27, ఏప్రిల్ 2012, శుక్రవారం

11 ఏళ్ళ తెలంగాణ ఆత్మగౌరవ పోరు




(నేడు  టిఆర్‌ఎస్ 12వ ఆవిర్భావ దినోత్సవం)

మహాత్మాగాంధీ 1921 సెప్టెంబర్ ఒకటి నాటికి స్వరాజ్యం తెస్తాను అని ప్రకటిస్తే, బహుశా తేదీ పొరపాటు పడ్డారేమో ఏప్రిల్ ఒకటి అని ఉండాలి అని కట్టమంచి రామలింగారెడ్డి చమత్కరించారు. ఆ కాలంలో స్వాతంత్య్రం లభిస్తుందని భావించడం నమ్మశక్యం కాని విషయం.

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అని కెసిఆర్ ప్రకటించినప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ఇలానే చమత్కరించారు. ఆరునెలలకు మించి పార్టీ బతికి బట్టకట్టదన్నారు. తెలంగాణపై ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధానం లభించకపోవచ్చు. కానీ రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రధాన రాజకీయ పక్షం మేం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాం అని ప్రకటించే స్థితి లేదు. డిసెంబర్ తొమ్మిదిన కేంద్రం ప్రకటించిన తెలంగాణ ఏర్పాటును కొందరు నాయకులు ఆలస్యం చేయగలిగి ఉండవచ్చు. కానీ తెలంగాణ సమస్య తెలంగాణ ఏర్పాటుతోనే పరిష్కారం అవుందని అన్ని రాజకీయ పక్షాలు గుర్తించాయి. తెలంగాణ రాష్ట్రం అంటే రాజకీయ పక్షాలు నవ్విన పరిస్థితి నుంచి తెలంగాణ అంటే ఆత్మగౌరవ నినాదం అనేంత వరకు తీసుకు వచ్చిన ఘనత మాత్రం ముమ్మాటికీ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌కే దక్కుతుంది. 

తెలంగాణ ఉద్య మం అంటే కెసిఆర్, కెసిఆర్ అంటే తెలంగాణ ఉద్యమం అనే భావనతో ఉద్యమాన్ని దెబ్బతీయాలంటే కెసిఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కెసిఆర్‌పై తీవ్ర స్థాయిలోనే విమర్శలు సాగించారు. యుద్ధం మొదలు పెట్టేంత వరకే నీ చేతిలో ఉంటుంది. అది మొదలయ్యాక ఎటైనా దారి తీయవచ్చు. యుద్ధం సాగుతున్నప్పుడు, యుద్ధం ముగిసినప్పుడు యుద్ధ ఫలితంపై ఎవరి విశే్లషణ వారికుంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో 11 సంవత్సరాల నుంచి సాగుతున్నది తెలంగాణ ఆత్మగౌరవ పోరు.
2001 ఏప్రిల్ 27న జల దృశ్యంలో ఆవిర్భవించిన టిఆర్‌ఎస్, 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ ఏట అడుగుపెడుతోంది. ఏ ముహూర్తంలో టిఆర్‌ఎస్ ఆవిర్భవించిందో కానీ ఆ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ అంశం చుట్టే తిరుగుతున్నాయి. టిఆర్‌ఎస్ పుట్టినప్పుడు ఆరునెలలకు మించి బతకదు అంటూ అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు. కానీ టిఆర్‌ఎస్ పుట్టినప్పటి నుంచి టిడిపి పతనం మొదలైంది. అప్పటి నుంచి టిడిపి ఇప్పటి వరకు కోలుకోలేకపోయింది. 2001లో టిఆర్‌ఎస్ పుట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ టిడిపి మెజారిటీ సీట్లు సాధించలేదు.
మర్రి చెన్నారెడ్డి 69లో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా సాగించినప్పుడే తెలంగాణ సాధించలేదు, కెసిఆర్ అంత కన్నా గొప్పవాడా? అంటూ కొందరు వాదించినా, చెన్నారెడ్డి కాలంలో లేని అనుకూల వాతావరణం ఇప్పుడు కెసిఆర్ కాలంలో ఉంది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం లేదు. ఇందిరాగాంధీని ప్రశ్నించే నాయకత్వం లేదు. ఇప్పుడు అలా కాదు ఒకే ఒక్క ఓటుతో కేంద్రంలో ప్రభుత్వాలు పడిపోయిన కాలమిది. కాంగ్రెస్, బిజెపి ఏదో ఒక పార్టీ సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బిజెపి దాదాపు సమాన బలంతో ఉన్నాయి. పదేళ్ల పాలనతో కాంగ్రెస్ బలహీనంగా ఉంది. బిజెపి అధికారం కోసం తహతహ లాడుతోంది.

 ఇవి తెలంగాణకు అనుకూలమైన పరిస్థితులు. ఇక రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలు ఏవీ తెలంగాణను వ్యతిరేకించే స్థితిలో లేవు. తెలంగాణ వాదం టిఆర్‌ఎస్ సొత్తు కాదు మేమూ తెలంగాణ వాదులమే అని పోటీ పడాల్సిందే తప్ప తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా తెలంగాణలో సమైక్యవాదం వినిపించే స్థితిలో ఏ రాజకీయ పక్షం లేదు.
టిఆర్‌ఎస్ బలహీనపడితే తెలగాణ వాదం బలహీనపడుతుంది అనేది సమైక్యవాదుల ఆశ. అందుకే కెసిఆర్‌పై ఆరోపణలు, విమర్శలు చేయడం ద్వారా తెలంగాణ వాదాన్ని బలహీనపరచడానికి ప్రధాన రాజకీయ పక్షాలు తీవ్రంగానే ప్రయత్నించాయి. కానీ ఒకవేళ టిఆర్‌ఎస్ బలహీనపడితే తెలంగాణను కోరుకునే తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయంగా బిజెపి వైపు చూస్తారు తప్ప టిడిపి, కాంగ్రెస్‌ల వైపు చూడరు అని మహబూబ్‌నగర్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. 

ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో టిఆర్‌ఎస్ ఆవిర్భా వం ఒక కీలక సంఘటన అయితే డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడం మరో ప్రధాన ఘటన. దీని తరువాత బిజెపి జాతీయ నాయకత్వం తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించడం కీలక పరిణామం. తెలంగాణ ఉద్యమంలో బిజెపి తాను పోషిస్తున్న పాత్రకు తగిన గుర్తింపు మహబూబ్‌నగర్ ఫలితంతో పొందింది. టిఆర్‌ఎస్ యుపిఏ మంత్రివర్గంలో చేరిన తరువాత క్రమంగా తెలంగాణ వాదుల్లో నిరాశా వాదం మొదలైంది. అదే సమయంలో బిజెపి తెలంగాణ ఉద్యమాన్ని ఇక తాము నిర్వహిస్తామని ప్రకటించింది. ఆ ప్రకటన సందర్భంలోనే కెసిఆర్ యుపిఏ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు. కెసిఆర్ ఆ సమయంలో రాజీనామా చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఇప్పటికీ ఆయనే నాయకత్వం వహించగలుగుతున్నారు.
కెసిఆర్‌తోనే తెలంగాణ ఉద్యమం వచ్చిందని భావించే వాళ్లు కొందరైతే, ఆయన్ని బద్నాం చేస్తే తెలంగాణ ఉద్యమం చల్లబడుతుంది అని భావించే వాళ్లు మరి కొందరు. అది జరిగినా ప్రత్యామ్నాయంగా మేమున్నామని బిజెపి ముందుకు రావడం తెలంగాణ కోరుకునే వారికి కలిసి వచ్చిన అంశం. పాలమూరులో టిఆర్‌ఎస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయి బిజెపి గెలవగానే అదేదో సమైక్యవాదం గెలిచినట్టుగా కొందరు సంతోషపడ్డారు. కానీ తెలంగాణ కోరుకునే వారు మాత్రం ఈ ఫలితానికి సంతోషించారు. మతతత్వ పార్టీ అని బిజెపిని వ్యతిరేకించే తెలంగాణ వాదులు సైతం తెలంగాణ వాదానికి అండగా నిలిచినందుకు బిజెపిని ఇష్టపడుతున్నారు. పార్లమెంటులో లెక్కలేనన్ని సార్లు బిజెపి తెలంగాణకు అండగా నిలిచింది. పార్టీ జాతీయ సమావేశాల్లో తెలంగాణపై తీర్మానం చేశారు. మీరు తెలంగాణ బిల్లు పెట్టండి మేం మద్దతు ఇస్తామని బిజెపి ప్రకటించింది. తెలంగాణకు బిజెపి ఇంత అండగా నిలిచినప్పుడు ఆ పార్టీని ఆదరించడం తమ ధర్మం అని తెలంగాణ కోరుకునే వారు భావించారు. బిజెపి గెలవడం ఒక రాజకీయ పార్టీగా టిఆర్‌ఎస్‌కు ఇబ్బంది కలిగించవచ్చు, తెలంగాణ మొత్తం ఆ పార్టీ గుత్త సొత్తు కాదు అనే సందేశం ఈ ఫలితం కలిగించవచ్చు. కానీ ఈ ఫలితం కచ్చితంగా తెలంగాణ వాదానికి ప్రయోజనం కలిగిస్తుంది. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి సొంతంగా పోటీ చేసినప్పుడు ఆరు ఎంపి సీట్లలో విజయం సాధించింది. అరవై అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొదటి స్థానంలో నిలిచింది. అలాంటి పార్టీ టిడిపితో చేతులు కలిపిన తరువాత కేవలం రెండు స్థానాలకు పరిమితం అయింది. తెలంగాణ వాదం బిజెపికి రాష్ట్రంలో మరోసారి అవకాశం కల్పించింది. తెలంగాణ పోరుకు శ్రీకారం చుట్టింది కెసిఆర్ కాదు. కానీ ఉధృతంగా సాగించింది, పోరును గడ్డిపోచగా చూసిన ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించింది మాత్రం ముమ్మాటికీ కెసిఆర్. 69 ఉద్యమం చల్లబడిన తరువాత తెలంగాణకు సంబంధించి చిన్న చిన్న సంస్థలు తెలంగాణ కోసం కార్యక్రమాలు చేపట్టినా అవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. టిఆర్‌ఎస్ ఆవిర్భావానికి నాలుగైదేళ్ల ముందే తెలంగాణ జనసభ మరోసారి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు.ఒక్క ఓటుతో వాజ్‌పాయి ప్రభుత్వం ఓడిపోవడంతో దేశవ్యాప్తంగా వీచిన సానుభూతి పవనాలను నమ్ముకున్న చంద్రబాబు సైతం బిజెపితో చేతులు కలిపి 1999లో రెండవ సారి అధికారంలోకి వచ్చారు. బిజెపి వల్ల అధికారంలోకి వచ్చినా చంద్రబాబు క్రమంగా తన ప్రాభవం కోల్పోతున్నారనే విషయం కెసిఆర్ గ్రహించారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం అతనికి స్వాగతం పలికింది. అప్పటికే తెలంగాణ జన సభ వేసిన విత్తనాలు తెలంగాణలో మొలకెత్తుతున్నాయి. విద్యుత్ చార్జీల పెంపుదల ఆ సమయంలో కెసిఆర్‌కు ఒక ఆయుధంగా ఉపయోగపడింది.
2001 ఏప్రిల్ 27 సచివాలయం ఎదురుగా ఉన్న జలదృశ్యంలో కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఇంద్రారెడ్డి తెలంగాణ పేరుతో పార్టీ ఏర్పాటు చేయడం, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కోసం సదస్సులు నిర్వహించడం వంటివి చేసినా వాటిలో సీరియస్‌నెస్ కనిపించలేదు. ఇవన్నీ అధికారంలో ఉన్న టిడిపిని ఇబ్బంది పెట్టడానికే తప్ప నిజంగా చిత్తశుద్ధితో తెలంగాణ సాధన కోసం జరుగుతున్న చర్యలని తెలంగాణ ప్రజలు భావించలేదు. టిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కెసిఆర్ ప్రకటించగానే దమ్ముంటే డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. కెసిఆర్ పార్టీ ఆవిర్భావ సభలోనే మీరు ఒక్క రాజీనామా అడిగితే నేను మూడు రాజీనామాలు ఇస్తున్నాను తీసుకోండి అంటూ డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎదుటి వారిని ఒక రకమైన ఆలోచనలో పెట్టి, వారు ఊహించని విధంగా నిర్ణయం తీసుకుని చావు దెబ్బ కొట్టే రాజకీయం మాకూ తెలుసు అని టిడిపి నాయకత్వానికి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే కెసిఆర్ చూపించారు. ఏ అంశంలోనైనా కాలం కీలకమైంది. ఇప్పుడు తెలంగాణకు కలిసి వచ్చే కాలం. జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి. ఈ కీలక సమయంలో ఉద్యమ నాయకత్వం తప్పటడుగులు వేస్తుందా? వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాన్ని సాధించుకుంటుందా? అనేది కాలమే చెప్పాలి
.

25, ఏప్రిల్ 2012, బుధవారం

బ్రహ్మచారుల పాలన!

ఇంకా తెలవారదేమీ ఈ చీకటి విడిపోదేమీ అంటూ అబ్బాయి బెంగాలీలో హుషారుగా పాడుకుంటూ ఇంకెన్ని రోజులు డార్లింగ్ మా డాడీ రాగానే మన పెళ్లి గురించి మాట్లాడేస్తాను. నా మాటను ఎప్పుడూ కాదనలేదు’’ అని కుర్రాడు భరోసా ఇచ్చాడు. ‘‘నీతో పెళ్లికి మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం మా వాళ్ల గొప్పతనం డార్లింగ్! మీ నాన్న బేసిక్ కన్నా మా నాన్న బేసిక్ ఎక్కువ. మీరుండే ఏరియాలో అపార్ట్‌మెంట్ ధరల కన్నా మా ఏరియా అపార్ట్‌మెంట్ ధరలు ఎక్కువ. చివరకు అద్దెలు కూడా మా ఏరియాలోనే ఎక్కువ. అయినా మనం ప్రేమించుకున్నామని ఇంట్లో వాళ్లను ఒప్పించాను’’అంటూ అమ్మాయి తనదే పై చేయి అని చెప్పుకొచ్చింది. ఇద్దరిదీ ఒకే మతం. ఔను ఒకే కులం. కులంలో ఒకే తెగ, తెగలో ఆర్థిక పరిస్థితి ఇద్దరిదీ దాదాపు ఒకటే మన మధ్య సమానత్వానికి ఇంతకు మించి ఇంకేం కావాలని అని ఒకరి కళ్లల్లో ఒకరు ఆప్యాయంగా చూసుకున్నారు.
***
‘‘సారీ డార్లింగ్’’ అబ్బాయి దిగులుగా చెప్పాడు. నేనూ అదే మాట చెప్పాలనుకున్నాను అంటూ అమ్మాయి ఇంతకూ ముందు నువ్వు చెప్పు ఆ సారీ ఎందుకో అని అడిగింది. ‘‘నిన్న నాన్నకు మన ప్రేమ సంగతి చెప్పాను. సంతోషంగా ఒప్పుకున్నారు. మీ నాన్నతో మాట్లాడతానని ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తరువాత ఏమైంది. వాళ్లేం మాట్లాడుకున్నారో తెలియదు కానీ మాటల సందర్భంలో మీ నాన్న కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త అని చెప్పాడట! మా నానే్నమో దీదీకి వీరాభిమాని అంతే చచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకునేది లేదన్నాడు’’ అని అబ్బాయి ఆగాడు. అమ్మాయి మొదలు పెట్టింది. ‘‘మీ నాన్న ఒప్పుకున్నా మా నాన్న ఒప్పుకునే ప్రసక్తే లేదు. దీదీలాంటి అహంకారి పార్టీ అభిమానికి మా పిల్లను ఇచ్చేది లేదని మా నాన్న అన్నాడు’’ అంది అమ్మాయి ఈ జన్మలో మనం ప్రేమికులుగానే మిగిలి పోదాం... ఒకరినొకరం మరిచిపోదాం అనుకుంటూ వెళ్లిపోయారు.
***
అమ్మాయి తండ్రి, అబ్బాయి తండ్రి జయహో దీదీ అనుకున్నారు. అబ్బాయికి భారీగా కట్నం వచ్చే ఓ సంబంధం కుదిరింది, అమ్మాయికేమో అమెరికా సంబంధం కుదిరింది. అమ్మాయి అబ్బాయి, వారి తండ్రులు ఈ ప్రేమ సంబంధం ఎలా వదులుకుందామా? అని ఆలోచిస్తుంటే దీదీ వారి పాలిట దేవతగా కనిపించింది. కమ్యూనిస్టు పార్టీ సానుభూతి పరులను తృణముల్ సానుభూతి పరులు చచ్చినా పెళ్లి చేసుకోవద్దని దీదీ ఆదేశించడంతో అప్పటికప్పుడు అమ్మాయి తండ్రి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం, అబ్బాయి తండ్రి తృణముల్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. రెండు పాతిక రూపాయల ఖర్చుతో రెండు కుటుంబాల సమస్య తీరిపోయినందుకు పెద్దలిద్దరు పార్టీ చేసుకున్నారు. చీర్స్ అంటూ అబ్బాయి తండ్రి జయహో దీదీ అని గట్టిగా అరిస్తే, దీదీ కలకాలం వర్థిల్లాలి అని అమ్మాయి తండ్రి మెల్లగా అన్నాడు. ఎందుకంటే ఆయన కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నాడాయె!
పెళ్లి చేసుకోని పిల్లాపాపలతో చల్లగా కాపురం చేయాలని సినీ రచయిత ఒకరు అలవోకగా చెప్పారు కానీ అదే పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. ఇప్పుడు జనాభాలో మనం ఇప్పుడు చైనాను దాటిపోయేట్టుగా ఉన్నాం. సంక్లిష్టమైన ఈ జనాభా సమస్యకు దీదీ చూపిన పరిష్కారం అనుసరించదగింది. దీదీ తొలి సలహా ప్రేమికులకు ఇచ్చింది. తరువాత మెల్లగా భార్యా భర్తలకదే సలహా ఇస్తుంది. భార్యా భర్తలు తృణముల్ కాంగ్రెస్, కమ్యూనిస్టుల్లా ఉండాలనేది దీదీ త్వరలో ఇవ్వబోయే సలహా! ఇందులో భార్య ఎవరు ? భర్త ఎవరు? అంటే ఇంట్లో పెత్తనం ఎవరిదైతే వారు తృణముల్ కాంగ్రెస్ అన్నమాట! భార్యా భర్తలు తృణముల్ కాంగ్రెస్, కమ్యూనిస్టుల్లా ఉంటే ఆ ఇల్లు ఇల్లులా ఎందుకుంటుంది అసెంబ్లీ అవుతుంది. దీదీ కోరుకునేదే అది కదా! జనాభా నియంత్రణకు ఇది దీదీ కనిపెట్టిన చిట్కా. బెంగాల్ ఈ రోజు ఏం ఆలోచిస్తే రేపు దేశం అదే ఆలోచిస్తుందని ఒకప్పుడు గట్టిగా నమ్మేవారు. వివిధ పార్టీల నాయకులు కలిసి కుంభకోణాలు చేయవచ్చు. కానీ పెళ్లిళ్లు మాత్రం చేసుకోవద్దని దీదీ ఇచ్చిన పిలుపు త్వరలోనే దేశంలోని అన్ని పార్టీలకు మార్గదర్శకం కావచ్చు. బ్రహ్మచారి దీదీకి పెళ్లి గురించి చక్కని ఆలోచనలే ఉన్నాయి. అంతేనా..? ఇంట్లో ఉన్నప్పుడు ఏ పత్రిక చదవాలి, ఏ చానల్ చూడాలో కూడా దీదీ ఆదేశాలిస్తున్నారు. దీదీ తాను చేసే ధర్మోపదేశాన్ని ప్రజలకు వివరించడానికి సొంత పత్రిక, సొంత చానల్ ప్రారంభించబోతున్నారు. ఉదయం లేవగానే ఏ టూత్‌పేస్ట్‌తో ముఖం కడుక్కోవాలో, ఏ కంపెనీ టీ తాగాలో దీదీ చెబుతారు. ఉదయం ఏ కంపెనీ టీ తాగాలో మొదలు పెట్టి రాత్రి ఏ కంపెనీ పరుపు మీద పడుకోవాలో చెబుతారు. ఎంతైనా బెంగాలీ ప్రజలు అదృష్టవంతులు.. అని కొందరంటే గిట్టని వాళ్లు బెంగాలీ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యి మీది నుంచి పడ్డట్టుగా ఉందని అంటారు. జయ, మాయా, మమతా ముగ్గురూ బ్రహ్మచారిణులే. బ్రహ్మచారి పాలన ఎలా ఉంటుందో చూపించారు, చూపిస్తున్నారు. వాళ్ల వాళ్ల పార్టీల్లో ముగ్గురూ నియంతలే. మనం అదృష్టవంతులం మనకు బ్రహ్మ చారులు లేరు.

18, ఏప్రిల్ 2012, బుధవారం

దేశం లోని సమస్యలన్నింటికీ అర్ధరాత్రి స్వతంత్రం ప్రకటించిన ముహుర్తమే కారణం నేరం నాది కాదు ముహూర్తానిది!

‘‘ఏరా ఎలా పట్టుపడ్డావు? కులపోళ్ల ముందు పరువు తీశావు కదరా? ఏరా గంగా నీ కొడుకు పట్టుపడ్డాడట కదా? అని ప్రతి అడ్డమైనోడు సానుభూతి చూపడమే! తల కొట్టేసినట్టుగా ఉంది ?’’
అని జైలు ఊచలు లెక్కిస్తున్న కొడుకు ముందు తండ్రి వాపోయాడు. ‘‘అసలే కష్టాల్లో ఉంటే నువ్వేంటి నాన్నా మరింత బాధపెడుతున్నావు’’ అంటూ దొంగ సత్తి బాధపడ్డాడు.


‘‘అలా సిగ్గుపడడానికి సిగ్గుగా లేదు. ఎలాంటి వంశంలో పుట్టావు. మన ఇంటి పేరు చెబితే చుట్టుపక్కల పాతిక గ్రామాల ప్రజలకు నిద్ర పట్టేదు కాదు. పోలీసులు నెల నెలా మామూళ్లకోసం ఇంటికి వచ్చేవారే కానీ పట్టుకునే ధైర్యం చేయలేదు. అలాంటిది నువ్వు రెండో దొంగతనానికే జైలుకెళ్లావంటే నా పరువేం కాను’’ అని తండ్రి ఆవేశంగా తిట్టాడు. 30 ఏళ్లలో లెక్కలేనన్ని దొంగ తనాలు చేశాను. ఒక్కసారి పట్టుపడలేదు. మరి నువ్వేంటిరా ఇలా పట్టుపడిపోయావు. సరే నెల రోజుల్లో బయటకు వస్తావు అది కాదు సమస్య. నీకు కాబోయే మామ గారు మొన్న వచ్చారు. చిన్న దొంగ తనానికే మీ వాడు పట్టుబడ్డాడంటే కూతురు జీవితం ఎలా ఉంటుందో అనే భయంగా ఉంది. నిన్ను చూసి మంచి సంబంధం అని ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు నీ కొడుకు ఇంత అసమర్ధుడని అనుకోలేదు. పెళ్లి సంబంధం రద్దు చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఏదో బతిమిలాడి ఒప్పించాను. కానీ మరోసారి ఇలా జరిగితే మాత్రం నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంటుంది’’ అని తండ్రి బాధగా చెప్పాడు.


‘‘తప్పు నాది కాదు నాన్నా ఆ రోజు మన ఇంటి పురోహితుడు లేకపోవడంతో కొత్తవారితో ముహూర్తం పెట్టించాం. నేను పనిలోకి వెళ్లిన ముహూర్తానిదే తప్పు’’అని చెప్పి జైలు ఊచల వైపు వీపు ఆనించి ‘‘ నేను ఇక్కడనుంచి పారిపోవడానికి మంచి ముహూ ర్తం పెట్టించు’’అని ములాఖత్ ముగియడంతో కొడుకు లోపలికి వెళ్లాడు.
ఉత్తరాన హిమాలయాలు ఎత్తుగా ఉండడం వల్ల దేశానికి వాస్తు బాగాలేదని కొందరి నమ్మకం. అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ముహూర్తం బాగాలేదని కొందరు మరింత గట్టిగా నమ్ముతారు. ముహూర్తాన్ని కాదనగలమేమో కానీ కళ్ల ముందు కనిపిస్తున్న పరిస్థితులను చూసి ఏమనగలం?


రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులకు కారణం మీరంటే మీరని రాజకీయ పక్షాలన్నీ ఇంత కాలం వీధిపోరాటాలు చేశాయి. కానీ అసలు కారణాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగు వారికి కూడా అర్ధమయ్యే తెలుగులో చక్కగా చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ముహూర్తం బాగాలేదట! అందుకే పరిస్థితులు ఇలా అఘోరించాయన్నమాట! సిబిఐ వాళ్లు తక్షణం తమ వద్ద ఉన్న కేసులు కొద్ది రోజులు పక్కన పెట్టి కిరణ్ ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని నిర్ణయించింది ఎవరు? దీని వెనక అధికారపక్షం కుట్ర ఉందా? ప్రతిపక్షం హస్తం రేఖలు ఉన్నాయా? అనే కోణంలో పరిశోధించాలి.


రథాన్ని నడిపించడంలో శల్యుడిని మించిన వాడు లేడంటారు. మహాభారత యుద్ధంలో అతన్ని అర్జునుడికి రథసారథిగా ఉండమని కోరితే అయ్యో కౌరవుల వద్ద అడ్వాన్స్ తీసుకున్నాను సాధ్యం కాదు అంటాడు. పోనీ మ్యాచ్‌ఫిక్సింగ్‌కు సిద్ధమా? అంటే దాందేం భాగ్యం సరే అని కర్ణుడికి సారథిగా ఉంటూ ఇటు పాండవులకు ఉపయోగపడే విధంగా పని చేస్తాడు. అలానే కిరణ్‌కు ముహూర్తం నిర్ణయించే వారు సైతం ఆయన్ని దెబ్బతీసే విధంగా శల్యసారథ్యం తరహా మ్యాచ్ ఫిక్సింగ్ ఉండదని ఎందుకనుకుంటాం? బాబు తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. కానీ ఆయన తెలంగాణను అమితంగా ప్రేమిస్తున్నాడని తెలుగు నేత ఒకరు బహిరంగంగా, రహస్యాన్ని విప్పి చెప్పాడు. మనకు అర్థరాత్రి స్వాతంత్య్రం వచ్చింది. అట్లాగే తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం అర్ధరాత్రి ప్రకటించిందనుకోండి. అర్ధరాత్రి ముహూర్తం వల్ల కష్టాలు వస్తాయేమో అని బాబు కలత చెంది నిలదీశారు. అంతే తప్ప తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కాదు. అని ఆ తెలుగు నేత చెప్పుకొచ్చారు.


మనుషులకేనా..? దేవుళ్లకు సైతం ఈ ముహూర్తం దెబ్బ తప్పలేదు. పట్ట్భాషేకం చేసుకోవడానికి స్నానమాడి బయటకు వచ్చిన శ్రీరాముడికి అడవుల బాట పట్టాలన్న పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. పట్ట్భాషేకానికి ముహూర్తం నిర్ణయించిన వారిని శ్రీరాముడు ఏమన్నాడో?
ఆమె పేరు వింటే నాయకులు, పోలీసులు, సినిమా వాళ్లు, ఏదీ కాని వాళ్లు పులకించి పోయేవారు. కొందరు ఆమెవైపు చూసేందుకు వణికిపోయేవారు. కానీ ఇప్పుడు ఆమెనే వణికిపోతోంది. ఎవరామె? ఎందుకిలా అంటే ? ‘‘ఏం చేస్తాం ఆరోజు లేచిన ముహూర్తం బాగాలేదు’’ అంటూ తలపట్టుకుంటోంది తారా చౌదరి.

13, ఏప్రిల్ 2012, శుక్రవారం

తోట రాముడు రామా రావును , కత్తివీరుడు కాంతారావు , దేవదాసు నాగేశ్వర్ రావు , సూపర్ స్టార్ కృష్ణ గయ్యాళి సూర్యకాంతం , గండర గండడు యస్వీ ఆర్ లను సినిమా హాల్ లో దర్శించే భాగ్యం లేదా










రాజకుమారుడు కళ్ల ముందు కనిపించినా వీడు రాజకుమారుడెమిటి? రాజకుమారుడంటే కాంతారావులా ఉండాలనిపిస్తుంది. కాంతారావు ఒక చేత్తో కత్తి ఝులిపిస్తూ మరో చేత్తో గుర్రాన్ని అదిలిస్తున్నాడు. గుర్రం పరుగులు తీస్తోంది. మీ చేతిలో పల్లీ పొట్లం ఉంది. ఒక్కో పల్లీకాయ తింటూ పెద్ద తెరపై ఈ దృశ్యం చూస్తుంటే ఎలా ఉంటుంది. ఎక్కడికో వెళ్లిపోయినట్టుగా ఉంటుంది కదూ! సాహసం సేయరా డింభకా రాజకుమారి లభిస్తుంది అని ఎస్వీఆర్ చెబితే పాపం రాజకుమారిని ప్రేమించిన తోటమాలి ఎన్టీఆర్ ఆమె కోసం ఎస్వీఆర్‌ను నమ్ముకొంటే ప్రేమకోసమై వలలో పడెనే అయ్యో పాపం పసివాడు అనే పాట బ్యాక్ గ్రౌండ్ నుంచి వినిపిస్తుంటే ఎన్టీవోడి ప్రేమ ఎలాగైనా విజయవంతం కావాలని మొక్కుకోకుండా ఉంటామా? శభాష్ సత్యం లో సూపర్ స్టార్ కృష్ణ నుమరువగలమా ? 
ఎన్టీఆర్ చాంతాడంత పద్యాలు చదివితే, బానిస’ అని ఎస్వీఆర్ ఒక్క ముక్కలో తేల్చేయడం గుర్తుందా? పెద్దతెర కన్నా ఎస్వీఆర్ పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటి భారీ నటున్ని బుల్లితెరపై చూసి సంతృప్తి పడగలమా?
రాముడు భీముడులో ఎన్టీఆర్ హోటల్‌కెళ్లి షుష్టుగా భోజనం చేసిన తరువాత అమాయక చూపులతో రెండో ఎన్టీఆర్ వచ్చి టిఫిన్ చేయకముందే బిల్లు కట్టడం చూసి అమాయకులంటే అందరికీ చులకనే అనుకోకుండా ఉంటామా?
మాయాశశిరేఖగా సావిత్రి నటన, కన్యాశుల్కంలో మధురవాణిగా ఆమె నవ్వు పెద్ద తెరపై చూసిన వాళ్లం మరిచిపోతామా? మిస్సమ్మలో జమున పెంకితనం గుర్తుందా? ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్ లాంటి హేమా హేమీలుంటే గుండమ్మ కథ అంటూ గయ్యాలి సూర్యకాంతం పేరుతో సినిమా టైటిల్ పెట్టడం సాహసం కాకమరేమిటి? వాణిశ్రీ స్టైల్ , అందగత్తెలు భారతి, కృష్ణకుమారి, కాంచన ఒక్కోక్కరిది ఒక్కో ప్రత్యేకత. వీరందరి సినిమాల్లో కడుపుబ్బా నవ్వించే రేలంగి, పద్మనాభం, రమణారెడ్డి ల హాస్యం. రాజబాబు, రమాప్రభల జంట చిలిపి చేష్టలు ఎనె్నన్నో... సూర్యకాంతం గయ్యాళితనం వల్లే కదా ఇప్పటి వరకూ ఆ పేరును ఎవరూ పెట్టుకోవడం లేదు.
ఇలాంటి అద్భుతమైన సినిమాలన్నీ చిన్నప్పుడు పెద్దతెరపై చూసిన మనం వాటిని ఏనాటికీ మరిచిపోలేం. ఈ సినిమాలు మొదటి సారి థియోటర్లలో విడుదలైనప్పుడు ఆనాటి తరం అనుభూతి ఏమిటో కానీ 85 వరకు వీటిని థియేటర్లలో మార్నింగ్ షోల్లో చూసిన వారు మాత్రం మరిచిపోలేరు. మనం చూడాలనుకుంటే ఈ సినిమాలన్నీ క్షణాల్లో ఇంటర్‌నెట్‌లో ప్రత్యక్షం అవుతాయి. కానీ ఆనాడు సినిమా చూసినప్పటి అనుభూతి ఇంటర్‌నెట్ ద్వారా చూడడంలో లభిస్తుందా? పెద్ద తెరపై ఇలాంటి సినిమాలను చూడడంలో ఉన్న మజానే వేరు. 1985 ప్రాంతం వరకు ఇలాంటి అద్భుతమైన కళాఖండాలన్నీ పెద్ద తెరపై చూసే అవకాశం ఉండేది.
మళ్లీ మనం వాటిని పెద్ద తెరపై చూడగలమా?అది మన చేజారిపోయిన అదృష్టమేనా? ప్రభుత్వం దయతలిస్తే, కాస్త పెద్ద మనసు చేసుకుంటే ఆనాటి అదృష్టం మళ్లీ మనం అనుభవించవచ్చు.
మూడు దశాబ్దాల క్రితం వరకూ ఇలాంటి అద్భుతమైన సినిమాలను పెద్ద తెరపై చూసే అవకాశం ఉండేది. కళాకారుడైన ఎన్టీరామారావు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత పాలన విషయం ఎలా ఉన్నా సినిమా అభిమానులకు మాత్రం ఈ అదృష్టం లేకుండా పోయింది.  హైదరాబాద్‌తో పాటు పెద్ద పట్టణాల్లో సినిమా హాళ్లలో మార్నింగ్ షోలను ప్రత్యేకంగా ప్రదర్శించే వారు. ఇప్పుడు ఏ సినిమా అయినా నాలుగు ఆటలు ప్రదర్శిస్తున్నారు. అప్పుడు అలా ఉండేది కాదు. కొత్త సినిమా మొదటి మూడు నాలుగు రోజులు నాలుగు ఆటలు ప్రదర్శించినా, ఆ తరువాత మార్నింగ్ షోను పాత సినిమాలనే ప్రదర్శించే వారు. తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ మనం పది అద్భుతమైన సినిమాల పేర్లు చెప్పుకుంటే, ఆ పదీ 1950 నుంచి 70 ప్రాంతంలో వచ్చినవే. మాయాబజార్, మిస్సమ్మ, రాముడు భీముడు, దేవదాసు వంటి సినిమాలన్నీ ఆ కాలంలో వచ్చినవే.
1980 కాలం నాటి యువత, పిల్లలు సైతం ఈ సినిమాలను థియేటర్లలో తిలకించి, ఇప్పటికీ వాటిని మరిచిపోలేకపోతున్నారు. దానికి కారణం ఆ రోజుల్లో సినిమా హాళ్లలో ఉదయం పూట పాత సినిమాలను ప్రదర్శించే అవకాశం ఉండడమే. గతంలో ఇప్పటి మాదిరిగా వందలాది థియోటర్లలో కొత్త సినిమాల విడుదల వంటివి ఉండేవి కావు.
 మార్నింగ్ షో మాత్రం పాత సినిమాలు ప్రదర్శించే వారు. మార్నింగ్ షోకు థియేటర్ వాళ్లు చెల్లించే పన్ను తక్కువగా ఉండేది, అదే సమయంలో టికెట్ ధర కూడా తక్కువగా ఉండేది.
దీని వల్ల థియేటర్ల వాళ్లు పాత సినిమాలనే మార్నింగ్ షోలుగా ప్రదర్శించే వాళ్లు. సహస్ర శిరచ్ఛ్ధే అపూర్వ చింతామణి, భీష్మ, బభ్రువాహన, శభాష్ సత్యం, రాము, రేలంగి హీరోగా వచ్చిన పక్కింటి అమ్మాయి, గుళేభకావళి కథ ఎనె్నన్నో అద్భుతమైన సినిమాలను మార్నింగ్ షోలుగా ప్రదర్శించే వాళ్లు.
ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత థియేటర్ల వాళ్లు పన్నులు చెల్లించే విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారని స్లాబ్ సిస్టం ఏర్పాటు చేశారు. దీంతో మార్నింగ్ షోలకు ఉరి తీసినట్టు అయింది. ఎన్ని సీట్లు ఉంటే అంత పన్ను కట్టాలి. మార్నింగ్ షోలకు ప్రత్యేక రాయితీ ఏమీ లేదు. దాంతో థియేటర్లు మార్నింగ్ షోలకు మంగళం పాడి ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు నాలుగు షోలు ఒకే సినిమాను ప్రదర్శిస్తున్నారు.
ఆ నిర్ణయంతో పాత సినిమాలను హాయిగా సినిమా హాలులో పెద్ద తెరపై చూద్దామనుకునే వారికి ఆ అదృష్టం లేకుండా పోయింది. ఆ కాలంలోనే ఎన్టీఆర్ సినిమా వారోత్సవాలు అంటూ ఆయన నటించిన అద్భుమైన ఏడు సినిమాలను రోజు కొకటి చొప్పున కొద్ది థియేటర్లలో ప్రదర్శించే వాళ్లు. అదే విధంగా అక్కినేని సినిమా వారోత్సవం, కృష్ణ, సావిత్రిల పేర్లతో ఇలానే చూపించే వాళ్లు.
ఇప్పుడు ఈ సినిమాల సీడీలు దొరుకుతున్నాయి. టీవిల్లో అప్పుడప్పుడు వీటిని ప్రదర్శిస్తున్నారు. టీవిల్లో ఐదు నిమిషాల కోసారి వచ్చే ప్రకటనల మధ్య ఇలాంటి సినిమాలను చూడడం, వాటిని జీర్ణం చేసుకోవడం కొంచం కష్టమే. ఇక సీడీల్లో వీటిని బంధించినా బుల్లితెరపై ఇంట్లో చూడడం వేరు, థియేటర్లలో ఇలాంటి సినిమాలు చూసేప్పుడు ఉండే అనుభూతి వేరు.
టూరిజం అభివృద్ధి అంటూ కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఐ మాక్స్‌ల పేరుతో థియేటర్లకు కట్టబెట్టేవాళ్లు కనీసం ఒకటి రెండు థియేటర్లలోనైనా పాత సినిమాలను ఉదయం సమయంలో ప్రదర్శించేందుకు పన్ను రాయితీ ఇవ్వలేరా? పాత సినిమాలు ప్రాచీన సంపద వంటివే. కళాఖండాలను కాపాడు కోవడం మన ధర్మం. ఇలాంటి కళాఖండాలను పెద్ద తెరపై చూసే అదృష్టం కల్పించలేరా? ఇలాంటి అద్భుతమైన సినిమాల డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాలతో సికింద్రాబాద్‌లోని రాష్టప్రతి రోడ్ కళకళలాడుతూ ఉండేది. పాత పోస్టర్లలా ఇప్పుడా కార్యాలయాలు బోసిపోయాయి. ఈ సినిమాల రీళ్లు వాళ్ల వద్ద భద్రంగానే ఉండొచ్చు. కాస్త కళాహృదయంతో ప్రభుత్వం ఆలోచిస్తే వాటిని తిరిగి వెండితెరపై చూసే భాగ్యం దక్కుతుంది. ఇప్పుడు వచ్చే సినిమాల్లో కేవలం 5శాతం మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. అన్ని థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోతున్నాయనుకుంటే భ్రమనే. ప్రభుత్వం పన్నురాయితీలతో ముందుకు రాకపోయినా ప్రయోగాత్మకంగా ఒకటి రెండు థియేటర్లు మార్నింగ్ షోలుగా పాత సినిమాలను ప్రదర్శించి చూస్తే పోయేదేముంది.

12, ఏప్రిల్ 2012, గురువారం

వావ్ బ్లాగ్స్ పై i news లో అద్భుతమైన స్టొరీ ?????



ఇప్పుడే బ్లాగ్స్ పై i news లో  ప్రత్యేక వార్తా చూశాక ఇది రాయకుండా ఉండలేక పోతున్నాను. తెలుగు నాట బ్లాగ్స్ ప్రారంభించడం బాగా పెరిగింది అని ఓ కథనం ప్రసారం చేశారు . ఒక్క తెలుగు అక్షరం కనిపించ నివ్వ కుండా , ఒక్క తెలుగు బ్లాగ్ చూపించ కూడా తెలుగు బ్లాగ్స్ పై భలే స్టొరీ చేశారు .. ఇక బ్లాగ్స్ గురించి ఒక అమ్మాయితోతెలుగు వార్తల్లో చక్కని ఇంగ్లిష్లో   మాట్లాడించారు .  నాకు తెలిసినంత వరకు  i news  తెలుగు వార్తా చానల్ . వార్తలు తెలుగులోనే ప్రసారం చేస్తారు . పోనీ తెలుగు రాని ఆఫ్రికా వాడెవడో తెలుగులో బ్లాగ్స్ పై స్టొరీ చేయమంటే అలా చేశాడని అర్ధం చేసుకోవచ్చు . కానీ  ఒక్క తెలుగు అక్షరం, తెలుగు బ్లాగ్ కనిపించకుండా తెలుగు నాడులో బ్లాగ్స్ పై స్టొరీ ఏమిటో ? ( ఆ వార్తా ఎలాగూ మళ్లీ మళ్లీ ప్రసారం చేస్తారు వీలుంటే మీరూ చూడండి )

11, ఏప్రిల్ 2012, బుధవారం

‘అఖిలపక్ష తార’!... ఆమె జీవితం సమాజానికే అంకితం


లైవ్ టెలికాస్ట్ కోసం ఆరేడు డజన్ల ఓబి వ్యాన్‌లతో అక్కడ గందరగోళంగా ఉంది. ఏమైంది ప్రధానమంత్రి వస్తున్నాడా? అని దారిన పోయే దానయ్య అక్కడున్న మీడియా వారిని అడిగాడు. ఏ కాలంలో ఉన్నావ్ ప్రధాని వస్తే ఇంత హడావుడి ఉంటుందా? అని దానయ్యను వెర్రివాడిని చూసినట్టు చూసి నవ్వాడతను. వచ్చేస్తోంది అని ఎవరో విజిల్ ఊదారు.



 లైట్ ఫోకస్ చేయడంతో మబ్బులను చీల్చుకుంటూ సూర్యుడు బయటపడినట్టుగా అక్కడ వెలుగు విరబూసింది. ముంగురు సవరించుకుంటూ మందగమనంతో వయ్యారంగా అడుగులో అడుగేసుకుంటూ తారా చౌదరి వస్తోంది. కదులుతున్న ఆత్మవిశ్వాసపు నిలువెత్తు రూపంగా ఉందామె. ఉత్సాహాన్ని ఆపుకోలేక ఒక కెమెరామెన్ ఆమెను తన్మయంగా చూస్తూ ముందుకు వెళ్లాడు. ‘‘వోయ్ కెమెరామెన్ నువ్వు కెమెరావెనక ఉండి కెమెరా నుండి ఆమెను చూడాలి కానీ ముందుకెళ్లి కళ్లతో చూడ్డం కాదు’’ అని రిపోర్టర్ ఔత్సాహిక కెమెరామెన్‌ను వెనక్కి పిలిచాడు. మెకప్ వేసుకుంటే తెలుగు హీరోయిన్‌లా, తీసేస్తే ముంభై హీరోయిన్‌లా ఉందామె అని తన సినిమా అనుభవాన్ని పంచిపెట్టాడొకరు. ఆమె రాగానే కొందరు తన్మయం చెందితే, కళారాధన తెలియని వాళ్లు హడావుడి చేశారు.


 ‘‘ఏంటీ ఏమవుతుందిక్కడ ఇదేనా మీరు నేర్చుకున్న క్రమశిక్షణ. ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలియదా? ఇదేమన్నా అసెంబ్లీ అనుకున్నారా? ’’అంటూ తారా చౌదరి ఆగ్రహించగానే కొందరు పెద్దవాళ్లు ముందుకు వచ్చి ఏదో తెలియక .... పిల్లలు వదిలేయండి అంటూ పనిలో పనిగా తారా చౌదరి చేయిని తమ చేతిలోకి తీసుకొని సర్ది చెప్పారు.
సరే పది నిమిషాల టైమిస్తున్నా, ఏమడుక్కుంటారో అడుక్కోండి అంది తారా చౌదరి


***
విలేఖరి: అసలేం జరిగిందో ముందు మీరే చెప్పండి
తారా: యూ సీ.... ఓ..కె... తెలుగులోనే చెబుతాను. నా జీవితం తెరిచిన పుస్తకం. ప్రజలకే నా జీవితం అంకితం.
వెనక నుంచి ఓ విలేఖరి: ఆవన్నీ రాజకీయాల్లో చేరాక, కుంభకోణాలు బయటపడ్డాక చెప్పాల్సిన డైలాగులు. ముందు నీ కథేందో చెప్పు’’ అని తన ముఖం కనిపించకుండా అందరికీ వినబడేట్టు అరిచాడు.
తారా: సమాజం ఇలా ఎందుకుందని నేనెప్పుడూ బాధపడుతుంటాను?
‘‘వద్దమ్మా! ముందు విషయం చెప్పు’’ ( మళ్లీ అరుపులు)
తార: ఆ సూర్యుడు ఎవరో చెబితే ఉదయిస్తున్నాడా? ఈ చంద్రుడు ఎవరి కోసమో వెనె్నల కురిపిస్తున్నాడా? గులాబీలు ఎవరి కోసమో పూయవు, అవి వాటి సహజ లక్షణం. నేనూ అంతే. సమాజంలో పడిపోతున్న విలువలను ఎలాగైనా నిలబెట్టాలని నేను కంకణం కట్టుకున్నాను.
విలేఖరి: ఒక ఎంపి గారికి కాంట్రాక్టులు ఇప్పించడానికి ఢిల్లీలో మీరు చక్రం తిప్పారట! గోవా టూర్లు వెళ్లారట!


తార: దేన్నయినా మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. ఇంద్రుడి సభలో రంభ, ఊర్వశి, మేనక వంటి వాళ్లు విశ్వశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నిర్వహించిన బాధ్యతలనే నేను రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేశాను. ఏ రాష్ట్రంలో చూసినా కాంట్రాక్టులు మన వారికే దక్కుతున్నందుకు తెలుగు వారిగా మనం సగర్వంగా తలెత్తుకుని చెప్పుకోవాలి.
విలేఖరి: మీరు ఇలా ఎలా అయ్యారు?
తార: ప్రజల కష్టాలను చూసి చలించిపోయిన గౌతముడు కష్టాలకు కారణాలు కనుగొని బుద్ధడయ్యాడు. ప్రజలను ఎలా సుఖపెట్టాలనే తపనతో నేను సమాజానికి అంకితమయ్యాను.
విలేఖరి: సాధారణంగా ఒక పార్టీ అంటే మరో పార్టీకి పడదు. కానీ మీరు అన్ని పార్టీల వారిని ఎలా ఆకర్షించగలిగారు?
తార: గుడ్ కొశ్చన్. అందుకే అంతా నన్ను ముద్దుగా ‘అఖిలపక్ష తార’ అంటారు. సమాజానికి, సమాజంలో ఉన్న పార్టీలకు, పార్టీల్లో ఉన్న నాయకులను సంతోషపెట్టాలనే అందరినీ ఏకం చేశాను.
విలేఖరి: మీ జీవితాశయం?
తార: సమాజంలో నైతిక విలువలు పెంచేందుకు త్వరలోనే ఒక బృహత్తర పథకాన్ని ప్రారంభిస్తాను. పేదరికం లేని, అందరూ సుఖంగా ఉండే సమాజాన్ని చూడాలనేది నా కోరిక! మహాత్మాగాంధీనే జైలు పాలు చేశారు నేనెంత? కేసులు నాకు కొత్త కాదు బయటకు వచ్చాక నైతిక విలువలపై ప్రచారం కోసం సొంతంగా చానల్ ఏర్పాటు చేసుకోవాలా? లేక ఎవరితోనైనా భాగస్వామ్య ఒప్పందం చేసుకోవాలా? అని ఆలోచిస్తున్నాను.



 ఆమె మాట్లాడుతుండగానే పిఎ చెవిలో ఏదో చెప్పి ఫోన్ అందించాడు. అందరూ విననివ్వండి అని సెల్‌ఫోన్ మైక్ ఆన్ చేసింది.
తార: థ్యాంక్యూ మిస్టర్ రావణ్ గోపాల్ బర్మ. సారీ ... నో... నో... నాపై సినిమా తీయాలని మీకు అనిపించడం సహజమే. ఈ మధ్య మీ వన్నీ అట్టర్ ప్లాప్ సినిమాలే మీతో సినిమాకు ఒప్పుకోలేకపోతున్నాను. అని తార లైన్ కట్ చేసింది.
విలేఖరి: చివరిగా సమాజానికి మీరిచ్చే సందేశం.
తార: మీ సుఖమే నేను కోరుతున్నా ... నా జీవితమే నా సందేశం.

9, ఏప్రిల్ 2012, సోమవారం

ప్రజలు పిచ్చివాళ్ళు .. గొర్రెల మందలా ?

^^ప్రజలు పిచ్చివాళ్ళు .. గొర్రెల మందలు ^^
^^ మీరేంటి ?
..............
నేనడిగింది మీ ఉద్యోగం గురించి కాదు ... మీరేంటి ?
.........
అయ్యో నేను మీ కులం గురించి అడగడం లేదండి ..
ప్రజలు గొర్రెలు, వెర్రి వాళ్ళు అని మీరు  అంటున్నారు . మీరు  ప్రజలు కాక పొతే మరేమిటి  దయ్యాలు, రాక్షసులా ? తెలుసుకుందామని 
ప్రజలు గొర్రెల మందలా  తయారయ్యారు. ఏ పార్టీ మంచిదో , ఎవరు మంచి నాయకుడో ఆలోచించడం లేదు ?
అలాగా మరీ మీ కులం వాళ్ళకు ఓటు వేసి గెలిపించినప్పుడు ప్రజలు మంచి వాళ్ళే కదా 
అంటే మిమ్ములను గెలిపించిన పాపానికి ప్రజలను మీ పాలనలో గొర్రెలు , వెర్రి వాళ్ల లా మార్చేశారా ? 
మీ కులం వాళ్ళు గెలిచినప్పుడయినా? మీ ప్రత్యర్ధి కులం వాళ్ళను గెలిపించి నప్పుడు అయినా ప్రజలు సహేతుక మయిన తీర్పునే ఇస్తున్నారు .. మన కులం వాడు గెలిచినప్పుడు ప్రపంచం ప్రశాంతంగా ఉన్నట్టు, మన కులం వాడు ఓడిపోతే ప్రపంచం తల క్రిందులయినట్టు బాధ పడుతున్నాం . రాత్రికి రాత్రి ప్రజలంతా కూర్చొని మాట్లాడుకున్నట్టు ఒకే రకంగా తీర్పును ఇస్తునట్టు మన ౬౦ ఏళ్ళ ప్రజా స్వామ్యం లో ప్రతి సారి నిరూపితం అయింది . మళ్లీ మళ్లీ నిరూపితం అవుతుంది .. ఎవరయినా గెలవ నివ్వండి నా అభిప్రాయం ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు . భారతీయ ఓటరు పరిణితి చెందిన వాడు . 

4, ఏప్రిల్ 2012, బుధవారం

ఎవరికెవరు కుమ్మక్కు ఈ లోకం లో ఎవరికి తెలుసు ? ఏ పార్టీ ఎటు పోతుందో ఎవరికి తెలుసు ?

గూట్లే అంటే తెలుసా? ఆ పదానికి అర్ధం పర్ధం అంటూ ఏమీ లేకపోయినా హీరోలను సైతం పక్కకు తోసేసి మొత్తం తెరను ఆక్రమించుకున్న ఎస్వీ రంగారావు ఆ డైలాగు పలకడంతో నచ్చని వాడిని ఇప్పటికీ గూట్లే అని తిట్టేంత పాపులారిటీ వచ్చింది. ఆ తరువాత జంద్యాల సుత్తికి అంత కీర్తి లభించింది. ఒకప్పుడు సినిమాల్లో బెల్‌బాటమ్ ప్యాంట్ మంచి పాపులర్! ఎన్టీవోడు అంత పెద్ద బెల్‌బాటం ప్యాంటు వేసుకుని నేను డిగ్రీలో స్టేట్ ఫస్ట్ వచ్చానమ్మా అని చెప్పేడైలాగు విన్నాక.. విజిల్ వేయడం రాని జీవితం ఒక జీవితమేనా? నాకెందుకీ శాపం భగవాన్ అంటూ నాగేశ్వరరావుపై లోపలి ప్రేమను బయటకు చెప్పలేక, పైకి కోపాన్ని నటిస్తూ వాణిశ్రీ తనలో తానే కుమిలికుమిలి ఏడ్చినట్టు ఏడ్వాలనిపించేది చాలా మందికి ఆ రోజుల్లో. శంఖంలో పోస్తేనే తీర్థం అయినట్టు కొన్ని డైలాగులు మంచి నటుల నోటిలో పడితే అక్షర లక్షలవుతాయి, అభిమానుల నోట్లో మంత్రాక్షరాలుగా మిగిలిపోతాయి. సినిమాల్లో కొన్ని ఫ్యాషన్లు, కొన్ని డైలాగులు పాపులర్ అయినట్టుగానే రాజకీయాల్లో ఒక్కో కాలంలో ఒక్కో డైలాగు ఒక వెలుగు వెలుగుతుంది.


ఆ కుంభకోణంలో ఎంత కొట్టేశారేమిటి? అని నాయకుడిని అడిగితే నా జీవితం తెరిచిన పుస్తకం అంటారు. ఆయన చిలక్కొట్టుడు వ్యవహారాలు ఆయన భార్యకు తప్ప అందరికీ తెలుసు దాంతో ఆయన ప్రతి మాటకు నా జీవితం తెరిచిన పుస్తకం అంటాడు. ఇప్పుడు లెటెస్ట్‌గా రాజకీయాల్లో వినిపిస్తున్న మాట కుమ్మక్కు. కుమ్మక్కు జన జీవితంలో పెనవేసుకుపోయిన శక్తివంతమైన డైలాగు.
***


ఏరా చంటి గాడెప్పుడూ క్లాస్‌లో ఫస్ట్ వస్తాడు. నువ్వెమో ఎప్పుడూ చివర్లోనే ఉంటావు. వాడిని చూసి నీకు సిగ్గనిపించదా?
లేదు డాడీ చంటిగాడు, క్లాస్ టీచర్‌తో కుమ్మక్కయ్యాడు. అందుకే వాడు చదివినా చదవకపోయినా ఫస్ట్ వస్తున్నాడు. నిజానికి నాకొచ్చిన మార్కులు కూడా వాడికే కలిపేస్తున్నారు.. అని కానె్వంట్ పిల్లాడు కూడా చక్కగా ఉపయోగించేస్తున్నారీ పదాన్ని.
కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు అయ్యాయనేది జగన్ ఆరోపణ. మూడు దశాబ్దాల నుంచి కాంగ్రెస్ వ్యతిరేకతే ఊపిరిగా బతికిన నేను కాంగ్రెస్‌తో కుమ్మక్కు కావడం ఏమిటి? అని బాబు ప్రశ్నిస్తే, మూడు దశాబ్దాలకు ముందు ఆయన రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్‌లోనే కదా? అనేది ప్రత్యర్థుల ఆరోపణ. కుమ్మక్కు పదాన్ని ఇంతకు ముందే బాబు ప్రచారంలోకి తీసుకు వచ్చినా ఆ సమయంలో ఇంతగా క్లిక్ కాలేదు. ఎన్టీఆర్‌ను దించేయగానే కాంగ్రెస్‌తో ఎన్టీఆర్ కుమ్మక్కు అయ్యారని బాబు అంతకు ముందే తనతో కుమ్మక్కు అయిన మీడియాతో ప్రచారం సాగించారు. బాబు, రాజగురువు ఇద్దరూ కుమ్మక్కు అయి తనను దించేశారనేది ఎన్టీఆర్ ఆరోపణ. అప్పుడు కీలక స్థానాల్లో ఉన్న మాజీ డిజిపి దొర ఈ మధ్య ఎన్టీఆర్‌తో తన అనుబంధాన్ని వివరిస్తూ పుస్తకం రాశారు. మధ్యంతర ఎన్నికలకు ఒప్పుకుంటూనే శివశంకర్, పివి నరసింహారావుల వంటి వారు పోటీ చేసే కొన్ని సీట్లలో బలహీనమైన అభ్యర్థులను పోటీకి పెట్టడానికి కుమ్మక్కు అయ్యారని దొరవారు రాశారు. కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని పచ్చపార్టీ గోలపెడుతుంటే, కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు అయిందని పంచరంగుల పార్టీ అధ్యక్షుడు జగన్ ఊరూవాడా కోడై కూస్తున్నారు. అందరూ ఒకరితో ఒకరు కుమ్మక్కయితే మేమెవరితో కుమ్మక్కు కావాలి అని కమలనాథులు ఏడ్చేస్తున్నారు.



  1. ***
సృష్టిలో కుమ్మక్కు ఎప్పుడు మొదలైందా? అని ఆలోచిస్తే, అసలు సృష్టి మొదలైందే కుమ్మక్కులతో అనిపిస్తోంది. దేవుడు వద్దని చెప్పినా ఈవ్, ఆడమ్‌లు కుమ్మక్కు కావడంతోనే కదా సృష్టి మొదలైంది. దేవతలంతా కుమ్మక్కు కావడం వల్లనే కదా రాక్షసులను అణిచిపెట్టేశారు. భోళాశంకరుడు ఎడాపెడా వరాలిచ్చేస్తుంటే, దేవతలంతా కుమ్మక్కై, మంచి ప్లాన్ వేసి రాక్షసులను సంహరించేవాళ్లు. అమృతమథనంలో న్యాయంగా రాక్షసులకు కూడా వాటా రావాలి. ఆ కాలంలో సమాజం నేటి మాదిరిగా అభివృద్ధి చెందలేదు కాబట్టి అమృతం మొత్తం కొట్టేద్దామని దేవతలంతా కుమ్మక్కయ్యారు. దేవతలు కుమ్మక్కు అయి రాక్షసులను సంవహరించడం వల్లనే కదా? మనం హాయిగా ఉన్నాం .జాతి ప్రయోజనం కోసం కుమ్మక్కు మంచిదే అని కొందరి వాదన.
***
‘‘కుమ్మక్కు అవుతుండగా, నేను కిటికీ నుంచి చూశాను. నాకు స్పష్టంగా కనిపించింది’’
‘‘ఎలా నమ్మాలి ?
సరే ఆ పార్టీల నాయకులంతా కుమ్మక్కయ్యారనడాకి ఆధారాలు ఉన్నాయా? ’’
‘‘ఎందుకు లేవు? జగన్ ఫ్యాంటు షర్ట్ వేసుకుంటాడు, కిరణ్ ఫ్యాంటు షర్ట్, కెసిఆర్ కూడా అంతే. కిరణ్‌కు రెండు కాళ్లు రెండు చేతులు ఉన్నాయి, వారికీ అంతే. వీళ్లంతా కుమ్మక్కయ్యారనడానికి ఇంత కన్నా ఇంకేం నిదర్శం కావాలి?
అయితే రాష్ట్రంలోని నాయకులంతా అలానే ఉన్నారు కదా?
ఏమో అంతా కుమ్మక్కయినా అయ ఉండొచ్చు.కాదని నేనెలా చెప్పగలను’’