29, డిసెంబర్ 2017, శుక్రవారం

మనుస్మృతి ఉంటే ఇస్తారా!

‘ఆ సణుగుడు ఏంటి? ఏం కావాలో స్పష్టంగా అడుగు?’’
‘‘ఒకటి ఎక్స్‌ట్రా ఉంటే ఇస్తావేమోనని’’
‘‘రెండు రోజులు అయితే నూతన సంవత్సరం నువ్వు దేనికోసం వచ్చావో తెలియనంత అమాయకుడినేం కాదు. స్పష్టంగా అడగమంటున్నాను?’’
‘‘మనసు లాగుతోంది ... ఉండలేకపోతున్నాను.. ’’
‘‘నువ్వు ఇంట్లో   గుమ్మడివి బయట దేవదాసులో అక్కినేనివి. ఇంకెంత కాలం ఈ డబుల్ రోల్. మేమంతా తాగుబోతులం . నువ్వేమో శ్రీరామ చంద్రుడివని కలరింగ్ .. స్పష్టంగా నోరు తెరిచి అడుగు? ’’
‘‘మార్కెట్‌లో దేనికి డిమాండ్ ఉందో నీకు తెలియదా? నా నోటి నుంచి చెప్పించాలని ప్రయత్నిస్తున్నావు? ’’
‘‘సిగ్గెందుకు ఏ బ్రాండ్ కావాలి? ఎన్ని కావాలి చెప్పు’’
‘‘బ్రాండ్ ఏదైనా ఫరవాలేదు. ఒక్కటి కావాలి చాలు. రెండు రోజుల్లో పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను. ’’
‘‘ విస్కీనా? బ్రాందీనా? రమ్మునా ? ఏం కావాలి చెప్పు’’
‘‘అడుగడుగునా దొరికే వాటి కోసం నేను నీ దగ్గరకెందుకు వస్తాను. అవి నాకెందుకు? ’’
‘‘కొబ్బరి బోండంలో విస్కీ పోసుకుని తాగే నీ తెలివితేటలు నాకు తెలియవనుకోకు. న్యూ ఇయర్ వేడుకలకు అవి లేనిదే ఉండలేవు. ఎందుకురా? ఈ డబుల్ స్టాండర్డ్స్ . ఏం కావాలో అడగలేని జీవితం కూడా ఒక జీవితమేనా?’’
‘‘అపార్థం చేసుకున్నావు’’
‘‘మరింకేం కావాలి?’’
‘‘అదేరా నువ్వు తలుచుకుంటే సాధ్యం కానిదేమీ ఉండదు. ఒకే ఒక కాపీ ఇప్పించు. రెండు రోజుల్లో నీకు తిరిగి ఇచ్చేస్తాను. నీమీద ఒట్టు’’
‘‘అదే ఏంటో చెప్పు ఏడువు’’
‘‘్ఢల్లీ నుంచి మన గల్లీ వరకు అంతా అదే నామస్మరణ మనుస్మృతి. మీసాలు కూడా రాని కుర్రాళ్లు మనుస్మృతిని చదివి జీర్ణం చేసుకుని తగలబెడుతున్నారు. ఇంత వయసొచ్చినా చదవలేదంటే ఎంత సిగ్గుచేటు. విశాలాంధ్ర నుంచి నవోదయ వరకు ఎక్కడా మనుస్మృతి దొరకడం లేదు. మనుస్మృతి ఉందా? అని అడిగితే ఏదో ఈ కాలంలో మనుస్మృతి ఎక్కడ దొరుకుతుంది అని పిచ్చోణ్ణి చూసినట్టు చూస్తున్నారు. ఇరానీ హోటల్‌కెళ్లి సాంబార్ ఇడ్లీ అడిగితే క్యా పూచ్ రా అని సర్వర్ ఆశ్యర్యపోయినట్టు చూస్తున్నారు. పుస్తకం లేకపోయినా కనీసం ఫిడిఎఫ్ కాపీ ఉన్నా పంపండిరా అందులో ఏ ముందో చదువుతాను. ’’
‘‘ఓహో ఇందాక నసుగుతున్నది మనుస్మృతి కోసమా? నిజంగా నీమీద ఒట్టు చిత్రంగా వామపక్ష భావాలున్న వారితోపాటు బిజెపి భావాలున్న వాళ్లు సైతం ఒక్కసారిగా మనుస్మృతిపై ప్రేమ పెంచుకుని తగలబెడుతుంటే నీకన్నా ముందే నాకూ ఆసక్తి కలిగింది. ఓ పుస్తకం ఎలాగైనా సంపాదించి అందులో ఏ ముందో చదువుదామని ప్రయత్నించి విఫలమయ్యాను.’’
‘‘అదేంటిరా? మరి అంత చిన్న చిన్న కుర్రాళ్లు కూడా చదువుల సారమెల్లా గ్రహించితిని తండ్రీ అన్నట్టు మనుస్మృతిని దించి గుట్టల కొద్ది తగలబెడుతుంటే ఇంత పలుకుబడి ఉన్న మనకు దొరక్కపోవడం ఏంటో? ’’
‘‘పుస్తకం అయితే ఇప్పించలేను కానీ ఐడియా ఇవ్వగలను. రాజుగారింట్లో పెళ్లికి ఊరి వారంతా పాలు పోసిన కథ గుర్తుందా? ’’
‘‘ఎందుకు గుర్తు లేదు. ఆ బిందెలో అందరూ పాలు పోస్తే నేనొక్కడిని నీళ్లు పోస్తే ఎవరికి తెలుస్తుందని అంతా నీళ్లే పోస్తారు. ఆ కథ మనుస్మృతిలోదా? తెలియదే’’
‘‘చెప్పేది పూర్తిగా విను. మనం ఓ చౌరస్తాలో నిలబడి కొన్ని తెల్లకాగితాలు కాల్చి మనుస్మృతిని తగలబెట్టినట్టు ప్రకటిద్దాం. ఎంత ప్రయత్నించినా మనకు దొరకని మనుస్మృతి కాపీలు వారికెలా దొరుకుతాయి. నా అనుమానం ఈ ఐడియానే వాళ్లు అమలు చేస్తున్నారు.’’
‘‘అలా చేసినా మనుస్మృతి చదవలేదనే నా బాధ అలానే ఉండిపోతుంది కదా?’’
‘‘ఓ పని చేద్దాం. మన చిన్ననాటి మిత్రుడు పాండురంగం గుర్తున్నాడు కదా? వాడికున్న పలుకుబడి నీకు తెలియదేమో! దేన్నయినా సాధించగలడు. వాడిని కలుద్దాం పని ఐపోతుంది. నాకో కాపీ నీకో కాపీ సరేనా? ’’
***
‘‘పాండురంగం ఇల్లంతా సందడిగా ఉంది. వరుసగా క్యూలో నిలబడి మరీ అతనికి బోకేలు ఇస్తున్నారు. మా వాడి షష్ఠిపూర్తి ఉత్సవమా? అంటే అదీ కాదు ఇంకా రెండేళ్ల సర్వీసు ఉంది. ఏమై ఉంటుంది?’’
‘‘రావోయ్ రా! ఏంటో ఇలా వచ్చావు. వట్టి చేతులతోనే వచ్చావు. నువ్వూ ఓ బోకే తీసుకు రాలేకపోయావా?’’
‘‘ఏరా పాండురంగం మీ అబ్బాయికి పెళ్లి కుదిరిందా? మాట మాత్రమైనా చెప్పలేదు. వారం రోజులు ఢిల్లీ వెళ్లి వచ్చాను. అందరినీ పిలిచి లంగోటి ఫ్రెండ్‌ను మాత్రం మరిచిపోయావు. ’’
‘‘ అబ్చాయి పెళ్లి కాదు. అమ్మాయి సీమంతం కాదు. వారం రోజులు సీటీలో లేవు కదా? అందుకే నీకు విషయం తెలియదు. టీవి వార్తలు చూడలేదా? ’’
‘‘చూడలేదు. ప్రపంచ రికార్డు ఏమైనా సృష్టించావా? ఏంటి? ’’
‘‘ఎసిబి వలలో తిమింగలం అని చూపిన వార్తనే మళ్లీ మళ్లీ చూపించారు నా గురించే. ఎసిబి వలలో చిక్కిన చేప అంటూ చెప్పడం రొటీన్‌గా మారిందని వెరైటీ కోసం ఎసిబికి చిక్కిన తిమింగలం అని చూపించారు. దాంతో టీవిలో చూపించిన దాని కన్నా ఎక్కువగా ఎన్నో వేల కోట్లు దగ్గర ఉండి ఉంటాయాని బంధువులు, స్నేహితులు అంతా అభినందనలతో ముంచెత్తుతున్నారు. కోట్లు ఉన్నాయి కానీ వాళ్లు అనుకుంటున్నట్టు వేల కోట్లు లేవు. ఇన్ని కోట్లు సంపాదించినా రాని గుర్తింపు ఎసిబి దాడితో వచ్చింది. ’’
‘‘పాండురంగం టీవిలో చూడగానే ఎంత సంతోషించానోయ్ మన వంశం పరువు నిలిపావు. వాళ్లెవరో వీళ్లెవరో ఎసిబి వలలో చిక్కారు అని టీవిల్లో చెబుతుంటే మన వంశం పేరు ఒక్కసారి కూడా వినిపించక ఎంత మదనపడిపోయానో? మన వంశం పేరు నిలిపేవాడు ఒక్కడైనా లేడా? అని బాధపడని రోజు లేదు. ఆలస్యం కావచ్చు కానీ అన్యాయం మాత్రం జరగలేదు. చిన్న చిన్న చేపలకే వాళ్లు అంత సంబరపడుతున్నారు. మన వంశంలో ఏకంగా తిమింగలమే ఉంది. చరిత్ర సృష్టించాలన్నా తిరగ రాయాలన్నా మన వంశం వల్లే అవుతుంది. నీ బాబాయ్‌ని అని ఇప్పుడు గర్వంగా చెఫ్పుకుంటాను.’’
‘‘్థ్యంక్స్ బాబాయ్ ’’
‘‘పాండురంగం అసలు నేను నీ దగ్గరకు ఎందుకొచ్చానంటే నీ వల్ల సాధ్యం కానిదే ఏదీ లేదని అంతా అనుకుంటాం. మనుస్మృతి కాపీ ఒకటి ఎలాగైనా సంపాదించి పెట్టాలోయ్’’
‘‘మీరంతా చెబుతుంటే నాకూ చదవాలనిపిస్తోంది. సంపాదన మార్గం చెప్పమని ఎప్పుడూ అడుగుతావు కదా? నీకో బ్రహ్మాండమైన ఐడియా! వేటపాలం గ్రంథాలయానికి వెళ్లు. అక్కడ ప్రాచీన తాళపత్ర గ్రంథాలు మొదలుకొని, పాత గ్రంథాల వరకు అన్నీ దొరుకుతాయి. మనుస్మృతి సంపాదించు, పబ్లిష్ చేయి, హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. వారం రోజుల్లో సంపన్నుడివి అవుతావు. మరెవరికీ ఈ ఐడియా రాక ముందే రంగంలోకి దిగు. లెఫ్ట్, రైట్ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలవరిస్తున్న పుస్తకం మనుస్మృతి మార్కెట్‌కు ఢోకా లేదు.’’

ప్రపంచం చాలా ముందుకు వచ్చేసింది .. ఇంకా ముందుకు వెళుతోంది . కొందరు ఇంకా మనుస్మృతి వద్దే ఆగిపోయారు . ఎవరిష్టం వారిది 
బుద్దా మురళి (జనాంతికం 29-12-2017)

23, డిసెంబర్ 2017, శనివారం

కల్పనఇప్పుడు ఒక కల్పన!....మాయమైన తెర


టాకీస్ 1

నమో వేంకటేశ నమో తిరుమలేశా 
మహానందమాయే ఓ మహా దేవ దేవ.. 



ఎప్పుడు ఈ పాట విన్నా మనసు ప్రశాంతంగా మారుతుంది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలను కలిపేది/విడదీసేది ట్యాంక్‌బండ్ అంటారు. కానీ నిజానికి కల్పన టాకీస్ ఈ రెండు నగరాల మధ్య వార ధి. ఈ టాకీసు మొదటి గేటు హైదరాబాద్‌లో ఉంటే, రెండవ గేటు సికింద్రాబాద్ పరిధిలో ఉంటుంది. టాకీస్ గేటు సికింద్రాబాద్ పరిధిలో ఉంటే సినిమా తెర హైదరాబాద్ పరిధిలో ఉంటుంది. 
మూత పడిన కల్పన



రంగుల ప్రపంచాన్ని చూపిన చోట వెలిసిన పూరిగుడిసె 
కవాడిగూడ, గాంధీనగర్‌లకు విస్తరించి ఉన్న టాకీసు ఇది. 

ఉదయం ఆట ప్రారంభానికి ప్రేక్షకులు లోనికి అడుగుపెట్టడం.. తెర పైకి వెళుతుండగా అదే సమయంలో నమో వేంకటేశ నమో తిరుమలేశా మహా నందమాయే ఓ మహా దేవ దేవఅనే పాట వినిపించేది. ఆ పాట వినేందుకు సినిమాకు వెళ్లే వాన్నా సినిమా చూసేందుకా? అంటే ఇప్పుడు చెప్పలేకపోవచ్చు. సినిమా హాలు ఎదురుగా ప్రాగా టూల్స్ రక్షణ శాఖకు సంబంధించిన ఉత్పత్తుల పరిశ్రమ. వందలమంది కార్మికులు. ఇంట్లో అన్నం తినే సమయానికి ప్రాగాటూల్స్ సైరన్ వినిపించేది. బాగా చదువుకుంటే అందులో ఉద్యోగం దొరుకుతుంది అనే పెద్దల మాటలు అప్పుడప్పుడు వినిపించేవి. దాని ఎదురుగా కార్మికుల సమావేశాలు.. కంచు కంఠంతో కార్మిక నాయకులు నాయిని నర్సింహారెడ్డి ఉపన్యాసాలు నిత్యకృత్యం. ఆవాజ్ దో హం ఏక్ హై అనే నినాదాలు రోజూ వినిపించేవి. ప్రాగా మూతపడిన తర్వాత కార్మికులు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. నిత్యం నినదించిన ఆ గొంతుల్లో చాలా గొంతులు మూగబోయాయి. 

కల్పన టాకీస్‌లో ఎక్కువగా హిందీ సినిమాలే ప్రదర్శించేవారు. ఇప్పు డు సినిమాహాళ్లలో రోజుకు నాలుగు ఆటలు ఒకే సినిమా ప్రదర్శిస్తారు. త్వరలోనే అయిదవ ఆటకు అనుమతిచ్చి.. అయిదవ ఆటను తప్పని సరి గా చిన్న సినిమాలనే ప్రదర్శించాలనే నిబంధన విధిస్తారట. నాలుగైదు దశాబ్దాల క్రితం అలా ఉండేది కాదు. ఉదయం ఆట పాత సినిమాలను ప్రదర్శించేవారు. ఉదయం ఆటకు టికెట్ ధర కూడా చాలా తక్కువగా ఉండేది. నేను పుట్టక ముందు వచ్చిన పాత సినిమాలన్నీ ఇలా మార్నింగ్ షో లో వేసినవే.

సూపర్‌స్టార్ కృష్ణ నటించిన శభాష్ సత్యం మా అన్నతో కలిసి కల్ప న టాకీస్‌లో చూసిన. ఓ ద్రావకం తాగగానే కృష్ణ కనిపించకుండా పోతా డు. రూపం కనిపించదు, మాట వినిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న అపరిచితుడు వంటి ఎన్నో సినిమాల కన్నా ఆ కాలంలోనే భలే తీశారు చిత్రమైన కథ అని ఓసారి సూపర్‌స్టార్ కృష్ణకే చెప్పాను. ముఖ్యమంత్రి కార్యాలయంలో కృష్ణ, విజయనిర్మల, నరేషు, ఓ పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు కనిపించారు. మాట ముచ్చటలో శభాష్ సత్యం ఆ రోజుల్లోనే భలే తీశారు అంటే కృష్ణ ఎంత సంతోషపడ్డారో. వెంటనే అది తెలుగు కథ కాదు ఇంగ్లీషులో వచ్చిన మిస్టర్ నో కథను ఉపయోగించుకున్నామని చెప్పారు. ఆ సినిమా యూట్యూబ్‌లో వెతికినా దొరుకడం లేదు.

లవకుశ సినిమా వచ్చినప్పుడు ప్రజలు గ్రామాల నుంచి ఎడ్ల బండ్ల పై వచ్చే వారట. అది చూడలేదు. కానీ కల్పన టాకీసుకు జనం అలా తండోపతండాలుగా వచ్చిన దృశ్యం మాత్రం ఇప్పటికీ కళ్ళముందు మెదులుతోంది. సెకండ్ షో కు సైతం బస్తీలకు బస్తీలు తరలివచ్చాయి. ఎక్కువగా మహిళలే. భారతీయ సినిమా చరిత్రలో బ్లాక్‌బస్టర్ సినిమా ఏది అంటే షోలే అని ఆలోచించకుండా చెప్పేస్తాం. కానీ 1975లో షోలే సమయంలోనే విడుదలైన ఈ సినిమా షోలేను మించి విజయం సాధించింది . 

జై సంతోషి మా 1975 మే లో విడుదలైన ఓ లో బడ్జెట్ సినిమా. యూట్యూబ్‌లో ఇప్పుడు ఆ సినిమాను చూస్తే ఎలా అంతగా విజయం సాధించిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. సినిమా చూడటమే కాదు అయ్యప్ప దీక్షల తరహాలో ఆ రోజుల్లో సినిమా వచ్చాక మహిళలు సంతోషి మా దీక్షలు చేసే వారు. కల్పన టాకీసు సమీపంలోని జీరాలో సంతోషి మా ఆలయం ఆ రోజుల్లో వెలిసిందే. వైన్ షాప్, కిరాణా షాప్, స్టేషనరీ షాప్ అనే తేడా లేకుండా సంతోషి మా పేరుతో ఆ రోజుల్లో షాపులు వెలిశాయి. దేశం మొత్తం ఆ సినిమా సూపర్‌హిట్ అయింది. కోడలిని అత్తగారు, తోటి కోడళ్ళు వేధించడం, బోలెడు బట్టలు ఉతకమనడం, అన్ని కష్టాల నుంచి సంతోషి మా కాపాడటం భక్తి సినిమాల ఫార్ములా కథనే. నిర్మాతను ఆ సంతోషి మా కరుణించినట్టు ఉంది. కనక వర్షం కురిపించింది. సినిమా ప్రదర్శన సమయంలో పూలు చల్లడం పూజలు, డబ్బులు వేయడం ఇక్కడినుం చే మొదలైంది. కల్పన టాకీసు చరిత్రలోనే కాదు భారతీయ సినిమా చరిత్రలోనే రికార్డ్.

ఇప్పుడు కల్పన టాకీసు లేదు. కల్పన అంటే ఇప్పుడు ఓ బస్సుస్టాప్ పేరు మాత్రమే. కల్పన ఎదురుగా ప్రాగా టూల్స్ లేదు. విశా లమైన ఆ స్థలంలో అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ మొలిచింది. 
ఆర్థిక సంస్కరణల తరువాత రక్షణ శాఖ పరిశ్రమ కూడా మూత పడి అపార్ట్‌మెంట్‌గా మారిపోవడం వింతే. ఆర్థిక సంస్కరణల తర్వాత ఏదీ శాశ్వతం కాదు అనే నమ్మకం ఏర్పడింది. నిరు పేద సంపన్నుడు కావచ్చు. పెద్ద కంపెనీ బిచాణా ఎత్తివేయవచ్చు. 
 
కల్పనలో మూడు ఆటలు హిందీవే అయినా మార్నింగ్ షో మాత్రం తప్పనిసరిగా పాత తెలుగు సినిమానే. శభాష్ సత్యంలో ద్రావకం తాగి కృష్ణ అదృశ్యం అయినట్టు.. ఏం జరిగిందో కానీ ఓ దుర్ముహూర్తంలో కల్పన టాకీసు మూత పడి పెళ్లి మంటపంగా మారిపోయింది. అప్పటి వరకు హీరో హీరోయిన్ల పెళ్లితో తెరపై శుభం కార్డు పడగానే లేచి వెళ్లి పోయే వారు. అప్పుడు తెర ఉన్న చోట తరువాత నిజమైన పెళ్లి.. 
కొంత కాలానికి అదీ కనిపించకుండాపోయింది. ఇప్పుడు కల్పన ఒక కల్పన మాత్రమే.
కృష్ణ పాతరూపంలో అందరికీ కనిపించినట్టే.. కల్పన టాకీస్ కూడా తిరిగి ప్రత్యక్షం అవుతుందని, కావాలని ఆశ. జానపద సినిమాల్లో విగ్రహంగా మారిన రాజకుమారుడు తిరిగి రాజకుమారుడిగా మారినట్టు కల్పన తిరిగి టాకీస్‌గా కనిపిస్తుందా? విశాలమైన ఖాళీ స్థలంలో భారీ అపార్ట్‌మెంట్‌గా ప్రత్యక్షమవుతుందో చూడాలి.
బుద్దా మురళి (జ్ఞాపకం నమస్తే తెలంగాణ 23-12-2017)



22, డిసెంబర్ 2017, శుక్రవారం

కవిత్వానికి ఎన్‌కౌంటర్

‘‘ఏమోయ్ ఫాండురంగం అన్నయ్య వచ్చాడు. టీ తీసుకురా!’’
‘‘నిన్న నీ కవిత చూశాను. నిజం చెప్పు నువ్వు ట్రెజరీలో పని చేస్తున్నావా? లేక ఇంటెలిజెన్స్ అధికారిగా మారువేషంలో ట్రెజరీలో ఉన్నావా?’’
‘‘ఒక్క పైసా కూడా లంచం తీసుకోకుండా నీ బిల్లులన్నీ సాంక్షన్ చేస్తున్నందుకు నువ్వు నాకిచ్చే గౌరవం ఇదా? నీ చిన్నప్పటి తొలి ప్రేయసి విశాలాక్షి బిల్లులు కూడా నువ్వు చెప్పావని పైసా తీసుకోకుండా సాంక్షన్ చేస్తున్నందుకా ఈ అపవాదు.’’
‘‘విశాలాక్షి సంగతి ఇప్పుడెందుకు కానీ నిజం చెప్పు నీకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా?’’
‘‘ఇంతకు ముందే ఇంటెలిజెన్స్‌లో పని చేస్తున్నావా? అన్నావు, ఇప్పుడేమో మావోయిస్టును అంటున్నావు అసలు నీకేమైందిరా? రాత్రి తాగింది దిగలేదా? పొద్దునే్న తాగావా? ’’
‘‘నేను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాను. నీ కవిత వ్యవహారంతోనే నాకీ అనుమానం వచ్చింది. నా దగ్గర దాచాలని ప్రయత్నించకు నిజం చెప్పు అసలు నువ్వెవరు? మావోయిస్టువా? పోలీసువా? ’’
‘‘చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం నేనేంటో నీకు తెలియదా? ఇదేమన్నా మహేశ్‌బాబు సినిమా అనుకున్నావా? జులాయి, పోకిరీ, రౌడీలా తిరిగి ఇంటర్‌వెల్ తరువాత మహేశ్‌బాబు ఐపిఎస్ 2014 బ్యాచ్ అని డైలాగు చెప్పేందుకు. నానా తంటాలు పడి క్లర్కు జాబు సంపాదించి రిటైర్‌మెంట్ నాటికి సెక్షన్ ఆఫీసర్ స్థాయికి చేరుకోవడానికే తాతలు దిగి వచ్చారు. ఎప్పుడూ లేని విధంగా నీకెందుకొచ్చింది అనుమానం. ?’’
‘‘ఆధారాలు లేనిదే నేనేమీ మాట్లాడను. మీడియాలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు.’’
‘‘నీ పరిచయాలతోనే కదా? నా కవిత్వం పత్రికల్లో వస్తోంది. ఆ సంగతి ఇప్పుడెందుకు? ’’
‘‘మొన్న ఎన్‌కౌంటర్‌పై కవిత్వం రాశావు కదా?’’
‘‘అవును రాశాను. చాలా బాగుందని చాలా మంది ఫోన్ చేశారు. కన్నులు చెమ్మగిల్లాయన్నారు. అన్నా నీ కవిత్వం చదివాక చదువు వదిలేసి అడవిలోకి వెళ్లి మొత్తం సమాజాన్ని కస కస కస నరికేయాలనిపించిందని ఓ యువ కవి అభినందించాడు తెలుసా? ’’
‘‘అడగడం మరిచిపోయాను. ఫేస్‌బుక్‌లో మొన్న మీ వాడి ఫోటో చూశా ఐబిఎంలో ఏటా 20 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చిందని పోస్ట్ చేశావు. ఉద్యోగంలో చేరాడా? ’’
‘‘లేదురా! అమెరికా వెళ్లి ఎంఎస్ చేస్తానంటున్నాడు. నీకు తెలుసు కదా ఒక్కగానొక్క కొడుకు వాడేం అడిగినా కాదనను. చుక్కా రామయ్య ఐఐటి కోచింగ్‌లో చేరుతాను నాన్నా అని మూడవ తరగతిలోనే అడిగితే ప్రశాసన్ నగర్ లోని సొంతింటిని అద్దెకిచ్చి, నల్లకుంటలో చుక్కా రామయ్య ఇంటి వీధిలోనే అద్దె ఎక్కువయినా పర్లేదని ఉన్నాను. ఇద్దరు ముగ్గురు ఐఎఎస్‌లు విశాలమైన ప్రభుత్వ క్వార్టర్లు కూడా వదలుకుని నల్లకుంటలో మా వీధిలోనే అద్దెకుంటున్నారు. అమెరికా వెళతాను డాలర్లలో జీతం వస్తుందంటున్నాడు. పిల్లల కోరిక తీర్చడం కన్నా ఈ జీవితానికి ఇంకేముంటుందిరా! ’’
‘‘నీకు సామాజిక బాధ్యత లేదా? మీ అబ్బాయికి ఓ తుపాకీ ఇచ్చి అడవి బాట పట్టించొచ్చు కదా?’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్ ! మనిషివేనా? నీ నోటి నుంచి ఆ మాటలెలా వచ్చాయిరా! ముక్కు పచ్చలారని నా బిడ్డను అడవిలో అనాధల్లా చనిపోయే వారితో పోలుస్తావా? చిన్ననాటి మిత్రుడివని ఊరుకున్నాను అదే మాట మరొకడు అనుంటే నాలుకు చీరేసేవాణ్ణి’’
‘‘సారీ నీకంత ఆవేశం వస్తుందని అనుకోలేదు’’
‘‘కన్న బిడ్డలను అడవికి పంపమంటే నాకే కాదు మనిషన్న ఎవడికైనా ఆవేశం వస్తుంది. ఆ సంగతి వదిలేయ్ ఇంతకూ నేను మావోయిస్టునో, పోలీసునో అనే అనుమానం ఎందుకు వచ్చింది ఆ సంగతి చెప్పు’’
‘‘ఎన్‌కౌంటర్‌పై నువ్వు పంపిన కవిత చదివేంత వరకు ఎనౌకౌంటర్ జరిగినట్టు తెలియదని, వాళ్ల రిపోర్టర్ నుంచి ఆ వార్త రావడానికన్నా ముందే నీ కవిత వాట్సప్‌లో వచ్చిందట మా జర్నలిస్టు మిత్రుడు చెప్పాడు. ఎన్‌కౌంటర్ సంగతి ముందుగానే తెలవడానికి పోలీసో, మావోయిస్టో ఆయితే తప్ప అంత వెంటనే మరొకరికి తెలియదని నీమీద మా వాడికి అనుమానం వచ్చింది. అయితే నీ కవితను బాగుందని పత్రికలో ఉద్యోగం మానేసి అటు నుంచి అడవి బాట పట్టాలన్నంత ఆవేశం తెప్పించిందని మా వాడు మెచ్చుకున్నాడు ’’
‘‘అదా నీ అనుమానం. మొన్న అక్కడెక్కడో ఎన్‌కౌంటర్ జరిగిందని చాలా మంది పోయారని వాట్సప్‌లో మెసేజ్ వచ్చింది. అది చూడగానే కవిత్వం రాశాను. కవిత్వం రాశాక మరుసటి రోజు చూస్తే పత్రికల్లో ఎన్‌కౌంటర్ వార్తే లేదు. వాట్సప్‌లో బోగస్ వార్త అని తేలింది. సర్లే ఎప్పుటికైనా పనికిరాకుండా పోతుందా? అని నెల రోజుల నుంచి ఆశగా ఎదురు చూస్తుంటే టీవిలో ఎన్‌కౌంటర్ బ్రేకింగ్ వార్త కనిపించింది. వెంటనే మార్పులు చేసి వాట్సప్‌లో మీ వాడికి పంపించాను.’’
‘‘శవాల కోసం ఎదురు చూసే కాటికాపరిలా ఎన్‌కౌంటర్‌లో ఎవరు పోతారా? అని ఎదురు చూశావన్నమాట. నువ్వసలు ఏమీ మారలేదురా! చదువుకునే రోజుల్లో కూడా అంతే ప్రేమ కవిత్వం, ప్రేమ కవితలు రాసిపెట్టుకునే వాడివి కొత్తగా ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి పేరు చేర్చి ఇచ్చేవాడివి. ఓ సారి ఇద్దరు అమ్మాయిలకు ప్రేమలేఖ చేరింది. ఇద్దరి లేఖల్లో మ్యాటర్ ఒకటే, కోప మొచ్చి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు గుర్తుందా?’’
‘‘నా కవిత్వంతో విప్లవం సృష్టిస్తాను. ఓ కళాకారుడు నావల్ల పదివేల మంది అడవిబాట పట్టారు అని ప్రతి సభలోనూ గర్వంగా చెప్పుకుంటాడు. పదివేల మంది కాకపోయినా నా కవిత్వంతో ఓ పదిమంది అడవిబాట పడితే ఈ జీవితానికి అది చాలు.’’
‘‘ఓ లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాను అని అంబానీ కూడా ఎప్పుడూ ఇంత గర్వంగా ప్రకటించలేదు. అంతకన్నా గర్వంగా వందలమంది యువతను అడవిబాట పట్టించాను అని కొంతమంది గర్వంగా ప్రకటించుకోవడం నేనూ విన్నాను. వస్తువులు అమ్మేప్పుడు షరతులు వర్తిస్తాయి అని రాసినట్టు, నా కవితతో మా పిల్లలు తప్ప ఇతరుల పిల్లలు అడవిబాట పడితే నా జీవితానికి అదే సంతృప్తి అని నీ కవితలో రాసుకుంటే బాగుంటుంది. చాతనైతే బతికే విశ్వాసం కలిగించు, బతికే మార్గం చూపించు. చంపే మార్గం చూపేందుకు నువ్వే కావాలా? లాడెన్ వారసుల నుంచి, అణ్వాయుధాల వరకు ఎన్నో ఉన్నాయి’’

‘‘ఏదో మిత్రుడివని వస్తే నా కవిత్వాన్ని ఎన్‌కౌంటర్ చేశావు. ఆ సంగతి వదిలేయ్ యాదగిరి గుట్ట వైపు రియల్ ఎస్టేట్ మంచి భూమ్ లో ఉంది . కొంత మంది ఫ్రెండ్స్ కలిసి ఇన్వెస్ట్ చేస్తున్నాం . నీకేమైనా ఆసక్తి ఉంటే చెప్పు ’’
‘‘ స్టేట్ మిథ్య అని కవిత్వం రాసే మీరంతా కలిసి  రియల్ ఎస్టేట్ వాస్తవం అని పెట్టుబడులు పెట్టడం భలే గా ఉంది ’’

- బుద్దా మురళి(జనాంతికం 22-12-2017)


15, డిసెంబర్ 2017, శుక్రవారం

తెలుగు భాష పుట్టిల్లు

‘‘ఏంటా పరుగులు! లేడికి లేచిందే పరుగు అన్నట్టు అలా పరుగెత్తుతున్నావు, ఎక్కడికి?’’
‘‘ఇంకెక్కడికి రాజధాని నగరానికి. నగరం మొత్తాన్ని ఓసారి తనివితీరా చూద్దామని?’’
‘‘మంచిది నేను కూడా వస్తాను పద! ఇంతకూ నువ్వెవరు? నీ కథేంటో చెప్పు’’
‘‘వినే ఓపికుంటే ఆత్మకథ మొత్తం చెబుతా విను’’.
‘‘ఆత్మకథ అంటే భయమేస్తుంది. మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ విషాదంగా ముగియడానికి ఆత్మకథనే కారణం కదా!’’
‘‘ఎన్టీఆర్ అంటే గుర్తుకు వచ్చింది. ఆయన మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నానో. కానీ ఊహించని విధంగా ఆయన నాకు తీరని ద్రోహం చేశారు’’.
‘‘ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు కానీ, ఎన్టీఆర్ ఎవరికీ ద్రోహం చేయలేదు. నువ్వు చెప్పినా నేను నమ్మను’’.
‘‘నేనెవరో చెబితే నువ్వా మాట అనవు. నేను తెలుగు భాషను ప్రపంచ తెలుగు మహాసభలను కనులారా చూసేందుకు పుట్టింటికి వచ్చాను. ఇంతకూ నువ్వెవరు?
‘‘నేను తెలుగు భాషాభిమానిని. పద, ఇద్దరం కలిసి నగర సంచారం చేద్దాం. ముందు నీ ఆత్మకథ ఏంటో చెప్పు’’.
‘‘నా పేరు మీదనే నటరత్న పార్టీ పెట్టడంతో ఎంత మురిసిపోయానో, భాషాప్రయుక్త రాష్ట్రం అయినా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ సంగతే మరచిపోయారు. ఇంతకాలానికి నాకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి కదా! అని ఎన్టీఆర్ వచ్చినప్పుడు సంతోషించాను. ఆయన వస్తూనే సంగీత, సాహిత్య, నృత్య నాటక అకాడమీలు అన్నింటిని ఒక్క కలంపోటుతో రద్దుచేశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి ఆస్థాన కవిగా ఉంటే ఆ పదవిని రద్దుచేశారు. కళలు, భాష పరస్పర ఆధారితాలు. కళాకారుడైనా కళలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అల్లుడేమో సామాజిక శాస్త్రాలే వృధా అన్నారు. మున్సిపల్ స్కూల్స్‌లో తెలుగు మీడియం వద్దన్నారు.’’
‘‘మొదటి జీవో రద్దుచేస్తూ మళ్లీ జీవో ఇచ్చారులే’’
‘‘ఇదిగో ఇక్కడే నిజాం రాజ్యంలో సభలో తెలుగులో ఉపన్యసించినందుకు మరాఠీలు అవమానించారు. నాకు ఈ అవమానం కొత్తేమీ కాదు. ఈ అవమానాలకు ముగింపు లేదు. నిజాం రాజ్యంలో అధికార భాష ఉర్దూ. తెలుగులో మాట్లాడితే, మరాఠీల అవమానిస్తే ఊరుకోలేదు. తెలుగుకోసం తెగించి పోరాడాం. భాషా ప్రయుక్త రాష్ట్రం అయినా రెండున్నర జిల్లాల భాషే అధికార భాష అని, మిగిలిన జిల్లాల భాషను అవహేళన చేసినా అంతగా ఎదిరించలేకపోయాను. నన్ను సినిమాల్లో, హీరోల భాష, విలన్ల భాషగా చీల్చినప్పుడు ప్రశ్నించలేకపోయాను. విలన్ల భాష అని అవహేళన చేసిన చోటే సగర్వంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తుండడంతో పుట్టింటికి వచ్చాను’’.
‘‘అదిగో అది శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం గుర్తుందా?’’
‘‘ఎందుకు గుర్తులేదు. వయోభారంతో అలా కనిపిస్తుంది కానీ వందేళ్ల క్రితం నిజాం రాజ్యంలో తెలుగుదనంతో కళకళలాడిన భాషా కేంద్రాన్ని నేనెలా మరిచిపోతాను. ఆంక్షలను ఖాతరు చేయకుండా తెలుగు గళం వినిపించిన పుణ్యభూమిని మరుస్తానా?’’
‘‘ఇదిగో ఇక్కడి నుంచి సురవరం ప్రతాపరెడ్డిగారు గోలకొండ పత్రికను నడిపారు’’.
‘‘ఔను.. మహానుభావుడు, నిజాం రాజ్యంలో నియంతృత్వాన్ని ఎదిరించి వీరోచితంగా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా గోల్కొండ పత్రికను నడిపినా, భాషాప్రయుక్త రాష్ట్రం వచ్చేనాటికి నడపలేకపోయారు’’.
‘‘ఇది నీకు తెలిసి ఉండకపోవచ్చు. సచివాలయం కొత్త ద్వారం. వాస్తు బాగా లేకనే మామ అర్థాంతరంగా కుర్చీ దిగాల్సి వచ్చిందని అల్లుడు లుంబిని పార్కు ఎదురుగా నిర్మించిన కొత్త ద్వారం ఇది’’.
‘‘అయ్యో అమాయకుడా! ఈ ద్వారం నాకు తెలియకపోవడం ఏమిటి? నీకు గుర్తులేకపోవచ్చు కానీ నాకు బాగా గుర్తుంది. ఈ కొత్త ద్వారం నిర్మించినపుడు ముఖద్వారంపై సచివాలయం అని తెలుగులో కూడా రాయాలని చాలామంది వయోవృద్ధ భాషాభిమానులు ఆందోళన చేశారు. సచివాలయం వద్ద బైఠాయిస్తే 70-80 ఏళ్ళ వయసువారని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి బయటపడేసిన విషయం ఇప్పటికీ కళ్ళముందు కదలాడుతూనే వుంది. భాషా ప్రయుక్త రాష్ట్రం, అధికార భాష, భాష పేరుతోనే ఉన్న పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సచివాలయం అని తెలుగులోనూ రాయాలని ధర్నా చేయడం, వారిని చితగ్గొట్టడం గుర్తుకు వస్తే ఇప్పటికీ నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి’’.
‘‘నగరాన్ని చూస్తే ఏమనిపిస్తోంది?’’
‘‘నాలుగేళ్ళ క్రితం నగరంలో ఎక్కడ చూసినా భారీ హోర్డింగులు జిగేల్ మంటూ కన్పించేవి. నాకే అర్థంకాని నా భాషలో మాట్లాడే ముఖ్యమంత్రి భారీ హోర్డింగులు కన్పించేవి. ఏసి వాడవద్దు, విద్యుత్ పొదుపు చేయాలనే నినాదాలు ఫ్లడ్‌లైట్‌లో హోర్డింగ్‌లు వెలిగిపోయేవి. ఇపుడు అదే చోట తెలుగు కవుల భారీ హోర్డింగ్‌లు చూస్తుంటే ముచ్చటేస్తోంది. నట వంశీయుల కుమారులు, మనవళ్ళు, వారి మనవళ్ళ హోర్డింగ్‌లే తప్ప తెలుగు కవుల హోర్డింగ్‌లు నేను బతికి ఉండగా చూస్తానని అనుకోలేదు’’.
‘‘రాజధానిలోనే కాదు జిల్లాలోనూ తెలుగు భాషా పండుగ వాతావరణం కనిపిస్తోంది. మీది సినిమాల్లో రౌడీ భాషేకాని తెలుగు కాదు అని కొందరంటే ప్రాచీన భాషగా తెలుగుకు గుర్తింపు రావడానికి చివరకు తెలంగాణలోని కురిక్యాల గ్రామంలో బొమ్మలగుట్ట క్రీ.శ. 946 నాటి తొలి కంద పద్య శాసనం ఆధారం కావడం కాలమహిమ’’.
‘‘ఏమైంది తెలుగు కుట్ర.. కుట్ర.. అని శబ్దాలు వినిపిస్తున్నాయి. మనుషులు కనిపించడంలేదు. ఆ శబ్దాలు భయం కలిగిస్తుంటే నువ్వేమో నవ్వుతున్నావు?’
‘‘తెలుగు భాషను, సంస్కృతిని, సాహిత్యాన్ని ప్రభుత్వం కిడ్నాప్ చేస్తోందని వారి అరుపుల సారాంశం’’.
‘‘అదేంటి. తెలుగుకు రాజాదరణ లేకే కదా! నిరాదరణకు గురై అంతరించిపోయే ప్రమాదంలో పడిందని అంతా ఆవేదన చెందుతుంటే వీళ్ళేంటి రివర్స్‌లో, వాళ్ళకు తగ్గట్టు నువ్వు కూడా రివర్స్‌లో స్పందిస్తున్నావు. నినాదాలపై నవ్వడం ఏమిటి?’’
‘‘పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి నవ్వు వచ్చిందిలే! ఈ కాలం వారికి తెలిసే అవకాశం లేదు. గతంలో ప్రతి పెళ్లిలో కనీసం ఒక్కడైనా ఉండేవాడు. పెళ్లి భోజనంలో విశ్వరూపం చూపించేవాడు. ఆవకాయలో నూనె తక్కువ అయిందని, చింతకాయ తొక్కులో ఉప్పు తక్కువని, పచ్చిపులుసు పల్చగా ఉందని ఏదో ఒక సాకు చూపించి గట్టిగా గట్టిగా అరిచేవారు. పెళ్లి పెద్దలు వాళ్ళను బతిమిలాడడం, వాళ్ళు ఇలాంటి తిండి మేం తినం అని అలగడం భలే గమ్మత్తుగా ఉండేది. ఆడపిల్లల పెళ్లి అంటే తల్లిదండ్రులకు తల ప్రాణం తోకకు వస్తుంది. చచ్చీ చెడి పెళ్లి చేస్తే భోజనాల్లో ఇలాంటి శాల్తీ చేసే హడావుడి భలే ఉండేది. ఉప్పు తక్కువయింది, పప్పు ఎక్కువయింది అని గోల చేసే వాళ్ళను మిగిలినవాళ్ళు చిరాకుగా చూసినా ఏదో ఒక రకంగా మేం గుర్తింపు పొందాము అన్నట్లుగా ఉండేది వీరి గోల. ప్రపంచ తెలుగు పండుగకు దిష్టిచుక్కలా ఇలాంటి నినాదాలను సరదాగా తీసుకొని నవ్వుకోవాలి! ఈ కాలం పెళ్లిళ్ళలో సమయానికి వచ్చి అక్షింతలు వేసి వెళ్ళడమే కానీ, భోజనాలు చేసి వంకలు పెట్టేవారు వెతికినా దొరకరు. అరుదైన అలకల సంస్కృతిని ప్రదర్శిస్తున్నందుకు వీరిని మెచ్చుకోవాలి కాని తప్పు పట్టాల్సిన అవసరం లేదు’’.
‘‘వ్యంగ్యంగా చెబుతున్నావు కానీ విషయం చెప్పడంలేదు’’.
‘‘సీరియస్‌గా చెప్పాలా?’’
‘‘అవును’’
‘‘తమ పిల్లలు చైనాలో, రష్యాలో ఎంబిబిఎస్ చదవాలి. అమెరికాలో స్థిరపడాలి. ఇతరుల పిల్లలు అడవిబాట పట్టాలి. అర్థాంతరంగా తనువు చాలించాలి అని కోరుకునేవారు ఏదైనా అడవిలోనే ఉండాలని కోరుకుంటారు. తాము జనారణ్యం లాంటి మహానగరాల్లో ఉంటూ తమ ఉపన్యాసాల ద్వారా చైతన్యవంతమైన యువత అడవి బాట పట్టాలని కోరుకుంటారు. భాషయినా, యువత అయినా ఉండాల్సింది అడవిలోనే అనేది వారి నినాదం. అడవిలో ఉండి ఈ మాటలు చెబితే ఎలా ఉండేదో కానీ జనారణ్యంలో ఉంటూ పిల్లలకు ఇంగ్లీష్ చదువులు చెప్పిస్తూ తెలుగు భాష ఉత్సవాలను వ్యతిరేకిస్తూ వారు చెబుతున్న మాటలు ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు’’.
‘‘ఇంత కుట్ర ఉందా?’’
‘‘పండగ పూట వారి సంగతి ఎందుకులే వదిలేయ్. ఇంతకాలం మరిచిపోయిన తెలుగు బిడ్డలను ఓసారి మనసారా తలచుకుందాం. తెలుగు భాషకు మరణం లేదు. అజంత భాషే కాదు అజరామరమైన భాష అని ఎలుగెత్తి చాటుదాం’’.
‘‘భాషకైనా, మనిషికైనా పుట్టింటిని మించిన స్వర్గం లేదు. తెలుగు భాషకు పుట్టింటికి స్వాగతం’

8, డిసెంబర్ 2017, శుక్రవారం

సక్సెస్ ఫార్ములా!


‘‘ఈ మధ్య నల్లపూసయ్యావు.. అసలు కన్పించడం లేదు’’
‘‘ఎదురుగా చెట్టంత మనిషిని పెట్టుకొని కనిపిస్తలేవంటావేంటి?
‘‘చాల్లే, నా ఉద్దేశం ఇప్పుడు కనిపించడం లేదని కాదు. ఈ మధ్య కనిపించలేదు’’
‘‘ఓ అద్భుతమైన విషయంపై పరిశోధించేందుకు వెళ్లాను. తెలుగు సినిమా సక్సెస్ ఫార్ములా, భారత రాజకీయాల సక్సెస్ ఫార్ములాల తులనాత్మక అధ్యయనం చేశా!’’
‘‘కాస్త తెలుగులో చెబుతావా?
‘‘తెలుగు సినిమాల సక్సెస్ ఫార్ములా, రాజకీయ పార్టీల సక్సెస్ ఫార్ములా ఒకటేనని తేల్చే పరిశోధన చేశాను’’
‘‘మంచి పని చేశావు! రామాయణంలో పురుష పాత్రలు, భారతంలో స్త్రీ  పాత్రల, వస్త్రాపహరణంలో ద్రౌపది మార్చిన చీరలు,శ్రీకృష్ణుడిని మీసాలు ఉండేవా ? పాండవులు శాఖా హారులా ? మాంసాహారులా ?  అనే అంశంపై కూడా పరిశోధన చేసి డాక్టరేట్లు సంపాదిస్తున్నారు. ఎంబిబిఎస్ డాక్టర్ సీటు ఓపెన్ మార్కెట్‌లో కోటిన్నర పడుతోంది. చైనా, కజికిస్తాన్‌లో పావు కోటి ఖర్చుతో  వచ్చేస్తోంది .. అదేదో నోరు తిరగని దేశం లో తెలుగు భోజనంతో తెలుగులో 15 లక్షలతో  ఎంబిబిఎస్ చేసేయొచ్చని టీవీల్లో తెగ ప్రకటనలు కనిపిస్తున్నాయి!’’
‘‘తొందర పడి 15 లక్షలు వదుల్చుకునేవు. ఆ కోర్సుకు గుర్తింపు ఉందో లేదో చూడాలి’’
‘‘వారి కోర్సుకు గుర్తింపు సంగతి దేవుడెరుగు. వారు చెబుతున్న దేశానికి గుర్తింపు లేదట! గ్లోబ్‌లో ఎన్నిసార్లు వెతికినా ఆ దేశం పేరు కనిపించలేదు’’
‘‘ఇంతకూ నీ పరిశోధన సంగతి చెప్పనే లేదు. పదిమందిని చంపితేకాని మంచి డాక్టర్ కాడంటారు. ఎవరినీ భౌతికంగా చంపకుండా రాతలతోనే చంపేసి డాక్టర్ పట్టా పొందే సౌకర్యం సమాజానికి చాలా ఉపయోగం’’
‘‘అతి పెద్ద గోర్లు పెంచడం, ముక్కులో పది మీటర్ల పొడవైన వెంట్రుకలు పెంచినందుకు అదేదో గిన్నీస్ బుక్‌లో పేరు నమోదు చేస్తారు కదా! ఈ అద్భుతాలు సృష్టించినందుకు వీరికీ డాక్టరేట్ ఇవ్వవచ్చుకదా?’’
‘‘కాళ్లకు అడ్డం తగిలేంతగా జుట్టు పెంచడం, ముఖం కనిపించనంతగా, ముక్కు రంధ్రాల మూసుకుపోయేంతగా, పిట్టలు గూడు కట్టుకునేంతగా గడ్డాలు, మీసాలు పెంచితే ఇవ్వాల్సింది డాక్టరేట్ కాదు. వాళ్లను మంచి డాక్టర్ దగ్గరకు తీసుకుపోవాలి.’’
‘‘నీ పరిశోధన ఇలాంటిది కాదా?’’
‘‘రాజకీయాలు, సినిమా కలిపి పరిశోధించి సక్సెస్ ఫార్ములా కనిపెట్టేశాను. ‘మొన్న చనిపోయిన శశికపూర్ ఎన్నో సినిమాల్లో నటించాడు కానీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్న డైలాగు ఏంటో తెలుసా?’’
‘‘ఎందుకు తెలియదు. ‘మేరే పాస్, బంగ్లాహై, గాడీ హై, పైసా హై తేరే పాస్ క్యా హై’ అని అమితాబ్ గంభీరంగా అడిగితే ‘మేరే పాస్ మా హై’ అని శశికపూర్ నెమ్మదిగా చెప్పిన డైలాగ్ భారతీయ సినిమా చరిత్రలో ఓ అద్భుతం కదా?’’
‘‘అవును మన ఊరి పాపారావు తెలుసుకదా! వాడికి హిందీ రాకపోయినా ఈ డైలాగ్ అర్థం తెలుసుకొని, ఆ ఒక్క డైలాగు కోసం దీవార్ ను  వందసార్లు చూశాడు. మొన్ననే తెలిసింది వాళ్లమ్మను అనాధ ఆశ్రమంలో చేర్పించాడట! మన స్కూల్‌లో లాస్ట్ బెంచ్‌లో కూర్చొనేవాడు సుధాకర్ వాడికీ అంతే.. ఈ డైలాగ్ అంటే ఎంత పిచ్చో. ఆస్తికోసం అమ్మానాన్నలకు పిచ్చి అని చెప్పి గదిలో బంధించి కాగితాలపై సంతకాలు తీసుకున్నారట! పాపం వాళ్ల అమ్మానాన్నలు ఈ దెబ్బతో నిజంగానే పిచ్చివాళ్లు అయ్యారట!’’
‘‘పిచ్చి తల్లిదండ్రుల గురించి మనకెందుకు కానీ ఈ డైలాగును పిచ్చిపిచ్చిగా అభిమానించని  భారతీయుడు లేడనేది నిజం. మనకు డైలాగు నచ్చుతుంది కానీ ఆచరణ అస్సలు నచ్చదు .
తల్లి సెంటిమెంట్‌తో దీవాన్ ఘన విజయం సాధించింది!’’
‘‘దీవార్  ఒక్కటే కాదు. మొత్తం భారతీయ భాషల్లో సక్సెస్ సినిమాలన్నీ సెంటిమెంట్‌తోనే విజయం సాధించాయి. షోలే, దీవార్ కాలం లోనే  40 ఏళ్ల క్రితం వచ్చిన లోబడ్జెట్ సినిమా జై సంతోషిమా గుర్తుందా? సూపర్ డూపర్ హిట్టయింది. కేవలం సెంటిమెంట్‌తోనే రజనీకాంత్ డబ్బింగ్ సినిమాలు బోల్తాకొట్టిన టైంలో బయ్యర్‌లు రోడ్డునపడి లబోదిబోమంటున్న టైంలో బిక్షగాడు అంటూ డీగ్లామర్ టైటిల్‌తో వచ్చిన సినిమా కోట్ల వర్షం కురిపించింది ఎలానో తెలుసా? తల్లి సెంటిమెంట్‌తో. 30 లక్షలకు కొన్న సినిమా మరో వంద సినిమాలు డైరక్ట్‌గా తీసేంత లాభాలు తెచ్చిపెట్టింది. సెంటిమెంట్‌కు ఉన్న బలం అది. మహేశ్‌బాబు తండ్రికోసం ప్రతీకారం తీర్చుకునే పాత్రల్లోనే కదా పంట పండించింది.’’
‘‘అది సరే ఇతకూ రాజకీయాలకు ఈ సెంటిమెంట్‌కు సంబంధం ఏపాటి?’’
‘‘కత్తి కాంతారావు, ఎన్టీఆర్‌ల జానపద సినిమాల్లో కామన్‌గా ఉండే కథేంటి? ఎన్టీఆర్ తోటరాముడు కావచ్చు, రాజకుమారుడు కావచ్చు.. కానీ కథ మాత్రం కామన్. తన తల్లిదండ్రులను విలన్ నుంచి రక్షించడమే కథ. తల్లిదండ్రులను కాపాడుకోవడానికి కాంతారావు, ఎన్టీఆర్ ఆ కాలంలో ఎంతో కష్టపడ్డారు కదా! తల్లిదండ్రుల సెంటిమెంట్ పంటపండి ఎన్టీఆర్ ఓ వెలుగు వెలిగారు’’
‘‘సెంటిమెంట్ సినిమాలు సరే! రాజకీయాలకు సంబంధం ఏమిటి?’’
‘‘అక్కడికే వస్తున్నా నా జీవితం ప్రజలకే అంకితం, చివరి రక్తం బొట్టు వరకు ప్రజల కోసమే, అనే సెంటిమెంట్ డైలాగులు మొదటిసారి విన్నప్పుడు ఉద్వేగానికి గురవుతాం. అవే డైలాగులు దశాబ్దాల తరబడి రోజూ చెబుతుంటే రొటీన్ అయిపోయి, ఏమాత్రం స్పందించడం. అప్పుడు మార్కెట్ ట్రెండ్‌కు తగ్గట్టు టెక్నిక్ మార్చాలి. తల్లిదండ్రుల సెంటిమెంట్, హీరోయిన్ సెంటిమెంట్ తరువాత ఇప్పుడు కొత్త సెంటిమెంట్ కావాలి.. అవునా కాదా?’’
‘‘ఔను! కాలచక్రం గిర్రున తిరుగుతుంది అన్నట్టు ఒకప్పుడు గుర్రాలు తోలేవారు వేసుకొనే టైట్‌ప్యాంట్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. బిక్షగాళ్లు వేసుకునే చిల్లుల బట్టలు మన నవతరానికి నచ్చిన ఫ్యాషన్.’’
‘‘కదా! అలానే రాజకీయాల్లో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ సెట్ చేసేందుకు కొత్త సెంటిమెంట్‌తో తమ్ముడు రాజకీయం నడుపుతాడట!’’
‘‘ఎలా?’’
‘‘కంచుకోట నుంచి అడవిరాముడు వరకు ఎన్టీఆర్, తల్లిదండ్రుల సెంటిమెంట్‌తో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అన్నయ్య సెంటిమెంట్‌తో తమ్ముడు రాజకీయంగా సక్సెస్ అవతాడు.’’
‘‘పేద ప్రజలకోసం, సమసమాజం, సామాజిక న్యాయం ఇవన్నీ తుప్పుపట్టిన సెంటిమెంట్లు. ఇప్పుడు కొత్త సెంటిమెంట్ అన్నయ్య!’’
‘‘అర్థం కాలేదు’’
‘‘తల్లిదండ్రులను బంధించి అవమానించిన రాజనాలపై ప్రతీకారం తీర్చుకొనే ఎన్టీఆర్ సినిమాలోలా అన్నను సిఎం కాకుండా అడ్డుకొన్న శక్తులపై ప్రతీకారం తీర్చుకోవడానికి తమ్ముడు రాజకీయం నడపనున్నారు. అదే అన్నయ్య సెంటిమెంట్’’
‘‘ఎవరు అడ్డుకున్నారు! ఎప్పుడైనా పార్టీలు ఎవరికివారు తమ పార్టీనే అధికారంలోకి రావాలని కోరుకోవడం సహజం. దాన్ని అడ్డుకోవడం అని ఎలా అంటారు? సోనియాగాంధీనా? బాబు, వైఎస్‌ఆర్ కెసిఆర్, విజయశాంతి, జగన్ వీరిలో ఎవరు అడ్డుకున్నారు?’’
‘‘వీరెవరూ కారు. బాగా ఆలోచిస్తే నీకే తెలుస్తుంది?’’
‘‘నావల్ల కావడం లేదు నువ్వే చెప్పు’’
‘‘ఒక రాజకీయ పార్టీ ఓడిపోవాలన్నా, గెలవాలన్నా ఎవరి చేతిలో ఉంటుంది?’’
‘‘ప్రజలు ఓటువేస్తే గెలుస్తారు. వేయకపోతే ఓడిపోతారు. ఇందులో పెద్ద రహస్యం ఏముంది?’’
‘‘పాయింట్‌కొచ్చావు. ఓటు వేయనిది ప్రజలు?’’
‘‘అన్నయ్య అధికారంలోకి రాకుండా అడ్డుకున్న వారిపై ప్రతీకారం తీర్చుకోవడం అంటే వామ్మో ఓటు వేయని  ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటారా?’’
‘‘నీ భయానికి కాలమే సమాధానం చెప్పాలి . ’’
బుద్ధా మురళి (జనాంతికం 8-12-2017)

1, డిసెంబర్ 2017, శుక్రవారం

మాయా ఇవాంక

‘‘దిగులుగా కనిపిస్తున్నావు.. ఇవాంకా వెళ్లి పోయిందనా ? ఆమె  నీ మనసు మీద తీవ్రమైన ప్రభావం చూపినట్టు వుంది?’’
‘‘నీలా నేను బానిసను కాదు స్వతంత్ర భారతదేశంలో పుట్టిన స్వతంత్ర పౌరుడిని..శ్వేత జాతి ఇవాంకా అంటే బానిసలా తోక ఊపుతా అనుకున్నావా?’’
‘‘బానిస అనగానే గుర్తుకు వచ్చింది. నీ దగ్గరకు వస్తున్నాను అని చెబితే మీ బాస్ వాళ్ల ఆవిడ నిన్ను కూరగాయలు తెమ్మని సంచి ఇచ్చింది... పోయినవారం ముదురు వంకాయలు తెచ్చావట ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకొని కూరగాయలు తెమ్మంది.’’
‘‘మా బాస్ వాళ్లావిడకు నా ప్రతిభపై చాలా నమ్మకం.. నాలుగుచోట్ల తిరిగి తక్కువ ధరకు కూరగాయలు తెస్తాను అని నాకు పని చెబుతుంది. అంతే తప్ప నామీద పెత్తనం చెలాయించాలని కాదు... డబ్బులూరికే రావు కష్ట పడితేనే వస్తాయి . నాలుగుచోట్ల తిరిగి ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడే కొనాలి అనేదాన్ని నేను మొదటి నుంచి నమ్ముతాను లలితా బంగారం షాపు అతను నన్ను చూసే  ప్రకటన చేసాడు... మన ఇంట్లోకి కూరగాయలు కొనేప్పుడు కొసరి కొసరి కొన్నట్టుగానే బాస్ ఇంటికి కూడా కొంటాను. అందుకే నాపై అంత నమ్మకం’’.
‘‘తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం చేసేటప్పుడు నువ్వయినా నేనయినా కూరగాయలు తెమ్మన్నా తేవాలి, బాస్ మనవడికి డైపర్ మార్చమన్నా మార్చాలి. తప్పుతుందా? ఏదో బానిసత్వం స్వేచ్ఛా భారతం గురించి మాట్లాడుకుంటూ దారి తప్పినట్టున్నాం..మీ వాడిని అమెరికా పంపే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి ? ఇంతకూ దిగులుకు కారణం చెప్పలేదు .  ?’’
‘‘ఇంత కాలమైనా ప్రపంచం ఇంతగా మారిపోయినా ఇంకా పురుషాధిక్యత కొనసాగడంపై దిగులు పడుతున్నా, బాధపడుతున్నా?’’
‘‘మొన్న మీ ఆవిడను కొట్టినందుకు ఇంకా దిగులు పడుతున్నావా? ఏదో తాగిన మైకంలో అలా కొట్టావు.. మీ ఆవిడేం తక్కువ తిందా? నువ్వు తాగిందంతా కక్కేంతవరకు నిన్ను చితక్కొట్టింది కదా ఇంకా బాధపడడం బాగా లేదోయ్... జరిగిందేదో జరిగిపోయింది మీ ఆవిడ కూడా మరిచిపోయింది వదిలేయ్.’’
‘‘అబ్బా! మా ఆవిడ నన్ను చితగ్గొట్టిన విషయం నువ్వు పదేపదే గుర్తు చేయడం ఏమాత్రం బాగాలేదు. నేను అమెరికా గురించి మాట్లాడుతుంటే నువ్వు పుచ్చు వంకాయలు, మా ఆవిడ తన్నిన విషయాలు, మనం తాగి పడిపోయిన సంగతి మాట్లాడుతున్నావు. కాస్త ఎదుగు.’’
‘‘అవును మరిచేపోయాను. నువ్వు కలిసినప్పుడు అమెరికా విషయాలే చర్చించాలని మొదట అనుకున్నాను. అట్లకాడతో మీ ఆవిడ నీ ముఖం మీద కొట్టిన దెబ్బ మచ్చ చూడగానే విషయం మరంచిపోయాను.
ఇవాంకా ఇక్కడి గాలి పీల్చడానికి ఇష్టపడడంలేదు. పీల్చేందుకు అమెరికా నుంచి గాలి తెచ్చుకుంది. ఇక్కడి వంటలు తినకుండా వండేందుకు అమెరికా నుంచి వంటవాళ్లను తెచ్చుకొంది. తెలంగాణ ప్రభుత్వం ఆమెకు కోట్లాది రూపాయల వజ్రాల హారం ఇవ్వనుంది అని ఏమేమో వార్తలు వచ్చాయికదా? మరేంటి ఆమె అప్పారావు, సుబ్బారావు, నువ్వు, నేను పీల్చిన గాలినే హాయిగా పీలుస్తూ ఎంత చక్కగా మాట్లాడింది. మన హోటల్ తిండే తిన్నది. ఎందుకిలా జరిగింది. తండ్రిలానే ఆమెకూ మీడియా అంటే అస్సలు పడదేమో! ఒకరకంగా ఇది పత్రికా స్వేచ్ఛపై దాడే. విమానంలో వచ్చేప్పుడు కొన్ని గాలి సిలెండర్లు పట్టుకొచ్చుకుంటే ఏమవుతుండె. మీడియా గౌరవాన్ని నిలబెట్టిన గుర్తింపు దక్కేది. అసలెందుకిలా జరిగిందంటావ్? పోలీసులు ఖాకీ డ్రెస్ ధరించవద్దు అని హుకుం జారీ చేసారు అన్నావు. ఖాకీ దుస్తుల్లో పోలీసులు ఆమెతో ఫొటోలు దిగారు.’’
‘‘కవి హృదయం అర్థం కాలేదు అనుకోకు. మనవన్నీ గాలి వార్తలని చెప్పాలనుకుంటున్నావేమో! అసలేం జరిగిందో నీకు తెలుసా? కనీసం ఊహించగలవా?’’
‘‘ఊహించలేను  కాబట్టే నిన్ను అడిగాను. ఏం జరిగిందని’’
‘‘అసలు ఇవాంక హైదరాబాద్‌కు రానే రాలేదు. ఇక్కడకు వచ్చింది మాయా ఇవాంక. సొంతగాలి, సొంత తిండి, సొంత పోలీసులు, వాహనాలు ఎన్నున్నా భద్రత లేదనే విషయం తెలిసి చివరి నిమిషంలో అసలు ఇవాంకను వైట్‌హౌస్‌లో దాచిపెట్టి మాయా ఇవాంకను హైదరాబాద్ పంపించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టి ఆమెను అమరావతికి ఆహ్వానించేందుకు వాళ్లు ఆసక్తి చూపలేదు.
ఏంటి ముఖం అలా పెట్టావ్! నేను చెప్పినదానిపై నమ్మకంలేదా? రామాయణం చదివావా?
‘‘ఏంటీ ఇవాంక గురించి రామాయణంలో కూడా ఉందా?’’
‘‘అతిగా ఆశ్చర్యపడకు. మాయా సీత కథ తెలుసుకదా? శ్రీరాముడితోపాటు అడవులకు వెళ్లింది, రావణుడు కిడ్నాప్ చేసింది మాయా సీతనే, అగ్నిప్రవేశం చేసింది అసలైన సీత. త్రేతాయుగంలోనే ఈ టెక్నాలజీ వున్నప్పుడు సాంకేతికంగా ఎంతో ముందున్న అమెరికాకు ఈ టెక్నాలజీ ఉండడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది.’’
‘‘నువ్వు చెబుతుంటే నిజమే అనిపిస్తుంది. సరే ఈ సంగతి వదిలేద్దాం. ఇంతకూ నీ దిగులుకు కారణం చెప్పలేదు.
పు రుషాహంకారం వల్ల దిగులుగా వున్నానన్నావు. అదేంటోయ్ అర్థం కాలేదు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు 150 దేశాల ప్రతినిధులు వస్తే వారిలో ఎక్కువమంది మహిళలే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు, ఆయన కుమార్తె ఇవాంకనే ప్రధాన ఆకర్షణ. మహిళా పారిశ్రామికవేత్తలే ప్రధాన అంశంగా సదస్సు నిర్వహించారు. నువ్వేమో పురుషాధిక్యత అంటావు.’’
‘‘అన్నీ బాగానే గుర్తు చేస్తున్నావు. మరి మధ్యలో మెట్రో రైలు గురించి మాట్లాడవేం?’’
‘‘మెట్రో రైలు స్ర్తిలింగం కాదు పురుషలింగం కాదు. అందులో పురుషాధిక్యత ఏముంది.? సీటు వుంటే కూర్చోవాలి. లేకపోతే స్ర్తి అయినా, పురుషులైనా నిలుచోవలసిందే.’’
‘‘చర్చ పక్కదారి పట్టించాలని ప్రయత్నించకు.  మెట్రో ప్రారంభంలో నీకు పురుషాధిక్యత ఏమీ కనిపించలేదా?’’
‘‘కనిపించలేదు పైగా మహిళా సాధికారత కనిపించింది. మెట్రో నడిపింది నలుగురు అమ్మాయిలేనట! వారి ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి.’’
‘‘విషయం తెలిసి కూడా పక్కదారి పట్టించాలని చూస్తున్నావు. ప్రధానమంత్రి మెట్రోను ఎక్కడి నుంచి ప్రారంభించారు?’’
‘‘మియాపూర్ నుంచి’’.
‘‘ఇంతకుమించిన పురుషాధిక్యత ఏముంటుంది? మరే స్టేషన్ దొరకనట్టు మియాపూర్‌నే ఎంపిక చేసుకున్నారంటే పురుషాధిక్యత కాకుండా మరేంటి? 30 కి.మీ రూట్‌లో 30 స్టేషన్లు వున్నాయి. వాటన్నిటినీ వదిలి మగవారి పెత్తనం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా మోదీ మియా మియాపూర్ నుంచే మెట్రోను ప్రారంభించారు. బేగంపేట నుంచి ప్రారంభిస్తే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్టవుతుందని మియాపూర్ ఎంపిక చేసారు. మియాపూర్ అంటే శ్రీవారి పురం, బేగంపేట అంటే శ్రీమతి పేట అనే విషయం ఉత్తరాది మోదీకి తెలియదంటే నమ్మేంత అమాయకుడ్ని కాదు. ఇంకెన్నాళ్లు ఈ పురుషాధిక్యత?’’
‘‘మియాపూర్‌ను ఎంపిక చేసుకోవడంలో మతలబు ఉందో లేదో తెలియదుకానీ దేన్నయినా వ్యతిరేకించే నీ ఆలోచనపై నాకు పూర్తి విశ్వాసం వుంది. తలుచుకుంటే సాధించలేనిది లేదన్నట్టు నువ్వు తలుచుకుంటే దేన్నుంచయినా, ఏదైనా సాధించగలవు. సరే ఇంతకూ మెట్రో ఎక్కుతున్నావా లేదా?’’
‘‘ముందే చెప్పాను. నేను సర్వ స్వతంత్రుణ్ణి. బానిసత్వం అస్సలు పడదు. బంగారు పంజరం కన్నా చెట్టు కొమ్మమీదే పక్షికి స్వేచ్ఛ ఎక్కువ. మెట్రో ఏసి జైలు లాంటిది. స్వేచ్ఛకోసం ఎంతకైనా సాహసించే నేను మెట్రో ఎక్కనుకాక ఎక్కను.’’
‘‘స్వేచ్ఛకు- మెట్రోకు సంబంధం ఏంటోయ్’’
‘‘దేశంలో ఏ రైలయినా ఎక్కిచూడు బీడీలు తాగుతూ, గుట్కా నములుతూ ప్రజలు ఎంత స్వేచ్ఛగా ప్రయాణిస్తారు. మెట్రోలో అలాంటి సౌకర్యం వుండదట! లాలూప్రసాద్‌తోపాటు ఎంతోమంది గొప్పగొప్ప నాయకులు చిన్నప్పుడు టికెట్ లేకుండానే రైళ్లలో, బస్సుల్లో ప్రయాణించి అంత గొప్ప నాయకులు అయ్యారు. టికెట్ తీసుకుంటేనే రైలు తలుపులు తెరుచుకుంటాయట! ప్రజలపై అంత నమ్మకం లేకపోతే మెట్రోను నేనెందుకు నమ్మాలి. అందుకే మెట్రో వైపే చూడను.’’
* * *
‘‘ఏరోయ్ మెట్రో వైపే చూడను అన్నావు. మొత్తం ఫ్యామిలీ మెట్రో ఎక్కినట్టున్నారు. ఉదయం ఆరు గంటలకే మీ ఫ్యామిలీ ఫొటో మెట్రో సెల్ఫీ ఫేస్‌బుక్‌లో కనిపించింది. ఇంతకూ నువ్వు నువ్వేనా? లేక మాయా నువ్వు కాదుకదా?’’
‘‘పిల్లలు పోరుపెడితే కాదనలేక అర్థరాత్రి వెళ్లి స్టేషన్‌లోనే నిలబడ్డాం. మా ఫ్యామిలీ మొత్తం టీవీలో కనిపించింది.’’
‘‘సెల్ఫీ కోసం వెళ్లావుకానీ మెట్రో ఎక్కవన్నమాట’’
‘‘అదేంకాదు. పిల్లలు ఇంట్లో అందరికోసం స్మార్ట్‌కార్డ్ తీసుకున్నారు. మెట్రో ఎక్కడం ఇష్టం లేదుకానీ స్మార్ట్ కార్డు తీసుకున్నాక తప్పుతుందా?’’
‘‘పిచ్చోడా! నువ్వొక్కడివే కాదు. నేనూ అంతే నువ్వు అర్థరాత్రి నుంచి మియాపూర్ స్టేషన్‌లో వున్నావు. నేను బేగంపేట స్టేషన్‌లో క్యూలో వున్నాను.
క్షమించాలి నేను కాదు. మాయా నేను. మాయా సీత వున్నప్పుడు మాయా ఇవాంక, మాయా నువ్వు ,మాయా నేను ఎందుకు ఉండరు.అంతా మాయ ’’
బుద్దా మురళి (జనాంతికం 1-12-2017)