28, నవంబర్ 2012, బుధవారం

అప్సరసలు - ఆమ్ ఆద్మీ - నేతలు


    ఢిల్లీలో చక్రం తిప్పుతున్న రాజకీయ నాయకుల కన్నా వయసులో సగం ఉన్నా ఎత్తుగడల్లో రెట్టింపు తెలివి చూపిస్తున్నారు అరవింద్ కెజ్రీవాల్.
దేశంలో ఓట్ల పండగ పుట్టక ముందు నుంచి పుట్టిన పార్టీలు నుంచి వచ్చే ఎన్నికల కోసం పుట్టిన పార్టీల వరకు అందరి గుండె చప్పుడు సామాన్యుడే కదా!
వేశ్య విటుల కోసం పరితపించినట్టు, కల్లు కంపౌండ్ వాడు తాగుబోతుల కోసం , కాటికాపరి శవాల కోసం చూసినట్టు రాజకీయ పార్టీలు ఏవైనా తమ వినియోగదారుడైన సామాన్యుడి కోసం చూస్తుంటాయి. కస్టమర్ ఈజ్ గాడ్ అని చెప్పిన గాంధీజీ మాటను ఉత్తరాది వాళ్లు ఇప్పటికీ తమ షాపుల్లో రాసి పెడతారు. వినియోగదారుడే వ్యాపారికి దేవుడు కదా? రాజకీయ నాయకులు మహాత్మాగాంధీని మరిచిపోయారు కానీ వినియోగదారుడే దేవుడు అని ఆయన చెప్పిన మాట మరువలేదు. హిందీ ప్రాంతం వ్యాపారుల కోసం మహాత్మాగాంధీ ఇంగ్లిష్‌లో చెప్పిన ఈ మాటను ప్రజలే దేవుళ్లు అని తెలుగు నాయకులు తెలుగులోకి అనువాదం చేసుకున్నారు. రాజకీయం, వ్యాపారం ఒకటే కాబట్టి ఒకే నినాదాన్ని ఇద్దరూ నమ్ముకున్నారు. రాజకీయ వ్యాపారం నడిచేది సామాన్యుడితోనే అందుకే ప్రతి పార్టీ సామాన్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి తంటాలు పడుతుంది. ఎన్నికల మ్యానిఫెస్టో, ఎన్నికల ప్రచారం, నినాదాలు అన్నీ సామాన్యుడి చుట్టే తిరుగుతుంటాయి. అధికారంలోకి వచ్చాక పని చేసేది అసామాన్యుల కోసమే అయినా చచ్చినట్టు సామాన్యుల చుట్టు తిరగాల్సిందే!
దేశం ఇంత అధ్వాన్నంగా ఉండడానికి ప్రజాస్వామ్యంలోనే లోపముందని మోకాలిని చేతితో నిమురుతూ చెప్పుకొచ్చాడో మేధావి. ఏమిటా లోపం అని అడిగితే, స్టాక్ మార్కెట్ గురించి తెలుసా? ఒక కంపెనీ షేర్లను వందగా విభజిస్తారు. నీ దగ్గర ఎంత డబ్బుంటే అన్ని వందల చొప్పున షేర్లు కొనవచ్చు. కంపెనీ మీటింగ్‌లో నీకు వంద షేర్లకో ఓటు ఉంటుంది. అంటే చిన్న మదుపరికి వద్ద వంద షేర్లు ఉంటే ఒక ఓటు లక్ష షేర్లు ఉన్న పెద్ద మదుపరికి వెయ్యి ఓట్లు ఉంటాయి. ఈ విధానం వల్లనే స్టాక్ మార్కెట్‌తో పాటు కంపెనీలు కళకళలాడుతున్నాయి. మరి ప్రజాస్వామ్యంలో నీ వద్ద ఉన్న డబ్బును ఏ మాత్రం గౌరవించకుండా తల ఒక్కంటికి ఒక్క ఓటు మాత్రమే ఇస్తున్నారు. దీని వల్లనే ప్రజాస్వామ్యం ఇలా ఆమ్ ఆద్మీని దేవుడిగా కొలవాల్సి వస్తోంది అని ఏడ్చాడు.
మళ్లీ మన కెజ్రీవాల్ వద్దకు వద్దాం.
సామాన్యులను స్వల్పకాలంలో మహా సంపన్నులుగా మార్చిన జగన్ అయినా, ప్రపంచానికి రాజకీయ పాఠాలు నేర్పించిన నేతగా అభిమానులు నిరాజనాలు పలికే బాబు అయినా చివరకు సామాన్యుడిని ప్రసన్నం చేసుకోవడానికే ప్రయత్నించాలి. వీరిని లక్ష్యంగా చేసుకుని రాజకీయం నడపాలి. అప్సరసలు అత్యంత సుందరంగా ఉండేవారట! ప్రబంధాల్లో వారి అందం గురించి చదివితనే మనసు ఎక్కడికో పోతుంది. ఇక వారిని నేరుగా చూస్తే... అంతటి అందగత్తెల ప్రధాన బాధ్యత ఏళ్ల తరబడి స్నాన పనాలు లేకుండా జెడలు కట్టిన తల వెంట్రులతో ముక్కు మూసుకొని తపస్సు చేసే మునులను రంజింప చేయాలి. పాపం నాయకులు కూడా ఇంతే ఎంత అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తేనేం చివరకు అప్సరసలు మునుల ముందు నృత్యం చేసినట్టు నాయకులు సామాన్యుల ముందు కళావిన్యాసాలు ప్రదర్శించాలి. కల్లు ముంత పట్టుకోవాలి, తాటి చెట్టేక్కాలి, టీ కొట్టులో టీ తయారు చేయాలి, చెప్పులు కుట్టాలి, పాలిష్ చేయాలి, గడ్డం గీయాలి. ముసలమ్మ కష్టాలు విని కన్నీరు కార్చాలి.జైలులో బంధించినా జనం కోసం తపించాలి ఎనె్నన్ని కళలు చూపాలి. ఇంత చేసినా ఫలితం ఉంటుందా? అంటే చెప్పలేం. ప్రవరాఖ్యుని లాంటి వాళ్లు అస్సలు చలించరు, వరూధిని లాంటి నేతలు ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడాలి. ఇన్ని కళలు ప్రదర్శించినా సామాన్యుడి మనసులో ఎవరున్నారో చివరి వరకు చెప్పడు. నా మనసులో ఉన్నది నీవే ప్రియా అని అందరికీ చెబుతున్నట్టు కనిపిస్తాడు కానీ మనసులోని మాట చివరి వరకు రహస్యంగా ఉంచుకుంటాడు.

 అల్లరి నరేష్ సినిమాలా మినిమమ్ గ్యారంటీ ఉంటుందనే నమ్మకం కూడా లేకపోయినా ఖర్చు, హడావుడి మెగాస్టార్ సినిమా లెవల్‌లో చేయక తప్పదు. మళ్లీ మనం కేజ్రీవాల్‌ను పక్కన పెట్టేసి మాట్లాడుకుంటున్నాం. ఆయన ఈ నాయకుల కన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదివిన వాడు ఎందుకంటే... మగ జనాభాలో కనీసం సగం మంది మందుబాబులే ఉంటారు మినిమం గ్యారంటీ అని ఆ మధ్య ఒకరు మందు బాబుల పార్టీ పెట్టారు. అది ఎన్నికల్లో పని చేయలేదు. ఆడా మగా అనే తేడా లేదు ప్రతి ఒక్కరూ ప్రేమించేస్తారు కదా? అని ఒకరు ప్రేమికుల పార్టీ పెట్టారు. జస్పాల్‌భట్టీ కొత్త కోణంలో ఆలోచించి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కుంభకోణాల కోసమే కదా? అని ఏకంగా గోటాలా పార్టీ (కుంభకోణాల పార్టీ) పెట్టారు.ఎంత కష్ట పడ్డా సూట్ కేసుల కోసమే కదా అని నిర్మోహ మాటంగా సూట్కేస్ పార్టీ పెట్టారు. ఇవేవీ ఎన్నికల మార్కెట్‌లో నిలువలేకపోయాయి.

 అందరు నాయకులు సామాన్యుడి కోసం పరితపిస్తుంటే కేజ్రీవాల్ ఓ అడుగు ముందుకేసి ఆ సామాన్యుడి పేరుతోనే పార్టీ పెట్టాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అని ప్రకటించే సరికి నేతలు లబోదిబో మన్నారు. ఇప్పుడు ఎవరు ఆమ్ ఆద్మీ గురించి మాట్లాడినా అది కెజ్రీవాల్ పార్టీ గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది. కాంగ్రెస్‌కే హాత్ ఆమ్ ఆద్మీకే సాత్ అంటూ సోనియా హయాంలో పుట్టిన నినాదం కాంగ్రెస్‌కు బాగానే వర్కవుట్ అయింది. ఆమ్ ఆద్మీ నినాదాన్ని మా నుంచి వేరు చేయలేరు అంటూ కాంగ్రెస్ నేతలు వాపోయారు. కెజ్రీవాల్ ఆమ్ ఆద్మీనే తన పార్టీ పేరుగా పెట్టడంతో తొలి విజయం సాధించారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ తన పేరున్న పార్టీని ఆదరిస్తాడా? తనను దేవుడన్న పార్టీని గెలిపిస్తారా? తన నామ స్మరణతోనే కాలం గడిపే పార్టీలను ఆదరిస్తారా? చూడాలి.

23, నవంబర్ 2012, శుక్రవారం

.తెలుగు హీరోల కడుపున హీరోయిన్లు ఎందుకు పుట్టరు?

పులికడుపున పులే పుడుతుంది ఇదో సినిమా డైలాగు. హీరో కడుపున హీరోనే పుడతాడు. ఇది వాస్తవం. మరి హీరోయిన్ కడుపున హీరోయిన్ పుడుతున్నప్పుడు హీరో కడుపున హీరోయిన్ ఎందుకు పుట్టడం లేదు. ఇందులో ప్రత్యేక కారణం ఏమీ లేదా? లేదు అని ఎవరైనా అంటే నమ్ముదామా? ఇప్పుడు తెలుగు చిత్రసీమను మూడు నాలుగు కుటుంబాలు ఏలేస్తున్నాయి. హీరోలు, నిర్మాతలు, స్టూడియో అధినేతలు ఆ కుటుంబాల నుంచే పుట్టేస్తున్నారు. తెలుగు సినిమా వారికి ఏమిటో ఈ ప్రత్యేకత ఒక్క హీరో కడుపులో కూడా ఒక హీరోయిన్ పుట్టక పోవడం ఆశ్చర్యంగానే ఉంది. చివరకు కొందరు కామెడీ స్టార్లకు సైతం హీరోలు పుట్టారు కానీ హీరోయిన్లు పుట్టలేదు. ఎన్టీఆర్ కుమారులు హీరోలుగా వెలుగు వెలిగారు. కుమారుల కుమారులు సైతం ఇప్పుడు ఏలేస్తున్నారు. ఆ ఒక్క కుటుంబం నుంచే ఆరడజను మంది హీరోలు పుట్టారు. అక్కినేని కుటుంబంలోనూ అంతే కుమారుడి కుమారులే కాదు కుమార్తెలకు సైతం హీరోలు పుట్టేస్తున్నారు. 

అన్నగారు 82లో ఇంత కాలం తనను ఆదరించిన తెలుగు ప్రజలకు ఏదో చేయాలనే తపనతో బాలకృష్ణను సినిమా రంగానికి అంకితం చేసి తాను రాజకీయాల్లోకి వెళ్లారు. ఇప్పుడు బాలకృష్ణకు తెలుగు ప్రజలకు ఏదో చేయాల్సిన వయసు వచ్చేసింది. తన కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయడానికి, తాను రాజకీయ ప్రవేశానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆ తరువాత స్వయం కృషితో సినిమా రంగంలోకి వచ్చిన చిరంజీవి కుమారుడు సైతం హీరో అయ్యారు.


హిందీలో చాలా మంది హీరోల కుమార్తెలు హీరోయిన్లుగా నటించారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం కాదు టాప్ స్థాయికి వెళ్లిన వాళ్లు కూడా ఉన్నారు. సూపర్ స్టార్ కిరీటాన్ని అలంకరించిన తొలి స్టార్ రాజేష్‌కన్నా , మాజీ హీరోయిన్ డింపుల కాపాడియ కుమార్తె హీరోయిన్‌గా చాలా సినిమాల్లోనూ నటించారు. ఇప్పుడు టాప్ స్థాయిలో ఉన్న కరిష్మాకపూర్, కరీనా కపూర్‌లు హీరో కడుపున పుట్టిన హీరోయిన్లు. ధర్మేంద్రా, హేమామాలిని జంట ఒకప్పుడు హిందీ సినిమా రంగానే్న ఏలారు. హేమా మాలిని తన కుమార్తెలను హీరోయిన్లుగా చేయడానికి బాగానే ప్రయత్నించారు. తొలుత విలన్‌గా ఆ తరువాత హీరోగా సంచలం సృష్టించిన షాట్‌గన్ శతఘ్న్ సింన్హా కుమార్తె హీరోయిన్‌గా వెలుగొందారు. హిందీలోనే కాదు చివరకు పొరుగున ఉన్న తమిళనాడులో సైతం కొందరు హీరోల కుమార్తెలు హీరోయిన్‌లు అవుతున్నారు. ప్రయోగాలకు పెట్టింది పేరయిన కమల్‌హాసన్ కుమార్తె శృతి హాసన్ తెలుగు, హిందీ సినిమాల్లో టాప్ రేంజ్‌కు వెళ్లారు.


కానీ చిత్రంగా తెలుగు నాట మాత్రం హీరోలకు, హీరోల బంధువులకు సైతం హీరోలే పుడుతున్నారు కానీ ఒక్క హీరోయిన్ కూడా పుట్టడం లేదు.
పాత తరం నటుడు అమర్‌నాథ్ కుమార్తె శ్రీలక్ష్మి హాస్యనటిగా స్థిరపడ్డారు. వారసత్వంగా కాకుండా బతుకు తెరువు కోసమే ఆమె నటి అయ్యారు. అంతా పోగొట్టుకుని హైదరాబాద్ నగరంలో ఒక అభిమాని ఆశ్రయం ఇస్తే బతుకు వెళ్లదీస్తున్న సమయంలో బతుకుతెరువు కోసం సినిమాల్లోకి వెళతాను అంటే తండ్రి చెప్పిన మొదటి మాట వద్దు అంటూ సినిమా రంగం ఎలాంటిదో చెప్పుకొచ్చారు. ఈ మధ్య జయమాలిని ఒక ఇంటర్వ్యూలో ఆ పాప కూపంలోకి నా పిల్లలను తీసుకు వచ్చే ఉద్దేశం లేదని చెప్పింది. హీరో కృష్ణ నటునిగా కొనసాగుతున్నప్పుడు కృష్ణ కుమార్తె మంజుల హీరోయిన్‌గా నటిస్తుందని ఒక ప్రకటన వచ్చింది. కృష్ణ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన నిలిచిపోయింది. ఆ తరువాత మంజుల సినిమాలు నిర్మిస్తూ తన కోరిక నెరవేర్చుకున్నారు. మోహన్‌బాబు కుమార్తె సినిమాలు తీస్తున్నారు, హీరోయిన్‌గా కాకుండా ఇతర పాత్రల్లోనటిస్తున్నారు. మోహన్‌బాబు ఎన్నో సినిమాలు నిర్మించారు. ఎందరికో నటులుగా అవకాశం ఇచ్చారు. అంటే మంచు లక్ష్మికి హీరోయిన్‌గా నటించాలనే ఆసక్తి లేకపోవడం వల్లనే అవకాశం కల్పించలేదని అనుకోవాలా?


జయమాలిన తరువాత వాంప్‌గా ఒక వెలుగు వెలిగిన అనురాధ కుమార్తె తల్లిలానే వాంప్‌గానే కొన్ని సినిమాల్లో కనిపించారు. 80-90 ప్రాంతాల్లో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రాధ కుమార్తె ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తోంది.


నాన్నా మా వారు ఈసారి దసరాకు మీనాన్న మోటర్ సైకిల్ కొనిచ్చి తీరాల్సిందే అంటున్నాడు అంటూ మధ్య తరగతి కుటుంబరావు కుమార్తె భర్త కోరిక చెప్పినంత సులభంగా ఇప్పుడు ఒకనాటి మాజీ హీరోల కుమార్తెలు నాన్నా మా వాడు హీరోగా నటించాలని ముచ్చటపడుతున్నాడు ఎలాగైనా ముచ్చట తీర్చాలి అని అడుగుతున్నారు. ముచ్చట తీర్చుకుంటున్నారు. ఒకరి తరువాత ఒకరు హీరోల వంశంలో హీరోలు పుడుతున్నా హీరోయిన్లు పుట్టక పోవడం చూస్తుంటే తెలుగు సినిమా రంగంలో ఉన్న ఫ్యూడల్ మనస్తత్వం తెలియడం లేదా?


తెలుగు సినిమా రంగంలో స్ర్తిలకు ఇచ్చే ప్రాధాన్యత ఏమిటో దీన్ని బట్టి తెలియడం లేదా? కొడుకును హీరోగా చేయడానికి తంటాలు పడుతున్న వృద్ధ హీరోలు కుమార్తెల విషయంలో అలా చేయడం లేదంటే సినిమా రంగంలో స్ర్తిలకు ఇచ్చే గౌరవం గురించి వారికి బాగా తెలుసు కాబట్టి అంతే కదా? కాదంటారా?

21, నవంబర్ 2012, బుధవారం

నేరజాణకు తమలపాకు తొడిమే పదివేలు? .. నేతలకు కుర్చియే చాలు

వరం కోరుకోవడం కూడా ఓ కళ. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడే పిల్లలు కేరు మంటూ ఏడిచి వరం సాధించుకుంటారు. వరం ఎప్పుడు కోరాలో పిల్లరాక్షసులకు తెలిసినంతగా పెద్ద రాక్షసులకు, నాయకులకు కూడా తెలియదనిపిస్తుంది.
 ఓ గడసరి నేరజాణ తనను బంగారంలో ముంచెత్తమని కోరుతూ పాట పాడుతుంది. ముద్దటుంగరం అమ్మి ముక్కుకు ముక్కెర, నాణ్యమైన ధాన్యం అమ్మి నడుముకు వడ్డాణం, కాడియెద్దులు అమ్మి కాళ్లకు కడియాలు తెమ్మంటుంది. చివరకు పట్టెమంచం పరుపూ లేక మనసు చిన్నబోయింది పంట భూములమ్మి పట్టె మంచం తెమ్మంటుంది. కాస్త స్వరం పెంచి అంతే నాకు చాలు తమలపాకు తొడిమే పదివేలు నేనేదిక కోరేదిక లేదు అంటుంది. చూసే వారికేమో పాపం తమలపాకు తొడిమె ఇచ్చినా అదే పదివేలనుకుంటుంది అమాయకురాలు, పైగా అందరి వలే అలిగే దాన్ని కాదు కొసిరే దాన్ని కాదని చెబుతుంది అనిపిస్తుంది.

 కోరికలు కోరేప్పుడు స్వరం తగ్గించి తమలపాకు తోడిమే పదివేలు అన్నప్పుడు స్వరం పెంచుతూ లౌక్యం చూపుతుంది. ఇప్పుడు మన నాయకులు కూడా ఇలానే తమలపాకు తొడిమే పదివేలు అంటూ కుర్చీ ఇస్తే అవన్నీ సమకూర్చేసుకుంటామని రోడ్డున పడ్డారు. కానీ ఆ జాణ లౌక్యంగా అడిగితే, మన నాయకులు మాత్రం కోరికను ఎక్కడా దాచుకోలేక పదవి లేకుండా ఉండలేమని చెబుతున్నారు.
ఆమె కోరికలు కోరుతున్న తీరు పాట కాదు పాఠం. ఏళ్ల తరబడి తపస్సులు చేసి గడ్డాలు పెంచి నీరసించే రుషులకు సైతం వరాలు ఎలా కోరాలో తెలియదు. నేతలకు అసలే తెలియదు.


మహాభారత యుద్ధంలో ధర్మరాజు హఠాత్తుగా కౌరవుల వైపు వెళ్లి భీష్ముడికి పాదాభివందనం చేస్తారు. శత్రువు కాళ్లు మొక్కాడు .. ఛీ..్ఛ... అని ఆది చూసిన వారికి అనిపించవచ్చు. సొంత వాళ్లు ఎన్ని పొగిడినా ఇవ్వని కిక్కు శత్రువు గౌరవించినప్పుడు వస్తుంది. ఆ విషయం ధర్మరాజుకు బాగా తెలుసు. ప్రసన్నుడై ఏం కావాలో కోరుకో అంటే నువ్వు ఎలా చస్తావో చెప్పి పుణ్యం కట్టుకో అని ధర్మరాజు కోరతాడు. అష్టాదశ పురాణాల్లో ఇంతటి చతురతతో వరం కోరిన వారు మరొకరు కనిపించరు. ధర్మరాజు కాళ్లు మొక్కినట్టే కనిపిస్తుంది కానీ కోరిక మాత్రం పీక నులిమేది. పాపం ఇలాంటి తెలివి తేటలు లేకపోవడం, ఏం వరం కోరాలో, ఎలా కోరాలో తెలియకనే మహా మహా రాక్షసులు సైతం బోల్తాపడ్డారు. ఒక ఐడి యా జీవితానే్న మార్చేస్తుందన్నట్టు.. సాస్టాంగ ప్రమాణం ఎలా చేయాలో చూపించమని అడిగి ఎస్‌విఆర్ తల నరికేసి దేవిని ప్రసన్నం చేసుకుని ఎన్టీఆర్ వరం కోరుకోవడం పాతాళాబైరవిలో మనం చూశాం కదా?


ఘోరమైన తపస్సు చేసి చివరకు శివుడిని భస్మాసురుడు కోరిన వరం అతనే్న బూడిదగా మార్చింది కదా? భస్మాసురుడి భాషలో వీకో, అతని భావం వరమిచ్చే దేవునికి అర్ధం కాలేదో కానీ నేను ఎవరితలపై చేతులు పెట్టినా వాళ్లు బూడిద కావాలనే వరం కోరుకోవాలనుకున్నాడు. స్పష్టంగా చెప్పక పోవడం వల్ల చివరకు తన తలపై చేయి పెట్టుకుని తానే భస్మం అయ్యాడు. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారన్నట్టు తన చావు కోసం తానే తపస్సు చేసినట్టు అయింది. తల్లిచేతిలోనే చనిపోయే వరం నరకాసురుడి సొంతం. కొడుకు వల్ల మరణించే వరం హిరణ్యకశిపుడిది. శివుడు రాక్షసులకు ఇచ్చిన వరాలన్నీ ఇలాంటివే కదా? నా కడుపులో దూరిపొమ్మని గజాసురుడు అడిగితే చివరకా వరం గజాసురుని కడుపు చీల్చడానికి ఉపయోగపడింది. పాపం వాళ్ల ప్రాణాలు వాళ్లు తీసుకోవడానికి వరం కోరుకోవడం ఎందుకో?


పత్రికలకు పాఠకులే దేవుళ్లు, రాజకీయ నాయకులకు ఓటర్లే దేవుళ్లు. దేవుళ్లలో అందరి కన్నా సులభంగా వరం ప్రసాదించేది పరమ శివుడంటారు. సరే ఈయన వరమిచ్చినా మిగిలిన దేవుళ్లు వెన్నుపోటు ద్వారా ఆ వరాన్ని శాపంగా మార్చేస్తుంటారు. దేవుళ్లలో శివుడు భోళా అయితే ప్రజాస్వామ్యంలో ఓటరు చాలూ.. ఓటరు దేవుళ్లను మెప్పించి వరం కోరుకోవడం అన్నింటి కన్నా కష్టమైన పని. ఓటరు దేవుళ్లు ఎవరికి ఎప్పుడు వరమిస్తారో, ఎప్పుడు ఎందుకు శిక్షిస్తారో మాకు బాగా తెలుసు అని నాయకులు అనుకుంటారు కానీ అది నిజం కాదు.
ఏ నాయకుడు ఏం చేసినా ఓటరు దేవున్ని మెప్పించి కుర్చీని వరంగా పొందాలనే కదా? నాకు కుర్చీపై అస్సలు వ్యామోహం లేదని ఏ నాయకున్ని కదిపినా చెబుతుంటారు. వారి ఫ్యామిలీ డాక్టర్‌ను అడిగితే చెబుతారో లేదో కానీ వారి ఎక్స్‌రేను పరిశీలిస్తే, అందరి హృదయం లవ్ షేప్‌లో ఉంటే వీరిది మాత్రం కుర్చీ ఆకారంలో ఉందని అనుమానం.


పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తావు అని అమ్మలక్కలాంతా అడిగే వయసు కూడా దాటిపోయినప్పటికీ సోనియమ్మ మాత్రం తన కుమారుడిని దేశానికి త్యాగం చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. వచ్చే ఎన్నికలు యువరాజా వారి నాయకత్వంలోనే జరుగుతాయి. ఫేస్‌బుక్‌లో, సోషల్ సైట్స్‌లో అతని పరిస్థితి ఘోరంగా ఉన్నా, దేశంలోని జనం ఫేస్‌లోకి చూస్తే మాత్రం మిగిలిన వారి కన్నా ఈ ముదురు బ్రహ్మచారికే అవకాశాలు ఎక్కువున్నట్టు అనిపిస్తోంది.నా కాళ్లు బొబ్బలెక్కుతున్నాయి, అలసిపోయాను, జ్వరం వచ్చింది నీరసంగా ఉంది అయినా నడుస్తున్నాను అని నాయకుడు చెబితే కుర్చీ కోసం ఎంత తంటాలు పడుతున్నాడో అనిపిస్తుంది కదా! తమలపాకు తొడిమే పదివేలు అన్నంత లౌక్యంగా కోరిక కోరాలి. పంట భూములమ్మయినా పట్టె మంచం కొనుక్కురమ్మంటున్న ఆ జాణ కోరికను భర్త తీర్చాడా? నేతల కోరిక ఓటరు దేవుడు తీరుస్తాడా? చూద్దాం.

19, నవంబర్ 2012, సోమవారం

ఈ కాలానికి అవసరమైన నాయకురాలు ఇందిరాగాంధీ



అందమైన యువతికి నపుంసక భర్త  ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మన  దేశానికి  నాయకత్వం అలానే ఉంది ..   ఆర్థికంగా ఎదుగుతున్న దేశం, అపారమైన వనరులు ఉన్న దేశం .  లేనిదల్ల సమర్ధమైన నాయకత్వం .మోడీ లాంటి ఒకరిద్దరిని మినహాయిస్తే దేశం లో బలమైన నాయకత్వమే లేదు ...  కీలుబొమ్మలు, నిద్రలో కూడా నటించే నట నాయకులు , అవినీతి పరులు , తప్ప నాయకులు తక్కువ. ఇందిరాగాంధీ  మరణించి మూడు  దశాభ్దాలు అవుతోంది. ఆమె బతికి ఉన్నప్పుడు నచ్చలేదు కానీ. ఇప్పుడు అనిపిస్తోంది .. ఇలాంటి సమయం లో అలాంటి దైర్య వంతురలైన నాయకురాలు ఉంటె బాగుండు అని ...

. ఇందిరాగాంధీ ఆమె జీవించిన కాలం కన్నా ఇప్పుడు ఉంది ఉంటే బాగుండేదేమో ( నేడు ఇందిరా గాంధీ జయంతి )
గతం లో ఆమె గురించి రాసిన ఒక పోస్ట్ .
http://amruthamathanam.blogspot.in/2012/03/blog-post_08.html

16, నవంబర్ 2012, శుక్రవారం

యం ఐ యం మద్దతు ఉపసంహరణకు కారణం ..రాజ్యలక్ష్మా? భాగ్యలక్ష్మా?




ఉప ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని ఊహించిందే. కానీ ఎంఐఎం మద్దతు ఉప సంహరణ ఊహించని పరిణామమే! ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసి జగన్‌కు సన్నిహితులు. సోనియాగాంధీ వద్దన్నా, జగన్ ఓదార్పు కోసం బయలు దేరాలని సన్నద్ధం అవుతున్నప్పుడు సోనియాగాంధీకి, జగన్‌కు మధ్య అసదుద్దీన్ రాజీకి ప్రయత్నించారు. తమ పాత నగరానికి, మతానికి సంబంధించిన వ్యవహారాలు మినహాయిస్తే, అసెంబ్లీలో అయినా, బయట అయినా చక్కగా మాట్లాడే అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో అసదుద్దీన్ ముందు వరుసలో నిలుస్తారు.

 తమ సామ్రాజ్యంలో వారి సొంత పాలన వేరు కానీ పరిపాలనకు సంబంధించి వారు చెప్పే విషయాలు వేలెత్తి చూపడానికి వీలులేకుండా చక్కగా ఉంటాయి. అలాంటి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవడానికి చూపిన కారణాలు, సందర్భం మాత్రం ఎబ్బెట్టుగా ఉంది. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం విషయంలో వివాదం ఇది మొదటి సారేమీ కాదు. చార్మినార్ కట్టిన తరువాత భాగ్యలక్ష్మి ఆలయం కాట్టారా? భాగ్యలక్ష్మి ఆలయం ఉన్న చోట చార్మినార్ నిర్మించారా? అనేదానిపై ఎవరి వాదనలు వారికున్నా మద్దతు ఉపసంహరణకు అసదుద్దీన్ చెప్పిన కారణాలు మాత్రం సహేతుకంగా కనిపించడం లేదు.

 భాగ్యలక్ష్మి ఆలయం విస్తరణకు ప్రభుత్వమే సహకరిస్తోందట! ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంఘ్ పరివార్ చెప్పు చేతుల్లో ఉన్నారట, ఆయన మరో మోడీ అనేది ఎంఐఎం ఆరోపణ. మిగిలిన వారికి ఎలా ఉన్నా ఈ ఆరోపణలు స్వయంగా ముఖ్యమంత్రికి సైతం విస్మయం కలిగించి ఉండొచ్చు. హైదరాబాద్‌లో సంఘ్ వారున్నారా? వారి వివరాలేమిటి? అని కిరణ్ తెలుసుకోవడానికి ప్రయత్నించి కూడా ఉండొచ్చు. క్రైస్తవుడే అయినా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హిందూ పూజారులకు ప్రయోజనం కలిగించే చర్యలు తీసుకున్నారని చిల్కూరు బాలాజీ పూజారి, పురోహితుల సంఘం నాయకులు స్వయంగా ప్రకటించారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి మాత్రం ఇలాంటి చరిత్ర ఏమీ లేదు. అసలు కిరణ్ వ్యవహార శైలి అర్ధం కాక సొంత పార్టీ వారే అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. ఆయన మంత్రులకే ఆయనంటే పడదు. ఇక సంఘ్ కోసం ఆయన పని చేయడమా? ఒక ఉద్యోగి ఉద్యోగం మారుతున్నప్పుడు తాను అప్పటి వరకు పని చేసిన సంస్థ గురించి చెడుగా చెప్పవద్దని అంటారు. కానీ ఇది రాజకీయాల్లో చెల్లదు. పాత పార్టీని ఎంత ఎక్కువగా తిడితే కొత్త కంపెనీకి అంత చేరువవుతారు. ఎంఐఎం చేసింది కూడా అదే.
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అందరికీ తెలిసిందే! ఏడాదిన్నర పాటు ప్రభుత్వాన్ని నిలుపుకుంటామని కాంగ్రెస్ నాయకులు ధీమాగా చెబుతారేమో కానీ మళ్లీ గెలుస్తాం అని ఎవరూ చెప్పరు. చెప్పినా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ వచ్చే ఎన్నికల కోసం సాగుతున్న వ్యూహాలే. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఎవరు ఎవరితో కలిసినా పాత బస్తీలోని ఏడెనిమిది నియోజక వర్గాల్లో ఎంఐఎం పార్టీనే గెలుస్తుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో ఉప ఎన్నికల్లో స్పష్టమైంది. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మరల్చుకోవాలని ఎంఐఎం భావిస్తోంది. కొత్త ప్రాంతాలకు విస్తరించగడానికి గతంలో కొంత వరకు ప్రయత్నించింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో తెలియదు అందుకే ముందు చూపుగా ఎంఐఎం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు తీసుకునే నిర్ణయాలకు ప్రజల్లో పెద్దగా విలువ ఉండదు. అందుకే ఏడాదిన్నర ముందే ఎంఐఎం ఎన్నికల రంగంలోకి దిగింది. మద్దతు ఉపసంహరణ తొలి అడుగు. మద్దతు ఉపసంహరణ ఎంఐఎం వ్యూహాత్మక ఎత్తుగడనే తప్ప భాగ్యలక్ష్మి ఆలయ వివాదం కానే కాదు.

 ఎంఐఎం కోరాలే కానీ ప్రభుత్వం భాగ్యలక్ష్మి ఆలయ   గతంలో ఉన్న దాని కన్నా మరింత చిన్నగా ఆలయాన్ని మార్చడానికి సైతం సిద్ధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎంఐఎంకు కావలసింది అది కాదు మద్దతు ఉపసంహరణకు ఒక అవకాశం అంతే
.

10, నవంబర్ 2012, శనివారం

అన్నా హజారే అవినీతి ఉద్యమం ....పూనం పాండే నషా సినిమా



1.అన్నా ఉద్యమం సమయం లో  ఉద్యమానికి మద్దతుగా  నగ్నంగా ఫోజులు ఇచ్చి సంచలన సృష్టించి ప్రచారం పొందిన పూనం  పాండే 
మోడల్గా పలు కంపెనీల నుంచి అవకాశాలు పొందారు .. నషా  సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు .
2. కేజ్రివాల్ పార్టీ పెట్ట బోతున్నారు ( ఆయన గెలిచే చాన్స్ ఉంది )
3. ఉద్యమ సమయం లో టిడిపి కార్యాలయం ముందు అన్న - బాబుల  కటౌట్లు ఏర్పాటు చేసిన టిడిపి అవి తొలగించి ఇప్పుడు  బాబు- బాపూజీ కటౌట్లు  పెట్టారు 
4.అన్న హజారే అవినీతి ( అంశాన్ని )ని పక్కన పెట్టి రైతు సమస్యలపై ఉద్యమానికి  సిద్ధమవుతున్నారు ..
5.సామాన్యులం  క్యాండిల్స్ దుమ్ము దులిపి మళ్లి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాం

7, నవంబర్ 2012, బుధవారం

ప్రతి నాయకుడి మదిలో కొలువై ఉండే ప్రేయసి

దురద వేసినప్పుడు మెదడు చెప్పకపోయినా గోళ్లు తమ పని తాము చేసుకుపోతాయి. అసంకల్పిత ప్రతీకార చర్య అంటే ఇదే. వయసొచ్చాక ప్రేమ కూడా అంతే ప్రేమించాలనిపించేస్తుంది. ప్రేమ కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మన కేంద్ర మంత్రి శశిథరూర్ ప్రేమంటే తెలుసా? నీకు అంటూ నరేంద్ర మోడీని ప్రశ్నించే సరికి ఆయన నీళ్లు నమలాల్సి వచ్చింది.

 ఎదుటి వాడి బలానికి మన బలం సరిపోదని లెక్క తేలితే బలహీనతపై దృష్టి పెట్టాలి. అప్పుడు లెక్క తేలుతుందనే లెక్క శశిథరూర్‌కు బాగా తెలుసు. ప్రేమ ఆ సబ్జెక్ట్‌లో థరూర్‌కు విశేషమైన ప్రావీణ్యం ఉంది. ఆ సబ్జెక్ట్‌లో మాస్టర్ డిగ్రీ పట్టాలా ఆయన వెన్నంటే అందాల కొత్త భార్య సునంద పుష్కర్ సాక్ష్యంగా పక్కన కనిపిస్తారు. 50 కోట్ల ప్రేయసిని ఎక్కడైనా చూశారా? అంటూ శశిథరూర్‌పై నరేంద్ర మోడీ చురక అంటించారు. ఐపిఎల్ టీంల కేటాయింపు సమయంలో ఎలా జరిగిందో తెలియకుండా సునంద ఖాతాలో 50 కోట్లుచేరిపోయాయి. అది కాస్తా వివాదంగా మారి చివరకు మంత్రి పదవి ఊడింది. అయినా అందమైన భార్య పక్కన లేకుండా ఏ సింహాసనం ఉంటే ఏం లాభం అనుకుని థరూర్ తన ప్రేయసి కోసం మంత్రి పదవిని లెక్క పెట్టలేదు. మంత్రి పదవి ఊడబెరికితే ఆయన ప్రేమించడమే కాదు పెళ్లి కూడా చేసుకుంటాను అని ఒక అడుగు ముందుకేసి చేసుకొని చూపించారు. ముందే చెప్పుకున్నాం కదా దురద పెట్టినప్పుడు గోక్కుంటే ఎదుటి వాడు చూస్తున్నాడా? పరువు పోతుందా? లాభమా నష్టమా? అనే లెక్కలు గుర్తుకు రావు. గోళ్లు తమ విధినిర్వహణలో మునిగిపోతాయి. ప్రేమా అంతే మంత్రి పదవి పోతుందా?మళ్లీ వస్తుందా? రాకపోతే ఎలా అనే భవిష్యత్తు ప్రణాళికలు ఉండవు.

 ప్రే మించగానే ఎక్కడ లేని శక్తి వస్తుంది. అయతే హనీమూన్ ముచ్చట తీరిన తరువాత థరూర్‌కు మళ్లీ మంత్రి పదవి లభించింది. ఒకవైపు ప్రేమిస్తూనే మరోవైపు ఆయన రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు. పోయిపోయి మోడీతో పెట్టుకున్నారు. ఈయన 50 కోట్ల ప్రేయసి గురించి మోడీ చేబితే, నా ప్రేయసి ఖరీదు 50 కోట్లకన్నా ఎక్కువే అని శశిథరూర్ ప్రకటించేశారు. ఐనా ప్రేమిస్తే ప్రేయసి విలువ తెలుస్తుంది కానీ మోడీకేం తెలుసు? అని మోడీ బలహీనతపై దెబ్బకొట్టారు. చిన్నప్పటి నుం చి ఆర్‌ఎస్‌ఎస్‌లో వయసులోకి వచ్చాక బిజెపిలో, మధ్య వయసులో ముఖ్యమంత్రి పదవిలో బిజీబిజీగా ఉన్న మోడీకి ఇక ప్రేమించడానికి సమయమెక్కడిది? డ్యూయె ట్లు పాడే ఓపికెక్కడిది.

 రాజరికపు జిత్తులతో రణ రంగపు టెత్తులతో సతమతవౌతున్న మా మదిలో మదనుడు సందడి చేయుట చిత్రం అని దుర్యోధనుడిగా అన్నగారు ఆశ్చర్యపోవడం మనం చూడలేదా? అయ్యో ఇది కేవ లం అన్నగారి నటన మాత్రమే అని తేలిగ్గా తీ సుకోకండి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ము దిమి వయసులో ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా లక్ష్మీపార్వతితో ప్రేమలో పడలేదా? బహిరంగ సభల్లోనే ఆకుచాటు పిందె తడిసే స్టెప్పులు వేయలేదా? నటన ప్రభావం ఆయనపై ఉందో, ఆయన ప్రభావం నటనపై ఉందో కానీ చివరకు ప్రేమ కావాలా? కుర్చీ కావాలా? తేల్చుకో అని అల్లుడు వార్నింగ్ ఇస్తే ప్రేమ కోసం కుర్చీని కూడా వదులుకున్నారు కదా? అన్నగారు లక్ష్మీపార్వతి కోసం ఒకే ఒక్కడుగా ఉండే ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకుంటే, శశిథరూర్ ఆరు డజన్ల కేంద్ర మంత్రుల్లో ఒకరిగా ఉండే కేంద్ర మంత్రి పదవి వదులుకోవడంలో వింతేముంది. మీ ప్రభుత్వం లక్షల కోట్ల కుంభకోణాల్లో మునిగిపోయిందని తిట్టినా, ఏమన్నా సహిస్తాం కానీ మా నాయకుల ప్రేమను చిన్న చూపు చూస్తే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులు ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నారు. నీకసలు ప్రేమం టే తెలియదు అని థరూర్ అంటే ఆయన వద్దకు వెళ్లి ప్రేమ పాఠాలు నేర్చుకోవాలని ఆయన అభిమానులు సూచిస్తున్నారు. ఇటీవల కాం గ్రెస్ నేతగా కన్నా పూరాతత్వ పరిశోధకునిగానే దిగ్విజయ్‌సింగ్ ఎక్కువగా గుర్తిం పు పొందారు. ముంబైలో బీహారీలపై బాల్‌థాకరే మండిపడితే, అసలు జీన్స్‌ను చూశాను థాకరేలు వచ్చింది బీహార్ నుంచే అని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక, ఇక రాదని తేలాక ఆయన పరిశోధనల్లో మునిగిపోయారు. ఆయన చరిత్రను తవ్వితీసి మోడీకో ప్రేయసి ఉందని అమె పేరు యశోధ అని చెప్పారు. దీనికి గూగులే సాక్షమన్నారు. అన్నీ వేదాల్లోనే ఉన్నాయని గ తంలో మనం గర్వంగా చెప్పుకున్నట్టు అన్నీ గూగుల్‌లోనే కనిపిస్తున్నాయి. మోడీ భార్య పేరు అని గూగుల్ సెర్చ్‌లో చూడగానే యశోధ అని పేరు కనిపించింది. తరువాత చాలా మంది పనిలో పనిగా రాహుల్‌గాంధీ భార్య పేరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఏకంగా కొలంబియాకు చెందిన జునిట అనే ముద్దు గుమ్మ పేరే కాదు అందమైన ఫోటో కనిపిస్తోంది. మరి ఆ ప్రేమ సంగతి ఏమిటి? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తే, రాజకుటుంబ రహస్యాలు బయటకు చెబుతామా? మాట్లాడతామా? అని ప్రభు భక్తిని ప్రదర్శిస్తున్నారు. అయినా మన నాయకులకు ప్రేమ గురించి కొత్తగా నేర్పించాల్సిన అవసరం ఉందా? 

అస లు ప్రేమించని నాయకుడెవరు? అందరికీ ఓ ప్రేమ కథ ఉంటుంది. ఏ నాయకుడి మనసులోకైనా తొంగి చూడగలిగితే వారు ప్రేమించే ప్రేయసి కనిపిస్తుంది? నాయకుడెవరైనా కావచ్చు కానీ వారు ప్రేమిం చే ప్రేయసి మాత్రం ఒకరే? ఎవరు? అనే అనుమానమా?
ఇంకెవరు కుర్చీనే ఆ ప్రేయసి.
రాజకీయ నాయకులు కుర్చీనే మనసా వాచా కర్మన ప్రేమిస్తారు. ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తారు, ప్రాణాలు తీస్తారు.