13, సెప్టెంబర్ 2019, శుక్రవారం

చీకటి రోజు-బ్లాక్‌బస్టర్

‘‘ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు..’’
‘‘ఏమైంది..?’’
‘‘సులభ్ కాంప్లెక్స్‌లో టాయ్‌లెట్‌కు పది రూపాయలు తీసుకున్నాడు. ఇంతకన్నా ఘోరం ఇంకేమైనా ఉంటుందా? ప్రజలకు బతికే హక్కు లేదా? టాయ్‌లెట్‌కు వెళ్లకుండా ప్రజలు అలానే పైకి పోవాలని కుట్ర పన్నుతున్నారా? ’’
‘‘పోనీలేవోయ్.. అదేదో సినిమాలో మహేశ్‌బాబు సుస్సు పోయిస్తాను అని అంటే అది మంచి లాభసాటి బేరం అనుకుని వీడెవడో సులభ్ కాంప్లెక్స్ కాంట్రాక్ట్ తీసుకున్నాడట! రోడ్డుపక్కన పోయడమే అలవాటు కావడం వల్ల ఇక్కడికి వచ్చేవారు తగ్గిపోయారు. దాంతో వచ్చిన వాళ్ల నుంచే ఐదు రూపాయలకు బదులు పది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇంతోటి దానికి- ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంటావా?’’
‘‘అదొక్కటే కాదు.. ఐదుకు బదులు పది తీసుకున్నారు. సరే పోనీ పది తీసుకున్నా కనీసం టాయ్‌లెట్‌లో ఓ లైటు వేయరా? చీకట్లో ఎంత ఇబ్బందో నీకేం తెలుసు?’’
‘‘టాయ్‌లెట్‌లో చీకటిని సింబాలిక్‌గా.. ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అన్నావా? నువ్వక్కడికి వెళ్లినప్పుడు చీకటిగా ఉంటే మొత్తం రోజంతా చీకటిగా ఉన్నట్టేనా? మహాఐతే అక్కడో పది నిమిషాలు ఉండి ఉంటావు. ప్రజాస్వామ్యానికి ఇది పది నిమిషాల చీకటి రోజు అంటే సరిపోతుంది. మరీ మొత్తం చీకటి రోజు అనడమే భావ్యం కాదు.’’
‘‘అదే నాయకులు అంటేనేమో హైలైట్ చేస్తారు. నేనంటేనేమో భరించ లేకపోతున్నావ్..’’
‘‘నాయకుల ప్రకటనలు లెక్కబెడుతూ పోతే సంవత్సరానికి 500 రోజులేమో అని డౌట్ వస్తుంది..’’
‘‘అదేం డౌట్.. సంవత్సరానికి 365 రోజులే. లీప్ సంవత్సరంలో ఒక రోజు ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప ఇదేదో హిట్ సినిమా ఆడినట్టు వెయ్యి రోజులు, ఐదు వందల రోజులు కావు’’
‘‘ఓ నాయకుడు తాను విపక్షంలో ఉంటే రోజుకు రెండు మూడు సార్లు ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అనే వాడు. అలా ఆయన చెప్పిన చీకటి రోజులన్నీ లెక్కకడితే ఒక ఏడాదిలో 1500 రోజులు వచ్చాయి తెలుసా?’’
‘‘ఔను.. నేనూ విన్నాను. ఓడిపోయాక అసెంబ్లీ జరిగేప్పుడు మైకు అందుకోగానే మొదటి మాట ఇదే ఉండేది. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని. ఓ రోజు అంబులెన్స్ అడ్డు రావడం వల్ల ఆయన వాహనాన్ని కొద్ది సేపుఆపితే ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అనేశారు. ’’
‘‘ప్రజాస్వామ్యానికి చీకటి పగలు అనాల్సింది కదా?’’
‘‘అధికారం లేనిదే ఉండలేని వారికి- ప్రతి రోజు, ప్రతి క్షణం ప్రజాస్వామ్యానికి చీకటి రోజే కదా?’’
‘‘ఔను- ప్రపంచంలో తాము, తమ సౌకర్యం, తమ అధికారం మినహా మరేమీ లేదనే గట్టి నమ్మకాలున్న వారికి అధికారం లేని ప్రతి క్షణం కూడా ప్రజాస్వామ్యానికి చీకటి రోజే. ఎందుకంటే వారి దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే వారే’’
‘‘నిజమేనోయ్.. షూటింగ్ ప్రారంభమైన ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. అధికారం కోల్పోయిన తరువాత ప్రతిక్షణం ప్రజాస్వామ్యానికి చీకటి రోజే.’’
‘‘అదేం పోలిక?’’
‘‘అంటే సినిమాలు, రాజకీయాలు ఒకటే అని భావించే వారి కోసం అన్నా..’’


‘‘ఐనా రెండింటికీ పోలిక ఎలా సాధ్యం?’’
‘‘నేను సినిమాలు చూడడం మానేసి చాలా ఏళ్లవుతోంది. కానీ ప్రతి సినిమా గురించి తెలుసుకోవాలని ఉంటుంది. ప్రతి సినిమా వార్తను చదువుతాను. టీవీలోచూస్తాను. కానీ థియేటర్‌లో ఒక్క సినిమా కూడా చూడను.’’
‘‘ఆ సంగతి వదిలేయ్... పోలిక గురించి చెప్పు?’’
‘‘సినిమా షూటింగ్ ప్రా రంభం చాలా అట్టహాసంగా సాగుతుంది. నిజంగా ఆ సినిమా షూటింగ్ జరిగిందో లేదో చాలామందికి తెలియదు. షూటింగ్ పూర్తయి, ఆ సినిమా వెలుగు చూస్తుందో లేదో అనుమానమే. ఈ గండాలన్నీ గట్టెక్కి థియేటర్ ముఖం చూసినా ఒకటి రెండు రోజుల్లోనే ఎత్తేస్తారు. ’’
‘‘లేకపోతే ఏళ్ల పాటు ఒకే సినిమా నడుస్తుందని అనుకుంటున్నావా? షోలే సినిమా ముంబయిలో దశాబ్దాల పాటు నడిచిందట. ఇవి లవకుశ, అడవిరాముడు సినిమాల కాలం కాదు. వారం నడిస్తే ఘన విజయం సాధించినట్టే! సినిమాలు చూడడం లేదు కాబట్టి ఇది నీకు తెలియకపోవచ్చు.’’
‘‘అక్కడికే వస్తున్నా.. సినిమా విడుదలై నాలుగైదు షోలు నడవడమే కష్టం. కానీ సినిమా ప్రారంభంలో మాత్రం- ఇది బ్లాక్‌బస్టర్ సినిమా కాబోతోంది.. కొత్త కథ, సరికొత్త చిత్రీకరణ, నిర్మాత ఖర్చుకు వెనుకాడలేదు, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయింది.. అని గొప్పగా ప్రకటిస్తారు. తీరా చూస్తే విడుదలైన రెండో రోజు థియేటర్లలో సినిమా కనిపించదు. దర్శకుడు నిర్మాతకు కనిపించడు. నిర్మాత బయ్యర్లకు చిక్కడు.’’
‘‘అచ్చం సినిమాలానే అనిపిస్తుంది. తల నొచ్చినా, ఇంట్లో భార్య చివాట్లు పెట్టినా నాయకుడు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ప్రకటించడం, విడుదలకు కూడా నోచుకోని సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ అని చెప్పుకోవడం ఒకటే అనిపిస్తోంది’’
‘‘ఆ మధ్య ఒకరు వంద రోజులు నడిచే సినిమా కథ కోసం తెగ ప్రయత్నించాడు..’’
‘‘సిన్మా తీశారా?’’
‘‘ఆ తీశారు.. ’’
‘‘వావ్.. ఇంతకీ ఆ సినిమా పేరు..?’’
‘‘శతదినోత్సవం?’’
‘‘??’’
‘‘ఔను- సినిమా పేరే శతదినోత్సవం, రెండు షోలు మాత్రమే నడిచింది. నిర్మాతకు భారీ నష్టాన్ని మిగిల్చింది. శతదినోత్సవ నిర్మాత రికార్డు సృష్టించాడు..’’
‘‘నిజమేనోయ్.. ఈ రోజుల్లో నాయకుల ప్రకటనల్లో వాస్తవం ఉండదు. సినిమాల్లో కథ ఉండదు. రెండూ భ్రమలే’’
‘‘అందుకేనేమో యువత సినిమా నుంచి ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు మళ్లుతోంది. ’’
‘‘ఔను.. చంద్రయాన్-2 ప్రయోగంలో అడ్డంకులు ఏర్పడితే ఇస్రోలో అంత పెద్ద అధికారి- బాగా చదివే విద్యార్థికి తక్కువ మార్కులు వస్తే ఏడ్చినట్టు భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. ప్రధాని ఆయనను భుజం తట్టి అనునయించాడు. దేశమంతా చలించిపోయింది. సినిమా హీరోలను మించి దేశం మొత్తం ఇస్రో కృషిని అభినందించింది. యువత ఇస్రో చైర్మన్ శివన్‌కు అండగా నిలిచింది. దేశం మారుతోందనడానికి ఇదే బలమైన సంఘటన’’
‘‘ఐతే.. ఏమంటావ్?’’
‘‘దేశం మారుతోంది. యువత మారుతోంది. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అనే చిరాకు తెప్పించే రొటీన్ డైలాగ్‌ను దాటి- తాము పైకి రావాలని నాయకులు కూడా గ్రహించాలి..’’
*-బుద్ధా మురళి (జనాంతికం 13-9-2019)

9, సెప్టెంబర్ 2019, సోమవారం

ఆర్థిక భద్రత

ఈ మధ్య జాతీయ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. ముంబై ఐఐటి నుంచి బిటెక్, ఎంటెక్ చేసిన యువకుడు శ్రావణ్ కుమార్ రైల్వేలో దన్‌బాద్ డివిజన్‌లో దిగువ స్థాయి ఉద్యోగంలో చేరాడు. అక్కడి రైల్వే అధికారులంతా ఆశ్చర్యపోయారు. వారే కాదు ఈ వార్త చదివిన వారు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రైల్వేలో డీ గ్రూప్ ఉద్యోగం నెలకు జీతం 18 వేల రూపాయలు. మిత్రులంతా కార్పొరేట్ కంపెనీల్లో చేరితే నువ్వు రైల్వేలో దిగువ స్థాయి ఉద్యోగంలో ఎందుకు చేరుతున్నావు అని ప్రశ్నిస్తే అతను చెప్పిన సమాధానం ఉద్యోగ భద్రత కోసం అని...
దేశంలోని ఐఐటిలన్నిటిలో ముంబై ఐఐటి మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి ఏటా క్యాంపస్ సెలక్షన్‌ల వార్తలు మనం చూస్తూనే ఉంటాం. ఏటా కోటి రూపాయల జీతానికి కోటిన్నరకు సెలక్ట్ అయిన ఐఐటి విద్యార్థులు అని. తెలుగు నాట ఐఐటి క్రేజ్ ఇంతా అంతా కాదు. అసలు మనిషి పుట్టిందే ఐఐటి చదువు కోసం అన్నట్టుగా తల్లిదండ్రులు పిల్లలు కష్టపడతారు. ఐఐటిలో చేరేందుకు టెన్త్ నుంచి రామయ్య కోచింగ్, ఆరవ తరగతి నుంచి శర్మ కోచింగ్, ఆరవ తరగతి వరకు స్కూల్‌లో ఐఐటి కోసం ప్రత్యేక శిక్షణ. హైదరాబాద్ నల్లకుంటలో ఉదయం ఐదు గంటల నుంచే ఐఐటి శిక్షణ హడావుడి కనిపిస్తుంటుంది. ఇది అందరికీ తెలిసిందే! ఐఐటి సీటు కోసమే అంత కష్టపడతారు. అలాంటిది ఐఐటిలో బిటెక్, ఎంటెక్ పూర్తి చేసిన తరువాత రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడం వింతగానే అనిపించవచ్చు. అతను చేసింది తప్పా? ఒప్పా? అని మనం నిర్ణయించలేం. అతని జీవితం అతని ఇష్టం. అతని అభిరుచి అతనిష్టం.
ఎందుకిలా చేశావు అని అతన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఐతే భద్రత ఉంటుంది. కార్పొరేట్ రంగంలోనైనా, ప్రైవేటు రంగంలోనైనా భద్రత ఉండదు. నాకు ఉద్యోగ భద్రత ముఖ్యం అని సమాధానం ఇచ్చారు.
అతని నిర్ణయం తీసిపారేయదగినదేమీ కాదు. అలా అని ఆహ్వానించదగింది కూడా కాదు. ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రతతో కూడిన జీవితం అనే నమ్మకం ఉంటుంది. కార్పొరేట్ రంగంలో లక్షల రూపాయల్లో జీతం ఉన్నా ఉద్యోగ భద్రత ఉండదు.
ప్రభుత్వ ఉద్యోగి అయితేనే అమ్మాయిని ఇస్తాం అనే తల్లిదండ్రులు రెండు మూడు దశాబ్దాల క్రితం ఎక్కువగా కనిపించేవారు. చిన్ననాటి నుంచి వాళ్లిద్దరినీ భార్యాభర్తలు అనుకున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం లేదని పిల్లను ఇవ్వడానికి ఇష్టపడలేదు అనే ఉదంతాలు చాలా కుటుంబాల్లో కనిపిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉద్యోగ భద్రత ఉటుంది. రిటైర్ అయిన తరువాత పెన్షన్ ఉంటుంది అనే ధీమాతో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికే పిల్లను ఇవ్వడానికి ఇష్టపడేవారు.
కార్పొరేట్ ఉద్యోగంలో జీతం బాగుంటుంది. రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగంలో జీతం పద్దెనిమిది వేలే. ఇలాంటి సందర్భం వస్తే ఏం చేయాలి అని సందేహం వస్తే ఏం చేయాలి.
ఏదో ఒకటే కోరుకోవడం ఎందుకు రెండింటిని కలిపి కోరుకోలేమా?
అదెలా సాధ్యమా?
డబ్బు లక్షణాలు తెలిస్తే అది సాధ్యమే!
బిఎస్‌ఎన్‌లాంటి సంస్థ భవిష్యత్తు ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఇండియన్ ఏయిర్ లైన్స్, బిఎస్‌ఎన్‌ఎల్ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మన కళ్ల ముందే బిడిఎల్, ఐడిపిఎల్, ప్రాగాటూల్స్, అల్విన్ వంటి ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు మూత పడ్డాయి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్నో కార్పొరేషన్లు మూత పడ్డాయి. మరి అందులో ఉద్యోగంలో చేరిన వారు కూడా శ్రావణ్ కుమార్ లానే ఉద్యోగానికి ఎలాంటి ఢోకా ఉండదనుకునే చేరారు కదా?
ముంబై ఐఐటిలో ఎంటెక్ చేసి శ్రావణ్ కుమార్ కేవలం ఉద్యోగ భద్రత కోసం చేసిన రైల్వేలో సైతం శాశ్వతంగా ఉద్యోగ భద్రత ఉంటుంది అనే నమ్మకం లేదు. రైల్వేను ప్రైవేటీకరిస్తారు అనే ప్రచారం జరుగుతుంది. మన కళ్ల ముందే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం అయినప్పుడు రైల్వే అయితే పెద్దగా ఆశ్చర్యపోవలసిన అవసరం కూడా లేదు.
ప్రభుత్వ ఉద్యోగంలో జీతం తక్కువ అయినా టెన్షన్ ఉండదు, ఉద్యోగ భద్రత ఉంటుంది అనే నమ్మకం తేలిగ్గా తీసేయాల్సిందేమీ కాదు. అదే విధంగా కార్పొరేట్ కంపెనీల్లో లక్షల్లో జీతాలు ఉన్నా పని ఒత్తిడి, ఉద్యోగం ఎప్పుడు పోతుందో అనే భయం. జీవితానికి భద్రత లేని పరిస్థితి నిజమే.
మరేం చేయాలి? కార్పొరేట్ రంగంలోని ఎక్కువ జీతం, ప్రభుత్వ ఉద్యోగంలోని భద్రత రెండూ సాధ్యం కాదా? అంటే...
డబ్బు గురించి అవగాహన, కొంత ఆలోచన ఉంటే సాధ్యం అవుతుంది.
కాలం మారింది. జీవితం సంక్లిష్టంగా మారింది. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగానికే భద్రత లేని పరిస్థితుల్లో కార్పొరేట్ రంగంలో ఉద్యోగ భద్రతపై పెద్దగా ఆశలు పెట్టుకోలేం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడు పోతాయో అనే టెన్షన్ నిజమే. అదే సమయంలో ఉద్యోగ అవకాశాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా విస్తృతంగా ఉన్న మాట నిజమే.
కార్పొరేట్ రంగంలో కానీ ప్రైవేటు రంగంలో కానీ ఎక్కువ జీతానికి ఉద్యోగం లభించినప్పుడు ఉద్యోగ భద్రత లేదు అనే దిగులుతో పని చేయడం కన్నా ... జీతం ఎక్కువైన జీవన శైలి మాత్రం తక్కువ ఖర్చు స్థాయిలోనే గడిపితే రేపటికి ఢోకా ఉండదు. 18 వేల జీతంతో రైల్వే ఉద్యోగం కన్నా కార్పొరేట్ రంగంలో లక్ష రూపాయ జీతానికి ఉద్యోగం లభిస్తే, దాదాపు పాతిక వేల ఆదాయం స్థాయిలో జీవితం గడిపి, 75వేల రూపాయలను సరిగ్గా ఇనె్వస్‌ట చేస్తే శ్రావణ్ కుమార్ జీవితానికి బోలెడు భద్రత లభిస్తుంది. 75 శాతం సాధ్యం కాకపోయినా 50 శాతం డబ్బును కనీసం ఐదు పదేళ్లపాటు అతను సరిగా ఇనె్వస్ట్ చేస్తే అతనికి ప్రభుత్వ ఉద్యోగానికి మించిన భద్రత లభిస్తుంది.
కుటుంబ పరిస్థితి, అవసరాలు, ఆర్థిక స్థితి అన్నీ కలిపి ఒక నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేస్తుంది. శ్రావణ్ కుమార్ నిర్ణయాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
ఐఐటి అని కాకపోయినా కార్పొరేట్ రంగంలో, ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేస్తున్న ఈ తరం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్ అనే అలవాట్లను మొదట్లోనే అలవాటు చేసుకుంటే జీవితానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. ఐదు -పదేళ్ల పాటు సగం జీతం స్థాయిలో గడిపితే.. ఆ ఇనె్వస్ట్‌మెంట్ ఉద్యోగం పోయినా జీతం అందించే స్థాయికి చేరుకుంటుంది. జీవితానికి ఇంతకు మించిన భద్రత ఇంకేం ఉంటుంది.
-బి.మురళి(ధనం మూలం 8-9-2019)

7, సెప్టెంబర్ 2019, శనివారం

అమెరికా కా? నేపాల్ కా ?

‘‘చెప్పినా వినకుండా... సర్వనాశనం చేస్తున్నారు...’’
‘‘ఏం జరిగిందోయ్...?’’
‘‘మన జీడీపీ ఎంతో తెలుసా? టాటా కార్ల ఫ్యాక్టరీలను రెండు రోజులు మూసేశారన్న సంగతైనా తెలుసా? పార్లే-జీ బిస్కట్లు తింటున్నావా? ఆ ఫాక్టరీలో పదివేల మంది ఉద్యోగులను తొలగించారన్నది తెలుసా?’’
‘‘చూడోయ్.. నాకు ఏ నెల జీతం ఆ నెలకే సరిపోవడం లేదు. మా అ బ్బాయి కారు కొందామని చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. ఈ మహానగరంలో కారైనా, సైకిలైనా ఒకటే స్పీడ్.. హాయిగా మెట్రోరైలెక్కి పోకుండా కారెందుకు రా.. అని నచ్చజెప్పా. కారు తీసుకొని మోండా మార్కెట్‌కు వెళ్లినా, మహంకాళి గుడికెళ్లినా నరకమే! ఎక్కడా పార్కింగ్‌కు అవకాశం లేదు. నడుచుకుంటూ వెళ్లడమే నయం. నామాట విను.. నువ్వు కూడా కారు కొనకు.. హాయిగా బస్సులోనో, మెట్రోలోనో వెళ్లు. మరీ అంతగా కారెక్కాలని అనిపిస్తే ఊబర్ టాక్సీ బుక్ చెయ్’’
‘‘నేనేం చెబుతున్నాను.. నువ్వేం మాట్లాడుతున్నావ్?’’
‘‘అదే లేవోయ్.. టాటా కార్ల ఫ్యాక్టరీని రెండు రోజులు మూసేశారన్నావ్.. అదే కదా? ఈరోజు కొనాలనుకున్నది మరో రెండు రోజుల తరువాత కొంటావేమో? అంతోటి దానికి ఇంత ఆవేశం, ముఖంలో ఇన్ని రూపాలు మార్చడం అవసరమా?’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్?’’
‘‘ఆ.. పార్లే బిస్కట్ల గురించే కదా? ఈ కాలం పిల్లలంతా పిజ్జాలు, బర్గర్‌లు అంటూ జపిస్తుంటే నువ్వేమో ఇంకా పాతకాలం వాడిలా పార్లే బిస్కట్ల కోసం ఇంతగా తపిస్తున్నావంటే.. నువ్వు గ్రేట్‌రా!’’
‘‘ఎహే ఆగు.. ఇంత అజ్ఞానంతో మనుషులు ఎలా ఉంటారో అర్థం కావడం లేదు. నేను పడిపోయిన జీడీపీ గురించి, తగ్గిపోయిన గ్రోత్ రేట్ గురించి, ఆగిపోయిన పరిశ్రమల గురించి.. ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుతుంటే- నువ్వేంటి.. సిల్లీగా బిస్కట్లు, చాక్లెట్లు అంటూ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నావ్!’’
‘‘చెప్పుకుంటే సిగ్గుచే టు కానీ, ఆర్థిక సంక్షోభం అంటే ఏంటి? అంతా దా నిపై తెగ మాట్లాడేస్తున్నా రు. మన చిన్నప్పుడు స్కై లాబ్ పడిపోయి ప్రపం చం అంతా భస్మీపటలం అవుతుందని తెగ భయపడేవారు. ఇప్పుడలాంటిదేమన్నా భూగోళానికి ముప్పుగా మారిందా?’’
‘‘అంతకన్నా పెద్ద ముప్పు! ప్రపంచానే్న గడగడలాడిస్తోంది..’’
‘‘ఫేస్‌బుక్‌లో చూశా.. ఆంధ్రపదేశ్‌లో బాబు ఓడిపోయి జగన్ గెలవడం వల్ల, బాబుకు మద్దతు ఇచ్చే మీడియాను కాదని, జగన్‌కు మద్దతు ఇచ్చే మీడియా వల్లనే ప్రపంచానికి ఈ ప్రమాదం ముంచుకొచ్చిందని కొందరు రాశారు. అస్సలు అర్థం కాలేదు. మరీ బడాయి కాకపోతే జగన్‌కు ఆంధ్రలో బలం ఉంది నిజమే, ప్రపంచాన్ని గజగజలాడించేంత బలం ఉందంటావా?’’
‘‘ఎహే.. జగన్ ముఖ్యమంత్రి కాకముందు నుంచి ప్రపంచం ఆర్థిక సంక్షోభం బాట పట్టింది’’
‘‘అంటే- బాబు వల్లనే ప్రపంచానికి ఆర్థిక సంక్షోభం అంటావా?’’
‘‘అబ్బా- నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ప్రపంచంలో ఏం జరిగినా ఐతే బాబు లేదంటే జగన్.. ఆ ఇద్దరి వల్లనే అంటావా? నీకు వీళ్లే ప్రపంచంలా కనిపిస్తున్నారా? ప్రపంచం వీరిద్దరి కార్యక్షేత్రాల కన్నా పెద్దగా ఉంటుంది.’’
‘‘ఔను.. మోదీ వల్లనే అని బాగా ప్రచారం జరుగుతోంది. మోదీ వల్ల ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో పడుతుందా? ఆయనెవరో- శివసేన నాయకుడు ఇప్పటికైనా మన్మోహన్ సింగ్‌ను పిలవండి, ఆయన సలహాలు తీసుకుని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడండని సలహా ఇచ్చినట్టు ఉన్నాడు. ప్రపంచాన్ని రక్షించేంత సత్తా మన దేశానికి చెందిన నాయకుడికి ఉండడం గర్వకారణం. ఆయన ఏ పార్టీ ఐనా కానీ, ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసింది మా సింగ్ గారే అని చెప్పుకోవడం మనకెంత గర్వకారణంగా ఉంటుంది?’’
‘‘నీకు ఆర్థిక అంశాల గురించి ఏమీ తెలియదని నాకు అర్థమైంది’’
‘‘చిన్నప్పుడు జేమ్స్‌బాండ్ సినిమాలు చాలా చూశా. ప్రపంచం సంక్షోభంలో పడిపోయినప్పుడు జేమ్స్‌బాండ్ అందమైన అమ్మాయితో కలిసి సాహసాలు చేసి ప్రపంచాన్ని రక్షిస్తాడు. హాలివుడ్ వాళ్లు సినిమాల్లో మాత్రమే ప్రపంచాన్ని రక్షించారు. కానీ మా సర్దార్జీ నిజంగా ప్రపంచాన్ని రక్షించాడని చెప్పుకోవడం ఎంత గర్వంగా ఉంటుంది’’
‘‘నీకు విషయం అర్థం కావడం లేదు. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో పడిపోతుంది. అంటే డబ్బులకు కటకట అన్నమాట’’
‘‘వావ్- ఎంత మంచి మాట చెప్పావురా! నెలాఖరులో మనం డబ్బులకు కటకటలాడుతాం. చివరి మూడు రోజులు టీ, టిఫిన్‌లకు కూడా డబ్బులుండవు. అంటే దేశాలు కూడా మనలాంటి వేతన జీవులే అన్నమాట. ఖర్చుకు డబ్బు లేక కటకటలాడుతున్నాయి.’’
‘‘అది కాదు.. జీడీపీ అని ఒకటుంటుంది లే! మన జీడీపీ గ్రోత్ రేట్  పాకిస్తాన్ కన్నా తక్కువ. బంగ్లాదేశ్ జీడీపీ గ్రోత్ రేట్ 8 శాతం, నేపాల్ 7.9, భూటాన్ 7.4 పాకిస్తాన్ 5.4 కానీ- ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ 5 శాతమని తెలుసా?’’
‘‘వాట్సాప్‌లో ఈ ప్రచారం చూశాను. నీకో మంచి ఐడియా ఇవ్వా లా?’’
‘‘ఇవ్వు.. ’’
‘‘మీ అబ్బాయిని అమెరికా కా ?  కెనడా కా ? ఎటు పంపాలి అని తెగ ఆలోచిస్తున్నావు కదా ? అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నావు కదా? ఆ ప్రయత్నాలన్నీ మానేయ్’’
‘‘ఎందుకు?’’
‘‘అమెరికా వెళ్లాలంటే అరకోటి ఖర్చు. ట్రంప్ అక్కడ ఉండనిస్తాడో వెనక్కి పంపుతాడో తెలియక రోజూ టెన్షన్‌తో చావాలి. పైగా అమెరికా జీడీపీ గ్రోత్ రేట్ 50 ఏళ్ళ నుంచి 3శాతమే. అదే నేపాల్‌కో, పాకిస్తాన్‌కో పంపించావనుకో ఎనిమిది శాతం జీడీపీ గ్రోత్ రేట్ . మన రూపాయికి అక్కడ రెండు రూపాయిలిస్తారు. రైలులో వెళ్లి పోవచ్చు. ఏమంటావ్?’’
‘‘ఏం చెప్పదలుచుకున్నావ్..’’
‘‘ప్రతి విషయం మీద మనం మాట్లాడొద్దు. సాహో సినిమా గురించి మాట్లాడడం వేరు. ఆర్థిక సంక్షోభం, జీడీపీ వంటి విషయాలు వేరు. ఇదేమీ రెండు గంటల సినిమా కాదు. ఆ రంగంలో నిపుణులు చెప్పింది విందాం. తెలియని దాని గురించి ఏదో అయిపోతుందని ప్రచారం చేయకు. ఈ దేశానికి సంక్షోభాలు కొత్త కాదు. ఎదిరించి నిలబడింది. నిలబడుతుంది. భవిష్యత్తు మనదే.
బుద్దా మురళి (జనాంతికం 7-9-2019)

30, ఆగస్టు 2019, శుక్రవారం

బిక్షగాడి యుద్ధ నినాదం

‘‘మనిషన్నాక అనేక పనులుంటాయి. ఏం మీకుండవా? వారం రోజులు సెలవు పెడితే ఇక అంతేనా? ప్రపంచంలో ఎవరూ సెలవు పెట్టరా? ఏం నువ్వు సెలవు పెట్టవా? అంతెందుకు ట్రంప్ భార్యాపిల్లలతో విహారానికి వెళ్లడా? మోదీ మొన్న వెళ్లలేదా? అతనెవరో చానల్ అతనితో కలిసి అడవుల్లో తిరగలేదా? మీ అందరూ సెలవు పెడతారు. నేనెందుకు సెలవు పెట్టోద్దు’’
‘‘మీ బాసే కాదు బాస్ ప్రపంచంలో ఏ బాస్‌కైనా సెలవులంటే పడదు. అంతెందుకు మీ ఇంట్లో పనిమనిషి సెలవు పెడితే మీ ఆవిడ ఊరుకుంటుందా? ఏమైందో చెప్పు?’’
‘‘ఫేస్‌బుక్‌లో స్టేటస్ అప్‌డేట్ చేశాను కూడా సెలవుపై వెళుతున్నాను. వారం రోజులు ఎవరికీ అందుబాటు లో ఉండను అని. ఇన్ని దశాబ్దాల నుంచి లేని తొందర ఈ వారంలోనే వచ్చిందా? నేను సెలవులో ఉన్నది చూసి నిర్ణయం తీసుకుంటారా?’’
‘‘ఔను తప్పే కుటుంబ పెద్దగా చెప్పకుండా కుటుంబం కీలక నిర్ణయం తీసుకోవడం తప్పే. మీ ఇంట్లో వాళ్లు నీ సెలవులో అంత కీలక నిర్ణయం ఏం తీసుకున్నారు?’’
‘‘ఇంటి నిర్ణయం కాదు.’’
‘‘మరి?’’
‘‘నేను సెలవులో ఉన్నది చూసి మోదీ కాశ్మీర్‌పై నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక ఆయనకు ట్రంప్ మద్దతు కూడా ఉన్నట్టుంది. ఇదేం ప్రజాస్వామ్యం ఇదేం దేశం. సెలవులు ముగించుకుని వచ్చాక, నా అభిప్రాయం అడిగి నిర్ణయం తీసుకోవలసింది’’
‘‘ఓరి భడవా! ఇదా విషయం నువ్వు సరదాగా అంటున్నావో సీరియస్‌గా అంటున్నావో తెలియదు కానీ... సామాజిక మాధ్యమాల్లో కొందరి కామెంట్లు చూస్తుంటే నాకూ ఇలానే అనిపించింది. అదేదో ఫేస్‌బుక్‌లో బిజీగా ఉండే వీరితో చర్చించిన తరువాతనే మోదీ నిర్ణయం తీసుకోవాలి అన్నట్టుగా ఉంది. సామాజిక మాధ్యమాలు పుట్టక ముందు ఇలాంటి మాటలు ‘లెఫ్ట్’ వైపు వారి నుంచి వినిపించేవి. వామవాదం వారు చిక్కిశల్యమై అదృశ్యమయ్యారు. కానీ వారి మాటలు వినిపిస్తున్నాయి.’’
‘‘ ఈ రోజు వంట ఏం వండుతున్నావ్! డియర్ అని భార్యను ముద్దుగా అడిగితేనే.. ఫోరా కుయ్యా వండింది ఇష్టం ఉంటే తిను లేకుంటే వెళ్లిపో అని గట్టిగా చెబుతుంది. అలాంటిది కాశ్మీర్ వంటి కీలక విషయంపై కోన్ కిస్కాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారా! మన అమాయకత్వం కానీ... ఏదో ప్రజాస్వామ్యం .. చీకటి రోజు, హక్కులు అనే మాటలు ఉపయోగించేందుకు బాగుంటాయని అంటుంటాం’’
‘‘నీలో నాకు బాగా నచ్చే విషయం ఇదేనోయ్! ఎక్కువ సార్లు సిల్లీగా ఆలోచించినా, తరువాత ప్రాక్టికల్‌గా ఆలోచించి నిన్ను నువ్వే సముదాయించుకుంటావ్’’
‘‘రోజూ చచ్చే వాడి కోసం ఏడిచే వాడెవడు అన్నట్టు రోజూ ఏడవడం కన్నా కాశ్మీర్‌పై ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమైతే అది అయింది చూద్దాం ఏమవుతుందో?’’
‘‘ఐనా ప్రపంచం క్లిష్టపరిస్థితిలో ఉంటే నువ్వు అంతగా నవ్వడం ఏమీ బాగోలేదు ’’
‘‘నా నవ్వుకు ప్రపంచం క్లిష్టపరిస్థితిలో ఉండడానికి అస్సలు సంబంధం లేదు. ఐనా ప్రపంచం క్లిష్టపరిస్థితిలో ఉందని నీకెవరు చెప్పారు?’’
‘‘మరెందుకు నవ్వుతున్నావ్?’’
‘‘పాకిస్తాన్ కార్టూనిస్ట్ ఎవరైనా తెలిస్తే బాగుండు కార్టూన్‌కు ఓ మంచి ఐడియా వచ్చింది’’
‘‘ఏమా ఐడియా?’’
‘‘అక్టోబర్‌లో భారత్‌తో యుద్ధం చేస్తామని పాక్ మంత్రి ఒకరు ప్రకటించారు కదా? ఒక రూపాయి దానం చేయండి బాబూ! ఇండియాతో యుద్ధం చేస్తాం అని అడుక్కుంటున్నట్టు కార్టూన్ వేస్తే పేలిపోతుంది కదూ’’
‘‘పాకిస్తాన్ మీడియాలో ఇలాంటి కార్టూన్ వేస్తే ఆ పత్రికను పేల్చేస్తారు.’’
‘‘ఇండియాలో వేస్తే...’’
‘‘ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తారు. రాజకీయ పక్షాలు, సిద్ధాంతాలు, సామాజిక వర్గాలు, రాష్ట్రాలను బట్టి ఉంటుంది’’
‘‘ఏది ఉదాహరణకు ఒక్కటి చెప్పు?’’
‘‘మోదీ భక్తులు అహంకారంతో వేసిన కార్టూన్ ... అంటారు లిబరల్ వాదులు’’
‘‘ఎప్పటి నుంచో నాకో సందేహం? తమ దేశం ఏం చేసినా తప్పు పట్టే మేధావులు మన దేశంలోనే ఉంటారా? అన్ని దేశాల్లో ఉంటారా? తప్పును తప్పు అని నిలదీయడం అభ్యుదయం అవుతుందా? ఏం చేసినా తప్పు అనడమే అభ్యుదయమా?’’
‘‘మరీ దేశమంతా అలానే ఉన్నారనుకోకు... మొన్న పాక్ దేశీయులు అమెరికాలో భారత జాతీయ పతాకాన్ని కాలుతో తొక్కుతూ నినాదాలు చేస్తుంటే ఓ మహిళా జర్నలిస్టు అడ్డుకుని జాతీయ పతాకాన్ని చేతిలోకి తీసుకుంది. అందరూ ఒకేలా ఉంటారని ఎందుకనుకుంటావు’’
‘‘నువ్వు ఎందుకు నవ్వావో చెప్పనే లేదు’’
‘‘మా వద్ద అణుబాంబులు ఉన్నాయి. ఇండియాపై అణుబాంబులు వేస్తామని పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ హెచ్చరించాడు. ఇదెంత సీరియస్ విషయం కదా? దీనిపై ఒక నెట్‌జన్ కామెంట్ చేస్తూ మా వద్ద ఉన్న అణుబాంబులు మేమేమైనా రాహుల్ గాంధీ పెళ్లిలో వేయడానికి ఉపయోగించుకుంటామా? అని ప్రశ్నించాడు. అది గుర్తుకు వచ్చి’’
‘‘అవి రెండూ జరిగే పనులు కావు’’
‘‘ఏ రెండు’’
‘‘రాహుల్ పెళ్లి.. యుద్ధంలో అణుబాంబుల ప్రయోగం’’
‘‘అలా అనుకుంటావు. నీకు గుర్తుందా. తెలంగాణ సమస్య, కాశ్మీర్ వివాదం ఎప్పటికీ పరిష్కారం కావు అని చాలా మంది కొన్ని దశాబ్దాల పాటు జోకులేసుకున్నాం. తెలంగాణకు కెసిఆర్ రూపంలో పరిష్కారం లభిస్తే, మోదీ రూపంలో కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించింది. ’’
‘‘అంతే అంటావా?’’
‘‘ఈ పరిష్కారాలు కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చక పోవచ్చు. పరిష్కార ఫలితాల కాలం చెబుతుంది.’’
‘‘మరి పాక్ యుద్ధం చేస్తే..’’
‘‘వెనకటికొకడు లేస్తే మనిషిని కాను అన్నాడట! నిండా అప్పుల్లో మునిగిపోయి... కాగితం రెండు వైపుల వాడాలని, పెట్రోల్ ఎక్కువగా వాడొద్దు అనేంత వరకు వచ్చిన పాక్ ఆర్థిక పరిస్థితి తెలిసే అడుగుతున్నావా? ఒక దేశం మరో దేశంతో యుద్ధం చేయడం అంటే దొంగ చాటుగా మానవ బాంబులను ప్రయోగించడం కాదు.’’
‘‘ఔను ఈ మధ్య పాక్ మేధావుల ఉపన్యాసాల వీడియోలు కొన్ని చూశాను. మన గ్రామాల్లో ఎవరు కనిపించినా అప్పులు అడిగే వాడ్ని చూస్తే పారిపోతారు. ఇప్పుడు ప్రపంచమనే గ్రామంలో పాక్ పరిస్థితి అలానే ఉందని పాక్ మేధావి ఒకరు చెప్పారు.ఐనా ప్రజలను సంతృప్తి పరిచేందుకు యుద్ధం అంటూ ప్రకటనలు చేయాలి తప్పదు’’
‘‘ఔను బిక్షగాడు యుద్ధం చేయడు.’’

బుద్ధా మురళి (జనాంతికం 30-8-2019)

20, ఆగస్టు 2019, మంగళవారం

ఇన్వెస్ట్ మెంట్ పంట

సంపాదన లేకపోయినా ఇనె్వస్ట్ చేయవచ్చు. ఇదేదో లాటరీ కాదు. లక్కీ స్కీం అంత కన్నా కాదు. ఇది నిజం. జీవితంలో విజయం సాధించే వారు ఆచరించి చూపిన మార్గం. సాధారణంగా 20 వరకు చదువు సాగుతుంది. ఆ తరువాత ఉద్యోగ వేట వెంటనే ఫలిస్తే, 20 నుంచి 25 ఏళ్ల వయసు నుంచి సంపాదన మొదలవుతుంది. ముందు చూపు ఉన్న వారు అప్పటి నుంచి పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్‌ను ప్రారంభించవచ్చు. ఇది చాలా మంది చేసేదే. కానీ ఇంకాస్త ముందు చూపు ఉంటే సంపాదన మొదలు కాక ముందే ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభించవచ్చు. 
ఇనె్వస్ట్‌మెంట్ అంటే మన మదిలో మెదిలేది. కేవలం డబ్బు మాత్రమే. కానీ ఆ డబ్బు సంపాదనకు అవసరం అయిన జ్ఞానాన్ని సంపాదించడం కూడా ఇనె్వస్ట్‌మెంట్‌గానే భావించాలి. డబ్బుకు సంబంధించిన జ్ఞానం లేనప్పుడు ఎంత డబ్బు ఒకరి చేతికి ఇచ్చినా అది నిలవదు. అదే డబ్బుకు సంబంధించిన జ్ఞానం ఉన్నవారి వద్ద ఆ డబ్బు మరింతగా పెరుగుతుంది. చదువుకునే రోజుల్లో మన వద్ద బోలెడు సమయం ఉండవచ్చు. కానీ ఇనె్వస్ట్‌మెంట్‌కు అవసరం అయిన డబ్బులు ఉండక పోవచ్చు. ఆ సమయంలో మనపై మనకు ఆత్మవిశ్వాసం అవసరం. డబ్బు డబ్బును ఆకర్శిస్తుంది. ఇది నిజం. ఇది జ్ఞాన యుగం. టాటాలు, బిర్లాలు, అంబానీల వంటి శ్రీమంతుల కుటుంబాలే కాదు. సాధారణ కుటుంబాల వాళ్లు సైతం జ్ఞానంతో సంపన్నులు అవుతున్న కాలం ఇది.
జ్ఞాన సముపార్జన కాలంలో, జ్ఞానంపై మన సమయాన్ని ఇనె్వస్ట్ చేయాలి. సంపాదన మొదలు పెట్టే కాలానికి అది మీకెంతో ఉపయోగపడుతుంది. ఇంకా చదువుకుంటున్నాను. చదువు పూర్తయి, ఉద్యోగం రావాలి ఆ తరువాత ఇనె్వస్ట్‌మెంట్ గురించి ఆలోచిస్తాను అనుకునే రోజులు కావు ఇవి. నీకు ఎక్కడ అవకాశం ఉంటే అది ఇనె్వస్ట్ చేయవచ్చు. నిరంతరం ఇనె్వస్ట్ చేయవచ్చు. చేతిలో ఒక రూపాయి లేకపోయినా ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభించవచ్చు.
జీవితానికి ఉపయోగపడే జ్ఞానంపైన, చదువు పూర్తయిన తరువాత ఏ రంగంలో స్థిరపడాలి అనుకుంటున్నారో ఆ రంగం గురించి అవసరమైన జ్ఞాన సముపార్జనపై సమయాన్ని ఇనె్వస్ట్ చేయవచ్చు.
ఇంజనీరింగ్ కావచ్చు, సాధారణ డిగ్రీ కావచ్చు. ఏదో ఒక డిగ్రీతో ఉద్యోగం లభిస్తుంది అనుకునే రోజులు కావు ఇవి. అవకాశాలు పెరిగాయి అదే సమయంలో పోటీ పెరిగింది. పోటీ కాలానికి తగ్గట్టుగా మీ సమయాన్ని జ్ఞాన సముపార్జన కోసం ఇనె్వస్ట్ చేయవచ్చు.
ఉద్యోగం లేదా వృత్తి, వ్యాపారం ద్వారా మీరు సంపాదన ప్రారంభించినప్పుడు ఈ జ్ఞానం మీకు ఎంతో ఉపయోగపడుతుంది.
జ్ఞానంపైనే కాదు చదువుకునే వయసులో ఆరోగ్యంపై కూడా ఇనె్వస్ట్ చేయవచ్చు. చదువు, సంపాదన, వృత్తి ఏదైనా ఈ శరీరంతోనే కదా చేసేది. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. నడక, వ్యాయామం, యోగా వంటివాటికి పైసా ఖర్చు అవసరం లేదు. అది మీకు బోలెడు లాభాలను తెచ్చిపెడుతుంది.
సంపాదన ప్రారంభించాకే ఖర్చు
సంపాదన ప్రారంభించిన తరువాతనే ఖర్చు మొదలు పెట్టాలి. చదువుకునే రోజుల్లో చదువుకు అవసరమైన ఖర్చు మినహా మిగిలిన వాటిపై అనవసర ఖర్చు చేయవద్దు. సంపాదించినప్పుడు చేసిన ఖర్చులోనే సంతృప్తి ఉంటుంది. దీని వల్ల డబ్బుకు విలువ ఇవ్వడం తెలుస్తుంది. సంపాదనకు మించి ఖర్చు చేయవద్దు. సంపాదన కన్నా ముందే ఖర్చు మొదలు పెట్టవద్దు.
డబ్బులు కాచే చెట్లు
డబ్బులు చెట్లకు కాస్తాయా?
అనే ఈ మాటను మనం ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగించే ఉంటాం. వినే ఉంటాం. డబ్బులు గురించి ప్రస్తావన వచ్చినప్పుడో, డబ్బులు అడిగినప్పుడో చాలా మంది డబ్బులు చెట్లకు కాస్తాయా? అని ప్రశ్నిస్తారు. నిజమే డబ్బులు చెట్లకు కాస్తాయి. ఐతే అన్ని చెట్లకు కాయవు. అందరి చెట్లకు కాయవు. డబ్బు లక్షణాలను గ్రహిస్తే మీ చెట్టుకు కూడా డబ్బులు కాస్తాయి.
అన్ని విత్తనాలు చెట్లు కావు. అన్ని భూముల్లో పంటలు పండవు. సరైన విత్తనాలను ఎంపిక చేసుకుని, సరైన భూమిలో వాటిని నాటాలి. పంటను నిరంతరం పరిశీలిస్తుండాలి. మంచి రైతు మాత్రమే మంచి పంట పండిస్తాడు. చెట్లకు చీడపురుగులు పడితే తగిన చర్యలు తీసుకోవాలి. నీరుపోయాలి. కలుపు తీయాలి. అప్పుడే మంచి పంట చేతికి వస్తుంది. డబ్బులు కూడా అంతే.
పంట వేసినప్పటి నుంచి కోతలు, పంటను మార్కెట్‌కు చేరేంత వరకు రైతు నిరంతరం కష్టపడతాడు. అప్రమత్తంగా ఉంటాడు. అప్పుడే మంచి పంట చేతికి వస్తుంది. లాభసాటిగా ఉంటుంది.
డబ్బు వ్యవహారంలో సైతం అచ్చం ఇదే విధంగా ఉండాలి. అప్పుడే చెట్లకు డబ్బులు కాస్తాయి.
మంచి విత్తనాలను, మంచి నేలలో పాతితేనే పంట పండుతుంది. ఇనె్వస్ట్‌మెంట్ సైతం అంతే. లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే ఏడాదిలో రెండు లక్షలు ఇస్తాం అనే ఆఫర్‌లను నమ్మితే నకిలీ విత్తనాలను పొలంలో నాటినట్టే. తాలు విత్తనాలతో పంట పండదు. పెట్టుబడి వృధా అవుతుంది. సరైన విత్తనాలు అంటే సరైన దానిలో పెట్టుబడి పెట్టడం. పెట్టిన పెట్టుబడి ఏ రీతిలో పెరుగుతుందో నిరంతరం పర్యవేక్షించాలి. బ్యాంకులో డిపాజిట్ చేసే కళ్లు మూసుకుని పడుకున్నా, రోజూ లెక్కలు చూసుకున్నా పెరుగుదల చాలా స్వల్పంగానే ఉంటుంది. మంచి ఆదాయం రావాలి అంటే మంచి ఆదాయం ఉన్న రంగాల్లో పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి ఏ విధంగా పెరుగుతుందో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అప్పటికప్పుడు అవసరం ఐన మార్పులు చేర్పులు చేయాలి. మంచి విత్తనాలు, మంచి భూమి, సరైన రీతిలో మంచి పంట పండించినట్టుగానే సరైన రీతిలో ఇనె్వస్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. డబ్బులు చెట్టుకు కాస్తాయా అంటే కచ్చితంగా కాస్తాయి. అయితే మంచి పంట పండించే సత్తా మనలో ఉందా? అనేది ముఖ్యం. తాలు విత్తనాలతో మంచి పంట పండించలేం.
-బి.మురళి

ఫ్రీడం ఫండ్

స్వాతంత్య్ర పోరాటం గురించి మనం చదివే ఉంటాం. స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎంతోమంది మన జీవితాలకు ప్రేరణగా నిలిచారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆ కాలంలో విద్యార్థులు చదువులను వదిలేశారు. న్యాయవాదులు ఎంతో ఆదాయం వచ్చే వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. ఎందుకు? బానిసత్వం భరించరానిది కాబట్టే స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం తెగించారు.
మరి మనమేం చేస్తున్నాం?
చేయడానికి ఏముంది. అప్పుడంటే బ్రిటీష్ పాలనలో ఉన్నాం, బానిసత్వం నుంచి విముక్తి కోసం బ్రిటీష్ వారిపై పోరాడే అవకాశం వారికి దక్కింది. ఇప్పుడు మనం స్వేచ్ఛా జీవులం ఎవరి మీద పోరాడాలి అనే కదా? అనిపిస్తోంది.
మనం నిజంగా స్వేచ్ఛా జీవితం గడుపుతున్నామా? బానిసత్వంలో లేమా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి నిజంగా మనం అంత స్వతంత్రులమా? నచ్చక పోయినా, మనసు ఒప్పుకోక పోయినా ఉద్యోగం చేస్తున్న వారు మనలో ఎంత మంది లేరు.
నరాలు తెగిపోయే టెన్షన్‌ను అనుభవిస్తూ ఇష్టం లేకపోయినా జీతం కోసం ఉద్యోగం చేస్తున్న వారు ఎంత మంది లేరు. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఏదైనా కావచ్చు అనివార్యంగా చేస్తున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. నిజానికి ఇదో రకమైన బానిసత్వం.
జీతం రాకపోతే ఇల్లు గడవదు. జీవితం సాగదు కాబట్టి మనసుకు నచ్చినా నచ్చక పోయినా చేయాల్సిందే. ఇదో రకం బానిసత్వమే కదా? చట్టం ఆమోదించిన బానిసత్వం కాదా?
పోనీ ఇంత ఒత్తిడిని అనుభవిస్తూ ఉద్యోగం చేసినా అది, రిటైర్ అయ్యేంత వరకు ఉంటుందా? అంటే అనుమానమే? ప్రభుత్వ ఉద్యోగాలకే భరోసా లేని రోజులివి. బిఎస్‌ఎన్‌ఎల్ ఎప్పుడు మూత పడుతుందో అన్నట్టుగా ఉంది. విమానయాన సంస్థలు మూత పడ్డవి కొన్ని, దివాళా అంచుల్లో ఉన్నవి కొన్ని. జెట్ విమాన యాన సంస్థ పుణ్యమా అని పెలెట్లు కూడా జీతాల కోసం రోడ్డున పడ్డ దృశ్యాలు చూశాం. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్నో మూత పడ్డాయి. ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అమెరికాలో ఐబిఎంలో ఏవేవో కారణాలతో రెండు మూడేళ్లలో లక్ష మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారని వార్తలు వచ్చాయి.
ఏతా వాతా చెప్పొచ్చేది ఏమిటంటే ఏ ఉద్యోగం కూడా గుండెలు మీద చేయి వేసుకుని హాయిగా రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది అనే భరోసా లేదు. అలా ఉంటే అదృష్టమే కానీ లేకపోయినా పరిస్థితులు మారిపోయినా భయపడాల్సిన అవసరం లేని స్థితికి ఎవరికి వారే చేరుకోవాలి.
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వారి కాలంలో మనం లేకపోవచ్చు. కానీ మన స్వాతంత్య్రం కోసం మనం చిన్న పాటి ప్రయత్నం చేయలేమా?
ఫ్రీడం ఫండ్...
నిజమే మన స్వాతంత్య్రం కోసం మనమే ఏర్పాటు చేసుకునే ఫండ్.
వ్యాపారం, ఉద్యోగం, వృత్తి మీ సంపాదన మార్గం ఏదైనా కావచ్చు. కానీ మీ ఆదాయంలో లేదా మీ జీతంలో కనీసం పది శాతాన్ని ఫ్రీడం ఫండ్‌గా కేటాయించాలి. పది శాతం పొదుపు చేసి సరైన రీతిలో ఇనె్వస్ట్ చేస్తే ఏడాదికి దాదాపు పది శాతం వడ్డీ వస్తుంది. చక్రవడ్డి మహత్యం వల్ల క్రమంగా అది పెరుగుతూనే ఉంటుంది. ఒకనాటికి ఆ ఫ్రీడం ఫండ్ మీకు నిజంగానే స్వాతంత్య్రాన్ని ప్రసాదిస్తుంది. ఉద్యోగం లేకపోయినా బతికే స్థితికి చేరుకుంటారు. అలానే కొనసాగిస్తే రిటైర్‌మెంట్ తరువాత మీరు కోరుకున్న విధంగా జీవించడానికి అవసరమైన డబ్బు ఈ ఫ్రీడం ఫండ్ సంపాదించి పెడుతుంది.
ఉద్యోగంలో చేరిన కొత్తలో పొదుపు అనేది ప్రారంభంలో అంతగా ఆసక్తి కలగకపోవచ్చు. కానీ భవిష్యత్తులో తలెత్తే సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఈ రోజు ప్రారంభించిన చిన్న పొదుపే భవిష్యత్తులో కొండంత అండగా నిలుస్తుందే విషయం తెలుస్తుంది.
పొదుపు ఒకసారి అలవాటు కావడం కష్టం. అలవాటు ఆయిన తరువాత అదెంత మంచి అలవాటో మీరే ఇతరులకు చెప్పగలరు.
పొదుపు చేసిన డబ్బును సరైన విధంగా ఇనె్వస్ట్ చేయాలి. మీకు తెలిసిన రంగంలోనే ఇనె్వస్ట్ చేయాలి. ఆర్థిక రంగంలో నిపుణుల అభిప్రాయం ప్రకారం మన పొదుపును మూడు రకాలుగా ఇనె్వస్ట్ చేయవచ్చు.
1. మొదటి విభాగంలో నష్ట్భయం అస్సలు లేని విధంగా పెట్టుబడి పెట్టాలి. బ్యాంకులో డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్, బాండ్లు వీటిలో ఆదాయం తక్కువగా ఉండవచ్చు కానీ నష్ట్భయం ఉండదు.
2. రెండవ భాగాన్ని ఆదాయం ఎక్కువ, అదే విధంగా నష్ట భయం ఎక్కువగా ఉండే వాటిలో ఇనె్వస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఎగుడు దిగుడులు ఎక్కువ. వస్తే ఆదాయం విపరీతంగా రావచ్చు, అదేవిధంగా నష్ట్భయం ఉంటుంది. రిస్క్ ఎంతో ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ విభాగంలో కొంత వరకు ఇనె్వస్ట్ చేయవచ్చు.
3. ఈ రెండింటికి భిన్నంగా కొంత భాగాన్ని మూడవ విభాగంలో ఇనె్వస్ట్ చేయవచ్చు. ప్రధానంగా స్టాక్ మార్కెట్‌లో వచ్చిన ఆదాయం కొంత వరకు మూడవ విభాగంలో ఇనె్వస్ట్ చేయాలి. మీ పొదుపును మూడు విభాగాలుగా చేసుకుని ఇనె్వస్ట్ చేయడం వల్ల ఒక దానిలో నష్టపోయినా మరో విభాగం ఉంటుంది. ఇక మొదటి విభాగంలో ఎలాంటి నష్ట్భయం లేని ఇనె్వస్ట్‌మెంట్ కాబట్టి మిగిలిన రెండు విభాగాల్లో దెబ్బతిన్నా మొదటి విభాగం ఆదాయం వల్ల కనీస అవసరాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మూడు విభాగాల్లోనూ ఆదాయం వస్తే మీ పంట పండినట్టే.
పొదుపు అనేది ప్రారంభంలో పెద్దగా ఆసక్తి అనిపించక పోవచ్చు. కానీ రేపటి రోజును ఊహించుకుంటే పొదుపు ఒక అలవాటుగా మారుతుంది. మీ స్వేచ్ఛ కోసం ఫ్రీడం ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ఈ రోజే మంచి రోజు. మంచి పనికి ఏ రోజైనా మంచి రోజే మీ వయసు? మీ ఆదాయం? మీ వృత్తి ఏదైనా కావచ్చు. పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్‌కు అన్నీ మంచి రోజులే ఈ రోజే ఫ్రీడం ఫండ్ కు శ్రీకారం చుట్టండి.
-బి.మురళి (11-8-2019)

27, జులై 2019, శనివారం

ప్రజాస్వామిక నల్లి!

‘‘అలా నవ్వుతూనే పోయేట్టుగా ఉన్నావ్? మరీ అంతగా పగలబడి నవ్వకు..’’
‘‘హా..హా..హా...’’
‘అదేంటో మాకూ చెప్పు.. మేమూ నవ్వుతాం’’
‘‘మూడ్ బాగా లేదు. మంచి అడల్ట్ జోక్ చెప్పమన్నాను’’
‘‘ఏం జోక్ చెప్పాడు? నాకూ చెబితే నవ్వుకుంటాను.’’
‘‘విలువలతో కూడిన రాజకీయాలు అని ఏకవాక్య జోకు చెప్పాడు.’’
‘‘జోక్ అంటే సంక్షిప్తంగా ఉండాలి. బోలెడు నవ్వు పుట్టించాలి. ఏక వాక్యజోకు ఇంతకు మించింది ఉండదు.’’
‘‘ఏకవాక్య జోక్‌లు ఇంకా చాలానే ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అనే మాట విన్నావుకదా? ఇదెలా పుట్టిందో నీకు తెలుసా?’’
‘‘ఉమ్మడి రాష్ట్రంలో, విడివిడి రాష్ట్రాల్లో సమావేశాలు జరిగిన ప్రతి సారీ, ప్రతి రోజూ ఎవరో ఒకరు ఈ మాట అంటారు. కానీ నిజంగా ఇది ఎలా పుట్టిందో తెలియదు.’’
‘‘ఈ మాట సమావేశంలోనే పుట్టింది. ఈ మాట పుట్టుక చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. అనగనగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న రోజు.. సభలో ఒకాయన లేచి అధ్యక్షా.. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అని కూర్చున్నాడు. అప్పుడేమో అసెంబ్లీలో సంతాప తీర్మానం సందర్భంగా మరణించిన సభ్యులకు నివాళి అర్పిస్తున్నారు. ఇంత అద్భుతంగా ఏకవాక్య నివాళి ఎవరూ అర్పించలేదని కొందరు సభ్యులు అతడిని అభినందించారు. ఆయన పార్టీ సభ్యులు దగ్గరకు వచ్చి భుజం తట్టారు. మరణించిన సభ్యుల గురించి చాలామంది తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అసెంబ్లీలో దివంగత సభ్యుడు ఎలా మాట్లాడేవాడో, నియోజకవర్గం ప్రజలతో అతని సంబంధాల గురించి అంతా మాట్లాడారు. కానీ సభలో ఏనాడూ నోరుమెదపని ఆ ఒక్క సభ్యుడు మాత్రమే ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అని అద్భుతంగా నివాళి అర్పించాడని రాజకీయ పక్షాలకు అతీతంగా అంతా అభినందించారు. ఏం జరుగుతోందో అతనికి అర్థం కాలేదు. నిద్రమబ్బుతో ఆయోమయంగా పక్కనున్న సభ్యుడిని అడిగాడు.. ఏం జరిగింది? అంతా నన్ను ఎందుకు అభినందిస్తున్నారు అని. అదేంటి..? ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అని నివాళి అర్పించి, ఏం జరిగిందని అడుగుతున్నావని పక్క సభ్యుడు సమాధానం ఇచ్చాడు. ‘ఓ అదా- మంచి నిద్రలో ఉన్నాను. నల్లి కుట్టింది. అసెంబ్లీ సీట్లలో కూడా నల్లులా? అని కోపం వచ్చింది. మంచి నిద్ర పాడుచేసిన నల్లిని చంపేసి, అసెంబ్లీలో నల్లులా? ఇదేం అసెంబ్లీ? ఇదేం ప్రజాస్వామ్యం? హాయిగా నిద్ర పోనివ్వరా? అని కోపంతో ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు- అన్నానని వివరించాడు. అందుకే సభ జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అనగానే ఈ సంఘటన గుర్తుకు వస్తుంది. ’’
‘‘ అది సరే.. ఇంతకూ విలువలతో కూడిన రాజకీయాలు అనే ఏకవాక్య జోక్ ఇప్పుడు నీకెందుకు గుర్తుకు వచ్చింది?’’
‘‘కర్నాటక రాజకీయాలు చూసి.. ప్రజాస్వామ్యం గెలించింది అని ఒకరు, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ఇంకొకరు, ధర్మమే గెలిచింది అని మరొకరు.. ఇలా ఒకరిని మించిన ప్రకటనలు ఒకరు చేస్తూ కన్నడ నాటకంతో దేశంలో అందరికీ బోలెడు వినోదాన్ని పంచుతున్నారు’’
‘‘నువ్వెన్నయినా చెప్పు- కర్నాటక రాజకీయంతో దేశానికి గొప్ప సందేశం ఇచ్చినట్టు అయింది?’’
‘‘ఏంటీ? ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టవచ్చునో నేర్పడమా?’’
‘‘అదేదో ఎమ్మెల్యేలను దేశంలో మొదటిసారి కొంటున్నట్టు, ప్రభుత్వాలను ఇప్పుడే పడగొడుతున్నట్టు, రాజకీయాలు ఇప్పుడే చెడిపోయినట్టు మాట్లాడకు. ఇప్పుడు జరుగుతున్నవి అన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే. అనేక సార్లు జరిగినవే’’
‘‘మరి- దేశానికి ఏం నేర్పినట్టు?’’
‘‘మా ఐదుగురు అన్నదమ్ముల్లో ఆ ‘కర్రోడే’ కాస్త తెలుపు- అని ఏదో సామెత చెప్పినట్టు మార్కెట్‌లో ఇప్పుడున్న రాజకీయ పక్షాల్లో విలువలు పాటించేది తామేనంటూ ఎవరికి వారే చెప్పుకునే వారు. కొందరు మెల్లగా చెప్పుకుంటే, కొందరు సిగ్గుపడుతూ చెప్పుకునే వారు. ఒకరు మాత్రం గోడెక్కి గట్టిగా తామే పవిత్రులం అని చెప్పుకునే వారు. కర్నాటక రాజకీయాలతో ‘కర్రోళ్లు’ అంతా కారునలుపే వారిలో ఏ ఒక్కరూ తెలుపుకాదు అని తేలిపోయింది. దేశానికి ఇంత కన్నా గొప్ప సందేశం ఇంకేం కావాలి?’’
‘‘కర్రోళ్లంతా కారు నలుపు.. వారిలో తెల్లగా ఎవరూ లేరని తేలడం ఇదే మొదటి సారేం కాదుకదా? చిన్నాచితక రాష్ట్రాల్లో రాత్రికి రాత్రే విపక్షం అధికార పక్షంగా మారిపోవడం జరిగింది కదా? ’’
‘‘మండపేటకు చెందిన పిల్లాడిని ఎవరు కిడ్నాప్ చేశారు? తమ టీవీలో వార్తల హోరు చూసే కిడ్నాపర్లు వదిలివేశారని అన్ని టీవీ చానళ్లవారు ఎవరికివారు కథనాలతో హోరెత్తిస్తున్నాయి. పిల్లకాయలను కిడ్నాప్ చేయడం ఇదే మొదటిసారా? వదిలి వేయడం మొదటిసారా? టీవీలో ఆ వార్తలు రావడం మొదటిసారా? కాదు కదా? మరెందుకలా హోరెత్తించారు. ప్రతిరోజూ డజన్ల కొద్దీ పిల్లలు కనిపించకుండా పోతారు. మళ్లీ దొరుకుతారు. కానీ ఇదెందుకు అంత హైలైట్ అయిందంటావ్?’’
‘‘కర్నాటక రాజకీయాలకు, మండపేట కుర్రాడి కిడ్నాప్‌కు సంబంధం ఏమిటి?’’
‘‘అక్కడికే వస్తున్నాను. ప్రతి గల్లీలోనూ కిడ్నాప్‌లు జరగవచ్చు. కానీ మండపేట కుర్రాడు ముద్దుగా ఉన్నాడు. అందంగా ఉన్నాడు. అందమైన ముఖం ఉన్నప్పుడు టీవీలకు చక్కటి వార్త అవుతుంది. ముక్కు చీమిడి కారుతూ చినిగిపోయిన దుస్తులతో పేదరికానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న పిల్లలు తప్పిపోతే అది టీవీలకు వార్త కాదు. అలాగే చీమిడి ముక్కంత రాష్ట్రాల్లో ఏదో జరిగితే దేశం పెద్దగా పట్టించుకోదు. కానీ కర్నాటక లాంటి పెద్ద రాష్ట్రం ఐటీ రంగానికి పేరు పొందిన రాష్ట్రం కాబట్టి దేశంలోని మీడియా దృష్టి ఉంటుంది. గోవా అనగానే బీచ్‌లు గుర్తుకు వస్తాయి కానీ రాజకీయ పరిణామాలు గుర్తుకు రావు. కర్నాటక అంటేనే రాజకీయ నాటకాలు గుర్తుకు వస్తాయి. ఆ పెద్ద రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల పుణ్యమాని మార్కెట్‌లోని రాజకీయ పక్షాలన్నీ ఒకటే అని అంటే- కర్రోళ్లంతా కర్రోళ్లే.. నల్లటివాళ్లలో తెల్లవాడు ఉండడు అని దేశానికి గొప్ప సందేశం లభించింది.’’
*-బుద్దా మురళి (జనాంతికం 26-7-2019)

3, జూన్ 2019, సోమవారం

డబ్బు- హీరో- థ్రిల్

అభిమాన హీరో సినిమా మొదటి రోజు మొదటి ఆట చూడడంలో ఉన్న థ్రిల్ ఎందులోనూ ఉండదు. మీరు చదువుకునే రోజుల్లో అలా మొదటి రోజు మొదటి ఆటకు వెళ్లిన అనుభవాలు మీకున్నాయా? చదువుకునే రోజుల్లో కొంత మంది ఇలా మొదటి రోజు మొదటి ఆటకు వెళ్లడమే కాదు కొందరు ఏకంగా తమ అభిమాన హీరో సినిమా విడుదలకు ముందు రోజు సినిమా హాలును కడిగి, అలంకరించే వారు. హీరో కటౌట్‌ను పాలతో కడిగి పూల మాలలు వేసేవారు. తమ తల్లిదండ్రులు మెడికల్ షాపుకు వెళ్లి మందు గోలీలు తెమ్మన్నా వినని కుర్రాళ్లు కూడా సినిమా హాలును కడిగి అలంకరించడం పవిత్ర కార్యంగా భావించే వాళ్లు. కాలం మారింది .. అభిమానులతో అలంకరించుకున్న సినిమా హాళ్లు ఎన్నో ఇప్పుడు మూత పడ్డాయి. ఇది మల్టీఫ్లెక్స్‌ల కాలం. ఆ కాలం నాటి స్థాయి అభిమానులు లేకపోవచ్చు కానీ మొదటి రోజు మొదటి ఆట సినిమా చూడక పోతే అభిమానానికి అర్థం లేదు, తమ జీవితానికి విలువ లేదు అని భావించే వారి సంఖ్య తక్కువేమీ కాదు.
మహేశ్‌బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాలు మొదటి రోజు మొదటి ఆటకు ఎంత ఖర్చయినా భరించి వెళ్లే అభిమానులకు కొదవ లేదు. మల్టీఫ్లెక్స్‌లో సినిమా అంటే ఒక్కోక్కరికి దాదాపు ఐదు వందల రూపాయల ఖర్చు.
హీరోలు కోట్ల రూపాయల పారితోషకాలు తీసుకుంటారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు పారితోషకాన్ని రియల్ ఎస్టేట్‌లో, సినిమా హాళ్ల నిర్మాణంలో, హోటల్స్ నిర్మాణం, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇటు సినిమాల్లో ఆదాయం మరోవైపు తమ పెట్టుబడులపై ఆదాయం. అది వారి వృత్తి చట్టబద్ధంగా సంపాదించిన డబ్బు వారు ఎక్కడైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు.
హీరో సినిమా అభిమానికి రెండు గంటల పాటు బోలెడు సంతోషాన్న ఇస్తుంది. సినిమా భాషలో చెప్పాలి అంటే బోలెడు కిక్ ఇస్తుంది. అదే హీరోకు పాపులారిటీ, కోట్ల రూపాయల సంపాదన, ప్రజల్లో అభిమానం. వయసు మీరిన తరువాత ఈ అభిమానాన్ని రాజకీయాల్లోకి కూడా మళ్లీంచి ప్రయోజనం పొందవచ్చు. మరి అభిమాని రెండు గంటల కిక్ తరువాత లెక్కలు వేసుకుంటే జేబులో ఐదు వందలు మైనస్ తప్ప ప్లస్ అంటూ ఏమీ ఉండదు.
నిజమే ఇది అందరికీ తెలిసిందే... ధనం- మూలంకు అభిమానుల కిక్‌కు సంబంధం ఏమిటి? అనే కదా? సందేహం.
ఐదు వందలు ఖర్చు పెట్టి రెండు గంటల కిక్‌ను కొంటున్నాం కదా? ఇదే ఐదు వందల రూపాయలతో జీవిత కాలమంతా ఉండే కిక్‌ను కొనుక్కునే అవకాశం వస్తే మీరేం చేస్తారు. ఎగరి గంతేస్తారు కదూ! నిజానికి ఎగిరి గంతేయాల్సిందే కానీ చాలా మంది ఇది తెలియక అలా చేయడం లేదు.
చాలా మంది యువతకు వారానికి ఒక సినిమా చూసే అలవాటు ఉంటుంది. అంటే నెలకు నాలుగు సినిమాలు. ఇప్పటి నుంచి ఒక పని చేయండి. నాలుగు వారాల్లో ఒక వారం సినిమాకు వెళ్లకండి. అదే సినిమా నెల గడిస్తే టీవిలో వస్తుంది. అప్పుడు టీవిలో చూడండి. ఆ ఐదు వందల రూపాయలను స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.
డబ్బు ఇచ్చిన కిక్ మరేదీ ఇవ్వదు. స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేదు. అదో అర్థం కాని సబ్జెక్ట్ ఇప్పుడు దాని గురించి తెలుసుకునే ఓపిక లేదు అంటున్నారు. అవసరం లేదు. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవలసిన అవసరం లేదు. ఇలాంటి వారి కోసమే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మన తరుఫున వాళ్లు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి అంటే లక్షల రూపాయలు అవసరం అనే అపోహతో ఉన్నారేమో! చాలా మందికి తెలియదు కానీ ఇళ్లల్లో పని చేసే పని మనుషులు సైతం ఈజీగా పెట్టుబడి పెట్టవచ్చు. అంతే నెలకు కనీసం ఐదు వందల రూపాయలు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు కావచ్చు. కనీసం నెలకు ఐదు వందల రూపాయలు పొదుపు చేయలేరా? మీరు నెలకు నాలుగు సినిమాలు చూసే విద్యార్థి కావచ్చు మీ భవిష్యత్తు కోసం ఒక సినిమాను తగ్గించుకుని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. సిప్ విధానంలో బ్యాంకు ముందే ఆదేశాలు ఇవ్వ వచ్చు. మీ ఖాతా నుంచి ప్రతి నెల మీరు పేర్కొన్న తేదీ నాడు ఐదువందల రూపాయలు మ్యూచ్‌వల్ ఫండ్స్‌లోకి వెళతాయి. రెండు గంటల పాటు వినోదాన్ని ఇచ్చే సినిమా ఖర్చు ఐదు వందలు. మీ భవిష్యత్తు అవసరాలు తీర్చే ఇనె్వస్ట్‌మెంట్ వ్యయం కూడా అంతే. ఐతే ఈ ఐదు వందల రూపాయలు క్రమ పద్దతిలో ప్రతినెలా ఇనె్వస్ట్ చేయడం వల్ల మీరు ఊహించని విధంగా పెట్టుబడి లాభాలు సమకూరుస్తుంది. ఈ రోజు ఇనె్వస్ట్ చేసి తెల్లవారగానే ఎంత లాభం వచ్చిందని చూసుకుంటే నిరాశ కలగవచ్చు. అలా కాదు ఇనె్వస్ట్‌మెంట్ అనేది దీర్ఘకాలంగా ఉండాలి. మార్కెట్ ఎంత అధ్వాన్న పరిస్థితిలో ఉన్నా ఒక దశాబ్ద కాలం చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ దాదాపు పనె్నండు శాతం వరకు లాభాలను ఇస్తున్నాయి.
సినిమాకు పెట్టిన ఖర్చు ఎంత కాలం అయినా మీకు తిరిగి ఇవ్వడం అంటూ ఉండదు కదా? కేవలం నెల రోజులు నిరీక్షిస్తే అదే సినిమాను ఇంట్లో కూర్చోని టీవిలో చూడవచ్చు. కానీ ఆ ఐదు వందల రూపాయలు మీ కోసం మార్కెట్‌లో పని చేస్తుంది. మీకు రేపటి కోసం ఉపయోగపడుతుంది. చుక్క చుక్క నీరే సముద్రం అయినట్టు ఐదేసి వందల రూపాయలే పెద్ద మొత్తంగా మారుతాయి. మీరు పెట్టుబడి పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ విలువను ఏ రోజుకు ఆ రోజు చూసుకోవచ్చు. మీ పది రూపాయల పెట్టుబడి పదకొండు రూపాయలుగా మారడం వంటి అంకెలు రోజూ చూస్తుంటే సినిమాకు మించిన థ్రిల్ ఇస్తుంది. మీ కోసం మీరు కష్టపడడం కాదు. మీ కోసం మీ డబ్బు కష్టపడడం చిన్న వయసులోనే అలవడితే అంతకు మించిన థ్రిల్లింగ్ ఉండదు. ఐదు వందల రూపాయలు అంటే ఈ రోజుల్లో పిల్లల వారం రోజుల పాకెట్ మనీ. పాకెట్ మనీతో మనీ సంపాదించడం చదువుకునే రోజుల్లోనే అలవాటు ఆయితే జీవితంలో వారికి డబ్బు పట్ల పూర్తి అవగాహన ఏర్పడుతుంది. భవిష్యత్తు జీవితానికి ఉపయోగపడుతుంది. పాకెట్ మనీనే కాదు ఒకవేళ మీరు ఉద్యోగులు అయితే పన్ను ఆదా సదుపాయం ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ విధానం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఒకవైపు పన్ను రాయితీ మరోవైపు డబ్బు డబ్బును సంపాదించడంలో థ్రిల్ అనుభవించడం. అనేక బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్‌ను నిర్వహిస్తున్నాయి. ఇంకెందుకాలస్యం.
-బి. మురళి

23, మే 2019, గురువారం

పెట్టుబడికి సరైన వయసు..

అన్నింటికీ ఒక వయసును నిర్ణయించారు. స్కూల్‌లో చేర్పించాల్సిన వయసు, మైనారిటీ తీరే వయసు, ఓటుకు వయసు ఉంది. పెళ్లి చేసుకోవడానికి కూడా ప్రభుత్వం వయసు నిర్ణయించింది. రిటైర్‌మెంట్‌కు కూడా నిర్ణీతమైన వయసు ఉంది. అలానే ఇనె్వస్ట్‌మెంట్‌కు ఏది సరైన వయసు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. పిల్లలకు డబ్బుల గురించి చెప్పవద్దు అది పిల్లలకు సంబంధించిన అంశం కాదు అనేది చాలా మంది అభిప్రాయం. ఇనె్వస్ట్‌మెంట్‌కు ఒక వయసు ఉంటుందా? ఉండాలా? ఏది సరైన వయసు?
పెట్టుబడుల ప్రపంచంలో సూపర్ స్టార్ లాంటి వారెన్ బఫెట్ తాను పనె్నండేళ్ల వయసులో ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభించారు. ఇనె్వస్ట్‌మెంట్‌కు ఏది సరైన వయసు అని ఆయన్ని అడిగినప్పుడు నేనైతే పనె్నండేళ్ల వయసుకు ప్రారంభించాను, అది చాలా లేటు వయసు అంతకు ముందే ప్రారంభించాల్సింది అని ఇప్పటికీ అనిపిస్తోంది అని నవ్వుతూ బదులిచ్చారు. పనె్నండేళ్ల వయసే ఆలస్యం అంటే మరి ఇంకేది సరైన వయసు?
నిజానికి ఇనె్వస్ట్‌మెంట్‌కు ఇదే సరైన వయసు అని ఏమీ లేదు. మనం ఎప్పుడు మేల్కొంటే అప్పుడే ఇనె్వస్ట్‌మెంట్‌కు సరైన వయసు. అసలు ప్రారంభించక పోవడం కన్నా ఆలస్యంగా ప్రారంభించడం బెటర్ కదా? మీ వయసు ఎంతైనా కావచ్చు, మీ సంపాదన ఎంతైనా ఉండొచ్చు. మీ జీతం ఎంతైనా కానివ్వండి ఇప్పటి వరకు ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభించకపోతే ఇప్పుడైనా శ్రీకారం చుట్టండి. ఇప్పటికీ ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభించకపోతే - చదువుకునే రోజులైనా, ఉద్యోగంలో చేరిన మొదటి రోజైనా, రిటైర్‌మెంట్ తరువాత అయినా ఎప్పుడైనా ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభించవచ్చు. ఎంత త్వరగా ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభిస్తే అంత మంచిది.
డీ మార్ట్ తెలుసు కదా? దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన వ్యాపారం. దేశ వ్యాప్తంగా డీ మార్ట్ సంచలనం సృష్టిస్తోంది. దీని వ్యవస్థాపకులు రాధాకృష్ణ దమానీ. తరుచుగా ఉత్తరాదిలో ఇనె్వస్ట్‌మెంట్ సదస్సుల్లో తమ అనుభవాలను వివరిస్తుంటారు. ఒక సమావేశంలో ఒక ఆసక్తికరమై సంఘటన వివరించారు. పిల్లల పుట్టిన రోజుకు రకరకాల బహుమతులు అందజేస్తారు. కొత్త దుస్తులు, ఆడుకునే బొమ్మలు బహుమతిగా ఇవ్వడం తెలిసిందే. అలానే అతని కుమారుడి పుట్టిన రోజుకు కొందరు బట్టలు, కొందరు బొమ్మలు బహుమతిగా ఇచ్చారట! ఒక మిత్రుడు మాత్రం హెచ్.డి.ఎఫ్.సి. కంపెనీకి చెందిన ఐదువందల షేర్లను పుట్టిన రోజు బహుమతిగా ఇచ్చారు. కొత్త బట్టలు వేసుకున్నారు. ఆటవస్తువులతో ఆడుకున్నారు. బట్టల జీవిత కాలం ముగిసింది. ఆటవస్తువులు పనికి రాకుండా పోయాయి. కానీ హెచ్.డి..ఎఫ్.సి. షేర్లు ఐదు వందలు అలానే ఉన్నాయి. రెండున్నర దశాబ్దాల కాలంలో ఐదు వందల షేర్లకు బోనస్ వల్ల రెండున్నర వేల షేర్లు అయ్యాయి. వాటి విలువ 50 లక్షల రూపాయలకు చేరువ అయ్యాయి. అంటే పిల్లాడు పుట్టగానే ఇనె్వస్ట్ చేసినట్టు భావించాలి. బహుమతిగా ఇచ్చిన బట్టలు, బొమ్మలు మిగల లేదు కానీ ఆ షేర్లు మాత్రం అతన్ని సంపన్నుడిని చేశాయి. మనకు కొత్తగా అనిపించినా ఉత్తరాదిలో షేర్లను బహుమతిగా ఇవ్వడం, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి అనేది కొన్ని వ్యాపార కుటుంబాల్లో ఆచారంగా వస్తోంది.
శుభకార్యాల్లో ఏవో ఖరీదైన బహుమతులు ఇవ్వడం కన్నా ఇలా స్టాక్ మార్కెట్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో వారి పేరు మీద ఇనె్వస్ట్ చేసి బహుమతిగా అందజేసే అలవాటు చేసుకుంటే బాగుంటుంది.
సాధారణంగా 20 తరువాత చదువు ముగించుకుని ఉద్యోగంలో చేరుతారు. సంపాదన మొదలైన మొదటి నెల నుంచే ఇనె్వస్ట్‌మెంట్ చేయడం ఒక అలవాటుగా మార్చుకుంటే భవిష్యత్తు జీవితానికి భరోసాగా ఉంటుంది. 20 ఏళ్ల వయసులో మంచి జీతం ఉంటుంది కానీ పెద్దగా బాధ్యతలు ఉండవు. ఇనె్వస్ట్‌మెంట్‌కు నిజానికి ఇదే మంచి తరుణం అయితే ఎక్కువ మంది ఆ వయసులో దీనిపై దృష్టి పెట్టరు. చాలా మందిలో 40 ఏళ్ల వయసు దాటిన తరువాత ఇనె్వస్ట్‌మెంట్ గురించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు మొదలవుతాయి. పిల్లల చదువు, వారి పెళ్లి, రిటైర్‌మెంట్ జీవితం ఎలా ఉంటుంది? అనే ఆలోచనలు ఎక్కువగా నలభై దాటిన తరువాత ప్రారంభం అవుతాయి. నిజానికి ఈ వయసులో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. 20ఏళ్ల వయసులో ఇనె్వస్ట్ చేయగలిగినంత సామర్థ్యం 40ప్లస్‌లో ఉండదు. 20లోనే ఇనె్వస్‌టమెంట్ ప్రారంభించి ఉంటే 40కి చేరుకునే సరికి ఉద్యోగం లేకపోయినా పరవాలేదు అనే మానసిక స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. 20లో ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభిస్తే మంచిదే, ఆ దశ దాటిపోయి ఉంటే ఇప్పుడు ఏ వయసులో ఉన్నా ఇప్పటికైనా ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభించాలి. ఏ వయసులో ఉన్నా, ఎంత ఆదాయం వచ్చినా కనీసం నెలకు పది శాతం ఇనె్వస్ట్‌మెంట్ వైపు మళ్లిస్తే ఆ ధనమే మీకు కొంత కాలానికి ఉద్యోగాన్ని మించిన భరోసా ఇస్తుంది. 40లో సైతం ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభించడానికి సమయం మించి పోలేదు. భవిష్యత్తు అవసరాల కోసం సాధ్యమైనంత ఇనె్వస్ట్ చేయాలి. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే ఐతే సాధారణంగా ఉండే ఖర్చులకు డబ్బును మినహాయించుకుని మిగిలిన జీతం అంతా ఇనె్వస్ట్ చేసినా ఇబ్బంది ఉండదు. చిన్న వయసులో ఐతే రిస్క్ తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. వయసు పెరుగుతున్నా కొద్ది రిస్క్ తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. 20లో ఐతే దూకుడుగా వెళ్లవచ్చు. 40 దాటిన తరువాత ఐతే భార్యాపిల్లలు, కుటుంబానికి అయ్యే ఖర్చుపై సరైన ప్రణాళిక రూపొందించుకుని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభించాలి.
-బి.మురళి

13, మే 2019, సోమవారం

ఎవరు శ్రీమంతులు?

ఎన్టీఆర్ హీరోగా 1963లో లక్షాధికారి అని ఓ సినిమా వచ్చింది. ఎన్టీఆర్ ఎలా నటించారు, సినిమా హిట్టయిందా? లేదా? కథ ఏంటి? ఈ విషయాలు మనకు ఇప్పుడు అవసరం లేదు కానీ విషయం ఏమిటంటే 1963 అంటే ఐదున్నర దశాబ్దాల క్రితం లక్ష రూపాయలు ఉంటే సంపన్నులు అన్నట్టు. ఇప్పుడు మనం సంపన్నులు, శ్రీమంతులు అని చెబుతున్నాం కానీ నాలుగైదు దశాబ్దాల క్రితం సంపన్నులను లక్షాధికారి అని వ్యవహరించేవారు. కానీ ఈ రోజుల్లో ఇంజనీరింగ్ చదువు ముగించుకుని నెలకు లక్ష రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరేవారు చాలామందే ఉంటారు. నెలకు లక్ష రూపాయల జీతం అంటే ఇప్పుడు చాలా కామన్. లక్ష జీతం వచ్చినా మొదటి వారం గడిచే సరికి చేతిలో చిల్లి గవ్వ లేదు అనే బాధపడే ఉద్యోగులు. జీతం లక్ష ఐనా ఇఐఎంలకే సరిపోతుందని వాపోయేవారు బోలెడు మంది కనిపిస్తారు. హైటెక్ సిటీకి వెళితే లక్ష రూపాయల జీతం పొందే ఉద్యోగులు వేలల్లో కనిపించవచ్చు.
అప్పుడంటే లక్ష రూపాయల ఆస్తి ఉంటే సంపన్నులు. మరి ఇప్పుడు ఎంత డబ్బు ఉంటే సంపన్నుడు అని వ్యవహరించాలి. సంపన్నుడు అని వ్యవహరించడానికి ఇప్పుడు నిర్వచనం మారిపోయింది.
ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నా సన్నిహితంగా మెదిలిన ఒక పారిశ్రామికవేత్త కమ్ ఎన్నికల జోస్యం చెప్పేవారి హడావుడి చాలా కనిపించేది. వేల కోట్ల రూపాయల సంపన్నుడు అనుకునే వారు. అతని తీరు అలానే ఉండేది. అతని గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తి అతని గురించి చెబుతూ అతన్ని అతని చెప్పులతో పాటు అమ్మినా అతనికున్న అప్పు తీరదు. అప్పుల్లో కూరుకుపోయిన అతను మాత్రం అత్యంత సంపన్న నాయకుడిగా ప్రచారం పొందేవారు. విజయ్ మాల్యా, నీరవ్‌మోడీ లాంటి ఎంతో మంది మనకు సంపన్నులుగా కనిపించవచ్చు. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసేదాకా వీరంతా దేశంలో అత్యంత సంపన్నులుగా గుర్తింపు పొందారు. ఎవరు నిజమైన సంపన్నులో ఎవరు నిండా అప్పుల్లో మునిగి, బ్యాంకులను ముంచి సంపన్నులుగా కనిపిస్తున్నారో అర్థం కాని విషయం. నిజమైన సంపన్నులు, నకిలీ సంపన్నులు ఎవరో గుర్తించడం అంత ఈజీ కాదు.
వీరి సంగతి పక్కన పెట్టేద్దాం. సంపన్నులు ఎవరు అనే దానికి కొత్త నిర్వచనం తెలుసా? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పాఠాల్లో ఈ మాట తరుచుగా వినిపిస్తోంది.
ఈ కాలంలో ఎవరు సంపన్నులు అంటే? భారీ భవంతులు కనిపిస్తే సంపన్నుడు అని ముద్ర వేసేద్దాం అనుకుంటే ఏమో ఎవరికి తెలుసు కనిపించే భారీ భవంతి వెనకు కనిపించని భారీ బ్యాంకు అప్పులు ఉండవచ్చు.
మరి ఈ కాలం సంపన్నులు ఎవరూ లేరా? సంపన్నులను గుర్తించలేమా? అంటే గుర్తించగలం ఐతే దానికి నిర్వచనం మారింది.
మీరు ఉద్యోగం చేస్తున్నారు. మీకు నెలకు లక్ష జీతం కావచ్చు. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని ఉన్న పళంగా వదిలివేస్తే మీకు అదే విధంగా లక్ష రూపాయల ఆదాయం వస్తుంటే మీరే సంపన్నులు.
ఔను నిజం పాత కాలంలోలా కాదు. ఈ తరం ఆర్థిక వ్యవహారాల్లో చాలా ముందు చూపుతో ఉంది. పాతికేళ్ల వయసులో ఉద్యోగంలో చేరి 40ఏళ్ల వయసు వచ్చేనాటికి ఉద్యోగం లేకపోయినా గడిచే స్థితికి చేరుకుంటున్నారు.
ఈ కొత్త ట్రెండ్ గురించి ఉత్తరాదికి చెందిన ఒక కంపెనీ సిఇఓ తన జీవితానుభవాన్ని వివరించారు. పాతికేళ్ల వయసులో ఐటి కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ వయసులో తనకు ఇనె్వస్ట్‌మెంట్ వంటి అంశాలపై పెద్దగా అవగాహన లేదు, వారానికో సినిమాకు వెళ్లేవాడు. ఒకరోజు భవిష్యత్తు గురించి ఆలోచించాలి అనే ఆలోచన పుట్టింది. వారానికో సినిమాకు బదులు రెండు వారాలకు ఒక సినిమా చూడాలని, ఆ వెయ్యి రూపాయలను ఇనె్వస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఆ పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడతని వయసు 40 ఏళ్లు. 25ఏళ్ల వయసులో పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టిన తాను పనె్నండేళ్లకు ఉద్యోగం లేకపోయినా పరవాలేదు అనే దశకు చేరుకున్నట్టు చెప్పారు. నెలకు తనకు ఎంత జీతం వచ్చేదో అంతకు మించి తన పెట్టుబడులపై ఆదాయం వస్తోంది. ఇనె్వస్ట్‌మెంట్‌పై తనకు జీతంలా డివిడెండ్స్ రూపంలో వస్తున్నట్టు తెలిపారు. పెట్టుబడిని ఉపసంహరించకుండా అలానే కొనసాగిస్తూ, జీతం స్థాయిలో డివిడెండ్ వస్తే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదని, మనం సంపన్నులం అని చెప్పుకోవడానికి అప్పుడు అర్హత వస్తుందని చెప్పారు. పాతికేళ్ల వయసులో పెట్టుబడులు ప్రారంభించి, పనె్నండేళ్లు గడిచిన తరువాత ఉద్యోగం వదిలి తనకు నచ్చిన పని చేస్తున్నట్టు చెప్పారు. ఒక్కోక్కరికి ఒక్కో రంగంలో ఆసక్తి ఉంటుంది. కానీ బతకడానికి ఉద్యోగం చేయాలి. జీవిత కాలమంతా అసంతృప్తితో గడపడం కన్నా సాధ్యమైనంత త్వరగా రిటైర్ కావడానికి అవసరమైన రీతిలో ఇనె్వస్ట్‌మెంట్ చేస్తే మిగిలిన జీవితం ఐనా నచ్చినట్టు బతక వచ్చు అని భావించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి వారే నిజమైన సంపన్నులు అంటున్నారు ఇలా చిన్న వయసులోనే రిటైర్ ఐన వారు. ఉత్తర భారతదేశంలో ఇలాంటి ట్రెండ్ క్రమంగా ఊపందుకుంటోంది.
తనకు మ్యూచువల్ ఫండ్స్‌పై నెల నెల జీతం వచ్చినట్టు డివిడెండ్స్ వస్తున్నాయని చెబుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఐతే ఇదేదో ఒక నెలలో, ఏడాదిలో అనుకుంటే అయ్యేది కాదు. కనీసం పది పదిహేనేళ్లపాటు ఒక ప్రణాళిక ప్రకారం పెట్టుబడులు క్రమంగా పెంచుకుంటూ పోతుంటే ఉపయోగం ఉంటుంది. రాత్రికి రాత్రే ఎవరికైనా ఉద్యోగం లేకపోయినా గడిచిపోయే స్థితి రావడం అంటే ఏదో అల్లా ఉద్దీన్ అద్భుత దీపంతో సాధ్యం అయ్యే పని కాదు. ఉద్యోగంలో చేరినప్పుడు ఈ ఆలోచనకు అంకురార్పణ జరిగితే ఒకటి రెండు దశాబ్దాల్లో ఈ కల సాకారం అవుతుంది. మీ వయసు ఎంతైనా కావచ్చు, మీరూ ఈ కాలం శ్రీమంతులు కావడానికి ప్రయత్నించండి.
-బి.మురళి
(12-5-2019)