27, సెప్టెంబర్ 2015, ఆదివారం

సినిమా చూపిస్త భామా!

‘‘రోజుకు ఇరవై గంటలు కష్టపడుతూ ఊపిరి తీసుకునేంత సమయం కూడా లేని నాయకులే ఉత్సాహంగా కనిపిస్తుంటే నువ్వేంట్రా అంత దిగులుగా ఉన్నావ్’’


‘‘నేత కష్టాలు నేతవి, పీత కష్టాలు పీతవి’’
‘‘ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగివి. ఊళ్లో పొలం, నగరంలో ఫ్లాట్లు అద్దెలు. వర్షాలొస్తే వర్షాల అలవెన్స్ కరువోస్తే కరవు భత్యం నీకేంటి కష్టాలు’’
‘‘అమ్మాయి పెళ్లిడుకొచ్చింది ’’
‘‘ఐటి కంపెనీలో మంచి ఉద్యోగం, హీరోయిన్ అంత అందంగా ఉంటుంది. మీ అమ్మాయికేంటిరా కళ్లకద్దుకొని పెళ్లి చేసుకుంటారు’’
‘‘ కళ్లకద్దుకొని పెళ్లి చేసుకుంటామని చాలా మందే వస్తున్నారు కానీ వాళ్లె వరూ మా అమ్మాయికి నచ్చడం లేదు. పోలీస్ కానిస్టేబుల్‌నే చేసుకుంటాను అని మొండిపట్టు పట్టింది. ’’
‘‘ ఇదేం కోరికరా నువ్వు చెప్పినా నేను నమ్మలేక పోతున్నాను ’’
‘‘ అదేరా నా దిగులు. ఒక్క సినిమాల విషయం తప్ప అన్నింటిలో ఫర్‌ఫెక్ట్. ఐఐటిలో సీటు కోసం మూడో తరగతిలోనే తెల్లవారు జామున మూడు గంటలకే కోచింగ్ సెంటర్‌లో దించితే మళ్లీ రాత్రి పదకొండు గంటలకు అన్ని ఇన్‌స్టిట్యూట్‌ల కోచింగ్ ముగించుకుని ఇంటికి వచ్చేది. దాంతో పగలు, రాత్రి ఎలా ఉంటుందో? ప్రపంచం ఎలా ఉంటుందో ఆ పిచ్చి తల్లికి అస్సలే తెలియకుండా పోయింది. ఉద్యోగంలో చేరిన తరువాత ఒక్కసారిగా సినిమా పిచ్చి పట్టుకుంది. తాను చిన్నప్పటి నుంచి చూడాలనుకున్న సినిమాలన్నీ వరుస పెట్టి చూసేస్తున్నది. చూసి వదిలేస్తే బాగుండు ఆ సినిమా కథల ప్రభావం అమ్మాయి మీద తీవ్రంగా ఉందిరా! అంతులేని కథ చూసి అసలు పెళ్లి చేసుకోను కుటుం బం కోసం త్యాగం చేస్తాను అంది ఆ అవసరం లేదు తల్లి అని ఒప్పించడానికి తల ప్రాణం తోకకు వచ్చింది. అదేదో సినిమాలో కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అంటూ ఆ హీరో చెప్పిన డైలాగుతో పెళ్లంటూ చేసుకుంటే కానిస్టేబుల్‌నే చేసుకుంటాను అంటోంది. చివరకు ఒక పోలీసు సంబంధం తీసుకు వచ్చాను. మూడు సింహాలే కనిపిస్తున్నాయి. కనిపించని ఆ నాలుగో సింహం కావాలంటోంది. ’’
‘‘దురదృష్టంలోనూ నువ్వు అదృష్టవంతుడివిరా ఇంకా నయం దొంగ రాము డు, రిక్షా రాముడు, డ్రైవర్ రాముడు సినిమాలు చూసి ఉంటే దొంగ కోసమో, రిక్షా వాడి కోసమో తిరగాల్సి వచ్చేది.’’
‘‘ఏదైనా సలహా చెబుతావేమో అని వస్తే నన్నింకా భయపెడతావా? ’’


‘‘ సినిమాలో హీరో రిక్షా తొక్కితే ప్రపంచంలో అతి ముఖ్యమైన వృత్తి రిక్షా తొక్కడమే, రిక్షా తొక్కే వాడిలో నిజాయితీ ఉంటుంది అని చూపిస్తారు. హీరో దొంగ అనుకో బలమైన కారణం వల్ల హీరో దొంగతనాలు చేస్తాడు. కానీ దొంగ చాలా మంచోడు. దొంగతనం పవిత్రమైన వృత్తి అని చూపిస్తారు. అలానే విలన్ స్మగ్లర్ అయితే అది దేశ ద్రోహం, అదే హీరో స్మగ్లర్ అయితే ఎంతో తెలివిగా అందరి కళ్లు కప్పి స్మగ్లింగ్ చేస్తాడు. ఇందులో ఆ పాత్ర వృత్తి గొప్పతనం కాదు. హీరో ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్ర గొప్పతనం. ఈ మాత్రం తెలియకుండా మీ అమ్మాయి మరీ ఇంత పిచ్చిగా సినిమాలో లీనం అయితే ఎలా? ’’
‘‘మా అమ్మాయి ఒక్కదాని ఆలోచనలోనే ఏదో తప్పున్నట్టు మాట్లాడతావు. కోట్లాది మంది సామాన్యులు, మేధావుల్లో కూడా ఈ ప్రభావం ఉంటుంది’’
‘‘ నేను నమ్మను’’


‘‘అమెరికాలో ఐటి ఉద్యోగం చేసొచ్చిన కెటిఆర్ శ్రీమతుండు సినిమా చూసి ఎంతగా స్పందించారు. ట్విట్టర్‌లో మహేశ్‌బాబును ఆకాశానికెత్తేయలేదా! అలానే మహేశ్‌బాబు స్పందించి ఏకంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోలేదా? ’’
‘‘ఆ ఇద్దరు ఒకరినొకరు పొగుడు కోవడానికి ఎవరి లెక్కలు వాళ్లకుంటా యి..’’
‘‘ తెలుగు వారికో రాష్ట్రం ఉన్నా, మద్రాస్‌లోనే జీవిత కాలమంతాగడిపిన ఎన్టీఆర్ సినిమా ఎండింగ్‌లో రాజకీయ పార్టీని స్థాపిస్తే ఎన్నో సినిమాల్లో ఆయన పేదలను ఆదుకున్న దాన్ని చూసే కదా తెలుగు ఓటర్లు ఆయనకు పట్టం కట్టింది. మా అమ్మాయిని తప్పు పడుతున్నావు మరి దీనే్నమంటావు. ’’
‘‘ఎన్టీఆర్ సినిమాల్లో విలన్లను మట్టికరిపించినా జీవితంలో మాత్రం తానే విలన్ల చేతిలో ఘోరంగా దెబ్బతిని మానసిక క్షోభతో పైకి పోయారు. అప్పటి పరిస్థితుల వల్ల ఎన్టీఆర్‌ను జనం గెలిపించారు. అదే జనం చిరంజీవి వస్తే గెలిపించలేదు కదా?’’
‘‘మా అమ్మాయికి ఆ దేవుడే ఓ దారి చూపించాలి.’’
‘‘ మీ అమ్మాయికి మంచి సంబంధం కుదిర్చే బాధ్యత నాది ఆ సంగతి నాకు వదిలేయ్’’
****
‘‘నాన్నా నేను ప్రవీణ్‌ను చేసుకుంటాను’’
‘‘సంతోషం ’’
****
‘ థాంక్స్ రా .. అసాధ్యుడివి .. ఏం మంత్రం వేశావు ’’
‘‘  సినిమా పోస్టర్లకు క్షీరాభిషేకాలు చేసేది, హీరో కోసం తలలు పగుల గొట్టుకునేది పెళ్లి కాని, బాధ్యతలు లేని వాళ్లే.’’ఇంకా  నయం మీ అమ్మాయి సినిమాలో హీరో వృత్తినే ప్రేమించింది . ఒక్కోసారి రోగానికి రోగమే చికిత్సలా పని చేస్తుంది. అదేదో కొత్త సినిమా అందులో హీరో హార్డ్‌వేర్... ప్రపంచమంతా ఆ హీరో వృత్తిపైనే ఆధారపడి ఉందని ఆ సినిమాలో చూపించారు. ప్రపంచాన్ని నాశనం చేయాలన్నా, కాపాడాలన్నా ఆ హీరో వల్లే సాధ్యం అనేది కథ. ప్రవీణ్ మా బంధువుల అబ్బాయే హార్డ్‌వేర్. మీ సాఫ్ట్‌వేర్ అమ్మాయికి సరైన సంబంధం అనిపించింది. ఇద్దరికీ నేనే పరిచయం చేశాను. ఇద్దరూ కలిసి సినిమాకెళ్లారు. హార్డ్‌వేర్ అబ్బాయి, సాఫ్ట్‌వేర్ అమ్మాయి ఒకటయ్యారు. ’’
‘‘ నీ సహాయం జీవితంలో మరువలేను’’
‘‘  పెళ్లితో సినిమాకు శుభం కార్డు పడుతుంది.జీవితంలో కాదు. జీవితం వేరు, సినిమా వేరు. జీవితంలో పెళ్లితోనే అసలు కథ మొదలవుతుంది. మహామహా ఎన్టీఆరే నిజ జీవితంలో విలన్‌లను ఎదుర్కోలేక బొక్క బోర్లా పడ్డారు. ఈ హార్డ్‌వేర్ కుర్రాడెంత. పెళ్లయింది కదా మెల్లగా మీ అమ్మాయికే జీవితం వేరు, సినిమా వేరని అర్ధమవుతుంది లే! 

26, సెప్టెంబర్ 2015, శనివారం

కాంగ్రెస్ టిడిపి లను ఏకం చేస్తున్న తెలంగాణా


ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్య మం లెఫ్ట్ రైట్ అనే తేడా లేకుండా తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసింది. తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమం అన్ని పార్టీల నాయకులను ఏకం చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్, టిడిపిలను తెలంగాణ ఏకం చేస్తోంది. బలమైన శత్రువును ఎదుర్కోవాలంటే ఏదో ఒక రూపంలో కలిసి అడుగులు వేయక తప్పదని కాంగ్రెస్, టిడిపిలు భావిస్తున్నాయి.

 ప్రస్తుతానికి టిడిపి ముందడుగు వేస్తుండగా, కాంగ్రెస్ మాత్రం పార్టీ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ అక్కడక్కడ కలిసి పని చేస్తున్నారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం టిడిపి సాగించిన పాదయాత్రలో కాంగ్రెస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర నాయకులు పాల్గొ ని ఒకే స్వరం వినిపించారు. వైఎస్‌ఆర్ ము ఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేవెళ్ల చెల్లెమ్మ అంటూ ఏ కార్యక్రమమైనా సబితా ఇంద్రారెడ్డి అప్పుడు ప్రాతినిధ్యం వహించిన చేవెళ్ల నుంచి ప్రారంభించేవారు. తెలంగాణలో కాంగ్రెస్,టిడిపిల మధ్య స్నేహం చేవెళ్ల చెల్లెమ్మ సమక్షంలో మొగ్గ తొడిగింది. వచ్చే ఎన్నికల నాటికి ఈ స్నేహం ఎంత వరకు వెళుతుంది అనేది వేచి చూడాలి.
రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. విచిత్రం కాదు... ఏదైనా సాధ్యమే. సినిమా లే తప్ప రాజకీయాలపై ఎప్పుడూ ఆసక్తి చూపని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ముఖ్యమంత్రి కావడం ఒక వింత. తన జీవితంలో ఎక్కువ భాగం మద్రాస్‌లోనే గడిపిన ఆయన పార్టీని స్థాపించాకే తెలుగు నాడుకు వచ్చి తెలుగు వారి ఆత్మగౌరవం అని ఇచ్చిన నినాదానికి జనం నీరాజనం పలికారు. అలాంటి పార్టీని చివరకు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన అల్లుడు ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడే ఆ పార్టీకి నాయకత్వం వహించడం విశేషం. మన దేశంలో రాజకీయ పార్టీలకు సిద్ధాంతం అంటే ప్రధానంగా ఆర్థిక విధానాలు, లౌకిక వాదమా? మతాభిమానమా? అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. కానీ ఒక రాజకీయ పార్టీని వ్యతిరేకించడమే ప్రధాన సిద్ధాంతగా ఆవిర్భవించిన పార్టీ టిడిపి. కాంగ్రెస్ వ్యతిరేకతే మా విధానం అని ఎన్టీఆర్ మొదలుకొని బాబు వరకు టిడిపి నాయకులంతా సగర్వంగా ప్రకటించే వారు. కానీ ఇప్పుడు చిత్రంగా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, టిడిపి కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ ఒకవైపు కాంగ్రెస్‌తో పోరాడుతూనే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తోంది.
94లో కాంగ్రెస్‌కు కనీసం ప్రతి పక్ష హోదా కూడా దక్కలేదు. ఘన విజయం సాధించిన ఎన్టీఆర్ ఇంటికి లక్ష్మీపార్వతి ఒకసారి కాంగ్రెస్‌కు చెందిన టి సుబ్బిరామిరెడ్డిని భోజనానికి ఆహ్వానించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ నేత ఇంటికి కాంగ్రెస్ నాయకుడు భోజనానికి రావడమా? అని చంద్రబాబు వర్గం ఊగిపోయింది. ఎన్టీఆర్‌ను దించేసే రాజకీయ క్రీడలో మొదటి ఎత్తు ఆ భోజనంతోనే మొదలైంది. సుబ్బిరామిరెడ్డిని ఇంటికి భోజనానికి పిలవడం అంటే ఒక దేవుడిగా పూజలందుకుంటున్న నాయకుడిని సైతం అధికారం నుంచి దించేయాల్సినంత ఘోరమైన తప్పిదంగా భావించారు. సుబ్బిరామిరెడ్డిని భోజనానికి పిలవడంతో టిడిపి అపవిత్రం అయినట్టుగా భావించారు. అంత గొప్ప నిష్టగల టిడిపి తెలంగాణలో ఇప్పు డు ఏకంగా కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకుని నడుస్తునడుస్తున్నది.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయాలని ప్రయత్నిస్తే కాంగ్రెస్, టిడిపిలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. టిడిపి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు టిడిపి సభలో గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చారు. వైఎస్‌ఆర్ ఎంతో అభిమానంతో భారీ నిధులు కేటాయించి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని టిడిపి, కాంగ్రెస్ రెండు పార్టీల నాయకులు ఒకే స్వరం వినిపించారు. జలయజ్ఞం కాదు ధన యజ్ఞం అంటూ తొమ్మిదేళ్లపాటు వైఎస్‌ఆర్‌పై తీవ్రంగా విమర్శలు సాగించిన టిడిపి నాయకులే ఆ సభలో ప్రాణహిత చేవెళ్లప్రాజెక్టుకు వైఎస్‌ఆర్ కృషిని పొగిడారు.
అంతకు ముందు మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్తు సమావేశంలో కాంగ్రెస్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పక్షం దాడిపై గన్‌పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేస్తే టిడిపి సభ్యులు అక్కడికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. కెసిఆర్ విధానాల వల్లనే కాంగ్రెస్, టిడిపి కలిసి పోరాడాల్సి వస్తోందని టిడిపి నాయకులు చెబుతున్నారు. సభ భయటే రెండు పార్టీలు వివిధ అంశాలపై క్రమంగా దగ్గరవుతున్నాయి. ఇక సభలో విపక్షాల మధ్య ఐక్యత అనేది సహజం. దేశంలో బిజెపికి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. ఆంధ్రలో టిడిపి, బిజెపి ఉమ్మడి ప్రభుత్వం. కేంద్రంలో ఎన్‌డిఏలో టిడిపి మంత్రులు ఉన్నారు. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్, టిడిపి ఆందోళనల కోసం అయి నా వేదికను పంచుకోవడం రాజకీయాల్లో విడ్డూరంగానే ఉంటుంది.
నిజానికి రాష్ట్రంలో విపక్షాలను ఏకత్రాటిపైకి తీసుకు వచ్చి టిఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యర్థిశక్తిని నిలపాలని వామపక్షాలు ప్ర యత్నిస్తున్నాయి. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో గద్దర్‌ను ఉమ్మడి అభ్యర్థిగా నిలపడం ద్వారా విపక్షాల మధ్య ఐక్యత కోసం వామపక్షాలు ప్రయత్నించాయి. టిడిపి, కాంగ్రెస్ పార్టీలు సైతం మద్దతు ఇస్తే గద్దర్ పోటీ చేసేందుకు కొంత వరకు అవకాశం ఉండేది. కానీ ప్రధాన పార్టీల మద్ద తు లేకుండా వామపక్షాల అభ్యర్థిగా పోటీకి గద్దర్ ఇష్టపడలేదు. ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్‌ను నిలిపేందుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, టిడిపిలను వామపక్షాలు కోరా యి. అయితే ఆ పార్టీలు అంగీకరించలేదు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల్లో టిఆర్‌ఎస్ బలమైన శక్తి. టిడిపి, కాంగ్రెస్‌లు విడివిడిగా ఆ పార్టీని ఎదుర్కోలేని పరిస్థితి. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం అంత సులభం కాదు. ఉద్యమాల కోసం ఏకం కావచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లోపాయికారిగా ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కానీ సాధారణ ఎన్నికల్లో బహిరంగంగా పొత్తు పెట్టుకోవడం అంత సులభం కాదు.
టిడిపితో పొత్తు తెలంగాణ బిజెపి నాయకులకు మొదటి నుంచి ఇష్టం లేదు. పొత్తు సమయంలో బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అలిగివెళ్లిపోతే పది జిల్లాల అధ్యక్షులు ఏకంగా రాజీనామా చేశారు. మిత్రపక్షంగా బిజెపి టిడిపిలు కలిసి ఉద్యమించాలి కానీ అలా కనిపించడం లేదు. బిజెపి సొంతంగానే కార్యక్రమాలు చేస్తుంటే టిడిపి మాత్రం క్రమంగా కాంగ్రెస్‌తో కలిసి కార్యక్రమాలు చేస్తోంది. ప్రాణహిత చేవెళ్ల కోసం టిడిపి ఉద్యమిస్తే బిజెపి నాయకులను పిలవలేదు, వాళ్లు రాలేదు. కానీ కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికి పెద్ద పీట వేశారు. ఈ పరిణామాలపై బిజెపి నాయకులు పైకేమీ చెప్పక పోయినా వారికిది సంతోషకరమైన విషయమే. తెలంగాణలో టిడిపితో తెగతెంపులు చేసుకోవడమే వారికి కావలసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు కొంత బలం తక్కువైతే బయటి నుంచి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్, టిడిపిల మధ్య ఒప్పందం కుదిరిందన్న రహస్యాన్ని టిడిపి వర్గీయులే బయటపెట్టారు.

 గతంలో కేంద్రంలో బయటి నుంచి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అనుభవం టిడిపికి ఉంది. అదే విధంగా అవసరం అయితే తెలంగాణలో బయటి నుంచి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి ఉండేది. అప్పటికప్పుడు దానికో సిద్ధాంతాన్ని చెప్పడం టిడిపికి పెద్ద కష్టమేమీ కాదు. దుష్ట కాంగ్రెస్‌ను అధికారానికి దూరంగా పెట్టేందుకు బిజెపికి మద్దతు ఇచ్చానని, మతతత్వ బిజెపిని అధికారానికి దూరంగా ఉంచేందుకు కేంద్రంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇచ్చానని గతంలో సమర్ధించుకున్న చరిత్ర చంద్రబాబుకు ఉంది. అదే తరహాలో దుష్ట టిఆర్‌ఎస్‌ను అధికారానికి దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చానని చెప్పుకునే వారు. అయితే ఆంధ్రలో బిజెపితో, తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తుండడమే విచిత్రం. ఉభయ రాష్ట్రాల్లో మరే పార్టీకి లేని ప్రచార శక్తి టిడిపికి ఉంది. చంద్రబాబు ఒకే రోజు తెలంగాణలో తన లేఖ వల్లనే తెలంగాణ ఏర్పడిందని చెబుతూ, అదే రోజు ఆంధ్రలో మాత్రం ఏకపక్షంగా అడ్డగోలుగా విభజించారని ప్రకటించారు.
వామపక్షాలను పక్కన పెట్టి బిజెపితో కలిసిన సమయంలో తిరిగి బిజెపిని వదిలి వామపక్షాలతో చేతులు కలిపిన సమయంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు సమయానుకూలంగా బలమైన వాదన వినిపించారు. ఆ తరువాత వామపక్షాలను పక్క న పెట్టి 2014లో బిజెపితో చేతులు కలిపినప్పుడు తిరిగి అంతే బలంగా తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ బలమైన వాద న వినిపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో చేతులు కలపడాన్ని సైతం అంతే బలంగా సమర్ధించుకునేంత యంత్రాంగం టిడిపికి ఉంది.
రెండు పార్టీల మధ్య అనుబంధం కాంగ్రెస్ కన్నా టిడిపికే ఎక్కువ అవసరం. ఆంధ్ర, తెలంగాణల్లో రెండు పార్టీల వ్యవస్థనే ఉంటుంది. ఆంధ్రలో టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలంగాణలో టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌ల మధ్యనే పోటీ ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఎప్పుడూ రెండు పార్టీల మధ్యనే బలమైన పోటీ సాగింది. ఎంఐఎం పార్టీ పాతనగరానికి పరిమితం అయినట్టు విభజన తరువాత టిడిపి కొత్త నగరంలో కొన్ని నియోజక వర్గాలకు మాత్రమే పరిమితం అవుతుంది. వివిధ అంశాల్లో ఆంధ్ర తెలంగాణలో మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉం టాయి. ఆ వివాదాల్లో టిడిపి ఒకవైపు తమ పార్టీ నేత చంద్రబాబు నిర్ణయాలను సమర్ధిస్తూ మరోవైపు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడాలి. 

ఈ డబుల్ రోల్‌లో కొత్త నగరంలో టిడిపి అభిమానులున్న నియోజక వర్గాలకే పరిమితం కావలసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్, టిడిపి చెట్టాపట్టాలేసుకుని ఉద్యమాల్లో పాల్గొంటే కాంగ్రెస్ కన్నా టిడిపికే ఎక్కువ ప్రయోజనం. తెలంగాణ టిడిపి నాయకులు విజయవాడ వెళ్లి చంద్రబాబుతో భేటీ అయిన తరువాతనే టిడిపి ఎమ్మెల్యే పాదయాత్ర, కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి టిడిపి సభలో పాల్గొనడం జరిగింది. ఉమ్మడి పోరాటాల్లో టిడిపితో కాంగ్రెస్ నేతలు కనిపిస్తున్నా, రెండు పార్టీల అనుబంధంపై కాంగ్రెస్ పార్టీ పరంగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో టిడిపి సభలో మీరెందుకు పాల్గొన్నారని కాంగ్రెస్ నాయకులను ఆ పార్టీ నాయకత్వం ప్రశ్నించలేదు. ఈ రెండు పార్టీల అనుబంధం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. శాసన సభ సమావేశాల్లో ఈ బంధం మరిం త గట్టిపడే అవకాశం ఉంది.
  • -బుద్దా మురళి

  • 26/09/201
    5
  • 20, సెప్టెంబర్ 2015, ఆదివారం

    ఆత్మ చరిత్ర!

    ‘‘చూస్తుండు బాబాయ్ చరిత్ర సృష్టిస్తాను’’
    ‘‘ ఏరా వాడెవడో గడ్డంతో లారీ లాగి చరిత్ర సృష్టించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించాడట! వాడికి పోటీగా ముక్కులోని వెంట్రుకలతో లారీ లాగి కొత్త చరిత్ర సృష్టిసావా? ఏంటి? ’’
    ‘‘అది కాదు ’’
    ‘‘మరింకేం చేస్తావు. కాళ్లకు అడ్డం తగలలేనంతగా గోళ్లు పెంచడం, రోడ్లను ఊడ్చేంతగా జుట్టు పెంచడం, తల క్రిందులుగా నడవడం’’
    ‘‘అది కాదు బాబాయ్ చరిత్ర సృష్టించినా, తిరగ రాసినా మా వంశం వల్లే అవుతుంది’’


    ‘‘ఆ తెలిసిందిలే ఆ హీరో ఎవరో ఇలాంటి డైలాగులు చెప్పి సినిమాల్లో కోట్లు సంపాదిస్తుంటే పోస్టర్లకు పాలాభిషేకాలు చేయడం, హీరో నడిచిన రోడ్డును శుభ్రం చేయడం ఇవే కదా మీ రికార్డులు. మహా అయితే ఆ సినిమాను అందరి కన్నా ఎక్కువ సార్లు చూసి రికార్డు సృష్టిస్తావేమో ? ’’
    ‘‘నేనే పరీక్ష రాసినా ఎందుకు ఫేయిల్ అవుతానో, ఏ ఉద్యోగానికి ఎం దుకు ఎంపిక కావడం లేదో తెలుసా బాబాయ్’’
    ‘‘నీ బుర్రలో మట్టితో పాటు ఇంకేమన్నా ఉంటే పాసయ్యేవాడివి ఇందులో తెలియందేముందిరా అబ్బాయ్’’


    ‘‘జోకులు తరువాత బాబాయ్ నేను సీరియస్‌గా చరిత్ర గురించి చారిత్రాత్మక విషయాలు చెబుతున్నాను. మధ్యలో జోకులొద్దు. యదార్థవాది లోక విరోధి అంటారు. నేను అన్నీ నిజాలే రాస్తున్నాను... చెబుతున్నాను కాబట్టే ఏ ఉద్యోగానికి ఎంపిక చేయడం లేదు. ఏ పరీక్ష పాసవడం లేదు’’
    ‘‘నిజమా? ఏంటో ఆ చారిత్రక సత్యాలు’’
    ‘‘అసలు స్వాతంత్య్ర పోరాటానికి మూలం మా తాత. నిరాయుధీకరణను ఆయుధంగా చేసుకుని మహాత్ముడు జరిపిన స్వాతంత్య్ర పోరాటం వల్ల ఈ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని చరిత్రను తప్పుదోవ పట్టించారు. కానే కాదు.. అసలు చరిత్ర వేరుగా ఉంది. నేనది రాసినందుకే నన్ను పాస్ చేయడం లేదు’’


    ‘‘ ఏంటో ఆ చరిత్ర ’’
    ‘‘తింగరి బుచ్చయ్య అని మా తాత స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి ఆయనే. ఓ రోజు ఆయన తాగి ఇంటికి వస్తే మా అవ్వ తిండి పెట్టలేదు. ఇంట్లోకి రానివ్వలేదు. రెండు రోజుల పాటు తిండి తిప్పలు లేక ఇంటి బయ ట అలానే పడి ఉన్నాడు. ఏ పనీ చేయలేదు. ఎవరింటికి వెళ్లలేదు. మందు తాగలేదు. మాట్లాడలేదు. దాంతో మా ఆవ్వ దెబ్బకు దిగి వచ్చింది. సహాయ నిరాకరణ ఉద్యమానికి, సత్యాగ్రహ ఉద్యమానికి ఇదే స్ఫూర్తి.. కానీ చరిత్రలో మా తింగరి బుచ్చయ్య తాతకు స్థానం కల్పించకుండా కాంగ్రెస్ కుట్ర పన్నింది. ’’
    ‘‘దీంతో కాంగ్రెస్ కేం సంబంధంరా అబ్బాయ్ ’’
    ‘‘అక్కడే ఉంది సమస్య అంతా. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అని విన్నా వా? ’’
    ‘‘ఏదో చరిత్ర రచయితల సంఘం అని చదివినట్టు గుర్తు. ’’
    ‘‘ఇక్కడే అసలు మతలబు ఉంది. చరిత్ర రాసుకునే వాళ్లు కూడా కాంగ్రెస్ అని ఒక పార్టీ పేరుతో సంస్థ పెట్టుకున్నారంటే చూడు బాబాయ్ వీళ్లు ఎంతకు తెగించారో. మా తింగరి బుచ్చయ్య తాత ఇండిపెండెంట్. ఏ పార్టీకి చెందని వాడు. ఇండిపెండెంట్‌గానే దేశానికి ఇండిపెండెన్స్ సాధించాలని ఉద్యమించాడు. మా తాత కాంగ్రెస్ సభ్యుడు కాదు కాబట్టి కాంగ్రెస్ చరిత్ర కారులు మా తాతను చిన్నచూపు చూశారు. ’’


    ‘‘చరిత్ర రచయితల సంఘానికి కాంగ్రెస్‌కు సంబంధం లేదనుకుంటారా? అది ఎప్పుడో 1935లో ఏర్పాటు చేశారురా అబ్బాయ్’’
    ‘‘బాబాయ్ కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేయకు. చివరకు వాళ్లు అమెరికా పార్లమెంటుకు కూడా కాంగ్రెస్ అని తమ పార్టీ పేరే పెట్టించుకున్నారు. అమెరికాలోనే పలుకుబడి చూపించినోళ్లు మన దేశ చరిత్రను రాసుకోవడంలో ప్రభావం చూపించలేదంటావా? ’’
    ‘‘ఏమోరా నాకు అయోమయంగా ఉంది.. ఇంతకూ ఇప్పుడు నువ్వేమంటావు’’
    ‘‘అక్కడికే వస్తున్నా... ఫేస్‌బుక్ గురించి విన్నావు కదా! సరికొత్త చరిత్ర సృష్టిస్తాను’’


    ‘‘అవును విన్నాను. కాలేజీకెళ్లే ముగ్గురు కుర్రాళ్లు కారు షెడ్డూలోనే ఫేస్‌బుక్‌ను స్థాపించి ప్రపంచంలోనే సంచలనం సృష్టించారు. 125 కోట్ల మంది ఫేస్‌బుక్ చూస్తారట నిజంగానే ఇది చరిత్ర రా అబ్బాయి’’
    ‘‘అది కాదు నేను చెప్పేది విను. వాడి సంస్థను వాడు కారు షెడ్డులో ప్రారంభిస్తే నాకేం ఇరానీ హోటల్‌లో ప్రారంభిస్తే నాకేం కానీ నేను చెప్పేది ఫేస్‌బుక్ ఓనర్ గురించి కాదు. ఫేస్‌బుక్‌ను ఉపయోగించి కొత్త చరిత్రను సృష్టిస్తాను దాని గురించి చెబుతున్నాను. ’’
    ‘‘కాస్త వివరంగా చెప్పు’’
    ‘‘నీకీ రహస్యం తెలుసా? నెహ్రూ, జిన్నా, ఫరూఖ్ అబ్దుల్లా ముగ్గురు దగ్గరి బంధువులు. వేలువిడిచిన మేనమాట, పినతల్లి చిన్నత్త కొడుక్కు తాత అవుతాడన్నమాట ’’


    ‘‘నిజమా? నెహ్రూ హిందువు, జిన్నా, అబ్దుల్లా ముస్లింలు బంధువులు ఎలా అవుతారు. అయినా ఇలాంటి తిక్క విషయాలు నీకెవడు చెప్పాడురా?’’
    ‘‘ఫేస్‌బుక్, వాట్సప్‌లలో ఇలాంటి అద్భుతమైన చరిత్రను ఇంకా ఎంతో చదవ వచ్చు బాబాయ్. అందుకే నాకీ చరిత్రపై నమ్మకం లేదు. సామాజిక మాధ్యమాల్లో నేను సరికొత్త చరిత్ర రాస్తాను. తింగరి బుచ్చయ్య తాతకు నివాళిగా చరిత్ర పాఠాలు రాస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడతాను, ఫేస్‌బుక్‌లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తా ’’
    ‘‘ బాగా ఎదిగిపోయావురా అబ్బాయ్... ఆయనెవరో నదులను నేనే అనుసంధానం చేశాను, ఇక సముద్రాలను అనుసంధానం చేయడమే తరువాయి అని చెబుతుంటే... నువ్వేమో ఏకంగా చరిత్రనే హైజాక్ చేసేస్తున్నావు’’
    ‘‘ ఆధారాలు చూపిస్తే, మేం పట్టించుకోం. మేం రాసే చరిత్రను అంగీకరించేవారే మా చరిత్ర గ్రూపులో ఉండాలి. ’’


    ‘‘ విజయం సాధించిన వాడు చెప్పిందే చరిత్ర అని నిన్నటి మాట. సామాజిక మాధ్యమాలు చూశాక ఎవడి చరిత్ర వాడిదే అనిపిస్తోంది. ఎవరి ఆత్మకథ వాళ్లు రాసుకున్నప్పుడు ఎవరికి తోచిన చరిత్ర వాళ్లు రాసుకుంటే వద్దనెదేముంది. వీటికి ఆత్మ చరిత్ర అని పేరు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది!

    13, సెప్టెంబర్ 2015, ఆదివారం

    కుక్క కరిచింది!

    బ్రేకింగ్ న్యూస్
    ‘‘రాణీ... కుక్క ఒకేసారి ఏకంగా ఏడుగురిని కరిచింది’’
    ‘‘థ్యంక్స్ రఘు ఈరోజు పెద్దవార్తలేమీ లేవు. తొందరగా లైవ్‌లోకి వచ్చేయ్’’
    ‘‘బ్రేకింగ్ న్యూస్...కెసిఆర్ ఇంటికి 28 కిలో మీటర్లు, హైటెక్ సిటీకి 31 కిలో మీటర్లు, అమరావతికి నాలుగు వందల కిలో మీటర్ల దూరంలోని కుషాయిగూడలో పిచ్చి కుక్క విచక్షణా రహితంగా 18 మందిని కరిచింది. పూర్తి వివరాలు మా రిపోర్టర్ రఘును అడిగి తెలుసుకుందాం’’
    ‘‘ రఘూ... కుక్క కరవడంపై ఏమంటున్నారు’’
    ‘‘ఒకేసారి 18 మందిని పట్టపగలు అందరూ చూస్తుండగా కరవడం వెనుక అంతు చిక్కని కుట్ర ఏదో ఉందనే అనుమానం రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు రాణి’’


    ‘‘ రఘూ...రాజకీయ నాయకులు ఎవరైనా స్పందించారా?’’
    ‘‘విప్లవ ప్రతిఘాతక శక్తులు బరితెగించారు అనడానికి కుక్క కరవడమే సాక్ష్యం. ఆరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని కుక్క కాట్లతో విప్లవాన్ని ఆపలేరు.’’ అని విప్లవ్‌కుమార్ ఆవేశంగా ప్రకటించాడు రాణీ. స్థానిక ప్రముఖ నాయకుడు గన్నయ్య మాట్లాడుతూ దామాషా ప్రకాఠం కరవాలి కానీ మా సామాజిక వర్గం వాళ్లను ఎక్కువ మందిని కరిచింది. ఇందులో కుట్ర దాగుంది. సాక్షాలను తారు మారు చేసే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేసి సిబిఐ విచారణకు ఆదేశించాలి.’’
    ‘‘రఘూ... రాష్ట్రాలను కుదిపేసిన ఈ సంఘటనపై మన స్టూడియోలో ఉన్న విశే్లషకుల అభిప్రాయాలు తెలుసుకుందాం. ముందుగా ప్రముఖ రిటైర్డ్ మేధావి మేదయ్య అభిప్రాయం’’


    ‘‘అరవడం మనిషి లక్షణం, కరవడం కుక్క లక్షణం. ప్రత్యేక పరిస్థితుల్లో మనుషులు కరుస్తారు, కుక్కలు అరుస్తాయి. మానవ నాగరికత అభివృద్ధి చెందుతున్న దశలో కక్కలు, మనుషులు కలిసే అరిచేవారు, కరిచే కరిచేవారు. మనిషి ఆహారాన్ని వేటాడే దశలో అతనికి కుక్కలు తోడుగా ఉండేవి. నాగరికత అభివృద్ధి చెందిన తరువాత సామాజిక వర్గాలు, మతం ఏర్పడిన తరువాత కుక్కల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి తమ జాతిపై మనుషులు సాగిస్తున్న అమానుషత్వానికి ప్రతీకారంగానే ఆ కుక్క మనుషులపై దాడి చేసి కరిచింది. ఆ కుక్క నా దృష్టిలో విప్లవ వీరుడు. ఏ జాతిలోనైనా ముందు ఒకే ధిక్కార స్వరం వినిపిస్తుంది. ఆ తరువాత ఆ స్వరాన్ని ఇతర స్వరాలు అనుసరిస్తాయి. మనం అన్ని కోణాల్లో ఈ అంశాన్ని పరిశీలించాలి. ఒక వేళ ఆ కుక్క అసంకల్పితంగా తిరుగుబాటు జరిపితే దానిలో హిందుత్వ వాదుల కుట్ర లేకపోలేదు. హిందూ శక్తులు ఆ కుక్కను ఉసిగొల్పి కరిపిస్తున్నాయేమో అనే కోణంలో పరిశోధన సాగించాల్సిన అవసరం ఉంది. నేనీ మాటను ఆషామాషిగా చెప్పడం లేదు. ఆ కుక్క నలుపు రంగులో ఉంది. అక్కడక్కడ తెలుపు మచ్చలు కనిపిస్తున్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ కుక్క మీసాల్లో కాషాయ రంగులో ఉన్న వెంట్రుక ఒకటి కనిపిస్తుంది. కుక్క మూతితోనే కరుస్తుంది. అంటే కాషాయ రంగు వెంట్రుక ప్రభావం ఆ కుక్క చర్యలో ఉందని చెప్పడంలో నాకు సందేహం లేదు. ’’


    ‘‘రాజకీయ జీవి గారు ఈ సంఘటనను మీరెలా చూస్తున్నారు.’’
    ‘‘మీరో కీలకమైన విషయాన్ని మరిచిపోతున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేనప్పుడే ఈ సంఘటన జరిగిందంటే యాదృచ్చికం అని భావించలేం. బలమైన సాక్ష్యాన్ని సిద్ధం చేసుకొని రాజకీయ కుట్రలో భాగంగానే ఇది జరిగి ఉంటుంది. స్టూడియోలో చర్చకు రాక ముందే కూషాయ గూడాలో కుక్క కాటుబారిన పడ్డవారి వివరాలు సేకరించాను. సామాజిక వర్గాల వారిగా బాధితుల సంఖ్యను చూస్తే రాజకీయ కారణం అనిపిస్తోంది. మా పార్టీకి అండగా నిలిచే సామాజిక వర్గం వారినే ఎక్కువ మందిని కరిచింది. మమ్ములను కరిచే కుక్కలను మేం తిరిగి కరుస్తాం. కరవడం అంటూ మొదలు పెడితే కుక్కలు మిగలవని గ్రహించాలి. పులితో ఫోటో దిగాలనుకో పరవా లేదు కానీ చనువిచ్చింది కదా అని పులిని కరవాలనుకుంటే కుక్క అనే కనికరం కూడా లేకుండా తిరిగి కరిచేస్తాం.’’
    ‘‘తటస్థులు గారు అందరి అభిప్రాయాలు విన్నారు కాదా దీనిపై మీరేమంటారు’’


    ‘‘ ఈ దేశంలో దురదృష్టకరమేమంటే అంతా తమ తమ పార్టీల కోణంలోనే సమస్యను చూస్తున్నారు. సమస్యను సమస్యగా చూడడం లేదు. ఇప్పుడున్న పార్టీలన్నీ కుక్కలను రెచ్చగొట్టి మనుషులను కరిపిస్తున్నాయి. కొత్త పార్టీ రావలసిన అవసరం ఉంది అని మొన్నటి వరకు నేను పని చేసిన పార్టీ నన్ను బయటకు పంపిన తరువాత నేను గ్రహించిన విష యం’’
    ‘‘రఘూ... విన్నావు కదా! ఇంతకూ విచక్షణా రహితంగా మనుషులను అలా ఎందుకు కరవాల్సి వచ్చిందో ఆ కుక్కతో మాట్లాడించు’’
    ‘‘ రాణీ... కుక్క కరవడంపై మనం ప్రసారం చేసిన వార్త దేశంలో సంచలనం సృష్టిస్తోంది. ప్రధాన మంత్రి కార్యాలయం దీనిపై వివరాలు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కుక్కలను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ రాష్ట్రప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని వివిధ పార్టీల ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసింది. రాష్టప్రతిని, అమెరికా అధ్యక్షుడిని కలిసేందుకు వేరువేరు బృందాలు బయలు దేరి వెళ్లాయి రాణీ. అసలెందుకు కరిచిందో మనం కుక్కను అడిగిత తెలుసుకుందాం.


     కుక్కగారూ మీరెందుకు..... ’’
    కెవ్వు కేక
    ‘‘రఘూ... ఏమైంది .. రఘూ...మాట్లాడండి’’


    ‘‘హాలో నేను దారిన పోయే దానయ్యనండి. మీ రిపోర్టర్‌ను కుక్క కరిచింది. కెవ్వుమని అరిచి పడిపోయాడండి. మాట్లాడలేడు. మీ రిపోర్టర్ నాకు బాగా తెలుసండి. ఆ కుక్క వాడి పెంపుడు కుక్కే. ఈ రోజు వార్తలేమీ లేక తన పెంపుడు కుక్క కరవడంపైనే స్టోరీ చేశాడు. తనను అడ్డం పెట్టుకుని ఇంత రాజకీయం చేయడం చూశాక ఆ కుక్కకు పిచ్చెక్కి మీ రిపోర్టర్‌ను కరిచేసింది. ఇప్పుడు, మీ స్టూడియో వైపేపరిగెత్తుకు  వస్తోంది జాగ్రత్తండి ’’

    6, సెప్టెంబర్ 2015, ఆదివారం

    మన కాలం యద్భావం తద్భవతి


    ‘‘మొన్నటి దాక ఒక మాటన్నవాళ్లు ఇప్పుడు మాటమార్చి మరో మాట అంటున్నారు. ఈ పెద్దల మాట అస్సలు అర్థం కాదు  ’’
    ‘‘ఏంటో ఇప్పుడు పెద్దలతో నీకొచ్చిన సమస్య’’
    ‘‘గురువు గారూ నా సందేహానికి నాన్చకుండా సూటిగా సమాధానం చెప్పండి. ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టమా? లాభమా? ’’
    ‘‘ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఈ సందేహం నీకెందుకొ చ్చింది? నువ్వు తెలంగాణకు చెందిన వాడివా? ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాని వా? రాయలసీమనా? ఉత్తరాంధ్రనా? రాజధాని జిల్లాలా? అధికార పక్షమా? విపక్షమా? ’’


    ‘‘గురువు గారూ నేనడిగిన సందేహానికి మీరడిగిన ప్రశ్నలకు ఏమైనా సంబంధం ఉందా? ’’
    ‘‘ముందు సమాధానాలు చెప్పు తరువాత సంబంధం ఉందో లేదో నేను చెబుతాను. ప్రత్యేక హోదా వల్ల లాభం నష్టం ఏదనుకుంటే అదే. యద్భావం తద్భవతి అంటూ సీరియస్‌గా మేధోముఖం పెట్టి వెళ్లిపోతే సరిపోతుంది. వివరంగా చెప్పాలంటే నేనడిగిన వివరాలు చెప్పాలి ’’
    ‘‘మొన్నటి వరకు ఒక్కో చానల్ ఒక్కో నటుణ్ణి అద్దెకు తీసుకుని మరీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు సాగించాయి కదా! హఠాత్తుగా అధికార పక్షంతో పాటు మీడియా ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రకు లాభం కన్నా నష్టం ఎక్కువ అని చెబుతుంటే గందరగోళంలో పడిపోయాను. ప్రత్యేక హోదా వల్ల నష్టమే అయితే జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు, వెంకయ్యనాయుడు లాంటి మహానేత పార్లమెంటులో అప్పటి అధికార పక్షం మెడలు వంచి ప్రత్యేక హోదా ఎందుకు సాధిస్తారు. నష్టం అయితే దేశంలోని అనేక రాష్ట్రాలు మాకూ ప్రత్యేక హోదా కావాలని ఎందుకు ఆందోళన చేస్తాయి? సరిహద్దు రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక హోదా ఎందుకు కల్పిస్తుంది? అవన్నీ సరే ఆంధ్ర ప్రయోజనాల కోసం నిరంతరం తపిస్తున్నామనే మీడియా ఆంధ్రకు ప్రత్యేక హోదా లేకపోతే ఊపిరి ఆగిపోతుందని వాళ్లే చెప్పి ఇప్పుడు వాళ్లే దీని వల్ల నష్టం అంటున్నారు. అదే అర్ధం కావడం లేదు.’’


    ‘‘ఇంతకూ నువ్వేమనుకుంటున్నావో చెప్పు? లాభమా? నష్టమా? ’’
    ‘‘ సూపర్ స్టార్ కృష్ణ డ్యాన్సులు చేసేందుకు ఆ కాలంలో ఎంత కష్టపడేవారో వేషాలు లేని నట శివాజీ టీవి కోసం ఆవేశాన్ని తెచ్చిపెట్టుకోవడానికి అంత కన్నా ఎక్కువ కష్టపడి ప్రత్యేక హోదా డిమాండ్ చేసినప్పుడు ప్రత్యేక హోదా కావలసిందే అనిపించింది.
    ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రకు ఎంత నష్టమో ఇప్పుడు మీడియా సామూహికంగా చెబుతుంటే కొంపదీసి ప్రత్యేక హోదా వచ్చేస్తుందా? అని భయం కూడా వేస్తోంది. ’’
    ‘‘యద్భావం తద్భవతికి కొనసాగింపు స్థితి అన్నమాట ఇది.’’
    ‘‘ ఎలా?’’
    ‘‘ మహాభారతం చదివావా? రామాయణం విన్నావా? ’’
    ‘‘ గురువుగారూ మీరు నన్ను అవమానిస్తున్నారు. మతాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్నవాళ్లు ఆ కథలు వినకుండా ఉంటారా? చెవిటి వాళ్లు తప్ప.. రంగనాయకమ్మ కూడా ఆమూలాగ్రం చదివిన తరువాతనే కదా? విషవృక్షాన్ని ఎక్కింది. ’’
    ‘‘మహాభారతంలో, రామాయణాల్లో హీరో ఎవరో చెప్పు ?’’
    ‘‘మహాభారతంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా శ్రీకృష్ణుడిని మించిన హీరో లేరు. తండ్రి మాటను జవదాటని మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు ఏ కాలానికైనా హీరోనే కదా? ’’
    ‘‘ ఈ నిర్ణయానికి నువ్వు ఫిక్స్ అయి పోయావా? ’’
    ‘‘ ఫిక్సున్నర ఫిక్స్ అయిపోయాను. లాక్ చేసేయండి. ’’
    ‘‘ నేనేమడిగినా ముందు దానికి సమాధానం చెప్పు, ఎదురు ప్రశ్నించకు, దానవీర శూరకర్ణ చూశావా? రావణుడిగా ఎన్టీఆర్ న భూతో నభవిష్యత్ అనిపించేట్టుగా నటించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి చూశావా?’’
    ‘‘గురువు గారూ మీరు నన్ను మళ్లీ అవమానిస్తున్నావు. ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్టీఆర్ నటనలో జీవించిన డివికె సినిమాను చూశావా అని అడుగుతున్నారా? ఎన్నిసార్లు చూశావు అని అడిగాలి. ఏమంటివేమంటివి? డైలాగులు చెప్పమంటావా? ’’


    ‘‘ వద్దులేవోయ్ ప్రతి డైలాగు నాకూ కంఠతా వచ్చేసింది. ఇప్పుడు చెప్పు ఆ సినిమాలు చూసినప్పుడు నీకు హీరో ఎవరనిపించింది? ’’
    ‘‘ దుర్యోధుడికి అన్యాయం చేశారు, అంతా కలిసి వెన్నుపోటు పొడిచారు కానీ నిజంగా మహాభారతంలో హీరో అతనే. ఆ రాజసం, ఆత్మవిశ్వాసం అబ్బో హీరో అంటే దుర్యోధనుడే ఇందులో అనుమానమే లేదు. ఇక రావణుడిగా ఎన్టీఆర్ నటించిన సినిమాలన్నీ నభూతో న భవిష్యత్ అంటే నమ్మండి. హీరో అంటే రావణుడే. సీతను వదిలేస్తే, రాజ్యం దక్కేది. ఆత్మ గౌరవం కోసం ప్రాణాలైనా వదిలాడు కానీ లొంగిపోలేదు. హీరోయిజం అంటే అది. అన్నా దమ్ముళ్ల మధ్య చీలిక తెచ్చి లంక రహస్యాలు తెలుసుకుని శ్రీరాముడు విజయం సాధించాడు కానీ.. ఓడినా సరే రావణుడిలా ఉండాలనిపించింది ఎన్టీఆర్ రాజసం ఉట్టేపడే విధంగా రావణుడి పాత్రలో చూసినప్పుడు ’’
    ‘‘అదేంటోయ్ ఇంతకు ముందే శ్రీకృష్ణుడు, శ్రీరాముడే హీరోలన్నావు, ఇప్పుడు ప్రతి నాయకులను హీరోలంటున్నావు. ఇదే యద్భావం తద్భవతి రెండవ దశ. రామాయణం, మహాభారతం అసలు రచయితలు రాసింది ఒక్కసారే. కానీ దాన్ని చూసే వారి దృష్టిమారింది. కొత్త కొత్త కోణాల్లో రాసేశారు. వ్యాసుడు, వాల్మీకి వారిని హీరోలుగా చూపించినప్పుడు నీకు హీరోలుగా కనిపించారు. అదే కథను ఎన్టీఆర్ విలన్లను హీరోలుగా మార్చి చూపిస్తే నీకు విలనే్ల హీరోలుగా కనిపించారు. అంటే నీవు ఎది అనుకుంటే అదే జరుగుతుంది అనేది నాటి పెద్దల మాట. నువ్వు ఏది అనుకోవాలో ఈనాటి పెద్దలు నిర్ణయిస్తారు. అదే యద్భావం తద్భవతి రెండో దశ. 


    హిట్లర్ ప్రపంచానికి కిరాతకుడిగా కనిపిస్తే చార్లీ చాప్లిన్‌కు కమెడియన్‌లా కనిపించారు. అన్నగారు అటువైపు దృష్టిసారించలేదు కానీ వేలాది సంవత్సరాల నుంచి విలన్లుగా చూస్తున్న దుర్యోధనుడు, రావణుడిని హీరోలుగా చూపినప్పుడు హిట్లర్‌ను ప్రపంచ హీరోగా చూపడం ఓ లెక్కా ? ఎన్టీఆర్ లాంటి సినీ వాలా , మన లాంటి మహా మీడియా జర్మనీకి ఉంటే హిట్లర్ ను అ విశ్వ దైవం గా చూపించే వారు .. ఇప్పుడర్ధమైందా? దేన్నయినా నువ్వు ఎలా చూడాలో పెద్దలు నిర్ణయిస్తారు. ప్రత్యేక హోదా అయినా మరోటైనా వాళ్లు ఎలా చూపాలనుకుంటే నువ్వు అలా చూడాలి అంతే ....

    4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

    రిజర్వేషన్ ల సమస్యకు రాజకీయ పక్షాల నుంచి పరిష్కారం సాధ్యమా ?







    గుజరాత్‌లో పటేళ్ల ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, గుజ్జర్ల ఉద్యమం, ఢిల్లీలో నిర్భయ ఉద్యమం, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం. వీటిలో ఒక్క తెలంగాణ మాత్రం లక్ష్యాన్నిసాధించే వరకు    ఉద్యమించి విజయం సాధించింది. మిగిలిన ఉద్యమాలు ఉవ్వెత్తున లేచాయి. కొంత కాలానికి చల్లబడ్డాయి. కొన్ని నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. దేశంలో మోదీ హవా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ గాలి సైతం ఈ కోవలోనిదే. ఈ ఉద్యమాలన్నీ ఒకదానికొకటి ఏ మాత్రం సంబంధం లేకపోవచ్చు. కానీ సమాజంలో తీవ్రమై అసంతృప్తి ఉందని, ప్రస్తుత పరిస్థితి పట్ల ప్రధానంగా దేశ యువత అసంతృప్తితో రగిలిపోతోంది అనే దానికి ఈ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమాలే కారణం. 

    అతని వయసు 22 ఏళ్లు కనీసం ఉద్యోగానికి కూడా ఎంపిక కాలేదు. కానీ దేశం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షిస్తున్నాడు. అతనేమీ వివేకానందుడు కాదు, దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టే విధంగా వీరోచిత కార్యమేమీ చేయలేదు. గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లను కోరుతూ అతను సాగిస్తున్న ఉద్యమాన్ని రెండేళ్ల క్రితం దేశాన్ని ఊపేసిన మోదీని సైతం వణికించేసింది.
    పటేళ్లు గుజరాత్‌లో ఆర్థికంగానే మంచి స్థితిలో ఉన్న వర్గం. తమకు రిజర్వేషన్లు కావాలని ఉద్యమిస్తున్నారు. రాజస్థాన్‌లో గుజ్జర్లు ఉధృతంగా రిజర్వేషన్ల కోసం ఉద్యమించినా అది రాజస్థాన్ సమస్యగానే మీడియా చూసింది. కానీ పటేళ్ల ఉద్యమం గుజరాత్‌కే పరిమితం అయ్యేట్టుగా కనిపించడం లేదు. అలా అని పటేళ్ల ఉద్యమం వల్ల అన్ని రంగాల్లో ముందున్న ఆ వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తారని అనిపించడం లేదు. గుజరాత్‌లో పటేళ్ల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న 22 ఏళ్ల హార్దిక్ పటేల్ మాటలు చూసినా, ఉద్యమ పోకడ గమనించినా నిజానికి అది పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో కాకుండా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం అనిపిస్తోంది.

     దేశంలో 95శాతం మంది పేదలే ఉన్నారు, పేదలందరికీ రిజర్వేషన్లు కల్పించాలని అనేది హార్దిక్ పటేల్ డిమాం డ్. అందరికీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయడం, రిజర్వేషన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేయడం రెండింటి అర్ధం ఒకటే.
    తాను దేశమంతటా పర్యటిస్తానని, అన్ని రాష్ట్రాల్లోని పటేళ్లు తమ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారని పటేల్ చెబుతున్నాడు. 27 కోట్ల మంది మద్దతు కూడగడతానని అంటున్నాడు. మరో వైపు ఇదే సమయంలో ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని వామపక్షాలు సదస్సులు ప్రారంభించినా పెద్దగా ఎవరి దృష్టిని ఆకర్షించలేదు. స్వాతంత్య్రం సిద్ధించిన ఆరున్నర దశాబ్దాల తరువాత కూడా తమను వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చాలని రోజు రోజుకు డిమాండ్లు పెరగడం విశేషం. ప్రస్తుతం తెలుగునాట రిజర్వేషన్లపై ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బిసి రిజర్వేషన్లను ముట్టుకుంటే సహించేది లేదని బిసి సంఘాలు హెచ్చరిస్తే, ఓసి సంక్షేమ సంఘం రిజర్వేషన్లపై గుజ్జర్లు, పటేళ్లు, జాట్‌లతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించడానికి సిద్ధమయింది. అన్నా హజారే ఉద్యమంలా ఉవ్వెత్తున ఎగిసిపడి తాత్కాలిక ప్రయోజనంతో పటేళ్ల ఉద్యమం చప్పపడి పోవచ్చు. ఈ ఉద్యమం వెనుక ఎవరి లక్ష్యాలు వారికి ఉండవచ్చు. కానీ పటేళ్ల ఉద్యమ ప్రభావం దేశంలో యువతపై అంతో ఇంతో పడుతోందనేది మాత్రం వాస్తవం. 
    తెలంగాణ ఉద్యమ సమయంలో బలమైన అంశం ఉంది  మైదానం ఖాళీగా ఉంది, నాయకత్వం వహించేవారే కరువయ్యారు. ఆ విషయా న్ని సరిగ్గా గుర్తించిన కెసిఆర్ ఆ స్థానాన్ని భర్తీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు రిజర్వేషన్లపై ఉద్యమానికి సరిగ్గా అదే విధంగా మైదానం ఖాళీగా ఉంది. దేశ వ్యాప్తంగా బలమైన అంశం ఉంది ,,, నాయకత్వం వహించే వారే లేరు .. ఇప్పుడు కావలసింది వారే . అయితే అదంత సులభం కాదు. ఏ రాజకీయ పార్టీ ఈ ఉద్యమానికి నేరుగా మద్దతు ప్రకటించదు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే అన్ని వర్గాల ఓట్లు అవసరం. ఏదో ఒక పార్టీ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమానికి మా మద్దతు అని ప్రకటిస్తే, ఆ పార్టీ తన మరణ శాసనాన్ని తానే రాసుకున్నట్టే. నిజానికి దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న కీలక నేతలు వ్యక్తిగతంగా రిజర్వేషన్లను వ్యతిరేకించే వారే కావచ్చు. రిజర్వేషన్ ల వల్ల నష్ట పోతున్నాము అని భావించే సామాజిక వర్గాలకు చెందిన  వారె..  కానీ ఏ ఒక్కరూ కూడా ఆ మాట పైకి చెప్పరు. హార్దిక్ పటేల్ దేశంలో ఎంతో మంది నాయకుల పేర్లు చెప్పి వీళ్లంతా తమ వర్గమే అని చెబుతున్నా, వాస్తవానికి ఒక్క నాయకుడు కూడా బహిరంగంగా మద్దతు ప్రకటించరు.
    దేశంలో రిజర్వేషన్ల అంశం చిత్రమైన సమస్యగా మిగిలిపోయింది. పదేళ్ల కోసం అని తొలుత రిజర్వేషన్లను ఏర్పాటు చేశా రు. చివరకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కరే స్వయంగా రిజర్వేషన్లు తాను ఆశించిన ప్రయోజనాన్ని చేకూర్చలేక పోయాయని, కొద్ది రోజుల్లోనే గ్రహించారు. రిజర్వేషన్ల వ్యవహారాన్ని ముట్టుకుంటే ఏ పార్టీ అయినా మాడిమసైపోతుంది .అం దుకే ప్రస్తుత విధానం పట్ల ఎవరూ సంతృప్తికరంగా లేకపోయినా ఈ విధానానే్న కొనసాగించేందుకే అన్ని పార్టీలు మొగ్గు చూపుతాయి. ఆరున్నర దశాబ్దాల తరువాత కూడా రిజర్వేషన్లపై సమీక్షకు రాజకీయ పక్షాలు సాహసించడం లేదు కానీ రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన అర్థదశాబ్దం లోపై బిఆర్ అంబేద్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్లతో తాను ఊహించిన ప్రయోజనం కలగలేదని, ఏ వర్గాలైతే రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం పొందారో వారు మిగిలిన తమ వారికి చేయూత నిస్తారని ఆశించానని అలా జరగలేదని అన్నారు. ఇదో విచిత్రమైన సమస్య, పరిష్కరించడానికి ఎవరూ సాహసించని సమస్య. పరిష్కరించడం మాట అటుంచి సమస్యను గుర్తించినట్టు ప్రకటిస్తే చాలా రాజకీయంగా సమాధి అవుతారు.అందుకే అందరికీ తెలిసిన సమస్యపై రాజకీయ పక్షాలు వౌనంగానే ఉంటాయి.
    ఈ దేశంలో ఇప్పుడు ఒకటి కాదు అనేక దేశాలు ఉన్నాయి. సంపన్న భారత దేశం, పేద భారత దేశం. ఈ రెండే కాదు రిజర్వేషన్లు పొందే పౌరుల దేశం, రిజర్వేషన్లు లేని వారి దేశం. రిజర్వేషన్లు లేని వారు అసంతృప్తి వ్యక్తం చేయడం సహజమే. కానీ రిజర్వేషన్లు పొందే వర్గం సైతం అసంతృప్తితోనే ఉంది. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని, ప్రస్తుత విధానం వల్ల తాము నష్టపోతున్నామని ఎంఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఉద్యమం జరిగింది. ఎస్టీలు సైతం వర్గీకరణ కోరుతూ కొద్దిమేరకు ఆందోళ చేశారు. ఇక బీసీల్లో కొత్త కులాలను చేర్చాలని కొందరు ఉద్యమిస్తుంటే, కొత్త కులాలను చేర్చితే సహించేది లేదని మరి కొన్ని కులాల ఆందోళన. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల సమయంలో టిడిపి హామీ ఇస్తే, మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టిఆర్‌ఎస్ హామీ ఇచ్చింది. మైనారిటీ రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు కానీ బీసీల్లో చేరిస్తే ఒప్పుకోమని బీసీ నాయకులు తెగేసి చెప్పారు.
    దేశ వ్యాప్తంగా రిజర్వేషన్లపై ఇలాంటి అసంతృప్తే. ఈ అసంతృప్తి నుంచి పుట్టిందే పటేళ్ల ఉద్యమం. పైకి పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్యమమే అయినా అసలు లక్ష్యం మాత్రం రిజర్వేషన్లకు వ్యతిరేక ఉద్యమం. దేశంలో 95శాతం పేదలే ఉన్నారు, పేదలందరికీ రిజర్వేషన్లు కల్పించాలి అంటూ పటేళ్లు ఉద్యమిస్తున్నారు. అందరికీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయడం అంటే పరోక్షంగా రిజర్వేషన్లును తొలగించాలని డిమాండ్ చేయడమే. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఒకవైపు డిమాండ్ చేస్తూనే మరోవైపు రిజర్వేషన్ల వల్ల ఎంతగా నష్టపోతున్నారో ఉద్యమ కారులు వివరిస్తున్నారు. పటేళ్ల ఉ ద్యమం వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందని కొందరు ఆరోపిస్తూంటే, ఆప్ నేతల హస్తం ఉందని భాజపా వర్గీయుల ఆరోపణ. పార్టీల కన్నా రిజర్వేషన్ల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే 22ఏళ్ల యువకుడు హార్దిక్ పటేల్ ఉద్యమానికి కారణం. ప్రజల్లో వ్యతిరేకత లేనప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీ తెర వెనుక ఉండి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఉంటే జనం నుంచి ఇంత స్పందన ఉండదు.
    గుజరాత్ నుంచి మోదీ దేశాన్ని ఒక ఉర్రూత లూగిస్తే, ఏడాదిలోనే అదే గుజరాత్ నుంచి పటేళ్ల ఉద్యమం మోదీని సైతం కలవరపెడుతోంది. మహాత్మాగాంధీకి పోటీగా పటేల్‌ను రంగంలోకి దించడానికి నరేంద్ర మోదీ ఐక్యతకు చిహ్నాంగా పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అదే పటేళ్లు మోదీకి సవాల్‌గా మారారు. రాజకీయ పార్టీలు లేని ఉద్యమం ఎక్కువ రోజులు నిలువదు. రిజర్వేషన్లపై జనంలో ఉన్న అసంతృప్తి చల్లారదు, అలా అని ఉద్యమం తమ లక్ష్యాన్ని చేరుకునే అవకాశమూ లేదు. ఆరు ఆరున్నర దశాబ్దాల తరువాతైనా రిజర్వేషన్లపై సమీక్ష జరపాల్సిన అవసరం ఉంది. సమీక్షించడం అంటే తొలగించడం అని భావించాల్సిన అవసరం లేదు. మంచి చెడులు సమీక్షించుకుని మరింత మెరుగ్గా అమలు చేసుకోవడం కోసమైనా సమీక్షించుకోవచ్చు. రిజర్వేషన్లు పొందుతున్న వారు, పొందని వారు ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవలసిన పరిస్థితిని తప్పించడం కోసమైనా ఆలోచించాలి.

     కానీ రాజకీయ పక్షాలు ఆ పని చేయడానిక సాహసించవు. సాధారణంగా ఎక్కడైనా చిన్న సమ స్య ఉన్నా రాజకీయ పక్షాలు అక్కడ వాలిపోతాయి. సమస్య లేకున్నా సృష్టించి వాలిపోతాయి. కానీ దేశాన్ని కుదిపేస్తున్న రిజర్వేషన్ల సమస్యను రాజకీయ పక్షాలు అసలు సమస్యగానే గుర్తించడం లేదు. గుర్తిస్తే తమ ఉనికికే ప్రమాదం. రిజర్వేషన్ల తేనె తుట్టెను కదిపే సాహసం చేయలేరు, ప్రభు త్వ రంగాన్ని క్రమంగా నిర్వీర్యం చేయడమే దీనికి పరిష్కారం అని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉందనేది కొందరి వాదన. రిజర్వేషన్ల సమస్యకు కాలమే సమాధానం చెబుతుంది కానీ రాజకీయ పక్షాల నుంచి  ఈ సమస్యకు పరిష్కారం ఆశించలేం.-

    మళ్లీ రిజర్వేషన్ చిచ్చు

    • - బుద్దా మురళి
    •  
    • 04/09/2015