25, మే 2014, ఆదివారం

బ్రహ్మచారుల రాజకీయ అశ్వమేధ యాగం

‘‘ఊహించని విధంగా ఈ ఎన్నికల ఫలితాలు ఇలా ఎందుకు వచ్చాయంటావు?’’
‘‘ఎవరు ఊహించని విధంగా? నువ్వు ఊహించక పోతే ఎవరూ ఊహించనట్టేనా? ’’
‘‘అంటే నువ్వు ముందుగానే ఈ ఫలితాలు ఊహించావా?’’
‘‘ ఆ మాట నేనన్నానా? ..... బాగా ఆలోచిస్తే, ఈ ఫలితాల వెనుక ఒక రహస్యం ఉందనిపిస్తోంది.’’


‘‘ ఏమిటా? రహస్యం’’
‘‘తొందరెందుకు? చెబుతా! దాని కన్నా ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి. పెళ్లి చేసుకుని చల్లగ కాపురం ఉండాలని ఒకరు చెబితే, పెళ్లి మానండోయ్ బాబు కళ్లు తెరవండోయ్ అని మరొకరు చెప్పారు. ఎవరి అనుభవం వారిది. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా కాపురం చేయాలని, భావ కవుల వలె ఏవో పాటలు పాడేయమని చెప్పిన గీత కవిని ఏమండీ పెళ్లిలో అంత సుఖముందా? అని ప్రశ్నిస్తే, దర్శకుడు కోరినట్టు పాట రాస్తాను, నిర్మాత ఇచ్చింది తీసుకుంటాను మిగిలిన దానితో నాకేం సంబంధం అంటాడు. పెళ్లి చేసుకోమని చెప్పినట్టే షాదీ మాటే వద్దు గురూ అని రాయమంటే రాస్తాను నాకేం అంటాడు. పెళ్లిలో సుఖం ఉందా? బ్రహ్మచర్యంలో ఆనందం ఉందా? అంటే ఒక్కొక్కరి అనుభవం ఒక్కో లా ఉంటుంది.... పెళ్లి లేకుండా జీవితం సంగతి ఎలా ఉన్నా, రాజకీయాల్లో మాత్రం ఎదురులేదనిపిస్తోంది.’’


‘‘ఎన్నికల ఫలితాల గురించి రహస్యం చెబుతానని చెప్పి, పెళ్లి రాజకీయం అంటూ లింకు లేకుండా మాట్లాడుతున్నావు’’
‘‘మన దేశంలో రాజకీయాలతో లింకు లేని రంగమంటూ ఉందా? కచ్చితంగా ఉంది? పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించింది ఎవరు? అని ప్రశ్నిస్తే, నరేంద్ర మోడీ అంటారు. అదేం చిత్రమో ఆయన తాను బిజెపి కన్నా చాలా చిన్నవాడిని అని చెప్పుకుంటున్నా, అంతా మాత్రం ఆయన్ని బిజెపి కన్నా పెద్దగానే చూస్తున్నారు. గతంలో బిజెపికి వచ్చిన సీట్లు అని చెప్పుకునే వారు ఇప్పుడు మరో ఆలోచన లేకుండా మోడీకి వచ్చిన సీట్లు అని చెప్పుకుంటున్నారు’’
‘‘అది సరే ఫలితాల రహస్యం చెప్పు ముందు’’
‘‘అక్కడికే వస్తున్నాను ఫలితాలు సాధించిన వారంతా బ్రహ్మచారులే.... పెళ్లయిన బ్రహ్మచారులు, పెళ్లి కాని బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులు ’’
‘‘అంటే వారికి పెళ్లి కాకపోవడం వల్లనే విజయం సాధించారనే కదా ? నీ ఉద్దేశం’’
‘‘అలా అని నేననలేదు. కానీ ఫలితాలు అలానే వచ్చాయని చెబుతున్నాను. మోడీకి చిన్న వయసులోనే పెళ్లయింది. పెళ్లయిన కొద్ది కాలానికే భార్య నుంచి విడిగా ఉంటున్నారు. అత్యధిక సీట్లు సాధించిన మోడీ పెళ్లయిన బ్రహ్మచారి. ప్రతి పక్ష హోదా ఏ పార్టీకి దక్కలేదు.. నిజమే కానీ మోడీ తరువాత అత్యధిక సీట్లు సాధించింది యువనేత రాహుల్‌గాంధీ. ఆయనకు పెళ్లి వయసు దాటి రెండు దశాబ్దాలు అయిపోయింది. ఆ లెక్కలెలా ఉన్నా ఇప్పటికైతే ఆయన ముదురు బ్రహ్మచారి’’
‘‘అవును నిజమే’’


‘‘ఇక మోడీ గాలిని తట్టుకుని మూడవ స్థానంలో నిలిచిందెవరో తెలుసా? బ్రహ్మచారిణి అవును నిజం. పురుచ్చితలైవి జయలలిత తమిళనాడులో తన భారీ పర్సనాలిటీతో మోడీ గాలిని విజయవంతంగా అడ్డుకున్నారు. మోడీ పర్యటించినా, రజనీకాంత్ మద్దతు ప్రకటించినా ఆమె గాలికి ఎదురు లేకుండా పోయింది. తమిళ అమ్మకు పెళ్లి కాలేదని వేరుగా చెప్పాలా? ఆమె బ్రహ్మచారిణే’’
‘‘ఒకటిరెండు మూడు ఏదో అలా యాధృచ్చికంగా జరిగిపోతే పెళ్లికి రాజకీయాలకు లింకు కలుపుతారా? ’’
‘‘మూడు వరకే కాదు నాలుగవ స్థానం సంగతేమిటి? మూడు దశాబ్దాల కమ్యూనిస్టుల కంచుకోటలను బద్ధలు కొట్టి గడ్డిపోచతో విప్లవం సృష్టించి నాలుగవ స్థానంలో నిలిచింది పెళ్లికాని మమతా దీదీనే... ఇప్పుడేమంటావు?’’
‘‘ ఏమో పెళ్లికి రాజకీయాలకు లింకుందని నేననుకోవడం లేదు’’
‘‘సరే మోడీ స్థానంలో గుజరాత్ పీఠాన్ని అధిరోహించిన అనందిబెన్ పటేల్‌కు ఆ అదృష్టం ఎలా పట్టిందో తెలుసా? ’’
‘‘ అది కూడా నువ్వే చెప్పు’’
‘‘ఉపాధ్యాయురాలిగా స్కూల్ పిల్లకాయలకు పాఠాలు చెప్పుకునే ఆమె భర్త నుంచి విడిపోయిన బ్రహ్మచారిణి... లేకపోతే మహా మహా బడా నేతలు ఎందరో ఉండగా, ఆమెకు ముఖ్యమంత్రి పదవి దక్కిందంటే కారణం అదే అని నేనంటాను. కాదంటావా? ’’
‘‘అంకెలు చెప్పి బోల్తా కొట్టించే నాయకుడిలా ఏవేవో ఉదాహరణలు చెబుతున్నావు కానీ నాకైతే నమ్మకం కుదరడం లేదు.... సరే మాట వరుసకు నువ్వు చెప్పిన వన్నీ నిజమే అనుకుందాం. అత్యధిక ఎంపి సీట్లతో ఆరు, ఏడు స్థానాల్లో నిలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబులు బ్రహ్మచారులు కాదు కదా? మరి వారెలా విజయం సాధించారంటావు... ఈ లెక్కన నీ థియరీ తప్పని తేలిపోయింది కదా?’’


‘‘ఏమీ కాదు 10ఏళ్ల నిరీక్షిణ తరువాత సగం రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నారు. అదీ మోడీ గాలి పుణ్యంతోనే. పదమూడేళ్ల ఉద్యమం తరువాత పది జిల్లాల రాష్ట్రానికి కెసిఆర్ ముఖ్యమంత్రి. అదే మోడీ ముఖ్యమంత్రి అయిన తరువాతనే గుజరాత్ అసెంబ్లీలోకి వెళ్లారు. ప్రధానమంత్రి పదవితోనే మోడీ పార్లమెంటులో అడుగు పెట్టారు. అంటే బ్రహ్మచారి కావడం వల్లనే కదా? మోడీని అదృష్టం వెంటాడుతోంది’’
‘‘పూర్వం రాజులు రాజ్యవిస్తరణ కోసం భార్యతో కలిసి యజ్ఞాలు కూడా చేసేవారు... నువ్వేంటి బ్రహ్మచారులకే రాజ్యాం దక్కుతుందని చెబుతున్నావు’’


‘‘నిజమేనోయ్ అది రాజరికం సంగతి, నేను చెప్పేది ప్రజాస్వామ్యం గురించి... పెళ్లికానివారైతే కుటుంబం కూడా లేదు పాపం ఎవరి కోసం దోచుకుంటాడు అనే సానుభూతి ఉంటుంది.. ఇంకో విషయం చెప్పనా? మహాభారతం మొత్తంలో మహాపరాక్రమవంతుడు ఎవరు? అంటే గుర్తుకు వచ్చేది భీష్ముడు. ఆయనా బ్రహ్మచారే... ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోతే వెన్నుపోటు బాధ తప్పేది మోడీ కన్నా రెండు దశాబ్దాల ముందే ప్రధానమంత్రి అయ్యేవారు కాదంటావా? ’’ 


20, మే 2014, మంగళవారం

జలదృశ్యం నుంచి సచివాలయానికి వంద అడుగుల దూరం 13 ఏళ్ళ ప్రయాణం

మోదీ మార్క్ ఎరువుతో దేశమంతటా కమలం పంట పండితే, పొలిమేరలోనే నమో గాలిని అడ్డుకుని తెలంగాణలో గులాబీ పంట పండించడంలో తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు విజయం సాధించారు. జలదృశ్యం నుంచి సచివాలయానికి దాదాపు వంద అడుగుల దూరం. ఆ దూరాన్ని అధిగమించడానికి తెరాసకు సరిగ్గా 13 ఏళ్ల సమయం పట్టింది. జల దృశ్యం తెరాస పుట్టినప్పటి కార్యాలయం. సచివాలయం రాష్ట్ర పాలనకు అధికార కేంద్రం. ఉద్యమ కేంద్రం నుంచి అధికార కేంద్రానికి చేరుకోవడానికి పదమూడేళ్లపాటు అలుపెరగని పోరాటం సాగింది. చివరకు కల సాకారమైంది. అనుకున్న లక్ష్యం నెరవేరింది.


2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో తెరాస ఆవిర్భావ సభ. వచ్చిన వారిలో తెలంగాణ సాకారం కావాలనే ఆశ, వస్తుందో రాదోననే అనుమానం. వాటిని పటాపంచలు చేస్తూ గమ్యాన్ని ముద్దాడే వరకూ ఉద్యమిద్దామంటూ బక్కపల్చని వ్యక్తి తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎన్ని విమర్శలు. ఎన్ని ఆరోపణలు. ఎంత దుష్ప్రచారం... అయినా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ సాధనే అజెండాగా 13 ఏళ్లపాటు ఉద్యమం సాగించారు. జలదృశ్యం నుంచి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రికి రాత్రి తెరాస కార్యాలయాన్ని తొలగించారు. ఇప్పుడు కేసీఆర్ ఏకంగా తెదేపానే తెలంగాణ నుంచి ఖాళీ చేయించారు. ఆంధ్రకు సాగనంపారు. తెరాస ఆవిర్భావ సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు, కొత్తగా పుట్టిన పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. పైగా సిద్ధిపేట నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఇకపై నేనే మీ సిద్దిపేట బాధ్యత చూసుకుంటానని బాబు భరోసా ఇచ్చారు. కానీ అదే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చంద్రబాబును అధికారానికి దూరం చేసింది. 2001లో తెరాస ఆవిర్భావం నుంచే తెదేపా పతనం ప్రారంభమైంది. పార్టీ ఆవిర్భవించిన వంద రోజులకే జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో తెరాస రెండు జిల్లా పరిషత్తులే నెగ్గింది. తెరాసకు ఇది చిన్న విజయమే కావొచ్చు. కానీ, తెదేపాకు వరుస పరాజయాలు ప్రారంభమయ్యాయి. 2001 నుంచి పరాజయాలను మూటకట్టుకున్న తెదేపా, 2014 ఎన్నికలు తొలి విజయం. చిత్రంగా ఇటు తెరాస, అటు తెదేపా ఒకేసారి అధికారంలోకి వస్తున్నాయి. 2001 తరువాత తెరాస అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. 2001 తరువాత తెదేపాకు అధికారం దక్కడం ఇదే మొదటిసారి.
కేసీఆర్‌తోనే తెలంగాణ సాకారమవుతుందనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఏర్పడింది. వైఎస్సార్ అకాల మరణం తరువాత మరోసారి తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ సాకారమైన తరువాత రాజకీయ ఎత్తుగడల్లో సైతం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అంచనాలే నిజమయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది తెరాస. తన నిర్ణయం సరైనదేనని ఫలితాలతో నిరూపించారు కేసీఆర్. తెరాస ఆవిర్భావం తరువాత తొలిసారిగా ఒంటరిగా పోటీ చేసింది. ఒంటరి పోరులో అందరినీ ఎదుర్కొని విజయం సాధించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్న తెలంగాణలో అధికారం దక్కాలంటే 60 సీట్లలో విజయం సాధించాలి. హంగ్ తప్పదేమోననే ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ స్పష్టమైన ఆధిక్యత సాధించారు. పోలింగ్ ముగిసిన వెంటనే కొత్త ప్రభుత్వం ఎలా ఉండాలి, మంత్రివర్గం ఎలా ఉండాలి, పాలన ఎలా సాగాలనే అంశంపై ఇటు నేతలతో, అటు అధికారులతో కేసీఆర్ చర్చలు సాగించారంటే విజయంపై ఆయనకు ఎంత నమ్మకమో చెప్పకనే చెబుతోంది.

18, మే 2014, ఆదివారం

అర్థ రాజ్యం - ఇద్దరు చంద్రులు

  మహారాజా రాజ్యం తూర్పు వైపు ఒక భయంకరమైన జంతువు తిరుగుతోంది. బాటసారులను మాయం చేస్తోంది. అటువైపు వెళ్లాలంటేనే ఎవరైనా భయపడుతున్నారు అంటూ గ్రామస్తులు మూకుమ్మడిగా రాజుకు మొరపెట్టుకుంటారు.
ఈరోజుల్లో మండల రెవెన్యూ అధికారిని నేరుగా కలవాలంటేనే కష్టం. ముందున్న అటెండర్, పక్కనున్న క్లర్క్ వెనక ఉన్న సీనియర్ క్లర్క్ మనం చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందాలి. పరవాలేదు అనుకుంటే అప్పుడు ఆయన దర్శనం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టెర్రరిస్టులు తమ టార్గెట్‌ను చేరుకోవడం కన్నా ప్రజలు ప్రభుత్వ అధికారిని కలుసుకోవడం కష్టం. ప్రజల వద్దకు పాలన వచ్చిన తరువాత ఇలాంటి కష్టాలు వచ్చాయి కానీ రాజరికంలో మాత్రం ప్రజలు నేరుగా రాజును కలిసేందుకు అపాయింట్‌మెంట్ అవసరం లేకుండా వెళ్లిపోయేవారని రాజుల కథలు చదివితే తెలుస్తుంది.


మళ్లీ కథలోకి వద్దాం. గ్రామస్తుల హాహాకారాలకు చలించిపోయిన రాజు తూర్పు వైపున ఆ వింత జంతువును సంహరించిన వారికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయడంతో పాటు అర్ధరాజ్యం బహుమతిగా ఇస్తాను అని ప్రకటిస్తారు. ఈ మాట విని వింత జంతువును సంహరించలేని రాజు దేశానే్నం రక్షిస్తాడు అని శత్రుదేశం వాళ్లు ఎందుకు దండెత్తరో అస్సలు అర్ధం కాదు. ఈ అర్ధరాజ్యం ప్రస్తావన లేని రాజుల కథలు ఎంత వెతికినా కనిపించవు. ఇందులో అనేక అనుమానాలు. పెద్ద పెద్ద బోనులు తయారు చేయించి జంతువులకు కాపాలా పెట్టినా మన నెహ్రూ జంతు ప్రదర్శన శాల నుంచే జంతువులు, వాటి చర్మాలు మాయం అయ్యాయి. పులితో దూరం నుంచి ఫోటో తీసుకో పరవాలేదు కానీ చనువిచ్చింది కదా అని దగ్గరికి వస్తే ఏదో చేస్తుందని సినిమా డైలాగులకు బాగానే ఉంటుంది కానీ ఎవడో దొంగోడు మరీ దగ్గరగా వచ్చి పులి చర్మం ఒలుచుకుపోయినా దిక్కులేదు. ఆ సంగతి వదిలేస్తే ఏదో జంతువు వచ్చి గ్రామంలో ప్రజలకు ఇబ్బంది పెడితే నలుగురు మనుషులను పంపించి దాని సంగతేమిటో చూడాలి కానీ అమ్మాయిని,అర్ధరాజ్యాన్ని ఇస్తానని ప్రకటించడం ఏమిటో ? ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకుంటే ఒక్కరు ఇద్దరు కాదు రాజులంతా ఇంతే ఏ చిన్న సమస్య పరిష్కారానికైనా అమ్మాయినిచ్చి పెళ్లి చేయడంతో పాటు అర్ధరాజ్యం ఇచ్చేస్తామంటారు. ఈ బంపర్ ఆఫర్ సరే. మరి ఆ సమస్యను మగవారే పరిష్కరించాలనేముంది. ఆడవారు పరిష్కరిస్తే, సరే మగవారే పరిష్కరిస్తారనుకుందాం. పెళ్లి కాని యువకుడే ఆ సమస్యను పరిష్కరించాలనేముంది. వయసు మళ్లిన వాడే అప్పటికే పెళ్లయినా వాడో ఆ సమస్య పరిష్కరిస్తే. ఏంటో రాజులకు మాట ఇచ్చే ముందు ఇలాంటి విషయాలు గుర్తుకు రావా?అల్లా టప్పా రాజులు కాదు చివరకు రారాజు దుర్యోధనుడు సైతం ఇలాంటి వే చేసేవాడు. కర్ణుడిపై అభిమానం పుట్టి అతనికి అర్ధరాజ్యం ఇచ్చేసి అంగరాజును చేశాడు. రారాజే అలా అయితే అల్లాటప్పా రాజులది చెప్పేదేముంది.


అర్ధరాజ్యం, రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని ముసలి రాజు ప్రకటించగానే ఐతే ఎన్టీఆర్ లేకుంటే కాంతారావు కత్తిని గాలిలో ఝుళిపిస్తూ గుర్రంపై దారి తెలియకుండా పరిగెత్తిస్తూ ప్రత్యక్షం అవుతారు. రాక్షసి కావచ్చు, వింత జంతువు కావచ్చు సమస్య ఏదైనా పరిష్కరించి అర్ధరాజ్యంతో పాటు హీరోయిన్‌ను సొంతం చేసుకుంటారు. ఈ అర్ధరాజ్యం కథలు మనకే పరిమితమేమో? తెలుగేతర రాజుల కథల్లో ఈ అర్ధరాజ్యం హామీలు అస్సలు కనిపించవు. అలాంటిదేమీ కాదు హిందీ చందమామ కథల్లో అర్ధరాజ్యం కథలు చదివామని చెబుతారేమో! తెలుగు చందమామ కథలనే హిందీలోకి అనువాదం చేసేవాళ్లు కాబట్టి అవన్నీ తెలుగు రాజుల కథలే. పద్యం తెలుగువాడి ప్రత్యేకం అయినట్టు అర్ధరాజ్యం కథలు కూడా తెలుగువాడి ప్రత్యేకత కావచ్చు. 

