20, ఆగస్టు 2018, సోమవారం

డబ్బు సంపాదించడం నేరమా?

డబ్బు సంపాదించడం నేరమా? సంపన్నులంతా నేరస్తులేనా? పేదరికం వరమా? మీరు పేదరికాన్ని ప్రేమిస్తున్నారా? డబ్బును ద్వేషిస్తున్నారా? నిజానికి పైకి డబ్బును, సంపన్నులను ద్వేషిస్తున్నట్టు కనిపించే వారు సైతం మనసులో వీటిని విపరీతంగా ప్రేమిస్తుంటారు.
డబ్బు సంపాదించే వాళ్లంతా ద్రోహులు కాదు. పేదరికం ఒక వరం కాదు. పాత సినిమాలు, అభ్యుదయ సాహిత్యం డబ్బు సంపాదనపై నెగిటివ్ భావనలు కలిగించాయి. పేదరికాన్ని గొప్పగా చూపుతూ చాలా సినిమాల్లో అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. కొన్ని దశాబ్దాల పాటు ఇవి మన మెదడుపై ఎంతో కొంత ప్రభావం చూపించాయి.
ప్రారంభ కాలంలో సినిమాలు, పత్రికలు, సాహిత్యంలో వామపక్ష భావజాలం ఉన్నవారి ప్రభావమే ఎక్కువ. వీరు పేదరికంలో ఉండడమే అదృష్టం అన్నట్టుగా చూపించారు.
ప్రారంభంలో తెలుగు సినిమాల్లో సంపన్నులు విలన్లు ఊరి జనాన్ని హింసిస్తుంటారు. ఊరిలోని పేద హీరో సంపన్న భూస్వామిని దారిలోకి తెస్తాడు. దాదాపు పాత సినిమాల్లోని కథలన్నీ ఇవే. చిత్రంగా ఆసినిమాలను నిర్మించింది జమిందారి కుటుంబాలు, సంపన్నుల కుటుంబాలే. ఒక రూపాయి పెట్టుబడి పెట్టిన వ్యాపారి తన పెట్టుబడికి మించి ఆదాయం రావాలని కోరుకుంటాడు. ఆ కాలంలో ఐనా ఈ కాలంలో ఐనా సినిమా వ్యాపారమే. దేశంలో పేదలే ఎక్కువ. వారు సినిమా చూస్తేనే తమ పెట్టుబడికి తగిన ఆదాయం వస్తుంది. ప్రేక్షకులు వారి ప్రొడక్ట్ కొనే వారు. కొనేవారికి నచ్చినట్టు ఉన్న ప్రొడక్టే అమ్ముడు పోతుంది. అమ్ముడు పోతేనే పెట్టుబడికి తగిన లాభాలు వస్తాయి. పేదలను హీరోలుగా, సంపన్నులను విలన్లుగా చూపే ఈ సినిమాలను నిర్మించింది జమిందార్లు, సంపన్నులే. పేదరికంలో బతకడం చాలా గొప్పతనం అనే భ్రమలు బాగానే పని చేశాయి. పేదరికంపై అద్భుతమైన డైలాగులు రాసే రచయిత, దర్శకులు, నటించే నటులు ఎవరూ పేదరికంలో ఉండడానికి ఇష్టపడరు.
పేదరికంలో పుట్టడమేమీ తప్పు కాదు. కానీ పేదరికాన్ని ప్రేమిస్తూ పేదరికంలో ఉండడమే గొప్ప అనే మానసిక స్థితి తప్పు. దాని నుంచి బయటపడడం మంచిది. చాలా మంది వామపక్ష నాయకులు మెడికల్ కాలేజీల వ్యాపారంలో, వడ్డీ వ్యాపారం, మద్యం వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కోట్లు సంపాదించారు. కానీ పేదరికం సాహిత్యానికి తమ వంతు సహకారం అందించారు.
***
సికిందరాబాద్ శివారు ప్రాంతంలో రోజు కూలీ చేసుకుని బతికే కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. రోడ్డుకు ఒకవైపు గుడిసెలు, మరో వైపు నీళ్ల ట్యాంకర్ ఆపారు. కార్లు వెళ్లడానికి దారి లేకుండా పోయింది. కొంచం పక్కన ఆపుకోవచ్చు కదా? అని నీళ్ల ట్యాంకర్ అతన్ని కారు డ్రైవర్ చెప్పడమే ఆలస్యం ఆ గుడిసెళ్లోంచి ఒకరు వచ్చి అచ్చం ఆర్ నారాయణ మూర్తి తరహాలోనే ఈ పేదలు గుక్కెడు నీళ్లు కూడా తాగడాన్ని సహించలేరా! మీ డబ్బున్న వారే మనుషులు కానీ పేదలు కాదా? అంటూ అచ్చం సినిమాలోలానే డైలాగులు వినిపిస్తుంటే విన్నవారు మనసులోనే నవ్వుకుంటూ వెళ్లిపోయారు. కారులో వెళ్లడం పాపం, గుడిసెలో పేదరికంలో గడపడం అదృష్టం అన్నట్టుగా అతని సినిమా డైలాగులు ఉన్నాయి. ఇలాంటి డైలాగులు సినిమాల ప్రభావం నుంచే వస్తాయి. సాంఘిక చిత్రాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఇదే తరహాలో సంపన్నులు అంటే విలన్లు, పేదరికం అదృష్టం అన్నట్టుగా చూపించారు. సినిమాల యుగం ప్రారంభం అయినప్పటి నుంచి సినిమాల్లో గుడిసె వాసుల్లోనే మానవత్వం, ప్రేమ అన్నీ ఉంటాయి. డబ్బులున్న వారు విలన్లు. నిజానికి అలాంటి సినిమాలు తీసేది కూడా డబ్బులతోనే, డబ్బులు సంపాదించేందుకే పేదరికం కథలు తీస్తారు. నిర్మాత, దర్శకుడు, అందులో నటించిన నటులు అంతా డబ్బున్నవాళ్లే. పేదరికాన్ని ఎంతగానో ప్రేమించే కథలు రాసే రచయితలు సైతం పేదరికానే్నమీ ప్రేమించరు. ఎంత త్వరగా సంపన్నులం కావాలనే కోరుకుంటారు.
రోజు కూలీపై బతికే వారిపై విప్లవ సినిమాల డైలాగుల ప్రభావం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. మద్యం షాపులను వేలం పాటల ద్వారా విక్రయిస్తారు. భవన నిర్మాణ కార్మికులు పేద్ద సంఖ్యలో ఉండే ఇలాంటి ప్రాంతాల్లో వైన్‌షాపులకు వేలం పాటలు అత్యధిక ధర పలుకుతుంది.
రోజుకు ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల కూలీ వస్తుంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు పదివేల రూపాయల లోపు జీతానికి కూడా పని చేస్తున్నారు. అలాంటిది రోజు కూలీ అంత కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఐతే వీరికి తాము సంపాదించిన దానిలో కొంత పొదుపు చేయడం, ఇనె్వస్ట్ చేయడం వంటివి అలవాటు చేస్తే వారి జీవితాలు పేదరికం నుంచి బయటపడతాయి. ఏ రోజు సంపాదన ఆ రోజు ఖర్చు కావడం, మద్యానికి ఖర్చు చేయడం వల్ల పేదరికానికి శాశ్వతం బంధువులుగా ఉండిపోతారు. పేదరికం నుంచి బయటపడాలి, సంపాదించిన దానిని పేదరికం నుంచి బయటపడే సాధనంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన రావాలి. స్వతఃహాగా ఆలోచన వచ్చిన వారు ఆ స్థాయి నుంచి కూడా ఎదుగుతున్నారు. ఇంజనీరింగ్ తరువాత సెల్‌ఫోన్ కంపెనీ కోసం కేబుల్స్ తవ్వే కూలీ పని చేసిన యువకుడు ఇప్పుడు బంజారాహిల్స్‌లో కోట్ల రూపాయల కంపెనీ ఓనర్. అతని జీవితం నిజంగా పేదరికాన్ని పారద్రోలాలి అనుకునే వారికో గ్రంథం. మరో నాలుగేళ్లపాటు కంపెనీ నిర్వహించి, తరువాత తనలా పేదరికం నుంచి బయటపడేందుకు మిగిలిన వారికి వ్యక్తిత్వ వికాసం గురించి పాఠాలు చెప్పాలని ఆ యువకుడు నిర్ణయించుకున్నారు. పేదరికంపై పోరాటానికి ఇలాంటి యువకుల జీవితాలు ఆదర్శం అంతే కానీ పేదరికాన్ని గ్లామరైజ్ చేసే సినిమాలు, డైలాగులు, సాహిత్యం కాదు.
పేదరికంలో పుట్టినా, పేదరికం నుంచి బయటపడేసేది మాత్రం మన మనసే. ఎదగాలి అనే బలమైన కోరిక ఉన్నప్పుడు పేదరికాన్ని జయించవచ్చు. మనం ఏం కావాలన్నా, మన భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకున్నా ముందు మన మనస్సు దానికి సిద్ధం కావాలి. నా జీవితం ఇంతే, పేదరికంలోనే పుట్టి, పేదరికంలోనే చనిపోవాలని నా నుదుటి మీద రాసి ఉంది అని మీరు పదే పదే మీ మెదడుకు సందేశాలు ఇస్తే, మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం ఉంటుంది. అలా కాకుండా నా చుట్టు ఎంతో మంది పేదరికాన్ని జయించిన విజేతలు ఉన్నారు. అలా నేనెందుకు చేయలేను అని మిమ్ములను మీరు ప్రశ్నించుకుంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని పేదరికంపై విజయం సాధించవచ్చు.
చట్టవిరుద్ధంగా సంపాదించడం తప్పు కానీ చట్టబద్ధంగా సంపాదించడం, సంపన్నులుగా మారడం తప్పు కాదు. అవకాశాన్ని అందిపుచ్చుకోక పోవడమే తప్పవుతుంది. పేదరికం సినిమాల్లో చూపినంత గ్లామర్‌గా ఉండదు. పేదరికాన్ని ప్రేమించడం, సంపన్నులను ద్వేషించడం పాత కాలపు ఫ్యాషన్. పేదలంటే హీరోలు, సంపన్నులు విలన్లు అనేది సినిమాల్లో మాత్రమే నిజ జీవితంలో అలా ఉండదు.
దాన్ని వదిలేయండి పేదరికాన్ని పారద్రోలండి. చట్టబద్ధంగా సంపాదించండి దీని కోసం మనసును ముందు సిద్ధం చేసుకోండి. పాత భావాలను పారద్రోలండి.
-బి.మురళి(16-7-2018)

రెండో ఆదాయం!

