28, జులై 2014, సోమవారం

కమిటానంద స్వామి!

మహానగరంలో సమస్యలతో జీవితంపై విరక్తి కలిగి సన్యాసం స్వీకరించి తపస్సు చేసేందుకు నల్లమల అడవుల బాట పట్టిన అతనికి అడవిలోని స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం జీవితంపై ఆశలు రేకెత్తించాయి. చావైనా రేవైనా ఇక ఇక్కడే అనుకున్నాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అడవిలో వీడెవడో కొత్త బిచ్చగాడు వచ్చినట్టుగా ఉందని తపస్సు చేసుకుంటున్న ముని యువకుడిని పిలిచాడు.
‘‘ఏమోయ్ ప్రశాంతంగా ఉన్న సరస్సులో రాయి వేసినట్టు నీ గొడవేంది?’’ అన్నాడు. ‘‘బాస్ నా మానాన నేను తపస్సు చేసుకోవాలని వచ్చాను. నీ మానాన నువ్వు తపస్సు చేసుకో’’ అని యువకుడు సమాధానం చెప్పాడు.


‘‘నేను ప్రశాంతంగానే తపస్సులో మునిగిపోయాను నువ్వు వచ్చాకే నా ఏకాగ్రత దెబ్బతింది. జీవితంలో ఏం అనుభవించావని ఇంత చిన్న వయసులో తపస్సు కోసం వచ్చావు. నువ్వెవరు, నీ కథేమిటో చెప్పు’’ అని ముని అడిగాడు.
‘‘ఈ సమస్యలతో బతకడం కన్నా తపస్సు బెటర్ అనిపించి వచ్చాను ’’ అని యువకుడు మునికి తన కథంతా చెప్పుకొచ్చాడు.
‘‘పిచ్చోడా? సమస్యలు లేని ఒక్క బడుద్దాయినైనా చూపించలగవా? ఈ సమస్యలు అందరికీ ఉండేవే. వీటికి ఒ అద్భుతనమై పరిష్కార మార్గం ఉంది’’ అని చెవిలో మంత్రోపదేశం చేశాడు.
***
‘‘రెండురోజులు ఎక్కడికెళ్లారు? సర్లే ఎక్కడికి చస్తే నాకేంటి కానీ... నేను అడిగింది ఏం చేశారు?’’ అని భార్య గర్జించింది.
‘‘డార్లింగ్ మన పంట పండింది. నేను ఇదివరకటి మొగుడిని కాదు... నల్లమల అడవుల్లో నాకు జ్ఞానోదయం అయింది. ఇప్పుడు నా కొత్త పేరు కమిటానంద స్వామి... ఒకసారి కమిట్ అయ్యానంటే అంతే... చెప్పు ఏమిటి నీ డిమాండ్స్..’’ అని మొగుడు అడిగాడు.
‘‘పట్టుచీర కొనిపెడతానన్నారు. వడ్డాణం చేయిస్తానని పెళ్లి రోజు వాగ్దానం చేశారు. వాటి సంగతి తేల్చమని అడుగుతున్నాను.’’ అంది భార్య.
‘‘తప్పకుండా డియర్ నీ ఈ చిన్నిచిన్న కోరికలు కూడా తీర్చకపోతే. నా జీవితం వృధా. బావ కళ్లల్లో ఆనందాన్ని చూడాలని మొద్దుశీనుకు, రైతు కళ్లల్లో ఆనందం చూడాలని పాలకులకు అనిపించినట్టుగానే వడ్డాణంతో నీ కళ్లల్లో ఆనందపు మెరుపులు చూడాలని నా కళ్లు పరితపిస్తున్నాయి,’’ అని మురిపెంగా పలికాడు.


‘‘ఐతే బంగారం బజారుకు వెళదామా? ’’ అని భార్య సంతోషంగా అడిగింది.
‘‘తప్పకుండా. దాని కన్నా ముందు కొంత తతంగం ఉంటుంది.
ఏ షాపులో బంగారం ఏ రేటులో ఉంది. ఎంత కొంటే ఎంత ఖర్చు, ఏ సమయంలో కొంటే ఎంత లాభం వంటి 36 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి. దీని కోసం ఒక కమిటీ వేస్తున్నాను. మీ అమ్మానాన్నలు, మా అమ్మానాన్నలు, మీ చెల్లి మా చెల్లి.. మేనత్త వీళ్లంతా ఆ కమిటీ సభ్యులు. వీళ్లు నివేదిక ఇవ్వగానే వడ్డాణం కొనిస్తాను’’
‘‘మరి పట్టుచీర ?’’
‘‘ ఓకే డియర్ .. దానికీ ఓ కమిటీ వేద్దాం. మన కాలనీలో ఒక్కో సామాజిక వర్గం నుంచి ఒకరిని ఎంపిక చేసి కమిటీ వేద్దాం. ఎలాంటి చీర కొనాలి, ఎంత ధరలో కొనాలో ఈ కమిటీ తేలుస్తుంది. రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్ర మూడు ప్రాంతాల్లోనూ కమిటీ పర్యటించాలి...ఏమంటావు’’ అని భర్త పలికాడు.
‘‘మీదెంత విశాల హృదయమండి... మిమ్మల్ని అనుమానించి నన్ను నేను అవమానించుకున్నాను. నాకు నచ్చిన చీర కోసం ఇంత శ్రద్ధ చూపుతున్నారంటే మీరు మనిషి కాదండి మనిషి రూపంలో ఉన్న దేవుడు‘‘ అంటూ భార్య ఆనంద భాష్పాలు రాల్చింది. విషయం తెలియగానే కాలనీ ప్రజలంతా సామాజిక వర్గాల వారిగా వచ్చి కమిటానందరావును అభినందనల్తో ముంచెత్తారు.


‘‘నాన్నా! కనీసం ఈ ఆదివారమైనా సినిమాకు వెళదాం’’ అంటూ ఇద్దరు పిల్లలు కోరస్‌గా పలికారు.
‘‘ పిల్లలూ మీరు అడగడం నేను కాదనడమా? వెళదాం. పవన్ కల్యాణ్ సినిమానా? మహేశ్ బాబు, తారక రత్నల సినిమానా? తేల్చడానికి ఆడ పిల్లలతో కమిటీ వేద్దాం. సమంతా, కత్రినా కైఫ్, త్రిష? ఎవరి సినిమానో తేల్చడానికి మగ కుంకలతో కమిటీ వేద్దాం . ఈరెండు కమిటీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే, మరో కమిటీ వేసి రెండు కమిటీల అభిప్రాయాలను క్రోడీకరించి నివేదిక ఇమ్మందాం’’ అని బదులిచ్చాడు.
‘‘ ఏమండోయ్ మీ చిన్నచెల్లెలు ఫోన్ చేసి ఏడుస్తోంది? వడ్డాణం కమిటీలో తనకు స్థానం కల్పించలేదని,తనను చిన్న చూపు చూస్తున్నా మంటోంది. చీరల కమిటీలో స్థానం కల్పించలేదని ఎదురింటి వనజొదిన మాట్లాడడం మానేసింది ’’ అంటూ భార్య ఏదో చెబుతూ పోతుంటే కమిటానందం సంతోషానికి అంతులేకుండా పోయింది. ఈ సంతోషాన్ని తన గురువుతో పంచుకోవాలనుకున్నాడు
***
నరక ప్రాయం అనుకున్న నా సంసారం ఒక్క మంత్రంతో స్వర్గంగా  మార్చేశారు అంటూ నల్లమల అడవుల్లో స్వామీజీ ముందు మోకరిల్లాడు.
గురువు గారూ ఈ కమిటీలను ఇంట్లో వాళ్లు ఎంత కాలం నమ్ముతారంటారు?
నమ్మక చస్తారా? పెళ్లి చేసుకున్న తరువాత కాపురం చేయాల్సిందే... నీకో రహస్యం చెప్పనా? కుటుంబానికైనా, ప్రభుత్వానికైనా తప్పించుకోవడానికి కమిటీలకు మించిన పరిష్కారం లేదు. 82లో ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తానంటే గెలిపించారు, ఐదేళ్లపాటు బియ్యం ఇచ్చిన తరువాత ఓడించారు. ఒక హామీని నెరవేర్చగానే జనం ఆ విషయం మరిచిపోయి మరోటి ఏమిస్తారని చూస్తారు. అందుకే ఏ హామీ నెరవేర్చకుండా కమిటీలతో కాలం వెళ్లదీస్తే ఢోకా లేదు. నేటి హామీలు ఏడేళ్లతరువాత అమలు అని చెబితే వచ్చే ఎన్నికల్లో విజయానికి మెట్లను నిర్మించుకున్నట్టు ఉంటుంది. హామీ నెరవేరిస్తే ఏముంటుంది? అంటూ మునీశ్వరుడు జ్ఞాన బోధ చేశారు. ఆనాటి నుంచి కుటుంబరావు కమిటానంద స్వామిగా ప్రఖ్యాతి పొందారు.


***
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు కమిటీలు వేశాయి అంటూ టీవిలో వార్తల శబ్దానికి మెలుకువ వచ్చింది. ఇప్పటి వరకు జరిగింది కలా నిజమా? అనే డైలమాలో పడిపోయాడు ఆదివారం ఆలస్యంగా లేచిన కుటుంబరావు...

27, జులై 2014, ఆదివారం

నట విశ్వవిద్యాలయం... సావిత్రి

  ఓ రాజుగారికి ఓ వింత అలవాటు. దేశంలో పెద్ద ఎత్తున తోట కూర పెంచుతూ అందరికీ పంచి పెట్టేవాడు. ఆయన నోటి నుంచి తరుచుగా వినిపించే మాట అంతకు ఇంతైతే, ఇంతకు ఎంత? అని. ఓ రోజు మంత్రిని అదే మాట అడిగాడు. ఆ ప్రశ్న ఉద్దేశం ఏమిటో చెబితే సమాధానం దొరుకుతుందని మంత్రి అన్నాడు.... అప్పుడు రాజు అసలు విషయం చెప్పుకొచ్చాడు. నాకు పూర్వజన్మ జ్ఞానం ఉంది. పూర్వజన్మలో నేను ఒక పేదవాన్ని. అయినా ప్రజలకు ఏదో దానం చేయాలనే కోరిక బలంగా ఉండేది. దాంతో పెరటిలో తోటకూర పెంచి అందరికీ పంచేవాన్ని ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో రాజును అయ్యాను. అంత తోటకూర పంచితే రాజును అయ్యాను. ఇప్పుడు ఎంతో మందికి తోటకూర దానం చేస్తున్నాను, ఈ పుణ్యం వల్ల ఏమవుతానో తెలుసుకోవాలని అంతకు ఇంతైతే, ఇంతకు ఎంత ? అని అడుగుతున్నాను అని రాజు చెప్పాడు. మంత్రి నింపాదిగా ఇంతకు ఇంతే అవుతారు అని సమాధానం చెప్పారు. ఎందుకలా అంటే మహారాజా! పేదవాడిగా ఉండి కూడా తోట కూర పెంచిన పుణ్యఫలం వల్ల రాజు అయ్యారు. రాజుగా ఉండి తోట కూర పంచడం పిచ్చితనం అవుతుంది రాజుగా మీరు చేయాల్సింది చాలా ఉంటుంది. తోట కూర పంచడం కాదు అని మంత్రి చెప్పిన సమాధానంతో రాజుకు జ్ఞానోదయం అయి తోటకూర దాన కార్యక్రమానికి స్వస్తిపలికారు. 

నిజంగా పునర్జన్మ జ్ఞానం ఉంటుందా? అని కాదు దానానికి సైతం వెనకా ముందు ఆలోచించుకోవాలని చెప్పడమే. ఉన్నదంతా దాన ధర్మాలు చేయడం సరైనది కాదు.. ఉన్నత స్థానంలో ఉండి తోట కూర దానం సరికాదు. మహానటి సావిత్రి జీవితాన్ని చూసిన సినిమా వారు చెప్పిన మాటల ప్రకారం దానాల విషయంలో సావిత్ర చేతికి ఎముక ఉండేది కాదు. ఆమె షూటింగ్‌లకు ఇంట్లోనుంచి బయట అడుగు పెట్టే సమయానికి సహాయం కోరి చాలా మంది వచ్చేవారు. చేతికి ఎంత వస్తే అంత సహాయం చేసేదట! ఇంతకూ సావిత్రి ఎవరు? అని అడిగే తెలుగువాడు ఉండడు అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఆమె మరణించి మూడు దశాబ్దాలు దాటింది. ఇప్పటికీ ఆమె ప్రభావం నేటి తరం నటీనటులపై అపారంగా ఉంది. నటన విషయంలోనే కాదు జీవితం విషయంలో కూడా
... 
ముందు చూపులేకపోతే జీవితం అంతిమ దశ ఎలా ఉంటుందో సావిత్రి జీవితాన్ని చూసిన వారికి జీవిత కాలం మరిచిపోలేని పాఠం అవుతుంది. మహానటి అనే మాటకు సార్ధకత చేకూర్చిన నటి సావిత్రి. నటన నేర్పేందుకు మాకు కళాశాలలులేవు, సావిత్రి నటనే మాకు నటనా పాఠాలకు విశ్వవిద్యాలయం అని వాణిశ్రీ ఒక సందర్భంలో సావిత్రి గురించి గొప్పగా చెప్పారు. నటన విషయంలోనే కాదు ఎలా జీవించాలి అనే విషయంలోనూ సావిత్రి జీవితం ఒక గొప్ప పాఠం. చేతికి ఎముక లేకుండా దానం చేసిన స్థితి నుంచి సావిత్రి అంతిమ కాలంలో చేతిలో ఏమీ లేని స్థితికి చేరుకున్నారు. ఆమె మరణం అత్యంత విషాదకరం. జీవితంలో మోసాన్ని, దగాను తట్టుకోలేని ఆమె దాదాపు రెండేళ్లపాటు కోమాలో ఆస్పత్రిలోనే మంచంపై గడిపి శాశ్వతంగా కన్ను మూశారు. నిర్మాతగా మారిన తరువాతనే ఆమె ఆర్థికంగా కృంగుబాటు ప్రారంభం అయింది. ‘‘నా దృష్టిలో సినిమా రంగంలో ముగ్గురు స్ర్తి శిల్పులు ఉన్నారు. ఒక ఓర చూపుతో, కనుబొమ ముడితో, పెదవి కదలికతో, చిరునవ్వుతో, తల తిప్పడంతో ఎలాంటి భావాన్నయినా ప్రదర్శించగల ఆ ముగ్గురు స్ర్తి శిల్పుల్లో ఇద్దరు తెలుగు వారే. మన సినిమా రంగంలోని ఆ మహిళా శిల్పులు జి. వరలక్ష్మి, సావిత్రి, హిందీ నటి మీనాకుమారి ’’ అంటూ మహాకవి శ్రీశ్రీ మహానటి సావిత్రి గురించి చెప్పిన మాట. కొమ్మారెడ్డి సావిత్రి డిసెంబర్, ఆరున 1937లో చిర్రావూరు గ్రామంలో జన్మించారు. సావిత్రికి ఆరునెలలు నిండాక తండ్రి నిశ్శంకరరావు టైఫాయిడ్‌తో మరణించారు. దాంతో సావిత్రి తల్లి సుభద్రమ్మ తన మకాంను విజయవాడలోని తన అక్క దుర్గాంబ ఇంటికి మార్చారు. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య. బహుశా బాల్యంలోనే తండ్రి మరణించడం, పెదనాన్న వారి ఇంటిలో పెరగడం వల్ల సావిత్రి అభద్రతా భావంతోనే అప్పటికే రెండు పెళ్ళిళ్లుచేసుకున్న జెమినీ గణేషన్‌ను పెళ్లి చేసుకొని ఉండవచ్చు. కానీ సావిత్రి జీవితానికి జెమినీ గణేషన్ ఏ మాత్రం భద్రత ఇవ్వలేకపోయారు. సావిత్రి నటి మాత్రమే కాదు నిర్మాత, దర్శకురాలు కూడా. మాతా పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి చిన్నారి పాపలు (1968) చిరంజీవి (69) వింత సంసారం(70) అనే సినిమాలను నిర్మించారు. మూగమనసులు సినిమాలో జెమిని గణేషన్‌తో కలిసి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నటనలో సావిత్రి మహానటి కానీ జీవితంలో మాత్రం నటించలేకపోయారు, నమ్మిన వారి చేతిలోనే ఘోరంగా మోసపోయారు. సినిమా రంగంలో వినిపించే దాని ప్రకారం... భర్తతో గొడవలు బయటకు అడుగు పెట్టక తప్పని పరిస్థితులు. బయటకు వచ్చాక కనీస భద్రత ఉంటుందని, కన్నడ నటుని భార్య వద్ద కొంత బంగారం దాచి పెట్టింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఆ నగల గురించి అడిగితే ఆ హీరో భార్య తన వద్ద ఎలాంటి నగలు దాచిపెట్టలేదని మహానటి షాక్ తినేంతగా నటించింది. ఆ తరువాత సావిత్రి కోలుకోలేక పోయారు. ఆ సమయంలో సావిత్రికి మంచి సలహాలు ఇచ్చే వారు ఉంటే ఆమె జీవితం అలా ఉండేది కాదని నిర్మాత కాట్రగడ్డ మురారి అంటారు. తెలుగు, తమిళ రెండు భాషల్లోనూ సినిమా రంగం ఆమెను మహానటి అని గౌరవించుకున్నాయి. అంత సంపద దానం చేసిన సావిత్రి అంతిమ జీవితం అలా గడిచిపోవాలా? బాగా సంపాదించినప్పుడు ఎంతో ఆదాయం పన్ను చెల్లించాను కదా ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు. నేను చెల్లించిన దానిలో కొంత వెనక్కి ఇచ్చే అవకాశం ఉందా? అని సావిత్రి ఒక దశలో విచారించారట! జీవితంలో తగిలిన దెబ్బలను, జరిగిన మోసాలను మరిచిపోవడానికి ఆమె మత్తును నమ్ముకున్నారు. 13 ఏళ్ల వయసులో నాటకాల్లో నటనకు శ్రీకారం చుట్టిన సావిత్రి 45ఏళ్లకే జీవితాన్ని ముగించారు. 
*** 
ప్రియాంక చోప్రా సినిమాల్లో, ప్రకటనల్లో రెండు చేతులా సంపాదిస్తున్న హీరోయిన్. ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఆరోజు చేసిన ఖర్చు లెక్క రాసుకుని చూసుకుంటాను. అందులో అనవసర ఖర్చు ఉందని అనిపిస్తే నాకు నేనే వార్నింగ్ ఇచ్చుకుంటాను అంటూ ఆమె ఈ మధ్య చెప్పుకొచ్చింది. సమంత చెన్నైలో ఒక స్టార్ హోటల్‌ను కొనుగోలు చేసింది. వీరద్దరే కాదు ఈ తరం వారంతా ఇలా ముందు చూపుతూనే ఉంటున్నారు. ఈ ఇద్దరూ సావిత్రిని చూసే అవకాశమే లేదు. సావిత్రి 1981లో మరణిస్తే, ఆమె మరణించిన ఐదారేళ్లతరువాత పుట్టిన వారు ఈ ఇద్దరు. కానీ సినిమా రంగంలో ముందు జాగ్రత్త లేకపోతే జీవితం ఎలా ముగుస్తుందో సావిత్రి జీవితం ఇలాంటి వారిపై తీవ్రమైన ప్రభావం చూపింది. సావిత్రి తెలియకపోయినా ఆమె జీవితం ఈ తరం సినిమా వారికి ఆర్థిక అంశాల్లో బలమైన పాఠంగా నిలుస్తోంది. సావిత్రి జీవితం సినిమా వారికే కాదు డబ్బుకు సంబంధించి అందరికీ ఒక పాఠం కావాలి. దానం చేయడం తప్పు కాదు.. అపాత్ర దానం తప్పు... అమాయకంగా అందరినీ నమ్మడం తప్పు. భవిష్యత్తు గురించి ఆలోచన లేకపోవడం ఆమె పాలిట శాపం గా మారింది 

20, జులై 2014, ఆదివారం

జీవితం హరిశ్చంద్రుని కథ కాదు..కత్తి పోరాటాల్లో గెలిచి జీవిత పోరాటం లో ఓడిపోయిన కాంతారావు

సత్యహరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పకూడదనే ఒకే ఒక నియమంతో మొత్తం రాజ్యాన్ని కోల్పోతాడు. కాటికాపరిగా మారుతాడు, రాజ్యాన్ని సర్వభోగాలను, భార్యా పిల్లను వదులుకోవడానికైనా సిద్ధపడతాడు కానీ సత్యసంధతను వదలడు. చివరకు దేవతలు సంతోషించి పూలవర్షం కురిపించి మరణించిన అతని కుమారున్ని తిరిగి బతికించి, వదులుకున్న రాజ్యాన్ని తిరిగి అప్పగించి నీ సత్యసంధతను పరీక్షించడానికి ఇలా చేశాం అంటారు. కథకు శుభం కార్డు పడుతుంది. ఇది సత్యహరిశ్చంద్రుని కథ. భారతీయ తొలి సినిమా ఇదే. రాజా హరిశ్చంద్ర సినిమా వచ్చి 101 ఏళ్లవుతుంది. తొలి భారతీయ సినిమా కథ ప్రభావం ఆ కాలం నాటి నటులపై బాగానే పడిందని, వారి జీవితాలను చూస్తేనే అర్ధమవుతుంది. అది సినిమా కథ కాబట్టి రాజ్యాన్ని సంపదను చిరునవ్వుతో వదులుకున్నా చివరకు దేవతలు ప్రత్యక్షమై పూలు చల్లి అతని సంపద అతనికి ఇచ్చేస్తారు. కానీ జీవితంలో అలా జరుగుందని నమ్మితే అది అమాయకత్వమే. ఒకసారి చేజారి సంపద తిరిగి చేతిలోకి రాదు.. ఎందుకంటే జీవితం సినిమా కాదు కాబట్టి.
***
తాడేపల్లి లక్ష్మీకాంతారావు ఉరఫ్ కత్తి కాంతారావు. అతనికి స్టూడియోలు లేవు, వారసులు హీరోలు కాదు అందుకే అతను ఈ తరానికి పెద్దగా గుర్తుండే అవకాశం లేదు, అవసరం లేదు.
సినిమా రంగంలోని రాజకీయాలకు బలైన జానపద హీరో అతను. ఒక్క సినిమా రంగంలోనే కాదు ఎక్కడైనా రాజకీయాలు ఉంటాయి. జీవిత యుద్ధం లో ఇవన్నీ సహజమే. అడుగడుగున అడ్డంకులు, కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. వాటిని తట్టుకుని నిలవాలి, ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోలేక బలైన వారి జీవితాలు ఇతరులకు తగిన హెచ్చరికలు జారీ చేస్తాయి. తాడేపల్లి లక్ష్మీకాంతారావు (కత్తి కాంతారావు) నల్లగొండ జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో 1923 నవంబర్ 16న జన్మించారు. గుడిబండలో జన్మించిన దగ్గరలోనే ఉన్న కృష్ణా జిల్లాలోని గ్రామంలో జన్మించినట్టుగా చెప్పుకునే వాడినని తాను హీరోగా నటించిన వందవ చిత్రం వచ్చే వరకు తాను తెలంగాణలో జన్మించాననే విషయం బయటపడలేదని చివరి దశలో ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు.


ధర్మరాజు లాంటి జ్ఞాని కూడా జూదంలో ఇంకోసారి ప్రయత్నిద్దాం ఇంకోసారి ప్రయత్నిద్దాం అనుకుంటూ చివరకు భార్య ద్రౌపదిని సైతం పందెం కాశాడు.
సినిమా వారిలో సైతం ఇలాంటి జూద లక్షణం బాగానే ఉంటుంది. సినిమాల్లో నిండా మునిగిపోయిన తరువాత ఇక శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదామని నిర్ణయించుకున్న సమయంలో సైతం ఆయన్ని దురదృష్టం వెంటాడింది. 1969 నుంచి 74 వరకు తెలుగు సినిమా రంగాన్ని జానపథ సినిమాలు ఒక ఊపు ఊపాయి. జానపద బ్రహ్మగా పేరు పొందిన విఠలాచార్య శకం అది. ఆయన దర్శకులు కాంతారావు హీరో.. ఇద్దరూ సినిమా రంగాన్ని ఏలేశారు.

ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు రెండు కళ్లు అంటారు. కానీ ఆ కాలంలో రెండు కళ్లలో ఒక కన్నుగా గుర్తింపు పొందే స్థాయిలో కాంతారావు నిలిచారు.. క్రమంగా సినిమా రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్న కాలం ఆ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి ఉంటే కాంతారావు సురక్షితంగా బయటపడేవారు. ఏటికి ఎదురీదాలని అనుకున్నారు. ఒకరిద్దరు హీరోల కోసమే సినిమా రంగం అన్నట్టుగా సినిమా రాజకీయాలు మారడంతో సొంతంగా సినిమా నిర్మాణం చేపట్టారు. సప్తస్వరాలు, గండర గండడు, ప్రేమజీవులు, గుండెలు తీసిన మొనగాడు సినిమాలు నిర్మించారు. కొన్ని సినిమాలు నడిచాయి, కొన్ని దెబ్బతీశాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంతారావు సినిమా విడుదలకు సిద్ధమైంది. తెలంగాణ వాడి సినిమా చూస్తారా? నా సినిమా చూస్తారా? అంటూ ఓ పెద్దాయన విమర్శ మొదలు పెట్టారు. చివరకు ఇద్దరి సినిమాలూ నడవలేదు, కానీ నేను దెబ్బతిన్నాను అని ఓ ఇంటర్వ్యూలో కాంతారావు చెప్పుకొచ్చారు. ఉన్నదంతా ఊడ్చి పెట్టుకు పోయిన తరువాత మద్రాస్‌లోని ఇంటిని అమ్మేసి హైదరాబాద్‌లో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని 1980 ప్రాంతంలో నిర్ణయించుకున్నారు. ఇంకొక్కసారి ప్రయత్నించి చూద్దాం నీ జీవితం నిలబడుతుంది అనే మాట వినిపించింది. ధర్మరాజుకు సైతం జూదమాడేప్పుడు ఇదే మాట వినిపించింది. విన్నాడు ద్రౌపదిని పందెం కాశాడు. కాంతారావు ఆ మాట విన్నాడు ఇంటిని అమ్మి స్వాతిచినుకులు తీశాడు. హీరోయిన్‌గా వాణిశ్రీ శకం ముగిసింది. ఆ విషయాన్ని వాణిశ్రీ, కాంతారావు ఇద్దరూ గ్రహించలేదు. స్వాతిచినుకులు తీశారు. కాంతారావుకు ఏదో మంచే చేయాలని ఆమె అనుకుని ఉండొచ్చు కానీ ఆ సినిమాతో కాంతారావు చిల్లిగవ్వలేని స్థితికి చేరుకున్నారు.

సినిమాల్లో మెరుపు వేగంతో కత్తిని తిప్పుతూ శత్రువులను హడలెత్తించిన ఆ రాజకుమారుడు జీవిత పోరాటంలో ఓడిపోయాడు..... చివరి క్షణం వరకు మేకప్ వేసుకొనే ప్రాణాలు వదలాలనేది నా జీవిత లక్ష్యం అంటూ రొటీన్ డైలాగులు ఎన్ని చెప్పినా రంగు వేసుకుంటేనే ఇంట్లో గడుస్తుంది అనేది మాత్రం నిజం. సినిమా, సీరియల్స్‌లో చిన్నా చితక పాత్ర ఏదైనా ఒప్పుకున్నారు. ఈ దశలో ఒక ఇంగ్లీష్ పత్రికాయనకు కాంతారావును ఇంటర్వ్యూ చేయాలనే బుద్ధి పుట్టింది. ఇంటర్వ్యూ ముగిశాక భారీ నిర్మాణ వ్యయంపై పిచ్చాపాటి ముచ్చట సాగింది. చిరంజీవి పారితోషికంపై చర్చ ఎందుకంటే హీరోలకు కోట్లు ఇవ్వడం.. నిర్మాణ వ్యయం పెరిగిందని బాధపడడం అంటూ అనుభవజ్ఞునిలా ఓ మాట అన్నారు. ఇంటర్వ్యూ చేసినాయన అన్నీ వదిలేసి హీరోల రెమ్యూనరేషన్‌పై నారదునికి కోపం వచ్చిందని రాశాడు. అంతే అప్పటి వరకు ఏదో ఇంట్లో గడవడానికి సానుభూతితో ఇచ్చిన పాత్రలు కూడా రద్దయ్యాయి. మీకు పాత్ర ఇచ్చి పెద్దవారికి కోపం తెప్పించలేమని చెప్పి తప్పించారు.
 
వందల ఎకరాలను దానం చేసిన, ఎంతో మందికి సహాయం చేసిన ఆయనకు చివరకు హైదరాబాద్‌లోని సినిమా వాళ్ల హౌసింగ్ సొసైటీలో ఓ ప్లాట్ కూడా దక్కలేదు. రాజకుటుంబం అజ్ఞాత వాసం చేస్తున్నట్టుగా ఆయన కుటుంబం నల్లకుంటలో తలదాచుకుంటోంది. కాంతారావు మరణించిన తరువాత కోదాడలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసిన నాయకులు ఆ విషయం మరిచిపోయారు. రాజకుమారుడు అంటే ఇలా ఉండాలనిపించే రూపం. అలాంటి రాజకుమారుని అంతిమ దశ, ఆ కుటుంబం ప్రస్తుత పరిస్థితి... ఆర్థిక వ్యవహారాల్లో ఎంతటి వారికైనా గొప్ప పాఠంగా నిలిచిపోతుంది. వృక్షోరక్షిత రక్షితః అన్నట్టుగా డబ్బును నువ్వు కాపాడుకుంటే డబ్బు నిన్ను కాపాడుకుంటుంది అని ఎలుగెత్తి చాటాలనిపిస్తుంది. 
చివరి సీన్‌లో సత్యహరిశ్చంద్రుని ముందు దేవతలు ప్రత్యక్షం అయినట్టు నిజ జీవితంలో ప్రత్యక్షం కారు. నాలుగు వందల సినిమాల్లో నటించిన కత్తివీరుడు జీవిత పోరాటంలో ఓడిపోయాడు.

13, జులై 2014, ఆదివారం

పాతాళభైరవి: సినిమాలో రాజకుమారి .. జీవితం లో పేద కుమారి


ఓ పేద యువకుడు చాలెంజ్ చేసి సంపన్నుడు అవుతాడు. కూడు, గుడ్డ లేనివాడు చాలెంజ్ చేసి కోట్లు గడిస్తాడు. ఇది సినిమా కథ. సామాన్యులను రెండున్నర గంటల పాటు ఊహాప్రపంచంలోకి తీసుకు వెళ్లి నిద్ర పుచ్చే సినిమా కథ. ఇలాంటి కథ చూసేందుకైనా, చదివేందుకైనా బాగుంటుంది. కానీ జీవితం సినిమాలా ఉండదు.
అంత కన్నా ఎక్కువ మలుపులు ఉంటాయి. అన్ని మలుపులు మనకు నచ్చాలని లేదు. సినిమా కథ మలుపుల్లో సామాన్యుడు సంపన్నుడైతే, నిజ జీవిత కథలో రాజకుమారి పేద కుమారిగా మారిపోవచ్చు.
***
పాతాళభైరవి సినిమా గుర్తుందా?
‘‘సినిమానే కాదు డైలాగులు కూడా గుర్తున్నాయి. సాహసం సేయరా డింభకా రాజకుమారి లభించునురా! కథ చెప్పమంటావా? డైలాగులు విసరమంటావా? ఎన్టీఆర్ నటన గురించి చెప్పాలా? ఎస్వీఆర్ డైలాగుల గురించి చెప్పనా? అనే సమాధానం వినిపిస్తుంది తెలుగు సినిమా ప్రేమికున్ని ఎవరిని ప్రశ్నించినా..’’ తెలుగులో ఆద్భుతమైన ఐదు సినిమాల పేర్లు చెప్పమని మరో ఐదు దశాబ్దాల తరువాత అడిగినా ఆరు దశాబ్దాల క్రితం వచ్చిన పాతాళభైరవి పేరు అందులో కచ్చితంగా ఉండి తీరుతుంది. ఆ సినిమాల్లో నటించిన హేమాహేమీల్లో ఇప్పుడు ఒక్కరు కూడా సజీవంగా లేరు. కానీ వారంతా చెరగని ముద్ర వేసి వెళ్లారు.
రాజుగారి తోటలో పని చేసే ముసలమ్మ కుమారుడు తోటరాముడు. అప్పుడప్పుడు తోటలోకి వచ్చే రాజకుమారిపై తోటరాముడు మనసు పడ్డాడు. తోటలో పని చేసే తోటరాముడేమిటి? రాజకుమారిపై మనసు పడడం ఏమిటి గమ్మత్తుగా ఉంది కదూ! అది సినిమా సినిమాలో ఏమైనా జరుగుతుంది. ఆ సినిమాలో తోట రాముడుగా నటించిన ఎన్టీఆర్, నేపాళ మాంత్రికుడిగా నటించిన ఎస్వీ రంగారావు, రేలంగి, పద్మనాభం లాంటి వారందరూ మనకు గుర్తున్నారు. రాజకుమారి గుర్తుందా?
రాజకుమారిగానే గుర్తుకొస్తుందేమో కానీ ఆమె గురించి అంతగా తెలియదు.
రాజకుమారి ఎంత అందంగా ఉంటే తోటరాముడు తన ప్రాణాలకు తెగించి మాంత్రికున్ని సైతం సంహరించాలని బయలు దేరుతాడు. వెంట్రుకతో కొండను లాగాలనే ప్రయత్నమే కదా? ఏకంగా నేపాళ మాంత్రికుడి గుహలోకే వెళ్లి తెలివి, సాహసాలను కలగలిపి మాంత్రికునే్న సంహరించి పాతాళభైరవి అనుగ్రహం పొంది రాజకుమారిని పెళ్లి చేసుకుంటాడు. తోటరాముడిలో ఇంతటి సాహసాన్ని ప్రేరేపించిన ఆ రాజకుమారి ఎంత అందగత్తె అయి ఉండాలి. పాతాళభైరవిలో రాజకుమారిగా నటించిన కె మాలతి నిజంగానే మంచి అందగత్తె.
కానీ చాలా మంది పాత తరం నటుల వలెనే దురదృష్టవంతురాలైన అందగత్తె. ఆమె దాదాపు 20 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. దాదాపు అన్నీ హిట్టయిన సినిమాలే.. 1940లో వచ్చిన సుమంగళి ఆమె మొదటి చిత్రం కాగా, 1979లో వచ్చిన శ్రీతిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చివరి చిత్రం. తొలి తరం అందమైన హీరోయిన్ అయిన కె మాలతిని చాలా మందిలానే దురదృష్టం వెంటాడింది.
***
ఒక ఇంటర్వ్యూలో హిందీ నటి రేఖ తన జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపిన ఒక సంఘటన గురించి వివరించింది. నటి రేఖ తల్లి పుష్పవళ్లి పాత తరం తెలుగు, తమిళ నటి. జెమినీగణేషన్, పుష్పవళ్లి కుమార్తెనే రేఖ.
ఒకసారి పుష్పవళ్లి ఇంటికి ఆమె స్నేహితురాలు వచ్చి చాలా సేపు మాట్లాడి వెళ్లింది. ఆమె తిరిగి వెళ్లేప్పుడు పుష్పవళ్లి కొన్ని దుస్తులు కూడా ఇచ్చింది. ఆమె వెళ్లిపోయిన తరువాత తల్లిని రేఖ అడిగింది. ఎవరామె అని
పుష్పవళ్లికి ఎలా చెప్పాలో అర్ధం కాలేదు.... తన సహ నటి అంటూ... వివరంగా చెప్పుకొచ్చింది. మాలతి.. పాతాళభైరవిలో రాజకుమారిగా నటించిన మాలతి అంటూ చెప్పింది.
***
ఏం జరిగిందో మాలతి పరిస్థితి ఇలా ఎందుకైందో తెలియదు కానీ సినిమాల్లో ఆమెను చూసిన ప్రేక్షకులు మైమరిచిపోతే తెర వెనుక అంతిమ దశలో ఆమె జీవితాన్ని చూసిన వారు చలించి పోయారు. ఆప్రమత్తంగా లేకపోతే రేపు మన జీవితం కూడా అంతేనా? అని వణికిపోయారు.
ఒక్క మాలతి అనే కాదు తొలి తరం నటీనటుల్లో చాలా మంది పరిస్థితి ఇంతే. నటనలో లీనమైపోయిన చాలా మంది వ్యక్తిగత జీవితాన్ని మరిచిపోయారు. కళల ప్రపంచంలో మునిగిపోయి వాస్తవిక ప్రపంచాన్ని మరిచిపోయారు. ఒక లోకం నుంచి మనిషి మరో లోకంలో అడుగు పెడితే ఎలాంటి అయోమయంలో పడిపోతాడో? ఎంత భయపడతాడో చాలా సినిమాల్లో సినిమా వాళ్లు చాలా చక్కగా చూపించారు.
ఒకప్పుడు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన వారు అవకాశాలు తగ్గినప్పుడు కళల ప్రపంచం నుంచి వాస్తవిక ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు సరిగ్గా ఇలాంటి ఆయోమయంలోనే పడిపోతారు. సినిమాల్లోనే కాదు ఏ వృత్తిలో ఉన్నా వృత్తి వేరు జీవితం వేరు అని గుర్తుంచుకోవాలి. ఉద్యోగికి 58 రిటైర్‌మెంట్ వయసు . 

నటీనటులకు అవకాశాలు ఎప్పుడు తగ్గితే అప్పుడే రిటైర్‌మెంట్. స్టూడియో నుంచి బయటకు వెళ్లిన తరువాత మరో జీవితం ఉంటుందని, సినిమాల్లో అవకాశాలు తగ్గిన తరువాత సొంత జీవితం ఉంటుందని ఒక వెలుగు వెలుగుతున్న కాలంలోనే గుర్తుంచుకుంటే భవిష్యత్తు జీవితానికి ఢోకా ఉండదు. చివరకు చీమ కూడా ఆహారం దొరికిన కాలంలోనే భవిష్యత్తు కాలంపై దృష్టిపెడుతుంది. అవకాశాలు దక్కిన కాలంలోనే, సంపాదిస్తున్న కాలంలోనే భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఏదీ శాశ్వతం కాదు. కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా ఎప్పుడూ ఇలానే ఉండం కాలం మారుతుందనే విషయం గ్రహించాలి. మారే కాలానికి మంచి కాలంలోనే పునాదులు వేసుకోవాలి. రాజకుమారిగా మహోజ్వలమైన జీవితాన్ని గడిపిన చోటే అవకాశాలు దక్కని కాలంలో భారంగా బతికిన వారి జీవితాలు ఇతరులకు ఆర్థిక వ్యూహంలో జాగ్రత్తలు చెబుతాయి.

7, జులై 2014, సోమవారం

ఆ హీరో జీవితమే సందేశం

పెద్దింటి అబ్బాయి పేదింటి అమ్మాయి ప్రేమించుకుంటారు. మా అంతస్థెక్కడ మీ అంతస్థెక్కడ అని పెద్దింటి అబ్బాయి తండ్రి పేదింటి అమ్మాయి తండ్రిని నిలదీస్తాడు. బాబు గారు కులానికి పేదవాళ్లం కావచ్చు కానీ గుణానికి పేదవాళ్లం కాదు బాబు మీ పెద్దొళ్ల శరీరంలో ప్రవహించేది రక్తమే మా పేదోళ్ల శరీరంలో ప్రవహించేది రక్తమే అంటూ ఆ ముసలి తండ్రి ఆయసంతో దగ్గుతూ డైలాగులు చెబుతాడు. మనసులేని ఇలాంటి వాళ్లను ఎంత బతిమిలాడినా వారు కరగరు నాన్నా వాళ్లకు మనుషులు, మానవత్వం కన్నా డబ్బే ముఖ్యం అంటూ పేదింటి అమ్మాయి తన వంతు డైలాగులు వినిపిస్తుంది. చివరకు ఆ పెద్దింటి ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. మనిషికి కావలసింది డబ్బు కాదు, మనను ప్రేమించే మనుషులు అని తెలుసుకున్నాను, నా కళ్లు తెరిపించారు అంటూ ఆ పెద్దింటాయన వారిద్దరి పెళ్లి జరిపిస్తాడు. 

చాలా సినిమాల్లో కనిపించే దృశ్యమిది. డబ్బు ముఖ్యం కాదు అని ఎన్ని సినిమాల్లో ఎంత మంది రచయితలు ఎన్ని పాత్రలతో చెప్పించినా అది నిజం కాదు. డబ్బు అన్నీ సమకూర్చకపోవచ్చు కానీ ఏది కావాలన్నా డబ్బు కావలసిందే. డబ్బు లేకుండా దొరికేవి కొన్ని ఉండొచ్చు కానీ చాలా అవసరాలకు మాత్రం డబ్బు కావలసిందే. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే కాకపోవచ్చు కానీ చాలా సంబంధాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. డబ్బుకు ఏమాత్రం విలువ లేదని చాటి చెప్పే సినిమా ను తీయాలన్నా బోలెడు డబ్బు కావాలి. డబ్బుకు విలువ లేదని డైలాగులు రాసే రచయిత డబ్బు కోసమే ఆ పని చేస్తాడు. డబ్బు ముట్టిన తరువాతే హీరో ఆ డైలాగులు చెబుతాడు.... డబ్బుచెల్లించి సినిమా చూసే మనలాంటి సగటు ప్రేక్షకుడు మాత్రం జీవితంలో డబ్బుకు విలువ లేదని ఎంత చక్కగా చెప్పారు అని ఆలోచిస్తూ ఖాళీ అయిన జేబులతో దియోటర్ నుంచి ఇంటికి వెళ్లాలి. అన్నింటికీ డబ్బు కావలసిందే. మనిషికి డబ్బు జబ్బు ప్రమాదకరమే కావచ్చు కానీ డబ్బు లేకుండా జబ్బులు వస్తే మనిషి జీవితం మహా ప్రమాదంలో పడ్డట్టే.


సినిమా కథల్లో డబ్బు విలువ గురించి చాలా తక్కువగా చెప్పినా చాలా మంది సినిమా వాళ్ల వాస్తవ జీవితాలు డబ్బు విలువను చాటి చెప్పే విధంగా ఉంటాయి. నా జీవితమే నా సందేశం అంటూ మహాత్మాగాంధీ తన ఆత్మకథ రాసుకున్నారు. ఒక రకంగా చిత్తూరు నాగయ్య జీవితానికి సైతం ఈ ట్యాగ్ బాగా సరిపోతుంది.


తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన తొలి సూపర్ స్టార్. అత్యధిక పారితోషకం తీసుకున్న నటుడు. 1948 అంటే మహామహానటులే నెలకు మూడు వందలు నాలుగు వందల రూపాయల జీతంతో సినిమాల్లో నటించిన కాలం అది. ఆ సమయంలో చిత్తూరు నాగయ్య తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా? సరిగ్గా లక్ష రూపాయలు. అంటే ఆ కాలంలో ఒక సినిమాకు చిత్తూరు నాగయ్య తీసుకున్న పారితోషికంతో మద్రాసులోనో, హైదరాబాద్‌లోనూ కొన్ని వందల ఎకరాల భూములు వచ్చేవి. చిత్తూరు నాగయ్య అదే చేసి ఉంటే ఇప్పుడాయన ఆస్తి కొన్ని వేల కోట్ల రూపాయలు అయ్యేది. అలా చేయలేదు కాబట్టి స్వయంగా ఆయనే చివరి దశలో అపాత్రదానం చేయవద్దు. నా జీవితం మీకు ఒక పాఠం కావాలి అని హితవు పలికారు తప్ప తన పరిస్థితికి ఎవరినీ నిందించలేదు. 1948లో లక్ష రూపాయల పారితోషికం తీసుకున్న ఆ మహానటుడు. అవసాన దశలో 1970 ప్రాంతంలో కేవలం కడుపు నింపుకోవడానికి వందల రూపాయల పారితోషికానికి సినిమాల్లో చిన్నా చితక వేషాలు వేస్తూ, అద్దె ఇంటిలో నివసించారు. ఇప్పటి హీరోలు విలన్ల కన్నా ఎక్కువ బీభత్సం సృష్టిస్తున్నారు. చిత్తూరు నాగయ్య హీరోగా వచ్చిన కాలంలో అన్ని సాధు పాత్రలే... ఆ పాత్రల ప్రభావం సినిమా షూటింగ్ వరకే ఉంటే బాగుండేది. కానీ ఆయన జీవితంపై సైతం ప్రభావం చూపించాయి. పోతన పాత్రలో జీవించిన ఆయన ఆయన లానే ధాన ధర్మాలు చేస్తూ పోయారు. రామదాసు సినిమాతో బాగా నష్టపోయారు. దానికి తోడు దాన ధర్మాలకు అంతు లేదు. ఆయన స్టూడియో నిత్యాన్న దాన సత్రంగా వెలుగొందేది. 1938 నుంచి 1973 వరకు చిత్తూరు నాగయ్య దాదాపు రెండువందల సినిమాల్లో నటించారు. భక్తపోతన, రామదాసు, యోగివేమన, త్యాగయ్య అని నటించిన చిత్రాల్లో ముఖ్యమైనవి. ఈ సినిమాల ప్రభావం నాగయ్యపై బాగా పడింది. 

వాస్తవిక జీవితంలో అందులోనూ సినిమా రంగంలో నమ్మించి మోసం చేసేవారు ఎలా ఉంటారో, విజయం దక్కినప్పుడు కాటేసే పాములు ఎలా పొంచి ఉంటాయో ఆ సాధు స్వభావి గ్రహించలేకపోయారు. అంతా అయిపోయిన తరువాత ఇక్కడ గోముఖంతో ఉండే పులులు చాలా ఉన్నాయని వాటితో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే ఆయన వద్ద ఏమీ మిగలలేదు. 1947లో నాగయ్య నటించిన యోగివేమన నటించిన సినిమా చూసి ముమ్మడివరానికి చెందిన బాలుడు బాలయోగిగా మారారు. తెలుగునాట తొలి తరం హీరో, సంగీత కర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆ కాలంలో ఎంతో పేరు గడించారు. దక్షిణ భారత దేశంలో పద్మశ్రీ అవార్డు పొందిన తొలి హీరో. చిత్తూరు నాగయ్య జీవితం సినిమా వారికే కాదు సంపాదనపై అవగాహన కలిగించడానికి, సంపాదించిన డబ్బును జాగ్రత్త చేసుకోకపోతే భవిష్యత్తు జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి చిత్తూరు నాగయ్య జీవితం ఏ కాలం వారికైనా ఏ రంగం వారికైనా ఒక పాఠంగా ఉపయోగపడుతుంది.
చిత్తూరు నాగయ్య తన తరువాత తరం వారికి నటనలోనే కాదు సంపాదన, జాగ్రత్తలపై కూడా తన జీవితం ద్వారా చాలా బలంగా పాఠం నేర్పించారు. ఈ తరం సినిమా వాళ్లు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండేందుకు ఇలాంటి వారి జీవిత చరిత్రలే కారణం. ఈ పాఠాలు సినిమా వారికే కాదు అందరికీ ఉపయోగకరమైనవే.

1, జులై 2014, మంగళవారం

నెల రోజుల తెలంగాణ అస్తిత్వ పాలన

ఐదేళ్లపాటు అధికారంలో ఉండే ప్రభుత్వానికి నెల రోజులు అంత ప్రధానమైన అంశం  కాకపోవచ్చు. 60 నెలల పాటు ప్రజలు అధికారం అప్పగించినప్పుడు మొదటి నెలలోనే ఒక అభిప్రాయానికి ఎలా వస్తామని అనిపించచ్చు. కానీ ఇది ఒక నెల రోజుల ప్రభుత్వ పాలన మాత్రమే కాదు. కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రం నెల రోజుల నడక. అందుకే ఈ నెల రోజుల ప్రభుత్వ తీరు బేరీజు వేసుకోవడం తెలంగాణకు అవసరం. కాళ్లు కడిగినప్పుడే కొత్త కోడలు కాపురం చేసే తీరు తెలుస్తుందన్నట్టు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం పని తీరును అంచనా వేయాల్సిందే. 
తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఎన్నికల హామీల్లో ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని అమలు పరచలేదు. భారీగా ప్రభుత్వంపై భారం పడే ఆ పథకాల అమలు ఒకటి రెండు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు కావు. దానికి కొంత సమయం పడుతుంది. నిధుల అవసరం పడుతుంది. సాధారణ కుటుంబం కొత్త ఇంట్లోకి మారినప్పుడు కొత్త ఇంటికి అలవాటు పడేందుకైనా నెల రోజులకు పైగానే సమయం పడుతుంది. అలాంటిది కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికే కొంత సమయం పడుతుంది. అలాంటిది హామీలను అమలు చేయలేదని నెల రోజులకే విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. జూన్ రెండవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన నెల రోజుల పాలనలో తెలంగాణ అభిమానుల, తెలంగాణ వాదులను సంతృప్తి పరిచారనే చెప్పవచ్చు. 

భారీ పథకాలేమీ ప్రకటించలేదు, భారీగా నిధులేమీ తేలేదు, భారీ హామీలేమీ ఇంకా అమలు పరచలేదు. అయినా తెలంగాణ ముద్రతో సాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి పాలన తెలంగాణ వాదులను సంతృప్తి పరిచేట్టుగానే ఉంది.

ఏ వాదనతో తెలంగాణ ఉద్యమం సాగిందో, అధికారంలోకి వచ్చిన తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆ వాదనను ఆచరణలో పెడుతున్నట్టుగానే నెల రోజుల పాలన సాగింది. సాధారణ సమయంలో ధరలు తగ్గడం, పెరగడాన్ని బట్టి ప్రభుత్వ పనితీరుపై ఒక అంచనాకు వచ్చే వారు ఉంటారేమో కానీ, ఇక్కడ ఆ సూత్రం వర్తించదు. పన్నులు పెంచడం, ధరలు పెరగడం, తగ్గడం ఏ ప్రభుత్వంలోనైనా సహజమే. నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే ధరలు పాతాళంలోకి పడిపోతాయని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆకాశంలోకి దూసుకెళతాయని అనుకునే వారు ఉంటే ఉండవచ్చు. కానీ ఈ విషయంలో ప్రభుత్వ పాత్ర స్వల్పమే, ఇతర అంశాలే కీలక పాత్ర వహిస్తాయి.
ఇలాంటి సాధారణ అంశాలు ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్రంపైన తెలంగాణ ప్రజలు ఎలాంటి ఆశలు పెట్టుకున్నారో సరిగ్గా గ్రహించి కెసిఆర్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు నెల రోజుల పాలనతో అనిపిస్తోంది.
తెలంగాణ ఉద్యమం ప్రధానంగా ఆస్తిత్వ పోరాటం. తమ సంస్కృతి, తమ యాస, భాషను అవహేళన చేస్తున్నారని, మాయం చేస్తున్నారనే బాధ నుంచి పుట్టిన ఉద్యమం ఇది. కెసిఆర్ తన నెల రోజుల పాలనలో ప్రధానంగా తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అది పివి నరసింహారావు జయంతిని అధికారికంగా నిర్వహించడం కావచ్చు. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం కావచ్చు. ఇవి కొందరికి చిన్న విషయాలుగా కనిపించవచ్చు. పుట్టినప్పటి నుంచి ఊపిరి విడిచే క్షణం వరకు కాంగ్రెస్‌లోనే ఉన్న పివి నరసింహారావును కెసిఆర్ గుర్తించిన తీరు తెలంగాణ సమాజం మొత్తం ఉద్వేగానికి గురయ్యేట్టు చేసింది. ఈ రాష్ట్రంలో ఎంతో మంది జయంతులు, వర్ధంతులు ఒక తంతుగా నిర్వహించడం చూశాం. పివి నరసింహారావు జయంతి వేడుకలకు కొన్ని కోట్ల రూపాయలేమీ ఖర్చు చేయలేదు. సాదాసీదాగానే చేశారు. 

చాలా సంతోషంగా ఉన్నప్పుడు సగటు తెలంగాణ వ్యక్తి కడుపు నిండినట్టుగా ఉంది అంటారు. పివి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన కుమార్తె వాణి సభలో అందరినీ చూస్తూ ఉద్వేగానికి గురై కడుపు నిండినట్టుగా ఉందని పలకడం అందరినీ కట్టిపడేసింది. తెలంగాణ అనే పదానే్న అసెంబ్లీలో పలక రాదు అనే ఆంక్షలను చూసిన తెలంగాణ సమాజం తమ వాడిని తాము గౌరవించుకోవడం చూసి నిజంగానే ఉద్వేగానికి గురైంది. మన కట్టుబొట్టు తెలియని వారు ఇంత కాలం అధికారంలో ఉండడం వల్ల పివికి తగిన గౌరవం ఇవ్వలేదని, ఇంత కాలానికి మన రాష్ట్రంలో, మన ప్రభుత్వం వచ్చింది పివిని గౌరవించుకుంటోంది అంటూ పివి కుమార్తె చెప్పిన మాటలు సగటు తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిప్రాయం.
కారణాలు ఏమైనా కావచ్చు, రాజకీయాలు ఏమైనా కావచ్చు. పివి నరసింహారావుకు లభించాల్సిన గౌరవం అప్పటి పాలకులు ఇవ్వలేదు. ఒక పోలీసు అధికారి తన విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే భాగ్యనగరంలో భారీ విగ్రహాన్ని నిర్మించారు. మంచిదే వారి సేవను గుర్తించి, విగ్రహం నిర్మించాలనే ఆలోచన వచ్చిన పాలకులకు అప్పుల్లో కూరుకుపోయిన దేశాన్ని సంక్షోభ సుడిగుండం నుంచి పైకి తీసుకు వచ్చిన నాయకుడి విగ్రహాన్ని నిర్మించాలనే ఆలోచన రాకపోవడం ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. పివి నరసింహారావు టిఆర్‌ఎస్ అభిమాని కాదు... కేసిఆరే సభలో చెప్పారు తనకు పివితో వ్యక్తిగతంగా సంబంధం లేదని. కానీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన మహానేతగా పివిని సముచిత రీతిని గౌరవించుకోవడం తెలుసు అని కేసిఆర్ చేసి చూపించారు. ప్రతి అంశాన్ని ఓట్ల లెక్కలతోనే చూసేవారు ఆ లెక్కల్లో భాగంగానే పివికి సముచిత గౌరవం ఇవ్వలేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు బాబ్రీ మసీదు కూల్చారు. ఆయనకు గౌరవం ఇస్తే మైనారిటీల ఓట్లు రావు. ఇదీ వారి లెక్క. త్వరలోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. మజ్లీస్ పార్టీతో టిఆర్‌ఎస్ స్నేహాన్ని కోరుకుంటోంది. అదే సమయంలో దేశాన్ని గట్టెక్కించిన పివి గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు కెసిఆర్ ఓట్ల లెక్కలకు భయపడలేదు. 

తమ పట్ల తామే ఆత్మన్యూనతకు గురయ్యేట్టు చేయడం ఆధిపత్యం చెలాయించే వాడి లక్షణం. దీనికి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా ఆ ఆత్మన్యూతనను సంప్రదాయంగా కొనసాగించాల్సిన అవసరం లేదు. మన జాతి రత్నాలను మనం గౌరవించుకుందాం. మన సంస్కృతి ఔన్నత్యాన్ని మనం చాటి చెప్పుకుందాం అనే ధోరణితోనే కెసిఆర్ మొదటి నెల రోజుల పాలనలోనే నిర్ణయాలు నిర్ణయాలు తీసుకున్నారు. బోనాల పండుగకు ప్రభుత్వం పాతిక లక్షలు విడుదల చేసింది, పివి జయంతి వేడుకలకు అంత కన్నా కొంచం ఎక్కువో తక్కువో ఖర్చయి ఉంటుంది. ఇక్కడ నిధుల విషయం కాదు. ఇది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం, అధికారంలో ఉన్నది తెలంగాణ పార్టీ అని కెసిఆర్ తన చర్యల ద్వారా చాటి చెప్పారు. 

నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో జరిగిన అన్యాయం ఎలా ఉన్నా, వాటిని కొనసాగనిచ్చేది లేదనే గట్టి సంకేతాలు పంపుతూనే సాంస్కృతికంగా తెలంగాణ ముద్రను బలంగా వేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం ఒక్కటే ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకు వెళ్లలేదు. ఈ మూడింటిలో తెలంగాణకు జరిగిన అన్యాయాలపై కమిటీల నివేదికలు ఉన్నాయి, కళ్ల ముందు కనిపిస్తున్నాయి. కానీ ఉద్యమంలో ఈఅంశాలు కీలక పాత్ర వహించి ఉండవచ్చు, కానీ ఉద్యమానికి ఈ మూడు అంశాలు మాత్రమే కారణం కానే కాదు.
నిధుల కోసమే అయితే కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తుంది, సమైక్య రాష్ట్రానికి ఒప్పుకోండి అనేవారు. నియామకాలే కారణం అయితే ఎక్కడో అమెరికాలో మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అంటూ దూకేవారు కాదు. తెలంగాణ వ్యక్తి ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ ఉద్యమంతో ఏదో ఒక రూపంలో పాలు పంచుకున్నాడు. నిధులు, నియామకాల కోసమే అయితే పాశ్చాత్య దేశాల్లో హాయిగా జీవిస్తున్న వ్యక్తి ఎందుకు స్పందిస్తాడు. ప్రధానంగా ఆస్తిత్వ పోరాటం కాబట్టే సకల జనులు ఉద్యమంలో భాగస్వామ్యం వహించారు. ఇప్పుడా సకల జనులు సంబరపడే విధంగా తెలంగాణ పాలనలో తెలంగాణ ముద్రను చూపేందుకు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రయత్నిస్తున్నారు.
కొంత మందికి మంత్రి పదవులు, కొందరికీ నామినేటెడ్ పదవులు, అధికారం ఒక వర్గం చేతి నుంచి మరో వర్గం చేతిలోకి రావడం కోసమే తెలంగాణ ప్రజలు ఉద్యమించలేదు. తెలంగాణ ఆస్తిత్వాన్ని చూపించేందుకు ఉద్యమించారు. దీన్ని కేసిఆర్ గుర్తించారు.. గుర్తుంచుకోవాలి కూడా. నెల రోజులైనా ఇప్పటి వరకు కేసిఆర్ ఒక్కసారి కూడా రాష్ట్రంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడలేదు. ఏదైనా చేసిన 
తరువాతనే మాట్లాడతాను అంటున్నారు. ఎన్నికల హామీల అమలు, పథకాలు ప్రవేశపెట్టడం, పాలనలో లోటు పాట్లు ఏ రాష్ట్రంలోనైనా, ఢిల్లీలోనైనా ఎవరు అధికారంలోకి వచ్చినా షరా మామూలే.
టిఆర్‌ఎస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన మొదటి వారంలోనే జరిగిన శాసన సభ సమావేశాల్లోనే ముఖ్యమంత్రిగా కేసిఆర్ తన ప్రసంగంలో తెలంగాణ ఆత్మను ఆవిష్కరించారు. కాకతీయుల పాలన నుంచి కులీకుతుబ్‌షాహీల పాలన వరకు ప్రస్తావించారు. సభలో ఒకసారి ఇదేమన్నా చందూలాల్ దర్బారా? అంటూ యధాలాపంగా పలికినా ఇంత కాలం కనిపించకుండా మట్టిలో కప్పి పెట్టిన తెలంగాణ ఆస్తిత్వాన్ని బయటకు తీసుకు వస్తున్నానని, తన ప్రతి మాట ద్వారా సంకేతాలు పంపించారు. ఇది తెలంగాణ సర్కార్ అనే మాటను సభకు, లోకానికి గుర్తు చేశారు. తెలంగాణ ఆస్తిత్వం సగర్వంగా తలెత్తుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం పని చేయాలి. చేస్తుందని ఆశిద్దాం.