18, ఆగస్టు 2018, శనివారం

దేశద్రోహులకో దేశం!

ఎంటీ.. అంత రహస్యంగా స్మార్ట్ ఫోన్ లో  లీనమయ్యావు’’
‘‘స్వచ్ఛ పనిలో ఉన్నాను. మెసేజ్‌లతో ఫోన్ బరువుగా మారింది. క్లీన్ చేస్తున్నాను’’
‘‘నాకు తెలుసులే.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షల మెసేజ్‌లతో ఫోన్ నిండిపోయి ఉంటుంది?’’
‘‘కాదు.. ఆ మెసేజ్‌లు మహా అయితే ఆరేడు వచ్చి ఉంటాయి. ఈసారి చిత్రంగా స్వాతంత్య్ర దినోత్సవ వ్యతిరేక మెసేజ్‌లతో ఫోన్ నిండిపోయింది. మనకింకా స్వాతంత్య్రం రాలేదు. ఇదేనా స్వాతంత్య్రం? ఎవరి కోసమీ స్వాతంత్య్రం? అంటూ ఆరేడు వేల మెసేజ్‌లు వచ్చాయి. ఆశ్చర్యకరంగా ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వ్యతిరేక శుభాకాంక్షలతో ఫేస్‌బుక్ నిండిపోతుందనే జ్యోతిష్యాల పోస్ట్‌లే కొన్ని వేల రేట్లు ఎక్కువగా కనిపించాయి. అపర మేధావులు పెట్టిన ఈ పోస్టులు చూసి చాలామంది స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం సిగ్గు పడాల్సిన విషయంగా భావించి భయపడి దూరంగా ఉండిపోయారు. ’’
‘‘ఉగ్రవాదికి అనుకూలంగా పోస్టులు పెట్టిన వారు కూడా భయపడనంతగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షల పోస్టులు పెట్టడానికి భయపడే రోజులు వస్తాయని కలలో కూడా అనుకోలేదు.’’
‘‘నిన్న ఓ షార్ట్ ఫిల్మ్ చూశా. దేశభక్తి అవసరం అని ఫేస్‌బుక్‌లో ఒకరు పోస్టు పెట్టి మిత్రులందరికీ చూపిస్తాడు. ఆఫీసులో తోటి ఉద్యోగికి ఆపద వస్తే ఉద్యోగులు తలా ఇంత ఆర్థిక సహాయం చేస్తారు. ఫేస్‌బుక్‌లో దేశభక్తి పోస్టు పెట్టిన వ్యక్తి మినహా. దేశభక్తి ఉన్నవారికి మానవత్వం ఉండదు అని ఆ షార్ట్ ఫిల్మ్ ద్వారా జాతికి సందేశం ఇచ్చారు.’’
‘‘వావ్.. ఏం ఐడియా..! కొద్దిగా మార్పులు చేస్తే ఈ షార్ట్ ఫిల్మ్‌కు అంతర్జాతీయ అవార్డు ఖాయం. ఈ షార్ట్ ఫిల్మ్‌ను తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో తీసి కష్టాల్లో ఉన్న సహ ఉద్యోగికి అస్సలు సహాయం చేయని వ్యక్తి దేశభక్తి పోస్టులు చేసిన వ్యక్తి అయితే, అందరి కన్నా ఎక్కువ ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి ఏవరా? అని విచారిస్తే, అంతర్జాతీయ టెర్రరిస్టు అని తేలుతుంది. ఈ ముగింపుతో షార్ట్ ఫిల్మ్ తీస్తే అదిరిపోతుంది. వచ్చే ఏడాదికి మనం ఈ మార్పులతో కొత్తగా షార్ట్ ఫిల్మ్ తీసేద్దాం. ’’
‘‘ప్రపంచంలో వ్యాపారానికి అనుకూలంగా ఉండే దేశాల జాబితాను వరల్డ్ బ్యాంకు తయారు చేస్తుంది కదా? అలానే తమ దేశాన్ని తాము ద్వేషించే వారు ప్రపంచంలో ఎక్కువగా ఉండే దేశం ఏది అన్నది సర్వేను ఎవరైనా చేశారా?’’