‘‘మీకు రెండవ ఆదాయం ఉందా?’’
‘‘మాది మీలా ప్రభుత్వ ఉద్యోగం కాదు రెండవ ఆదాయం ఉండేందుకు. మీకేం అదృష్టవంతులు. ఒక చేయితో కాదు రెండు చేతులా సంపాదిస్తారు. ’’
ఇలాంటి సంభాషణ మనం చాలా సార్లు వినే ఉంటాం. రెండవ ఆదాయం అంటే అక్రమ సంపాదనేనా? మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు ఎవరైనా కావచ్చు ప్రతి వారికి ఒకటే ఆదాయం ఎప్పటికైనా ప్రమాదకరమే. రెండవ ఆదాయంపై దృష్టి సారించడం ప్రతి ఒక్కరికీ అవసరం.
నోకియా ఒకప్పుడు సెల్‌ఫోన్‌లు తయారు చేసే గొప్ప కంపెనీ. బజాజ్ చేతక్ స్కూటర్లు ఒకప్పుడు బ్లాక్‌లో అమ్ముడు పోయేవి. ఆ స్కూటర్ కావాలంటే దాదాపు ఏడేళ్ల పాటు వెయిటింగ్ లిస్ట్‌లో మన పేరు చూస్తూ గడిపేయాల్సి వచ్చేది. బైక్‌ల విజృంభణతో స్కూటర్ల ఉత్పత్తి నిలిచిపోయింది. సెల్‌ఫోన్ ప్రపంచాన్ని ఏలిన నోకియా కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు తమ జీవితానికి ఢోకా లేదనే ధీమాతో బతికే వారు. ఆ కంపెనీలు కుప్పకూలిపోవడంతో వాటిపై ఆధారపడిన కుటుంబాలు ఒక్కసారిగా దిక్కు తోచని స్థితిలో పడిపోతాయి. గొప్ప కంపెనీలు అనే కాదు ఏ వ్యక్తి అయినా అప్పటి వరకు తనకు ఉపాధి కల్పిస్తున్న సంస్థ దెబ్బతినడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోతారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసినప్పుడు చాలా మంది ఉద్యోగులు మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. అప్పటి వరకు ఒక విధమైన జీవితానికి అలవాటు పడిన వారు తాము పని చేసే సంస్థ మూతపడగానే తట్టుకోలేరు. ప్రభుత్వ రంగ సంస్థ అయినా ప్రైవేటు సంస్థ అయినా ఉద్యోగి కోలుకోలేరు.
మారుతున్న కాలంలో ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరిగాయి. అదే సమయంలో ఏ సంస్థలో ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. పాతికేళ్ల లోపు వయసులోనే ఐటి కంపెనీల్లో ఉద్యోగం వేలల్లో జీతం. అంతా బాగుందనుకుంటుండగా ఉద్యోగం ఎప్పుడు పోతుందో ఎందుకు పోతుందో తెలియని పరిస్థితి. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చినా, అమెరికా- చైనాల మధ్య సుంకాల యుద్ధం జరిగినా, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఎవరి ఉద్యోగానికి ఎసరు వస్తుందో తెలియని పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నాయి, అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగితే ఉపాధి ఎక్కడ దెబ్బతింటుందో తెలియని పరిస్థితి. ఎక్కడో అమెరికా తీసుకునే నిర్ణయం ఎక్కడో మారుమూల గ్రామం మనె్నవారిపల్లి గ్రామానికి చెందిన యువకుడు పని చేసే మాదాపూర్‌లోని ఐటి కంపెనీపై పడొచ్చు. ఉద్యోగం ఊడొచ్చు. అంటే ట్రంప్‌ను కలలో కూడా చూడని గ్రామీణ కుటుంబంపై ట్రంప్ నిర్ణయం తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
జీవితం అంటే భయపెట్టడానికి చెప్పడం కాదు. మారిన పరిస్థితుల్లో ఏ నిర్ణయం, ఎవరి తప్పు ఎవరి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పలేం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త అవసరం. ఒకసారి ఉద్యోగంలో చేరితే 58 ఏళ్లకు శాలువా కప్పి రిటైర్‌మెంట్‌కు వీడ్కోలు పలికే రోజులు కావివి. ఏమైనా జరగవచ్చు. సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి తన ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. ఉన్న ఉద్యోగం ఊడవచ్చు. ఏదైనా జరగవచ్చు.
వ్యతిరేక భావనలు కలిగించడం కాదు. మన కళ్ల ముందే ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సాధించి క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగం పొంది జీవితం హ్యాపీడేస్ సినిమాలా గడిచిపోతుందనుకునే కుర్రాడికి కంపెనీలో ప్రతికూల పరిస్థితులు ఎదురైతే తట్టుకోవడం కష్టం. ఇలా జరుగుతుందని కాదు, జరగదని కాదు.
కానీ రెండవ ఆదాయంపై దృష్టి సారిస్తే, ఆ కుటుంబం ఇలాంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడమే కాదు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటుంది. రేపటిపై ధీమాగా జీవిస్తుంది. రెండవ ఆదాయం అంటే అక్రమంగా సంపాదించడం, నీతిని వదిలేయడం కాదు.
చేసే ఉద్యోగంలో జీతం ఎంతైనా కావచ్చు. ఖర్చులు తగ్గించి పొదుపును పెంచి సరైన రీతిలో ఇనె్వస్ట్ చేస్తే ఆ పొదుపే రెండవ ఆదాయానికి మార్గం అవుతుంది.
హిందీ సినిమా రంగంలో టాప్ హీరోలు కోట్ల రూపాయల్లో పారితోషికం తీసుకుంటారు. సినిమా రంగంలో అవకాశాలు ఎంత కాలం ఉంటాయో తెలియదు. టాప్ హీరోలు అందరూ సినిమా ఆదాయంపైనే కాకుండా ఇతర ఆదాయాలపై దృష్టిసారించారు. తాము సంపాదించిన డబ్బును హోటల్స్, రియల్ ఎస్టేట్, పరిశ్రమల వంటి రంగాల్లో పెట్టుబడి పెడుతున్నారు. సినిమాల్లో అవకాశాల సంగతి ఎలా ఉన్నా ఇతర రంగాల్లో వీరు పెట్టిన పెట్టుబడి వీరిని ఎక్కడికో తీసుకు వెళుతుంది. సినిమాల్లో అవకాశాలు లేకపోయినా సినిమాల ద్వారా సంపాదించిన దాని కన్నా ఇతర వ్యాపార మార్గాల ద్వారా వీరికి ఎక్కువ ఆదాయం వస్తోంది. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే వారు ఆ స్థాయిలో రెండవ సంపాదనపై దృష్టిసారిస్తే, సామాన్య ఉద్యోగి తన స్థాయిలో తాను రెండవ ఆదాయంపై దృష్టిసారించాలి. పన్ను రాయితీల కోసం ఉద్యోగులు ఏటా లక్షా 50వేల రూపాయల వరకు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. కొంత కాలానికి ఇదే పెద్ద ఆదాయం కావచ్చు. అందరి ఆలోచనలు ఒకే రకంగా ఉండవు, ఒకే రకమైన అభిరుచులు, అవకాశాలు ఉండక పోవచ్చు. అవకాశం ఉన్నంత వరకు ఒకే ఆదాయంపై ఆధారపడకుండా చట్టబద్ధంగా రెండవ ఆదాయంపై దృష్టిసారించడం ఈ కాలంలో అందరికీ అవసరం. చాలా మంది ఇంటిపై పెట్టుబడిని రెండవ ఆదాయంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా మందివి పెన్షన్ లేని ఉద్యోగాలు. చివరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సైతం పెన్షన్ విధానం మారింది. ఇలాంటి పరిస్థితిలో తాను ఉండడంతో పాటు అద్దె వచ్చే విధంగా సొంత ఇంటిని సమకూర్చుకోవడంపై చాలా మంది దృష్టి సారిస్తున్నారు. నగరాల్లో ఉన్న వారికి ఇది మంచి అవకాశం. ఇంటి విలువ పెరగడంతో పాటు పెన్షన్‌లా నెల నెలా అద్దె రూపంలో ఆదాయం వస్తుంది.
ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన రేలంగి నరసింహారావు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సినిమాల్లో పెద్దగా సంపాదించింది లేదని, ఆ రోజుల్లో కట్టిన ఇంటిపై ఇప్పుడు వస్తున్న అద్దెనే తనకు జీవనాధారం అని వివరించారు. ఆదాయం గడించేప్పుడే సరైన ఇనె్వస్ట్‌మెంట్ చేయాలి. భద్రమైన జీవితానికి రెండవ ఆదాయం అనివార్యం.
-బి.మురళి(9-7-2018)

18, ఆగస్టు 2018, శనివారం

దేశద్రోహులకో దేశం!

ఎంటీ.. అంత రహస్యంగా స్మార్ట్ ఫోన్ లో  లీనమయ్యావు’’
‘‘స్వచ్ఛ పనిలో ఉన్నాను. మెసేజ్‌లతో ఫోన్ బరువుగా మారింది. క్లీన్ చేస్తున్నాను’’
‘‘నాకు తెలుసులే.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షల మెసేజ్‌లతో ఫోన్ నిండిపోయి ఉంటుంది?’’
‘‘కాదు.. ఆ మెసేజ్‌లు మహా అయితే ఆరేడు వచ్చి ఉంటాయి. ఈసారి చిత్రంగా స్వాతంత్య్ర దినోత్సవ వ్యతిరేక మెసేజ్‌లతో ఫోన్ నిండిపోయింది. మనకింకా స్వాతంత్య్రం రాలేదు. ఇదేనా స్వాతంత్య్రం? ఎవరి కోసమీ స్వాతంత్య్రం? అంటూ ఆరేడు వేల మెసేజ్‌లు వచ్చాయి. ఆశ్చర్యకరంగా ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వ్యతిరేక శుభాకాంక్షలతో ఫేస్‌బుక్ నిండిపోతుందనే జ్యోతిష్యాల పోస్ట్‌లే కొన్ని వేల రేట్లు ఎక్కువగా కనిపించాయి. అపర మేధావులు పెట్టిన ఈ పోస్టులు చూసి చాలామంది స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం సిగ్గు పడాల్సిన విషయంగా భావించి భయపడి దూరంగా ఉండిపోయారు. ’’
‘‘ఉగ్రవాదికి అనుకూలంగా పోస్టులు పెట్టిన వారు కూడా భయపడనంతగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షల పోస్టులు పెట్టడానికి భయపడే రోజులు వస్తాయని కలలో కూడా అనుకోలేదు.’’
‘‘నిన్న ఓ షార్ట్ ఫిల్మ్ చూశా. దేశభక్తి అవసరం అని ఫేస్‌బుక్‌లో ఒకరు పోస్టు పెట్టి మిత్రులందరికీ చూపిస్తాడు. ఆఫీసులో తోటి ఉద్యోగికి ఆపద వస్తే ఉద్యోగులు తలా ఇంత ఆర్థిక సహాయం చేస్తారు. ఫేస్‌బుక్‌లో దేశభక్తి పోస్టు పెట్టిన వ్యక్తి మినహా. దేశభక్తి ఉన్నవారికి మానవత్వం ఉండదు అని ఆ షార్ట్ ఫిల్మ్ ద్వారా జాతికి సందేశం ఇచ్చారు.’’
‘‘వావ్.. ఏం ఐడియా..! కొద్దిగా మార్పులు చేస్తే ఈ షార్ట్ ఫిల్మ్‌కు అంతర్జాతీయ అవార్డు ఖాయం. ఈ షార్ట్ ఫిల్మ్‌ను తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో తీసి కష్టాల్లో ఉన్న సహ ఉద్యోగికి అస్సలు సహాయం చేయని వ్యక్తి దేశభక్తి పోస్టులు చేసిన వ్యక్తి అయితే, అందరి కన్నా ఎక్కువ ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి ఏవరా? అని విచారిస్తే, అంతర్జాతీయ టెర్రరిస్టు అని తేలుతుంది. ఈ ముగింపుతో షార్ట్ ఫిల్మ్ తీస్తే అదిరిపోతుంది. వచ్చే ఏడాదికి మనం ఈ మార్పులతో కొత్తగా షార్ట్ ఫిల్మ్ తీసేద్దాం. ’’
‘‘ప్రపంచంలో వ్యాపారానికి అనుకూలంగా ఉండే దేశాల జాబితాను వరల్డ్ బ్యాంకు తయారు చేస్తుంది కదా? అలానే తమ దేశాన్ని తాము ద్వేషించే వారు ప్రపంచంలో ఎక్కువగా ఉండే దేశం ఏది అన్నది సర్వేను ఎవరైనా చేశారా?’’
‘‘్భలే ఉంది. ప్రపంచంలో సంపన్న దేశం, నివసించడానికి అనువుగా ఉండే దేశం, అత్యంత సంతోషంగా ఉండే దేశం అనే సర్వేలు జరుగుతాయి కానీ ఓ దేశాన్ని, ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను ఎక్కువగా వ్యతిరేకించే వారు అత్యధికంగా ఉండే దేశం ఏది? అనే సర్వేలేమీ జరగలేదు అనుకుంటా!’’
‘‘నిజంగా జరిగి ఉంటే మనం ఊహించని ఫలితాలు వస్తాయేమో.. అమెరికా ప్రపంచంలోకెల్లా సంపన్న దేశం అనుకుంటాం కదా? కానీ ప్ర పంచ సంపన్న దేశాల్లో అమెరికాది మొదటి స్థానం కాదు కనీసం పదో స్థానం కూడా కాదు. అమెరికాది 12వ స్థానం అయితే. ఖతార్ అనే చిన్న దేశం ప్రపంచంలోకెల్లా సంపన్న దేశం కావడం విచిత్రం కదా? రక్షణ విషయంలోనే కాదు అనేక విషయాల్లో ఖతార్ ఇతర దేశాలపై ఆధారపడ్డా సంపన్నత విషయంలో మాత్రం మొదటి స్థానంలో నిలవడం విచిత్రం’’
‘‘నిజమా? ప్రపంచానికి ఆయుధాలు అమ్ముతున్న అమెరికా ప్రప్రంచంలోకెల్లా సంపన్న దేశం అనుకున్నా. ’’
‘‘చాలా మంది యువత కలల ప్రపంచమైన అమెరికా కన్నా సంపన్న దేశాలు 11 ఉండడం విచిత్రమే. ఐతే ఆ 11 దేశాలు కూడా అమెరికా కనుసన్నల్లో బతుకుతూ ఉండొచ్చు.. అది వేరే విషయం.’’
‘‘పోనీలే సంపన్న దేశం కాకపోయినా మన జాతీయ పతాకం, మన జాతీయ గీతం ప్రపంచంలో నంబర్ వన్ అని యునెస్కో తేల్చింది కదా? ఇంకేం కావాలి?’’
‘‘సరిగ్గా గుర్తు చేశావు. బోగస్ వార్తల్ని ప్రచారంలో చేయడంలో సర్వే జరిగితే మనమే మొదటి స్థానంలో నిలుస్తామోమో! జాతీయ గీతం, జాతీయ జెండా సర్వేల గురించి ఐదారేళ్ల నుంచి ఈ బోగస్ ప్రచారం మొదలుపెట్టింది ఎవరో తెలియదు. కానీ చివరకు యునెస్కో సైతం బాబోయ్ మమ్ముల్ని వదిలేయండి. మేం అలాంటి సర్వేలేమీ నిర్వహించం అని ప్రకటించింది. ’’
‘‘ మేమేం సర్వేలు నిర్వహించం అని నిజంగానే యునెస్కో ప్రకటించిందా? లేక ఇది కూడా నకిలీ ప్రచార గ్రూప్‌కు పోటీగా పుట్టిన బోగస్ ప్రచారం అయితే కాదు కదా?’’
‘‘ఏమో ఆ దిశగా ఆలోచించలేదు’’
‘‘పోనీ మన దేశం ఎందులో నంబర్ వన్‌గా నిలిచిందో చెప్పు. ‘సున్న’ను కనిపెట్టింది మన వాళ్లే కాబట్టి. ఈ లెక్కల్లో మన స్థానం అదే అంటావా?’’
‘‘నేనేమీ అనను. ఎందులో నంబర్ వన్నో కూడా నాకు తెలియదు. ’’
‘‘ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఓ ఆలోచన చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డలు కొందరిని తల్లితండ్రులకు దూరంగా ఒక చోట పెరిగేట్టు చేస్తే, వారు పెద్దవారయ్యాక ఎలా చూద్దామనుకున్నారు? ఆ ఆలోచన వర్కౌట్ కాలేదు కానీ అలా జరిగి ఉంటే కులాలు, మతాలు లేకుండా విశాల దృక్ఫథంతో మేధావులుగా మారి ఉండేవారేమో కాదా?’’
‘‘మేధావులుగా మారేవారో కొత్త హిప్పీల తెగలా ఉండేవారో..?’’
‘‘స్వాతంత్య్ర దినోత్సవాన్ని తమ దేశ పండుగలను, సంస్కృతిని, సంప్రదాయాలను, మాతృభాషలను అవహేళన చేసేవారు ఏ దేశంలో ఎక్కువ ఉన్నారో సర్వే జరిపితే ఫలితం ఎలా ఉంటుందంటావు?’’
‘‘దేశం దాటి వెళ్లని నాకు ఇతర దేశాల సంగతి తెలియదు కానీ. యునెస్కో వాళ్లు జోక్యం చేసుకుని దేశద్రోహులు ఎక్కువ ఉండే దేశం ఏదో సర్వే జరిపితే బాగుండేది’’
‘‘యునెస్కో ఆ పని చేస్తుందో లేదో కానీ. అన్ని దేశాల్లోని దేశ ద్రోహలందరినీ దేశ బహిష్కరణ చేస్తే, అలాంటి వారితో ఏర్పడే కొత్త దేశానికి పేరు పెట్టడం ఈజీ’’
‘‘ఏం పేరు..?’’
‘‘దేశద్రోహుల దేశం..!’’

