31, జులై 2013, బుధవారం

బేతాళుడు చెప్పిన ఒక రాజ్యం ఇద్దరు స్టార్ బ్యాట్‌మెన్ ల కథ

విక్రమార్కా స్టార్ బ్యాట్‌మెన్ కథ ఒకటి చెబుతాను, సావధానంగా విను. అనగనగా ఒక రాజ్యం.. ఆ రాజ్యంలో ఓ అల్లుడు. అందరి అల్లుళ్ళూ రాజకీయాల్లో ఎదిగిపోతుంటే నేనెందుకు పవర్ ప్రాజెక్టుకే పరిమితం కావాలి అసలైన పవర్ కోసం నేనెందుకు ప్రయత్నించకూడదు అనుకున్న అల్లుడు బెజవాడ గోపాలయ్య రాజకీయాల్లో దూకేసి, చెలరేగిపోయాడు. దేశంలో విభజన రాజకీయం ఊపందుకుంది. ప్రాంతాల వారీ గా మనుషులు చీలిపోయారు. ఆ సమయం లో ఒక ప్రాంతానికి స్టార్ బ్యాట్‌మెన్‌ను నేనే అంటూ గోపాలయ్య భారీ జాతీయ జెండా భుజాన వేసుకుని రాజ్యమంతా తిరిగాడు. చర్చోప చర్చల తరువాత రెండు ప్రాంతాలు యుద్ధ రంగంలో బలా బలాలు తేల్చుకోవడానికి సిద్ధం అయ్యాయి. స్టార్ బ్యాట్‌మెన్‌నని ప్రకటించుకున్న గోపాలయ్య ఊహించని విధంగా తెర వెనక్కి వెళ్లాడు. తెర ముందుకు రాజకిరణాన్ని తీసుకు వచ్చి ఇదిగో ఇతనే మీ స్టార్ బ్యాట్ మెన్ అన్నాడు.


అప్పటి వరకు టీవిల ముందు యుద్ధం చేసి స్టార్ బ్యాట్‌మెన్‌గా నిలిచిన గోపాలయ్య కనిపించని యుద్ధానికి శ్రీకారం చుట్టారు. ఆ యుద్ధంలో భాగమే స్టార్ బ్యాట్‌మెన్‌గా కిరణాన్ని ప్రకటించడం.
క్రికెట్‌లోనైనా, రాజకీయాల్లోనైనా స్టార్ బ్యాట్‌మెన్‌పైనే జట్టు ఆశలు పెట్టుకుంటుంది. మ్యాచ్ గెలిస్తే, సరే లేదంటే స్టార్ బ్యాట్‌మెన్ స్టార్ వ్యతిరేక దిశలో తిరుగుతుంది. క్రికెట్‌లో పాకిస్తాన్ వీర విహారం చేస్తున్న కాలంలో ఆ టీం కెప్టెన్‌ను ఒక పత్రిక వాళ్లు ఇంటర్వ్యూ చేశారు. ప్రపంచాన్ని గడగడలాడించే బౌలర్లను కూడా మీ వాళ్లు అస్సలు పట్టించుకోకుండా ఎడాపెడా బ్యాటింగ్ చేసేస్తారు ఏమిటీ మీ విజయరహస్యం అని అడిగితే ఆ కెప్టెన్ కూల్‌గా... నాతో పాటు మా టీం సభ్యులకు ఇంగ్లీష్ రాదు అందువల్ల అని సమాధానం చెప్పాడు. ప్రశ్న అడిగిన వానికి బుర్ర తిరిగిపోయింది. ఇంగ్లీష్ రాకపోవడానికి బ్యాటింగ్ అదర గొట్టడానికి సంబంధం ఏమిటని అడిగితే. ఎందుకు లేదు చాలా ఉంది. అంటూ పలానా దేశం జట్టు బౌలర్ యమకింకరుడు, బ్యాట్స్‌మెన్‌కు చమటలు పట్టిస్తారు అంటూ ఏవేవో ఉపమానాలతో ఇంగ్లీష్‌లో మీరు అద్భుతంగా రాస్తారు. అది చదివిన ప్రత్యర్థి టీం వాళ్లు వాడు నిజంగా యమ కింకరుడేనేమో అనుకుని అక్కడే సగం చచ్చిపోతాడు. మైదానంలోకి ప్రవేశించాక బౌలర్‌ను చూశాక మిగిలిన సగం చచ్చిపోతాడు. కానీ మా వాళ్లుకు ఇంగ్లీష్ రాదు కదా అందుకే ఎదుటి నిలిచింది ఎవడైనా ఒకటే చితక బాదేస్తారు అని చెప్పుకొచ్చాడు. మన స్టార్ బ్యాట్ మెన్ భాష విషయంలో నూ కొందరికి ఇలాంటి సందేహాలే ఉన్నాయి. అయినా ఆయన భాషను నమ్ముకుని స్టార్ బ్యాట్‌మెన్‌గా అంతా అంగీకరించేశారు.


స్టార్ బ్యాట్‌మెన్‌గా స్టాంప్ పడగానే కిరణ్‌ను మంత్రులు ఆకాశానికెత్తారు. గోపాలయ్య మాత్రం ముసిముసి నవ్వులతో తెర వెనకే ఉండిపోయారు. ఈ యుద్ధంలో మా స్టార్ బ్యాట్‌మెన్ ఇరగ దీస్తారు. ఒక వేళ మా ప్రత్యర్థి జట్టు విజయం సాధిస్తే, రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని గోపాలయ్య ప్రకటించాడు. దాంతో గోపాలయ్య మీద గౌరవం, కిరణయ్య బ్యాంటింగ్‌పై మరింత నమ్మకం ఏర్పడింది.


సచిన్ టెండూల్కర్ ఆడేప్పుడు టీమ్ అంతా క్యూ కట్టి ఔటయ్యేవాళ్లు ఎందుకలా అంటే డ్రెస్సింగ్ రూమ్‌లో సచిన్ ఆటను టీవిలో చూడవచ్చని అంటారు. అలానే సీమాంధ్ర నేతలంతా బ్యాటింగ్ భారాన్ని స్టార్ బ్యాట్‌మెన్‌పై వేసి తమ తమ వ్యాపారాల్లో తాము మునిగిపోయారు.
మూడేళ్ల నుంచి సీమాంధ్ర స్టార్ బ్యాట్‌మెన్‌గా తనను తానే ప్రకటించుకున్న గోపాలయ్య కూడా స్టార్ బ్యాట్‌మెన్ కిరణయ్య అంటూ ఆకాశానికెత్తారు. నాయకులంతా స్టార్ బ్యాట్‌మెన్‌ను భుజానికెత్తుకుని రాజమాత సమక్షంలో దించా రు. వార్ రూమ్‌లో ఎవరి మధ్య ఎలాంటి యుద్ధం జరిగిందో కానీ కిరణయ్య చిరునవ్వులతో టీవిలకు ఫోజులిచ్చారు. స్టార్ బ్యాట్‌మెట్ వార్ రూమ్ లో రాజమాతను కడిగేశారు, నిలదీశారు, దేశాన్ని పాలించే విధానం ఇదేనా? అని మండిపడ్డారు అంటూ మీడియా కోడై కూసింది.
మీడియాలో వార్తల జీవిత కాలం ఒక రోజే. ఆ రోజు గడిచిపోగానే యుద్ధ గదిలో వాస్తవంగా ఏం జరిగిందో బయటకు వచ్చింది. సంస్థానంలోని రెండు వర్గాల నేతల యుద్ధాన్ని కళ్లారా చూసిన రాజమాత విభజనకు పచ్చజెండా ఊపింది.


విక్రమార్క కథ విన్నావు కదా? అప్పటి వరకు తానే స్టార్ బ్యాట్‌మెన్‌ను అని ప్రకటించుకున్న బెజవాడ గోపాలయ్య యుద్ధ రంగానికి వెళ్లే ముందు వెన్ను చూపినట్టుగా హఠాత్తుగా ఎందుకలా చేశాడు. అని బేతాళుడు ప్రశ్నించాడు. విక్రమార్కుడు నవ్వి బేతాళా నువ్వన్నట్టు గోపాలయ్య కాడిని కింద పారేయలేదు. రాజకీయ యుద్ధం అనేది కంటికి కనిపించకుండా మెదడుతో జరుగుతుంది గోపాలయ్య చేసింది అదే. వార్ రూమ్‌లోకి అనేక సార్లు వెళ్లి వచ్చిన బెజవాడ గోపాలయ్యకు రాజమాత మనసులోని మాట తెలుసు. అది తెలిశాకే తెర వెనుక యుద్ధం ప్రారంభించాడు. స్టార్ బ్యాట్‌మెన్‌గా కిరణయ్యను ప్రకటించడమే కాకుండా విభజన జరిగితే సన్యాసం తీసుకుంటానని అన్నాడు.


విభజనతో అప్పుడేం జరుగుతుంది. స్టార్ బ్యాట్‌మెన్ కిరణయ్య ఘోరంగా ఓడిపోయినట్టు తేలుతుంది. సన్యసించిన గోపాలయ్య ఇంటి ముందు వేల సంఖ్యలో అభిమానులు చేరుతారు. నువ్వు బయటకు రావాలి. మమ్ములను పాలించాలి అని వేడుకుంటారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఇటు కిరణయ్య నుంచి పోటీ తప్పుతుంది. విభజనతో ఒక ప్రాంతం తన ఆధీనంలోకి వస్తుంది. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు గోపాలయ్య ఒకటి తలిస్తే ఓటరు ఏం తలుస్తున్నాడనేది కాలమే తేల్చాలి అని విక్రమార్కుడు చెప్పగానే బేతాళుడు మాయమయ్యాడు.

24, జులై 2013, బుధవారం

తెలంగాణా పై అత్తాస్త్రం


తెలుగు బంధుత్వాల్లో అత్తపై ఏర్పడినంత వ్యతిరేకత మరే బంధువుపై ఏర్పడి ఉండదు. రాజరికాల్లో అన్నా దమ్ముళ్లు సింహాసనం కోసం గోతులు తవ్వుకున్నారు. ఆధునిక కాలంలో ఆస్తుల కోసం పీకలు కోసుకున్నారు. మహాభారత యుద్ధం దాయాదుల మధ్యే కదా? అయినా అన్నదమ్ముల బం ధాన్ని అనురాగానికి చిహ్నాంగా గుర్తోస్తే, అత్త అనే పదం మాత్రం తెలుగు వారి మదిలో ఆడవిలన్‌గానే ముద్రించుకుని పోయింది. అత్త మీదున్న సామెతలు కూడా ఆమెనో పెద్ద విలన్‌గా చూపించేవే. ఆరునెలల వయసులో పట్టేది అత్త దయ్యం అని మనకో సామెత. ఆరునెలల వయసులో పసికూన మాట్లాడడం మొదలు పెడుతుంది. తొలి మాట అత్త అనే వస్తుంది దానికి గుర్తుగా ఈ సామెత పుట్టింది. 

