27, ఆగస్టు 2023, ఆదివారం
మజ్జిగ ప్యాకెట్ .. నీళ్ల బాటిల్ లోనూ రాజకీయం ఉంటుంది ....జర్నలిస్ట్ జ్ఞాపకాలు -86
డాక్టర్స్ హెల్త్ క్యాంపు అంటే .. ఏ నియోజకవర్గం అనడిగాను ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -86
వీళ్ళిద్దరూ డాక్టర్స్ పార్టీ శిక్షణా శిబిరాల్లో హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు అని పరిచయం చేయగానే , ఒక్క క్షణం కూడా ఆగకుండా .. ఏ నియోజక వర్గం టికెట్ ఆశిస్తున్నారు అని ప్రశ్నించగానే ఆ డాక్టర్ జంట బిత్తర పోయింది . చూసే కనులు , ఆలోచించే మెదడు ఉండాలి కానీ రాజకీయాల్లో సినిమాలను మించిన నాటకాలు కనిపిస్తాయి . ఇక్కడ రిహార్సల్స్ ఉండవు , కట్ చెప్పే డైరెక్టర్ ఉండరు , మేకప్ వేసేవారు ఉండరు , డైలాగులు రాసే రైటర్ ఉండరు . అంతా తామే సిద్ధం చేసుకొని తామే నటించాలి . అది నటన కాదు సహజం అనిపించేలా నటనలో జీవించాలి . అలా జీవించారు కాబట్టే విశ్వ విఖ్యాత నట సార్వభౌముడే కాకుండా స్వయంగా దర్శకుడు కూడా అయిన ఎన్టీఆర్ బాబు నటనలో జీవిస్తే గ్రహించలేక పోయాను అన్నారు . .
తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ పేర్లు ఉంటే , తమిళ డబ్బింగ్ తెలుగు సినిమాలకు చక్కని తెలుగు పేర్లు ఉన్నట్టు ... కొందరి నటన పేలవంగా ఉంటుంది. షర్మిల మాట్లాడితే తెలంగాణ అంటే అచ్చం డబ్బింగ్ సినిమాకు అమలాపురం బుల్లోడు , సీమ వీరుడు అని టైటిల్ లా ఉంటుంది . సీమ మీద ప్రేమతో ఆ సినిమా చూస్తే తమిళ గ్రామాలు , తమిళ బోర్డు లు ఉంటాయి . తమిళ పత్రికలను తెలుగులో చదువుతుంటారు . రాజకీయాల్లో డబ్బింగ్ సినిమాలు నడిచినట్టు చరిత్ర లేదు .
*****
కరోనా సమయంలో మా అబ్బాయి మెదక్ జిల్లాలో సేవా కార్యక్రమాలు చేశారు టికెట్ ఇవ్వరా ? అని మైనం పల్లి హనుమంతరావు గట్టిగా ప్రశ్నిస్తున్నారు . నాకు టికెట్ ఇచ్చారు సరే మా అబ్బాయికి ఇవ్వాలి అనేది అయన డిమాండ్ . కరోనాలో తన కుమారుడి సేవ గురించి ప్రస్తావించి టికెట్ డిమాండ్ చేయడం తో రాజకీయాలలో ఈ నిస్వార్ధ సేవా కార్యక్రమాలుగుర్తుకు వచ్చాయి .
ఎన్టీఆర్ నుంచి బాబు పార్టీ లాక్కున్న తరువాత చంపా పేట లో టీడీపీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేవారు . 97-98 లో ఓ రోజు ఈ శిక్షణా కార్యక్రమాల్లో రాజకీయాల్లో నైతిక విలువలు , క్రమశిక్షణ గురించి బాబు ఉపన్యాసం ముగిశాక మీడియా తిరిగి వెళ్లి పోవడానికి వస్తుంటే పార్టీలో ముఖ్యనాయకుడు పి . ఎన్ వి . ప్రసాద్ మీడియా వద్దకు పరిగెత్తుకు వచ్చి ఒక డాక్టర్ జంటను పరిచయం చేశారు . పార్టీ శిక్షణా కార్యక్రమం లో వీళ్ళు హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు సేవా భావం తో అని పరిచయం చేశారు . నవ్వుతూ ఏ నోయోజక వర్గం టికెట్ ఆశిస్తున్నారు అని అడిగాను . వాళ్ళు అప్పుడు చెప్పలేదు కానీ కానీ 1998 లో99లో ఆ డాక్టర్ సుగుణకుమారికి పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కింది . ఆమె గెలిచింది కూడా ., 98లో గెలిచాక కానీ 2004 లో ఓడిపోయాక కానీ మళ్ళీ ఎప్పుడూ ఆమె హెల్త్ క్యాంపు లు నిర్వహించినట్టు కనిపించలేదు . టికెట్ కోసం సేవా కార్యక్రమాలు కానీ టికెట్ వచ్చి గెలిచాక సేవా కార్యక్రమాలు ఏమిటీ మన పిచ్చికానీ ..
