2, డిసెంబర్ 2012, ఆదివారం

కాలం తయారు చేసుకొన్న యోధుడు నరేంద్ర మోడీ

తనకు కావలసిన యోధులను కాలమే తయారు చేసుకుంటుంది. ఆ యోధులు హీరోలు కావచ్చు, విలన్‌లు కావచ్చు. లక్షలాది మంది యూదులను హతమార్చిన హిట్లర్‌నైనా, ప్రపంచాన్ని పాలించే అమెరికాను గడగడలాడించిన లాడెన్‌నైనా .. కోట్లాది మందిలో స్వాతంత్రేచ్ఛను రగిల్చిన మహాత్మాగాంధీనైనా, ప్రపంచానికి మార్గాన్ని చూపించిన బుద్ధ్ధుడినైనా కాలమే తయారు చేసుకుంటుంది. అంత కన్నా ముందు ఆ తరువాత వీరికన్నా శక్తివంతమైన వారు పుట్టి ఉండవచ్చు కానీ కాలం సహకరించక పోవడం వల్ల వారి ఉనికే తెలియకుండా పోయింది. భారత రాజకీయాల్లో నడుస్తున్న కాలం రూపొందించుకున్న యోధుడు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ప్రస్తాన లేకుండా భారత రాజకీయాలను అంచనా వేయలేం. ఆయన్ని వ్యతిరేకిస్తూనో, ఆయనకు అభిమానిస్తూనో, ఎలాగైతేనేం ఆయన పాత్ర లేకుండా రాజకీయాలు ఊహించలేని స్థాయికి మోడీ చేరుకున్నారు.

 తాను ప్రధానమంత్రి పోటీలో ఉన్నానని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ ప్రధానమంత్రి పోటీలో ఉన్న వారి జాబితా ఎవరు రూపొందించినా ఆయన పేరు ఉండి తీరాల్సిందే. తనను తాను గుజరాతీగా చెప్పుకోవడానికి, గుజరాత్ అభివృద్ధికి అంకితమైన నాయకుడిగా గుర్తింపు పొందడానికే మోడీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. పునాదులు బలంగా ఉంటే భవనం ఎంత ఎత్తుకైనా కట్టవచ్చునని పునాదులు తెలిసిన నాయకుడాయన. అందుకే బిజెపిలో తాను ఎవరికీ పోటీ కాదని గుజరాత్ రాజకీయాలకే పరిమితం అయ్యారు. ఒక జాతీయ పార్టీ నాయకుడైనా, గుజరాత్‌లో మాత్రం ప్రాంతీయ పార్టీ తరహాలోనే తన వ్యక్తిగత ఇమేజ్‌తో బిజెపికి ఎదురులేకుండా చేశారు. నరేంద్ర మోడీ స్థానిక నాయకుడు, రాహుల్‌గాంధీ జాతీయ నాయకుడు, రాహుల్‌తో మోడీకి పోలికేమిటి? అంటూ గుజరాత్ కాంగ్రెస్ నాయకులు విమర్శించినప్పుడు.

 ఔను నేను స్థానిక నాయకుణ్ణే, ఈ విషయాన్ని నేను వినయంగా ఒప్పుకుంటాను. రాహుల్‌గాంధీ జాతీయ నాయకుడే కాదు అంతర్జాతీయ నాయకుడు కూడా. ఆయన ఇటలీ నుంచి కూడా పోటీ చేయగలరు అంటూ చురక అంటించారు. ఎదుటి వారిని ఆటపట్టిస్తూ, గుజరాత్ ఆత్మగౌరవాన్ని చాటిచెబుతూ, అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తూ మాట్లాడడంలో మోడీ స్టైలే వేరు. కార్యదర్శులు రాసిచ్చే ఉపన్యాసం కన్నా అప్పటికప్పుడు చమక్కులతో ప్రత్యర్థులను ఆటపట్టించడం మోడీకి భలే సరదా! మోడీ ముమ్మాటికీ కాలం తయారు చేసుకున్న హీరో.... మోడీని రాజకీయాల్లో విపరీతంగా అభిమానించే వాళ్లు ఉన్నారు. అదే విధంగా తీవ్రంగా వ్యతిరేకించే వాళ్లు ఉన్నారు. నరేంద్ర మోడీ భారత రాజకీయాల్లో ఇప్పుడు కేంద్ర బిందువు. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభావం ఆ రాష్ట్రానికే పరిమితం అవుతుంది. కానీ మోడీ ప్రభావం మాత్రం మొత్తం దేశంపై కనిపిస్తోంది. కాబోయే ప్రధానమంత్రి మోడీ అని భావించే వాళ్లు కొందరు. రాహుల్‌గాంధీకి మోడీ నుంచే గట్టి పోటీ ఎదురవుతుంది.

 ఒక్క ఫోటో మీ జీవితానే్న మార్చేస్తుంది. నిజమే రాజకీయ నాయకుల జీవితాలను ఏ సంఘటన ఎలా మలుపుతిప్పుతుందో తెలియదు. గుజరాత్ మత కలహాల సమయంలో ఒక ముస్లిం యువకుడు నన్ను ఏమీ చేయకండి అంటూ కన్నీళ్లు పెడుతూ వేడుకుంటున్న ఫోటో ప్రపంచ వ్యాప్తంగా మోడీకి వ్యతిరేక ప్రచారాన్ని తెచ్చి పెట్టింది. చివరకు ఆయనకు అమెరికా, బ్రిటన్‌లు వీసాను సైతం నిరాకరించాయి. ఇది మొదటి ఫోటో కథ ఇక మరో ఫోటోలోకి వెళదాం.. అది మైనారిటీల సమావేశం. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని వక్తలు ఆకాశానికెత్తుతున్నారు. మోడీ మెడలో శాలువ కప్పారు. అనంతరం ముస్లింలు సంప్రదాయ బద్ధంగా తలపై ధరించే టోపీని మోడీ తలపై పెట్టడానికి మత పెద్ద ముందుకు రాగానే మోడీ సున్నితంగా తిరస్కరించారు. పత్రికలు ఆ ఫోటోను ప్రచురించాయి. చానల్స్ హడావుడి చేశాయి. మోడీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సాధారణంగా మోడీ స్థానంలో మరే నాయకుడు ఉన్నా ముస్లింల కన్నా మిన్నగా ముస్లిం సంప్రదాయంలో టోపీ ధరించి ఆ సమావేశానికి వెళ్లేవారు. టోపీ పెట్టడానికి ముందుకు వస్తే మహాద్బాగ్యంగా భావించే వాళ్లు. మోడీ సైతం అలానే చేసి ఉంటే దేశంలోని కొన్ని వందల మంది రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరుగా ఉండేవారు. కానీ మనసులో ఒకటి పైకి ఒకటి అని కాకుండా ఇతరులు ఏమనుకున్నా, ఇతరులకు నచ్చినా నచ్చక పోయినా తాను అనుకున్నది చేయడం ద్వారా భారత రాజకీయాల్లో నవతరానికి ఆయన హీరోగా మారారు.

 ఆయన పులుకడిగిన ముత్యం కాకపోవచ్చు, అలానే లౌకిక వాద మీడియా ప్రచారం సాగించినట్టుగా భయంకరమైన నాయకుడు కాకపోవచ్చు. కానీ నవ తరాన్ని ఆకట్టుకుంటున్న నిఖార్సయిన రాజకీయ నాయకుడు. ప్రధానమంత్రి పోటీలో ప్రాంతాలకు అతీతంగా మద్దతు పొందుతున్న నేత. అగ్రవర్ణాల పార్టీ అనే ముద్ర ఉన్న బిజెపిలో వెనుకబడిన వర్గాల నుంచి ప్రధానమంత్రి పదవికి పోటీ పడే స్థాయికి ఎదిగిన నేత. గదిలో బంధించి అదే పనిగా పిల్లిని హింసించినా అది పులిలా తిరగబడుతుంది ఇది సహజం. అలానే హిందూమతం సహనాన్ని అసమర్థతగా భావించినప్పుడు మోడీ లాంటి వారిని తమ యోధునిగా నిర్ణయించుకోవడానికి కాలమే అవకాశం కల్పించింది. మతం అనే భావన పుట్టక ముందే పుట్టిన హిందూ మతంలోనే లౌకిక వాదం ఉంది. హిందూమతానికి మరెవరో లౌకిక వాదం నేర్పాల్సిన అవసరం లేదు, ఆ మతం పునాదే లౌకిక వాదం. కానీ ఓట్ల రాజకీయంలో, మైనారిటీల సంతృప్తీకరణ విధానాలతో మమ్ములను, మా మతాన్ని చులకన చేస్తున్నారు అనే భావన హిందువుల్లో బలంగా ఏర్పడింది. ఈ ఆలోచనలే మోడీని బలమైన నాయకుడిగా నిలబెట్టింది. దేశం మొత్తం మోడీకి వ్యతిరేకంగా మీడియా ప్రచారం సాగించినా, అమెరికా వీసా నిరాకరించినా ఇలాంటి ప్రతి చర్య మోడీకి హీరో ఇమేజ్‌ను తెచ్చి పెట్టాయి. 

అమెరికాలో గుజరాతీల సమావేశానికి హాజరు కావడానికి మోడీ వీసా కోసం దరఖాస్తు చేస్తే తిరస్కరించారు. దాంతో మోడీ గుజరాత్ నుంచే అమెరికాలోని గుజరాతీలతో సంభాషించారు. ఎంతో ఆర్భాటంగా పెట్టుబడుల సేకరణ కోసం కాళ్లరిగేలా అమెరికాలో తిరిగిన నాయకుల కన్నా మోడీ తన సొంత రాష్ట్రంలో ఉండే ఎక్కువ పెట్టుబడులు రాబట్ట గలిగారు. పెట్టుబడులతో పాటు గుజరాతీల మనసు దోచారు. గుజరాత్‌కు సింబల్‌గా మారారు. చివరకు ఆయన ప్రత్యర్థి పార్టీలు సైతం మాది మోడీ రాష్ట్రం అని చెప్పుకునే పరిస్థితి కల్పించారు.

రెండేళ్లకోసారి ఒక్కో రాష్ట్రంలో ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహిస్తారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో నిర్వహించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులు తమ తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటో? తమ రాష్ట్రం పెట్టుబడులకు ఏ విధంగా అనుకూలమైనదో వివరించారు. మోడీ వంతు రాగానే డబ్బు సంపాదన కోసం మీరు సొంత దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్లిన వారు. లాభం వస్తుందనే నమ్మకం ఉంటే తప్ప పెట్టుబడులు పెట్టరు. పెట్టుబడులు పెట్టమని నేనేమి మిమ్ములను బ్రతిమిలాడడం లేదు. లాభం ఉందనుకుంటే పెట్టుబడులు పెడతారు అంటూ తమ రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఎలా ఉందో వివరిస్తూనే మీ నుంచి ఒక సహాయాన్ని కోరుతున్నాను అంటూ మీరున్న దేశంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక పది మందికి భారత దేశంలో దర్శనీయ ప్రదేశాల గురించి ఒక పది మందికి చెప్పండి. ఒక్కొక్కరు ఒక పది మందిని భారత్‌కు పర్యాటకులుగా పంపగలిగితే దేశానికి ఎంత విదేశీ మారక ద్రవ్యం వస్తుందో లెక్కలు చెప్పారు. అప్పటి వరకు మాట్లాడిన ముఖ్యమంత్రులంతా ఎన్‌ఆర్‌ఐలను బ్రతిమిలాడినట్టుగా మాట్లాడితే మోడీ మాత్రం ప్రాక్టికల్‌గా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.

 తన ధరించే దుస్తుల నుంచి, తన ఉపన్యాసం, తన పాలన వరకు అన్నింటిలోనూ మోడీ మార్క్ కనిపిస్తుంది. అప్పటి వరకు ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్న మోడీ 1987లో బిజెపి ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అంతకు ముందు అతనికి ఎలాంటి పాలనానుభవం లేదు. కానీ చిత్రంగా అనేక ఒడిదుడుకులను, వ్యతిరేకతను ఎదుర్కొని పాలనను గాడిలో పెట్టి వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చి నాలుగవ సారి సైతం అధికారంలోకి రావడంలో ఎలాంటి సందేహం లేని పరిస్థితి తెచ్చుకున్నారు. 1995 నుంచి గుజరాత్‌లో బిజెపి అధికారంలో ఉంది. అయితే ఇప్పటి వరకు బిజెపి అధికారంలోకి ఉంచే విధంగా చేసింది మాత్రం మోడీనే. 2001 జనవరి లో భారీ భూ కంపం గుజరాత్‌ను అతలాకుతలం చేసింది. అలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ 2001లో నరేంద్ర మోడీ గుజరాత్ పగ్గాలు చేపట్టారు. భూ కంపంలో భుజ్ పట్టణం సర్వనాశనం అయింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకున్నారు. ఈ రోజు మీరు భుజ్ పట్టణాన్ని చూస్తే ఒకప్పుడు భూ కంపంలో నాశనమైన పట్టణం ఇదేనా? అని ఆశ్చర్యపోతారు. భుజ్ పట్టణం మోడీ పాలనా దక్షతకు నిదర్శనం అంటారు ఆయన అభిమానులు. ఒకవైపు భుజ్‌పై శ్రద్ధ పెడుతూనే మరోవైపు గుజరాత్ నవ నిర్మాణంపై దృష్టి సారించారు. ఇప్పుడు గుజరాత్ అభివృద్ధి రేటు రెండంకెల్లో ఉంది. గుజరాత్‌కు ఇప్పుడు రాష్ట్రాలతో కాదు దేశాలతోనే పోటీ అని మోడీ సగర్వంగా ప్రకటించారు. మతపరంగా మోడీని విమర్శించే వారు సైతం అభివృద్ధి విషయంలో, అవినీతి వ్యవహారాల్లో ఆయన్ని వేలెత్తి చూపించలేరు. మతపరంగా మోడీపై తీవ్రంగా విమర్శలు చేసే వారు ఉన్నారు కానీ పాలనలో అసమర్ధత, అవినీతి, అక్రమాలపై విమర్శించే వారు లేరు. చివరకు మైనారిటీ నాయకులు సైతం మోడీ కన్నా ముందు నుంచే గుజరాత్ అభివృద్ధి పథాన పయనిస్తోంది అని చెబుతున్నారు కానీ మోడీ అభివృద్ధి సాధించలేరు అని చెప్పడం లేదు. సహజంగా వేగంగా అభివృద్ధి జరుగుతున్నప్పుడు కుంభకోణాలు, అవినీతి సైతం అదే స్థాయిలో బయటపడుతుంది. కానీ మోడీ పాలన మాత్రం దీనికి భిన్నంగా సాగుతోంది. 1950 సెప్టెంబర్‌లో గుజరాత్‌లోని మెహసనా జిల్లాలోని వడనగర్ అనే చిన్న పట్టణంలో మోడీ జన్మించారు. సామాన్య కుటుంబం. మోడీ ఈ స్థాయిలో ఉన్నా ఏ ముఖ్య కార్యక్రమం అయినా తన గ్రామంలోని ఇంటికి వెళ్లి తల్లికి పాదాభివందనం చేసి ప్రారంభిస్తారు. 1967లో ఇండో పాక్ యుద్ధ సమయంలో చిన్న వయసులోనే సహాయ కార్యక్రమాలు చేపట్టారు. రైల్వే స్టేషన్‌లో సైనికులకు యుద్ధ సమయంలో వాలంట్రీగా పని చేశారు. అఖిలభారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో గుజరాత్‌లో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఎంఎ పొలిటికల్ సైన్స్ చదివిన మోడీ విద్యార్థి దశ నుంచే సేవా కార్యక్రమాల్లో ఉండేవారు. ఎంఎ తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎక్కువ సమయం గడిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉండగా, 1974లో అవినీతికి వ్యతిరేకంగా నవనిర్మాణ్ ఉద్యమంలో పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితి కాలంలో అజ్ఞాత వాసంలో ఉండి కార్యక్రమాలు నిర్వహించారు. 1987లో బిజెపిలో చేరారు. ఏడాదిలోనే అతన్ని గుజరాత్ బిజెపి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1995లో గుజరాత్‌లో బిజెపి అధికారంలోకి వచ్చింది. 88 నుంచి 95 వరకు మోడీ తన కార్యకలాపాలతో గుజరాత్ బిజెపిలో మంచి వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. అద్వానీ రథయాత్రలకు ఏర్పాట్లు జరిగింది మోడీ నాయకత్వంలోనే. 

1998లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. 1995లో మోడీని బిజెపి జాతీయ కార్యదర్శిగా నియమించి, ఐదు రాష్ట్రాల్లో బిజెపి బాధ్యతలు అప్పగించారు. తరువాత ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వివిధ దేశాల్లో పర్యటించి, అక్కడి పరిస్థితులు తెలుసుకోవడానికి, బిజెపి జాతీయ నాయకులతో సన్నిహితం కావడానికి ఈ కాలంలో ఆయనకు ఎంతో ఉపయోగపడింది. ఈ పరిచయాలే ఆయన్ని 2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిని చేశాయి. పంచమిత్ర యోజన పేరుతో ఐదు ప్రధాన అంశాలను గుర్తించి, వివిధ రంగాల్లో గుజరాత్ సమగ్రాభివృద్ధికి మోడీ ప్రాధాన్యత ఇచ్చారు.

 22 డిసెంబర్ 2002లో రెండవ సారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం నుంచే మోడీ స్టైల్ చూపించారు. ఓపెన్ ఏయిర్ ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం చేశారు. గ్లామర్ రాజకీయాలను నమ్ముకునే ప్రాంతీయ పార్టీల నాయకుల తరహాలో ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ గవర్నెన్స్, పెట్టుబడులు, విద్య, విద్యుత్, ఎస్‌ఇజడ్, రోడ్లఅభివృద్ధి వంటి అనేక రంగాల్లో గుజరాత్ ఆశ్చర్యకరమైన అభివృద్ధి సాధిస్తోంది. మీడియా మొత్తం మోడీని వ్యతిరేకించిన కాలంలో సైతం సామాజిక సైట్స్‌లో మాత్రం మోడీ హవా కనిపించేది. దేశం మొత్తంలో అందరి కన్నా ఎక్కువగా సామాజిక సైట్స్‌తో అనుసంధానం అయింది మోడీనే. ఆయన ట్విట్‌ను కొన్నివేల మంది అనుసరిస్తారు. వివిధ అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఇప్పుడు పెద్ద సంఖ్యలో ముస్లింలు సైతం మోడీకి మద్దతు ఇస్తున్నారు. మత రాజకీయాలు ఇంకెంత కాలం అభివృద్ధిపై దృష్టి సారిద్దాం అంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. బురఖాలను సైతం బిజెపి పంపిణీ చేసి సభలకు పంపిస్తున్నారు అంటూ గుజరాత్ కాంగ్రెస్ నాయకుడొకరు విమర్శించారంటే మోడీ సభల్లో ముస్లింల హాజరుపై ఆ పార్టీ కలవరపాటు కనిపిస్తోంది. కేవలం మతాన్ని నమ్ముకొని మోడీ అధికారంలోకి వచ్చి ఉంటే కేవలం ఒకసారి మాత్రమే గెలిచే వారు. నాలుగవ సారి అధికార పగ్గాలు చేపట్టడం అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా మోడీ పాలన గుజరాత్ ప్రజలకు నచ్చింది. అందుకే మళ్లీ మళ్లీఅధికారం అప్పగిస్తున్నారు. కేవలం ప్రచారం, మతం, ఉద్రేకాలు రెచ్చగొట్టే ఏదో ఒక అంశం ఒకసారి కన్నా ఎక్కువ సార్లు పని చేయదు. మోడీ మళ్లీ మళ్లీ గెలుస్తున్నారు అంటే ప్రజలు ఆమోదిస్తున్నారనే విషయాన్ని మోడీ వ్యతిరేకులు గుర్తించాలి. 

మోడీ స్టైల్

* మోడీ స్టైల్ నరేంద్ర మోడీ రాజకీయాల్లోనే కాదు ఆయన దుస్తుల్లోనూ ప్రత్యేకత కనిపిస్తుంది. సాధారణంగా రాజకీయ నాయకులు ఒకే రకంగా తెల్ల రంగు దుస్తులు ధరిస్తారు. కానీ మోడీ స్టైల్ వేరు. ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆయన దుస్తుల్లో సైతం ఆ ప్రత్యేకత కనిపిస్తుంది. మోడీ కుర్తా ఇప్పుడు గుజరాత్‌నే కాకుండా ఉత్తరాదిలో చాలా ప్రాంతాల్లో పాపులర్. మీ దుస్తుల డిజైనర్ ఎవరు? అని ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన సమాధానం విని విస్తుపోయారు. ఎందుకంటే ఆయన దుస్తుల డిజైనర్ ఆయనే. ఇందులో వింతేమీ లేకపోవచ్చు. కానీ ఆ డిజైన్ వెనుక కథ మాత్రం ఆసక్తికరమైనదే. ‘‘ గత 40 ఏళ్ల నుంచి నా దుస్తులను నేనే ఉతుక్కుంటున్నాను. లాంగ్ కుర్తా ఉతుక్కోవడం కొంచెం కష్టం అనిపించేది. ఉతక డానికి సౌకర్యంగా ఉంటుందనే చేతులు లేని కుర్తాకు డిజైన్ చేశాను. అంటే కనీసం చేతుల వరకు ఉతకాల్సిన అవసరం ఉండదు. పైగా లగేజీలో తక్కువ స్థలం ఆక్రమించుకుంటుంది. అంటూ తన స్టైల్ రహస్యం విప్పి చెప్పారు. నా సింప్లీసిటీ కూడా ఫ్యాషన్ అయిపోయింది. మోడీ కుర్తా ఇప్పుడు అన్ని చోట్ల లభిస్తోంది అంటారు నవ్వుతూ. ఇక ఆయన ఇష్టపడి తినేది కిచిడి. ఈ తరం వాళ్లకు ఇది అంతగా ఇష్టం ఉండదు కానీ నాకు మాత్రం చాలా ఇష్టం అంటారు. నేను గత నాలుగున్నర దశాబ్దాలుగా పరివ్రాజకునిగానే జీవిస్తున్నాను, ఎక్కడ ఎవరింటికి వెళ్లినా వాళ్లు పెట్టింది తింటాను’’ అని చెబుతున్నారు. 

 హిట్లర్ మోడీ
ఔను హిట్లర్ కూడా అభివృద్ధి చేశాడు అభివృద్ధి విషయంలో మోడీని ఆకాశానికెత్తేవారు ఉన్నట్టుగానే తీవ్రంగా విమర్శించే వారు సైతం ఉన్నారు. వారు సైతం బలమైన వాదనలే వినిపిస్తారు. గుజరాత్, మహారాష్టల్రో విద్యారంగంలో విశేష కృషి జరిపిన మహమ్మద్ వస్తన్వీ వాదన మరో విధంగా ఉంది. 20 శతాబ్దంలో అత్యంత వేగంగా అభివృద్ధి జరిగింది. 1933నుంచి 1939 వరకు ఆరేళ్లు జర్మనీలో అత్యంత వేగంగా అభివృద్ధి జరిగింది. అయితే ఆ తరువాత 1939 నుంచి 1945 వరకు ఆరేళ్ల కాలంలో హిట్లర్ పాలనా కాలంలో జర్మనీ విధ్వంసం అయింది. అభివృద్ధి జరిగింది హిట్లర్ పాలనా కాలంలోనే విధ్వంసం జరిగిందీ హిట్లర్ పాలనలోనే. ఐదు కోట్ల మంది రెండవ ప్రపంచ యుద్ధం వల్ల బాధితులయ్యారు. అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలను, షిప్ బ్రేకింగ్ యూనిట్స్‌ను అల్యూమినియం, అస్బెస్టాస్, కెమికల్ పరిశ్రమలను తమ దేశం నుంచి తొలగించి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మనం వీటిని చూసి అభివృద్ధి అని భావిస్తున్నామని గులాం మహమ్మద్ వాదిస్తున్నారు. 

మేం భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించామని చెప్పుకోవడానికి నాయకులు ఇలాంటి ప్రమాదకరమైన పరిశ్రమలకు ఆహ్వానం పలుకుతున్నారనేది ఆయన వాదన. ఇలాంటి ఇనె్వస్ట్‌మెంట్ ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వస్తోందని తెలిపారు. అభివృద్ధి సూచికలపై ప్రపంచ బ్యాంకు రూపొందించిన పారామీటర్స్‌నే మనం ఉపయోగిస్తున్నాం ఇది మారాలని ఆయన అంటారు. పారిశ్రామికంగా దేశంలో ఎక్కువగా అభివృద్ధి చెందిన మహారాష్టల్రోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే జమ్మూకాశ్మీర్‌లో అతి తక్కువ మంది ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. అయినా గుజరాత్ అభివృద్ధి మోడీ నాయకత్వంలో ఇప్పుడు మొదలైనదేమీ కాదు. పారిశ్రామిక వాతావరణం గుజరాత్‌లో 19వ శాతాబ్దం నుంచే ఉంది. పారిశ్రామిక వేత్త అబ్దుల్లా గుజరాత్ నుంచి మహాత్మాగాంధీని దక్షిణ ఆఫ్రికాకు పిలిపించుకున్నారు. పారిశ్రామిక వాతావరణం విషయంలో దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలతో గుజరాత్‌ను పోల్చడానికి అవకాశం లేదు. ఇక గుజరాత్‌లో అభివృద్ధి అని చెబుతున్నది మోడీ హయాంలో జరిగిందేమీ కాదు. నరేంద్ర మోడీ గ్రోత్ రేట్ అని ప్రచారం చేస్తున్నారు కానీ మోడీ లేక ముందు రెండు దశాబ్దాల క్రితమే ఇప్పటి కన్నా అభివృద్ధి రేటు ఎక్కువగా ఉందనేది మోడీ వ్యతిరేకుల వాదన. 

1990లో గుజరాత్‌లో అభివృద్ధి రేటు 12 నుంచి 13 శాతం. ఆ సమయంలో జాతీయ అభివృద్ధి రేటు ఆరు నుంచి ఏడు శాతం మాత్రమే. ఇప్పుడు గుజరాత్‌లో అభివృద్ధి రేటు 11 శాతం కాగా,జాతీయ అభివృద్ధి రేటు దీని కన్నా ఒకటి రెండు శాతం మాత్రమే తక్కువ. ఇదీ మోడీ వ్యతిరేకుల వాదన. మీడియా ప్రచారం వల్ల మోడీకి అభివృద్ధికి చిహ్నం అనే ముద్ర పడిందనేది వారి వాదన. అయితే అభివృద్ధి విషయంలో మోడీ చేతలతో చూపించడం వల్ల వ్యతిరేక ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదు. 

7 కామెంట్‌లు:

  1. "...హిందూమతం సహనాన్ని అసమర్థతగా భావించినప్పుడు మోడీ లాంటి వారిని తమ యోధునిగా నిర్ణయించుకోవడానికి కాలమే అవకాశం కల్పించింది..."

    Well said

    రిప్లయితొలగించండి
  2. మొదటి వాక్యాలు కాలానికి నిలిచే సత్యాలు.
    నరేంద్రమోడీ గురించి మొదట మీరు చెప్పిన వన్నీ తెలిసినవి. మొత్తం ఆయన జీవనం, జీవనవిధానం గురించి క్లుప్తంగా తెలిపినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. ..హిందూమతం సహనాన్ని అసమర్థతగా భావించినప్పుడు మోడీ లాంటి వారిని తమ యోధునిగా నిర్ణయించుకోవడానికి కాలమే అవకాశం కల్పించింది..." True

    ఒకే ఒక మాట, మంచి జరిగినా,చేసినా, చూసి ఒప్పుకోలేనివారుంటారు, ఏంచేస్తాం. మోడీ గురించిన నిజాలు బాగా చెప్పేరు.

    రిప్లయితొలగించండి
  4. ముఖ్యంగా ఆయన సచ్చీలత ,త్యాగమయ జీవనం జనాన్ని తెలియకుండానే ఆకర్షింపజేస్తున్నాయి

    రిప్లయితొలగించండి
  5. కాలమే తయారుచేసుకొనే పనైతే కనీసం రాష్ట్రానికి ఒక "నమో" లాంటి నేత ఉండాలి. కాని "నమో" లాంటి వెన్నెముక గల భారత నేత ప్రస్తుత రాజకీయాలలో అరుదు. వెన్నెముక గల నేతలు కాలం తయారు చేయదు, వాళ్ళు దేశ సంస్కృతి, ఔన్నత్యాన్ని నిలబెట్టటానికి వాళ్ళని వాళ్ళు మలచుకొంటారు. అలా మలచుకొనే వారిలో కొందరికి పేరు వస్తుంది, కొందరికి రాదు. పేరు వచ్చిన వారిలో "నమో" ఒకడు.

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం