29, జనవరి 2014, బుధవారం

ఈ తరం జాతి నేతలు కిరణ్ వీరప్పన్ .. వారి జీవితమే మనకు సందేశం

ఇప్పుడు మనం అనుభవిస్తున్నవన్నీ ఓ శతాబ్దం క్రితం కలలో కూడా ఊహించి ఉండం. రోజులో ఎక్కువ భాగం టీవికే అంకితం. ఫేస్‌బుక్ లేనిదే ఉండలేం. కంప్యూటర్ లేనిదే గడవదు. ల్యాప్ టాప్ పక్కలో లేందే నిద్ర పట్టదు. గూగుల్ సెర్చ్ పని చేయకపోతే ఊపిరి ఆగిపోతోందేమో ననిపిస్తోంది. నాకు గూగుల్‌తో పని లేదు, మా ఆవిడకు అన్నీతెలుసు అనే మాట రాసున్న టీ షర్ట్ ఒకటి ధరించిన మొగుడి గారి ఫోటో ఫేస్‌బుక్‌లో బాగానే చక్కర్లు కొడుతోంది. ఆ మొగుడ్ని వదిలేస్తే గూగుల్ లేకుంటే అమ్మో ఇంకేమైనా ఉందా? ఎక్కడున్నా సెల్‌ఫోన్ పుణ్యమా అని క్షణాల్లో ఒకరికొకరు పలకరించుకోవచ్చు. ఇంతటి మహత్తర మైన కాలంలో మనం ఉండడం మన అదృష్టం. వందేళ్ల క్రితం ఇవేవీ ఆ నాటి ప్రజలకు లేవు. ఒక్కో సారి మనమే అదృష్టవంతులం అనిపిస్తోంది, మరోసారి కాదే మో అనిపిస్తోంది. ఎందుకా డైలమా? అంటే ?


నా జీవితమే నా సందేశం అంటూ చెప్పింది చేశారు, చేసిందే చెప్పి తన జీవితానే్న సందేశంగా ఇచ్చారు ఆనాటి తరానికి మహాత్ముడు. బగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్, లాల్‌బాల్‌పాల్ ఒక్కోక్కరి పేరు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చదువును, భవిష్యత్తును పక్కన పారేసి దేశం కోసం త్యాగం చేయడానికి ఆనాటి యువతను చైతన్య పరిచిన మహనీయులు బతికిన కాలం అది. వాళ్లకు సెల్‌ఫోన్ లేకపోవచ్చు, ఇంటర్‌నెట్ పేరు విని ఉండకపోవచ్చు. ఫేస్ వాల్యూ తప్ప వారికి ఫేస్‌బుక్ గురించి విని ఉండక పోవచ్చు.


ఇవేవీ లేని ఆ నాటి తరానికి ఆనాటి మహనీయులు మా జీవితమే మా సందేశం అని చెబితే, అన్నీ సౌకర్యాలు ఉన్న మన కాలంలో కూడా కొందరు మహనీయులు నా జీవితమే నా సందేశం అని చెబుతున్నారు.


కిరణ్ అని ఓ కుర్రాడు టీవిల్లో తెలుగు జాతిని ఉద్దేశించి గంభీరమైన ఉపన్యాసం చేశారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లు రాత్రికి రాత్రి కోట్లు సంపాదిస్తున్నారు. దేశం ఎక్కడికి పోతోంది. ఈ దేశానికి నిజాయితీ పరులైన వారు, యువత కావాలి అంటూ చక్కని ఉపన్యాసం ఇచ్చాడు. బావ కళ్లల్లో మొద్దు శీను ఆనందం చూసినట్టుగా, ఆ యువకుడి కళ్లల్లో వెలుగును చూసిన చానల్ వాళ్లు దాన్ని తమకు మాత్రమే పరిమితం చేసుకోకుండా ఆఖిలాంధ్ర తెలుగు ప్రేక్షకులకు చూపించారు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను అనే మాట ద్వారా బోసుబాబు ఆనాటి యువత రక్తం మరిగేట్టుగా చేశాడు.
యువతలో ఆత్మవిశ్వాసం కోసం వివేకానందుడు తన జీవితాన్నే అంకితం చేశాడు .  హిందుమత ఔన్నత్యాన్ని అమెరికాలో అమెరికా వారికి చెప్పి వచ్చాడు. మరి నేనేం చేసి సందేశం ఇవ్వాలా? అని కిరణ్ బాగా ఆలోచించి తనిష్కలో కేజీల కొద్ది బంగారం దోచేశాడు. మీకేం ఎన్నయినా మాట్లాడతారు. ఆ కుర్రాడు నేను సందేశం ఇస్తాను అంటే టీవి చానల్ గేటు లోపలికి రానిస్తారా! మూడు రోజుల్లో కేజీల కొద్ది బంగారం దోచుకోవడం ఎలా? అనే అంశంలో నైపుణ్యం సాధించాడు కాబట్టి ఆ యువకుడు జాతిని ఉద్దేశించి చేసే ఉపన్యాసాన్ని టీవిలో లైవ్‌గా చూపించారు. ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా? లేదా అనేది ముఖ్యం. ఇలాంటి జాతీయ యువ యోధులను మన చానల్స్ మరింతగా ప్రోత్సహించి మరింత మంది కిరణ్ లను అర్జంట్ గా తాయారు చేయాల్సిన అవసరం ఎంతయినా ఉంది . ఎలాగైతేనేం సందేశం ఇచ్చే చాన్స్ వచ్చిందా? లేదా? అనేది ముఖ్యం. 

విభజన హడావుడి వల్ల ఆ కుర్రాడి సాహసోపేత సందేశానికి మీడియా ఆ కుర్రాడు ఆశించిన మే రకు ప్రాధాన్యత ఇవ్వలేదమోననిపిస్తోంది. లేకపోతే కిరణ్‌కు పిజ్జా అంటే ఇష్టమా? ప్యారడైజ్ బిర్యానీ ఎన్ని రోజులకోసారి తింటాడు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానా?  పవనిజంపై అతని అభిప్రాయం ఏమిటి? మహేశ్‌బాబు సినిమాలు ఎన్ని చూశారు? హీరోయిన్లలో ఎవరంటే ఇష్టం? రాష్ట్ర విభజనపై మీ అభిప్రాయం ఏమిటి? విభజన వల్ల కలిగే నష్టాలు, సమైక్యాంధ్ర కోసం మీరు చేయాలనుకుంటున్న త్యాగాలు ఏమిటి? అనే ప్రశ్నలు బోలెడు వేసి ఉండేవారు. ఎలాగో ఇతను రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్నాడు కనుక అప్పుడు టీవిలో ఈ ప్రశ్నలన్నీ అడగొచ్చు.


ప్రపంచాన్ని జయించాలనుకుని బయలు దేరిన అలెగ్జాండర్ మరణించాక శవపేటికలో తన రెండు చేతులు బయటకు వచ్చేట్టు ఏర్పాటు చేయమని ముందే చెప్పాడట! అలెగ్జాండర్ కూడా వెళ్లేప్పుడు ఏమీ తీసుకు వెళ్లలేదని చెప్పడానికి. అలానే కిరణ్‌కు ఇంకాస్త సమయం ఇస్తే ఇలాంటి సందేశం ఏదో ఒకటి ఇచ్చేవాడే.
మన తెలుగు తేజం ఘన కార్యం తక్కువ చేసి చూపడం కాదు కానీ అప్పుడెప్పుడో వీరప్పన్ కూడా జాతికి ఇలాంటి సందేశమే ఇచ్చాడు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసి కన్నడ జాతికి గొప్ప సందేశం ఇచ్చాడు. అయ్యా ! నీ డిమాండ్లు ఏమిటి? అని ప్రశ్నిస్తే, కన్నడ సమాజానికి గొప్ప సందేశం ఇవ్వడానికే ఈ కిడ్నాప్ అని చెప్పుకొచ్చారు.
సరే ఏమిటా? సందేశం అని అడిగితే కన్నడ నాట కన్నడ భాష అమలు తీరు పట్ల వీరప్పన్ ఆవేదన వ్యక్తం చేశారు. కన్నడ సంస్కృతి, సంప్రదాయాలు, కన్నడ భాషకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అని గట్టిగా వాదించారు. అడవుల్లో గంధం చెట్లు దొంగకు అడవి జంతువుల భాష తప్ప కన్నడ భాషమీద ఇంత అభిమానం ఉంటుందని ఎవరూ అనుకోలేదు. సచివాలయంలో ఉండే సచీవులకన్నా అడివలో ఉండే గందం చెట్ల స్మగ్లర్‌కే ఎక్కువ భాషాభిమానం ఉందని భాషాభిమానుల కళ్లు చెమ్మగిల్లాయి. లోగుట్టు పేరమాళ్ళ కెరుక. పెద్ద మొత్తంలో డబ్బుకోసమే కిడ్నాప్ చేశాడని, డబ్బులు చేతులు మారాకే రాజ్‌కుమార్‌ను విడుదల చేశారని తరువాత ప్రచారం జరిగింది. కిడ్నాప్ తరువాత కన్నడ భాష అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్టయితే కనిపించలేదు.


ఇంతటి మహనీయుల సందేశాలను లైవ్‌గా వినగలుగుతున్న మనం అదృష్టవంతులమా? దురదృష్టవంతులమా? ఆధునిక సౌకర్యాలు లేకపోయినా మహనీయుల జీవితాలనే సందేశాలుగా చూసిన తరం గొప్పదా? ఏమో అన్నీ ప్రశ్నలే. ఎవరికి నచ్చిన సమాధానం వారు చెప్పుకోవలసిన కాలమిది.

22, జనవరి 2014, బుధవారం

ఆత్మ లేని ఆత్మకథలు.... భాగవతం శ్రీకృష్ణుని ఆత్మకథ .. రామాయణం శ్రీ రాముని ఆత్మ కథ

అధికారం అనుభవించిన వారి జీవితాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఎక్కడ రహ స్యం ఉంటుందో అక్కడ ఆసక్తి ఉంటుంది. అధికారం అన్నప్పుడు కడుపులో ఎన్నో రహస్యాలు ఇమిడి ఉంటాయి. అందుకే ఆ ఆసక్తి. అలాంటి వారు ఆత్మకథలు రాస్తే. రహస్యాలు బయటపెడతారేమో అనే ఆసక్తి ఉంటుంది. నిజాం పాలన ముగిసి ఆరు దశాబ్దాలు దాటిపోయినా నిజాం పై చర్చ ఇప్పటికీ అసెంబ్లీలో సాగుతూనే ఉంది. ఇండో చైనా వార్ సమయంలో భారత సైన్యానికి నిజాం 120 కేజీల బంగారం ఇచ్చాడట! భగవద్గీత అనువాదానికి నిధులు, తిరుపతితో పాటు అనేక ఆలయాలకు నిధులు ఇచ్చాడట! ఇవన్నీ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చెబుతుంటేనే ఆసక్తిగా అనిపించినప్పుడు ఇక స్వయంగా నిజాం తన ఆత్మకథ రాస్తే ఇంకెన్ని రహస్యాలు తెలిసేవో?

 హైదరాబాద్ అభివృద్ధిలో తన వంతు పాత్ర వహించి, పాలనలో చివరి రోజుల్లో కాశీం రజ్వీ చేతిలో కీలుబొమ్మగా ఎందుకు మారాల్సి వచ్చిందో, రజ్వీ ముష్కరులు గ్రామాలపై పడి అమాయకులను హతమారుస్తుంటే ఎందుకు నివారించలేకపోయాడో పాకిస్తాన్ మద్దతుతో హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా ఉంచాలని ఎందుకనుకున్నాడో ఎవరో చెప్పడం కన్నా ఆయన ఆత్మకథలో చెప్పి ఉంటే బాగుండేది.


నాలుగు వందల ఏళ్లు పాలించారు కానీ కనీసం ఓ నలుగురైనా ఆత్మకథలు రాయలేదు. భారతీయులకు అత్మకథల అలవాటు తక్కువే. సురవరం ప్రతాపరెడ్డి దీన్ని ఒప్పుకుంటూనే అదేం కాదు మనం సరైన కోణంలో చూడడం లేదు కానీ భాగవతం, రామాయణాలు ఆత్మకథలు కాకుంటే మరేమిటని ఎదురు ప్రశ్నించారు. శ్రీకృష్ణుడు బాల్యం నుంచి చివరి వరకు సాగించిన లీలల సారం భాగవతం శ్రీకృష్ణుని ఆత్మకథే. శ్రీరాముడి జీవితమంతా రామాయణంలో కళ్ల కు కట్టినట్టు ఉంది కదా అది ఆత్మకథే కదా అం టారాయన. ఇక్ష్వాకుల కాలం నుంచే మనకు అత్మకథలు రాసుకునే అలవాటు ఉందనేది ఆయన అభిప్రాయం.. పురాణాలన్నీ దేవుళ్ల ఆత్మకథలు అనడం వాదనకు బాగానే ఉన్నా. అత్మకథలుగా అవి నిలవవు.


దాదాపు ఏడు దశాబ్దాల క్రితం నాటి మాట! నిజాం పాలనా కాలంలో హైదరాబాద్‌లో ప్రముఖ పత్రిక మిజాన్.. తిరుమల రామచంద్ర, అడవి బాపిరాజు లాంటి హేమా హేమీలు అందులో పని చేశారు. తిరుమల రామచంద్ర ఆఫీసుకు రాగానే చెత్తబుట్టలో ఏమున్నాయో చూసేవారట! మంచి సాహిత్యం సరైన వ్యక్తి చేతిలో పడనప్పుడు అది దర్శనమిచ్చేది అక్కడే అని ఆయన గట్టి నమ్మకం. ఒకసారి అలా చూడగా, చప్రాసీ ఆత్మకథ అంటూ ఒక ఆత్మకథ చెత్తబుట్టలో కనిపించింది. మహామహులే ఆత్మకథలు రాయడం లేదు వీడెవడో చప్రాసీ పైగా ఆత్మకథ రాసుకోవడం అని ఎవరో ఒకాయన దాన్ని చెత్తబుట్టలో పారేశాడు. దాన్ని చదివిన తిరుమల రామచంద్రకు ప్రచురించదగిన రచనగా అనిపించి, అడవి బాపిరాజుకు చూపించారు. చప్రాసీగా పని చేసిన ఒకాయన తన జీవితంలో ఎదురైన సంఘటనతో రాసిన ఆత్మకథ అది. అక్షర దోషాలు ఉన్నాయి, వాటిని సవరించి యధాతథంగా ప్రచురించండి అని అడవి బాపిరాజు ఆదేశించారు. రాయాలనే ఆసక్తి ఉండాలి కానీ చప్రాసీకి సైతం ఆత్మకథ రాసుకునేంత జీవితం ఉంటుంది.


అధికారంలో ఉన్న వారు రహస్యాలు బయటపడతాయనే భయంతో ఆత్మకథల జోలికి వెళ్లరు. నిజాయితీగా నేతలు ఆత్మకథలు రాస్తే హాట్ కేకులు కాకుండా ఉంటాయా?
మనుషులు చెప్పేదాంట్లో నిజాలు ఎంతుంటాయంటే ఈ మధ్య ఓ రచయిత ఐస్‌బర్గ్‌ని ప్రస్తావించారు. అది పది శాతం మాత్రమే పైకి కనిపిస్తుంది. పైకి కనిపించే పది శాతాన్ని బట్టి లోన ఉన్న 90 శాతం గురించి ఊహించుకోవాలి తప్ప కనిపించదు. నాయకులు చెప్పేదానిలో ఆ పది శాతం నిజాయితీ కూడా అనుమానమే. ఆ మధ్య బాబుతో మాట్లాడిన ఒకాయన బాబు పేరుతో మనసులోని మాట అని రాస్తే చివరకు అది ప్రత్యర్థుల చేతిలో ఆయుధంగా మారిపోయింది. నేతలు జీవించి ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉంటారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు రహస్యాలను ఆత్మకథల్లో చెప్ప రు. అంటే రాజకీయ రహస్యాలకు శాశ్వత స్థానం సమాధి మాత్రమే. ఎవరైనా నాయకుడు అధికారంలోకి రాగానే మీ చరిత్ర రాసేస్తాం అంటూ ఈ మధ్య బతక నేర్చిన వారు చౌరస్తాల్లో కనిపించే కూలీల్లా మీద పడిపోతున్నారు. ఆ నేతల ఆంద చందాలను పొగుడుతూ వీరు రాసే వాటి కన్నా సమాచార శాఖ ప్రకటనలు మెరుగ్గా ఉంటాయనిపిస్తుంది.


బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఆత్మకథ రాస్తానని బెదిరిస్తున్నారు. ఇప్పటి వరకు మన రాష్ట్రాన్ని 16 మంది ముఖ్యమంత్రులు పాలించగా, వీరిలో పావు మంది కూడా ఆత్మకథలు రాసుకోలేదు. మన నేతలకు ఆత్మకథలు అచ్చిరావేమో? ఎన్టీఆర్ ఆ త్మకథ రాసుకోవాలనే కోరిక రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పింది. ఈ కోరిక పుణ్యమా అని ఆయనకు కొత్త భార్య దక్కింది కానీ ఉన్న పదవి ఊడింది. అల్లుడికి కాలం కలిసొచ్చింది. నీలం సంజీవరెడ్డి ఆత్మకథ రాశారు. జలగం వెంగళరావు డిక్టెట్ చేస్తే వాళ్ల కోడలు రాసింది. కాసు బ్రహ్మానందరెడ్డి, దామోదరం సంజీవయ్యల ఆత్మకథలు కూడా వెలుగు చూశాయి. బహుభాషా వేత్త, సాహితీ మూర్తి పివి నరసింహారావు ఇన్‌సైడర్ అంటూ పరోక్ష ఆత్మకథ రాసుకున్నారు. ఇక రాజకీయాల్లో భవిష్యత్తు లేదనుకున్నారేమో నాదెండ్ల కూడా ఆ మధ్య ఆత్మకథ రాశారు. అంజయ్య, చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి, రోశయ్యలకు ఆ ఆలోచనలే రాలేదు ఎందుకో?

 ప్రకాశం పంతులు ఆత్మకథలో మరీ ఎక్కువ నిజాలు చెప్పేశారని వివాదం తలెత్తడంతో తగ్గించారు. హేమాహేమీలైన ఎంతో మందితో సినిమాలు తీసిన ఎంఎస్‌రెడ్డి నటుల గురించి కొన్ని నిజాలతో ఆత్మకథ రాస్తే తెలుగు సినిమా పరిశ్రమ చిన్నబోయింది. ఆయనకు ఇక సినిమాలు తీసే ఉద్దేశం లేదు కాబట్టి ధైర్యంగా రాశారు. కానీ ఆయన కొడుకు పరిస్థితి అది కాదు. ఇంకా నాలుగు కాలాల పాటు సినిమాలు తీయాలనుకుని, ఆత్మకథను మార్కెట్ నుంచి వెనక్కి తెప్పించారు. నేతి బీర కాయలో నెయ్యేంత ఉంటుందో ఆత్మ కథల్లో ఆత్మ అంత ఉంటుంది .    ఆత్మకథలకు ముఖ్య సూత్రం దానిలో ఆత్మ కనిపించవద్దు.

12, జనవరి 2014, ఆదివారం

నేనెవరు ? మీరెవరు ?

సోక్రటీసు చివరి దశలో నాకేమీ తెలియదని తెలుసుకున్నానంటాడు. అలానే కిరణ్ కుమార్‌రెడ్డి తన పదవీ కాలం ముగిసే సమయంలో నేనే ప్రాంతానికి చెందిన వాడినో చెప్పండి అంటున్నారు. నేనెవరిని? అనే సందేహం రావడం ఇది మొదటి సారి కాదు చివరి సారి కాదు. సిద్ధార్థునికి ఇదే అనుమానం వచ్చి బుద్ధునిగా మార్చింది. గొప్పవీరుడైన అశోక చక్రవర్తికి ఇదే అనుమానం వచ్చి కత్తిని పక్కన పారేసి బౌద్ధం స్వీకరించేట్టు చేసింది. శ్రీరాముని మదిలో సైతం ఇదే ప్రశ్న ఉదయిస్తే గురువు తీర్చాడు. 

సాధారణంగా రాజకీయ నాయకులు నేను అది ఇది అని చెప్పుకుంటారు. కానీ నేనెవరిని? అనే ప్రశ్న వేయరు. అధికారం పోయేటప్పుడు కలిగే ఆలోచనల పుణ్యమా అని ఇంత కాలానికి కిరణ్‌కు ఈ సందేహం వచ్చింది. తత్వవేత్త కాబట్టి సోక్రటీసు తనకేమీ తెలియదని తనకు తానే ప్రకటించుకున్నాడు. కానీ కిరణ్ రాజకీయ నాయకుడు. వీళ్లు అన్నీ ప్రజలనే అడుగుతారు. రాజకీయ నాయకుల కున్న గొప్ప సౌకర్యమే ఇది. సింగపూర్‌లో పెట్టుబడులు పెట్టినా, లక్ష కోట్లు కొల్లగొట్టినా వాళ్లు ప్రజల సంక్షేమం కోసమే ఆ పని చేస్తారు. అమ్మాయి చదువు, అబ్బాయి పెళ్లి అన్నీ వాళ్లు రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే చేస్తారు.


సాంప్రదాయ రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్న ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్ సైతం అచ్చం ఇలానే ప్రజలను అడిగారు. ఏం చేయాలో చెప్పండి? అని. ఢిల్లీ ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాలేదు, బిజెపి మొదటి స్థానంలో, ఆమ్ ఆద్మీ రెండవ స్థానంలో, కాంగ్రెస్ మూడవ స్థానంలో నిలిచింది. సహజంగా అయితే మొదటి స్థానంలో నిలిచిన బిజెపి అధికారంలోకి రావాలి.. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ చిన్నదే అయినా ప్రచారం పెద్దది అనే విషయం గ్రహించి ఢిల్లీ రాష్ట్రం కోసం చూసుకుంటే మోడీకి ఢిల్లీ పెద్ద గద్దె మిస్సయ్యే ప్రమాదం ఉందని గ్రహించి వద్దు లేండి మీరే తీసుకోండన్నారు. రెండవ స్థానంలో ఉన్న కేజ్రీవాల్ మీరేం చేయమంటే అది చేస్తాను అని ప్రజలను అడిగారు. రోగి కోరుకున్నదే వైద్యుడు ఇచ్చాడన్నట్టు కేజ్రీవాల్ కోరుకున్న విధంగానే జనం అభిప్రాయం చెప్పారు. అదే విధంగా ఇప్పుడు కిరణ్ కూడా ప్రజలనే అడుగుతున్నారు. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే. నా వయసు 53 ఏళ్లు ఇప్పుడు చెప్పండి..నాదే ప్రాంతం? అని ఆయన సోక్రటీసు గురువులా ముఖం పెట్టి నిండు సభలో అడిగారు.


నిండు సభలోకి ద్రౌపదిని ఈడ్చుకు రమ్మని దుర్యోధనుడు ఆదేశించినప్పుడు నన్నోడి తానోడెనా? తానోడి నన్నోడెనా? అని ద్రౌపది అడిగిన చిక్కు ప్రశ్నలా మీరే చెప్పండి నాదే ప్రాంతం? అని అడిగితే నేల తెలంగాణదైనా విత్తనం సీమాంధ్రదే అని ఎమ్మెల్యే హరీశ్‌రావు బాగానే చెప్పారు. కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు క్షేత్రం ముఖ్యమా, బీజం ముఖ్యమా అనేది మరో చర్చ. తప్పు పట్టాల్సింది నేలను కాదు నేల లక్షణం ఒకటే ఏ విత్తనం నాటిదే అదే మొలకెత్తుతుంది.


ఓ సినిమాలో ఎంఎస్ నారాయణ ఇంటికి సునీల్ దొంగతనానికి వస్తాడు. సరదాగా పందెం వేసుకుందాం అంటాడు. నువ్వెవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నేను దొంగను, మనిషిని, అంటూ సునీల్ రకరకాల సమాధానాలు చెప్పినా నువ్వు దొంగవా? మంచివాడివా? మనిషివా జంతువువా? అని కాదు నువ్వెవరు సరైన సమాధానం చెప్పి ఈ బంగారు గొలుసు తీసుకెళ్లమని సునీల్ బంగారు గొలుసు నొక్కెస్తాడు. కిరణ్ కూడా విభజన బిల్లుపై చర్చ జరిగేప్పుడు నేనెవరూ చెప్పండి అని పందెం కాసినట్టు ప్రశ్నించాడు. సమాధానం చెప్పలేకపోతే బిల్లు వీగిపోతుందనుకున్నారేమో ! మహా తత్వవేత్తలు ముందు ప్రజలను ప్రశ్నలు అడుగుతారు. అజ్ఞానులారా నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేంత గొప్పవాళ్లా మీరు అన్నట్టుగా అమాయక ప్రజల ముఖం ఒకసారి చూసి మళ్లీ వాళ్లే సమాధానం చెబుతారు. కిరణ్ కూడా అదే విధంగా తన ప్రశ్నకు తానే నర్మగర్భంగా సమాధానం కూడా చెప్పాడు. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను మరి నాదే ప్రాంతం అని ప్రశ్నించిన ఆయనే మరో సందర్భంలో పివి నరసింహారావును మీ ప్రాంతంలో గెలిపించరని, మా ప్రాంతంలో పోటీ చేయించి గెలిపించాం అంటూ తెలంగాణకు చెందిన పివి రాయలసీమ నుంచి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, తనదే ప్రాంతమో చెప్పకనే చెప్పారు.

 పివి ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు నంద్యాల నుంచి పోటీ చేశారు. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఒకరో ఇద్దరో సీమాంధ్రకు చెందిన వారు ఎన్నికైన సందర్భాలు ఉన్నాయి. ప్రధానమంత్రి పదవిలో ఉంటే తప్ప తెలంగాణ నేత సీమాంధ్ర నుంచి గెలవడం సాధ్యం కాలేదని మరొకరు ప్రాంతాల వాదన చెప్పుకొచ్చారు.


ఎస్‌వి రంగారావు, గుమ్మడి ప్రధాన పాత్రలుగా చాలా కాలం క్రితం ఓ సినిమా వచ్చింది. దొంగ కొడుకు దొంగే అవుతాడు, మంచివాడి కొడుకు మంచి వాడే అవుతాడు అనేది జడ్జి అయిన గుమ్మడి వాదన, అది తప్పు పెరిగిన పరిస్థితులే ముఖ్యం అనేది ఎస్‌విఆర్ వాదన. అది నిరూపించేందుకు గుమ్మడి కొడుకును ఎస్‌విఆర్ ఎత్తుకెళ్లి మహా దొంగగా తీర్చిదిద్దుతాడు. వీళ్ల పందెం సంగతేమో కానీ పాపం జడ్జి కొడుకు దొంగవుతాడు. సరే హీరో కాబట్టి దొంగ అయినా తిరిగి మారిపోతాడనుకోండి. కిరణ్‌కు ఈ సినిమాను చూపించేంత టైమ్ హరీశ్‌కు దొరికితే చేసే రకమే. కానీ అంత టైమ్ లేకపోవడం వల్ల భూమి ఏదైనా విత్తనం ఏదైతే చెట్టు అదే అవుతుందని చెప్పారు.


అమెరికాలో తెలుగు వారికి కొదవ లేదు. తల్లిదండ్రులు ఉద్యోగం చేసే కాలంలో అక్కడ స్థిరపడిన కుటుంబాలకు చెందిన పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. వారి జీవిత కాలంలో ఎప్పుడూ తెలుగునాడును చూడలేదు. అలాంటి కొంత మంది యువతను రాష్ట్ర విభజనపై అభిప్రాయం అడిగితే, ఏమంటారు? సీమాంధ్ర తల్లిదండ్రుల పిల్లలు సమైక్యవాదం వినిపిస్తారు, తెలంగాణావారి పిల్లలు విభజన జరగాల్సిందే అంటారు. ఎందుకంటే అది విత్తనం లక్షణం.

8, జనవరి 2014, బుధవారం

పాత కోణం- కొత్త పార్టీ

’’సార్ స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ ప్రయోగం.. జిఎస్‌ఎల్‌వి-డి5 ప్రయో గం విజయవంతం అయింది కదా? దీనిపై మీ అభిప్రాయం చెబుతారా?’’ అని విలేఖరులు ప్రశ్నించగానే, తెలుగు బాబు ఆగ్రహంతో ఊగిపోయాడు. నన్ను ఎలాగైనా దెబ్బతీయాలని అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోంది, దానిలో భాగంగానే ఈ ప్రయోగం చేశారు. తెలుగుజాతిని చీల్చడానికి చివరకు అంతరిక్ష ప్రయోగాలను సైతం వాడుకుంటున్నారు. మనుషులనైనా, యంత్రాలనైనా కలపాలి కానీ విడిదీయడం కాదు. రాకెట్, ఉపగ్రహం రెండు వేరు కావడం అంటేనే ఎంత బాధగా ఉంటుంది. మీరెన్ని పార్టీలు పెట్టినా, ఎక్కడికి ఉపగ్రహాలు పంపినా రెండు గ్రహాల్లోనూ మా పార్టీనే అధికారంలోకి వస్తుంది’’ అంటూ తెలుగు బాబు ఊగిపోతుండగా, ఒక నేత వచ్చి మెల్లగా చెవిలో సార్ కిరణ్ కొత్త పార్టీ పెట్టినప్పుడు మీరు చేయాల్సిన కామెంట్స్, క్రయోజనిక్ ప్రయోగం విజయవంతం అయినప్పడు చేయాల్సిన ప్రకటన రెండు కలిపి చెబుతున్నారు అని మెల్లగా చెవిలో చెప్పాడు. వెంటనే తెలుగు బాబు సర్దుకుని ...
పాదయాత్ర సమయంలో మీడియాలో నాకు లభించిన అపూర్వ స్పందన చూసి ఓర్వలేక దెబ్బతీయడానికి సోనియాగాంధీ, కిరణ్, జగన్, కెసిఆర్, నారాయణ, రాఘవులు, ఆర్ కృష్ణయ్య, చల్లయ్య నాయక్, భీంసింగ్ , వెంకట వీరయ్య అందరూ కలిసి కుట్ర పన్ని కిరణ్‌తో పార్టీ పెట్టిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది కోట్ల మంది ప్రజలు కూడా మిమ్మల్ని ఓడించాలని కుట్ర పన్నినట్టుగా ఉందని వెనకి నుంచి కుర్ర జర్నలిస్టు జోకేశాడు.


***
కిరణ్, తెలుగు బాబు, సోనియాగాంధీ కుమ్మక్కు అయ్యారనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి అని జగన్ మీడియాను ప్రశ్నించారు. ఇలానే ఎన్నికలు జరిగితే ఎలాగైనా జగన్ ముఖ్యమంత్రి అవుతారు, 30 సీట్లు గెలిచి ప్రధానమంత్రి ఎవరుండాలో నిర్ణయిస్తారనే భయంతో సోనియాగాంధీ సలహా మేరకు, తెలుగు బాబు సూచనల మేరకు కిరణ్ కొత్త పార్టీ పెడుతున్నాడు. ప్రజల గుండెల్లో మా చానల్ ఉంది, నాకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి మేమే విజయం సాధిస్తాం. 30 సీట్లు గెలిచి రెండు రాష్ట్రాలను ఒకటి చేస్తాను. తరువాత ఇం డియా పాకిస్తాన్‌లను ఏకం చేస్తాను. అమెరికా విధానాలను మారుస్తాను అని జగన్ బాబు సూటిగా స్పష్టంగా తన అస్పష్ట విధానాలను వివరించారు.


***
కిరణ్ పార్టీ అత్యంత ప్రమాదకరమైన నిర్ణ యం ప్రపంచంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో మీకు తెలుసా? మన రాష్ట్రంలో అంటూ జయప్రకాశ్ నారాయణ్ అంకెలు చదువుతుంటే సార్ ఇవన్నీ గూగుల్‌లో మేం కూడా చూశాం. నెట్ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి గూగుల్ కూడా అందుబాటులో ఉంటుంది అది కాదు కానీ కొత్త పార్టీ గురించి మీరేమంటారు.?
మీకు అస్సలు ఓపిక లేదు, నేను ఎంతో కష్టపడి ప్రపంచంలో తొలి పార్టీ ఏది, మన దేశంలో ఏ పార్టీ ఎప్పుడు స్థాపించారు, ఏ పార్టీ కార్యాలయం ఎక్కడుంది అనేది ఫోటోలతో సహా సేకరించి ఐదు గంటల పాటు సభలో మాట్లాడేందుకు సమాచారం అంతా సేకరించాను. అని జేపీ కొంత నిట్టూర్చి, ‘‘తెలుగుబాబును ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే కుట్ర ఇది. సమాజంలో మార్పు కోసమే మేం వచ్చాం నేను పోటీ చేసే చోటు సరే నేను లేని చోట తెలుగుబాబును గెలిపించి తెలుగు జాతి గౌరవాన్ని నిలపాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.’’అని చెప్పాడు.
***
కొత్త పార్టీ ఏర్పాటు వెనుక అంతర్జాతీయ కుట్ర ఏమైనా ఉందేమో చూడాలి. ఎన్ని పార్టీలు పుట్టినా వామపక్షాలపై ఏ ప్రభావం ఉండదు అని నారాయణ, రాఘవులు ఉమ్మడిగా పలికారు. ఔను అసలు మీ పార్టీ ఉంటే కదా ప్రభావం పడేందుకు అని వెనక నుంచి కమ్యూనిస్టు వ్యతిరేక శక్తి ఎవరో పలికారు.


***
బిజెపి కిషన్‌రెడ్డి సుదీర్ఘంగా వివరించేందుకు సిద్ధం కాగా, ప్రమాదాన్ని గ్రహించి సార్ ఒక్క ముక్కలో చెప్పండి టైమ్ లేదు అని విలేఖరులు ముందే చెప్పారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో పుట్టిన పార్టీలతో పాటు కొత్తగా పుట్టబోతున్న కిరణ్ పార్టీ సైతం బిజెపితో పొత్తు కోసం ప్రయత్నిస్తోంది అయితే మేం ఎవరితో పొత్తు పెట్టుకోం, 294 నియోజక వర్గాల్లో పోటీ చేస్తాం, అభ్యర్థులు దొరక్కపోతే పక్క పార్టీ నుంచి చేబదులు తీసుకుంటాం కానీ పొత్తు మాత్రం పెట్టుకోం.


***
ఏమండీ మీరు పార్టీ పెడుతున్నారా? అని శ్రీమతి కొంత సీరియస్‌గా ముఖం పెట్టి అడిగింది.
ఆ విషయం నాకేం తెలుసు.. నేనూ ఇప్పుడే టీవిల్లో చూస్తున్నాను. ఇంత స్పందన చూస్తుంటే పెడితే బాగానే ఉంటుందేమో అనిపిస్తోంది. ఏమంటావు? కిరణ్ అన్నాడు.
మీమీద మీకే నమ్మకం లేకపోయినా మీరు పెట్టే పార్టీపై ఇంత మంది నాయకులు అంత నమ్మకం పెట్టుకోవడం విచిత్రమే కదండి అని శ్రీమతి అడిగింది.
‘‘సర్లే ముందు ఇంకా మిగిలిన వాళ్లేమనుకుంటున్నారో చూద్దాం’’ అంటూ కిరణ్ టీవి చానల్ మార్చాడు.
విలేఖరులు కెసిఆర్ వద్దకు వచ్చి సార్ కిరణ్ కొత్త పార్టీ పై మీ అభిప్రాయం అని అడిగితే..
పక్క స్టేట్ వాళ్లతో మాకేంటి? ఒక్కటి కాకపోతే పది పార్టీలు పెట్టుకోమను. వాళ్ల పార్టీ కార్యాలయం మా స్టేట్‌లో ఉంటే మాకే పన్ను లు వస్తా యి మాకేం పోయింది’’ ముగించాడు.


***
‘‘కిరణ్, జగన్, బాబు, కెసిఆర్‌లందరిదీ కాంగ్రెస్ డిఎన్‌ఏనే. మా డిఎన్‌ఏ వాళ్లు అధికారంలోకి వస్తే మేం వచ్చినట్టే కదా అని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దిగ్విజయ్ సింగ్ ఎదురు ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఉన్న పార్టీల డిఎన్‌ఏ మాదే, కొత్త పార్టీ డిఎన్‌ఏ మాదే. మేం డిఎన్‌ఏ హోల్‌సేల్ సప్లయర్స్‌మి అని దిగ్విజయ్‌సింగ్ ఇంగ్లీష్‌లో చెప్పి హిందీలో నవ్వారు.
నీతి: మనుషులంతా ఒకటే అనేది ఎంత అబద్ధమో! నాయకులందరి డిఎన్‌ఏ ఒకటే అనేది అంత నిజం.

1, జనవరి 2014, బుధవారం

జర్నలిస్టులకు ఓపెన్ చాలెంజ్!

‘‘అంతా కట్టకట్టుకుని వచ్చారు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పడానికా? ’’ అంటూ బాస్ అడిగితే, కుర్ర జర్నలిస్టు మధ్యలో బ్రేక్ వేసి జీతం పెంచి ఎంత కాలమైంది? ఇవీ మా డిమాండ్లు’’ అని కాగితం ఇచ్చారు.

 ‘‘సర్లేవోయ్ తెగ కష్టపడిపోతున్నారు. మేమంతా పెద్ద పోటుగాళ్లమని మీపై మీకు బాగా నమ్మకం ఉంది కదా. మీకో పరీక్ష మీరో ఇంట ర్వ్యూ చే యాలి. రెండు డజన్ల ప్రశ్నలు ... ఒక్కదానికైనా సరైన సమాధానం రాబట్టాలి. మీ తరఫున మరో డజను ప్రశ్నలు రాసుకోండి అభ్యంతరం లేదు. సరైన సమాధానం రాబట్టాలి. ఇది షరతు ఈ పరీక్షలో మీరు విజయం సాధిస్తే మీ డిమాండ్లను ఈ రోజు నుంచే ఆమోదిస్తాను సరేనా?’’ అని బాస్ అనగానే అంతా ఎగిరి గంతేశారు. ‘‘ఇదో పరీక్షనా దానికి మేమంతా వెళ్లాలా? కెమెరామెన్ గంగతో రాంబాబు వెళితే చాలు’’ అన్నారు.
రాంబాబు అందరిలో  జూనియర్.. బాబంటే మహాఅభిమానం.
***
సాయంత్రం ఆరు గంటలు కాగానే గంగతో కలిసి రాంబాబు తెలుగునేత ఇంటికి వెళ్లారు.
‘‘ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారా? సరే అడుక్కోండి ’’ అన్నాడు తెలుగు నేత.
రాంబాబు:సార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలుగునేత : ఉల్లిగడ్డల ధర వింటేనే కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి బ్రదర్ ఇంతకు మించిన కష్టం ఇంకోటి ఉంటుందా?
రాం: మీ డేట్ ఆఫ్ బర్త్ చెబుతారా?
తెలుగునేత : ఎప్పుడు పుట్టామని కాదు.. ఎంత కాలం అధికారంలో ఉన్నాం, మళ్లీ ఎంత కాలంలో అధికారంలోకి రానున్నాం అనేది ము ఖ్యం. ఈ కాంగ్రెస్‌కు ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే హక్కు లేదు.
ప్ర: అంటే కాంగ్రెస్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నారా?
జ: అవిశ్వాసం పెడితే యువనేతకు లాభం, పెట్టక పోతే కాంగ్రెస్‌కు, మరి మాకేమిటి? ప్రజ లు ఈ కష్టాలు ఇంకెంత కాలం భరించాలి.
ప్ర: సార్ మీరు నరేంద్ర మోడీ పాపులారిటీ చూశాక బిజెపితో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారా?
జ: బాగా గుర్తు చేశావు బ్రదర్.. తెలుగునాట నేను సాధించిన అభివృద్ధితో ప్రేరణ పొంది మోడీ నా మార్గంలో పయనిస్తున్నాడు. మంచి ఎక్కడున్నా అనుసరించాలి. నా సామర్ధ్యాన్ని సరిగ్గా అంచనా వేసి మోడీ నన్ను అనుసరించాడు. ఇప్పుడు దేశం మొత్తంలో మంచి గుర్తిం పు తెచ్చుకున్నాడు. ఇది చూసైనా కాంగ్రెస్ వాళ్లు సిగ్గుపడాలి.
ప్ర:మీ అబ్బాయిని రాజకీయాల్లోకి తీసుకు వస్తున్నారా?
జ:బ్రదర్ పదవ తరగతిలో మా వాడు ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలిచాడు.
ప్ర: మీవాడికి ఇంటర్‌లో 70%మార్కులే వచ్చాయి కదా?
జ: ఏడో తరగతిలో మా వాడి ప్రతిభను చూసి సీటిస్తామని ప్రపంచంలోనే అత్యంత గొ ప్ప యూనివర్సిటీలు ఏడు ముందుకు వచ్చాయి.
ప్ర: సత్యం లింగయ్య మీ వాడి చదువు ఖర్చు భరించాడటంటారు.
జ: సరిగ్గా గుర్తు చేశావు. నేను అధికారంలో ఉన్నప్పుడు సత్యం లింగయ్య బిల్‌గేట్స్ పక్కన కూర్చున్నాడు. తరువాతేమైంది అందరికీ తెలిసిందే కదా?
ప్ర: మీ నెల జీతం రూపాయే కదా? దాంతో అంత పెద్ద పార్టీ భవనాన్ని ఎలా నిర్వహిస్తున్నారు. అక్కడేమైనా అక్షయ పాత్ర ఉందా? నిత్యాన్నదానం ఎలా జరుపుతున్నారు.
జ:నా దృష్టిలో అది పవిత్ర ఆలయం. అందు కే అక్కడ ఓన్లీ వెజిటేరియన్.


ప్ర: సార్ నాకిది చావు బతుకుల సమస్య కనీసం ఒక్క ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. ఇంతకూ మీరు రాష్టవ్రిభజన కోరుతున్నారా? సమైక్యంగా ఉండాలంటున్నారా?
జ: నీ రెండు చేతుల్లో ఏ చేతిని నువ్వు కోరుకుంటున్నావు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. రెండుకాళ్లు ఉంటేనే ప్రయాణం. ఉల్లిగడ్డ కోసినా రెండు ముక్కలవుతుంది. కొబ్బరికాయ కొట్టిన రెండే అవుతుంది. ఒకటి పూజారి తీసుకుని ఇంకొటి మనకిస్తారు. ఈ మాత్రం జ్ఞానం కూడా ఢిల్లీ పెద్దలకు లేకుండా పోయింది.
రాంబాబుకు కళ్లు తిరిగినట్టు అనిపించింది. ‘‘సార్ కాస్త మంచినీళ్లు తెప్పిస్తారా? ’’ అని అడిగాడు.
‘‘మేం అధికారంలో ఉండగా ఇంకుడు గుంతలు తవ్వి, భూగర్భ జలాలు పెంచాం. మేం అధికారం నుంచి దిగిపోయాక నీళ్లు కూడా కన్నీళ్లు కార్చి ఆవిరైపోయాయి.’’ అంటూ తెలుగునేత ఇంకా ఏదో చెబుతూనే ఉండగా, రాంబాబు పక్కకు ఒరిగిపోయాడు. కెమెరామెన్ గంగ పక్కకు వెళ్లి నీళ్లు తెచ్చి రాంబాబు ముఖంపై చల్లింది.
బ్రదర్ పర్లేదు కదా?


సార్ చివరగా ఒక్క ప్రశ్న. ఈసారి బాలకృష్ణ ఎన్నికల్లో పోటీ చేస్తారా?
జ: ప్రజలు ఫ్యాక్షనిజాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకే మా బాలయ్య బాబు నటించిన ఫ్యాక్ష న్ సినిమాలన్నీ హిట్టయ్యాయి.
ప్ర: అరవింద్ కేజ్రీవాల్......
జ: బాగా చెప్పావు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగించిన పాలనను ఆ మధ్య యూ ట్యూబ్‌లో చూసిన అరవింద్‌కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు. నన్ను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారు.
ప్ర: సార్ మీ రాజకీయ జీవితం అంతా మచ్చలే అని విమర్శలు ఉన్నాయి కదా?
జ: నేను అధికారంలో ఉన్నప్పుడు ఉదయం లేవగానే చక్రం తిప్పేవాడిని. అలా చక్రం తిప్పుతున్నప్పుడు పడిన గాట్లు అవి.
రాంబాబు నిరాశగా గంగతో కలిసి బయటకు వచ్చాడు.
‘‘్థర్టీ ఇయర్   ఇండస్ట్రి పిల్ల వెధవలు నా ముందు తమాషాలా’’అని తెలుగునేత నవ్వుకుంటూ ఇంకెవరైనా ఇంటర్వ్యూకు వస్తే పంపించండి అని చెప్పి లోనికి వెళ్లాడు.


రాంబాబు గుక్కపెట్టి ఏడుస్తూ చిన్నపిల్లాడిని చేసి మీరంతా నా జీవితంతో ఆడుకుంటారా? అని భోరుమన్నాడు.
విషయం తెలిసి బాస్ వికటాట్టహాసం చేస్తూ ఓపెన్ చాలెంజ్. కొమ్ములు తిరిగిన జర్నలిస్టు, సొమ్ములు మరిగిన జర్నలిస్టులు ఎవరైనా సరే. కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిస్తే దేనికైనా రెడీ అంటూ ఓపెన్ చాలెంజ్ చేశాడు.


 ‘డాన్‌కో పకడ్‌నా ముష్కిల్ హీ నహీ నా మున్కీన్‌హై’ అని టీవిలోఏదో సినిమా డైలాగు వినిపిస్తోంది.