30, నవంబర్ 2014, ఆదివారం

మాయా బజార్ కెవి రెడ్డిని కాటేసిన పరాజయం

ఆ గొంతు ఒక్కసారి గద్దించిందంటే నాగిరెడ్డి చక్రపాణి లాంటి వారు సైతం వౌనంగా సెట్ నుంచి బయటకు వెళ్లిపోయేవారు. ఎన్టీఆర్ సైతం ఆయన ఉంటే బుద్ధిమంతుడైన విద్యార్థిలా ఉండేవారు. ఒకప్పుడు గర్జించిన ఆ గొంతు మాట్లాడాలా? వద్దా ? అని తటపటాయిస్తోంది. చివరకు మాట్లాడాలనే నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ వద్దకు వెళ్లి తన కుమారుడి విదేశీ చదువు కోసం 40 వేల రూపాయల సహాయం కావాలని అడిగారు. అలా అడిగిన వారు మాయాబజార్ సృష్టించిన కెవి రెడ్డి.


***


శ్రీకృష్ణుడికి ఎన్టీఆర్ మారుపేరు అన్నట్టుగా మారిపోయింది. మరి ఆ ఎన్టీఆర్‌లోని శ్రీకృష్ణున్ని వెలికి తీసింది కెవిరెడ్డినే. ఇద్దరు పెళ్లాలు, సొంత ఊరు ఈ రెండు సినిమాల్లో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించారు. శ్రీకృష్ణుడిగా ఆయన కనిపించగానే జనం ఈలలు వేసి, గోల చేశారు. దాంతో శ్రీకృష్ణునిగా తాను పనికి రాను అని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. మాయాబజారు సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రకు కెవిరెడ్డి ఎన్టీఆర్‌ను ఎంపిక చేస్తే ‘‘గురువు గారూ ఆ పాత్రకు నేను సరిపోను, చేయలేను అని ఎన్టీఆర్ పాత అనుభవాలు గుర్తు తెచ్చుకున్నారు. నీలో శ్రీకృష్ణుడు ఉన్నాడు నేను చూపిస్తాను అని కెవిరెడ్డి భరోసా ఇవ్వడంతో తనపై నమ్మకం కన్నా నటుల ఎంపికలో కెవిరెడ్డికి ఉన్న జడ్జ్‌మెంట్‌కు ఎన్టీఆర్ అంగీకరించారు. ఆ తరువాత ఎన్టీఆర్, శ్రీకృష్ణుడు ఒకరే అన్నట్టుగా మారిపోయింది.
అలాంటి కెవిరెడ్డిపై ఎన్టీఆర్‌కు అపారమైన గౌరవం.


తన కుమారుడి చదువు కోసం గురువు సహాయం అడగడమే మహాద్భాగ్యం అని భావించిన ఎన్టీఆర్ ఆ డబ్బు ఇవ్వడమే కాకుండా, మీరు నాకో సినిమా చేసి పెట్టాలి అన్నారు. ఓటమి దెబ్బలకు తట్టుకోలేక మానసికంగా అలసిపోయిన ఆయన ఆరోగ్యం బాగాలేదు. చేయలేనేమో అన్నారు. గురువు గారూ మీరు అక్కడ కూర్చొని డైరెక్షన్ ఇవ్వండి అంతా మేం చూసుకుంటాం అన్నారు. అలా వచ్చిన కెవిరెడ్డి చివరి చిత్రమే శ్రీకృష్ణ సత్య.
***


కెవి రెడ్డి అంటే కాలేజీ కుర్రాళ్లకు కూడా తెలియకపోవచ్చు. మాయాబజార్ అంటే కానె్వంట్ స్కూల్‌కెళ్లే పిల్లోడికి కూడా తెలుసు.
ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం వచ్చిన సినిమా ఇప్పటి జనాభాలో మూడొంతుల మంది 30 ఏళ్ల యువతేనట. అంటే నేటి యువత తల్లిదండ్రులు కూడా పుట్టక ముందు వచ్చిన సినిమా అది. అయినా నేటి బుడతలకు కూడా ఆ సినిమా గురించి తెలుసు అంటే అదెంత గొప్ప సినిమా అయి ఉంటుంది.


మాయాబజార్‌ను సినిమా అనడం సరికాదేమో! అది సినిమా కాదు ఓ కళాఖండం. తెలుగు సంస్కృతిలో భాగం, తెలుగు సినిమా చరిత్ర. తెలుగు దేవుళ్ల ప్రొఫైల్ పిక్చర్ అది. ఆ కళాఖండానికి ఊపిరి పోసింది కెవి రెడ్డి. కదిరి వెంకటరెడ్డి. పాతాళాభైరవి, మాయాబజార్ ఈ రెండు సినిమాలను మినహాయిస్తే తెలుగు సినిమా చరిత్ర అసంపూర్ణం. ఈ రెండు సినిమాలు కెవి రెడ్డి దర్శకత్వం వహించినవే.


పదవ తరగతి పాఠ్యపుస్తకంలో మాయాబజారు సినిమా గురించి ఒక పాఠాన్ని చేర్చారు. బహుశా మరే సినిమాకు ఇంతటి కీర్తి దక్కి ఉండదు. సినిమా ఎలా తీయాలో బోధించేందుకు అనేక జాతీయ అంతర్జాతీయ సినిమా ఇన్‌స్టిట్యూట్‌లో మాయాబజారు చూపడం తెలిసిందే. కానీ రేపటి పౌరులను తీర్చిదిద్దడం కోసం రాసే పాఠ్యపుస్తకాల్లో కెవిరెడ్డి సినిమా ఉంది అంటే అది సినిమా కాదు సినిమా కన్నా ఇంకా చాలా ఎక్కువ అని అర్థమవుతూనే ఉంది. కెవిరెడ్డి సినిమాలు సినిమా పరిశ్రమకు పాఠాలు అయితే ఆయన నిజ జీవితం సైతం నేటి తరానికి ఎన్నో పాఠాలు చెబుతుంది.
ఓటమికి కృంగిపోవలసిన అవసరం లేదు... ఓటమి తెలియని విజయం ఓటమి కన్నా ప్రమాదకరం అని కెవిరెడ్డి జీవితం నేర్పిస్తుంది.
రాజబాబును పరిచయం చేసింది, అతనిలో మంచి నటుడు ఉన్నాడని గుర్తించింది కెవిరెడ్డినే. వాణిశ్రీని సైతం ... ఎంతో మందిలో నటున్ని గుర్తించిన ఆయన ఓటమి తరువాత తెలిసిన వారే ఎలా వ్యవహరిస్తారో అనుభవంలోకి వచ్చేంత వరకు గుర్తించ లేకపోయారు.


***
వరుస విజయాలకు అలవాటు పడితే పరాజయాన్ని తట్టుకోలేరు కృంగిపోతారు. విజయాలు, పరాజయాలకు అలవాటు పడి ఉంటే పరాజయాలకు కృంగిపోయి ఉండేవారు కాదేమో!
కెవి రెడ్డి అని పిలువబడే కదిరి వెంకటరెడ్డి తీసింది 18 సినిమాలుః అందులో 15 సూపర్ హిట్టు. అంటే ఈరోజుల్లో జరుగుతున్న ప్రచార హిట్టు సినిమాలు కాదు. ఆరు దశాబ్దాల తరువాత విడుదలైనా విజయం సాధించే మాయాబజారు, పాతాళాభైరవి, జగదేక వీరుని కథ లాంటి సూపర్ హిట్లు. విజయసంస్థకు ఎన్నో హిట్లు అందించిన కెవిరెడ్డి చివరి మూడు సినిమాలు సరిగా నడవలేదు. విజయవారి ఉమాచండీగౌరీ శంకరుల కథ సినిమా ఫ్ల్లాప్. అప్పటి వరకు విజయ సంస్థలో మహారాజులా చూసిన కెవిరెడ్డిని పక్కన పెట్టారు. కెవిరెడ్డికి ఇచ్చిన కారును సైతం తీసేసుకున్నారు.
ఈ అనుభవాన్ని ఆయన ఊహించలేకపోయారు. ఉమా చండీ గౌరీ శంకరుల కథ పరాజయాన్ని విజయ సంస్థ తట్టుకోలేకపోయింది. ఆ పరాజయాన్ని కెవిరెడ్డి కూడా తట్టుకోలేకపోయారు. అయితే పరాజయం మనుషుల్లో ఇంత మార్పు తీసుకువస్తుందని ఆయన ఊహించలేకపోయారు. ఆ సృజనశీలిని ఈ మార్పు తీవ్రంగా కలిచివేసింది.


వరుసగా మూడు సినిమాలు పరాజయం పాలు కావడంతో ఆ దర్శకుడు మానసికంగా సంఘర్షణ తీవ్రంగా ఉంది. తానిక సినిమాలకు పనికిరానా? అని మదనపడ్డారు. అద్భుత విజయాలతోనే జీవితాన్ని ప్రారంభించడమే పెద్ద పరాజయం. పరాజయ అనుభవం లేకపోతే నీకు జీవిత మాధుర్యం ఎలా తెలుస్తుంది. నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సరిగ్గా ఎలా అంచనా వేయగలవు. పరాజయం నిన్ను నీకు కొత్తగా పరిచయం చేస్తుంది.
అదే ఘన విజయాల తరువాత ఒక పరాజయం ఎదురైతే తట్టుకోవడం కష్టం. కెవి రెడ్డి విషయంలో అదే జరిగింది. ఆర్థికంగా దెబ్బతిన్నారు, ఆరోగ్యం క్షీణించింది.
***


జూలై 1 1912లో అనంతపురం జిల్లా తాడిపర్తిలో జన్మించిన కెవిరెడ్డి చదువుకునే రోజుల్లోనే తన మిత్రుడు మూలా నారాయణస్వామితో కలిసి సినిమాలు తీయాలని కలలు కనేవారు. చదువు ముగిశాక మూలా నారాయణస్వామి రోహిణి సంస్థలో భాగస్వామిగా చేరడంతో ఆసక్తి ఉంటే రమ్మని కెవిరెడ్డిని పిలిచారు. అక్కడ క్యాషియర్‌గా చేరిన కెవిరెడ్డి డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉండేవారు. తాను సినిమా తీసే సంస్థల కోసం డబ్బు వ్యవహారంలో నిక్కచ్చిగా ఉన్న ఆయన తన సొంత జీవితంలో మాత్రం ఏమీ సంపాదించలేకపోయారు. రోహిణీ నుంచి కొందరు బయటకు వచ్చి వాహిని సంస్థను ఏర్పాటు చేసినప్పుడు కెవిరెడ్డి ప్రొడక్షన్ మేనేజర్‌గా చేరారు. ఆసక్తి అంతా సినిమాలపైనే. 1942లో భక్తపోతన తొలి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అప్పటి వరకు రొమాంటిక్ హీరోగా ఉన్న నాగయ్యను పోతనగా ఎంపిక చేయడం నాగయ్యకే ఆశ్చర్యం వేసింది. మిగిలిన వారు నవ్వుకున్నారు. సినిమా విడుదలయ్యాక నాగయ్యను దేవుడిలా పూజించారు. తరువాత యోగి వేమన అదీ సూపర్ హిట్. గుణసుందరి కథ, పాతాళాభైరవి, పెద్దమనుషులు, దొంగ రాముడు, మాయాబజారు, పెళ్లినాటి ప్రమాణాలు, జగదేక వీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధంతో పాటు రెండు ఇతర భాషా సినిమాలు. ఇవన్నీ సంచలన విజయాలు సాధించాయి. సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీ శంకరుల కథ, భాగ్యచక్రం ఈ మూడు సినిమాలు కెవిరెడ్డి భాగ్యచక్రాన్ని దెబ్బతీశాయి. పరాజయాలతోనే తన సినిమా జీవితం ముగింపు పలకాల్సి వస్తోందని మదనపడిన ఆయనకు ఎన్టీఆర్ శ్రీకృష్ణ సత్య రూపంలో విజయం అందించారు. మన ఫోటోలు ఎవరు చూస్తారు అంటూ ఆయన ఫోటోలు తీయించుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదట! ఆయన సినిమాను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తారని ఆయన ఊహించి ఉండరు.


కెవిరెడ్డి కుమారుడు ఇప్పుడు అమెరికాలో ఒక కంపెనీ నిర్వహిస్తున్నారు. రైతులా కనిపించే కెవిరెడ్డి సినిమాల బంగారు పంట పండించారు. 15 సెప్టెంబర్ 1972లో 60 ఏళ్ల వయసులో మరణించారు.
*

23, నవంబర్ 2014, ఆదివారం

మొనగాళ్లకు మొనగాడు!!

‘‘జీవితం బుద్భుద ప్రాయం.. ఖరీదైన ఐస్‌క్రీమ్ అయినా ఎండ తగిలితే కరిగిపోవాల్సిందే... హెరిటేజ్ పాలకైనా సబ్బు నురగ ఉండాల్సిందే ఈ జీవితం కూడా అంతే నాయనా! ఉప్పు తిన్న విశ్వాసం కన్నా నురగ తాగిన అభిమానం ఎక్కువ. ట్రింగో ట్రింగాయహః మేల్కొండి... ’’ అంటూ స్వామి భీమ్‌పాల్ తన ప్రవచనాన్ని ముగించడంతో భక్తులు వరుసగా పాదాభివందనం చేసి వెళుతున్నారు. అంతా ముగియడంతో అంతరంగిక మందిరంలోకి భీమ్‌పాల్ అడుగు పెట్టాడు... అంతరంగిక మందిరంలో అతి కొద్ది మందికి మాత్రమే అనుమతి. అక్కడుంటే వాళ్లంతా ఒకరి కన్నా ఒకరు మొనగాళ్లు.


‘‘ఔను స్వామి ట్రింగో ట్రింగాయహః ’’అంటే అర్ధమేంటి అని పాత్రికేయ పాపారావు అడిగాడు. భీమ్‌పాల్ పక పకా నవ్వి.‘‘ పిచ్చోడా ఆ పదానికి నాకు అర్ధం తెలిస్తే కదా నీకు చెప్పడానికి. ఎవరికీ అర్ధం కానీ ఏవో కొన్ని పదాలు చెబితే తప్ప భక్తులకు విశ్వాసం కలగదు... చూశావా నీ లాంటి దేశ ముదురు కూడా ఆ పదాన్ని గుర్తుంచుకుని అడిగావంటే నా టెక్నిక్ ఫలించినట్టే కదా?’’ అన్నాడు. ‘‘ అది సరే మనం కలిసి చాలా రోజులైంది. ఏంటి మీ మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి?’’ అని అభిమానంతో స్వామి అడిగాడు.


‘‘ఈ మధ్య పెద్దగా గిట్టుబాటు కావడం లేదు’’ అని రాజకీయ నానాజీ
దీనంగా చెప్పాడు. ‘‘ ఇదిగో నానాజీ చింతామణికైనా ఆదాయం కొంత కాలమే ఉంటుంది. కానీ కాలాతీతంగా ఆదాయాలు గల వాళ్లం మనం.’’.. అంతరంగిక మందిరంలోనూ నటిస్తే ఎలాగోయ్’’ అని అభిమానంతో చీవాట్లు పెట్టాడు. మూడో పెగ్గు తరువాత చర్చ వారి వారి వృత్తులపై సాగింది.
‘‘ఎంత హీరోనైనా ఏ సినిమా నడుస్తుందో ఏది నడవదో తెలియదు. రోజుకో కొత్త హీరో మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు. తాత పేరు చెప్పుకుని బతికేద్దామన్నా వంశ వృక్షం పెద్దది కావడంతో ఒక్కో తాత ఇంట్లోంచి డజన్ల మంది రంగంలోకి వచ్చేస్తున్నారు. ఇక్కడ తప్ప ఎక్కడ బతకలేం ఈ కష్టాలు పగోడికి కూడా వద్దని ’’హీరో గద్గద స్వరంతో పలికాడు.
అతని బాధ విన్నాక ఔను నిజమే అని అంతా తలలు ఊపారు. కొందరు ఊరడించారు.


‘‘నీకు రాసుకోవడానికి పెన్ను కాగితం కూడా ఎవడో ఒకడు ఇవ్వాల్సిందే కదా? కోట్లు గడించావ్ ..నీ పనే బాగుందోయ్’’ అని పాత్రికేయ పాపారావు వైపు చూశారు.


‘‘ఎక్కడ స్వామి ఆ రోజులే పోయాయి. ఆ కాలంలో అంటే ఐదారుగురే ఉండేవారు. ఒక్కొక్కడు ఒక్కో నాయకుడ్ని పట్టేసేవాడు. ఆ నాయకుడి దశ తిరిగితే వాడ్ని పట్టుకున్నవాడి దశ కూడా తిరిగేది. మీరు ఆ కాలాన్ని చూసి ఈ కాలం వాళ్లను అంచనా వేస్తే ఎలా? ఈ రోజుల్లో పార్టీకో అరడజను చానల్స్, పావు డజను పత్రికలుంటున్నాయి. రెండు రాష్ట్రాలకు నాలుగు డజన్ల చానల్స్... ఐటి దాడి జరిగితే సేఠ్ చంపక్‌లాల్ గోడ దూకి పారిపోయినట్టు, ఎసిబి వాళ్లు రైడ్ చేస్తే మండలాఫీసులో గుమస్తాలు పరుగులు తీసినట్టు మీడియా కంటికి కనిపించకుండా నాయకులు పరుగులు తీస్తున్నారు. వాళ్లు మాకు చిక్కితే కదా! వాళ్లే చిక్కనప్పుడు మాకేం లాభం. ఒకవేళ చిక్కినా 16వేల మంది గోపికల మధ్య చిన్నికృష్ణుడు అన్నట్టుగా ఉంటోంది... వ్యవహారాలు జరపడం తరువాత కనీసం వాటి గురించి మాట్లాడేంత ఏకాంత సేవ దక్కడం లేదు. అప్పటి రోజులు మళ్లీరమ్మన్నా రావు’’ అని పాత్రికేయ పాపారావు దీనంగా చెప్పిన దానికి మిగిలిన వారు నిజమే అన్నారు.


‘‘ఎంత ఉన్నతాధికారుల మైతేనేం ఆదాయం బాగా తగ్గింది మా వైపు చూడకండి’’అని ఉన్నతాధికారి మరో పెగ్గు కోసం చేయి చాచాడు. ‘‘మీకేంటి సార్ మీ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ కూడా పార్ట్‌టైం వృత్తిలో లక్షలు సంపాదిస్తున్నారు ’’ అంటూ ఓబులేషు వ్యవహారాన్ని ఎత్తి చూపుతూ అంతా ఆయన వైపు చూసి నవ్వారు. వౌనమే తన సమాధానం అన్నట్టు ఆయన తన పనిలో తానుండిపోయారు.


‘‘నా వైపు చూడాల్సిన అవసరం లేదు. నేను నేలరాలిన ‘తార’ను’’ అని అమె వయ్యారంగా పలికింది. ‘‘ఒక్కోసారి డెన్ నిర్వాహణ ఖర్చులు కూడారావడం లేదు, ఎక్కడ చూసినా సిసి కెమెరాలే ఇక కిడ్నాప్‌లు ఎక్కడ చేస్తాం’’ అని దావూద్ అబ్రహం తనను అడగక ముందే తన పరిస్థితి చెప్పారు. ఏదో మంచి కాలంలో దోచుకున్న సొమ్ముతో కాలం గడుపుతున్నాం కానీ ఇప్పుడు మా బిజినెస్ ఏ మాత్రం లాభసాటిగా లేదని అందరి మాటల సారాంశం.
స్వామి భీమ్‌పాల్ నవ్వి ‘‘మంచి వ్యాపారి ఎప్పుడూ తన లాభాన్ని చెప్పడు బేరాలు లేవని ఏడుస్తూనే ఉంటాడు.. జుమేరాత్ బజార్‌లో దొంగ సొమ్ము అమ్మే సులేమాన్, రైతు బజార్‌లో వంకాయలమ్మే కిష్టయ్య నుంచి స్విస్ బ్యాంకులో దొంగ ఖాతాలున్న మీ వరకూ అంతా బేరాలు లేవనే అంటారు. అలా అనడం వ్యాపార ధర్మం అదంతే’’ అని నవ్వాడు.


రాజకీయ నానాజీ మైకు కోసం చేయి పైకెత్తినట్టు చేయి చూపగానే అంతా అతని మాటల వినేందుకు ఆసక్తి చూపారు. ‘‘ప్రతి వృత్తిలోనూ రిస్క్ ఉంటుంది. ఒక్కో నియోజక వర్గంలో కనీసం నాలుగు ప్రధాన రాజకీయ పక్షాలు ఉంటాయి. ఒక్కో పార్టీ నుంచి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించే వాళ్లు కనీసం ముగ్గురుంటారు. అంటే ఒక నియోజక వర్గంలో 12 మంది గట్టిగా ఐదేళ్లపాటు ఖర్చు చేస్తే, అందులో ముగ్గురికి టికెట్ వస్తుంది. ఒక్కరు గెలుస్తారు. టికెట్ వస్తుందో రాదో తెలియదు, వస్తే గెలుస్తామో లేదో తెలియదు, గెలిస్తే మేం గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు. మా రాజకీయ వ్యాపారంలో ఉన్నంత రిస్క్ మరే వ్యాపారంలో లేదు’’ అని చెప్పగానే వెనక నుంచి ఎవరో ఔను రిస్క్ ఎక్కువే ఆదాయం ఎక్కువే అని గోణిగారు.


‘‘ఇంతకూ నేను చెప్పొచ్చేదేమిటంటే మా అందరి కన్నా ఆదాయంలో స్వామి భీమ్‌పాలే మొనగాడు. తనకు కూడా అర్ధం కాని నాలుగు మాటలు చెప్పి మహామహులతో కాళ్లు మొక్కించుని సామాజ్య్రాలను సృష్టించుకుంటారు. మర్డర్ చేసినా అరెస్టు చేసేందుకు పోలీసులు జంకుతారు. ఎవరో ఒకరు సాహసం చేసి అరెస్టు చేసేందుకు వస్తే వేలాది మానవ కవచాలు రక్షణగా నిలుస్తాయి.. కానుకలిస్తారు, కాళ్లు మొక్కుతారు. ఇంతకు మించిన లాభసాటి వ్యాపారం ఏముంటుంది అని రాజకీయ నానాజీ చెప్పిన మాటలకు అంతా చప్పట్లు కొట్టారు.


‘‘మేమంతా మొనగాళ్లం కావచ్చు కానీ మీరు మొనగాళ్లకే మొనగాడు’’ అంటూ అంతా అనడంతో స్వామి భీమ్‌పాల్ ముసిముసిగా నవ్వుకున్నాడు.

ఆ నటుడు బిచ్చగాడయ్యాడు



సినిమా నటుడు అంటే జనంలో బోలెడు క్రేజీ. కనిపిస్తే చాలు ఆటోగ్రాఫుల కోసం వందల చేతులు పోటీ పడుతుంటాయి. అలాంటి నటుడే వందలాది ముందు బిక్షం వేయమని చేయి చాస్తే.... అలాంటి నటుడు ఫుట్‌పాత్‌పైనే తన జీవితాన్ని చాలించాడు అని, చివరకు భార్యా పిల్లలు కూడా చివరి దశలో చూసేందుకు రావడానికి ఇష్టపడలేదు అంటే ఊహించడానికే కష్టంగా ఉంటుంది కదూ! చాలా మంది జీవితాల్లో సినిమాల్లో కన్నా ఊహించని మలుపులు ఉంటాయి.
***

54ఏళ్ల యువరత్న బాలకృష్ణ కన్నెర్ర చేయగానే వేగంగా వస్తున్న రైలు తోక ముడిచి వెనక్కి వెళ్లింది. బాలకృష్ణ ప్యారాచూట్ వేసుకుని పాకిస్తాన్‌లో దిగి ఒంటి చేత్తో ఆ దేశ సైన్యాన్ని మట్టికరిపించాడు. మన హీరోలు అందరూ అంతే.  ...   మరి నిజ జీవితంలో..హీరోల కన్నా శక్తివంతమైనది ఒక చిన్న వ్యసనం. ప్రముఖ నటునిగా ఒక వెలుగు వెలిగిన వారిని సైతం బిక్షగాళ్లుగా మార్చేసేంత శక్తివంతమైనది ఆ చిన్న వ్యసనం.
ఒక్కసారి నన్ను పూర్తిగా నమ్మి నీ జీవితాన్ని నాకు అప్పగించు. ఆ తరువాత నీ జీవితాన్ని నడిపించే బాధ్యత నాదీ అని మద్యం మనిషికి గట్టి నమ్మకాన్ని ఇస్తుంది. ఆ మాటను నమ్మిన వారి జీవితాన్ని మద్యమే నడిపిస్తుంది.
***
దాదాపు మూడు దశాబ్దాల సినిమా జీవితం. విలన్‌గా ఒక వెలుగు వెలిగిన నటుడు రోడ్డుమీద బిక్ష మెత్తుకుని బతికాడు.. అలా రోడ్డుమీదనే కన్ను మూశాడు. ఆయన మరణ విషయం తెలిసినా భార్యా, కుమారుడు భౌతిక కాయాన్ని చూసేందుకు కూడా రాలేదు. అంటే నమ్మగలమా? నమ్మి తీరాలి. ఆయన జీవితం నుంచి గుణపాఠాన్ని నేర్చుకోవాలి.
***
పరశురామ్ ఒకప్పటి బాలీవుడ్ ఫేమస్ విలన్... అంతకు ముందు బాల నటుడు. మంచి గాయకుడు. మనకు ఆయన పేరు తెలిసి ఉండక పోవచ్చు. మనం ఆయన సినిమాలు చూసి ఉండక పోవచ్చు. తెలియాల్సిన అవసరం కూడా లేదు. శాంతారామ్, రాజ్‌కపూర్ లాంటి వారు మెచ్చుకున్న ప్రతిభావంతుడైన నటుడి జీవితం చివరకు ఫుట్‌పాత్‌పై ఎందుకు ముగిసింది. భార్యా పిల్లలు కడ చూపు కోసం కూడా ఎందుకు రాలేదు.
***
దేశంలో బుల్లితెరపై తొలిసారిగా టాక్‌షోను ప్రారంభించింది. తబస్సుమ్. 1947లో బాలనటిగా సినిమా రంగంలోకి ప్రవేశించిన ఆమె ఆ తరువాత 70వ దశకంలో దూరదర్శన్‌లో ఫూల్‌కిలే గుల్షన్ గుల్షన్ కార్యక్రమం ద్వారా టాక్ షోలు నిర్వహించారు. ముంబైలో ఓ రోజు తబస్సుమ్ కారులో వెళుతుండగా, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బిక్షమెత్తుకుంటున్న ఒక వ్యక్తిని చూసి ఆమె నిర్ఘాంత పోయింది. తన కళ్లు తనను మోసం చేస్తున్నాయేమో అనుకుంది. కారు ఆపి దగ్గరకు వెళ్లి చూసింది. నిజమే ఆ బిక్షగాడు ఒకప్పటి గొప్ప నటుడు. ప్రభాత్ స్టూడియోలో బాల నటునిగా నట జీవితాన్ని ప్రారంభించి, ఆ కాలంలో టాప్‌మోస్ట్ విలన్‌గా ఎదిగిన పరశురామ్. కొన్ని సినిమాల్లో అతని కుమార్తెగా నటించిన తబస్సుమ్. అతన్ని గుర్తు పట్టింది. అతన్ని తన కారులో ఎక్కించుకొని స్టూడియోకు తీసుకు వెళ్లింది. దూరదర్శన్‌లో పరశురామ్ ఇంటర్వ్యూ ప్రసారం చేశారు.
అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్‌తో సహా సినిమా అభిమానులు ఎంతో మంది స్పందించి సహాయం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరశురామ్‌కు సహాయం చేశారు.
పరశురామ్ గురించి తబుస్సుమ్ అనుభవాన్ని చదివిన పాత హిందీ సినిమాల అభిమానులు కొందరు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు.
పరశురామ్ కుమార్తెతో పాటు మనవడి ఆచూకీ కనుగొని సంబరపడ్డారు. పరశురామ్ జీవితం ముగింపు గురించి వారి నుంచి తెలుసుకుని ఆవేదన చెందారు.

దునియా నా మానా (1937) సినిమాలో ఆయన పాడిన మన్‌సాఫ్ తెరా హై కె నహీ పాట ఆ కాలంలో చాలా పాపులర్. పరశురామ్ లక్ష్మణ్ మహారాష్టల్రోని ఆహ్మద్‌నగర్ జిల్లాలో ఒక గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే అతనికి పాటలు పాడడం, నటించడంలో ప్రావీణ్యం ఉంది. పేదరికం వల్ల ఫోర్త్ స్టాండర్డ్‌కు మించి చదవలేకపోయాడు. విపరీతంగా చదివే వాడు. పదేళ్ల వయసులో తండ్రి బొంబాయికి చేరుకుని పని కోసం రంజీత్ మూవీ టోన్‌లో చేర్పించాడు. వి.శాంతారామ్ ఓ సారి ఆ కుర్రాడు సినిమా కోసం పాట పాడుతుంటే విని తన్మయం చెందారు. ఆ కుర్రాడి బాధ్యత అప్పటి నుంచి శాంతారామ్ తీసుకుని ప్రభాత్ ఫిల్మ్ కంపెనీలో నెలకు ఐదు రూపాయల జీతంపై చేర్చుకున్నాడు. ప్రభాత్ వారి అద్భుతమైన సినిమాగా చరిత్రలో నిలిచిపోయిన దునియా నా మానే సినిమాలో బిక్షగాడిగా పురుషోత్తం నటించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. చివరకు అతను బిక్షగాడిగానే తనువు చాలించడం విచిత్రం. 1940లో పరశురామ్ లీలాబాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఖర్చుల కోసం శాంతారామ్ ఐదు వందల రూపాయలు ఇచ్చారు. ఆ కాలంలో ఇది చాలా పెద్ద మొత్తం. ఇక తన జీవితం స్థిరపడినట్టే అనుకున్నాడు పురుషోత్తం. 

ప్రభాత్ ఫిల్మ్ కొన్ని వివాదాల్లో చిక్కుకోవడంతో ఆయన నేషనల్ స్టూడియో వారి మేరీ దునియా (1942)లో నటించారు. ఈ సినిమాలో ఆయన మూడు పాటలు కూడా పాడారు. తరువాత శాంతారామ్ రాజ్‌కమల్ సినిమా స్టూడియోను ఏర్పాటు చేసి పరశురామ్‌ను నెలకు 80 రూపాయల వేతనంపై తీసుకున్నారు. 1943లో శాంతారామ్ తీసిన శకుంతల సినిమాలో పరశురామ్ కణ్వమునిగా నటించాడు. ఒకవైపు రాజ్‌కమల్ వారి సినిమాల్లో నటిస్తూనే ఇతర సంస్థల సినిమాల్లో బిజీ అయ్యాడు. జీవన్ యాత్ర(1946) మత్‌వాలా షాయర్(47), బూల్(48)అప్నాదేశ్(49), తీన్ బాతి చార్ రాస్తా(53) గీత్ గాయా పాత్తరోనే(64), చోర్ బజార్(54), హౌస్ నంబర్ 44(1955) జాగ్తే రహో1956) బాగం బాగ్(1956) సినిమాల్లో నటించారు. 62లో వచ్చిన కింగ్ కాంగ్, ఆశిఖ్, మై చూప్ రహుంగా, 64లో ఆప్‌కి పర్‌చయే 65లో రుస్తూం ఇ హిందు, 70లో సఫర్, 71లో మన మందిర్ సినిమాల్లో నటించారు. మద్రాస్ వెళ్లి ఎవిఎం వారి సినిమాల్లో కూడా నటించాడు పరశురామ్.

1968లో ఒక సినిమాషూటింగ్‌లో కాలు విరగడంతో అతని దురదృష్టకర జీవితం ప్రారంభం అయింది. ఆ సంఘటన తరువాత పరశురామ్ పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తరహా నటన, పాటలకు కాలం చెల్లిందని దూరం పెట్టారు. సినిమాల్లో నటించనిదే ఉండలేని అతను చివరకు మద్యం లేనిదే ఉండలేని స్థితికి చేరుకున్నాడు. సినిమా వాళ్ల ముందు మద్యం కోసం చేతులు చాచడం ప్రారంభించారు. చివరకతను బిక్షగాడిగా మారిపోయాడు.... మద్యానికి బానిసైన పరశురామ్‌కు ఎంత చెప్పినా వినకపోడంతో కుటుంబం దూరమైంది. కుమార్తెకు అప్పటికే పెళ్లి కావడంతో ఆమె వేరుగా ఉంది. అలాంటి సమయంలోనే పరశురామ్ రోడ్డుపై బిక్షమెత్తుకుంటుంటే తబస్సుమ్ చూసింది. ఎంత మంది సహాయం చేసినా మద్యం ముందు ఆయన నిలువలేకపోయాడు. ఆ తరువాత కొద్ది రోజులకే జనవరి 24, 1978న పరశురామ్ ఫుట్‌పాత్‌పైనే జీవితాన్ని ముగించారు. రోడ్డుమీద అతన్ని చూసి దయగల వాళ్లు బాబా ఆస్పత్రిలో చేర్పించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే వాళ్లు రావడానికి ఇష్టపడలేదు. కుమార్తెకు తెలిసి వచ్చేసరికి పరశురామ్ మరణించాడు. ఆమెనే తండ్రి అంత్య క్రియలు నిర్వహించింది. 1981లో పరశురామ్ భార్య, 82లో కుమారుడు మరణించాడు. పరశురామ్ కుమార్తె ముంబైలో, మనవడు న్యూజిలాండ్‌లో ఉన్నారు. మూడున్నర దశాబ్దాల తరువాత తన తాత గురించి తెలుసుకొనే వారి గురించి తెలిసి మనవడు సంతోషించాడు. ఆయన మద్యానికి బానిసై దుర్భర జీవితం గడిపి ఉండవచ్చు కానీ అంత కన్నా ముందు గొప్పనటుడు ఆ నటుని మనవడిగా నేను సంతోషిస్తాను అని పరశురామ్ మనవడు మంగేష్ బార్డె చెప్పుకొచ్చారు.

నటన జీవితంలో ఒక భాగం... కానీ నటనే జీవిత కాదు.. కానీ పరశురామ్ మాత్రం ఆ తేడాను గ్రహించ కుండా జీవితాన్ని విషాదంగా మార్చుకున్నారు. *

16, నవంబర్ 2014, ఆదివారం

పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే... చార్మినార్‌లో లక్క గాజులు తక్కువ ధరకు దొరికేవి

‘‘ఏమోయ్ కుటుంబరావు   నీ కోసమే ఎదురు చూస్తున్నాను. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి’’అని విశ్వనాథం ఫోన్ చేశాడు. ‘‘ఇదిగో నినే్న మీ కుటుంబరావు అన్నయ్య వస్తున్నాడు, మంచి టీ చేయ్ సీరియస్ విషయంపై సీరియస్‌గా మాట్లాడుకోవాలి’’
‘‘ఏంటో అంత సీరియస్ విషయం ’’అని శ్రీమతి అడిగింది.


‘‘దేశంలో ఇప్పుడు ఇదే అత్యంత కీలకమైన అంశం. జవహర్ లాల్ నెహ్రూకు బదులు పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే ఎలా ఉండేదని దేశ పాలకులు మొదలుకుని, సామాజిక మాధ్యమాల వరకూ అంతా దీనిపైనే చర్చించుకుంటున్నారు. రిటైర్ అయ్యాక ఈ దేశం కోసం ఏమైనా చేయాలని తెగ ఆలోచించాను. ఆలోచించడానికి మించిన దేశసేవ లేదని మా ఆలోచనల్లో తేలింది. అందుకే ఇవ్వాళ ఈ సీరియస్ విషయం మీద కుటుంబరావు, నేను సుదీర్ఘంగా చర్చించాలని నిర్ణయించుకున్నాం. వినాలని ఆసక్తి ఉంటే వంట గది నుంచి విను... అనవసరంగా మధ్యలో జోక్యం చేసుకుని మూడ్ పాడు చేయకు’’ అని విశ్వనాథం చెబుతుండగానే కుటుంబరావు వచ్చినట్టుగా శబ్దం అయింది.


పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే పాకిస్తాన్‌తో పాటు నాలుగైదు దేశాలు మన దేశంలో కలిసిపోయేవని, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ పెరిగి ఉండేవని, చార్మినార్‌లో లక్క గాజులు తక్కువ ధరకు దొరికేవని, జాంబాగ్ ఫ్రూట్‌మార్కెట్‌లో పండ్ల ధర ఇంకా తక్కువుండేదని నాకెందుకో గట్టిగా అనిపిస్తోందోయ్ నువ్వేమంటావు’’ అని విశ్వానాథం చర్చ ప్రారంభించాడు.


‘‘అన్నయ్య గారూ బాగున్నారా? ఈ మధ్య రావడం లేదేమిటి ’’ అని కుటుంబరావును శ్రీమతి అడిగింది. ఇంకా భార్య అక్కడే నిలబడడంతో ‘‘ఇలాంటి విషయాలు నీకు అర్ధం కావు. ముందు టీ పెట్టుపో..’’ విశ్వనాథం శ్రీమతిని ఆదేశించాడు.
‘‘సరే టీ పెడతాను కానీ మొన్న పెళ్లిలో మీరు చాలా సేపు మాట్లాడారు చూడండి ’’
‘‘ఎవరూ ఆ బట్టతల అతని గురించేనా నువ్వు చెబుతున్నది’’.
‘‘అవును అతనే ఇంటికి రమ్మని పిలిచాం కదా వస్తానన్నాడు. వచ్చేప్పుడు ఫోన్ చేస్తాడు కాస్త చూడండి ’’


‘‘సరే చూస్తాను కానీ ఎవరతను చాలా ఇంట్రస్టింగ్ పర్సన్ తెగ మాట్లాడేస్తాడు కొత్తా పాత అని లేనే లేదు. బాగా కలిసిపోతాడు. ఆ పెళ్లిలో అతనున్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంతో ఇబ్బంది పడేవాడిని.. ఔను ఏదో సినిమాలో కూడా నటించాడట కదా?’’ అని విశ్వనాథం అడిగాడు.


‘‘అతను మీకూ నచ్చాడా! అతనంతే ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాడు. బాగా మాట్లాడతాడు. తహసిల్దారుగా వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకొన్నాడు. బాగానే సంపాదించాడు. వాళ్ల పిల్లలిద్దరూ అమెరికాలో సెటిలయ్యారు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక రిటైర్ అయ్యాక ఇప్పుడు ఆసక్తి కొద్దీ సినిమాల్లో ప్రయత్నిస్తున్నాడు. మాయా మశ్చింద్ర సినిమా చూశారా! అందులో రాజు యుద్ధానికి వెళ్లేప్పుడు చాలా మంది సైనికులు ఉంటారు కదా! ఆ సైనికుల్లో ముందు వరసలో 14వ వాడు ఆయనే... ఆ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్‌ను చాలా దగ్గరి నుంచి చూశాడట! ఎన్టీఆర్ అచ్చం మనిషిలానే ఉన్నాడట కలిసినప్పుడల్లా 40ఏళ్ల క్రితం నాటి ఆ సినిమా షూటింగ్ కబుర్లు కళ్లకు కట్టినట్టు చెబుతాడనుకో... 


ఇంట్లో ఆ సినిమా సీడీ ఉంది. చూడండి. చేసింది సైనికుడి వేషమే అయినా, డైలాగులు లేకపోయినా ఎంత హుందాగా నిలబడ్డాడు... ఆ ఠీవీ... దర్పం...’’ అంటూ శ్రీమతి చెప్పుకుపోతున్నది.


‘‘సర్లేఈ సారి నువ్వు ఆ సినిమా చూసేప్పుడు ఆ సీన్ వచ్చినప్పుడు నన్ను పిలువు చూస్తాను....అది సరే ఇంతకూ అతను నీకేమవుతాడో చెప్పనే లేదు.’’ని విశ్వనాథం ఆసక్తిగా అడిగాడు.


‘‘ఏమవుతాడు చేసుకుంటే ఇప్పుడు మీరు కూర్చున్న చోట ఆయన కూర్చునే వాడు. అది జరిగితే నా జీవితం ఎంత బాగుండేది. సినిమాల షూటింగ్‌లకు తీసుకు వెళ్లేవాడు. కాలం కలిసి వస్తే మహానటుడు అయ్యేవాడు. ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడు. మధ్యలోనే పోతే ఆ స్థానంలో నేను ముఖ్యమంత్రిని అయ్యేదాన్ని. దూరపు బంధువు.. వరుసకు బావ అవుతాడు. మా తరఫు వాళ్లు, వాళ్ల తరఫు వాళ్లు అంతా ఓకే అనుకున్నారు. మాయదారి గోత్రాలు కలవలేదు’’ అని శ్రీమతి ఏదో చెబుతుంటే


విశ్వనాథం మధ్యలోనే జోక్యం చేసుకుని, ఎవడూ ఆ ఉడత ముఖం వాడు నిన్ను చేసుకోవాలనుకున్నాడా! అయినా వాడేంటి ఆడవాళ్లలా అలా కబుర్లు చెబుతూనే ఉంటాడు. ఎదుటివాడు వింటున్నాడా లేడా? అనే స్పృహనే ఉండదు. పొట్టివెదవ, ఏదో లంచం తీసుకుంటుంటే ఎసిబి వాళ్లు పట్టుకున్నట్టున్నారు. తీసేసిన తహసిల్దారు అని చెప్పుకోవడానికి సిగ్గుపడి అలా చెబుతున్నాడేమో! వాడ్ని చూడగానే దొంగ ముఖం అనిపించింది ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. వాడ్ని నువ్వు చేసుకుని ఉంటే పీడాపోయేది నేను ఏ వాణిశ్రీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండేవాన్ని అని విశ్వనాథం ఉడుక్కుంటూ చెప్పాడు.

 సర్లేండి మీ బట్టతల ముఖానికి వాణిశ్రీ లాంటి అమ్మాయి దొరికేదా? అని శ్రీమతి ఎత్తి పొడిచింది.

‘అది సరే వాడు మహానటుడు, ముఖ్యమంత్రి అయ్యేవాడా? ? ఎలా?’’


’’డిప్యూటీ రిజిస్ట్రార్ ఉద్యోగం వదిలి ఇన్‌స్పెక్టర్‌గా చిన్న పాత్రలో నటించిన ఎన్టీఆర్ మహానటుడై, తరువాత ముఖ్యమంత్రి కాలేదా? ఆయన ఏకంగా తహసిల్దారు... సైనికుడి వేషం వేశాడు ఏం ఎన్టీఆర్‌లా ఎందుకు కాకూడదు ?’’ అని శ్రీమతి నిలదీసింది...
శ్రీమతితో వాదించి ప్రయోజనం లేదని గ్రహించిన విశ్వనాథం ‘‘సర్లేవే నీతో వాదనెందుకు? పెళ్లయిన ఆరు దశాబ్దాల తరువాత వాడెవడితోనో పెళ్లయి ఉంటే అనుకోవడం పిచ్చితనం’’ అన్నాడు.
‘‘ మరి దేశంలో మరే సమస్య లేనట్టు.. ఏడు దశాబ్దాల తరువాత నెహ్రూకు బదులు పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే? ’’ అని చర్చించుకోవడం తెలివైన పనా? అని శ్రీమతి అడిగింది.


గుర్తు తెలియని వ్యక్తి వీరి చర్చలో దూరి ‘‘మా గుండప్ప బతికుంటే దేశంలో ఇన్ని సమస్యలే ఉండేవి కాదు. వాడు మా ఊర్లో పెద్ద రౌడీ వాడంటే అందరికీ హడల్ పిచ్చి కుక్క వెనకనుంచి వాడ్ని దెబ్బతీసింది’’ అని చెబుతుంటే .. ఒక గుంపు అదిగో గుండప్ప అక్కడున్నాడు అని ఆ అగంతకుని వైపు పరిగెత్తు కొచ్చారు. 

ఆ హీరోయిన్ టై మ్ మ్యాగజైన్ ముఖచిత్రంగా నిలిచింది - అనాధలా మరణించింది



మూడు రోజుల నుంచి ఆ శవం మంచంపై పడి ఉంది. తలుపులు విరగ్గొట్టి లోనికి వెళ్లి శవాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. ముక్కు మూసుకున్నారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చాలా సేపటి వరకు ఆ శవాన్ని శుభ్రం చేసేందుకు ఎవరూ రాలేదు. మరణించి మూడు రోజులు కావడం వల్ల కుళ్లి పోయింది.
హే భగవాన్ ఆమెమీద ఎందుకంత కక్ష.. పగవానికి కూడా ఇలాంటి మరణం వద్దు అని వౌనంగా రోదించారు ఆ శవాన్ని చూసిన వారు...


***
భగవంతుడు ఉల్లాసంగా ఉన్నప్పుడు ఆమె కోసం ప్రత్యేంగా సమయం కేటాయించి పోత పోసినట్టున్నాడు. లేకపోతే ఆమె అంత అందంగా ఎలా ఉంటుంది. సృష్టి ధర్మం అని ఆమెను భూమిపైకి పంపించాడు కానీ ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆమెను తన లోకంలోనే ఉంచుకునే వాడేమో ఆ దేవుడు. అందమే ఆమెలా ఉంటుంది అని చెప్పాల్సినంత అందం ఆమెది. కోట్లాది మంది అభిమానులే కాదు... సాటి మేటి నటులు సైతం ఆమె అందానికి ఫిదా అయ్యారు. ఇతర అందగత్తెలు ఆమె అందాన్ని చూసి ఈర్ష్య పడ్డారు. ప్రపంచ ప్రఖ్యాత 
టై మ్ మ్యాగజైన్ సైతం ఆమె అందానికి దాసోహం అంది. తన ముఖ చిత్రంగా మార్చుకుంది.
ఇంతకూ ఎవరామె?

అనాధలా మరణించింది, అందగత్తె ఇద్దరూ ఒకరే .. దాదాపు దశాబ్ద కాలం పాటు హిందీ సినిమా అప్సరసగా కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన పర్వీన్ బాబీ . బాలీవుడ్ తొలి మహిళా సూపర్ స్టార్, హిందీ సినిమాలకు ఫ్యాషన్‌ను నేర్పిన అందగత్తె అమె.
కోట్లాది మందికి నిద్ర లేకుండా చేసిన ఆ అందగత్తె శాశ్వత నిద్రలోకి జారుకున్న విషయం మూడు రోజుల తరువాత కానీ ప్రపంచానికి తెలియలేదు.
ఆమె అందంగా ఉండడానికి, దయనీయమైన మరణానికి దేవుడికి ఎలాంటి సంబంధం లేదు. మనిషి తన చేతులతో, తన చేతలతోనే తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు.

***
గుజరాత్‌లోని జునాఘడ్‌లో ముస్లిం కుటుంబంలో జన్మించిన పర్వీన్ బాబీ అహమ్మదాబాద్‌లోని స్కూల్‌లో చదువుకుంది. పదేళ్ల వయసులో ఉండగానే తండ్రి మరణించాడు. బహుశా ఆమె జీవితంలో ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉండి ఉంటుంది. తండ్రి ద్వారా పిల్లలకు ఆత్మవిశ్వాసం అలవడుతుంది. బాల్యంలోనే ఆ భరోసాను కోల్పోయిన పర్వీన్ బాబీ ప్రేమ కోసం పరితపించినట్టు ఆమె ప్రవర్తనను బట్టి అర్థమవుతుంది. అహ్మదాబాద్‌లో కాలేజీలో చదువుకుంటున్న సమయంలోనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 1972లో మోడల్‌గా గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టిన ఆమెకు 73లోనే చరిత్ర అనే సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం లభించింది. సినిమా ఫ్లాప్, కానీ పర్వీన్ బాబి అందానికి హిందీ సినిమా రంగం ఫ్లాట్ అయింది. 74లో అమితాబ్‌తో కలిసి నటించిన బజ్‌బూర్ పెద్ద హిట్.. అవకాశాలు వెల్లువెత్తాయి. భారతీయ సినిమా హీరోయిన్ల ఇమేజ్‌ను మార్చేసిన నటిగా గుర్తింపు పొందింది. తన కాలంలో ఆమె ఎంత తీవ్రమైన ప్రభావం చూపిందంటే... 73లో సినిమా రంగంలోకి ప్రవేశిస్తే, 76జూలైలో ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ ముఖ చిత్రంగా నిలిచింది. టైమ్స్ ముఖ చిత్రంగా వెలిగిపోయిన తొలి బాలీవుడ్ నటి. అమితాబ్‌తో కలిసి ఆమె ఎనిమిది సినిమాల్లో నటిస్తే, అవన్నీ సూపర్ హిట్టయ్యాయి. 1970-80ల కాలంలో టాప్ హీరోలైన అమితాబ్, శశికపూర్, ఫిరోజ్ ఖాన్, ధర్మేంద్ర, రాజేష్‌ఖన్నా, వినోద్ ఖన్నా, మనోజ్‌కుమార్, రిషికపూర్, మనోజ్ కుమార్‌లతో హీరోయిన్‌గా నటించింది. 75లో వచ్చిన దీవార్‌లో ఆమె అందం ఇప్పటికీ నిత్యనూతనంగా అభిమానులను అలరిస్తుంది. 77లో వచ్చిన అమర్ అక్బర్ అంథోనీ సినిమాల్లో అమితాబ్‌కు జంటగా నటించింది.

***
తండ్రి లేడు, బంధువులకూ పర్వీన్ బాబీకి సంబంధాలు లేవు. గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ గ్లామర్ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తుంది. ఎంతో మంది చుట్టూ చేరేట్టు చేస్తూంది. అదే అందం ఆమెను అగాధంలోకి తోసేస్తుంది. సినిమా ప్రపంచం మాయ గురించి చెబుతూ ఓ సందర్భంలో తెలుగు నటి రమాప్రభ జీవిత అనుభవంతో ఓ మాట చెప్పారు. వయసు, డబ్బు ఈ రెండింటికే మగాడు ఆకర్షితుడవుతాడు. కానీ స్ర్తి ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉంటాయంది. ఎంతో మంది సినిమా హీరోయిన్ల మాదిరిగానే పర్వీన్ బాబీ విషయంలో అదే జరిగింది. మంచి అందగత్తె... విపరీతంగా చదివే అలవాటుంది. ఆధునిక భావాలు. ప్రేమ కోసం తపిస్తోంది. ఇంత కన్నా ఇంకేం కావాలి. ఇదే సమయంలో సినిమాల్లో అవకాశాల కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న నేటి మేటి దర్శకుడు మహేశ్‌భట్ పర్వీన్ బాబీకి చేరువయ్యారు. ఆమె కోరుకున్నది, అతను కోరుకున్నది వేరు వేరు, కానీ ఇద్దరూ ఏకమయ్యారు. పర్వీన్ బాబీ తరుచూ మానసికంగా తీవ్రమైన సంఘర్షణలోకి లోనయ్యేది. పర్వీన్ బాగా చేరువైన తరువాత మహేశ్‌భట్ 82లో అర్త్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. కథ తానే రాశారు. ఇది పర్వీన్‌బాబీ, భట్‌ల ప్రేమ కథ అనే ప్రచారం ఉంది. ఈ సినిమా తరువాత పర్వీన్‌బాబి మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు.

ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి టాప్ పొజిషన్‌లో ఉన్న సమయంలోనే పర్వీన్ ఎవరికీ చెప్పకుండా 83లో కనిపించకుండా పోయారు. ముంబై మాఫియా ఆమెను కిడ్నాప్ చేసిందని రకరకాల పుకార్లు వినిపించాయి. ప్రముఖ తత్వవేత్త యుజి కృష్ణమూర్తి, తన స్నేహితుడు వాలైంటెన్‌తో కలిసి ఆ సమయంలో ఆమె అనేక దేశాలు తిరిగింది. కాలిఫోర్నియాలో ఎక్కువ రోజులు ఉన్నారు.

నమ్మిన వ్యక్తులు మోసం చేయడం, ప్రేమించిన వారు అవమానించడం వంటి సంఘటనలు ఆమె మానసిక స్థితిపై తీవ్రంగా ప్రభావం చూపించాయి. చివరకు తానెవరో తనకే తెలియని స్థితికి చేరుకుంది. 84లో జాన్ ఎఫ్ కెన్నడి అంతర్జాతీయ విమానాశ్రయంలో తన ఐడెంటిటీ చెప్పలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న అమెను పోలీసులు అదుపులో తీసుకుని మరో 30 మంది పిచ్చివాళ్ల మధ్య ఉంచారు. విషయం తెలిసి యుజి కృష్ణమూర్తి తన పలుకుబడితో ఆమెను బయటకు తీసుకు వచ్చారు. కొంత కాలం తరువాత హఠాత్తుగా ముంబైలో ప్రత్యక్షమయ్యారు. అమితాబ్ మొదలుకుని అనేక మంది తనపై కుట్ర చేస్తున్నారని ఏమేమో మాట్లాడసాగింది. తన వారు అనేవారు ఎవరూ లేరు, ఒక్క మత్తు మందు తప్ప . ఆ మత్తులోనే అనంత లోకాలకు పయనమైంది.

పత్రికలు, పాల ప్యాకెట్లు మూడు రోజులైనా తీసుకోక పోవడంతో అనుమానం వచ్చి తలుపు బద్దలు కొడితే పర్వీన్ బాబీ శవం కనిపించింది. హిందీ చిత్ర సీమ మొత్తం తరలి వస్తుందేమో అనుకుని ఆస్పత్రికి వెళ్లాను కానీ ఏ ఒక్కరూ అక్కడ కనిపించలేదు అంటూ ఆనాటి సంఘటనను తలుచుకుంటూ ఓ హిందీ దర్శకుడు గద్గద స్వరంతో పలికాడు.
ఐశ్వర్యం అంటే బంగారం, డబ్బు , భూముల రూపం లోనే కాదు .. మానవ సంబంధాల రూపం లో కూడా ఉంటుంది అని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు .. అందుకే అష్ట 
ఐశ్వర్యా లలో కుటుంబం , సంతానం , బందు  గ నా న్ని కూడా చేర్చారు .. బలమైన కుటుంబం కూడా ఐశ్వర్యమే. మానసికంగా ఆందోళనలో ఉన్నప్పుడు   , ఏది మంచో ఏది చెడో  నిర్ణయించు కోలేనప్పుడు,  సరైన  నిర్ణయం తీసుకోవడానికి కుటుంబం అండగా నిలుస్తుంది . 

ఆమె సంపన్న కుటుంబం లో పుట్టింది కానీ సినిమాల్లోకి వచ్చాక ఆమెకు కుటుంబం తప్ప అన్నీ ఉన్నాయి .  గొప్ప అందగత్తె ఎంతో సంపాదించింది. కానీ కుటుంబ సంబంధాల విషయంలో నిరుపేదగానే మిగిలిపోయింది. మానసికమైన ఒత్తిడి ఏ వృత్తిలోని వారికైనా ఎంతో కొంత సహజమే. గ్లామర్ పోటీ ప్రపంచంలో అది మరీ ఎక్కువగా ఉండొచ్చు. తల్లితండ్రి, భార్యాభర్తలు, పిల్లలు, బంధువులు, మంచి మిత్రులు అనే బలమైన రక్షణ కవచం  ఉన్నప్పుడు ఇలాంటి ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. లేకపోతే జీవితం పర్వీన్ బాబీలా విషాదంగా ముగుస్తుంది. సంపదను నిలబెట్టుకోవడమే కాదు బంధాలను కూడా నిలబెట్టుకున్నవారే ఐశ్యర్యవంతులు.

ఏప్రిల్ 4, 1949లో జన్మించిన పర్వీన్ బాబీ, జనవరి 20, 2005లో మరణించారు.

 ‘ఆమె రెండుసార్లు మరణించారు, మానసికంగా మొదటిసారి, శారీరకంగా రెండవ సారి మరణించింది’ అని మహేశ్‌భట్ ఆమె మరణించినప్పుడు కామెంట్ చేశారు. 

మానసికంగా మరణించిన పర్వీన్ బాబీలు నేటి మెటీరియలిస్టిక్ ప్రపంచంలో లెక్కలేనంత మంది ఉన్నారు. 
*  

11, నవంబర్ 2014, మంగళవారం

నాయకుల చివరి కోరిక!

చివరి కోరిక తీరకుండా పోతే ఆత్మలుగా మారి వెంటాడతారు అనేదో నమ్మకం. అందుకే ఎంతో ఘోరమైన నేరం చేసిన వాడికి ఉరిశిక్ష అమలు చేసేప్పుడు కూడా చివరి కోరిక అడుగుతారు. ఉరి నుంచి తప్పించుకోవాలనేది వాని చివరి కోరిక అయినా అది తీర్చరు కాబట్టి ఆ మాట చెప్పరు.


వెకటికో గజదొంగ రాజుగారి సైనికులకు చిక్కాడు. ఉరిశిక్ష అమలు చేసే సమయంలో చివరి కోరిక ఏమిటి?అని అడిగారు. అతనికి ఇంకా చాలా కాలం బతకాలని ఉంది, ఆ కోరిక తీర్చరు కదా! ఏమో ప్రయత్నిస్తే ఫలించవచ్చు అని మనసులోనే అనుకుని ఏమీ చెప్పకుండా నవ్వాడు. దొంగ తప్పించుకొని పోయినా రాజు సహిస్తాడే కానీ తన ముందు నవ్వడం అస్సలు సహించడు. రాజైనా, బాసైనా బానిసల నవ్వును అస్సలు సహించలేరు. ఎలాగూ ఉరిశిక్ష అనుభవించబోతున్న వాడికి నవ్వినందుకు అంతకన్నా మించి ఇంకేం శిక్ష విధిస్తారు. చాన్స్ లేదు కాబట్టి రాజే ఒక అడుగు కిందికి దిగి, కారణం అడుగుతాడు. గుర్రాన్ని ఎగిరించే విద్య తెలిసిన నా లాంటి వాడిని ఉరితీస్తున్న మూర్ఖులను చూసి నవ్వు ఆపుకోలేకపోయాను అని మళ్లీ నవ్వుతాడు. నీకా విద్య తెలిస్తే ఆరునెలల గడువు ఇస్తున్నాను, గుర్రాలను, వాటిని ఎగిరించేందుకు కావలసిన సౌకర్యాలను నీకు అందుబాటులో ఉంచుతాను, ఆరునెలల్లో గుర్రాలు ఎగరకపోతే నీ ప్రాణాలు ఎగిరిపోతాయంటాడు రాజు. 

ఆరునెలల తరువాత ఏమవుతుంది అని తోటి ఖైదీ ఆసక్తిగా అడిగితే, ఏమో ఎవడు చెప్పొచ్చాడు... ఏమైనా కావచ్చు, నాకు శిక్ష విధించిన రాజు యుద్ధంలో ఓడిపోవచ్చు, ఈ రాజ్యాన్ని ఎవరైనా ఆక్రమించుకోవచ్చు. రాణిగారే విషం పెట్టి రాజును చంపొచ్చు ... ఇవేవీ జరగకపోతే ఆరునెలల్లో ఏమో గుర్రం ఎగరావచ్చు.. కానీ ఆరునెలలైతే రాజభోగం అనుభవించవచ్చు కదా? ఇదే నా చివరి కోరిక అని మనసులోని మాట చెబుతాడు గజదొంగ.
గజదొంగకే ఇన్ని తెలివి తేటలు ఉండి ఆరునెలల్లో ఏమైనా జరగవచ్చు అనుకుంటే ఇంత కన్నా ఎన్నో తెలివి తేటలు ఉన్న రాజకీయ నాయకులు ఐదేళ్లలో ఏమైనా జరగవచ్చు అనుకోకుండా ఉంటారా? ఏమో గుర్రం ఎగరావచ్చు అని నాయకులు అనుకుంటే వింతేముంది. 


విదేశాల్లోని నల్లధనం తెచ్చేస్తామని హామీ ఇచ్చేస్తే, జనం నమ్మి అధికారం అప్పగించేస్తారు. మరి తెస్తారా? అంటే ఐదేళ్లయితే అధికారం ఉంటుంది కదా? ఐదేళ్లలో ఏమైనా జరగవచ్చు, ప్రజలు ఈ విషయం మరిచిపోవచ్చు, ఏమో గుర్రం ఎగిరినట్టు, గోడకు కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టు నల్లధనం రావచ్చూ!


రాజకీయ నాయకుల మనసులో చివరి కోరిక ఏముంటుందో కానీ పైకి మాత్రం ఓట్లు రాల్చే కోరికలే చెబుతారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా చివరి కోరిక అంటాడో నాయకుడు. ప్రపంచంలో పేదరికం లేని దేశమే లేదు. ఒకవేళ భవిష్యత్తులో చంద్ర గ్రహమో, ఇంద్ర గ్రహమో ఏదో ఒక గ్రహం మీద మనుషుల ఉనికి తేలినా? లేక మనుషులే అక్కడికి పోయి నివసించడం మొదలు పెట్టినా వారితో పాటే పెదరికం అక్కడికి వెళ్లి తీరుతుంది. జీవ సంచారం ఉన్న ప్రతి చోట పేదరికం ఉంటుంది. జీవితాంతం అధికారంలో ఉండాలని, బతికి ఉన్నంత వరకు నన్ను గెలిపించండి అని ఇదే నా చివరి కోరిక అని పైకి చెబితే బాగోదు కానీ పేదరికం లేని సమాజ నిర్మాణమే నా చివరి కోరిక అంటే ఓట్లు రాలకుండా ఉంటాయా?
ముందుంది మంచి కాలం అని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్‌రెడ్డి చెబితే పాపం ఆయన్ని ఎవరూ సరిగా అర్ధం చేసుకోలేదు. లాస్ట్‌బాల్‌తో తెలంగాణను అడ్డుకుంటానన్నారు కాబట్టి ముందున్నది సమైక్యాంధ్ర అనే ఉద్దేశంతో ఆయనా మాట అన్నారేమో అనుకొని తెలంగాణ వాళ్లు వ్యతిరేకించారు. చివరకు సొంత నియోజక వర్గం వాళ్లు కూడా ఆయన్ని పట్టించుకోలేదు. 


బహుశా ముందుంది మంచి కాలం అని ఆయన మాటల ఉద్దేశం తెలంగాణ వచ్చే రోజులు ముందున్నాయి అని చెప్పదలుచుకున్నారేమో? అని తెలంగాణ వాళ్లు ఇప్పుడనుకుంటున్నారేమో! అయ్యో ఆయన కాంగ్రెస్ వాళ్లను ఉద్దేశించి ఆ మాట అన్నారేమో అని అప్పుడనుకున్నాం, టిడిపికి మంచి కాలం ముందుందనే ఉద్దేశంతో ఆ నినాదం ఇచ్చినట్టు ఉందని ఆంధ్ర టిడిపి నాయకులు ఇప్పటికి గ్రహించి ఉంటారు. చివరకు కాంగ్రెస్ వాళ్లు కూడా ఆయన మాటలను సరిగా అర్ధం చేసుకోలేదు. తమకు మంచి కాలం ముందుందని ఆయన చెబుతున్నారేమో అనుకున్నారు కానీ తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు ఆంధ్రలో టిడిపికి ముందుంది మంచి కాలం అని చెప్పడమే ఆయన ఉద్దేశం అని ఇప్పుడనుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కిరణ్ కుమార్‌రెడ్డి అంత నిస్వార్థ నాయకుడు మరొకరు కనిపించరు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన పార్టీని సర్వనాశనం చేసి తన గురించి కాక తమ వ్యతిరేక పార్టీల బాగు కోసం పని చేశారంటే ఆయనలో ఎంత నిస్వార్థపరుడైన నాయకుడుండాలి. ఇప్పుడు బిజెపిలో చేరేందుకు ఆయన ఉత్సాహం చూపిస్తున్నా, పొరుగు వారిని ప్రేమించమనే ఆయన సుగుణాన్ని చూసి వారూ భయపడుతున్నారేమో! ఏ విధంగానైతేనేం ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ కొత్త రికార్డు సృష్టించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానీ రికార్డును ఆయన సృష్టించారు. బహుశా ఇదే ఆయన చివరి కోరిక కావచ్చు. ప్రస్తుత రాజకీయాల్లో ఆయన కోరికలు తీరే అవకాశాలు లేవు కాబట్టి ఇదే చివరి కోరిక అనుకోవాలి.
తన అవసరాలను మించి తన జీతం ఉండాలనేది సామాన్యుడి చిరకాల కోరిక, చివరి కోరిక. కానీ ఆ కోరిక ఎప్పటికీ తీరదు.


మన హీరోయిన్లు నిండుగా చీర కట్టుకుని నటిస్తే చూడాలనేది నా చివరి కోరిక అని ఓ సినిమా అభిమాని తీరని కోరికను బయటపెట్టాడు. అదేదో సినిమాలో జ్యోతిలక్ష్మి చీర కట్టింది చీరకే సిగ్గేసింది అని పాడినట్టు ఈ కోరిక గురించి తెలిస్తే హీరోయిన్లు సిగ్గుపడి పోరూ! మారుతున్న కాలంలో హీరోయిన్లు బట్టలను పూర్తిగా త్యజించే రోజులు వస్తాయేమో కానీ నిండుగా చీరకట్టుకుని నటించే రోజులు వస్తాయా? ఒకవైపు నడిరోడ్డు మీద ముద్దులు పెట్టుకోవడం మా జన్మహక్కు అని కొందరు ఉద్యమిస్తుంటే.. హీరోయిన్లు నిండుగా కనిపించాలని కోరుకోవడం ఎప్పటికీ తీరని కోరికే కాదు అత్యాశ కూడా.

 

9, నవంబర్ 2014, ఆదివారం

హాస్యనట చక్రవర్తి రాజబాబు జీవితం అలా రోడ్డున పడింది

తుపాను బాధితుల కోసం విరాళాలు అందజేసిన సందర్భంగా ఇందిరా గాంధీతో రాజబాబు



మానవత్వం మనిషి లక్షణం. అది లేకపోతే అసలు మనిషే కాదు. కానీ ఆ మానవత్వం మితిమీరితే మనిషి రోడ్డున పడతాడు. అచ్చం మన హీరో హాస్యనట చక్రవర్తి రాజబాబులా! !
***
ఒక సినిమాలో హీరోగా ఎన్టీఆర్ పారితోషికం 35వేల రూపాయలు. రాజబాబు పారితోషికం 20వేల రూపాయలుగా నిర్ణయించారు నిర్మాత. తనకూ 35వేల రూపాయలు కావలసిందే అని పట్టుపట్టాడు రాజబాబు. ఎన్టీఆర్ హీరో మీరు కమెడియన్ అని నిర్మాత నసిగితే.. ఐతే హీరోనే కమెడియన్‌గా చూపించి సినిమాను విడుదల చేయండి అని రాజబాబు సమాధానం చెప్పారు. ఈ విషయం ఓ సందర్భంలో రాజబాబు తమ్ముడు చిట్టిబాబు స్వయంగా చెప్పారు. జగపతి వారి అంతస్తులు సినిమాలో నటించినందుకు 13వందల రూపాయల పారితోషికం ఇచ్చారు. అదే రాజబాబు తొలిసారిగా తీసుకున్న పెద్ద మొత్తం. ఆ తరువాత హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి రాజబాబు సినీ జీవితంలో. గంటల చొప్పున నటించిన నటుడు. ఒక గంట ఎన్టీఆర్‌తో నటిస్తే, మరో గంట శోభన్‌బాబు సినిమాలో ఇతరుల సినిమాల్లో నటించిన రికార్డు రాజబాబుది.
డబ్బుకు, పరపతికి కొదవ లేదు. కుటుంబంతో గడపలేంత బిజీగా, తన గురించి తాను ఆలోచించుకోలేంత బిజీగా మారిపోయాడు.
ఒకప్పుడు మద్రాస్‌లో పంపునీళ్లు తాగి రోజులు వెళ్లదీసిన రాజబాబు కమెడియన్ గా హీరోను మించిన పాపులారిటీ సంపాదించారు, డబ్బు సంపాదించారు. ఆ రోజుల్లోనే రాజబాబు లక్షల్లో పారితోషికం తీసుకున్నారు. అగ్ర హీరోల పారితోషికం కూడా ఆ కాలంలో అంతే.
బహుశా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నవారే హాస్యనటులుగా రాణిస్తారేమో! చార్లీ చాప్లిన్ మొదలుకొని రాజబాబు వరకు ఎంతో మంది హాస్యనటులు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. ఏమీ లేని కాలంలో ఎన్నో కష్టాలు అనుభవించిన రాజబాబు, ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్న తరువాత కూడా కష్టాలు ఆయన్ని వీడలేదు. కష్టాలు తమ రూపాన్ని మార్చుకుని రాజబాబును వెంబడించాయి. తన పుట్టిన రోజు నాడు రాజబాబు ఒక తారను సత్కరించేవారు. బాలకృష్ణ (పాతాళభైరవి అంజిగాడు) తో ప్రారంభించారు. సావిత్రిని సత్కరించినప్పుడు ఆమె పరిస్థితి చూసి వేదికపైనే బోరున ఏడ్చేశారు. ఆరంభం నుంచి ముగింపు వరకు ఆయన జీవితం సమస్యల మయమే. కానీ తాను మాత్రం కోట్ల మంది ప్రేక్షకులకు చక్కని హాస్యం అందించారు, కడుపుబ్బా నవ్వించారు.


తుఫాను వస్తే జోలె పట్టి ప్రజల నుంచి విరాళాలు వసూలు నటులున్నారు. రాజకీయ ప్రవేశానికి వారికి ఆ జోలె ఉపయోగపడింది. రాజబాబు అలా కాదు.. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు విరాళాలు సేకరించి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి అందజేశారు. రాజబాబు పేదలకు ఏకంగా ఒక కాలనీ కట్టి ఇచ్చారు. రాజమండ్రిలో పాకిపనివారి దుస్థితి చూసిన ఆయనలోని మనిషి కదిలిపోయి వారి కోసం ఏకంగా కాలనీ కట్టించారు. తెలుగునాట బహుశా ఏ మహానటుడు కూడా ఇలా చేసి ఉండరు. రాజమండ్రిలో ఏకంగా ఒక జూనియర్ కాలేజీని కూడా కట్టించారు.
1937 అక్టోబర్ 20న తూర్పు గోదావరి జిల్లాలో ఉమా మహేశ్వరరావు, రమణమ్మ దంపతులకు జన్మించిన రాజబాబు ఇంటర్ మీడియట్ చదివి, తెలుగు టీచర్‌గా ఉద్యోగంలో చేరారు. రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పల రాజు. ఇంటి పేరును సార్థకం చేసే విధంగా ఆయన దాన ధర్మాలు చేశారు. దాని వల్ల వచ్చే జన్మకోసం ఆయన ఎంత పుణ్యం మూట కట్టుకున్నారో తెలియదు కానీ కష్టాల్లోనే కడతేరారు. ఎంతో మందికి సహాయం చేశారు. పేదలకు పెళ్లిళ్లు చేశారు. తాను ఆకలితో ఇబ్బంది పడినప్పుడు పట్టెడన్నం పెట్టి ఆదుకున్న అందరినీ గుర్తుంచుకొని వారికి సహాయం చేశారు. వేషాల కోసం మద్రాస్‌లో తిరుగుతున్నప్పుడు ఆకలి గుర్తించి అన్నం పెట్టిన రాజసులోచన తోటమాలిని సైతం ఎదిగిన తరువాత గుర్తుంచుకుని ఆదరించిన మానవత్వం ఆయనది. 20 ఏళ్ల కాలంలో 589 సినిమాల్లో నటించారు. వరుసగా 13 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డు పొందిన రికార్డు రాజబాబుదే.


సినిమాలో రాజబాబు ఉన్నాడా? లేడా? అని చూసి డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనే పరిస్థితి ఏర్పడింది. రాజబాబు ఉంటేనే సినిమాకు కాసులు రాలుతాయని వారు నమ్మారు. వారి నమ్మకం వమ్ము కాలేదు. ఎన్నో సినిమాలు రాజబాబు వల్ల విజయవంతం అయ్యాయి. నిర్మాతలు బాగుపడ్డారు. ముందు చూపు లేకపోవడంతో చివరకు తన వారికి కీర్తిని తప్ప ఏమీ మిగల్చకుండానే వెళ్లిపోయారు.
తాతా మనవడు, పిచ్చోడి పెళ్లి, తిరుపతి, మనిషి రోడ్డున పడ్డాడు, ఎవరికి వారే యమునా తీరే, తాతా మనవడు సినిమాల్లో హీరోగా నటించి, మెప్పించారు. నటనా ప్రతిభా ఉన్నా అవకాశాలు అంత ఈజీగా దొరకలేదు. దాంతో పొట్టపోసుకోవడానికి ట్యూషన్లను నమ్ముకున్నారు. అడ్డాల నారాయణరావు తీసిన సమాజం సినిమాలో హాస్యనటునిగా తొలి అవకాశం లభించింది. ఆ తరువాత అవకాశాల ప్రవాహం మొదలైంది.
హాస్యనటుడు అయినా రాజబాబు మాటల్లో తాత్విక ధోరణి ఎక్కువగా ఉండేదంటారు. రాజబాబు నుంచి ప్రజలు హాస్యాన్ని కోరుకుంటారు. కానీ రాజబాబు మాత్రం ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నించారు. మనిషి రోడ్డున పడ్డాడు వంటి సందేశాత్మక చిత్రాలు నిర్మించారు. సినిమా అద్భుతంగా ఉంది. మంచి సందేశం ఉంది కానీ ప్రేక్షకులకు నచ్చలేదు. ప్రేక్షకులు మెచ్చే దారిలోనే నిర్మాత వెళ్లాలి అనే సందేశం రాజబాబు లాంటి వారికి ఈ సినిమా ఇచ్చింది. కానీ ఈ అనుభవం రాజబాబుకు ఆర్థికంగా బాగానే భారం అయింది.
***
పనీ పనీ పనీ రాజబాబుకు తెలిసింది ఇదొక్కటే. భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది, ఆ ప్రభావం రాజబాబుపై బాగా పడింది అని ఆయనతో దాదాపు 250 సినిమాల్లో జంటగా నటించిన రమాప్రభ ఓ సందర్భంలో తెలిపారు. కుటుంబ కలహాలు సున్నిత మనస్కుడైన రాజబాబుపై తీవ్రమైన ప్రభావం చూపించాయి. రాజబాబు మద్యానికి బానిసయ్యారు. సినిమాలు లేక మద్యాన్ని నమ్ముకున్నాను అనేది రాజబాబు చెప్పిన మాట, మద్యానికి బానిస అయ్యారు కాబట్టి అవకాశాలు ఇవ్వలేదు అనేది సినిమా వారి మాట. ఎవరి మాటల్లో ఎంత నిజముందో కానీ రాజబాబు మాత్రం విషాదంగానే ముగిసిపోయింది. కేవలం 45 ఏళ్ల వయసు. సినిమా రంగంలో ఉన్న కొందరి వ్యసనాలు బయట పడతాయి, కొందరివి రహస్యంగా ఉండిపోతాయి. అంతే తేడా..
1960లో మద్రాసుకు వచ్చి సినిమా యాత్రను ప్రారంభించిన రాజబాబు దాదాపు 20 ఏళ్లపాటు సినిమా సామాజ్య్రంలో నట చక్రవర్తిగా జీవించి ఏమీ లేకుండానే ఖాళీ చేతులతోనే జీవితం ముగించారు. 1983 ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లోని అస్పత్రిలో తుది శ్వాస విడిచారు. అంతకు ముందు రోజే మాట్లాడాలని ఉంది వస్తావా? అని రమాప్రభకు ఫోన్ చేశారు. అమె రాకముందే, చివరకు ఆ చిన్న కోరిక కూడా తీరకుండానే కన్ను మూశారు. రాజమండ్రిలో రాజబాబు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏటా రాజబాబు కుటుంబం ఇక్కడకు వచ్చి రాజబాబు జయంతి, వర్థంతి నిర్వహిస్తుంది. జీవితాన్ని ఎక్కడ ప్రారంభించారో మళ్లీ అక్కడికే చేరుకున్నారు. మరణించే నాటికి రాజబాబు వయసు 45 సంవత్సరాలు. చివరి సినిమా గడసరి అత్త సొగసరి కోడలు. 1965లో లక్ష్మీ అమ్ములుతో రాజబాబు వివాహం జరిగింది. అమె మహాకవి శ్రీశ్రీ మరదలు. రాజబాబు సోదరులు చిట్టిబాబు, అనంత్ సినిమాల్లో నటిస్తున్నారు. రాజబాబు ఇద్దరు కుమారులు నాగేంద్ర బాబు, మహేశ్‌బాబు అమెరికాలో ఉన్నారు.
*

***
కష్టాలతో కాలం గడుపుతున్న రోజుల్లో  రాజబాబు తాను బాగా సంపాదించి కారు కొని  తన ప్రయోజకత్వాన్ని తల్లికి  చూపాలనుకొన్నారు .. రాజబాబుకు ఆ అవకాశం ఇవ్వకుండానే   తల్లి కన్ను మూశారు .. రాజబాబు కుమారులు ఎదిగి అమెరికాలో సొంత ఐ టి కంపెనీ నడుపుతున్నారు .. వారి ప్రయోజకత్వాన్ని చూడకుండానే పిన్న వయసులోనే రాజబాబు తనువు చాలించారు .  .   

4, నవంబర్ 2014, మంగళవారం

మోదీ మీద మీకు నమ్మకం లేదా?

ఇన్నాళ్లకు నా నోములు ఫలించాయి. మీమ్ములను ఇలా చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అని శ్రీమతి ఏదేదో అంటుంటే శ్రీపతి అయోమయంగా చూస్తున్నాడు. ఇదే నండి నేను అన్ని దేవతలను కోరుకున్నది.. మీలో ఈ మార్పు కోసమే నేను ఉప వాసాలు ఉన్నాను. ప్రాంతాలకు, మతాలకు అతీతంగా అన్ని గుళ్లు, చర్చిలు, దర్గాలు తిరిగాను. సీమలోని తిరుపతికి వెళ్లాను, తెలంగాణలోని యాదగిరి గుట్టకెళ్లాను. ఉత్తరాంధ్రలోని సింహాచలం కోస్తాలో అన్నవరం వెళ్లాను. ఆ దేవుళ్లు నన్ను కరుణించారు. అంటూ శ్రీమతి చెప్పుకుంటూ పోతూనే ఉంటే శ్రీవారు అడ్డుకున్నారు. ఈరోజు మీరు ఎన్నయినా అనండి. నా దృష్టిలో ఈ రోజు మీరు మారిన మనిషి.. మనుషుల్లో దేవుడు అంటూ తనకు గుర్తున్న  దేవుడి సినిమా పేర్లన్నీ శ్రీమతి చదివేసింది.

ఏంటి ఈ రోజు ఇంకా మందు ముట్టుకోలేదని దేవుడంటున్నావా? ఏంటి? అలాంటి భ్రమలేమీ పెట్టుకోకు. మా లాంటి వాళ్లు మందు మానేస్తే ఆదాయాలు లేక ప్రభుత్వాలు పడిపోతాయి. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరు. అన్న కాలంలో మద్యనిషేధ ఉద్యమం జరిపి, అన్న అధికారంలోకి రాగానే నిషేధం విధించి, అన్నను తప్పించి నిషేధం ఎత్తివేయించారు అల్లుడు గారు. అధికారం పోగానే దశలవారీగా మద్యనిషేధం అంటూ ఉద్యమాలు చేశారు. ఇప్పుడు మద్యం ఉత్పత్తిని పెంచాలని మందు చూపుతో నిర్ణయం తీసుకున్నారు. దీన్ని బట్టి నీకు ఏమర్ధం అయింది? అన్న, అల్లుడు, తమ్ముడు, మామ ఎవరు అధికారంలో ఉన్నా మందు ఆదాయం లేనిదే అలా ముందుకు వెళ్లలేరు. మందు లేనిదే ప్రభుత్వాలే నడవనప్పుడు నేను నడుస్తానని ఎలా అనుకున్నావు డియర్’’ అని శ్రీవారు మందంగా చెప్పుకొచ్చాడు.

అది కాదు ఇన్నాళ్లకు మీరు పిల్లల చదువుపై దృష్టి పెట్టారు నాకదే చాలు అని శ్రీమతి కళ్లు తుడుచుకుంది. ఇవి కన్నీళ్లు కాదండి ఆనంద భాష్పాలు అని రోటీన్ డైలాగు చెప్పకు నాకు చిరాకు అంటూ చిరాగ్గా పలికి పిచ్చి దానా నోట్ బుక్‌లో లెక్కలతో కుస్తీ పడుతుంటే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు.

కాగితాల్లో లెక్కలు, కంప్యూటర్‌లో అకౌంట్స్, పక్కన క్యాలుక్యులేటర్ ఇవన్నీ పిల్లల చదువు గురించి కాకుంటే మరెందుకండి... రాత్రంతా నిద్ర లేకుండా ఆ లెక్కలతో గడుపుతున్నారు. మీలో మీరే ఏదో లెక్కిస్తున్నారు. పిల్లల కోసం మీరింతగా మారిపోతారని కలలో కూడా అనుకోలేదు. ఇంజనీరింగ్ చదివే మన పెద్దది కూడా సరిగ్గా ఇలానే కూర్చుంటుంది. నాకు తెలియదనుకోకండి నేను మరీ అంత అమాయకురాలినేమీ కాదు అని శ్రీమతి చెప్పింది.
దాచెపల్లి బుక్ డిపోవారి లెక్కల పుస్తకాలన్నీ అక్కడ కుప్పగా పోసినట్టుగా ఉందా వాతావరణం. నోట్‌బుక్‌లో ఏవో అంకెలు కొట్టివేతలు, తీసివేతలు, భాగ హారాలు. శ్రీమతి ఎంత చెప్పినా వినేట్టు లేదని శ్రీవారు తన పనిలో తాను పడ్డాడు. కొట్టివేతలు, తీసివేతలతో బుర్ర వేడెక్కుతోంది.
లెక్క చిక్కిందనే ఉత్సాహంతో శ్రీవారు ఉందో లేదో స్వర్గం నా వాటా నాకిచ్చేసేయ్ అంటూ కూనిరాగం తీయసాగాడు. కథకు సంబంధం లేకుండానే తెలుగు సినిమాలో హాస్యనటులు ప్రత్యక్షం అయినట్టు శ్రీమతి వెంటనే అక్కడికి వాలిపోయింది. ఆ పాటను అలా పాడొద్దండి. అది నాకు చాలా ఇష్టమైన పాట. అలా ఖూనీ చేస్తే భరించలేను. నా వాటా నాకిచ్చేసేయ్ కాదు. నా బాల్యం నాకిచ్చేసేయ్ అనాలి. ఆ గాయకుడు గజల్ శ్రీనివాస్ నా చిన్నప్పటి నుంచి ఆ బాల్యం పాట మీదే బండి లాక్కొస్త్తున్నాడు. మీరేంటి ఇలా పాడుతున్నారు’’ అని శ్రీమతి కోపగించుకుంది.

ఇదిగో ఇందుకే నాకు చిరాకేస్తుంది. అసలు విషయం తెలియకుండా మధ్యలో మాట్లాడేస్తావు అని శ్రీవారు కోపగించుకున్నారు.
అది సర్లే కానీ నీకో శుభవార్తోయ్.. ఇంత కాలం ఏమీ సంపాదించలేదు. పిల్లల భవిష్యత్తు ఏమిటి? అంటూ ఓ తెగ ఇదయ్యావు కదా! ఇప్పుడే లెక్క తేలింది. చెబుతున్నాను విను అంటూ శ్రీవారు చెప్పబోతుంటే శ్రీమతి సెల్‌ఫోన్ రింగైంది. శ్రీమతి మాట్లాడుతూ అలాగా అంటూ ఎగిరి గంతేసింది. ఏమండోయ్ శుభవార్త. మా పిన్ని మూడవ మనవరాలికి పిల్లలు లేరంటే సంతాన లక్ష్మి వ్రతం చేయమని నేను చెప్పాను కదా? పూజలు ఫలించాయి లక్ష్మీదేవి లాంటి బిడ్డను కందట ఇప్పుడే ఫోన్ చేసింది అని శ్రీమతి సంతోషంగా చెప్పింది.
కలిసొచ్చే కాలానికి ఎవరో ఒకరు ఇలా అడ్డుతగులుతుంటారు అని చిరాకు పడ్డాడు.
అదేంటండి వారెవరికో అమ్మాయి పుడితే మనకు వచ్చిన నష్టం ఏమిటి? అని శ్రీమతి ఆశ్చర్యపోయింది.

‘‘ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఆస్తి చేతిలో పడే సమయానికి ఇలా కొత్త వారసులు పుట్టుకొస్తుంటే కోపం రాకుండా ఉంటుందా?’’ అని శ్రీవారు చిరాకుగా అన్నాడు.
శ్రీవారు చిరాకుగా ముఖం పెట్టి కాస్సేపు ఆగు అంటూ మళ్లీ లెక్కలు చేస్తూ ఆ ఇప్పుడు లెక్క తేలింది. మీ పిన్ని మనవరాలి సంతానానికి కూడా వాటా వేశాక తేలిన లెక్క ప్రకారం మనకు త్వరలోనే 20లక్షల 16వేల 222 రూపాయల 54 పైసల వాటా దక్కుతుంది. అని శ్రీవారు లెక్క తేల్చారు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకో, వడ్డాణం చేయించుకుంటావో, అపార్ట్‌మెంట్ కొంటావో, యాత్రలకు వెళ్లొస్తావో, పిల్లల పేర్లమీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకుంటావో నీ ఇష్టం..’’ శ్రీవారు ఉదారంగా వరం ఇచ్చేశాడు.
వారసులు లేని బంధువులు ఎవరైనా పోయారా? ఆస్తి కలిసొచ్చిందా? అని శ్రీమతి ఆసక్తిగా అడిగింది.
సరే నా మాటల మీద నీకు నమ్మకం ఎప్పుడుంది కానీ నీకు నామీద నమ్మకం లేకపోయినా మోదీ మీద నమ్మకం ఉంది కదా?
‘‘మొన్న జన్‌ధన్ యోజన పేరుతో బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించాడు గుర్తుందా? విదేశాల్లో లక్షల కోట్ల నల్లధనం ఉంది. ప్రధానమంత్రిని కాగానే అది తెప్పిస్తాను ఒక్కొక్కరికి ఎంతొస్తుందో లెక్కలు చెప్పాడు గుర్తుందా? ఆ డబ్బుకు వడ్డీ, ఆ తరువాత పుట్టిన పిల్లలు ఇవన్నీ లెక్కిస్తే మన వాటా తేలింది. రోజుకోసారి బ్యాంకుకు వెళ్లిరా ఏ రోజైనా మన అకౌంట్‌లో డబ్బు జమ అవుతుంది,’’అని శ్రీవారు శ్రీమతికి భరోసా ఇచ్చారు.
మీరు కూడా ఓ సారి బ్యాంకుకు వెళ్లి రండి...
ఏం మోదీ మీద  మీకు నమ్మకం లేదా?

2, నవంబర్ 2014, ఆదివారం

ఆ.. విషాద గీతం లానే ముగిసింది ఆ సంగీత దర్శకుని జీవితం





ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము
ఎంత వరకీ బంధము
ఈ పాట ఆనాటి తరాన్ని తీవ్రంగా కదిలించింది. పాట వింటేనే మనసు భారంగా మారుతుంది. ఇక సినిమాలోని ఆ దృశ్యాలను చూస్తూ పాట వింటే మనుషులపై ప్రభావాన్ని ఊహించలేం. ఇంతగా కదిలించిన ఆ పాటలో సంగీతం గొప్పదా? సాహిత్యమా? గాయకుడి గాత్రమా? ఏది అంటే చెప్పలేం. మూడు కలిశాయి కాబట్టే ఆ పాట మనసున్న వారిని కదిలించింది.
సరిగ్గా నాలుగు దశాబ్దాల తరువాత తన జీవితం కూడా ఆ పాట చరణాల్లో చెప్పినట్టు విషాదంగా ముగుస్తుందని, ఆ పాటకు సంగీతం అందించిన జెవి రాఘవులు ఊహించి ఉండరు.  
ఎవరీ జెవి రాఘవులు అంటే?

***
‘‘బాగున్నారా? ’’
‘‘ఓ మీరా బాగున్నాం సార్...’’
‘‘నా పరిస్థితి బాగాలేదు. వైద్యం ఖర్చులు భరించలేకపోతున్నాను. ఏమైనా సహాయం చేస్తారా? ’’
‘‘సారీ సార్ మేమిప్పుడు సినిమాలకు ఫైనాన్స్ మాత్రమే చేస్తున్నాం, సహాయం చేయలేం’’
జెవి రాఘవులు ఫోన్ చేసినప్పుడు పలువురు దర్శక నిర్మాతలు చెప్పిన మాటలు ఇవి.
***
1973లో పుట్టిన ఆ పాట 2013లో జెవి రాఘవులు విషాద జీవితాన్ని తలపించేట్టుగా ఉంది.
పాటకు ఆయన సంగీతం ప్రాణం పోస్తుందని, తమ సినిమా హిట్టు కావడానికి దోహదం చేస్తుందనే నమ్మకంతో ప్రముఖ నిర్మాత, దర్శకులు రాఘవులు ఇంటి వద్ద వేచి చూసేవారు.
‘‘ఒకప్పుడు ఎంతో మంది ప్రముఖ నిర్మాతలు జెవి రాఘవులు కోసం నిరీక్షించారు, ఇప్పుడు ఆయన తనను ఆదుకోవడానికి దాతలు ఎవరైనా ముందుకు వస్తారేమోనని నిరీక్షిస్తున్నారు. ఆయన్ని ఆదుకోండి. వైద్య చికిత్స చేయించుకోలేని స్థితి, ఇల్లు గడవని పరిస్థితి దాతలు ఆదుకోండి ’’ రాజమండ్రిలో జెవి రాఘవులు అభిమానులు విలేఖరుల సమావేశంలో చెప్పిన మాటలివి. చివరి రోజుల్లో ఆయన పరిస్థితికి అద్దం పడుతున్నాయి ఈ మాటలు. అభిమానులు ఎందుకు చెప్పారు అంటే ఒకప్పుడు శ్రావ్యమైన సంగీతం వినిపించిన ఆయన అప్పుడు తన దుస్థితి కూడా తాను చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. పక్షవాతం వల్ల మాట్లాడలేని పరిస్థితి ఉండడంతో అభిమానులే ఆయన పక్కన ఉండగా, ఆయన దీన గాథను వివరించారు. ఎంత మంది ఆదుకున్నారు, ఎంత మంది స్పందించారో కానీ ఆయన మాత్రం ఏమీ లేకుండానే ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము అనే పాటలోని మాటలు అక్షర సత్యాలు అని నిరూపించి తన జీవితాన్ని ముగించారు.

82లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా బొబ్బిలిపులి టిడిపి సూపర్ హిట్‌కు తన వంతు పాత్ర పోషించింది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి పాట సినిమాకు కనక వర్షం, టిడిపికి ఓట్ల వర్షం కురిపించింది. ఆ పాటకు సంగీతం అందించిన జెవి రాఘవులు జీవితంలో చివరి రోజుల్లో మాత్రం కాసు లేకుండానే కన్ను మూశారు.
మనసు గతి ఇంతే, వీణనాది తీగనీది తీగ చాటు రాగముంది వంటి ఎన్నో సూపర్ హిట్ పాటలకు సంగీతం అందించారు. భగవద్గీతకు ఘంటసాలతో కలిసి పని చేశారు.

ఆకాశవాణి రికార్డింగ్ థియేటర్‌లో జెవి రాఘవులు పాడిన పాట విన్న ఘంటసాల అద్భుతంగా పాడావు, ఆసక్తి ఉంటే మద్రాసు వచ్చి కలవమని చిరునామా ఇచ్చారు. అప్పటి నుంచి ఘంటసాలతో రాఘవులు అనుబంధం కొనసాగింది. అనేక సినిమాలకు కలిసి పని చేశారు. నెలకు వంద రూపాయల జీతంతో ఘంటసాల వద్ద జీవితాన్ని ప్రారంభించిన రాఘవులు సినిమా రంగంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లారు.
సంగీత దర్శకుడిగా తొలి చిత్రానికి 15వేల రూపాయల పారితోషికం తీసుకున్నారు. బొబ్బిలి పులికి రెండు లక్షల పారితోషికం. అప్పట్లో అది చాలా ఎక్కువ మొత్తం.

సంగీతం రోగాలను నయం చేస్తుందని, శిశువులు, పశువులను సైతం గాన రసం మైమరిపిస్తుందని అంటారు. కోట్లాది మంది ప్రజలను తన సంగీతంతో మైమరిపించేట్టు చేసిన ఆయన మాత్రం ఆనారోగ్యంతో యుద్ధం చేయలేక ఓడిపోయారు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు ఆర్థిక సమస్యలు మద్రాసులోని భవనం అమ్మేశారు. ఆస్తులు కరిగిపోయాయి. చివరి దశలో రాజమండ్రిలో ఉన్న కుమారుడి వద్దకు వచ్చారు. తన కాళ్ల మీద తాను నిలబడలేని ఆయన నిస్సహాయ స్థితి చూసి అభిమానులు చలించి పోయారు.

1970లో వచ్చిన ద్రోహి సినిమా జెవి రాఘవులు సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా. 2000లో వచ్చిన ఛలో అసెంబ్లీ చివరి సినిమా. ఆ తరువాత అనారోగ్యం ఆయన పాలిట శాపంగా మారింది. తెలుగు, తమిళం, మరాఠా, కన్నడ భాషల్లో 172 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. వంద వరకు సినిమా పాటలు పాడారు. లవకుశ సినిమాకు ఘంటసాల వద్ద సహాయకునిగా పని చేశారు.
జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్‌లో సినిమా వారి బంధువులకు కూడా ప్లాట్లు ఉంటాయి కానీ జెవి రాఘవులు, వేటూరి లాంటి వారికి ఎందుకు ఉండవు. ఇలాంటి వారు అద్దె ఇళ్లల్లో కాలం వెళ్లదీస్తారు ఎందుకు? అంటే సమాధానం అందరికీ తెలుసు కానీ ఎవరూ చెప్పరు.
ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్ రహమాన్, మణిశర్మ  లాంటి వారు ప్రారంభ రోజుల్లో రాఘవులు వద్ద పని చేశారు.

జెవి రాఘవులుగా పేరు పొందిన జెట్టి వీర రాఘవులు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించారు. 1931 అక్టోబర్ 22న జన్మించారు. తల్లిదండ్రులు వీరా స్వామినాయుడు, ఆదిలక్ష్మి. తల్లిపాడే భక్తి పాటలు విని సంగీతంపై ఆసక్తి పెంచుకున్నాడు. చదువుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో కాకినాడలోని పిఆర్ కాలేజీలో పియుసిలో చేరి నెల రోజులకే మానేశారు. తన జీవిత కాలమంతా సంగీత ప్రపంచంలోనే మునిగిపోయిన ఆయన తన జీవితం ముగింపు ఇలా ఉంటుందని ఊహించి ఉండరు. ఘంటసాలతో పరిచయం అయ్యాక సంగీతమే ప్రపంచంగా బతికారు. బాల్యంలో చదువుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి వల్ల చదువుకోలేక పోయిన విషయం రాఘవులు మనసుపై బలంగా ప్రభావం చూపి ఉండాల్సింది. అలా ప్రభావం చూపి ఉంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి జీవిత చరమాంకం ప్రశాంతంగా గడిచిపోవడానికి అవసరం అయిన మెట్లు ముందు నుంచే నిర్మించుకుని ఉండేవారు. ఆలోచన రాలేదు. కాలం కలిసి రాలేదు. దాంతో సంపాదించిన కొద్దిపాటి ఆస్తిని కూడా ఆనారోగ్యం మింగేసింది.

బొబ్బిలి పులి సినిమా సమయంలో ఎన్టీఆర్ రాఘవులుతో ఎందుకైనా మంచిది హైదరాబాద్‌లో స్థలం తీసుకోండి అని సలహా ఇచ్చారు, సరిగమల గురించే నిరంతరం ఆలోచిస్తూ గడిపిన ఆయన స్థలం గురించి పట్టించుకోలేదు. ఆ సలహా వినక తాను తప్పు చేశానని, విని ఉంటే పరిస్థితి ఇప్పుడిలా ఉండేది కాదని ఓ సందర్భంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్రాసులో మంచి కార్లలో తిరుగుతూ భారీ భవంతుల్లో నివసించిన ఆయన చివరి రోజులు రాజమండ్రిలో పేదరికంలో గడిచాయి.
తనలా కష్టపడవద్దని పిల్లలకు సంగీతం నేర్పించలేదు, సినిమాల్లో బిజీగా ఉండడంతో పిల్లల ఆలనా పాలన పట్టించుకోలేదు. దాంతో వారికి చదువు అబ్బలేదు. చిన్న కంపెనీలో చిరుద్యోగం చేస్తున్న మూడవ కుమారుడి ఇంట్లో చివరి రోజులు గడిచిపోయాయి.

సంగీత ప్రపంచంలో లీనమై పోయిన జెవి రాఘవులు తర తరాలు నిలిచిపోయే సంగీతాన్ని అందించారు. అద్బుతమైన పాటల సంపద తెలుగువారికి ఇచ్చారు. ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఏమీ లేకుండా నిరాశతో జూన్ 7, 2013న చనిపోయారు.
* ధనం మూలం 17