పెట్టుకుని మాతో రోడ్లు ఊడ్పిస్తున్నారు. మాకు తెలియదనుకోకండి మొన్న మా యూనియన్ మీటింగ్‌కు వెళ్లాను. రోడ్లు ఊడ్చే మా కన్నా సూపర్‌వైజర్లకు, కాంట్రాక్ట్ పొందిన కంపెనీకే ఎక్కువ ఆదాయం వస్తుందట! ఆదాయం బాగుందని ఏకంగా చీపుర్లు తీసుకుని పెద్దోళ్లంతా ఇలా రోడ్డున పడడం ఏమైనా న్యాయంగా ఉందా? ’’ అంటూ ఆమె ఆవేశంగా ప్రశ్నించింది.
‘‘ఆవేశపడకు... నేను చెబుతున్నాను కదా రోడ్లను ఊడ్చే నీ ఉద్యోగానికి ఎలాంటి ఢోకా లేదు. వాళ్లంతా సెలబ్రిటీలు అంటే బ్యాట్ పట్టినందుకు సానియా మీర్జా, సినిమాల్లో నటించినందుకు అమితాబ్ లాంటి వాళ్లు కోట్ల రూపాయలు తీసుకుంటారు. వ్యాపారంలో ఎత్తుపల్లాలు సహజమే ఎంత వ్యాపారం పడిపోతే మాత్రం చీపురు పట్టుకుని మీతో పోటీకి వస్తారా? రారు కదా? ’’ అని ఆ రిటైర్డ్ అధికారి ఆమెను అనునయించాడు.
‘‘మరి ఎందుకలా రోజూ చీపుర్లు పట్టుకుని టీవిల్లో కనిపిస్తున్నారు. ఇన్ని వందల మంది చీపుర్లు పట్టుకుని రోడ్డు మీదకు వస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయని భయంగా ఉంటుందా? ఉండదా? మీరే చెప్పండి. అర్ధరాత్రి నుంచి రోడ్లు ఊడ్చి రెక్కలు ముక్కలు చేసుకుంటే అందరి కమీషన్లు పోగా నెలకో నాలుగువేలు మిగిల్తే గొప్ప. దీనికీ పోటీ అంటే కోపం వస్తుందా? రాదా? మీరే చెప్పండి ’’ అని మళ్లీ అడిగింది.


‘‘ఎవరైనా మనిషే ఉద్యోగం పోతుందంటే కోపం వస్తుంది. కానీ టీవిల్లో రోజూ చీపుర్లతో కనిపించే వాళ్లేవరూ మీకు పోటీ కానే కాదు. ఇంకో విషయం తెలుసా? వాళ్లకసలు చీపురు పట్టుకోవడం కూడా సరిగా రాదు. ఇక ఊడ్వడం వరకెందుకు? కెమెరాల ముందు కాసేపు పట్టుకుని వెళ్లిపోతారు. నిజం నీమీద ఓట్టు నమ్ము.
స్వచ్ఛ్భారత్ అని కొత్త ప్రొగ్రామ్... మీ సూపర్‌వైజర్‌తో మంచిగుండాలని మీరనుకుంటారు కదా? అలానే దేశాన్ని పాలించే వాళ్లతో మంచిగుండాలని వాళ్లంతా అలా చీపుర్లు పట్టుకుని వెళ్లిపోతారు. ’’
‘‘స్వచ్ఛ్భారత్ అంటే ఏంటి బాబయ్యా.. రోడ్లు ఊడ్చేవారి జీతాలు పెంచడం, వారికి నీడ కల్పించడం, వారి ఆరోగ్యంపై దృష్టిపెట్టడం వంటి పథకాలు ప్రారంభిస్తారా? ’’


‘‘నీకెంత జ్ఞానోదయం కలిగించాలని ప్రయత్నించినా నీ చిన్నబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. స్వచ్ఛ భారత్ అంటే నీలాంటి స్వీపర్ల గురించి ఆలోచించడం కాదు. స్వచ్ఛ్భారత్ అంటే అంబానీ లాంటి బడా కార్పొరేటర్లు, అమితాబ్ లాంటి సూపర్ స్టార్లు, ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, సమంత లాంటి అందగెత్తలు చీపుర్లు పట్టుకోవడం. దేశానికో అంబానీ ఉన్నట్టుగానే రాష్ట్ర స్థాయి అంబానీలు కూడా ఉంటారు కదా? స్వచ్ఛ భారత్ అంటే ఏయే రాష్ట్రంలో ఏయే సెలబ్రిటీ ద్వారా చీపుర్లు పట్టించాలో ఆలోచించే ప్రోగ్రాం అంతే కానీ చీపుర్లు పట్టేవారి జీవితాల గురించి ఆలోచించే చీప్ ప్రోగ్రామ్ కాదు.’’ అని కోపంగా చెప్పి వెళ్లిపోయాడు ఆ రిటైర్డ్ ఉన్నతాధికారి.
సెలబ్రిటీ లు స్వీపర్ల అవతారం ఎత్తోచ్చు  .. కానీ స్వీపర్లు సెలబ్రిటీ లు కాలేరు 

6, జనవరి 2015, మంగళవారం

ఎంత ఎదిగి పోయావయ్యా!?

‘‘ఏమోయ్ ఉత్తరాలు రాయడంతో నా అంత మొనగాడు లేడని ఓ తెగ చెప్పుకుంటావు కదా? ఏదీ ఒకటి రాసిపెట్టు చూద్దాం నీ ప్రతాపమెంతో?’’
‘‘టీ హోటల్‌లో ఖాళీగా కూర్చున్నానని తక్కువగా అంచనా వేయకు, టీ కొట్టు నుంచి ఎర్రకోటకు ఎగబాకిన మోదీ కాలమిది.’’
‘‘ఆ మధ్య ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతోడు ఇందిరాగాంధీ కూడా ఓడిపోయంది అని చెప్పుకునేవారు. ఇందిరాగాంధీ కూడా ఓడిపోయంది నిజమే కానీ ఓడిపోయిన వారంతా ఇందిరాగాంధీ కాలేరు. టీ కొట్టు నడిపేవారంతా మోదీలు కారు’’
‘‘అది సర్లే కానీ ఇంతకూ ఈ వయసులో ప్రేమ లేఖ రాయించుకోవాలనెందుకనిపించింది. ’’
‘‘లేఖ రాయమన్నాను కానీ ప్రేమ లేఖ అని చెప్పలేదు కదా? ’’
‘‘మరింకేం లేఖ.. ఏరా నీకు గుర్తుందా? ఈ చేతితో మన క్లాస్‌లో ఎంత మంది కోసం ప్రేమ లేఖలు రాయలేదు. ఎవరు ఎవరిని ప్రేమించినా, ప్రేమ లేఖ రాయాల్సింది నేనే కదా? ఆ రోజు గుర్తుందా? సురేష్ గాడు తన ప్రేయసికి లేఖ రాయమంటే పొరపాటున వాడి పేరుకు బదులు నా పేరు రాసుకున్నాను. వెదవ ఆ మాత్రం కూడా చూడకుండా అలానే ప్రేమలేఖ ఇవ్వడం , ప్రేమలేఖ రాయలేనోడికి ప్రేమెందుకని ఆ అమ్మాయి తిట్టడం ’’
‘‘చాల్లేవోయ్ అంటే నాకు లేఖ రాయడం రాకున్నా నీతో రాయించుకోవడానికి వచ్చాననుకున్నావా? అయినా నాకు కావలసింది ప్రేమ లేఖ కాదు. జీవిత లేఖ. ఇదేమీ ప్రేమలేఖలు రాసే కాలం కాదు, వయసు కాదు. ’’
‘‘సర్లే విషయమేంటో చెప్పు. లేఖ అంటూ రాయడం వచ్చిన వాడు వీలునామానైనా, విడాకుల పత్రమైనా, ప్రేమలేఖనైనా రాయగలడు. ఇంతకూ ఇందులో నీకే లేఖ కావాలి. సెలవు చీటి రాయించుకోవడానికి నీకేమన్నా ఉద్యోగమా? సద్యోగమా? పార్టీ అంటూ పైరవీలు అంటూ తిరగేటోడికి నీకు లేఖలతో పనేంటిరా? చెక్కుపై సంతకం చేయడానికి తప్ప పెన్ను ఉపయోగించనోడివి నువ్వు’’
‘‘ఎప్పటి నుంచో పార్టీలో తిరుగుతున్నానని తెలుసు కదా? ’’
‘‘ఎందుకు తెలియదురా! చదువు ఒంటబట్టకపోయినా చదువుకున్నోడికన్నా బాగానే సంపాదిస్తున్నావని మనోళ్లందరూ నిన్ను చూసి కుళ్లుకుంటున్నారు. ఎన్ని తరాల వాళ్లయినా ఇంట్లో కూర్చోని తిన్నా ఇబ్బంది లేకుండా గడిచిపోయేంత సంపాదించావని మన మిత్రులంతా మీ గురించి చెప్పుకుంటారు. ఐటి ఉద్యోగి అయినా బోలెడంత ఐటి చెల్లించే ఉద్యోగి అయినా ఆరునెలల పాటు జీతం లేకున్నా గడిచిపోయేంత డబ్బు బ్యాంకు అకౌంట్‌లో ఉంచుకునే వాడే మంచి ఆర్థిక సూత్రాలు పాటించేవాడని అంటారు. వాడే గొప్ప ఆర్థిక పనిమంతుడు అనుకుంటే నువ్వు ఏకంగా పదేళ్లపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిని కూర్చోని చూపించావంటే , చదువుకున్నవాడికన్నా మధ్యలోనే చదువు వదిలేసుకున్న నువ్వే గ్రేట్‌రా! ’’
‘‘ఏదో అంతా ప్రజల అభిమానం. నా లేఖ గురించి కాస్త ఆలోచించు. ఏమీ లేదురా! ఆవురావురు మంటూ ఇంత కాలం ఎదురు చూశాక అధికారం వచ్చింది కదా? విపక్షంలో ఉన్నప్పుడు సంపద పంపణి అని చెప్పిన మాటకు కట్టుబడి ఇప్పుడు అధికార పంపిణీకి అవకావం ఏర్పడింది. ఏదో నాకు తోచిన ప్రజా సేవ చేయాలి కదా? ప్రజా సేవ చేయాలంటే ఏదో ఒక పదవి ఉండాలి. పదవి పొందేందుకు కూడా అప్లికేషన్ పెట్టుకోవాలని మా బాస్ పిలుపు నిచ్చారు. కనీసం కాలేజీలో సీటు కోసం కూడా సొంతంగా అప్లికేషన్ పెట్టుకున్న అనుభవం లేదు. ఆ పనేదో నువ్వు చేసిపెడతావని వచ్చాను ’’
‘‘ఓ దాందేం భాగ్యం. తప్పకుండా వివరాలు చెప్పు మరి... చదువు సంధ్యలు, స్పోర్ట్స్‌లో గెలిచిన పతకాలు. వీటితో పాటు ప్రజా సేవలో ప్రజల కోసం నువ్వు చేసిన మంచి పనులు ఏమిటేమిటో చెప్పు వాటితో చక్కగా లేఖ రాసేస్తాను’’
‘‘మన దగ్గర సర్ట్ఫికెట్లు ఏమీ లేవు. కానీ ఏ సర్ట్ఫికెట్ కావాలన్నా సంపాదించే తెలివితేటలు ఉన్నాయి. పిచ్చోడా ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నావా? నేను దరఖాస్తు రాయమన్నది గవర్నమెంట్‌లో పదవి కోసం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కోసం కాదు. మంచి పనులు చేసేదుంటే రాజకీయాల్లో ఎందుకుంటాంరా! ఎదుటోటి మీద నాలుగు రాళ్లు విసిరేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి రాజకీయాల్లోకి వస్తాం ... అది కాదు కానీ ఏయే వివరాలు ఉండాలో నేను చెబుతాను వాటన్నింటిని కలిపి మా బాస్ మురిసిపోయేలా లెటర్ రాసే బాధ్యత నీది.... ఇదిగో ఈ పేపర్ కటింగ్ చూడు దరఖాస్తుకు ఇది జత చేయి ఈ ఒక్క సర్ట్ఫికెట్ చాలు పదవి వచ్చి నా ఒళ్లో వాలిపోవడానికి
హత్యలు చేసైనా బాస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకు రావాలి ఈ స్టేట్‌మెంట్ చూశావా? నాదే ఈ స్టేట్ మెంట్. ఒక్క స్టేట్‌మెంట్‌తో పార్టీలో మన క్రేజీ ఎంత పెరిగిపోయిందో తెలుసా? ఈ అంకె జనాభాలో మా కులం ఓట్లది. దొంగ ఓట్లు వేయించినందుకు ఇదిగో నాపై పెట్టిన కేసులు. రాళ్లు విసిరినందుకు, బంద్‌లు చేసినందుకు, దాడులు జరిపినందుకు ఇదిగో నాపై పెట్టిన కేసుల జాబితా.
‘‘ఇవి చాలు వీటితో దరఖాస్తు తయారు చేసేయ్’’
‘‘ ఏరా ఏదో చిన్ననాటి మిత్రుడివని ఇంత సేపు నీతో చనువుగా మాట్లాడాను కానీ నీమీదున్న కేసులు చూస్తుంటే నీతో మాట్లాడేందుకు నాకే భయమేస్తుందిరా! ’’
‘‘నిజంగానా? ఐతే నాకు పదవి ఖాయం. ఈ కేసులే నాకు శ్రీరామ రక్ష ఇంకో మాట నాకు పదవి వచ్చాక నువ్వే నా పిఎ. రాయడం బాగా తెలిసి వ్యవహారం ఏమీ తెలియని నువ్వే నాకు కావాలి. అసలే రోజులు బాగా లేవు. రాజకీయాల్లో ఎవరినీ నమ్మలేం.’’
‘‘నువ్వు చెబుతుంటే నీ మాటే నిజమనిపిస్తోందిరా! చదువుకొని నేనెంత నష్టపోయానో, చదువు అబ్బక నువ్వెంత బాగుపడ్డావో మనను చూసిన ఎవరికైనా అర్ధమవుతుంది’’
‘‘నా ప్రతిభను గుర్తించినందుకు థ్యాంక్స్. ఇంకో విషయం ఆ లెటర్‌తో పాటు ఇంకో సర్ట్ఫికెట్ రహస్యంగా జత చేయాలి’’
‘‘ ఏంటది? ’’
‘‘ మనమీదో మర్డర్ కేసు కూడా ఉంది.. ఇదిగో ఆ మర్డన్ నేనే చేశానని కోర్టు ఇచ్చిన తీర్పు ’’
‘‘ ఎంత ఎదిగిపోయావయ్యా’’
‘‘ ఏదో అంతా మీ అభిమానం’’
**