చివరకు తెలుగు సినిమాలు సైతం అత్తకు తీరని ద్రోహం చేశాయి. సరే ఇప్పటి సినిమాలో ఆడా మగ సంబంధాలు తప్ప మరే బంధుత్వాలు లేవు, బంధుత్వాలపై పాటలు లేవు కానీ పాత సినిమాల్లో అన్ని రకాల బంధుత్వాలపై అద్భుతమైన పాటలున్నాయి. కానీ వాళ్లు కూడా అత్తకు అన్యాయమే చేశారు. ఓ నాన్నా నీ అనురాగం అంటూ తండ్రి ప్రేమను కళ్లకు కట్టినట్టు చూపించారు. అమ్మమీద లెక్కలేనన్ని పాటలు రాశారు. కానీ ఒక్కటంటే ఒక్క పాటలోనూ అత్త మీద అభిమానం చూపించారా?
అత్త అనగానే కళ్ల ముందు తెలుగు సినిమా లేడీ విలన్‌లా ప్రత్యక్షం అవుతుంది. సూర్యకాంతం, చాయాదేవి లాంటి వారు అత్తను శాశ్వతంగా విలన్‌గా మార్చేశారు. అత్త అంటే ఇలానే ఉండితీరాలేమో అనుకుని సినిమాల్లోని వీరి పాత్రలను ఇంట్లో అమలు చేసిన వారు కూడా ఉన్నారు. సూర్యకాంతంకు పిల్లలు లేరు కాబట్టి సమస్య ఆమె దృష్టికి రాకపోయి ఉండొచ్చు. కానీ ఒకవేళ ఆమెకు కొడుకు ఉంటే పిల్లనివ్వడానికి జంకేవారే! అత్తపాత్రలో ఆమె అంతగా జీవించేశారు.


అది సరే రాజకీయాలు మాట్లాడకుండా హఠాత్తుగా అత్త సబ్జెక్ట్ ఎందుకు? అనే కదా? మీకొచ్చిన సందేహం...? ఎప్పుడూ లేని విధంగా తెలుగు నాయకులు, తెలుగు మీడియా హఠాత్తుగా అత్తగారిని గుర్తు చేసుకుంటున్నారు.


ఒబామా వద్దంటేనో, పాకిస్తాన్‌తో యుద్ధం వస్తేనో తప్ప రాష్ట్ర విభజన ఆగేట్టుగా కనిపించడం లేదని ఒక తెలుగు నాయకుడు ఆఫ్‌ది రికార్డ్‌గా వాపోయాడు. మరో నేత మనం చివరి వరకు ప్రయత్నాలను ఆపవద్దు వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టు సెంటిమెంట్‌ను సెంటిమెంట్‌తోనే ఎదుర్కొందామని చెబుతున్నాడు.

 రావణుడు శక్తివంతమైన ఒక బాణం వేస్తే శ్రీరాముడు మరో బాణం వేసి దాన్ని అడ్డుకుంటాడు. దేవతల మధ్య యుద్ధం జరిగినా, దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరిగినా ఒక బాణాన్ని మించిన మరో బాణం వేసి దాన్ని పని చేయకుండా చేస్తారు. బాణాన్ని బాణంతోనే ఎదుర్కొన్నట్టు సెంటిమెంట్ పై సెంటిమెంట్ ఆయుధాన్ని ప్రయోగిద్దాం అని నిర్ణయించుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌పై అత్త సెంటిమెంట్‌ను ప్రయోగించారు. చివరగా అత్తసెంటిమెంట్‌పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు.


స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత ప్రజాధరణ పొందిన నాయకురాలు, మీడియా అత్యధికంగా ద్వేషించిన నాయకురాలు ఇందిరాగాంధీ. ఎమర్జన్సీ అనే పదం ఇందిరాగాంధీ ఇంటిపేరుగా మారిపోయింది. అమెను ప్రజలు ఎంతగా ఆదరించారో, మీడియా అంతగా వ్యతిరేకించింది. అలాంటి ఇందిరా గాంధీ జపం ఇప్పుడు తెలుగు నాట హఠాత్తుగా మొదలైంది. 2003లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క ఆరునెలలు ఓపిక పట్టండి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అంటూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విస్తృతంగా ప్రచా రం సాగించారు. ఇందిరమ్మ, ఎమర్జన్సీ రెండు వేరువేరు కావు కాబట్టి అప్పటి తెలుగు మీడి యా, తెలుగు నేతలు ఇందిరమ్మ రాజ్యం అంటే మళ్లీ ఎమర్జన్సీ తీసుకు వస్తారా? అని రాజశేఖర్‌రెడ్డిని నిలదీశారు. ఇందిరాగాంధీని వ్యతిరేకించడమే ఊపిరిగా బతికిన వర్గమంతా ఇప్పుడు ఇందిర జపం చేస్తున్నారు. ఏ పేరు చెబితే ఓట్లు పడతాయో ఆ పేరు చెప్పడం నాయకుల జన్మహక్కు. దానిలో భాగంగానే ఇందిరాగాంధీ పేరు చెప్పుకుంటున్నారా? అంటే అది కాదు. రాష్ట్ర విభజనను నిలపడానికి వారికి మిగిలిన ఏకైక ఆశ ఇందిరాగాంధీ.


1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఇందిరాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. అత్త ఇవ్వలేదు కాబట్టి అత్తపై ఏ మాత్రం గౌరవం ఉన్నా తెలంగాణ ఇవ్వవద్దు అనేది వీరి అత్తాయుధం. ఇందిరాగాంధీ నామాన్ని జపించిన వారు కాకుండా ఇందిరాగాంధీని వ్యతిరేకించడమే జీవిత ఊపిరిగా బతికిన వర్గం నుంచే ఈ డిమాండ్ రావడం రాజకీయ విచిత్రం!


హైదరాబాద్ సంస్థానాన్ని బలవంతంగా విలీనం చేసుకున్నారని నిజాం ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేయడం వల్ల, ఆ ఫిర్యాదు అలానే ఉండడం వల్ల 69లో ఇందిరాగాంధీ తెలంగాణ ఏర్పాటు చేయలేదు అనేది తెలంగాణ కోరుకునే వారి వాదన. సోనియాగాంధీ ఇందిరాగాంధీ మాట వినాలని చెబుతున్న వారు ఇందిరాగాంధీ తండ్రి నెహ్రూ కలిసి ఉండలేక పోతే ఎప్పుడైనా విడిపోవచ్చని చెప్పారు కదా? ఆ మాట వినాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. తాత మాటలు వినేదెవరు? అత్త మాటనే వినాలి అనేది వారి వాదన. పెళ్లి కాగానే తల్లిదండ్రులను, అత్తమామలను వృద్ధాశ్రమాలకు పంపుతున్న కాలంలో ఏ కారణం చేతనైతేనేమి అత్త మీద గౌరవం పెరగడం మంచిదే.
బంధుత్వాల్లో నాకు నచ్చని ఒకే ఒక పదం అత్త అంటూ నిన్నమొన్నటి వరకు అత్త అనే మాట వింటేనే గయ్యిమని లేచే తెలుగు బాబులు కూడా ఇప్పుడు అత్తాయుధంపైనే ఆశలు పెట్టుకున్నారు. అత్తగా నాకు కనీస మర్యాద ఇచ్చేది లేదా అల్లుడూ? అంటూ అత్త లక్ష్మీపార్వతి అవకాశం చిక్కినప్పుడల్లా  ఏదో ఒక టీవిలో అల్లుడ్ని కడిగేస్తునే ఉన్నారు. మామను దించినా, అత్తమ్మ పోరు ఆయన్ని  వెంటాడుతూనే ఉంది. ఇంత కాలం అత్తమ్మ అనే మాట వింటేనే మండిపడే ఆయన కూడా ఇప్పుడు అత్తాస్త్రం ప్రయోగ ఫలితం పై ఆశగా, మౌనంగా  ఎదురు చూస్తున్నారు . డిల్లి లో చక్రం తిప్పిన  ఆయనకు ఇంతకు మించిన అస్త్రం కనిపించడం లేదు.  


కోడలి పాత్ర నుంచి అత్తమ్మ వయసులోకి వచ్చిన సోనియాగాంధీ అత్తగా సొంత నిర్ణయం తీసుకుంటుందా? లేదా? కాలమే సమాధానం చెబుతుంది.

19, జులై 2013, శుక్రవారం

జగన్ బాబుకో లేఖ


ఏం చేస్తున్నావు ?
జగన్ బాబుకు లేఖ రాస్తున్నాను 
దొరికి పోయావు . నువ్వు జగన్ అభిమానివి కదూ
అని ఎవరు చెప్పారు ?
లేకపోతే ఎవరు రాస్తారు?
అభిమానులే రాయాలా ?
ప్రశ్నలు కాదు ..యెమ్ రాస్తున్నావు? ఎందుకు రాస్తున్నవో చెప్పు 
చెప్పేదేమీ లేదు ..నువ్వె చదువుకో 

బాబు జగన్ 
ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఏమేమో చేస్తా నని చెబుతున్నావు . ముందు నువ్వు  వెంటనే రాష్ట్రం లోని మూడు ప్రాంతాల్లో మూడు మెడికల్ కాలేజిలు ఏర్పాటు చేయి . ఇప్పటికిప్పుడు   కొత్త వి  సాధ్యం కాకపోతే  పాతవాటినే కొనెయ్.. అలానే ఇంటర్ మీడియట్  కార్పోరేట్ కాలేజిలు  ప్రారంభించు .. రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇంతకు మించి చేసే మంచి ఉండదు .. ఆలోచించుకో -- ఇట్లు గుంపులో గోవిందయ్య 
లేఖ చదివావా?
చదివాను అస్సలు అర్థం కాలేదు 
ఆయన ఇప్పుడు సంపాదించింది సరిపోలేదనుకుంతున్నవా? విద్య వ్యాపారం మొదలు పెట్టమని చెబుతున్నావు 
ఆయన కోసం కాదు మన కోసం ఈ సలహా 
అదెలా ?
మెడికల్ కాలేజీల్లో సీటు కోటి రూపాయలకు అమ్ముకుంటున్నారు . ఇది అందరికి తెలిసిందే 
ముఖ్య మంత్రికి కుడా ఏటా కొన్ని సీట్లు ఉంటాయి ( కాలేజికి ఒకటి రెండు ) 
తీర్పు  చెప్పాల్సిన ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి కుడా మెడికల్ కాలేజీల్లో సీట్ల అమ్మకాల గురించి తెలుసు ..వాల్లకు మనవాళ్ళు, మనవరాళ్ళు ఉంటారు 
ఇంతకు మించి చెబితే తంటాలు . 
ఇక కార్పోరేట్ కాలేజీల విద్య వ్యాపారానికి అడ్డు అదుపు లేదు . ప్రతి మధ్య తరగతి వాడికి తెలిసిందే .. 
అది సరే 
జగన్  విద్యా వ్యాపారం లో కి రమ్మని కోరడానికి, దీనికి సంబంధం ఏమిటి ?
ఈ రాష్ట్రం లో మీడియా పెద్దలు , రాజకీయ పెద్దలు జగన్ ను తప్ప దేన్నీ పట్టించుకునే స్థితిలో లేరు .. ఒక mla భార్య ముచ్చట పడి సర్పంచు పదవికి పోటి చేస్తే దగ్గరి బందువు భార్య పోటికి వస్తే మొగుణ్ణి mla హత్య  చేసినా వదిలేసెంత ఉదారంగా ఉన్నాం 
చెప్పేది స్పష్టంగా చెప్పు 
అక్కడికే వస్థున్నను. 
జగన్ వ్యవహారాలు తప్ప ఏది పట్టించుకోవడం లేదు 
జగన్ మెడికల్ కాలేజిలు పెడితే .. సీట్లు అమ్ముకోక తప్పదు 
కార్పోరేట్ కాలేజిలు పెడితే పీజులతో తల్లి తండ్రులను , హింసతో పిల్లలను చంపక తప్పదు 
అప్పుడు మీడియా , రాజకీయ పెద్దలు అందరు ఇప్పటి మాదిరిగా విద్య వ్యాపారాన్ని చూసి చూడనట్టు వదిలేయారు .  జగన్ విద్య వ్యాపారం పైనే అందరు దృష్టి పెడతారు . అప్పుడు ఈ దుస్థితి మారడం ఖాయం .జగన్ విద్య వ్యాపారం లోకి వచ్చేంత వరకు ఇంతే .. అందుకే లేఖ . 

17, జులై 2013, బుధవారం

మోడీ ఐదు రూపాయల్లో దాగిన హిందుత్వం అజెండా

డోర్ స్పీడ్‌గా తీయడంతో అక్కడ కాపు కాసిన చౌదరి రెడ్డి ముక్కుకు బలంగా తాకింది. సారీ మీరున్నారని తెలియదు అని ప్రముఖ విశ్లేషణ  జర్నలిస్టు సింగినాదం అన్నాడు. చౌదరి రెడ్డి నియోజక వర్గంలో చేసేదేమీ లేక ఎప్పుడూ టీవి చర్చల్లో కనిపిస్తుంటాడు. ఏ అంశంపైనైనా టీవి చర్చల్లో గట్టిగా తన వాదన వినిపించడానికి ఆయన సర్వవేళలా సిద్ధంగా ఉంటారు. ‘‘ ఇపుదేమి లేదు . సాయంత్రం నరేంద్ర మో డీ మీటింగ్ ఉంది. మీ అవసరం పడవచ్చు’’అని చెప్పి సింగినాధం తన పనిలో పడ్డాడు.


ఏజెంట్ 007 ఫోజులతో కొత్త కుర్రాడొకడు దూసుకొచ్చి, సింగ్నాధం మీరేనా? అని అడిగాడు. ‘‘తెలుగును అంత వంకరగా పలుకుతున్నావు, యాంకరింగ్ కోసం వచ్చావా?’’ అని సింగినాధం అడిగాడు. కుర్రాడు లేదు కాస్త స్టైల్‌గా ఉంటుందని అలా పలికాను అంతే ట్రైయినీ రిపోర్టర్‌గా చేరాను అని వినయంగా పలికాడు. ఎంసిజె చేశాను అంటూ చెబుతుంటే, యూనివర్సిటీలో నువ్వు నేర్చుకున్నది మొత్తం మరిచిపో చూసిన సినిమాలు గుర్తు తెచ్చుకో అలా అయితేనే ఇక్కడ బాగుపడతావు, ఏం సినిమాలు చూశావ్’’ అని అడిగాడు.


‘‘మహేష్ బాబుకు వీర ఫ్యాన్‌ను. జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా.. తొలి రోజు తొలి ఆట చూడాల్సిందే. ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండు. అడ్డంగా నరికేస్తాను ’’ అంటూ కుర్రాడు ఆవేశంగా డైలాగులు చెబుతుంటే ...
‘‘నేనీ రోజు చెబుతున్నాను రాసి పెట్టుకో ఏదో ఒక నాడు నువ్వు తెలుగు టీవి జర్నలిజాన్ని ఏలేస్తావు ’’ అని రంగురాళ్ల కోసం వెతుకుతుంటే వజ్రం దొరికినంత సంతోషంగా కుర్రాడి కళ్లల్లోకి చూశాడు సింగినాధం.
‘‘మీరు వెటకారంగా అంటున్నట్టున్నారు. సినిమాలకు జర్నలిజానికి సంబంధం ఏముంది సార్. చదువుకునే రోజుల్లో   పిచ్చిగా సినిమాలు చూశాను. ఇప్పుడలా చేయను’’ అని వినయంగా చెప్పాడు.


‘‘సినిమాలకు, మన టీవి వార్తలకు సంబం ధం ఉంది బాబు ఉంది.
మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లు కనిపించిన వారినల్లా తూటాతో పేల్చేస్తుంటారు. కత్తులతో పొడిచేస్తుంటారు. ఎంత మందిని చంపినా హీరోను పొగడ్తలతో ముంచెత్తుతారు కానీ ఒక్క కేసు ఉండదు. సినిమాలకు లాజిక్‌కు ఏ మాత్రం సంబంధం ఉండదు. మన వార్తలకు సైతం సినిమాల్లానే లాజిక్ ఉండదు. లాజిక్ తో ఆలోచించి సినిమా చూసినా ,వార్తలు చూసినా పిచ్చెక్కుతుంది . అన్నాడు . ఇంతలో 
సెల్‌ఫోన్‌లో ఒక వార్త అందగానే సింగినాధం వావ్ అని ఆనందంతో కేక పెట్టాడు.ప్రాక్టికల్ క్లాస్ తీసుకుంటాను. అని స్టూడియో లోకి వెళ్లాడు.
అప్పటి వరకు తన కళ్ల ముందు కూర్చున్న సింగినాధం టీవి తెరలో కనిపించగానే కుర్రాడికి వింతగానే అనిపించింది.


ప్రత్యేక వార్త
బిజెపి నాయకుడు నరేంద్ర మోడీ కరుడు గట్టిన తన హిందుత్వాన్ని, మరో మారు నగ్నంగా ప్రదర్శించారు. అంటూ అయిదు నిమిషాల ఉపోద్ఘాతం తరువాత వార్త చెప్పాడు. హైదరాబాద్‌లో మోడీ బహిరంగ సభకు ఐదు రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఇంతకు మించిన మతతత్వం ఏముంటుంది. ఐదు హిందువులకు పవిత్రమైన సంఖ్య. పంచారామాలు, పంచభూతాలు , పంచామృతాలు, పంచ ప్రాణాలు ,పంచ సూక్తములు, పంచాంగములు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ 
 దే. దానికి ప్రతీకగానే మోడీ తన బహిరంగ సభకు ఐదు రూపాయల విరాళం వసూలు చేయాలని నిర్ణయించారు. ఐదు ఎందుకు? ఒక్క రూపాయి వసూలు చేయవచ్చు కదా? అలా చేస్తే మైనారిటీ మతం వారికి గౌరవం ఇచ్చినట్టు అవుతుందనే హిందుత్వాన్ని రెచ్చగొట్టేందుకు ఐదు రూపాయల విరాళం వసూలు చేస్తున్నాడు. అంటూ సింగినాధం టివిలో   వార్త చదివాడు. 

చార్ ధామ్ సహాయ కార్యక్రమాల కోసం ఐదు రూపాయల విరాళం వసూలు చేస్తామని బిజెపి వాళ్లు అంటే నిజమే 

అనుకున్నాను దీని వెనకు ఇంతటి మత తత్వం ఉందా? ఆస్సలు ఊహించలేక పోయా ను అని కుర్రాడు తనను తానే నిందించుకున్నాడు. 


ఈ వార్త పై టివిలో చర్చ మొదలయింది . 

మోడీకి ఒకరుహైదరాబాద్  బిర్యానీ ఆఫర్ చేస్తే కడుపులో బాగా లేదని శాఖాహారం తీసుకున్నాడట! దేశంలో 90 శాతం మంది మాంసాహారులైతే కేవలం పది శాతం మంది శాఖాహారులు. బిర్యానీని తిరస్కరించడం ద్వారా మోడీ 90 శాతం మంది ప్రజల మనోభావాలను దెబ్బతీశాడని ఒకాయన ఆవేశంగా ఊగిపోతున్నాడు. అంతే కాదండి పాండురంగం గారు మోడీ ఉత్తరాఖండ్ వరదలకు స్పందించారు కానీ దక్షిణాధి ప్రమాదాలకు స్పందించలేదు. అంటే ఆయనలోని ఉత్తరాధి అభిమానం, దక్షిణాది వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఎర్రన్న చెప్పుకొచ్చాడు. ‘‘మోడీలోని కరుడు గట్టిన హింసోన్మాధం ఆయన ఒకటో తరగతి చదువుకునే రోజుల్లోనే బయటపడింది. తోటి వారికి ఇచ్చిన తరువాతనే మనం తినాలనే నీతిని పాటించకుండా మోడీ తన టిఫిన్ బాక్స్ తానే తినేవాడు. తన టిఫిన్ బాక్స్‌నే పంచుకోలేని వ్యక్తి ఈ దేశానికి ప్రధాన మంత్రి అయితే ఇంకేమన్నా ఉందా? అందరి టిఫిన్లు తానే తినేస్తాడు అని చరిత్ర పరిశోధకుడు చిత్రయ్య చెప్పుకొచ్చాడు. ఆయనీ విషయాన్ని పరిశోధించి చెబుతున్నారని మాసిపోయిన ఆయన బట్టలే చెబుతున్నాయి.


లక్షల కోట్ల కుంభకోణాలతో మా ప్రభుత్వం దేశ ప్రతిష్టను ఇనుమడింప జేస్తుంటే మోడీ 5 రూపాయలు అడుక్కోవడం కన్నా ఈ దేశానికి అవమానం ఏముంటుందని తెల్ల బట్టల నల్ల య్య వాపోయాడు. మా నాయకుల సభలకు మేమైతే ఇలా వసూలు   చేయం అని ఖద్దరు కన్నయ్య చెబితే పొండి బావ గారు లక్షల కోట్ల కుంభకోణాలు చేసే అధికారం మీ చేతిలో ఉండగా అయిదు రూపాయలు వసూలు  చేసే గతి మీకెందుకు అని పచ్చయ్య చమత్కరించాడు . గతం లో పచ్చయ్యకు,ఖద్దరు కన్నయ్యలకు మధ్య పచ్చ గడ్డి వేసినా తగలబడేది . రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం ఇద్దరు చేతులు కలిపారు. 


ఇదంతా చూస్తున్నకుర్ర జర్నలిస్ట్  సింగినాధం వద్దకు వెళ్లి సార్ నాకో చాన్స్ ఇవ్వండి పలానా పార్టీ కార్యాలయంలో మీటింగ్ ఉంది మీ స్ఫూర్తితో దాన్ని ఇరగ దీస్తాను అని చెబితే సింగినాధం నవ్వి పిచ్చోడా! అది మన అభిమాన పార్టీ.. అర్ధం చేసుకో అని నవ్వాడు. మనకు నిప్పులు చెరగడం తెలియాలి, చల్లని చూపు చూడడం తెలియాలి. ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలియాలి  అన్నాడు 
చదువుల సారమెల్ల గ్రహించితిని తండ్రీ అంటూ కుర్రాడు సంతోషంగా వెళ్లాడు.

15, జులై 2013, సోమవారం

కాంగ్రెస్‌ను బతికించిన తెలంగాణ... ఇటు తెలంగాణా అటు కాపు.. రాహుల్ పట్టాభిషేకానికి తెలంగాణా


ఈ నెల 12న జరిగిన 
కోర్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయాన్ని ప్రకటించక పోవడం వల్ల ఇక తెలంగాణ రాదు అని కొందరు ఆశపడుతున్నారు . గంటన్నర పాటు సాగిన కోర్ కమిటీ సమావేశంలో ఒక వేళ తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుని ఉంటే భయంకరమైన విమర్శలు వచ్చి ఉండేవి. పదో తరగతి పిల్లాడి పరిజ్ఞానం తెలుసుకోవడానికి కూడా రెండున్నర గంటల పాటు పరీక్ష జరుపుతారు. ముగ్గురు వ్యక్తులతో గంటన్నర పాటు చర్చించి పది కోట్ల మంది తెలుగు ప్రజల భవిష్యత్తు నిర్ణయిస్తారా? అంటూ ధ్వజమెత్తి ఉండేవారు.


తెలంగాణ అంశంపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. ఈ అంశం ద్వారా ప్రత్యర్థులను దెబ్బతీయడం ఒకటి,  రాజకీయ ప్రయోజనం పొందడం మరోటి. మొదటి ప్రయోజనాన్ని కాంగ్రెస్ ఇప్పటికే నమోదు చేసుకుంది. తెలంగాణ అంశం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతికించింది. అంతే కాదు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి సైతం తెలంగాణ దోహదం కాబోతోంది. తెలంగాణపై కేంద్రం ఏం చేయబోతోంది అని ప్రశ్నిస్తే, తెలంగాణ ఏర్పాటు కాదు అని జరిగిన పరిణామాలను వివరిస్తూ ఎంత గట్టిగా వాదించవచ్చునో, వస్తుందని ఉదాహరణలు చూపుతూ అంత కన్నా గట్టిగా వాదించవచ్చు. విభిన్నమైన అభిప్రాయాలు అంత బలంగా ఏర్పడేట్టు చేయడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఏదో ఒకటి తేలిపోతే కాంగ్రెస్ బలహీనపడి, ప్రత్యర్థులు ఎప్పుడో బలపడేవారు.
ప్రజాస్వామ్యం, ప్రజాభిప్రాయం, దేశ ప్రయోజనాలు, రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు  అంటూ పైకి ఎన్ని నీతివచనాలు చెప్పినా రాజకీయం ఒక యుద్ధం. రాజరికంలో రాజ్యవిస్తరణకు, అధికారాన్ని కాపాడుకోవడానికి కత్తిని నమ్ముకుంటే, ప్రజాస్వామ్యంలో ఎత్తుగడలను నమ్ముకోవాలి. అప్పుడు కత్తితో యుద్ధం జరిగితే ఇప్పుడు ఎత్తుగడలతో యుద్ధం చేస్తారు. ఆయుధం మారింది కానీ జరిగేది యుద్ధమే. తెలంగాణ అనే అంశంపై ఇప్పటి వరకు జరిగిన రాజకీయంలో కాంగ్రెస్ నష్టపోయిందేమీ లేదు.పైగా ప్రయోజనం పొందింది.
2009 ఎన్నికల్లో మహాకూటమిని మట్టికరిపించి వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చినా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాన ప్రతిపక్షానికి 92 మంది ఎమ్మెల్యేల బలం ఉండడం, కాంగ్రెస్ మెజారిటీ స్వల్పమే కావడం ఆయనకు రుచించలేదు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే విపక్షాలను అస్థిర పరచక తప్పదని ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టారు. వైఎస్‌ఆర్ లాంటి జనాకర్షణ గల నాయకుడి నాయకత్వంలో ఉన్నప్పటి కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మైనారిటీలోనే ధీమాగా ఉంది. కాంగ్రెస్‌కు ఇంతటి ధీమాను ఇచ్చిన అంశం తెలంగాణ!
అసలు ప్రభుత్వం ఉందా? అనుకునే విధంగా పాలన సాగుతోంది. అయితే దమ్ముంటే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టండి అని సవాల్ చేసే స్థితిలో ప్రభుత్వం ఉంటే, మేం అవిశ్వాసం పెట్టం అంటూ విపక్ష నేత బహిరంగంగా ప్రకటించారు. అలా అని వైఎస్‌ఆర్ కన్నా కిరణ్ కుమార్‌రెడ్డి సమర్ధుడైన నాయకుడని కాదు. తెలంగాణ అంశం అలా నానుతూ ఉన్నంతకాలం ప్రధాన ప్రతిపక్షం ఎన్నికలకు సిద్ధమయ్యే పరిస్థితి ఉండదు. ఈ ప్రతిపక్ష బలహీనతనే అధికార పక్షం బలం. ఒక్క ఎమ్మెల్యే బలం లేకపోయినా కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ఢోకా లేదని ఎప్పుడో తేలిపోయింది.
ఎవరి అంచనాలు వారివి, ఎవరి విశ్లేషణలు  వారివి. తెలంగాణను ఇస్తామని, ఇవ్వమని చెప్పకుండా కాంగ్రెస్ రాజకీయం నడిపిస్తోంది. ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తే, టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపిలు దూసుకెళతాయి, కాంగ్రెస్ కొచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. నిర్ణయం ఎంత ఆలస్యం అయితే కాంగ్రెస్‌కు అంత ప్రయోజనం. తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం కాంగ్రెస్ చేతిలో ఉండడం అనేదొక్కటే కాంగ్రెస్‌ను రాష్ట్రంలో బతికిస్తోంది. మాయలపకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రాణం తెలంగాణ అంశంలో ఉంది. అందుకే అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కాంగ్రెస్ ఎప్పుటికప్పుడు తెలంగాణపై చర్చలు సాగిస్తూ ముందుకెళుతోంది.

 ఒకవేళ వైఎస్‌ఆర్ ఉండి ఉన్నా మూడవ సారి అధికార పక్షాన్ని గెలిపించడం అంత సులభం కాదు. 2009 ఎన్నికల సమయంలోనే ఒకరిద్దరు కాంగ్రెస్ సీనియర్ల వద్ద తెలంగాణ అంశంపై వైఎస్‌ఆర్ తన మనసులోని మాట బయటపెట్టారు. 2009 వరకు మాత్రమే మనం తెలంగాణను అడ్డుకోగలం, 2014 నాటికి మనకు అంత శక్తి ఉండదు అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు కాంగ్రెస్‌లో ప్రచారంలో ఉంది.
2009 డిసెంబర్9న చేసిన ప్రకటనకు కట్టుబడి తెలంగాణను మూడేళ్ల క్రితమే ఏర్పాటు చేసి ఉంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. సీమాంధ్రలో జగన్, బాబు దూకుడుగా వెళ్లి ఉండేవారు. కార్యకర్తల బలం, ఆర్థిక బలం, ప్రచార బలం ద్వారా తెలంగాణలో సైతం చంద్రబాబు చొచ్చుకెళ్లగలిగే వారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు సైతం తెలంగాణలో స్పీడ్ బ్రేకులు పడేవి కాదు.
కానీ డిసెంబర్ 9 నాటి ప్రకటనకు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులు ఉద్యమించడం రాజకీయంగా కాంగ్రెస్‌కే కలిసి వచ్చింది. అప్పటి నుంచి సమస్యను అలా నానుస్తూనే ఉన్నారు. 42 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే సగం స్థానాల్లో టిడిపి డిపాజిట్ పోగొట్టుకుంది. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఇబ్బంది కరంగా ఉంది. మూడేళ్ల క్రితమే కేంద్రం తెలంగాణకు అనుకూలంగానైనా, వ్యతిరేకంగానైనా ఒక నిర్ణయం అంటూ తీసుకుని ఉంటే టిడిపి పుంజుకోవడానికి అవకాశం ఉండేది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేంత సమయం టిడిపికి ఉండేది. కానీ అలాంటి చాన్స్ లేకుండా పోయింది. ఒక నిర్ణయాన్ని తీసుకుని అమలు చేసిన తరువాతనే కాంగ్రెస్ 2014 ఎన్నికలకు వెళ్లే పరిస్థితి. తెలంగాణ సమస్యకు పరిష్కారం అంటే తెలంగాణ ఏర్పాటే తప్ప మరో పరిష్కారాన్ని తెలంగాణ కోరుకునే వారు ఒప్పుకోరు.
డిసెంబర్9 చేసిన ప్రకటన ఉప సంహరించుకుంటున్నామని కేంద్రం ఎప్పుడూ ప్రకటించలేదు. డిసెంబర్ 23న చేసిన ప్రకటనలో సైతం అభిప్రాయాలు తెలుసుకుంటామని చెప్పారు కానీ నిర్ణయాన్ని ఉప సంహరించుకుంటున్నట్టు చెప్పలేదు. రాష్ట్రం నుంచి సిపిఎం మినహా మరే పార్టీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరలేదు. రెండు వారాలు, మూడు వారాలు, నెల అంటూ రోజులు గడిపిన కాంగ్రెస్ ఇప్పుడు వేగాన్ని పెంచింది. ఇక ఎన్నికలకు వెళ్లే ముందు కాంగ్రెస్ తెలంగాణపై ఏ నిర్ణయమైనా సరే తీసుకోవడంతో పాటు అమలు చేయాలి కూడా. తీసుకున్న నిర్ణయం కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రభావం చూపవచ్చు కానీ, ఆ నిర్ణయం తీసుకునేప్పుడు ఉన్న పరిస్థితులే నిర్ణయంలో కీలక పాత్ర వహిస్తాయి.
ఇప్పుడున్న పరిస్థితులు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగానే ఉన్నాయి. పదేళ్ల పాలన  తరువాత కూడా  కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకు వచ్చేంత గొప్ప నాయకత్వమేమీ ఆ పార్టీకి లేదు. ఇది తెలంగాణకు కలిసి వచ్చే అంశం. ఇక రెండు రాష్ట్రాలుగా విభజన జరిగితే, తెలంగాణలో కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లు ప్రధాన శక్తులుగా నిలుస్తాయి. మొదటి నుంచి కాంగ్రెస్‌కు రెడ్లు అండగా నిలుస్తున్నారు. జగన్ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత రెడ్లు జగన్ వైపు వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో సమైక్యాంధ్రలో ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పరిస్థితి గతంలోని రికార్డును బద్ధలు చేసే విధంగా ఉండొచ్చు.  కాంగ్రెస్ అలాంటి సాహసానికి పునుకోక పొవచ్చు. తెలంగాణ ఏర్పాటు చేసి,  సీమాంధ్ర కాంగ్రెస్‌లో కాపుల ప్రాబల్యాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని కేంద్ర మంత్రిని చేశారు. చిరంజీవి ఇమేజ్ సొంతంగా ముఖ్య మంత్రి కావడానికి ఉపయోగపడలేదు. కానీ తన ఇమేజ్, కాంగ్రెస్ బలం కలిస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ గౌరవ ప్రదమైన స్థానంలోనే నిలబడే అవకాశం ఉంది.
రాష్ట్రంలో అధికారం రెండు సామాజిక వర్గాలకే పరిమితం అయిందనే విమర్శ  సామాజిక వర్గాలన్నింటిలో ఉంది. అదే విధంగా కాపు సామాజిక వర్గం అధికారం కోరుకుంటోంది. ప్రజారాజ్యం వారిని తీవ్రంగా నిరాశ పరిచింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్, కాపు కాంబినేషన్ కలిసినప్పుడు కాంగ్రెస్‌కు అంతో ఇంతో ప్రయోజన కలగవచ్చు. రాజకీయాల్లో ఎన్ని విమర్శలు చేసుకున్నా, ఎవరిపై ఎన్ని కేసులు పెట్టుకున్నా పరస్పర ప్రయోజనాల కోసం ఎంతటి శత్రువులైనా కలిసిపోతారు. అలానే ఎన్నికల తరువాత టిఆర్‌ఎస్, వైఎఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల బలం సైతం కేంద్రంలో మరోసారి యుపిఏ ప్రభుత్వం ఏర్పాటుకు ఉపయోగపడవచ్చు. తన కుమారున్ని ప్రధానమంత్రిని చేయాలనుకుంటున్న సోనియాగాంధీ కల నెరవేరవచ్చు. తెలంగాణ ఏర్పాటు చేయడం ద్వారా పార్లమెంటులో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నట్టుగా ఉంటుంది. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా చూసే అవకాశమూ సోనియాగాంధీకి దక్కుతుంది. అలా కాకుండా ఎలాంటి మార్పు లేకుండా సమైక్యాంధ్రలో ఎన్నికలకు వెళితే ఫలితాలు ఎలా ఉంటాయో పలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఇప్పటికే చూసింది. 

తెలంగాణ ప్రజల కోసమో, తెలంగాణ ప్రజలు చేసిన ఉద్య మం కోసమో, కెసిఆర్ కోసమో కాకుండా సొంత ప్రయోజనాల కోసం సోనియాగాంధీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైఎస్‌ఆర్ అమలు చేస్తున్న పథకాలు అన్నీ అమలు చేస్తూ మరిన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టినా కిరణ్ కుమార్‌రెడ్డికి జన నేతగా గుర్తింపు రాలేదు.కిరణ్ కుమార్‌రెడ్డికి వైఎస్‌ఆర్‌లా ఇమేజ్ ఏర్పడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.
తెలంగాణా ఏర్పాటు కాంగ్రెస్ కు అనివార్యం . 

14, జులై 2013, ఆదివారం

ఆంధ్రా దేవానంద్ జీవితాన్ని కాటేసిన సినిమా...అనామకంగా ముగిసిన ఓ హీరో జీవితం


దివి నుంచి భువికి దిగివచ్చే దిగివచ్చే 
పారిజాతమే నీవై నీవై... 

ఎంత మధురమైన పాట తరాలతో సంబంధం లేకుండా ఏ తరం వారినైనా ఊహాలోకాల్లో విహరింపజేసే పాట.
‘తేనె మనసులు ’ సినిమాలోనిది ఈ పాట. అంతా కొత్తవారితోనే నిర్మించిన ఈ సినిమాలో రాం మోహన్, కృష్ణ హీరోలు. ప్రధాన హీరో రాంమోహనే. ఆయనపైనే ఈ పాట చిత్రీకరించారు. 


ఎలాంటి ఆలోచనలు లేకుండా కళ్లు మూసుకుని ఈ పాట వింటే ఆనంద సాగరంలో మునిగిపోతాం. కావాలంటే ఓ సారి ప్రయత్నించి చూడండి. కానీ ఈ పాటలో నటించిన ఈ సినిమాలోని హీరో జీవితం గురించి తెలిస్తే మాత్రం మనసు కకావికలం అవుతుంది. ఏమిటో ఈ మాయ అనిపిస్తుంది.


నాలుగు దశాబ్దాల క్రితం బేగంపేట విమానాశ్రయంలో గ్రౌండ్ ఇంజనీర్. మంచి ఉద్యోగం, మంచి కుటుంబం. జీవితం హాయిగా గడిచిపోతోంది. అలాంటి పరిస్థితిలో రామ్మోహన్‌ను సినిమాల్లో నటించాలనే పురుగు తొలిచింది. ఆదుర్తి సుబ్బారావు నిర్మించినతేనె మనసులు  సినిమాలో హీరోగా నటించాడు. సూపర్ స్టార్ కృష్ణతో పాటు ఒకేసారి సినిమాల్లో హీరోగా పరిచయం అయ్యారు. అభిమానులు ‘ఆంధ్రా దేవానంద్’ అని ముద్దుగా పిలుచుకునేవారు. రాం మోహన్ స్టైల్ దేవానంద్‌ను గుర్తుకు తెచ్చే విధంగా ఉండేది.
తెరపై నటించే నటులు సైతం నటనలో జీవించే వారి పట్ల అప్రమత్తంగా ఉండక పోతే అందమైన జీవితం విషాదంగా మారుతుందనడానికి రాం మోహన్ జీవితమే సాక్ష్యం.


విషాదాంత సినిమా కథను మించిన విషాదంతో తొమ్మిదేళ్ల క్రితం రాం మోహన్ జీవితం మల్కాజిగిరిలో ముగిసింది. సినిమా రంగానికి వెళ్లిన అతను ‘స్టార్ట్.. కెమెరా.. యాక్షన్’ అనగానే నటించాలని మాత్రమే నేర్చుకున్నాడు. కానీ అలాంటి డైలాగులు ఏమీ లేకుండానే తన మిత్రులుగా నటిస్తూనే తన జీవితానికి చరమ గీతం రచించే మహానటులు తన చుట్టే ఉంటారనే విషయం గ్రహించలేదు. గ్రహించే సరికి జీవితం ముగింపునకు వచ్చింది.


ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవారితోనే‘తేనె మనసులు   సినిమా తీయాలని అనుకున్నారు. మా సినిమాలో నటించేందుకు ‘కొత్త వారు కావలెను’ అని ప్రకటన ఇచ్చారు. వందల మంది ముందుకొచ్చారు. రాం మోహన్‌ను చూడగానే తెలుగు సినిమా రంగానికి మంచి నటుడు దొరికాడని అనుకున్నారు. ‘తేనె మనసులు’లో కృష్ణ, రాం మోహన్ ఇద్దరిని హీరోలుగా ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్ జరిగే రోజుల్లో ఈ ఇద్దరు హీరోలు ఎన్నో కలలు కన్నారు. సినిమా రంగంలో స్థిరపడేందుకు ఒకరికొకరం సహకరించుకుందామనుకున్నారు. ‘తేనె మనసు’లో సినిమా టైటిల్స్‌లో కృష్ణ పేరు ముందు వేశారా? రాం మోహన్‌ది ముందా? అనే సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఎవరి పేరు వేయలేదు. అంతా కొత్తవారే, కొత్త తారలే అంటూ తారల పేర్లు లేకుండానే టైటిల్స్ చూపించారు.
సినిమా హిట్టయింది. ఇద్దరికీ మంచి అవకాశాలు రాసాగాయి.
రాం మోహన్‌కు ఎదురు లేదనుకున్నారు. అవకాశాల వరద రాం మోహన్‌ను ముంచెత్తింది. తేనె మనసులు (1965) రంగుల రాట్నం(1966) తేనెమనసులులో నటించిన బృందంతోనే 1966లోకన్నె   మనసులు తీశారు. సుడిగుండాలు (1967), పసిడి మనసులు (1970) ఇందులో శోభన్‌బాబు హీరో. రాజశ్రీ కాంతారావు తదితరులు నటించిన ఎవరు మొనగాడు(1978)లో నటించారు.
ఏం జరిగిందో తెలియదు కానీ తెర వెనుక ఎక్కడో కుట్ర జరిగిందంటారు ఆ కాలం నాటి సినిమా పరిశ్రమ లోతులు తెలిసిన వారు. రాం మోహన్ తనకు తెలియకుండానే ఒక వలలో ఇరుక్కున్నారు.


సన్నిహిత మిత్రులు మాటలతో తమ ప్రభావం చూపించారు. నువ్వు గొప్ప హీరోవి. పాపులర్ హీరోవి సమయానికి వెళితే నీ గొప్పతనం ఏముంటుంది. ఎంత ఆలస్యంగా వెళితే అంత గొప్ప అని నమ్మించారు. మందు బృందం మాటలు రాం మోహన్‌పై బాగానే పని చేశాయి. నిత్యం మందు బృందంతో మందులో మునిగిపోయారు. షూటింగ్‌కు ఎంత ఆలస్యంగా వస్తారో, వస్తారో రారో తెలియని పరిస్థితి. మెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి. అవకాశాలు తగ్గుతున్నా కొద్దీ మిత్రుల సంఖ్య క్రమంగా తగ్గింది. మందులో ముంచెత్తిన మిత్ర బృందం తాము వచ్చిన పని అయిపోయిందన్నట్టు వెళ్లిపోయారు. తాగనిది ఉండలేని పరిస్థితి కానీ తాగుడు అలవాటు చేసిన మిత్రులు లేరు. అవకాశాలు లేవు.. అడిగే వారు లేరు. రాం మోహన్ మద్యానికి బానిస అయిన తరువాత కుటుంబం కూడా విచ్ఛిన్నం అయింది.
విమానాశ్రయంలో మేనేజర్ స్థాయి ఉద్యోగం చేస్తున్న రాంమోహన్‌కు సినిమా నటన అంటే ప్రాణం. చేస్తున్న ఉద్యోగానికి నెల రోజుల పాటు సెలవు పెట్టి మద్రాస్ వెళ్లారు. సినిమా హిట్టయితే సరే లేదంటే మళ్లీ బుద్ధిగా ఉద్యోగం చేసుకోవాలనుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు రాకుండా ఉండి ఉంటే ఇప్పుడు రాం మోహన్ పిల్లా పాపలతో హాయిగా విశ్రాంతి జీవితం గడుపుతూ ఉండేవాడు. సినిమా హిట్టయింది. వరుసగా అవకాశాలు వచ్చాయి. అదే అతని పాలిట శాపంగా మారింది. రాం మోహన్ అలవాట్లతో కుటుంబం విచ్ఛిన్నమైంది. సినిమాల కోసమే మద్రాస్ వెళ్లిన రాం మోహన్  సినిమా జీవితం ముగిశాక అక్కడ తనను పలకరించే వారు లేకపోవడంతో తిరిగి హైదరాబాద్ వచ్చారు. చేసిన సినిమాలతో పెద్దగా సంపాదించిందేమీ లేదు. చేతిలో ఉద్యోగమూ లేదు.


మంచి ఉద్యోగాన్ని వదులుకుని సినిమా రంగానికి వెళ్లినప్పుడు రాం మోహన్ తొలుత తాను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాల్సింది. సినిమా మెరుపుల్లో మునిగిపోయిన రాం మోహన్‌కు రేపు ఎలా అనే ఆలోచనే రాలేదు.
చదువు సంధ్య లేకుండా, బతుకు తెరువు కోసం సినిమా రంగానికి వెళ్లిన జీవితం కాదు రాం మోహన్‌ది. చదువుకున్న వాడు. విమానాశ్రయంలో గ్రౌండ్ ఇంజనీర్. పెళ్లయింది. హాయిగా గడిచిపోతున్న జీవితం. . తేనె మనసులు ఆ తరువాత వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తుండడంతో ఉద్యోగాన్ని వదులుకున్నారు.


సినిమా రంగం అతన్ని వదలుకున్న తరువాత తనకు తెలిసిన హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. సినిమా కాటేసిన తరువాత అతని జీవితం తెగిన గాలిపటం అయింది. ఉద్యోగం లేదు. సినిమాల్లో అవకాశాలు లేవు. సికింద్రాబాద్ మల్కాజిగిరిలో తనకు తెలిసిన మిత్రుడికి అద్దె సైకిల్ షాపు ఉంది. మిత్రున్ని వెతుక్కుంటూ వెళ్లాడు. అతని జీవితం అంతంత మాత్రమే. తనకేమీ అభ్యంతరం లేదని ఆశ్రయం ఇచ్చాడు. సైకిల్ షాపులోనే జీవితం గడిపాడు. ఆక్కడే ఆయన జీవితం ముగిసింది. ఆయన్ని హీరోగా చూసిన వారు ఆ సైకిల్ షాపులో ఓనరుకు సహాయకునిగా ఉన్నప్పుడు చూసిన వారికి ఔను జీవితం నిజంగా భగవంతుడు ఆడించే నాటకం అనుకున్నారు. విమానాశ్రయం మేనేజర్ హీరో కావడం .. ఆంధ్రా దేవానంద్‌గా పిలిపించుకోవడం . అమ్మాయిల కలల రాజకుమారుడిగా గుర్తింపు. చివరకు ఒక సైకిల్ షాపులో జీవితం.


