15, ఆగస్టు 2011, సోమవారం

ఇది మన భారత దేశం.........భారత మాత చిరునామా తెలుసా ?


ఇది మన భారతదేశం

బుద్దా మురళి


గాంధి పుట్టిన దేశమా ఇది..అంటూ కవి ఆరుద్ర ఏనాడో పేద్ద పాట రాశాడు. రాసి మూడు,నాలుగు దశాబ్ధాలు దాటుతున్నా, దేశ పరిస్థితులు అలాగే వున్నాయ..పేరుకు ప్రజలది రాజ్యం..పెత్తందార్లదే భోజ్యం..అన్న దందా ఇంకా నడుస్తూనే వుంది. .ఈ నేపథ్యంలో సగటు మనిషి మనోగతం ఇది..బాధగీతం ఇది. సామ్యవాదం..రామరాజ్యం సంభవించే కాలం కోసం, కలవరింత ఇది.

అమ్మా భారత మాత
బాగున్నావా తల్లీ! ఉత్తరం రాసేప్పుడు ఇక్కడంతా క్షేమమే.. మీరు కూడా క్షేమమే అని తలుస్తాను అనడం మర్యాద. కానీ కళ్ల ముందు పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఇక్కడంతా క్షేమమే అని ఎందుకో రాయాలనిపించలేదు తల్ల్లీ. సరే ఇంతకూ నీ అడ్రస్ ఎక్కడ మాత. ఏమో ఎప్పుడు చూసినా ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు తప్ప భారత మాత అని ఎవరి నోటి నుండి పెద్దగా వినిపించడం లేదు. మరి నీ అడ్రస్ నాగపూర్ అనుకోవాలా/ లేక ఢిల్లీనా సరే ముందు ఉత్తరమైతే పూర్తి చేస్తాను అడ్రస్‌దేముంది తల్లి అడ్రస్‌ను కూడా గూగుల్‌లో వెతుక్కునే రోజులు వచ్చేశాయి. గూగుల్‌లో సెర్చ్ చేసి పోస్ట్ చేస్తాను లే! జైలులో ఉండాల్సిన వాళ్ల అడ్రస్ అధికార కేంద్రంలో, ఇంట్లో పూజలందుకోవలసిన తల్లిదండ్రుల కేరాఫ్ అడ్రస్ వృద్ధాశ్రమం అవుతోంది మాత అందుకే అడ్రస్ అడిగాను మరోలా అనుకోకు.
నీవు ఎలా ఉన్నావో నాకు తెలియదు మరి నేను ఎలా ఉన్నాననే కదా నీ సందేహం. నిజమే తల్లీ ఎలా ఉన్నా నిరంతరం తన సంతానం మంచి చెడుల గురించే కదా? ఆందోళన చెందుతుంది.
ఎలా ఉన్నానంటే సంతోషంగా ఉన్నానని, చెప్పాలా? బోలెడు బాధల్లో ఉన్నానని చెప్పాలా? చెప్పకూడదని కాదు తల్లి నిజంగా నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు.
1947 ఆగస్టు 14 ఆర్ధరాత్రి... సరిహద్దుల్లో అల్లకల్లోలం. లక్షలాది మంది ఇటు నుండి అటు... అటు నుండి ఇటు.. మత కలహాలు... సంపన్నులు సైతం కట్టుబట్టలతో పరుగులు తీశారు. ఏ ముహూర్తంలో ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందో కానీ ఇంకా ఆ అల్లకల్లోలం తీరలేదు తల్లి. కాశ్మీర్‌లో రావణ కాష్టం రగులుతూనే ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో అల్లకల్లోలంగానే ఉన్నాయి. దక్షిణాదిన ఆంధ్రలో చిచ్చు రగులుతోంది. మత ఘర్షణలు, కుల ఘర్షణలు పెరుగుతున్నాయే తప్ప తక్కడం లేదు.
అయ్యో నా బాధలు చెప్పి నిన్ను మరింత కలవరపెట్టానా? సరే ఇవి ఎప్పుడూ ఉండేవే లే అన్నీ సమస్యలేనే నీ జీవితంలో మంచేమీ లేదా? అనే కదా తల్లి నీకొచ్చిన సందేహం. ఎందుకు లేదు చాతి పొంగిపోయేంత, నేను భారతీయుడ్ని అని గర్వించేంత సంతోషకరమైన విషయాలు చాలానే ఉన్నాయి తల్ల్లీ.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశం ఎదుర్కొన్న ప్రధాన సమస్య తిండి గింజలు. అమెరికా వాడు దయతలిచి ఇచ్చిన గోదుమలు, మంచి నూనెను అమృతంలా తీసుకున్న రోజులు మరిచిపోలేదు తల్లీ. అలాంటిది మొన్న అమెరికా అధ్యక్షుడొచ్చి మన మధ్య స్నేహం అవసరం అంటూ సమాన స్థాయి స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడాడు. అంతే కాదు వాళ్ల దేశానికి వెళ్లి ఇండియా నన్ను బాగా ఆదరించింది నా పర్యటనలో కుదిరిన ఒప్పందాల వల్ల అమెరికా పౌరులకు 50వేల ఉద్యోగాలు వస్తాయని గర్వంగా ప్రకటించుకున్నాడు. వాడిచ్చే పాలపొడి, గోధుమ రవ్వ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన రోజులు మరిచిపోలేదు తల్లీ ఇప్పుడు అదే అమెరికా అధ్యక్షుడు భారతీయులు తెగ తినేస్తున్నారు, పెట్రోల్ వాడేస్తున్నారు అందుకే ధరలు పెరిగాయని వాపోతే దాన్ని నేను సాధించిన అభివృద్ధికి కితాబుగానే భావించాను. వాడిచ్చే గోదుమల కోసం ఎదురు చూసిన ఈ కళ్లతోనే వాళ్లకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి వెళ్లినందుకు నిజంగానే ఆ క్షణంలో గర్వించాను తల్ల్లీ.
అమెరికాలో విడుదలైన కారు మరుసటి రోజే మన రోడ్లమీద దర్శనమిస్తోంది. ఇప్పుడు ప్రపంచం చూపు మన దేశంపై ఉంది.
భారత మాత నీకు తెలియదని కాదు ఇప్పుడు ఎంత అభివృద్ధి సాధించామో తెలుసా? జనాభాలో చైనా తరువాత మనమే. తల్లీ ఇప్పుడు నీ బిడ్డల సంఖ్య 120 కోట్లు. ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. బౌగోళికంగా ప్రపంచంలో ఏడవ పెద్ద దేశం. ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాలైన హిందూయజం, బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం మతాలను నీ బిడ్డలు అవలంబిస్తున్నారు.
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లెక్క ప్రకారం 2010 ఇండియా జిడిపి 1.538 యుఎస్ ట్రిలియన్ డాలర్లు. 2011 1.7 యుఎస్ ట్రిలియన్ డాలర్లు. ఏమిటీ లెక్క అనడుగుతున్నావా? తల్ల్లీ నీలానే నీ బిడ్డల్లో కోట్లాది మందికి ఈ లెక్కలు అస్సలు తెలియవు తల్లీ. చివరకు ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చిన పివి నరసింహారావు సైతం ఈ లెక్కలేమిటో నాకు తెలియవన్నారు. ఆయన ప్రధానమంత్రిగా దిగిపోయిన తరువాత ఒక సభలో అప్పటి సిఎం చంద్రబాబు సంస్కరణలు, ట్రిలియన్లు బిలియన్లు అంటూ ఏవో లెక్కలు చెబుతుంటే బాబు ఏవో లెక్కలు చెబుతున్నారు, ఈ ట్రిలియన్లు, బిలియన్లు నాకు తెలియవు అన్నారు. మనవడు ముచ్చట్లు చెబుతుంటే అబ్బురంగా విన్న తాతలా ఆయన బాబు ట్రిలియన్ల ముచ్చట్లు వింటూ సంస్కరణలు అంటూ నేను కిటికీలు తెరిస్తే తరువాత వాళ్లు ఏకంగా తలుపులే తెరిచేశారని చెప్పాడు. నిజమే తల్లీ ఈ సంస్కరణల తరువాత తలుపులు తెరిచాక లోనికి విస్తారంగా గాలి వచ్చిందని సంతోషపడాలో, ఈ తుఫాను గాలిలో అస్థిత్వానే్న కోల్పోయి మనది కాని లోకంలోకి కొట్టుకుపోతున్నామో అర్థం కావడం లేదు తల్లీ.

 నీకు తెలుసా తల్లి ఈ దేశంలో రోజుకు 20 రూపాయలు సంపాదించే నీ బిడ్డలు కొన్ని కోట్ల మంది ఉన్నారు. తిన్నది అరక్క రాత్రి పూట క్లబ్బుల్లో లక్షలు ఖర్చు చేసే బిడ్డలూ ఉన్నారు. రాత్రి జీవితం కోసం గతంలో వలె సింగపూర్‌కో మరో దేశానికో వెళ్లక్కర లేదు. చాలా రాష్ట్రాల రాజధానులు రాత్రి కాగానే సింగపూర్‌లు అయిపోతున్నాయి.
మనది ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అట. కొనుగోలు శక్తి ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగో అతి పెద్దదట! ఒక నివేదిక ప్రకారం 2011లో కొనుగోలు శక్తిలో భారత్ జపాన్‌ను అధిగమిస్తుంది. 2045 నాటికి అమెరికాను అధిగమిస్తుంది. మరో నాలుగు దశాబ్దాల పాటు భారత వృద్ధిరేటు ఎనిమిది శాతం వరకు ఉంటుందట! 2050 వరకు కూడా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తుందట! పని చేసే యువత శాతం అత్యధికంగా ఉండడమే ఈ వృద్ధికి కారణం.
అందుకే మన దేశాన్ని పాశ్చాత్యులే కాదు చివరకు మన వాళ్లు సైతం వినియోగదారుల్లానే చూస్తున్నారు తప్ప మనుషుల్లా కాదు.
మరో విషయం చెబుతాను తల్లీ టాటా వాళ్లు ఆ మధ్య నానో కారు తయారు చేశారు. ఇది ప్రపంచంలో కెల్లా చౌకయిన కారు. ప్రపంచంలో అత్యధికంగా బేసిక్ కార్లు తయారు చేసేది మన దేశమే. పేదరికం అత్యధికం ఇక్కడే సంపద ఇక్కడే. బిలియనీర్ల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతున్నది ఇక్కడే, అంత కన్నా వేగంగా పేదల సంఖ్య పెరుగుతున్నది ఇక్కడే.
దేశంలో సగం మంది పిల్లలు నిర్ణీత బరువు కన్నా తక్కువగా ఉంటున్నారు. అంటే వారికి సరైన పౌష్టికాహారం దొరకడం లేదు. అమెరికా అధ్యక్షుడంతటి వాడు మీరు తెగ తిని తాగేస్తున్నారర్రోయ్ అని మొత్తుకున్నది మన గురించే తిండి లేక బక్కచిక్కుతున్నది మనమే చిత్రంగానే ఉంది కదు తల్లీ.
మనకు తెలియకుండానే భారత దేశంలో రెండు భారత దేశాలు కనిపిస్తున్నాయి తల్లీ. ఒకటి సంపన్న భారత దేశం, మరోటి కడు పేద భారత దేశం. భారత్, పాకిస్తాన్‌లు చీలిపోయినంత వేగంగా రెండు భారత దేశాలు చీలిపోతున్నాయి. ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ ఈ చీలిక ఏనాటికైనా ప్రమాదమే తల్లీ. కొడుకుల్లో సగం మంది మంచి తిండి, సుఖ సంతోషాలతో ఉంటే మిగిలిన సగం మంది ఆకలి కేకలు వేస్తుంటే ఏ తల్లి మనసైనా తల్లడిల్లకుండా ఉంటుందా? సరే తల్లీ వీటి గురించి మళ్లీ మాట్లాడదాం కానీ ఎప్పటి నుండో నాకో సందేహం.
నీ కడుపున ఎలాంటి వీరులు పుట్టారు. దేశ భక్తులు, సంఘ సంస్కర్తలు, శత్రువులను చీల్చి చెండాడిన మహా యోధులు, మేధావులు ఎంత మంది పుట్టారు తల్లీ. అలాంటి నీ కడుపున ఇప్పుడు నపుంసక నాయకులు పుట్టారేమి తల్లీ. దేశ ఆర్థిక రాజధానిలో రాక్షసుల్లా దాడి చేసి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసిన ముష్కరుడు అల్లుడిలా ఆతిథ్యం పొందుతుంటే ఎంత గాంధేయ వాదులమైనా సహించలేకపోతున్నాం తల్ల్లీ.
 ఈ దేశం నన్నేం  చేస్తుంది అన్నట్టుగా వాడు కోర్టులో వెకిలినవ్వు నవ్వుతుంటే ఎందుకో తల్లీ ఎంత క్షమించేద్దామన్నా మనసు ఒప్పుకోవడం లేదు. నువ్వు కనిపిస్తే ఎందుకు తల్లీ ఈ నపుంసక నాయకత్వాన్ని మాకు కట్టబెట్టావని నిలదీయాలనిపిస్తోంది. జలియన్ వాలాబాగ్‌లో అమాయకులను చంపిన డయ్యర్‌ను మట్టుపెట్టిన నీ కుమారులు ఇప్పుడేమయ్యారు తల్లీ.
ప్రపంచానికి అణుబాంబును పరిచయం చేసిన వాడు సైతం చివరి రోజుల్లో తనను క్షమించమని వేడుకుని కుమిలిపోయాడు. అంత కన్నా శక్తివంతమైన నిరాహార దీక్ష అనే ఆయుధాన్ని ప్రపంచానికి అందించిన మహాత్మాగాంధీని కన్నావు. ఆయుధ సంపత్తితో ఉన్న బ్రిటీష్ వాడిని ఓడించాలంటే అంత కన్నా బలమైన ఆయుధం కావాలి. పేద భారతీయులు అలాంటి ఆయుధాన్ని ఎలా సమకూర్చుకుంటారు. ఎంత కాలమైనా బానిసత్వంలో మగ్గవలసిందేనా? అనుకుంటున్న తరుణంలో ఒక్క బక్క జీవి అంత బలమైన బ్రిటీష్‌వాడిని నిరాయుధం ఆనే ఆయుధంతో చావు దెబ్బ తీశాడు.

 అప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా రక్త పాతం కనిపించింది. ఒకరు విజయం సాధించారు అంటే మరొకరు ఓడిపోయారు. రెండువైపులా రక్తం ప్రవహిస్తేనే అది యుద్ధం. కానీ యుద్ధానికే కొత్త నిర్వచనం చెప్పి రక్తపాతం లేకుండా ఇద్దరూ గెలిచే కొత్త యుద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మోహన్‌దాస్ కరం చంద్ గాంధీని కన్న తల్లివి. ఈ దేశాన్ని పాలించుకునేంత శక్తి సామర్ధ్యాలు భారతీయులకు లేవు, వాళ్లు చవటలు అంటూ చర్చిల్ లాంటి వాడు తిడితే తన పాలనతోనే వాడికి సమాధానం చెప్పి నవ భారతానికి పునాదులు వేసిన జవహర్‌లాల్ నెహ్రూలాంటి వజ్రాన్ని కన్నావు. ఏమన్నావురా మాకు పాలించడం చాతకాదా? చవట ఇప్పుడు చూడరా నీ దేశం గత చరిత్ర మాది భవిష్యత్తు అని వాడికి ఎలుగెత్తి చాటే విధంగా దేశానికి బలమైన పునాదులు నిర్మించారు.

 అంత కన్నా కొంత ముందుకు వెళితే అఖండ భారతాన్ని తురుష్క ముష్కరులు దాడులు జరిపి దోచుకుంటున్న కాలంలో కత్తి పట్టి వీరోచితంగా పోరాడిన శివాజీ లాంటి వీరులను ఎంతోమందిని కన్నావు తల్లీ. అప్పటి గాలి నీరు అలాంటిది అని సరిపెట్టుకుందామంటే స్వాతంత్య్రం వచ్చాక కూడా ఇందిరాగాంధీ లాంటి వీరనారిని ఈ దేశానికిచ్చావు కదా! పాకిస్తాన్ సైనిక పాలకుడు యాహ్యాఖాన్ 1971 డిసెంబర్ మూడున పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌లోని సైనిక స్థావరాలపై దాడులకు పాకిస్తాన్ సైన్యానికి ఆదేశాలిచ్చారు. సరిగ్గా మరో 13 రోజుల్లోనే పాకిస్తాన్‌ను చీల్చి ఢాకా రాజధానిగా బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడినట్టు ఇందిరాగాంధీ ప్రకటించారు.

 తన దేశంలోని రెండు సైనిక స్థావరాలపై దాడులకు ఆదేశించిన దేశాన్ని రెండు ముక్కలు చేసిన వీరత్వం ఎక్కడ, ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు పార్లమెంటుపై దాడి చేసిన వాడిని శిక్షించడంలో మీన మేషాలు లెక్కిస్తున్న శిఖండి నాయకత్వం ఎక్కడ. భారత పాకిస్తాన్ ల మధ్య యుద్ధం అంటూ జరిగితే చైనా పాకిస్తాన్‌కు అండగా నిలుస్తుంది. కానీ మేం మాత్రం మీకు సహకరించేది లేదు అని అమెరికా ఖరాఖండిగా అధికారికంగానే తేల్చి చెప్పినా నీ మద్దతు లేకుంటే యుద్ధం చేయలేమని ఎందుకనుకుంటున్నావు చేతలతోనే ప్రశ్నించి పాకిస్తాన్‌ను చీల్చి చెండాడేందుకు భారత సైనికులకు ధైర్యాన్ని నూరిపోసిన ఆ వీరనారి ఎక్కడ.

 పార్లమెంటుపై దాడి చేస్తే దండిస్తే అమెరికాకు కోపం వస్తుందేమో, ఓటు బ్యాంకు చెదిరిపోతుందనేమో అని భయపడిన పిరికి జీవులెక్కడ. బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి ఇందిరాగాంధీ మొదటి నుండి అండగా నిలిచారు. కోటి మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చారు. కష్టాల్లో ఉన్న పొరుగు వాడిని ఆదుకోడం నీ కనీస ధర్మం. పొరుగు వాడిగా సహాయం చేసేందుకు సదా సిద్ధంగా ఉంటాను, కానీ నావైపు కనె్నత్తి చూస్తే ఇక నీకు చూసేందుకు కన్ను లేకుండా చేయడానికి వెనకాడను అనే సందేశాన్ని ఇచ్చి, ప్రతిపక్ష నాయకునిచేత కూడా అపరకాళి అని బిరుదు పొందిన ఇందిర ఎక్కడ రిమోట్‌తో నడిచే పప్పెట్ పాలకులెక్కడ?. బంగ్లావిముక్తికి సహకరించినందుకు బంగ్లాదేశ్ ఇచ్చిన అత్యున్నత పురస్కారం ఆమె కోడలు స్వీకరించారు. వీరనారిగా పురస్కారానికి ఇందిరాగాంధీ అర్హురాలే కానీ, నాయకత్వ లక్షణాల్లో కోడలికంత అర్హత ఉందా? నువ్వే చెప్పు తల్లీ. మేం ఏ జన్మలో చేసుకున్న పాపం తల్లీ ఈ జన్మలో ఇంత సన్నాసి పాలకులనిచ్చావు. తల్లిని ప్రశ్నించడం పాపమంటారు కానీ ప్రశ్నించకుండా ఉండలేకపోతున్నాను తల్లీ. ఇలాంటి నాయకులను కన్నందుకు నేను నిన్ను ప్రశ్నించాలా? లేక నీ దేశాన్ని ఇలాంటి నాయకుల చేతిలో పెట్టినందుకు నువ్వు నన్ను నిలదీస్తావా? యధారాజ తథా ప్రజ అన్నారు అంటే తప్పు నాలోనే ఉందంటావా తల్లీ. ఏమో అది కూడా నిజమే కావచ్చు.
దేశంలో ఇప్పుడు 467 మిలియన్ వర్కర్స్ ఉన్నారట! అంటే పని చేసేశక్తి ఉన్నవారిలో ప్రపంచంలో మనది రెండో స్థానంలో ఉన్న దేశం. మధ్యతరగతి ప్రజల సంఖ్య 580 మిలియన్లు, ప్రపంచంలోని 15 టాప్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల్లో ఏడు మన దేశానికి సంబంధించినవే.
భారత మాత ఆర్థిక రంగంలో సాధిస్తున్న ఈ అభివృద్ధిని చూసి సంతోష పడమంటావా? ప్రపంచంలోని సగం మంది నిరక్ష్యరాస్యులు, పేదవారు, పౌష్టికాహారం లోపించిన వారు ఈ దేశంలోనే ఉన్నారని బాధపడమంటావా?
ప్రపంచానికి నీ దేశం ఏమిచ్చింది? అని ప్రశ్నించి సున్నా అని ఒకడు నవ్వాడు. ఔను సున్నానే అని నీ బిడ్డలు గర్వంగా చెప్పుకుంటున్నారు. నిజమే కదా తల్లీ ప్రపంచానికి మన దేశం సున్నా ఇవ్వకపోతే ఈ ప్రపంచం అభివృద్ధి సున్నా వద్దే నిలిచిపోయేది కదా! అర్యభట్టు, భాస్కరాచార్య, ఆటమిక్ సిద్ధాంతానికి మూల పురుషుడు ఆచార్య కంద, అమెరికా పురుడు పోసుకోకముందే ప్రపంచానికి కెమికల్ సైన్స్‌ను పరిచయం చేసిన నాగార్జునుడు, వైద్యానికి పితామహుడు ఆచార్య చరకుడు, ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు ఆచార్య శుశ్రుతి. వరాహమిహీరుడు, ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించిన యోగా పితామహుడు ఆచార్య పతంజలి, వైమానిక టెక్నాలజీని క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే చెప్పిన ఆచార్య భరద్వాజ, కాస్మాలజీ ఫౌండర్ ఆచార్య కపిల వీరంతా నీ ముద్దు బిడ్డలే కదా తల్లీ ఇలాంటి ఎందరో మహనీయులను, వీరులను, సంఘ సంస్కర్తలను కన్న నీవు ఇప్పుడెందుకమ్మా మరి ఇలా...
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అని మురిసిపోవాలా? నీ దేశంపై దాడి చేసినా నువ్వు ఏమీ చేయలేవురా అని వాడు వికృతంగా నవ్వుతుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోవాలా?
ఒద్దు తల్లీ ఇలాంటి శిఖండి నాయకత్వం మాకొద్దు... నెత్తురు మండే యువత ఒకవైపు నపుంసక నాయకత్వం ఒకవైపు ఇది అన్యాయం తల్ల్లీ. అయినా అమ్మా నిజంగా దీన్ని నేను అభివృద్ధి అనుకోవాలా? నా గ్రామాల్లో మంచినీరు లేదు కానీ కోకాకోలా, విదేశీ మద్యం దొరకని గ్రామం లేదు. సగం మందికి తిండిలేని నా దేశానికి పిజ్జాలు అవసరమా తల్ల్లీ. ఇంతకూ నేను ప్రపంచం దృష్టిలో వినియోగదారునే్ననా? లేక మహోన్నతమైన సంస్కృతికి వారసుణ్ణా?
ఇంత భారీ అభివృద్ధిని నేను భరించలేను తల్లీ నా సంస్కృతిని, నా సంప్రదాయాలను పణంగా పెట్టి సాధించుకున్న ఈ అభివృద్ధి నన్ను గందరగోళంలో పడేస్తోంది.
ఇప్పుడు నా పరిస్థితి జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా ఉంది. ఎటు వెళుతున్నానో, ఏది మంచో ఏది చెడో నాకు అర్థం కావడం లేదు. కంటికి కనిపిస్తుంటే ఇది అభివృద్ధి కాదు అని చెప్పలేను. సగం మంది దుఃఖంలో ఉండి, గ్రామాలు జీవచ్ఛవంలా కనిపిస్తుంటే ఇదే అభివృద్ధి అని చెప్పలేను. ఈ గందరగోళంలో కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఐటిలోనే కాదు భార్యాభర్తలు విడిపోవడంలోనూ అమెరికాతో పోటీపడుతున్నాం.
నిజంగా నాకేం కావాలో నాకే తెలియడం లేదు. నిజమే కదా! కొడుకు అవసరం ఏమిటో తల్లికే తెలుస్తుంది. జాతరలో తప్పిపోయిన నన్ను చేయి పట్టుకుని సరైన మార్గంలో తీసుకువెళ్లాల్సింది నువ్వే తల్లి. ముందు ఈ జాతర నాకు అబ్బురంగా కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం తల్లీ ఒడిలో నిర్భయంగా పడుకోవాలని ఉంది. మరో ప్రపంచం అయినా తల్లి ఒడికి సాటిరాదు కదా! తల్లీ
సరే ఇక ఉంటానమ్మా!
నీ కోటాను కోట్ల మంది బిడ్డల్లో ఒకరు *
***



బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కరప్షన్
మార్కెట్‌లో దేనికి డిమాండ్ ఉంటే దానే్న అమ్మాలి. లేదా డిమాండ్ సృష్టించాలి. ఎంసెట్‌కు ఉన్న డిమాండ్‌ను మన రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇలానే దేశంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతుంది. మరి అవినీతిలో పాఠాలు నేర్పడానికి ఒక డిగ్రీ కోర్సు ప్రారంభిస్తే దాని ప్రకటన ఎలా ఉంటుంది.
బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కరప్షన్
నేషనల్ కరప్షన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
( పార్లమెంటు ఉభయ సభలకు అనుబంధం)
అవినీతిపై ప్రపంచ ప్రఖ్యాత సంస్థలో బిడిసి కోర్సు చేయండి.
హవాలా, కుంభకోణాలు, ఫైనాన్షియల్ నెట్‌వర్క్ ( రాష్ట్ర పార్టీ నుండి కేంద్ర పార్టీకి, కేంద్రం నుండి రాష్ట్ర పార్టీలకు నిధుల మళ్లింపులో చక్కని శిక్షణ ఇవ్వబడును. లంచాలు ఇవ్వడం, తీసుకోవడం వంటి వాటిలో ప్రాక్టికల్ క్లాస్‌లు ఉంటాయి. చాయ్ పానీ మొదలుకొని స్వీట్ బాక్స్, కలర్ టీవి, ఫారన్ ట్రిప్ ల వంటి చిన్నచిన్న అవినీతి వ్యవహారాలతో పాఠాలు మొదలు పెట్టి 2జి స్పెక్ట్రమ్ వంటి కుంభకోణాల వరకు అన్నింటిలో అవగాహన కల్పిస్తాం. అవినీతికి పాల్పడే చాన్స్ వచ్చినప్పుడు ఇది నాకు తెలియదు అనే అవకాశం లేకుండా మిమ్ములను మా డిగ్రీ సర్వసన్నద్ధం చేస్తుంది.
మీ పార్టీ వారు అవినీతికి పాల్పడినా, మీరు అవినీతికి పాల్పడినా ఏ విధంగా తప్పించుకోవాలో శిక్షణ ఇస్తాం. మీడియా ప్రశ్నలు ఎలా ఉంటాయి, నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ఏ విధంగా సమాధానం చెప్పాలో నిపుణులతో శిక్షణ ఉంటుంది. మనీష్ తివారి, రవిశంకర్ ప్రసాద్‌లతో ఈ అంశంపై ప్రత్యేక క్లాసులుంటాయి.
లా అండ్ ఆర్డర్
మిమ్ములను కేవలం అవినీతికే పరిమితం చేయం. మర్డర్, రేప్ చేసి ఎలా తప్పించుకోవాలో చక్కని శిక్షణ లభిస్తుంది. స్థానిక పోలీసులను చెప్పుచేతుల్లో ఉంచుకోవడం, బెయిల్ పొందడం వంటి అంశాలన్నీ ఇందులో ఉంటాయి. నేరం చేయడానికి సిద్ధం కాగానే ముందస్తు బెయిల్ పొందడం. ఒక వేళ జైలుకు వెళితే అక్కడి నుండే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడంపై తగు శిక్షణ ఉంటుంది.
అర్హతలు: ఈ కోర్సులో చేరడానికి కనీసం వంద కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన అనుభవం ఉండాలి
ఒకటిలేక రెండు రేపులు, ఒకటి రెండు హత్యలు చేసి ఉండాలి.
దేశంలోని వివిధ కోర్టుల్లో కనీసం పది కేసులు విచారణలో ఉండాలి.
కనీసం ఆరునెలల జైలు జీవితం ఉండాలి.
కనీసం స్విస్ బ్యాంకులో ఒక్క అకౌంట్ అయినా ఉండాలి.
====
ఇది మన దేశం
ఇది నా దేశం అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు.
* ఇక్కడ బియ్యం కిలో 40 రూపాయలు.. సిమ్‌కార్డ్ మాత్రం ఉచితం
*పిజ్జాకు ఆర్డర్ ఇస్తే అరగంటలో ఇంటి ముందుకొస్తుంది. గుండెపోటు వచ్చినా, హత్య జరిగినా అంబులెన్స్ రావాలంటే చాలా సమయం పడుతుంది.
*కారు లోన్‌కు ఐదు శాతం వడ్డీ , చదువుకోవడానికి విద్యార్థులకు ఇచ్చే రుణాల వడ్డీ 13 శాతం
* ఈ దేశంలో రెండు ఐపిఎల్ టీంలను 3300 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇదే దేశంలో రోజుకు ఒక పూట తిండిలేని వాళ్లు కోట్లలో ఉన్నారు.
* ఈ దేశంలో కాళ్లకు ధరించే పాదరక్షలను ఎసి షోరూ ముల్లో అమ్ముతారు. తినే కూరగాయలను ఫుట్‌పాత్‌లపైన, చెత్తకుప్పల పక్కన అమ్ముతారు.
* ప్రతి వారు తమ పేరు పత్రికల్లో రావాలని, తాము టీవీల్లో కనిపించాలని అనుకుంటారు. మంచి పనితో కాదు ఏ తప్పు చేసైనా సరే అని
* ఈ దేశంలో పెద్ద మాల్స్‌లున్నాయి. అదే పట్టణాల్లో భారీ మురికివాడలున్నాయ.
* ఎన్నో చోట్ల ఆడవారు, మగవారు రైల్వే ట్రాక్‌నే మరుగుదొడ్డిగా ఉపయోగించుకునే దేశమిది. ఇదే దేశంలో ఒక జంటకు మూడు బాత్‌రూంలు కూడా ఉన్నాయ.
* ఈ దేశంలో నాయకులు ప్రజలకు సేవ చేస్తూ జీతంతో పాటు వారి నుండి డబ్బులూ తీసుకుంటారు.
* మనం అవినీతికి వ్యతిరేకంగా అనర్ఘళంగా ఉపన్యాసం ఇస్తాం. రాంగ్ రూట్‌లో వెళితే ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటే చేతిలో నోటు పెట్టి వెళ్లిపోతాం.
* నిజాన్ని ఒప్పుకుందాం.. ఇది మన భారతదేశం.



 . పూర్తి లేఖ ఇక్కడ 


cover story | ఇది మన భారతదేశం | Andhra Bhoomi

3 కామెంట్‌లు:

  1. మనం అవినీతికి వ్యతిరేకంగా అనర్ఘళంగా ఉపన్యాసం ఇస్తాం. రాంగ్ రూట్‌లో వెళితే ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటే చేతిలో నోటు పెట్టి వెళ్లిపోతాం.
    * నిజాన్ని ఒప్పుకుందాం.. ఇది మన భారతదేశం.
    this
    LAST LINE is THE REALITY and THE BEST PUNCH.......

    I don't agree on the theory of GANDHISM....

    We got Independence not becaz of the NON-VIOLENCE but becaz of 2nd world war....

    after 2nd world war...British Empire was not in a position to rule our country with armed forces and by that time most of our natural resouses were successfully diverted to ENGLISH LAND....


    becaz of our FAKE HISTORY we r being taught like this....had it been NTHAJI or BHAGATH SINGH kind of revolution we would have been got independence much erlier and our nation would not have been devided on the besis of religion.....



    plz atleast in Blogs circulate our true history.....GANDHIISM is not at all acceptable.......

    this is my strong personal opinion.....

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం