26, జూన్ 2013, బుధవారం

తెలుగునాట కొత్త జబ్బు

‘‘నా జీవితం అన్యాయం అయిపోయింది. ఆ నూజివీడు సంబంధం ఒప్పుకున్నా జీవితం బాగుండేది. బందరు సంబంధం నా కొంప కూల్చింది ’’ అంటూ ఆమె బిగ్గరగా ఏడుస్తోంది. ఏంటీ అంతా అయిపోయిందా? అని వీరేశం కంగారుగా అడిగాడు. ‘‘మీ బావ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఒక్క మాటకు పొంతన ఉండడం లేదు. అప్పుడే ఒక నాయకుడిని ఆకాశానికెత్తేస్తాడు, మరుక్షణమే వాడంత అధ్వాన్నమైన నాయకుడు భూ ప్రపంచంలో లేడంటాడు. రాజకీయ నాయకుడు కనీసం తానన్న మాటకు ఒక పూటైనా కట్టుబడి ఉంటాడు. కానీ బావ మాత్రం కనీసం ఒక నిమిషం కూడా కట్టుబడి ఉండడం లేదు. ఏం పాడురోగమో ఏమో అర్ధం కావడం లేదు’’ అని అక్క  వాపోయింది.

 ‘‘ఏరా వీరేశం ఇప్పుడేనా రాక. రా.. రా.. మీ అక్క ఒట్టి అమాయకపు మా లోకం. ఏదేదో ఊహించుకుని కంగారు పడుతున్నది. లోపలికి రా! ’’ అని బావ ఆహ్వానిస్తే విస్తుపోవడం వీరేశం వంతయింది. 

చక్కగా ఉన్న వీరేశాన్ని చూశాక, కొంపదీసి అక్కకే ఏమైనా అయిందా అని వీరేశం అనుమానించాడు. కొద్దిసేపు ఆగు మీ బావ రోగం నీకే అర్ధమవుతుంది అని అక్క చెప్పింది.
 వీరేశం బావనే నిశితంగా గమనిస్తూ, ‘‘ఏం బావా రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఏ పార్టీ గెలుస్తుందేమిటి?’’ అంటూ టీవి అన్ చేశాడు.

 ‘‘సంజీవిని పర్వతాన్ని హనుమంతుడు ఒంటి చేత్తో మోసుకెళ్లినట్టు ఈ రాష్ట్రాన్ని ఒంటి చేత్తో మోసే సత్తా మా తెలుగు నాయకుడు ఒక్కడికే ఉంది. ఈ రాష్ట్రానికి తెలుగునేతే దిక్కు’’ ఈ మాటలు వినగానే వీరేశం ఆశ్చర్యపోయాడు. బావ బిజెపి అభిమాని కదా ఇలా అయిపోయాడేమిటని అనుకుంటుండగానే ... ‘‘సింహాన్ని బోనులో బంధించి చిట్టెలుకలు హీరోల్లా ఫోజు పెడుతున్నాయి. దమ్ముం టే జైలు నుంచి విడుదల చేసి అప్పుడు చూడండి. జైలులో ఉన్నా బయట ఉన్నా సింహం సింహమే. ఓదార్పు స్పెషలిస్టును ఓదార్పుకు దూరం చేయడానికి కాంగ్రెస్, టిడిపి కలిసి కుట్ర పన్నాయి. జగనన్న రాజ్యం వస్తుంది’’ అంటూ బావ ఆవేశంగా ఊగిపోసాగాడు. వీరేశం కంగారు పడి బావా బావా అంటూ భుజం చరిచాడు. 

బావ ఒక్క క్షణం ఆగి ‘‘వంద అసెంబ్లీ, 15 పార్లమెంటు సీట్లు గెలుస్తాం, తెలంగాణ సాధిస్తాం. ఆంధ్ర పార్టీలు, ఆంధ్ర నాయకుల అవసరం ఇక మాకు లేదు... లేనే లేదు.. జై తెలంగాణ’’ అంటూ అరిచాడు. ‘‘అదేంటి బావా కొందరు మతం మార్చుకున్నట్టు నువ్వు ప్రాంతం మార్చుకున్నావా? ఏమిటి? ’’అని వీరేశం చమత్కరించాడు. ‘‘ఇంకెక్కడి తెలంగాణ ... కొందరు రాజకీయ నిరుద్యోగులు పదవుల కోసమే తెలంగాణ అంటున్నారు. జై సమైక్యాంధ్ర!’’ అంటూ బావ ఆవేశంగా ప్రారంభించే సరికి అక్క చెప్పినట్టు బావకు ఏదో అయింది అనే నిర్ణయానికి వచ్చిన  వీరేశం బావను ఎంతో మంది డాక్టర్లకు చూపించాడు.

 బావకున్న పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఆస్పత్రులను ఆకర్షిస్తోంది కానీ రోగం ఏమిటో అంతు చిక్కడం లేదు. అన్ని రకాల టెస్ట్‌లు చేయించినా ఏమీ లేదనే తేలుతోంది.

 *** 
ఇంటికి వచ్చిన తరువాత కూడా డాక్టర్ యోగేష్‌కు బావ జబ్బు ఆలోచనే పట్టిపీడిస్తోంది. టెస్టుల్లో తేలకుండా డాక్టర్లకు టెస్ట్ పెడుతున్న పేషంట్‌గా బావ మిగిలిపోయాడు. ఆలోచనల్లో మార్పు కోసం   టీవి ఆన్ చేయగానే చిన్న పిల్ల ఐ న్యూస్ చానల్‌లో ‘చల్లని కిరణాలు, మా పాలిట ఆశాకిరణాలు అంటూ పెద్ద కవిత చదువుతోంది. ముఖ్యమంత్రి ముసిముసినవ్వులు నవ్వుతున్నా యోగేష్‌కు మాత్రం చిర్రెత్తుకొచ్చింది. చానల్ మార్చగానే ఓ చానల్‌లో ‘ఇదే రోజు’ పత్రిక కనిపించింది. ఈరోజు పత్రిక వల్ల ఈ తెలుగు భక్తుడు చార్‌ధామ్ వరదల నుంచి బయట పడ్డాడు. వసుదేవుడు చిన్నికృష్ణున్ని తలపై బుట్టలో మోస్తుంటే యమునా నది దారి ఇచ్చినట్టుగా తెలుగు భక్తుడి చేతిలో ఉన్న ఇదే రోజు పత్రికను చూసి మందాకిని నది దారి ఇచ్చింది ’’ అంటూ ఆ చానల్ వాళ్లు చెబుతున్నారు. 

యోగేష్ మరో రెండు మూడు చానల్స్ మార్చి చివరకు కోపం వచ్చి టీవి ఆఫ్ చేసినప్పుడు చిన్న మెరుపుకనిపించింది. , యూరేకా అని గట్టిగా అరిచాడు. 

*** 
బావకొచ్చిన విచిత్రమైన జబ్బు ఏంటో తెలియక ప్రపంచం అంతా బుర్ర గోక్కుంటుంటే డాక్టర్ యోగేష్ ఆ వ్యాధిని కనుక్కోవడమే కాకుండా దానికి చికిత్స జరిపి బావ జీవితాన్ని కాపాడారు అని పివిఆర్ హెల్త్ చానల్‌లో వస్తోంది.

 ***
 ఈ పరిశోధనతో మీకు నోబెల్ వస్తుంది. ఈ అవార్డు మా ఆవిడకే అంకితం అని చెబుతారు కదూ అని యోగేష్‌ను వాళ్ల ఆవిడ గోముగా అడిగింది. ‘‘బావకే కాదు ఈ జబ్బు చాలా మందికి ఉంది. బావకు ముదిరింది. ఒకే చానల్ ఉన్న రోజులు కావివి. పార్టీకో చానల్ వచ్చింది. తమతమ పార్టీలకు అనుకూలంగా ఒకే విషయాన్ని ఒక్కో చానల్ ఒక్కో రకంగా చెబుతోంది. జబ్బుకు అదే కారణం ’’ అని యోగేష్ చెబుతుంటే ‘‘అలా అయితే బావకొచ్చిన జబ్బే అందరికీ రావాలి కదా? ’’ అని భార్య అడిగింది. చానల్స్‌లో వచ్చే వార్తలన్నీ నిజమే అని నమ్మే అమాయకుడు బావ.  బావ అన్ని చానల్స్ చూస్తాడు . అన్ని నిజాలే చెబుతున్నాయని నమ్ముతాడు .  దాంతో పరస్పర విరుద్ధమైన అంశాలు అతని మెదడుతో ఆడుకున్నాయి .   మిగతా వారు అలా కాదు.  కొద్ది రోజుల పాటు అన్ని చానల్స్‌ను చూడడం మానేయమని చెప్పాను ఈ చికిత్స బాగా పని చేసింది.

 కొన్ని వ్యాదులు రాకుండా ముందే వ్యాక్సిన్ వేస్తారు కదా అలానే ఈ వ్యాదికి  వ్యాక్సిన్ ఉందా ? అని ఆందోళనగా  అడిగింది . 
లేకేం.  ఉంది .  ఏ చానల్ ఏ  పార్టీ వారిదో తెలుసుకొని వార్తలు చూస్తే అది జబ్బు నివారణ వ్యాక్సిన్ గా పని  చేస్తుంది. అసలే ఎన్నికల కాలం సకాలంలో చికిత్స అందింది కాబట్టి సరిపోయింది లేకపోతే’’ అని యోగేష్ అంటుండగానే వాళ్ల ఆవిడ చేతిలోని రిమోట్ జారి కింద పడింది.

 నీతి: వార్తలన్నీ నిజాలు కావు. నిజాలన్నీ వార్తలు కావు. సినిమాలను చూసినట్టుగానే వార్తలను కాలక్షేపం కోసం చూస్తే ఏ జబ్బురాదు.

19, జూన్ 2013, బుధవారం

రాజకీయ రహస్య సహజీవనం

మనుషులకు పెళ్లి చేసినంత కీడు మరేదీ చేయలేదని, మనిషి స్వేచ్ఛను పెళ్లి హరించేసిందంటారు ఓషో రజనీష్. పెళ్లి ప్రస్తావన లేని సమాజం గురించి ఆయన కలలు కన్నారు. కొంత మంది సహజీవనం రూపంలో రజనీష్ కలలను నిజం చేస్తున్నారు. మనుషుల జీవితంలో సహజీవనం విషయం ఎలా ఉన్నా రాజకీయాల్లో మాత్రం సహజీవనం అత్యవసరం. మన సంప్రదాయంలో పెళ్లి ఏడు జన్మల బంధం అంటారు. మనుషుల జీవితం విషయంలో ఎలా ఉన్నా పెళ్లి రాజకీయాల్లో స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. 

రాష్ట్రంలో అధికార పక్షం, విపక్షం మధ్య రహస్య సహజీవనం జరుగుతోంది అనేది బలంగా ప్రచారంలో ఉంది. రాజకీయ పక్షాల మధ్య చాలా కాలం నుంచే సహజీవనం సాగుతోంది. ఒకప్పుడు రాష్ట్రంలో వామపక్షాలు అధికారంలోకి వస్తాయేమో అన్నంతగా విజృంభించాయి. చివరకు విజయవాడను కాకుండా కర్నూలును ఆంధ్రరాష్ట్ర రాజధానిగా నిర్ణయించడం వెనుక, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వెనుక కమ్యూనిస్టుల ప్రాభల్యమే ప్రధాన కారణం. టిడిపితో వామపక్షాలు బంధం ఎప్పుడైతే ప్రారంభం అయిందో అప్పటి నుంచి వామపక్షాలు అంటే గత చరిత్ర మాత్రమే. వృద్ధనారీ పత్రివ్రత అన్నట్టు మూడు దశాబ్దాల కాపురం తరువాత ఇప్పుడు కనులు తెరుచుకున్న వామపక్షాలు పెళ్లి వద్దు సహజీవనం ముద్దు అంటున్నాయి. దానికి దీనికి తేడా ఏమిటంటే పెళ్లంటే ఇష్టం ఉన్నా లేకున్నా కలిసి ఉండాల్సి వస్తుంది. విడిపోకుండా పట్టుకుని వేలాడేవారు అంటే ఎవరికైనా చిన్నచూపే అదే నచ్చక పోతే విడిపోతారు అనే భయం ఉంటే నిరంతరం ప్రేమిస్తుంటారు. ఈ తేడా తెలుసుకున్న వామపక్షాలు టిడిపితో మాది శాశ్వత బంధం కాదు ఇష్టం వచ్చినప్పుడు విడిపోవడానికి అవకాశం ఉన్న సహజీవనం మాత్రమే అంటున్నాయి.

 ఏ వయసులో చెప్పాల్సిన మాట ఆ వయసులో చెబితే బాగుంటుంది. వృద్ధనారి సరసోక్తులు కూడా చిరాకుగానే ఉంటాయి. అలానే రాజకీయ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు చేతిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా బాగానే ఉంటుంది. ఓటు బ్యాంకు క్షీణించి ప్రజలు మరిచిపోయిన దశలో శాశ్వత బంధం అన్నా, కొద్ది కాలం సహజీవం చేద్దాం అన్నా వినిపించుకునే వారుండరు.
రాజకీయాల్లో అనేక ఆవిష్కరణలకు మూల స్థానంగా నిలిచిన తెలుగునాడు రాజకీయాల్లో సహజీవనానికి శ్రీకారం చుట్టింది. బయటి నుంచి, పక్క నుంచి, పై నుంచి మద్దతు అంటూ జాతీయ రాజకీయాల్లో తెలుగునాడు సహజీవన రాజకీయాలకు తెరలేపింది.


కాంగ్రెస్ పార్టీ కున్న ఫ్లెక్సిబులిటీ దేశంలో మరే పార్టీకి ఉండదేమో. దేశంలో బిజెపితో మినహాయిస్తే ఏ పార్టీతోనైనా కాంగ్రెస్ సహజీవనం చేయగలదు. చేసింది కూడా. తమిళనాడులో అన్నా డిఎంకె, డిఎంకెల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అసెంబ్లీలో బట్టలూడదీసి కొట్టుకుంటారు. అలాంటి రెండు పార్టీలు బిజెపితో మాత్రం చిలకా గోరింకల్లా సహజీవనం చేస్తాయి. అంతే కాదు ఆ రెండు పార్టీలతో అంతే ముచ్చటగా బిజెపి సైతం సహజీవనం చేసిన అనుభవం ఉంది. రాష్ట్రంలో టిడిపికి ఈ అనుభవం ఉంది. అటు వామపక్షాలతో, ఇటు బిజెపితో సహజీవనం చేయడమే కాదు, గతంలో ఒకే సారి అటు లెఫ్ట్ ఇటు రైట్‌తో సహజీవనం చేసి నెట్టుకొచ్చిన ఘనత ఆ పార్టీది.


ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఒకరు లేనిదే ఒకరు క్షణమైనా ఉండలేమంటారు. నీవుకాదంటే కాలేజీ గోడ నుంచి దూకి చస్తానంటాడు. క్లాసులు ఎగ్గొట్టి అప్పులు చేసి మరీ బైకు మీద తిప్పుతాడు. చివరకు అమ్మాయి మనసు కరిగి ఐ లవ్ యూ సందేశానికి ఐ లవ్ యూ అని సమాధానం ఇస్తుంది. పెళ్లవుంది. ఏ ముహూర్తాన నిన్ను కట్టుకున్నానో కానీ రోజూ కష్టాలే. నిన్ను కట్టుకోవడం వల్ల దరిద్రాన్ని కట్టుకున్నట్టు అయింది. నేనంటే ప్రాణమిచ్చే మా వదిన బంధువుల అమ్మాయిని చేసుకున్నా బాగుండేది. ఇప్పుడా అమ్మాయికి మంచి జీతం అంటూ భార్య కనిపించగానే చిరాకు పడతాడు. ఇది మనుషుల వివాహ జీవితంలో సర్వ సాధారణం.