-బుద్దామురళి (జనాంతికం 17-8-2018)

10, ఆగస్టు 2018, శుక్రవారం

లాడెన్ వియ్యంకుడు.. హిట్లర్ తోడల్లుడు!

‘‘పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల చరిత్ర చూడాలని పాత కాలంలో అనుకునేవారు కదా?’’
‘‘ఔను.. అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో పెళ్లి సంబంధాల సైట్లు చూడడమే కానీ ఏడు తరాల చరిత్ర చూసేవారెవరు? అలా అంటే- ఇంకా ఇదేం చాదస్తం అంటారు’’
‘‘ఈ కాలంలో కూడా ఇలా కుటుంబ చరిత్రను చూసేవాళ్లున్నారు.’’
‘ మొన్న జరిగిన మీ బాబాయ్ కొడుకు పెళ్లి గురించేనా?’’
‘‘మా బంధువులు కాదు. మన దేశం కూడా కాదు. మొన్న లాడెన్ కొడుకు పెళ్లి జరిగింది. అమ్మాయి ఎవరని అడగవేం?’’
‘‘అడకగ పోయినా చెబుతావు కదా? నువ్వే చెప్పు?’’
‘‘అదే మరి.. అల్లాటప్పా కోన్ కిస్కా అమ్మాయిని ఎలా చేసుకుంటాడు? తన కుటుంబం స్థాయికి తగ్గ సంబంధం వెతికి మరీ చేసుకున్నాడు. అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఉగ్రవాదులు విమానంతో దాడి చేసిన విషయం గుర్తుందా?’’
‘‘ఎందుకు గుర్తు లేదు. పాపిష్టి ఉగ్రవాదులు అమానుషంగా దాడి చేసి 17వందల మంది ప్రాణాలను హరించారు. ప్రపంచం వారిని ఎలా మరిచిపోతుంది? ఏ పాపం ఎరుగని ఆ 17వందల మంది కుటుంబాలు ఇంకా ఆ ఆవేదన నుంచి బయటపడి ఉండవు. ఈ దాడి తరువాత అమెరికాలో ప్రజల ఆలోచనా ధోరణి మారిపోయిందట! ’’
‘‘గుర్తింది కదా? ఆ దాడికి నాయకత్వం వహించింది హైజాకర్ల నాయకుడు మహమ్మద్ అట్టా. ఆయన కుమార్తెనే లాడెన్ కుమారుడు పెళ్లి చేసుకున్నాడు.’’
‘‘మనలాంటి కుటుంబరావుల పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటేనే తగిన సంబంధం వెతకడానికి ఎంత కష్టపడతాం? ఆ రోజుల్లో అంటే పెళ్లిళ్ల పేరయ్యల వద్ద పెళ్లి సంబందాలు రెడీగా ఉండేవి. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే పెళ్లి సంబంధాల సైట్లు వచ్చాయి. అబ్బాయి మహేశ్ బాబులా, అమ్మాయి కత్రినా కైఫ్‌లా ఉండాలని కోరుకుంటారు. ఆన్‌లైన్‌లో సమాచారం కూడా అలానే ఉంటుంది. మహేశ్ బాబులా ఉంటాడని ఫోటో చూపించి, బ్రహ్మానందంలా బట్టతల ఉన్న అబ్బాయిని అంటగట్టారని అమ్మాయి వాళ్లు, కత్రినా కైఫ్ అని చెప్పి కంత్రీ పిల్లను అంటగట్టారని అబ్బాయి వాళ్లు వీధిన పడ్డ కేసులు ఎన్ని చూడడం లేదు? గంతకు తగ్గ బొంత అన్నట్టు మనలాంటి వాళ్లకే ఇన్ని సమస్యలుంటే నరరూప రాక్షసులు తమ పిల్లలకు సంబంధాలు కుదుర్చుకోవడం అంటే సామాన్యమా? వేలాది మందిని హతమార్చిన లాడెన్‌ను అమెరికా బృందం మట్టుపెట్టాక తండ్రి లేని ఆ బిడ్డకు పెళ్లెలా అవుతుందో, తగిన సం బంధం దొరుకుతుందా? అని ఆయన అభిమానులెంత ఆందోళన చెందారో..’’
‘‘ఇక్కడ సమస్య పెళ్లి గురించి కాదు. లాడెన్ కొడుకు అంటే మామూలు కాదు.. వారి కుటుంబం స్థాయికి తగిన సంబంధం దొరకాలి. ఐటీ కంపెనీలో పనిచేసే కుర్రాడికి అదే కంపెనీలోనో, మరో కంపెనీలోనో పనిచేసే ఐటీ అమ్మాయి దొరకడం పెద్ద కష్టం కాదు. ప్రపంచాన్ని గడగడలాడించిన వారి పిల్లలకు సంబంధాలు ఈజీనా..? ’’
‘‘మీరేదో వెటకారంగా మా ట్లాడుతున్నట్టుంది. వాళ్ల తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలకేం సంబంధం?’’
‘‘కాళ్లు కడిగినప్పుడే కాపురం చేసే తీరు తెలుస్తుందని పెద్దలంటారు. లాడెన్ కుమారుడికి సంబంధాలు వెతికినప్పుడు, ట్విన్ టవర్స్ కూల్చేసిన వాడి కుమార్తెకు సంబంధం వెతికినప్పుడు వీరి కాపురం తీరు తెలుస్తోంది. మీరన్నట్టు వీరి కడుపున శాంతికపోతాలు పుడితే వద్దనడానికి నేనెవరిని? మహా అయితే మరో పిల్ల లాడెన్ పుట్టవద్దని కోరుకుంటా అంతే. ’’
‘‘తమ సిద్థాంతాల కోసం ప్రపంచాన్ని గడగడలాడించే పనిలో బిజీగా ఉండే లాడెన్ లాంటి ఉగ్రవాదులు, ప్రపంచాన్ని జయించాలని చూసే హిట్లర్ లాంటి గొప్పవాళ్లు తమ పిల్లలకు సంబంధాలపై అస్సలు దృష్టిపెట్టరు. ఆ మధ్య ముంబయి డాన్ దావుద్ ఇబ్రహీం పిల్లల పెళ్లి గురించి చదివాను. దావుద్ షడ్డకుడని, చోటా షకీల్ వియ్యంకుడు ఇతనే అని చెప్పుకోవడం ఎంత గొప్పగా ఉంటుంది! అమెరికా అధ్యక్షుడిని అని చెప్పుకున్నంత గొప్పగా ‘హిట్లర్ తోడల్లుడు, దావుడ్ వియ్యంకుడు’ అని అని చెప్పుకోవాలంటే పెట్టి పుట్టాలి.
హాజీ మస్తాన్, అబు సలేం, చోటా రాజన్, వరదరాజు ముదిలియార్ వంటి డాన్‌లు ముంబయి చీకటి సామ్రాజాన్ని ఈజీగానే ఏలేశారు కానీ తమ పిల్లలకు తమ కుటుంబ స్థాయి సంబంధాల కోసం ఎంత కష్టపడ్డారో పాపం! వీరికోసం ‘డాన్ ఫ్యామిలీ పెళ్లి సంబంధాల వెబ్‌సైట్’ ప్రారంభించే ఆలోచన ఇంకా ఎవరికీ రానట్టుంది. ట్రై చేస్తావా? అలానే వందల కోట్ల డబ్బుతో ఏసీబీ దాడుల్లో పట్టుపడిన వారికి కూడా ఓ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ఉండాల్సిందే. ఏసీబీ దాడుల తరువాత చాలా మంది పలుకుబడి సమాజాంలో ఆమాంతం పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం.
పైకి ఎవరెన్ని నీతులు చెప్పినా నిజాయితీ పరుడంటే ఎవరైనా ఇంతే కదా? వీడి దగ్గరేముంటుంది బూడిద? అని దూరంగా ఉంటారు. అదే ఏసీబీ దాడిలో పట్టుపడ్డాడంటే సంపన్నుడు అని అంతా గుర్తించినట్టే. ఏసీబీ దాడుల్లో దొరికితే వంద కోట్ల ఉద్యోగుల క్లబ్, రెండువందల కోట్ల క్లబ్, అలానే మర్డర్ చేసిన వారికి, దోపిడీలు చేసిన వారికి విడివిడిగా క్లబ్‌లు ఉంటే వీరి మధ్య పెళ్లి సంబంధాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు’’
‘‘అది సరే.. లాడెన్ కుమారుడికి కట్నం కింద ఏమిచ్చి ఉంటారు?’’
‘‘అదేదో సినిమాలో అడుక్కునే వాడు తన కూతురు పెళ్లికి రెండు మూడు వీధులు రాసిస్తాడు. ఆ వీధుల్లో అడుక్కోమని. అలానే బాంబులేయడానికి ఏదో ఓ ఖండాన్ని లాడెన్ కుమారుడికి మహమ్మద్ అట్టా కుటుంబం వారు కట్నంగా ఇచ్చే ఉంటారు.’’
‘‘లాడెన్ కుమారుడికి ట్విన్‌టవర్ కూల్చిన హైజాకర్ల కుటుంబంతో సంబంధం కుదిరిందని నీకు కుళ్లు’’
‘‘ఈ రోజుల్లో ఉద్యోగం , సొంతిళ్లు ఉన్నా అబ్బాయిలకు సంబంధాలు కుదరడం లేదు. ‘పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య’ రోజు రోజుకూ అన్ని సామాజిక వర్గాల్లోనూ పెరిగిపోతుంది. ఎంతైనా లాడెన్ అదృష్టవంతుడు తనకు తగిన వియ్యంకుడు దొరికాడు.’’

-బుద్దా మురళి (జనాంతికం 10-8-2018)

3, ఆగస్టు 2018, శుక్రవారం

లంచమిస్తే శిక్ష!

తంతే బూరెల బుట్టలో పడడం అంటే ఇదేనేమో?’’
‘‘నిన్ను ఎవరు తన్నారు? ఎక్కడ పడ్డావు?’’
‘‘నా సంగతి కాదు. ఇకపై లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేరమేనట! లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఏడేళ్లపాటు జైలు శిక్షనట! లంచగొండులకు పండగే పండుగ.. ఇక నిర్భయంగా లంచాలు తీసుకోవచ్చు. ఎవరైనా ప్రశ్నిస్తే, లంచం ఇవ్వడానికి వచ్చాడని ఎదురు ఫిర్యాదు చేయవచ్చు.’’
‘‘చిన్నప్పుడు చదివిన కథ ఒకటి గుర్తుకొచ్చింది. లంచాలకు అలవాటు పడ్డ రాజోద్యోగి ఒకరి గురించి రాజుగారికి తెలిసి, చాలా వార్నింగ్‌లు ఇచ్చాడట! ఐనా ఎలాంటి మార్పు లేదు. ప్రాధాన్యత లేని, ప్రజలతో సంబంధం లేని పని అప్పగిస్తే చచ్చినట్టు మారతాడనుకున్న రాజు అతనికి సముద్రం ఒడ్డున పని అప్పగించాడు. అలలు లెక్కపెట్టి సముద్రంలో రోజుకు ఎన్ని అలలు వస్తున్నాయో చెప్పాలి. కొంత కాలానికి రాజుగారికి ఆ ఉద్యోగి ఎలా మారాడో, ఎలా ఉన్నాడో చూడాలనిపించి మారువేషంలో వెళ్లి చూశాడు. రాజోద్యోగి గతంలో కొలువులో ఉన్నప్పటి కన్నా ఇప్పుడు మరీ ఎక్కువ ఉత్సాహంగా కనిపించాడు. సముద్రంలో అలలు లెక్కించడంలో పై ఆదాయం ఏ విధంగా సాధ్యం అని రాజుగారు అడిగితే- అతను చెప్పిన సమాధానం కళ్లు తెరిపించింది. సముద్రం అన్నాక సరకులతో కూడిన భారీ పడవలు రావడం సహజమే. అవి వచ్చినప్పుడు రాజోద్యోగి వారిని అడ్డగించి సముద్రంలో అలలు లెక్కించే కీలకమైన బాధ్యతలను రాజు నాకు అప్పగించారు. మీ పడవలు ఆగడం వల్ల అలలు లెక్కించే పనికి ఆటంకం అవుతోందని అడ్డగిస్తుండగా, రాజోద్యోగితో మనకెందుకు గొడవ అని అడిగినంత ఇచ్చి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇక్కడే ఆదాయం ఎక్కువగా ఉందని రాజోద్యోగి సంతోషంగా చెప్పుకొచ్చాడు’’
‘‘ఈ కథకు, దీనికి సంబంధం ఏముంది?’’
‘‘అధికారంలోకి వచ్చిన ప్రతి రాజు కూడా తనదైన శైలిలో అవినీతిని నిర్మూలించాలనుకుంటాడు. కానీ అది మనుషుల జీవితంలో భాగంగా మారిపోయింది. ‘ఆత్మను నాశనం చేయలేరు’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అవినీతి అనేది మన వ్యవస్థ ఆత్మ. ఈ ఆత్మను అంగీకరించాల్సిందే తప్ప నిర్మూలించలేం అంటున్నాను. అలలు లెక్కించే పని అప్పగిస్తే, అవినీతి పరుడు మారిపోతాడని ఆ రాజు భావిస్తే, లంచం ఇచ్చేవారిని సైతం శిక్షిస్తే లంచాలు కనిపించకుండా పోతాయని ఈ రాజు భావిస్తున్నారు.. అందుకే ఈ కథ చెప్పాను’’
‘‘మరీ అంత నిరాశావాదం అయితే ఎలా? అమెరికా లాంటి దేశాల్లో అవినీతి అస్సలు ఉండదు తెలుసా? ’’
‘‘బల్లకింద చేతులు పెట్టడం అనే పదానికి ఆ దేశం వారికి అస్సలు అర్థం తెలియదు. కన్సల్టెన్సీ ఫీజు అని వాళ్లు దానికి ముచ్చటగా పేరు పెట్టుకుని చట్టబద్ధం చేశారు.’’
‘‘మన దేశంలో కూడా ప్రతి పనికి లంచం ఎంతో నిర్ణయించి దానికి ఇలానే ఓ ముద్దు పేరు పెట్టుకుంటే లంచం సమస్య తీరిపోతుంది కదా? ’’
‘‘పోదు.. ఆ మధ్య ఒకరు జీతాలు పెంచితే లంచాలు ఉండవన్నారు. జీతాలు బాగా నే పెరిగాయి. మరి లంచాలు మాయం అయ్యాయా? కావు. కన్సల్టెన్సీ ఫీజు అని నిర్ణయించినా.. కన్సల్టెన్సీ ఫీజు చెల్లించావు మరి నా వాటా అనే మాట వినిపించి తీరుతుంది. నీకు పెళ్లయిందా?’’
‘‘నా పెళ్లికి, లంచాలకు సంబంధం ఏంటోయ్’’
‘‘నిజాయితీగా చెప్పు .. నీకు పెళ్లయినా పక్క చూపులు చూస్తావా? లేదా?’’
‘‘నేను మగాణ్ణి’’
‘‘కదా! పక్క చూపులు చూడడం మగాడి జన్మహక్కు అని నువ్వు భావించినట్టే. బల్లకింద సంపాదన మా జన్మహక్కు అని కొందరి గట్టి నమ్మకం. ’’
‘‘ సరదాగా అన్నా... పక్కచూపులు చూస్తే మా ఆవిడ ఊరుకుంటుందా?’’
‘‘మీ ఆవిడ లేనప్పుడు నువ్వు పక్కచూపులు చూసినట్టే ఎవరూ చూడనప్పుడు వాళ్లు బల్లకింద చేయి పెడతారులే’’
‘‘లంచం ఇచ్చే వాడుంటేనే కదా? తీసుకునే వాళ్లుంటారు.. అందుకే లంచం ఇచ్చేవాళ్లను కూడా శిక్షించడం ద్వారా లంచాల సంస్కృతికి చరమగీతం పాడాలని ప్రయత్నం’’
‘‘ఇంకా నయం బల్లలు ఉన్నాయి కాబట్టి బల్లకింద చేతులు పెడుతున్నారని, ప్రభుత్వ కార్యాలయాల్లో అసలు బల్లలు లేకుండా చేసేయలేదు’’
‘‘ఇదేదో బాగుందోయ్ ఐడియా. అసలు బల్లలు లేకుండే చేస్తే ఇక బల్లకింద చేతులు ఎలా పెడతారు?’’
‘‘చేతులు లేకుండా చేసేస్తే చేతులు తడపడం ఉండదు ఏమంటావు?’’
‘‘ఈ ఐడియా బాగానే ఉంది.. పాలకులకు చెప్పాలి. అదేదో దేశంలో తప్పు చేస్తే.. తప్పు చేయడానికి కారణం చేతులే కదా? అని చేతులు నరికేస్తారట! బల్లకింద చేతులు పెట్టేందుకు వీలు లేకుండా అసలు చేతులే లేకుండా చేశాకే ఉద్యోగ బాధ్యతలు అప్పగించాలి’’
‘‘చూడోయ్.. మనుషులందరికీ ఏదో ఒక సమస్య ఉంది. మనుషులందరికీ మనుషులతోనే సమస్య. సమస్యలు లేకుండా చేయాలంటే అసలు మనుషులే లేకుండా చేస్తే ఎలా ఉంటుందంటావు’’
‘‘తల నరికేసి.. చుండ్రు సమస్య పరిష్కరించానని మురిసినట్టుంది.’’
‘‘ఏం చేసినా విమర్శించడమేనా?’’
‘‘సమస్య పరిష్కరించడం కన్నా ఏదో చేసినట్టు నటించడం చాలా?’’
‘‘పోనీ- నువ్వు చెప్పు.. అవినీతి లేకుండా చేయాలంటే ఏం చేయాలో.. సిటిజన్ చార్టర్ అని ప్రతి కార్యాలయంలో ఏ పని ఎన్ని రోజుల్లో అవుతుందో రాస్తారు కదా? అలానే ఏ పనికి ఎంత ముట్ట చెప్పాలో రాస్తే బాగుంటుందా?’’
‘‘అది కాకుండా- నాకెంతిస్తావ్? అని అడుగుతారు అప్పుడు’’
‘‘రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వం రూపాయి ఖర్చు పెడితే లబ్దిదారులకు పది పైసలు చేరేవనేవారు..’’
‘‘ఔను.. అప్పటి నుంచి ఈ పది పైసల విలువ పెంచాలని ప్రయత్నాలు ప్రారంభిస్తే, రూపాయి విలువే తగ్గింది కానీ పది పైసల విలువ పెరగనేలేదు. ’’
‘‘నీతో మాట్లాడుతుంటే నాకో బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. కరెన్సీ ఉండడం వల్లనే కదా? ఈ అవినీతి సమస్య. అసలు కరెన్సీ మొత్తాన్ని రద్దు చేసి, బార్టర్ సిస్టం ప్రవేశపెడితే...’’
‘‘గట్టిగా అనకు విన్నారంటే మన్‌కీ బాత్ అంటూ అవినీతి నిర్మూలనకు కరెన్సీని రద్దు చేసినా చేస్తారు. అసలే ఎన్నికలు సమీపిస్తున్నాయి కనుక ఏదో అద్భుతం చేసి చూపించాలి’’
*బుద్దా మురళి (జనాంతికం 3-8-2018)

28, జులై 2018, శనివారం

దేవుడిది ఏ మతం?

ఏదో ఒక రోజు మనం దేవుడిని చూడబోతున్నాం!’’
‘‘దేవుడ్ని చూసే సంగతి ఎలా ఉన్నా- రాక్షసులను మాత్రం రోజూ చూస్తూనే ఉన్నాం ’’
‘‘ఇవి ఉత్తమాటలు కాదు, సైన్స్ పరంగా దేవుడి ఉనికిని చూపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 11 ఏళ్ల బుడతడు విలియం మిల్లిస్ దేవుడున్నాడని సైన్స్ ద్వారా రుజువు చేస్తానని చాలెంజ్ చేశాడు.’’
‘‘ఇది సాధ్యం అవుతుందా? ’’
‘‘అసాధ్యం అనే మాట నుంచే అన్ని ఆవిష్కరణలు సాధ్యమయ్యాయి. ఫోన్ ద్వారా ఖండాంతరాల్లో ఉన్నవారితో మాట్లాడుకోవచ్చునని ఊహించామా? సెల్‌ఫోన్ మన జీవితంలో ఓ భాగమని అనుకున్నామా? గాలిలో విమానాలు ఎగురుతాయని మొదట అన్నప్పుడు ఎన్నో సందేహాలు వచ్చాయి కదా?’’
‘‘నా అనుమానం అది కాదోయ్. దేవుడు ఉన్నాడా?లేడా? అనేది తరువాత, అసలు దేవుడు ఎలా ఉంటాడని అనుకుంటున్నావ్.. ఆ సంగతి చెప్పు ?’’
‘‘తాతయ్యా.. నేను చెప్పాలా? మొన్న టీవీలో మాయాబజార్ సినిమా చూశా.. దేవుడు అచ్చం ఎన్టీఆర్‌లా ఉంటాడని అమ్మమ్మ చెప్పింది’’
‘‘ పెద్దవాళ్లిద్దరం మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటిరా? ?’’
‘‘పిల్లవాడైనా మంచి మాట చెప్పాడురా! తెలుగు వారిని దేవుడు ఎలా ఉంటాడని అడిగితే ‘ఎన్టీఆర్‌లా..’ అంటారు. అదే తమిళులను అడిగితే ఎంజిఆర్‌లా ఉంటాడంటారు. కన్నడిగులు రాజ్‌కుమారే దేవుడు అంటారు. ఇప్పుడు చెప్పు.. దేవుడు ఎలా ఉంటాడు. ఎన్టీఆర్‌లానా? రాజ్‌కుమార్‌లానా? ’’
‘‘ఇప్పటి తెలుగు కుర్రకారును అడిగితే పవన్ కల్యాణే మా దేవుడని అంటారు. తమిళులు మాత్రం రజనీకాంత్ రూపంలో ఉంటాడంటారు’’
‘‘ఏమో.. ఆ కాలంలో దేవుడు ఎన్టీఆర్‌లా ఉంటే ఇప్పుడు రజనీకాంత్‌లా మారాడేమో! ఫ్యాషన్లు మారినప్పుడు దేవుడి రూపం మారే ఉంటుంది.’’
‘‘సీరియస్‌గా దేవుడి గురించి చర్చిస్తుంటే నువ్వేంటి.. సినిమా దేవుళ్ల గురించి మాట్లాడుతున్నావు’’
‘‘నువ్వు చెప్పు దేవుడు ఎలా ఉంటాడో. దేవుడు నిజంగా బంగారు కిరీటాలు, ఆభరణాలు ధరించి ధగధగా మెరిసిపోతాడా? అంటే దేవుడు లోహయుగం నాటివాడా? లేక లోహయుగం దాకా మనుషులకు కనిపించి ఆ తరువాత కనిపించడం మానేశాడా?’’
‘‘చర్చ ఎక్కడికో వెళుతుందోయ్.. ఆయనెవరో ఇండియాకు దారి కనిపెట్టడానికి వెళ్లి అమెరికాను కనిపెట్టినట్టు.. ఆ అమెరికా ఇప్పుడు భూతల స్వర్గంగా మారినట్టు- ఈ కుర్రాడు దేవుడ్ని కనిపెడతాడేమో! ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?’’
‘‘దేవుడి ఉనికి దొరికితే రాక్షసులు కూడా దొరికి తీరుతారు. ’’
‘‘కొందరు దేవుడిని నమ్మడం లేదు, రాక్షసుల ఉనికిని నమ్ముతున్నారు.’’
‘‘రాక్షసుల ఉనికి కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదోయ్.. అడుగడుగునా రాక్షసులు కనిపిస్తూనే ఉండగా ఇంకా వారి జాడ కోసం కష్టపడడం ఎందుకు?’’
‘‘నీకు రాక్షసులు కనిపించారా? ఎక్కడ?’’
‘‘హాస్టల్ బాలికలను ఏళ్లతరబడి అత్యాచారం చేయడం మానవ మాత్రుల వల్ల సాధ్యమా? రాక్షస అంశ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఉగ్రవాదం పేరుతో వందల మందిని పొట్టన పెట్టుకోవాలంటే మానవమాత్రుల వల్ల సాధ్యం కాదు, రాక్షస లక్షణాలుంటే తప్ప. పసిపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయనే వార్తలు చూస్తుంటే రాక్షసుల ఉనికి వాస్తవమే కదా? దీనికి ఇంకా ఆనే్వషణ ఎందుకు? ’’
‘‘ఓహో.. అలా వచ్చావా? రాక్షసులున్నారని అంగీకరిస్తే దేవుళ్లను కూడా అంగీకరించాలి. కొందరు మేధావులు మాత్రం దేవుడు అబద్ధం, రాక్షసులు నిజం అంటున్నారు. ఎందుకంటావు?’’
‘‘ముందు దేవుడు అంటే ఏమిటో నిర్వచనం ఖరారు చేసుకున్నాక- దేవుడి కోసం అనే్వషిస్తే బాగుంటుందని నాకనిపిస్తోంది. ’’
‘‘దేవుడనే వాడున్నాడా? అని మనిషికి కలిగెను సందేహం.. మనుషులనే వారున్నారా? అని దేవుడికి కలిగెను సందేహం.. అని చాలాకాలం క్రితమే ఓ సినిమా కవి తన సందేహాన్ని బయటపెట్టాడు. ’’
‘‘మనిషి పుట్టినప్పటి నుంచే దేవుడిపై ఈ సందేహాలు ఉన్నాయంటారు ’’
‘‘మనిషి తాను పుట్టిన తరువాత- దేవుడ్ని పుట్టించాడని కొందరంటారు.. ఇంతకూ మనిషి ముందా? దేవుడు ముందా? ’’
‘‘ఒకవేళ అమెరికా బుడతడి పరిశోధన విజయవంతమై దేవుడి ఉనికి కనిపెట్టారనుకో.. ఆ దేవుడు ఏ మతం దేవుడంటావు?’’
‘‘నిజమే- ఈ డౌట్ రాలేదు.. అమెరికా బుడతడు కనిపెట్టిన దేవుడు ఏదో ఒక మతానికి చెందిన దేవుడవుతాడు కదా? అప్పుడు ప్రపంచంలోని మిగతా మతాలు ఊరుకుంటాయా? ’’
‘‘చంద్రమండలంపైకి ఒక దేశం వెళ్లగానే పోటీగా ఇతర దేశాలు వెళ్లాయి కదా? ఇప్పుడు అలానే- తమ మతాల దేవుళ్ల ఉనికిని కనిపెట్టేందుకు అన్ని మతాలూ రంగంలోకి దిగుతాయేమో?’’
‘‘దేవుడి ఉనికి తెలిసి, అతను ఏ మతానికీ చెందనివాడని తేలితే ఏమవుతుందంటావు?’’
‘‘మా మతంలో చేరిపో అని దేవుడిపై అన్ని మతాల వాళ్లు ఒత్తిడి తెస్తారేమో! తమకే చెందాలని దేవుడ్ని కిడ్నాప్ చేసినా చేస్తారు..’’
‘‘ఔను.. మనిషి కనిపిస్తే చాలు మతం మారమని ఒత్తిడి తెస్తున్నారు. ఇక దేవుడు కనిపిస్తే మతం మారమని ఒత్తిడి తేకుండా ఉంటారా?’’
‘‘నీకున్న పరిజ్ఞానం ప్రకారం దేవుడు ఏ మతంలో చేరే అవకాశం ఉంది? ’’
‘‘నాకంత పరిజ్ఞానం లేదు. కానీ నీ సందేహాలు విన్నాక దేవుడి ఉనికిని కనిపెడితే ప్రపంచమే కాదు దేవుడు కూడా ప్రమాదంలో పడతాడేమో? ఏ మతంలో చేరలేక, ఎవరినీ కాదనలేక దేవుడు ప్రాణత్యాగం చేస్తాడేమో? అంటే మళ్లీ అదృశ్యం అవుతాడన్నమాట’’
‘‘కనిపించి మాయం కావడం కన్నా, అసలు కనిపించక పోవడమే మంచిది కదా?’’
‘‘ఏమో ఇవన్నీ ఊహించే దేవుడు ఎవరికీ కనిపించడం లేదేమో’’
‘‘దేవుడి ఉనికిని కనిపెట్టడం కన్నా మనుషుల్లో మానవత్వం మాయం కాకుండా చూడడడం ఈ ప్రంపచానికి తక్షణ అవసరమేమో! ’’

‘‘ నిజమే దేవుని ఉనికి కనిపెట్టడం ఎంత కష్టమో మనిషిలోని మానవత్వం ఉనికి కనిపెట్టడం కూడా భవిష్యత్తులో అంతే కష్టం అవుతుందేమో  అనిపిస్తోంది మారుతున్నకాలాన్ని చూస్తుంటే ’’
‘‘ ఆ కాలం వచ్చే నాటికి మనం ఉండం అదే మన అదృష్టం  ’’

బుద్దా మురళి (జనాంతికం 27-7-2018)

16, జులై 2018, సోమవారం

బాలజ్ఞానులు!

‘‘బయట కూర్చున్నావ్.. మీ ఇంట్లో చక్కని టీ తాగుదామని వస్తే’’
‘‘మా ఇంట్లో ఈ రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ’’
‘‘అదేం లేదన్నయ్య గారూ.. అయన బడాయి మాటలు.కరెంట్ బిల్లు కట్టమని వారం క్రితం డబ్బులిచ్చాను. చుట్టలు కాల్చాడో, బీడీలు కాల్చాడో తెలియదు కానీ జేబులో డబ్బుల్లేవట.. బిల్లు విషయమే మరిచిపోయాడట! కరెంట్ కట్ చేశారు’’
‘‘ఇదిగో నీకు లక్షసార్లు చెప్పా.. వాటిని చుట్టలు అనరు సిగార్స్ అంటారు’’
‘‘రెండూ ఒకటే కదోయ్’’
‘‘క్లాస్‌లో కుర్రాడు గోల చేస్తే టీచర్‌గా మీరేం చేస్తారన్నయ్యగారూ? వాడి గోల వల్ల మిగిలిన పిల్లల చదువుకు ఇబ్బంది అవుతుందని క్లాస్ బయటకు పంపిస్తారు కదా? అలా చేస్తే ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంటాడు ఈయన. 24గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా నిర్ణయం కూడా ప్రజాస్వామ్యానికి చీకటి రోజేనట! చెప్పుకుంటే సిగ్గు చేటు. మొన్న కాకరకాయ పులుసులో ఉప్పు ఎక్కువైందని.. ప్రజాస్వామానికి ముప్పు అంటూ అలిగి తిండి మీది నుంచి లేచిపోయాడు. పోతే పో.. అని చానల్ మార్చి పక్కింటి మొగుడు సీరియల్ 213వ భాగం సీరియస్‌గా చూస్తూ ఉండిపోయా! ఆకలికి తట్టుకోలేక తానే వచ్చి ప్రజాస్వామ్యంలో వాకౌట్లు, సంప్రదింపులు సర్వసాధారణం అంటూ తానే తిండి పెట్టుకుని తిన్నాడు. ఈయనతో వేగడం కన్నా అడవిలోకి వెళ్లడం నయమనిపిస్తోంది’’
‘‘అడవిలో ఉన్నవాళ్లే అక్కడ ఉండి ఏం సాధించామని బయటకు రాలేక, అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. నువ్వెళ్లి ఏం చేస్తావుతల్లీ..’’
‘‘చూడోయ్.. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పవచ్చు.. అంతమాత్రాన ఇంట్లో నుంచి బయటకు పంపిస్తావా? మార్క్స్ ఏం చెప్పాడు? ఏంగెల్స్ ఏమన్నాడో తెలుసా?’’
‘‘ఏమంటాడు? ఈ నెల పాత బాకీ తీర్చకపోతే బియ్యం, పప్పులు ఇచ్చేది లేదని అందరి ముందే ముఖం మీదే అనేశాడు. కాలనీ సెక్రటరీ భార్య ఆ మాటలు విని ముసిముసి నవ్వులు నవ్వుతుంటే తల కొట్టేసినట్టు అయింది.’’
‘‘ఏంగెల్స్ అంటే పచారీ షాపు లింగయ్య గురించి చెబుతావ్..’’
‘‘నెలనెలా బియ్యం, పప్పులు ఇచ్చేది లింగయ్యే కానీ ఏంగెల్స్ కాదు. ఆ విషయం నువ్వు తెలుసుకో. ఎలాగూ పనీపాటా లేదు కదా? శ్రీ్ధర్ చిల్లాల్ అని ఒకడు పూణెలో 66 ఏళ్ల నుంచి గోళ్లు పెంచుతూ గిన్నిస్ రికార్డులోకి ఎక్కాడట! మీరో పాతిక సంవత్సరాలు అలా ముక్కులో వెంట్రుకలు పెంచుతూ కొత్త రికార్డు సృష్టించవచ్చు కదా? అలాగైనా మీతో పాటు నేనూ టీవీలో కనిపిస్తాను.’’
‘‘66 ఏళ్లపాటు అసహ్యంగా అలా గోళ్లు పెంచి వాడు సాధించింది ఏంటట? జీవితం వృథా చేసుకున్నాడు’’
‘‘ఎవరిష్టం వాళ్లది. మీ పెదనాన్న భార్యా పిల్లలను వారి మానాన వారిని వదిలేసి ముఫ్ఫై ఏళ్లపాటు అడవి బాట పట్టి చివరకు లొంగిపోవడం తప్ప ఏం సాధించాడని ఎప్పుడైనా అడిగానా? ’’
‘‘అంటే గోళ్లు పెంచిన పిచ్చోడికి, సమసమాజ సా థపనకు అడవిబాట పట్టిన మా పెదనాన్నకు పోలికా?’’
‘‘ఎవరి పని వారికి గొప్ప. అనడం కాదు.. దమ్ముంటే మీరూ అలా గోళ్లు పెంచండి చూద్దాం.’’
‘‘నీతో వాదించి వృథా.. నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ఇంట్లో కరెంట్ ఉంటే నా రూమ్‌లో నేను ఉండేవాణ్ణి’’
‘‘ఏంటీ.. దంపతులు ఎప్పటి మాదిరిగానే గొడవ పడుతున్నారు? 66 ఏళ్లపాటు గోళ్లు పెంచిన వాడిని భరించిన వాళ్ల ఆవిడకు- నాకే గనుక అధికారం ఉంటే భారతరత్న బిరుదు ఇచ్చేవాణ్ణి’’
‘‘రావోయ్ రా! మా గొడవ ఎప్పుడూ ఉండేదే? ఆ పిల్లాడెవరు?’’
‘‘మనవడు..’’
‘‘ఓలోలే.. క్యూట్‌గా ఉన్నాడు. వాటీజ్ యువర్ నేమ్?’’
‘‘ఓయ్.. ఏం మాట్లాడుతున్నావ్! మావాడు మరీ అంత చిన్నవాడేం కాదు. ఐదవ తరగతి చదువుతున్నాడు. బాలమేధావి’’
‘‘ఓహో.. గ్లోబ్‌ను చుట్టూ తిప్పుతూ కనిపించిన దేశం రాజధాని పేరు అడగ్గానే వచ్చీరాని మాటలతో వాళ్లు చెప్పడం.. తల్లిదండ్రులు మురిసిపోవడం ... ఈ బాలమేధావులను రోజూ పత్రికల్లో జోనల్ పేజీలో చూస్తూనే ఉంటాను లే.. పెద్దయ్యాక ఇంటర్‌లోనో, ఎంసెట్ ర్యాంకుల్లోనో వీళ్లు అస్సలు కనిపించరు ఎందుకంటావ్? ఎంసెట్‌కే దిక్కు లేనప్పుడు ఇక సివిల్స్ సంగతి ఎందుకులే’’
‘‘వీడు రాజధానుల బాలమేధావి కాదు. ఇప్పటికే బోలెడు ఫిల్మ్‌లు తీసి యూ ట్యూబ్‌లో పెట్టాడు. మహాత్మా గాంధీ చేసిన డజను తప్పులు అని బాగా పాపులర్ అయిన వీడియో వీడిదే’’
‘‘అబ్బో.. ఏరా..! గాంధీ పూర్తి పేరు తప్పులు లేకుండా రాయి చూద్దాం’’
‘‘ఇంకా ఏ కాలంలో ఉన్నారంకుల్ ! యూ ట్యూబ్ చానల్‌కు రాయడంతో పనేంటకుల్? గూగుల్‌లో ఫొటోలు తీసుకుని నోటికొచ్చిన చరిత్రను చెప్పడమే. జవహర్‌లాల్ నెహ్రుకు బాబర్ మేనమామ అవుతాడని, హిట్లర్ హిందువు అని, జిజియా పన్ను వెనుక నెహ్రు పిన్నమ్మ హస్తం అని వరుసగా కొన్ని వీడియోలు తీస్తున్నా అంకుల్’’
‘‘ఏరా.. ఇది వీడి సొంత తెలివేనా? లేక..’’
‘‘నీ దగ్గర రహస్యాలెందుకు? ఇంజినీరింగ్ తరువాత కూడా ఉద్యోగాలు దొరకడం లేదు. ముందు చూపుతో వీడ్ని చిన్నప్పుడే ఈ రంగంలో దించాను. నాకు చిత్ర విచిత్రమైన వాట్సాప్ మెసేజ్‌లు వస్తుంటాయి. పాకిస్తాన్ ఏర్పాటుకు రాహుల్ గాంధీ కారణం అని, మహాత్మా గాంధీ జగన్‌తో కుమ్మక్కు, జగన్ ఎత్తుగడలు ముందే తెలిసి లాలాలజపతి రాయ్ అతన్ని దూరంగా పెట్టాడని, క్వింట్ ఇండియా ఉద్యమంలో మన యువ నేతలు అంటూ చారిత్రక మెసేజ్‌లు వస్తుంటాయి. అవన్నీ వీడికి ఫార్వర్డ్ చేస్తాను. వీడు వీడియోలు తీసి యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాడు. వాడికి కాలక్షేపం, ఆదాయం ’’
‘‘ ఎన్నికలొస్తున్నాయి కదా? ఇలాంటి చిత్ర విచిత్రాలు కళ్ల ముందే కనిపిస్తుంటే మెసేజ్‌లదేముంది? పిల్లలను ఎత్తుకెళుతున్నారనే వీడియోల వల్ల దేశంలో 30 మందిని చంపేశారట! వాటి కన్నా మీవాడి వీడియోలేమీ ప్రమాదకరమైనవి కాదులే.. మీవాడొక్కడే కాదురోయ్ అడుగడుగునా బాలజ్ఞానులున్నారు. ఎన్నికల నాటికి బాలజ్ఞానం మరింత ప్రకోపిస్తుంది’’
*- బుద్దా మురళి (జనాంతికం 12-7-2018)

6, జులై 2018, శుక్రవారం

శ్రీరాముని దయచేతను..

‘‘తెలియదు  అంటే- తెలివి లేదని నిందిస్తావా? నాగం జనార్దన రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన స్థాపించిన పార్టీ ఏమైంది? బిజెపి నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు? కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి పదవేంటి? టీవీ చర్చల్లో రోజూ కనిపించే ఫలానా నాయకురాలు ఈ రోజు ఏ పార్టీ తరఫున మాట్లాడారు? అనడిగితే ,తెలియదు అన్నందుకు - రాజకీయాల గురించి నాకేమీ తెలియదా? నువ్వడిగిన ప్రశ్నలకు నాగంకే సమాధానం తెలియదు. విలేఖరుల సమావేశంలో అవినీతి కాంగ్రెస్ అంటూ చీల్చి చెండాడాడు. సార్.. ఇప్పుడు మీరు కాంగ్రెస్‌లోనే ఉన్నారని ఆయనకు గుర్తు చేయాల్సి వచ్చింది.’‘‘ఎవరితో మాటలు..? ఫోన్‌లో అంతగా ఊగిపోతున్నావ్?’
‘‘పక్కింటి పిల్లాడికి హోంవర్క్‌లో రాజకీయాల గురించి ప్రశ్నలు అడిగారట! వాళ్ల నాన్న నన్ను అడిగితే తెలియదని నిజాయితీగా చెప్పాను. ఇవి కూడా తెలియదు కానీ అన్నీ తెలిసినట్టు పెద్ద పోజు అని ఎత్తిపొడుపు మాటలకు చిర్రెత్తుకొచ్చింది. మీరు చెప్పండిరా! తెలంగాణ వస్తుందని ముందే చెప్పానా? లేదా? దేశ రాజకీయాలు ఎలా ఉంటాయి? 2019 ఎన్నికల అంచనాలు కూడా చెప్పాను కదా? మరి నాకేమీ తెలియదని ఎంతేసి మాటలంటున్నాడు.’’
‘‘బాధపడకు.. మాలో ఎవరికి సందేహం వచ్చినా నిన్నే  అడుగుతాం కదా? రాజకుమారి ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారని వారి పిల్లలను అడిగినా చెప్పలేరు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష విరమించారని దేశంలో కెల్లా సీనియర్ రాజకీయ నాయకుడు సృష్టించిన చరిత్ర, ఆయన కనిపెట్టిన పురాణాల ప్రకారం పోతన రాసిన రామాయణం పేరేమిటి? చినబాబు కనిపెట్టిన తెలుగు పదాలు ఏవి? వంటి ప్రశ్నలు అడిగితే ఠక్కున సమాధానం చెప్పడం ‘గూగుల్’కు కూడా సాధ్యం కాదు. ఇలాంటి వాటితో మూడ్ పాడు చేసుకోవద్దు.’’
‘‘సర్లే.. పొత్తికడుపుపట్టుకుని అంతగా మెలికలు తిరిగిపోతున్నావ్? ఏంటి విషయం? గ్యాసేమో..  టీ తాగడం తగ్గించు’’
‘‘కడుపులో నుంచి తన్నుకొస్తున్న ఈ గ్యాస్ వేరు’’
‘‘అలా మెలికలు తిరగకు. ఫర్వాలేదు సిగ్గుపడకు.. అంతా మన ఫ్రెండ్సే కదా? ఎవరూ ఏమీ అనుకోరు చెప్పు’’
‘‘కడుపులో నుంచి దేశభక్తి తన్నుకొస్తోంది.. దేశం కోసం ఏదో ఒకటి చేసి తీరాల్సిందే అనిపిస్తోంది. అలా అని నా అలవాట్లు మానుకోను. జేబులో నుంచి ఒక్క రూపాయి తీయను’’
‘‘దురద పుట్టినప్పుడు గోక్కోవాలని అనిపించడం ఎంత సహజమో మనిషన్నాక ఈ వయసులో ఏదో ఒకటి చేయాలనిపించడం అంతే సహజం. ఖర్చు లేని మార్గాలు బోలెడు ఉన్నాయి. సెల్ ఫోన్  ఉంది కదా? అదొక్కటి చాలు. ప్రతి బ్యాంకు అకౌంట్ నుంచి ఒక రూపాయి కోత విధించి సరిహద్దుల్లో యుద్ధంలో మరణించే సైనికుడి ఖాతాలో జమ చేయమని ఒక సందేశం తయా రు చేసి వాట్సాప్‌లో పం పించు.. నీకు పైసా ఖర్చు లేదు. నీ దేశభక్తికి బోలెడు గుర్తింపు’’
‘భలే  ఉంది. ఆగాగు.. ముందు వాట్సాప్‌లో ఈ మెసేజ్ అందరికీ పంపిస్తా..’’
‘‘అప్పుడే రంగంలోకి దిగావంటే నీలో దేశభక్తి ప్రవాహం మామూలుగా లేదు. ఇలాంటి దేశభక్తి సందేశాలు నీ శక్తిమేరకు తయారు చేసి వాట్సాప్ గ్రూపుల్లో నింపేయ్.’’
‘‘ఏరోయ్.. నువ్వేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టున్నావ్. వాడికిచ్చినట్టే నీకూ సలహా ఇస్తా చెప్పు ’’
‘‘రోజూ ఇలాంటివి వంద దేశభక్తి మెసేజ్‌లు వస్తాయి. అంతమందిలో ఒక బోడిగుండులా ఉండడం నాకు నచ్చదు. నేనసలే మేధావిని’’
‘‘ఓ పని చేయ్! అంతా రాముణ్ణి మొక్కితే, నేను నాస్తికుణ్ణి దేవునిపై నమ్మకం లేదు. రాముడు అబద్ధం, రావణుడు నిజం అని చెప్పు. రావణుడే నిజమైన దేవుడు అని వాదించు. నీ ఇంటి ముందు టీవీ వాళ్లు క్యూ కట్టక పోతే ఓట్టు’’
‘‘రాముడు లేడని, రావణుడు ఉన్నాడని పరస్పర విరుద్ధంగా ఎలా చెప్పాలి?’’
‘‘ఇలా ఆలోచిస్తే నీకు మేధావిగా గుర్తింపు లభించడం కష్టమోయ్.’’
‘‘దీంట్లో రిస్క్ లేదంటావా? ’’
‘‘స్టాక్ మార్కెట్, పూల దుకాణం.. ఏ వ్యాపారంలోనైనా రిస్క్‌ను బట్టే ఆదాయం ఉంటుంది. పాల ప్యాకెట్టు అమ్మితే రూపాయి కమీషన్ వస్తుంది. అదే హెరాయిన్ ప్యాకెట్ అమ్మితే అబ్బో బోలెడు ఆదాయం. రిస్క్ భరించేందుకు సిద్ధపడితేనే పబ్లిసిటీ, మీడియా గుర్తింపు..
‘‘ప్రాణాలు ప్రమాదంలో పడేంత రిస్క్ ఉంటే...’’
‘‘ప్రపంచ పటంలో భూతద్దం పెట్టి వెతికితే కనిపించీ కనిపించకుండా ఉండే చిన్న దేశంలో మతంపై కార్టూన్ వేస్తే మన దేశంతో పాటు అనేక దేశాలు భగ్గుమన్నాయి. ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అలాంటి వాటి జోలికెళ్లవద్దు. వంద కోట్ల జనాభా ఉన్న హిందువుల ఆరాధ్య దైవాలపై కార్టూన్లు వేసినా, కామెంట్ చేసినా గుర్తింపు తప్ప ఎలాంటి రిస్క్ లేదు. ’’
‘‘మీ చర్చలో జోక్యం చేసుకుంటున్నాను. నువ్వేదో వెటకారంగా చెబుతున్నట్టున్నావ్. మా బామ్మ రంగనాయకమ్మ ఈ అంశంపై చాలా చక్కగా వివరణ ఇచ్చారు. నేను హిందువుగా పుట్టాను, ఆ మతంలో పెరిగాను కాబట్టి హిందుమతం గురించి విమర్శిస్తూ రాస్తున్నాను. తెలియని మతాల గురించి రాయడం లేదని చెప్పారు. నువ్వు చదవలేదా?’’
‘‘అంటే ఆమె పుట్టినప్పుడే ఉగ్గుపాలకు బదులు క్యాపిటల్ పుస్తకం చదువుతూ పెరిగారా? పాలపీకలో మార్క్సిజాన్ని కలుపుకొని తాగుతూ పెరిగారా? క్యాపిటల్ గురించి, మార్క్సిజాన్ని గురించి ఎలా రాశారు? వీటి గురించి తెలుసుకుని రాశారు అంతే కదా? అలానే ఇతర మతాల గురించి తెలుసుకుని రాయవచ్చు కదా? రాస్తే ఏమవుతుందో బామ్మకు బాగా తెలుసు. ఆమె సంగతి మనకెందుకు కానీ మన సంగతి మనం చూసుకుందాం.’’
‘‘ఉద్రిక్తతలు కలిగిస్తున్న చానల్స్, సంస్థల సంగతి తేల్చకుండా.. .’’
‘‘పిచ్చోడా! పార్టీ శ్రేణులు కూడా చేయని మేలును టీవీ చానల్స్ చేస్తుంటే తెలివైన వాడెవడూ వద్దనడు..
లోకల్ గుర్తింపునకు ఇది సరిపోతుంది .. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కావాలంటే .. తన శైలిలో ప్రపంచ శాంతి కోసం తపించిన లాడెన్ కు నోబెల్ శాంతి అవార్డు ప్రకటించాలి అని డిమాండ్ చేయి . మన దేశం లో జైళ్లలో ఉన్న టెర్రరిస్ట్ లను విడుదల చేసి ... రావణున్ని చంపిన రామునిపై హత్యా నేరం , గృహ హింస కేసు , నిర్భయ కేసు పెట్టాలని రామాయణం లో జరిగిన మరణాలన్నింటిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేయి .. అసలు విషయం మరిచిపోయా బంగారు లేడిని చంపినందుకు అటవీజంతువుల సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకో మని డిమాండ్ చేస్తే తిరుగుండదు. శ్రీ రాముని దయతో నీ కోరిక నెరవేరి అంతర్జాతీయ మేధావిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను . బచ్చన్న పేట లో ఉండే అతనెవరో ట్రంప్ ఫొటోకు పూజ చేసి ట్రంప్ దృష్టిలో పడ్డప్పుడు మహానగరం లో ఉండే నువ్వు లాడెన్ కు శాంతి దూత అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ప్రపంచం దృష్టిలో పడకుండా ఉంటావా ?  ’’
‘‘అర్థం అయినట్టు, కాకుండా మాట్లాడుతున్నావు’’
‘‘మోదీ విజయంలో హిందుత్వ శక్తుల ప్రయత్నాల కన్నా, హిందూ వ్యతిరేక శక్తుల కృషి ఎక్కువ ఉంది’’
‘‘అర్థం కాలేదు..’’
‘‘తుంటిమీద కొడితే పళ్లు రాలాయనే సామెత తెలుసు కదా? తుంటికి, పళ్లకు సంబంధం ఉండదు. కానీ రాజకీయాల్లో ఉంటుంది.’’
*-బుద్దా మురళి (జనాంతికం 6-7-2018)

2, జులై 2018, సోమవారం

ఆస్తి పంపకం.. ఓ కళ

‘పిల్లలు సమర్ధులు అయితే వారి కోసం తల్లిదండ్రులు సంపాదించి పెట్టాల్సిన అవసరం ఏముంది? వారే సంపాదించుకుంటారు.
ఒకవేళ పిల్లలు అసమర్థులు, సంపాదించింది నిలుపుకోలేని అసమర్ధుల కోసం తల్లిదండ్రులు సంపాదించి పెట్టడం ఏందుకు?’ అంటూ యాంగ్రీ యంగ్ మెన్‌గా మూడు దశాబ్దాల క్రితం ఓ సినిమాలో అమితాబ్ చెప్పిన డైలాగు అప్పట్లో బాగా పాపులర్.
‘మా జీవితమంతా పిల్లల బాగు కోసం ధారపోశాం. వయసుడిగిన తరువాత ఇంట్లో నుంచి బయటకు పంపించారు. నిలువ నీడ లేదు.’ హైదరాబాద్‌లో ఇటీవల సీనియర్ సిటిజన్స్ సమావేశాన్ని నిర్వహించినప్పుడు పలువురు వృద్ధులు అవేదనగా చెప్పిన మాట.
పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో కొంత సంపాదించి పెట్టాలా? వద్దా? తాము సంపాదించింది పిల్లలకు ఏ వయసులో ఇవ్వాలి ఎలా ఇవ్వాలి?
సంపాదించడమే కాదు సంపాదించింది పిల్లలకు ఇవ్వడం కూడా ఒక కళే.
ఆ కళలో తేడా వస్తే, జీవితం కల తప్పి పోతుంది. హాయిగా గడవాల్సిన జీవితపు చివరి దశ నరక ప్రాయంగా మారుతుంది. పిల్లలకు సంపాదన ఎప్పుడివ్వాలి? ఎలా ఇవ్వాలి అనే సమస్య ఈ కాలం నాటిది కాదు. యుగ యుగాలుగా ఉన్నదే.
12వ శతాబ్దాంలో కాశ్మీర్‌కు చెందిన సంస్కృత పండితుడు యోగేంద్రుడు ఆనాటి పరిస్థితులను చూసి సంపదను పిల్లలకు ఇవ్వడం గురించి ఆనాడే చెప్పాడు. ఆకాలం నాటి కాశ్మీర్ రాజు అనంత దేవుడు తొలుత అధికారం అంతా కుమారుడికి అప్పగిస్తాడు. కుమారిని తీరు నచ్చక తిరిగి తాను అధికారం తీసుకుంటాడు. పరిస్థితులను తట్టుకోలేక చివరకు ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ పరిస్థితులను చూసిన క్షేమేంద్రుడు తాను రాసిన చారుచర్యలో వారసులకు సంపద ఏ విధంగా అప్పగించాలో వివరించారు.
ధృతరాష్ట్రుడు తన కుమారుడిపై ఉన్న విపరీతమైన వ్యామోహంతో రాజ్యాధికారం మొత్తం అతనికే అప్పగిస్తాడు. తీరా యుద్ధాన్ని నివారించేందుకు తండ్రి ప్రయత్నిస్తే, సూదిమోపినంత నేలను కూడా ఇవ్వనని దుర్యోధనుడు తిరస్కరిస్తాడు. ఒకవేళ అధికారం దృతరాష్ట్రుని చేతిలోనే ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా? ఇష్టం లేకపోయినా దుర్యోధనుడు తండ్రి మాట వినాల్సి వచ్చేది. కానీ రాజ్యాధికారం మొత్తం తన చేతిలో ఉన్న తరువాత తండ్రి మాట వినాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కూడా అంతే ఆస్తి మొత్తం వారసుల చేతికి వచ్చిన తరువాత తల్లిదండ్రుల మాట ఎందుకు వింటారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో క్షేమేంద్రుడు చెప్పారు. తండ్రి సంపాదన ఎలాగూ సంతానానికే చెందుతుంది. సంతానం బలవంతంగా తీసుకోక ముందే వయసు వచ్చిన పిల్లలకు తండ్రి సంపద అప్పగించాలి. అదే సమయంలో సంపద చేతికి అందిన తరువాత వారెలా ఉంటారనేది కూడా ఒక అంచనాకు రావాలి. అందరూ అలానే అని కాదు. అలా అని అంతా మంచివారే అని కాదు. కాలం ఎలాంటి వారినైనా మార్చేస్తుంది. మొత్తం సంపద ఒకేసారి వారి చేతిలో పెట్టవద్దు. అనుభవం లేని వారసులు ఒకేసారి సంపద వచ్చి పడితే వృధా చేయవచ్చు. లేదా సంపద మొత్తం వచ్చిన తరువాత ఇక తల్లిదండ్రులను పట్టించుకోవలసిన అవసరం ఏముంది అనుకోవచ్చు. దీని వల్ల వృద్ధాప్యంలో బాధలు తప్పవు. మధ్యేమార్గంగా కొద్ది కొద్దిగా తన సంపదను వారసులకు ఇస్తూ ఉంటే ... తండ్రితో బాగుంటేనే మిగిలిన సంపద దక్కుతుంది అని భావిస్తారు. అదే సమయంలో ఆ సంపదను ఎలా నిర్వహించాలో క్రమంగా అనుభవం గడిస్తారు.
నేను పోయేంత వరకు నా సంపదపై నాదే హక్కు అంటే ఎప్పుడు పోతాడా? అని ఎదురు చూస్తారు. తొందరగా పైకి పంపేందుకు సిద్ధపడే వారు కూడా ఉంటారు. క్రమంగా తన అధికారాన్ని, సంపదను వారసులకు అప్పగించడమే ఉత్తమ పద్దతి అని ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే పెద్దలు సూచించారు.
పిల్లలకు సంపదనంతా ఇచ్చేసి అనాథలుగా మారిన తల్లిదండ్రులు ఉన్న ఈ సమాజంలోనే తండ్రి పోతే కానీ సంపదపై అధికారం రాదు అని ఎదురు చూస్తున్న కుటుంబాలూ ఉన్నాయి.
పిల్లలకు సంపదంతా ఇచ్చేసి మోసపోయిన తండ్రులు అడుగడుగునా కనిపిస్తారు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా క్రమంగా సంపద వారసులకు అప్పగించడం ఉత్తమ మార్గం. దీని వల్ల వారసులకు అనుభవం వస్తుంది. పెద్దలకు చివరి దశ హాయిగా గడిచిపోతుంది.
వారసులకు సంపద అప్పగించడం అంటే అది కేవలం ధనం రూపంలో ఉన్న సంపద మాత్రమే కాదు. ఆ సంపదను కాపాడుకునే తెలివి తేటలు, వృద్ధి చేసే తెలివి తేటలు, జీవిత అనుభవాన్ని కూడా పిల్లలకు ఇవ్వాలి. ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలపాలి.
పిల్లలు పట్టించుకోవడం అని ఆవేదన చెందే తల్లిదండ్రులు చాలా మంది కనిపిస్తున్నారు. అదే సమయంలో ఇంకా తమ పెత్తనమే సాగాలి అని భావించే తల్లిదండ్రులూ ఉన్నారు. వయసు మీరిన తరువాత హుందాగా దాన్ని అంగీకరించాలి. బాధ్యతలను పిల్లలకు అప్పగించాలి. చివరి దశలో ఎవరిపైనా ఆధారపడకుండా ఏం చేస్తే బాగుటుందో ఒక నిర్ణయానికి రావాలి. మారిన కాలంలో పిల్లలు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. వారి స్వతంత్ర భావాలను అర్థం చేసుకోవాలి. మంచి చెడు చెప్పి నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఇవ్వాలి. పెద్దరికాన్ని నిలుపుకోవాలి.
చేతిలో అధికారం, ఆస్తి ఉన్నప్పుడే రేపటి గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. వయసు మీరి, అధికారం పోయి, సంపద చేజారిన తరువాత ఎంత జీవితానుభవం ఉన్నా ఉపయోగపడదు. అన్నీ చేతిలో ఉన్నప్పుడే సరైన తీరుగా నిర్ణయం తీసుకోవాలి.
-బి.మురళి

29, జూన్ 2018, శుక్రవారం

ఆ ‘మట్టిగడ్డ’ ఏమైంది..?

‘‘దిగులుపడకు.. మన రాజకుమారి అక్కయ్య కోరినట్టు మగవాళ్ల హక్కుల కమిషన్ వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది.’’
‘‘నాకూ అదే అనిపించింది.. ఆడపిల్ల అని కడుపులోనే చంపేసినట్టు వచ్చే వార్తలు కాస్తా ఇప్పుడు మగపిల్లాడని తెలిసి పుట్టగానే చంపేసిన తల్లి అనే వార్తలుగా మారాయి.’’
‘‘ఏదో జరుగుతోందని అనిపిస్తోంది..’’
‘‘సినిమాలో హీరోకో, హీరోయిన్‌కో ఏదన్నా అయితే ప్రకృతి స్తంభించి పోతుంది. నిజంగా అలా ఎప్పుడూ జరగదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఏదో ఒకటి జరిగిపోతూనే ఉంటుంది. ప్రపంచం ఎవరి కోసం ఆగదు’’
‘‘కడుపులో శిశువులను చంపడం గురించి కాదు. రాజకీయాల గురించి మాట్లాడుతున్నా .. అతను చాలా సీరియస్‌గా ఉన్నాడు. ఏదో ఒకటి చేసేట్టుగానే ఉన్నాడు’’
‘‘ఏమా కథ?’’
‘‘రష్యాను శక్తిమంతంగా మార్చి, ట్రంప్ పీచమణిచి, ప్రపంచ శాంతి సాధించి, మోదీని దించేసి, ఆంధ్రలో జగన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకొని, తెలంగాణలో మరో మహాకూటమిని ఏర్పాటు చేసి అధికారంలో కూర్చోబెట్టి తీరుతానని అంటున్నాడు’’
‘‘ఎవరతను..?’’
‘‘వెలిసిపోయిన ఎర్రరంగు ఇల్లుంది కదా? అతనే.. వాళ్లింట్లో మూడు ఓట్లున్నాయి’’
‘‘ఆ మూడు ఓట్లు ఆయన చెప్పిన వారికి పడతాయని గ్యారంటీ ఇస్తావా?’’
‘‘రెండు ఓట్ల సంగతి చెప్పలేను. భర్త ఓటు వేయమన్న పార్టీకే భార్య ఓటు వేస్తుందనే గ్యారంటీ లేని రోజులివి. ఆయన ఓటు మాత్రం కచ్చితంగా తాను అనుకున్న విధంగా వేసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉందని గట్టిగా నమ్ముతున్నాను.’’
‘‘అతని పేరు రామకృష్ణనా?’’
‘‘తెలియదు.. ఎందుకలా అడిగావు?’’
‘‘అదే పేరుగలాయన ఒకరు ఇలానే మాట్లాడితే అతనేనేమో అనుకున్నాను. చేతిలో ఉన్న ఒక్క ఓటుతో ట్రంప్ పీచమణిచి, మోదీని ఓడించి, జగన్‌ను అధికారంలోకి రాకుండా చేసి, మహాకూటమిని అధికారంలోకి తేవడం సాధ్యమే అంటావా?’’
‘‘అబ్దుల్ కలాం ఏమన్నారు. కలలు కనమన్నారు. అసాధ్యం అని తెలిసినప్పుడు చిన్న కలలు ఎందుకు కనాలి? అదేదో పెద్ద కలలే కంటే సరిపోతుంది కదా? అప్పుడెప్పుడో మూడు వందల ప్రజాసంఘాలు, పనె్నండు పార్టీల కూటమితో వరంగల్‌లో పోటీ చేసి చతికిలపడ్డారు.
ఏమో.. రేపు ఎన్నికల్లో రెట్టించిన బలంతో అంటే ఆరువందల ప్రజాసంఘాలు, 24 పార్టీలతో కూటమి కట్టే చాన్స్ లేకపోలేదు.’’
‘‘నిజమే.. కలలు కనేందుకు పన్నులేమీ లేవు కదా? ’’
‘‘గట్టిగా అనకు.. కలలపై జిఎస్‌టి వేస్తే దిగులతో జనం చచ్చిపోతారు’’
‘‘కలల లోకానిదేముంది కానీ రాజకీయ లోకంలో ఏం జరుగుతోంది? నేను మాట్లాడుతుంటే నువ్వేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్? దేని గురించి ఆలోచన?’’
‘‘ కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో మళ్లీ చేరుతున్నార ట!’’
‘‘ఆయన చేరితే.. నీకెందుకు దిగులు..?’’
‘‘నా ఆలోచన ఆయన చేరడం గురించి కాదు. ఆయన చేతిలోని ఆ కర్ర, మట్టిగడ్డ ఏమైందా? ఎక్కడుందా? వాటిని కూడా తనతో పాటు తీసుకెళ్లి కాంగ్రెస్‌లో చేరుతున్నాడా? అని?’’
‘‘మట్టిగడ్డ ఏంటి? కర్ర కధేంటి?’’
‘‘బెర్లిన్ గోడను కూల్చారు కదా? ఆ గోడ మట్టిగడ్డను తన పలుకుబడి ఉపయోగించి కిరణ్‌కుమార్ రెడ్డి ఎలాగోలా సంపాదించారు. రాష్ట్ర విభజనను నిలిపివేస్తూ ఆ మట్టిగడ్డ ఆంధ్ర, తెలంగాణ మధ్య ఫెవికాల్‌గా మారుతుందని చాలా మంది అనుకున్నారు. మహిమ గల ఆ మట్టిగడ్డ గురించి కిరణ్ కూడా మీడియా సమావేశంలో అద్భుతంగా చెప్పేవారు. ఇప్పుడా మట్టిగడ్డ ఎక్కడుందా? అని ఆలోచిస్తున్నా! విభజన తరువాత తెలంగాణ అంతా చీకటే అని చూపించిన ఆ కర్ర ఇప్పుడెక్కడుందా? అని ఆలోచిస్తున్నాను. ఆ రోజు కిరణ్ ఆ కర్రను తనతోనే తీసుకు వెళ్లారా? లేక సచివాలయంలోనే ఉంచారా? ’’
‘‘ఉమ్మడి రాష్ట్రంలోని సంపద కదా? రెండు రాష్ట్రాలకు సగం కర్ర, సగం మట్టిగడ్డ పంచే చాన్స్ ఏమైనా ఉందంటావా? లేక సొంత సంపదగా కిరణ్‌కే దక్కుతుందంటావా?’’
‘‘అది కిరణ్ చెప్పాలి.’’
‘‘అప్పుడెప్పుడో కిరణ్ భాజపాలో చేరుతారనుకున్నారు, తమ్ముణ్ణి తెదేపాలోకి పంపారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతారంటావా? చేరితే తెలంగాణ కాంగ్రెస్‌లో చేరుతారా? ఆంధ్ర కాంగ్రెస్‌లో చేరుతారా? తాను పక్కా హైదరాబాదీని అని ఉద్యమ కాలంలో చెప్పిన ఈ నిజాం కాలేజీ మాజీ విద్యార్థి తెలంగాణ కాంగ్రెస్‌లో చేరితే ఎలా ఉంటుందంటావు? ఆంధ్ర కాంగ్రెస్‌లో ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది? కాంగ్రెస్‌కు ఆయన లాభమా? భారమా? ’’
‘‘ఐపోయాయా? ఇంకా ప్రశ్నలున్నాయా? కిరణ్ తన గురించి తాను ఇన్ని ప్రశ్నలు వేసుకుని ఉంటే ఆయన భవిష్యత్తు మరోలా ఉండేదేమో. సీఎంగానే హాయిగా క్రికెట్ చూస్తూ గడిపేశారు. పార్టీ పెట్టి, పోటీ నుంచి తప్పు కున్న రాజకీయ యోధుడు.’’
‘‘చూడోయ్.. ఎవరి భవిష్యత్తు ఎప్పుడు ఎటు మలుపు తిరుగుతుందో చెప్పలేం. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకున్న చెన్నారెడ్డి అవసరం అయితే గంగలో దూకుతాను కానీ కాంగ్రెస్‌లో చేరను అని ప్రతిజ్ఞ చేసి , సొంత పార్టీకి అడ్రెస్ లేక తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి 1989లో ఏకంగా కాంగ్రెస్ నుంచి సిఎం అయ్యారు’’
‘‘అందుకేనేమో కిరణ్ ఏదో ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా తిరిగి అవతారం ఎత్తినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని ఆంధ్రలో అనువాద ఉపన్యాస నేత చాలారోజుల క్రితమే చెప్పారు.’’
‘‘్భమి గుండ్రంగా ఉంటుందన్న దానిపై ఇప్పటికీ కొందరు శాస్తవ్రేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం భూమి గుండ్రంగా ఉంటుందని పదే పదే నిరూపిస్తుంటారు. రాజకీయ పరీక్షల్లో తప్పి పోయి, సొంతంగా బతక లేనప్పుడు, నిర్మోహమాటంగా సొంత గూటికి చేరుకుంటారు.’’
‘‘్భమి గుండ్రంగా ఉన్నా, బల్లపరుపుగా ఉన్నా మనకొచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ ఏనాటికైనా మనందరి శాశ్వత చిరునామా ఆరడుగుల భూమిలోపలే అని గుర్తుంచుకుంటే మనుషుల తీరు మారొచ్చునేమో’’

-బుద్దా మురళి (జనాంతికం 29-6-2018)

25, జూన్ 2018, సోమవారం

సమాచార సమస్యకు సాంకేతికతే సమాధానం

మిషన్ భగీరథ పథకం కింద మారుమూ ల గ్రామాలకు సైతం ఇంటింటికి మం చినీటితో పాటు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించే ప్రయత్నాలు సాగుతున్నప్పుడు, అధికారు లు ప్రభుత్వ సమాచారాన్ని ఇంటర్‌నెట్‌లో ఉంచలే రా? సమాచారహక్కు చట్టం కింద సమాచారం ఇవ్వడం అదనపు భారంగా మారిందని భావిస్తున్న అధికారులు సాంకేతిక విప్లవాన్ని ఉపయోగించుకొ ని ఈ సమస్యను పరిష్కరించలేరా?
సమాచారహక్కు చట్టం కింద సమాచారం కోరితే ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది చాలామంది పిటిషనర్ల ఫిర్యాదు. అనేక పథకాల అమలుతో పని ఒత్తిడి పెరిగిపోయింది. దీనికితోడు సమాచారహక్కు చట్టం పేరుతో అవసరంలేని సమాచారం కూడా అడుగుతూ ఒత్తిడి పెం చుతున్నారు. ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఒత్తిడి పెం చేందుకు ఉపయోగించుకోవడం మంచిది కాదు అనేది అధికారులు వినిపించేమాట. ఎవరైనా సమాచారం కోరినప్పుడు అధికారులు తగిన వ్యవధిలో ఇవ్వాల్సిందే తప్ప ఈ సమాచారం ఎందుకు? అని అడుగడానికి వీలులేదు. సమాచారం ఏం చేసుకోవడానికి అనేది కూడా అధికారులకు అనవసరం.

కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు సమాచారం ఇంకా పూర్తిగా మాకు అందలేదు అందువల్ల సకాలంలో ఇవ్వలేకపోయాం. బదిలీపై ఈ మధ్య నే వచ్చాను అంతకుముందున్న అధికారి సమాచారం ఇవ్వలేదు. ఫైల్స్ దొరుకడం లేదు ఇలా ఉంటాయి అధికారులు చెప్పే కొన్ని కారణాలు. మరోవైపు సమాచారం కోసం కన్నా ఏదోరకంగా ఇబ్బందిపెట్టాలనే కోణంలోనే కొందరు సమాచారహక్కు చట్టాన్ని ఉపయోగించుకొంటున్నారు. పని ఒత్తిడి నిజమే, కొందరు అధికారులు సకాలంలో సమాచా రం ఇవ్వడంలేదు అనేదీ నిజమే. ఫిర్యాదుదారు, ప్రజా సమాచార అధికారి ఇద్దరు చెబుతున్న సమస్యలు నిజమే. ఇరువురి సమస్యలకు ఒకే పరిష్కారం- సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించి, ఫలితాలను ప్రకటించిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంతో పాటు సమాచార కమిషన్ కార్యాలయం కూడా కిక్కిరిసిపోయేది. ఆ పరీక్షలకు సంబంధించి కొన్ని వందలమంది అభ్యర్థులు అనేక సందేహాలతో సమాచారహక్కు చట్టం కింద సమాచారం కోరుతూ దరఖాస్తుచేసి, సమాచారం ఇవ్వలేదని కమిషన్‌ను ఆశ్రయించేవారు. ప్రతి కేసుకు సమాచార కమిషన్ వద్దకు వచ్చి సమాధానం చెప్పడం కన్నా సమాచారం మొత్తం వెబ్‌సైట్‌లో ఉంచడం మంచిదని పబ్లిక్ సర్వీ స్ కమిషన్ నిర్ణయించి అమలుచేసింది. అప్పటి నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సంబంధించి పిటిషన్లు పూర్తిగా తగ్గిపోయాయి. సమాచారం నెట్లో అందుబాటులో ఉన్నప్పుడు ఏ అభ్యర్థి అయినా సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగి రోజుల తరబడి ఎందుకు నిరీక్షిస్తారు. సమాచారం ఇవ్వడం అనేది తమకు అదనపు భారంగా మారిందని భావించడంకన్నా సమాచారం మొత్తం నెట్‌లో ప్రజలకు అందుబాటు లో ఉంచేట్టు చేస్తే అధికారులకు భారం తగ్గడమే కాకుండా అవసరమైన వారికీ సమాచారం అందుబాటులో ఉంటుంది.

నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాద్ నగరం నుంచి గ్రామానికి ఫోన్ చేసుకోవాలంటే ట్రంక్ కాల్ బుక్‌చేసి టెలిఫోన్ ఎక్స్‌ంజ్‌లో గం టల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది . మరిప్పుడు అమెరికాలో ఉండే పిల్ల లు హైదరాబాద్‌లో ఉండే అమ్మతో వంటల గురించి కూడా క్షణాల్లో సలహాలు తీసుకొంటున్నారు. సాంకేతిక విప్లవం సమాచారం ఇచ్చిపు చ్చుకోవడంలో ఇంత మార్పు తెచ్చినప్పుడు ప్రభుత్వాధికారులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి . వేధించే విధంగా సమాచారం కోరుతున్న కేసులు కూడా చాలానే కనిపిస్తున్నాయి. అంతమాత్రాన చట్టం కల్పించిన హక్కును కాదనలేరు.విద్యాశాఖకు సంబంధించి తరుచుగా ఒకేరకమైన సమాచారం కోరుతుంటారు. జిల్లా/మండల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల పేర్లు? వాటి లో గుర్తింపున్న పాఠశాలలు గుర్తింపులేని పాఠశాలలు వాటిపేర్లు, ఆటస్థలం, ఉపాధ్యాయులు, ఇతర సౌకర్యాలు వాటి వివరాలు అడుగుతుంటారు. ప్రతి జిల్లా విద్యా శాఖాధికారికి ఇలాంటి ప్రశ్నలతో కొన్ని వందల దరఖాస్తులు వస్తుంటాయి. వీటిలో కొన్ని నిజంగా సమాచారం తెలుసుకోవడానికి వస్తుంటాయి. ప్రైవేట్ పాఠశాలలతో ఏవో వివాదాల వల్ల సమాచారం కోరేవారు కొందరు. ఎవరు ఏ ఉద్దేశంతో సమాచారం కోరినా సమాచారం ఇవ్వడం అధికారుల బాధ్యత.కొన్ని వందల దరఖాస్తుల్లో ఒకేరకమైన సమాచారం కోరుతున్నప్పుడు ఆ అధికారులు తమ దృష్టి మొత్తం వీటికి సమాధానాలు పంపడంలోనే కేంద్రీకరించడం కన్నా ఆ సమాచారం మొత్తం వెబ్‌సైట్‌లో ఉంచడం మంచి ది. యూజీసీ గుర్తింపు పొందిన విద్యాలయాల జాబితాను తమ వెబ్‌సై ట్‌లో ఉంచుతున్నది. అదే తరహాలో విద్యాశాఖ కూడా జిల్లాలవారీగా ప్రభుత్వ పాఠశాలలు, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల పేర్లు, ఆ పాఠశాలలకు సంబంధించి తమ వద్ద ఉండే ఇతర సమాచారం వెబ్‌సై ట్‌లో పొందుపరిస్తే అధికారులకు భారం తగ్గుతుంది. పిటిషనర్లకు సమాచారం అందుబాటులో ఉం టుంది.

పాఠశాలకు సంబంధించి సమాచారం కోరినప్పుడు పిటిషనర్ తొలు త ప్రజా సమాచార అధికారికి దరఖాస్తు ఇస్తారు. ముప్ఫై రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే తర్వాత మొదటి అప్పిలేట్ అధికారిని సంప్రదించా లి. అక్కడా సమాచారం రాకపోతే కమిషన్‌ను సంప్రదించాలి. ఒక పిటిషన్‌పై సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి , కమిషన్ ముగ్గురు పని చేయాల్సి ఉంటుంది. అదే సమాచారాన్ని ఇంటర్‌నెట్‌లో ఉండేట్టు చేస్తే ముగ్గురి పని సులువుకావడంతో పాటు పిటిషనర్‌కు ఈ ముగ్గురి చుట్టూ తిరుగాల్సిన బాధ తప్పుతుంది.
సమాచారం వెబ్‌సైట్‌లో ఉండేట్టు చూడటంవల్ల అధికారులకు పని భారం తగ్గడం తప్ప నష్టంలేదు. ఒక్క విద్యాశాఖనే కాదు, అనేక శాఖలకు సంబంధించి కోరుతున్న సమాచారం ఇదేవిధంగా ఉంటుంది. ఒకే రకమైన సమాచారం అడుగుతుంటారు. ఆయా శాఖలు ఆ సమాచారా న్ని ఇంటర్‌నెట్‌లో ఉంచి తమ పనిభారాన్ని తగ్గించుకోవచ్చు. తృతీయ పక్షానికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం అయితే సెక్షన్-11 ప్రకా రం ఆ వ్యక్తి అనుమతి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. వ్యక్తిగత సమాచారం కానప్పుడు నెట్‌లో అందుబాటులో ఉంచడమే మేలు.
Buddamurali 
2005లో సమాచారహక్కు చట్టం వచ్చింది. చట్టం అమల్లోకి వచ్చిన 120 రోజుల్లో అధికార యంత్రాంగం స్వచ్ఛందంగానే తన వద్ద ఉన్న రికార్డులను, ఉద్యోగులు, విధులవంటి పలు అంశాల సమాచారం ప్రచురించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని చట్టం చెబుతున్నది. తమ వద్ద ఉన్న అన్ని రికార్డులను సహేతుకమైన కాలపరిమితిలో ఇంటర్‌నె ట్లో అందుబాటులో ఉంచాలని చట్టం చెబుతున్నది. సమాచారం పొం దడం కోసం ప్రజలు వీలైనంత తక్కువగా ఆశ్రయించడం కోసం అధికార యంత్రాంగం చట్టంలో చెప్పిన విధంగా ఎవరూ కోరకముందే వీలైనంత ఎక్కువ సమాచారం ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉండాలని చట్టం చెబుతున్నది. 30 రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే కమిషనర్ విచారించి జరిమానా విధించవచ్చు. అయితే స్వచ్ఛందంగానే సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఇంటర్‌నెట్‌లో ఉంచాలని చట్టం చెప్పింది కానీ అలా చేయకపోతే జరిమానా గురించి ప్రస్తావన లేదు. తమ పని సులభం చేసుకోవడానికి అధికారులు తామే వీలున్నం తవరకు సమాచారాన్ని నెట్‌లో పెట్టడం మంచిది. సమాచారం ఇవ్వడం భారంగా భావించడం కన్నా అడుగకముందే సమాచారం ఇంటర్‌నెట్ లో ఉంచడం ద్వారా పని భారం తగ్గించుకోవచ్చు.తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ తాగునీటి పథకంతో పాటు ఇంటర్ నెట్ సౌకర్యం అందించనున్నట్టు ప్రకటించింది. మారుమూల గ్రామా ల్లో సైతం ఇంటర్నెట్ అందుబాటులో ఉంటున్నప్పుడు జిల్లాస్థాయి అధికారులు తమ కార్యాలయంలో ఉన్న సమాచారాన్ని ఇంటర్నెట్‌లో ఉం డేట్టు చూడటం కష్టమేమీ కాదు.
-బుద్దా మురళి (నమస్తే తెలంగాణ 24-6-2018)