సత్యహరిశ్చంద్రుడు కాటికాపరిగా పని చేయడం గుర్తుకు వచ్చిందా? సత్యహరిశ్చంద్రున్ని దేవతలు పరీక్షించి విజయం సాధించాక మళ్లీ ఆయన సంపదను ఆయనకిచ్చేశారు. ఇక్కడ ఆంధ్రా దేవానంద్‌కు అలాంటి పరీక్షలేమీ లేదు. తన సంపద తనకు తిరిగి దక్కలేదు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందిన రాం మోహన్... ఎలాంటి గుర్తింపు లేకుండా ఎవరికీ తెలియకుండా తొమ్మిదేళ్ల క్రితం మల్కాజిగిరిలో మరణించారు.


ఇందులో తప్పేవరిదీ అంటే ఎవరి జీవితానికి వారే బాధ్యులు. చదువు, వ్యాపారం, సినిమా ఏ రంగం అయినా కావచ్చు పోటీ ఉంటుంది. ప్రత్యర్థి నిన్ను ఎలాగైనా దెబ్బతీయాలని ప్రయత్నిస్తాడు. జీవితం ఒక యుద్ధమే. యుద్ధంలో ఏదీ తప్పు కాదంటారు. ఇక్కడ దురదృష్టం ఏమంటే యుద్ధరంగంలో నీ శత్రువు సైతం నీతో నేను యుద్ధం చేస్తున్నానని యుద్ధ్భేరీ ప్రకటించి యుద్ధం మొదలు పెడతాడు. కానీ రాం మోహన్‌కు మాత్రం ఎలాంటి యుద్ధ భేరీ మ్రోగించకుండా స్నేహితులుగా ఉంటూనే అతనితో యుద్ధం చేసి కోలుకోలేని విధంగా ముంచేశారు. సినిమా కాటుకు రాం మోహన్ జీవితం విషాదంగా ముగిసింది.

‘తేనె మనసులు   సినిమా 

https://www.youtube.com/watch?v=LPIQg6W06GI

దివి నుంచి భువికి ...పాట 


10, జులై 2013, బుధవారం

పెళ్లి చూపులు- రోడ్ మ్యాప్ లు

‘‘హలో బావగారూ’’
‘‘ఎవరూ?’’
‘‘నేనండి బావగారూ ఓల్డ్‌సిటీ సత్యాన్ని’’
‘‘గుర్తుకు రావడం లేదూ’’
‘‘మీ వాడికి షాలిబండ సంబంధం గురించి మీతో ప్రస్తావించాను’’
‘‘ఓహో సత్యం బావ గారూ మీరా బాగున్నారా? అసలు దర్శనాలే లేవు. సత్యం అన్న య్య ఎలా ఉన్నారండి అని మీ చెల్లెలు అడగని రోజు లేదనుకో’’ అంటూ దిగ్వి సింగయ్య చెప్పారు.
‘‘సరే మరి అమ్మాయి కుటుంబం గురించి మీకు పదేళ్ల నుంచి తెలిసిందే. పెళ్లి చూపులకు ఎప్పుడొస్తారో చెబితే, ఏర్పాట్లు చేసుకుంటాం’’ అని సత్యం చెప్పాడు.
‘‘మీ సంబంధం కాకుంటే ఇంకెవరిది ఒప్పుకుంటాం చెప్పండి. అబ్బాయికి నా మాటంటే వేదం. ముందు పెళ్లి చూపులకు, ఆ తరువాత పెళ్లికి రోడ్ మ్యాప్ తయారు చేసుకోండి’’ అని దిగ్వి సింగయ్య సమాధానం చెప్పాడు.
‘‘ రోడ్ మ్యపా ? బస్ డిపోకు వెళితే శాలిబండకు వెళ్ళడానికి మూడు నిమిషాలకో బస్సు వస్థున్ది. కారులో అయితే గూగుల్ మ్యాప్ చూసుకొని వచ్చేయండి . దీనికి రోడ్ మ్యాప్ ఎందుకు ?’’  అని సత్యం అన్నాడు . 
‘‘ రోడ్ మ్యాప్ అంటే అది కాదు బావా . శాలిబండ సంబంధం ఖరారు చేసుకుంటే మా కొచ్చే లాభ నష్టాలూ, చేసుకోకపోతే కలిగే నష్టాలూ, చేసుకుంటే ఎలా చేసుకోవాలి, వద్దంటే ఏం చెప్పాలి .. రోడ్ మ్యాప్ అంటే ఇది’’ అని అని దిగ్వి సింగయ్య  చెప్పాడు.

‘‘ అంటే పదేళ్ళ నుంచి మీరేమి ఆలోచన చేయలేదా ?’’ అని సత్యం ఆశ్చర్యంగా అడిగాడు .. ఇలాని తేవా రహస్యాలను అడగ వద్దు అని చెప్పి సింగయ్య ఫోన్ కట్ చేశాడు . ఇంతలోనే మళ్లీ సెల్‌ఫోన్ రింగైంది.

‘‘హాలో దిగ్వి సింగయ్యగారేనా?’’
‘‘ఔను నా ఫోన్ రింగైతే నేను కాకుండా సోమిదమ్మ ఎత్తుతుందా?’’అని అడిగాడు.
‘‘బావగారు భలే చతుర్లే ’’
‘‘బావగారూ అంటున్నావంటే కచ్చితంగా పెళ్లి సంబంధం గురించే కదా? ’’ అని సింగయ్య అడిగాడు.


‘‘నేనండి గోపాలయ్యను. విజయవాడ సంబంధం గురించి మాట్లాడుకుందామని అనుకున్నాం కదా. అమ్మాయిని చూసుకోవడానికి ఎప్పుడొస్తారో చెబితే ’’ అని గోపాలయ్య ఒక నవ్వు నవ్వాడు
‘‘సరే సోమవారం వస్తాం’’ అని సింగయ్య సమాధానం ఇచ్చాడు.
‘‘అమ్మాయి కుటుంబం సంప్రదాయమైం ది. అమ్మాయి బుద్ధిమంతురాలు. కుటుంబానికి వందెకరాల కొబ్బరి తోట. ఇంకా... అయినా డబ్బుదేముంది. ఈ రోజుల్లో కుక్కను తంతే డబ్బులు రాలుతున్నాయి. కలకాలం ఉండేది మంచితనమే కానీ డబ్బు కాదు కదా? ఏమంటారు’’ అని గోపాలయ్య సమాధానం కోసం ఎదురు చూడసాగాడు.


‘‘గోపాలయ్య బావగారూ మీకు డబ్బు ముఖ్యం కాకపోవచ్చు కానీ నాకు అదే చాలా ముఖ్యం. డబ్బుదేముందని ఇన్ని మాటలు చెబుతున్న మీరు మా సంబంధంపై ఆసక్తి చూపడానికి మాకున్న డబ్బులే కారణం కదండి. మీకో జీవిత రహస్యం చెప్పనా? ఎవరికి ఏది ఉందో ఇంకా అదే కావాలని కోరుకుంటారు. నాకు బోలెడు డబ్బుంది అందుకే నేను డబ్బునే కోరుకుంటున్నాను అర్ధమైం దా?’’ అని సింగయ్య గట్టిగా నవ్వాడు. ‘‘అం తే కాదు పిల్లలు వారి వారి రంగాల్లో స్థిరపడిన తరువాత నా జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి మరింత సంపాదించాలనుకుంటున్నాను.’’ అని సింగయ్య పలికాడు.


‘‘ఏదో అనుకున్నాను. మిమ్ములను అర్ధం చేసుకోవడం కష్టమే.
డబ్బు విషయంలో మా వాళ్లను తక్కువగా అంచనా వేయకండి. మీరేమో మీ జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. వాళ్లు ఎప్పుడో వాళ్ల జీవితాలను ప్రజలకు అంకితం చేశారు. దీన్ని బట్టి వారి ఆర్థిక స్థోమత అర్ధం చేసుకోండి ’’ అని గోపాలయ్య గడుసుగా సమాధానం చెప్పాడు.
‘‘ అయితే సంతోషం. పెళ్లి చూపులకు రోడ్ మ్యాప్ తయారు చేసుకోండి’’ అని దిగ్విసింగయ్య సమాధానం చెప్పాడు.


‘‘హాలో నేను జైరెడ్డిని మాట్లాడుతున్నాను. ముందు మా సంగతి తేల్చండి’’ అని జైరెడ్డి ఆవేశంగా ఫోన్ చేశాడు.‘‘ విషయం ఏమిటో చెప్పకుండా ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నావంటే జైరెడ్డివని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బావగారూ నీ మాటతీరే చెబుతుంది. ఎప్పుడొచ్చినా ఆ సంబంధం వద్దు ఈ సంబంధం వద్దనే చెప్పావు కానీ మీ సంబంధం గురించి ఒక్క మాట చెప్పలేదు. ’’ అని సింగయ్య అడిగాడు.
‘‘ అప్పుడు చెప్పకపోతేనేం ఇప్పుడు చెబుతున్నాను కదా? అని జైరెడ్డి ఆవేశంగా అన్నాడు.
‘‘అన్నింటికి ఆవేశం అయితే ఎలా బావగారు.. సరే నీ కేం కావాలో ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని రా’’ అని సింగయ్య ఫోన్ కట్ చేశాడు.


 సింగయ్య వరుసగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా అప్పటికే నిజామియా యూనివర్సిటీ పిల్లలు కొంత మంది సింగయ్య ఇంటి ముందు చేరి అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నారు.
‘‘వాళ్లు పదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వాళ్ల పెళ్లికి ఒప్పుకుంటారా? లేదా? ఇప్పుడే చెప్పండి లేదంటే తఢాఖా చూపిస్తామని ఆవేశంగా, గుంపు మాట్లాడసాగింది.
సింగయ్య చిరునవ్వు నవ్వి ఏమేవ్ ఆ స్వీట్ బాక్స్ ఇలా తే అని విద్యార్థులందరికీ స్వీట్స్ పంచాడు. ఆఖల్‌మంద్‌కో ఇషారా హీ కాపీ స్వీట్స్ తినండి ’’ అని దిగ్వి సింగయ్య అందరి నోట్లలో స్వీట్స్ కుక్కారు.
విద్యార్థులంతా దిగ్వి సింగయ్యకు జై ... దిగ్వి సింగయ్య కలకాలం వర్ధిల్లాలి అనుకుంటూ వెళ్లిపోయారు.
అంతా విన్న రాజ్యలక్ష్మి ఏంటండీ షాలిబండ సంబంధం, విజయవాడ సంబంధం. జైరెడ్డి అన్నయ్య సంబంధం మీరు ఎవరితో మాట్లాడితే వారి సంబంధమే ఖాయం అ యిందనిపించింది. ఇప్పుడేమో వీరికి స్వీట్లు తినిపించారు.
‘‘రోడ్ మ్యాప్‌లు తయారు చేసుకోవడంలో వాళ్లంతా బిజీగా ఉంటారు. నిన్నటి వరకు  బొంద  పెడతామని నినాదాలు చేసిన వారు ఇప్పుడు వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తున్నారు . అదేనే మన తెలివి . మనకు వారి న్యూ సెన్స్ ఉండదు.  చివరకు మా అమ్మ ఏ సంబంధం కోరుకుంటే వారి రోడ్ మ్యాపే ఫైనల్‌గా నిలిచేది. అప్పటి వరకు మన వాడికి డిమాండ్ ఉండేందుకు ఎవరొస్తే వారికి రోడ్ మ్యాప్ తయారు చేసుకోమని చెబితేనే మన పెద్దరికం నిలుస్తుందని నవ్వాడు.


‘‘మరి అమ్మ మనసులు ఏముంది అని రాజ్యలక్మి అడిగింది . ’’ 

‘‘ నిజం చెబుతున్నాను.   అది అమ్మకు  తప్ప ఎవరికి తెలియదు ’’ అని సింగయ్య భార్య మీద  ఒట్టేసి చెప్పాడు . 

 కొన్ని నెలలు గడిచాక...

‘‘కొంప కోల్లేరైందండి. మీరేమో  రోడ్ మ్యాప్ తయారు చేసుకోండి అని అందరికీ చెబుతూవచ్చారు . ఈ  విషయం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడేమో మీ ముందు అలాగే అని తలాడించి అందరూ మనకు చెయ్యిచ్చి ఇతర సంబంధాలు చూసుకున్నారు.
ఇప్పుడు అబ్బాయికి పెళ్లవుతుందా? పట్ట్భాషేకం అవుతుందా? ’’ అని రాజ్యలక్ష్మి కంగారుగా ఆడిగింది.

ఇప్పుడేమవుతుంది .. అబ్బాయికి పెళ్ళయ్యే యోగం ఉందా ? అమ్మ మనసులో ఏముంది ? 

7, జులై 2013, ఆదివారం

టెలిగ్రామ్ ఆత్మకథ




‘టెలిగ్రామ్’..
‘‘ ఈ మాట వినగానే ఎందుకు మిత్రమా! అంత ఉలిక్కి పడతావ్! ఈ టెలిగ్రామ్ వచ్చింది నీకు కాదు. నాకొచ్చింది. కాదు.. కాదు.. నాకు నేను రాసుకుంటున్న టెలిగ్రామ్.. ఇది నా గురించి నేను చెప్పుకుంటున్న కథ. 

క్షమించు మిత్రమా! ఇకపై నేను మీకు కనిపించను. ఈ నెల 15 నుంచి టెలిగ్రామ్ సేవలను నిలిపివేయాలని బిఎస్‌ఎన్‌ఎల్ నిర్ణయించింది. ఒక్కసారి మన అనుబంధాన్ని మనసారా తలుచుకుందామని. ఇలా నాకు నేను టెలిగ్రామ్ ఇచ్చుకున్నాను. ఏదో ఒక రోజు ఇలా జరగాల్సిందే.! ఇంత కాలం నేను నీకిచ్చిన సమాచారం సంక్షిప్తంగా ఉండేది. ఇది నా చివరి టెలిగ్రామ్. దీనిలో నా గురించి నేను సుదీర్ఘంగానే చెప్పుకుంటున్నాను. ఒకటా రెండా.. నేను పుట్టి 160 సంవత్సరాలు అవుతోంది. 1854లో- నేను పుట్టిన రోజు తలుచుకుంటే అబ్బా అప్పుడే 160 ఏళ్లు గడిచాయా? అనిపిస్తోంది. నాతో పాటు పుట్టిన ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. నేనింకా సజీవంగా ఉండడమే ఒక వింత! ఇప్పుడు నా వంతూ వచ్చింది. కాలగర్భంలో కలిసి పోతున్నందుకు నాకేమీ బాధలేదు. పుట్టిన వాటికి మరణం ఉంటుంది. నేను మరణిస్తున్నానంటే పుట్టినట్టే కదా? నేనింత కాలం బతుకుతానని నన్ను పుట్టించిన వారు కూడా అనుకొని ఉండరు.

 టెక్నాలజీ వేగంగా మారుతోంది. అలాంటి కాలంలోనూ నేను 160 ఏళ్ల పాటు బతకడం అంటే సామాన్యం. కాదు.. సుదీర్ఘ కాలం జీవించినందుకు నాకు సంతోషంగానే ఉంది తప్ప నా జీవితం ముగిసిపోతున్నందుకు ఎలాంటి బాధ లేదు.
1854 చివరి నుంచి నా సేవలు అందిస్తున్నాను. వయసు మీద పడింది. ఇక పని చేసే స్థితిలో లేను. సమాజంలో ఎవరిదో ఒకరిది.. ఎక్కడో ఒక చోట గుండె ఆగిపోతుంది. అప్పుడు నేను టక్‌టక్ మంటూ శబ్దంతో, చుక్కలతో ఈ విషయాన్ని వారి బంధువులకు చేరవేస్తాను. ఇప్పుడంటే క్షణాల్లో నీకు సమాచారం చేరిపోతోంది కానీ నేను పుట్టిన కాలంలో సమాచారం చేరడం అంటే ఒక యజ్ఞం లాంటిదే.
టెలిగ్రామ్ అనే మాట వినగానే ఎంతటి వారైనా ఒక్క క్షణం కలవరపాటుకు గురవుతారు. మిత్రమా! నిజం చెప్పమంటావా? టెలిగ్రామ్ అనే మాట నీలో కలిగించే మార్పు గురించి నాకు తెలుసు. కానీ నేను అనుభవించే క్షోభ ఎవరికి తెలుసు?
ఎవరో చనిపోయారనో, వారి ఆరోగ్యం బాగా లేదనో సమాచారం అందించేప్పుడు మీరు పడే బాధకన్నా ఆ సమాచారం అందించడానికి నా మనసు పడే క్షోభ ఎక్కువ. అలాంటి సమాచారం అందించి అందించి నేను బండబారి పోయాను. టెలిగ్రామ్ అందించే తంతితపాలా శాఖ ఉద్యోగిని అంతా చూసే చూపు నాకు తెలుసులే... ఆగండాగండి.. ఏమిటీ.. నేను అన్ని చెడు వార్తలే అందించానని అనుకుంటున్నారా? కాదు.. కానే కాదు...
ఇదిగో- దాసరి నారాయణరావూ.. నువ్వు చెప్పు.. సినిమాల్లో ప్రయత్నించి విసిగిపోయి తిరిగి సొంత గ్రామానికి వెళ్లిపోయిన నీకు ఒక నిర్మాత నుంచి మద్రాస్ రమ్మనే కబురు అందించింది ఎవరు నేనే కదా?
ఇప్పుడంటే టెలిఫోన్లు, సెల్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌లు ఉన్నాయి. ఇదిగో వెండితెరపై వెలిగిపోయిన నిన్నటి తరం తారల్లారా మీరే చెప్పండి.. మీలో ఎంతో మందికి సినిమాలో మీకు ఛాన్స్ వచ్చిన కబురందించింది నేనే కదా? మీరిప్పుడా విషయం మరిచిపోయారేమో, కానీ నాకు గుర్తుంది. 

ఇదిగో సూపర్ స్టార్ కృష్ణా... ‘తేనె మనుసులు’ సినిమాకు నువ్వు సెలక్ట్ అయ్యావని చెప్పింది నేనే కదా...! మరి చెప్పవేమిటయ్యా!
హలో.. సుబ్బారావు గారూ రిటైరై ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారా? మీకు ఉద్యోగం వచ్చిన సంగతి చెప్పింది నేనే కదా? ఆ గుర్తుంది గుర్తుంది లే.. మీ నాన్నకు కూడా ఉద్యోగం వచ్చిన సంతోషకరమైన వార్త అందించింది నేనేనని అంటున్నా?
ముసిముసి నవ్వులు నవ్వుతున్న పార్వతమ్మ గారూ.. మీ నవ్వులకు కారణం తెలుసులెండి. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి మీరు నచ్చారని, ముహూర్తాలు పెట్టుకోమని సమాచారం నా ద్వారానే కదా పంపింది. అది గుర్తుకొచ్చిందా? ఓయ్.. పంతులమ్మా... నువ్వు పుట్టిన విషయం మీ నాన్నకు నేనే చెప్పాను తెలుసా!
ఇదిగో రచయితలూ.. కాలం మారిందండి మీరు కథలు రాయడం మొదలు పెట్టిన కొత్తలో టెలిగ్రామ్ అనే మాటతోనే కదా శ్రీకారం చుట్టింది.
ఇదిగో జర్నలిస్టులూ... మిమ్మల్ని మరిచిపోయాననుకోకండి. ఇప్పుడంటే ల్యాప్‌టాప్‌తో ఫోజులు కొడుతున్నారు.. కానీ తెలియదనుకోకండి. 1990 వరకు బేరింగ్ కార్డు పట్టుకుని టెలిగ్రామ్ ద్వారానే కదా మీరు వార్తలు పంపింది. ఎన్నెన్ని  వార్తలు,  కబుర్లు పంపించారు. ఇప్పుడు లైవ్‌లో చూపుతున్న వార్తల్లో కన్నా ఆనాడు టెలిగ్రామ్‌లో పంపిన వార్తల్లోనే మజా ఉందంటారా? నిజమే కష్టంలోనే సుఖం ఉంటుంది.
ఓ సరదా విషయం గుర్తుకొచ్చింది. దాదాపు 40 ఏళ్లు అవుతుండవచ్చు. అదో చిన్న గ్రామం.. సాయంత్రం పెళ్లి జరుగుతోంది. కొంత మంది తమలో తామే ఏదో గుసగుసలాడుకుంటున్నారు. ఏదో తెలియని భయం వారి ముఖాల్లో కనిపిస్తోంది. కొద్ది సేపటి తరువాత ఒకరికొకరు గుసగుసలాడుతూ చెప్పుకున్నారు. ఏమీ కాలేదు. పెళ్లి బాగా జరగాలని ఎవరో శుభాకాంక్షలు పంపారట! ‘టెలిగ్రామ్’ అనగానే హడలి చచ్చాను వదినా.. అంటూ మధ్య వయసు ఆవిడ ఇంకో ఆవిడతో చెప్పుకుంది. టెలిగ్రామ్ రాగానే వారంతా ఏదో జరిగిందని అనుకున్నారు. శుభాకాంక్షలని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
పెళ్లి, జన్మదినం వంటి శుభకార్యాలకు ఒక్కో నంబర్ కేటాయించి సమాచారం పంపేవారు. శుభాకాంక్షలకు ప్రత్యేకంగా కవర్లు ఉపయోగించే వారు.
* * *
కలకత్తా- డైమండ్ హార్బర్‌ల మధ్య తొలి టెలిగ్రాఫ్ సర్వీస్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ టెలిగ్రాఫ్ సర్వీస్‌ను ఉపయోగించుకుంది. 1854 నుంచి ఈ సర్వీస్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా వేగంగా టెలిగ్రాఫ్ లైన్ల ఏర్పాటు జరిగింది. అలెగ్జాండర్ గ్రాహంబెల్ 1876లో టెలిఫోన్‌ను కనిపెట్టిన తరువాత దాదాపు అర్ధ దశాబ్దం వరకు కేబుల్ లైన్స్‌నే టెలిగ్రామ్ సేవలకు ఉపయోగించారు. 1902లో వైర్‌లెస్ సిస్టమ్‌లోకి మారింది. 1960 నుంచి సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. 1990 నుంచి టెలిగ్రాఫ్ సిస్టమ్‌ను బిఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించారు. అప్పటి వరకు ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఈ సేవలను అందించగా, 1990 నుంచి బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది.
మీకో విచిత్రం చెప్పనా! అన్నింటి ధరలు ఆకాశానికంటుతున్నాయి కదా? కానీ టెలిగ్రాఫ్ చార్జీలను మాత్రం 60 ఏళ్ల తరువాత పెంచారు. అయినా బిఎస్‌ఎన్‌ఎల్‌కు టెలిగ్రాఫ్ సేవల వల్ల భారీగానే నష్టం కలుగుతోంది. బిఎస్‌ఎన్‌ఎల్‌కు టెలిగ్రాఫ్ వల్ల ఒక అంచనా ప్రకారం 17 మిలియన్ రూపాయల వరకు నష్టం కలుగుతోందట! ఈ నష్టాన్ని భరించలేం, మీరు కొంత సహాయం చేయండి అంటూ బిఎస్‌ఎన్‌ఎల్ ప్రభుత్వాన్ని కోరింది. దాంతో ఈ కాలంలో అసలీ సర్వీసు అవసరమా? అనే చర్చ మొదలైంది. ఫ్యాక్స్, ఎస్‌ఎంఎస్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తరువాత టెలిగ్రామ్ అవసరం లేదనే నిర్ణయానికి వచ్చారు. చిత్రంగా సమాచారాన్ని పంపించడంలో ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్ వంటి ఇన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా కోర్టులు టెలిగ్రామ్‌ను రసీదును సాక్ష్యంగా అంగీకరిస్తున్నాయి.

 ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పటికే టెలిగ్రామ్ సేవలకు స్వస్తి పలికాయి. 1990 ప్రాంతంలో రోజుకు 25 నుంచి 30వేల టెలిగ్రామ్‌లు పంపేవారు. జూలైలో చివరి టెలిగ్రామ్ పంపనుండగా, ఇప్పటికీ రోజుకు ఐదువేల టెలిగ్రామ్‌లు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడం విచిత్రమే కదూ! అయితే వీటిలో కోర్టులో సాక్ష్యం కోసం పంపుతున్నవే ఎక్కువగా ఉన్నాయి. 1985లో అత్యధికంగా 60 మిలియన్ల టెలిగ్రామ్‌లు పంపారు.
ఏంటో.. నాతో అనుబంధాలు ఒక్కొక్కటి గుర్తుకు వస్తున్నాయా? ఇంత కాలం మీకు నాతో పని పడి ఉండక పోవచ్చు. కానీ నేను అంతర్థానం అవుతున్నానని తెలిసి మీ హృదయం ఎంత భారంగా మారిందో నేను గ్రహించ గలను. నాది కూడా మీ పరిస్థితే.. కానీ ఏం చేస్తాం తప్పదు కదా?
ఇక ఉంటాను...
వెళ్ళొస్తాను అని చెప్పాలంటారా?
నిజమే కానీ నేను మళ్లీ రాను కదా..! తెలిసీ ఆ మాట ఎలా చెప్పను? ఇక ఉంటాను. మీ జ్ఞాపకాలను మదినిండా నింపుకుని ప్రశాంతంగా నిద్ర పోతాను. శాశ్వతంగా నిద్ర పోతాను.
-ఇట్లు
మీ టెలిగ్రామ్
(1854- 2013)

3, జులై 2013, బుధవారం

ఇచ్చట సహాయం చేయబడును

ఫోన్ రింగ్ కాగానే ‘‘ సీనియర్ కరస్పాండెంట్ సింహం స్పీకింగ్ ’’అన్నాడు. ‘‘ఏడిచారు కానీ నేనండి మాట్లాడేది .ఈ రోజు ఇంట్లో పనిమనిషి రాలేదు’’ అంది భార్య.
 చూడు పారూ చానల్‌లో నాకెంత పలుకుబడి ఉన్నా మనింట్లో పని మనిషి రాలేదనే వార్త బ్రేకింగ్ న్యూస్‌గా వేయడం కుదరదు అని చెప్పాడు.

 ‘‘రాత్రి తొందరగా వచ్చేయండి ప్లేట్లు కడగాలి అని చెప్పడానికి ఫోన్ చేశాను ’’అంటూ భార్య విసురుగా ఫోన్ పెట్టేసింది.

 ‘‘ఏంటి బాస్ అలా దిగులుగా ఉన్నావు? ’’ అని తెలిసిన పొలిటీషియన్ ప్రశ్నించాడు. ఇం ట్లో పని మనిషి రాలేదని చెప్పడం పూర్తి కాక ముందు అతను ఎవరికో ఫోన్ చేసి అర్జంట్‌గా ఇద్దరు పని మనుషులను పంపండి అని అడ్రస్ చెప్పాడు. ఇంతటి స్పందన సింహం ఎప్పుడూ చూడలేదు. ఆశ్చర్యం నుంచి తేరుకొని ఆఫీసు మెట్లు దిగి బయట అడుగుపెట్టగానే ఒక వ్యక్తి వచ్చి గొడుగు పట్టుకున్నాడు. 

సార్ వర్షం వచ్చేట్టుగా ఉంది. ఒక్క చుక్క కూడా మీ ఒంటిపై పడకుండా ఇంటికి చేర్చే బాధ్యత నాది అంటే అతన్ని చిత్రంగా చూసి సింహం ముందుకు వెళ్లాడు. పనికి మాలిన వాడు వాడి గొడుగు కింద మీరు ఉండడం ఏమిటి సార్ రండి నా గొడుగు పడతాను అని మరో వ్యక్తి వచ్చాడు. సింహంకు అంతా విచిత్రంగా అనిపించింది. మే ఐ హెల్ఫ్ యూ అంటూ టీ షర్ట్‌లు ధరించిన వారు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. ఏంటబ్బా ఒక్కసారిగా ప్రపంచం ఇలా మారిపోయిందని ఆశ్చర్యపోయాడు.

 ***
 సింహం దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలోకి రాగా, ఒక చోట ఆజాను బాహువు ఒకరు ఒక వ్యక్తిని అమాంతం ఎత్తుకెళ్లి కారులో పడేశాడు. అక్కడేదో గ్యాంగ్ వార్ జరుగుతుందని గ్రహించాడు. వెంటనే ఆఫీసుకు ఫోన్ చేసి కెమెరామెన్‌ను పంపించమని ఆర్డరేశాడు. ముంబై గ్యాంగ్ వార్ వీధిపోరాటం హైదరాబాద్‌లో కూడా మొదలైంది. రక్తాలు కారుతున్నాయి, తూటాలు పేలుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియని భయానక వాతావరణం ఏర్పడింది. సింహం ఫోన్ చేయడంతో లైవ్ కోసం చానల్ ఓబి వ్యాన్ బయలు దేరింది. అంబులెన్స్ అడ్డం రావడంతో చానల్ ఆయనకు కోపం చిర్రెత్తుకొచ్చింది.
 ఏరా హారన్ కొడుతుంటే సైడ్ ఇచ్చేది లేదా? ఓబి వ్యాన్ కనిపించడం లేదా? అంటూ అంబులెన్స్ డ్రైవర్‌పై మండిపడ్డాడు. రెండు మూడు స్కూటర్లను, ఆటోను, రెండు బైక్‌లను బోల్తా కొట్టించి ఓబి వ్యాన్ విజయవంతంగా సంఘటన స్థలానికి చేరుకుంది. 
***
 పచ్చ చొక్కా , తెల్ల చొక్కా వేసుకున్న ఇద్దరు వ్యక్తులు బాహాబాహి యుద్ధానికి దిగారు. మల్లయుద్ధంలో ఎవరిది పై చేయి అంటే యుద్ధం జరిగేప్పుడే చెప్పడం సాధ్యం కాదు. యుద్ధం ముగిశాక ఎవరు పైకి లేస్తే వాడే విజయం సాధించినట్టు. ‘‘పద్మా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎల్లో గ్యాంగ్, వైట్ గ్యాంగ్‌ల మధ్య ఇక్కడ స్ట్రీట్‌ఫైట్ జరుగుతోంది. అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గ్యాంగ్‌లు రాష్ట్రంలో సైతం తమ బ్రాంచీలు ఏర్పాటు చేసినట్టు ఈ వార్‌తో తేట తెల్లం అయింది.’’ అంటూ సింహం చెప్పు కు పోతున్నాడు.

 కింద పడి పైకి లేచిన ఒక గ్రామీణుడు పిచ్చి నా... అంటూ చేతికి మోకాలికి అంటిన దుమ్ము దులుపుకుని సింహం వైపు రాసాగాడు. గ్రామీణుడిని సింహం ఆక్రమించేసుకుని ఏం జరిగిందో చెప్పమన్నాడు. ఎన్నో రోజుల నుంచి టీవి వార్తలకు అలవాటు పడ్డ గ్రామీణుడు టీవి చానల్ లోగో చేతిలోకి తీసుకొని, ‘‘అదో భయానక విషాదకర, హృద య విదారకమైన సంఘటన. అసలు నేను మళ్లీ బతుకుతానా? ఆ గ్యాంగ్ చేతి నుంచి ప్రాణాలతో బయటకు వస్తానా?అని భయపడ్డాను. ఆ భగవంతుని దయ,మా ఆవిడ పూజలు, మా పిల్లల ఎంసెట్ ర్యాంకులే నన్ను బతికించాయి.’’ అని చెప్పాడు.

 భలే మాట్లాడావు అని సింహం అతన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు. ఒకటా రెండా పదిహేనేళ్ల నుంచి రోజూ కొన్ని గంటల పాటు టీవిల్లో వార్తలు చూస్తున్నాను. వినీ వినీ ఎప్పుడు ఏం మాట్లాడాలి. ఏ చానల్‌లో ఏం మాట్లాడాలో బాగా వచ్చేసింది. అంటూ గ్రామీణుడు వెళ్లిపోయాడు. ఇంతలో కారు డోర్ తెరుచుకుని ఒక యువకుడు పరిగెత్తుకొస్తుంటే సింహం అతన్ని ఆపి మీ అనుభవాలు చెప్పండి అంటూ  వరుసగా ఐదారు ప్రశ్నలు వేశాడు.
 ‘‘మేం ప్రయాణిస్తున్న ఆర్టీసి బస్సు టైర్ పంక్చర్ అయి చిన్న జర్క్ ఇచ్చింది. ఎటు నుంచి వచ్చారో కానీ మీ అందరినీ మీ ఇళ్లకు చేర్చే బాధ్యత మాదంటే మాది అంటూ ఎల్లో గ్యాంగ్, వైట్ గ్యాంగ్ హోరా హోరీగా కొట్టుకుంది. బలవంతంగా కార్లలో బంధించారు. మా ఇల్లు పక్కనే ఉందని చెప్పినా వినకుండా అవసరం అయితే ప్రత్యేక విమానంలో పంపిస్తామని పోటీ పడుతున్నారు’’ అని చెప్పి యువకుడు పరిగెత్తాడు. 

విశ్వంలో తెలుగు వారికి ఎక్కడేం జరిగినా సహాయం చేసే హక్కు మాదే అని నేత ఒకరు సవాల్ చేశారు. దీన్ని ఖండిస్తున్నానని మరొకాయన కత్తిపట్టుకుని వచ్చాడు. మెడపై కత్తి పెట్టి బెదిరించి రేప్ చేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ మెడపై కత్తిపెట్టి సహాయం చేసే వాళ్లుంటారా? అనుకున్నాడు.

 మే ఐ హెల్ప్ యూ స్కీమ్ బాగా వర్కవుట్ అవుతోందని, మన అభిమాన నాయకుడు అధికారంలోకి రావడం ఖాయం అని చానల్స్ తేల్చేశాయి. 

ఇదేం జబ్బో సింహానికి అర్ధం కాలేదు. 2014 వరకు పరిస్థితి ఇలానే ఉంటుందని డాక్టర్లు చెప్పారు.

 ముక్తాయింపు: సీజనల్ ఫీవర్స్ లానే ఎన్నికల సీజన్ జబ్బులుంటాయి