12, డిసెంబర్ 2012, బుధవారం

చింతామణి ప్రజాస్వామ్యం-ఇరానీ టీ!


‘కడుపు తరుక్కు పోతోంది మనం ఏదో ఒకటి చేయాలి. అంటూ శంకరం అరికాలును గీక్కున్నాడు. అది చూసి ఇరానీ హోటల్ లోని తెలుగు సప్లయర్ ‘‘సాబ్ బాజూమే గవర్నమెంట్ హాస్పటల్ హై వహా అచ్చా మరం లగాతే.. తీన్‌దిన్‌మే ఆచ్చా హోజాతా హై’’ అని చెప్పాడు. ‘‘ ఆస్పత్రిలో మందు ఇస్తే మూడు రోజుల్లో ప్రజాస్వామ్యం బాగవుతుందా?’’ అని శంకరం ఆశ్చర్యపోయాడు. 

‘‘నువ్వు అనవసరంగా ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ ఆస్పత్రిని రెండింటిని కలిపి ఆశ్చర్యపోతున్నావు. నువ్వు కాలు గోక్కుంటుంటే వాడు కాలుకు పుండయి బాధపడుతున్నావేమో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లమని చెబుతున్నాడు’’ అని పరాంకుశం వివరించి చెప్పాడు. ‘‘నా పుండు గురించి కాదు ప్రజాస్వామ్యనికి పట్టిన పుండును బాగుచేయాలనేది నా బాధ.’’ అని అన్నాడు. ‘‘నువ్వేం సినిమా హీరోవు కాదు, నీ వయసు 60 ఏళ్లు కాదు. సాధారణ ఉద్యోగివి. 50 ఏళ్ల వయసు కూడా కాదాయే నువ్వేం చేస్తావు ప్రజాస్వామ్యానికి?’’అని పరాంకుంశం అడిగాడు. సగం టీకి కక్కుర్తి పడి వీడితో ఇరానీ హోటల్‌కు వస్తే ఇదే బాధ అని మనసులోనే అనుకున్నా పైకి మాత్రం మామూలుగానే ఉన్నా డు.‘‘ప్రజాస్వామ్యం అంటే ఏమనుకుంటున్నావు?’’ అని శంకరం ఆవేశంగా ప్రశ్నించాడు. ‘‘నేనేమీ అనుకోవడం లేదు కానీ నువ్వేమనుకుంటున్నావో చెప్పు ’’ అని పరాంకుశం బదులిచ్చాడు.

‘‘ఇంతకూ ప్రజాస్వామ్యం అంటే ఏమై ఉంటుంది?’’ అని శంకరం మెల్లగా అడిగాడు. ‘‘నా ఉద్దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఆత్మ లాంటిది. ఆత్మ కనిపించదు. ఆత్మకు చావు లేదు. ప్రజాస్వామ్యం కూడా అంతే దీనికి చావులేదు. కనిపించదు’’ అని పరాంకుశం చెప్పాడు. అది కాదురా సీరియస్‌గా చెప్పు అని శంకరం అడగడంతో పరాంకుశం ఒక్క క్షణం ఆగి

 ‘‘ఈ మధ్య చింతామణి నాటకం విన్నాను. ఎక్కడా చెప్పలేదు. ఎవరితో పంచుకోలేదు కానీ ఆ నాటకం విన్నాక నాకెందుకో చింతామణి ప్రజాస్వామ్యం ఒకటే అని పించింది’’ అని మనసులోని మాట చెప్పా డు.‘‘తాను ఎవరెవరిని ఎలా ముంచేసింది, ఎంత సంపాదించింది. నమ్మించి ఎలా ముం చేసింది. యూజ్ అండ్ త్రో అంటూ ఉపయోగించుకున్న వారిని ఎలా వదిలించుకోవాలో తల్లి చింతామణికి చెబుతుంది. అది వృద్ధ నాయకులు తన వారసులకు ప్రజాస్వామ్య నీతి బోధిస్తున్నట్టు అనిపించింది. చింతామణి చెప్పే నీతులు ప్రజాస్వామ్యంలో నాయకులు చెప్పే నీతులు ఒకేలా ఉంటాయి.

 తన వద్దకు వచ్చేవాళ్లు ఎలాంటి వాళ్లయితే చింతామణి అలాంటి పాట పాడుతుంది. తుంటరి వాళ్ళు వస్తే తుంటరి పాట పాడుతుంది, పెద్దమనిషి వస్తే అన్నమాచార్య కీర్తన పాడుతుంది. తన అభిమానుల మనసు దోచేందుకు చింతామణి పాడే పాటలు, మాటలు వింటే అచ్చం నాయకుల మాటల్లానే ఉంటాయి. కావాలంటే చింతామణి నాటకాన్ని విను.. ప్రజాస్వామ్యం విశ్వరూపం నీ కళ్లముందు ప్రత్యక్షం అవుతుంది. లేనిపోని చిక్కులెందుకు అని ఎవరితోనూ అనలేదు. నీతోనే చెబుతున్నాను ఎక్కడా చెప్పకు’’ అని పరాంకుశం చెప్పాడు. శంకరానికి సంతృప్తి కలగలేదు..

‘‘ప్రజాస్వామ్యం అంటే ఏంటో నాకు అర్ధం కాలేదు కానీ అది మాత్రం చాలా పవిత్రమైందిరా?’’ అని అన్నాడు. ‘‘విషం కలిపిన పాయసం ఈ ప్రజాస్వామ్యం, అని ఓ కవి ఆవేశంగా చెప్పాడు కానీ ఎందుకో అది సరికాదనిపించింది. విషం కలిపిన పాయసం అంటే అది ఎవరికైనా విషమే కదా? కానీ ప్రజాస్వామ్యం అలా కాదే కొందరికి పాయసంగా కొందరికి విషంగా ఉపయోగపడుతున్నది కదా? కాబట్టి అది సరికాదనిపిస్తోంది.’’ అని శంకరం నిరాశగా చెప్పాడు. అప్పుడెప్పుడో అన్నగారిని అధికారం నుంచి దించేసినప్పుడు ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటే ప్రజాస్వామ్యం అడ్రస్ దొరికినట్టు సంబరపడ్డాను. పదేళ్ల తరువాత అదే అన్నగారిని తిరిగి దించినప్పుడు ప్రజాస్వామ్యం కోసమే దించాం అంటే ఏది ప్రజాస్వామ్యమో అర్ధం కాలేదు. 

ఒక నేత విచ్చలవిడిగా పాలించినప్పుడు అదే ప్రజాస్వామ్యం అనిపించింది. ఆయన కుమారుడ్ని జైలులో పెడితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అంటే మళ్లీ అనుమానం వచ్చింది ఏది ప్రజాస్వామ్యం?’’ అని శంకరం ఆవేదనగా చెప్పుకుపోతున్నాడు. పరాంకుశం అప్పుడే గుర్తుకు వచ్చినట్టు ‘‘ 

ప్రజాస్వామ్యం వైట్ హౌస్ గొడ్ల చావిడిలో కట్టేసి ఉంటుందనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడి ప్రజాస్వామ్యం అయినా వైట్ హౌస్ నుంచి అమెరికా కంట్రోల్ చేస్తుంది. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ అనే వాడెవడో ప్రజాస్వామ్యాన్ని సరి గా చూసుకోవడం లేదని అమెరికా వాడు బాంబులేసి వాన్ని చంపేసి ప్రజాస్వామ్యాన్ని బతికించాడా? లేదా? పెట్రోలు, సహజ వనరులు ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యానికి వీసమెత్తు అపకారం జరిగినా అమెరికా వోడు అస్సలు సహించడు. దీన్ని బట్టి ప్రజాస్వామ్యానికి అమెరికా వాడు మొగుడు అని పిస్తోంది. మొగుడు సరే మరి ప్రజాస్వామ్యం అంటే ఎవరు? అంటే మాత్రం నేను చెప్పలేనురా’’ అని పరాంకుశం చేతులెత్తేశాడు.

 నన్ను చెప్పమంటారా? అని ఇరానీ హోటల్ లో సప్లయర్ ‘‘ప్రజాస్వామ్యం అంటే ఇరానీ హోటల్ లాంటి దే సార్! గుంపులు గుంపులుగా కూర్చుంటారు. ఎవడి గోల వాడిదే. ఒకడి మాట ఒకడు వినడు. ప్రజాస్వామ్యంలోనూ ఇంతే. తాగే టీ కప్పును సరిగా కడకపోయినా తాగేందుకు మళ్లీ మళ్లీ వచ్చేస్తుంటారు.’’ అంటూ వాడు చెబుతుంటే శంకరం నీళ్లను జగ్గులో నుంచి గ్లాస్‌లో పోస్తూ, నీళ్లు గ్లాస్‌లో పోస్తే గ్లాస్ రూపంలో కనిపిస్తాయి, జగ్గులో పోస్తే జగ్గు రూపంలో కనిపిస్తాయి. ప్రజాస్వామ్యం అంటే ఇరానీ హోటల్ జగ్గులోని నీళ్లు’’ అని అరిచాడు.

 శంకరం మాటలను విబేధిస్తూ పరాంకుశం ప్రజాస్వామ్య యుతం గా తల అడ్డంగా ఊపాడు.

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం