31, మే 2011, మంగళవారం

ప్రధాన మంత్రి , ముఖ్యమంత్రి ..నేను .....................సికింద్రాబాద్ కథలు 3

ప్రధాన మంత్రి , ముఖ్యమంత్రి ..నేను ....

మీ ఆయనకు ప్రధాన మంత్రి తెలుసా ?  అంటూ మా ఇంటి ఓనర్ కూతురు ఇంట్లోకి పూర్తిగా అడుగు పెట్టకుండానే ప్రశ్న సంధించింది. ప్రధానమంత్రే కాదు అమెరికా అధ్యక్షుడు కుడా నాకు తెలుసు కాని నేనే వాళ్ళకు తెలియదు అని పాత జోక్ చెబుదామనుకున్నా , కాని ఆమె నామాట వినేట్టుగా లేదు .   ఇంటి  ఓనర్ కూతురు మా ఆవిడను ఆశ్చర్యంగా అడిగితే మా ఆవిడా అదేం ప్రశ్న అన్నట్టు గందర గోళం తో   కూడిన ఆశ్చర్యంగా ముఖం పెట్టింది . ఆశ్చర్యానికి, ఆశ్చర్యం ఎప్పుడూ సమాధానం కాదు. ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే మా ఆవిడ ముందు  ఆమె వైపు, తరువాత  నా వైపు  ప్రశ్నార్థకంగా చూసింది . నీకు ప్రదాని తెలుసన్న విషయం నాకు తెలియదు కాని ఆమె కెలా తెలుసు అని నన్ను   ప్రశ్నిస్తున్నట్టుగా  అనిపించిది నాకు  ఆ చుపునకు అర్థం . ప్రదాని నాకు తెలుసన్న విషయం ఆమె చెప్పేంత వరకు నాకే తెలియదు ఇక నీకేం  చెబుతాను అన్నట్టుగా మా  ఆ విడ  వైపు  సంజాయిషి ఇస్తున్నట్టు చూశా..   తన ప్రశ్నకు కారణం అన్నట్టు ఓనర్ కూతురు మా ఇంట్లో  ఓ మూలకు బిక్కు బిక్కు మంటూ పడి ఉన్న ఫోటో  చేతిలోకి తీసుకుంది.  నిజమే   ఆ ఫోటోలో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి , నేను ఉన్నాను.
 ************
1995 లో వరంగల్ నుంచి హైదరాబాద్ బదిలీ అయ్యాక . సికింద్రాబాద్ వారసిగూడ లోని బ్రాహ్మణ  బస్తీలో ఉండే వాళ్ళం  . కొద్ది రోజుల తరువాత ఇల్లు  చిన్నగా మనుషులు పెద్దగా ఉన్నట్టు సందేహం వచ్చింది .మనుషులను చిన్నగా చేయలేం , అలా అని ఇంటిని పెద్దగా చేద్దామంటే ఇంటి  ఓనర్ ఒప్పుకోడు .. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది .అది కాశ్మీర్ సమస్య కావచ్చు , తెలంగాణా,  సమైక్యాంధ్ర  సమస్య కావచు పరిష్కారం మాత్రం ఉంటుంది .ఇంట్లో ఉన్న  వస్తువుల సంఖ్య    తగ్గిస్తే  ఇల్లు పెద్దదవుతుందని నిర్ణయించుకున్నాం .  ఆ నిర్ణయం లో భాగంగానే ఆ మూలనున్న వస్తువులను బయటకు తీసినప్పుడు ప్రదాన మంత్రి, ముఖ్యమంత్రి నేను ఉన్న ఫోటో బయటకు వచ్చింది .ఫోటో లో డజను మందిమి ఉన్నాం. ప్రదానమంత్రి నీ, ముఖ్యమంత్రిని ని    ఆందరూ గుర్తు పడతారు, వాళ్ళింట్లో అద్దెకు ఉన్నాం కాబట్టి నన్ను గుర్తు పట్టారు. అందువల్ల వాళ్ళ దృష్టిలో ప్రదాని, ముఖ్యమంత్రి , నేను దిగిన ఫోటో అనిపించింది . అప్పటి వరకు పెద్దగా పట్టించుకోని ఇంటి ఓనరు కూతురు గౌరవ  భావనతో చూడసాగారు. 

********
94 లో పివి నరసింహారావు ప్రదానమంత్రి, కోట్ల విజయ  భాస్కర్ రెడ్డి  ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ప్రదాన మంత్రి హోదాలో తోలి  సారిగా పివి నరసింహారావు వరంగల్ వచ్చారు . టివిల గందరగోళం లేని కాలమది . ఐదారుగురు జర్నలిస్టులు మాత్రమే ఉండేవారు. పివి సొంత ప్రాంతం కాబట్టి  ఆర్భాటం లేకుండా మాములుగానే ఉన్నారు దాంతో ప్రెస్ క్లబ్ తరపున అందరితో ఫోటో దిగారు. అక్కడ నేను కాకుండా ఒక అప్పారావు ఉన్న ఫోటో దిగేవాడు అందులో నా ప్రత్యేకత ఏమి లేదని ఫోటో ను పెద్దగా పట్టించుకోలేదు. అప్పటి నా అభిప్రాయం అదే . ఇంటి ఓనర్ హిందీ టిచర్ ౩౦౦ గజాల స్థలం ఉంటే సగం స్థలంలో ఇల్లు కట్టాడు . ఇంటి మీద పెట్టిన పెట్టుబడి అంతా డేడ్ ఇన్వెస్ట్ మెంట్ మీరు తప్పు చేసారు అంటూ ఆతను కనిపించినప్పుడల్లా క్లాస్ తీసుకునే వాడిని. (నెలనెలా అడగక ముందే అద్దె చెల్లించే వారికి ఈ అదనపు సౌకర్యం ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది . స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే మీరు రిటైర్ అయ్యే నాటికి ఎక్కడికో వెళ్లి పోతారని సలహా ఇచ్చాను . ఏమోనండి నాకు అవన్నీ తెలియవు రేపు అద్దేతోనైన బతక వచ్చునని ఇంటి మీదే ఇన్వెస్ట్ చేసానని చెప్పాడు,... 
*****
*ప్రముఖులతో ఫోటోలు దిగడానికి ఉత్శాపడే వారిని నేను చిన్నచూపు చూసేవాడిని. ఇప్పుడు నా అభిప్రాయం మారింది  కాలాన్ని ఒక్క క్షణం కూడా నిలుప లెం , ఇక  జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తేగలమా.?  ఫోటోలు ఆ పని చేయగలవు ఒక్కసారి కాలాన్ని గిర్రున వెనక్కి తిప్పగలవు. సంతోషంలో తేలియాడి పోయేట్టు చేయగలవు. ఒక్క మాట మాట్లాడకుండానే జీవిత గ్రంధాన్ని చదివి వినిపిస్తాయి. ఇప్పుడు నాకు స్టాక్ మార్కెట్ అంటే చిన్న చూపు  .. రిటైర్ అయ్యే నాటికి అద్దెలు వచ్చే బిల్డింగ్ కట్టేయాలనేది నేటి నా ఆలోచన ..ఇది నా ఇప్పటి ఆలోచన ..  ఏమో ఆ రోజు వచ్చే సరికి మరే  ఆలోచన మనపై దాడి చేస్తుందో .. ఇప్పుడు నేను స్కూల్ లో గ్రూప్ ఫోటో కోసం చిన్న నాటి మిత్రుల కోసం వెతుకుతున్నా.... ఈ ఆలోచన ఎన్ని రోజులు ఉంటుందో. ప్రతి క్షణం మనిషి మారుతుంటాడని ఓషో రజనీష్ చెప్పింది నిజమే అని ఇప్పటికైతే అనిపిస్తుంది . .....

27, మే 2011, శుక్రవారం

ఆటో వాడికీ మనసుంటుంది .... ....................... ........మా సికింద్రాబాద్ కథలు2



 ప్రపంచం అంతా మార వచ్చు, యల్ టిటి శాంతి మంత్రం పటించవచ్చు .. పాకిస్తాన్ తీవ్రవాదులను ఏరి పారేయ వచ్చు .. ఆమెరికా ఇతర దేశాల సార్వబౌమత్వాన్ని గౌర వించవచ్చు.   ఏమైనా జరగవచ్చు కాని హైదరా బాద్ లో ఆటో వాళ్ళు మాత్రం మారరు  అని చాలామంది కి ఉన్నట్టే నాకు గట్టి విశ్వాసం . మనకు ఓ విశ్వాసం ఉన్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవదానికే శత విధాల ప్రయత్నిస్తాం. నేను అంతే నా విశ్వాసం ఇప్పటికీ అదే .              

ఒక సారి హైదరాబాద్ నుంచి సికిందరాబాద్ కు ఆటో లో వెళుతున్నా..ముందే చెప్పాను కదా హైదరాబాద్ ఆటో వారిని నమ్మ వద్దు అనే ఆచారం పై నాకు పూర్తి నమ్మకం ఉంది. . కవాడిగూడ ప్రాంతం నుంచి వస్తున్నాను . అటునుంచి బన్సిలాల్ పేట స్మశాన వాటిక ముందునుంచి వెళితే బైబిల్ హౌస్ , సికింద్రాబాద్ వస్తుంది .  ఆటో ఆతను అలాకాకుండా కనీసం ఒక కిలోమీటర్  దూరం పెరిగే విధంగా జీరా మీదుగా కింగ్స్ వే నుంచి  సికింద్రాబాద్  కు వస్తున్నాడు.


 మనను ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నించడాన్ని మనం గ్రహిస్తే మనలోని హీరో బయటకు తన్నుకు వస్తాడు.ఎదుటి వాడు బలహీను డైన విలన్ ఐతే మనం చాల బలమైన హీరో గా మారుతాం . బాబూ సికిందరాబాద్ కు కొత్త అనుకుంటున్నావా ? సికింద్రాబాద్ లో నాకు ప్రతి అడుగు తెలుసు .దగ్గరి దారి ఉండగా అలా ఎందుకు తీసుకు వెలుతున్నావని నిలదీశాను. 


.మామను  కుర్చీ నుంచి దించేసిన అల్లుడు వారం రోజులకే తొలి అధికార సమావేశం లో రాజకీయాల్లో విలువలు పడి పోతున్నాయని దైర్యంగా ఉపన్యాసించారు. అలాంటిది ఏతప్పూ చేయడానికి కుడా  అధికారం లేని నేను నైతిక విలువల గురించి మాట్లాడడానికి వచ్చిన అవకాశం ఎందుకు వదులుకుంటాను? అందు లోను ఆటోలో మా అమ్మ కూడా ఉంది . 


సరే ఇది ముప్పయి ఏళ్ళ క్రితం నాటి మాట కాసేపు ఇది పక్కన పెట్టి ఇప్పటిలోకి వద్దాం.


 వారం క్రితం మా అమ్మాయి ఫ్రెండ్స్ అంతా కలిసి  పంజాగుట్ట నుంచి ఆటో లో బేగం పేటకు వచ్చారు . రెండున్నర కిలో మీటర్ల దూరాన్ని కాస్తా ఆటో వాడు ఊరంతా తిప్పాడు . పాపం వాడికి రూట్ తెలియదు అందుకే అలా తిప్పాడు అని పిల్లలు చెప్పారు . నా నమ్మకాన్ని బలపరిచే సంఘటన జరిగి నప్పుడు నేను మౌనంగా  ఎందుకు ఉంటాను . నాలోని ఉపన్యాసకుడు మేల్కొన్నాడు. ఆటో వాళ్ళు ఎలా మోసం చేస్తారో చక్కగా వివరించా .పిల్లలు మాత్రం అది కాదు వాడికి నిజంగానే రూట్ తెలియదేమో అన్నారు. పిల్లలకు పెద్దవారికి ఉన్నంత అనుభవం ఉండదు కదా .. 


సరే .మరి వెనక్కి వెళదాం ..


 ఆటోలో మా అమ్మకూడా ఉండడం తో  ఆటో వాడి ని అలా ఎందుకు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నావని నిలదిశా .. వాడు మీరు ఈ రూట్ లో రోజు వెళతారు కదా మీటర్ ఎంత అవుతుందో అంతే ఇవ్వండి దూరం పెరగడం వల్ల అదనంగా డబ్బు అవసరం లేదని చెప్పాడు. 
నాకు రూట్ తెలుసు కాబట్టి  దారికి వచ్చావు తెలయక పొతే మోసం చేసేవాడివే కదా  అని ప్రశ్నించా .. ఎదుటి వాడిని నిలదీయడం లో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు ..సాధారణంగా ఆటో డ్రైవర్స్ వాళ్ల డ్రైవింగ్ లానే రాష్ గా ఉంటారు కాని ఆతను మాత్రం నిర్వికారంగా ఉన్నాడు . బహుశా అందువల్లనేమో   నా ఉపన్యాసం ఎలాంటి అడ్డు లేకుండా సాగింది.


 నా ఉపన్యాసం   ముగిశాక అతను మెల్లగా మిమ్ములను మోసం చేయాలని కాదు. స్మశాన వాటిక ముందు నుంచి వెళ్ళడానికి మనసొప్పడం లేదు . ఈ మద్యనే నా భార్య చనిపోయింది. అక్కడే అంత్యక్రియలు జరిగాయి అటునుంచి వెళితే అన్నీ గుర్తుకు వస్తాయని ఇటునుంచి వచ్చా అని అతను చెప్పగానే  నా నమ్మకం  పై బలంగా కొట్టినట్టు అనిపించి , తమాయించుకొని నిలబడ్డా. ..


మళ్లీ చెబుతున్నాను ప్రపంచంలో ఎవరైనా మారవచ్చు , హైదరాబాద్ లో ఆటో వాళ్ళు తప్ప అనే నా నమ్మకం లో ఎలాంటి మార్పు లేదు. 

తెలుగు దేశం భవిష్యత్తు ఏమిటి ?....సమస్యలనుంచి సంక్షోభంలోకి.. పయనం


  నేటి నుంచి మూడు రోజులు మహానాడు

టిడిపి ఆవిర్భావం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసింది. తమిళనాడులో డిఎంకె, అన్నాడిఎంకె స్ఫూర్తితో ఆవిర్భవించిన టిడిపి రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. ఎన్టీఆర్ హయాంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెసేతర పక్షాలన్నింటిని ఏకం చేయగలిగింది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో పెకిలించారని టిడిపి నాయకులు ఘనంగా చెప్పుకుంటారు.
 కానీ అది నిజం కాదు. టిడిపి ఆవిర్భావం తరువాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెద్దగా చెదిరిపోలేదు. రాష్ట్రంలో కాంగ్రేసేతర పక్షాలన్నింటిని ఎన్టీఆర్ కూకటివేళ్లతో పెకిలించారు. ప్రతిపక్షాలు చీలికలు పేలికలు కావడం వల్ల 30- 40 శాతం ఓట్లతో ఎదురులేని విధంగా రాష్ట్రంలో పాలన సాగిస్తూ వచ్చిన కాంగ్రెస్ విజయాలకు టిడిపి బ్రేకు వేసింది.
 కాంగ్రేసేతర పక్షాల ఓట్లన్నీ గుండుగుత్తగా టిడిపి ఏకం చేయడంతో ఎదురులేదనుకున్న కాంగ్రెస్ డీలాపడిపోయింది. ఈ విజయంతో ఎన్టీఆర్ రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా కాంగ్రేసేతర పక్షాలను ఏకం చేయడానికి తీవ్రంగానే ప్రయత్నించారు.
ఇదంతా టిడిపికి సంబంధించి గత వైభవం. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఎన్టీఆర్ ప్రభావాన్ని పార్టీపైన, ప్రజల పైన లేకుండా చేయడానికి తన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. సాధ్యం కాలేదు. చివరకు ఓటమి తరువాత ఇప్పుడు తన పాలన గురించి చెప్పడం కన్నా ఎన్టీఆర్ హయాంలో సాధించిన విజయాలు, రాజకీయ రంగంలో ఎన్టీఆర్ చూపిన ప్రభావం గురించి చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు గండిపేటలో మహానాడు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సమస్య మొత్తం దేశానికి సమస్యగా మారిందనేది టిడిపి సీమాంధ్ర నాయకుల వాదన. ఒక రాష్ట్రాన్ని విభజిస్తే మొత్తం దేశం నుంచి లాంటి వందలాది డిమాండ్లు పుట్టుకొస్తాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ దేశానికే సమస్య అని భావిస్తున్న వారు హైదరాబాద్‌లో జరుగుతున్న మహానాడులో మాత్రం తెలంగాణపై చర్చించవద్దని భావించడం విచిత్రం. అసలు సమస్యనే చర్చించనప్పుడు మూడు రోజుల మహానాడును మొక్కుబడి తంతుగా కాక పార్టీ శ్రేణులకు దశ దిశ చూపేదిగా ఎట్లా నిర్వహిస్తారు?
 ఒక పార్టీని వ్యతిరేకించడమే మా సిద్ధాంతం అని చెప్పుకునే ప్రత్యేకత టిడిపికి మాత్రమే పరిమితం! మరిప్పుడు తెలంగాణ, సమైక్యాంధ్ర, ఎన్‌డిఏ కూటమి, యుపిఎ కూటమి, తృతీయ ఫ్రంట్.. వీటిల్లో దేన్ని వ్యతిరేకించాలో.. ఎవరికి మద్దతు ఇవ్వాలో.. ఎటూ అంతు చిక్కని గందరగోళ పరిస్థితిలో టిడిపి కొట్టుమిట్టాడుతోంది.
ఎన్టీఆర్ మరణించిన ఒకటిన్నర దశాబ్దాల తరువాత కూడా ఇంకా ఎన్టీఆర్ పేరు చెప్పుకొని బతికే ప్రయత్నమే తప్ప పార్టీశ్రేణుల్లో ఉత్సాహం నింపలేకపోతున్నారు. దానికి ఏం చేయాలంటే ఎవరి వద్ద సమాధానం లేదు. నాయకునిపై పెద్దగా ఎవరికీ నమ్మకం లేదు. 2004 ఎన్నికల ముందు ప్రజల్లో టిడిపి పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందనే విషయం పార్టీలో అందరికీ తెలుసు! అయినా చంద్రబాబు పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వస్తాడు అనే నమ్మకం చాలా మంది నాయకుల్లో బలంగా ఉండేది. ఇప్పుడలాంటి నమ్మకం ఏమాత్రం లేదు. 95లో ఎన్టీఆర్‌ను పక్కకు తప్పించి పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పదహారేళ్ల శ్రమతో పార్టీ శ్రేణులను నమ్మకం నుంచి అపనమ్మకంలోకి తీసుకువెళ్లారు.

 ఇలాంటి పరిస్థితుల్లోనూ...పార్టీ పరిస్థితి ఎలాగైనా ఉండనివ్వండి. ఈ పార్టీని ఇప్పుడున్న స్థితిలో ఆయన తప్ప మరెవరూ నడిపించలేరని బలంగా నమ్మే నాయకులే ఎక్కువ ఉండటం చంద్రబాబుకు బాగా కలిసి వచ్చే అంశం. మీడియా పుణ్యమా అని నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల పేరుతో కొంత హడావుడి జరిగినా అవి తాటాకు చప్పుళ్ళే అన్న విషయం బాబుకు తెలుసు. నందమూరి హీరోలు ఎన్నికల ప్రచారానికి తప్ప ఒక రాజకీయ పార్టీని నిర్వహించే సామర్ధ్యం వారికి లేదనే విషయం పార్టీ నేతలకూ తెలుసు, బాబుకు మరింత బాగా తెలుసు.
తెలుగుదేశం నాతోనే పుట్టింది.. నాతోనే పోతుంది అని ఎన్టీఆర్ చెప్పిన మాట నిజం కాలేదు.. కానీ ఆ మాట చెప్పకపోయినా చంద్రబాబుకు మాత్రం ఆ గౌరవం దక్కేట్టుగా ఉంది. ఇప్పుడా పార్టీ నిలవాలన్నా..మునగాలన్నా ఆయన వల్లే సాధ్యం. పార్టీ పరిస్థితి మెరుగుపడాలంటే ఏం చేస్తే బాగుంటుంది? అనే ప్రశ్న బాబుతో సహా టిడిపి నాయకులెవరికీ ఉదయించడం లేదా? అంటే ఎందుకు ఉదయించదు. కానీ సమాధానం వారి చేతుల్లో లేదు! తెలంగాణ, జగన్ ఈరెండూ లేకపోతే టిడిపి ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలోకి వచ్చి పాలించేస్తున్నంత హడావుడిగా ఉండేది. టిడిపి దూకుడుకు పగ్గాలు లేకుండేవి. ఈ రెండు సమస్యలు పరిష్కారం అయితే కానీ టిడిపి ముందుకెళ్లలేదు. మరి చంద్రబాబును తెలంగాణ వ్యవహారం ముందుకెళ్లకుండా చేస్తోంది. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానం సైతం బాగానే గ్రహించినట్టుగా ఉంది. అందుకే తెలంగాణ వ్యవహారాన్ని అటు ముందుకెళ్లనివ్వడం లేదు, ఇటు వెనక్కి పోనివ్వడం లేదు. ఎందుకంటే ఒకసారి తెలంగాణ సమస్య పరిష్కరించారంటే పరిస్థితులు తమ చేతిలో ఉండవు. బాబు,జగన్ చేతిలో ఉంటాయి. అందుకే బలమైన తెలంగాణ ఆయుధాన్ని వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్ హై కమాండ్ తమ చేతిలోనే ఉంచుకోదలుచుకుంది. తెలంగాణ సమస్య రాజుకున్నంత కాలం టిడిపి ముందరి కాళ్లకు బంధం వేసినట్టే. తెలంగాణకు టిడిపి ఔననదు, కాదనదు. తాము ఔనంటే ఢిల్లీ కాదనవచ్చు, తాము కాదంటే ఢిల్లీ ఔననవచ్చు. కాబట్టి మేం చివరకు రెండు కళ్లను నమ్ముకోవడం మినహా మరో మార్గం లేదనేది టిడిపి నాయకుల వాదన. టిడిపి రెండు కళ్ల సిద్ధాంతం చెప్పినంత కాలం రెండు ప్రాంతాల్లోనూ టిడిపికి ఇబ్బందులే.
నిజానికి కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు నిర్వీర్యంగా మారుతోంది. రెండుసార్లు గెలిచిన కాంగ్రెస్‌కు ఎంత గొప్పనాయకుడు నాయకత్వం వహించినా మూడోసారి గెలవడం అంత సులభం కాదు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు లేని పార్టీగా మారింది. ఇలాంటి పరిస్థితి వాస్తవానికి ఇప్పుడు అంతా టిడిపి వైపు చూసే పరిస్థితి ఉండాలి. కానీ టిడిపి సైతం శూన్యంలోకి చూస్తోంది. జగన్ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత కాంగ్రెస్ ఓట్లు రెండుగా చీలి మేం అధికారంలోకి వస్తాం అంటూ చంద్రబాబు కొత్త వాదాన్ని వినిపించి పార్టీ శ్రేణుల్లో ఆశలు రేకెత్తించారు. ఆ వాదం బయటకు వచ్చిన తరువాత జరిగిన తొలి ఎన్నికలు కడప, పులివెందుల. కాంగ్రెస్ ఓట్లు చీలడం మాట అటుంచి చివరకు టిడిపి ఓట్లు సైతం చీలిపోయి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు పడ్డాయి. గత ఎన్నికల్లో కడపలో టిడిపికి మూడున్నర లక్షల ఓట్లు వస్తే ఇప్పుడు లక్షా 20వేల ఓట్లు మాత్రమే వచ్చి, డిపాజిట్ కూడా దక్కలేదు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఈ స్థాయిలో ఉండక పోవచ్చు. కానీ జగన్ పార్టీకి కాంగ్రెస్ ఓట్లు మాత్రమే చీలుతాయని చెప్పలేం, టిడిపి ఓట్లు సైతం చీలడం ఖాయం. ఇదే టిడిపిని కలవరపెడుతున్న సమస్య. అధికారంలో ఉన్నంత కాలం పాజిటివ్ ప్రచారంతో ఆశలు రేకెత్తించారు. గతంలో మాదిరిగా మీడియా మొత్తం టిడిపికి ఏకపక్షంగా లేదు, టిడిపి ప్రత్యర్థులకు సైతం బలమైన మీడియా అండ ఉంది. ఇది టిడిపికి మింగుడు పడని కొత్త సమస్య. ఏకపక్ష మీడియాతో ప్రయోజనం పొందిన టిడిపికి ప్రత్యర్థులకు సైతం మీడియా అండ లభించడంతో ఈ కొత్త పోరును ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. ఇప్పుడు మీడియా ఒకే సామాజిక వర్గం, ఒకే ప్రాంతం చెప్పు చేతుల్లో లేదు. విస్తృత మైంది.

 ఇక ఇప్పటి వరకు గట్టి మద్దతుదారులుగా నిలిచిన వామపక్షాలు జగన్ వైపు దృష్టిసారించాయి. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణలు వేగంగా మార్పు చోటు చేసుకుంటాయి. రోజులు గడుస్తున్నా కొద్ది టిడిపిని తెలంగాణ సమస్య మరింతగా చుట్టుముడుతుంది. ఇప్పుడు నాగం జనార్దన్‌రెడ్డిని బయటకు పంపినా, తెలంగాణపై గొంతెత్తే నేతల సంఖ్య ఇంతటితో ఆగిపోదు. ఉద్యమం బలపడిన కొద్దీ సమస్యలు చుట్టుముడతాయి. పూర్తిగా చల్లబడితే ముందు ప్రయోజనం పొందేది టిడిపినే. మరి చల్లబడేదెప్పుడు? మొత్తం మీద టిడిపి పరిస్థితి సమస్యల నుంచి సంక్షోభం వైపు పయనిస్తున్నట్టుగా ఉంది.

25, మే 2011, బుధవారం

విక్టోరియా రాణి.. బంగారు పళ్లెం!-లోక్‌పాల్

శ్రీకృష్ణునిపై కోపంగా ఉండిన సత్యభామ కోపగృహంలోకి వెళ్లింది. రావణుడైనా, మైరావణుడైనా, దుర్యోధనుడైనా, శకుని ఐనా కాంతాదాసుడేనాయె.... శ్రీకృష్ణుడు దీనికి అతీతుడా? చిన్నప్పటి నుంచే వెన్నతోపాటు అమ్మాయిల మనసు దోచినవాడు ఇష్ట భార్య అలిగితే బుజ్జగించకుండా ఉంటాడా!

 ప్రత్యర్థిపై విజయం సాధించాలంటే నీ బలం ఒక్కటే సరిపోదు ఎదుటివాడి బలహీనతేమిటో తెలుసుకోవడం ముఖ్యం. శ్రీకృష్ణుడి బలహీనత సత్యభామ. -ఫెమినిస్టులు క్షమించుదురు గాక, నరకాసుర వధలో శ్రీకృష్ణుడి బలం సత్యభామే అని తెలుసు లేండి-

మా ఆయనతో సహా ఎవరొచ్చినా లోనికి పంపకండి అంటూ సత్యభామ చెలికత్తెలకు హుకుం జారీ చేసింది. శ్రీకృష్ణునికి ఇంతకు మించిన రాజకార్యం ఏముంటుంది? పరుగుపరుగున సత్యభామ వద్దకు వచ్చారు. ససేమిరా లోనికి పంపే ప్రసక్తి లేదని చెలికత్తెలు చెప్పారు. ఎంత సేపు బతిమిలాడినా వారి సమాధానం అదే. వారి కర్తవ్యదీక్షకు మురిసిపోయిన శ్రీకృష్ణుడు ఒక్కో చెలికత్తెకు ఒక్కో బంగారు ఉంగరం బహూకరించారు. బహుమతికి మురిసిపోయిన చెలికత్తెలు అడ్డుతొలగి తలుపు తెరిచారు. శ్రీకృష్ణుడు లోనికి వెళ్లాడు. సరే సత్యను ఏదో విధంగా బతిమిలాడి బామాలి, పాట పాడి దారికి తెచ్చుకున్నాడు.

 ఆ తరువాతైనా శ్రీకృష్ణుడు కానీ, సత్యభామ కానీ ఆ చెలికత్తెలను పల్లెత్తు మాట అనలేదు. ఇంత కీలక స్థానాల్లో ఉన్న మీరే బహుమతి ఇస్తే లోనికి పంపించడం ఏమిటని సత్యభామ కానీ శ్రీకృష్ణుడు కానీ వారిని నిలిదీశారా?ఆ చెలికత్తెలను మార్చారా? అని వెతికితే భావగతంలో కానీ మహాభారతంలో కానీ అసలే దొరకలేదు.

 ఇక మన లోకానికి వస్తే కరెంటు లేని కాలంలో , వందేళ్ల క్రితం మద్రాసు నగరంలో ఆముదం దీపాలు వెలిగించే వారట. రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు దీపాలు వెలగాలంటే ఎంత ఆముదం అవసరమో లెక్కించి ఇచ్చేవారు. కానీ ఆవి తెల్లవారు జాము కాదు కదా ఆర్థరాత్రికి ముందే ఆరిపోయేవి. ఎందుకంటే కొంత ఆముదాన్ని కా జే సే వారు మరి. ఏ చెట్టులేని చోట ఆముదం చెట్టే మహావృక్షం. అభివృద్ధి అంతగా లేని కాలంలో ఆముదం కాజేయడమే మహా అవినీతి.

 సరే కరెంటు లేని కాలం నుంచి కరెంటొచ్చిన కాలానికొద్దాం.
రవి అస్తమించని బ్రిటిష్ స్రామాజ్యాన్ని పాలించే విక్టోరియా మహారాణి బంకింగ్ హమ్ ప్యాలెస్‌లో ఇస్తున్న విందుకు ఆహ్వానం అంటే అల్లాటప్పనా! దేశ దేశాల రాజులు, రాణులు, సామంతులు ఎంతో మంది వస్తారు
 మీనాక్షి, రామలక్ష్మిలైతే ఆఫీసులో మీ ఆయన సంపాదన ఎలా ఉందంటే ఎలా ఉందని కబుర్లు చెప్పుకుంటారు. హౌస్‌వైఫ్‌లైతే - ఒక పురుషునికి భార్య ఉంటుంది , కానీ ఇంటికి భార్యేమిటో నాకిప్పటికీ అర్ధం కాలేదు- కొత్తగా కొన్న చీరలు ఒకరికొకరు చూపించుకుంటారు.
 మా తమ్ముడు అమెరికాలో ఉంటున్నాడు కదా! వాడు మొన్న పంపించాడు ఈ బంగారు గొలుసు ఎలా ఉంది పంకజం అని అడుగుతారు. ఆ వాడు అమెరికాలో పెట్రోల్ పంపులో పెట్రోలు పోస్తూ బతుకుతున్నాడనే విషయం మాకు తెలియదా? ఏమిటి అని పక్కింటి సుందరి మనసులో అనుకుంటున్న విషయాన్ని పైకి కనిపించనివ్వకుండా చాలా బాగుంది అంటుంది.
 అదే ఆత్తలైతే వాళ్ల వాళ్ల కోడళ్లు వాళ్లను ఎలా రాచిరంపాన పెడుతున్నారో ఒకరికొకరు చెప్పుకుని పరస్పర సానుభూతి సంపాదిస్తారు. మరిక్కడ విక్టోరియా మహారాణి విందాయే, వాళ్లు పాలకులు చిన్నా చితక విషయాలెందుకు మాట్లాడుకుంటారు. ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేని పెద్దపెద్ద విషయాలే మాట్లాడుకుంటారు. నీ మెడలో వజ్రాల నెక్లస్ మెరిసిపోతుంది అని విక్టోరియా మహారాణి తన పక్కనున్న సామంత రాజ్యపు రాణి నెక్లస్‌ను చూస్తూ అభినందించింది.
 చిలకపచ్చ చీరలోమెరిసిపోతున్నావు సుధా అని మొగుడంటే భార్య అందం రెట్టింపు కాకుండా ఉంటుందా? అలానే విక్టోరియా మహారాణి అంతటి వారు తన వజ్రాల నెక్లస్‌ను మెచ్చుకోవడంతో సామంత రాణి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఇంతలో కరెంటు పోయింది.
 కరెంటు ఉండేది పోయి రావడానికే కదా! అలానే మళ్లీ వచ్చింది. కరెంటు వచ్చింది కానీ సామంత రాణి మెడలో వజ్రాల నెక్లస్ కనిపించ లేదు. విక్టోరియా మహారాణి మనసు చివుక్కుమన్నది. తానిచ్చిన విందుకు వచ్చింది సామాన్యులు కాదు, రాజులు, రాణులు కానీ దొంగతనం జరిగింది. అందరినీ తనిఖీ చేద్దామంటే అంతకు మించిన అవమానం ఉండదు. ఎంత విక్కోరియా రాణి అయినా ఆమెకూ బాల్యం ఉంటుంది. ఆమె బాల్యంలో వాళ్ల భాషలో పరోపకారి పాపన్న, తెనాలి రామలింగడి కథలు చదివే ఉంటారు. ఆ కథల ప్రభావంతో ఆమెకే ఒక ఐడియా వచ్చింది.
 వజ్రాల నెక్లెస్ పోయింది, అందరినీ తనిఖీ చేసి అవమానించడం నాకు ఇష్టం లేదు. ఇక్కడో బంగారు పళ్ళెం పెట్టి లైట్లు తీసేస్తాం. నెక్లెస్‌ను ఎవరు కొట్టేశారో వారు దాన్ని బంగారు పల్లెంలో తిరిగి పెట్టండి. లైట్లు ఉండవు కాబట్టి ఎవరు తెచ్చిపెట్టారో ఎవరికీ తెలియదు. అందరి మర్యాద నిలుస్తుంది. బంగారు గొలుసు దొరుకుతుంది అని మహారాణి చెప్పింది. బంగారు పళ్ళెం మధ్యలో పెట్టి లైట్లు తీశారు. కొద్ది సేపటి తరువాత లైట్లు వేశాక అంతా విస్తుపోయారు. ఇప్పుడు బంగారు పళ్ళెం కూడా పోయింది. లైట్లు లేకపోవడం వల్ల బంగారు పళ్లెమును ఎవరెత్తుకెళ్లారో ఎవరికీ తెలియలే దు.
లోక్‌పాల్ పేరుతో మనం చేస్తున్న హడావుడి చూస్తుంటే వజ్రాల నెక్లెస్ కోసం వెతుకుతూ బంగారు పళ్ళెం కూడ పోగొట్టుకుంటామేమోననిపిస్తోంది. ఎందుకంటే విక్టోరియా మహారాణి వారికే దొంగను పట్టుకోవడం సాధ్యం కాలేదు. వాళ్లు తయారు చేసిన చట్టాలనే నేటికీ అమలు చేస్తున్న మన నల్లపాలకులు దొంగను పట్టుకుంటారా? బంగారు కంచాన్ని కూడ పోగొట్టుకుంటారా? ద్వాపరయుగం నాటికే బలపడ్డ అలవాటు కలియుగంలో పోతుందంటారా?

22, మే 2011, ఆదివారం

అంట్లు తోముకుంటున్న అక్కినేనినాగేశ్వర రావు........ మా సికింద్రాబాద్ కథలు 1

.. హీరో నాగార్జున తన మేనల్లుడిని హీరో గా పరిచయం చేస్తూ అక్కినేని కుటుంబం  నుంచి మరో హీరో వచాడు. అతన్ని మీకు అప్పగిస్తున్నాను మీ భుజాల మీద మోయండి అని చెప్పగానే అభిమానులు కేరింతలు కొట్టారు. ఇది టివి లో ఆందరూ చూసిందే నేను కొత్తగా చెప్పాల్సింది లేదు.  ఇలాంటివి చూసి నవ్వుకునే నన్ను బాగా కదిలించిన సంఘటన మీతో పంచుకోవాలని.. 
*********
  .....  
   పాతికేళ్ళ క్రితం సికింద్రాబాద్ మోండా మార్కెట్ వద్ద మా అన్నయ్య  హోల్ సెల్  షాప్ ప్రారంభించాడు. సహాయంగా నేను వెళ్ళే వాడిని కాలేజి కి వెళ్ళే వరకు అక్కడే ఉండే వాడిని. అన్నయ్య షాప్ లో  ఒకతను చేరాడు అతని వాలకం కొంచం చిత్రంగా అనిపించేది. వీళ్ళంతా సామాన్యులు, నేను చాల గొప్పవాడిని అన్నట్టు ఉండేది అతని వాలకం. అంటే గంధర్వుడు శాప వశాన మానవుడిగా ఉన్నట్టు అన్న మాట. . 
 అచ్చం అక్కినేని లా హెయిర్ స్టైల్ ఉండేది. కొద్ది రోజుల తరువాత నన్ను కరుణించి మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆతను జూనియర్ అక్కినేని అట. రికార్డింగ్ డాన్సు లు చేస్తాడు. ముషిరా బాద్ లో కొంచం డబ్బు ఉన్న వల్ల అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇతన్ని కొద్ది రోజుల పాటు వాళ్ళు భరించారు. ఆ రికార్డింగ్ డాన్సులు వదిలేసి బుద్దిగా ఏదైనా పని చేసుకోమని చాల సార్లు నచ్చ చెప్పారు.
 కళామతల్లి నెత్తికి ఎక్కడం వల్ల వారి మాటలు అతనిపై పని చేయలేదు. రికార్డింగ్ డాన్సులు కావాలో బార్య కావాలో తేల్చుకో అని మామ పరీక్ష పెట్టాడు. కళ ముందు కళావతి తరువాత అనుకున్న ఆతను బార్యను, అప్పటి వరకు ఉన్న మామ ఇంటిని వదిలేసి బయటకు వచ్చాడు. సరే ఇప్పటికి మీ ఆన్న షాప్ లో పని చేస్తున్న తరువాత వెళ్లి పోతాను అని చెప్పాడు. అతని రికార్డింగ్ డాన్సులు యెంత అద్బుతంగా ఉంటాయో, అమ్మాయిలు  అతని డాన్సు కు ఎలా పడిపోతారో కథలు కథలుగా చెప్పే వాడు. 


 ఆ రోజుల్లో యంటి ఆర్ అభిమానులు , కృష్ణ , నాగేశ్వర్ రావు అభిమానులు అనే స్పష్టమైన విబజన  ఉండేది . అప్పటి నుంచే నాకు మాత్రం అలంటి పట్టింపులు ఉండేవి కాదు. ఎవడైతే  మన కేంటి సినిమా బాగుంటే చుద్దాం అనుకునే వాడిని. ఒక సారి ఆతను( నిజంగా నాకు అతని పేరు తెలియదు. అక్కినేని అనే పిలిచే వాడిని.) తన అనుభవాలు చెబుతూ  కోస్తాలో ఏదో గ్రామం లో రికార్డింగ్ డాన్సు చేసి తిరిగి వస్తున్నాడట . దారిలో ఏదో షూటింగ్ కు పోయా అక్కినేని నాగేశ్వర్ రావు వస్తున్నారు. రైల్ గేటు పాడడం వల్ల ఒకరిని ఒకరు చూసుకున్నారు. అంతే ఒక్క సారిగా అక్కినేని నాగేశ్వర్ రావు ముక   కవళికలు మారి పోయాయి . అని చెప్పగానే ఎందుకు అని నేను ఆశ్చర్యంగా అడిగాను. ఒకరు చెప్పే విషయం నమ్మినా, నమ్మక పోయినా  ఆసక్తిగా వినడం నా అలవాటు. నేను అచ్చం అక్కినేనిలానే ఉన్నాను కదా నన్ను , నా హెయిర్ స్టైల్ చూసి ముకం మాడ్చుకున్నాడు అని మా అక్కినేని చెప్పాడు. ఆ వయసులో కుడా అది నాకు నమ్మ బుద్ది  కాలేదు. కొద్ది రోజుల తరువాత ఆతను వెళ్లి పోయాడు. నా చదువు , ఉద్యోగం లో పడి పోయాక ఆతను నాకు ఎప్పుడూ గుర్తుకు రాలేదు.

 ****** 
 ఇటీవల మా కొలీగ్ కూతురు పెళ్లి జూబ్లి బస్డిపో సమీపం లోని మ్యారేజి హలో జరిగింది  ఆఫీసులో అందరం వెళ్ళాం . జర్నలిస్ట్ కావడం వల్ల చాలామంది ప్రముక రాజకీయ నాయకులో వచ్చారు. ఫ్రెండ్స్ తో జోకులేస్తూ భోజనం చేస్తున్నాము. వాష్ బేసిన్ ఎక్కడుందో కనిపించడం లేదు . ఆందరూ తిన్న ప్లేట్లు ఉన్న పెద్ద ( దాన్ని ఏమంటారు గుర్తు రావడం లేదు ) దాన్ని ఇద్దరు వ్యక్తులు చెరో వైపు పట్టుకేలుతున్నారు. ప్లేట్లు  కడిగే వాడికి వాష్ బేసిన్ ఎక్కడుంటుందో తెలుస్తుంది కదా అని బాబు వాష్ బేసిన్ ఎక్కడుంది అని అడిగాను . ఆతను చూపించాడు. అతని నడక , హెయిర్ స్టైల్ కొంత తేడాగా అనిపించింది . ముందు వాష్ బేసిన్ ముక్యం అనుకోని వెళ్లి పోయాను. అప్పుడు గుర్తుకు వచ్చింది. అది పాతికేళ్ళ క్రితం అక్కినేని నాగేశ్వర్ రావు  హెయిర్ స్టైల్ అని. అతని నడక అక్కినేనిల ఉందని. ఆతను మా అక్కినేని అని గుర్తుకు వచ్చింది పాపం అనిపించింది . ఎక్కడికో వెళ్లి పోతాను అని చెప్పిన ఆతను చివరకు ఎంగిలి ప్లేట్లకు అంకితం కావడం మనసును కలచి వేసింది. నేను కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఆతను నన్ను గుర్తు పట్టి ఉండక పోవచ్చు కానీ నేను మాత్రం అతన్ని గుర్తుపట్టాను. తరువాత అనిపించింది. అతన్ని పలకరించి ఉండాల్సింది అని . విజయం సాదించిన వాడి కన్నా పరాజయం సాదించిన వాడి అనుభవాలు బాగా ఉపయోగ పడతాయి. తన జీవితాన్ని తన చేతులతో తానె పాడు చేసుకున్నానని ఆతను యిప్పటి కైనా తెలుసుకున్నాడో లేదో ? ఆ రోజు అక్కినేని తను చూసింది జేలసితో కాదు చిరాకుతో అని ఇప్పటికైనా తెలుసుకున్నాడో లేదో ? అక్కినేని కొడుకు, మనవడు, అక్క కొడుకు, చెల్లెలి కొడుకు సమస్త బందు గణం నుంచి హీరోలు వచ్చారు. అదివారి ఇష్టం  . కాని అభిమానం అంటూ జీవితాన్ని వృదా చేసుకుంటే    త రు వాత ఏడ్చినా ప్రయోజనం ఉండడు.  ఈ కాలం లో అంతగా కనిపించడం లేదు కాని గతం లో హీరోల కోసం జీవితాలను నాశనం చేసుకునే వారు .  చిరంజీవి పార్టీ పెట్టాలని ఆ మద్య ఖమ్మం   లో ఒక వ్యక్తీ ఆత్మా హత్య చేసుకున్నాడు. చిరంజీవి పార్టీ పెట్టాడు ఏమైంది. నటించడం వారి వ్రిత్తి అలానే, చదువు, ఉద్యోగం ఎవరి వ్రుత్తి వారు చేసుకోవాలి. ఎవరి కోసమో జీవితాలు వృదా చేసుకోవడం ఎందుకు. నిజానికి అక్కినేని ఐన ఎవరైనా అభిమానం పేరుతో జీవితాలు నాశనం చేసుకూమని చెప్పారు. వారికి అలంటి పిచ్చి అభిమానం నచ్చదు  కుడా . సికింద్రాబాద్ కథలు పేరుతొ  అప్పుడప్పుడు ఇలాంటి అనుభవాలు  రాయాలని అనుకుంటున్నా .........

18, మే 2011, బుధవారం

నేనొప్పుకోనంతే.

ఏరా ఈసారైనా ఎంసెట్‌లో గట్టెక్కుతావా? లేక నీ చదువు సంకనాకిపోయినట్టేనా?- అని చంద్రున్ని వాళ్ల చిన్నాన్న కోపంగా అడిగాడు. ‘‘ లేదు బాబాయ్ ఈసారి చూస్తావు కదా స్టేట్ టాప్ ర్యాంక్ కొట్టేయకపోతే నా పేరు చంద్రుడే కాదు. పరిస్థితులన్నీ నాకు అనుకూల కనిపిస్తున్నాయి. ఈసారి ననె్నవరూ ఆపలేరు’’ అని చంద్రుడు చెప్పాడు. ‘‘ ఔను కాబోయే స్టేట్ ర్యాంకర్ అని మనోడ్ని లోకల్ పేపర్స్‌లో ముందే ఇంటర్వ్యూలు చేశాయి. కేబుల్ టీవి వాళ్లు కూడా ముఖా ముఖి నిర్వహించారు. మన బడుద్దాయి వాళ్లడిగిన ప్రశ్నలకు ఎంత చక్కగా సమాధానాలు చెప్పాడు. వాడు టీవిలో అచ్చం హీరోలా కనిపించాడురా! ’’అని చంద్రుడి వాళ్ల నాన్న మురిసిపోతూ చెప్పాడు.
‘‘అది కాదు అన్నయ్య నువ్వు కూడా వాడి మాటలు నమ్మితే ఎలా వరుసగా రెండుసార్లు ఎంసెట్‌లో బొక్క బోర్లా పడ్డాడు. అప్పుడు కూడా స్టేట్ ర్యాంక్ నాదే అని ముందస్తుగానే లోకల్ పేపర్లను మేనేజ్ చేసుకుని రాయించుకున్నాడు. తీరా ఏమైంది ఆ ఎదురింటి సందింటి వాళ్ల కొడుకు చేతిలో చావు దెబ్బతిన్నాడు. మనవాడేమో ఫార్ములా వన్ పేరుతో కార్లరేస్ నిర్వహించాలనుకుంటే , అతనేమో ఏకంగా పాదయాత్ర జరిపి మన వాడ్ని చితగ్గొడితే ఇప్పటి వరకు లేవలేదు’’ అని చంద్రుడి బాబాయ్ చిన్నారావు ఆవేదనగా పలికాడు. సరే ఇది లాస్ట్ చాన్స్ అని మూడోసారి లాంగ్ టర్మ్ కోచింగ్‌కు పంపిస్తున్నాం, అదన్నా సరిగ్గా వెలగబెడుతున్నాడా? తింగరి వేషాలు చూస్తుంటే ఈసారి కూడా గట్టెక్కేట్టు కనిపించడం లేదని చిన్నారావు నిట్టూర్చాడు.
చంద్రుడికి రోషం ముంచుకొచ్చింది. ‘‘బాబాయ్ నువ్వు తెలియకుండా మాట్లాడకు ఎంసెట్‌లో ఫస్ట్‌టైం నేను ఎందుకు ఫైయిల్ అయ్యానో నీకు తెలియదా? ప్రశ్నా పత్రం అందజేసిన ఇన్విజిలేటర్లు ప్రభుత్వ ఉద్యోగులు. నేను పరీక్ష బాగానే రాశాను. నాకు రావలసిన మార్కులు ఇతరులకు కలిపి నేను ఫైయిల్ అయ్యేట్టు చేశారు. అంతే తప్ప నాకు చదువు రాక కాదు ’’ ‘‘ ఓహో అలాగా మరి రెండోసారి తమరు ఎందుకు చిత్తయ్యారో సెలవిస్తారా’’ అని చిన్నారావు వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ‘‘ప్రపంచ మంతటికీ తెలిసిన విషయం నీకు తెలియకపోవడం ఏంటి బాబాయ్ నాకొచ్చిన మార్కులను కంప్యూటర్‌లో లెక్కించడం వల్లనే ఇలా జరిగింది’’ అన్నాడు. ‘‘కంప్యూటర్ లో ప్రపంచానికే పాఠాలు చెప్పిన నువ్వు కంప్యూటర్‌ను అనుమానిస్తున్నావా?’’ అని చిన్నారావు ఆశ్చర్యపోయాడు. ‘‘ నిజం బాబాయ్ నాకొచ్చిన మార్కులను కరెక్ట్‌గా లెక్కిస్తే స్టేట్ ఫస్ట్ ర్యాంకు నాదే. ఆరుగురం కలిసి మహాకూటమిగా ఏర్పడి కంబైండ్ స్టడీ చేశాం. మాలో అంతా బాగానే చదివారు కానీ మన కులం కానొడొకన్ని మనలో చేర్చుకోవడంతో వాడివల్ల నాకు ర్యాంక్ రాకుండా పోయింది. వాడే మనకు గుదిబండలా తయారయ్యాడు. అందుకే ఎంసెట్ రిజల్ట్స్ రాగానే మా టీం నుంచి వాడ్ని బయటకు పంపించేశాం’’ అని చంద్రుడు చెప్పుకొచ్చాడు. ‘‘ చదువుకునే వాడు తన మానానా తాను నిశ్చబ్దంగా చదువుకుంటాడు. పరీక్షలు రాయకముందే పస్ట్ ర్యాంకు నాదే అని ఇంటర్వ్యూలు ఇవ్వడం ఏమిటి? ఐదారుగురిని పోగేసి పోచుకోలు కబుర్లుచెప్పుకుంటూ అదే కంబైన్డ్ స్టడీ అని చెప్పడం ఏమిటి?’’ అని చిన్నారావు నిలదీశాడు.‘‘ మీ ఇంటికి వచ్చే ముందు ఆ ఎర్రన్నల ఇంటికి వెళ్లి వచ్చానన్నయ్య వాళ్లు మీ వాడి గురించి చెప్పిన మాటలు విన్నాక తల తీసేసినట్టు అయింది. మీ వాడితో తిరిగాక ఊళ్లో ఎవరూ మా వాళ్లను కూడా నమ్మడం లేదట. ఈసారికి తమని వదిలేయమని చెప్పండి అని వేడుకున్నారు. వచ్చే పరీక్షలకు వాళ్లు మన చంద్రుడితో కంబైండ్ స్టడీకి వస్తారనే నమ్మకం నాకైతే లేదు’’ అని చిన్నారావు పలికాడు. సరే ఆ కడపలో మాక్ ఎంసెట్ నిర్వహిస్తున్నారట వెళ్లి నీ సత్తా ఏంటో చూసుకో, ఆ మాక్ ఎంసెట్‌లో నీ కొచ్చే ర్యాంకును బట్టే తరువాత జరిగే ఎంసెట్‌లో నీ స్థానం ఏమిటో తెలుస్తుంది తరువాత నీ ఇష్టం’’ అని చిన్నారావు చెప్పాడు.



 ‘‘కడపలో టీచర్లు మంచి వాళ్లు కాదు బాబాయ్ చివరకు అక్కడి ఉద్యోగులు, టీచర్లు, ప్రజలు అంతా డమ్బుకు అమ్ముడుపోయారు. అక్కడి గాలిని కొందరు కొనేశారు. నేను అక్కడికి వెళ్లినప్పుడు ఊపిరాడకపోవడంతో ఈ విషయం తెలిసింది. ఐనా ప్రతిభా వంతున్ని ఎవరూ ఆపలేరు కడప మాక్ ఎంసెట్‌లో గెలుపు నాదే బాబాయ్’’అని చంద్రుడు మీసం మెలేశాడు.
కడప కాలేజీవాళ్లు నిర్వహించిన మాక్ ఎంసెట్‌లో చంద్రుడు మళ్లీ ఎప్పటి మాదిరిగానే అధ్వాన్నమైన స్థాయిలో ప్రతిభ చూపించాడు. చంద్రుడు మైకు అందుకుని ,‘‘ఈ పరీక్షలను నేను గుర్తించడం లేదు. నేను ముందే చెప్పాను చెప్పినట్టుగానే జరిగింది. డబ్బు, మద్యంతో మొత్తం ప్రకృతిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. నాకొచ్చిన మార్కులను ఎదురింటి సందింటాయన కొడుక్కు కలిపారు. ప్రపంచంలోనే ఇంత అధ్వాన్నంగా పరీక్షలను గతంలో ఎప్పుడూ నిర్వహించలేదు. పరీక్షల నిర్వహణలో ఉపాధ్యాయులు విఫలమయ్యారు. విద్యావ్యవస్థ విఫలమైంది, మొత్తం ప్రపంచమే విఫలమైంది ’’ అని చంద్రుడు ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు.
‘‘ నాలాంటి విద్యార్థిని టాపర్‌గా నిలపని ఈ వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది’’ - అని ఆవేశంగా పలికాడు.‘‘ ఊరందరిదీ ఒక దారి ఐతే ఉలికిపిట్టది ఒకదారి అన్నట్టు నీ వైఖరేంటో నాకస్సలు అర్ధం కావడం లేదురా!’’ అని చిన్నారావు చిన్నగా పలికాడు. ‘‘నా ఒక్కరి వైఖరే కాదు బాబాయ్ మా రాజగురువు వైఖరి నా వైఖరి ఒకటే. ప్రపంచంలో మేం తప్ప అంతా అమ్ముడు పోయారు బాబాయ్. ఎదురింటి సందింటి వాళ్ల కొడుకు గెలుపు ఒక గెలుపే కాదని నేనూ, మా రాజగురువు నమ్ముతున్నాం. మీ నమ్మకాలు మీకెంత ముఖ్యమో మా నమ్మకాలు మాకంత ముఖ్యం. నమ్మకమే జీవితం ’’అని చంద్రుడు పలికాడు.
‘‘ఏమోరా! కడప మాక్ ఎంసెట్ చూస్తుంటే లాంగ్‌టర్మ్ కోచింగ్‌లు కూడా నీమీద పని చేసేట్టుగా కనిపించడం లేదు’’ అని చిన్నారావు నిర్వేదంగా పలికాడు.

17, మే 2011, మంగళవారం

వినోదం విషాదం రెండు ఒకటే

వినోదం, విషాదం వేరువేరైనా చాలా సందర్భాల్లో రెండూ కలిసే ఉంటాయి. అక్కా చెల్లెళ్లలా ఒకదాని తరువాత ఒకటి కనిపిస్తుంది. కవల పిల్లల్లాంటి వినోదం, విషాదాన్ని చూసిన వారు అక్కను చూసి చెల్లె అనుకుంటారు, చెల్లెను చూసి అక్క అనుకుంటారు. మొత్తం మీద ఇద్దరూ కవలలే అనేది మాత్రం నిజం. క్లోజప్‌లో విషాదంగా కనిపించేది లాంగ్ షాట్‌లో వినోదంగా కనిపిస్తుందని ఒక మహానుభావుడన్నారు.

‘‘ ఔను క్లోజప్‌లో విషాదంగా కనిపించింది లాంగ్ షాట్‌లో వినోదంగా ఉంటుందనేది అక్షరాలా నిజం’’ అని చిన్నబుచ్చుకున్న ముఖంతో చిన్నారావు పలికాడు. జ్ఞానోదయానికి కారణమేంటో అని పెద్దారెడ్డి ప్రశ్నిస్తే, ‘‘ ఏడవ తరగతిలో నా పక్క బెంచి అమ్మాయి ప్రేమించడం లేదని జీవితం విషాదంగా అనిపించింది. ఇదీ ఒక జీవితమేనా ఆమె ప్రేమను పొందని జీవితం వృథాఅనుకున్నాను.
 రాత్రిళ్లు ఎవరూ చూడకుండా కుమిలి కుమిలి ఏడ్చాను. ఛీ కనీసం విషాదాన్ని ప్రదర్శించడానికి గడ్డం పెంచే భాగ్యం లేదు, మందు కొట్టే వయసు కాదు అని ఏళ్ల తరబడి ఏడ్చాను.
 నాకు పెళ్లయి ఏడేళ్లవుతుంది కదా! మొన్న రోడ్డు మీద వెళుతుంటే ఏడవ తరగతిలో ప్రేమించిన అమ్మాయిని రేషన్ షాపు క్యూలో చూశాను. ఎంత లావుగా ఉందో ముందు భయమేసింది తరువాత నవ్వోచ్చింది. ఆ అమ్మాయి ప్రేమించక పోబట్టి సరిపోయింది నిజంగా ప్రేమిస్తే నాపనేమయ్యేదనిపించింది. అప్పటి విషాదం ఇప్పుడు లాంగ్ షాట్‌లో వినోదంగా అనిపిస్తుంది’’అని చిన్నారావు నవ్వుతూ చెప్పాడు.

‘‘ నీ అనుభవమే కాదురా చిన్నా మన కళ్లముందు కనిపించే ప్రతి దాన్లోనూ ఇలాంటి వినోదం విషాదం కలిసిపోయి కనిపిస్తుంటాయి. మన స్వాతంత్య్ర సమర యోధుల పోరాటాన్ని తలుచుకుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. చాతి సిక్స్‌ప్యాక్ బాడీ అవుతుంది. అదే సమయంలో ఇంత పెద్ద దేశాన్ని అంత చిన్న దేశం ఇంగ్లాండ్ నుండి వ్యాపారం కోసం వచ్చినోళ్లు అన్ని వందల సంవత్సరాల పాటు మనల్ని పాలించడం కన్నా మించిన వినోదం, విషాధం ఏముంటుందనిపించకుండా ఉంటుందా? ఈ దేశంలో పక్క ఒక కులం వాడి పొడ మరో కులం వాడికి పడదు కానీ ఖండాంతరాల నుంచి వచ్చిన వారికి దేశ నాయకత్వం అప్పగించేస్తాం.
 ఇది విషాదంతో కూడిన వినోదమే కదా! వంద కోట్ల మంది భారతీయులున్న దేశాన్ని పాలించే ప్రధానమంత్రి డమీ కావడానికి మించిన విశాదం ఏ ముంటుంది. మన్ మోహన్ సింగ్ మేడంను ఎదరించనున్నారనే వార్తలను మించిన వినోదం ఏముంది. సొంత విగ్రహాలను తయారు చేయించుకునే మాయావతమ్మ, మంచం మీద నుంచే పాలన సాగించే తమిళ ముఖ్యమంత్రులు, మాఫియాలుగా పోలీసులకు చిక్కే మాజీ ముఖ్యమంత్రులు, జిన్నా సమాధిలో భారత భక్తిని వెతికే బిజెపి నేతలు వీరిని చూస్తే విషాదం, వినోదం ఏక కాలంలో కలగకుండా ఎలాఉంటాయి?
 తెలంగాణ కోసం వందలాది మంది విద్యార్థులు ఆత్మార్పణ చేసుకుంటే ఉద్యమ నేత కెసిఆర్ లగడపాటికి ఐ లవ్యూ అని చెప్పడం తెలంగాణ వాదుల గుండెలను పిండే విషాదం, అందరికీ బోలెడు వినోదం. రాష్ట్రంలో ఎంతో పోరాట చరిత్ర గల కమ్యూనిస్టు పార్టీకి బఫూన్‌లను మించిన వినోదాన్ని పంచే వారు నాయకత్వం వహించడం వినోదం, విషాదం ఒకటే అనడానికి బలమైన ఉదాహరణ. నాలుక చీరేస్తా, తాట ఒలిచేస్తే, బస్తీమే సవాల్ అంటూ నారాయణ వీరంగం చూస్తుంటే నాటకాల్లో కేతిగాడి పాత్ర గుర్తుకు రావడం రాష్ట్ర కమ్యూనిస్టులకు విషాదం, మిగిలిన వారికి బోలెడు వినోదం.
 ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ఒకే వేదికపై లగడపాటి, నారాయణ, హరీశ్వర్‌రావు లాంటి వారంతా గ్రూప్ ఫోటుకు ఫోజులివ్వడం చూసిన వారికి బోలెడు వినోదం కలిగించింది. ప్రపంచ శాంతి చివరకు వినోదంగా మారడం విషాదకరం.
రాష్ట్రంలో పరిస్థితి చూస్తే కన్నీళ్లుస్తున్నాయని చాలా మంది నాయకులు విశాదంగా పలుకుతున్నారు కదా! నాకు మాత్రం బోలెడు వినోదంగా ఉంది అని పెద్దారెడ్డి చెప్పసాగాడు. నిన్నటి మంత్రివర్గ సమావేశమే చూడు. సార్ ఆ ఎంపిల సంగతి మాకు అప్పగించండి సార్ వాళ్ల సంగతి మేం చూసుకుంటాం అని ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు. ఆ విషయం తెలిసిన ముగ్గురు ఎంపిలు ఆ మంత్రులు రౌడీ షీటర్లు వాళ్లా మా సంగతి చూసేది మా జోలికి వస్తే చూపిస్తాం.

. అభిమాన హీరో సినిమా సూపర్ హిట్టవుతుందో కాదోనని బెంగపెట్టుకుని అభిమాని గుండెపోటు తెచ్చుకుని ఆస్పత్రి పాలైతే, హీరో మాత్రం నా రెమ్యునరేషన్ నాకొచ్చేసింది, హిట్టయినా పట్టయినా నాకు సంబంధం లేదని మరో సినిమా షూటింగ్‌కు ముస్తాబవుతుంటే , అభిమాని పరిస్థితి మొదటి బాధ కలిగినా తరువాత నవ్వు తెప్పించుకుండా ఉంటుందా? తెలంగాణే తన ఊపిరి అంటున్న కెసిఆర్ ఇంటి ముందు తెలంగాణ వాదుల దీక్ష ఉద్యమాభిమానులకు విషాదం, ఇతరులకు వినోదం. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారినట్టుగా, వినోదం విషాదంగా, విషాదం వినోదంగా కాలాన్ని బట్టి మారుతుంటుంది కానీ రెండూ ఒకటే.

11, మే 2011, బుధవారం

వీరీవీరీ గుమ్మడి పండు వీరి పేరేమి?....చెప్పుకోండి చుద్దాం .......

పూర్వం పాఠశాలకు , కళాశాలలకు ఆటస్థలాలు ఉండేవని , చదువుకునేప్పుడు మధ్యాహ్నాం ఆడుకునేవాళ్లమని ఓ కార్పోరేట్ కళాశాలలో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థికి చెబితే, అతగాడు ‘సీరియస్’గా ముఖం పెట్టి మరీ మీరిలాంటి అభూతకల్పనలు చెప్పడం ఏమీ బాగాలేదు బాబాయ్ అని నిలదీశాడు.
 మీరింకా చందమామ కథలను చెబితే నమ్మేంత అమాయకులమేమీ కాదు మాకన్నీ తెలుసు అని నెట్‌లోకి వెళ్లిపోయాడు. ఎవరైనా నెట్‌లోకి వెళితే నాకు సాలెగూటిలోకి వెళ్లినట్టుగానే అనిపిస్తుంది. ‘‘కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆటస్థలాలు ఉన్నట్టు నాకు తెలిసింది కావాలంటే నాతో రా చూపిస్తాను’’ అని సవాల్ చేశాను. నగరం నడిబొడ్డులో ‘కమర్షిల్‌కాంప్లెక్స్’లో నిర్వహించే ఒక కార్పొరేట్ కాలేజీలో ఇతగాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాంప్లెక్స్ మొదటి అంతస్థులో వైన్ షా పు, బారు; రెండో అంతస్థులో ఇతగాడి కాలేజీ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో బారుషాపో, వైన్ షాపో ఉంటుంది కానీ ప్లే గ్రౌండ్ ఉండడం ఏమిటనేది అతడి వాదన.
 నిజమే మరి , రోజూ కనులతో చూసిందే నమ్ముతాడు కానీ మనం చెప్పింది ఎందుకు నమ్ముతాడు? ‘ ప్లే గ్రౌండే’ తెలియని ఈ తరానికి పిల్లలు ఆటలు పాటలు ఏం తెలుస్తాయి. టీవిలు లేని సమాజం ఇంత ‘నాగరికత’ సంతరించుకోనప్పుడు పిల్లలకు బోలెడు ఆటలుండేవి. ఆటలతోనే మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు తెలివి తేటులు అబ్బేవి. ఇప్పు ఇంకా భూమి మీదికి రాకముందే తల్లికడుపులోనే ఐఐటికి కోచింగ్ ఇప్పించేస్తుంటే ఇక పిల్లలకు ఆటలెలా తెలుస్తాయి.
 ఈ మధ్య జి చానల్‌లో తల్లి కడుపులో ఉండగానే శిశువు నేర్చుకుంటాడని తల్లి మాటలు వింటాడని ఒక స్టోరీ ప్రసారం చేశారు. అదృష్ట వశాత్తు ఈ స్టోరీ ఇంకా ఐఐటి కోచింగ్ కాలేజీల వారి దృష్టిలో పడలేదు కానీ గర్బస్థ శిశువుల కోసం గర్బీణీ స్ర్తిలకు ప్రత్యేక ఐఐటి కోచింగ్ ప్రారంభించేవారు. పిల్లలకు ఆటల అదృష్టం ఎలాగూ లేదు కానీ కనీసం ఆటల గురించి తెలుసుకోవడానికి ఒక మ్యూజియమైనా ఏర్పాటు చేస్తే బాగుండేది. వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి అనే చిన్నప్పుడు ఆడారు కదా!


 ఇప్పుడీ ఆట పిల్లలకు తెలియదు కానీ టీవిల్లో జేబులు ఖాళీ చేసేందుకు ఇలాంటి తరహా ఆట మొదలు పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ లేదా మహేశ్ బాబు బొమ్మ చూపి వీరెవరో చెప్పుకోండి చూద్దాం చెబితే పాతిక వేలు మీవే అంటూ కవ్వించే దుస్తులతో ఓ అమ్మాయి అడుగుతుంది. ఒక్క ఫోన్ కాల్‌తో పాతిక వేలు కొట్టేయవచ్చని ఫోన్ చేస్తే మనం క్యూలో ఉంటాం, వెయ్యి రూపాయల బిల్లవుతుంది కానీ బహుమతి రాదు. ఇది పిల్లలాట కాదు జగత్ కిలాడి ఆట అని ఫోన్ బిల్లు కట్టేప్పుడు తెలుస్తుంది. సరే ఆ ఆటను వదిలేసి మనం వీరివీరి గుమ్మడి పండు ఆటతో నేటి ప్రముఖుల గురించి తెలుసుకుందాం.


 ‘మురికి వాడలో చింపిరి జుట్టు పిల్లను ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. గుడిసెలోకి వెళ్లి కుండలోని నీటిని అమృతం తాగినంత ఆనందంగా తాగాడు. అపరిశుభ్రంగా ఉన్నవాళ్లు మీద మీద పడుతున్నా ఏ మాత్రం చిరాకు పడకుండా ఆప్యాయంగా కౌగిలించుకుంటున్నాడు. ఇచ్చిన దరఖాస్తులన్నీ తీసుకుని మీ సమస్య పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు.ప్రజలకే నా జీవితం అంకితం అని ప్రకటించాడు. వీరివీరి గుమ్మడి పండు ఈ జీవి పేరేమి. ఆ మాత్రం తెలియదా? రాజకీయ నాయకుడు అని నవ్వుకుంటున్నారా?... లక్షణాలను బట్టి వీరివీరి గుమ్మడి పండు వారిపేరేమి తేల్చుకోండి చూద్దాం.

****
నేను దారిన పోయే దానయ్యను. ఈసారి నిన్ను పార్లమెంటుకు పంపిస్తాను. నా చిన్నప్పుడు మా ఊళ్లొ ఇలాంటి పనికి మాలిన వాడే ఉండేవాడు. నేను హై కమాండ్‌కు విశ్వాస పాత్రున్ని సోనియా మేడం ఏం చెబితే అది చేస్తాను. ముఖ్యమంత్రిగా ఉండమన్నారు ఉన్నాను. ఇప్పుడు సాధారణ కార్యకర్తగా ఉండమంటే ఉంటాను. మరి నేనెవరిని?

*****


తెలంగాణ కాంగ్రెస్, టిడిపి నాయకులు దద్దమ్మలు, చేతకాని చవటలు. ఏమన్నా అంటే అన్నానంటారు కానీ ఇలాంటి వారిని దద్దమ్మలు అనకుంటే ఇంకేమనాలి. చంద్రబాబు బూట్లు నాకటమే వీరి పని. ఇంకెంత కాలం ఆ బానిసత్వం. బయటకు రండి. తెచ్చిన తెలంగాణను నిలబెట్టుకోలేని దద్దమ్మలు ఇప్పుడు తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అంటున్నారు. చచ్చేది కూడా మీరే బిడ్డా గుర్తుపెట్టుకోండి- తెలిసిపోయిందా నేనెవరినో?

*****
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేది ఉందా? నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేది. ఇప్పుడు హైదరాబాద్‌కు ఎవరూ రావడం లేదు. నేను లేని రాష్ట్రంలో అడుగుపెట్టేది లేదని ప్రపంచంలో ఉన్నవాళ్లంతా నాకు ఫోన్ చేసి చెబుతున్నారు. రాజకీయాల్లో విలువలు ముఖ్యం. నేను అన్నింటికి విలువను పెంచేశాను. గత ఏడేళ్లలో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పాలన వల్ల చివరకు ఓజోన్‌పొర కూడా కరిగిపోతోంది. నేనూ, క్లింటన్, టోనీ బ్లేయర్ కలిసి కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దామనుకున్నాను. కంప్యూటర్‌ను కనిపెట్టింది నేనే అని చాలా మంది నమ్మకం. నా నటనకు మా మామ ఆశ్చర్యపోయాడు- నేను నేనే...
****

మా నాన్న నాకు పది కోట్ల మంది ప్రజలున్న పెద్ద కుటుంబాన్ని అప్పగించి పోయారు. మీకోసం ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టి మీకు సేవ చేయాలా? అని ఎదురు చూస్తున్నాను. ఇటలీ సోనియమ్మకు భారతీయత ఏం తెలుస్తుంది. ఈ ప్రభుత్వాన్ని రక్షించే బాధ్యత ఇక నాది కాదు’- బెంగళూరువెళ్లి మళ్లీ వస్తా..
****

మా నాన్నగారు.. అన్నగారు... అంటే అన్నగారు నాకు నాన్నగారు. మన తెలుగుదేశం... బావగారి కోసం పని చేయాలని అంతా అనుకున్నాం. మా సోదరి ఇంటి ముందు తొడ గొట్టానని అంతా తిడుతున్నారు కానీ మరి వేరేవారి ఇంటి ముందు తొడకొడితే ఊరుకుంటారా? సరే బావగారు పిలుస్తున్నారు మళ్లీ వస్తా-నేనెవరినో?

10, మే 2011, మంగళవారం

మీడియా ఒక పార్టీని అధికారం లోకి తెచ్చే బలం నుంచి ..ఒక వ్యక్తిని ఓడించలేని స్తితికి ఎందుకు చేరింది. మీడియా వార్తలు నాయనా పులి వచ్చే కథలు ఎందుకు అవుతున్నాయి ?


వంద శతఘు్నల కన్నా ఒక పత్రికకు నేను ఎక్కువగా భయపడతాను, ప్రజాస్వామ్యానికి ప్రచార మాధ్యమ వ్యవస్థ - మీడియా- నాలుగవ కంబం- మీడియా బలాన్ని చాటి చెప్పే ఇలాంటి సూక్తులకు కొదవేమీ లేదు. కానీ మీడియా బలం ఎంత? గత కొంత కాలంగా రాష్ట్రంలోప్రచార మాధ్యమాలు పోషిస్తున్న పాత్రను, వస్తున్న ఫలితాలను చూస్తుంటే వాటి బలాన్ని ఎక్కువగా అంచనా వేస్తున్నామనిపిస్తోంది. ఆ మాట ఒప్పుకోవడానికి ఇష్టం లేకపోతే మీడియాను బాగా బలహీనపరిచామని చెప్పుకోవాలి.


 ఇటీవల కాలంలో మీడియా రెండు విషయాల్లో తీవ్రంగా ప్రయత్నాలు సాగించి రెండింటిలోనూ విఫలం అయింది. వైఎస్‌ఆర్ ఉన్నంత వరకు కాంగ్రెస్‌ను ఓడించేందుకు చేసిన ప్రయత్నాల్లో వైఫల్యం తప్పలేదు. తెలంగాణ ఉద్యమం కెసిఆర్ చేతి నుంచి తప్పించి గద్దర్‌కు అప్పగించడానికి మీడియా సాగించిన ప్రయత్నాల్లో ఘోరవైఫల్యం తప్పలేదు. ఇప్పుడు తాజాగా జగన్‌ను ఓడించడానికి సాగిస్తున్న ప్రయత్నాల్లో ఫలితాలు ముందుగానే ఊహించి మీడియా తన వ్యూహాన్ని మార్చుకుంది. మద్యం, డబ్బు ఏరులై పారుతోంది కాబట్టి జగన్ గెలుపు ప్రజల మద్దతుతో కాదు డబ్బు ప్రభావంతో అని ఫలితాల కన్నా ముందే తేల్చేసే ప్రయత్నం సాగుతోంది. నిజానికి అన్ని పార్టీలు డబ్బులు పంచుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయ. ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు ఖర్చు చేసి విజయం సాధించిన వారెవరూ బహుశా మనకు కనిపించరు.


కడప ఉప ఎన్నికల సందర్భంగా మీడియా పాత్రపై మరోసారి విస్తృతంగా చర్చ సాగింది. కడప, పులివెందుల నియోజక వర్గాల్లో మూడు పార్టీల మధ్య కాకుండా కొన్ని మీడియా సంస్థల మధ్య సాగుతున్న పోరులా అనిపిపించింది. ఒక వర్గం మీడియావారు ఒక పార్టీ అభ్యర్థిపై విషం చిమ్మినట్టుగా వార్తలు రాసారు, మరో వర్గం మీడియా వారు దీనికి సమాధానంగా తమ మీడియాలో వార్తలు రాయిస్తున్నారు. ఒక పార్టీ కొన్ని మీడియా సంస్థలు ఒక కూటమిగా ఏర్పడి తమపై కుట్ర జరుపుతున్నాయని ఎన్నికల్లో జగన్ ప్రచారం చేసారు. దీంతో ఈ పోరు పార్టీల మధ్య జరుగుతున్న పోరులా కాకుండా మీడియా సంస్థల మధ్య సాగుతున్న పోరును తలపించింది.


ఒకనాడు మీడియా ఏకంగా ఒక పార్టీనే అధికారంలోకి తీసుకు వచ్చేంత శక్తివంతంగా ఉండేది. రాష్ట్రంలోని మీడియా ఆ తరువాత క్రమంగా ఒక పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే మాట అటుంచి కనీసం తమకు నచ్చని ఒక అభ్యర్థిని ఓడించే శక్తి సైతం లేకుండా నిర్వీర్యమైపోయింది. తెలుగుదేశం పార్టీ- టిడిపి- ని అధికారంలోకి తీసుకురావడానికి1982లో ఒక ప్రతిక పోషించిన పాత్ర సామాన్యమైనదేమీ కాదు. అది పాత మాట. అదే మీడియా 2009లో తన సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించినా ఒక అభ్యర్థిని ఓడించలేకపోయింది. ప్రస్తుతం ఒక వర్గం మీడియా జగన్‌ను గురిపెట్టిన దాని కన్నా మిన్నగా 2006 డిసెంబర్‌లో బొబ్బిలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు బలమైన మీడియా సంస్థ ప్రయత్నించింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత బొబ్బిలి టిడిపి ఎంపి మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. 
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత మొదలైంది అని చాటి చెప్పడానికి బొబ్బిలి ఉప ఎన్నికలను ఉపయోగించుకోవాలని తెలుగుదేశం వారు ప్రయత్నించారు. బొబ్బిలిలో కాంగ్రెస్ ఓడిపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఐపోయింది అని విస్తృతంగా ప్రచారం సాగించి, వైఎస్‌ఆర్ నాయకత్వాన్ని బలహీనపరచాలనేది వ్యూహం. మంత్రి బొత్సా సత్యనారాయణ భార్య బొత్సా ఝాన్సీ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఆ సమయంలో ప్రధాన మీడియాలో ఆశ్చర్యకరమైన స్థాయిలో బొత్సా కుటుంబం గురించి వ్యతిరేక వార్తలు వచ్చాయి.


 ఆ మీడియావారి పత్రికలో, చానల్‌లో రోజూ లెక్కలేనన్ని వ్యతిరేక వార్తలు వచ్చేవి. తమపై పోటీ చేస్తున్నది టిడిపి కాదనీ ఆ మీడియా సంస్థతోనేతాము పోటీ పడుతున్నాం అని ఎన్నికల ప్రచారంలోనే బొత్సా ప్రకటించారు. ఒక నేతకు వ్యతిరేకంగా వార్తలు రావడాన్ని తప్పు పట్టలేం. కానీ ఎన్నికలు ముందు మాత్రం ప్రపంచంలో అతని వ్యతిరేక వార్తలు తప్ప మరేమీ లేనట్టు ఊదరగొట్టి ఫలితాల తరువాత అతని అవినీతి ఊసెత్తకపోవడంలో ఉద్దేశం ఏమిటి? ఎన్నికల్లో మొత్తం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం సాగించడం ఎప్పటి నుంచో ఉన్నా ఒక అభ్యర్థిని టార్గెట్ చేసుకుని అంతగా వ్యతిరేక ప్రచారం సాగించడం బొత్సా కుటుంబం విషయంలోనే బహుశా తొలిసారి జరిగింది.
 చివరకు బొబ్బిలిలో కాంగ్రెస్ గెలిచింది. ఒక పార్టీని ఓడించి, మరో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే స్థాయి నుంచి చివరకు ఒక అభ్యర్థిని కూడా ఓడించలేని నిస్సహాయ స్థితికి మీడియా బలం పడిపోయింది. ఆ తరువాత 2009లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డారు. మరోవైపు కనీసం ఉండవల్లి అరుణ్‌కుమార్‌నైనా ఓడించాలని బలగాలను రాజమండ్రిలో దింపారు. అరుణ్‌కుమార్‌కు మూడో స్థానాన్ని మీడియా ఖాయం చేస్తే ప్రజలేమో మొదటి స్థానం కట్టబెట్టారు.
తెలంగాణ ఏర్పడాలని కొందరు, లేదు సమైక్యాంధ్రగానే ఉండాలని మరి కొందరు కోరుకుంటున్నారు. ఎవరిష్టం వారిది ఎవరి వాదనలు వారి కున్నాయి. కానీ తెలంగాణ ఉద్యమం ఎవరి చేతిలో ఉండాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. వారి నిర్ణయాధికారాన్ని సైతం మీడియా తన చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నించడం విడ్డూరం. ఏదో విషయంలో కెసిఆర్‌తో తేడాలొచ్చిన మీడియాకు ఉద్యమాన్ని కెసిఆర్ చేతిలో నుంచి గద్దర్ చేతిలో పెట్టడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం మరో చెంప పట్టు. ఇది మీడియా బలహీనతను మరోసారి బయటపెట్టింది. మీడియా బలంగా ఉందా? బలహీనపడిందా? అంటే మీడియా వారు తమ సొంత అజెండాను అమలు చేయాలనుకుంటే సాధ్యం కాదని పదే పదే నిరూపితం అవుతోంది.



 జరుగుతున్నది ప్రజలకు చూపడంలో మీడియా శక్తి వంతమైందే, కానీ జరిగే దాన్ని తమ కళ్లతో చూసి తమకు ప్రయోజనం కలిగే విధంగానే జనం స్పందించాలని మీడియా కోరుకుంటే అది సాధ్యం కావడం లేదు. ఈ కోరిక నెరవేర్చడంలో మాత్రం మీడియా చాలా బలహీనపడింది. 1983నాటి టిడిపి విజయం మొత్తం ఘనతను మీడియాకే కట్టబెట్టడం ప్రజల నిర్ణయాన్ని చిన్నచూపు చూసినట్టే అవుతుంది. అప్పుడు టిడిపికి అండగా నిలిచిన పత్రిక సర్క్యూలేషన్ మూడు లక్షల లోపు మాత్రమే . కానీ టిడిపికి ఆ ఎన్నికల్లో దాదాపుగా కోటి ఓట్లు వచ్చాయి. అప్పటి పరిస్థితుల్లో ప్రజలు టిడిపిని ఆదరించారు అంతే తప్ప మీడియా చెప్పినందుకు కాదు. ఒక వేళ మీడియా చెప్పినట్టుగానే జనం నడుచుకునే పరిస్థితి ఉంటే చంద్రబాబు శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండిపోయేవారు. ఆయనకు లభించి నంత సానుకూల ప్రచారం దేశంలో మరే నాయకుడికి లభించలేదు.


 దేశంలో బలమైన నాయకులుగా గుర్తింపు పొందిన వారంతా మీడియా నుంచి పెద్దగా సహకారం ఆశించని వారే పైగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వారు. మయావతి కనీసం ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించకుండా ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. నరేంద్ర మోడీని మీడియా మొత్తం వ్యతిరేకిస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే మందకృష్ణమాదిగ, టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ రాష్ట్రంలో బలమైన ఉద్యమాలు నిర్వహించారు. అవకాశం వచ్చినప్పుడల్లా వీరు మీడియాపై మండిపడేవారే. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డిని బలమైన మీడియా తీవ్రంగా వ్యతిరేకించింది కానీ ఆయన మాత్రం ఆ వ్యతిరేకతతోనే రెండవ సారి విజయం సాధించారు. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్‌ఆర్ , ‘‘ఆ రెండు పత్రికలు..’’ అంటూ విమర్శిస్తే ప్రజాస్వామ్యంపై దాడి అంటూ చంద్రబాబు మండిపడేవారు. విషయం ఏదైనా సరే మీడియాను ఏమైనా అంటే సహించేది లేదని ఆయన ఉగ్ర రూపం దాల్చేవారు. ప్రజాస్వామ్యానికి నాలుగవ కంబమైన మీడియాపై దాడి చేస్తారా? అంటూ భగ్గుమనే వారు.


 అలాంటి బాబే ఇప్పుడు స్వయంగా జగన్ మీడియాపై ధ్వజమెత్తని రోజు లేదు. అసలే అంతంత మాత్రంగా ఉన్న మీడియా బలం మీడియాను మీడియాతోనే ఎదుర్కోవాలని వైఎస్‌ఆర్ తీసుకున్న నిర్ణయంతో మరింత బలహీనపడింది. మీడియా బలహీనతే కాంగ్రెస్ హయాంలో వైఎస్‌ఆర్‌కు బలంగా మారింది. అదే ఇప్పుడు జగన్‌కు బలంగా తయారైంది. లెక్కలేనన్ని అబద్ధాలు చెప్పేవాడు అప్పుడప్పుడు నిజాలు చెప్పినా జనం నమ్మరు. నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడు మీడియా బలంగానే ఉంటుంది. తమ సొంత ప్రయోజనాల కోసం కక్షకట్టినట్టు వ్యవహరిస్తే మీడియా మాటలు నాయనా పులివచ్చే కథలా మారుతాయి.

7, మే 2011, శనివారం

జగన్ గెలిచాక ఎవరికి కృతజ్ఞత చెప్పాలి ?

కడప ఎన్నికల పలితాలు రాగానే జగన్ తొలుత తనను ఇంతటి వాడిని చేసిన సోనియాకు ఆతరువాత రామోజికి ఆ తరువాత రోజు లక్ష కోట్లు సంపాదించాడని విస్తృతంగా ప్రచారం చేసిన బాబుకు కృతజ్నతలు చెప్పాలి. వీరిలో ఏ ఒక్కరి సహకారం, కృషి లేక పోయిన జగన్ ఈ రోజు బెంగళూరు లో వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు . తొలత జగన్ కాంగ్రెస్స్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని ఉహాగానాలు సాగినప్పుడు. బయటకు వచ్చి పార్టీ పెడితే అడ్రెస్స్ లేకుండా పోతాడు అనిపించింది. తరువాత క్రమంగా బాబు, రామోజిల బయం రోజు రోజుకు పెరగడం తో విరిద్దరిని ఎదిరించే సత్తా జగన్ కు  మాత్రమే ఉండనే అభిప్రాయం బలంగా ఏర్పడింది . దాంతో కాంగ్రెస్స్ డమ్మిగా మారి జగన్ బలపడుతున్నాడు. హిరణ్య కశ్యపుడు నిరంతరం విష్ణు నామ స్మరణ చేసినట్టు రామోజి బృందం రోజు జగన్ నమ స్మరణ చేసి అతన్ని చివరకు హీరోను చేస్తున్నారు . బాబు , రామోజిల బృందం జగన్ ను యెంత వ్యతిరేకిస్తే రాజకీయాల్లో ఆతను అంతగా ఎదిగి పోతాడు. మీడియా వ్యతిరేకత వల్లనే మోడి మళ్లీ మళ్లీ గెలుస్తున్నాడు. మీడియా వ్యతిరేకత వల్లనే    వై స్  ఆర్  రెండో సారి గెలిచాడు. మీడియా వ్యతిరేకించినంత కాలం కాంగ్రెస్స్ పరిస్తితి బాగుండేది . వై యస్ ఆర్  మరణం తరువాత రోశయ్య కాలం నుంచి మీడియా కాంగ్రెస్స్ పట్ల కాస్త అనుకూల దొరని చూపుతోంది . అప్పటి నుంచే కాంగ్రెస్స్ ప్రజాలకు దూరమైంది. చివరకు రాజ కియంగా దిక్కు లేని స్తితి లో ఉన్నా చిరంజీవి యిప్పుడు కాంగ్రెస్స్ కు పెద్ద దిక్కు గా మారారు.  గెలిచాక జగన్ అది తన బలం అనుకుంటే పొరపాటు తనను యింతవాడిని చేసిన మీడియాను మరువవద్దు.  

4, మే 2011, బుధవారం

ఒక లాడెన్ మరణిస్తే వేలాది లాడెన్‌ను వస్తారు.... ప్రపంచంలో ఎవరికీ రక్షణ లేదు. చివరకు పాకిస్తాన్‌లో టెర్రరిస్టులకు సైతం..

ఒక సీతారామరాజు మరణిస్తే వందలాది మంది సీతారామారాజులు పుడతారు రూథర్‌ఫర్డ్! -అంటూ అల్లూరి సీతారామారాజు సినిమాలో కృష్ణ ఆవేశంగా చెబితే అది సినిమా అని కూడా మరిచిపోయి మన వెంట్రుకలు నిక్కబోడుచుకుంటాయి. స్కూల్ ఎగ్గొట్టి మిత్రులతో సినిమాకు వచ్చిన విషయం కూడా మరిచిపోయి మనలోని దేశ దేశ భక్తి ఉప్పొంగడం చూసి పులకరించి పోతాం.
 నిజ జీవితంలో కాసింత అనుభవం వచ్చాక రూథర్‌ఫర్డ్‌లు మళ్లీ మళ్లీ పుడతారేమో కానీ సీతారామరాజులు పుట్టరని తెలుసుకుంటాం. అడుగడుగున మనకు గాడ్సేలు కనిపిస్తారు కానీ మహాత్మాగాంధీ తరువాత మనకు మరో గాంధీ పుట్టాడా? భగత్‌సింగ్, సీతారామరాజు, సుభాస్ చంద్రబోసు, మహాత్మాగాంధీ మరణించిన తరువాత అలాంటి వారు నూటా ఇరవై కోట్ల జనాభా దాటిన ఈ దేశంలో ఒక్కరు కూడా పుట్టలేదు.
 నిజానికి అలా పుట్టక పోవడం వల్లనే వీరి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయాయి.
మళ్లీమళ్లీ పుడితే మహాత్మునికి సైతం పెద్దగా ఆదరణ ఉండదు. ఇంటి ముందో మహాత్ముడు, పక్కింట్లో ఒక మహాత్ముడు ఉంటే మహాత్మున్ని గుర్తు చేసుకునేదెవరూ. కోట్లాది మందిలో ఒకరు మహాత్ముడైతేనే బాగుంటుంది కానీ కోట్లాది మంది మహాత్ములైతే గాడ్సేలే ప్రత్యేకంగా కనిపిస్తారు.



 లాడెన్‌ను అమెరికా వాడు హతం చేశాడని తెలియగానే టెర్రరిస్టు అభిమానులు ఒక లాడెన్ మరణిస్తే వేలాది లాడెన్‌ను వస్తారు, మరింత విజృంభిస్తారు అమెరికాకు పక్కలో బల్లెంగా మారుతారు, ఇక నుంచే దాడులు ఎక్కువవుతాయి అని భీకర ప్రతిజ్ఞలు చేస్తున్నారు. సరే మహనీయులు ఒకరు మరణిస్తే వందలాది మంది పుట్టుకొస్తారంటే అది నిజం కాదని అనుకోవచ్చు కానీ రాక్షసుల విషయంలో అలా కాదు ఒకరు మరణిస్తే వందలమంది పుట్టుకొచ్చిన సందర్భాలున్నాయి, అవకాశాలున్నాయి.అమెరికా అయినా మరే దేశమైనా ఈ సవాళ్లను తేలిగ్గా తీసుకోవద్దు అలా అని తమకు నచ్చని దేశాలన్నింటిని సర్వనాశనం చేయడానికి పూనుకోవద్దు. ఒక విధ్వసంసానికి అంత కన్నా భారీ విధ్వంసం సమాధానం కానే కాదు.
మనకెంత మంది రాక్షసులు లేరు వాడి రక్తం చుక్క భూమిపై పడగానే అలాంటి వందల మంది రాక్షసులు పుట్టిన కథలు కోకొల్లలు.

 మళ్లీ విష్ణుదేవుడు మారు వేషం వేసి ఎలాగోలా ఆ రాక్షసున్ని సంహరించి దేవుళ్లను రక్షిస్తారు. బహుశా ఇలాంటి కథల స్ఫూర్తితోనే కావచ్చు రజనీకాంత్ ఆ మధ్య రోబో తీశారు. ఆ సినిమాలో రజనీ కాంత్ అచ్చం రజనీకాంత్‌లా ఉండే రోబోను తయారు చేస్తాడు. అది కాస్తా దారి తప్పడంతో దాన్ని ముక్కలు ముక్కలు చేసి చెత్తకుప్పలో పారేస్తే వేలాది మంది విలన్ రజనీకాంత్‌లు తయారై ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెడతారు. సరే వేలాది రజనీకాంత్ రోబోలు, ఏకైక వృద్ధ రజనీకాంత్‌ల మధ్య ఫైట్ అయినప్పటికీ సినిమా అన్నాక హీరోనే గెలిచి తీరాలి కాబట్టి వేలాది రోబో రజనీకాంత్‌లను ముట్టుపెట్టి వృద్ధ రజనీకాంత్ విజయం సాధించి ఐశ్వర్యను దక్కించుకుంటాడు.
 సరే అది శంకర్ సినిమా కాబట్టి ఆయన చెప్పినట్టు జరిగింది. అదే ఇప్పుడు జీహాద్ తలకెక్కిన వాళ్లు వేలాది మంది లాడెన్‌లను పుట్టిస్తే ఈ ప్రపంచం ఎలా తట్టుకుంటుంది? ప్రపంచంలో ఎక్కడేం జరిగినా రష్యావాళ్లకు తెలిసిపోతుందని గతంలో గట్టినమ్మకం ఉండేది. ఆ తరువాత అదే నమ్మకం మనం అమెరికా వాళ్లమీద పెట్టుకున్నాం. మనింట్లో ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకుంటున్న విషయాలు కూడా అమెరికా వాడికి తెలిసిపోతాయి తెలుసా? అంటూ చెబుతుంటే ఆశ్చర్యంగా వినాల్సి వచ్చేది.
 సోవియట్ రష్యానే కుప్పకూలిపోయాక, వీడి దేశంలో కూలిపోతున్న విషయం వీడికే తెలియదు ఇక మన సంగతి వాడికేం తెలుస్తుందనిపించింది. రష్యా గురించి మనం అనుకున్నది తప్పు కానీ అమెరికా విషయం మాత్రం అలా కాదు అని కమ్యూనిస్టులను కమానా ఇష్టులు (కమానా అంటే సంపాదించడం) ఆట పట్టించేవారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిలువునా కూలిపోయాక ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుందో ఎవడికీ తెలియదు కానీ ప్రపంచంలో ఎక్కడేం చేయాలన్నా చేసే సామర్ధ్యం లాడెన్ కుంది అని కోట్లాది మంది నమ్మారు. ఇప్పుడు నగరంలో ఆధునికి ఫ్యాషన్ అంటే చెవులకు కమ్మలు పెట్టుకోవడం, ఆడవాళ్లలా జుట్టు పెంచుకోవడం. గ్రామాల్లో వృద్ధుల చెవులకు ఈ ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. అవే ఇప్పుడు మహానగరాల్లో లేటెస్ట్ ఫ్యాషన్
.మరో పదిఇరవై ఏళ్లలో చీరలు మళ్లీ కొత్త ఫ్యాషన్ అవుతాయి. ఆగండి ఇందులో ఫ్యాషన్ ఏంటీ అంటే ఆడవాళ్లు కాదు మగవాళ్లు చీరలు కట్టుకుంటారన్నమాట! అలానే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విలన్‌లనే ప్రేమించడం లేటెస్ట్ ఫ్యాషన్. లాడెన్‌కు కోట్లాది మంది అభిమానులున్నారు. ఈ విషయం తెలిసే అమెరికా వాడు లాడెన్ శవానికి నరమానవుడు గుర్తించకుండా అంతిమ సంస్కారాలు నిర్వహించేశాడు. ప్రపంచ సార్వభౌములం మేమే, ఏ దేశంలోనైనా, ఏమైనా చేస్తామని దీంతో అమెరికా మరోసారి ప్రపంచానికి చాటింది.
కరీంనగర్‌లో ఒక యువకుడు రావణాసురుడికి గుడి కట్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు-అభిమానం ఉంటే అడ్రస్ కనుక్కొని చందాలివ్వండి! శ్రీరాముని అనుగ్రహం ఉంటే ఆ యువకుడి కోరిక తప్పక తీరుతుందని ఒక ఆశావాది చెప్పుకొచ్చాడు. చాలా మంది ఎన్టీఆర్‌లో శ్రీరామున్ని, శ్రీకృష్ణున్ని చూసుకుంటే ఎన్టీఆర్ తనలో దుర్యోధనుడు, రావణున్ని చూసుకున్నారు. పౌరాణిక విలన్లయిన వీరిని హీరోలుగా చూపుతూ ఎన్టీఆర్ చాలా సినిమాలు తీశారు. లాడెన్‌ను చంపడం కాదు.... లాడెన్లు పుట్టడానికి అమెరికా కారణం తాను కారాదు. లాడెన్లను పుట్టించి శత్రువులపైకి ఉసిగొల్పితే చివరకు వారు తమను పుట్టించిన వారినే చంపడానికి సిద్ధపడతారు. వరమిచ్చిన దేవుళ్లపైనే కదా రాక్షసులు తొలుత ఆ శక్తిని ప్రదర్శించింది.
ముక్తాయింపు.... ప్రపంచంలో ఎవరికీ రక్షణ లేదు. చివరకు పాకిస్తాన్‌లో టెర్రరిస్టులకు సైతం..

2, మే 2011, సోమవారం

హీరో హీరోయిన్ల ప్రేమ లాంటిదే రాజకీయ నాయకుల మద్య ద్వేషం

అబ్బో మనకిదేమన్నా కొత్తనా? ఎన్ని సినిమాలు చూడలేదు. హీరోయిన్‌ను హీరో తెగి ఏడిపిస్తుంటాడు. ఎలాగైనా హీరోను చితగ్గొట్టించాలని హీరోయిన్ ప్రయత్నిస్తుంటుంది. హీరోలో కసి మరింతగా పెరిగిపోతుంది. హీరో ఆగడాలను తట్టుకోలేక హీరోయిన్ తండ్రి చివరకు గుండాలను ఆశ్రయించి హీరోను తుదముట్టించమని డబ్బులిస్తాడు. ఆ హీరో గుండాలనే మట్టికరిపిస్తాడు. ఆ భీకరమైన ఫైటింగ్‌లో హీరో తలకు గడ్డం గీసుకుంటే అయ్యేంతటి చిన్నగాటు పడుతుంది. అప్పటి వరకు హీరోను తుదముట్టించాలనుకున్న హీరోయిన్ కళ్లలో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ రాజా అంటూ హీరో వళ్లో వాలిపోతుంది. ఈ రోజు కోసమే రాణి... నేను ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను.
. కూరగాయల మార్కెట్‌లో పుచ్చు వంకాయలు ఒక్కక్కటి ఏరుతూ మంచి వంకాయల కోసం నువ్వు పడ్డ తపన చూసినప్పుడే నేను నీమీద మనసు పారేసుకున్నాను.
 నువ్వు నన్ను చూడలేదు కానీ ప్రకాశం మార్కెట్‌లో ఆ రోజు నువ్వు వంకాయలు కొంటున్నప్పుడే నేను బామ్మా పక్కనే టమాటాలు కొంటున్నాం. వయసైపోయిన బామ్మ, కూరగాయల గురించి తెలియని నేను వాడేవిస్తే అవి తీసుకొని, ఇంటికి వెళ్లాక పుచ్చువి ఏరి పారేసేవాళ్లం. కానీ అక్కడే పుచ్చువి తొలిగించి మంచివి తీసుకోవచ్చునని నిన్ను చూశాకే తెలిసింది.
 అప్పటి నుంచి ఏనాటికైనా నిన్నే  చేసుకోవాలనుకున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే అప్పటికే ఐదారు డజన్ల మంది వందల సార్లు చెప్పి ఉంటారు. వారిలో నన్ను ఒకడిగా జమకడతావు. అలా కాకుండా నిన్ను ద్వేషించడం ద్వారా నీ ప్రేమ పొందాలనుకున్నాను. రోజూ నిన్ను మానసికంగా హింసించాను, వెంటపడ్డాను, వేదించాను, చివరకు ద్వేషం నుంచి ప్రేమ పుట్టేట్టు చేశాను. నేను విజయం సాధించాను రాణి విజయం సాధించాను అని హీరో అంటాడు.
ఆ తరువాత డ్యూయెట్.
కొంచం అటూ ఇటుగా ఇలాంటి కథలు మనం ఎన్ని చూడలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, హరనాథ్, కాంతారావుల కాలం నుండి తొలి తరం హీరోల మూడో తరం మనవల వరకు ఈ కథలతో ఎందరి సినిమాలు వచ్చాయో?
 విలన్ అయిన హీరోయిన్ తండ్రి 13 రీళ్ల వరకు పరమ భయంకరంగా కనిపించి చివరి రీలులో నా కళ్లు తెరిపించావు అల్లుడూ అని హీరోను హత్తుకుంటాడు. మన సినిమాల కథలు వాస్తవాలకు దూరంగా ఉంటాయని చులకన చేస్తాం కానీ కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే ఇలాంటి కథల్లో వాస్తవం లేదా?
జీవితంలోనే కాదు చివరకు రాజకీయాల్లో కూడా ఇలాంటి కథల కాలమే నడుస్తోంది. కెసిఆర్, లగడపాటి రాజ్‌గోపాల్ అంటే కాంతారావు, రాజనాలలా కనిపిస్తే కత్తులతో యుద్ధం చేసుకుంటారని, ఒకరంటే ఒకరికి పడదని సీమాంధ్రులు, తెలంగాణ వారు విడివిడిగా సంతోషించారు.
 లగడపాటి చూపిన ప్రేమకు ఉబ్బి తబ్బయిన కెసిఆర్ సమస్త ప్రేక్షకుల ముందే ఐ లవ్ యూ రాజ్‌గోపాల్ అనకుండా ఉండలేకపోయారు. అప్పుడు ఇద్దరు ఎంతగా తిట్టుకున్నారో ఇప్పుడు అంతగా ప్రేమించుకుంటున్నారు. అదేం చిత్రమే కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా నాయకులంతా ఇలాంటి ప్రేమలోనే మునిగిపోయారు.
 ఆగర్భ శత్రువులు హఠాత్తుగా ప్రేమ సందేశాలు పంపించుకుంటున్నారు. పుట్టింది కాంగ్రెస్‌లోనే అయినా ఆ పేరు చెబితేనే శివాలెత్తే చంద్రబాబు సోనియాగాంధీకి వీరాభిమానిగా మారిపోయిట్టున్నారు. మన రాష్ట్రంలో మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా మీ నాయకత్వంలో ఉద్యమిద్దాం అని సోనియాకు రాహుల్‌కు చంద్రబాబు సందేశాలు పంపిస్తున్నారు. కాంగ్రెస్ మార్గమే నా మార్గం అని సోనియా మాటే నాకు వేదం అన్నట్టుగా ఉందాయన తీరు. కాంగ్రెస్స్ లో పుట్టిన జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్స్ ను పడగొడతానని సవాల్ చేస్తే , ఎలా పడగోడతవో  నేను చూస్తా అని బాబు బయటి నుంచి మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్స్ వాళ్ళ పంచలు ఉడగోట్టాలని ఎన్నిక ప్రచారం లో నిప్పులు చెరిగిన చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్స్ పై జగన్ చూపు పడకుండా గొడుగు పడతానని ముందుకు వచ్చారు. ని ప్రాణానికి నా ప్రాణం అడ్డు అన్నట్టు మీ పార్టీకి మా పార్టీ అడ్డు అని చెబుతున్నారు. మీ మద్దతు పుణ్యమా అని రెండు పార్టీ లు సమన స్తాయికి చేరు కున్నాయని కొందరి బాధ . సమ ఉజ్జిల మద్యనే కదా స్నేహం కుదిరేది.
కాంగ్రెస్ పట్ల  బాబు, చిరంజివిల్లో మరీ ఇంత ప్రేమ దాగుందని  కాంగ్రెస్స్ వారె ఉహించి ఉండరు.  

 సృష్టి, స్థితి, లయ కారకుడు, సెల్‌ఫోన్లు ప్రజలకు ఉపయోగపడతాయని తొలుత కనిపెట్టిన వ్యక్తి, కంప్యూటర్‌ను ప్రపంచంలో తొలిసారిగా వినియోగించిన వ్యక్తి, ప్రపంచంలో అన్ని సమస్యలు పరిష్కరించే శక్తివంతుడు బాబు మాత్రమే అని త్రికరణ శుద్ధిగా నమ్మే టిడిపి నాయకులు సైతం ఇప్పుడు ఆయన వల్ల ఆయ్యేదేమీ లేదు కానీ సోనియా ఇంటికి వెళ్లి ధర్నా జరిపి తెలంగాణ తెచ్చుకుందామంటున్నారు.
మనిషి దగ్గరున్నప్పుడు అతని మీదున్న ప్రేమ తెలియదు దూరం అయ్యాక తెలిసొస్తుందని దేవేందర్‌గౌడ్ బాబుమీద ప్రేమ చూపిస్తున్నారు. టిడిపి మునిగిపోయే పడవ, బాబు పని ఐపోయింది అఒ చెప్పిన దేవేందర్‌గౌడ్ ఇప్పుడు బాబును మించిన నాయకుడు లేడని ప్రేమించడం మొదలు పెట్టారు. ఇక్కడ పుట్టిన వారంతా తెలంగాణ బిడ్డలే అంటూ కెసిఆర్ ‘సెట్లర్ల’పై ప్రేమ కురిపిస్తున్నారని తెలంగాణ వాదులు ఆయనపై భగ్గుమంటున్నారు. ఈ దెబ్బతోకెసిఆర్‌పై సెట్లర్లకు ప్రేమ పుట్టకుండా ఉంటుందా? 

ప్రేమను ప్రేమ ప్రేమిస్తుందనేది పాత మాట. ద్వేషం నుండే ప్రేమ పుడుతుందనేది నేటి నాయకుల మాట. మన నాయకుల ద్వేష ప్రేమకు మూలం తెలుగు సినిమా కథలు. మరి మన తెలుగు సినిమాల్లోని ప్రేమ కథల్లో ముందు ద్వేషం తరువాత ప్రేమ ఫార్మూలాకు మూలమేమిటో తెలుసా? ఔను పురాణాల్లోనే ఉంది. జయవిజయుల కథ తెలుసు కదా! ద్వేషం ద్వారా తక్కువ జన్మల్లోనే విష్ణువు ప్రేమను సాధించవచ్చుననే కదా, వారు విలన్ల పాత్రలకు ఒప్పుకున్నది!ప్రేమిస్తే ఎక్కువ సమయం పడుతుంది. ద్వేషిస్తే తక్కువ సమయంలో ప్రేమను సాధించవచ్చు.