**********
పి ఎన్ వి ప్రసాద్ కూడా పార్టీలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు . ఎన్టీఆర్ కుటుంబ యల్ ఐ సి ఏజెంట్ గా జీవితాన్ని ప్రారంభించి బాబు హయం లో పార్టీలో కీలక నేతగా మారారు . హెలికాఫ్టర్ లో జగన్ ఇడుపుల పాయ ఎస్టేట్ ను రహస్యంగా చిత్రించింది ఈయనే . పార్టీకి సంబంధించి కీలక వ్యవహారాలు తెలిసిన నేత . నియోజక వర్గం టికెట్ ఆశించలేదు కానీ రాజ్య సభ సభ్యత్వం ఆశించారు . దక్కక పోవడం తో కొన్ని రోజులు రాజ్యాధికార వేదిక లో పని చేశారు . తరువాత వై యస్ ఆర్ కాంగ్రెస్ లో తేలారు . జగన్ లక్ష కోట్లు సంపాదించారు అని ఆరోపించి , సాహసోపేతంగా హెలికాఫ్టర్ లో జగన్ సామ్రాజ్యాన్ని చిత్రీకరించి సంచలనం సృష్టించిన వారు అదే జగన్ పార్టీలో చేరడం అంటే రాజకీయాల్లో సినిమాలను మించిన ట్విస్ట్ లు ఉంటాయి అంటే నమ్మకుండా ఉంటారా ?
******
మహానాడు వంటి పెద్ద మీటింగ్ లు కావచ్చు ఎన్నికల ముందు జరిగే మీటింగ్ లు కావచ్చు కొందరు మంచి నీళ్ల బాటిల్స్ , మజ్జిగ ప్యాకెట్స్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు . మజ్జిగ చిక్కదనాన్ని ఆస్వాదించడం తో పాటు ఆ మజ్జిగ ప్యాకెట్ మీద ఉన్న సందేశాన్ని చదివితే వాటిని పంచిన నాయకుడు టికెట్ ఆశిస్తున్నా నియోజక వర్గం గురించి స్పష్టం గా ఉంటుంది . తెలంగాణ , ఆంధ్ర , రాయలసీమ అనే తేడా లేదు . సికింద్రాబాద్ మహంకాళి జాతర మొదలుకొని కోటప్ప కొండ , నెల్లూరు రొట్టెల జాతర వరకు నాయకుల హోర్డింగ్ లతో పాటు వారు టికెట్ ఆశిస్తున్న నియోజక వర్గం పేరు స్పష్టంగా కనిపిస్తుంది . నాయకుల పుట్టిన రోజు కావచ్చు శ్రావణ శుక్రవారం కావచ్చు పత్రికల్లో పెద్ద ప్రకటనలు , అమ్మవారి జాతర ల వద్ద పెద్ద పెద్ద హోర్డింగ్ లు కనిపిస్తాయి . వాటిలో నాయకుల బొమ్మలు , వారు టికెట్ ఆశిస్తున్నా నియోజక వర్గం ఉంటుంది . ప్రతి సేవ వెనుక ఒక నియోజక వర్గం టికెట్ లక్ష్యం ఉంటుంది .
సేవా కార్యక్రమాలు చూసి మానవతావాది లో మానవత్వం పొంగిపొర్లుతోంది అని తొందరపడి ఓ నిర్ణయానికి రావద్దు . చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో రాజకీయ ప్రవేశం చేసినప్పుడు చెప్పనే చెప్పారు సేవే మార్గం అని . బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయండి తరువాత రాజకీయ ప్రవేశానికి ఉపయోగపడుతుంది అని చిరంజీవికి యండమూరి వీరేంద్ర నాథ్ సలహా ఇచ్చినట్టు ఎక్కడో చదివాను . దివిసీమ తుఫాను సమయంలో ఎన్టీఆర్ , అక్కినేని జోలె పట్టి విరాళాలు వసూలు చేశారు . ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంలో చెప్పుకోవడానికి ఈ సేవ ఎంతో ఉపయోగపడింది .
సేవలందు రాజకీయ సేవలు వేరు .
బుద్దా మురళి .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం