29, జులై 2017, శనివారం

‘కలికాలం దేవుళ్ల’కు కష్టాలు!

‘‘ ఛీ ఛీ.. కలికాలం.. ఇలాంటి గడ్డుకాలం వస్తుందని క లలోనూ ఊహించలేదు. భక్తులకు కష్టాలు వస్తే దేవుళ్లకు మొక్కుకుంటారు. ఆ దేవుళ్లకే కష్టాలు వస్తే..?’’
‘‘సెలబ్రిటీలంతా ఒకే చోట ఉన్నారు. ఇంద్రసభలో దేవుళ్లంతా కొలువైనట్టు ఉంది. మీ అందరినీ ఒకే చోట చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. డైరెక్టర్, హీరోలు, హీరోయిన్‌లు, క్యారక్టర్ ఆర్టిస్టులు, కెమెరామెన్.. వావ్..! సూపర్‌హిట్ సినిమా కాంబినేషన్ మొత్తం ఇక్కడే ఉంది.’’
‘‘రావయ్యా.. రా! ఇక్కడ నీ పొగడ్తలకేం తక్కువ లేదు. కానీ మీ చానల్‌లో మాత్రం మేం డ్రగ్స్ తీసుకునే వార్తలు పదే పదే చూపిస్తారు. నువ్వు లేవగానే టీ తీసుకుంటావ్, ఇంకొకరు కాఫీ తాగందే బెడ్‌మీద నుంచి లేవరు. ఎవరి అలవాటు వారిది. అడగడానికి వీళ్లెవ్వరు?’’
‘‘మా హీరోయిన్ ఆరోగ్యం మీద ఆమె అమ్మ కన్నా పోలీసులకు ఎక్కువ శ్రద్ధ ఉంటుందా? వాళ్ల అమ్మే అడగలేదు. పోలీసులెవరు అడగడానికి? అయినా మేం మీడియాను పిలవలేదు కదా! ఎందుకొచ్చావ్?’’
‘‘మీడియాగా రాలేదు. ఏదో ఫ్రెండ్‌షిప్ కొద్దీ వచ్చా..’’
‘‘ఫ్రెండ్ అనుకుంటే టీవీలో డ్రగ్స్ గురించి అంతసేపు చూపించవు. సర్లే.. డ్రగ్స్ తీసుకుంటావా?’’
‘‘అమ్మో.. ఇప్పుడొద్దు. కాస్త చల్లబడిన తరువాత! మీ విచారణ పూర్తయ్యాకనే! డ్రగ్స్ ప్రస్తావన లేకుండా, మీరు డ్రగ్స్ తీసుకుంటారా? అని ప్రశ్నించకుండా, మీ అమ్మాయి మనోభావాల, మీ అమ్మ ఆవేదన, మీ ఆవిడ భావోద్వేగంపై గంట సేపు ఇంటర్వ్యూ చేశాం కదా! అయినా ఇలా నిష్ఠురం తగునా?’’
‘‘అంతకన్నా ముందు పరువు తీసేట్టుగా చూపించారు కదా? రోజంతా చూపించాల్సిన అవసరం ఉందా? కాంబోడియాలో ట్రాఫిక్ జామ్,ట్రంప్‌కు జలుబు, ఆఫ్రికా అడవుల్లో దొరికిన మూడు తలల నాగుపాము, చైనాలో కొత్త రకం వంకాయ పంట.. ఇలా ఎన్నిలేవు చూపించడానికి? మా సినిమా వాళ్ల గురించే అంతసేపు చూపించాలా?
‘‘నాకు పెళ్లయింది. మా పక్కింటి వాడికి పెళ్లయింది. రాష్ట్రంలో, దేశంలో కోట్లాది మందికి పెళ్లయింది. వాళ్ల పెళ్లి ముచ్చట్లు ఏమీ చూపలేదు. కానీ మీ సినిమావాళ్ల పెళ్ల మొత్తం రోజంతా టీవీలో చూపిస్తారు. అలా ఎందుకు? అని అప్పుడు అడిగి వుంటే బాగుండేదన్నా?’’
‘‘మీ రేటింగ్‌ల కోసం చూపిస్తారు. మా కోసమా?
‘‘ఇది కూడ అంతే. మరిచిపోయా ..  పెళ్లిళ్లు, పుట్టిన రోజులే కాదు.. పోయిన రోజు కూడా రోజంతా చూపిస్తారు. గాంధీ జయంతి రోజున గాంధీని గుర్తు చేసుకోకపోయినా, సినీనటుల పుట్టినరోజున మాత్రం గుర్తుంచుకని రోజంతా చూపిస్తాం. ఎందుకంటే మీరు దేవుళ్లు. మీ ఆవిడను మీరు మొదటిసారి ఎక్కడ కలిసారు? మీ అమ్మాయి ముద్దుపేరు ఏంటో ప్రేక్షకులకు చెబుతాం. పరమశివుని కుమారుడు గణపతి అని తెలిసినప్పుడు మీ పిల్లల పేర్లు కూడా జనాలకు తెలియడం ధర్మం.’’
‘‘అసలు మన సిస్టమ్‌లోనే తప్పుంది. మీరు సినిమా హాల్‌కు వెళ్లినప్పుడు ఫస్ట్‌క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని వుంటుంది. భారీ బడ్జెట్ సినిమా, లోబడ్జెట్ సినిమా అని వుంటుంది. ఎవరి స్థాయికి తగ్గట్టు వారు వెడతారు. అదేవిధంగా మామూలు జనాలను విచారించే చట్టాలలోనే సినిమావాళ్లను విచారించడం ఏమిటి? సినిమా వాళ్లకు ప్రత్యేక రాజ్యాంగం, చట్టం ఉండాలి’’
‘‘ఔను! రాజ్యాంగం రాసిన వారికి ఈ ముందు చూపు లేకపోవడం వల్ల తలెత్తిన సమస్య ఇది..’’
‘‘ఇప్పటికైనా రాజ్యాంగాన్ని మార్చాలి. మోదీకి చెప్పాలి’’
‘‘ఆయన ఛస్తే వినడేమో! ఒకే దేశం, ఒకే చట్టం అంటూ ఇప్పటికే ఉన్న సౌకర్యాలను పీకి పారేయాలని చూస్తున్నాడు..’’
‘‘వినకపోతే సినిమా వారికి ప్రత్యేక దేశం కావాలంటాం. సినిమావాళ్లు లేకపోతే ఈ వెర్రి జనం ఒక్కరోజు కూడా బతకలేరు. మమ్మల్ని తక్కువగా అంచనా వేయవద్దు. ఒక్క నటుడు తలుచుకుంటేనే గతంలో ఓ ప్రాంతీయ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు. మొత్తం సినిమా వాళ్లంతా తలుచుకంటే..?’’


‘‘అలాంటి నట నాయకుణ్ణి మట్టి కరిపించింది రాజకీయ నాయకుడే అయినా చిన్న సమస్యకు అంత తీవ్రమైన నిర్ణయం ఎందుకులెండి. శ్రీరాముడికే కష్టాలు తప్పలేదు. సీతమ్మపైనే నిందలు వేసారు. మీమీదా అంతే?’’
‘‘వాళ్లతో మాకు పోలికేంటి? వాళ్లు పాతకాలం నాటి దేవుళ్లు.. మేం కలియుగ దైవాలం. మేం కనిపించే దైవాలం. ఏరా..! నేనిక్కడ సీరియస్‌గా మాట్లాడుతునే ఉన్నాను. ఆ హీరోయిన్‌ను గోకుతున్నావ్! ఏ టైంలో ఏం చేయాలో తెలియదా? వాళ్లు ఒక మతం వారికి దేవుళ్లు మేం అందరికీ దేవుళ్లం’’
‘‘గోకడం లేదు సార్! హీరోయిన్ బుగ్గలపై ఎలాంటి మేకప్ వేస్తే బాగుంటుందో రిహార్సల్స్ చేస్తున్నా కెమెరా  మెన్ గా ఇవన్నీ చూసుకోవడం నా ధర్మం ...’’
‘‘ఇది షూటింగ్ ఏమో? మేకప్‌మెన్, కెమెరామెన్ గోకినా ఏమనవద్దని ఊరుకున్నాను. మరిచేపోయా! షూటింగ్ కాదు కదా!
‘‘నువ్వే చూశావుకదా! మా హీరోయిన్ ప్రతిక్షణం నటనలో లీనమై ఉంటుంది. అలాంటి హీరోయిన్‌ను కూడా అనుమానించడం అంత పాపం ఇంకోటి ఉంటుందా?’’
‘‘అవును.. మీరు నిరంతరం నటిస్తూనే ఉంటారు.’’
‘‘ప్రజలకు దగ్గర కావడం వల్ల సమస్య కానీ, అదే మద్రాస్‌లో ఉన్నప్పుడు దేవుళ్ల కన్నా మాకే ఎక్కువ క్రేజ్ ఉండేది. తిరుపతి వెంకన్నను గంటలో దర్శనం చేసుకున్నా, మద్రాస్ వచ్చి నటులను దర్శించుకోవడానికి గంటలకు గంటలు పడిగాపులు కాసేవాళ్లు. ఇప్పుడు మేం దగ్గరగా ఉండడం వల్ల కేసుల్లో బుక్కవుతున్నాం.’’
‘‘కలియుగ దైవాలు కళ్లముందు ప్రత్యక్షం అయ్యారని మురిసిపోయి సెల్ఫీ దిగి పోవాలి కానీ.. పోలీసుల ఓవర్ చేస్తున్నారు’’
‘‘కొందరు పోలీసులు  నిజంగా బుద్ధిమంతులు. ‘సిట్’ కార్యాలయంలోకి మేం రాగానే ఫోటో దిగి మా ముందే వాళ్ల పెళ్లాలకు ‘షేర్’ చేసి మురిసిపోయారు. ఆ ‘బట్టతల పోలీసు అధికారి’కే మేమంటే ఏంటో తెలియడం లేదు. దేవుళ్లను చూసిన ఫీలింగ్‌తో కాకుండా మామూలు మనుషులను చూసినట్టు చూశాడు. ఎంత అవమానం? ఆ పోలీసు బాసు మీద ఓ సినిమా తీసి.. నేనేంటో చూపిస్తా.’’


‘‘ఓసారి మోహన్‌బాబు చిత్తూరు జిల్లా ఎన్నికల ప్రచారంలో ఎన్నికల అధికారిపై కోపం వచ్చి- సినిమాలో నీ సంగతి చూపిస్తా అని వార్నింగ్ ఇచ్చి మరిచిపోయారు. మీరు మాత్రం ఆ ‘బట్టతల అధికారి’ని విలన్‌గా చూపించి ఓ సినిమా తీయాలి. డ్రగ్స్ కేసులో చివరకు ఆ పోలీసు అధికారి విలన్ అని తేలుతుంది. ఎలా ఉంది ఐడియా?’’
‘‘గుమ్మడి, నాగభూషణం, ప్రభాకర్‌రెడ్డిలతో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయి. వెరైటీగా సిఎం విలన్ అని చూపిస్తే..?’’
‘‘గుడ్ ఐడియా.. ఓ అడుగు ముందుకేసి ప్రధాని విలన్ అని చూపితే ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది.’’
‘‘విలన్ చేసే డ్రగ్స్ వ్యాపారాన్ని బయటపెట్టే పవర్‌ఫుల్ హీరోయిన్ పాత్ర నాకే. డ్రగ్స్‌లో నాకు బోలెడు అనుభవం ఉంది.’’
‘‘అసలే నిండా మునిగి పోయి ఉన్నాం. రోజులు మారాయి. హీరో ఇంట్లో అర్ధరాత్రి తుపాకీ పేల్చినా ఏమీ కాదు. ఓ టీవీ సీరియల్‌లో అత్త,కోడలి మధ్య కనిపించే అన్యోన్యతలా అధికార, విపక్షాల మధ్య ఆ కాలంలో అనుబంధం ఉండేది. ‘ఆయనే ఉంటే..’ అని ఏదో సామెత చెప్పినట్టు ఆ రోజులు మళ్లీ రావు.’’
‘‘మీరు ఇలా మా బండారం బయటపెట్టి కేసులు పెడితే- మేం అమరావతి వెళ్లిపోతాం అని వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? చచ్చినట్టు ఈ చట్టాల నుంచి మనకు మినహాయిపు ఇస్తారేమో!’’
‘‘మనం వెళ్లిపోతాం అంటే- మీ సినిమాలు మాకు వద్దు అని మెలిక పెడతారు. అసలే పది శాతం సినిమాలకు కూడా లాభాలు రావడం లేదు. మార్కెట్ సగం తగ్గితే వసూళ్లు కూడా సగం తగ్గుతాయి కదా!’’
‘‘ఏంటోయ్ కామన్ మ్యాన్ సినిమా దేవుళ్లను అందరినీ ఒకే చోట చూసి నోటమాట రావడం లేదా? అవాక్కయ్యావు’’
‘‘ స్వర్గంలో ఉండాల్సిన అప్సరస మీ అందరి మధ్యలో ఉందేమిటని ఆశ్చర్యపోతున్నారేమో!’’
‘‘చెప్పవయ్యా.. అలా చూస్తూ ఉండిపోయావేం?’’


‘‘మీలా నటించలేను, మనసులో మాట చెప్పి బాధ పెట్టలేను.. ఏదో కామన్ మెన్‌ను వదిలేయండి.’’
‘‘కాళిదాసును చూస్తే కవిత్వం వచ్చినట్టు సినిమా వాళ్లను చూసి నీకూ డైలాగులు వస్తున్నాయి. చెప్పు ఫరవాలేదు. మేమే కాదు, మమ్మల్ని పూజించే నువ్వు కూడా దేవుడివే.’’
‘‘ఆ గౌరవం అంతా ఆడియా ఫంక్షన్‌లోనే. మీ ఇంటికొస్తే సెక్యురిటీ వాడికి చెప్పి కొట్టిస్తారు.’’
‘‘ఆ సంగతి వదిలేయ్! జరుగుతున్న పరిణామాలపై నువ్వేమంటావు? నిర్మొహమాటంగా చెప్పు.. ఫరవాలేదు.’’
‘‘సినిమాలో నటించండి ఫరవాలేదు. జీవితంలో నటన ఓ భాగం. మీరేమీ సమాజానికి అతీతులు కారు. సమాజంలో మీరూ భాగమే. సినిమా కనిపెట్టకముందు కూడా సమాజం ఉంది. సినిమా లేకపోయినా సమాజం ఉంటుంది. కానీ సమాజం లేకపోతే సినిమా ఉండదు. మేము సమాజానికి అతీతులమని భావించినప్పుడే సమస్య. మేం చట్టానికి అతీతులం అనుకున్నప్పుడే చట్ట వ్యతిరేక పనులను అవలీలగా చేస్తారు లేదా మత్తులో మునిగిపోతారు. చట్టం మాకూ వర్తిస్తుందని అనుకుంటే తప్పు చేయరు’’
‘‘ ఇది చిత్తూరు నాగయ్య కాలం కాదు. పోకిరీల కాలం.. నీతులు చెబితే ఎవ్వడూ వినడు.’’
‘‘అబ్బో.. మీ సక్సెస్ ఫార్ములాతో రోజుకు పది సినిమాల షూటింగ్‌లు ప్రారంభం అయితే నెలకు ఒక్క సినిమా కూడా లాభాలు గడించడం లేదు.’’
‘‘ఇంతకూ ఏమంటావ్ ?’’
‘‘దేవుళ్లం అనే భ్రమ నుంచి బయటపడి మేమూ మనుషులమే అనే వాస్తవంలోకి రమ్మంటాను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.’’ 

*
-బుద్దా మురళి (జనాంతికం 28. 7. 2017)


21, జులై 2017, శుక్రవారం

అయ్యో.. అమెరికా ఇలా ఉందేమిటి?

‘‘విమానం న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతోంది. సీటు బెల్టు పెట్టుకోమని అనౌన్స్ చేస్తుంటే మీరెంటి సీటుకిందకు దూరారు?’’
‘‘నాకన్నా నీకు ఎక్కువ తెలుసా? ఏడవ తరగతి నుంచే క్లాస్‌బుక్స్‌లో మధుబాబు షాడో డిటెక్టివ్ బుక్స్ చదివామిక్కడ. శత్రువు ఎలాదాడి చేస్తాడో? క్షణంలో ఎనిమిదవ వంతు సమయంలో తప్పించుకోవడం, అర నిమిషంలో 12వ వంతు సమయంలో ఎదురుదాడి ఎలా చేయాలో, నిమిషంలో 14వ వంతు సమయంలో పిడిగుద్దులతో ప్రత్యర్థిని ఎలా మట్టి కరిపించాలో చిన్నప్పుడే చదివాను.’’
‘‘ఎవరైనా దాడిచేస్తే కాలిక్యులేటర్‌లో ఈ లెక్కలు చూసుకుంటారా? ఈ లోపు వాడు మిమ్ములను చితగ్గొట్టి పోతాడు కదా?’’
‘‘నా మీదే సెటైరా? మనసులోనే లెక్కలు వేసుకుంటాం. నువ్వు కూడా సీటు కిందకు దూరు’’
‘‘అది సరే.. విమానం ల్యాండ్ కావడానికి, షాడోకు, సీటు కింద దూరడానికి సంబంధం ఏమిటి?’’
‘‘వయసులో నీకన్నా ఫైవ్ ఇయర్స్ సీనియర్‌ని. 15 ఏళ్ళ నుంచి తెలుగు న్యూస్ చానల్స్ చూస్తూ పెరిగిన బుర్ర ఇది. అమెరికా ఎలా ఉందో మన చానల్స్‌లో రోజూ చూపించారు. న్యూస్ చానల్స్ చూడమంటే హారర్ మూవీస్, హారర్ న్యూస్ నచ్చవుఅని సీరియల్స్ మాత్రమే చూస్తే ఏం తెలుస్తుంది?’’
‘‘మీరు చెప్పారని వాడెవడో అర్నబ్ అని టీవీ నుంచి బయటకు వచ్చి 3డి ఎఫెక్ట్‌లో భయపెడుతున్నట్టు అనిపిస్తే భయం వేసి మళ్లీ చూసే సాహసం చేయలేదు.’’
‘‘మరదే..! అన్నప్రాసన నాడే అర్నబ్ వార్తలు చూస్తే ఎలా? కళ్ళు తెరవగానే రాంగోపాల్‌వర్మ సినిమాలు చూసినట్టు, క్రమంగా అలవాటుపడితే విషం కూడా జీర్ణం అవుతుంది. ముందు తెలుగు న్యూస్ చానల్స్‌కు అలవాటుపడితే, అర్నబ్ కూడా జీర్ణం అవుతాడు.’’
‘‘ఇంతకూ మీరు సీటు కిందకు ఎందుకు దూరినట్టు?’’
‘‘రామాయణం అంతా విన్నాక దుర్యోధనుడికి సీత ఏమవుతుంది అని అడిగారట. నీలాంటి వారెవరో?’’
‘‘రాముడికి సీత ఏమవుతుంది? అని అనాలి.’’
‘‘ఈ తెలివికేమీ తక్కువ లేదు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు అంటే ఎన్టీఆరే కదా? సీత అంటే అంజలీదేవి, గీతాంజలి, జయప్రద నుంచి నయనతార వరకు ఎవరైనా కావచ్చు.. అదన్నమాట విషయం.’’
‘‘మరి సీటు కిందకు?’’
‘‘అదే చెబుతున్నా.. అమెరికా పరిణామాలపై మన న్యూస్ చానల్స్ చూడకపోవడం వల్ల నువ్వు చాలా అజ్ఞానంలో ఉండిపోయావు. శబ్దం వినిపిస్తుంది కదా! అది విమానం ల్యాండింగ్ శబ్దం అనుకుంటున్నావు కదూ! కాదు. తూటాల శబ్దం. అమెరికాలో తూటాలతో ఆడుకుంటారు. ఏ తూటా ఎటువైపు నుంచి వచ్చి తాకుతుందో తెలియదు. న్యూస్ చానల్స్ వల్లనే నాకీ విషయాలు తెలిశాయి. వడియాలు లేనిదే మనం అన్నం తిననట్టు వారికి లంచ్‌లో తూటాలు తప్పనిసరి ఆట. యాంకర్ అందాన్ని చూస్తున్నావా? వార్తలు చూస్తున్నావా? అని నువ్వోసారి అ పార్థం చేసుకున్నావు గుర్తుందా? ఆ న్యూస్ యాంకర్ చెప్పింది ఈ విషయాలు వార్తల్లో. అంత అందంగా ఉన్న అమ్మాయి అబద్ధాలు చెబుతుందా?’’
‘‘అదా విషయం. పోకిరి లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన తన తండ్రికి డ్రగ్స్‌తో సంబంధం ఉందంటే నమ్మే ప్రసక్తేలేదు అంటోంది పూరీ జగన్నాథ్ కూతురు. ఫ్లాప్ సినిమాలు తీసిన డైరెక్టర్లు, హీరోలకు డ్రగ్స్‌తో సంబంధం అంటే నమ్మవచ్చు కానీ హిట్ సినిమాల వాళ్ళకు డ్రగ్స్‌తో ఆ ప్రసక్తే లేదు.’’
‘‘జోకా?’’
‘‘మీతో జోకులా.. లాడెన్ కొడుకు తన నాన్నను టెర్రరిస్ట్ అంటాడా? విజయ్ మాల్యా కుమారుడు తండ్రిది తప్పంటే నమ్ముతాడా?’’
‘‘ఏం చెబుతున్నావో అర్థం కాలేదు. వర్షపు చినుకులు పడకుండా గొడుగు ఎలాగో తూటాలు పడకుండా అమెరికాలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న సౌండ్ వినిపించినా కింద కూర్చోవాలి. పారిపోవాలి.’’
‘‘అబ్బా.. అది నా తుమ్ము. అంత భయపడితే ఎలా?’’
‘‘మనం నడుస్తూ రోడ్డు దాటుతుంటే అల్లంత దూరంలో కారు ఆపాడు అంటే వాడు మనల్ని లేపేయాలని చూస్తున్న జాత్యహంకారి. కాలినడకన వచ్చే వారి కోసం అంత ఖరీదైన కారు ఆపడమా?
‘‘మీ అనుమానంతో చంపేస్తున్నారు. అమెరికాలో కాలినడక వారిని మన దేశంలోలా పనికి మాలిన వారిలా చూడరు. వారికోసం కారు ఆపాల్సిందే.’’
‘‘ఏమోయ్ కాస్త చెయ్యిగిచ్చు. నిజంగా ఇది అమెరికానేనా? గ్రాఫిక్స్‌తోనే రాజధానులను నిర్మిస్తున్నారు. దేన్నీ నమ్మేట్టుగా లేదు. హైదరాబాద్‌లోని బోలక్‌పూర్‌లో కబేళాల నుంచి ఎక్కడ చూసినా రక్తం పారినట్టు, అమెరికాలోనూ అలానే రోడ్లన్నీ రక్తంతో ఎరుపెక్కి ఉంటాయనుకున్నా. కానీ శుభ్రంగా నల్లగా తళతళలాడుతున్నాయి. టీవీల్లో చెప్పినట్టు ట్రంప్ వల్ల మన ఐటి కుర్రాళ్ళు అందరూ హాహాకారాలు చేస్తూ రోడ్లపై వరద బాధితుల్లా ఉంటారనుకున్నాను. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.’’
‘‘మీ ఫేవరేట్ టీవీ యాంకర్ మీద ఒట్టు. మనం అమెరికాలోనే ఉన్నాం. మీపై న్యూస్ చానల్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే కళ్ళతో చూసినా నమ్మలేకపోతున్నారు. అందమైన యాంకర్ వార్తల ప్రభావం అంత త్వరగా పోదు.’’
‘‘నువ్వు మీడియా స్వేచ్ఛపై దాడి చేస్తున్నావు.’’
‘‘ఏ పార్టీ మీడియాపై?’’
‘‘అవన్నీ ఇప్పుడెందుకులే? ముందు అమెరికా చూద్దాం. అమెరికా ఏదో గొప్పగా అభివృద్ధి చెందిన దేశం అని మనం భ్రమల్లో ఉన్నాం. కానీ వీళ్ళు రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నారు. వాళ్ళకు మనం ఆన్‌లైన్‌లో పొలిటికల్ క్లాసులు తీసుకోవాలి. కమర్షియల్ ఏరియా, హైవే అదీ ఇదీ అని కాదు. ఎక్కడ చూసినా అడవిలా చెట్లు కనిపిస్తున్నాయి. మనం అడవిలో కూడా చెట్లు కనిపించనంతగా అభివృద్ధి సాధిస్తే, వీళ్ళేమో వెనకబడ్డారు. చెట్లను ఇలానే వదిలేస్తే మనుషులకు చోటు మిగల్చకుండా ఆక్రమించుకుంటాయి. అమెరికా ఇప్పటికైనా మనలా మేల్కొనాలి. ఎ.సి.లతో కూల్‌సిటీల టెక్నాలజీ గురించి మనం ఆలోచిస్తుంటే, చెట్లతో చల్లదనం కోసం వేల ఏళ్ళ క్రితం నాటి పద్ధతులను అమెరికా నమ్ముకొంది.’’
‘‘ఎవరిగోల వారిది.. నయగారా చూద్దాం పద’’
‘‘ట్రంప్‌ను గెలిపించవద్దు అని మా తెలుగు మీడియా మీకు చెప్పింది ఇందుకే? అనుభవించండి. కళ్ళముందు వర్ణవివక్ష చూస్తుంటే రక్తం మరిగిపోతోంది. తెల్లవాళ్ళను వదిలేసి, నల్లవాళ్ళను ఆపేస్తున్నారు.’’
‘‘అన్నిటికీ తొందరే. టికెట్ చూపించమని ఆపుతున్నాడు. వర్ణవివక్ష కాదు. పాడు కాదు.’’
‘‘నువ్వు ఎంత చెప్పినా నమ్మబుద్ధి కావడం లేదు. ఎక్కడికి వెళ్ళినా పరిచయం లేని వాడు కూడా నవ్వుతూ పలకరిస్తాడు. నవ్వే వాణ్ణి అస్సలు నమ్మకూడదు. మన నుంచి ఏదో ఆశించకపోతే నవ్వుతూ ఎందుకు పలకరిస్తారు? మనవద్ద ఉన్న డాలర్లు లాగేసుకుందామని చూస్తున్నారేమో?’’
‘‘ఆప్యాయంగా పలకరించింది షాప్ ఓనర్ కాదు. మనలాంటి కస్టమర్లే. అలా పలకరించడం వారి సాంప్రదాయం.’’
‘‘మన న్యూస్ చానల్స్‌లో నేను చూసిన అమెరికాకు, కళ్ళతో చూస్తున్న అమెరికాకు సంబంధమే లేదు. ఇది నిజంగానే అమెరికా అంటావా? దేశంలో ఎక్కడ తిరిగినా ఒక్కడూ దాడి చేయలేదు. వైట్‌హౌస్‌కు వెళ్ళినా, వాళ్ళ క్యాపిటల్ సిటీ ఆఫీసుకు వెళ్ళినా ఒక్కరూ ఆపడం లేదు. మనం కనీసం మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళినా పదిమంది అడ్డుకుంటారు. ఇక్కడ ఎక్కడా ఒక్క పోలీసు కూడా అడ్డుకోలేదు.
* * *
‘‘మనం అమెరికా యాత్ర ముగించుకొని వచ్చామని స్వాగతం పలుకుతూ ఆకాశంలోకి తారాజువ్వలు విసురుతున్నారు చూశావా?’’
‘‘మీకంత సీన్ లేదు. అలా విసురుతున్న వాళ్ళు కూడా మనతోపాటు అమెరికా నుంచి తిరిగి వచ్చిన వారే ఉత్సాహంగా వాటర్ బాటెల్స్‌ను ఆకాశంలోకి విసిరేస్తున్నారు. ఖాళీ వాటర్ బాటెల్స్ కారులో నుంచి అలా విసిరి వేయడం మన ఆచారం.’’
‘‘వాళ్ళు విసిరిన బాటెల్‌ను మన బాటెల్‌తో నేను భలే కొట్టానుకదా? ఆకాశంలో.’’
‘‘్భలే కొట్టారు అంకుల్ గురి చూసి.’’
‘‘చూశావోయ్. నా గురిని ఆ కుర్రాడు కూడా మెచ్చుకుంటున్నాడు. అమెరికాలో ఉన్నన్ని రోజులు భ్రమల్లో ఉన్నట్టు అనిపించింది. జాతీయ రహదారులపై కారును ఆపి టాయ్‌లెట్స్‌గా ఉపయోగించడం చూశాక పూర్తి స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్న భావన కలుగుతోంది. చట్టాలను పాటించి బతకడం కన్నా చావడం మేలు ఏమంటావోయ్. కారులో వచ్చి రోడ్డు ప్రక్కన చెత్త పారేయడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం అన్నీ చూశాక ఇప్పుడు మన దేశంలో మనం ఉన్నామని సంతోషంగా ఉంది. నువ్వేమంటావ్?’’
‘‘ గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం గుర్తుకొస్తోంది..’’
‘‘ఎందుకలా?’’
‘‘1920 ప్రాంతంలో గాంధీ శాసనోల్లంఘనకు పిలుపు ఇచ్చాడు. ఉద్యమం హింసాత్మకంగా మారాక మహాత్ముడు తన పిలుపును ఉపసంహరించుకున్నాడు. భారతీయులందరూ ఇప్పటికీ శాసనోల్లంఘన ఉద్యమంలోనే ఉన్నాం. ఇక్కడ చట్టాలు పాటించే వాడు పిచ్చోడు, ఉల్లంఘించే వాడు హీరో, టెర్రరిస్టులను ఆరాధిస్తాం. డ్రగ్స్‌లో మునిగిన హీరోలను పూజిస్తాం. చట్టాలు చేసేవారికి చట్టాలపై గౌరవం ఉండదు. ఎవరి కోసం చట్టాలో వారికే చట్టాలంటే పట్టదు. శాసన ఉల్లంఘన ఉద్యమానికి చరమగీతం పాడేంతవరకు ఈ దేశం ఇంతే.’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్. మనింట్లో మనకు మర్యాదలేమిటి? మన చట్టాలను మనం పాటించడమేమిటి? విదేశాల్లో చట్టాలు పాటించాలి కానీ మన చట్టాలను మనం పాటించాలి అంటే విన్నవారు నవ్విపోతారు!’’
*
-బుద్దా మురళి (జనాంతికం 21. 7. 2017)

14, జులై 2017, శుక్రవారం

మనుషులంతా ఒక్కటే..!

‘‘ఈ కాలంలో ఎవరినీ నమ్మేట్టు లేదు’’
‘‘ఔను నిజం.. ఆ ముఖ్యమంత్రి యోగినో త్యాగినో దేశప్రజల వ్రత ఫలం, పుణ్యపురుషుడు అని ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. ఆయనా అందరు నాయకుల్లాంటివాడే. ఆ మహిళా పోలీసు అధికారి బదిలీతో ఈ విషయం తేలిపోయింది. తప్పు చేసిన అధికార పక్షం కార్యకర్తలను ప్రశ్నించడమే ఆమె చేసిన ఘోరమైన తప్పిదమై, ఆమెను నెపాల్ సరిహద్దులకు బదిలీ అయ్యేట్టు చేసింది. అదేదో లాలూప్రసాద్ యాదవ్ బదిలీ చేస్తే- మన నాయకులు ఇంతే.. అనుకునే వాళ్లం. కానీ మన ఆదర్శ పురుషుడు ఆదిత్యనాథ్ యోగి ఇలా చేయడం నమ్మలేక పోతున్నాం’’
‘‘అక్షర లక్షలు విలువ చేసే మాట చెప్పావు’’
‘‘నువ్వు లక్షలు అంటే 28 శాతం జిఎస్‌టి కట్టమంటారు’’
‘‘జిఎస్‌టి మంచిదే అని కెసిఆర్ చెబుతున్నారు కదా?’’
‘‘మరక మంచిదే అని సర్ఫ్ ఎక్సెల్ వాళ్లు చెబుతారు. మరక ఉంటేనే కదా సర్ఫ్ అమ్ముడు పోయేది.. ఎవరి కోణం వారిది. పాలకుడు కోరుకునేది మరింత ఆదాయం. పాలితులు కోరుకునేది మరింత పొదుపు. ఐనా నేనన్నది ఉత్తర ప్రదేశ్ గురించి కాదు. ’’
‘‘ఎవరినీ నమ్మేట్టు లేదన్నది దేని గురించి?’’
‘‘గుండెపోటు గుమ్మడి ఓ తాతలా, మోతుబరి రైతులా కనిపిస్తాడు.. అలాంటి గుమ్మడిలో కూడా విలన్ ఉంటాడని అనుకుంటామా? నాగభూషణం అంటే తడిగుడ్డతో గొంతులు కోసే విలన్ అనుకుంటాం.. కానీ విలన్‌ను చీల్చి చెండాడే వీరోచిత హీరో ఆయనే అంటే నమ్మగలమా? మొన్న ఓ న్యూస్ చానల్‌లో ఓ నాయకుడు నైతిక విలువల గురించి అదే పనిగా చెబుతుంటే చూడలేక చానల్ మారిస్తే మరో టీవిలో ‘ఏది నిజం?’ అని 1950 ప్రాంతం నాటి సినిమా కనిపించింది. అందులో హీరో నాగభూషణం, విలన్ గుమ్మడి.. నమ్మలేక పోయాను. విలువల గురించిన ఉపన్యాసాలకు ఉండే విలువ ఏంటో తెలుసు కాబట్టి నవ్వుకొని చానల్ మార్చేస్తే ఈ సినిమా కంట పడింది. ’’
‘‘విలన్లు, కమెడియన్లు పరిణామక్రమంలో హీరోలు కావడం, హీరో విలన్ కావడం జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్‌గా ఎదగడం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎప్పటి నుంచో ఉన్నదే కదా? నాగభూషణం హీరో అంటేనే నమ్మలేం ’’
‘‘ఇందులో నమ్మక పోవడానికేముంది మోహన్‌బాబు షక్కర్ మే రక్కర్ అంటూ విలనీ పండించి.. దారి చూపిన దేవత అంటూ తాను రేప్ చేసిన కథానాయికనే పెళ్లి చేసుకుని మారిన మనిషిగా పెదరాయుడుగా గ్రామస్తులకు తీర్పులు చెప్పలేదా? అంతులేని కథలో బాధ్యత తెలియని వ్యక్తిగా జయప్రదకు అన్నగా నటించిన రజనీకాంత్ కోట్లాది మంది తమిళులకు ఆరాధ్య దైవం అవుతాడని ఊహించామా? ఓవైపు తీర్పులు చెప్పి, బాషాగా అలరించి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి కోట్లాది మందిని ఉద్ధరించాలనే స్థాయికి చేరుకుంటాడని ఎప్పుడైనా అనుకున్నామా? సాగర సంగమంలో తాగుబోతు కమల్ హాసన్ బాధ్యతాయుతమైన ‘్భరతీయుడు’గా మారుతాడని ఎవరనుకున్నారు? ఎవరైనా ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎందుకనుకుంటావు? కాలాన్ని బట్టి మారుతారు. జగపతిబాబు వాళ్ల నాన్న సూపర్ హిట్ సినిమాలు తీస్తే, జగపతిబాబు హీరోగా సూపర్ హిట్ సినిమాల్లో నటించి కాలం కలిసి రాక హీరో నుంచి ఇప్పుడు విలన్ కాలేదా? తాత వయసులో బాలకృష్ణ ఇపుడు ఇరగదీయడం లేదా? అంతా కాలమహిమ.’’
‘‘మన చేతిలో ఏమీ ఉండదు.. అంతా కాల మహిమ.. దూరదర్శన్ సీరియల్స్‌లో పేదవృద్ధుడి పాత్రలో నరసింహరాజు కనిపిస్తుంటాడు. ఆయన ముఖంలో పేదరికం వెళ్లి విరుస్తుంటుంది. చెబితే నమ్ముతావా? నరసింహరాజు ఒకప్పుడు టాప్ హీరో.. పున్నమినాగులో చిరంజీవి విలన్ అయితే ఆయన హీరో. హీరో అన్నాక విలన్‌ను పిచ్చకొట్టుడు కొట్టాలి అలా కొట్టాడు కూడా. వాళ్లిద్దరి జాతకాలు తారు మారయ్యాయి నరసింహరాజు దూరదర్శన్ జూనియర్ ఆర్టిస్ట్‌లా మారిపోతే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు.’’
‘‘ కాలం కలిసొస్తే ఎన్టీఆర్ మునిమనవళ్లు కూడా హీరోలు అవుతారు కలిసి రాకపోతే హీరో నుంచి జూనియర్ ఆర్టిస్ట్‌లై పోతారు.’’
‘‘మీ ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో నాకస్సలు అర్థం కావడం లేదు.’’
‘‘ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటారు అనుకుంటున్నాం. బాగో జాగో అన్న కెసిఆర్ తెలంగాణ వచ్చాక మీ కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తాను అని చెప్పలేదా? నా లేఖతోనే తెలంగాణ వచ్చిందని తెలంగాణలో చెప్పి మధ్యాహ్నం హెలికాప్టర్‌లో విజయవాడకు చేరుకుని అన్యాయంగా విడదీశారు అని బాబు చెప్పలేదా? ’’
‘‘అంతే కదా? అదేదో సినిమాలో ఎన్టీఆర్ హీరో, సత్యనారాయణ విలన్ ఇద్దరి మధ్య ఫైటింగ్ సీన్ పూర్తి కాగానే అదే స్టూడియోలో మరో ఫ్లోర్‌లో ఎన్టీఆర్, సత్యనారాయణలు తాతా మనవళ్లుగా అద్భుత రసాన్ని పండించారు. ఏ ఫ్లోర్ నటన ఆ ఫ్లోర్ కే పరిమితం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిఎస్‌టిని వీరోచితంగా వ్యతిరేకించిన మోదీ ప్రధానమంత్రి కాగానే జిఎస్‌టి అమలుతోనే దేశం ముందుకు వెళుతుందని చెప్పలేదా? గుజరాతీ భాషలో కేంద్రం మిధ్య అని హూంకరించి, ఇప్పుడు జిఎస్‌టితో రాష్ట్రం మిధ్య అని మోదీ చెప్పడం లేదా? ఏ పాత్రలో ఉంటే ఆ డైలాగు చెప్పక తప్పదు కదా? అద్వానీ సూపర్ హిట్ సినిమా ‘రథయాత్ర’ సమయంలో మోదీ జూనియర్ ఆర్టిస్ట్. అదే మోదీ హీరో అయ్యాక అద్వానీకి కనీసం క్యారక్టర్ ఆర్టిస్ట్ పాత్ర కూడా దక్కకుండా చేయలేదా? ’’
‘‘బాగా చెప్పావు.. దానవీర శూరకర్ణలో దుర్యోధనుడిగా ఎన్టీఆర్ అద్భుతమైన డైలాగులు చెబితే- మనకు మహాభారతంలో నిజమైన హీరో దుర్యోధనుడే అనిపించింది. అదే ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించిన సినిమాలో దుర్యోధనుడు ఇంత ఫవర్‌పుల్‌గా ఉండడు. ఎన్టీఆర్ కూడా దుర్యోధనుడి పాత్రలో చెప్పిన డైలాగులను బృహన్నల పాత్రలో చెప్పలేడు కదా? ఏ పాత్ర డైలాగులు ఆ పాత్రకే’’
‘‘సినిమాకు, రాజకీయాలకు సంబంధం ఏంటి?’’
‘‘రెండూ ఒకదానిలో ఒకటి కలిసిపోయి చాలా కాలం అయింది. రెండూ నటనే’’
‘‘మీ ఇద్దరి చర్చ సినిమాలపైనా, రాజకీయాల గురించా? నాయకుల గురించా? ’’
‘‘మనుషులంతా ఒకటే . రాజకీయాలు,సినిమాలు ఒకటే.. పాత్రకు తగ్గ డైలాగులు చెబుతారు. ఏ పాత్రా శాశ్వతంగా ఒకేలా ఉండదు. కాలాన్ని బట్టి అవసరాన్ని బట్టి మారుతుంది. దానవీర శూరకర్ణ డైలాగులను శ్రీకృష్ణ పాండవీయంలో ఆశించవద్దు అని అంతే.’’
*
-బుద్దా మురళి(జనాంతికం 14-7-2017)

8, జులై 2017, శనివారం

సభ్య సమాజానికి ఓ సందేశం..

‘‘ఏమండోయ్.. ముందు లేవండి.. మీకో అ ద్భుతమైన విషయం చెబుతాను’’
‘‘ప్రశాంతంగా పడుకోనివ్వవా? ఏంటీ చెప్పు.. కొంపతీసి జిఎస్‌టిని ఉపసంహరించుకుంటున్నట్టు మోదీ ప్రకటించారా? ఫలనా హీరో సినిమా మొదటి ఆటకే తనే్నసిందా? ’’
‘‘అవేం కాదు..’’
‘‘ ఐశ్వర్యారాయ్ ఏమన్నా మనంటికొస్తుందా? కత్రినా కైఫ్ మనల్ని రమ్మందా? ’’
‘‘పాచి మొఖంతో మీ సరసాలు ఏడ్చినట్టే ఉన్నాయి. ఐశ్వర్యారాయ్ మనింటికి రావడానికి మీరేమీ అభిషేక్ బచ్చన్ కాదు.’’
‘‘జిఎస్‌టి వల్ల అద్దె తగ్గిస్తున్నట్టు ఓనరుడు మాటిచ్చాడా? మనం వాడ్ని తెగ తిట్టుకుంటాం.. కానీ పిచ్చి వెధవ మంచోడే!’’
‘‘అద్దెలు పెరుగుతాయి కానీ కలియుగంలో ఎక్కడైనా తగ్గుతాయా? మీ ఛాదస్తం కాకపోతే ’’
‘‘మరేంటో చెప్పు..’’
‘‘పోయిన జన్మలో నేను రాకుమార్తెనట’’
‘‘సోదమ్మ చెప్పిందా? రోడ్డుమీద చిలక జోస్యం వాడు చెప్పాడా? ఇంకో పది రూపాయలు ఇస్తే మోదీ తరువాత కాబోయే ప్రధానమంత్రివి నువ్వే అని కూడా చెబుతాడు’’
‘‘నాకంతా ఆశేమీ లేదు. ఏదో సిఎం అంటే ఓకే.. కానీ ప్రధానమంత్రి పదవి వద్దు. ప్రయాణాలు నాకు పడవు. నా జన్మభూమి ఎంత అందమైన దేశము.. అంటూ పాడుకుంటూ ఇక్కడే ఉంటాను. నాకు స్కూల్ టీచర్‌ను కావాలని చిన్నప్పటి నుంచి కొరికగా ఉండేదండి. రోజూ పిల్లల మీద- అసలేం చేస్తున్నారు, ఇలాగేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో? మనమేం చేయకపోయినా అసలేం చేస్తున్నారు.. అని ఎదుటి వాడిని నిలదీయడం కన్నా మించిన ఆనందం మానవ జన్మకు లేదు. బిఇడి చేస్తున్నప్పుడు మంచి సంబంధం అని మా వాళ్లు మీకు కట్టబెట్టారు లేకపోతే టీచర్‌నై పిల్లలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంతోషంగా ఉండేదాన్ని. చిన్నప్పుడు రోజూ నాన్న అమ్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఏ నాటికైనా రోజూ ఆగ్రహం వ్యక్తం చేసే పోస్టులో ఉండాలనుకున్నాను. నా పరిశోధనలో టీచర్‌కు పిల్లల మీద, సిఎంకు అధికారుల మీద, నాయకుల మీద రోజూ ఆగ్రహం వ్యక్తం చేసే అధికారం ఉంటుందని తేలింది. ఔ నండీ.. నాకో డౌటు.. ప్రధానమంత్రికి ఆగ్రహం రాదా? ఎప్పుడు చూసినా పత్రికల్లో సిఎం ఆగ్రహం అనే వస్తుంది కానీ ప్రధాని ఆగ్రహం, రాష్టప్రతి ఆగ్రహం అని రాదెందుకు? ఆగ్రహం వ్యక్తం చేయలేని ప్రధానమంత్రి పదవి నాకు వద్దే వద్దు. ’’


‘‘ప్రధానమంత్రి పదవి తీసుకోమని నినే్నదో బతిమిలాడుతున్నట్టు .. ప్రధాని పదవి నాకు వద్దంటే వద్దు అని ప్రకటిస్తున్న రాజకీయ నాయకులు అరడజను మంది తయారయ్యారు. ఇప్పుడు వారికి జతగా నువ్వు.. సాయంత్రం ఏం వండాలో ఉదయం చెప్పి వెళితేనే నీకు గుర్తుండదు. పోయిన జన్మది బాగానే గుర్తుంది. నువ్వు రాజకుమార్తె వైతే నేను రాజకుమారుడినా? ఏ దేశం స్వయం వరంలో ప్రత్యర్థులందరినీ ఓడించి నిన్ను వరించానా? ఎలా? ఆ కథ చెప్పు ’’
‘‘మీకంత సీన్ లేదు లేండి .. నేను పోయిన జన్మలో రాజకుమారినట! మనింట్లో ఆరువందల చీరలు, వంద ఆభరణాలు, వెయ్యి జతల చెప్పులున్నాయి. ఇంతలో మెలకువ వచ్చింది.’’
‘‘రాత్రి టీవిలో వాడెవడో వందల కోట్లు వెనకేసుకున్నాడు అని కథలు కథలుగా వార్తల్లో చెప్పారు కదా? ఆ ప్రభావం కావచ్చు’’
‘‘నా జీవితానికి కల కనడమే తప్ప మురిసిపోవడానికి ఇంకేముంది? మంచి ఉద్యోగం, పట్టిందల్లా బంగారం అని ఏదేదో ఊహించి మీకు కట్టబెట్టారు. బంధువులకు చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది. మీ ఆయన కేవలం జీతం పైనే ఆధారపడి జీవిస్తారట కదా? ఈ కాలంలో ఎలా బతుకుతున్నారని నలుగురూ అడిగితే చెప్పలేక సిగ్గుతో తల చితికి పోయినట్టు ఉం టుంది. ఫలానా ఇంట్లో ఎసిబి దాడిలో ఉద్యోగి ఇంట్లో నాలుగు వందల జతల చెప్పులు, 30 వడ్డాణాలు, 13 ప్లాట్లు, వంద ఎకరాల పొలం, ఇతర ఆస్తిపత్రాలు బయటపడినట్లు టీవిలో వాళ్ల గురించి చెబుతుంటే ఇంట్లో మూలన పడి ఉన్న మూడు జతల చెప్పులు గుర్తుకు వచ్చి- హే భగవాన్.. నాకెందుకీ శిక్ష అని ఎన్నిసార్లు మూగగా రోదించానో మీకేం తెలుసండీ? మీకు కొంచెం అయినా సిగ్గనిపించదా? తోటి వారు అనే్నసి వందల కోట్లు సంపాదిస్తుంటే? ఆ మధ్య కూకట్‌పల్లిలో పోలీసు అధికారి ఒకరు పట్టుపడితే రెండుమూడు వందల కోట్ల ఆస్తులు దొరికాయి. ఆయనెవరో ఆరోగ్య శాఖలో ఏకంగా తొమ్మిది వందల కోట్లు నొక్కేశారు. మిమ్మల్నేమన్నా వేల కోట్లు కొట్టుకు రమ్మన్నానా? మన గౌరవానికి తగ్గట్టు ఓ పాతిక కోట్లయినా వెనకేయకపోతే మన బంధువుల్లో ఏం విలువ ఉంటుంది? మా ఆయనపై ఎసిబి దాడి జరిగిందంటూ అమ్మలక్కలకు చెప్పుకోవాలని నాకు మాత్రం ఉండదా? అల్లుడు గారు భలే సంపాదించారమ్మాయి నీక్కూడా చెప్పకుండా.. అ ని నాన్నగారు మెచ్చుకోవాలనే ఆశ సగటు మహిళగా నాకూ ఉంటుందండి.. ఉంటుంది. ఏదో బంగారు వడ్డాణాలు పెట్టుకొని తిరగాలని కాదు. మా ఆయనా సంపాదించగలడు.. జీతం మీదే బతకాల్సిన ఖర్మ మాకు పట్టలేదు అని గట్టిగా అరవాలనుంటుంది. జీతంపైనే బతకడం ద్వారా ఈ సభ్య సమాజానికి మీరేం సందేశం ఇవ్వదలచుకున్నారు. మా నాన్న హీరో, మా నాన్న కాంట్రాక్టర్, మా నాన్న రియల్డర్ అని సాటి పిల్లలు గర్వంగా చెప్పుకుంటే- పోవోయ్ పో.. మా నాన్న మీద ఎసిబి దాడి జరిగితే వంద కోట్ల క్యాష్ దొరికింది తెలుసా? అని గర్వంగా కాలర్ ఎగరేయాలని మన పిల్లలకు ఉండదా? చెప్పండి... ఈ సభ్య సమాజానికి మీరేం చెప్పదలుచుకున్నారు. ? ’’
‘‘ఆపు.. శకుంతలా ఆపు.. నేనేమన్నా సత్యహరిశ్చంద్రుడినని చెప్పానా? అన్ని ఉద్యోగాలూ ఒకేలా ఉండవు. అదృష్ట జాతకులు కొద్దిమందే ఉంటారు. అలాంటి ఉద్యోగం దక్కితే మూడు వందలేంటి ఐదువందల జతల చెప్పులుండేవి మన ఇంట్లో.’’


‘‘అధికారానికి అవినీతి ఆత్మ లాంటిది. ఆత్మలేని మిమ్మల్ని నాకు కట్టబెట్టినందుకు ఆ దేవున్ని అనాలి. అంతా నా ఖర్మ’’.
‘‘అలా అంటావేం..? మీ అమాయకత్వం నాకెంత నచ్చింది. జన్మజన్మలకు మన అనుబంధం ఇలానే ఉండాలి అని మొన్ననే కదా సుల్తాన్ బజార్‌లో తుంగస్వామి బట్టల షాపు చీరలు కొనేప్పుడు చెప్పావు.’’
‘‘నేనే కనుకు పతివ్రతను అయితే ఏడాదిలో ఎసిబి దాడి చేసేంతగా మా ఆయన ఎదగాలి. ఇదే నా శపథం.. అప్పటి వరకు నన్ను ముట్టుకోవద్దు’’
*