ఈ అర్ధరాజ్యం కథ తెలుగు వారిని వదిలేట్టుగా లేదు. తెలుగు రాజ్యాన్ని రెండుగా విభజించి ఒక చంద్రునికి సగం, మరో చంద్రానికి సగం పంచి పెట్టారు. సగం రాజ్యం దక్కింది, మా రాజ్యం మేం బాగు చేసుకుంటాము అని తొలిసారిగా పట్ట్భాషేకం చేసుకోబోతున్న తెలంగాణ రాజ్యాధిపతి సంబరపడుతుంటే మొత్తం రాజ్యాన్ని చాలా కాలం ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన నేను ఇప్పుడు రాజధాని లేని సగం రాజ్యాన్ని పాలించాల్సి వస్తోంది అని చంద్రం వాపోతున్నారు.
మంత్రిపదవి దక్కలేదని ఉద్యమం ప్రారంభిస్తే ఏకంగా రాజ్యమే దక్కింది అని కొందరి విమర్శ. నిజానికి చంద్రన్న రాజకీయం పదేళ్లక్రితమే ముగిసిపోయింది. రాజ్య విభజనతో జనం మా భవిష్యత్తు ఏమిటి? అని కలవరపడుతుంటే నాకు పాలించిన అనుభవం ఉంది నన్ను నమ్మండి ఈసారి బాగా పాలిస్తాను అని జనాన్ని నమ్మించడంతో చంద్రన్న సెకండ్ ఇన్నింగ్స్‌కు జనామోదం లభించింది. రాజ్యవిభజన వల్లే రాజ్యాధికారం దక్కింది కాబట్టి దానికి తెలుగు చంద్రన్న విభజనకు కారణం అయిన వారందిరినీ పేరు పేరును తలుచుకోవాలనేది కొందరి వాదన. తెలుగునేత మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు చంద్రన్న ఏకంగా రాజ్యాధినేత అయ్యాడనే మాటలో ఎంత నిజముందో? ఆయన ప్రారంభించిన ఉద్యమం వల్ల రాజ్యవిభజన జరిగి పరిస్థితులు మారి తెలుగు చంద్రన్న రాజ్యధినేతగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారనే మాటలో అంతే నిజముంది. ఈ మాటలో ఎంత అబద్ధం ఉందో, ఆ మాటలో కూడా అంతే అబద్ధం ఉంది.


ఆకాశంలో సగం, అర్ధాంగి, అర్ధనారీశ్వరుడు అబ్బో ఎన్ని అర్ధకు ఎన్ని అర్ధాలో... అంతా బాగానే ఉంది కానీ సగం సగం అన్నప్పుడు రాజ్యాన్ని రెండు సగాలు చేసినప్పుడు ఒక సగం న్యాయంగా ఆడవారికి దక్కాలి కదా? అర్ధరాజ్యానికి ఆడవారు ముఖ్యమంత్రి కావాలనేది నా కల అని యువరాజావారు చెప్పినా జనం మాత్రం ఎందుకో పట్టించుకోలేదు. 

11, మే 2014, ఆదివారం

ఆయనంతే... అదో టైపు!

ఏ మోయ్ కాంతం ఎప్పుడు లేనంత అందంగా కనిపిస్తున్నావు? ఏమిటో విశేషం ’’
ఆ మాటలతో కాంతం ఒక్కసారిగా సిగ్గుతో ముడుచుకుపోయి ‘ముసలోడికి దసరా పండగ అని ఈ వయసులో ఏమిటా? చిలిపి మాటలు’’ అంటూ పైకి కోపం నటిస్తూనే లోలోన మురిసిపోయింది.

‘‘ఉన్నమాట చెబితే కోపమెందుకు? ఆ నల్లంచు తెల్ల చీరలో మెరిసిపోతున్నావోయ్ శే్వతా దేవి ’’ అని కుటుంబరావు అనగానే కాంతం మెలికలు తిరిగిపోతూ, చాల్లేండి ఎవరైనా వింటే నవ్విపోతారు’’ అంది. ఇంతలోనే కాలింగ్ బెల్ మ్రోగడంతో వెళ్లి తలుపు తీసింది. పక్కింటి పచ్చమ్మ ‘‘కాంతం రెడీ అయ్యారా? పంక్షన్‌కు టైం అవుతుంది పదండి’’ అని హడావుడి చేసింది. ‘‘అంతా పంక్షన్‌కు వెళున్నారా? ఈ రోజు పచ్చమ్మ కొత్త పెళ్లి కూతురంత అందంగా ఉంది . చెంపల్లో ఎప్పుడూ లేనంత మెరుపు కనిపిస్తోంది. ఏమిటా? విశేషం అనుకున్నాను’’ అని కుటుంబరావు పచ్చమ్మను పలకరించాడు. ఆ మాటలతో ఒకేసారి కాంతం, పచ్చమ్మ నివ్వెరపోయారు. అసలు ఇంట్లో ఉన్నాడా? లేడా? అన్నట్టు ఉండే కుటుంబ రావు ఒక్కసారి కూడా పలకరించి ఎరుగడు. అలాంటిది ఏకంగా తనను కొత్త పెళ్లి కూతురులా మెరిసిపోతున్నారు అనడం పచ్చమ్మకు నమ్మశక్యం కాకుండా ఉంది. ఈ మాట వినగానే కాంతం నిర్ఘాంత పోయింది. మా ఆయన మంచోడు ఇంటికెవరైనా ఆడవారు వస్తే తలెత్తి కూడా చూడకుండా తన గదిలోకి వెళతాడు అని ఇంత కాలం గొప్పగా అనుకున్నాను... కానీ ఛీ..్ఛఛీ... ఈ వయసులో ఆయనకు ఇదేం పాడు బుద్ధి నా ముందే ఇంటికొచ్చిన ఆడవారి అందాలను పొగుడుతున్నాడు అని కాంతం బాధపడింది. ఆమెకు పచ్చమ్మ ముఖం చూసేందుకు మనసొప్పలేదు. ఏంటీ ఇంకా రెడీ అయ్యారా? లేదా? అంటూ కమలమ్మ తలుపు తోసుకొచ్చి, పచ్చమ్మ భుజంపై చేయి వేసి, తొందరపెట్టింది. ఆమెను చూడగానే కుటుంబరావు చిన్నగా ఈలవేసి ‘‘ ఓహో ముద్దు గుమ్మ కమలమ్మ కూడా వచ్చిందా? శే్వతమ్మ, కమలమ్మ, పచ్చమ్మ ముగ్గురూ అందగత్తెలే ఒకరిని మించిన వారు ఒకరు. పచ్చమ్మకు, కమలమ్మకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది ఇప్పుడేంటి భుజం భుజం కలిపి నడుస్తున్నారు?’’అంటూ కుటుంబరావు అడిగిన ప్రశ్నకు ఏం చెప్పాలో వారికి అర్ధం కాలేదు. కాంతానికి మాత్రం తలకొట్టేసినట్టు అనిపించింది. ఇంకాస్సేపు ఉంటే ఈ ముసలాయన వాళ్ల అంద చందాల గురించి ఇంకేం మాట్లాడతాడో అనే భయంతో వారిని తీసుకొని బయటకు నడిచింది.

‘‘ఏమీ అనుకోకండి మా ఆయన ఇంతకు ముందెన్నడూ లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు’’ అని క్షమాపణ చెబితే, ‘‘మనలో మనకు క్షమాపణలేందుకు? వయసు మీరిన తరువాత ఎవరి నుంచైనా మన అందం గురించి పొగడ్తలు వింటే ఇంకా వినాలనిపిస్తుంది కానీ కోపం రాదు అని ముద్దుగుమ్మలు నవ్వుతూ కోరస్‌గా చెప్పారు.
***


కుటుంబరావు వ్యవహారం ముదిరిపోవడంతో కాంతమ్మ ‘‘ఏమండీ ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఈలవేస్తూ పని మనిషి అందాన్ని కూడా మెచ్చుకుంటున్నారు. ఇంత అద్భుతంగా ఈలవేయడం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు. మీకేమైందండి’’ అని కాంతం కన్నీళ్లు తుడుచుకుంది.


‘‘పిచ్చి కాంతం నేను ఎప్పటిలానే ఉన్నాను. నీకే ఏదో అయింది’’ అంటూ రిమోట్ అందుకుని టీవి ఆన్ చేశాడు. రాష్టమ్రంతటా యువనేత పవనాలే వీస్తున్నాయి అని తన్మయంగా చెబుతోంది ఆ న్యూస్ రీడర్. ఆయన సింహాసనంపై కూర్చున్న తరువాతనే తాను తల్లి కడుపులో నుంచి బయటకు వస్తానని గర్భస్థ శిశువు శపథం చేసినట్టు మా ప్రత్యేక విలేఖరి కథనం. చానల్ మార్చగానే ‘‘వృద్ధ నేత గడ్డానికి ఫిదా అయిపోయిన ప్రజలు. ఆయనే మళ్లీ రావాలని ప్రపంచ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈరోజు నేను అమెరికాను ఇంత సమర్ధవంతంగా పాలిస్తున్నాను అంటే దానికి ఆయన చూపిన మార్గమే కారణం అని ఒబామా తన  సెక్రటరీతో చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన గెలుపు కోసం ప్రపంచ దేశాల పాలకులు దేవుళ్లను మొక్కుతున్నారు’’ అని మరో చానల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో అదరగొడుతోంది.


‘‘చూశావా కాంతం టీవి ఒకటే, రిమోట్ ఒకటే కానీ చానల్‌ను మారిస్తే అదే టీవి తెరపై యువనేత అధికారంలోకి రావడం ఖాయం అంటుందో చానల్, వృద్ధనేత ఆల్‌రెడీ సింహాసనంపై కూర్చున్నారంటోంది మరో చానల్ ... ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అంతా నాటకం. మన టీవి మనకే అబద్ధం చెబుతుందా? అంటే ఏం చెబుతాం, ఈ లోకం అంతే కాంతం ... అంతే...’’ అంటూ కుటుంబరావు ఇంకా ఏదో చెప్పబోతుంటే కాంతానికి కన్నీళ్లు ఆగలేదు. పాత సినిమాలో తాగుబోతు హీరో వద్ద ఉండే రామయ్యా అనే నౌకరు పాత్ర ఇలానే అర్ధం పర్థం లేకుండా నీతులు చెబుతుంది. మా ఆయనకు ఈ మాయదారి రోగం వచ్చిందేమిటి దేవుడా?అని కాంతం కన్నీళ్లు పెట్టుకుని డాక్టర్ వద్దకు పరుగులు తీసింది.
***
హలో కుటుంబరావు గారూ ఏంటీ ఒంట్లో నలతగా ఉందా? మీ ఆవిడ కంగారు పడుతుంటే నేను వచ్చాను అని డాక్టర్ పలకరించారు. కుటుంబరావు టీవిల్లో వార్తల విశే్లషకునిగా వస్తుంటాడు దాంతో చుట్టు పక్కల బాగానే పాపులర్.
‘‘ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయంటారు?’’ అని డాక్టర్ సంభాషణ ప్రారంభించారు.
‘‘ముందు మీరు ఏ పార్టీనో చెప్పండి... చానల్‌ను బట్టి మా విశే్లషణ ఉంటుంది? అలానే మీరే పార్టీనో చెబితే ఫలితాలు ఎలా ఉంటాయో చెబుతాను’’ అని కుటుంబరావు నవ్వాడు.
***
‘‘జలుబుకు చికిత్స జరిపితే వారంలో, జరపకపోతే ఏడు రోజుల్లో తగ్గిపోతుంది. మీ ఆయన క్కూడా అంతే. చికిత్స చేస్తే వారంలో, చేయకపోతే ఈనెల 16న మధ్యాహ్నానికి సాధారణ స్థితికి వస్తారు’’ అని డాక్టర్ భరోసా ఇచ్చారు.
కాంతం అర్ధం కానట్టు అయోమయంగా చూస్తే, ఏమీ లేదమ్మా మీ ఆయన ఎన్నికల ఫలితాలపై ఒక్కో టీవిలో ఒక్కో రకంగా విశే్లషణ చేసి చేసి అలా అయ్యారు. మే 16న ఫలితాలు వచ్చాక ఆయనే మామూలు మనిషి అవుతారు. అప్పటి వరకు ఎవరైనా చేసేదేమీ లేదన్నాడు.

6, మే 2014, మంగళవారం

మిస్టర్ లోకేశం



సూపర్ స్టార్ కృష్ణ కొడుకైనా సత్తాలేకుండా సినిమాల్లోకి వస్తే.. రమేష్ బాబు అవుతాడు? సత్తా చూపితే మహేష్ బాబు అవుతాడు.
***
ఎవరైనా ఊపిరి తీసుకుని బతుకుతారు. ఆయన మాత్రం రాజకీయమే ఊపిరిగా బతుకుతారు. చదువుకునే రోజులనుంచే రాజకీయ ఎత్తుగడలు నేర్చుకున్న చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్. కానీ -ఆయన రాజకీయ రంగ ప్రవేశమే పేలవంగా జరిగింది. తేదీలు ప్రకటించి ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వచ్చారు. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, చిరంజీవి లాంటి వారంతా తాము సినిమా రంగంలో టాప్ పొజిషన్‌లో ఉన్నప్పుడే వారసులను తెరపైకి తెచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం వరుసగా రెండుసార్లు ఓడిపోయి సంక్షోభంలో పడిన సమయంలో తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. తన పాదయాత్ర ముగింపు సభలో లోకేశ్‌ను ప్రవేశపెట్టాలనే ప్రయత్నం కుటుంబ రాజకీయాలతో ఫలించలేదు. సైకిల్ యాత్ర అంటూ హడావుడి చేసినా వర్కవుట్ కాలేదు. దాంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక, లోకేశ్‌ను రాజకీయాలకు విడుదల చేశారు.
‘నగదు బదిలీ పథకం సృష్టికర్త’ -అంటూ నారా లోకేశ్ ట్విట్టర్‌లో తన గురించి తాను రాసుకున్నారు. ‘తెరవెనుక పార్టీ ప్రచారానికి వ్యూహ రచన చేసేది మా అబ్బాయే’ -అని బాబు మురిపెంగా చెప్పుకున్నారు. కానీ, జనం మాత్రం లోకేశ్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ‘ఏమంటివేమంటివి..’ అంటూ ఎన్టీఆర్‌లా డైలాగులు చెప్పాలని పవన్ ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది. లోకేశ్ ప్రయత్నం కూడా అలానే ఉంది. ఏదో ఆవేశంగా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు, సాధ్యం కావడం లేదు. కుల పిచ్చి ఉన్న పార్టీ తెదేపానే.. అని ఒకసారి, సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మనకు మనం ఉరివేసుకున్నట్టేనని మరోసారి ఆవేశంగా మాట్లాడడం వెనక ఉన్నవారు జాగ్రత్తలు చెప్పడం ఈ వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు వినోదాన్ని కలిగిస్తున్నాయి.

అనంతపురం జిల్లాలో లోకేశ్ తొలి రాజకీయ సభ. ఆ సభ ఏర్పాటు చేసి లోకేశ్ పక్కనే ఐదారు గంటలపాటు ఓ యువనేత కూర్చోవాల్సి వచ్చింది. నాలుగు రోజుల తరువాత మళ్లీ కలిస్తే -ఎవరు? అని అడిగారట లోకేశ్. తనను తాను మళ్లీ పరిచయం చేసుకున్నాడు యువనేత. రాజకీయాల్లో రాణించాలంటే అస్సలు ఉండకూడని లక్షణమిది. ఒకరకంగా చంద్రబాబు అదృష్టవంతుడు. తన పార్టీలోనే కాదు తన ఇంట్లో సైతం ఆయనకు ఎలాంటి పోటీ లేదు. శరీరం సహకరించినంత వరకు రాజకీయాల్లో కొనసాగే అదృష్టం ఉన్న నాయకుడు చంద్రబాబు.

రాజకీయాల్లోకి రావడం కోసం లోకేశ్ ఒక చానల్‌ను నిర్వహించాలని ప్రయత్నించినా సాధ్యంకాక చేతులెత్తేశారు. తండ్రి నిలబెట్టిన హెరిటేజ్ నిర్వహణలో మాత్రం దూసుకు వెళ్తున్నారు. మాట తీరు, వ్యవహారం, ఏ ఒక్కటీ రాజకీయాల్లో రాణించే లక్షణాలు లోకేశ్‌లో కనిపించడం లేదు. మీడియా అభిమానంతో ఆకాశానికెత్తినా నిలబడలేరు. సూటిగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడం, ప్రజల్లో మమేకం కావడం, అనుచరులకు విశ్వాసం కలిగించడం వంటి లక్షణాలేవీ కనిపించడం లేదు. 

వైఎస్సార్, చంద్రబాబు ఒకప్పుడు మంచి మిత్రులు.. ఇద్దరూ 78 బ్యాచ్ ఎమ్మెల్యేలే. ఇద్దరి సంతానం రాజకీయాల్లోకి వచ్చింది. కానీ ఇద్దరికీ పోలికే లేదు. బాబును తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం అతనిలోని రాజకీయ నేతను, తెరవెనుక వ్యూహాల్లో ఆయన తెలివిని కాదనలేరు. కానీ లోకేశ్‌లో అవేవీ మచ్చుకైనా కనిపించవు. కానీ -లోకేశ్‌ను ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు పిలిచి సీటు ఇచ్చాయని బాబు చెబుతుంటారు. వినేవాళ్లుంటే చంద్రబాబు చాలా చెప్తారంటారు -మీడియా మిత్రులు.

4, మే 2014, ఆదివారం

దారితప్పిన మేధావి

సబ్బం హరి. ఈ పేరు తలుచుకోగానే ఔను ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఏ పార్టీలో ఉన్నారు? గతంలో ప్రతిరోజూ టెలివిజన్ చర్చల్లో కనిపించే వారు కదా! ఇప్పుడు కనిపించడం లేదేమిటి? అనే ప్రశ్నలు ఒకదాని తరువాత ఒకటి తన్నుకొస్తాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతుగా బలమైన వాదన వినిపించేవారు. ఇప్పుడాయన ఏం చేస్తున్నట్టు? -అంటే విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేస్తున్నారు? అదీ -జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి. ఇది నిజ్జంగా నిజం. ఆ పార్టీకి ఆయన ఉపాధ్యక్షుడు కూడా. 

టెలివిజన్ చర్చలు దెబ్బతీసిన నాయకుల్లో సబ్బం హరి ఒకరు. వైఎస్సార్ ఉండగా, ఆయనకు గట్టి మద్దతుదారునిగా నిలిచారు. వైఎస్సార్ మరణం తరువాత అంతకుమించి జగన్‌కు అండగా నిలిచారు.. జగన్ మీద ఈగవాలినా సహించక పోయేవారు. రోజూ టెలివిజన్ చానెళ్లలో కనిపిస్తూ జగన్‌కు అండగా నిలిచారు. అంతా బాగానే ఉంది. కానీ గొప్ప మేధావిని అనే గట్టి నమ్మకం ఆయన్ని రాజకీయాల్లో దెబ్బతీసింది. అసలే మేధావిననే నమ్మకం.. పైగా టీవీ చర్చలు. ఊరికే ఉంటారా? జగన్ యూపీఏకు మద్దతిస్తారంటూ ప్రకటించేశారు. సబ్బం వ్యాఖ్యలను అందిపుచ్చుకున్న తెదేపా -జగన్‌పై దాడి మొదలెట్టింది. దాంతో వైకాపా వాళ్లు మేం ఎవరికి మద్దతిస్తామో చెప్పడానికి సబ్బం హరికి సంబంధమేంటి? ఆయనసలు మా పార్టీనే కాదు, ఆయనకు మా పార్టీ సభ్యత్వం కూడా లేదు -పొమ్మన్నారు.
మేధావి అహం దెబ్బతింది. నేనేమీ వైకాపా సభ్యత్వం కోసం 

దేబిరించలేదు అంటూ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌లో ఉండి జై సమైక్యాంధ్ర అంటున్నందున ఏకంగా జై సమైక్యాంధ్రనే నమ్ముకుంటే పోలే అనుకుని కిరణ్ అధ్యక్షతన ఉన్న జై సమైక్యాంధ్ర పార్టీకి ఉపాధ్యక్షుడయ్యారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయో బాగా ఊహించి అధినాయకుడు కిరణ్‌కుమార్‌రెడ్డినే పోటీకి దూరంగా ఉంటున్నందున పోటీలో ఉన్న సబ్బం హరి పరిస్థితి ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలుగుతాడని భావించిన నాయకుడు చివరకు ఇలా అయిపోయారు. జగన్ జైలులో ఉన్నంతకాలం ఆయనకు మద్దతుగా నిలిచారు. తీరా బయటకు వచ్చే సమయానికి పార్టీ వీడి వెళ్లారు. విశాఖ మేయర్‌గా పని చేసిన సబ్బం హరి, 2009 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో కృషి చేశారు. పార్లమెంటులో చివరి వరకూ పోరాడారు. సొంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టటంతో కాంగ్రెస్‌కు దూరమయ్యారు. టీవీ చర్చలతో జగన్ పార్టీకి దూరమయ్యారు. కిరణ్‌కు చేరువైనా, కిరణ్‌కే రాజకీయ జీవితం లేనప్పుడు ఇక సబ్బానికేముంటుంది? అన్న సంపతీ డైలాగులు ఎదుర్కొంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఐదుశాతం ఓట్లు కూడా రావని లెక్కలు 
చెబుతున్న సబ్బం, తనకు ఎన్ని శాతం ఓట్లు వస్తాయో చెప్పలేకపోతున్నారు. విశాఖ మేయర్‌గా పట్టణంలో మంచి పట్టుసాధించారు. హేమాహేమీలను తట్టుకుని 2009లో పార్లమెంటుకు ఎన్నికైన సబ్బం రాజకీయ జీవితం ఇప్పుడు క్రాస్‌రోడ్‌లో ఉంది.

ముదురు ప్రేమికుల దినోత్సవం

జీవితం నుంచే సినిమాలు పుడతాయి, సినిమాల నుంచి జీవితాలు ప్రభావితం అవుతాయి. ఇప్పుడు సినిమాలేమో కుర్ర హీరోల ప్రేమ కథలతో చెలరేగిపోతున్నాయి. యువత చదువు ఉద్యోగం వేటలో ఎప్పుడూ లేనంత టెన్షన్ అనుభవిస్తుంటే, అచ్చం గతంలో సినిమాల వలెనే సీనియర్ సిటిజన్స్ ప్రేమలో పడిపోతున్నారు. పెళ్లి చేసుకుంటావా? తాతా అంటే నాకెవడిస్తాడు పిల్లను అనేది పాత మాట. ఈ తరం తాతలు ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి అదృష్టవంతులు కొందరేననుకోండి. ఇలాంటి అదృష్టవంతుల ప్రేమ కథలు మాత్రం యాధృచ్చికంగానే బయటపడుతున్నాయి. 

అదేదో సినిమాలో శ్రీలక్ష్మి మూగపాత్రలో నటించింది. ఆమెకు హఠాత్తుగా మాటలొస్తాయి. ఇంకేం అంత కాలం అణిచిపెట్టుకున్న మాటలన్నీ అసందర్భంగా బయటకు తన్నుకొస్తుంటాయి. స్కూల్‌లో చదివేప్పుడు పెన్సిల్ ఎత్తుకెళ్లాడని మొగుడ్ని చితగ్గొడుతుంది చిన్నప్పటి విషయాలు పెద్దయ్యాక తెగ మాట్లాడేస్తుంది.


ఎన్నికల ప్రచారం, కోర్టు తీర్పులు, ప్రత్యర్థులపై నిఘా పుణ్యమా అని ఇప్పుడు అలానే ఎనె్నన్నో రహస్యాలు బయటకు వచ్చేస్తున్నాయి. మా మోదీ దేశం కోసం పెళ్లి కూడా చేసుకోలేదు తెలుసా? అని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకునే వారు. దిగ్విజయ్‌సింగ్ మాత్రం అదేం కాదు మోదీకి భార్య ఉన్నారంటూ చెప్పుకొచ్చేవారు. నాయకులపై ఆరోపణలు సహజం కాబట్టి వీటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల్లో పోటీ చేసే వారు ఏ కాలంను ఖాళీగా వదిలేయడానికి వీలు లేదు అన్నింటిని పూరించాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు పుణ్యమా అని నరేంద్ర మోదీ తన పెళ్లి రహస్యాన్ని బట్టబయలు చేయక తప్పలేదు. ఈ వ్యవహారంలో బిజెపి వాళ్లకు దిగ్విజయ్‌పై కోపం వచ్చిందో లేక తెర వెనుక వ్యవహారం ఏమిటో కానీ దిగ్విజయ్ సింగ్ అమృతారాయ్‌తో ప్రేమాయణం సాగిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.  67 ఏళ్ల దిగ్విజయ్‌సింగ్ తనలో  సగం వయస్సున్న అమృతారాయ్‌ ని అర్ధాంగిగా మార్చుకోనున్నారు . విషయం బయటపడిన తరువాత ఆమె  తో నిండా ప్రేమలో మునిగిపోయినట్టు, అమెకు విడాకులు మంజూరైన మరుక్షణమే పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు.. ఆమె కూడా కాబోయే భర్తకు తగిన ఇల్లాలులా పరస్పరం విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాం, అవి అందగానే దిగ్విజయ్ నేనూ ఒకటవుతాం అని ప్రకటించింది.

ఈ ముదురు ప్రేమికుల పుణ్యమా అని జాతీయ మీడియా మరోసారి ఎన్టీఆర్‌ను జ్ఞాపకం చేసుకుంది. ఆయన దిగ్విజయ్‌కన్నా పెద్ద వయసులో కనీసం విడాకుల కోసం దరఖాస్తు కూడా చేయకముందే లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు.
విడాకులు, మళ్లీ పెళ్లి ఇప్పుడేం కొత్త కాదు.. కానీ కొన్ని ముదురు ప్రేమలే మరీ చోద్యంగా అనిపిస్తున్నాయి. ఎక్కడో అమెరికాలో 60 ఏళ్లాయన పెళ్లి చేసుకున్నాడని, ఎవరో ఎలిజబెత్ టేలర్ డజన్ల కొద్ది పెళ్లిళ్లు చేసుకుంటుందని వింతగా చెప్పుకునే వారు ఇప్పుడు మనకూ ఇవి కామన్‌గా మారిపోయాయి.


ప్రజా జీవితంలో ఉన్నవారి ఇలాంటి ప్రేమలను ప్రజలు సహించరు అని చెప్పడానికి కూడా వీలులేదు. ఎన్టీఆర్ 70ఏళ్ల వయసులో లక్ష్మీపార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అప్పుడు టిడిపి నాయకులు మా రాజకీయ జీవితం ముగిసిపోయినట్టే అని కుమిలిపోయారు. తీరా చూస్తే ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతుంటే తమ్ముళ్లు ఈలలు,అరుపులతో ఆనందంగా గెంతులేశారు. ఫలితాలు వచ్చాక చూస్తే కాంగ్రెస్‌కు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదు. ఈ ప్రజలు దేన్ని ఆమోదిస్తారో, దేన్ని వ్యతిరేకిస్తారో అర్ధం కాదు. అలా అని దిగ్విజయ్‌సింగ్ తన ప్రేమ పురాణాన్ని బహిర్గతం చేశాడని జనం గెలిపిస్తారా? అంటే అంత సీన్ కనిపించడం లేదు. 

బాబులాగానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిగ్విజయ్ సంస్కరణ వాదిగా పేరు తెచ్చుకున్నారు. కొంచం ముందు కొంచెం వెనుక అన్నట్టుగా దాదాపు ఒకే కాలంలో ఇద్దరు అధికారం కోల్పోయారు. అధికారం తప్ప మరేదీ బాబుకు జీర్ణం కాదు. ఆయన అధికారాన్ని అంతగా ప్రేమించారు. అవసరం అయితే జిల్లాకు ఇద్దరు ముగ్గురు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలి అంతే .. ప్రేమిస్తే అంతే లైలా ప్రేమ కోసం సామ్రాజ్యాన్ని వదలుకున్నాడు మజ్నూ. ప్రేమ అత్యంత శక్తివంతమైంది. అది అమ్మాయిపై ప్రేమ కావచ్చు, సింహాసనం పై ప్రేమ కావచ్చు. సింహాసనంపై ప్రేమను విజయవంతం చేసుకునే సూచనలు కనుచూపు మేరలో కూడా కనిపించక పోవడంతో దిగ్విజయ్‌సింగ్ అమృతారాయ్ ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ప్రేమలో తన్మయంలో మునిగిపోయినప్పుడు ఎవరు ఫోటోలు తీశారో, ఎవరు లీక్ చేశారో ఏమిటో కానీ వ్యవహారం సామాజిక మాధ్యమాలకు ఆ తర్వాత ప్రతికలకెక్కింది. ఇలాంటి వ్యవహారాల్లో దిగ్విజయ్ మొదటి వారు కాదు చివరి వారు కాదు.
ఎన్టీఆర్ ప్రేమ తెలుగుదేశం చరిత్రను మలుపు తిప్పింది. శశిధరూర్ ప్రేమ ఆయన మంత్రిపదవికి ఎసరు పెట్టింది. ముదురు ప్రేమలో తాత లాంటి వారు ఎన్‌డి తివారి. తన ప్రేమ ఈ వయసులో ఆయన్ని ఇరకాటంలో పెట్టింది. ఎన్ని ప్రేమలో ఆయనకు ఎన్నని గుర్తుంటాయి. చివరకు వాళ్ల అబ్బాయి కోర్టుకెక్కి తివారీనే తండ్రి అని కోర్టుతో చెప్పించుకున్నారు. మరోవైపు ఆయన ప్రేమాయణం గవర్నర్ పదవికి ఎసరు తెచ్చింది.


ఆ మధ్య తారా చౌదరి పట్టుబడ్డప్పుడు చాలా మంది తెలుగు ముదురు ప్రేమికుల పేర్లు బయటకు వచ్చాయి. తరువాత ఏం జరిగిందో కానీ ఎవరికి ఏమీ జరగలేదు, ఆమె బయటకు వచ్చారు. ప్రేమిస్తే పోయేదేమీ లేదు, తిరిగి వారు ప్రేమిస్తారు అనే సినిమా డైలాగు బాగానే ఉంది కానీ ముదురు ప్రేమికులు ప్రేమించేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కెమెరాలు ఉన్నాయో? ఎవరు నిఘా పెట్టారో చూసుకోవాలి లేకపోతే లేటు వయసులో పెళ్లికి ఒప్పుకోవలసి వస్తుంది. ప్రేమికుల దినోత్సవం లానే ముదురు ప్రేమిలకూ ఒక దినం ఉండాలి.
సాహసం చేయకురా నాయకా పదవి ఊ డేను 
రాజ నీతి .. రాజకీయ నాయకులు పదవిని ప్రేమించినట్టు ఆడవారిని ప్రేమిస్తే పదవి ఊ డుతుంది