‘‘్భలే ఉంది. ప్రపంచంలో సంపన్న దేశం, నివసించడానికి అనువుగా ఉండే దేశం, అత్యంత సంతోషంగా ఉండే దేశం అనే సర్వేలు జరుగుతాయి కానీ ఓ దేశాన్ని, ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను ఎక్కువగా వ్యతిరేకించే వారు అత్యధికంగా ఉండే దేశం ఏది? అనే సర్వేలేమీ జరగలేదు అనుకుంటా!’’
‘‘నిజంగా జరిగి ఉంటే మనం ఊహించని ఫలితాలు వస్తాయేమో.. అమెరికా ప్రపంచంలోకెల్లా సంపన్న దేశం అనుకుంటాం కదా? కానీ ప్ర పంచ సంపన్న దేశాల్లో అమెరికాది మొదటి స్థానం కాదు కనీసం పదో స్థానం కూడా కాదు. అమెరికాది 12వ స్థానం అయితే. ఖతార్ అనే చిన్న దేశం ప్రపంచంలోకెల్లా సంపన్న దేశం కావడం విచిత్రం కదా? రక్షణ విషయంలోనే కాదు అనేక విషయాల్లో ఖతార్ ఇతర దేశాలపై ఆధారపడ్డా సంపన్నత విషయంలో మాత్రం మొదటి స్థానంలో నిలవడం విచిత్రం’’
‘‘నిజమా? ప్రపంచానికి ఆయుధాలు అమ్ముతున్న అమెరికా ప్రప్రంచంలోకెల్లా సంపన్న దేశం అనుకున్నా. ’’
‘‘చాలా మంది యువత కలల ప్రపంచమైన అమెరికా కన్నా సంపన్న దేశాలు 11 ఉండడం విచిత్రమే. ఐతే ఆ 11 దేశాలు కూడా అమెరికా కనుసన్నల్లో బతుకుతూ ఉండొచ్చు.. అది వేరే విషయం.’’
‘‘పోనీలే సంపన్న దేశం కాకపోయినా మన జాతీయ పతాకం, మన జాతీయ గీతం ప్రపంచంలో నంబర్ వన్ అని యునెస్కో తేల్చింది కదా? ఇంకేం కావాలి?’’
‘‘సరిగ్గా గుర్తు చేశావు. బోగస్ వార్తల్ని ప్రచారంలో చేయడంలో సర్వే జరిగితే మనమే మొదటి స్థానంలో నిలుస్తామోమో! జాతీయ గీతం, జాతీయ జెండా సర్వేల గురించి ఐదారేళ్ల నుంచి ఈ బోగస్ ప్రచారం మొదలుపెట్టింది ఎవరో తెలియదు. కానీ చివరకు యునెస్కో సైతం బాబోయ్ మమ్ముల్ని వదిలేయండి. మేం అలాంటి సర్వేలేమీ నిర్వహించం అని ప్రకటించింది. ’’
‘‘ మేమేం సర్వేలు నిర్వహించం అని నిజంగానే యునెస్కో ప్రకటించిందా? లేక ఇది కూడా నకిలీ ప్రచార గ్రూప్‌కు పోటీగా పుట్టిన బోగస్ ప్రచారం అయితే కాదు కదా?’’
‘‘ఏమో ఆ దిశగా ఆలోచించలేదు’’
‘‘పోనీ మన దేశం ఎందులో నంబర్ వన్‌గా నిలిచిందో చెప్పు. ‘సున్న’ను కనిపెట్టింది మన వాళ్లే కాబట్టి. ఈ లెక్కల్లో మన స్థానం అదే అంటావా?’’
‘‘నేనేమీ అనను. ఎందులో నంబర్ వన్నో కూడా నాకు తెలియదు. ’’
‘‘ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఓ ఆలోచన చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డలు కొందరిని తల్లితండ్రులకు దూరంగా ఒక చోట పెరిగేట్టు చేస్తే, వారు పెద్దవారయ్యాక ఎలా చూద్దామనుకున్నారు? ఆ ఆలోచన వర్కౌట్ కాలేదు కానీ అలా జరిగి ఉంటే కులాలు, మతాలు లేకుండా విశాల దృక్ఫథంతో మేధావులుగా మారి ఉండేవారేమో కాదా?’’
‘‘మేధావులుగా మారేవారో కొత్త హిప్పీల తెగలా ఉండేవారో..?’’
‘‘స్వాతంత్య్ర దినోత్సవాన్ని తమ దేశ పండుగలను, సంస్కృతిని, సంప్రదాయాలను, మాతృభాషలను అవహేళన చేసేవారు ఏ దేశంలో ఎక్కువ ఉన్నారో సర్వే జరిపితే ఫలితం ఎలా ఉంటుందంటావు?’’
‘‘దేశం దాటి వెళ్లని నాకు ఇతర దేశాల సంగతి తెలియదు కానీ. యునెస్కో వాళ్లు జోక్యం చేసుకుని దేశద్రోహులు ఎక్కువ ఉండే దేశం ఏదో సర్వే జరిపితే బాగుండేది’’
‘‘యునెస్కో ఆ పని చేస్తుందో లేదో కానీ. అన్ని దేశాల్లోని దేశ ద్రోహలందరినీ దేశ బహిష్కరణ చేస్తే, అలాంటి వారితో ఏర్పడే కొత్త దేశానికి పేరు పెట్టడం ఈజీ’’
‘‘ఏం పేరు..?’’
‘‘దేశద్రోహుల దేశం..!’’

-బుద్దామురళి (జనాంతికం 17-8-2018)

10, ఆగస్టు 2018, శుక్రవారం

లాడెన్ వియ్యంకుడు.. హిట్లర్ తోడల్లుడు!

‘‘పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల చరిత్ర చూడాలని పాత కాలంలో అనుకునేవారు కదా?’’
‘‘ఔను.. అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో పెళ్లి సంబంధాల సైట్లు చూడడమే కానీ ఏడు తరాల చరిత్ర చూసేవారెవరు? అలా అంటే- ఇంకా ఇదేం చాదస్తం అంటారు’’
‘‘ఈ కాలంలో కూడా ఇలా కుటుంబ చరిత్రను చూసేవాళ్లున్నారు.’’
‘ మొన్న జరిగిన మీ బాబాయ్ కొడుకు పెళ్లి గురించేనా?’’
‘‘మా బంధువులు కాదు. మన దేశం కూడా కాదు. మొన్న లాడెన్ కొడుకు పెళ్లి జరిగింది. అమ్మాయి ఎవరని అడగవేం?’’
‘‘అడకగ పోయినా చెబుతావు కదా? నువ్వే చెప్పు?’’
‘‘అదే మరి.. అల్లాటప్పా కోన్ కిస్కా అమ్మాయిని ఎలా చేసుకుంటాడు? తన కుటుంబం స్థాయికి తగ్గ సంబంధం వెతికి మరీ చేసుకున్నాడు. అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఉగ్రవాదులు విమానంతో దాడి చేసిన విషయం గుర్తుందా?’’
‘‘ఎందుకు గుర్తు లేదు. పాపిష్టి ఉగ్రవాదులు అమానుషంగా దాడి చేసి 17వందల మంది ప్రాణాలను హరించారు. ప్రపంచం వారిని ఎలా మరిచిపోతుంది? ఏ పాపం ఎరుగని ఆ 17వందల మంది కుటుంబాలు ఇంకా ఆ ఆవేదన నుంచి బయటపడి ఉండవు. ఈ దాడి తరువాత అమెరికాలో ప్రజల ఆలోచనా ధోరణి మారిపోయిందట! ’’
‘‘గుర్తింది కదా? ఆ దాడికి నాయకత్వం వహించింది హైజాకర్ల నాయకుడు మహమ్మద్ అట్టా. ఆయన కుమార్తెనే లాడెన్ కుమారుడు పెళ్లి చేసుకున్నాడు.’’
‘‘మనలాంటి కుటుంబరావుల పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటేనే తగిన సంబంధం వెతకడానికి ఎంత కష్టపడతాం? ఆ రోజుల్లో అంటే పెళ్లిళ్ల పేరయ్యల వద్ద పెళ్లి సంబందాలు రెడీగా ఉండేవి. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే పెళ్లి సంబంధాల సైట్లు వచ్చాయి. అబ్బాయి మహేశ్ బాబులా, అమ్మాయి కత్రినా కైఫ్‌లా ఉండాలని కోరుకుంటారు. ఆన్‌లైన్‌లో సమాచారం కూడా అలానే ఉంటుంది. మహేశ్ బాబులా ఉంటాడని ఫోటో చూపించి, బ్రహ్మానందంలా బట్టతల ఉన్న అబ్బాయిని అంటగట్టారని అమ్మాయి వాళ్లు, కత్రినా కైఫ్ అని చెప్పి కంత్రీ పిల్లను అంటగట్టారని అబ్బాయి వాళ్లు వీధిన పడ్డ కేసులు ఎన్ని చూడడం లేదు? గంతకు తగ్గ బొంత అన్నట్టు మనలాంటి వాళ్లకే ఇన్ని సమస్యలుంటే నరరూప రాక్షసులు తమ పిల్లలకు సంబంధాలు కుదుర్చుకోవడం అంటే సామాన్యమా? వేలాది మందిని హతమార్చిన లాడెన్‌ను అమెరికా బృందం మట్టుపెట్టాక తండ్రి లేని ఆ బిడ్డకు పెళ్లెలా అవుతుందో, తగిన సం బంధం దొరుకుతుందా? అని ఆయన అభిమానులెంత ఆందోళన చెందారో..’’
‘‘ఇక్కడ సమస్య పెళ్లి గురించి కాదు. లాడెన్ కొడుకు అంటే మామూలు కాదు.. వారి కుటుంబం స్థాయికి తగిన సంబంధం దొరకాలి. ఐటీ కంపెనీలో పనిచేసే కుర్రాడికి అదే కంపెనీలోనో, మరో కంపెనీలోనో పనిచేసే ఐటీ అమ్మాయి దొరకడం పెద్ద కష్టం కాదు. ప్రపంచాన్ని గడగడలాడించిన వారి పిల్లలకు సంబంధాలు ఈజీనా..? ’’
‘‘మీరేదో వెటకారంగా మా ట్లాడుతున్నట్టుంది. వాళ్ల తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలకేం సంబంధం?’’
‘‘కాళ్లు కడిగినప్పుడే కాపురం చేసే తీరు తెలుస్తుందని పెద్దలంటారు. లాడెన్ కుమారుడికి సంబంధాలు వెతికినప్పుడు, ట్విన్ టవర్స్ కూల్చేసిన వాడి కుమార్తెకు సంబంధం వెతికినప్పుడు వీరి కాపురం తీరు తెలుస్తోంది. మీరన్నట్టు వీరి కడుపున శాంతికపోతాలు పుడితే వద్దనడానికి నేనెవరిని? మహా అయితే మరో పిల్ల లాడెన్ పుట్టవద్దని కోరుకుంటా అంతే. ’’
‘‘తమ సిద్థాంతాల కోసం ప్రపంచాన్ని గడగడలాడించే పనిలో బిజీగా ఉండే లాడెన్ లాంటి ఉగ్రవాదులు, ప్రపంచాన్ని జయించాలని చూసే హిట్లర్ లాంటి గొప్పవాళ్లు తమ పిల్లలకు సంబంధాలపై అస్సలు దృష్టిపెట్టరు. ఆ మధ్య ముంబయి డాన్ దావుద్ ఇబ్రహీం పిల్లల పెళ్లి గురించి చదివాను. దావుద్ షడ్డకుడని, చోటా షకీల్ వియ్యంకుడు ఇతనే అని చెప్పుకోవడం ఎంత గొప్పగా ఉంటుంది! అమెరికా అధ్యక్షుడిని అని చెప్పుకున్నంత గొప్పగా ‘హిట్లర్ తోడల్లుడు, దావుడ్ వియ్యంకుడు’ అని అని చెప్పుకోవాలంటే పెట్టి పుట్టాలి.
హాజీ మస్తాన్, అబు సలేం, చోటా రాజన్, వరదరాజు ముదిలియార్ వంటి డాన్‌లు ముంబయి చీకటి సామ్రాజాన్ని ఈజీగానే ఏలేశారు కానీ తమ పిల్లలకు తమ కుటుంబ స్థాయి సంబంధాల కోసం ఎంత కష్టపడ్డారో పాపం! వీరికోసం ‘డాన్ ఫ్యామిలీ పెళ్లి సంబంధాల వెబ్‌సైట్’ ప్రారంభించే ఆలోచన ఇంకా ఎవరికీ రానట్టుంది. ట్రై చేస్తావా? అలానే వందల కోట్ల డబ్బుతో ఏసీబీ దాడుల్లో పట్టుపడిన వారికి కూడా ఓ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ఉండాల్సిందే. ఏసీబీ దాడుల తరువాత చాలా మంది పలుకుబడి సమాజాంలో ఆమాంతం పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం.
పైకి ఎవరెన్ని నీతులు చెప్పినా నిజాయితీ పరుడంటే ఎవరైనా ఇంతే కదా? వీడి దగ్గరేముంటుంది బూడిద? అని దూరంగా ఉంటారు. అదే ఏసీబీ దాడిలో పట్టుపడ్డాడంటే సంపన్నుడు అని అంతా గుర్తించినట్టే. ఏసీబీ దాడుల్లో దొరికితే వంద కోట్ల ఉద్యోగుల క్లబ్, రెండువందల కోట్ల క్లబ్, అలానే మర్డర్ చేసిన వారికి, దోపిడీలు చేసిన వారికి విడివిడిగా క్లబ్‌లు ఉంటే వీరి మధ్య పెళ్లి సంబంధాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు’’
‘‘అది సరే.. లాడెన్ కుమారుడికి కట్నం కింద ఏమిచ్చి ఉంటారు?’’
‘‘అదేదో సినిమాలో అడుక్కునే వాడు తన కూతురు పెళ్లికి రెండు మూడు వీధులు రాసిస్తాడు. ఆ వీధుల్లో అడుక్కోమని. అలానే బాంబులేయడానికి ఏదో ఓ ఖండాన్ని లాడెన్ కుమారుడికి మహమ్మద్ అట్టా కుటుంబం వారు కట్నంగా ఇచ్చే ఉంటారు.’’
‘‘లాడెన్ కుమారుడికి ట్విన్‌టవర్ కూల్చిన హైజాకర్ల కుటుంబంతో సంబంధం కుదిరిందని నీకు కుళ్లు’’
‘‘ఈ రోజుల్లో ఉద్యోగం , సొంతిళ్లు ఉన్నా అబ్బాయిలకు సంబంధాలు కుదరడం లేదు. ‘పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య’ రోజు రోజుకూ అన్ని సామాజిక వర్గాల్లోనూ పెరిగిపోతుంది. ఎంతైనా లాడెన్ అదృష్టవంతుడు తనకు తగిన వియ్యంకుడు దొరికాడు.’’

-బుద్దా మురళి (జనాంతికం 10-8-2018)

3, ఆగస్టు 2018, శుక్రవారం

లంచమిస్తే శిక్ష!

తంతే బూరెల బుట్టలో పడడం అంటే ఇదేనేమో?’’
‘‘నిన్ను ఎవరు తన్నారు? ఎక్కడ పడ్డావు?’’
‘‘నా సంగతి కాదు. ఇకపై లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేరమేనట! లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఏడేళ్లపాటు జైలు శిక్షనట! లంచగొండులకు పండగే పండుగ.. ఇక నిర్భయంగా లంచాలు తీసుకోవచ్చు. ఎవరైనా ప్రశ్నిస్తే, లంచం ఇవ్వడానికి వచ్చాడని ఎదురు ఫిర్యాదు చేయవచ్చు.’’
‘‘చిన్నప్పుడు చదివిన కథ ఒకటి గుర్తుకొచ్చింది. లంచాలకు అలవాటు పడ్డ రాజోద్యోగి ఒకరి గురించి రాజుగారికి తెలిసి, చాలా వార్నింగ్‌లు ఇచ్చాడట! ఐనా ఎలాంటి మార్పు లేదు. ప్రాధాన్యత లేని, ప్రజలతో సంబంధం లేని పని అప్పగిస్తే చచ్చినట్టు మారతాడనుకున్న రాజు అతనికి సముద్రం ఒడ్డున పని అప్పగించాడు. అలలు లెక్కపెట్టి సముద్రంలో రోజుకు ఎన్ని అలలు వస్తున్నాయో చెప్పాలి. కొంత కాలానికి రాజుగారికి ఆ ఉద్యోగి ఎలా మారాడో, ఎలా ఉన్నాడో చూడాలనిపించి మారువేషంలో వెళ్లి చూశాడు. రాజోద్యోగి గతంలో కొలువులో ఉన్నప్పటి కన్నా ఇప్పుడు మరీ ఎక్కువ ఉత్సాహంగా కనిపించాడు. సముద్రంలో అలలు లెక్కించడంలో పై ఆదాయం ఏ విధంగా సాధ్యం అని రాజుగారు అడిగితే- అతను చెప్పిన సమాధానం కళ్లు తెరిపించింది. సముద్రం అన్నాక సరకులతో కూడిన భారీ పడవలు రావడం సహజమే. అవి వచ్చినప్పుడు రాజోద్యోగి వారిని అడ్డగించి సముద్రంలో అలలు లెక్కించే కీలకమైన బాధ్యతలను రాజు నాకు అప్పగించారు. మీ పడవలు ఆగడం వల్ల అలలు లెక్కించే పనికి ఆటంకం అవుతోందని అడ్డగిస్తుండగా, రాజోద్యోగితో మనకెందుకు గొడవ అని అడిగినంత ఇచ్చి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇక్కడే ఆదాయం ఎక్కువగా ఉందని రాజోద్యోగి సంతోషంగా చెప్పుకొచ్చాడు’’
‘‘ఈ కథకు, దీనికి సంబంధం ఏముంది?’’
‘‘అధికారంలోకి వచ్చిన ప్రతి రాజు కూడా తనదైన శైలిలో అవినీతిని నిర్మూలించాలనుకుంటాడు. కానీ అది మనుషుల జీవితంలో భాగంగా మారిపోయింది. ‘ఆత్మను నాశనం చేయలేరు’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అవినీతి అనేది మన వ్యవస్థ ఆత్మ. ఈ ఆత్మను అంగీకరించాల్సిందే తప్ప నిర్మూలించలేం అంటున్నాను. అలలు లెక్కించే పని అప్పగిస్తే, అవినీతి పరుడు మారిపోతాడని ఆ రాజు భావిస్తే, లంచం ఇచ్చేవారిని సైతం శిక్షిస్తే లంచాలు కనిపించకుండా పోతాయని ఈ రాజు భావిస్తున్నారు.. అందుకే ఈ కథ చెప్పాను’’
‘‘మరీ అంత నిరాశావాదం అయితే ఎలా? అమెరికా లాంటి దేశాల్లో అవినీతి అస్సలు ఉండదు తెలుసా? ’’
‘‘బల్లకింద చేతులు పెట్టడం అనే పదానికి ఆ దేశం వారికి అస్సలు అర్థం తెలియదు. కన్సల్టెన్సీ ఫీజు అని వాళ్లు దానికి ముచ్చటగా పేరు పెట్టుకుని చట్టబద్ధం చేశారు.’’
‘‘మన దేశంలో కూడా ప్రతి పనికి లంచం ఎంతో నిర్ణయించి దానికి ఇలానే ఓ ముద్దు పేరు పెట్టుకుంటే లంచం సమస్య తీరిపోతుంది కదా? ’’
‘‘పోదు.. ఆ మధ్య ఒకరు జీతాలు పెంచితే లంచాలు ఉండవన్నారు. జీతాలు బాగా నే పెరిగాయి. మరి లంచాలు మాయం అయ్యాయా? కావు. కన్సల్టెన్సీ ఫీజు అని నిర్ణయించినా.. కన్సల్టెన్సీ ఫీజు చెల్లించావు మరి నా వాటా అనే మాట వినిపించి తీరుతుంది. నీకు పెళ్లయిందా?’’
‘‘నా పెళ్లికి, లంచాలకు సంబంధం ఏంటోయ్’’
‘‘నిజాయితీగా చెప్పు .. నీకు పెళ్లయినా పక్క చూపులు చూస్తావా? లేదా?’’
‘‘నేను మగాణ్ణి’’
‘‘కదా! పక్క చూపులు చూడడం మగాడి జన్మహక్కు అని నువ్వు భావించినట్టే. బల్లకింద సంపాదన మా జన్మహక్కు అని కొందరి గట్టి నమ్మకం. ’’
‘‘ సరదాగా అన్నా... పక్కచూపులు చూస్తే మా ఆవిడ ఊరుకుంటుందా?’’
‘‘మీ ఆవిడ లేనప్పుడు నువ్వు పక్కచూపులు చూసినట్టే ఎవరూ చూడనప్పుడు వాళ్లు బల్లకింద చేయి పెడతారులే’’
‘‘లంచం ఇచ్చే వాడుంటేనే కదా? తీసుకునే వాళ్లుంటారు.. అందుకే లంచం ఇచ్చేవాళ్లను కూడా శిక్షించడం ద్వారా లంచాల సంస్కృతికి చరమగీతం పాడాలని ప్రయత్నం’’
‘‘ఇంకా నయం బల్లలు ఉన్నాయి కాబట్టి బల్లకింద చేతులు పెడుతున్నారని, ప్రభుత్వ కార్యాలయాల్లో అసలు బల్లలు లేకుండా చేసేయలేదు’’
‘‘ఇదేదో బాగుందోయ్ ఐడియా. అసలు బల్లలు లేకుండే చేస్తే ఇక బల్లకింద చేతులు ఎలా పెడతారు?’’
‘‘చేతులు లేకుండా చేసేస్తే చేతులు తడపడం ఉండదు ఏమంటావు?’’
‘‘ఈ ఐడియా బాగానే ఉంది.. పాలకులకు చెప్పాలి. అదేదో దేశంలో తప్పు చేస్తే.. తప్పు చేయడానికి కారణం చేతులే కదా? అని చేతులు నరికేస్తారట! బల్లకింద చేతులు పెట్టేందుకు వీలు లేకుండా అసలు చేతులే లేకుండా చేశాకే ఉద్యోగ బాధ్యతలు అప్పగించాలి’’
‘‘చూడోయ్.. మనుషులందరికీ ఏదో ఒక సమస్య ఉంది. మనుషులందరికీ మనుషులతోనే సమస్య. సమస్యలు లేకుండా చేయాలంటే అసలు మనుషులే లేకుండా చేస్తే ఎలా ఉంటుందంటావు’’
‘‘తల నరికేసి.. చుండ్రు సమస్య పరిష్కరించానని మురిసినట్టుంది.’’
‘‘ఏం చేసినా విమర్శించడమేనా?’’
‘‘సమస్య పరిష్కరించడం కన్నా ఏదో చేసినట్టు నటించడం చాలా?’’
‘‘పోనీ- నువ్వు చెప్పు.. అవినీతి లేకుండా చేయాలంటే ఏం చేయాలో.. సిటిజన్ చార్టర్ అని ప్రతి కార్యాలయంలో ఏ పని ఎన్ని రోజుల్లో అవుతుందో రాస్తారు కదా? అలానే ఏ పనికి ఎంత ముట్ట చెప్పాలో రాస్తే బాగుంటుందా?’’
‘‘అది కాకుండా- నాకెంతిస్తావ్? అని అడుగుతారు అప్పుడు’’
‘‘రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వం రూపాయి ఖర్చు పెడితే లబ్దిదారులకు పది పైసలు చేరేవనేవారు..’’
‘‘ఔను.. అప్పటి నుంచి ఈ పది పైసల విలువ పెంచాలని ప్రయత్నాలు ప్రారంభిస్తే, రూపాయి విలువే తగ్గింది కానీ పది పైసల విలువ పెరగనేలేదు. ’’
‘‘నీతో మాట్లాడుతుంటే నాకో బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. కరెన్సీ ఉండడం వల్లనే కదా? ఈ అవినీతి సమస్య. అసలు కరెన్సీ మొత్తాన్ని రద్దు చేసి, బార్టర్ సిస్టం ప్రవేశపెడితే...’’
‘‘గట్టిగా అనకు విన్నారంటే మన్‌కీ బాత్ అంటూ అవినీతి నిర్మూలనకు కరెన్సీని రద్దు చేసినా చేస్తారు. అసలే ఎన్నికలు సమీపిస్తున్నాయి కనుక ఏదో అద్భుతం చేసి చూపించాలి’’
*బుద్దా మురళి (జనాంతికం 3-8-2018)