29, ఫిబ్రవరి 2012, బుధవారం

సెల్‌టవర్ ప్రజాస్వామ్యం.... మాయదారి మల్లిగాడు

ఇరవైమూడు జిల్లాల నుంచి పేరుమోసిన పెద్దవారంతా ఒకరి తరువాత ఒకరు వస్తున్నారు. ‘‘ఎలాగున్నావన్నాయ్ ఈ మధ్య ఏమైనా కొత్తగా మర్డర్లు చేశావా? పాత మర్డర్లేనా? ఇంకెంత కాలం పాత మర్డర్ల గురించి చెప్పుకొని తిరుగుతావన్నాయ్ ... ’’ ఒక పరాచికం. ‘‘చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకున్నట్టు మీ ఫాదర్ చేసిన హత్యలేనా? కనీసం ఒక్కడినన్నా చంపావా! బావా!’’ ఒకరి చమత్కారం. జైలుకెళ్లి వచ్చినట్టున్నావు బాగా ఒళ్లు చేశావ్! మధ్య వయసు రౌడీని స్నేహితుడు పలకరించాడు. లేదన్న చిన్నబ్బాయి మలేషియాలో రౌడీ ట్రైయినింగ్‌కు వెళితే తోడుగా ఉండొచ్చని వెళ్లి వచ్చాను. మసాజులతో ముఖం కాస్తా మారింది... అని నవ్వాడు. 


పెద్దింట్లో పెళ్లివారి విడిదిలా కోలాహాలంగా ఉందా ప్రాంతం.
సమావేశం ప్రారంభానికి సూచనగా గంట మ్రోగించారు. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. చీమకుట్టిన శబ్దం, దోమ తుమ్మిన తుమ్ము వినిపించేంత నిశ్శబ్దం. మాయదారి మల్లిగాడు గారు లోనికి ప్రవేశించారు. సుశిక్షితులైన సైనికుల్లా అంతా లేచి నిలబడ్డారు. ఆయన అసలు పేరేమిటో ఆయనతో సహా ఎవరికీ తెలియదు. మాయదారి మల్లిగాడు సినిమా వచ్చినప్పుడు అచ్చం అలానే లుంగి కట్టుకుని చేతిలో కర్ర పట్టుకుని మామూళ్లు వసూలు చేసేవాడు. ఆ పేరే అతనికి స్థిరపడిపోయింది. తరువాత వందలాది ఎకరాలను ప్లాట్లు అమ్మి, వందలాది మంది ఏజెంట్లతో ఇన్‌స్టాల్‌మెంట్లు వసూలు చేయిస్తున్నందున పేరు తరువాత గారు చేరి మాయదారి మల్లిగాడు గారు అయింది. 



మల్లిగాడు గారికి తన పర అనే తేడా ఉండదు. అందుకే తన భూమితో పాటు ప్రభుత్వ భూమిని కలుపుకొని తనవిగానే చూసుకుంటాడు. అలాంటి మల్లిగాడు అధ్యక్ష స్థానంలో ఉండి సమావేశాన్ని నిర్వహిస్తుండడంతో అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.
అలాంటి వాతావరణంలో ‘నీ యబ్బ ఒరేయ్’ అని చైనా నుంచి దిగుమతి చేసుకున్న లెటెస్ట్ రింగ్‌టోన్ వినిపించగానే అంతా అటు వైపు తలలు తిప్పారు. సంస్కారం లేని వాళ్లు కూడా పెద్ద రౌడీలమని చెప్పుకుంటారు. సిగ్గుండాలి అని వెనకవైపు ఉన్నవారు ఎవరో తిట్టారు. ఆ మాటలతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏనుగు ఘీంకరించినా వినిపించనంత గందరగోళంగా మారింది.



 చిట్టినాయుడుకి చిర్రెత్తుకొచ్చింది. ఎవరినుద్దేశించి తిట్టారో కానీ తననే అలా తిట్టారని అనిపించింది. మీకు సిగ్గుతో పాటు లజ్జ ఉండాలి’’ అన్నాడు. సిగ్గు,లజ్జ అంటే రైతు బజారులో అమ్మే కూరగాయలు కావురా? విదేశాల్లో మాత్రమే అమ్ముతారు అని వెనక నుంచి ఎవరో అరిచారు. నువ్వు కూడా మాట్లడేటోడివేనా? మా అబ్బాయి చిన్నప్పటి నుండి సంస్కారవంతమైన సబ్బుతో స్నానం చేయడమే కాదు, తినేవాడు కూడా. నీ కొడుకులా నా కొడుకు జిల్లాపరిషత్ స్కూల్‌లో చదవలేదు. కానె్వంట్ స్కూల్‌లో చదివించాను. చిన్నప్పుడు వాడు ఉగ్గుపాలు వద్దని సంస్కారవంతమైన సబ్బు త్రిబుల్ ఎక్స్‌నే కొరికే వాడు. అలాంటి మా వాడి గురించి మాట్లాడే అర్హతుందా? నీకు? మీవాడు అమ్మాయిలను ఉపయోగించుకుని ఉట్టిచేతులతో పంపేవాడు, మా వాడు అలా కాదు. వారి అనుమతితోనే ఒక పద్ధతి ప్రకారం అనుభవించి, సొంత కారులో ఇంటివద్ద దిగబెడతాడు. అంతటి సంస్కారవంతుని గురించి నీ లాంటి వాడా మాట్లాడేది అని మండిపడ్డాడు.


 ఎవరు ఎవరిని తిడుతున్నారో అర్ధం కావడం లేదు.
మల్లిగాడు లేచి నిలబడి గట్టిగా అరిచాడు. మళ్లీ నిశ్శబ్దంగా మారింది. మనం ఇలా పోరాడుకుంటే ఇక రౌడీలకు ప్రజా నాయకులకు తేడా ఏముంటుంది. మనం వీధిలో నడుస్తుంటే నలుగురు నమస్కారం చేస్తారు. అలాంటి గౌరవ ప్రదమైన రౌడీ వృత్తిలో ఉన్న మనం ప్రజా నాయకుల్లా తిట్టుకోవడం సిగ్గనిపించడం లేదూ! కనిపించని నాలుగో సింహం పోలీసు అయితే మనం కనిపించే మూడో సింహాం. అంటూ మల్లిగాడు కళ్లు తుడుచుకున్నాడు. వాతావరణం ఒక్కసారిగి ఉద్వేగంగా మారింది. రాజకీయ నాయకుల ప్రవర్తన నాకు ఆవేదన కలిగించింది. అందుకే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాను. నాయకుల మాటల వల్ల రౌడీల పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నాయకులు తమ మాటల తీరు మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. 



రౌడీల సంఘం నాయకులకు ప్రవర్తనా నియమావళిని రూపొందించి, నాయకులకు పంపించింది.
రాజకీయ సభలను నాయకుల కుటుంబ చరిత్రల పరిశోధనకే పరిమితం చేసి ప్రజల కోసం ప్రతి నియోజక వర్గ కేంద్రంలో ఒక భారీ సెల్ టవర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. రైతులు, నిరుద్యోగులు, కార్మికులు ఎవరైనా ఈ టవర్ ఎక్కి తమ సమస్యలను చెప్పుకుంటారు. పరిష్కరిస్తే సరి లేకపోతే ఆ టవర్ నుంచి దూకాలి. సెల్ టవర్లే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు. అని మల్లిగాడు ప్రకటించగానే అంతా చప్పట్లు కొట్టారు. సెల్‌టవర్ ప్రజాస్వామ్యాన్ని తరువాత గ్రామ స్థాయికి విస్తరించాలని నిర్ణయించారు.

28, ఫిబ్రవరి 2012, మంగళవారం

తెలుగు న్యూస్ చానల్స్ ప్రధాన లక్ష్యం విషం చిమ్మడమేనా? ఒక చుక్క అమృతం పంచలేవా ?..... మంత్రి గారి ఊరు సరే మంచి ఊళ్లు చూపలేరా ?

తెలుగు న్యూస్ చానల్స్ ప్రధాన లక్ష్యం విషం చిమ్మడమేనా? సరే ఆ దారి నుంచి చానల్స్‌ను మార్చలేరు కానీ కనీసం ఒక చుక్క అమృతం పంచలేరా? ఈ దిశగా మన చానల్స్ ఆలోచించాలని కోరుకోవడం అత్యాశే అవుతుందా? రాష్ట్రంలో ఇరవై వేలకు పైగా గ్రామాలు ఉన్నాయి. మనసు పెట్టి వెతికితే ఎన్నో అద్భుతాల సాధించిన గ్రామాలకు కొదవ లేదు. ఒక ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ విదేశాల్లో స్థిరపడి కోట్లు సంపాదించిన తరువాత తన సొంత గ్రామంపై మమకారంతో తిరిగి వచ్చారు. ఉచితంగా దానాలు చేయడం కాదు. పాల సేకరణ ద్వారా గ్రామస్తుల్లో ఆత్మవిశ్వాసం పెంచారు. ఆర్థికంగా బలపడేట్టు చేశారు. ఇలాంటి కథనాలు వార్తా పత్రికల్లో తరుచుగా కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఒక గ్రామంలో ఒక యువకుడి చైతన్యం వల్ల గ్రామస్తులంతా తమ మరణానంతరం కళ్లు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. మొత్తం గ్రామస్తులు కళ్లు దానం చేయడం ద్వారా ఆ గ్రామం రికార్డుల కెక్కింది.


ఈ విషయం తెలిసి మరి కొన్ని గ్రామాల వాళ్లు ముందుకు వచ్చారు. ఇలాంటి కథనాలు ప్రింట్ మీడియాలో కన్నా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఒక్క సినిమా తారలను మినహాయిస్తే, ప్రపంచంలో ఎవరినీ మన తెలుగు మీడియా అనుకూల దృష్టితో చూడదు. మాఫియా వ్యవహారాలు, వ్యభిచారంలో పట్టుపడ్డా, నల్లమందు అమ్ముతూ పట్టుపడిన వారున్నా ఒక్క సినిమా ప్రపంచానే్న ఆకాశానికెత్తుతుంటారు.


ఎబిఎన్ చానల్ రాజకీయ నాయకులు చిన్నప్పుడు చదివిన పాఠశాలపై ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. ఎన్‌టీవి మంత్రిగారి సొంత ఊరు పేరుతో రోజుకో మంత్రి సొంత గ్రామంలోని పరిస్థితులు వివరిస్తోంది. మహాత్మాగాంధీ పుట్టిన ఊరి నుంచి మన టీవి యజమానులు పుట్టిన ఊరి వరకు అన్ని గ్రామాల్లో అవే సమస్యలుంటాయి. పారిశుద్ధ్య పరిస్థితి సరిగా లేదు, తాగు నీరు లేదు, వైద్య సదుపాయాలు లేవు, రోడ్లు సరిగా లేవు ఏ గ్రామ చరిత్ర చూసినా దాదాపు ఇవే సమస్యలు కదా? మంత్రిగారి ఊరు అంటూ ఆ గ్రామంలోని ఇవే సమస్యలను చూపుతూ ఆయన మంత్రి అయినా సొంత గ్రామానికి ఏమీ చేయలేదు అని ఐదారుగురితో తిట్టించడం.
ఇదీ ఎన్‌టీవి వారి మంత్రిగారి సొంతూరు ప్రత్యేక కార్యక్రమం. 



బంగారాన్ని విదేశాల్లో తాకట్టుపెట్టిన గడ్డు కాలంలో పివి నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఆయన ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల తరువాత ఇప్పుడు దేశం పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన సొంత గ్రామం వంగరలో కనీస సౌకర్యాలు ఉండేవి కావు. అంత మాత్రాన ఆయన గొప్పనాయకుడు కాకుండా పోతాడా? పివి రాజకీయ జీవితం ప్రారంభంలో ములకనూరు సహకార సొసైటీకి చైర్మన్‌గా పని చేశారు. ఆ సొసైటీ చుట్టుపక్కల గ్రామాలపై ఇప్పటికీ ప్రభావం చూపుతోంది. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేట్టు చేసింది. వంగర సమస్యలు చూపి ఆయన్ని విమర్శించడం కన్నా ములకనూరు సొసైటీ చేస్తున్న అద్భుతాలను చూపడం ద్వారా మేలు జరుగుతుంది. విఐపి గారు చదివిన పాఠశాలను చూపడం సరే. మంచి ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయి. మట్టిలో మాణిక్యాల్లా ఈ పాఠశాలల్లో ఎంతో మంది పేదలు విద్యలో రాణిస్తున్నారు.


 గత సంవత్సరం ఐఎఎస్ టాపర్ ముత్యాల రాజు చదివింది ఒక ప్రభుత్వ పాఠశాలలోనే, ఏ మాత్రం సౌకర్యాలు లేని లంక గ్రామంలో. ఒకసారి అలాంటి గ్రామాల్లోని పాఠశాలలను చూపించి, ఇతరులు ఆదర్శంగా తీసుకుని ఎదగడానికి సహకరించవచ్చు కదా?


* * *
తాజాగా మంత్రి పొన్నాల లక్ష్మయ్య సొంత గ్రామం ఖిలాషాపూర్ గ్రామాన్ని ఎన్‌టీవిలో మంత్రిగారి సొంత ఊరులో చూపారు. అన్ని గ్రామాల్లో మాదిరిగానే ఆ గ్రామంలోనూ సమస్యలున్నాయి. ఉండి తీరుతాయి కూడా ఎందుకంటే బడ్జెట్‌లో మంత్రిగారి సొంత గ్రామానికి ప్రత్యేక కేటాయింపులు అంటూ ఏమీ ఉండవు. ఒకవేళ అలా ఉంటే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. మంత్రిగారు పుట్టిన ఊరిని ప్రత్యేకంగా చూస్తూ ఇతర గ్రామాల పట్ల వివక్ష చూపినట్టు అవుతుంది. కార్యక్రమాన్ని రూపొందించిన వారి ఉద్దేశం మంత్రిగారు తన సొంత ఊరినే పట్టించుకోలేదు. ఇక రాష్ట్ర ప్రజలను ఏం పట్టించుకుంటారు అనే ఉద్దేశం కావచ్చు. అలానే ఎబిఎన్‌లో వచ్చే విఐపిలు చదివిన పాఠశాలల కథనాల ఉద్దేశం ఆయనేమో అక్కడ చదివి ఎంతో ఎదిగారు, ఆయన చదివిన పాఠశాలలో మాత్రం సౌకర్యాలు లేవు అని చెప్పడం కావచ్చు.


పొన్నాల లక్ష్మయ్య సొంత గ్రామంలో కొంత మందితో మాట్లాడించారు. ఒక వ్యక్తి మంత్రి బాగా సంపాదించాడు కానీ గ్రామానికి చేసిందేమీ లేదని చెబుతూ ఆంధ్రోళ్లతో సోపతి చేసి అంటూ ఏదో తిట్టాడు. అక్కడ బిప్... బిప్ అంటూ సెన్సార్ చేశారు. మంత్రిగారు అద్భుతంగా పని చేస్తున్నారని చెప్పించదలిస్తే, గ్రామంలో అలాంటి వారూ దొరుకుతారు లేదా ఏమీ చేయలేదని చెప్పించదలిస్తే అలాంటి వారు దొరుకుతారు. కావలసిందల్లా మనం ఏ కోణంలో ప్రసారం చేయదలుచుకున్నామూ అనేది. ఒకసారి స్వయంగా నారా చంద్రబాబునాయుడు సొంత గ్రామం నారావారి పల్లెలో ఆయన బాబాయ్‌ని బాబు పలకరిస్తే, వైఎస్‌ఆర్‌లా రైతులకు ఏమైనా చేసి మంచి పేరు తెచ్చుకో అని సలహా ఇచ్చారు. సాక్షి చానల్ దీనికి ప్రాధాన్యత ఇచ్చింది. తొమ్మిదేళ్లపాటు సిఎంగా చేసిన నారావారి గ్రామంలోనే ఆయన్ని విమర్శించేవారు దొరుకుతారు, అభినందించేవారు లభిస్తారు. ఇక పొన్నాల గ్రామంలో పెద్ద కష్టమా?


మంత్రి అయినంత మాత్రాన అతని గ్రామానికి అదృష్టం పట్టదు. జిల్లాకు వచ్చిన నిధులన్నీ ఆయన తన సొంత గ్రామానికి తరలించాలని ప్రయత్నిస్తే నిబంధనలు దానికి ఒప్పుకోవు. అలా అని గ్రామానికి ఏమీ చేసుకోలేరు అని కాదు. గ్రామానికి ఏమైనా చేసుకుందామనే ఆసక్తి ఉంటే అధికారుల వెంట పడి కొంత వరకు సాధించుకోవచ్చు. అయితే అది పరిమితంగానే ఉంటుంది. నియోజక వర్గంలో ఇతర గ్రామాలను వదిలి సొంత గ్రామంపైనే దృష్టి సారించడం సాధ్యం కాదు.
ఒకవేళ మంత్రుల ఊళ్లన్ని పచ్చదనంతో కళకళలాడుతూ ఏ సమస్య లేకుండా చక్కాగా ఉన్నాయని అనుకుందాం. మొత్తం గ్రామాల్లో వాటి సంఖ్య ఎంత?


దానికి బదులు ఇప్పుడు ప్రింట్ మీడియాలో కనిపిస్తున్న ఆదర్శ గ్రామాల గురించి ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తే ఆ ప్రభావం మొత్తం రాష్ట్రంపై పడుతుంది కదా? అన్నా హజారే రాలేగావ్ సిద్ధి గ్రామంలో చేసిన ప్రయోగం మొత్తం దేశంపై ప్రభావం చూపుతున్నప్పుడు మన గ్రామాల్లోని మార్పు కనీసం ఆ జిల్లాలోని గ్రామాలపై పడదా? వ్యతిరేక ఆలోచనలతో మంత్రిగారి ఊరు అధ్వాన్నం అని ప్రపంచానికి చూపించే బదులు. కనీసం ఒక్కో జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఆ గ్రామాన్ని ఆదర్శంగా ఎలా తీర్చిదిద్దుకున్నారు, దానికి కృషి చేసిన వారు ఎవరు? ఆ గ్రామం పత్యేకత ఏమిటి? సాధించిన అభివృద్ధి ఏమిటో మొత్తం రాష్ట్రానికి చూపవచ్చు కదా?
అనేక గ్రామాల్లో కొంత మంది కృషి వల్ల అద్భుతమైన మార్పు కనిపిస్తోంది. అలాంటి గ్రామాలను టీవి తెరపై చూపడం వల్ల ఇతర గ్రామాలపై ప్రభావం పడుతుంది. మంత్రిగారి ఊరు గురించి కాదు మంచి ఊరి గురించి చెప్పండి.

26, ఫిబ్రవరి 2012, ఆదివారం

స్ఫూర్తి ప్రదాతలు.. విజేతల జీవన రేఖలు



జీవితంలో అన్నింటా ఓడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామని ఓ బహుళ అంతస్తుల భవనం ఎక్కాడు. దూకడానికి సిద్ధమైన అతనికి ఎదురుగా మరో భవనంపై వేలాడుతూ ఓ వ్యక్తి భవనానికి రంగులు వేయడం కనిపించింది. అతనికి జీవితం ప్రతి రోజు రిస్కే. రిస్కునే జీవితంగా గడుపుతున్నప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం పిరికితనమే, జీవితం జీవించడానికే అని గ్రహించి, తన ఎదుగుదలకు కృషి చేశాడు. స్టార్ హోటల్స్ నిర్మించాడు. అంతర్జాతీయ అవార్డులు సాధించాడు. సినిమా కథ చెబుతున్నాననుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి జీవిత కథను ప్రస్తావిస్తున్నాను. నిజమే తెలుసుకునే ఓపిక ఉండాలి కానీ సినిమా కథలను మించిన మలుపులుంటాయి వ్యక్తుల జీవితాల్లో. అవి స్ఫూర్తినిస్తాయి. అలాంటి 51 మంది స్ఫూర్తి ప్రదాతల సంక్షిప్త జీవిత చరిత్రల రూపమే స్ఫూర్తి ప్రదాతలు. ఇవి సినిమా కథలు కాదు విజయం సాధించిన వారి జీవితాలు. కామత్ హోటల్ పేరు విన్నదే కదా? ఆ హోటల్‌లో పదార్థాలు నాలుకపై కలిగించే ప్రభావం కన్నా ఆ హోటల్ యజమాని జీవిత కథ మనసుపై చూపించే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆత్మహత్య చేసుకుందామనుకున్న స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి హోటల్ నిర్మించే స్థాయికి ఎదిగిన వ్యక్తి విఠల్ వెంకటేష్ కామత్.
ఆయన ఆత్మకథను యండమూరి వీరేంద్రనాథ్  తెలుగులో అనువదించారు. కర్నాటకలో పలు యూనివర్సిటీల్లో ఆయన అత్మకథను నాన్‌డిటేల్డ్‌గా పెట్టారు. కచ్చితంగా ఇలాంటి వారి ఆత్మకథలు యువతకు ప్రేరణ కలిగిస్తాయి. స్ఫూర్తి ప్రదాతలు అంటే.. అందరూ చిల్లిగవ్వలేకుండా జీవితాన్ని మొదలు పెట్టి కోట్లు గడించిన వారేనా? ఈ మధ్య వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎక్కువగా ఇలాంటి వారి జీవితాలనే ఉదహరిస్తున్నాయి. అయితే, ఈ పుస్తకంలో రామా చంద్రవౌళి కేవలం అలాంటి విజేతలను మాత్రమే ఎంపిక చేసుకోలేదు. బాలచందర్, ఇళయరాజా మొదలుకుని తమ ఆలోచనల ద్వారా సమాజంలో చైతన్యానికి పూనుకున్న మహాశే్వతాదేవి, మేథాపాట్కర్ , అన్నా హజారే, బెన్‌కింగ్‌స్లే , బాలగోపాల్ వరకు వివిధ రంగాల్లోని విజేతలను పరిచయం చేశారు. బూట్ల పాలిష్ షాపులో పని చేసే వ్యక్తి స్థాయి నుండి అత్యున్నతమైన జ్ఞానపీఠం అవార్డు స్థాయి వరకు ఎదిగిన జయకాంతన్ వరకు 53 మంది విశిష్ట వ్యక్తుల సంక్షిప్త జీవిత చరిత్రల కూర్పు స్ఫూర్తి ప్రదాతలు.
ముంబైలో, హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించిన గ్రంథి మల్లిఖార్జున రావు గురించి రాస్తూ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మద్యపాన నిషేధ ప్రతిపాదనలు ప్రకటించగానే ఆయన తన బ్రూవరీలను యుబికి అమ్మేశాడని రాశారు. రాష్ట్రంలో చంద్రబాబు ఎప్పుడూ మద్యపాన నిషేధం విధించలేదు. పైగా నిషేధాన్ని ఎత్తేశారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సారాపై నిషేధం విధిస్తే, 1994లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు. ఆ తరువాత వచ్చిన బాబు నిషేధాన్ని సడలించారు. రచయిత అనేక చోట్ల ఒక రంగాన్ని నమ్ముకుని అదే రంగంలో ఉన్నవారు అత్యున్నత స్థాయికి వెళ్లారని పేర్కొంటారు. అంటే అదే రంగంలో ఉండాలనే ఉద్దేశంతో. విజయానికి ఇవీ సూత్రాలు అని ఏమీ ఉండదు. మరి ఇదే పుస్తకంలో గ్రంధి మల్లిఖార్జున రావు సంప్రదాయంగా తాము చేస్తున్న వ్యాపారాలను వదిలి ఇతర రంగాలకు వెళ్లి విజయం సాధించారు కదా? జూట్‌నుంచి జెట్ వరకు ఎదిగిన సాహసిగా మిత్రులు ఆయనను అభివర్ణిస్తారని రచయితే రాశారు. పౌరహక్కుల నేత కె.బాలగోపాల్ గురించి రాసిన దానిలో ఎస్‌ఆర్ శంకరన్, కెజి కన్నాభిరాన్, ఆర్‌ఎస్ రావులను ప్రస్తావించారు. ఐఎఎస్ అధికారుల్లో స్ఫూర్తి దాయకమైన ఎస్‌ఆర్ శంకరన్ లాంటి వారు లేకపోవడం దురదృష్టకరమనే మాట ఇటీవల తరుచుగా వినిపిస్తోంది. వారి గురించి కూడా రాస్తే బాగుండేది. ఈ పుస్తకంలో దాదాపుగా స్ఫూర్తి ప్రదాతల ఆత్మకథలో, జీవిత చరిత్రలో వెలుగు చూశాయి. సంక్షిప్త జీవిత కథ చదివిన తరువాత ఆసక్తి గల వారు వారి ఆత్మకథలు చదివేందుకు ప్రయత్నించవచ్చు.

    స్ఫూర్తి ప్రదాతలు
( విజేతల జీవన రేఖలు)
రచయిత :
రామాచంద్రవౌళి
వెల : వంద రూపాయలు
పేజీలు 196
ప్రాప్తిస్థానం: అన్ని ప్రధాన పుస్తక షాపుల్లో


22, ఫిబ్రవరి 2012, బుధవారం

మచ్చ లేని మనుషులు- మహానుబావులు

దేవుడా! నేనే పాపం చేశాను. కనిపించిన దేవుళ్లకు మొక్కాను. అన్ని గుళ్లు తిరిగాను. మా ఆడపడుచు నెలకోసారి కూడా గుడికెళ్లదు నేను వారం వారం వెళతాను కదా! నాకే ఇంత అన్యాయం జరగాలా? మా తోటికోడలికి మా పక్కింటి లక్ష్మికీ, ఎవరికీ లేని కష్టాలు నాకేనా? ఇప్పుడు వాళ్లకు నా ముఖం ఎలా చూపించను’’ విశాలాక్షి అలా ఏడుస్తూనే ఉంది.


 ఏడుపు శృతి పెరగడంతో పరిగెత్తుకొచ్చిన శ్రీవారు ‘‘అలా ఏకపాత్రాభినయం చేయడమేనా? ఏం జరిగిందో చెబుతావా?’’అని చిరాగ్గా అడిగాడు. ‘‘మన వాడిపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. ఐఐటిలో చేరేందుకే కదా మీ ఆఫీసుకు దూరమవుతుందని తెలిసినా, అద్దె ఎక్కువైనా నల్లకుంటలో ఉంటున్నాం’’ చెప్పుకుపోతూనే ఉంది. ‘‘అది సరేలే ఇంకా మనోడిని స్కూల్‌లో కూడా చేర్పించలేదు అప్పుడే ఐఐటి కోచింగ్‌కు పనికిరాడని ఐఐటి రామయ్య ఏమైనా చెప్పాడా? ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘అది కాదండి మన వాడిని రేపు స్కూల్‌లో చేర్పిద్దామనుకున్నాం కదా? స్కూల్‌లో రాయించడానికి పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో చూద్దామని ప్రయత్నిస్తే ఒక్కటి కూడా కనిపించలేదు. మచ్చలేని వాన్ని స్కూల్‌లో ఎలా చేర్చుకుంటారు. మన ఐఐటి కలలు కల్లలైనట్టేనా?’’ అంటూ మళ్లీ ఏడుపు మొదలు పెట్టింది. అప్పటి వరకు నింపాదిగా ఉన్న శ్రీవారు ఒక్కసారిగా కంగారు పడ్డాడు.‘‘ అదేంటే అసలు మచ్చలేని మనిషి ఉండటం అసాధ్యం. నువ్వు సరిగా చూశావా? అని గాబరాపడ్డాడు. ‘‘కావాలంటే రండి’’ అని ఆరుబయటకు తీసుకెళ్లింది. ‘‘బురద నీటిలో ఆడుతున్న ఆ పిల్లల గుంపులో మెరుస్తున్న కళ్లు చూశారా? వాడే మనవాడు’’ అని ఒక పిల్లాడిని పట్టుకుని చూపింది. కళ్లు తప్ప వాడు నడుస్తున్న బురదలా కనిపించాడు.


 కొద్ది సేపు ఆలోచించిన శ్రీవారు పక పకా నవ్వాడు. ‘‘పిచ్చి విశాలక్షి మనవాడిలో మచ్చలేదని ఎవరు చెప్పారే నీకు. ఒక్కనిమిషం ఆగు అంటూ చిన్నాడిని లాక్కొచ్చి మంచినీటి నల్లాకింద నిలబెట్టి నల్లా తిప్పాడు. వాడిమీద నీళ్లు పడగానే బురద పోయింది. అటూ ఇటూ చూశాడు. వాడి చేయిమీద, పిర్ర మీద. కాళ్ల మీద, ముఖం మీద కనీసం అరడజను మచ్చలను చూపించి, ‘‘చాలా ఇంకా కావాలా? ’’ అని అడిగాడు. ‘‘బురదలో తడిసి ముద్దవడం వల్ల మచ్చకనిపించలేదు కానీ మచ్చలేని మనిషి ఉండడే పంకజాక్షి. కొందరు రాజకీయ నాయకులు కూడా అంతే బురదలో కూరుకుపోయి తమది మచ్చలేని జీవితం అంటారు. నువ్వు మనోడికి మచ్చలేదు అంటే రాజకీయాల్లోకి పనికొస్తాడేమో అనుకున్నాను’’ అంటూ నవ్వుతూ శ్రీవారు మళ్లీ పేపర్ చదువుకోవడానికి లోనికి వెళుతూ, ‘మాయా మశ్చింద్రా మచ్చను చూడా వచ్చావా?’ అంటూ ఊషారుగా పాటందుకున్నాడు.
***
వంశీ లేడీస్ టైలర్ సినిమాలో తొడమీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయి కోసం హీరో రాజేంద్ర ప్రసాద్ తెగ వెతుకుతుంటాడు. పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని చేసుకుంటే కలిసొస్తుందని ఊళ్లో పిచ్చిపిల్లను తప్ప అమ్మాయిలందరినీ ప్రేమించేస్తాడు. ఐతే తొడమీద మచ్చున్నది ఆ పిచ్చిపిల్లకే. నాది మచ్చలేని జీవితం అంటూ నాయకులు గొప్పగా చెప్పుకుంటారు కానీ మచ్చల్లోనే అదృష్టం దాగుందని మచ్చల శాస్త్రం చెబుతుంది. నుదురుకుడి బాగాన, ముక్కు కుడివైపున మచ్చ ఉంటే ఆకస్మిక ధనప్రాప్తి అట, కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే భార్య వల్ల ధన ప్రాప్తి అని పుట్టుమచ్చల శాస్త్రం చెబుతోంది. పెదవి మీద, ఎడమ కంటి రెప్పమీద ఎడమ తొడమీద మచ్చ ఉంటే చెడు ఫలితాలట! పుట్టుమచ్చల శాస్త్రంలో ఎక్కడ మచ్చ ఉంటే సంపద కలిసొస్తుందో, ఎక్కడ మచ్చలుంటే కష్టాలు తప్పవో చెబుతుంది. పుట్టుమచ్చల శాస్త్రానికి, రాజకీయ శాస్త్రానికి అస్సలు పొంతన కుదరదు! ఎక్కడ మచ్చలుంటే కలిసొస్తుందో పుట్టుమచ్చల శాస్త్రం చెబితే, అస్సలు మచ్చలు లేకపోతేనే ప్రజలు నమ్మి అధికారం అప్పగిస్తారని రాజకీయ శాస్త్రం చెబుతుంది. 



మీలో పాపం చేయనివారు ఎవరో చెప్పండి అని పాడినట్టుగా మీలో మచ్చలేని నాయకుడెవరో చెప్పండి అంటే నాయకులంతా చేతులెత్తుతారు కానీ నిజానికి వారికున్నన్ని మచ్చలు మరెవరికీ ఉండవు. బహుశా ఇంకా పుట్టని నాయకులకు మచ్చలు లేకపోవచ్చు కానీ రాజకీయ జీవితం ఉన్న నాయకులందరికీ చిన్నదో పెద్దదో మచ్చలేకుండా ఉండదు. నా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పకపోయినా, నిజంగానే తెరిచిన పుస్తకంలా జీవితాన్ని గడిపిన మహాత్మాగాంధీ జీవితంలో సైతం మచ్చలున్నాయి. ఆయనే స్వయంగా తన ఆత్మకథలో ఆ మచ్చలను ప్రస్తావించారు. బాపూ జీవితంలోనే మచ్చలు తప్పనప్పుడు బాబుల జీవితం ఎంత? నాది మచ్చలేని జీవితం అని నాయకులు చెబుతున్నారు కానీ మా నాయకుడిది మచ్చలేని జీవితం అని ఒక్క అనుచరుడు కూడా చెప్పలేకపోతున్నాడంటే వారి జీవితంలో ఎన్ని మచ్చలున్నాయో అర్ధమవుతుంది.


***
 ‘‘నామాట వినురా ఆ అమ్మాయి అందంగా ఉంది. ఆమెది మచ్చలేని శరీరం పెళ్లి చేసుకో?’’
‘ఆమెను పెళ్లిచేసుకుందామనే అనుకున్నాను నువ్వా మాట చెప్పాక ఇంకెలా చేసుకుంటానురా? ’’
నీతి: మచ్చల రహస్యం చెప్పకపోవడమే మంచిది. ఏ పుట్టుమచ్చల శాస్త్రంలో ఏ ముందో ఎవరికి తెలుసు?

21, ఫిబ్రవరి 2012, మంగళవారం

వెండితెర మాజీ హీరోయిన్లు బుల్లి తెర తాజా యాంకర్లు



    ఇప్పుడు పలువురు మాజీ హీరోయిన్లు బుల్లితెరపై యాంకర్లుగా ప్రత్యక్షమవుతున్నారు. రోజా, రజని తరువాత ఇప్పుడు ఆమని బుల్లితెరను నమ్ముకున్నారు. వృద్ధ హీరోలు ప్రజలకు సేవ చేయడానికి రాజకీయ ప్రవేశం చేసి తరిస్తున్నారు. కానీ హీరోయిన్లకు మాత్రం రాజకీయాల్లో అవకాశాలు దక్కడం లేదు. దాంతో బుల్లితెరను నమ్ముకుంటున్నారు. వీరు బుల్లితెరపై యాంకర్ల నుండి పోటీ ఎదుర్కొని ఎంత వరకు నిలబడతారో చూడాలి.
తెలుగునాట సినిమా వాళ్లకు చిన్నతెరపై మొదటి నుండి కొంత చిన్నచూపే. చిన్నతెరపై కనిపించే వారికి సినిమాల్లో అవకాశాలు ఉండవనే అభిప్రాయం ఉంది. హిందీలో ఇలాంటి చిన్నచూపు ఏమీ లేకపోయినా తెలుగులో మాత్రం ఇది బాగానే కనిపిస్తుంది. చిన్నతెరపై కనిపిస్తున్నారు అంటే సినిమాల్లో అవకాశాలు లేవు అని ప్రకటించినట్టు అనే అభిప్రాయం తెలుగులో బాగా ఉంది. దానికి తగ్గట్టుగానే హీరో, హీరోయిన్లు, క్యారక్టర్ యాక్టర్లు, కమెడియన్లు ఎవరైనా ఎక్కువగా సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పుడే చిన్నతెరవైపు చూస్తున్నారు. రజని, రోజా, ఆమని వంటి వారు ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగారు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా వివిధ తెలుగు చానల్స్‌లో యాంకర్లుగా కనిపిస్తున్నారు. హీరోయిన్లుగా గతంలో ఉన్న క్రేజీ వల్ల యాంకర్లుగా బాగానే రాణిస్తున్నారు. కానీ పాపులర్ యాంకర్లకు గట్టిపోటీ ఇవ్వలేకపోతున్నారు. రజని ప్రముఖ హీరోలందరితో నటించారు. బాగా అవకాశాలు ఉన్న సమయంలోనే ఆమె వివాహం చేసుకుని దశాబ్దకాలానికి పైగా సినిమా రంగానికి దూరంగానే ఉన్నారు. హఠాత్తుగా ఆమె వార్తల్లో కనిపించారు. తన కుటుంబ జీవితంలో తలెత్తిన వివాదాన్ని ప్రస్తావించి ఆసక్తి రేకెత్తించారు. చాలా మంది హీరోయిన్లుగా వెలుగుతున్న కాలంలోనే భవిష్యత్తు గురించి సరైన ప్రణాళిక రూపొందించు కోవడంలో విఫలమవుతున్నారు. తొలి తరం హీరోలు ఇదే విధంగా దెబ్బతింటే ఆ తరువాత వచ్చిన ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వారు జాగ్రత్త పడ్డారు. కానీ అదేం దురదృష్టమో హీరోయిన్ల విషయంలో అలాంటి జాగ్రత్తలు సాధ్యం కావడం లేదు. రజని సైతం అలా దెబ్బతిన్నవారే. ఆటుపోట్లను విజయవంతంగా ఎదుర్కొన్న హెచ్‌ఎం టీవిలో కుటుంబ సమస్యలపై సలహాలు ఇచ్చారు. ఆ కార్యక్రమం పెద్దగా విజయం సాధించలేదు. ఇందిర పేరుతో డిడిలో కనిపించారు. అదీ అంతంత మాత్రమే. ఇప్పుడు ఈటీవి వారి డ్యాన్స్ పోటీల్లో జడ్జిగా కనిపిస్తున్నారు. అస్సలు ఏ మాత్రం మర్యాద పాటించకుండా పోటీ దార్లు ఒకరినొకరు తిట్టుకోవ డం, నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం కొరియోగ్రాఫర్ల ఈ డ్యాన్స్ కార్యక్రమానికే పరిమితం. హీరోయిన్‌గా ఎంతో అందంగా కనిపించే రజని, ఇలాంటి కార్యక్రమంలో కనిపించడం ఇబ్బందికరమే. ఓడలు బళ్లు కావడం, బళ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో! హీరోయిన్లుగా ఎలాంటి పాత్రలు ఎంపిక చేసుకోవాలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టుగానే టీవి కార్యక్రమాల్లో సైతం తాము ఎలాంటి కార్యక్రమాల్లో అయితే రాణిస్తాం అని బాగా ఆలోచించి అలాంటి వాటికే అంగీకరించడం మంచిది. దాదాపు దశాబ్ద కాలం పాటు రజని తెలుగునాట అందార తారగా ఒక వెలుగు వెలిగారు. తమిళంలో తొలుత నటించి, ఆ తరువాత తెలుగులో స్థిరపడ్డారు. పలు తమిళ, కన్నడ, మళయాళం సినిమాల్లో నటించారు. బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, నాగార్జున వంటి టాప్ హీరోలందరితో రజని హీరోయిన్ గా నటించా రు. ప్రారం
భం లో వచ్చిన కార్యక్రమాలు అంతంత మాత్రంగానే ఉన్నా ఇప్పుడు బుల్లితెరపై నెట్టుకు రావడానికి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.
రోజా ఇలానే తొలుత తప్పటడుగులు వేసినా తరువాత నిలదొక్కుకున్నారు. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోగానే ఆమె ఒక వైపు రాజకీయ ప్రవేశంతో పాటు మరోవైపు టీవి కార్యక్రమాలను నమ్ముకున్నారు. మొగుడ్స్ పెళ్లామ్స్ అనే పాపులర్ కార్యక్రమంలో అప్పటి వరకు ఉన్న యాంకర్ స్థానంలో రోజా వచ్చింది. అయితే సురేఖ యాంకరింగ్‌కు అలవాటు పడిన ప్రేక్షకులు రోజాను స్వాగతించలేక పోయారు. తొందరగానే ఈ విషయం గ్రహించినట్టున్నారు. రోజా మరో కార్యక్రమానికి జంప్ అయి నిలదొక్కుకున్నారు. తాజా గా ఆమ ని ఇప్పుడు జీ తెలుగులో నేనే సత్యభామ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హీరోయిన్‌గా తెరమరుగైన తరువాత ఆమె బుల్లితెరపై కనిపిస్తున్న తొలి కార్యక్రమం ఇది. జీ తెలుగులో నేనే సత్యభామ అంటూ ఆమని హడావుడి చేస్తున్నారు. శుభలగ్నం, మావి చిగురు, మిస్టర్ పెళ్లాం సినిమాల్లో మంచి నటిగా పేరు పొందిన ఆమని బుల్లితెర జీవితం ఎలా ఉంటుందో మరి. సత్యభామ అంటే పొగరుకు ప్రతీక. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలు కాస్తంతా పొగరు తనంతో ఉంటారు.
పొగరు పాత్రలు హీరోయిన్‌గా ఆమనికి కొట్టిన పిండే.

15, ఫిబ్రవరి 2012, బుధవారం

కల్లా కపటం తెలియని నేతలు



ల్లా కపటం తెలియని వాడా

లోకం పోకడ తెలియనివాడా

పాడేటప్పుడు శబ్దం నోటి నుండి కాదు హృదయం నుండి రావాలి అంటూ చంద్రబాబు ఎన్టీఆర్ భవన్‌లో పాడిస్తున్నాడు. ‘‘నేను నేర్పిన క్రమ శిక్షణ ఒక్కోసారి నాకే ముచ్చటేస్తుంది. ఇంతటి క్రమశిక్షణ గల మీ రుణం నేను ఏ జన్మలోనూ తీర్చుకోను’’ అని బాబు చెప్పగానే అంతా చప్పట్లు కొట్టారు. ఈ పాటల సిడిని రాష్టమ్రంతటా పంచండి. ఈసారి కల్లాకపటం తెలియని వారినే గెలిపించాలని కంత్రీలను ఇంటికి పంపించాలని జనం అనుకుంటున్నట్టు తెలిసింది. మనను మించిన అమాయకుడు మరొకడు లేడని నిరూపించాలి అని బాబు ఆదేశించారు.

 ఇంతలో అక్కడికి సర్వే బృందం వచ్చింది. పాట రిహార్సల్స్ చూసి ఎన్టీఆర్ భవన్‌కు బదులు పక్కనున్న అన్నపూర్ణ స్టూడియోకు వచ్చామా? ఏమిటని కంగారు పడ్డారు. సరైన అడ్రస్‌కే వచ్చారు రండి అని చంద్రబాబు పిలిచారు. ‘‘నేనంటే మా వాళ్లకు పిచ్చి అభిమానం. నాకు కుట్రలు కుతంత్రాలు అస్సలు తెలియదు. ఏ విషయమైనా ముఖం మీదే ముక్కు సూటిగా చెబుతుంటాను, దానే్న మా వాళ్లు పాటగా మార్చి వద్దన్నా పాడుతున్నారు. సాధారణంగా నాకు ఇతరులు పొగడడం నచ్చదు. నా గురించి నేనే పొగుడుకుంటాను.’’ అని చంద్రబాబు బదులిచ్చారు.

 రాష్ట్రంలో కుట్రలు కుతంత్రాలు, కల్లా కపటం తెలియని నాయకుల గురించి మేమో సర్వే నిర్వహిస్తున్నాం అని వారు చెప్పగానే, పాట విన్నాక కూడా ఈ విషయంలో నాతో పోటీ పడేవాళ్లు ఉన్నారని మీరనుకుంటున్నారా? అని అడిగారు. వారు కొన్ని ప్రశ్నలు అడిగి వెళ్లారు.
బాలకృష్ణ తొడలు కొట్టడంతో ఆ యువకులు బెదిరిపోయారు. పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే అయ్యో అనవసరంగా భయపడుతున్నారు. దురదపెడితే గోక్కున్నట్టుగా మా సార్‌కు తొడగొట్టడం అలవాటైంది. అని సిబ్బంది వాళ్లకు నచ్చజెప్పారు. మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అనగానే. మాది నందమూరి వంశం నేను చాలా తెలివైన వాడిని. ఐనా మా బావ చెప్పేంత వరకు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పనంటూ బాలకృష్ణ బాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. నేను చాలా తెలివైన వాడినని మా బావ కూడా చెప్పాడు. సర్వేలోని మీ ప్రశ్నలకు నా తరఫున మా బావే సమాధానాలు చెబుతాడు వెళ్లండి అంటూ బాలకృష్ణ తొడ గొట్టాడు.
మరేటి సేద్దాం అంటూ బొత్స ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. నాకు 31 వైన్‌షాపులున్నాయని ఓపెన్‌గా చెప్పిన వాడిని నా కన్నా కల్లాకపటం తెలియని వాడు ఈ రాష్ట్రంలో ఇంకొకరుంటారా? అని ప్రశ్నించారు.
మా నాన్న చనిపోవడాన్ని తట్టుకోలేక వందల మంది చనిపోయారు. వారిని ఓదార్చడానికి వెళతానంటే మేడం సోనియా వద్దే వద్దన్నారు. పార్టీ నుండి బయటకు పంపినా, అరెస్టు చేసినా ఓదార్పును ఆపనన్నాను. నాకన్నా కల్లాకపటం తెలియని వాడు ఇంకెవడుంటాడు అని జగన్ చెబుతుంటే, మరి లక్ష కోట్లు అంటూ ఏదో అడగబోతే, ప్రశ్న పూర్తి కాకముందే. మా నాన్న నాకు ఇంతపెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. లక్ష కోట్ల కన్నా పది కోట్ల మంది ప్రజల హృదయాలే నాకు ఎక్కువబ్బా! మీ సర్వేలో నా కన్నా అమాయకుడు కనిపించాడా? అని జగన్ ఎదురు ప్రశ్నించారు.
టు నుంచి బృందం నేరుగా కిరణ్‌కుమార్‌రెడ్డి దగ్గరకు వెళ్లింది. ‘‘మేడం మా ఇంట్లో సర్వెంట్లు సరిగా పని చేయడం లేదు. మా ఆవిడేమో సర్వెంట్‌ను మార్చాల్సిందే అంటున్నారు. మరి మార్చమంటరా? మేడం అంటూ కిరణ్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. తన అమాయకత్వం గురించి కిరణ్‌కుమార్ ఏదో చెప్పాడు. వారికి ఏదో అర్ధమైంది. సార్ సర్వే విషయం ఎలా ఉన్నా త్రి భాషా సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా అమలు చేస్తున్నది మీరొక్కరే సార్ అని బృంద సభ్యుడు ముఖ్యమంత్రిని అభినందించాడు. దానికి ముఖ్యమంత్రి మూడు భాషల్లో కృతజ్ఞతలు తెలిపారు.
ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని చిరంజీవి అనగానే అంతా ఫేస్‌ను మరోవైపు టర్నింగ్ ఇచ్చుకున్నారు. ఇప్పుడే మేడం ఫోన్ చేశారు ఏంటీ విషయం అంటూ చిరంజీవి అడిగారు. నమ్మడం లేదా? మేడం అంటే ఎవరనుకున్నారు సోనియాగాంధీ అంటూ చిరంజీవి మురిపెంగా చెప్పారు. 10 జన్‌పథ్ దగ్గర రెండు మూడు రోజులు వేచి ఉన్నా మేడం అపాయింట్‌మెంట్ ఇవ్వదు, ఫోన్ చేస్తుందా? అనుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. సర్వే బృందం ఏమీ చెప్పకుండా పాపం అమాయకుడు అని మనసులోనే అనుకున్నారు.
ఇంకా నేను కాంగ్రెస్‌ను నమ్ముతున్నానంటే నా కన్నా కల్లాకపటం తెలియని వాళ్లు ఇంకెవరుంటారు అని కెసిఆర్ ఎదురుప్రశ్నించారు. మాకంటూ సొంత అభిప్రాయాలు ఉండవు, బాబు మాటే మాకు వేదవాక్కు అని నారాయణ, రాఘవులు కోరస్‌గా పలికారు.
రాష్ట్రంలో రాజకీయ నాయకులంతా కల్లాకపటం తెలియని వారే. కుట్రలు కుతంత్రాలతో నిండని రాజకీయాలకు వీళ్లు పనికిరారు. పాల వ్యాపారం, వైన్‌షాపులు, సినిమా వ్యాపారం సాగించుకోవలసిందే అని బృందం తమ నివేదిక ఇచ్చింది. 
మరి ప్రజలేమంటారో ? 

14, ఫిబ్రవరి 2012, మంగళవారం

బూతును నమ్ముకొని బతుకుతున్న తెలుగు చానల్స్





- కర్నాటకంలో ‘నీలి’ సంచలనం - తెలుగునాట బూతు విప్లవం

తెలుగునాట బుల్లితెరపై నీలి విప్లవం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కర్నాటక అసెంబ్లీలో ముగ్గురు మంత్రులు సెల్‌ఫోన్‌లో అశ్లీల బొమ్మలు చూస్తూ టీవి చానల్ కెమెరాకు చిక్కారు. అయితే ఆ వార్తలను ప్రసారం చేసిన తెలుగు చానల్స్ అంతకు మించిన బూతును చూపిస్తున్నాయ. బూతు బొమ్మలు చూడాలనే ముచ్చట కాస్తా కర్నాటకలో ముగ్గురి మంత్రి పదవులను ఊడబెరికింది. కానీ తెలుగు నాట మాత్రం ఈ బూతు విప్లవం తమ వీవర్‌షిప్‌ను గణనీయంగా పెంచుతుందని చానల్స్ గట్టి నమ్మకంతో ఉన్నాయి. ఉదయం నుండి రాత్రి వరకు అందరి అవినీతిని ఎండగడుతూ ప్రపంచానికి నీతి పాఠాలు చెబుతున్న తెలుగు చానల్స్ రాత్రి పదకొండు అయిందంటే తమ అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నాయి. అన్ని చానల్స్ కాకపోయినా నాలుగైదు తెలుగు చానల్స్ మాత్రం రాత్రి పదకొండు నుండి బూతు పంటను పండిస్తున్నాయి.
ముగ్గురు కర్నాటక మంత్రులు సెల్‌ఫోన్‌లో చూసిన బూతు బొమ్మలు ఏమిటో తెలుగు నాట బుల్లితెర ప్రేక్షకులందరికీ కనువిందు కలిగించేట్టుగా తెలుగు చానల్స్ చూపించాయి. అసెంబ్లీలో కూర్చొని బిల్లులపైనో, ప్రజల సమస్యలపైనో చర్చించాలి. అంత ఓపిక లేకపోతే అధికార పక్షం, ప్రతిపక్షం తిట్టుకుని, పరస్పరం ఆరోపణలు చేసుకోవాలి. అంత కన్నా ఇంకా ఎక్కువ ఓపిక ఉంటే మైకులు విరిచేసి, బాహాబాహికి దిగొచ్చు. ఇది ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రజా ప్రతినిధుల ఓపికను బట్టి జరిగే తంతు. కానీ కర్నాటకలో దీని కన్నా భిన్నంగా ముగ్గురు మంత్రులు సెల్‌ఫోన్‌లో బూతు బొమ్మలు చూస్తూ బ్లూ హ్యాండెడ్‌గా (రెడ్ హ్యాండెడ్ ) దొరికి పోయారు. ఒంటరిగా భోజనం చేయవద్దని, ఎదురుగా ఉన్నవారికి ఆఫర్ చేయాలనేది ఒక సంప్రదాయం. అలానే ఒంటరిగా బూతు బొమ్మలను ఆస్వాదించవద్దని, చుట్టు పక్కల వారికి సైతం ఆ ఆనందాన్ని పంచాలనే సంప్రదాయం ఏమైనా కర్నాటక మంత్రికి ఉన్నట్టుంది. ఆయన ఒక్కడే కాకుండా అటువైపు ఇటు వైపు ఉన్న ఇద్దరు మంత్రులను సైతం పిలిచి చూపించారు. ఇది చివరికి మీడియా కెమెరాలో చిక్కి, కర్నాటకలో సంచలనం సృష్టించింది. కానీ చిత్రంగా కర్నాటక చానల్స్‌లో కన్నా ఈ వ్యవహారాన్ని తెలుగు చానల్స్ ఎక్కువ సమయం చూపించాయి. ముగ్గురు మంత్రులు చూసిన బూతు దృశ్యాలను తెలుగు చానల్స్ పదే పదే చూపించాయి.

 ఐ న్యూస్ ప్రత్యేక కథనాన్ని రూపొందించి, విలువలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. నైతిక విలువలు, భారతీయ సంప్రదాయాల గురించి ఎక్కువగా మాట్లాడే బిజెపికి చెందిన మంత్రులు అసెంబ్లీలో సెల్‌ఫోన్‌లో బూతు బొమ్మలు చూస్తూ దొరికిపోయారు. విలువలకు తిలోదకాలిచ్చి పవిత్రమైన అసెంబ్లీలో మంత్రులు బూతు బొమ్మలు చూశారని తెలుగు చానల్స్ విలువల గురించి ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. ఐ న్యూస్ ఈ అంశంపై విలువలు బోధిస్తూ సెల్‌ఫోన్‌లోని ఆ బూతు బొమ్మలను చాలా సేపు చూపిన తరువాత కొన్ని గంటలు గడవకముందే రాత్రి పదకొండు గంటలకు ష్ గప్‌చుప్ పేరుతో బూతు దృశ్యాలను చూపే కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. మిగిలిన చానల్స్ రాత్రి 11.30, 12 నుండి బూతు దృశ్యాలతో తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుండగా, ఐ న్యూస్ మాత్రం వారి కన్నా అరగంట ముందే బూతు పరుగులు తీస్తోంది. సాధారణంగా క్రీడా వార్తలు, రాజకీయ వార్తలు, క్రైం అంటూ వార్తలు కవర్ చేసేవారు అంశాల వారీగా విడివిడిగా ఉంటారు. అలానే మన చానల్స్‌లో నీతులు బోధించే విభాగం, అర్ధరాత్రి బూతులు చూపించే విభాగం వేరువేరుగా ఉండొచ్చు కానీ, అంతగా నీతులు చెప్పేవారు మరీ ఇంత పచ్చిగా బూతులు చూపడం నైతికంగా ఎంత వరకు సమర్ధనీయం.
కుటుంబం మొత్తం వార్తలు చూసే పది గంటల సమయంలో సైతం ఐ న్యూస్ ష్ గప్ చుప్ గురించి ప్రోమోలు చూపిస్తోంది. బూతు కార్యక్రమాలు చానల్స్ బతుకు పోరాటమో ఏమో? స్టూడియో ఎన్‌లో ఏకంగా బూతు సినిమాలు వేస్తున్నారు. రతినిర్వేదం లాంటి సినిమాలను ప్రసారం చేస్తున్నారు. సరే వీటికి సెన్సార్ బోర్డు వారు ఏ సర్ట్ఫికెట్ ఇచ్చారు, వీటిని చూపించడంలో తప్పేమీ కాదని వాదిస్తారేమో! సినిమాలే కాకుండా స్టూడియో ఎన్‌లో అర్ధరాత్రి బూతు దృశ్యాలు చూపిస్తున్నారు. కర్నాటక అసెంబ్లీలో మంత్రులు చూసిన బూతు బొమ్మలకు మించిన అశ్లీల దృశ్యాలు అర్ధరాత్రి తెలుగు చానల్స్‌లో కనిపిస్తున్నాయి. కొన్ని చానల్స్ సెక్స్ జ్ఞానం ముసుగులో బూతు చూపిస్తున్నారు.
కొన్ని తెలుగు చానల్స్ చివరకు ఇలాంటి కార్యక్రమాల కోసం యాంకర్‌లను సైతం రెచ్చగొడుతూ మాట్లాడేందుకు ప్రోత్సహిస్తున్నారు. చివరకు వారి దుస్తులు సైతం అలానే ఉంటున్నాయి. ఆ విషయం అడిగితే ఏ దృష్టితో చూసే వారికి ఆ విధంగానే కనిపిస్తుందని చెబుతారేమో! తెలుగు న్యూస్ చానల్‌లో నంబర్ వన్ స్థానం తమదే అని చెప్పుకుంటున్న ఎన్ టీవి సైతం ఇలాంటివాటినే నమ్ముకుంటోంది. సినీ కలర్స్ పేరుతో అర్ధరాత్రి వేడివేడి దృశ్యాలను రస ప్రియుల కోసం సమర్పిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో శృంగార నృత్యాలను, దృశ్యాలను చూపిస్తున్నారు. ఇవి రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. కనీసం ఇవి సెన్సార్ సర్ట్ఫికెట్ పొందిన సినిమాలోవి. కానీ ఈ పాటలు, దృశ్యాల మధ్యలో రెచ్చగొట్టే విధంగా ఉన్న బూతు దృశ్యాలను చూపిస్తున్నారు. టీవి 5లో సైతం ఇదే విధంగా ఏదో ఒక పేరుతో బూతు దృశ్యాలు చూపుతున్నారు. సంపన్నుల కుటుంబాలకు చెందిన వారు సైతం వ్యబిచారం చేస్తున్నారని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ఒక్క మాట చాలు మన టీవి వాళ్లకు ఆ పేరుతో పనికి మాలిన దృశ్యాలను చూపిస్తూ నీతి కథలు చెప్పారు.
శరీరంలోని భాగాలకు బీమా చేయిస్తున్నారనో, జీరో ప్యాక్ బాడీ అనో ఏదో ఒక చిన్నమాట చాలు మన వారికి ఆ పేరుతో అశ్లీల దృశ్యాలను జొప్పించేస్తున్నారు.

ఎమ్మెల్యేలు, మంత్రులు కొలువై ఉండే అసెంబ్లీ పవిత్రమైనదే. అసెంబ్లీలో ఉండి సెల్‌ఫోన్‌లో బూతు దృశ్యాలు చూడడం తప్పే! మరి ఇంట్లో ఉండి కొన్ని కోట్ల మంది చూసే చానల్స్‌లో అర్ధరాత్రి పచ్చి బూతు దృశ్యాలను చూపించడం సరైనదేనా? రాజకీయ నాయకులకు విలువల గురించి పాఠాలు చెప్పే చానల్స్ వాటిని తాము పాటించాల్సిన అవసరం లేదా? కొంత కాలం క్రితం ఇదే విధంగా అర్ధరాత్రి సమయంలో బూతు సినిమాలు, సినిమాల్లోని కొన్ని దృశ్యాలు చూపించడంతో చానల్స్‌పై ఫిర్యాదులు వెళ్లాయి. ఆ తరువాత కొంత కాలం వాటి జోలికి వెళ్లలేదు. ఈ మధ్య ఇలాంటి దృశ్యాలు మరీ పెరిగిపోయాయి.
రాజకీయ నాయకులకు నీతులు చెబుతున్న చానల్స్ బూతు దృశ్యాల విషయంలో స్వయం నియంత్రణ కోసం ప్రయత్నించాలి. ఒకరిని చూసి ఒకరు పోటీ పడుతూ అర్ధరాత్రి బూతు చూపాల్సిందే అనే నిర్ణయానికి వచ్చారు. ఈటీవి రాత్రి పాత సినిమాలు ప్రసారం చేస్తుండగా, కొన్ని చానల్స్ మాత్రం బూతునే నమ్ముకున్నాయి.

8, ఫిబ్రవరి 2012, బుధవారం

జ్ఞాన శిక్షలు!....హిరోను కుక్కను చేసి పిల్లిలా వెంట తిప్పుకున్న విఠలాచార్య..... అత్తవారింటి కాపురం తో అల్లుడికి తత్వం బోధపడుతుంది

సినిమాకు హీరో ఊపిరి. మరి అలాంటి ఊపిరికి ఆగ్రహం వస్తే, సినిమా ఊపిరి ఆగిపోతుంది. అందుకే హీరోలకు కోపం రాకుండా వాళ్లను కంటికి రెప్పలా, ఇంటికి అల్లుడిలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇలానే పాత కాలంలో ఒక హీరోగారికి కోపం వచ్చింది. ఇంకేం ఆ సినిమా ఊపిరి ఆగిపోయినట్టే అనుకున్నారు. దర్శకుడు మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఇంటావిడ అలిగి బతిమిలాడడానికి ఇంకా మొగుడు రాలేదేమిటని ఎదురు చూసినట్టుగా ఆ హీరో తనను బుజ్జగించేందుకు దర్శకుడు, నిర్మాత, యూనిట్ మొత్తం కట్టకట్టుకుని వస్తారని అనుకున్నాడు.
 చాలా సేపు గడిచిపోయినా హీరో గారి అలకను పట్టించుకున్న వారు లేరు. పైగా సినిమా షూటింగ్‌ను ఒక్క నిమిషం కూడా ఆపలేదు. ఇదెలా సాధ్యమబ్బా అని ఆశ్చర్యపోయిన హీరో విషయం తెలుసుకుని లబోదిబోమంటూ ఇకపై ఎప్పుడూ అలగనని దర్శకుడికి రాయబారం పంపాడట! ఇది నిజంగా జరిగిందే. ఆ దర్శకుడు విఠలాచార్య. హీరో అలిగాడని తెలిసి ఆయన ఏ మాత్రం కంగారు పడకుండా హీరోను కుక్కను చేసినట్టు కథ మార్చేసి షూటింగ్ జరిపించారు. ఆయనే విఠలాచార్య. దయ్యాలను హీరోయిన్లుగా, కుక్కలు, నక్కలు, పాములుగా చేశారాయన. హీరోను కుక్కగా మార్చి, అందమైన హీరోయిన్ ఒళ్ళో కుక్క ఒదిగిపోయి తెగ నటించేస్తుంటే హీరో దారికి రాకుండా ఉంటాడా? హీరోయిన్ ఒళ్లో కుక్క కన్నా తానే బాగా నటించేస్తానని బతిమిలాడి మరీ దారికి వచ్చాడట హీరో. అందుకే బాబోయ్ విఠలాచార్యవి ఇదేం వింత శిక్షలు అని సినిమా వాళ్లు భయపడి, ఆయన ముందు పిల్లుల్లా ఉండేవారు.


 ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే అంటాడు రేలంగి ఓ సినిమాలో. వాడికేం వాడిని అల్లుడిలా చూసుకుంటారు అంటారు కానీ శిక్షల్లో అత్తగారింటికి వెళ్లడానికి మించిన శిక్ష ఉండదని చాటిచెప్పే పురాతన కథ ఒకటి ఉంది.
సంస్కృత మహాకవుల్లో భారవి ఒకరు. కిరాతార్జునీయం వంటి మహాకావ్యం రాసిన భారవికి సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. చిన్న వయసు నుండే అపారమైన పాండిత్యాన్ని ప్రదర్శించిన భారవిని అంతా మెచ్చుకుంటుంటే, తండ్రి మాత్రం వాడి మొఖం వాడికేం తెలుసు అనేవాడు. మహామహా పండితులను ఓడించాక, ఘన సన్మానం తర్వాత కూడా భారవికి తండ్రి నుండి అవే మాటలు వినిపించాయి. ఒకసారి భారవి కోపాన్ని అణచుకోలేక తనను అభినందించడానికి బదులు అవహేళన చేస్తున్నాడని తండ్రిని ఇక మట్టుపెట్టక తప్పదనుకుని అదే విషయం తల్లికి చెబుతాడు. తొందరపడకు విషయం తెలుసుకుంటానని చెప్పి తల్లి ఈ సంగతి భర్తకు చెబుతుంది. తండ్రి కుమారుడిని మెచ్చుకుంటే ఆయువు క్షీణమవుతుందని, ఆ కారణం చేతనే మెచ్చుకోవడం లేదని భార్యకు చెబుతాడు. అసలు విషయం తెలిసిన తరువాత భారవి తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏం చేయాలని తండ్రిని అడుగుతాడు. ఎందుకొచ్చాను, ఎన్ని రోజులు ఉంటాను అనేది చెప్పకుండా ఏడాది పాటు అత్తవారింటిలో ఉండి రమ్మని భారవిని పంపిస్తాడు.



 అల్లుడిని వారం పాటు బాగా చూసుకున్న అత్తామామ, బావ మరుదులు ఎంతకూ పోడేమిటని రెండు వారాల తరువాత ఇంటి పనులు చెప్పడం మొదలు పెట్టారు. ఆ తర్వాత పొలం పనులు చెబుతారు. ఒక కూలీ మాదిరిగానే భారవి పొలంలో పని చేస్తే, వారి మాదిరిగానే అతనికి తిండి పెడాతారు. కలం పట్టుకోవలసిన ఆ చేతులు హలం దున్నుతాయి. భార్య కన్నీరు మున్నీరై ఏడుస్తుంది. అలా ఏడాది గడిచిన తరువాత అప్పుడు భారవి భార్యతో కలిసి ఇంటికి బయలు దేరుతాడు. తాను చదివిన ఎన్నో గ్రంధాలు నేర్పించని జీవిత పాఠాలను ఏడాది పాటు అత్తగారింటిలో గడిపిన కాలంలో నేర్చుకున్నాని భారవి చెబుతాడు. భారవి తండ్రి నిజంగానే జీవిత సత్యాలు భాగా తెలిసిన వాడు. తన కుమారుడికి చిత్రమైన శిక్ష వేసి, శిక్షతో అతను మరింత రాటుదేలిపోయేట్టు చేశాడు.


 ఒక్కోసారి శిక్షలు అద్భుతమైన జీవిత సత్యాలను బోధిస్తాయి. మార్క్‌ట్వైన్ సైతం అంతే కదా జైలు శిక్ష పడిన తరువాతనే అతనిలో ఒక అద్భుతమైన రచయిత బయటకు వచ్చారు. మన దేశ నాయకులు జైల్లోనే మంచి గ్రంథాలు రచించారు.
రాజు తప్పు చేయడు అని ఇంగ్లీష్ వాడు నమ్మినట్టు స్వాతంత్య్రం వచ్చాక అదే సూక్తిని ఐఎఎస్ బాబులు తప్పు చేయరు అని అనువదించుకున్నారు. తప్పు చేసినా అది రాజు చేశాడు కాబట్టి అది తప్పు కాదన్నమాట అందుకే రాజు తప్పు చేయడు అన్నారు. మరి తప్పు చేశారు కదయ్యా! ఆధారాలున్నాయి కదా? అని ప్రశ్నిస్తే, మమ్మల్ని బెదిరించి తప్పు చేయించారు, లేకపోతే మేం తప్పు చేయడం ఏమిటంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. 



పాలించేది మంత్రులు మేమంతా నిమిత్తమాత్రులం అంటున్నారు. ఐఎఎస్‌లకే అన్నీ తెలుసు అని మొన్నటి వరకు గట్టిగా నమ్మిన వారు ఇద్దరు ముగ్గురు జైలుకెళ్లగానే మాకేం తెలుసు అంటున్నారు. ఏమీ తెలియదంటున్న ఐఎఎస్ బాబులు ఇప్పుడు జైలుకు వెళ్లి బోలెడు చదువుకుని, అన్నీ తెలుసుకుని వస్తే సరిపోతుంది. అధికారాంతమున చూడవలె అన్నట్టు శిక్షల భయంతో అటు నేతలు, ఇటు బాబులు మాకేమీ తెలియదంటే మాకేమీ తెలియదని అజ్ఞానంలో పోటీ పడుతున్నారు. బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు కొందరికి శిక్షలతో జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానశిక్షలకు మించిన శిక్ష లేదు.

7, ఫిబ్రవరి 2012, మంగళవారం

జయమాలినిని కలువ లేరా ? రమణారెడ్డి సమకాలీనులు లేరా ?












సినిమాలో ఒక వెలుగు వెలుగుతున్న తారలు కావచ్చు, కాలం చేసి రెండు మూడు దశాబ్దాలు గడిచిపోయి ఉండొచ్చు. నటుల జన్మదినం అయితే ఘనంగా శుభాకాంక్షలు, జయంతి దినోత్సవం అయితే ఘనంగా నివాళి లభిస్తోంది. ఆ కాలం సినిమా వాళ్లు ఏదో ఒకనాడు తమను ఇంతగా గుర్తుంచుకుంటారని ఊహించి ఉండరు. తెలుగు చానల్స్ పుణ్యమా? అని నాటి తరం సినిమా వాళ్లను ఇప్పుడు మళ్లీ స్మరించుకునే అవకాశం లభిస్తోంది.


రమణారెడ్డి అంటే ఎవరు? అని ఈ తరం వాళ్లు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి అడగొచ్చు. ఇప్పటి వాడా? ఆయన మరణించి మూడు దశాబ్దాలు అవుతుంది. అంటే ఆయన పోయాక మూడు తరాలు వచ్చాయన్నమాట. ఇక నేటి తరానికి ఆయనేం గుర్తుంటారు. కానీ పాత తరం వాళ్లు, పాత సినిమాలను ఇష్టపడే నేటి తరం వారికి రమణారెడ్డి పేరు వినగానే ముఖం నవ్వులతో వికసిస్తుంది. హాస్యనటునిగా తెలుగు సినిమాల్లో ఆయన రూటే వేరు అన్నట్టుగా ఉంది. ఫేవరేట్ 5 పేరుతో టీవి5లో పాత తరం నటుల గురించి చక్కని కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు. అద్భుతమైన పాత సినిమాల గురించి, దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, హాస్యనటులు, గాయనీ గాయకులు అందరి గురించి ఈ కార్యక్రమంలో పాత సినిమాల క్లిప్పింగులతో ప్రసారం చేస్తున్నారు. రమణారెడ్డిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. మరోసారి పాత సినిమాల్లో అతని నటన చూసే అవకాశం కల్పించారు. బాగానే ఉంది కానీ రమణారెడ్డి గురించి వీకీపిడియాలో ఏముందో అది చదివి వినిపించారు. పాత సినిమాల క్లిప్పింగులు, వీకీపిడియాలోని సమాచారం చదవడం అంతేనా? ఇంటర్‌నెట్‌లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం తప్పేమీ కాదు. ఈ రోజుల్లో ఉపయోగించుకోకపోతేనే తప్పేమో! ప్రాథమిక సమాచారం నెట్ నుంచి తీసుకున్నా టీవిలో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించేప్పుడు సొంతంగా కొంత సమాచారాన్ని సేకరించి కార్యక్రమాన్ని రూపొందిస్తే మరింత ఆకట్టుకునేది. చాలా సినిమా కార్యక్రమాలకు పెద్దగా శ్రమించకుండా ఇలా అరకొర సమాచారం, ఐదారు సినిమాల క్లిప్పింగులతో ముగించేస్తున్నారు. పాత సినిమాల గురించి, పాత తరం నటుల గురించి టీవిలో చూపిస్తున్నందుకు అభినందనలు.


 అదే సమయంలో ఇలాంటి కార్యక్రమాలు కొంత శ్రమించి రూపొందిస్తే మరింత అద్భుతంగా ఉంటాయి.
‘ ఆ శరీరం రబ్బరు బొమ్మ తిరిగినట్టు, చేతులు కాళ్లు కావలసిన రీతిలో ఆడించేది. దబ్బున కూలిపోవడం, దబాలున పడిపోవడం రమణారెడ్డికే సాధ్యమైనట్టు తక్కిన వాళ్లకి సాధ్యమయ్యేది కాదు’ అని రమణారెడ్డి గురించిన అభిప్రాయాన్ని సైతం వికీపీడియా నుంచి మక్కీకి మక్కి తీసుకోవాలా?


రమణారెడ్డి ఆరు దశాబ్దాల క్రితం సినిమా రంగ ప్రవేశం చేశారు. మూడు దశాబ్దాల క్రితం మరణించారు. అయితే అతను సినిమాల్లో నటించేప్పుడు ఆయనతో పాటు నటించిన కొంత మంది నటీనటులు ఇప్పుడు లేకపోలేదు. వారితో రమణారెడ్డి గురించి మాట్లాడి కార్యక్రమాన్ని రూపొందిస్తే బాగుండేది. ఆనాటి హీరోయిన్ గీతాంజలి, రావికొండల రావు దంపతులతో పాటు చాలా మంది ఉన్నారు. రావి కొండల రావు ఆనాటి అద్భుతమైన సినిమాల గురించి, నటీనటుల గురించి చక్కని వ్యాసాలు రాస్తున్నారు. ఇలాంటి వారిని కలిసి రమణారెడ్డి నటన గురించి మాట్లాడితే, కార్యక్రమానికి నిండుదనం వచ్చేది. ఏదో మొక్కుబడిగా ఇంటర్‌నెట్‌లో లభించే సమాచారంతో వ్యాఖ్యానం, పాత సినిమాల సిడిల నుంచి కొన్ని క్లిప్పింగ్స్ తీసుకుంటే చాలు. కానీ ఇంత కన్నా బాగుండాలి అనుకుంటే సొంత శ్రమ కూడా కొంత చేస్తే బాగుంటుంది. బ్రహ్మానందం జన్మదినం రోజున తెలుగు చానల్స్ ఇలానే కొన్ని సినిమాల క్లిప్పింగ్స్‌తో చేతులు దులుపుకున్నాయి. బ్రహ్మానందం ఉండేది భాగ్యనగరంలోనే కదా ఆయనతో మాట్లాడించవచ్చు, ఆయన తోటి నటులతో మాట్లాడించవచ్చు.


జయమాలిని ఒకప్పుడు తెలుగు సినిమాలను తన ఒంపు సొంపులతో ఒక ఆట ఆడించిన నటి. ఆమె సినిమాల్లో వచ్చిన కొత్తలో అప్పటి చాలా మంది హీరోయిన్ల కన్నా అందంగా ఉండేది. కానీ మొదటి నుంచి వాంప్ పాత్రలకే పరిమితమయ్యారు. జయమాలిన తన ఆత్మకథ రాసుకుంటున్నారని నాలుగైదేళ్ల క్రితం ఇంటర్‌నెట్‌లో ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ వార్తను జయమాలిని ఖండించలేదు, నిజమే అని చెప్పలేదు. జయమాలిని జన్మదినం సందర్భంగా ప్రతి సారి ఆ వార్తనే అటూ ఇటూ తిప్పి కథనాలు ప్రసారం చేస్తున్నారు. జయమాలిని ఆత్మకథ అంటే ఆసక్తి ఉండడం సహజమే. సిల్క్‌స్మిత కన్నా జయమాలిని ఎక్కువ కాలం తెలుగు సినిమాలపై తన ప్రభావం చూపించారు. అలాంటి జయమాలిని ఇప్పుడు ఏం చేస్తోంది? ఎక్కడుంది అనే ఆసక్తి తెలుగు సినిమా అభిమానులకు తప్పకుండా ఉంటుంది. జయమాలిని ఆత్మకథ రాస్తున్నారనే వార్త ఇంటర్‌నెట్‌లో దర్శన మిస్తే, తెలుగు చానల్స్ స్వయంగా ఆమెను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించవచ్చు కదా. ఇంటర్‌నెట్ వార్తను పట్టుకుని ఎన్ని సార్లు నడిపిస్తారు. ఆమె ఉండేది చెన్నై నగరమే. అదేమీ చానల్స్ వాళ్లు వెళ్లకూడని మరో ఖండమేమీ కాదు. పొరుగు రాష్టమ్రే కదా? కానీ అంత ఓపిక చానల్స్‌కు ఎక్కడిది? పాత సినిమాల్లో జయమాలిని క్లిప్పింగులతో అరగంట కథ నడిపించేయగలరు. ఆది బాగానే ఉంటుంది. కానీ చెన్నై వెళ్లి ఆమెతో మాట్లాడి ప్రత్యేక కథనాన్ని రూపొందిస్తే అది మరింత ఆసక్తికరంగా ఉంటుంది.

5, ఫిబ్రవరి 2012, ఆదివారం

ఏది విజయం

జగన్ కు అయిదున్నర లక్షల వోట్ల మెజారిటీ వచ్చింది. ( ఆయన లక్ష కోట్లు అక్రమంగా సంపాదించాడనే ఆరోపణ ఉంది . ఇందులో పది శాతం అన్నా నిజం కావచ్చు) ఎప్పుడూ చూసిన ఒక ముతక బట్ట సంచితో కనిపించిన వావిలాల గోపాల క్రిష్నయ్య ఎన్నికల్లో వొడి పోయారు . ఎన్నో కళాత్మక సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. బూతు  మాటలు,బూతు  పాటల సినిమాలు హిట్టయ్యాయి. (పేరు గుర్తుకు రావడం లేదు విశ్వనాద్ కళాత్మక సినిమా ఒకటి విడుదలకే నోచుకోలేదు . రాజకీయాల్లోకి రాక ముందు  తన జీవితం లో ఎప్పుడూ ఏ ఉద్యమం లో పాలు పంచుకొని చంద్రబాబు రాష్ట్రం లో అత్యదిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు( విద్యార్తి గా ఉన్నప్పుడు విద్యార్థి సంఘం లో కుల రాజకీయాలు నడపడం ఉద్యమం కాదు ) ఇక ఇప్పుడు కాబోయే సి యం రేస్లో జగన్ బాబు ఉన్నారు. వీరిద్దరిలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలా ? అని కమ్యునిస్టులు ఎదురు చూస్తున్నారు .. ఒక  వ్యక్తి అయినా , ఒక పార్టీ అయినా ...సిద్ధాంతం అయినా ? విజయం సాధిస్తేనే మంచిదని, గొప్పదని భావించాలా ? ఏది విజయమో నేను చెప్పడం లేదు . ఏది విజయమో తెలుసుకోవాలనుకుంటున్నాను . ఇంతకూ

1, ఫిబ్రవరి 2012, బుధవారం

మధురవాణి..చింతామణి..సామాజిక న్యాయం


 ‘‘వా’నాకు అది కావాలి అని ఆరేళ్ల బాబిగాడు కాళ్లు నేలకేసి కొట్టుకుంటున్నాడు. కావాలంటే క్యాడ్‌బరీ తీసుకో అని తాత పరంధామయ్య వాడిని సముదాయించడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడేమో ఏడుపు శృతి పెంచాడు. తినే వస్తువు కాకపోతే టీవిలో అంత మంది ప్రముఖులు అదే మాటను మళ్లీ మళ్లీ ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించాడు. పదే పదే ఒకే మాట వినిపిస్తే అది కచ్చితంగా యాడ్ అని, యాడ్ అంటే తినే వస్తువే అనేది వాడు నమ్మిన సిద్ధాంతం. ‘‘నాన్నా వాడేదో అడుగుతున్నాడు ఇవ్వోచ్చు కదా?’’ అని లోపలి నుంచి కూతురు ఆదేశించింది. ‘‘అది కాదమ్మా వాడేమడుగుతున్నాడో మీకు తెలుసా?’’ అని తండ్రి మాటను పూర్తి చేయక ముందే, ‘‘తెలుసులే నాన్నా వాడేమన్నా నీ కొడుకు కొడుకు కాదు కదా! కూతురు కొడుకు కదా? ఇలానే ఉంటుందిలే’’ అని కూతురు ముక్కు చీదుకుంటూ వంట గది నుంచే నిష్టూరంగా పలికింది.

 ‘‘ఇదిగో మిమ్మల్నే.. రిటైర్ అయి పని పాటా లేకుండా ఇంట్లోనే ఉన్నారు కదా? మనవడు అడిగింది కొనివ్వలేరా?’’ అని అక్కడి నుంచే కూతురుకు మద్దతుగా భార్య గర్జించింది. పరిస్థితి చేయి దాటి పోయేట్టుగా ఉందని కంగారు పడ్డ పరంధామయ్య పదరా బుజ్జి నువ్వడిగింది ఇస్తాను అని బయటకు నడుస్తూ, వాడికి సామాజిక న్యాయం కావాలట! టీవిలో కనిపించిన ప్రతి ఒక్కరు, సామాజిక న్యాయం... సామాజిక న్యాయం అంటుంటే. వీడేమో అదేదో తినే వస్తువు అనుకుంటున్నాడు.అని పరంధామయ్య చెప్పాడు.
***
ఏమిచ్చినా బాబిగాడు ఊరుకోవడం లేదు. సామాజిక న్యాయమే కావాలంటున్నాడు. మిత్రులకు ఫోన్ చేసి పార్క్‌కు రమ్మన్నాడు పరంధామయ్య. సామాజిక న్యాయం కంటికి కనిపించేది కాదురా బుజ్జి అని బుజ్జగిస్తూ చెప్పాడు. కనిపించక పోతే ప్రతి ఒక్కరూ అదే ఎందుకు చెబుతారు? నాకు సామాజిక న్యాయం కావాలి అని మళ్లీ ఏడుపు అందుకున్నాడు. ఇంతలోనే మిత్రులు రావడంతో బుజ్జిగాడి సమక్షంలోనే మిత్రులంతా సామాజిక న్యాయంపై చర్చ మొదలు పెట్టారు. ‘‘నాకు తెలిసి ఎన్టీఆర్ చేసిన సామాజిక న్యాయం మరెవ్వరూ చేయలేదు. షష్టిపూర్తి + డజను సంవత్సరాల వయసులో తమ వర్గం శ్రీమతినే పెళ్లి చేసుకున్న దాన్ని మించిన సామాజిక న్యాయం ఏముంటుంది?’’ అని ఎన్టీఆర్ అభిమాని చెప్పుకొచ్చాడు. ‘‘అసలు సామాజిక న్యాయం అనే పదానికి గ్లామర్ తీసుకు వచ్చిందే మా చిరంజీవి, ఓట్లు మా వాళ్లే వేశారు, సీట్లు మా వాళ్లే గెలుచుకున్నారు, మంత్రి పదవులు మా వాళ్లకే ఇప్పించుకున్నాం ఇంతకు మించిన సామాజిక న్యాయం ఏముంటుంది’’ అని చిరు అభిమాని ప్రశ్నించాడు.

 ‘‘ వైఎస్‌ఆర్ హయాం ఆయన తన ప్రత్యర్థి సామాజిక వర్గాల వారిని సైతం తన కోటరీలో చేర్చుకున్నారు. ఇంతకు మించిన సామాజిక న్యాయం ఇంకేముంటుంది అదే దారిలో జగన్ పయనిస్తున్నారు. వారిని మించిన సామాజిక న్యాయం ఇంకెక్కడుంటుంది’’ అని ఆయన అభిమాని సూటిగా ప్రశ్నించారు. సామాజిక న్యాయం, బాబు ఒకరి కోసం ఒకరు పుట్టారు. అతుక్కొని పుట్టిన వీణావాణి కవలపిల్లల మాదిరిగా బాబు సామాజిక న్యాయం కలిసే పుట్టాయి. వాటిని విడదీయడం ఎవరికీ సాధ్యం కాదని పచ్చ చొక్కా ఆయన ఆవేశంగా పలికాడు. అల్లుడు, మేనల్లుడు, కూతురు వీరి కోసం తపించడాన్ని మించిన సామాజిక న్యాయం ఏముంటుంది సామాజిక న్యాయంలో కెసిఆర్‌ను మించిన వారు లేరని ఇంకొకాయన బల్లగుద్ది చెప్పాడు.
మీరంతా మీమీ సామాజిక వర్గాం వారి గొప్పలు చెప్పుకుంటూ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. గతి తార్కిక భౌతిక వాదం గురించి అవగాహన లేని బూర్జువా శక్తులు మాత్రమే ఇలా మాట్లాడగలవు. మీకు దధీచి తెలుసా? అని ఎర్రన్న సీరియస్‌గా అడిగాడు. వాడెవడు రష్యన్ కమ్యూనిస్టు నాయకుడా? అని ఓ పెద్దాయన ఎద్దేవా చేశాడు. ఒక రకంగా ఆయన పూర్వపు కమ్యూనిస్టు. దధీచి తన వెన్నుముకను ఇంద్రుడికి ఇస్తే, దాంతో ఇంద్రుడు వంద అంచులు గల వజ్రాయుధాన్ని చేసుకొన్నాడు. ఇంద్రుడి ఆయుధం కోసం దధీచి తన వెన్నుముకను ఇస్తే కమ్యూనిస్టు సోదరులు పువ్వాడ నుంచి రాఘవులు వరకు చంద్రుడి కోసం తమను తానే ఆర్పించుకున్నారు. సామాజిక వర్గ ప్రయోజనాల కోసం సొంత పార్టీని త్యాగం చేసి తెలుగు పార్టీ పల్లకీని మోసిన మా ఎర్రన్నలను మించిన సామాజిక న్యాయం ఎక్కడుంది ఎర్రాభిమాని ప్రశ్నించాడు.
ఏరా కపాలేశ్వర్ నువ్వేమంటావు. ప్రతి దానికి కన్యాశుల్కం గురించి చెబుతావు కదా? అని పరంధామయ్య సన్నిహిత మిత్రున్ని అడిగాడు. నాకు మాత్రం మధురవాణి, చింతామణిలు గుర్తుకొస్తున్నారు. గిరీశం మొదలు లుబ్దావధాన్లు వరకు అందరినీ సమానంగా ఆదరించిన మధురవాణి, భవానిశంకర్ నుంచి సుబ్బిశెట్టి వరకు అందరినీ సమానంగా ఆదరించిన చింతామణిని మించి సామాజిక న్యాయం చేసినవారు ఎవరున్నారని కపాలేశ్వర్ పకపకా నవ్వాడు.

 ఏడవాలో, ఏడుపు నిలిపివేయాలో నిర్ణయించుకోలేక బుజ్జిగాడు ఆయోమయంలో పడిపోయాడు.