రాజకీయ పెళ్లిళ్లలో సైతం ఈ మాటలు సర్వ సాధారణం. గోద్రా అల్లర్ల తరువాత 2003లో బీహార్ ముఖ్యమంత్రి ( అప్పుడు ఎన్‌డిఏ ప్రభుత్వంలో లో కేంద్ర మంత్రి) నితీష్ కుమార్ ఒక సభలో నరేంద్ర మోడిని ఆకాశానికెత్తేశారు. ఇలాంటి దమ్మున్న నాయకుడు ఒక రాష్ట్రానికే పరిమితం కాకూడదని, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని బహిరగంగ సభలో పిలుపు ఇచ్చారు. ఇప్పుడేమో మోడీ లాంటి నాయకుడు ఉన్న పార్టీలతో మేం జత కట్టలేం.. లౌకిక వాదం ఏమైపోతుంది అంటూ విడాకులు తీసుకున్నారు. బిజెపి నాయకులకు కోపం వచ్చి పదేళ్ల క్రితం ఆయన మోడీని ఆకాశానికెత్తుతూ మాట్లాడిన వీడియోను మీడియాకు లీక్ చేశారు. మరీ అమాయకత్వం కాకపోతే ఈ పెళ్లి మా కొద్దు బాబోయ్ అని విడాకులు కోరే జంటకు ప్రేమించుకున్నప్పటి వీడియో చూపిస్తే ఎలా ఉంటుంది. నీవు లేనిదే నేను ఉండలేను ప్రాణాలు తీసుకుంటాను అన్నావు కదా? ఇప్పుడేమో దరిద్రం మొఖం అని తిడుతున్నావు ఇది నీకు న్యాయమా? అని ప్రశ్నించడం న్యాయ మా? ప్రేమించుకున్నప్పుడు చెప్పుకున్న ఊసులను విడాకుల సమయంలో గుర్తు చేయడం ధర్మమా? పొత్తుల పేరుతో శాశ్వత బంధాలు రాజకీయ పక్షాలకు అచ్చిరావు. అంశాల వారి మద్దతు, బయటి నుంచి మద్దతు అంటూ సందర్భానికి తగిన పేరు పెట్టుకుని సహజీవనం చేయడమే మంచిది.


కొన్ని పక్షాలు బహిరంగంగా సహ జీవనం చేస్తే మరి కొన్ని రహస్య సహ జీవనం చేస్తాయి. రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం రహస్య సహజీవనం చేస్తున్నాయని ఒకరంటే, అది నిజం కాదు తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ల మధ్యనే రహస్య సహజీవనం సాగుతోందని వారంటున్నారు. ఏడాది గడిస్తే కానీ ఎవరెవరితో సహజీవనం చేస్తున్నారో తేలదు. రాజకీయ పక్షాలకు రజనీష్ మార్గం అనివార్యం.

16, జూన్ 2013, ఆదివారం

ఒక్క మన దేశం తప్ప అన్నీ మనవే గొప్ప



రూపాయి పతనం అంటూ ntv లో రాత్రి ప్రత్యేక కథనం వచ్చింది .. బాగుంది ..  ఈ పతనానికి కారణాల్లో మనం ఉన్నాం అనేది కథనం  సారాంశం .. మనం రోజూ  వాడే అనేక  వస్తువులు బహుళ జాతి కంపెనిలవే .. దీంతో మన కంపెనీలు ముత  పడుతూ బహుళ జాతి కంపెనీలు బాగుపడుతున్నాయని చెప్పారు .  అంతా నిజమే .. అయితే ఈ ప్రత్యెక కథనం మధ్యలో వచ్చిన ప్రకటనలు ఎక్కువగా బహుళ జాతి కంపెనిలవే ... 
 బానిసత్వం మన నరనరాన జిర్నించుకు పోవడమే. విదేశీ కంపెనీలపై  మోజుకు కారణం .. 

మనది మహోన్నత కులం ... ఇతర కులాలు అద్వాన్నం 
మంది మహోన్నత మతం ఇతర కులాలు చెత్త 
మన ప్రాంతం గొప్పది ఇతర ప్రాంతాల వారు  అనాగరికులు

మన కుల పొడి పార్టీ మహోన్నతమయింది -  ఇతర పార్టీ లు చెత్త 
ఆగండాగండి అన్ని విషయాల్లో మనదే  గొప్ప .. దేశం విషయం లో మాత్రం ????
మన దేశ సరుకు చెత్త .. విదేశియిడైతే అపూర్వం .. అమెరికాదే కానవసరం లేదు చివరకు నేపాల్ దైనా సరే అద్భుతం ... ఎంత రేటు కైనా కొంటాం 
ఎందుకంటె మన జీన్స్ లోనే బానిసత్వం ఉంది ... ఒకటా రెండా కొన్ని వందల సంవత్సరాల పాటు మనను విదేశీయులు పాలించారు ..( తొలుత ముస్లిం పాలకులు, తరువాత  బ్రిటిష్ వాడు ) 

సూర్యకాంతం జీవితం - వీలునామా పాఠం



ఎంతో మంది నటులు ఒక వెలుగు వెలిగినా ఆర్థిక పరమైన పరిజ్ఞానం లేకపోవడంతో చివరి దశలో దయనీయమైన జీవితం గడిపారు. ఈ విషయంలో మాత్రం సూర్యకాంతంది భిన్నమైన జీవితం. తాము సంపాదించిన సంపద చివరి దశలో తాము కోరుకున్న వారికి చెందాలని ఎవరైనా కోరుకుంటారు. అలానే సూర్యకాంతం కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. వీలునామాకు సంబంధించి ఒక పాఠంగా సూర్యకాంతం జీవితం నిలిచిపోయింది.
* * *


పూర్వం ఒక రాజు కుమారుడి ప్రాణాలకు పందితో ముప్పు అని జ్యోతిష్యుడు చెప్పడంతో, రాజు ఒంటి స్తంభం మేడ కట్టించి అందులో చిన్నారి రాజకుమారుడిని దాచిపెడతాడు. రాజకుమారుడు ఆడుకునే ఆట బొమ్మలు తప్ప అక్కడ ఏమీ ఉండదు. చీమ కూడా అనుమతి లేనిదే లోనికి వెళ్లలేదు. ఇక పంది వెళ్లే అవకాశమే లేదు. రాజు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా చివరకు చిన్నారి రాజకుమారుడికి పంది చేతిలో మరణం తప్పలేదు. రాజకుమారుడు ఆడుకునే బొమ్మల్లో పంది బొమ్మ కూడా ఉంది. అది గుచ్చుకొని రాజకుమారుడు మరణిస్తాడు.


నటి సూర్యకాంతం ఆర్థిక వ్యవహారాలను చూస్తే ఈ కథ గుర్తుకు వస్తుంది.
ఒక్క చాన్స్ .. ఫ్లీజ్ ఒక్క చాన్స్ ఇవ్వండి... సినిమాల్లో వేషం కోసం ఇలా అడగడం ఎప్పుడూ ఉన్నదే. అలాంటిది మొదటి వేషం, మొదటి సినిమాకు మీరిచ్చే పారితోషికం సరిపోదు పెంచండి అని అడిగే దమ్ము ఉంటుందా? ఎవరికీ ఉండదేమో కానీ సూర్యకాంతంకు ఆ దమ్ముంది.
సరస్వతి, లక్ష్మీదేవి ఒకే చోట ఉండదని అంటారు. ఈ కాలం నాటి నటుల సంగతి కాదు కానీ పాత తరం నటుల విషయంలో ఈ మాట నిజమే అనిపిస్తోంది. మహామహానటులు చివరి రోజుల్లో ఆర్థికంగా దయనీయంగానే గడిపారు. నటన తప్ప మరో ప్రపంచం గురించి పట్టించుకోకుండా వారి చివరి దశ అలా మారిపోయింది. మొదటి సినిమాలోనే తన పారితోషకం పెంచాలని డిమాండ్ చేసిన సూర్యకాంతం తన జీవితమంతా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగానే ఉన్నారు. ఒకవైపు నటిస్తూనే ఆ కాలంలో సైతం ఆర్థిక వ్యవహారాల్లో చురుగ్గా ఉండేవారు. వ్యాపారాలు సైతం చేసే వారు. కానీ చిత్రంగా చివరి రోజుల్లో ఆమె ఆస్తి ఏమీ ఆమెకు మిగలలేదు.
ఆమె మరణించి రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. అయినా ఆమె పేరు వింటే ఇప్పటికీ హడల్. అందుకే ఇప్పటికీ మనకు సూర్యకాంతం అనే పేరు ఎక్కడా వినిపించదు. సూర్యకాంతం అనే చక్కని పేరుకు నువ్వు అన్యాయం చేశావమ్మా! అని అందుకే గుమ్మడి ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు.


1924లో పుట్టిన సూర్యకాంతం పాతికేళ్ల వయసులో సినిమాల్లో ప్రవేశించింది. అప్పట్లో నటీనటులకు నెల జీతంగా చెల్లించే వారు. స్టూడియోలు సినిమాలను నిర్మించేవి, నటీనటులు ఈ స్టూడియోలో ఉద్యోగులుగా నెల జీతంపై సినిమాల్లో నటించే వారు. చంద్రలేఖ సినిమాలో డ్యాన్సర్‌గా నటించిన సూర్యకాంతంకు నెలకు 65 రూపాయల జీతం నిర్ణయిస్తే, ఆమె ఆ డబ్బు తీసుకోవడానికి నిరాకరించింది. తన కష్టాన్ని వివరించి, నిర్మాత వద్ద అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో ఆమె జీతాన్ని 75 రూపాయలుగా నిర్ణయించారు. డబ్బు విషయంలో ఇంత నిక్కచ్చిగా ఉన్న నటీమణి తరువాత ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటారో అనిపించకుండా ఉంటుందా? ఆమె అలానే ఉన్నారు కూడా .. 1949లో వచ్చిన ధర్మాంగ సినిమాలో ఆమెది కాస్త పెద్ద వేషమే అందులో మూగగా నటించారు. ఎప్పటికైనా హీరోయిన్‌గా నటించాలని సూర్యకాంతంకు ఉండేది. తక్కువ జీతంతో చిన్న చిన్న పాత్రల్లో నటించడం ఇష్టమనిపించక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చారు. ముంబై వెళ్లి సినిమాల్లో ప్రయత్నించాలని అనుకున్నారు, అయితే ఆర్థిక పరిస్థితి సహకరించక పోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు.
అప్పటి నుంచి ఆమె ఆర్థిక వ్యవహారాల్లో మరింత నిక్కచ్చిగా ఉండడం మొదలు పెట్టారు.


గృహ ప్రవేశం సినిమాలో సహాయ నటిగా నటించింది. సౌదామిని సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. కారు ప్రమాదంలో ముఖానికి గాయాలు కావడంతో ఆ అవకాశం తప్పిపోయింది. నటిగా ఒక రకంగా అది ఆమెకు అదృష్టాన్ని తెచ్చిపెట్టి ఉంటుంది. హీరోయిన్‌గా అయితే అవకాశాలు ఎలా ఉండేవో కానీ సూర్యకాంతానికి సూర్యకాంతం పాత్రలు లభించడం ద్వారా తెలుగు సినిమాల్లో ఆమె పాత్ర పేరు శాశ్వతం అయింది. గయ్యాళి తనానికి మారుపేరుగా ఆమె పేరు నిలిచిపోయింది. గుండమ్మ కథ సినిమా మళ్లీ తీస్తారనే చర్చ జరిగితే సూర్యకాంతం పాత్రకు మాత్రం ఎవరి పేరును సూచించే ధైర్యం ఎవరూ చేయలేదు. సూర్యకాంతంకు ప్రత్యామ్నాయం లేనే లేదని తేల్చేశారు.


కారు ప్రమాదం నుంచి కోలుకున్న తరువాత సంసారం చిత్రంలో మొదటి సారిగా గయ్యాళి పాత్రలో నటించారు. ఏ ముహూర్తాన ఈ సినిమాలో ఆమె నటించారో కానీ ఆ తరువాత వరుసగా అవే పాత్రలు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంలో గయ్యాళి పాత్రలను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలేశారు. విచిత్రమైన విషయం ఏమంటే అప్పుడు సమాజంలో ఉమ్మడి కుటుంబాలు, గయ్యాళి అత్తలు ఉండేవారు. కాలం మారింది ఇప్పుడు అత్తల పాత్రను చాలా కుటుంబాల్లో కోడళ్లు తీసుకున్నారు. బహుశా ఇక గయ్యాళి అత్త అవసరం లేదనుకున్నారేమో దేవుడు 1994లో సూర్యకాంతంను తన వద్దకు పిలిపించుకున్నారు. అమాయకుడైన భర్తకు గయ్యాళి భార్యగా ఆమె అనేక సినిమాల్లో జీవించేశారు. సినిమాల్లో ఆమె అత్తపాత్రలో నటించినా నిజ జీవితంలో మాత్రం తల్లిగా ఉండేవారు. షూటింగ్‌లకు తన కోసమే కాకుండా తన తోటి వారి కోసం కూడా ఇంట్లో మంచి వంటలు వండి తీసుకు వెళ్లేవారు. సావిత్రి కళ్లతో నటిస్తే, సూర్యకాంతం చేతలు విసురుతో చేతులతో నటించేసేవారు. సినిమాల్లో తన పాత్రను నటించడంలో పాత్రలో ఎంతగా లీనమయ్యేదో, షూటింగ్ పూర్తయిన తరువాత తన పారితోషకం తీసుకోవడానికి అంతే నిక్కచ్చిగా ఉండేవారు. మొదటి సినిమా నుంచి చివరి వరకు ఆమె డబ్బు విషయంలో ఈ విధానానే్న కొనసాగించారు. సూర్యకాంతం దాదాపు ఆరువందల సినిమాల్లో నటించారు. న్యాయవాది పెద్దిబొట్ల చలపతిరావును 1950లో వివాహం చేసుకున్నారు. ఆయన తరువాత హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఒకవైపు నటిస్తూనే ఆమె పాతకార్లను కొని మరమ్మత్తు చేయించి ఆమ్మే వ్యాపారం కూడా చేశారు. ఇళ్ల స్థలాలు, ఇండ్లు కొనడం అమ్మడం చేసే వారు. నిర్మాతలకు వడ్డీలకు కూడా ఇచ్చారు. అయితే డబ్బులు వసూలు చేయడంలో నిక్కచ్చిగా ఉండేవారు.


సినిమాల్లో గయ్యాళి అత్త ఉన్నా, నిజ జీవితంలో దానికి పూర్తి భిన్నంగా సున్నిత హృదయంతో అమ్మలా ఉండేవారు. డబ్బుల విషయంలో ఎవరినీ నమ్మేది కాదు.


సూర్యకాంతం దంపతులకు పిల్లలు లేరు. చివరి రోజుల్లో సూర్యకాంతం తన ఆస్తి తన సోదరులకు చెందే విధంగా వీలునామా రాయమని న్యాయవాదిని కోరారు. ఆయన వీలునామా రాశాడు. అయితే సూర్యకాంతం కోరిన విధంగా ఆమె సోదరులు పేరు మీద కాకుండా తన పేరు మీద రాసుకున్నాడు. ఈ విషయం చివరి వరకు సూర్యకాంతంకు తెలియదు. ఆమె మరణం తరువాత సూర్యకాంతం సోదరునికి ఈ విషయం తెలిసి గుండెపోటుతో మరణించాడు. ఈ విషయం ఒక ఇంటర్వ్యూలో సినీనటి రమాప్రభ తెలిపారు.


సంపాదనను జాగ్రత్త చేసుకోవడమే కాదు, వీలునామా రాయడంలో సైతం జాగ్రత్తలు అవసరం అని సూర్యకాంతం జీవితం నిరూపిస్తోంది.

12, జూన్ 2013, బుధవారం

గూఢచారి నంబర్ వన్

‘‘చూడు పారూ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. శాశ్వతం అనుకున్నదానికీ ఎప్పుడో ఒకప్పుడు ది ఎండ్ పడుతుంది. మనం చదువుకునేప్పుడు గర్జించు రష్యా గాండ్రించు రష్యా అని పాడుకునే వాళ్లం రష్యా ముక్కలవుతుందని అనుకున్నామా? ప్రపంచమంతా సోవియట్ రష్యాలా ఎర్రబారుతుందని మనం అనుకుంటే చివరకు ప్రపంచంలానే రష్యా మారిపోయింది. మార్పును జీర్ణం చేసుకోవాలి’’ అంటూ ముకుంద్ చెప్పుకుపోతూనే ఉన్నా డు. పారు ముఖంలో ఎలాంటి మార్పు లేదు.


2020 వరకు తానే అధికారంలో ఉంటానన్న నేత 2004లోనే అధికారం వదులుకుని 2014కు మనసు రాయి చేసుకుని కొడుకు కోసం త్యాగం చేయడం లేదా? విశాల రాష్ట్రాన్ని పాలించాలనుకున్న యువనేత జైలు పాలనకు తలొగ్గడం లేదా? నాయకులే మార్పును అర్ధం చేసుకున్నప్పుడు మనమెంత?


ఋతురాగాలు సీరియల్ ముగుస్తుందని నువ్వు, నేనే కాదు, ఆ సీరియల్ తీస్తున్న వారూ అనుకోలేదు. కానీ విధి బలీయమైనది మనుషులు ఊహించనివి చేయడమే ఆ దేవుడు ఆడే నాటకం. మనం ఊహించినట్టే జరిగితే ఇక ఆ దేవుణ్ణి మనం గుర్తు చేసుకోం కదా?.’’ అంటూ అనునయించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.  అప్పటికీ ఆమెలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

 ‘‘మన ప్రేమ చిగురించిన కొత్తలో ప్రారంభమైన ఋతురాగాలు, మన పిల్లలు ఉద్యోగంలో చేరుతున్న కాలంలో ముగిసింది. మరో సీరియల్ తీస్తానని మంజులా నాయుడు చెప్పారు కదా? కొద్ది రోజులు ఓపిక పట్టాలి తప్పదు’’ అని ముకుంద్ చెబుతుంటే, ఒక్కసారి ఆమె కోపంగా ముఖం ఇటు తిప్పి మీరేం మాట్లాడుతున్నారు అని అడిగింది. ఏదో దిగులుగా ఉన్నావని మాట్లాడాను కానీ నీ ముందు నేనెందుకు మాట్లాడతాను పారూ అని సంజాయిషీ ఇచ్చాడు. ముకుంద్.


‘‘ నా జీవితంలో ఇంత అవమాన పడాల్సి వస్తుందని అనుకోలేదు. ఈ రోజు నాకు తలతీసేసినట్టు అయింది. మన కాలనీ పంకజం కొడుకు ఎవరో అమ్మాయితో పారిపోయాడట’’! అని పారు చెప్పగానే పాపం సుబ్బారావు కొడుకు ప్రేమించిన అమ్మాయితో పారిపోయాడా! ఆ సుబ్బారావు వాడి కొడుకు మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. కష్టపడి పెంచి పెద్ద చేసిన తనను వృద్ధాప్యంలో కొడకు ఆదుకుంటాడని ఎన్ని కలలు కన్నాడు. చివరకు వాడేమో తండ్రిని అప్పుల్లో పడేసి ప్రేయసితో ఉడాయించాడా? ఈ వయసులో ఆ కష్టం తట్టుకోవడం ఇబ్బందే, వాళ్లకొచ్చిన సమస్యకు నువ్వింతగా బాధపడుతున్నావంటే కనిపించవు కానీ నీ మనసు వెన్న పారూ వెన్న అని ముకుంద్ తన్మయంగా చెప్పాడు. ‘‘వెన్న కాదు డాల్డా కాదు. నేను బాధపడేది అందుకు కాదు.


ఈ విషయం నీకు తెలుసా అని పక్కింటి లక్ష్మి అడిగే సరికి తల కొట్టేసినట్టు అయింది. ఒకే కాలనీలో పక్క పక్కన ఉంటాం సుబ్బారావు, పంకజంల కొడుకు లేచి పోవడం గురించి లక్ష్మి చెప్పేంత వరకు నాకు తెలియలేదు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు కదా? నాకీ విషయం తెలియదు, లక్ష్మికి తెలుసు అంటే నా కన్నా లక్ష్మి పవర్ పుల్ కదా? అదీ నా బాధ.
ఇలాంటి సమాచారం కోసమే కదా! పంకజాక్షికి రెట్టింపు డబ్బు ఇస్తున్నాం. అందుకే ఈ రోజు నుంచి పంకజాక్షిని పనిలో నుంచి తీసేస్తున్నట్టు చెప్పాను ’’ అని పారు చెబుతుండగానే పంకజాక్షి ఇంట్లోకి వచ్చింది. మీరైనా చెప్పండి బాబు గారు నేను చేసింది చిన్న తప్పు కాదు నాకు తెలుసు. మొన్న మా ఆయన సినిమాకు వెళదాం అంటే అమ్మగారు ఆఫీసు నుంచి రాకముందే హడావుడిగా వెళ్లిపోయాను, నినే్నమో జ్వరంతో రాలేదు. నాకు చెప్పకుండా ఇంత ముఖ్యమైన సమాచారం పక్కింటావిడకు చెబుతావా? అని అమ్మగారికి కోపం రావడం ధర్మమే కానీ మళ్లెప్పుడూ ఇలా జరగదని పార్లమెంటు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను బాబూ అంటూ పంకజాక్షి టీవిలో వార్తలు చూస్తూ ఆవేదనగా చెప్పింది.


‘‘ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు పార్లమెంటును ఎందుకు బలి చేస్తావు. పార్లమెంటు మీద వద్దు కానీ మరోసారి అలా చేయనంటుంది క్షమించి వదిలేయ్ పారూ ’’అని నచ్చజెప్పాడు. కాలనీలోని విలువైన సమాచారం కోసం పనిమనిషి పై ఆధారపడ్డ నీ తెలివి అద్భుతం పారూ అని ముకుంద్ మెచ్చుకున్నాడు. పూర్వం రాజు లు దేశం నిండా గూఢచారులను నింపేవారు. సైన్యం తక్కువుంటే మిత్ర దేశం నుంచి తెచ్చుకోవచ్చు కానీ గూఢచారులు తక్కువుంటే సింహాసనం కిందకు నీళ్లు వచ్చినా తెలియదని భయపడేవారు. రాజులు పోయి ప్రజాస్వామ్యం వచ్చాక డ్రైవర్లను, పని వాళ్లను కూడా గూఢచారులుగా ఉపయోగించుకోవడం అలవాటైంది. 

పూర్వం రాజుల కైనా ప్రజాస్వామ్యంలో ప్రభువులకైనా కామన్ గూఢచారి క్షౌరం చేసే వ్యక్తే. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెల తన వ్యక్తిగత క్షురకునితో కనీసం అరగంట సేపు మాట్లాడేవారట!పాలన గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకునే వారట! టీవి చర్చల్లో కొట్టుకున్నట్టుగా కాకుండా బార్బర్ షాపుకొచ్చిన వాళ్లు దేశ రాజకీయాలు, ఎవరు ఎంత సంపాదించారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు చక్కగా చర్చించుకుంటారు. అందుకే ఎన్టీఆర్ క్షురకునితో మాట్లాడేవారట. ఇందిరాగాంధీకి ఎమర్జన్సీ సమయంలో అందరు మాట్లాడుకునే సమాచారం ఇచ్చిన డ్రైవర్ ఆ తరువాత కేంద్ర మంత్రి అయ్యారు.’’ అని ముకుంద్ తనకు తెలిసిన విషయం చెప్పాడు.


‘‘ఆ క్షురకున్ని, డ్రైవర్‌ను ఎవరైనా మేనేజ్ చేశారనుకోండి, సింహాసనం కదిలేంత వరకు నాయకుడ్ని భ్రమల్లో ఉంచవచ్చు కదా? ’’ అని పారూ ఆడిగింది. అందుకేనేమో కొందరు నేతలు తమ నీడను కూడా తాము నమ్మరు .. నీకే ఇంత నెట్‌వర్క్ ఉంటే నేతలకెంత ఉండాలని అనుకున్నాడు ముకుంద్
ముక్తాయింపు: ఎదుటి వాడి  సమాచారాన్ని సేకరించడం లో  అందరూ మొనగాళ్లే.

7, జూన్ 2013, శుక్రవారం

సమాచార చట్టం తో రాజకీయ వ్యాపారం బట్ట బయలు

ఇప్పుడు దేశంలో రాజకీయం అనేది ఫక్తు వ్యాపారం. ఒక వ్యాపార సంస్థ తన వ్యాపార రహస్యాన్ని బయట పెట్టడం వ్యాపార ధర్మం కాదు, అలా బయట పెట్టాలని కోరడం కూడా అన్యాయమే. అందుకే నేమో సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాజకీయ పార్టీలను తీసుకు వస్తూ కేంద్ర సమాచార కమిషన్ తీసుకున్న నిర్ణయం రాజకీయ పక్షాలకు మింగుడు పడడం లేదు. కొన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తే, మరి కొన్ని పార్టీలు ఇదెక్కడి తలనొప్పి అనుకుంటున్నాయి.


దేశంలో రాజకీయం ఎంత వ్యాపారంగా మారినా, ప్రజాస్వామ్యం మనుగడ రాజకీయ పక్షాలపైనే ఆధారపడి ఉంది. రాజకీయ పక్షాలను ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తున్నా, ప్రజాస్వామ్యానికి ఇవి తప్ప ప్రత్యామ్నాయం లేదు. లోపాలను సరిదిద్దుకుంటూ ఈ వ్యవస్థలు మనుగడ సాగించాలని కోరుకోవాలి. ఈ వ్యవస్థల్లోని లోపాలను ప్రశ్నించినంత మాత్రాన వీటిని వ్యతిరేకిస్తున్నట్టు కాదు. అన్నా హాజారే అవినీతికి వ్యతిరేకంగా పౌర సమాజం పేరుతో ఉద్యమిస్తున్నప్పుడు పార్లమెంటు కన్నా పౌర సమాజమే ఉన్నతమైంది అన్నట్టుగా వ్యవహరించడాన్ని జీర్ణం చేసుకోలేకపోయారు. పార్లమెంటులో నేర చరిత్రులకు కొదవ లేదు , తప్పు చేసిన వారి సంఖ్య తక్కువేమీ కాదు . పార్లమెంటు వ్యవస్థలో లోపాలు ఉండవచ్చు. కానీ ఎవరో ఐదారుగురు ఒక బృందంగా ఏర్పడి మీడియా ప్రచారంతో పార్లమెంటు కన్నా తామే ఉన్నతులమన్నట్టుగా మాట్లాడితే ప్రజలు అంగీకరించలేదు. చివరకు అన్నా హాజరే సైతం తామేమీ పార్లమెంటును కించ పరచడం లేదని దిగి వచ్చారు. 

అలానే ఇప్పుడు సమాచార హక్కు కమిషనర్లు రాజకీయ పార్టీల కన్నా, ప్రజాస్వామ్యం కన్నా ఉన్నతులని ఎవరూ భావించడం లేదు. రాజకీయ పార్టీల కార్యకలాపాల్లో పారదర్శకత కోసమే సమాచార కమిషన్ రాజకీయ పక్షాలను సమాచార హక్కు చట్టం పరిధిలో ఉండాలని కోరుకుంటోంది కానీ వారిపై పెత్తనం చలాయించడానికి కాదు. కమిషన్‌కు రాజకీయ పక్షాలపై పెత్తనం చెలాయించే అధికారం ఉండవద్దు కూడా. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు, రాజకీయ పార్టీల కీలకమైనవి. వాటి ప్రాధాన్యతను తగ్గించలేరు. కానీ రాజకీయ పార్టీల్లో పారదర్శకత కోరుకుంటే తప్పేముంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకిస్తుండడం వల్ల ఈ నిర్ణయం అమలులోకి రావడం సందేహమే.


రాజకీయ పార్టీలను కుటుంబ ఆస్తులుగా మార్చేశారు. కుటుంబ ఆస్తి పాస్తుల వివరాలు కోరితే ఆ సంగతి మీకెందుకు అని యజమానికి కోపం వస్తుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలకు సైతం అదే విధంగా కోపం వస్తోంది. రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువైన భూమిని రాజకీయ పక్షాల కార్యాలయానికి కట్టబెట్టారు. ప్రజల సొమ్మును పార్టీల కార్యాలయాలకు కట్టబెట్టినప్పుడు వాటి వివరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండాల్సిందే. కాంగ్రెస్, టిడిపి, బిజెపి,టిఆర్‌ఎస్ పార్టీలకు పార్టీ కార్యాలయాలుగా అత్యంత విలువైన భూమి కట్టబెట్టారు. బ్రహ్మానందరెడ్డి పార్క్ ఎదురుగా ఉన్న విలువైన స్థలంలో హుడా ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించగా, దానిని రద్దు చేసి టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ భవన్‌కు కేటాయించి, అక్కడ టిడిపి కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టిడిపి, బిజెపిల మధ్య చెలిమి ఉండేది. అదే సమయంలో నాంపల్లిలో బిజెపి కార్యాలయానికి విలువైన స్థలం కేటాయించారు. ఆ తరువాత వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత బంజారాహిల్స్‌లో టిఆర్‌ఎస్‌కు స్థలం కేటాయించారు. బీంరావ్‌బాడాలోని గుడిసెవాసులను బలవంతంతగా అక్కడి నుంచి తరలించి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం స్థలం కేటాయించారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నింటికి విలువైన స్థలాల్లో కార్యాలయాలు ఉన్నాయి. రాజకీయ పక్షాలపై సమాచార కమిషన్ అధికారం చలాయించే ధోరణితో కాకుండా ,   రాజకీయ పార్టీల  కార్యకలాపాలను ప్రజలకు తెలుసుకునే విధంగా సమాచార హక్కు చట్టం పరిధిలో రాజకీయ పార్టీలను చేర్చడం ఆహ్వానించదగిన పరిణామమే.
రాజకీయ పార్టీలకు అందే విరాళాలు అంత రహస్యమే .. రాజకీయ పార్టీలే మీ 
ధార్మిక సంస్థలు కావు ... విరాళాలు ఇచ్చే వారు పరలోకం లో సుఖం కోసం కాదు పార్టీల అధికారాన్ని ఉపయోగించుకొని ఆర్ధిక ప్రయోజనం పొందాలనే విరాళాలు ఇస్తారు . వీటి గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటె తప్పా ?

5, జూన్ 2013, బుధవారం

ఇంటింటా హైకమాండ్!

వెకటికో బిక్షగాడు అమ్మా బిక్షం అంటే , కొత్త కోడలు ఇంకా వంట కాలేదు వెళ్లవయ్యా అని పంపించేసిందట! ముచ్చట్లు ముగించుకుని అప్పుడే ఇంట్లోకి వస్తున్న అత్తగారు అది చూసి బిక్షగాన్ని ఏంటీ అలా ఉత్త చేతులతో వెళుతున్నావని ఆపి రమ్మంటుంది. వాడు ఉత్సాహంగా మళ్లీ అమ్మా బిక్షం అంటే అత్త ఇంకా వంట కాలేదు వెళ్లు వెళ్లు అని కసరుకొని పంపిచేస్తుంది!
దీన్నో జోక్‌గానే ప్రచారం చేశారు కానీ ఇందులో అనేక జీవిత సత్యాలు ఇమిడి ఉన్నా యి. ఆనాటి కుటుంబ జీవితంలో అసలైన అధికారం ఎవరిదో తేల్చి చెప్పే నగ్న సత్యాలు దాగి ఉన్నాయి. వెళ్లే బిక్షగాన్ని పిలిచి వెళ్లు వెళ్లు అని కసరుకొంటుంది అత్తకేమైనా పిచ్చా అనిపిస్తుంది.. కానీ అత్త చాలా తెలివైంది. పాపం కోడలు పిల్ల కొత్త కాబట్టి విధి విధానాలు తెలియక అలా వెళ్లమంది.
కోడలిని ఒక్క మాట కూడా అనకుండా అత్త ఇంట్లో హై కమాండ్ ఎవరో ఒక్క మాటతో తేల్చి చెప్పింది. వెనుకటి కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబంలో కోడలు పిల్ల వచ్చిన కొత్తలోనే ఇంట్లో హై కమాండ్ ఎవరో ఆమెకు తెలియజేస్తే సమస్య ఉండదు. లేకపోతే ఆమె మామ గారే హై కమాండ్ అనుకుని ఆయన్ని గౌరవించడం మొదలుపెడితే, ఆయన ఆ గౌరవానికి అలవాటుపడిపోతే అనవసరంగా అధికారం కోసం ఇంట్లో ఘర్షణ మొదలవుతుంది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. ఎవరినీ ఒక్క మాట కూడా అనకుండా బిక్షగాడ్ని పిలిచి ఇంట్లో హై కమాండ్ ఎవరో ఇంట్లో అందరికీ మరోసారి సున్నితంగా తెలియజేశారు అత్తగారు. ఆ అత్తగారు రాజకీయాల్లోకి వస్తే చక్కగా రాణించే వారు.
అప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే ఇంట్లో సభ్యుల సంఖ్యను డజన్లలో చెప్పాల్సి వచ్చేది. మరి నేడో.... భార్య ఒక ఖండంలో, భర్త మరో ఖండంలో పని చేస్తున్న రోజులు. ఈ కాలంలో భార్యా భర్త ఒకే చోట ఉంటే అదే ఉమ్మడి కు టుంబం. ఎక్కడైనా భర్త తల్లిదండ్రులతో కలిసి ఉన్నా ఆ ఇంట్లో పాత రోజుల్లో మాదిరిగా అత్తగారు కాదు ఇప్పుడు కోడలే హై కమాండ్.
ఇంట్లో హై కమాండ్ ఎవరో పిల్లలు చాలా సులభంగా గ్రహించేస్తారు. సినిమాకు వెళ్లాలన్నా, ఫ్రెండ్స్ వద్దకు వెళ్లాలన్నా తండ్రి అనుమతించినా ఏ మాత్రం స్పందించకుండా మళ్లీ తల్లి అనుమతి కోరడం అంటే ఇంట్లో హై కమాండ్ ఎవరూ వారికి బాగా తెలిసిపోయిందన్నమాట!
సర్వసత్తాక గణతంత్ర అంటూ మన రాజ్యాంగంలో ఏవేవో రాసి ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం చూస్తే దేశానికి హై కమాండ్ రాష్టప్రతి అనిపిస్తుంది. రాష్టప్రతి పేరుమీద పాలన జరిగినా ప్రజాస్వామ్యం కాబట్టి ప్రధానమంత్రి హై కమాండ్ అనేది కొందరి వాదన. కానీ ఆచరణలో చూస్తే మాత్రం హై కమాండ్ వీరెవరూ కాదు. అధికారికంగా ఎలాంటి అధికారం లేని అమ్మగారే అసలైన హై కమాండ్.
హైకమాండ్‌కు స్పష్టమైన నిర్వచనం అనేది కనిపించదు. హోదాను బట్టి హై కమాండ్ పాత్ర లభించదు. ఒక్కోసారి ఎలాంటి హోదా లేకపోయినా హై కమాండ్‌గా అధికారం చెలాయించవచ్చు.ఆపాత్ర  నిర్వచనానికి అందనిది. హై కమాండ్‌కు హోదా ముఖ్యం కాదు. అధికారం చలాయించడమే ముఖ్యం. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఆయనే హై కమాండ్‌గా ఉండేవారు. చివరకు ఆయన ప్రత్యర్థి సైతం ఆయన అధికారాన్ని చూసి ఆసూయతో వైఎస్‌ఆర్ హై కమాండ్‌కే హై కమాండ్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడేవారు.

 అదే స్థానంలో కూర్చున్న కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు నచ్చిన చోట ఉదయం నడక, అల్పాహారం, భోజనం వంటి వాటిలో ఎవరి మాటా వినడం లేదు. ఈ అంశా ల్లో ఆయనకు ఆయనే హై కమాండ్. కానీ పాపం పాలనకు సంబంధించి ఆయనకు రా ష్ట్రంలో, ఢిల్లీలో లెక్కలేనంత మంది హై కమాం డ్ దళాలు ఉన్నాయి. ఒకరిని ముఖ్యమంత్రిని చేసి పంపిస్తారు, ఆయనకు వ్యతిరేకంగా ఒక ఎమ్మెల్యేను ప్రోత్సహిస్తారు. హై కమాండ్ మనసేమిటో అర్ధం కాక ఆయన జుట్టు పీక్కుంటారు. ఇది ఢిల్లీ హై కమాండ్ తీరు.
***
ఎలుకలు భూ కంపాలను ముందుగానే గ్రహిస్తాయట! భూ కంపాలు వచ్చే ముందు వాటి ప్రవర్తన  అసహజంగా ఉంటుంది. బొరియల్లోకి దూరడం వంటివి చేస్తాయట! అలానే కొందరు హై కమాండ్‌నే కాదు కాబోయే హై కమాండ్‌ను సైతం ఎలుకల్లా ముందుగానే గ్రహించేస్తారు. ఈ మధ్య తెలుగునేత కొడుకుకు రాజకీయ తెరంగ్రేటం చేయించడానికి బహిరంగ సమావేశానికి తీసుకు వచ్చారు. ఆయన ఏం చేసినా ముందు చూపు ఉంటుంది. పార్టీలో కాబోయే హై కమాండ్ ఎవరో గ్రహించేసిన ముదురు ఎమ్మెల్యేలు కొందరు వాళ్ల కొడుకులను ఆ నేత కొడుకు చుట్టుపక్కల సీట్లను రిజర్వ్ చేసుకోవడానికి పంపించేశారు. ఇంకా పార్టీలో సభ్యత్వం కూడా తీసుకోని తెలుగు పుత్ర రత్నాన్ని అప్పుడే యువనేతలు చుట్టు ముట్టారు. అభిమానులుగా మారిపోయారు. ఎన్నికల ఫలితాలను బట్టి ఆయన అనుచర గణం సంఖ్య ఆధారపడి ఉంటుంది.

 రాహుల్ బాబు అమ్మ మాదిరిగా తెర వెనుక హై కమాండ్‌గా కాకుండా తెర ముందే హై కమాండ్‌గా వెలిగిపోవాలని తంటాలు పడుతున్నారు. సాధారణంగా పార్టీ అధ్యక్షుడే హై కమాండ్ అవుతారు కానీ ఇప్పుడు బిజెపిలో మాత్రం జాతీయ అధ్యక్షుడిగా కన్నా గుజరాత్ ముఖ్యమంత్రే హై కమాండ్ పాత్ర పోషిస్తున్నట్టుగా కనిపిస్తుంది.
ఇంటింటికో హై కమాండ్ మాత్రమే కాదు. ప్రతి వారిలో ఓ హై కమాండ్ ఉంటుంది. దేశాన్ని దోచుకునే నాయక హై కమాండ్‌ల సంగతి వదిలేద్దాం. ప్రతి మనిషి మనసే అతని హై కమాండ్. మనసు మాట వింటే మనిషి ఎలాంటి తప్పు చేయడంటారు ఓషో రజనీష్. మనలోనే ఉన్న హై కమాండ్‌ను గౌరవించుకుందాం. మనసు చెప్పిన మాట విందాం.

2, జూన్ 2013, ఆదివారం

ఇంటిలోనే లోక కల్యాణం!

వెయ్యి అబద్ధాలు ఆడయినా ఒక పెళ్లి చేయాలంటారు. ఒక్కకల్యా ణానికే వెయ్యి అబద్ధాల వరకు మినహాయింపు ఉన్నప్పుడు ఇక లోక కల్యాణం కోసం ఎన్ని అబద్ధాలు అడొచ్చు లెక్క తేలాలంటే లెక్కలేనన్ని రోజులు పడుతుంది. లోకంలో.. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎక్కడ ఏం చేసినా అందులో కచ్చితంగా లోకకల్యాణం ఉండే ఉంటుంది. లేకపోతే వాళ్ళెందుకా పని చేస్తారు? రాక్షసులు, దేవతలు ఎవరేం చేసినా లోక కళ్యాణం కోసమే! అనుమానం ఉంటే ఏ పురాణాన్నైయినా చదవండి. ఏ నాయకుడి పురాణాన్నయినా వినండి. లోకకల్యాణం కోసమే అని స్పష్టంగా తెలుస్తుంది. దేవతలు రాక్షసులు అన్నా దమ్ముళ్ళే. అలానే కురువంశానికి చెందిన కౌరవులు, పాండవులు అన్నదమ్ములే. రాజకీయ నాయకులను అధికార పక్షం, ప్రతిపక్షం అని సులభంగా అర్ధం కావడానికి మనం పిలుచుకున్నట్టు పాండవులు, కౌరవులు అని పిలుచుకుంటాం కానీ ఇద్దరిదీ కురు వంశమే!! రాక్షసులైనా, దేవతలైనా, కౌరవులైనా పాండవులైనా, అలానే అధికార పక్షం అయినా విపక్షం అయినా ఎవరేం చేసినా లోక కల్యాణం! కోసమే చేస్తారు. అధికార పక్షం వారికే లోకకల్యాణం పనులు చేసే అవకాశం ఉంటుందని విపక్షానికి ఆ అదృష్టం ఉండదనేది అపోహ మాత్రమే! పురాణాలు చూస్తే దేవతలే కాదు రాక్షసులు సైతం లోక కల్యాణంకోసం ఎన్నో పనులు చేశారు. ఒక నటుడు హీరోగా నటిస్తే, ఇంకొకడు విలన్‌గా నటిస్తాడు. అంతా మాత్రాన హీరో అనే వాడు మంచివాడని, విలన్ చెడ్డవాడని ఎలా అంటాం? దర్శకుడు ఎవరిని ఏ పాత్రకు ఎంపిక చేస్తే ఆ నటుడు ఆ పాత్రలో నటిస్తాడు అంతే. (చాలా సార్లు షూటింగ్ ముగియగానే హీరో, విలన్ ఇద్దరూ విలనే్ల. హీరోయిన్ మాత్రం పాపం!)

రాజకీయాల్లో కూడా అంతే సినిమాల్లో దర్శకుడు ఒక్కో పాత్రకు ఒక్కొక్కరిని ఎంపిక చేస్తాడు. ప్రజా స్వామ్యంలో ఓటరే దర్శకుడు ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలో నిర్ణయిస్తాడు. 60 ఏళ్లు దాటినా హీరోగా నటించే అదృష్టం ఎవరో కొద్ది మందికే ఉంటుంది! హీరో వేలువిడిచిన పిన్నమ్మ చిన్నతల్లి, మనవడికి కూడా హీరో అయ్యే చాన్స్ ఉంటుంది. లోక కల్యాణం కోసం మనం వారిని హీరోలుగా చూడాల్సిందే. సినిమా ప్రపంచం చేతిలో ఉంటుంది కాబట్టి అది చెల్లుబాటు అవుతుంది. కానీ ఓటరు నిర్దయుడు. ముఖ్యమంత్రి పీఠం నాకు బాగా నచ్చింది అక్కడే కూర్చుంటాను అని ఎంత మారాం చేసినా వాడు వినడు. ఋషుల మనస్సు దోచి తపస్సును భగ్నం చేసేందుకు రక రకాల నృత్యాలు చేసే రంభా ఊర్వశి, మేనకల్లా ఓటరు దీక్షను భగ్నం చేసి మనసు కుర్చీని లాక్కెళ్లాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తారు.

దేవ వేశ్యలను అపార్ధం చేసుకుంటాం కానీ వాళ్లు అలా ఋషుల ముందు నృత్యాలు చేసేది తమ సుఖం కోసమా కాదు కానే కాదు లోక కళ్యాణం కోసం. అంతటి అందగత్తెలు మాసిన గడ్డంతో ఏళ్ల తరబడి చెట్ల, పుట్టలతో సహవాసం చేస్తూ అడవుల్లో తపస్సు చేసే ఏ మాత్రం గ్లామర్ లేని ఋషులను కవ్విస్తూ నృత్యం చేయాలంటే ఎంత కష్టం. షోలేలో గబ్బర్ సింగ్ ముందు హేమామాలిని నాట్యం చేసినంత కష్టం. అంత గ్లామర్ ఉన్న రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమలు స్వాముల ముందు నృత్యం చేయడం లోక కల్యాణం కోసం.

 హిందీ అయినా తెలుగైనా, ఏ భాషా చిత్రాలైనా ఇప్పుడు నాలుగు రోజులు నడవాలంటే ఐటం సాంగ్స్ తప్పని సరి. కొన్ని సినిమాల్లో అయితే హీరోయినే్ల ఐటెం గర్ల్స్‌గా ప్రత్యక్షం అవుతున్నారు. ఇదేదో ఈ కాలంలో మన దర్శకులు కనిపెట్టిన విషయమేమీ కాదు. పురాణాల కాలం నుంచి ఉన్నదే. తొలి ఐటం గర్ల్ రంభ. హీరోయిన్‌గా సినిమా మొత్తం అతి తక్కువ బట్టలతో నటించడం కన్నా ఐటెం సాంగ్‌లో నృత్యం చేయడమే లాభసాటి అని కొందరు హీరోయిన్లు గ్రహించేశారు. అంత మాత్రాన మనం రంభను చిన్నచూపు చూస్తామా? ఐటెం గర్ల్స్‌ను చిన్నచూపు చూస్తామా? వారైనా వీరైనా లోక కల్యాణం కోసమే ఆ పని చేస్తారు.
కైకేయి శ్రీరామున్ని అడవులకు పంపినా, రావణుడు సీతను అపహరించినా, ఆ రాముడు చెట్టు చాటు నుంచి వాలిని సంహరించినా, అంతా లోక కల్యాణం కోసమే. ఈ లోక కళ్యాణంలో కొందరు విలన్ పాత్రలో కనిపిస్తే, కొందరు హీరో పాత్రలో కనిపిస్తారు కానీ ఇద్దరి లక్ష్యం లోక కల్యాణంమే!

నారదున్ని జగడాల మారిగా ఆడిపోసుకుంటారు సినిమా ముగియగానే చివర్లో అంతా ఆయన లోక కళ్యాణం కోసమే ఈ పని చేశారని గ్రహిస్తారు. ఏదైనా సినిమాలో హీరో విలన్‌గా కనిపిస్తే తెలుగు ప్రేక్షకుడు తొందరపడి ఒక నిర్ణయానికి రాడు. ఏదో బలమైన కారణం ఉండడం వల్లనే లోక కల్యాణం కోసం హీరో అలా విలన్‌లా ప్రవర్తిస్తున్నాడని, చివరలో అసలు విషయం బయటపడుతుందని గ్రహించేస్తారు. లోక జ్ఞానం లేకపోవడం వల్ల మహనీయులు చేసే పనిలోని లోక కల్యాణాన్ని మనం గ్రహించ లేకపోతున్నాం. తానేం చేసినా లోక కల్యాణం కోసమే అని విపక్ష నేత ప్రకటించారు. 63 ఏళ్ల వయసులో ఆయన లోకకల్యాణం కోసం పాదయాత్ర చేశారు. తన కుమారుడిని వారసునిగా తీర్చి దిద్దుతున్నారు. బాబూ అధికారం ముళ్ల కిరీటం అని సోనియా చెప్పినా లోక కల్యాణంకోసం రాహుల్‌గాంధీ ముళ్ల కిరీటం ధరించేందుకు కసరత్తులు చేస్తున్నారు. 63 ఏళ్ల వయసులో బాబు లోక కల్యాణం కోసం పాదయాత్ర చేశారు. అంతే తప్ప ముఖ్యమంత్రి పదవి కోసం కానే కాదు. తన స్థానంలో లోకేశ్‌ను కూర్చోబెట్టడానికి బాబు ప్రయత్నిస్తున్నారంటే లోక జ్ఞానం లేని వాళ్లు విమర్శలు చేయవచ్చు కానీ ఆయనా పని చేస్తున్నది లోక కల్యాణం!  కోసమే.
అమెరికా ఇరాన్ మీద దాడి చేసినా, ఇరాక్ ను పాలించే  సద్దాం హుస్సేన్‌ను చంపినా లోక కల్యాణం కోసమే. మేం ప్రపంచంలోని ఏ దేశంపై దాడి చేసినా అది లోక కల్యాణం! కోసమే తప్ప పెట్రోల్ బావుల కోసం కానే కాదు అని అమెరికా చెప్పిన తరువాత కూడా అనుమానించడం అంటే లోక కళ్యాణాన్ని అడ్డుకోవడమే. విష్ణువు మోహిని అవతారం ఎత్తింది లోక కల్యాణం కోసమే. తెలుగు నేత వేషాలతో విశ్వరూపం చూపింది లోక కల్యాణంకోసమే. లోక కళ్యాణం కోసం నేత అలా ముందుకు వెడుతుంటే, విమర్శించే వారు లోక కంటకులు. నాయకుల లోక కల్యాణం! చరిత్రను ప్రస్తావించేది కూడా లోక కల్యాణం!కోసమే.
ముక్తాయింపు .. కల్యాణం అంటే తెలుసు కాని ఇంతకు లోకమంటే? 
ఎవరి నిర్వచనం వారిది .. కొందరికి కుటుంబమే లోకం, కొందరికి సామాజిక వర్గమే లోకం ..  కొందరికి తామే లోకం అనిపిస్తుంది  త్యాగ జీవులకు తమ సంతానం లోనే లోకం కనిపిస్తుంది . యశోదకు కృష్ణుడి నోటిలో విశ్వం కనిపిస్తే ముచ్చట పడ్డ మనం కుమారుడి ముఖం లో లోకాన్ని చూసుకుంటే ఎందుకు తప్పు పట్టాలి .